Jump to content

హరివంశము/ఉత్తరభాగము - షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - షష్ఠాశ్వాసము

     నాథకథాశ్రుతిని
     త్యానందస్యంద[1]మందిరాంతఃకరణా
     దానగుణైకాభరణా
     భూనారీరమణసుభగ ప్రోలయవేమా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు భక్తానందసంవిధాయకుం
     డైన యయ్యదునాయకుండు బదరీవనావలోకనపారీణుం డై యున్నంత.2
మ. తనపైశాచికభావముం దొరఁగి సిద్ధత్వమునం బేర్చి నె
     ట్టనఁ దేజోమయమూర్తి యై చనిన ఘంటాకర్లుతో మచ్చరిం
     చెనొకో నా నిబిడంబులై యెసఁగు పెంజీఁకట్లు వాయంగ నూ
     తనసంధ్యామయదీప్తి దాల్చెఁ ద్రిజగత్కల్యాణకల్యాకృతిన్.3
క. వినతాతనఁయుఁడు మున్నుగ, ననుపమతేజుఁ డయి తోఁచుహరి దానయనన్
     వినతాతనయుఁడు మున్నగ, ననుపమతేజూఁ డయి తోఁచె హరి యుదయాద్రిన్.4
వ. ఇట్లు సూర్యోదయం బగుటయు గంగాస్నానవిశదగాత్రుండును బవిత్రార్ఘ్య
     సేవితసరోజమిత్రుండును నై దేవకీపుత్రుండు సనుదెంచి సవినయంబుగాఁ దను
     నిఖిలమునిదేవసముదయంబును నెదుర్కొన నయ్యందఱ నభినందించి రాత్రిఁ
     దనపోయినపోక లన్నియుం జెప్పిన నప్పరమవ్రతు లప్పిశాచంబునకుఁ గలిగిన
     పుణ్యపాకంబు గొనియాడి రనంతరంబ వారల వీడ్కొని.5
క. గరుడారోహణలీలా, సరసం బగు గగనమార్గసంచారమునం
     ద్వరితగతి నుత్తరపుదెస, కరిగి మురద్విషుఁడు ప్రముదితాత్ముం డగుచున్.6
మ. కనియెం గ్రీడదమర్త్యదంపతిమిధోగంభీరహాసంబు ని
     త్యనిరుద్థేంద్రియసిద్ధసంయమిగణైకావాసమున్ వాసవా
     ద్యనఘారాధనరమ్యరుద్రచరణన్యాసంబు నాసన్నఖే
     లనలోలాద్రిసుతామనోజ్ఞగిరిశోల్లాసంబుఁ గైలాసమున్.7

శ్రీకృష్ణుఁడు కైలాసంబు గనుంగొని తదీయవైభవంబు నభివర్ణించుట

వ. కని కదియం జని తదీయవిభవంబు లూహించి.8
సీ. ఈకొండసెలయేఱు లీశ్వరువృషభంబు గోరాడు కూలము ల్గూడి యొప్పు
     నీగిరికుంజంబు లిందుశేఖరుదేవి మెచ్చుపూఁబఱుపులు మెఱయ మెఱయు
     నీయద్రినెత్తంబు లీశతాండవరంగభూము లై యసమాసభూతిఁ దనరు
     నీపర్వతముతోఁట లిభదైత్యదమనుపూజకు భృంగి గోయుపుష్పములు పూచు

తే. నీనగంబుక్రేవలు ప్రమథేశ్వరులకు, రుద్రకన్యాసహస్రంబు రుచిరకేళి
     నలరునెలవులై యెంతయు నమరు ననినఁ, బొగడఁదగదె యీరాజతభూధరంబు.9
తే. తలలు దఱిగి పూజించినదర్పలీల, సెసఁగువీరుఁడు నీశైల మెత్తఁబోయి
     బాహు లిఱుకంగఁ దాల్మిని బాసి కూసె, దీనిగౌరవంబున కెద్ది మాన మరయ.10
మ. తొమ్మిదిపెన్నిధానములు దూఁకొని యర్థవిభుం డనం బ్రశ
     స్తమగుపేర్మి నిందుధరుసఖ్యము గాంచినమేటి యొండుచో
     టిమ్మెయి మెచ్చ కివ్వరమహీధరుపాదము నాశ్రయించి సౌ
     ఖ్యమ్మున మూరిఁబోయెఁ బెఱయద్రుల కింతటిపేర్మి గల్గునే.11
శా. యక్షస్త్రీస్తనభంగురోర్మి యలకేశాంతఃపురోత్తంసతా
     దక్షస్వర్గసరోజ కిన్నరవదద్వంద్వానుభూతస్థలీ
     వృక్షచ్ఛాయ వియత్తరంగిణి పయోవేగంబున న్నిత్యముం
     బ్రక్షాళింపఁగ నొప్పుదీని[2]చఱు లీభద్రంబు సామాన్య మే.12
చ. అనిశము సార్వభౌమకరి యంజనపైఁ గమనీయపుష్కరం
     బునఁ గనకంపుఁజెంగలువపుప్పొడి నొప్పగునీరు సల్లఁగాఁ
     [3]దనరుచు నంచకాఁపులకుఁ దానకమై కడ లుల్లసిల్లఁ బెం
     పెనసినమానసం బమరు నిచ్చలు మెచ్చరె యిమ్మహీధ్రమున్.13
మ. కరులు సింగములున్ వృకంబులుఁ గురంగంబుల్ భుజంగంబులున్
     బురినెమ్ముల్ మొదలైన కాననచరంబుల్ వైరము ల్దక్కి శం
     కరసంస్మృత్యనుభూతియం దొకటి కైక్యప్రీతితోఁ దెల్పుచున్
     బరఁగుఁ దీనితటంబునఁ శుభద మిప్పట్టాత్మవిత్కోటికిన్.14
సీ. అలిగి దక్షాధ్వరం బఱవఱసేయంగ భద్రతేజుని వీరభద్రుఁ బనిచె
     దర్పించి పలికినఁ దలద్రుంచి కమలజుఁ గ్రొవ్వడఁగింప రుద్రులను బనిచె
     నన్యాయకారియై యడరినయంతకుఁ బ్రహరింపఁ గాలభైరవునిఁ బనిచె
     నిజభక్తరక్షణనిష్ఠ మై మృత్యువు భంగింపఁ బహుగణప్రతతిఁ బనిచె
తే. నర్థి నిమ్మహాచలము సింహాసనముగ, నెలమితో నుండి విశ్వలోకేశ్వరుండు
     నమరవాసంబు మొదలుగా[4]నన్యభూము, లెఱుఁగఁ డీశంభునకు మెచ్చు నిదియె కాదె.15
వ. అని బహుప్రకారంబుల బహుమానతత్పరుం డగుచు నటఁ బరిక్రమించి.16
క. ఇదే ప్రేపయడవి ప్రమథులు, ముదమున శతకోటిసంఖ్య ముసరికొని ప్రియం
     బు దలిర్ప దీనఁ గోలలు, గుదియలుఁ గైకొండ్రు తమకుఁ గోరి ధరింపన్.17
మ. అదె నందీశ్వరవేత్రవారితనిలింపాజస్రసమ్మర్దసం
     పద సొంపారెడుశంభు[5]గోపురము సంభావ్యంబు లై మించె నిం
     పొదవంగా నవె శర్వగేహమణిశృంగోన్నద్ధచామీకరో
     ద్యదనేకధ్వజవైజయంతిక లమందాందోళనోల్లాసముల్.18

ఉ. అంబిక నెచ్చెలు ల్విజయ యాదిగఁ బువ్వులు గోయుకేళి రా
     గం బగునిక్కువంబుఁ గలకంఠరుతంబులతోడఁ గూడి చో
     ద్యంబుగ వించె ముందటి వనాంతములం దవె శంకరార్ధదే
     హం బడగోలుగొన్నసతి యద్భుతరూపవిలాసగేయముల్.19
వ. అనుచుఁ గొండొకతడవునన తత్ప్రదేశంబు లతిక్రమించి చని మానససరసి
     యుత్తరతటంబున దార్క్ష్యువలన నవతీర్ణుండై యమ్మహాత్ముండు.20
క. అచ్చటిమునులు న్సిద్ధులు, వచ్చి తనుం గాంచి వినయవాక్పూజనముల్
     మెచ్చుగఁ జేయఁగఁ దగుచో, నిచ్చ నిలిచి తపముమీఁది యెసకపుఁగడఁకన్.21
తే. ద్వాదశాబ్దకృత్యం బగువ్రతము నిర్వ, హించుతలఁపున జడలు ధరించి శాక
     మూలఫలకోటి యాహారముగఁ దొదంగెఁ, దన్మయాత్ముఁ డై తాపసధర్మమునకు.22
వ. ఇట్లు ఫాల్గునశుక్లపక్షంబున దీక్షించి యక్షీణంబు లగునిత్యస్నానాధ్యయనధ్యాన
     జపతర్పణహోమబలిప్రముఖంబు లగుననుష్ఠానంబులదెస నలిగరిష్ఠ యగునిష్ఠ
     నవలంబించి యున్నయంబుజోదరునకుఁ గాకోదరద్విషుం డగ్నికార్యప్రయోజ
     నంబు లైనయింధనంబులు దెచ్చియిచ్చు, సుదర్శనచక్రరాజంబు పూజార్థకుసుమం
     బులు గొనివచ్చు, నందకఖడ్గం బఖండితకుశంబుల సంఘటించు, అఖిలాస్త్రంబుల
     తోడ శార్ఙ్గంబు దైత్యదానవభీకరంబై భృత్యభావంబు మెఱయు, అగ్రభాగం
     బునఁ బాంచజన్యంబు సకలదిశలు రక్షించుఁ గౌమోదకి సమస్తవస్తువులు సంసా
     దించుచు సర్వపరిచర్యలుం జేయు నద్దేవుండును నియతభావుం డై.23
క. ఒకనెల నొక్కపదార్థం, బొకనెల వేఱొకటి మఱియు నొకనెలఁ దా నొం
     డొకటి యశనంబుగా నీ, ప్రకారమున నొక్కవత్సరము చరియించెన్.24
వ. రెండవునేఁడును నవులనేఁడు నట్లకాఁ గ్రమంబునఁ బండ్రెండువర్షంబులు గడపి
     పండ్రెండవునేఁటిమాఘమాసంబు నవసానంబునందు.25
క. ప్రణిధానంబున నంబా, ప్రణయుం బశుపతి నమర్చి భక్తి యెలర్పన్
     బ్రణవము రుద్రాధ్యాయము, ప్రణుతమతి జపించుచుండెఁ బర్యాయమునన్.26

ఇంద్రాదిదేవతలు శ్రీకృష్ణుని దర్శించుటకుఁ గైలాసపర్వతంబునకు వచ్చుట

మ. అతిమాత్రంబు తపంబుపేర్మిఁ గృశుఁడై యాపింగరంగచ్చటా
     ధృతి నొప్పారు పురాణసంయమిఁ బ్రభున్ దేవార్చితున్ దేవకీ
     సుతు విశ్వంభరు విశ్వలోకవరదుం జూడంగ నేతెంచి రం
     చితరాజ్యోదయవైభనంబును గడుం జెన్నొంద బృందారకుల్.27
వ. ఇవ్విధంబున నైరావతంబు నెక్కి యెక్కుడుపెంపునం బొదలుభిదురంబుఁ గేల
     నమర నమరీకరకలితకనకదండతాళవృంతానిలంబులు గుంతలంబులు గదల్ప ననల్ప
     మణిమరీచిరుచిరంబు లగుభూషానికరంబులు నయనసహస్రం బను సహస్రదళ
     సముదయంబున నలంకృతం బగుగాత్రంబున రుక్మపరిష్క్రియాచిత్రంబు గావింపఁ

     బెంపారుపాకశాసనుండును లోకత్రాసకరంబగుకాసరంబు నధిరోహించి రోహి
     తేక్షణంబును నాక్షిప్తక్షపాతమస్సమూహంబును నగుదేహంబుతో దేహినివహ
     జీవితఖండనచండం బగుదండంబు ధరించి దర్పోద్రేకభయంకరు లగుకింకరులు పరి
     వేష్టింప నక్లిష్టతేజుం డగు భానుతనూజుండును మనోజవం బగువాహనంబై
     మెఱయు మకరంబుమీఁదం బొలుపారుధవళ యగుతనువు విలసనంబు గైసేయు
     ముత్తియంబులతొడవులును దుకూలాత్మకం బెలయుపరిధానోత్తరీయశిరోవేష్ట
     నంబులుం దదనురూపంబులగు సితచ్ఛత్రచామరవాలవ్యజనంబులు నొక్కతెలుపై
     వెలయ బహుళయాదోనివహంబులు గొలువ వరుణుండును నరుగుదేరం దోడన
     యాశ్వినులు వసువులును సిద్ధసాధ్యులు లోనగుగణదేవతలును విద్యాధరాదిదేవ
     యోనులును బర్వతనారదప్రముఖమునివరులును వచ్చినం గైలాసశైలాసన్న
     ప్రదేశంబు లక్లేశసమ్మర్ధసుందరంబులును గంధర్వగానంబులుం గిన్నరవల్లకీధ్వానం
     బులు నప్సరోనర్తనంబులుం జారణసంకీర్తనంబులు వైమానికపుష్పవర్షంబులు
     నొక్కట నుల్లసిల్లె నట్టియెడ నయ్యందఱుం దమలోన.28
ఉ. చూచితిరే పురాణపురుషుం బురుషార్థసమర్థు యోగిహృ
     ద్గోచరుఁ గృష్ణు నేమితెఱఁగో యిట వచ్చి తగంబుమైఁ గడున్
     [6]గోచరుఁ డైనవాఁ డితనిగూఢమనోరథ మెట్టిదో ఫలం
     బేచతురుండొ యీతనికి నిచ్చుటకుం బ్రభుఁ డిజ్జగంబులన్.29
క. కంటిమి కన్నులపండువు, మంటి మనుచుఁ దద్గుణోక్తి మధువాహిని పె
     న్నీంటం దేలుచు సమ్మద, కంటకితాంగు లయి యేఁగి కాంచిరి వరుసన్.30
వ. అట్టి మహోత్సవంబున నద్దివసంబు పరిపూర్ణం బగుటయు మఱునాఁడు.31
సీ. ఎనిమిదిమూర్తుల నెవ్వఁ డీవిశ్వప్రపంచంబు దానయై పరఁగి యొప్పు
     నఖిలంబునకు నంతరాత్మ యై యెవ్వఁడు సాంఖ్యయోగజ్ఞానసరణిఁ దోఁచు
     నజుఁ డనాద్యంతుఁ డాద్యంతవిధాయి యింతకు నన నెవ్వఁడు దనరు శ్రుతుల
     వేల్పులకును వేల్పు విభులకు విభుఁ డెవ్వఁ డచలభక్తికి గమ్యుఁడై వెలుంగు
తే. నమ్మహాదేవుఁ డనురూపితానుభావుఁ, డప్రమేయఁ డనంతదయావిధేయుఁ
     డచ్యుతానుగ్రహప్రీతి నరుగుదెంచె, నద్రిజయుఁ దాను వృషభవాహనము నెక్కి.32
వ. అద్దేవుపార్శ్వంబున నపరిమితయక్షరాక్షసపరివారుండును (నక్షయసిద్ధగణసేవితుం
     డును) బుష్పకవిమానారూఢుండును నై వైశ్రవణుండు నొక్కకెలన నుదగ్ర
     మూషికమయూరవాహనులై యాత్మీయచిహ్నంబులతోడం గరివదనకార్తికేయు
     లును నగ్రభాగంబున వేత్రదండపాణుడై నంగిమహాకాళులు ముందటం బిఱుం
     దను గెలంకుల మఱియు సర్వదిక్కులనుం బరఁగి ఘంటాకర్ణశంఖకర్ణవిరూపాక్ష
     దీర్ఘరోమదీర్ఘనాసదీర్ఘలోచనదీర్ఘబాహుదీర్ఘముఖులు ననూరువక్త్రపార్శ్వవదన
     శతగ్రీవశతోదరకుండోదరులును మహగ్రీవస్థూలజిహ్వసింహముఖవ్యాఘ్ర

