హరివంశము/ఉత్తరభాగము - సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - సప్తమాశ్వాసము

     వత్సాంకవిభూతిని
     భావన పావనచరిత్ర భాసురభువన
     పావనగుణౌఘ సుస్థిర
     జీవన వేమజననాథ జితజనాథా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు వాసుదేవుచరితంబుపరి
     పాటి యంతయు నంతఃకరణంబున నభినందించి యభిమన్యునందనుండు వైశంపా
     యనున కి ట్లనియె.2
క. మునివంశవర్య యేవ్విధ, మునఁ బశుపతిగుప్తగరిమఁ బొదలెడిదనుజేం
     ద్రునిఁ బరిభవించె విష్ణుఁడు, వినవలతుఁ దదీయవృత్తవిస్మయవిధముల్.3
వ. అని యడిగిన నతం డి ట్లనియె.4
సీ. మానుషమూర్తియై మధుసూదనుఁడు చరియించుకాలంబున నేపు మిగిలి
     బాణుఁడు దొడఁగినపనియును నచ్యుతుఁ డనలాక్షగుహసహాయత్వదీప్తు
     నాతని భంగించి ప్రాణమాత్రావశిష్టునిఁ జేసి పోవనిచ్చినవిధంబు
     సురేశ్వరునకు నుమాధినాథుఁడు దొల్లి యొసఁగినపుత్రత్వయుక్తికల్మి
తే. కతనఁ గ్రమ్మఱుఁ గలిగినగణపతిత్వ, మాది యగుశుభములు గడునద్భుతంబు
     లింతయును గ్రమమున మనుజేంద్ర నీకు, విస్తరింతుఁ బ్రశస్తవాగ్విరచనముల.5
చ. విను బలిపట్టి బాణుఁ డతివిశ్రుతబాహుసహస్రుఁ డిద్ధయౌ
     వనదశ నెల్లచోఁ దిరుగువాఁ డొకనాఁడు మనోజ్ఞదివ్యఖే
     లనములఁ దల్లిదండ్రు లుపలాలన సేయఁగ నొప్పుషణ్ముఖుం
     గనియెఁ గుబేరశైలమణికాంచనసుందరకందరస్థలిన్.6
వ. ఇట్లు గనుంగొని.7
క. ఆముఖము లాభుజావలి, యామేనివికాసరేఖ యభినవములుగా
     శ్రీ మెఱయుకుమారుని తే, జోమహిమకు నద్భుతంపుఁజొక్కుఁ దలిర్పన్.8
ఉ. ఏమితపంబు సేసి పరమేశున కీతఁడు పుత్రుఁడై దృఢ
     ప్రేమనిబద్ధుఁ జేసెఁ గడుఁ బేరగు నట్టితపంబు చేసి యు
     ద్దామవిభూతి నింతటిపదంబు భజించెద నేను సంశయం
     బేమిటి కన్తలంపు దనుజేంద్రునకుం జనియించె నత్తఱిన్.9
వ. అయ్యుదాత్తనిశ్చయంబువలన వికల్పవిరహితుం డై కడంగి.10

శా. ఏకాగ్రం బగుభక్తియోగమున విశ్వేశున్ మనోవాక్క్రియా
     పాకం బేకముఖంబునం బరఁగ నభ్యర్థించుచు న్నిష్ఠకున్
     లోకంబుల్ వెఱఁగొంద నయ్యసుర [1]నిర్లోపంబుగాఁ గూర్చె న
     స్తోకం బైనతపోమయం బగుధనస్తోమం బనేకాబ్దముల్.11
క. అతనికిఁ బ్రసన్నుఁడై యా, శ్రితసులభుఁడు విశ్వగురుఁడు శ్రీకంఠుఁడు పా
     ర్వతియును దానును ముంచట, నతులితకృపతోడ నిలిచి యల్లన నగుచున్.12
తే. అడుగు మిచ్చెద నెయ్యది యైన నీకు, వలయునట్టిసమున్నతవరము వత్స
     యనిన సాష్టాంగవినతుఁడై యతఁడు గేలు, మొగిచి యాహ్లాదపులకితమూర్తి యగుచు.13
క. దేవా దేవికిఁ బుత్రుడ, నై వేడుకమెయి భవద్దయాపాత్ర మనం
     గావలయుఁ బేర్మి వెఱవక, యే వేఁడెదఁ జిత్తగింపవే తగునేనిన్.14

శివుఁడు బాణాసురునికిఁ గోరినవరంబు లిచ్చి యాదరించుట

సీ. అనుటయు నిచ్చితి నని యాదిదేవుండు దేవి నాలోకించి తెఱవ నీకు
     వీఁడు కుమారుని వెనుకవాఁడై ముద్దు సేయంగఁ దగునట్టిచిఱుతపట్టి
     బాణుఁడు మత్పదభక్తుడు గైకొను మని యప్పగించి యయ్యగ్నిభవుని
     యావాసమై రుధిరాఖ్య నొప్పెడి పురిపొరువున శోణితపుర మనంగ
తే. నధికసంపత్సమృద్ధిఁ బెరిపారునెలవు, నతని కొసఁగి నీ వీటికి నధికరక్ష
     సేసి యేఁ బాయకుండెదఁ జెనసియందు, నెంతబలియుండు నిన్ను జయింపలేఁడు.15
వ. నిశ్చింతంబున నుండు మని యానతిచ్చె నిట్లు వరంబు వడసి బాణుండు శోణిత
     పురంబున నసురసామ్రాజ్యలక్ష్మి యంతయుఁ దన్ను భజింపఁ బెంపొందె నత
     నికి వాహనంబును గేతువును నై మెఱయఁ గుమారుండు దివ్యమయూరంబు
     నొక్కటి నిచ్చె నంత.16
మ. హరసంభావనకల్మి నాత్మ నభయుండై దానవుం డేపునన్
     సురగంధర్వభుజంగమద్యుచరరక్షోయక్షభూతాదులన్
     వరుసం గాసిగఁ జేసి యెవ్వనిఁ బ్రతిద్వంద్విన్ ధరం గాన కు
     ద్దురయుద్ధంబులు గోరుచుండె విలసద్ధోర్మండలీచండతన్.17
వ. అట్టివర్తనంబున నపరిమితం బగుకాలం బరుగ నొక్కసమయంబున నతండు
     మహాదేవుసన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబులు సేసి యేనూఱంజలులు
     గంజపుటంబులుగాఁ దత్పురోభాగంబు పూజించి నిర్వ్యాజవినయభాషిణి యగుచు
     ని ట్లనియె.18
మ. పలుమాఱుల్ బలభేదిఁ గొట్టి సురలన్ బాధించుటం జేసి వా
     రలు నాకుం దలసూప నోడుదు శూరశ్రేష్ఠు లిమ్ముజ్జగం

     బుల లే రెవ్వరుఁ గయ్యపున్గఱవు నన్ బొందెం ద్రిలోకేశ బా
     హులు వే యాఱడిమోపయై యెటులు పోనోపుం దలం కయ్యెడున్.19
సీ, నిండారఁ దెగఁగొని నిండించుతూపుల వైరిదేహంబులు వ్రచ్చివ్రచ్చి
     బిగితంపుముష్టిఁ గంపిత యైనయసిధార విమత[2]కరాస్థులు విఱిచివిఱిచి
     యనువొంద నందంద యల్లార్చుబలుగద శత్రుదేహంబులు చదిపిచదిపి
     చదలు మొర్ముగఁ జేయుశక్తిశూలాదులఁ బఱపి పీనుఁగు లుర్వి నెఱపినెఱపి
తే. యేదినంబును వృథవోవనీక కడిమిఁ, బొదలఁ బోరాడి యాడుచె న్నొదవునేనిఁ
     గూడు చవియగుఁ గాక నిష్క్రోధమైన, దర్ప మూరక యివురింపఁదలమె దేవ.20
వ. అట్లు గావున.21
క. చేతులకసి వోఁ గయ్యము, నేతవిలెడునట్టివిధము చింతించి ననుం
     బ్రీతునిఁగాఁ గరుణించుట, యీతఱి నెనవోల్పరానియీగి మహేశా.22
క. అనవుడు దైత్యునిఁ దప్పక, కనుఁగొని యొక సెలవి నగుచు గౌరీవిభుఁ డి
     ట్లను నీయడిగినయర్థం, బసఘా యీకునికి నాకు నర్హం బగునే.23
వ. వినుము సెప్పెద భవదీయం బగుమయూరధ్వజ నిర్ణిమిత్తంబున నిజస్థానంబు
     నంద యుండి యెప్పు డేనియు నకారణంబ భగ్నం బై యొఱగునపుడు నీకోరు
     సమరంబు నేరువగా నెఱుంగు మెల్లభంగులం గులంబునకుఁ జలంబునకు బాహు
     బలంబునకుం దగిన యుద్ధంబు సిద్ధించుఁ బ్రమోదింపు మనిన బ్రతికితి ననుచుఁ
     బలుమాఱు మ్రొక్కి శంకరుని వీడ్కొని చని.24
క. తనయింట నొండెడకు నెం, దును బోవక [3]నెమిలిరూపుతో నొప్పెడు కే
     తనముఁ దనరారుచోటికిఁ, జని యాసీనుఁ డయి యాప్తజనములు గొలువన్.25

బాణుఁడు కుంభాండునితోఁ దనకు శివునివలనఁ గలిగిన వరదానక్రమంబు చెప్పుట

వ. కొలువుండి కుంభాండుం డనుమంత్రిం బిలిపించి మొకంబునఁ దేలివి మిక్కుటం
     బుగా నక్కజం బగుపొంకంబు బింకంబు మూఁపులఁ దోఁప నయ్యసురేశ్వరుండు.26
క. ప్రియ మొక్కటి యేఁ జెప్పెద, నయవినయనిధీ మనంబునను నీవు గడుం
     బ్రియముగఁ దిలకింపుము మ, త్ప్రియుఁడవు మత్ప్రియమునందుఁ బ్రియ మొందందగన్.27
క. నావుడు నద్భుతమతియై, దేవాహితుమంత్రి యధికధీనిధి యగుటన్
     దా వేగిరపడ కాతని, భావ మరయఁ దలఁచి చతురభాషాసరణిన్.28
వ. అతనితో నల్లన యి ట్లనియె.29
తే. అధిప ప్రియము సెప్పెద నని యానతిచ్చి, నంతలోనన నీమాట కాత్మఁ జాల
     నుబ్బి యడిగెద నెయ్యదియొక్కొ యెద్ది, ప్రియము ప్రియములు రూపింపఁ బెక్కు గలవు.30

ఉ. భర్గుప్రసాదమున్ గుహునిప్రాపును నీ కనపాయము ల్విధూ
     తార్గళ మైనవిక్రమ ముదంచిత మి ట్లగుటన్ జగత్త్రయీ
     సర్గమునందు నెవ్వరికి సాధ్యము గానివరంబు నీమనో
     మార్గ మెఱింగి శంభుఁ డసమంబుగ నిచ్చెనె నేఁడు వేడినన్.31
శా. వైకుంఠాశ్రయగర్వి యై పొదలునవ్వజ్రిం దొలంగించి యా
     లోకం బింతయు నీవ యేలు మని త్రైలోక్యేశ్వరుం డైనయా
     శ్రీకంఠుం డొసఁగంగ నింద్రుఁడు సురశ్రేణీసమేతంబుగా
     నాకంబుం బెడఁబాసిపోవఁడు గదా నాగాలయంబుం జొరన్.32
క. జలధులఁ గ్రుంకియుఁ బన్నగ, నిలయంబులం దూఱఁబడియు నేఁడాదిగ నా
     కులపడుదితిసంతతి నీ, కలిమిఁ గనియె నయ్య దేవగణములనెలవుల్.33
సీ. పాంచజన్యధ్వని పర్విన గుండియ లవిసి చేష్టింపక యలసియలసి
     ప్రకటకౌమోదకీభ్రమణవేగంబుల దిగ్భ్రాంతి వాటిలి తిరిగితిరిగి
     నందకచ్ఛాయ నందందచీకటులు బొదివినఁ గానక యొదిగియొదిగి
     దీప్తసుదర్శనతీవ్రభానునివేఁడి పఱఁగినఁ గ్రొవ్వఱ నుఱికియుఱికి
తే. యసుర లేవీరుకడిమి నూటాడి చెడుదు, రట్టివిష్ణుని నోర్వంగ నబ్బె నేని
     మనకుఁ బరమకళ్యాణ మమ్మహిమ యొదవు, [4]వెరవు నేఁడు సూపఁడు గదా విశ్వగురుఁడు.34
వ. అదియునుంగాక.35
సీ. కఱదులాఁ డగుచక్రి కపటంపుటనువునఁ దనుమోసపుచ్చిన ధర్మరతుఁడు
     గాన సత్యం బనుకట్టునఁ దగఁ గట్టువడిపోయి పాతాళభవనకోటి
     కెల్లనుఁ గ్రిందైనయిఱుకున నున్నమీతండ్రి విరోచనతనయుఁ డెలమి
     నీయట్టిసత్పుత్రు నాయతవిక్రముఁ గనుటఁ దద్భంధమోక్షణము వడసి
తే. నేఁడు వెలువడి తనతొంటినెలవు రాజ్య, గరిమ నేతెంచెనే దివ్యగంధమాల్య
     భూషణాంబరశ్రీ లిలఁ బొలుచు నాబ, లీంద్రుఁ జూడంగఁ గాంచుట యెట్టితపమొ.36
చ. అడుగులు మూఁడుగాఁ గొలిచి యనంగ జగత్త్రయంబు నా
     గడమునఁ గొన్నయాకుటిలుఁ గానికిఁ గైకొన కెట్టులైన నే
     మడరి మహాండమధ్యవలయం బఖిలంబును నాక్రమించి నీ
     యడుగులు గొల్తు మాసరసిజాసను సృష్టి గలంతకాలమున్.37
వ. అనిన నయ్యమాత్యుమాటలకు నలంత న వ్వొలయ బలితనయుం డతని మొగం
     బునఁ జూడ్కి నిలిపి.38
మ. విను కుంభాండ యనేకకాలము మహావీరాహవప్రౌఢిపెం
     పునఁ గ్రీడింపఁగ లేక నాదగు భుజంబు[5]ల్ ముందటం బొందినం

