Jump to content

హలో...డాక్టర్/గుల్ల ఎముకలవ్యాధి (Osteoporosis)

వికీసోర్స్ నుండి

28. గుల్ల ఎముకల వ్యాధి ( Osteoporosis )

గుల్ల ఎముకల వ్యాధి ( అస్థిసాంద్ర క్షీణత ; Osteoporosis ) :

గుల్ల ఎముకల వ్యాధిలో  ఎముకల  సాంద్రత తగ్గి ఎముకలు బలహీనమవుతాయి. బలహీనమయిన ఎముకలు ప్రమాదములలో తక్కువ శక్తికే సులభముగా విఱుగుతాయి. ఈ వ్యాధిబారికి  వెన్నుపూసలు (vertebrae), తుంటియెముకలు (hip bones), ముంజేతియెముకలు (forearm bones) ఎక్కువగా గుఱి అయి చిన్న చిన్న ప్రమాదములకే విఱుగుతుంటాయి. గుల్ల ఎముకల వ్యాధి ( అస్థిసాంద్ర క్షీణత ) వయస్సు పైబడినవారిలో కనిపిస్తుంది. ఏబది సంవత్సరముల వయస్సు దాటిన వారిలో సుమారు 30 శాతము మందిలోను ఎనుబది సంవత్సరములు మించిన వారిలో సుమారు 70 శాతము మందిలోను అస్థిసాంద్ర క్షీణత పొడచూపుతుంది. ఋతుస్రావములు తప్పిన స్త్రీలు వారితో  సమానవయస్సు గల పురుషులు కంటె అస్థిసాంద్ర క్షీణత బారికి ఎక్కువగా గుఱి అవుతారు. అందువలన వీరిలో ఎముకలు విఱుగుట అధికముగా చూస్తాము. అందఱిలోను యౌవనములో ఉన్నపుడు ఎముకలు బలముగా ఉంటాయి. ఎముకలలో ఉండే సజీవకణములు వలన ఎముకలలో నిత్యము

304 :: నిర్మాణ ప్రక్రియ (bone formation), శిథిల ప్రక్రియ (bone resorption) జరుగుతుంటాయి.

ఎముకల నిర్మాణ ప్రక్రియలో అస్థినిర్మాణ కణములు (osteoblasts), ఎముకల శిథిల ప్రక్రియలో అస్థిశిథిల కణములు (osteoclasts) పాల్గొంటాయి.

గరిష్ఠ అస్థిరాశి (peak bone mass) తక్కువగా ఉన్నవారిలోను, ఎముకల నిర్మాణ ప్రక్రియ తగ్గిన వారిలోను, ఎముకల శిథిల ప్రక్రియ హెచ్చయిన వారిలోను ఎముకలు బలహీనపడుతుంటాయి.

కారణములు :

వయస్సుతో కలిగే  గుల్ల ఎముకల వ్యాధిని ప్రాథమిక అస్థిసాంద్ర క్షీణతగా (Primary Osteoporosis)  పరిగణిస్తారు. ఆహారములో కాల్సియం, విటమిను డి లోపములు ఈ వ్యాధి కలుగుటకు దోహదపడుతాయి. ఇతర వ్యాధుల వలన కలిగే గుల్ల ఎముకల వ్యాధిని ద్వితీయ అస్థిసాంద్ర క్షీణతగా ( Secondary Osteoporosis ) పరిగణిస్తారు. గుల్ల ఎముకల వ్యాధిని కలిగించు ఇతర వ్యాధులు : 1 . వినాళగ్రంథి వ్యాధులు ( Endocrine disorders ) : సహగళగ్రంథి ఆధిక్యత ( Hyperparathyroidism ) :

కంఠములో ఉండే గళగ్రంథులకు (Thyroid glands) వెనుక భాగములో ఆనుకొని చెఱి ఒకపక్క మీది భాగములో ఒకటి, క్రింద భాగములో ఒకటి, మొత్తము నాలుగు సహగళ గ్రంథులు ( Parathyroid glands) ఉంటాయి. ఇవి పరిమాణములో 6 మి.మీ పొడవు 4 మి.మీ. వెడల్పు, 2 మి.మీ మందము కలిగి ఉంటాయి. ఈ గ్రంథులు శరీరములోను రక్తములోను కాల్సియమ్ (Calcium), ఫాస్ఫేట్ (Phosphate) ప్రమాణములను వాటి వినాళ స్రావకముతో (Parathyroid hormone) నియంత్రిస్తాయి. ఎముకల జీవవ్యాపారము (metabolism) కూడా సహగళ గ్రంథి స్రావకముపై ఆధారపడి ఉంటుంది.