     ముఖోన్నతాంసమహాహనులును ద్రిబాహు చతుర్బాహు పంచబాహు శతబా
     హు లనుపేళ్లు గలిగి తాదృశంబు లైనయాకారంబుల నద్భుతంబులై పెంపుతెంపా
     రిన యసంఖ్యాతభూతంబులు సంప్రోతప్రేతకరాళంబు లగుశూలంబులతోఁ బరి
     పూరితకీలాలంబు లగుకపాలంబులతో నతికఠినపాతంబు లగుచరణఘాతంబుల
     ధరణి యద్రువ నాడుచుఁ బటహాడంబరనిర్భరంబు లగువీరస్వరంబులం బాడుచుఁ
     బ్రకంపితదిగ్భాగంబు లగునూరువేగంబులం బరువులు పెట్టుచు నాక్రాంతగగ
     నంబు లగులంఘనంబుల నెగయుచుఁ దమతమవంగడంబు లేర్పడ నడిచిరి ప్రశాం
     తస్వాంతులు ప్రాప్తేంద్రియజయులు నంగీకృతయమనియములు నాత్మజ్ఞానవిజ్ఞు
     నులును నగు ప్రమథులుఁ ద్రిపుండ్రాంకితలలాటంబులు భస్మోద్ధూళితవక్షంబులు
     నక్షసూత్రశోభితహస్తంబులు రుద్రాధ్యయనతత్పరముఖంబులు భక్తిపులకితావ
     యవంబులు నానందబాష్పవిస్ఫురల్లోచనంబులు నైనదేహంబుల వెలసి విలసిల్లిరి
     చతుర్భుజులుఁ ద్రినేత్రులుఁ జంద్రరేఖాంకితజటామకుటులు శూలడమరుఖట్వాం
     గలక్షణులు నాగయజ్ఞోపవీతులు శార్దూలచర్మవసనులు నగురుద్రులు భద్రమూర్తు
     లునై కీర్తితానుభావధుర్యంబు లగునైశ్వర్యంబు లెనిమిదియుఁ దమవశంబున
     వర్తిల్ల జగదుద్భవస్థితిసంహారకారణంబులయందుఁ జంద్రశేఖరునంతవారల యగు
     టం జేసి వారిరుహాసనవాసవప్రముఖులకు నఖిలోపచారంబుల నర్చనీయులు గావునం
     గమనీయవైభవులై విభవంబున శోభిల్లిరి విముక్తసంసారులు విపులతపస్సారులు
     నధిగతసర్వవేదులు నభ్యస్తశాస్త్రపారగులు ననన్యభక్తిగంభీరులు నగుమునివరులు
     కృష్ణాజినకమండులుకుశయష్టి ప్రభృతిచిహ్నంబు లమర భూతిధవళితంబు లగుశరీ
     రంబు లలర మాహేశ్వరంబు లగు శ్రుతిసూక్తంబులఁ బౌరాణికంబు లగుభవ్య
     స్తోత్రంబుల లౌకికంబు లగుజయజయధ్వానాలోకశబ్దంబులం బరమేశ్వరునిఁ బరి
     తుష్టుం జేయుచు మహాసంఘంబు లై మెఱసిరి సర్వాంగసుందరులును సమస్తసిద్ధి
     సంపన్నులును సంతతసుఖాభిరాములును సంభృతానందపారవశ్యులును సమ్య
     క్ప్రబుద్ధులు నగుసిద్ధులును విద్యాధరులుం బ్రియాసహితు లయి దివ్యభూషణ
     గంధమాల్యాంబరాకారంబు లగునలంకారంబుల నింపారఁ జెలువొందిరి వీణా
     వేణుశంఖభేరీమృదంగవాదనంబులు మంగళగానంబులు నొనర్చుచు గంధర్వులు
     నప్సరోంగనలు లలితాంగనాసత్వవచోదాత్తంబు లగునృత్తంబులు రమణీయం
     బులు గావించిరి మహావాచాలు రగుచారణులు త్రిపురదహనదక్షాధ్వరధ్వంసనం
     బులు మొదలుగాఁ గలగంగాధరువిజయావదానంబులు గైవారంబులు సేయుచుఁ
     జెన్ను మీఱిరి వైమానికముక్తంబు లగుపుష్పవర్షంబులం బొదలుసౌరభ్యం
     బులు గైకొని కైలాసశైలనిర్ఝరశీకరంబులం దడిసినమందసమీరుండు [7]సమీహి
     తాసురవితానవైజయంతికా[8]పల్లవుం డగుచు నుల్లసిల్లె నిట్లు మహావిభూతి విస్త
     రిల్ల విజయం చేసి విశ్వేశ్వరుండు.33

శివుఁడు సపరివారుండై శ్రీకృష్ణునిఁ గాన వచ్చుట

మ. కనియెం దార్క్ష్యసుదర్శనాదినిజభక్తప్రత్యహాపాదితా
     ర్చనహోమోచితవస్తుసంచయపురోజాజ్వల్యమానానలున్
     ఘనకృష్ణాజినవాసు భాసురజటాకల్పున్ సుసంకల్పు భా
     వనిరుద్ధేంద్రియు సత్సమాధిపరతావర్ధిష్ణునిం గృష్ణునిన్.34
క. కని నెమ్మనము కృపారస, మునఁ [9]దోఁగఁగ సుప్రసన్నముఖుఁ డగుచు శివుం
     డనురాగంబునఁ దనవా, హన మగు వృషభమ్ము డిగ్గె నతివయుఁ దానున్.35
క. వెన్నుఁడు నవ్విభు దవ్వులఁ, గన్నంతన నిజసమాధికలితాసనమున్
     గ్రన్నన విడిచి యెదురుసని, సత్నతమౌళి యయి భక్తిసంభరితమతిన్.36
వ. కేలు మొగిచి ఫాలంబునం గదియించి ఫాలనయనుమూర్తిఁ దప్పక చూచుచుండె
     నట్టియెడ.37
సీ. ఔఁదలఁ జదలేటిలేఁదరఁగలు బాలుఁ డగుచందమామ నుయ్యాల లూపఁ
     నొడవుల తలలఁ జెన్నడరుమానికములచాయ దిక్కుల నెఱసంజ వఱుపఁ
     దోరంపుటేనికతోలి[10]యేడ్తెఱ కప్పుకుత్తుకకఱతోడఁ బొత్తు సేయ
     దట్టంపుభూతిపూఁతలు బూదిపఱచినపునుకలపే రురంబునఁ దలిర్ప
తే. మూఁడులోకంబులును గావ మొనసినట్లు, చేత ముమ్మొనకయిరువు చెన్ను మీఱ
     వేల్పుఁబదువుచూడ్కికిఁ గడువింతవేడ్క, సేసె ముక్కంటియున్నయాచెలువుపేర్మి.38
క. హరిఁ జూతురు హరుఁ జూతురు, హరిఁ జూతురు గ్రమ్మఱంగ హరుఁ జూతురు ని
     ర్జరులును మునులును నిమ్మెయి, హరిహరతత్త్వయుగవిస్మితాలోకనులై.39
వ. అందఱు నయ్యిరువురకుం బ్రణామంబులు సేసి యంజలిపుటంబులు ఘటియించి.40
సీ. యజ్ఞరక్షకుఁడును యజ్ఞవిధ్వంసియు నై లోకనుతులఁ బెంపారువారు
     కందర్పజనకుండు గందర్పదర్పైకదమనుండు నై లీలఁ దనరువారు
     భువనసంభర్తయు భువనసంహర్తయు నన నాత్మగుణకృత్యులైనవారు
     భూధరోద్ధారియు భూధరావాసియు నగుట నిత్యప్రీతి నెగడువారు
తే. విషధిజాతంబు లగురత్నవిషము లురముఁ, గప్పుకంఠంబుఁ గైసేయ నొప్పువారు
     భుజగశయనుండు భుజగవిభూషణుండు, నెపుడు గరుణతో వరదు లయ్యెదరు మాకు.41
క. ఈరెండుమూర్తులును నిం, పారఁగ నిటు గదిసియుండ నంతఃకరణం
     బారాధింపం గనియెడు, ప్రారంభము లెల్లఁ బ్రాప్తఫలముల మాకున్.42

శ్రీకృష్ణుఁడు శివుమాహాత్మ్యం బభివర్ణించి స్తుతియించుట

వ. అనుచుండం బుండరీకాక్షుం డట్లు ప్రత్యక్షమూర్తి యైనయష్టమూర్తికి సాష్టాంగ
     ప్రణతుండై యి ట్లని వినుతించె.43

క. శ్రీకంఠగగనతటినీ, శీకరకోరకితజూట శీతకిరణరే
     ఖాకల్పకల్పతరు[11]లీ, లాకల్ప దయవిలాస లాలితసుజనా.44
ఉ. నీమహనీయనామములు నీమహనీయగుణోదయంబులు
     న్నీమహనీయశీలములు నిత్యవిచిత్రము లాద్యసంయమి
     స్తోమనిరుక్తులం దెలిసి చూతురు ప్రాజ్ఞులు సర్వదేవచూ
     డామణిలగ్నముల్ భవవిడంబనమోచనముల్ మహేశ్వరా.45
మ. ఉరుఖట్వాంగకపాలభస్మభుజగాద్యుద్దామచిహ్నంబు ల
     ట్లరుదై యొప్పు ప్రభూతభూతవికృతవ్యాపారము ల్సూడ్కికిన్
     బరమౌత్సుక్య మొనర్పఁగా నెసఁగురూపం బొంద కీ వున్న నె
     వ్వరు సర్వజ్ఞ యెఱుంగువారు భవదవ్యక్తాద్యసూక్ష్మాకృతిన్.46
క. చిరతపముల మెచ్చును సు, స్థిరభక్తికి వలచి వచ్చి చిక్కును ద్రిజగ
     ద్వరదా! ప్రభు! నినుఁ దక్కఁగ, హర! యన్యునిఁ జెప్పగలనె యామ్నాయంబుల్.47
ఉ. మేదిని తోయముల్ శిఖి సమీరుఁడు మిన్ను రవీందు లాత్మనా
     నై దును మూఁడు నీతనువులై వెలుఁగొందఁ బ్రపంచనిష్ప్రపం
     చోదితభావకర్తవయి యొక్కఁడవుం దనరారు టెందు లో
     కాదిని ని న్నెఱుంగు బుధుఁ డన్యు గణించునె విశ్వవందితా.48
ఉ. దక్షుఁ డదక్షుఁడై చెడియెఁ దన్మఖమందుఁ గడంగి బాహుదం
     [12]తాక్షిరసజ్ఞలాదిగ నపాయము నొంది రనేకనిర్జరుల్
     ప్రక్షతు లైరి నీనుదుటిపావకుఁ డేఁచినఁ గాలుఁ గాలుఁడున్
     రక్షకుఁ డైననీ వొకఁడ రాజవు రాజకళావిభూషణా.49
మ. గిరిరాజాత్మజ దేవి నీకు, గిరి నీగేహంబు, విశ్వామరే
     శ్వరులుం బంట్లు సుభూతముల్ సహచరవ్రాతంబు ద్రైలోక్యమున్
     బరమైశ్వర్యపదంబు నీకు నెన సెప్ప న్నీవ కా కన్యు లె
     వ్వరు నీ యుద్ధత తాండవం [13]బనితరవ్యాప్తంబ యంబాపతీ.50
క. హుతభుజుఁడును యజమానుఁడు, హుతమును నీవ యని చెప్పుచున్న విశ్రుతులా
     శ్రుతిమఖములు నీప్రియములు, క్రతుఫలదాతవును నీ వొకండవు రుద్రా!51
క. అతిసౌమ్యము లతిఘోరము, లతిసూక్ష్మము లతివిపులము లద్భుతములు నీ
     వితతాకారంబులు త, ద్గతహృదయుల కెఱుఁగవచ్చుఁ గందర్పహరా.52
క. [14]భూతివిధాయకుఁడ వఖిల, భూతనియామకుఁడ వీవు భూతనిధివి స
     ద్భూతిదుఁడవు నమ్రులకును, భూతేశ్వర నీమహిను ప్రభూతంబు శివా.53
క. భద్రాకారుఁడవు సతత, భద్రచరిత్రుఁడవు పరమభవ్యుఁడవు మహా
     భద్రాభిధానుఁడవు బహు, భద్ర[15]ప్రదుఁడవు త్రిలోకపతివి మహేశా.54

