హరివంశము/ఉత్తరభాగము - తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - తృతీయాశ్వాసము

     కంఠచరణసేవక
     వైకుంఠ గుణావదానవర్ణననిపుణా
     శ్రీకంఠబాహువిభవ
     వ్యాకుంఠితవైరిధామ [1]యన్నయవేమా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు నిజేచ్ఛావశత్రిభువన
     విభవుం డైన యయ్యదువీరుండు ప్రభూతస్థితిం బొందియుండ ననతిచిరం బగు
     కాలం బరిగిన.2
క. రైవతుకూరిమికన్నియ, రేవతి నసమానరూపరేఖావినయ
     శ్రీవినుతఁ బెండ్లియై బల, దేవుఁ డలరె జనకవాసుదేవానుజ్ఞన్.3
వ. తదనంతరంబ విష్ణుదేవుండును వివాహవైభవం బంగికరించె నవ్విధంబు
     వివరించెద.4
సీ. విను వింధ్యపర్వతంబునకుఁ దక్షిణపార్శ్వమునఁ గుండినం బనుపురము రాజు
     గ్రథకైశికాన్వయప్రభవుండు వైదర్భుఁ డకలంకయశుఁడు భీష్మకుఁ డనంగఁ
     [2]దనరారునృపతికిఁ దనయుఁడు రుక్మి యవార్యశౌర్యుఁడు ద్రుముఁ డనునరేంద్రు
     వలనఁ గృతాస్త్రుఁ డై వెలసి బ్రహ్మాస్త్రంబు జమదగ్నిసూనుచే నమరఁ బడసి
తే. శౌరితో నెల్లనాఁడు మచ్చరముచేయు, చుండు నాతనిసోదరి యుజ్జ్వలాంగి
     రుక్మిణీదేవి యసమానరూపయావ, నమునఁ ద్రైలోక్యముల నభినంద్య యయ్యె.5
చ. హరి కనురాగపాత్ర యగునట్టిది యట్టె ప్రసూనబాణవి
     స్ఫురితపునర్భవంబునకు భూమి యనం దగునట్టె సన్మునీ
     శ్వరులకు నర్చనీయ యటె వర్ణనసేయ వశంబె పూని యె
     వ్వరికి నుదాత్తచిత్త యగువారిజలోచన పుణ్యభావముల్.6
క. ఆవెలఁది నాప్తజనముల, చే విని కామించె నాత్మసితకమలాక్షుం
     డావిభుపై నప్పొలఁతియు, భావము గదియించె శ్రవణపరిచయలీలన్.7
చ. తలఁపులు చిక్కు [3]జీరువడఁ దాల్ములు పెల్లగిలంగఁ జూడ్కు లా
     కులపడి [4]చూపు పండువులు గోరఁగఁ గోర్కులక్రందుచేష్టితం
     బులఁ దడపెట్ట భావములపూఁపు బయల్పడ వారి నిద్దఱన్
     బలసి మరుండు తుల్యరసపాకముతీపులఁ గ్రోల్చి విన్కలిన్.8

చ. అనిమిషసిద్ధయక్షజగాదులు వేఁడినఁ బువ్వుఁబోఁడి నె
     వ్వనికిని నెట్ల గైకొనఁగ వచ్చు మదగ్రవిభూతి యల్ప మే
     యని తమకించి పేర్చెఁ బ్రభుఁ డంగనయుం బురుషోత్తమార్తయై
     యెనయు తలంపుజాడ కొక యింతయుఁ దక్కకయుండె వేడుకన్.9
తే. రుక్మి గోవిందుతోడి విరోధి గాన, యాతఁ డడిగినఁ జెలియలి నకని కీఁడ
     గొల్లపల్లియలో సందగోపునింటి, పసులగాపరి యగునె నాపాటి యనుచు.10
వ. ఆసమయంబున సుపరిచరవంశజాతుండును మగధమహీనాథుండును గిరవ్రజ
     పురస్వామియు నగుజరాసంధుండు నిజజ్ఞాతి యగు దమఘోషునకు వసుదేవు
     తోడంబుట్టు వైన శ్రుతశ్రవ యను నాయమకుఁ బుట్టిన దశగ్రీవశైబ్యదస్రస్వవశు
     లను నలువురు కొడుకులకుం బెద్దవాఁ డైన సునీధుం డను నామాంతరంబు
     గల శిశుపాలుం దజ్జనకుండు దనకుఁ గొడుకుగా నొసంగం గైకొనినవాఁడు
     గావున నతనికి రుక్మిణి నడుగఁ బుత్తెంచిన.11
తే. భీష్మకుఁడు వాసుదేవుపై బ్రియము గలిగి, యుండియును రుక్మి మాటకు నొండనంగ
     నేర కాచేదిపతికి నన్నీరజాక్షి, నిచ్చువాఁ డయ్యె మగధేంద్రు నిచ్చ గోరి.12
వ. ఆజరాసంధుండును సంబంధసంధి యవ్విధంబున సవిశేషంబుగా సంఘటితం
     బగుటకు సంతోషించి సకలబాంధవులకు శోభనార్థంబు లేఖలు [5]వ్రాయించి పుచ్చి
     రావించిన యంగ వంగ కళింగ పౌండ్ర పాండ్య కాశ [6]కరూశాద్యనేకదేశాధీశులం
     గూర్చి శిశుపాలుం దోడ్కొని తదీయస్నిద్ధు లగు పౌండ్రపుత్రుండును (వాసు
     దేవుండు) నేకలవ్యాత్మజుండు వీర్యవంతుండును దంతవక్త్రతనయుండు సువక్రుం
     డును లోనుగాఁ బెక్కండ్రు రాజకుమారు లక్కుమారుం బొదివికొనిరా ననే
     కాక్షోహిణీకలితంబు లగు బలంబులతోడ నడువ నప్రతిమవైభవంబున వైద
     ర్భునిపురంబునకుం జనుదెంచిన.13
మ. తన[7]చుట్టు న్నడుమన్ రథాశ్వగజబృందశ్రీ లెలర్పంగ నె
     మ్మన మానందము నొంద రుక్మి మగధక్ష్మానాథుఁ బ్రత్యుద్గమా
     ర్చనసంభావితుఁ జేసి తెచ్చి తగ విశ్వక్షోణిపాన్వీతు నా
     తనిఁ బ్రీతి న్విడియించెఁ బ్రస్ఫురితసత్కారోపకార్యావలిన్.14
వ. అమ్మహీపతి మౌహూర్తికుల రావించి లగ్నంబు నిర్ణయించి యెల్లి కుమారి
     వివాహలగ్నదివసం బని నిజస్కందావారంబున ఘోషణంబు సేయించె రాజు
     లెల్లం దమ తమ విభవంబులు మెఱసి సకలసేనల నలంకారంబు లొలయ సమక
     ట్టిరి శిశుపాలుండునుం బెండ్లిసింగారంబు పొలుపార సవయస్కులగు వసుధావర
     కుమారులం గలసి [8]యుల్లాసం బెసంగ నుండె నాసమయంబున నక్కడ.15