305 :: ఈ సహగళ గ్రంథుల చైతన్యము ఎక్కువయినచో వాటి స్రావక ప్రభావము

వలన ఎముకల నుంచి కాల్సియమ్ ఎక్కువగా సంగ్రహించబడుతుంది. రక్తములో కాల్సియమ్ ప్రమాణములు పెరుగుతాయి. ఎముకలలో సాంద్రత తగ్గి గుల్ల ఎముకల వ్యాధి (osteoporosis) కలుగుతుంది.

ఇతర వినాళగ్రంథుల వ్యాధులు :

ఎడ్రినల్ గ్రంథులలో వెలుపలి భాగపు (adrenal cortex) స్రావకములు కార్టికోష్టీరాయిడులు ఎక్కువయి వచ్చే కుషింగ్ సిండ్రోమ్ (Cushing syndrome), గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism), బీజగ్రంథులహీనత (hypogonadism), పిట్యూటరీ గ్రంథి స్రవించు ప్రవర్ధన స్రావకపు (Growth hormone) ఆధిక్యత, పిట్యూటరీ గ్రంథిలో కలిగే  ప్రొలాక్టినోమా (Prolactinoma) అనే పెరుగుదల  వలన కూడా గుల్ల ఎముకల వ్యాధి  కలుగవచ్చును. అండాశయములు (ovaries) తొలగించిన స్త్రీలలోను, ఋతుస్రావములు తప్పిన స్త్రీలలోను గుల్ల ఎముకల వ్యాధి  ఎక్కువగా కలుగుతుంది.

2. రక్తోత్పాదన వ్యాధులు ( hematopoietic disorders ) :

ఎముకల మజ్జలో (bone marrow) రక్తము ఉత్పత్తి అవుతుంది. లవిత్రకణ వ్యాధి (sickle cell disease), థలసీమియా (thalassemia), Multiple myeloma, leukemias, lymphomas, polycythemia vera వంటి వ్యాధులలో అస్థిసాంద్ర క్షీణత (Osteoporosis) కలుగవచ్చును.

3. సంధాన కణజాల వ్యాధులు ( connective tissue disorders ) : a). అస్థికణజాల ఉత్పత్తి దోషము ; పెళుసు ఎముకల వ్యాధి ( Osteogenesis imperfecta ; Brittle bone disease ) :

ఈ వ్యాధి జన్యుపరముగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిలో ఎముకల మాతృక (matrix) లోను, ఇతర అవయవములలోను కొల్లజెన్-1 (collagen-1) అనే సంధానపు మాంసకృత్తి (connective tissue pro:: 306 :: tein ) ఉత్పత్తిలో దోషము ఉండుట వలన గుల్ల ఎముకల వ్యాధి కలిగి, ఎముకలు పెళుసుగా ఉండి,  సులభముగా విఱుగుతుంటాయి. వీరి కన్నుల శ్వేతపటలములు కొల్లజెన్-1 లోపము వలన  నీలివర్ణములో ఉంటాయి, వీరిలో వినికిడి లోపములు, వదులు కీళ్ళు, దంతములలో లోపములు, శ్వాసలో ఇబ్బంది మొదలగు ఇతర లక్షణములు వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతాయి.

b). మూత్రములో హోమోసిష్టి న్ విసర్జ న ( homocystinuria ) :

జన్యుపరముగా కలిగే ఈ సంధానకణజాల వ్యాధిలో (connective tissue disorder) హోమోసిష్టిన్ అను ఎమైనో ఆమ్లము (amino acid) మూత్రములో అధికముగా విసర్జింపబడుతుంది. వీరిలో గుల్ల ఎముకల వ్యాధి తఱచు కలుగుతుంది.

4. మూత్రాంగ వ్యాధులు ( Renal disorders ) :

దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము (Chronic renal failure), మూత్ర నాళికలలో ఆమ్లవిసర్జన లోపము వలన కలుగు మూత్రనాళిక ఆమ్లీకృతము (Renal tubular acidosis), కాల్సియమ్ అధిక విసరన ్జ (hypercalciurea) వ్యాధులలో కాల్సియమ్ విసర్జన ఎక్కువగా ఉండి కాల్సియమ్ నష్టము కలిగి అస్థిసాంద్ర క్షీణత (osteoporosis ) కలుగుతుంది.