చ. నినుఁ గొనియాడ నేర్తు నని నిక్కువ మెవ్వఁడు శక్తియుక్తుఁ డె
     వ్వనిమనము న్మనీషయును వట్రిలు నెవ్వనిజిహ్వ సాగు నే
     యనువు ప్రశంస చెప్పు సకలార్థసహిష్ణుఁడ వీవు సైపఁగాఁ
     జనుఁ బరమేశ మాదృశులసంస్తుతి చాపలమున్ వృషధ్వజా.55
ఉ. ఏ ననిశంబు దేవ నిను నెంతయు భక్తిఁ దలంతు నీవు న
     న్నీ నెఱివానిఁగా నెఱుఁగు దిట్లగు టించుక చిత్తగించినం
     బూని కృతార్థతామహిమఁ బొందని భక్తశుభ[16]క్రియానుసం
     ధానము నీకు నైజము గదా జగదాత్మక! యెవ్విధంబునన్.56
క. మ్రొక్కెదఁ గృప రక్షింపుము, మ్రొక్కెదఁ గృపతోడఁ జూడుము నిరంతరమున్
     మ్రొక్కెదఁ గృపఁ గైకొను [17]మే, దిక్కున నీదిక్కె మాకు దిక్కు శరణ్యా!57
వ. అని బహుభంగులఁ బ్రస్తుతించినం బ్రసన్నుం డై పరమేశ్వరుండు పద్మలోచను
     పాణిపంకజంబు నిజహస్తతలంబునం గబళించి సర్వదేవమునిసముదయంబులు విను
     చుండ నతని కి ట్లనియె.58
తే. దేవవంద్య జనార్దన దివ్యతపము, పేర్మిఁ దొల్లియ తగుసిద్ధిఁ బేర్చినాఁడ
     వీవు పుత్రుఁడు నీ కుదయించెఁ గాదె, మున్ను నాయీగివలన జగన్నుతార్థ.59
క. విను మేను ప్రథమయుగమున, ననేక వత్సరశతంబు లంచితనిష్ఠం
     బనుపడి కావించితిఁ దప, మనఘా యెం దేని నొక్కయభిలాషమునన్.60
వ. ఆసమయంబున.61
క. నాకుఁ బరిచర్య చేయుట, కై కొండుక[18]ప్రాయమున నిజాత్మజ నిమ్మై
     నాకజనకుండు దెచ్చి స, ఖీకలితసహాయ నప్పగించెం బ్రీతిన్.62
వ. ఏను నక్కన్నియ కొలువున కియ్యకొంటి న ట్లున్న మమ్ము నిద్దఱం గూర్చుట
     యపేక్షించి సహస్రాక్షుం డక్షుద్రసాహసక్రియావిజృంభమాణోద్దాముం డగు
     కాముం బనిచినం బనిపూని.63
సీ. ముందటియెలమావిమొక్కల సలరింపఁ గర్త దా నగు చెలికాఁడు నడువ
     నిరువంకలందును విరులతేనియగ్రోలుదొరలు మోదంబునఁ ద్రుళ్లియాడ
     నునుఁగుత్తుకలు తీపుగొనఁ గూయుపులుఁగులచారునాదములు గైవారములుగఁ
     జందనగిరినుండి చనుదెంచి చల్లనిబం ట్లెల్లపనులకుఁ బరువువెట్టఁ
తే. జిలుకమావులు గట్టినచిగురుదేరి, పసిఁడిబలుమీనుపడగ నల్దెసల మెఱయఁ
     జెఱుకువిలుఁబువ్వుటమ్ము లేడ్తెఱ ధరించి, కట్టి బిగిసి యేతెంచె నక్కడిఁదిమగఁడు.64
వ. ఇట్లు వచ్చి పచ్చవిల్తుండు వివిక్తప్రదేశంబునఁ బవిత్రచిత్రకాయవర్మాస్తరణంబున
     నాసీనుండ నై యనూనధ్యానముకుళితలోచనం బగు పవనస్థానంబున నాత్మాను
     సంధానంబు సేయుచు వెలుపలి నడవడి దడవుగా నుడిగి మగుడి మనంబు

     లయంబు నొందెడుపాకంబు గైకొనియున్ననన్నుం గని సమాధిసమవసానం బగు
     సంనందాఁక నాయితం బై నిలిచి యనంతరంబ పరిచరపరతంత్ర యై సమీపంబున
     నున్నశైలనందన యునికియుం జూచి.65
చ. అతులితమోహనాస్త్రము రయంబున వెంట సమర్చి విస్ఫుర
     ద్రతిరశనాపకర్షణధురంధర మైనకరంబునన్ సము
     ద్ధతిఁ దెగనిండఁగాఁ దిగిచి తార్కొని నాహృదయంబు నల్లల
     క్షితముగఁ జేసి యేసె నిజజీవితనిస్పృహుఁడై మురాంతకా.66
వ. ఇ ట్లేయుటయును.67
చ. కదలి మనంబు నూతనవికారము నొందఁగ నేను బార్వతీ
     వదనసరోరుహంబుపయి వావిరి నిల్పితిఁ జూడ్కి వేడ్క న
     మ్ముదితయుఁ బ్రస్ఫురత్పులకముగ్ధము లైననిజాంగకంబు లిం
     పొదవఁగ నుండె మేఘసమయోత్థకదంబకవల్లిచాడ్పునన్.68
క. ఇది యేమిచంద మేటికి మది యిట్టిద యయ్యె ననుచు మఱి యొయ్యన యేఁ
     బదిలుఁడనై నలుదిక్కులు, వదలక పరికించునపుడు వల నొప్పంగన్.69
క. తనకుఁ గలయమ్ము లన్నియు, మునుకొని యేయుటకుఁ బూని మున్నున్నతెఱం
     [19]గున నచల మొప్ప నిలిచిన, ఘనుఁడు మనోభవుఁడు నాకుఁ గానఁగఁబడియెన్.70
తే. ఆదురాత్మునిచేత యయ్యది మహాప, రాధిఁ బఱచుట యెందు నర్హంబ కాదె
     యని తలంచునాతలఁపుతో ననలుఁ డుప్ప, తిల్లె రోచులఁబటుఫాలదృఙ్ముఖమున.71
చ. అలుఁగకు తప్పుపై సైపు కుసుమాయుధుఁ గావుము దేవ యంచు నా
     కొలఁదిన దేవతల్ చదలఁ గూడి యెలుంగులు సూపి వేఁడ నే
     కొలఁదులఁ బోవ కట్లు దలకొన్నహుతాశనుఁ డంతలోనఁ బూ
     విలుతునిఁ జుట్టుముట్టుకొని వ్రేల్మిడిలో నొనరించె నీఱుగన్.72

శివుఁడు శ్రీకృష్ణునిమాహాత్మ్యము నభివర్ణించి స్తుతి చేయుట

తే. పిదప బ్రహ్మాదిసురలు సంప్రీతితోడఁ, జేరి యెఱిఁగింపఁ గందర్పచేష్టితంబు
     త్రిభువనములకు హితముగాఁ దెలిసి యేను, గ్రమ్మఱంగనుఁ గలిగింపఁ గరుణపుట్టి.73
వ. లోకపితామహునిర్దేశంబునుం గలుగుటం జేసి భవదీయపుత్రుం డై జనియించు
     నట్లుగా ననుగ్రహించితి నతండు రుక్మిణీప్రథమప్రసవంబునఁ బ్రద్యుమ్నుం
     డనంబ్రసిద్ధనామంధేయుం డై సర్వగుణంబుల నిన్నుం బోలుకుమారుం డమ్మారుం
     డుదయించి తనయైశ్వర్యం బంతయు వహించి యీదృశరూపంబున జగన్మోహనుం
     డైయున్నవాఁడు. నీవు పూర్వంబునందును నధికతపం బొనర్చి తిప్పుడు పరమ
     తపోనుష్ఠాననిర్వాహకుండవు నైతి నీదైనయీభవిష్యత్తపోవిభవంబు నెఱింగి
     యింతవట్టునకును ఫలరూపంబుగాఁ గొడుకు మున్న యిచ్చుట యిట్లు సువ్య

     క్తంబు సేయవలసె వినుము నీవు నాకును మానవీయుండవు నీమహత్త్వం బి
     మ్మునులు సకలుసిద్ధులు నెఱుఁగవలయు వివరించెద.74
సీ. ప్రకృతియు గుణములు ప్రకృతిజన్యం బగువికృతిసప్తకమును విను వికార
     ములు పదియాఱునై కలిగినయీప్రోవు మాధవ నీస్థూలమహిమ వీని
     కతిరిక్తుఁ డిరువదేనవుతత్త్వ మీ వని సాంఖ్యులు సూక్ష్మదర్శనులు బుద్ధిఁ
     [20]గని చెప్పుదురు జగజ్జననసుస్థితివిలయంబుల గుణమూర్తివై యొనర్తు
తే. పురుషసూక్తవాచ్యుఁ డపూర్వపురుషుఁ డనుచు, నిన్నుఁ గీర్తింతు రామ్నాయనిష్ఠనుతులు
     విశ్వసంప్రాప్తికతమున విష్ణునామ, మఖిలవిద్వన్నియుక్తమై యతిశయిల్లు.75
క. నారము లండ్రు జలము లిం, పారఁగ నారంబు లయనమై నీ వునికి
     న్నారాయణుఁ డనఁగా నీ, పే రఖిలపురాణములను వెలయుఁ బ్రసిద్ధిన్.76
క. వసధాతువు దివిధాతువుఁ, బొసఁగినవసుదేవసంప్రభూతార్థములం
     దెసఁగుట జగన్నివాసో, భ్యసనరసికు వాసుదేవుఁ డందురు నిన్నున్.77
చ. హరి యన సర్వసంహరుఁడ వౌటఁ బ్రసిద్ధుఁడ వైతి భక్తులం
     గరుణ సుఖాత్మజీవనులఁగా నొనరించుట శంకరుం డనం
     బరఁగితి [21]బృంహణత్వమున బ్రహ్మ యనందగి యీత్రిలోకముల్
     వెరవున విక్రమించుటఁ ద్రివిక్రముఁ డైతి త్రివిక్రమంబులన్.78
క. మధువు లనఁగ నింద్రియములు, మధుద్విషుఁడ వింద్రియప్రమథమున మఱి నీ
     వధికశ్రీనిధి వౌటను, బుధవర్యులు మాధవాఖ్యఁ బొగడుదురు నినున్.79
క. విషయేంద్రియప్రపంచము, హృషీక మనఁ బరఁగు నీ వతీతుఁడవై యు
     న్మిషితముగ నది ధరించుట, హృషీకేశనామశోభి వెందును గృష్ణా.80
క. గోవుమహీదేవి మహీ, దేవిఁ బడసి తీవు ప్రియసతీతిలకమనం
     గావున గోవిందుఁడ వను, భావంబున వామనుఁ డనఁ బరఁగితి పేర్మిన్.81
క. మననంబున ముని యనఁగా, ననఘ తపస్థితిఁ దపస్వి యనఁగా విశ్వం
     బును శాసించుట నీశ్వరుఁ, డనఁగా నీ కివియుఁ బేరులై యొప్పారున్.82
వ. నీవు సకలచ్ఛందంబులయందును గాయత్రియు వేదంబులయందుఁ బ్రణవంబును
     వర్ణంబులయం దకారంబును నాదిత్యులయంచు విష్ణుండును రుద్రులయందు శంక
     రుండును మనువులయందు స్వాయంభువుండును నగ్నులయందుఁ బావకుండును
     దేవతలయందుఁ బురందరుండును గుహ్యకులయందుఁ గుబేరుండును దేవమునుల
     యందు నారదుండును దైత్యులయందఁ బ్రహ్లాదుండును సర్పంబులయందు
     వాసుకియు నదులయందు గంగయుఁ బర్వతంబులయందు మేరువు నై యుండు
     దువు సర్వవస్తువులయందును నుత్తమం బైనయట్టిభవద్విభూతివిశేషంబును భవ

     దీయవ్యాప్తికలితం బని నిన్ను నెఱింగి వినుతింపఁ జాలువాచాలు రెవ్వరు లేరు
     విను మింక నొక్కటి సెప్పెద.83
క. నీపే ళ్లెన్నియొ యన్నియు, నాపేశ్ళును నోముకుంద నాకు న్నీకున్
     రూపింప లేదు భేదం, బేపగిదిని నిన్నుఁ గనుట యెఱుఁగుట నన్నున్.84
క. నిను నొల్లక ననుఁ జేరుట, నను మెచ్చక నిన్నుఁ గొలుచునరునకు నరకా
     యనములుగఁ దెలుప హరిహర, వినిరూపణతుల్యమతులు విభు లేయేడలన్.85
వ. అని పలికి పరమేశ్వరుండు తపస్వివరులదెస నాలోకించి.86
క. మునివర్యులార యిందఱుఁ, జనుదెంచినవారు మీరు సంప్రీతి ననున్
     గని యెయ్యదేని నొక్కటి, యనుపమభద్రంబు గనుటకై కడుఁగాంక్షన్.87
తే. అదియు మీ కేను జెప్పెద నవహితాంత, రంగు లై వినుఁ డింపార నస్మదుక్తి
     విని సమస్తభావంబుల ననవరతము, నభ్యసింపఁగ వలయు నయ్యర్థ మాత్మ.88
సీ. త్రైవిద్యులకు నిరంతరసేవ్యుఁ డధికతపశ్శీలురకు నిత్యభావనీయుఁ
     డర్చనాపరులకు నవిరతారాధ్యుఁడు యోగజ్ఞులకు మనో[22]యుక్తిపదము
     సాంఖ్యుల కశ్రాంతసంఖ్యేయతత్త్వంబు విరతుల కానందవేద్యభూమి
     బోధల కేకాంతబోధనిధానంబు సిద్ధుల కైశ్వర్యసిద్ధిదాత
తే. యఖిలలోకేశ్వరుడు విష్ణుఁ డాదిదేవుఁ, డప్రమేయుండు భక్తదయాళుఁ డీశుఁ
     డితనిఁ బరమదైవతముగా నెఱుఁగుఁ డిదియ, యధికధర్మంబు మీకుఁ బుణ్యాత్ములార.89
క. ప్రణవాభ్యాసైకపరా, యణులై సతతంబుఁ దలఁచు నాత్మవిదులకున్
     ప్రణతవరదుఁ డీనారా, యణుఁడు ప్రసన్నుఁ డయి చేయు నమృతావాప్తిన్.90
ఉ. మీరును నియ్యుపాయము సమీహితసంయమ మైనబుద్ధి
     పార దృఢీకరించి కమలాక్షుఁ దలంచుచు నుండఁగాఁ ప్రభూ
     తారతిఁ దేఱుఁ జిత్తము నిరంతరశుద్ధవివేకు లై తపః
     పారము నందఁ గాంతు రనుభావ్యవిభామయు నిమ్మహాత్మునిన్.91
క. అని యుపదేశించిన న, మ్మునివరులందఱును సంప్రమోదము దమనే
     మ్మనములఁ గడలుకొనఁగ శం, భునకుం బ్రణమిల్లి వినయమునఁ బ్రాంజలు లై.92
శా. దేవా సంశయము ల్దొలంగెఁ గలఁక ల్దేఱె న్మనోవృత్తులన్
     భావంబుల్ పరమార్థము న్గనియె సద్భక్తిం బ్రయత్నించి నీ
     యావాసంబున కేము వచ్చినఫలం బారంగఁ బండె న్మహా
     దైవంబుల్ మిము నొక్కచోటఁ గనుటన్ ధన్యంబు మాజన్మముల్.93
క. లోకగురుండవు నీ విటు, మాకుం గరుణించి యుత్తమం బగు ప్రజ్ఞా
     లోకము నిచ్చితి [23]భక్తి, స్వీకృత యీవిద్య యగుట సెప్పితి దెలియన్.94
వ. అనిన యనంతరంబ యమ్మహాదేవుండు వాసుదేవు నభినందించి వీడ్కొని దేవీ
     సమేతంబుగఁ బ్రమథగణంబులతోడ నచ్చోటన యంతర్ధానంబు నొందె మునులు