     జని నేఁ డేను నిరంతరాభిముఖు నాసర్వజ్ఞు నర్థించితి
     న్ననుఁ దృప్తుండుగఁ జేయఁ జాలు సమరోన్మాదంబు మోదంబుగన్.39
వ. అమ్మహాదేవుండును నా విన్నపం బవధరించి నీవు నీ మయూరధ్వజంబ నిమిత్త
     భగ్నం బగుట కోర్చియుండు మదీయనిమిత్తంబుగా నీ కోరినట్టికయ్యం
     బయ్యెడి నని యానతిచ్చిన నిచ్చోటకు వచ్చి యీ యభ్యుదయంటు నీ కెఱింగించితి
     ననిన నతండు.40
క. కడఁ జిన్నవోయి యిది యె, క్కడియొప్పమి సేసికొంటి గరకంఠుని నేఁ
     డడిగితి విట్టిది వరముగఁ, జెడియెం బ్రహ్లాదకులము చెప్పఁగ నేలా.41
మహాస్రగ్ధర. అను మండం జండవజ్రాహతగిరినిభమై యమ్మయూరధ్వజం బా
     దనుజేంద్రుండుం బ్రధానోత్తముఁడును గనఁగా ధాత్రిపై భగ్నమై మ్ర
     గ్గిన హర్షోదగ్రలీలం గెరలె నతఁ డసంక్లిష్టదోర్దండకండూ
     యనఘోరస్ఫారవీరాహవము దనకు నభ్యగ్రమై తోఁచె నందున్.42
వ. తదనంతరంబ.43
ఉ. క్షోణి వణంకె దిగ్గహన ఘోరముగా దివి ధూమకేతు వ
     క్షీణతఁ దోఁచె శర్కరలు నేడ్వడఁ జల్లుచుఁ దీవ్రుఁడై జగ
     త్ప్రాణుఁడు వీచె శోణితపురం బురుశోణితవృష్టిఁ దేలె ని
     ర్వాణము లయ్యె దేవరిపువర్గము వేఁడుము లెల్ల నొక్కమై.44
వ. మఱియు ననేకభంగు లగు నుత్పాతంబులు పుట్టె నవ్విధంబునం గుంభాండుండు
     తనమనంబున నధికభీతిం బొంది.45
మ. జితలోకత్రితయుండు దైత్యుఁ డచలోత్సేకంబునన్ మాఱు లే
     క తనుం బట్టఁగరానిగర్వమున సంగ్రామంబ కాంక్షించి దు
     ర్మతియై యాత్మవినాశహేతు వగుదౌరాత్మ్యంబు గావించె నే
     గతిఁ బెంపొందిన నాసురప్రకృతి సక్కంబెట్టగా వచ్చునే.46
క. ఊరకపోవు నే యిమ్మెయి, ఘోరం బగుదుర్నిమిత్తకోటి యకట ని
     ష్కారణనాశము దివిజేం, ద్రారికులంబునకుఁ దప్ప దగు నెబ్బంగిన్.47
సీ. సకలసురాసురసమితికిఁ బ్రభుఁ డైనశంభుండు దారును షణ్ముఖుండు
     బాణునిపైఁ గూర్మిఁ బాయక యిప్పురిఁ గావలియై యుండుగణవరేణ్యు
     లందఱు ననురక్తు లసురేశ్వరునకు నెవ్వారికి నిచ్చోటు సేర నరిది
     యనుబుద్ధి నూఱడిల్లను రాదు మదమున నీతఁడు వేఁడిన నీశుఁ డిచ్చె
తే. గాదె వరముగ నిది దీనిఁ గడపవశమె, కలుగు నెట్లు నుగ్రపుఁబోరు బలిసుతునకు
     వేఱ ప్రతివీరు లెవ్వరు విబుధులందు, మహిమఁ బేర్కొనఁ గలిగినమగల కాక.48
మ. హరి దైతేయులమీఁద రోషకలుషుం డాశక్రుచిత్తంబునన్
     బరువై యెప్పుడు నిండియుండుఁ బగ దర్పం బొప్ప నయ్యిద్దఱున్

     బరిభూతి న్మునుపడ్డ వేల్పుగమితో బల్వీకమై వచ్చి సం
     గర మర్ధించినబాణు బాహుతతికిం గామ్యార్ధముల్ నిండవే.49

కుంభాడుఁడు బాణునితో మహోత్పాతంబులు పుట్టుట చెప్పి పరితపించుట

[6]తోటకము. తన క్రొవ్వుల నైనది తాఁ గనియెన్
     మన కే మని యాత్మఁ గుమారగురుం
     డని యొప్పరికించె నహా యిఁక న
     య్యినతేజునకుం దుది యెయ్యెదియో.50
వ. అని మఱియు నీదృశవితర్కంబుల నానాఁటికి డెందంబు గందుచుండ సంధులు
     ప్రిదిలి యొక్కనాఁ డమాత్యుం డమ్మహాదైత్యుపాలికిం జనుదెంచి సవినయం
     బుగాఁ గదిసి యుత్పాతంబులతెఱంగు సెప్పి యింద్రోపేంద్రులవైరంబునుం
     దెలియఁ బలికి మీఁదు లెస్సగాకుఁడు ననియ నుగ్గడించిన విని నవ్వి యవ్వీ
     రుండు.51
మ. విను కుంభాండ యజాండ మింతయును నే సుద్వృత్తిఁ బైఁ బడ్డ బొం
     కని హుంకారమ యిచ్చి యాఁగుదు విభగ్నాత్ముండు దీనుండు ము
     న్నును శక్రుండు తదీయవాంఛకయి విష్ణుం డాజికిం బూనినన్
     బనిదీఱె న్బలియాఁక మాన్పఁగను నబ్భాగ్యోదయం బల్పమే.52
క. ఇప్పటియుత్పాతంబుల, యొప్పిద మంతయును వేగ యుద్ధోత్సవముం
     దప్పింపఁజాల వొకటియుఁ, జెప్పుమ మఱియొకటి నాకుఁ జెప్పకు మింకన్.53
వ. అని పల్కిన లెస్స గాక యని యతం డరిగి యుచితవ్యాపారంబుల నుండె బాణుం
     డును సుధాకరదీధితి సంగమశోభాసనాథంబు లగు సౌధంబులఁ బ్రతిదినసవర్ధ
     మానరాగుం డై వర్తిల్లుచు.54
సీ. కనకకుంభంబులగర్వంబు చులకగాఁ గల్పించువలిచన్నుఁగవలవ్రేఁగు
     నిండారుచందురునెరసు తక్కువపడఁ దిలకించుముద్దుమోములబెడంగు
     వలరాచతూపులవలను [7]మొక్కలువోవ వాలుఁగ్రెఁగన్నులవాఁడిమియును
     బాలపల్లవములలీలలు పొలివోవ మించారుకెంగేలిమేలిమియును
తే. [8]మనము సొక్కింపఁజాల నింపెనయుబోటి, పదువు పొదువంగఁ గ్రీడైకపరత నొంది
     యొం డెఱుంగండు భోగించుచుండె గీత, వాద్యనృత్యమధూత్సనవ్యాప్తరతుల.55
సీ. ఆదైత్యనాథునియాత్మజ యుష యనుపేర నొప్పారెడివారిజాక్షి
     యమృతాంశుకళ కన్యయై తోఁచె ననఁ బుష్పసాయకు[9]పూవమ్ము చామ యయ్యె

     ననఁ గాఱుమొగులునఁ దనరుక్రొమ్మెఱుఁ గింతియై నిల్చెనన నెందు నసమలీలఁ
     బొలుపొందుకుంభాండపుత్రి విచిత్రవిద్యాఖని యగుచిత్రరేఖ దనకు
తే. ననుఁగునెచ్చెలిగాఁ దండ్రిపనుపువలన, శాంభవీదత్తవరలబ్ధజనన గాన
     సదృశవరుఁ గోరి యాజగజ్జననిఁజారు, నియతిఁ గొలుచుచునుండె నెంతయును వేడ్క.56
వ. ఇ ట్లుండ ననతిచిరం బగుకాలంబున.57
మ. చిగురుం గెంజడ లొప్పఁ బుష్పరజము ల్సెల్వారు నున్బూదిపూఁ
     తగ [10]లేఁదేటులచుట్టుకోలు జపసూత్రశ్రీలుగాఁ గోకిల
     ప్రగుణాత్తాధ్యయనంబుతోడ సకలారామంబులున్ శాంభవం
     బగుదీక్షావిధి నొంద నా వెలసెఁ జైత్రారూఢి విశ్వంబునన్.58
వ. ఆసమయంబున బాణనగరనివాసుం డై యున్నకుసుమబాణదమనుండు కుసుమ
     గోమల యగుహైమవతిం గుసుమసమయసముచితం బగువిహారంబుల నలరించు
     తలంపున ననేకాప్సరోరమణుల రావించి గంధర్వసుదతులనెల్లం గూడఁ బిలిపించి
     వారివారిని సంగీతప్రసంగకలనంబులకుం గట్టాయితం బై రండని దేవియనుజ్ఞం
     జిత్రరేఖాదిలీలావతులఁ బార్వతీరూపంబునఁ దన్నుఁ గదిసి కొలువ నియమించి
     సర్వప్రమథులఁ దమతమశక్తులతోడ శివశక్తిరూపధరు లై వచ్చునట్లుగా నాజ్ఞా
     పనం బొనర్చిన.59
సీ. బాలారుణ్యప్రభపసిమి నూడ్చినభంగి నిండుకెంజడతలద్రిండుగట్టి
     భసితంపునెఱిపూఁతపై హరిచందనస్థాపకరచన యందముగఁ దాల్చి
     మాణిక్యమౌక్తికమరకతమిళితభూషణము లొయ్యారంపుసరణిఁ బూని
     మందారపుష్పదామంబులు జడముడి నఱుతను జదురుగా నలవరించి
తే. యభినవాకల్పలీల లి ట్లతిశయిల్ల, నిత్యయావనుఁ డభవుండు నీలకంఠుఁ
     డాదిదేవుఁడు వృషభవాహనము నెక్కి, గౌరిముందట నిడుకొని కౌఁగిలించి.60
చ. [11]వెలిగొడు గుత్తమాంగమునఁ బేర్చుతరంగిణిమీఁదిఫేనమం
     డల మనుశంకఁ జేయ ముకుటస్థశశాంకమరీచిజాలముం
     గలసి వికీర్ణచామరశిఖారుచి రెండుకెలంకులందు ను
     జ్జ్వలతఁ దలిర్ప వెల్వడియె సందడిగాఁ గదియన్ గణావళుల్.61
క. వెలువడి బాణుపురంబున, వెలుపల మందాకినీపవిత్రతటమునం
     బొలుపారెడు నెలదోఁటల, నలరెడువాటలకుఁ దొడఁగి యచ్చట నచటన్.62
సీ. భ్రమరనాదములును బ్రకటగంధర్వమృదంగనాదములును దడఁబడంగఁ
     గోకిలా[12]రవములు గోమలకిన్నరీగీతులు నొండొంటిఁ గేలికొనఁగ
     లలితానిలోద్దూతలతలనృత్తములు నచ్చరలయాటలు సరసముగ దొరయ
     నభినవ రాజకీరావళిపలుకులుఁ జారణస్తుతులు మచ్చర మొనర్పఁ

తే. బ్రియము నొందించు పుష్పాపచయవిహార, సరణిఁ గల్పభూరుహములవిరులు ప్రియకు
     నమరఁ గైసేసి మన్మథు నఖిలలోక, మునకు [13]నేకాధికారిగా నునిచి మనిచె.63
క. ప్రమథులు నాండ్రుం దారును, దమయిచ్చల నెందు సంచితము లగులీలా
     భ్రమణముల నలరి రపరో, క్షముగా బ్రహ్మానుభవము గని సొగయుగతిన్.64
క. మగపొడవు లెల్ల శివుఁడును, మగువలు శివ యనెడుశ్రుతులమాటలు నిక్కం
     బుగఁ దెలుపు భంగిఁ దత్సము, లగుగణదంపతులయొప్పు లప్పుడు మెఱసెన్.65
క. ఎచ్చోటఁ జూచినం దా, రచ్చోటన [14]యున్నయట్ల యయ్యె గణము ల
     య్యచ్చెరువుసృష్టి పలుమఱు, మెచ్చుచును మృడాని నగియె మృడుఁడును నగఁగాన్.66
వ. అట్టిసమయంబున.67
మ. ఒకయేకాంతపుఁజోటఁ జంద్రమణివిద్యుత్సంగతల్పంబుపై
     సకలేశుండు విచిత్రకేళికళలన్ శర్వాణి సంప్రీత గాఁ
     బ్రకటప్రేమనిరూఢలీల విహరింపం గోరి యొక్కింత యు
     త్సుకుఁ డయ్యెం గుసుమావకీర్ణమధుపస్తోమాభిరామస్థలిన్.68
వ. అమ్మనోహరవిహారవిన్యాసంబునందు.69
సీ. కంఠ కాళిమ దనకంఠంబునకు నూత్నకస్తూరికాదీప్తి విస్తరింప
     నౌదలఁ జందురుఁ డమృతబిందులఁ దనయలకలఁ జిన్నిపువ్వులనుఁ దొడుగ
     నవతంసనిశ్వాస మల్లనఁ దనయవతంసోత్పలమున కుత్కంప మొసఁగ
     నంగదమణిదీప్తు లలమి యొప్పగుతనభుజములకాంతికిఁ బ్రోది సేయఁ
తే. గడఁకఁ బరమేశ్వరుఁడు దన్నుఁ గౌఁగిలింప, నతనిదోర్మధ్యసరసి నోలాడుచున్న
     ఘనతరస్తనచక్రవాకముల నలరు, నంబ నసురేంద్రుకూఁతు రింపారఁ గనియె.70
క. కని కోర్కు లంకురింపఁగ, మనసిజరాగమున ముగ్ధమానస మొయ్యొ
     య్యన పొగ రెక్కఁగఁ గన్నియఁ, దనమున నెంతయునుభ్రాంతి తనుఁ బొదివికొనన్.71
వ. ఆత్మగతంబున.72
క. తగుమగనిఁ బడసి కౌఁగిట, సొగయఁ గనుటగాదె యరయ జోటికి నధికం
     బగు భాగ్యఫలము నాకిం, పుగ నిం కెన్నఁడొకొ యట్టిపోఁడిమి గలుగున్.73
చ. జనకుఁడు మూఁడులోకముల సన్నుతి కెక్కిన మేటి సంపదం
     దనరినవాఁడు మాకుఁ గులదైవము పర్వతకన్య కన్యనై
     యెనసినభకిమైఁ గదిసి యేఁ బరమేశ్వరి నాశ్రయించినన్
     ననుఁ గృపఁజూడ కంబ కరుణానిధి యూరక యేల యుండెడున్.74