5. జీర్ణమండల వ్యాధులు ( gastrointestinal disorders )

జఠర ఖండనము (gastrectomy) జరిగిన వారిలోను, సీలియక్ వ్యాధి (celiac disease), ప్రాథమిక  పైత్యనాళిక నారంగ కాలేయవ్యాధి (primary biliary cirrhosis), ఇతర అజీర్తి (indigestion), సంగ్రహణ వ్యాధులు (assimilation) కలవారిలోను ప్రేవులలో కాల్సియమ్  సంగ్రహణము (absorption) తగ్గుతుంది. వీరిలో గుల్ల ఎముకల వ్యాధి  కలిగే అవకాశములు హెచ్చు .

307 ::

6. ఔషధములు :

a ). కార్టి కోష్టీ రాయిడులు ( corticosteroids ) :

హైడ్రొకార్టిసోన్ (hydrocortisone) దినమునకు 30 మి.గ్రాములు, ప్రెడ్నిసొలోన్ (prednisolone)  7.5 మి.గ్రాములకు సమానమయిన కార్టికోష్టీరాయిడులు మూడు మాసములకు మించి దీర్ఘకాలము వాడే వారిలో  అస్థిసాంద్ర క్షీణత (osteoporosis) కలుగుతుంది. వీరి ప్రేవులలో కాల్సియమ్ సంగ్రహణము (absorption) తగ్గుతుంది. అస్థినిర్మాణ కణముల (osteoblasts) చైతన్యము తగ్గి, అస్థిశిథిల కణముల (osteoclasts ) చైతన్యము పెరిగి ఎముకల నుంచి కాల్సియమ్ ఎక్కువగా సంగ్రహించబడుతుంది. మూత్రములో కాల్సియమ్ విసర్జన పెరుగుతుంది. అందుచే వీరిలో గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశము హెచ్చు.

b). ఆమ్లయంత్ర అవరోధకములు ( Proton pump inhibitors ) :

జీర్ణాశయములో ఆమ్ల స్రావమును (acid secretion) నిరోధించు ఆమ్లయంత్ర అవరోధకములను (proton pump inhibitors  ex ; omeprazole, esomeprazole, lansoprazole) వాడేవారి జీర్ణాశయములో ఆమ్లము తగ్గుట వలన  కాల్సియమ్ కార్బొనేట్ సంగ్రహణము (absorption) మందగిస్త ుం ది. దీర్ఘ కా లము ఈ మందులు వాడే వారిలో అస్థిసాంద్ర  క్షీణత (osteoporosis) కలిగే అవకాశము ఉన్నది. వీరు కాల్సియమ్ సిట్రేట్ (calcium citrate) వాడి కాల్సియమ్ లోటును భర్తీచేసుకోవచ్చును.

c) . మూర్ఛ నివారిణులు ( anticonvulsants ) :

మూర్ఛ నివారిణులు  కాలేయములో విటమిన్ డి విచ్ఛేదనను పెంచి కాల్సియమ్, ఫాస్ఫేట్ ప్రమాణముల లోపమునకు దారితీసి గుల్ల ఎముకల వ్యాధిని కలిగిస్తాయి.

7. జన్యు వ్యాధులు ( Genetic disorders ) :

జన్యుపరముగా వచ్చే Turner syndrome, Klinefelter

308 :: syndrome  లు ఉన్నవారిలో గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు

హెచ్చు.

గుల్ల ఎముకల వ్యాధి కలగించు ఇతర కారణములు : వ్యాయామ లోపము :

శరీర భారము వహించే వ్యాయామములు నడక, త్వరిత నడక, పరుగులు  మెట్లు ఎక్కుట గుల్ల ఎముకల వ్యాధిని అరికట్టుటకు తోడ్పడుతాయి. వ్యాయామము లేకపోయినా, చాలా ఎక్కువయినా అస్థిసాంద్ర  క్షీణత త్వరితమవుతుంది.

విటమిన్ డి, కాల్సియమ్ ల వాడుక తగ్గినపుడు అస్థిక్షీణత కలుగు తుంది. ఆహారములో కాల్సియమ్, విటమిన్ డి లు లోపించినవారు, సూర్యరశ్మి శరీరమునకు తగినంత సోకని వారు కాల్సియమ్, విటమిన్ డి లు ప్రత్యేకముగా తీసుకోవాలి.