     ననిమిషులుఁ గృష్ణునకు నమస్కరించి యతనిచేత వీడ్కోలు వడసి తమ తమ
     నివాసంబుల కుఁ బోయిరి హరియును గరుడుని నెక్కి యెప్పటిమార్గంబునం గ్రమ్మఱి
     సాయాహ్నసమయంబున బదరీవనంబు ప్రవేశించె నని చెప్పి వైశంపాయనుండు
     జనమేజయున కి ట్లనియె.95

పౌండ్రవాసుదేవుఁడు ద్వారకమీఁద దండెత్త నుద్యోగించుట

తే. వాసుదేవుఁడు ప్రీతిఁ గైలాసయాత్ర, సేయు టేర్పడఁ జారులచేత నెఱిఁగి
     పౌండ్రుఁ డాత్మీయపక్షభూపాలకోటిఁ, గూర్చి యందఱ కి ట్లనుఁ గొలువునందు.96
మ. ధరణీమండలి నెందునుం దొడరి దోర్దర్పోద్ధతిం గ్రాలుభూ
     వరులం బల్వుర నుక్కడంచితిఁ గడున్ వశ్యాత్ము లై వారు నా
     కరిగా నాత్మధనావళు ల్వరుసఁ బ్రత్యబ్దంబు నర్పింతు రె
     వ్వకు వస్మత్పటువిక్రమస్ఫురణకున్ వక్రింప రెక్కాలమున్.97
క. యాదవులు కృష్ణుప్రాపున, నాదగువేఁడిమికి [24]నోర్చి నడుఁకక యెదురై
     యేదియు నెఱుఁగరు శౌర్యో, న్మాదంబున నున్నవారు మహిమోద్ధతు లై.98
వ. ఇది మదీయం బగు హృదయంబున శల్యభూతం బై యున్నయది యదియునుం
     గాక.99
తే. తాను బసులఁగాచినగొల్ల దనకు నేటి, మహిమ యాకృష్ణుఁడును నింత మఱచినాఁడు
     చక్ర మొక్కటి గల దని చక్కనుండఁ, డేపు మిగిలిన మగఁటిమి సూపఁ గడఁగు.100
క. తన చక్రముఁ దన శంఖముఁ, దన శార్ఙ్గముఁ దనదు గదయుఁ దన ఖడ్గంబున్
     నను జోఁకినఁ జెడిపోవుట, మనమునఁ దలఁపఁ డతఁ డధికమత్తుఁడు గాఁడే.101
తే. వసుధలోపల నిరువురు వాసుదేవు, లున్నఁ దడఁబాటు గాదె యే నొక్కరుఁడన
     పేరు సెల్లింతు నని నీని పేరణంతు, మెచ్చి [25]భూపాలు రెల్లను బిచ్చలింప.102
క. నాకు సుదర్శన మనునీ, భీకరచక్రంబు గలదు బెట్టిదముగ నే
     నాకైదువు గొని చేసెద, నాకృష్ణు సుదర్శనంబు ననిఁ బొడిపొడిగాన్.103
తే. అతని పాంచజన్యమునకు నస్మదీయ, పాంచజన్యశంఖం బిది ప్రతి[26]భటంబు
     దీనియుద్ధతధ్వానంబు దెసలఁ బొంగి, మ్రింగుఁ దన్మహాశంఖసమిద్ధరవము.104
క. హరిచేతినందకము మ, త్కరవాలం బైన నందకంబును నని ని
     ర్భరముగఁ దాఁకెడు క్రేంకృతి, విరచింపదె మీకు నెల్ల విస్మయభయముల్.105
మ. కమలాక్షుండును నేను నొండొరుపయిం గౌమోదకుల్ వైవ ను
     గ్రముగాఁ బోర సహస్రలోహరచనల్ గావింపఁగాఁబడ్డ యీ
     యమదండోపమ మైన మద్గదకు నాహారంబు గాకుండఁ బ్రా
     ణములం గావఁగ శక్యమే యతనికిన్ సర్వప్రయత్నంబులన్.106

క. మామకశార్‌ఙ్గవినిర్గత, మై మార్గణవేగ మెసఁగి యచ్యుతశార్‌ఙ్గ
     వ్యాముక్తతుచ్చశరతతి, వే ముంపఁగఁ జూతు రింక వేడుక మీరల్‌.107
వ. చక్రాయుధుండును బాంచజన్యలక్షణుండును శార్‌ఙ్గధన్వుండును గదాధరుం
     డును నందకహస్తుండును నైన వాసుదేవుండ నేన కాని గోపాలబాలకునకుం
     బనిగాదు న న్నట్టిప్రశంసనంబులం గొనియాడుండు కొనియాడనివాఁడు సువర్ణ
     నిష్కథాన్యంబుల భారశతంబుల దండం బరువంగలవాఁడు మత్ప్రియసఖుం
     డైన నరకాసురు వధియించి మాఱులేక మలయు నబ్బలియుం బరిమార్చి కృత
     కృత్యుండ నయ్యెద నిది నిశ్చయం బనిన నతని వాక్యంబులు గొంద ఱభినందించిరి
     గోవిందు విక్ర్రమంబునఁ దొల్లి [27]నెట్టంబడినరాజులు సంత్రాసంబు నొందిరి కొంద
     ఱవశ్యంబును విష్ణు నిర్జించి నీకుం ప్రియంబు సేయుదు మని పంతంబులు పలికిరి
     పౌండ్రపతియును యదునగరిపై నరుగ నుత్సాహంబు సేసె నయ్యవసరంబున.108

పౌండ్రకవాసుదేవుఁడు నారదునితో శ్రీకృష్ణుమీఁది వైరంబు చెప్పుట

క. చారుశరీరద్యుతిజిత, శారదనీరదుఁడు ధీవిశారదుఁడు భవో
     త్తారదుఁ డాశ్రితవితతికి, నారదుఁడు దదీయగ్భహమునకు నేతెంచెన్‌.109
క. మునివల్లభునకు నెదురుగఁ జని యర్ఘ్యం బిచ్చి తెచ్చి సముచితకనకా
     సనమున నునిచి యొనర్చెన్ జనపతి పాద్యాదిహృద్యసత్కారంబుల్‌.110
క. అన్నియుఁ గైకొని యతఁడు ప్ర, సన్నతఁ గుశలంబు లడుగ సర్వంబును సం
     పన్నముగం జెప్పి యి ట్లను నున్నతభుజుఁ డగునరేంద్రుఁ డూర్జితబుద్ధిన్.111
మ. సురదైతేయభుజంగమదద్యుచరరక్షో యక్షగంధర్వకి
     న్నరవిద్యాధరగోచరంబు లగునానాలోకముల్‌ లోక[28]జి
     త్వర నీకున్ [29]సుగమంబు లందును గతివ్యాఘాత మేకాలమున్
     బొరయం జెప్పరు నీవిహారసరణిం బుణ్యుండ వీ వెమ్మెయిన్‌.112
క. కావున నెచ్చటి కెచ్చటి, కీ వరిగెద వచటి కచటి కేర్పడ నత్యం
     తావహితబుద్థివై బుధ, సేవిత నాకోర్కి యొకటి సేయఁగ వలయున్‌.113
సీ. సమరపరాక్రమచండుఁడు పౌండ్రుఁడు విఖ్యాతుఁ డఖలపృథ్వీతలమున
     వాసుదేవుం డన వానిపే రంచితచక్రాదిఘోరలక్షణము లెల్ల
     వానివి వాని నెవ్వారికి నిర్జింవ నలవిగా దొకగొల్లఁ డతిచవలత
     నవ్వీరుపేరును నడియాలములు దాను గైకొని యున్నాఁడు గానఁ డొకఁడు
తే. నట్టిపగతుని ననిఁ గూల్చి యద్వితీయ, కముగఁ దనసంజ్ఞ చెల్లింపఁగలుగువాఁడు
     వానిలావును నెరుఁగుదు మానవేంద్రు, లెంద [30]ఱేనియు వానిచే హింస పడిరి.114
వ. అని యివ్విధంబు దప్పక క్రమంబున.115

చ. అజుసభఁ జెప్పు మింద్రుసభ నాడుము వహ్నిసభ న్గణింపు మ
     ర్కజుసభఁ బల్కు యక్షుసభఁ బ్రస్తుతి సేయుము గోవృషాంచిత
     ధ్వజుసభ నుగ్గడింవు మహిదానవభూచరకోటిదొట్టి యీ
     త్రిజగములందు నెందును జరింపుము సర్వసభాంతరంబులన్‌.116
క. ఇదె నీయడుగుల కెరఁగెద, సదయాత్మక! యింతవట్టు సంప్రార్థనమున్
     దుదిముట్టఁజేసి క్రమ్మఱ, ముదలింపుము నన్ను వినుము మునివర యింకన్‌.117
సీ. చెలులుఁ జుట్టలు నైనబలియురు భూపాలు రేపాటికూడినా రెంద ఱేని
     రథములు గరులు దురంగంబు లెన్నంగఁ బెక్కు కాల్బలములు లెక్క కెక్కు
     డీసైన్యకోటితో [31]నీసున జగములు తల్లడిల్లఁగ బెట్టు దాడివెట్టి
     యదుగణంబుల నెల్ల నణఁచెదఁ దూలించి తత్పురిఁ గాల్చి మాధవునిఁ దొడరి
తే. శార్‌ఙ్గవిర్ముక్తశితపర్వశరచయములఁ, దనువు రక్తంబుతో నిండి ధాత్రి దోఁగ
     నీకు గగనరంగంబున నిర్నిమేష, దృష్టిఁజూడ నాట్యంబు సంధించువాఁడ.118
క. అన విని యల్లన నవ్వున, దనవదనము వింతచెన్ను దలకొనఁగా లో
     చనరోచులు దళుకొత్తఁగ, ననిమిషముని యిట్టు లనియె నాతనితోడన్‌.119
ఉ. ఏను సమస్తలోకముల నెప్పుడు నడ్డము లేక వేడుకం
     బూని చరింతు సర్వజనపూజ్యుఁడ నాపలు కెల్లవారు నౌ
     నౌనని యాదరింతు రది యట్టిద యైనను నీదువాక్యముల్‌
     మానవనాథ యన్నియును మానము గానివి నాకుఁ జూడఁగన్‌.120
క. హరి యెక్కడ నీ వెక్కడ, హరికిని నీకును విశేష మరయఁగ భూభ్ళ
     త్పరమాణువులకుఁ గలయది పరికింపవు హరికి నీవ ప్రతియోధుఁడవే.121
ఉ. సర్వసముంండు సర్వగుణసంపదుపేతుఁ డనంతుఁ డాద్యుఁ డీ
     సర్వజగంబు నొక్కరుఁడ చక్రములావునఁ జక్రవర్తియై
     గర్వ మెలర్ప నేలు రిపుగర్వహరుండు మురాంతకుండు నీ
     గర్వము నెల్ల నిచ్చటనకా కటు నల్లెఁడు సాగివచ్చునే.122
తే. వలవ దుడుగుము నిన్నును వాసుదేవుఁ, డందురే బుద్ధయుతులు సర్వాధివాస
     సిద్ధయై వాసుదేవాఖ్య సెల్లై [32]నట్టు, లుర్విలోపలఁ దత్తుల్యుం డొరుండు గలఁడె.123
క. నీచక్ర్రము నీశంఖము, నీచాపము నీదుగదయు నీఖడ్గంబున్
     నీచారోపీతములు విను, చూచిన నవ్వుదురు వీని శూరులు ధరణిన్‌.124
ఉ. చక్రము శంఖము న్గదయు శార్‌ఙ్గము ఖడ్డము విస్ఫురన్మహా
     విక్రాము డైనదేవుఁడు త్రివిక్రము సొమ్ములు నిక్క మింత నీ
     చక్రముఁ శంఖము న్గదయు శార్ఙ్గము ఖడ్గము మాఱె వాని కి
     య్యక్రమవాక్యము ల్చెఱుచు నాయువు శ్రీయుఁ గులంబుఁ దేజమున్‌.125

క. నవ్వెడువారల నెఱుఁగవు, క్రొవ్వున నిటు వలికె దేల గోవిందుని నీ
     వెవ్వరిఁగాఁ దలఁచెద వతఁ, డువ్విళ్ళూరెకు భవన్మదోద్గతి యణఁపన్‌.126
వ. అనినఁ బౌండ్రుండు ప్రహసితాననుం డగుచు నమ్మునిపుంగవుం గనుంగొని.127
క. మాఱాడినఁ గోపింతురు, నీఱుగ శపియింతు [33]రేము నీబోటులకున్‌
     నూఱంతలు వెఱతుము మముఁ, గాఱియగా నిట్లు పలుకఁగలరే యన్యుల్‌.128
తే. నీవు మామగంటిమి గని నిక్కువముగ, మెచ్చుతఱియును వచ్చు నీమీఁద నింక
     నిప్పు డూరక వాగ్వాద మించుకయును, సెలవులేదు విచ్చేయుము సిద్ధవర్య.129
క. నావుడు బ్రహ్మతనూభవుఁ, డేవాక్యముఁ బలుక కపుడ యేఁగె బదరి క
     చ్చో విష్ణుఁ గాంచి పౌండ్రుబ, లావష్టంభంబుచంద మఖిలముఁ జెప్పెన్‌.130