పార్వతీదేవి యుషాకన్యను నభిమతవరం బొసంగి యాదరించుట

తే. అని తలంప రుద్రాణి యయ్యబలతలఁపు, తనతలంపునఁ గనుఁగొని కనికరమునఁ

     జిత్త మలరంగ నల్లనఁ జేరఁబిలిచి, యిట్టులనుఁ [15]దన్మనంబున కింపు మిగుల.75
శా. బాలా నీతలఁ పొప్పుఁ గన్నియలకు భావంబు నిత్యంబుగా
     లోలం బై పతిలాభలోభ మనుకల్లోలంబులం దేలుటల్
     రేలెల్లన్ హరుఁ గూడి యే నెటులు నిర్నిదప్రమోదక్రియా
     లీలన్ సోలెద నట్ల నీకును బ్రియాశ్లేషంబు వే చేకుఱున్.76
వ. అట్టికల్యాణంబునకుఁ గారణంబు విను మెఱింగించెద వై శాఖశుద్ధద్వాదశినాఁటి
     నిశాసమయంబున సమున్నతసౌధతలంబునందు నీవు నిద్రించియుండఁ గల
     లోన వచ్చి యెవ్వండు నిన్నుఁ గలపె నతండు నీకుం బతి యయ్యెడుం బొ మ్మనిన
     సిగ్గుతోడి విలాసంబు దృగ్విలాసంబు నలంకరింప నింపారుమ్రెక్కున నక్కపర్ది
     కుటుంబిని వీడ్కొని వేడ్కలు పిక్కటిల్లునుల్లంబుతో మరలె నప్పుడు.77
క. చేసఱచి నవ్వుచుం బరి, హాస్యోక్తులు మెఱయుబోంట్ల నాయుగ్మలియి
     చ్ఛాసరణియుఁ బరమేశ్వరి, చేసినక్రియతెఱఁగు ప్రణుతిచేసిరి నెమ్మిన్.78
వ. ఇవ్విధంబునఁ గిన్నరగంధర్వయక్షరాక్షసదైత్యదానవదేవాన్వయజననధన్య
     లయిన కన్యలు వేలసంఖ్యలు గొలువఁ జని నగరు సొచ్చి యుషాకన్య యనన్య
     సామాన్యం బై జగన్మాన్యం బగుసౌభాగ్యంబు దనకు భోగ్యం బయ్యెడు సమ
     యంబు ప్రతీక్షించి యుండె నంత.79
సీ. వనకేళి సాలించి తనపారిషదులును దానును శంభుఁ డుదారయశుఁడు
     దారగృహీతార్ధతనుఁ డష్టతనుభేదసంవ్యాక్తభువనుఁడు సకలభువన
     సంభవస్థితిలయస్వామి సామీప్యాదెవిభవవిజృంభితవినతచయుఁడు
     వినతినుతిక్రియావివశవిశ్వామరగణుఁ డగణేయాత్మగుఁవిలాసుఁ
తే. డెలమి నభిరామకారుభోగేచ్ఛ లిచ్చఁ, దాల్చి సంసారతంత్రప్రధానకర్త
     యైనవాఁడు గావున విహారానుషక్తి, నంబుకేళికై చనుదెంచె నమరనదికి.80
ఆ. అందుఁ బ్రమథముఖ్యు లందఱుఁ గ్రంద గాఁ, దఱిసితమయనుంగుఁదెఱవపిండుఁ
     గూర్చుకొని మనోజ్ఞకోలాహలస్ఫూర్తి, యలర నోలి నోలలాడుచుండ.81
ఉ. నావికనీతమై పృథుఘనస్థిరతం దనరారుపోతమున్
     దేవియుఁ దాను నెక్కి శివదేవుఁడు దేవవభూవిధూతసం
     భావితచామరానిలము పైఁ బొలయంగఁ దదీయకేళిలీ
     లావిధి చూచుచుండె మృదుల[16]స్మితదీప్తుల మో మెలర్పఁగన్.82
క. అచ్చరలు తత్ప్రవాహము, సొచ్చి భవానియును భవుండుఁ జూడఁగ వేడ్కన్
     విచ్చలవిడిగా నాడిరి, మచ్చిగఁ దేఁకువలు లేని మాధుర్యమునన్.83
సీ. క్షాళితకస్తూరికము లగుకుచములక్రేవల నఖపదశ్రీలు మెఱయ
     విశ్రుతాంజనచారువిభవంబు లగునేత్రముల దట్టకెంపులేముల భజింప
     గళితతాంబూలరాగము లగుబింబాధరముల దంతక్షతరచన బెరయ

     నాక్షిప్తతిలకంబు లగుఫాలముల నార్దలంబంబు లగుకుంతలములు వొదువ
తే. సన్నవలిపంబు లూరుల జఘనములను, నంట నారులు జిగి యెక్కి యసదుఁగౌను
     నందు నేడ్తెరఁ గాంతి నిండార నంబు, సేక మభినవద్యుతిఁ జేసెఁ జెలువగమికి.84
వ. పరమేశ్వరుండు గౌతుక, తరళితుఁడై యోడ డిగ్గి తనప్రియకరమున్
     గరమునఁ గైకొని తోయాం, తరము ప్రవేశించె సిద్ధదంపతు లలరన్.85
వ. ఆసమయంబున.86
సీ. తలమీఁదియేటిక్రొత్తరఁగలతో మించుతరఁగలు వొరిఁబొరిఁ దార్కొనంగ
     సడలిననిడుదకెంజడలును ముదురఁబండిన నాఁచుఁదీగలుఁ బెనఁగొనంగ
     నఱచందురుని క్రొత్తమెఱుఁగులు నంచఱెక్కల యచ్చతెలుపులుఁ గలయఁ బడఁగ
     నఱితి క్రొన్నలుపు నింపగు నల్లగలువపువ్వుల నిండుజిగియును జెలిమి సేయ
తే. నంగములభూతి పొలుపుగ నంబమూర్తి, మిగులఁ దెలుపెక్కె మొగిచినమీఁదికంటి
     ఱెప్పపద్మరేణువు లంట నొప్పు మిగిలె, నభవునకు గంగ సలిలవిహారలీల.87
తరువోజ. అలరుపుప్పొడి [17]పసుపార్చి మృణాళహారం బమర్చి కహ్లారంపుఱేకు
     లలకల నలికి కర్ణావతంసకముగ నభినవకైరవం బర్పించి కేల
     నెలతమ్మికేళికై యిచ్చి లేఁదేఁటి యెసకంపుటులివున నింపులు వలికి
     చెలితనంబున గంగ చెల్వపార్వతికిఁ జేసె సత్కృతులెల్ల శ్రీసొంపు మెఱసి.88
క. విజయాదిసఖీజనులును, ద్రిజగద్గురుఁ డైన దేవదేవుఁ గనకశృం
     గజలంబులఁ జల్లిరి శై, లజ కనుగీటంగఁ బ్రణయలాలసలీలన్.89
క. అచ్చరలును సర్వజ్ఞుని, యిచ్చ యెఱిఁగి కదిసి భక్తియెసఁగఁగఁ గరయం
     త్రోచ్చలితగంధసలిలస, ముచ్చయముల ముంచి రాటముఖమున నెమ్మిన్.90
వ. ఇవ్విధంబున వినోదించి సరిత్ప్రవాహంబు వెలువడి విశ్వేశ్వరుండు హృదయేశ్వ
     రియుం దానును నభిమతనైపథ్యంబులు ధరియించి యలంకృతు లైన గణపుంగ
     వులు నంగనాసముదయంబులు పరివేష్టింపఁ గొండొకసేపు గంధర్వాప్సరోగణ
     ప్రయుక్తం బైన సరససంగీతం బవధరించి మధురావలోకనంబుల నందఱఁ గృతా
     ర్థులం జేసె నయ్యవసరంబున.91
సీ. గురుగోత్రతటములు గోడాడ నునుమొక్కవోయినవలిగొమ్ముదోయి మెఱయ
     ఘనమేఘతటములు గాల్ద్రవ్వుగ్రొమెఱుంగులపస నూనినగొరిజ లొప్ప
     భూరిదిగ్భిత్తులతో రాచికొన సన్నగఱుకెక్కి కప్పారుకంఠ మొప్ప
     నలఘువాయుస్కంధములు దాఁకి తారలు దొరుఁగ నాడెడునిడుదోఁక యలరఁ
తే. దారశిఖరిఁ గీలించిన మేరుశకల, మనఁగ ధవళాంగకల్పిత మైనపసిఁడి
     పల్లమును రత్నకింకిణీపరికరంబు, నమర వృషభేంద్రుఁ డాయితంబయి తనర్చె.92
వ. అమ్మహాదేవుం డుమాదేవీసహితుం డై యావాహనంబు నారోహణంబు సేసెఁ
     బ్రమథపుంగవులుం బ్రధానగంధర్వవరులును సిద్ధవరులు నప్పరోవారముఖ్యులు

     వారణంబులుఁ దేరులు నశ్వంబులు నందలంబులు నెక్కిరి కొందఱు విమానా
     రూఢులు నాకాశగాములు నై రిట్లు సర్వపరివారంబును గొలువ శర్వుండు
     మగుడి యాత్మీయం బగు దివ్యనివాసంబు ప్రవేశించి సుఖంబుండె నంత.93

ఉషాకన్య దనస్వప్నమందు ననిరుద్ధసమాగమంబు గనుట

ఉ. అంటినఁ గందుమేనుఁ బసనారెడు జవ్వనమున్ రసంబు పె
     న్నింటలఁ గూర్చుకామమును నిబ్బర మైనమదంబునై మనం
     బొంటికిఁ బోక భర్తృరతి కువ్విళులూర నిరంతరస్పృహా
     కంటకితాంగియై యలరుకన్నియ బాణునికూఁతు రత్తఱిన్.94
చ. తనవిహరించుసౌధమునఁ దల్పముపై మును దేవి యానతి
     చ్చిననిశియందు బోఁటులును జేరువ నిద్దురవోవఁ దాను నిం
     పలరఁగ నొం డెఱుంగని సుఖాచితనిద్ర నెలర్చియుండఁగా
     ననఘశరీరుఁ డై నపురుషాగ్రణి [18]మారసమానుఁ డిమ్ములన్.95
సీ. కలలోన నయ్యింతిఁ గదిసి మోమున నవ్వు గడలొత్తఁ దియ్యనిపలుకు వలికి
     కెంగేలితోఁ గేలు గీలించి నెమ్మేను మేనను బెరయించి మెలపుతోడ
     బిగియారఁ గౌఁగిట సొగియించి మనసులు రెండును గరఁగి యొక్కండ కాఁగ
     నేకోర్కు లేమిటి కెలసిన వానికిఁ జుబ్బనచూఱలై చొప్పడంగఁ
తే. జతురసంభోగరసములు చవులవెంట, నిద్దఱును క్రొత్తగాఁ గని యేపు మిగుల
     నట్టిచందంబు గావించి యాత్మమూర్తి, యబలతలఁపున నచ్చొత్తినట్లు సేసె.96
వ. తదనంతరంబ.97
తే. ఉదరిపడి మేలుకని కన్ను లువిద విచ్చి, చూచి కానద యట్టియాసొబగు నచట
     భయము లజ్జయు మాహంబు బాలమనసు, పొదివెఁ దమము మంచును దమ్మిఁ బొదువుమాడ్కి.98
చ. అది కలలోని కానుపయి యంబికయావతి మున్న కల్గి య
     ట్లొదవుట ముగ్ధతం దలఁప కుగ్మలి నిక్కమకాఁగఁ జూచి పె
     ల్లొదవెడుబాష్పవారి నయనోత్పలపీడ యొనర్ప రోదనా
     భ్యుదయమనోజ్ఞ మై వదన మొప్ప వడంకుచు నార్తి వొందఁగాన్.99
వ. మణిదీపమనోహరం బైన యమ్మందిరంబున చేరువ నిద్రించి యున్న చెలికత్తియ
     లెల్ల మేల్కని సంభ్రమంబునం బొదివికొనిరి వారిలోనం జిత్రరేఖ యల్లన
     యమ్ముద్దియశిరం బొక్కకేలఁ గ్రుచ్చి కౌఁగిలించి.100
మ. చెలియా యోడకు మేల యేడ్చెదవు నీచిత్తంబులోఁ దాపముం
     దలఁకుం జేయఁగ నెవ్వరుం గలరె యీత్రైలోక్యమధ్యంబునన్

     బలిసూనుండఁట తండ్రి నీ వెఱుఁగవే భగ్నాతులై మ్రగ్గరే
     బలభిన్ముఖ్య నిలింపు లీతనికి నీభాగ్యంబు సామాన్యమే.101
తే. గురుఁడుఁ బ్రెగ్గడయును రక్షకుండు నీకుఁ, బొలఁతి శ క్రుండు శోణితపురము నెలవు
     స్రుక్క రెక్కడ వచ్చి నీ కొక్కకీడు, సేయువాఁ డొల్లఁ డాత్మీయజీవితంబు.102
వ. కావున భయంపడవల దని కన్నీరు దుడిచి బుజ్జగింప నబ్బోటి వారిం
     గనుంగొని.103
క. ఏ నిచ్చట నిద్రితనై, యీనెఱి నుండంగఁ బురుషుఁ డెవ్వఁడొ యుపగూ
     హానుభవంబున వికృతం, గా నొనరించె నది [19]కలయొ కాదో యెఱుఁగన్.104
చ. కల యనరాదు రామలకుఁ గాములకూటము లెన్నిచందముల్
     గల వవి యన్నియున్ బెరసెఁ గన్నెఱికం బిటు వీటిఁ బోయెఁ బె
     ద్దలకును బెద్దయై నెగడుతండ్రికి దక్కువపాటు దెచ్చితిం
     గుల మెరియించితిన్ జననిఁ గూల్చితి శోకములోఁతు [20]వాటమున్.105
క. ఏనింకను గన్నియ నని, మేనం బ్రాణములు తాల్చి మెయికొని యున్న
     బ్లేని నిహముఁ బరమును గల, వే నిక్కము కులట యెవ్వ రింతటికంటెన్. 106
వ. అని యవ్వెలంది యందంద యేడ్చుచుఁ బెద్దయుంబ్రొద్దు వేగుచున్నం గని
     కన్నియలందఱు విహ్వలభీతలోచన లగుచు నవ్వామలోచన కి ట్లనిరి.107
క. కలయగును గాక యిట్టివి, గలవే నిక్కములు నీవు గడువడి నెడ్డం
     దలఁపక యున్నను గలుగుం, బొలఁతీ యే మేని వికృతపుందెఱఁగు గలన్.108
మ. తెలియంగూడి యొనర్చు కానిపనులం దెల్లంబు దోషంబునుం
     గల దాచందము గల్గు కాంతఁ గులటంగా నెన్నుదు ర్సజ్జనుల్
     గలదే నీ కిది యింతయేనిఁ గలలోఁ గన్నట్టి చూ పేటికిన్
     గులశీలంబుల పేర్మి మాన్పఁ దగునే కుందింపఁగా డెందమున్.109
చ. ఎఱుఁగమె యేము నీహృదయ మేల తలంకెదు నీచరిత్ర మే
     తెఱవలయందు లేదు సుదతీ మదతీవ్రము లైనభావముల్
     నెఱసినభావ మొక్కటియ నీదుతలంపు మొఱంగి యిట్టియే
     మఱుటకుఁ దెచ్చెఁ గాలగతి మాన్పఁగ శక్యమె యెట్టివారికిన్.110
ఆ. దీన నేమిదప్పు ధీరవు నీయను, తాప మొకఁడు నిన్ను ధన్యఁ జేసె
     విను మకామకృతము లనుతాపమున శుద్ధి, నెలయు ననుట మునులపలుకుగాదె.111