పొగత్రాగే వారిలోను, మితము మీఱి మద్యపానము సలిపేవారిలోను గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశము హెచ్చు. శరీర భారము తక్కువగా ఉన్నవారిలో గుల్ల ఎముకల వ్యాధి అధికముగా కలుగుతుంది.

తెల్ల జాతీయులలోను, ఆసియాఖండ ప్రజలలోను గుల్ల ఎముకల వ్యాధి తఱచు కనిపిస్తుంది. నల్ల జాతీయులలో అస్థిసాంద్ర క్షీణత తక్కువగా చూస్తాము.

గుల్ల ఎముకల వ్యాధి లక్షణములు :

చాలా మందిలో అస్థిసాంద్ర క్షయము ఏ లక్షణములను చూపకుండా క్రమముగా హీనమవుతుంది. వ్యాధి తీవ్రమయిన వారిలో చిన్న చిన్న ప్రమాదములలోను, పడిపోవుటల వలన వెన్నుపూసలు ఒత్తిడికి గుఱయి కుచించుకుపోవుట (compression fractures), తుంటి ఎముకలు, ముంజేతి ఎముకలు, భుజపు టెముకలు విఱుగుట సంభవిస్తాయి. ఆపై ఎముకల నొప్పులు, కీళ్ళనొప్పులు కలుగుతాయి.   

309 :: ఉరస్సులో క్రింది వెన్నుపూసలు, నడుములో వెన్నుపూసలు

వాటికి  పైన, క్రింద ఉన్న వెన్నుపూసల మధ్య  అణచబడి కుచించినపుడు, వాటిని  సంపీడన అస్థి భంగములుగా (compression fractures) పరిగణిస్తారు. వాటి వలన దీర్ఘకాలపు నడుము నొప్పులు, ఎత్తు తగ్గుట, గూని, చలనములో ఇబ్బంది  కలుగ గలవు. వెన్నుపాము, వెన్నునాడులు ఒత్తిడికి గుఱి అయే అవకాశము కూడా ఉన్నది.

వైద్యులు పరీక్ష చేసినపుడు రోగి ఎత్తు తగ్గిఉండుట, అంగస్థితిలో మార్పు, గూని (kyphosis ),  వెన్నెముకలో పక్క వంకరలు (scoliosis), వెన్నెముకలో నొప్పులు కనుగొనే అవకాశము ఉన్నది.

పరీక్షలు : రక్తపరీక్షలతో రక్తకణముల గణనములు, కాల్సియమ్, ఫాస్ఫేట్ లతో సహా విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలు, మూత్రాంగ వ్యాపార ప్రమాణములు (blood urea nitrogen and creatinine), ఆల్కలైను ఫాస్ఫటేజ్ (serum Alkaline Phosphatase) విలువ, కాలేయ వ్యాపార పరీక్షలు (liver function tests), గళగ్రంథి వ్యాపార పరీక్షలు (thyroid function tests), 25- హైడ్రాక్సీ విటమిన్ డి విలువలు, పురుషులలో టెష్టోష్టెరోన్ విలువలు తెలుసుకోవాలి. సీలియక్ వ్యాధి నిర్ణయమునకు tissue transglutaminase antibodies విలువలకు రక్తపరీక్షలు చేయాలి.  

రక్తద్రవములో  కాల్సియమ్ (serum calcium) విలువలు పెరిగి ఉంటే రక్తద్రవములో సహగళగ్రంథి స్రావకపు  (parathyroid hormone) విలువలు పరీక్షించాలి. రక్తపరీక్షలు అన్నీ బాగుంటే ఇతర వ్యాధి లక్షణములు లేనపుడు గుల్ల ఎముకల వ్యాధిని ప్రాథమిక వ్యాధిగా పరిగణించవచ్చును.

అస్థిసాంద్రత చిత్రీకరణము ( Bone Mineral Densitometry ):

శరీరములో ఎముకల చిత్రీకరణము చేసి అస్థిసాంద్రతను (Bone density) నిర్ణయించి అస్థి (సాంద్ర) క్షీణత (osteoporosis) గల వారిని

310 :: గుర్తించవచ్చును. ఈ చిత్రీకరణము Dual Energy X-ray absorptiometry Scan తో (DEXA Scan) చేస్తారు. ఎక్స్ రేలను రెండు భిన్న

మోతాదులలో వాడి తుంటి ఎముకలను (hips), వెన్నెముకను (spine) చిత్రీకరిస్తారు. చిత్రములతో ఎముకల సాంద్రతను (bone density) గణించి సాంద్రతకు T score, Z score లను ఆపాదిస్తారు.