పౌండ్రకవాసుదేవుఁడు ద్వారకానగరంబుపై దండెత్తివచ్చి యుద్ధము సేయుట

వ. అమ్మహావీరుండును విని యతనితోఁ దదనురూపం బగువీరసల్లాపం బొనరించి
     వీడ్కొలిపె నంత.131
క. ఆరాత్రియ పౌండ్రుఁడు దీ, వ్రారంభుఁ డనేకబలసహస్రంబులతో
     ద్వారావతినగరిపయిం, దారుణముగ దాడివెట్టె దద్దయు నలుకన్‌.132
వ. ఇ ట్లరిగి పురంబు పూర్వద్వారంబు గదిసి బహుసహస్రదీపనికరాలోకనంబున నవ్
     విస్మయకారి యగుప్రకాశంబు గలిగించుదు గజబృంహితంబులుఁ దురంగమ
     హేషితంబులు వీరభటసింహనాదంబులు నొక్కట దిక్కుహరపీడనం బొనర్ప
     దుస్సహు లగుమహీపతులుం దానునుం గూడి వేరువాడి భేరీనిస్సాణకాహళ
     కోలాహలం బొనర్పం బనిచిన.133
చ. అనిశము నప్రమత్తమతి నాయితమై కరదీపికల్‌ వెలుం
     గ్ నఖిలరాత్రులుం దివసకల్పత నొందఁగ నున్నయాదవుల్‌
     ఘనుఁ డగుపౌండ్రురాకకుఁ దగంగ నొకింతయు సంభ్రనుంబు లే
     కనువుగ సర్వసైన్యముల నప్పుడ పన్ని భయంకరోద్ధతిన్‌.134
వ. ఉగ్రసేన బలదేవసాత్యకి కృతవర్మలు మున్నుగా వెడలి ప్రతివీరులం దలపడి రట్టి
     తలపాటున హయంబులమీఁదివారు హయారోహకులం దాఁకి పెనంగ గజంబులం
     గలవారు గజోపరిస్థితులఁ దొడరి పోర రథికులు రథికులం బొదివి కయస్ధంబు
     సేయఁ గాల్వురు కాల్వురం బెరసి పోట్లాడ సందడి నొండొండ యొదవి పెంధూళు
     లెగసి దివియలచేతనుంబోని క్రొత్తచీఁకటిఁ గలిగించి దిగులు పుట్టునట్టి బెట్టిదం
     పుఁజందంబు దలకొలుపం దలంకక దరికిం జొచ్చి చిచ్చఱపిడుగులంబోని యమ్ములు
     దిఙ్ముఖంబుల దీటుకొలుపుచు మేటిజోదులు కన్నాకులయి తమతమవంగడంబులఁ
     బురికొలిపిన నిరువాఁగును నద్భుతసంప్రహారం బొనర్చె నందు.135
మహాస్రగ్ధర. కూలెం గుంభివ్రజంబుల్‌ గువలయ నుద్రువన్ ఘోటకశ్రేణి మ్రగ్గెం
     దూలెం దేరు ల్పదాతు ల్దుమురులయిరి నిర్ధూతధూళీకనిర్య

     త్కీలా[34]లోరుస్రవంతు [35]ల్కిలకిలరవసంక్రీడమానోగ్రభూతా
     భీలశ్ర్రీలం దలిర్చెం బృథుపలలచయస్ఫీతరోదస్యు లొప్పన్‌.136
వ. అట్టియెడ నేకలవ్యుం డేపుమిగిలి యాదవసైన్యంబున కెదిర్చి తనపేరు సెప్పి
     యార్చి శంఖం బొత్తి యిది యేమి సాత్యకి యక్కడవోయె గృతవర్మ పొడసూ
     పండు బలదేవునికి మదిరామదంబు దెలిసెనే కృష్ణుం డెచ్చోట నొదిఁగె నేను
     వచ్చుట నెఱింగిన నెంతటివారికిం దాల్మి దలకొలుప శక్యం బగునే యనుచుఁ
     గదిసినం గడంగి యదువీరు లతనిం దాఁకి రమ్మహాధన్వి యుగ్రసేను నేఁబది
     బాణంబులను వసుదేవు నేడింట నుద్ధవునిం బదియేనింటను నక్రూరు నేనింటను
     గదుని నిరువదేనింటను సారణుం బదునొకంటను హార్దిక్యు నాలుగింటను నొంచి
     తదనుచరులగుయోధుల నరిమితశరపరంపరలం గప్పినం దలరి సైన్యంబులు విచ్చె
     నెల్లదెసలం దల్లడంబున దీపహస్తులు దివియలు వైచి పాఱినఁ జీఁకటి భయాంధ
     కారంబునకుం దోడ్పడియె నట్లు యదువర్గం బొదుంగుటయుఁ బౌండ్రుండు
     తన్నుఁ బ్రాప్తవిజయుంగాఁ దలంచి చెలంగి యెలుంగె త్తి.137
సీ. ఓరాజవరులార మాకును మీవారుం దడయ కొక్కట నెల్లకడలఁ గదిసి
     కోటబ్ర్రాఁకుడు కం లీలఁగూలంగఁద్రోయుడు [36]తాలోగ్రయంత్రకేతనచయములు
     పురిలోనఁ జొచ్చి విస్ఫురితగేహంబులయర్థసంచయముల నాఁచికొనుఁడు
     వెలయాండ్రురను గొండియలఁ బరిచారికాశ్రేణుల నొండొండ చెఱలువట్టుఁ
తే. డేనుఁగులను గుఱ్ఱములను హేమరత్న, రథవితతిఁ గొనుఁ డనిఁ దొడరంగఁబడిన
     పురుషు నాయుధహస్తునిఁ బొడిచి కూల్పుఁ, డింతతోడ [37]నవృష్ణియై యిలయెలర్ప.138
వ. అనిన నతనియాజ్ఞ నఖిలసేనాచరులుం గోట వొదివి బరవసంబుచేసి రాసమయం
     బునఁ దదీయంబగు కలకలంబులు బహుళంబులైన నాకర్ణించి యనుత్సాహు లై
     యున్న యాత్మీయుల నందఱం జూచి సాత్యకి దనమనంబున.139
చ. సకలకుటుంబభారమును సన్మతి నాపయిఁ బెట్టి యాత్మలో
     వికృతి యొకింత లేక కడువేడ్క నుమాపతిఁ గొల్వ దవ్వుగా
     నకట ముకుందుఁ డేగెఁ రిపు లాక్రమ మి ట్లొనరింప నాకు నూ
     రక కనుఁగొంట పాడియె పురంబును రాజ్యముఁ గాతు నెమ్మెయిన్‌.140
క. ఏను గడంగిన నెదురం, గా నెవ్వానికి వశంబె కమలాక్షపద
     ధ్యానపరుల కెందు[38]ను జయ, మౌ నని చెప్పుదురు పెద్ద లది బొం కగునే.141
వ. శాత్రవుని దుర్జయత్వంబుకతనను బహుదేశసైన్యంబులు గూడి పెల్లుగాఁ [39]దోఁచు
     టవలనను గేశవుండు లేకునికి బలుమగలును ఱిచ్చవడి చూచెదరు వీరిం దెలిపి
     పురికొలుపకున్నఁ గర్జంబు దప్పు నని తలంచి దారుకానుజు నరదంబు నడుపం
     బనిచి సింవానాదంబు సేసి శరాసనశింజినీబరిస్ఫాలనం బొనర్చి దొరలం
     బేర్కొని.142

మ. ప్రగుణోత్సాహులు యాదవో_త్తములకుం బ్రత్యర్థులై తొల్లి యే
     మగ[40]లున్ మైమయిఁ బో రొనర్చిరె వృథా మానాకులుం డైనయీ
     పగతుం డెంతటివాఁడు వ్రేల్మిడిన యే భంజించెదన్ వీని మీ
     రు గరిష్ఠస్థితి నన్నుఁ జూడుఁడు రణారూఢి న్వినోదింపఁగన్‌.143
క. మఱచితిరే యదువిభుఁ డిం, దఱకును బురి యొప్పగించి తగ నేఁగుట యి
     త్తఱి నది శూరులు వోవఁగఁ, గొఱయగునే మగతనంబుం గులమును మనకున్.144
వ. అని పలుక నందఱు నుత్సాహంబునం బొదలి యవ్వీరుం గూడికొనిరి క్రమ్మఱం
     గరదీపికాసహస్రంబులు బెలసె సనాథంబు లగుటంజెసి సైన్యంబులుం గలంక
     దక్కి కడంగె రణతూర్యంబులరవంబును సుభటులయార్పుటెలుంగులు గజబృం
     హితతురంగహేషితరవంబులు రథనేమినినాదంబులుం గలసి యొక్కటి యై
     పెక్కటిల్లి దిక్కులు వగిల్చె నట్టియెడ.145
క. నలుదెసలఁ గోటఁ బ్రాఁకెడు, బలవంతులఁ బగఱఁ జూచి ప్రస్తుతబాహా
     కలనంబు మాన్పుటకుఁ గ, ట్టలుక శినికులోద్వహుఁయు సనూహితమతి యై.146
క. అనిలాస్త్రంబు ప్రయోగిం, చిన నది [41]చొక్కాకు లట్ల చెల్లాచెదరై
     చనఁ జేసెఁ బెలుచ శాత్రవ, జనులం బ్రాకార మస్త్రసంవృత మయ్యెన్‌.147
వ. అట్లు చెదరిన పౌండ్రసైనికు లందఱు నేలిక యున్నయెడకుం బోయిరి సాత్య
     కియు సై న్యంబు దనతోడన చనుదేరఁ దఱిమికొని చని ప్రతిసేనయెదుర నిలిచి
     యి ట్లనియె.148

సాత్యకి పౌండ్రవాసుదేవుని నెదిర్చి యాక్షేపించి యుద్ధంబుచేయుట

సీ. అక్కట రాజాన్వయమునందుఁ బ్రభవించి నీచుఁడై యేమియు రాచపాడి
     యెఱుఁగక నడురేయి యెల్లజనంబులు సుప్తులైయుండఁగఁ జోరునట్లు
     సనుదెంచె నెవ్వఁ డాతనిఁ గోరి వెదకెద నిదె దివియలు వట్టి యెచట నున్న
     వాఁడు సూపుఁడు పౌండ్రవసుధేశుఁ గేశవబంట సాత్యకి యనుప్రకటబలుఁడ
తే. నాయితంబయి వచ్చితి నాలమునకుఁ, గార్ముకం బాదిగా నెల్లకైదువులను
     శూరవరుల మెప్పించెద భూరిశక్తి, కలిమి దానును జూపంగ వలదె నాకు.149
క. తను మగిడి పోయివచ్చినఁ, దనయానయ రాజధర్మతత్పరుఁడై నా
     సునిశితకరములచేం జ, చ్చిన మేలాప్తజను లింతసెప్పుఁ డతనికిన్‌.150
క. నావిని పౌండ్ర్రుఁడు నిజసై, న్యావలిముందటికి వచ్చి యతులధ్వజలీ
     లావిర్భావము శరచా, పావష్టంభంబు మెఱయ నధికోద్ధతుఁ డై.151
వ. ఆతని నుపలక్షించి యి ట్లవియె.152
తే. ఓయి సత్యకాత్మజ నీవు యుద్ధమునకు, వచ్చినాఁడ వెక్కడ నున్నవాఁడు గృష్ణుఁ
     డేరు విడిచి చిక్కులపారుటిదియ యతఁడుఁ, పసులఁ గావక యోధుఁడై పరఁగు టెట్లు.153

క. నను నెఱుఁగఁడె నానామము, దన కలవడునే తలంపఁదగదే దీని
     న్వనితాహంతకుఁ బశువిశ, సనకారికి నిట్టిపేరు సదృశమె యరయన్.154
ఉ. నాచెలికాని నాధరణినందనుఁ జంపినవాఁడిఁ గాన బా
     హాచతురుండ నై యతని నాజిమొన న్వధియింప వచ్చితిన్
     వే చనుచెంచి తాను నను [42]వీఁక నెదుర్చుట యొప్పు నీదెస
     న్నీచము నాకు సంగరము నీవు దొలంగఁగఁ బొమ్ము నెమ్మదిన్‌.155
మ. అటుగా కించుక నిల్వనోపిన మదీయాఖండకోదండ ము
     ద్భటమై యీనెడు బాణసంతతులచందంబు దగం జూడు మం
     తటిలో నీపని సక్కనయ్యెడు నపేతప్రాణుఁ గావింతు మి
     క్కుటపుంగ్రొ వ్వణఁగంగఁ గుందు నెద మీ[43]గోపాలుఁడున్ బాలిశా.156
వ. ఇచ్చోటి పసులవ్రేఁ గంతయు నీతలన యెత్తి ఆానుఁ కైలాసపర్వతంబునకుం
     బోయె నని వింటి మాకృష్ణుండు వచ్చినయప్పటికిం దగిన కర్జంబు సూచికొనియె
     దము నీకు పాదునిలిచి మీయేలికకుం బ్రియంబుగాఁ జచ్చుటయు ధర్మంబకాదె
     యనిన శైనేయుం డట్టహాసంబు సేసి యతని కి ట్లనియె.157
చ. హరిఁ బరమేశ్వ[44]రేశ్వరు సమస్తజగత్ప్రియుఁ గూడువల్కుదు
     ర్నరుఁడవు నీదుజిహ్వ పలువ్రయ్యలువాయదు నోరఁ బెల్లుగాఁ
     దొరఁగవు తోఁకపుర్వు లెడఁ దూఱ(ల)దు ప్రాణము సూడుమా మహో
     ద్ధురమయి చేరె మృత్యు విటుత్రుళ్ళకు మొప్పదు సెప్పెదం దుదిన్‌.158
తే. ఆదిదేవునిపేరు చిహ్నములు మోచి, నంతటనె యాతనికిఁ దుల్యుఁ డండ్రె నిన్ను
     సింహచర్మంబు దొడిగినఁ జెనఁటికుక్క, గంధగజగంధమునకును గలదె నిలువ.159
క. ఒక్కఁడ సర్వగతుండై, యొక్కుడుక్రియ వాసుదేవుఁ డితఁ డని పెద్దల్‌
     మ్రొక్కఁగ నుండుజనార్దనుఁ, డక్కరణి యనన్య మెఱుఁగ వైతి దురాత్మా.160
మ. భువనస్వామికి ద్రోహి వైనకుమతిం బోనీక ని న్నిప్డు గ్‌
     ష్టవిధిం బెట్టి తిల్వపృమాణశకలస్రస్తాంగునిం జేసి మ
     జ్జవసామిశ్రభవత్తనూపలలముల్‌ సాలంగ నేఁ డిచ్చటన్
     నవభంగిన్ బహుయాతుధానతతికి [45]న్వడ్డించు నాబాణముల్‌.161
తే. ఇంతలో శౌరి చనుదెంచెనేనిఁ దీవ్ర, భూరిదివ్యాస్త్రచయములఁ బొదివి పట్టి
     కట్టి యొప్పింపఁ బశువవై కంసదమను, ఖడ్డధారకు లోను గాఁ గలవు నీవు
వ. అని యివ్విధంబున నన్యోన్యంబు పరుషంబులు వలికి తలపడినం గయ్యం బ
     య్యిరువురకు ఘోరం బయ్యె నందు.163
క. తెగనిండఁ దిగిచి యొకయా, శుగ మప్పౌండ్రకునియురము సొనిపెఁ దొలుతనా
     నగధరుతమ్ముఁడు దానం, బగతుఁడు వడవడవణంకి భ్రమగొని తిరుగన్‌.164