చిత్రరేఖ యుషాకన్యకన్నకలకుఁ గారణం బూహించి యుషాకన్య నూరార్చుట

వ. అనుచుండం గుంభాండపుత్రి యొక్కింతసే పూరకుండి యయ్యఖండితచారిత్ర
     నుద్దేశించి.112
క. ఇంతవడి కేను దలఁచితి, నింతీ జగదంబ నిన్ను నే మని పనిచెన్
     గాంతునిఁ గోరినగోర్కికి, నంతర్గతి నాదరించి యది గనుఁగొనుమా.113

వ. వైశాఖశుద్ధద్వాదశినాటిరాత్రి హర్మ్యతలంబున సుప్త యైననిన్ను ననుభా
     వ్యభావరససంస్కారం బగుభావసంభవవికారంబు నొందించినవాఁడ వల్లభుం
     డగు నని యద్దేవి నిర్దేశం బిప్పుడ ఫలియించె నీవు పరితోషంబు కొందు మనిన
     నయ్యిందుముఖి ముఖంబు మంచుదొరంగినయిందుబింబంబుపగిది నవగతబాష్ప
     పూరం బై భూరికాంతి వహించె నెచ్చెలు లెల్ల నుల్లాసంబు నొంది రనంతరంబ
     యయ్యబల ప్రియసఖిం గనుంగొని యల్లన యి ట్లనియె.114
క. భ్రమ వాయఁజేసి యిటు మా, నము గ్రమ్మఱఁ జెలియ నీవు నా కిచ్చితి వీ
     సమధిక మగుభాగ్యము భో, గ్యముగా నొడఁగూడుత్రోవ యరయుమ యింకన్.115
క. మనసున నాడెడునయ్యన, ఘునియాకృతి యతివ వాక్యగోచరముగఁ జే
     య నశక్యము సుభగ శ్రీ, నెనసినయది దీని నీవ యెఱుఁగుదు వెదకన్.116
క. నినుఁ దేపగాఁగఁ గైకొని, మనోరథపయోధి యేను మానిని గడవన్
     గని చరితార్ధత నొందుదు, నని తలఁచెద నీ సహాయ మల్పమె యెందున్.117
ఉ. నావునుఁ జిత్రరేఖ లలనా యది యట్టిద నాదుదేహమున్
     జీవితము న్భవత్ప్రియము చేఁతకు నైనవి గాక యొంటికే
     యేవెర వైననూఁది భవదిష్టునిఁ దెచ్చెదఁ దొల్తఁ దెల్లగా
     నావినుతానుభావుఁ దెలియన్వలయుం దదుపాయ మెద్దియో.118
తే. ఇట్టివాఁ డని నీవును నెఱుఁగఁ జెప్ప, నేర వెమ్మెయి నెఱుఁగంగ నేరవచ్చు
     వినక చూడక యెఱిఁగెడువిధము గలదె, కడిఁది యెవ్విధమున నిది కమలనయన.119
క. చాయయుఁ జందము నించుక, యీయనువని నీవు చెప్ప నెఱిఁగెదవేనిన్
     వేయేల పుట్టుఁ బేరును, శ్రీయుఁ బ్రభావంబుఁ దెలియఁ జేపడును దుదిన్.120
సీ. వసువులు రుద్రులు వాయువు లశ్విను లాదిగా నెవ్వారి కైనఁ జొరఁగ
     రానిశోణితనగరంబు నిర్భయత దైత్యాధీశుతల వ్రేసినట్లు సొచ్చి
     సరసభావమున నీసర్వభావంబులు భోగించి పోయినపురుషవృషభుఁ
     డిప్పు డెన్నినవీరి కెల్లను వేవేలు క్రమముల నెక్కుడుఁ గాక యున్నె
తే. బాణునకు వేయిభుజములభరము డించు, కయ్య మిచ్చువాఁడును వీఁడె కాఁగఁబోలు
     నిట్టిపతిఁ బొందలేనియయ్యింతిరూపుఁ, [21]బ్రాయమును సిరియును నపార్థములు గావె.121
చ. అనుసఖిభాషణంబులకు నంగజరాగరసంబు దోడుతోఁ
     వనువున నాత్మఁ బిక్కటిల దందడి వేగిరపాటు నార్తియున్
     ఘనముగఁ జేయ నచ్చ తెలిగన్నులఱెప్పల నశ్రుబిందువుల్
     వనరుహకేసరస్థహిమవారిలవంబులపెంపు డింపఁగాన్.122
వ. నెచ్చెలికేలు గేలం గైకొని మౌళిం జేర్చి.123
మ. తమకార్యంబుల కెల్లవారుఁ గడునుత్సాహంబు వాటింతు రు
     ద్యమ మన్యార్థము సేఁత దుర్లభము మత్ప్రాణంబుతోఁ దుల్యగా

     రమణీ యేను దలంతు నిన్నుఁ బ్రియ మార న్నీవు నున్నట్టిభా
     వమ పాటించి భజంచినం గలుగు దైవస్ఫూర్తి నాకోర్కెకిన్.124
క. నిక్కము సెప్పెద నాదెస, నక్కటికము నీకు లేనియట్టిద యేనిన్
     దిక్కొరు లెవ్వరు ప్రాణము, లిక్కాయముతోడఁ బాయు నింతియ పిదపన్.125
వ. అనినఁ జిత్రరేఖ పరిత్రాసతరళ యగుచు నత్తరళనయన కేలు కేలం బట్టి.126
క. ఎడ యిమ్ము నా కొకించుక, దడవెద నాబుద్ధియంద త్రైలోక్యమునన్
     బొడవైనవి యెల్లను గని, తడయక నీ ప్రియుని నెవ్విధంబునఁ దెత్తున్.127
మ. కరుణాలోచనమూ ర్తి సర్వజగదేకస్వామికిన్ జీవితే
     శ్వరి శైలేశ్వరకన్య నీదెసఁ గటాక్షం బొందఁగాఁ జేర్చుటం
     దరుణీ యెంతయు ధన్య వీవు దయితుం దచ్చోదితున్ లోకసుం
     దరు విశ్వాధికుఁ బొంది తెట్లు తుదియేదం గాంచు నీకోరికల్.128
వ. అని యయ్యువిద నూరార్చి సఖీజనంబులం దదీయరక్షణార్థంబు నియోగించి
     యోగవిద్యావిదిత యైన యమ్మహానుభావ యేకాంతంబున నుండి.129
సీ. అధికవిస్తీర్ణమై యమరునాలేఖ్యపటంబున వలయువర్ణంబు లెల్ల
     నొడగూర్చి తూలిక యొప్పఁ గైకొని పదునాలుగుజగముల నోలి నెవ్వ
     రెవ్వరు ముఖ్యులై యెందుఁ బ్రఖ్యాతిఁ బొందుదు రట్టిపురుషులఁ జదు రెలర్ప
     నాకారములుఁ జాయ లంబారాభరణాదు లొప్పులు నిలుకడ లొకఁడు దప్ప
తే. కుండ సప్తరాత్రంబున నొనర వ్రాసి, తెచ్చి నెచ్చెలిముందట విచ్చి చూపి
     యచ్చెరువునొందు నముగ్ధ కవ్విధంబు, వేఱువేఱ యిట్లని చెప్పె విస్తరించి.130
ఉ. ఈయఖిలాండసృష్టి నొడలెత్తినధన్యుల నెల్ల నేను నీ
     కై యిదె యస్మదద్భుతకళాతిశయంబున నాహరించి బా
     లా యిటు చిత్రవిన్యసనలక్ష్యులఁ జేసితి నిందు నీప్రియున్
     శ్రీయుతు నొప్పుగాఁ దడవి చెప్పుము నిక్క మెఱింగి క్రమ్మఱన్.131

చిత్రరేఖ దేవదానవప్రముఖులనెల్లఁ జిత్రపటంబున లిఖించి తెచ్చి యుషకుం జూపుట

మ. విను మాద్యం బగుతేజ మొక్కటియ యీవిశ్వంబుఁ బుట్టింపఁ బెం
     ప నడంపంగఁ ద్రిమూర్తులై నెలసె సౌభవ్యాత్మకుల్ వీరె లో
     కనుతుల్ బ్రహ్మయు విష్ణుఁడున్ శివుఁడు నాఁగా వాగ్రమాహైమవ
     త్యనురాగావహు లెల్లవారలకుఁ దా రారాధ్యు లబ్జాననా.152
సీ. పొడవెల్లఁ బసిఁడియై పొలుపారుమాణిక్యతటములు గలకొండ తమకు నెలవు
     ముదిమియుఁ దెవులును గదురకుండఁగఁ బాలతరిఁ గన్నవస్తువు తమకుఁ గూడు
     పొలిపోనిపంట యెప్పుడుఁ గలతరువుల నలరుతోఁటలు దమయాటపట్లు
     యుగకోటి యెఱిఁగినయువతు లయ్యై వేడ్కఁ గొఱలుభామలు దమకొలువువారు
తే. వీరు వేల్పులు ముద్దియ వేయుఁగన్ను, లమర నూఱంచు లెసఁగుఘోరాయుధంబు

     [22]గేలఁ దాల్చినమేటి దమ్మేలఁ గ్రాలు, సౌఖ్యనిరతులు వ్రతులు నిష్కలుషమతులు.133
చ. అమరులకంటెఁ బూర్వు లమరావలిపేర్మి సహింప రుగ్రులై
     యమరకులంబు నొంచుటకునై తపముల్ సవరించి సర్వలో
     కములను నాక్రమింతురు మగంటిమిఁ గోపమునం జలంబునన్
     సమధికు లింతి వీరు పటుసాహసనిత్యులు దైత్యు లారయన్.134
క. దైతేయులట్ల యతివి, ఖ్యాతులు సర్వగుణనివహగౌరవమున ను
     ద్యోతితమూర్తులు సూచితె, నాతీ దానవనిశాటనాథుల వరుసన్.135
శా. పక్షంబు ల్లలిఁ దాల్చు కీరనిభదివ్యద్వాణులుం గాణులున్
     జక్షూరాగముఁ గంఠరాగము సురాసంసక్తి గేయోక్తి నా
     లక్షింపం బొలుపారుమోహకతనూలక్ష్మీవరేణ్యు ల్లస
     ద్దాక్షిణ్యుల్ మఱి వీరిఁ జూడు వరగంధర్వుల్ కురంగేక్షణా.136
మ. అణిమాద్యష్టవిభూతులుం దమకు నిత్యాయత్తలై చేరఁగాఁ
     బ్రణయంబుల్ దళుకొత్తఁ దారుఁ బ్రియలుం బ్రాణంబు లైక్యంబుగా
     గుణితక్రీడలఁ గూడి రూఢ మగు కోర్కు ల్సంతతామోదసౌపా
     రణలం దృప్తిసనంగ నొప్పుదురు వీర ల్సిద్ధు లిద్ధాకృతుల్.137
మత్తకోకిల. ఆధనేశుపురంబువారలు యక్షువర్యులు వీరు వి
     ద్యాధరేంద్రులులు వీరు నిత్యశుభాభిరాములు భూరిమా
     యాధికారులు వీరు గుహ్యకు లంగనారమణక్రియా
     వీథి సర్వపధీను లుగ్మలి వీరు కిన్నరపుంగవుల్.138
మ. సకలాజాండవిలంఘనక్షమబలస్ఫారుల్ మహావిక్రముల్
     శకునిశ్రేష్ఠులు వీరు వీరు త్రిజగత్సంభావ్యభోగుల్ యశః
     ప్రకటోద్యోగులు భోగు లక్షయసుఖప్రాప్తోర్ధ్వలోకాస్పదుల్
     సుకృతుల్ వీరు సురాంగనానిచయహృత్సుస్నిగ్ధభావోజ్జ్వలుల్.139
ఉ. మర్త్యులు వీరు పెంపున నమర్త్యులకంటె నుదగ్రులై మనో
     వర్త్యవిరోధసంప్రసరవర్గచతుష్టయలబ్ధవిస్ఫుర
     త్కీర్త్యనుభావముల్ భువనఖేలనలోలములై యెలర్ప నా
     పూర్యసమానసంపదలఁ బొంపిరివోయెడువారు నెచ్చెలీ.140
చ. మనుజులయందు నస్ఖలితమానసమగ్రులు రాజవంశసం
     జనితులు వీరు హైహయులు శైబ్యులు [23]వైన్యులు రాఘవాన్వయుల్
     జనకులు నైషధుల్ భరతసంభవు లాదిగఁ గాశికోసలా
     ద్యనుపమదేశరాజ్యవిభవాధికసౌఖ్యకళావిజృంభితుల్.141
వ. ఇట్లుగా నస్మద్విలిఖితం బైన యీచిత్రపటంబునందుఁ దగులనిరూపంబు లేదు వీరి