ఒక వ్యక్తి అస్థిసాంద్రతకు (Bone density), యువజనుల సగటు అస్థిసాంద్రతకు,  గల ప్రమాణ వ్యత్యాసము (standard deviation) ఆ వ్యక్తి T- score తెలియపరుస్తుంది . T- score, - 2.5  కంటె తక్కువ ఉంటే అస్థిసాంద్ర క్షీణత (osteoporosis ; గుల్ల ఎముకల వ్యాధి)  నిర్ధారిస్తారు.

T - score,  -1 నుంచి -2.5 వఱకు ఉంటే అది ఎముకల బలహీనతను (osteopenia) ధ్రువపఱుస్తుంది.

ఒక వ్యక్తి అస్థిసాంద్రతకు, ఆ వ్యక్తికి సమాన వయస్సు, బరువు, లింగములకు చెందిన మనుజుల సగటు అస్థి సాంద్రతకు, కల  ప్రమాణ వ్యత్యాసము (standard deviation) ఆ వ్యక్తి  Z- score తెలుపుతుంది.

40 సంవత్సరముల వయస్సు లోపలి వారిలో గుల్ల ఎముకల వ్యాధిని నిర్ధారించుటకు  Z- scores పరిగణనలోనికి తీసుకుంటారు.

గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు ఉన్నవారిలో అస్థిసాంద్ర చిత్రీకరణము (Bone Mineral Densitometry) అవసరము. 65 సంవత్సరములు పైబడిన స్త్రీలలోను, 70 సంవత్సరములు పైబడిన పురుషులు అందఱిలోను అస్థిసాంద్ర చిత్రీకరణములు చేసి పరిశీలించుట వలన గుల్ల ఎముకలవ్యాధి ( osteoporosis) కలవారిని ఎముకలు విఱుగక మున్నే గుర్తించి వారికి చికిత్సలు చేయుట వలన ఎముకలు విఱుగుట (అస్ధిభంగములు, fractures) తగ్గించగలుగుతాము.

చికిత్స :

కాల్సియమ్ :  గుల్ల ఎముకల వ్యాధిని నివారించుటకు, చికిత్సకు కూడా తగినంత కాల్సియమ్  వాడవలసి ఉంటుంది. కాల్సియమ్ ఎంత

311 :: అవసరమో వయస్సు, లింగములపై ఆధారపడుతుంది.

25-65 సంవత్సరముల మధ్య  పురుషులకు దినమునకు 1000 మి. గ్రా ల కాల్సియమ్ అవసరము.

65 సంవత్సరములు దాటిన పురుషులకు దినమునకు 1500 మి.గ్రా ల కాల్సియమ్ అవసరము.

25-50 సంవత్సరముల మధ్య స్త్రీలకు దినమునకు 1000 మి. గ్రాములు,

50 సంవత్సరములు దాటిన స్త్రీలకు దినమునకు 1500 మి.గ్రా. ల కాల్సియమ్ అవసరము.

మనము తీసుకునే ఆహారములో పాలు, పెరుగులలో కప్పుకు (240 మి.లీ) 300 మి.గ్రా ల కాల్సియమ్ ఉంటుంది. మిగిలిన ఆహార పదార్థములతో మనకు సుమారు 250 మి.గ్రాల కాల్సియమ్ లభిస్తుంది . ఆహారము వలన తగినంత కాల్సియమ్ వినియోగించని వారు  కాల్సియమ్ అదనముగా తీసుకొని లోపమును భర్తీ చెయ్యాలి.

కాల్సియమ్ కార్బొనేట్ సంగ్రహణకు జీర్ణాశయపు ఉదజ హరికామ్ల ము (hydrochloric acid) అవసరము. ఆమ్ల నిరోధకములు (antacids), కడుపులో ఆమ్లపు ఉత్పత్తిని అరికట్టు మందులు వాడేవారు, జఠర ఖండన శస్త్రచికిత్స (gastric resection) అయినవారు  కాల్సియమ్ సిట్రేట్ ను (Calcium Citrate) వాడుకోవాలి.