క. ముక్కున నోరను నెత్తురు, గ్రక్కున వెడలంగ ధైర్యకఠినుఁ డగుట దా
     నొక్కింత సైచి యంతన, నెక్కొను తెలివునఁ బ్రహాసనిర్భరమతి యై.165
తే. తొమ్మిదియు నైదు క్రొవ్వాఁడితూవు లయ్య, దూద్వహునిమీఁద నేసి వేఱొక్కవలుద
     నారసంబున ఫాలంబు నాటుటయును, మూర్ఛవోయి రథంబుపై మ్రొగ్గె నతఁడు.166
వ. ఆలోనఁ బౌండ్రుండు నిరువదే నమ్ముల నతని సారథి నొప్పించి రథ్యంబుల
     నాలుగింటిని నాలుగు శరంబుల స్రుక్కించి సింహనాదంబు సేసె నంతటం దెలిసి
     శినివరుండు.167
క. తూఁగాడుసూతుని సముద్వేగంబున వడఁకు రథ్యవితతిం గని [46]రో
     షాగమ[47]కలితుం డై ఫణి, భోగనిభం బైనచాపమున నొకశరమున్‌.168
వ. వజ్రోపమం బైన దాని సంధించి బెట్టిదంబుగాం దిగిచి పగతు నురంబు వ్ర్రయ్య
     నేసి మూర్ఛ ముంచి.169
తే. పడగతోడన తునుమాడి పటుహయములఁ, జంపి సారథిం బరిమార్చి సకలనభము
     బూరటిల్లంగ సింగంబుపోల్కిఁ బెలుచఁ, బొరి [48]నుదీర్ణగర్జాపరిస్ఫూర్తిఁ జెలఁగె.170
వ. పౌండ్రపతియును నాలోనన తెలిసి హతరథ్యం బగు రథంబు డిగ్గి సాత్యకి రథంబు
     గుఱ్ఱంబులం బడనేసి సూతు సమయించి రథావయనంబు లన్నియు ననేకసహస్ర
     సంఖ్యంబు లగు విశిఖంబులం బొడివొడి సేసె నివ్విధంబున.171
క. ఇరువురును విరథులయి యొం, డొరువుల చాపములు నఱికి యొక్కట పటుతో
     మరశక్తిముఖాయుధములఁ, జిరముగఁ బోరిరి చలంబుఁ జేవయు నలరన్‌.172
వ. తదనంతరంబ గదాహస్తు లై తాఁకి యభ్యస్తంబు లగు సమస్తకళావిస్ఫారంబులు
     ప్రశస్తంబులుగాఁ బెద్దయుం బ్రొద్దు పెనంగి యన్యోన్యఘాతంబుల నుద్భూతం
     బైన రక్తంబున సిక్తంబు లై ప్రతీకంబులు వసంతాశోకంబులకు సదృశంబు లై
     యసదృశోల్లాసంబున నుద్భాసిల్లం గొండొకతడవునకు గదలు మిధోహననంబు
     లైన విడిచి పిడికిళ్లకుం జొచ్చి పెచ్చుపెరిగి పొదుచునప్పటి చప్పుళ్లు సర్వభూత
     భీతిజననచండంబు లై యొండొండ నొదలఁ దలంబుల వ్రేసియుంఁ బెడచేతుల
     నడిచియుఁ గూర్పరాహతు లొనర్చియు జానువుల నొంచియుఁ గేశాకర్షణనఖ
     విఖండనప్రముఖంబులం దొడరియుఁ బోరి తమపోరు సూచువారు తమ్ము
     నుద్దేశించి యీసాత్యకి యీపౌండ్రుం బొరిగొనక యేల విడుచు నీపౌండ్రుండు
     సాత్యకిని మడియింపక యుడుగ నేరండు. వీరిద్దఱు నొక్కలావువారు గాన
     యొండొరువులచేతం జచ్చి వీరస్వర్గంబు నొందుదు రింతియ కాని యలంతుల
     నిలువ రిట్టశౌర్యం బిట్టిధైర్యం బిట్టిచలం బెట్టిబలం బెచ్చోటఁ జూడ మెయ్యెడల
     విన మెన్నఁడు నెఱుంగ మనుచుం బ్రశంసింప నకంపితప్రకారు లై తాఁకి రయ్యు

     వసరంబున నుభయబలంబులం బేరుకలరథికు లిరుదెసలం గ్రందుగాఁ దఱిమి సందడి
     చేసిన నాసాహసికులు పాసిపోయి రంత.173

ఏకలవ్యుఁడు బలరామునితోఁ దలపడి ఘోరయుద్ధంబు సేయుట

మ. బలదేవుండును నేకలవ్యుఁడును దృప్యద్బాహులై తాఁకి యు
     జ్జ్వలచాపంబులఁ బోరుచో బలుని వింశత్యస్త్రతీవ్రాహతి
     న్బొలియం జేసి తదాశుగంబుల వెసన్ సూతుం బ్రపీడించి క
     ట్టలుకం ద్రుంచె నిషాదనాథుఁడు ధనుర్జ్యావల్లి భల్లంబునన్.174
తే. వింట నొండొకగొనయంబు వేగఁగూర్చి, కేశవాగ్రజుఁ డొకకోలఁ గేతుదండ
     ముర్విఁగూల్చి కార్ముకము వేఱొకట నఱికి, [49]పదిట సారథిఁ బదిట నబ్బలియు నొంచె.175
క. మఱియును ముప్పదియమ్ములఁ, గిఱికొన నరదంబు వొదివి కేళీయ పోలెన్
     మెఱసిన సైపక వేఱొక, నెఱవి ల్లెక్కిడి కిరాతనృపతియుఁ గడఁకన్.176
క. ఆతనిచనుమర విశిఖ, స్యూతము సేయుటయు నొచ్చి స్రుక్కి హలాంకుం
     డాతతరోషసముద్ధతుఁ, డై త్రుంచెం [50]బిడియకొలఁది కహితునిధనువున్.177
వ. ఏకలవ్యుం డడిదంబు వుచ్చికొని [51]విసరి వైచె నది యదునందనుం డేనమ్ముల నడు
     వన పొడి చేసి మఱియు నొక్కమండలాగ్రంబు సారథిగుఱచి వైచినం బదిబాణం
     బుల ఖండించి చండఘంటావిభూషణ యగు భీషణశక్తి వైచిన నొడిసిపట్టి
     మగుడఁ దద్వక్షంబు లక్ష్యంబుగా వై చిన నప్పాటున నమ్మేటిమగండు సొమ్మసిలం
     బోయి తేరిపయం బడినం గని తదీయు లగు నిషాదయోధు లెనుబదియెనిమిది
     వేలు రథతురంగమాతంగసముదయంబుతోడం గదిసి.178
క. మిడుతపరివోలె దిక్కుల, యెడములు దమమయమకాఁగ [52]నేకాకృతితో
     గడిఁదిగఁ [53]బొదివిరి రాముని, నడరఁ దదాఘోష ముగ్రమై గగనమునన్.179
తే. అలిగి హలమును ముసలంబు హస్తయుగము, నందు ధరియించి తాలాంకుఁ డరద ముడిగి
     యెఱుకుమూఁకలమీదికి నుఱికి విలయ, కాలకలుషకృతాంతానుకారి యగుచు.180
క. నాఁగటఁ దగిలిచి తగిలిచి, వ్రేఁగగురోఁకలి యమర్చి వ్రేయుచుఁ దోడ్తో
     రేఁగెడుదర్పమ బాసట, గాఁ గూల్చెను బగఱనెల్లఁ గడుఁజోద్యముగాన్.181
వ. అట్లు ముహూర్తమాత్రంబున నఖిలనిషాదసైన్యంబులం బొడిసేసి యపరిమిత
     రక్తహంసమేదంబులుఁ గ్రవ్యాదభూతబేతాళజాతంబులకు నభూతపూర్వకం
     బగు పర్వంబు సంఘటించె నంతం దెలిసి యేకలవ్యుండు.182
క. తనసేనపాటు దెలియం, గని కోపము మిగులఁ బెద్దగద గొని బలభ
     ద్రునిమీఁదఁ గవిసె నతఁడును, ఘనగదఁ గైకొని కడంగెఁ గలుషం బెసఁగన్.183

వ. వారలిరువురకు నతిభీషణం బగుగదారణంబు ప్రవర్తిల్లె నందు.184
సీ. గదలొక్కటొకటిఁ దాఁకఁగ నుప్పతిలు మిడుంగురుల దిక్తటములు దుఱఁగలించె
     హుంకారములు నగరోన్నతప్రాకారవలభులఁ బ్రతిశబ్దవతులఁ జేసెఁ
     జరణఘట్టనముల ధరణియంతయు [54]బిట్టు గదలి పాతాళంబు గదియఁ గ్రుంగెఁ
     దర్జనోక్తులపటుధ్వానంబు లాకాశచరులకుఁ జిత్తసంచలన మొసఁగె
తే. నుభయబలములవారుఁ బోటుడిగి వెఱయు, వెఱఁగుపాటును గదుర నవ్వీరవరులు
     జూచుచుండిరి కలహసంక్షుభితఘోర, శూరవారణద్వితయంబు జూచుకరణి.185
వ. ఇవ్విధంబునఁ బౌండ్రసాత్యకు లొక్కదిక్కునను బలదేవనిషాదపతు లొక్కవల
     నను గయ్యంబు సేయుచుండ నలువుర కారణంబున నపరిమితజనసంక్షయం బగు
     చుండె నంత.186
ఆ. దీపరుచులతోన తిమిరంబు దోడ్తోనఁ, దఱుఁగఁ దారకములు దరతరంబ
     యడఁగ వస్తుమూర్తు లన్నియు నొండొండ, తోఁపఁ దెల్లనయ్యెఁ దూర్పుదిక్కు.187
క. అరుణోదయరుచు లొయ్యనఁ, బరఁగుచుఁ గమలములతోన ప్రాణుల కెల్లం
     బరిబోధము నొదవింపఁగఁ, గరణీయంబులు బహుప్రకారత వెలసెన్.188
క. కుముదవనంబులతోడన, కమనీయవినమ్రజననికరపాణితతుల్
     సమయముకుళితమ్ములు గాఁ, గమలహితుఁడు ప్రధమగిరిశిఖరమణి యయ్యెన్.189

శ్రీకృష్ణుఁడు కైలాసంబుననుండి మరలి ద్వారకానగరంబునకు వచ్చుట

వ. అట్టిదివసప్రారంభంబున సంరంభం బెసుగ రెండుదిక్కుల యోధులు నధికసంరం
     భంబుగా బెరసి పెనంగఁ బౌండ్రవిభుం డెలుం గెత్తి యాత్మీయసైన్యనాయకుల
     నుద్దేశించి.190
క. మన మెంతలావు సేసినఁ, బని దీఱదు నేకుఱండు పగతుఁడు లోకం
     బున దూఱు రాదె యితరుల, ననిఁ జంపినఁ [55]గాన వలవ దాహవ మింకన్.191
మ. హరి యేతెంచుట లెస్సగా నెఱిఁగి తీవ్రాటోపదీప్తంబుగాఁ
     బరిమై వత్తము గాకయున్నఁ [56]గడిమిం బ్రత్యర్థి నాహూతిఁ జే
     సి రణక్రీడఁ జలంబు సూపుదము ప్రస్ఫీతాస్మదియోగ్రవీ
     ర్యరసారూఢికి నోర్తురే యిచట నీయల్పుల్ వృథావిక్రముల్.192
వ. అని పలికి బలంబులం దివియం బనిచిన వారును నట్ల సేయ సైన్యసమేతుం డై
     క్రమ్మఱఁ జని.193
క. తనకుం గాశిమహీపతి, యనుఁగుంజెలి యగుటఁ జేసి యాతనినగరం
     బున నుండె సహాయుల నెల్లను బిల్వ ననేక సమరలంపటబుద్ధిన్.194
వ. ఇక్కడఁ గృష్ణబాంధవులు విజయంబు చేకొని తూర్యవిరావంబులుం బ్రమోద
     నాదంబులు మేదురంబులుగాఁ బురంబు ప్రవేశించి యందఱుం దమలోన.195

తే. స్వామి యేతెంచుటయుఁ దదాజ్ఞసమర్థధ, కరణ మిట్లు నివేదింపఁ గలిగె మనకు
     ధన్యచరితుల మైతి మనన్యసులభ, మెందుఁ జూచిన సామాన్యమే గణింప.196
వ. అని సరససంభాషణపరితోషణంబులం బొంగు నంతరంగంబులతోడ నున్న సమ
     యంబున.197
క. ఇదె సనుదెంచె మురాంతకుఁ, డెదురుకొనుఁడు సకలజగదధీశు నతని నిం
     పొదవఁ గనుఁడు గన్నారఁగ, యదువరు ననుపలుకు లెసఁగె నంబరవీధిన్.198
వ. చారణప్రయుక్త యైనయయ్యుత్సవోక్తికి నుద్యుక్తు లై సర్వయాదవులును
     సర్వాలంకారకల్యాణవేషంబులతో సర్వపౌరసై న్యపురస్సరంబుగాఁ బురంబు
     వెలువడి రంత నంతరిక్షంబున దార్క్ష్యస్కంధాసనాసీనుం డై దేవకీసూనుండు
     గానంబడియె న ట్లరుగుదెంచి యతండు.199
క. వాహనము డిగ్గి దారుక, వాహిత మగునరద మెక్కి వరబంధుజన
     వ్యూహము లభినందింపఁగ, మోహమతిఁ బురప్రవేశముం బొనరించెన్.200
తే. నగరిలోనికిఁ జని రౌప్యనగమునందు, నగసుతాధీశ్వరుం డర్చనంబుసేఁత
     యతనిఁ గనుట భాషించుట యఖిలమునుప, మాదరంబున వినిపించె నర్హతతికి.201
వ. ద్వాదశవత్సరంబులు తన్నుం బాసి ముచ్చిరి యున్న బంధుమిత్రభృత్యకోటి
     నెల్లను బహుళవాక్యామృతప్రవాహంబునం దేల్చి పౌండ్రావరోధప్రకారం
     బును వార లెఱింగింప నెఱింగినవాఁ డై యుద్ధవోగ్రసేనబలదేవులఁ బ్రశంసించి
     సాత్యకి నెంతయు నుపలాలించి లీలాలోలవిభూషితవదనసరోరుహుం డై.202
శా. ఏమీ పౌండ్రుఁడు దానుఁ జుట్టములు నై యేతెంచెనే మేలు మే
     లేమైఁ దన్ను వధించుసేఁత కొఱకుం బ్రేరేచువాఁ డబ్బెనే
     నేమిం బూనికి లేకయుంటిని నిజం బిం కూర కె ట్లుండుదున్
     భౌమధ్వంసము పిమ్మటం బ్రథనలిప్సం గూడె నాకైదువుల్.203
క. భయ మొకటి లేక కుకురా, న్వయుల నగరిమీఁద [57]వచ్చినట్టిదురాత్మున్
     రయమున నేనును బలసం, చయములతో నరిగి ముట్టి చంపుదుఁ బోరన్.204
వ. అని పలికి పగతుపోయిన తెరువును దత్సన్నాహంబును నరయఁ దగినమానుసులం
     బుచ్చి సంస్మరణసమకాలంబునన చనుదెంచువానిఁగా వైనతేయు వీడ్కొల్పి సము
     చితవ్యాపారంబుల నున్నంత నట పౌండ్రుండు వారణాసీపురంబున నుండి చారుల
     వలన వనజనయనురాక విని కాశిరాజునుం దానును దక్కిన భూపతులు నాలో
     చనంబు సేసి యొకదూత నాదైత్యదమనుపాలికిం బుత్తెంచిన.205
క. పేరోలగమున వాఁడును, నారాయణుఁ గాంచి పౌండ్రనరపతి నన్నుం
     గోరి భవదంతికమున కు, దారతఁ బుత్తెంచె వినుము తద్వచనంబుల్.206