     నిందఱం గలయం గనుంగొను మనిన నయ్యంగన యంతరంగం బలరఁ గ్రమం
     బున నాలోకించి.142
సీ. దేవతలను బూర్వదేవతలను జూచి దేవయోనుల నెల్లఁ దెలియఁ జూచి
     విహగేశ్వరులఁ జూచి యహినాయకులఁ జూచి మనుజసంఘముఁ జూచి మనుజపతులు
     జూచి యాదవకోటిఁ జూచుచో నప్పుడు హరిఁ జూచి పోలిక తెరువు గాంచి
     ప్రద్యుమ్నుఁ జూచి సంభ్రాంతయై యల్లన యనిరుద్ధుఁ జూచి యత్యాదరమున
తే. విగతసంశయ మగుమాడ్కి వేఱొకటికిఁ, బోక యాకూతకౌతుకాద్భుతవిలోక
     తారకం బయి నిలుకడదగులఁ దగిలి, మనసు దోడ్తోడ మన్మధోన్మాద మొంద.143
తే. బిగియఁ జనుదోయి యొత్తినపేరురంబు, నలరుమోవితీ పానినయాననంబుఁ
     దనియఁ గురులు దెమల్చియాడినకరంబుఁ, దరుణి మెచ్చుచు నెమ్మోముఁదమ్మి యలర.144
క. నను మఱపి యెందువోయితి, గనుఁగొంటిమ పట్టువడితి కైతవ మిటుసే
     సినఁ బోనిత్తుమె యనుచును, దనమదిఁ బలుకుగతిఁ గొంతతడ వీక్షించెన్.145
వ. చిత్రరేఖయుఁ దదీయభావం బుపలక్షించి.146
మ.అనిరుద్ధాకృతిమీఁదఁ జిక్కువడి యయ్యబ్జాక్షిచూ పంగముల్
     ఘనరోమాంచమునం దలిర్చెఁ బ్రియు నిక్కం బిట్లు గన్నట్లు గై
     కొని పూర్వానుభవంబు తియ్య [24]మగుకోర్కుల్ చిత్రరూపంబుపై
     మునుఁగం బాఱుట దెల్పెడున్ వివశతాముగ్ధంబులై భావముల్.147
వ. కావున నిమ్మత్తకాశిని నున్మత్తదశ వొందకుండం దేర్చి తడయక దీని మనోరథంబు
     దీర్చెద నని తలంచి యల్ల నగుచు ని ట్లనియె.148
సీ. కన్యాపురంబునఁ గనకసౌధంబుపై నిద్ర నేమఱి యున్న నిన్నుఁ గదిసి
     తన చెయ్దములు సూపి మనము మ్రుచ్చిలి కొని యరిగిన మ్రుచ్చు నబ్జాయతాక్షి
     నీనేర్పు సులువుగా నెఱిఁగితి నేర్పడఁ బోయెద నెచ్చట నేయనువున
     నున్నను బలిమియు నోపికయును నీవు మెచ్చఁగఁ దెచ్చెదఁ దెచ్చి నీకుఁ
తే. జేయలంతిగా నిచ్చెదఁ జెలఁగి నీవు, నీకటాక్షపాతంబున నెఱయఁగంటి
     భోగలలితశృంగార మైపొసఁగుగృహమునందుఁ ద్రోచి నీవలచినయట్లు సేయు.149
వ. అన విని ససంభ్రమంబుగా నయ్యబల చిత్రరేఖం జూచి చిత్రరూపం బంగుళిపల్ల
     వంబున నిరూపించుచు.150
క. నీకౌశల మే మని చెలి, యా కొనియాడుదు మదీయమగుమదికిం జి
     త్రాకృతి మును గలఁ గలసిన, యాకారం బెంత సేసె నంతియ చేసెన్.151
క. ఏపుణ్యవంశమునవాఁ, డేపురుషశ్రేష్ఠుఁ డాతఁ డేగుణముల ను
     ద్దీపితుఁ డతఁ డెయ్యెదిపే, రేపగిడిం జెల్లెఁ జెపుమ యింతయుఁ దెలియన్.152
వ. అనిన విని చిత్రరేఖ యసురరాజపుత్రి కి ట్లనియె.153

చిత్రరేఖ యుషాకన్యకు ననిరుద్ధుని కులశీలవయోబలాదు లెఱిఁగించుట

శా. త్రైలోక్యంబును నేలు దేవుఁడు ధరన్ ధర్మంబు నిల్ప న్నరుం
     డై లీలన్ యదురాజవంశమున విఖ్యాతంబుగాఁ బున్ట్టి గో
     పాలీకేళికరుండు నాఁ బరఁగె నేభవ్యాత్ముఁ డాశౌరికి
     బాలా మన్మఁడు వీఁడు తత్సముఁడు సౌభాగ్యానుభావంబులన్.154
మ. కినుకం దొల్లి యనంగుఁ జేసి పిదనం క్రీడాయతానుగ్రహం
     బున భూతేశుఁడు కృష్ణనందనునిగాఁ బుట్టించినం బుట్టి పెం
     పునఁ బ్రద్యుమ్నుఁ డనఁగ నొప్పెడుమహాభోగాఢ్యుపుత్రుండు త
     న్ననిరుద్ధుం డని పేర్కొనం బరఁగు నత్యాశ్చర్యశౌర్యుం డనిన్.155
సీ. పేర్చి శైలంబులు పెఱికి శైలంబుపై నూడుకొనంగ నొండొంటి వైవఁ
     గడఁగి యంభోధులు గలఁచి యంభోధులపైఁ గ్రందుకొన నూర్మి పటలిఁగలఁప
     గిట్టి దిగ్గజములఁ బట్టి దిగ్గజములతో రాయిడిగను దాఁ బోరొనర్ప
     [25]బ్రహాండపఙ్క్తులు బ్రహ్మాండపఙ్క్తులతోడుత నొండొంటిఁ ద్రుంగ నడువఁ
తే. జాలుఁ గినిసినఁ దక్కినసత్త్వధనుల, తరముగా నెన్నరాదు దుర్ధరభుజుండు
     లలితశృంగారనిధి కళాకలికభువన, గీతకులకేతు వీ ఋశ్యకేతు వబల.156
తే. అఖిలలోకంబులకుఁ దల్లి యైనవిశ్వ, గురునియిల్లాలు చేసినకరుణపేర్మి
     యింత యొప్పునె నీసరి యెవ్వ రింతు, [26]లింతి యొప్పితి పతిఁ బొంద నింతవాని.157
క. సాధించి సురల నేలిన, యాధిక్యము వెలసెఁ దండ్రి కతివా నీచే
     నీధన్యత గొనియాడఁగ, వేధయు జడముఖుఁడు వేయివిధముల నరయన్.158
వ. బాణనిలయం బగుశోణితపురం బెట్లు నిత్యగుప్తం బై యుండు నట్ల కృష్ణనివాసం
     బైన ద్వారకాపురంబును యదువీరసంరక్షణంబున నెవ్వరికి నదృష్టనివేశం బయి
     యుండు నట్లున్నను బ్రద్యుమ్నుతనయుం గదియుదనికి సర్వోపాయంబుల నుత్స
     హించి నీకుఁ బ్రియంబుసేసెద ననిన నసురరాజతనయ యమ్మంత్రితనయ కి ట్లనియె.159
క. యోగినివి కామరూపవు, ధీగణ్యవు ఖేచరత్వదీపితవు మహా
     భాగవు భామిని నీయు, ద్యోగమున కసాధ్యభంగి యొకటియుఁ గలదే.160
ఉ. పున్నమచందురుం జెనయు పొల్పున నయ్యనిరుద్ధుమోము నా
     కన్నులతృష్ణ కిప్పు డిటు గల్గినఁ బ్రాణము నిల్పు నట్లుగా
     కున్నఁ గృతాంతదండహతి నొందుటకుం దగ వైనకాల మా
     సన్నము సన్నుతాంగి యవసన్నత మాన్పఁగఁ జేయవే కృపన్.161
తే. ఏడుదివసంబు లోర్చితి నింక గడియ, దడవునకు నైన లేదు నాతాల్మి చెలియ
     నన్ను బ్రతికించుటయ నీదునైపుణముల, కెల్లఁ దలకట్టు చెలిప్రాణ మెత్తుటసదె.162
క. కుల మొల్లరు నింద యొకటి, దలఁపరు కామార్త లైనతరుణులు మాన

     స్ఖలన మెఱుంగరు నన్నా, [27]కలఁకకు రానీకు నీవు గలఫల మతివా.163
క. దూతీముఖమున గరువము, ప్రీతియుఁ బొదలంగఁ గదియుఁ బ్రియము లరయఁ గా
     ర్యాతురతఁ దాన పైకొను, టే తెఱఁగునఁ గాదు సూడు మిది నీబుద్ధిన్.164
వ. దౌత్యంబు లాఁతివారిదెస నొక్కింత [28]యెగ్గయి తోఁచుం గాని తన ప్రాణంబు
     లతో సమానం బగు జనంబునందుఁ గేవల గౌరవంబునక యయ్యుండు నిన్నియు
     నీ యెఱుంగని భంగులే యనిన నయ్యంగన యింతయు నన నేల నన్ను నేలం
     బనిచెదవు గాదె వేగంబ సర్వశోభనంబులకు భోజనం బయ్యెదు గాక యొక్కింత
     ధైర్యం బవలంబింపు మని యూఱడించి యమ్మగువం గౌఁగిలించి యెప్పటియట్ల
     చెలికత్తియలం బరివేష్టించి యుండం బనిచి వీడ్కొని యంతరిక్షంబునకు నెగసి
     యంతర్ధానంబు నొంది.165
క. చెలువ మనోజవ గావునఁ, గళాంతరములోన సనియెఁ గంసరిపుని యు
     జ్జ్వలవైభవముల కెల్లను నెల వగు తద్ద్వారకాఖ్య నిరుపమపురికిన్.166
వ. చని తదీయసౌందర్యంబునకు మోదంబు నొందుచుం దన కార్యగతియం
     దొక్కింత చింతాకుల యై యుండ నంత నక్కడ నొక్కసలిలాశయంబున నున్న
     నారదుం గని చేర నరిగి ప్రణామంబు సేసిన నకండు దీవించి నవ్వుచు నవ్వెలంది
     నాగమనకారణం బడిగినఁ జేతులు మొగిచి.167
క. బాణసుతుకోరికయు రు, ద్రాణికృపాదానమును ముదంబున సుమనో
     బాణసుతుగుఱిచి తా న, క్షీణతఁ గనవచ్చుటయును జెప్పెఁ గ్రమమునన్.168
వ. చెప్పి మునీంద్రా యేను యదుకుమారునిం గొనిపోయిన నవశ్యంబు నెఱింగి
     బాణుండు సైరింపండు బాణపరాక్రమ మనిరుద్ధునకు భరం బై వచ్చు. మీరు
     మురాంతకునకు నివ్విధం బెఱుంగింప వలయు బలితనయ వసుదేవతనయులకుఁ
     గయ్యం బగు ననియుం గల దందు దైత్యారికి విజయం సిద్ధంబు మఱియొక్కటి
     యెఱింగించెద.169
చ, మనుమని నొక్కకాంతకయి మాయపుభంగిఁ దొలంగ దవ్వుగాఁ
     గొని యట యేను పోవుట ముకుందుఁ డెఱింగిన శాపవహ్నిచే
     నను నెటు నీఱుసేయునొ మనంబునఁ బెల్కుఱియున్నదాన స
     న్మునివర నీవు దోఁచితి మనోరథదేవతవై ప్రసన్నతన్.170
క. కావునఁ గృష్ణునిదేస భయ, మేవిధమునఁ బొందకుండ నీవలయుఁ గృపన్
     నీవరవు డుషాకన్యకు, దేవా యిట్లైన నెల్లదియు సిద్ధించున్.171
క. అనిన మునీశ్వరుఁ డయ్యం, గనఁ గనుఁగొని నీకు నఖలకార్యములకు సొ
     ధనముగ నిచ్చితిఁ దామసి, యను విద్య ప్రియంబు నొందు మంబుజవదనా.172
క. నీ వనిరుద్ధుని నట గొని, పోవఁగ సురరిపునితోడిపోరు గలుగు నే
     నావేళ నరుగుదెంచి ర, ణావష్టంభంబు సూతు ఈ [29]నాదటవోవన్.173

వ. అవ్విధంబున బ్రద్యుమ్నుసూనువృత్తాంతం బనుసంధించుట యయ్యుడుఁ బొమ్మని
     తాను నిజేచ్ఛం జనియెఁ జిత్రరేఖయు నదృశ్యమూర్తి యై వాసుదేవు పెద్ద
     నగరును బ్రద్యుమ్నుమందిరమును నరసి [30]యావల ననిరుద్థుగేహంబు గాంచి
     యందు మనోహరస్థలంబున.174

చిత్రరేఖ యనిరుద్ధుమందిరంబు సొచ్చి యతనిం గొనివచ్చుట

క. పసిఁడికోరల నించి యింపెసఁగ మధువుఁ, గ్రోలుచునుఁ జుట్టునతివలు గ్రాలునడుమ
     నమరుపిడిపిండులోని మహాగజేంద్రు, కాంతి నమరుకుమారు నంతంతఁ గనియె.175
వ. కని తదతీయభావం బుపలక్షించి యాత్మగతంబున.176
చ. సరసతయొప్పఁ బ్రోడ లగుచామలు పాటలు నాటలుం గరం
     బరుదుగ విస్తరించుచుఁ బ్రియంబులు సూపఁగ దీన నేమిటం
     బొరయమి గానరా నొక యపూర్వపుఁ జందముతో నృపాత్మజుం
     డెరవయి యున్నవాఁ డకట యేమిగతం బగు నొక్కొ దీనికిన్.177
సీ. బలిమిం గొల్వున నవ్వుదళుకొత్తినను మొగం బెల్లఁ దానై యున్న వెల్లఁదనము
     ధీరతఁ దెచ్చి పొందించిన పలుకులయందు గద్గదిక వాయంగ లేదు
     గరువంపుజూపులఁ బురిగొనియిన్నను రాగ మేతెరువున రాదు సేరఁ
     జేతులు వేడుకచేఁతలకై చక్కఁ బచరించినను జక్కఁబడదు చేష్ట
తే. యితనిచిత్త మెవ్వతెయేనిఁ జతురయొకతె, గొన్నయది దైత్యనాథునికూఁతు నితఁడు
     బొందినటు లీతనికి నింపొందఁ గలుగఁ, బోలు [31]దైవికమయ్యు నప్పొలఁతియందు.178
చ. అగు ననుమాన మేమిటికి నమ్మదిరేక్షణదక్క నొండులే
     మగువలు నీయుదారు నసమాానమనఃపరివీడ నొందున
     ట్లుగ నొనరింప శక్తలె త్రిలోచనదేవిప్రసాదసంపదల్‌
     జగదభివంద్య లయ్యు సరసంబుగఁ బండె మదీయయత్నముల్‌.179
వ. ఇప్పు డితనితోడ సంభాషింపవలయు నవ్విధంబునకు ననురూపంబుగా వివిక్తంబు
     గావించెద నని తలంచి యన్నాతి నారదదత్త మైన విద్య నక్కడి జనంబు నెల్ల
     సమ్మోహితంబుఁ జేసి చేరం జని పొడసూపి నిలిచి విరచితాంజలి యై యి ట్లనియె.180
సీ. బలిదైత్యుపుత్రుండు బాణుండు నాఁగఁ బ్రఖ్యాతుఁ డాతనికి హిమాద్రికన్య
     వరమునఁ బుట్టినయరిదికూఁతురు త్రిలోకైకసుందరి యుష యనుకుమారి
     యప్పరమేశ్వరియానతి నిశ్చలనిద్ర యై యుండంగ నీవు దన్నుఁ
     గలయంగఁ గలగని కామార్త యై తాల్మి గోల్పోయి నెవ్వగ కొలఁది మిగిలి
తే. చెఱిచి మఱచిన తెఱఁగునఁ జెయ్వులెల్ల, నెడల విడిచియున్నది బోటి యేను జిత్ర
     రేఖ యనుదాన నినుం బ్రియలీలసుముఖుఁ, జేసి తోడ్కొనిపోవవచ్చితిఁ గుమార.181
క. నాచెలికత్తియరూపం, బాచతురాననుఁడుఁ జాలఁ డభివర్ణింపన్
     గోచరయే యస్మాదృశ, వాచోయుక్తులకు నైన వలయుం దెలుపన్‌.182