విటమిన్ డి :

చాలా మందిలో విటమిన్ డి లోపము సాధారణము. రక్తములో 25హైడ్రాక్సీ వైటమిన్ డి ప్రమాణములు  (serum 25- hydroxy vitamin D ) 30 నానో గ్రాములు / మి. లీ లకు మించి ఉండాలి.

50 సంవత్సరములు దాటిన వారికి దినమునకు 600 - 800 IU (International Units) విటమిన్ డి అవసరము. ఆహారమునకు అదనముగా 200-400 IU విటమిన్ డి అవసరము అవవచ్చును.

312 :: విటమిన్ డి లోపము హెచ్చుగా ఉన్నవారికి హెచ్చు మోతాదుల విటమిన్

డి అవసరము. సూర్యరశ్మి సోకేవారి చర్మములో విటమిన్ డి ఉత్పత్తి కొంత జరుగుతుంది.

వ్యాయామము  : చేయగలిగేవారు తగినంత వ్యాయామము చేయాలి.

ఔషధములు :    అస్థిసాంద్ర క్షీణత కలవారిలో డెక్సా టి విలువ (DEXA T Score) -2 కంటె తక్కువ ఉన్నవారిలోను ;

బలహీనులలోను, అదివఱకు తుంటి ఎముక, వెన్నుపూసలు విఱిగిన వారిలోను DEXA T Score -1.5  కంటె తక్కువ ఉంటే ఎముకలు విఱుగుట (fractures) అరికట్టుటకు ఔషధ చికిత్స అవసరము.

బై ఫాస్ఫొనేటులు ( Biphosphonates ) :

గుల్ల ఎముకల వ్యాధి కలవారిలో బైఫాస్ఫొనేటులు ఎముకలు విఱుగుటను (fractures) 30-60 శాతము వఱకు తగ్గిస్తాయి. ఇవి ఎముకల నుంచి కాల్సియమ్ సంగ్రహణము (absorption) అరికట్టి ఎముకల శిథిలమును (bone resorption) మందగింపచేస్తాయి.

ఎలెన్డ్రోనేట్  (Alendronate), రిసెడ్రొనేట్ (Risedronate), ఐబాన్డ్రొనేట్ (Ibandronate) నోటి ద్వారా తీసుకుందుకు అందుబాటులో ఉన్నాయి.

ఈ బైఫాస్ఫొనేటులను ఉదయము నిద్ర లేచాక ఖాళీ కడుపుతో  240 మి.లీ ( 8 ఔన్సులు ) మంచినీళ్ళతో తీసుకోవాలి. తర్వాత 30 నిమిషముల వఱకు ఆహారము, యితర పానీయములు తీసుకోరాదు. మందు తీసుకున్నాక 30 నిమిషములు నిటారు స్థితిలో ఉండాలి. అలా ఉండకపోతే మందు అన్ననాళిక లోనికి తిరోగమనము చెంది అక్కడ తాపము (esophagitis), వ్రణములు (esophageal ulcers) కలిగించవచ్చును. ఈ మందులతో పాటు కాల్సియమ్, విటమిన్ డి లు ఆహారముతో అదనముగా ఇవ్వాలి.

ఈ మందులు దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము కలవారిలోను, అన్ననాళ వ్యాధులు (esopgageal diseases)  గలవారిలోను వాడకూడదు.

313 ::

సిరల ద్వారా ఇచ్చుటకు ఐబాన్డ్రొనేట్ (Ibandronate, మూడు మాసములకు ఒకసారి ఇస్తారు), జొలెన్డ్రొనేట్ (Zolendronate) సంవత్సరమునకు ఒకసారి ఇస్తారు.) మందులు లభ్యము.  

ఎముకలకు వ్యాపించిన కర్కట వ్రణములు (metastatic bone cancers) కలవారిలో   బైఫాస్ఫొనేటులు వాడినపుడు  దవడ ఎముక శిధిలమయే (osteonecrosis) అవకాశము ఉన్నది.

రలోక్సిఫీన్ (Raloxifene) :    రలోక్సిఫీన్ ఎష్ట్రొజెన్ గ్రాహకములను (estrogen receptors) సవరించు ఔషధము. ఎముకలలో ఇది ఎష్ట్రొజెన్ కు అనుకూలముగాను, స్తనములు, గర్భాశయములపై ఎష్ట్రొజెన్ కు ప్రతికూలముగాను పనిచేస్తుంది. ఇది ఎముకల సాంద్రత పెంచుటకు ఉపయోగపడుతుంది. బైఫాస్ఫొనేటులు తీసుకోలేని వారికి ఈ మందు ఉపయోగకరము. ఈ ఔషధము వలన రక్తనాళములలో రక్తపుగడ్డలు (thrombosis) ఏర్పడే అవకాశము ఉన్నది.