సీ. పుట్టినఁగోలెను బోఁడిమి సెడి గొల్లమందలోఁ బెరిగి ధర్మం బెఱుఁగక
     వనితావధంబు గోవధమును బాంధవవధముఁ గావించి దుర్వర్తనమునఁ
     దిరిగి తంతటఁబోక తేఁకువమాలి నా పేరుఁ జిహ్నములుఁ గల్పించికొంటి
     వాసుదేవుం డన వసుధపైఁ గారణజన్మంబు నొందినసత్యఘనుఁడఁ
తే. [58]గడఁగి నేన కా నీకు నెక్కడితెఱంగు, బ్రతుకు వలతేని వినుము నాపనుపు సేసి
     చక్ర మాదిగ విడిచి మత్సంజ్ఞ యుడిగి, నడిఁకి చనుదెమ్ము నాశరణమ్ము సొరఁగ.207
వ. అని యిట్లు దూతముఖంబున వెడలిన విమత వాక్యం బాకర్ణించి యాకర్ణవికాస
     హాసమధురలోచనుం డగుచుఁ గమలలోచనుండు వానిం గనుంగొని.208
క. మీయేలికమాటలు దూ, తా యెంతయు మంచి వేను దప్పక యాతం
     డేయనువునఁ బలికెడుఁ ద, న్నాయర్థము చేయువాఁడ నటువిను దెలియన్.209
సీ. నను నట కరుగు దె మ్మనియెఁ గావున నెల్ల యడియాలములతోన యరుగుదొంతు
     వినుతచిహ్నంబులు విడువు మన్నాఁడు గావునఁ జక్రపూర్వతఁ దనరువానిఁ
     దనమీఁద విడిచెదఁ దనశరణము సొచ్చి మనుమంట గాదు గావునఁ గడంగి
     తనశరణంబె పెంపొనరంగఁ జొచ్చి నిర్భయుఁడ నై భూరిసంపద హరింతు
తే. ధరణి నెందుఁ బేర్కలవాఁడు దాను నాకు, దాఁటవచ్చునె తనయాజ్ఞ దడయ కింత
     వట్టు నేడు నెల్లిటిలోన నిట్టలముగఁ, జేయఁగలవాఁడ నింతయుఁ జెప్పు మీవు.210
క. అని కట్టనిచ్చి వీడ్కొలి, పిన దూతయుఁ జని యుదారభీమగభీర
     ధ్వనిరమ్య మైనవిష్ణుని, వినిశ్చితోక్తంబు పౌండ్రవిభునకుఁ జెప్పెన్.211
వ. అతండును సహాయు లగు రాజులందఱకు నివ్విధం బెఱింగించి వారునుం దానును
     సర్వసైన్యంబులం గొని వారణాసీపురంబు వెలుపల నాయితం బై మురాంతకు
     రాక కెదురుసూచుచుండెఁ గాశీవిభుండును దనసేనలతోడఁ జెలికానివెనుకయై
     నిలిచె నంత నిక్కడ.212
సీ. సౌత్యకిమున్నుగా శత్రునిర్మథనంబునకుఁ దారతార నిర్ణయము గాఁగ
     జాలుదు మని వచ్చి యోలిఁ బంతంబులు పలుకుచుట్టంబులఁ బరమపురుషుఁ
     డాదరంబునఁ జూచి యస్మత్పరోక్షంబునందు మీ చేసినయట్టిలావు
     సామాన్యమే రిపుజయము మీ చేతికి వచ్చినయది సహవాసకృత్య
తే. మింత [59]గడవంగ నెట్టది యేను వోయి, నాకు వలయు కార్యాంశం బొనర్చివత్తు
     నిలుఁడు మీ రని యందఱ నిలిపి గురుజ, నానుమతమున మంగళోద్యమ మెలర్ప.213

శ్రీకృష్ణుఁడు గరుడవాహనారూఢుఁ డై పౌండ్రవాసుదేవునిఁ జంపం బోవుట

క. గరుడస్కంధారోహణ, దురతిక్రమగమనలీలతో నరిగె వెసం
     బరిపంథిమీఁదఁ [60]భూతో, త్కర మఖిలముఁ దనకు శుభము గాంక్షింపంగన్.214

వ. అరిగి తదీయస్కంధావారంబున కనతిదూరంబునం బాంచజన్యస్వనంబునం బంచ
     మహాభూతవిస్తారవిదళనంబు సేసిన.215
ఉ. ఆతనిఁ గాంచి పౌండ్రబల మార్పులుఁ దూర్యరవంబులున్ దిగం
     తాతతసంప్రసారముల నచ్చెరువై యెసఁగంగఁ దాఁకి యు
     ద్యోతితకుంతయష్టిశరతోమరశక్తిపరశ్వథాతిసం
     పాతనిరంతరంబుగ నభంగురఘారరణం బొనర్చినన్.216
తే. చటులశార్ఙ్గనిర్ముక్తోగ్రసాయకములఁ, గలుషకౌమోదకీవిమోక్షక్రమముల
     గడియతడవులోఁ బొడిపొడిగా నొనర్చె, నసురమథనుండు రిపులమోహరమునెల్ల.217
వ. ఇట్లు కాశీశుసైన్యసహితంబుగాఁ గలసేన లన్నియు మడిసినఁ బౌండ్రవాసుదేవుం
     డవ్వాసుదేవున కెదురై నడచె నట్టిసమయంబున.218
తే. శంఖచక్రగదాఖడ్గచాపములకుఁ, బాంచజన్యాదినామకల్పనము లొలయఁ
     బడగఁ గృత్రిమతార్క్ష్యుండు ప్రజ్వరిలఁగఁ, దేరిపై నున్నపగతు నాశౌరి గనియె.219
వ. కని తదీయశరీరంబున కలంకారంబు లైనపీతాంబరకృతకకౌస్తుభశ్రీవత్సవైజ
     యంతీమకుటలక్షణంబు లుపలక్షించి యెలుంగెత్తి నవ్వి యద్దేవుండు దివ్య
     గంభీరస్వరంబున నతని కి ట్లనియె.220
సీ. పౌండ్ర భూవర నీవు భావంబునందు మదీయాంకములు మోవఁ దివిరితేని
     నాపాలి కేతెంచి నమ్రుఁడవై యేను నీవాఁడ నా కిమ్ము నీదుచిహ్న
     ముల నని వేడిన లలి శాశ్వతంబులై చెల్లవె వెఱ్ఱివై చెట్టచేసి
     తింకనైన వినీతి నేతెంచి వేఁడుము కాచెద నఖిలలోకముల నిన్ను
తే. నీదృశోజ్జ్వలవేషసమ్మోదమాన, హృదయుఁగాఁ గరుణించెద నింత నిజము
     వినుము శరణాగతత్రాణవిపులనిశ్చ, యాఢ్యుఁగా నెఱుంగుము నన్ను నాత్మలోన.221
క. నాచక్రముచే మడిసిన, యాచకలుర నరకుఁ దొట్టి యకట యెఱుఁగ వీ
     వాచెడుటలు మేలులుగాఁ, జూచెదు నినుఁ గావ నొకనిఁ జూపుమ యిచటన్.222
వ. నీవు నన్ను రమ్మని దూతచేతఁ జెప్పి పుత్తెంచిన నీదెస వచ్చితిఁ దగిన బుద్ధియుం
     జెప్పితి నిట్లు సేయుము చేయకున్న నేను నీ చెప్పినట్లు చేసి చక్రకౌమోదకీప్రముఖ
     చిహ్నంబులు నీమీఁద విడిచెద గరుడునిం ద్వదీయధ్వజంబుపై కనిచెద నట్లు
     చూడు మని పలికిన బౌండ్రుం డతని కి ట్లనియె.223
మ. అవనీనాథుల నెల్ల నుద్ధతుల గర్వాంధ్యం బడంగింప నే
     నవతీర్ణుండ నెఱుంగవే యకట మిథ్యావాసుదేవాహ్వయం
     బవినీతిన్ ధరియించి కొందఱకు మోహశ్రాంతి పుట్టించె దీ
     యవలేపంబు నెఱింగి కాదె నీను దండార్హుండుగాఁ జూచితిన్.224

తే. నాకు వెఱచి కైలాసయానంబు పేరఁ, గొంతగాల మమ్మెయిఁ దప్పఁ గ్రుంకిపోయి
     తీవు లేకున్నఁ జూవె మహావిభూతి, మెఱయ వచ్చియు నీయూరు సెఱుప నైతి.225
క. మేలయ్యె నిట్లు వచ్చితి, లేలెమ్ము రణంబులో బలిమి చూపుము రో
     షాలోలరక్తనయనుఁడు, గాలుఁడు ని న్నతిథిఁ జేయఁ గడఁగెడుఁ దనకున్.226
చ. అని నిజశార్ఙ్గముక్తవిశిఖావలిఁ గృష్ణునిఁ గప్పి వైనతే
     యుని ఘనదేహ మంతయును నొక్కట ర క్తమయంబు చేసినం
     గినిసి బలానుజుండు శరకీలల నాతని వ్రేల్చెఁ బెల్చ న
     త్యనుపమదాపదగ్ధగిరియాకృతి నొంద నిమేషమాత్రలోన్.227
వ. పౌండ్రుండు పుండరీకనయను నయనోపాంతంబు కాండవిదళితంబు గావింప
     నెత్తురు ధార యై తొరగ నిర్యాణవిగళన్మదధారం బగు మత్తవారణోత్త
     మంబుం బోలి యయ్యత్తమపురుషుం డతిపరుషం బగు శరం బతని యురంబు
     గాఁడనేసిన.228
క. ఒక్కింత సొగసి యంతన, గ్రక్కునఁ దెలివొంది రిపుఁడు కౌమోదకి నా
     నెక్కొని [61]మిడుఁగుఱు లడరఁగ, నుక్కుగద మురారిదెసకు నుక్కున వైచెన్.229
వ. అద్దేవుండు కౌమోదకీప్రయోగంబున దాని నడుమన పొడివొడి గావించిన
     యనంతరంబ.230
క. పగతుఁడు చక్రము వై చిన, నగధరుఁడు సుదర్శనమున నది తుత్తుమురై
     జగతీస్థలిఁ దొరఁగెడున, ట్లుగఁ జేసె సమస్తజనములును ముదమందన్.231
వ. సందకసంజ్ఞం బగు ఖడ్గం బాపౌండ్రుండు గైకొని జళిపించి వైవం జూచిన నది
     యచ్యుతుండు వానిచేతన యుండం బ్రచండకాండంబున ఖండించె నతండు
     గ్రమ్మఱం దన చాపంబు గైకొని యచ్చెరువుగా ననేక బాణపరంపరలు వెల్లి
     గొల్పుటయు నల్లన నవ్వి యన్విభుండు.232
క. మౌర్వీటంకృతి దిక్కులఁ, బర్వఁగ శార్ఙ్గంబు గుడుసుపడఁ దిగుచుచు దో
     ర్గర్వంబున రిపుశరచయ, చర్వణతం బఱవ భూరిశరతతు లేసెన్.233
తే. ఏసి సూతునిఁ గూల్చి యుద్భాసిరథ్య, సమితిప్రాణంబు గొని సిడం బమరఁ ద్రుంచి
     యహితు దేహంబు బహుళరక్తారుణముగఁ, జేసి పెల్లార్చి వెండియుఁ జెలఁగి నగియె.234
వ. ఇబ్బంగిఁ బగతు నపగతసమస్తసాధనుం గా నొనర్చి యమ్మహావీరుండు.235
తే. ఏమిరా వాసు దేవుఁడ నేన యనుచుఁ, జెప్పికొనవచ్చునే యింకఁ జెపుమ నాకు
     నిన్నుఁ గన్నప్డ చక్రాగ్ని నీఱుసేయ, వచ్చు మూదలించుట కింత వలసెఁ జేయ.236
వ. అని పలికి వానిచేతిపిల్లును శంఖంబును శకలంబులుగా సేసి గరుడచరణప్రహారం
     బులఁ గృత్రిమగరుడలాంఛితంబు లగు తదీయధ్వజదండంబు ఖండంబులు

     సేయించి యాభీలజ్వాలాజ్వలితదిక్చక్రం బగు చక్రంబు సంప్రయోగనిర్వక్రం
     బుగాఁ బనిచిన.237
క. అది వోయి శత్రుదేహము, భిదురము గిరి వ్రయ్యనడుచు పెలుచన్ లీలన్
     విదళితము సేసి వ్రయ్యలు, పొదలిన నెత్తురులతోడ భువిఁ బడఁద్రోచెన్.238
వ. ఇట్లు పౌండ్రుండు సమసిన.239
క. చెలికాని చావు గనుఁగొని, బెలసినవగతోడఁ గినుక పెనఁగొనఁ గాశ్యుం
     డలఘుఁడు దైతేయాంతకుఁ, దలపడి బెట్టేసె దీవ్రతరవిశిఖములన్.240
తే. మిత్రుదేహంబు నొద్దన మేదినికి మ, హోపహారమై నీమేను నొదవుఁగాక
     యనుచు శార్ఙ్గి శార్ఙ్గిచ్యుతసునిశితాస్త్ర, జాలములఁ గప్పె నతని నాభీలలీల.241
క. క్షణమాత్రము చిత్రరణ, క్షణము ననుభవించి పిదపఁ గాశిపుఁ గమలే
     క్షణుఁడు శిరశ్ఛేదవిచ, క్షణుఁడై వీరజనయోగ్యగతులకు ననిచెన్.242
వ. ఇత్తెఱంగునం గాశీదేశాధీశ్వరుం ద్రుంచిన దివ్యాస్త్రంబున యతని తల తదీయ
     నగరమధ్యంబున వైపించి మఱియు మార్కొనిన మగల ననేకులం దునిమి
     తూఁటాడి విజయశ్రీసనాథుం డై యదునాథుండు క్రమ్మఱ నిజపురంబున కరిగి
     సుఖంబునం బ్రమోదించె నంత నిక్కడ.243