సీ. చందురునకు నంబుజంబులనెత్తావి యొక కొఱంతయుం జెంద కొదవెనేని
     గోకంబులకుఁ బైఁడికుండలఁ గొఱలురూపంతయ సతమును నబ్బెనేని
     [32]అతను బాణములకేణాలోకముల కల్కితనము నిక్కంబుగాఁ దనరెనేని
     బికభాషలకు విపంచికల మ్రోఁతకు భావ మఱలేక దోడ్పడి మెఱసెనేని
తే. బాణనందనయాననప్రభకుఁ జన్ను, దోయికాంతి కపాంగదీప్తులసరణికి
     వాక్యభంగికి నెనయనవచ్చుఁ గాక, యెక్కటిగఁ బోల్చనుపమాన మెందుఁ గలదు?183
తే. ఏను మాబిడ్డఁ బొగడుట యెంతయేని, వైశికం బగు నచటికి వచ్చి చూచి
     యెఱిఁగెదవు గాక మామాట లెల్ల నిప్పు, డిన్నియునుఁ బచరింపఁగ నేల యిచట.184
క. ఆవెలఁదికి నీవును నీ. కావనజనయనయుఁ దగుదు రన్యులు సరి లే
     రీవిశ్వంబున మీ కిది, దైవఘటన మపరిహార్యతరము కుమారా.185
చ. అనువున నేను ని న్నెఱిఁగి యంచితచిత్రపటంబునందు నీ
     యనుపమమూర్తి వ్రాసి ప్రియమారఁగఁ జూపిన నేర్పు పెంపునన్
     దనువునఁ బ్రాణముల్‌ నిలిచెఁ దన్వికిఁ బల్వురు నీకు వల్లభల్‌
     ఘనభుజ యైనఁ గామహతఁ గాచుట పుణ్యము సర్వభంగులన్‌.186
క. ఏ నిదె మ్రొక్కెద మ్రొక్కెద నానెచ్చెలి మ్రొక్కుగా నెనయుకృపతో న
     మ్మానిని బ్రతికించుటకుం, బూనుము తడ వింత యోర్వఁ బోలదు సుమ్మీ.187
వ. అనిన నతండు సంతసిల్లి యక్కాంత కభిముఖుండై.188
తే. మెలఁత యేమని చెప్పుదు మీమృగాక్షి, గన్నకలయ యేనును గనియున్న చొప్పు
     గాన కున్నాఁడ వచ్చితి పూని నీవ, కాంత కలగన్నచో టిక గంపగొనుచు.189
ఉ. ఏవిదినంబులో రజను లెయ్యవియో విను నిద్ర యెట్టిదో
     వేవుట యెప్పుడో యకట వెమ్ముమనంబున కెద్ది మందొ యే
     త్రోవలఁ బోయెనో తలఁపుతోడన చెయ్వు లెఱుంగ నేను నా
     కీవెఱవేఁకి మాన్ప గమలేక్షణ యబ్బితి వీవు వెజ్జ వై.190
క. నను నీవు వేఁడుకొనియెడు, పని నేనును నిప్పు డతివ ప్రార్థించెదఁ దో
     డ్కొనిపొ మ్మచటికిఁ గొనిపో, యిన వచ్చెద మచ్చెకంటి యిచ్చకు దొరయన్‌.191
వ. అని యివ్విధంబున మనసు దెఱచి పలికిన యక్కుమారు నుత్కంఠాతిశయంబు
     నకుం బ్రముదిత మై యమ్ముదిత తదీయహ్తంబు నిజహస్తంబున నవలంబించి
     యంతరిక్షంబున కెగసి యంతర్ధానం బిరువురయందును నిజవిద్యాప్రభావంబునం
     గలిగించి నిమిషమాత్రంబున శోణితపురంబునం గన్యాగేహాంబున కరిగి యందు.192
సీ. వలవంతసంతాప మొలసియుం బెల్లాస [33]చలిమిరి తోడ్తోడ శమన మొంద
     గోర్కులం దవుకంబు గొదరియుఁ దాలిమిపొందున నందంద క్రిందువడఁగఁ
     దలపోఁత దలఁకు వెగ్టల మయ్యు భావంబు నూఱట పొరిఁబొరి నూరఁబోవ
     దగులను నురివెట్టఁ దనికియు నలకనితెలివిఁ బల్మఱుఁ గార్యదృష్టి నడఁగఁ

తే. గామవికృతులు నైజంపుగారవమునఁ, బరహరించుచుఁ దనరాక వార్చియున్న
     యుషకుఁ బొడసూపెఁ బూర్ణచంద్రోపమానుఁ, డైనయదువీరుతోఁగూడ నమ్మృగాక్షి.193

చిత్రరేఖ యనిరుద్ధునిం దోడ్కొనివచ్చి యుషాకన్యకతోఁ గూర్చుట

వ. ఇట్లు చిత్రలేఖ దోడ్కొనితేర నరుగుదెంచి ముందట నావిర్భవించిన యని
     రుద్ధు నక్కన్య యాలోకించిన నతండు నయ్యువిదం గనుంగొనియె నంత.194
మ. ప్రమదోద్ధామసుఖానుభూతి గలలోఁ బ్రాపించుట న్మున్న చి
     త్తములం బ్రాఁబడియున్న యయ్యిరువురుం దద్వేళ వీక్షించుచోఁ
     దమకం బారఁగ వింతగాక సమతం దార్కొన్నయాలోకముల్‌
     గమియం బ్రాఁకెఁ బరస్పరాంగములపైఁ గౌతూహలోద్యద్గతిన్‌.195
క . సెగ్గంబులదెస వోవక, సిగ్గులు గైకొనక మానసీమఁ జనక పే
     రగ్గలిక రెండుమనసులు, డగ్గఱి చూపుబడి నుత్కటంబుగఁ గలసెన్.196
తే. మనసు లొండొంటిఁ దార్కొనుమానమునన, ఘర్మ మశ్రులుఁ బులకలుఁ గంప మనఁగ
     నలరుభావంబు లుభయాత్మలంద బెరసి, వెలసె మోహనతిమిరంబు పేర్చి వొదువ197.
వ. ఇత్తెఱంగునఁ గొంతనే పన్యోన్యావలోకనసంభ్ర్రమంబున సొగసి.198
క. తనిసి యిరుచూపునుచితపుఁ, బనులకు నాసపడి క్రేళ్లువాఱఁగ బోటిం
     గనుఁగొని యమాత్యనందన, యనిరుద్దునిఁ జేరఁ దెచ్చి యనురాగమునన్‌.199
క. పంతము చెల్లించితి నిదె, కాంతునిఁ గైకొనుము శ్రైలకన్యకకృప నీ
     కెంతయుఁ గల దేమియు మదిఁ, జింతిలవల దిమ్ము కేలుఁజిగు రీతనికిన్‌.200
వ. గాంధర్వవివాహంబు రాజులకుఁ బ్రశస్తంబు దేవీప్రసాదం బను ఋత్విజుండు
     గూర్పఁ గామాగ్నిసాక్షికంబుగాఁ గల్యాణంబు సమంజసం బగుఁ గాక యనిన
     నక్కన్యక నెచ్చెలిం గౌఁగిలించి నీవు సర్వమంగళాచారంబునకు నాచార్యవు
     నీ పనుపునఁ బరమభద్రం బగుటకు సందియం బే మనియె నంత.201
ఆ. చిత్రరేఖ యొసఁగఁ జిత్రమాల్యాంబరా, భరణశోభమానభవ్యామూర్తి
     రాజసుతుఁడు దైత్యరాజతనయకరగ్రహణ మాచరించెఁ గరము వేడ్క.202
ఉ. ఊఱటచెయ్వులం దివుట లూరఁగ దర్పము లొండొకంటికిన్
     మాఱుకొనంగ మున్గనినమంజులసౌఖ్యరసంబు నిక్క లం
     దాఱుచుఁ గోరికల్‌ గెరలి దాఁటులు వైవఁగ సోయగంబుపైఁ
     దేఱఁగఁ బ్రౌఢదంపతులతీరునఁ బొల్పెసలారి రిద్దఱున్‌.203
సీ. కలలోన నొండొరుఁ గలసినయప్పటియానందపూర్ణధన్యత్వములును
     బెరసి యొండొరులపైఁ బ్రేముడి సలిపిన సంతాపబహుళదశాంతరములు

     నెమ్మి నొండొరులకు నెచ్చెలికతమున నబ్బినయసమభాగ్యాతిశయముఁ
     గ్రియల నొండొరులకుఁ గీల్కొన నొదవినయౌవనోచితకళావ్యాప్తివిధముఁ
తే. జెన్ను మిగుల నొండొరులకుఁ జెప్పికొనుచు, నద్భుతంబులు భయములు నాదరములుఁ
     గౌతుకంబులు బొడలాడఁగాఁ బ్రియుండుఁ, బ్రియయుఁ గ్రోలిరి నూతనప్రేమరసము.204
క. వితతపరిరంభణంబులుఁ, జతురవచోరుచులు [34]నపుడు సస్మితములుగా
     నితరేతరరతి వారికిఁ గతిపయదినములనె నెఱసెఁ గఱదతనంబుల్‌.205
వ. అంత నయ్యిద్దఱసమాగమంబు నెఱింగి కన్య్యాంతఃపురంబు కావలివారు దైత్య
     వల్లభుపాలికిం జని యవ్విధంబు విన్నవించినం గోపించి.206
శా. నావిక్రాంతియుఁ బేరుఁ బెంపు మదిలోనం గాన కున్మార్గుఁ డై
     నావీ డక్కట సొచ్చి నాప్రియనుత న్వంశైకభూషామణిన్
     భావం [35]బేదఁగ నొక్కమర్త్యుఁ డఁట దర్పం బేర్పడన్ దూషితం
     గావించెన్ మది సైఁపఁగా వశమె యిక్కాలుష్య మెబ్భంగులన్‌.207
క. అరుగుఁడు పొదువుఁడు పట్టుఁడు, పొరిగొనుఁ డాదుర్వినీతుఁ బోనీకుఁడు మ
     త్పరిభవకారికి నజరా, మరదేహున కైనఁ గలదె మనుగడ యెట్లున్.208
వ. అని యనేకసహస్రసంఖ్యలం గలకింకరులం బనిచిన నయ్యసుర లసిశరాసన
     ప్రాసపట్టిసప్రముఖప్రహారణపాణు లై బాణజామాత యున్న యున్నతసౌధంబు
     చుట్టుపొదివి బిట్టదల్చి యార్చిన.209
క. ఉషకౌఁగిట [36]నలరుచుఁ దా, నుషస్సు నిశి యని యెఱుంగ కుద్దామరసో
     న్మిషితుఁ డయి రేయుఁ బవలును, సుషమలుగాఁ గ్రాలు రాజసూనుఁడు నెమ్మిన్‌.210
వ. అమ్మహాకలకలం బాకర్ణించి తనకు నెగ్గుసేయ డగ్గఱుదానవులకట్టలుకగా నెఱింగి
     కట్టాయితం బై సౌధగిరిగహ్వరంబు వెలువడి సింహసమరేఖం బొలుపారి
     దారుణంబుగా నిల్చె నట్టయెడ.211
సీ. కన్నియలకుఁ జేయఁ గానిచేఁతకుఁ జొచ్చి కులనాశ మొనరించి కులట నైతిఁ
     ద్రైలోక్యనాథుండు తండ్రికిఁ బెడఁబాసి చెడితి నిం కెయ్యది చేయుదాన
     నటమీఁద నాకుఁగా నాఱడి వెలవెట్టరాని రత్నముఁబోని రాచపట్టి
     యవధివోయెడి జగదంబ యిచ్చినవరంబునకును నొకహాని వుట్టునొక్కొ
తే. భాగ్యదేవతలార యీబారి గడవఁ బెట్టరే యంచుఁ జేతులు పిసికికొనుచుఁ
     గన్నునీరు నించుచు నార్తకంఠి యైన, యాత్మవల్లభఁ గనుఁగొని యల్ల నగుచు.212
వ. అక్కుమారవరుండు.213
క. నాలావుకొలఁది యెఱుఁగవు, బాలా తలఁకెదవు బాణపరివార మొకం
     డేలా యేను జయింతును, ఫాలాక్షుఁడు బ్రమథవరులుఁ బన్నిరయేనిన్.214

ఉ. సోరణగండ్ల నిల్చి యట సూచుచునుండుము మద్భుజాయుగ
     ప్రేరితముష్టినిర్దళదుదీర్ణవిరోధిశరీరముల్‌ నవ
     ద్వారములందు వెల్వడునవారితశోణితధారలన్ సురేం
     ద్రారిపురంబుపేరు నిజమై యొడఁగూడెడునట్లు సేయఁగాన్‌.215

అనిరుద్ధుఁడు బాణప్రేరితు లై తన్నుఁ బట్టవచ్చిన రాక్షసకింకరులం బాఱఁదోలుట

వ. అని పలికి యచ్చటికిం జేరువ నున్న కన్యాంతఃపురద్వారంబున నున్న పరిఘంబు
     గైకొని నిడుదతొండంబున నుద్దండం బగు వేదండంబు కదళీకాండంబుపైఁ
     గవియు చందంబున బృందారకరిపుబృందంబుపై నడచె నట్టియెడ నారదుండు
     చనుదెంచి చదల నిలిచి యదువీరు నుత్సాహంబు కుతూహలం బలర నాలోకించు
     చుండె నంత.216
చ. తడఁబడ నమ్ము లేయుచు గదల్‌ నిగుడించుచుఁ గుంతసంతతిం
     బొడువఁగఁ జూచుచున్ సురరిపుల్‌ మఱియు న్వివిధాయుధంబు లె
     వ్వడువున నెవ్వి నేయనగు వానికి నయ్యనువు ల్వొనర్చుచుం
     గడఁగిన నగ్గలంపుఁగినుకం గనుఁగ్రేవలఁ గెం పెలర్పఁగాన్‌.217
తే. శౌరిమనుమఁడు తనచేతిదారుణంపు, పరిఘమున మాటిమాటికిఁ బదులునూఱు
     లవుల వే లనుసంఖ్యల నహితభటుల, నేచి నుఱుమాడుచును వచ్చె వైచివైచి.218
చ. ఎడనెడ ముష్టిపాతములయేపున వజ్రవిభిన్నశైలముల్‌
     వడియెడుభంగి సూపెఁ బరిపంథుల నుద్ధతిఁ గూల్చికూల్చి యు
     గ్గడు వగునెత్తురుల్‌ బహుళగైరికధారలఁ బోల నారదుం
     డుడుగక కుంచె వీచుచును నుబ్బున దబ్బరయాట లాడఁగన్‌.219
వ. అ ట్లమ్మహావీరు పరుసఁదనంబున దందడిం జచ్చియు నొచ్చియు విచ్చియుఁ గింకరులు
     సంకులంబుగాం దమయేలికపాలికిం బఱతెంచినఁ గనుంగొని యయ్యసురపుంగ
     వుండు.220
మ. తగునే యింతటివారి కివ్విధముననన్ దైన్యంబు శూన్యోద్యముం
     బగవానిం గడుఁబెద్ద సేసి చలము ల్పంతంబు లుత్సాహముల్‌
     దెగిపో నాఱడివోయి వచ్చితిరి మీతేజంబునం దొల్లి యీ
     జగమే నోర్చితి నాదునమ్మిక వృథాసంకల్ప మయ్యెం దుదిన్‌.221
క. పోర నకట ప్రాణముచవి, గూరి తగవు మఱతు రేనిఁ గులజులు ధీరుల్‌
     శూరు లనునూట యేటిది పోరామికిఁగాదె ధైర్యములు శౌౌర్యములున్‌.222
క. మరలుఁడి మీవెనుకన యిదె కరిహయరథసుభటబహుళఘనసేనలతో
     దొరలెల్ల నడచెదరు రిపుఁ బొరిగొన కె ట్లూర్సు గలుగఁ బురుషుఁడు సైఁచున్‌?223
వ. అని తనకుం గలవారి నెల్లనుం బనిచినఁ దొలుకాఱునం గదలుతొలుమొగుల
     మొత్తంబులకరణిఁ గాలకాయు లగు దైతేయులు దెసలు నాకసంబునుం దార
     యై తర్జనంబులతో వివిధాయుధద్యుతులు విద్యుత్తులుగా నుద్యుక్తు లయి
     శక్తిదుర్నివారుం డగు కుమారునిమీఁద నురవడించిన.224