ఎష్ట్రొజెన్ లు (estrogens) గుల్ల ఎముకల వ్యాధిని అరికట్టగలిగినా వాటిని వాడిన వారిలో హృద్రోగములు, మస్తిష్క విఘాతములు (cerebrovascular accidents), నిమ్నసిరలలో రక్తపుగడ్డలు (deep vein thrombosis) కలిగే అవకాశములు  హెచ్చగుట వలన ఎష్ట్రొజెన్ల వాడుక పోయింది.

టెరిపెరటైడ్ (Teriparatide) :    టెరిపెరటైడ్ ఒక సహగళగ్రంథి స్రావక సమధర్మి (parathyroid hormone analog). ఇది అస్థి నిర్మాణ కణములను (osteoblasts) అస్థిశిథిల కణముల (osteoclasts) కంటె ఎక్కువగా ఉత్తేజపఱచి అస్థి నిర్మాణమును పెంచుతుంది. టెరిపెరటైడ్ వాడుక వలన ఎముకల  సాంద్రత పెరుగుతుంది. గుల్ల ఎముకల వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలోను, మిగిలిన ఔషధములు  తీసుకోలేని వారిలోను దీనిని వాడుతారు. టెరిపెరటైడ్ ని చర్మము క్రింద సూదిమందుగా దినమునకు ఒకసారి చొప్పున 18 నెలల వఱకు ఇస్తారు. ఎక్కువ కాలము వాడేవారిలో ఎముకలలో ప్రమాదకరమైన పెరుగుదలలు (malignant growths) కలిగే అవకాశము ఉండుట వలన 18 మాసములకు మించి దీనిని వాడరు.

314 :: కాల్సిటోనిన్ ( Calcitonin ) :  కాల్సిటోనిన్ ఎముకల శిధిలతను

(resorption) మందగింపజేస్తుంది. దినమునకు ఒక ప్రక్క చొప్పున మారుస్తూ ముక్కులో తుంపరులుగా కాల్సిటోనిన్  వాడుతారు. ఇతర ఔషధములు వాడలేని వారిలో కాల్సిటోనిన్ వాడుతారు. బైఫాస్ఫొనేటులు కలుగజేసినంత ప్రయోజనమును కాల్సిటోనిన్ కలుగజేయదు. డెనోసుమాబ్ (Denosumab) :   డెనోసుమాబ్ ఒక ఏకరూపక ప్రతిరక్షకము (monoclonal antibody). ఇది అస్థిశిథిల కణముల (osteoclasts) చైతన్యమును నిరోధించి ఎముకల శిథిలతను (bone resorption) తగ్గించి అస్థిసాంద్రతను పెంచుతుంది. దీనిని చర్మము కింద సూదిమందుగా ఆరుమాసములకు ఒకసారి ఇస్తారు. ఇది ఋతుస్రావములు తప్పిన (post menopausal) గుల్ల ఎముకల వ్యాధిగ్రస్థులైన స్త్రీలలో  వెన్నెముక, తుంటె ఎముకల విఱుగుటలు (fractures) తగ్గిస్తుంది.

గుల్ల ఎముకల వ్యాధిగ్రస్థులైన స్త్రీ, పురుషులు, గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు ఎక్కువగా ఉన్నవారు, ఇతర మందులు సహించలేనపుడు, లేక  ఇతర మందుల వలన ప్రయోజనము పొందనపుడు డెనోసుమాబ్ వాడుతారు. డెనోసునాబ్ రక్తపు కాల్సియమ్ ప్రమాణాలను తగ్గించే అవకాశము ఉన్నది కావున కాల్సియమ్ విలువలను పరిశీలిస్తూ, కాల్సియమ్ లోపములను సరిదిద్దుతు ఉండాలి.

పర్యవేక్షణ : గుల్ల ఎముకల వ్యాధి కలవారికి తగిన చికిత్స అందజేస్తూ సంవత్సరము, రెండు సంవత్సరములకు ఒకసారి వారి అస్థిసాంద్రతను DEXA Scan తో గమనిస్తూ ఉండాలి.

315 ::