శ్రీకృష్ణుఁడు సుదర్శనచక్రంబుచేఁ గాశిరాజసుతప్రేషిత యనుకృత్యం దునుముట

సీ. తండ్రి పౌండ్రునకునై దనుజారిచేత నకారణమృతి నతిక్రాంతుఁ డైనఁ
     గడుశోకవివశుఁడై కాశ్యతనూజుండు హితబుద్ధి యగుపురోహితునిచేత
     వేలిమి పుట్టింప వెస దక్షిణాగ్నియం దుద్భూతయై కృత్య యుగ్రభంగి
     నెయ్యది గర్తవ్య మెఱిఁగింపు మనవుడు యదువంశ్యుఁ డగుకృష్ణుఁ డతనివారిఁ
తే. జంపు మని పంపఁగా నేఁగెఁ జటులరోష, రక్తలోచనజ్వాలాకరాళ మైన
     తనువు మిన్నంటికొనఁ బేర్చి దనుజవైరి, యెచట నెచ్చట ననుచు నే పెసఁగమసఁగి.244
వ. ద్వారకానివాసు లప్పిశాచి నంతంతం గని తలంకి.245
చ. ఇది యొకఘోరరూపము సమిధలయాంతకతుల్యతీవ్రతం
     బొదలి యవీర్యవేగమునఁ బ్రోజ్జ్వలశూలము గేలఁ ద్రిప్పుచున్
     వదనము విప్పుగాఁ దెఱచి వచ్చుచు నున్నది యేమీమాయ యో
     కదిసె శరణ్య కృష్ణ కృపఁ గావుము మ మ్మని యార్తమూర్తులై .246
క. తనశరణము చొచ్చుటయును, గని యపుడు ముకుందుఁ డక్షకలితక్రీడా
     జనితాస క్తిఁ దలిర్చుట, ననాదరప్రీతిలీల నచలాసనుఁ డై.247
వ. అంగీకృతాకృత్య యైన యాకృత్య నుద్దేశించి యుద్దీప్తలీలానిర్వక్రం బగు
     చక్రంబుం బనిచిన నమ్మహాస్త్రంబు సంవర్తమార్తాండమండలచండం బై కవియు
     టయుఁ నిజతేజంబున నిజతేజంబు నిరస్తం బైన సంత్రస్తాంతరంగ యై.248

క. కాశీశుసుతపురోహిత, నాశని యగుకృత్య మరలినం దోడన యా
     క్రోశార్త యైనదానిం, గేశవసాధనము వెనుదగిలెఁ దీవ్రగతిన్.249
వ. అదియునుం గాశీపురంబునకుం జనఁ దదార్తధ్యానం బనతిదూరంబున వీతేరం
     బౌరులు గలంగిరి రాజసేనాపతు లిది యేమి యేమియో యనుచు సకలసైన్యం
     బులం బన్ని యద్దెసకు నడచి.250
తే. కనిరి మిన్నును నేలయు ననలశిఖలఁ, బొదివి శతకోటిసంఖ్యదంభోళిశతము
     లొక్కప్రోవయి చనుదెంచునోజఁ గృత్యు, ననుగమించు వైకుంఠుదివ్యాయుధంబు.251
క. కనుకని తమతమకైదువు, లనువుగఁ బచరించుకొనుచు నభిముఖులై యం
     తన తత్తేజోహత[62]ద, ర్శను లగుటం దల్లడిల్లి క్రమ్మఱిరి వెసన్‌.252
వ. ఇవ్విధంబున నందఱు విఱిగి పురంబు సొచ్చుటయుఁ గృత్యయు వెనుకన చొచ్చె
     నమ్మహాచక్రంబు నవ్వీటిపైఁ బడి కృత్యాసహితంబుగాఁ బార్థివామాత్యభృత్య
     పురోహితబాంధవపౌరవారణరథతురంగభాండాగారగోష్టగృహంబులతోడ
     నున్నతహర్మ్యప్రాసాదసభాచయచత్వరోవశోభిత యగునగరి యంతయు నిమిషం
     బున నీఱుగాఁ జేసె నట్లు దేవాసురాదులకుం దేఱిచూడరాని యాదివ్యనివాసం
     బాసురచరితులకతంబున నుపహతంబు గావించి సర్వభూతదుర్దర్శనం బైనసుదర్శ
     నంబు విష్ణుసమీపంబునకుం జనుదెంచె నని వైశంపాయనుండు వివరించిన పౌండ్ర
     వధప్రకారంబు విని జనమేజయుండు విస్మయప్రమదరసనిమగ్నం బగుమనంబుతో
     మరియు నతని కి ట్లనియె.253
క. ఎంతెంత వింటి మాత్మకు, నంతంతయ ప్రియము సేసె హరిచరితము ల
     త్యంతవిచిత్రములు నతి, శాంతము లద్భుతము లధికకల్యాణంబుల్‌.254
తే. తనియ దింకను జిత్తంబు మునివరేణ్య యమృతసారంబు వీనులయందుఁ గ్రోల్పు
     మనిన నతం డానరేంద్రున కాదరమున, నిట్లనియె వాక్యసౌభాగ్య మింపు మిగుల.255
క. నిర్మలయశుండు జనార్టను, కర్మము లమితములు సెప్పఁగా నొప్పువచో
     నిర్మితు లెక్కడఁ గల రతి, ధార్మికసంపూజ్య చెప్పెదను గొన్ని దగన్‌.256
వ. అవియును సవిస్తరంబుగా నుదాహరింప ననేకకాలంబు వలసియుండుఁ బరిమిత
     భాషణంబుల నుదాహరించెద నాకర్ణింపుము.257
సీ. ద్వారకాపురమున వసియించి [63]యవ్వాసుదేవుండు గ్రమమునఁ దేజ మెసఁగ
     సకలనరేంద్రరాజ్యశ్రీలు దన్నుఁ జేరడునుపాయముతోడికడిమిఁ బేర్చి
     పాండ్యులఁ గేకయపతులఁ గాళింగుల నంగవంగేశుల నాహవములఁ
     దగిలి యొక్కొకనిమిత్తంబున భంగించెఁ బెక్కండ్రు నృపతుల నుక్కుమడఁచె
తే. [64]రాజితాన్వయగాంధారరాజకన్యఁ, గోరి గ్రహియించె గురునస్త్రగురునికొడుకుఁ
     గృపునిఁ గర్ణునిఁ గురుపతి గెలిచి భీష్ము, ఘనతఁ గార్యాంతరమ్ములఁ గడఁగి గెలిచె.258

క. వేడుకకుం దలపడి పృథ, సూడఁగఁ బోరాడి వాయుసుతు నోడించెన్
     గ్రీడిఁ బరాజితుఁ జేసెం, గ్రీడాహితబాహుశక్తిఁ గేశవుఁ డధిపా.259
తే. [65]బభ్రుకొఱకునైై సౌవీరపతి జయించి, తెచ్చెఁ దత్పుత్రి నఖిలపార్థివులుఁ గూడి
     వేణుధారి తన్ దొడరిన విక్రమించి, శౌరి యందఱ నిర్జించి చంపె నతని.260
వ. మఱియఁ గరూషాధిపతి యైనదంతవక్త్రు దక్షిణాపథంబున వధియించెఁ బర్వత
     సహస్ర్రంబులు చక్రంబున భేదించి ద్రుముసేనుం బరిమార్చె నిరావతీనగరంబు
     వొదివి గోపతితాలకేతు లనుభూపతులఁ దునిమె యక్షప్రపతనం బనునెలవునం
     బ్రబలబలాన్వితు లైన నిమిహంసు లనునృపులం గూల్చె వజ్రుండు శైబ్యుండు
     శతధన్వుం డుగ్రసేనుండు ననురాజులం ద్రుంచెఁ గంసామాత్యులం బృథుం డను
    దైత్యుఁ దత్పుత్రుం డసిరోముతోఁగూడ సమయించె మానుషరూపధరు విరూ
     పాభిధానుం దానవు నైరావణం బనుదంతిసహితంబుగా వ్రచ్చె హిమశైైలసంచారు
     లై లోకాపకారు లగుమైందద్వివిదు లనువానరులం దెగటార్చె శోణపురం
     బునం బురవైరిచేత రక్షితుం డైనబలిసూను బాణుం బ్రాణమాత్రావశిష్టుం
     జేసి బాహుసహస్రచ్ఛేదనంబునఁ బోవ విడిచెఁ బావకుం జయించి నిస్తేజుం
     గావించె సాగరంబు గలంచి చొచ్చి సవరివారు వరుణుం దిరస్కరించె నివి త్రివిక్రము
     విక్రమంబులు బాల్యంబునఁ బూతనాఘాతంబు మొదలుగాఁ గంసధ్వంసనంబు
     తుదగా నొనర్చిన పను లెత్తెఱంగులో, పిదప జరాసంధవిరోధంబునం జేసిన చేఁత లే
     విధంబులో కాలయవనసంహరణంబు ద్వారావతీకరణంబు రుక్మిప్రహరణంబు నరక
     నిపాతనంబును పౌండ్రనిపాతనంబు లోనుగా నిర్వహించిన సర్వకార్యంబు
     లెబ్భంగులో గాండీవిచేత ఖాండవదహనంబు సేయించుట భీమసేనుచేత [66]జరా
     సంధుం జంపించుట యతనిచెఱ నున్ననరనాథుల విడిపించుట యపరాధశతంబు
     నిండిన శిశుపాలు జముపాలు వఱచుట సౌంభవిభుం పీడించుట పాండవసహాయుం
     డై సర్వక్షత్రంబు నిశ్శేషంబుగా నొనర్చుట యేచందంబులో యూహింపుము.261
క. తనమేనయత్త గొంతికిఁ, బ్రమదంబునం దత్తనూజపంచకమును గ
     య్యముల బ్రతికింతు ననియె, న్గమలాక్షుఁడు పలికినట్ల కథ యేతెంచెన్‌.262
క. మీతండి ద్రౌణిబాణవి, ఘాతుండై పుట్టుటయును గంసారికృపా
     స్ఫీత యగుదృష్టి నాతని, కే[67]తెరువున నిచ్చె జీవ మెఱుఁగవె యనఘా.263
వ. [68]ధర్మవిద్వేషులు ధర్మవిప్లావకులు నగుపాపాత్ముల నెల్లను మడియించుట యద్దేవ
     దేవదివ్యలీల లిట్టిమహిమ లెన్ని పేర్కొనిన నన్నియ కల వవి యెల్లను [69]ముని
     వర్ణితంబులు త్రిభువనోద్గతంబులు నఖిలదురితోత్తారకంబులుఁ బ్రచురకళ్యాణ
     కారణంబులు నైయుండు నని వైశంపాయనుండు వర్ణించినచందం బానందని
     ష్యందసుందరం బై యొప్పుచుండ.264

తరల. వినయభూషణ విశ్వపోషణ విక్రమక్రమభీషణా
     వినుతఖేలన విప్రపాలన విశ్రుతశ్రుతశీలనా
     కనకవర్షణ కాంతిహర్షణ కామినీధృతిధర్షణా
     ఘనయశోధన కార్యశోధన గర్వితారినిరోధనా.265
క. కేళాదిరాయ వితరణ, కేళీనిరపాయ నృత్యగీతకళాలీ
     లీలోచేతోత్సవనిరతిశ, యాలంకృతభాగ్య సుస్థిరాయుర్భోగ్యా.266
మాలిని. సకలజలధివేలాశైలవప్రావమాతా
     ప్రకటకరటిసైన్యా భవ్యసౌజన్యధన్యా
     వికలనికరక్షా వీక్షితోదీర్ణపూర్ణా
     ప్రకటితసురనౌఘా బాంధవామోఘమేఘా.267
గద్యము. ఇతది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూరసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైనహరివంశంబున నుత్తరభాగంబునందు షష్ఠాశ్వాసము.

  1. మేదుర
  2. తరు
  3. తనరఁగ
  4. నన్యబాము, లెఱుగఁ డీశంభుఁ డతనిమె చ్చెదియకాదె
  5. కాఁపురము
  6. రోచకియైనవాఁ డితనిరూఢమనోరథ మేదియో
  7. సమీరితసురవినూన
  8. వల్లభుం
  9. రోగన్
  10. యుత్తెర
  11. శీలాకల్ప
  12. త్రాక్షరసంజ్ఞ
  13. బు నితరావ్యాప్యంబె
  14. భూత
  15. పదుండవు
  16. ప్రదాన
  17. మీ, దిక్కగు టొక్కటియ మాకు దేవశరణ్యా.
  18. కాయమున
  19. గున నచ్చముగను
  20. గని చెప్పుదరు జగజ్జనములు సుస్థితి విలయంబు గుణమూర్తి లలినొనర్తు
  21. బ్రాహ్మ
  22. యుక్తపథము
  23. భక్తస్వీకృతి నీ
  24. నొచ్చి
  25. భూచారు
  26. భటుండు
  27. వేటువడిన
  28. విద్వర
  29. నిగమాదివేద్యసుగతివ్యాఘాత
  30. ఱే నని వానిచే హీనపడిరి
  31. నేపున
  32. నతని, కొక్కనికకాక త
  33. రేమొ నీబోంట్లకు నీ శూరతములు వెఱతురె?
  34. లోగ్రస్రవంబు
  35. వెలితురి
  36. తాలాట్ట
  37. అవృష్టియై
  38. నభయ
  39. దోచు
  40. లున్నెమ్మెయి
  41. సొరగాకు
  42. నన్నెదిర్చిన
  43. గోపుండు గోపాలకా
  44. రుంబ్రభు
  45. న్నందించు
  46. కోప
  47. కలుషితుఁ డై
  48. నినుద్దీర్ణగజ
  49. పదిటఁ బదిట సారథి రథి బలిమి నొంచె.
  50. పిడికొలఁదికిన
  51. వీచి
  52. నేకాస్త్రతతిన్
  53. బొడిచిరి
  54. బట్టు గదలి పాతాళంబు గలయ బ్రుంగె
  55. గాదు
  56. గరిమన్
  57. బంచి
  58. నేనకా కెక్కడితెఱంగు నీకు బ్రతుక, వలచెనేనియు నాసను వలరఁజేసి
  59. గడవంగదేటది, గడవంగ నేటది, గడువంగ నేఁటది.
  60. బౌరో
  61. వెడవెడవేడుక; పేదపేరు గలుగు; పెదపిడిక గలుగు.
  62. దశ, ఘ
  63. వాసుదేవుఁడు ప్రశస్తప్రభావుఁడు గ్రమమున
  64. ఆ. రాజితస్వయంవరమున గాంధారక, న్యకఁ బరిగ్రహించె నస్త్రగురుని కొడుకు గృపునిఁ గర్ణు గురుపతిభీష్ముఁ గార్యాంతరములఁ దొడరి, యభిభవించె.
  65. బభ్రుకొడుకైన
  66. మగధనాథుం
  67. తెఱఁగున
  68. బ్రహ్మ
  69. వ్యాస