క. అంతంతఁ బగతురం గని, సంతసమున నొక్కయసియుఁ జర్మముఁ గొని దు
     ర్దాంతగతి నడచెఁ దా మిసి, మింతుఁడు గా కతఁడు ప్రియకు మెచ్చు దలిర్పన్.225
క. దీపహుతాశనుఁ బొదివెడు, దృప్తశలభతతులుఁ బోలె దితిజబలము ల
     ప్రాప్తపరిభవుని నాహరి, [37]నప్తఁ బొదివి రంత నుల్బణక్రౌర్యమునన్.226
తే. తరతరంబ విద్వేషులు దారుణాస్త్ర, శస్త్రచయములఁ బొడువఁ దుషారపిహితుఁ
     డైనరవిమాడ్కిఁ గొంతసే పాతఁ డపుడు, రూఢి ననిరుద్ధుఁ డయ్యు నిరుద్ధుఁ డయ్యె.
చ. అనువున నద్భుతంబు లగునాక్రమణంబుల వానినెల్ల నొ
     డ్డనమున నాఁగియాఁగి సుదృఢం బగుఖడ్గము చేతఁ గొన్నితు
     త్తునియలు చేయుచుం గినిసి దుర్దమతీవ్రచపేటమై కడం
     గిన హరిలీలఁ గూల్పఁ గడఁగెం గరిసన్నిభ దైత్యపఙ్క్తులన్.228
క. అనిరుద్ధుఁ డొక్కరుం డ, య్యనిమిషరిపు లపరిమితసహస్రము లట్ల
     య్యును [38]డయ్యనిమగఁటిమి నతఁ, డని కందఱ కన్నిరూపు లై దీపించెన్.229
క. కరికోటికి బిమ్మటి యై, హరిసమితికి గ్రుడ్లకొలఁది యై రథతతికిన్
     సరిదన్ని తాపలయి త, త్కరవాలకరాళఘాతకఠినత పేర్చెన్.230
సీ. తోరంపుటెమ్ములతోడ నుగ్గడు వగుదందడి ఖరఖరత్కారములును
     గండకొవ్వులయంగకంబులు సెక్క నుగ్రము లగుచటచటాత్కారములును
     శస్త్రభూషణసముచ్చయములు నుఱుపంగఁ గడలొత్తువలుదక్రేంకారములును
     నాపాదమస్తకాహతి వ్రయ్యం దాఁకంగఁ దళుకొత్తుపటపటాత్కారములును
తే. నెల్లదెసలును దార యై యెసకమెసఁగ, మెఱుఁగు లంబరాంతరమున మిక్కుటముగఁ
     గ్రాలు ప్రద్యుమ్నుసుతుచేతివాలు దనరఁ, జూచె నారదముని కుంచె వీచివీచి.231
క. వరుణునితో నంతకుతో, సురపతితోఁ దొల్లి తొడరి చూడమె యిమ్మై
     బరుసఁదన మందు లే దిది, యరు దని వెఱఁగొంది రాత్మ నసురప్రవరుల్.232
వ. అట్టి ఘోరసంప్రహారంబునం దలలు దగియును గాలు గేలు దునిసియు మేను లవి
     సియు దంతజిహ్వాప్రముఖంబులు మురిసియు రూపు చెడి కొందఱు మడిసియు
     నెత్తురులు దొరఁగి కండ లురిలి కసులు దిరిగి కొందఱు బ్రమసియు వెండ్రుకలు
     వీడ వలువలు సడలఁ గైదువు లెడలఁ గంపితకంటకితగర్హితంబు లగు గాత్రంబు
     లతో నాక్రోశస్వరవిహ్వలు లగుచుఁ గాందిశీకు లై కొందఱు దొలంగం గలంగి
     తొల్లి ధీరు లనం బెంపారినవారును సైరణ విడిచి యెడసేసి సందడి నొండొరులం
     ద్రొక్కుచు నుక్కు దక్కి మరలు దొరలును దురంగమాతంగశతాంగంబులతో
     భంగంబుల కోర్చి సైన్యంబులం బురికొల్పనేరక భయంబునం దిరిగి సురిఁగి
     పోవం గుమారుం డుబ్బి [39]బొబ్బవొడిచి యార్చి యర్చిష్మంతుండు గ్రీష్మసమయ
     తీవ్రుం డై వెలుంగుపగిది. గయ్యంపునేల యను నింగిం గైకొని వెలింగె నట్లు
     విఱిగి పఱతెంచిన తనవారిం జూచి విశ్వాససంచలప్రాణుం డై బాణుండు.233

మ. అనిలోఁ జంపక కాచి పోవిడిచినం బ్రాణంబులం బట్టి యా
     కనకక్ష్మాధర మెన్నఁడుం దిగుటకై గంపింతు రింద్రాదు ల
     య్యని నాచేతులఘాత కల్పు సరిసేయంజాల కిట్లున్న నె
     ట్లును బోదయ్యెఁ గడంకమై వలసె నాటోపం బెదం గైకొనన్.234

బాణాసురుఁడు సర్వసైన్యసమేతుం డై యనిరుద్ధుమీఁద యుద్ధంబునకు వచ్చుట

వ. లెండు రథంబు దెండని పరిజనంబులం బనిచి సమస్తసమరసమాయోగంబును
     యోజించి.235
సీ. వెలయంగ నాలుగువేల కిష్కువులవిస్తారంబు గల్గి యుదార మైన
     గడితంపుటెలుఁగుతో ల్గప్పిననొప్పారు బలుదేరు వేయుమావులు వహింప
     నెక్కి బర్హిధ్వజం బెత్తించి రక్తపతాక గ్రాలఁగఁ దనుత్రంబు దాల్చి
     గదలు గార్ముకములు ఖడ్గముల్ శక్తులు మొదలైన యాయుధంబులు గ్రమమున
తే. వెలుఁగ వేయుచేతులతోడ వేయు గిరణ, ములఁ దలిర్చువిభాకరుపోల్కి యమర
     నమరుకుంభాండసారథి యై కడంగె, సుచిరకాంక్షితసంగరోత్సుకత వెలయ.236
వ. సర్వసైన్యనాయకులును నిజస్వామిపూనిక కనురూపంబుగా నాటోపంబు దెచ్చు
     కొని యతనిముందటఁ గెలంకులను బింకంబులు మొలవ నడచి రిట్లు నడచి బలి
     సూనుం డయ్యదుసూను దవ్వులం గనియె నతండును బగతుబాహుసహస్రం
     బును బాణసంధానసామగ్రియు నగ్రేసరుల యుగ్రతయుఁ జీరికిం గొనక యడి
     దంబు జళిపించి యొడ్డనంబు దాటించి యడ్డంబు నిడుపును దాఁటుచు నెదురు
     నడిచె నవ్వీరుం గాంచి కలుషించి.237
చ. నరుఁడు విహీనసాధనుఁడు నా కెదురై లలిఁ ద్రుళ్లియాడఁ జె
     ల్లరె యిటు సూడఁగాఁ దగునె లాఘవ మేర్పడఁ బట్టుఁ డుక్కునం
     బొరిగొనుఁ డంచు యోధగణము న్బురికొల్పుచుఁ దాఁకి యేసె ని
     బ్బరముగఁ బెక్కుబాణముల బాణుఁ డుషాసతి ప్రాణవల్లభున్.238
క. చంపుదు నని మఱియును సై , రింపక తోమరగదాపరిఘశూలాదుల్
     గంపితభువనుం డగుచు ని, లింపరిపుఁడు పఱపె నబ్బలియుపై నాజిన్.239
శా. వానిం గైకొన కుగ్రచర్మచలనవ్యాఘాతము ల్సేయుచున్
     నానాసైన్యము లడ్డమై తొడర నున్మత్తాకృతిం గూల్చుచు
     న్మానోదగ్రుఁ డవార్యనిర్భరగతి న్ఖడ్గైకసాహాయ్యుఁ డై
     తా నద్దానవనాథుతేరు గదిసెం దద్బాంధవు ల్బెల్కుఱన్.240
తే. కదిసి రథ్యముల్ వేయింటిఁ గడమవడక
     యుండఁ జించి పెన్నెత్తుట నుర్వి నుంచి
     యుగ్రుఁ డై తనమీఁదను నుఱుకఁ దలఁచు
     నతనిఁ గనుఁగొని సైఁప కయ్యసురవిభుఁడు.241

క. శరముద్గరకుంత[40]గదా, పరిఘపరసుతోమరములు పై పై నొదువన్
     బరపి తిరోహితుఁ జేసెను, విరోధి మడిసె నని విబుధవిద్విషు లార్వన్.242
వ. ఇవ్విధంబున ననిరుద్ధు నిరోధించి యయ్యంతరంబున నతండు దివ్యశక్తి యొక్కటి
     యతని పయిం బ్రయోగించిన.243
క. ఎనిమదిఘంటలు మ్రోయఁగ, నినదీప్తులు మాయ నుల్క కెనయగుసరణిన్
     జనుదెంచుచున్నతత్సా, ధన మానృపసుతుఁడు సూచి తలఁకనిబుద్ధిన్.244
చ. వెరవునఁ బట్టి క్రమ్మఱఁగ విద్విషుమీఁదన బిట్టువైవఁ బే
     రురముఁ బగిల్చి వీపున మహోద్ధతి వెల్వడి యుర్వి సొచ్చెఁ జె
     చ్చెర నది దైత్యభర్త గతచేతనుఁడై ధ్వజయష్టి యూఁతగా
     నిరవఱి మ్రొగ్గఁ జూచి దొర లెల్లఁ గలంగిరి నెమ్మనంబులన్.245
వ. కుంభాండుం డొయ్య నతనిం దేర్చి యి ట్లనియె.246
మ. పగవాఁ డల్పుఁడు గాఁడు సంగరవిధిం బల్పోకలం బోయినాఁ
     డు గణింపం డెదిరిం దృణంబునకు నాటోపంబు దీపింప నీ
     జగ మెల్లం బయిఁబడ్డ నోర్చుఁ గడునిశ్శంకాకృతిం జూచితే
     తెగువం గ్రాలెడు వీనిశౌర్యము బలోద్రేకంబు నక్షోభ్యముల్.247
శా. చేయం బోలినవెల్లఁ జేసితిమి దోశ్శిక్షావిశేషోద్ధతుల్
     మాయం డేగతి నందు వీని బలిమిన్ మాయింపరా దేటికిన్
     వేయు న్నన్నును నిన్నుఁ గాచుకొను ముద్వేగం బపేక్షించినం
     జేయున్ లోక మితండు వీతదనుజశ్రీకంబుగా వ్రేల్మిడిన్.248
క. అని ప్రెగ్గడ దెలిపిన న, ద్దనుజేంద్రుడు దెలిసి యపుడు దర్పితు నిమ్మూ
     ఢునిఁ బాముఁ బొదువుగరుడం,డనఁ బొదువుదుఁ జూడుఁ డనుచు నాక్షణమ తగన్.249
వ. గంధర్వనగరంబుచాడ్పునఁ జూడం జూడ నదృశ్యదేహుం డై.250
క. తనుఁ గానక నలుదెసలన్, గనుఁగొను ప్రద్యుమ్నతనయుఁ గౌక్షేయకఖే
     లనదీప్తుదీప్తమధ్యం, దినరవిసమతేజు నుగ్రతేజుఁడు కినుకన్.251

బాణాసురుఁడు అనిరుద్ధుని నాగపాశబద్ధునిఁ చేసి పడద్రోయుట

వ. కృష్ణోరగముఖంబు లగు శిలీముఖంబుల ముఖప్రముఖాఖిలాంగంబుల నావేష్టితుం
     జేసి త్రోచినం గదలనేరక యతండు మేఘవలయపరివృతం బగు మైనాకపర్వతంబు
     పగిది నుండెఁ దాదృశం బగు తదీయదశాంతరంబు దశకంఠసుతవిశిఖవివశుం
     డగు దశరథనందనుచందంబు దలఁపించె నిట్లు నిమేషమాత్రంబున ననిమిషేంద్ర
     సమాను నమ్మానధను నవమానించి దానవేశ్వరుం డమాత్యునిం జూచి. 252
క. కుంభాండ దుష్టయౌవన, జృంభితుఁ డగు దాయ మనకుఁ జిక్కెఁ దన దురా
     రంభమునకుఁ దగ నిపు డసి, శుంభుతుఁ డగుఁగాక వీఁడు సొలయక యింకన్.253

తే. వీనిచేత దూషిత యైన వినుతవృత్త, సీమ వెలయు దీఖలు నిట్లు సేయకున్న
     ననుడు నాతఁడు దేవర యానతిచ్చి, నట్ల యగు నైన నొకవాక్య మవధరింపు.254
సీ. గాంధర్వవిధిఁ గోరి కన్నియ పెండిలి యైనవాఁ డితఁడు కార్యంబు గడచె
     నితని నొండొకటి సేయించిన బాల నుక్కటశోకవహ్నిఁ ద్రోచుటయె కాదె
     యెందుండి వచ్చెనో యెవ్వఁడో యవ్వీరు నెఱుఁగుటయును లెస్స యెల్లభంగిఁ
     బ్రకృతిమానవుఁడు గాఁ డకలంకరూపవిక్రమముల నమరులకంటె మేటి
తే. [41]శీలవృత్తవయోబలశ్రీసమగ్ర, సౌందర్యగుణముల మే లనంగఁ
     దగినవాఁ డిమ్మహాత్తుఁ డీధరణీలోన, మాన్యుఁ డగు నెంచి చూడఁగ ధన్యుఁ డధిప.255
మ. ఇరుగేలం గలయం గదోద్యతములై యేపారునివ్వీరుతో
     దుర మేబంగి నొనర్తు నాక సరి నీతో రాసి నానాస్త్రని
     ర్భరపీడం బడియుండియుం దనదుభ్రూభంగంబునం జూడ్కి క్రో
     ధరసోగ్రంబుగ నీదెసం బఱపెడుం దైత్యేంద్ర లక్షించితే.256
ఉ. ఆతనియున్న రూ పరసితయ్య! యవశ్యము నీకుఁ దుల్యజా
     మాత యనంగ నీ దుహితమాన్యత కర్హుఁ డనంగ నిన్ను సం
     ప్రీతునిఁ జేయఁ జాలెడుగభీరగుణుం డన నుల్లసిల్లెడున్
     నాతలఁ పిచ్చగింపు మనినం బ్రభుఁ డించుక యియ్యకోలునన్.257
వ. అక్కుమారునకుఁ దగిన కావలి పెట్టి నిజభవనంబునకుం బోయె నంత.258
క. చనుదెంచి నారదుం డా, తని నాశ్వాసించి కంసదమనుని నేఁ దో
     డ్కొనివచ్చెద నీదుర్దశ, యనుచీకటి నుగ్రభానుఁ డడఁచునటులుగాన్.259
వ. ధీరజనసత్కార్యం బగు ధైర్యంబు కలిమి యిట్టిచోట్లకుం గాదె కావున నీపరిపీడ
     నంబు సైరించుట లెస్స యని చెప్పి యతఁ డరిగినఁ దన యున్న తెఱంగు సూచి
     యశ్రువిలులితిలోచన యైన వల్లభతో ననిరుద్ధుండు.260
చ, ఎదురెదురై పెనంగుటకు నేమియు నోర్వక మాయ వన్ని యీ
     త్రిదశవిధి చేసినయుదీర్ణవికార మవశ్యభావి యై
     కదిరెఁ గడింది యై పరఁగుకాలము గెల్వ వశంబె యైన నా
     పద దొలఁగింపఁగాఁ బరమబంధుఁడు శౌరి గలండు [42]మానినీ.261
వ. లయకాలోత్థపతంగబింబముక్రియన్ లాయున్ యదీయోగ్రని
     ర్దయనిర్ముద్రసుదర్శనాఖ్యపటుచక్రం బిద్ధదైతేయసం
     క్షయసంక్రీడకు నట్టదేవుఁడు కృపాకళ్యాణుఁ డబ్జాక్షుఁ డ
     క్షయుఁ డాత్మీయపరాభవం బెటులు నిచ్చన్ సైపఁగా నేర్చునే.262

వ. నీ వేల వగచెదవు బాణభాగధేయంబున కిది యవసానం బిటుసూడు మని య
     య్యింతిం గొంత యుపశమితశోకం జేసి.263
క. ఆపదలకుఁ బరిహారం, బై పూర్వులు నిశ్చయించి నట్టిమతము దు
     ర్గాపదసంస్మరణమ యని, యాపరమేశ్వరిఁ దలంచి యంచితభక్తిన్.264
వ. అమ్మహాముని ప్రకరపరిగీతం బైన వాక్యజాతంబున ననిరుద్ధుండు విశుద్ధాంతరం
     గుం డై యి ట్లని స్తుతించె.265
ఉ. నందునికూర్మినందన యనంగ యశోదకృశోదరంబు నిం
     డం దగ నావహించి ప్రకటంబుగ విష్ణునితోడఁబుట్టువై
     సుందరి గోకులైకనవశోభనయై జనియించి యేజగ
     ద్వందిత యొప్పె నాయసురదారణి నాదిమశక్తిఁ గొల్చెదన్.266
తే. తనువులం దెల్ల నొలసి చేతన యనంగఁ
     బ్రజ్ఞ యన మాయ యనఁగఁ బూరణి యనంగఁ
     బరమ యన దాంత యన నొప్పుహరపురంధ్రి
     బరమభద్ర దాక్షాయణిఁ బస్తుతింతు.267
సీ. చంద్రబింబాననఁ జారునేత్రత్రయశోభిని సురమునిస్తుతచరిత్రఁ
     గాళి గాత్యాయనిఁ గంసధిక్కారిణి నహితభయంకరి నభయదాత్రి
     బ్రహ్మవాదినిఁ గామపాలిని సిద్ధసౌదామిని రేవతిఁ దరుణి నచల
     యోగప్రదాయిని యోగిని గంధర్వి లక్ష్మి సరస్వతి లజ్జఁ గీర్తి
తే. సకలతిథులఁ జతుర్దశి షష్ఠిఁ బౌర్ణ, మాసిఁ బంచమి మహనీయమహిమ నంబ
     ధ్రువఁ దపస్విని సావిత్రిఁ దుష్టి శాంతి, దైవమాత భక్తిప్రియఁ దలఁతు భక్తి.268
చ. ఇరువదియేడుదారలును నేఱులు దిక్కులుఁ దాన యైనయీ
     శ్వరిఁ బరమాత్మికన్ మలయవాసిని వారుణి వింధ్య మేరుమం
     దరగిరిమందిరోద్ధరణి ధారిణి సింహరథన్ వృషధ్వజన్
     వరతరుణీలలామ ననవద్యవరప్రద నాశ్రయించెదన్.269
తే. దుర్గ దుర్జయ దుర్గమ [43]దుర్గ్రహ సతి, భద్రదర్శన శివ వజ్రపాణి భగిని
     శబరి జీవనధారిణి శబరసైన్య, నాథనాయిక నాత్మ వర్ణన మొనర్తు.270
క. కౌమారిఁ గామదాయిని, సోమరసాస్వాదలోల శుంభనిశుంభ
     వ్యామర్దినిఁ బార్వతిఁ బృథు, సామజకుంభస్తనిం బ్రసన్నఁ దలంతున్.271
సీ. దేవపత్నులు సర్వదివిజకన్యలుఁ గాద్రవేయకుటుంబినీవితతి వారి
     కన్నియ లప్సరోగణములు మునిభామినులు సిద్ధవిద్యాధరులవనితలు
     మనుజపురంధ్రు లి ట్లెనసినసుందరీసృష్టి యంతయును లక్షింప నంబ
     నీవ యచింత్యవు నిత్యాప్రమేయప్రకృతివి త్రైలోక్యసంకీర్తనీయ

తే. [44]వెవ్వతవొ నీవు నీవని యెఱుఁగ నెవ్వ, రెవ్వరికి శక్య మద్దిపే రెట్టిరూప
     మెల్లపే ళ్ళెల్లరూపము లెల్ల నీవ, పుణ్య నీరూపములు భవ్యభూతిలలిత.272
చ. హరిహరపదగర్భతుహినాంశురవిగ్రహతారకాబ్ధిభూ
     గిరిసరిదగ్నివాయుముఖకీర్త్యసముజ్జ్వలమూర్తులెల్ల నిం
     పరుదుగ గీర్తనంబు గనునట్లు ముదంబునఁ బొందు నిన్నుఁ బ్ర
     స్ఫురదురుకీర్తనం బ్రమదపూర్ణగఁ జేసెదఁ బుణ్యకీర్తనా.273
క. పదునెనిమిదిభుజములతో, నొదవినహారమకుటాద్యనుత్తమభూషా
     మృదులాంబర శోభిని నినుఁ, ద్రిదశేశ్వరి దలఁచువారు దేవీ ధన్యుల్. 274
క. నరదాయిని మహిషాసుర, పరిమర్దిని వైదికాదిబ్రహ్మిణి శివసుం
     దరి నారాయణి యచలే, శ్వరకన్యక యనఁగ నీదుసంజ్ఞలు తల్లీ.275
క. ననుఁ జూడుము దుస్స్థితు లె, ల్లను దొలఁగింపుము శుభోజ్జ్వలశ్రీయుతుఁగా
     నొనరింపుము భవదాశ్రిత, జను లాపద్రహితు లనరె చదువుల నార్యుల్.276
తే. కేలు మొగిచి మ్రొక్కెద నిదె కీర్తనంబు, లర్ధిఁ జేసెదఁ దలఁచెద నర్చనంబు
     లాత్మ నించెద నీ కెక్కినట్టి యన్ని, చందములు భద్రములు గావె సర్వభద్ర.277

కాళికాదేవి ప్రత్యక్షంబై యనిరుద్ధునిబంధనంబు దునిమి యాశ్వాసించుట

వ. అని యనేకప్రకారంబులం బ్రస్తుతింపుచున్న యన్నరోత్తమునకుం బ్రసన్న యై
     దుర్గమపరాక్రమ యగు దుర్గ తత్పురోభాగంబునఁ దనరూపు సూపి నిలిచి
     తదీయబంధనస్థానం బైన వజ్రమయపంజరంబు కరస్పర్శనంబున భంజించి నిగ్ర
     హత్వంబు మాన్చి యతనిం గనుంగొని.278
మ. ఘనబాణాసురబాహుమండల మని ఖండించి దండించి వే
     నినుఁ జక్రాయుధుఁ డార్తబంధుఁడు దయానిత్యుండు దైత్యాంతకుం
     డనఘా మోక్షితుఁ జేసి తోడ్కొని చనున్ హర్షంబుతో నంతదాఁ
     కను సైరింపు మొకింత దీన నొదవుం గళ్యాణ మేభంగులన్.279
క. అని కరుణించి మహేశ్వరి, యసఘుఁ డతఁడు సూచుచుండ నంతర్ధానం
     బునఁ బొందె నంత నెంతయు, ననిరుద్ధుఁడపోలె నుండె ననిరుద్ధుండున్.280
క. ఆర్యాస్తోత్రం బిది విధి, ధుర్యతఁ బఠియించుదురితదూరులు లక్ష్మీ
     పర్యాప్తిఁ బరఁగి యెయ్యెడ, నార్యులు గొనియాడఁ గాంతు రఖిలసుఖంబుల్.281
క. అనుదినమును నియతమనం, బున నెరయఁ బఠించుపుణ్యపురుషునకు జగ
     జ్జనని కరుణ నెలకొనఁగా, ననుగ్రహము సేసి మనుచు నధికప్రీతిన్.282
క. అని వైశంపాయనముని, జన మేజయజనవిభునకుఁ జక్రాయుధపౌ
     త్రునిసౌభాగ్యము శౌర్యము, వినిపించినకథ ప్రశస్తవిస్తరఫణితిన్.283

ఉ. సాధితసర్వధర్మ యవసాదితదుర్జనకర్మ నిత్యస
     త్యోదితశర్మ నీతిసముపార్జితభాసురభర్మ బాణసం
     వేధితవైరిమర్మ దురుపేక్ష్యసముద్యమమర్మ వృత్తసం
     శోధితపుణ్యజీవన యశోమయగాంగజలైక పావనా.284
క. శ్రీమల్లచమూపతిసే, వామధురిమనిత్యసుముఖ వామవిచార
     [45]న్యామూఢవిముఖ యర్చిత, వామార్ధాంగపరతత్త్వ వాసవసత్త్వా.285
మాలిని. అనతనృపతికాంతాహారహంసాపకారీ
     [46]ధ్వనితగురుధనుఃప్రోద్వాంతనారాచవృష్టి
     వినమదభిమతార్థానిష్క్రియాసారదృష్టి
     జనితసుజనహర్షా సత్యనిత్యప్రకర్షా.286
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామ
     ధేయప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందు సప్తమాశ్వాసము.

  1. నిర్లోకంబు
  2. కంఠాస్థులు
  3. నిమిలి
  4. కరుణచే నీదుభక్తికిఁ గరము మెచ్చి
  5. ల్ముచ్చటం; ల్మూఁదటం.
  6. క. తన క్రొవ్వున నైనదిదా, గనియె మనకు నేమి యనుచుఁ గడంగి గుహగురుం
         డని నొప్పరికించెనె యి, య్యినతేజునకుఁ దుది యిప్పు డెయ్యదియొ కదా.
  7. మోక
  8. తనమనంబు సొక్కించి పనియింపెనయు
  9. పుపుటమ్ముచాయ
  10. లేఁదేటులు చుట్టికొల్వ
  11. వెలగొడగు
  12. రుతులును
  13. సేనాధి
  14. నిల్చియున్న యగుగణములయ
  15. దనతలఁపున
  16. స్థితిదీప్తులఁ గ్రాలుచుండఁగన్
  17. వనపార్చి
  18. దేవ
  19. కలదొ
  20. బాఁతటన్
  21. బ్రణయమును జేయునంసమర్థముల కావె.
  22. నెలమిఁ దాల్చినయమ్మేటి యేల లీలఁ, గ్రాలు సౌఖ్యనిరతులు నిష్కలుషమతులు.
  23. వారలు
  24. మునఁ గోర్కుల్
  25. తొడరి బ్రహ్మాండపంక్తులతోడ బ్రహ్మాండపంక్తులు వడి బిట్టు వగుల నడువ.
  26. లింతి యిప్పతిఁ జెందుమీ యింతవాని
  27. మ్మా, కలకగునే నీకు రాకుండగలఫల మతివా.
  28. నెగ్గంబై
  29. ఆరట
  30. యపుల
  31. దైవికంబెన యప్పొలఁతిపొందు
  32. మదనుబాణములకేణా
  33. చెలిమిని దోడ్తోడ శమము నొందు
  34. నమరసస్థిరరాగా, యతరతివిధులను
  35. బొందఁగ
  36. ను విహాయను, లుషస్సు లివి
  37. నప్తృ
  38. నొయ్యని
  39. బొబ్బయిడి
  40. కులిశ
  41. సకలవేదశాస్త్రముల విశారదుండు, గావలయు (మరి) పడుగును గాఁగవలయు
    శీలవృత్తయశంబుల మేలనంగఁ, దగినవాఁడు గావలయు నీధన్యుఁ డధిప.
  42. కామినీ
  43. దుర్గ్రహ దుర్గహరిణి
  44. ఎవ్వతవు నీవు ని న్నెఱుఁగు దెఱుఁగ నెవ్వ, నెవ్వరికి నైన శక్యంబె యెట్టి రూపొ
    యెల్లపేళ్ళు నీదు పేళ్ళెల్లరూప, ములును నీరూపములు భవ్యభూతిలలిత.
  45. వ్యామోహ
  46. ధ్వనిగురుధనురంభోధ్వాంత