నారదుఁడు శ్రీకృష్ణునొద్దకు వచ్చి రుక్మిణీపరిణయోద్యమంబు తెఱం గెఱింగించుట

సీ. పసిఁడి కెంజాయ నింపెసలారుజడముడిఁ జెరివినమందారసురభికుసుమ
     మాలిక పైఁ గ్రాలులోలాళిపటలంబు పింఛాతపత్రంబు పేర్మిఁ దనకు
     నొసఁగఁ దెల్లనిమేని కుత్తరీయం బగుకడవసం బమృతాంశునొడలిమీఁది
     కందుచాడ్పునఁ దోఁపఁ గనకంపుమొలత్రాటఁ జెఱుఁగు దూఁగాడుచు సితపయోద
తే. చలితచంచలాగ్రముతోడి సరి యనంగఁ, జేతివీణ సన్నపుగాడ్పుపుచేత మ్రోయు
     తెఁఱగు లొయ్య మెచ్చుచుఁ జనుదెంచె గగన, మార్గమున నారదుఁడు కంసమథనుపురికి.16
క. చను దెంచి సర్వజనములుఁ, దనుఁ గౌతూహలతరంగతరళతరవిలో
     చను లై కనుఁగొనఁగ నగరి, యనుంగు మొగసాలగవని కవతీర్ణుం డై.17
వ. దౌవారికులచేతం దనరాక యెఱింగింప నింపారుసంభ్రమంబున నుగ్రసేనవసు
     దేవులు పురస్సరులుగా వాసుదేవుండు బలదేవసహితుం డై యదుముఖ్యులుఁ
     దోడరా నెదురువచ్చి నమస్కరించి యమ్మహాపురుషుం దోడ్కొనిపోయి సుధ
     ర్మాభ్యంతరంబున భర్మమయం బగు భవ్యపీఠంబున నునిచి యర్ఘ్యపాద్యాదివైదిక
     సత్కారంబు లాచరించి తదనుజ్ఞ నాసీనుం డై తక్కినవారిం గూర్చుండం బనిచి
     విరచితాంజలి యై యి ట్లనియె.18
శా. సేమంబే తగ నీకు లోకములకున్ సేమంబె [9]దేవాళికిన్
     సేముంబే మునిముఖ్య యెల్లకడల న్నిత్యస్వతంత్రుండ వై
     యీమాడ్కి న్విహరించునీయెఱుక [10]కన్వీతార్థముల్ గాని వె
     ట్లేమై వస్తువు లుగ్గడింపఁ గలవే యిమ్మూడులోకంబులన్.19
వ. అది యట్లుండె నిప్పుడు.20
క. నీకుశలం బే నడిగెద, నాకుశలత యెట్టిదో సనాతనయోగ
     శ్రీకుశలి యైనధన్యున, కేకుశలము గొఱుఁత యింత యెఱుఁగన కంటే.21
క. ఒక్కటి గల దీయదుకుల, మెక్కటి లోకమున లెక్క కెక్కఁగఁ జేయన్
     నిక్కముగ వచ్చి తీపని, దక్కఁగ నీరాక కొండు దగు నన నేదీ.22
     ధన్యులమైతి నిజధర్మములందు గృహీతనిత్యసౌ
     జన్యుల మైతి మభ్యుదయశాశ్వతపూజ్యత మై యలోకసా
     మాన్యుల మైతి మిట్లఖిలమాన్యమహావ్రతశాలి వీవు ధీ
     విన్యసనంబు మావలన విప్పుగఁ జేర్చుట[11]ఁ జేసి సంయమీ.23
క. అని యివి మొదలుగ మాధవుఁ, డనుపమమధురోక్తివిధము లభినవములుగా
     నొనరింపఁగ ముని యాతనిఁ, గనుఁగొని యి ట్లనియె వదనకమలం బలరన్.24

ఉ. నీవు దలంపఁగా గలుగు నిక్కము నేమముచొప్పుఁ సర్వ
     వావలికిం జతుర్యుగములందు భవత్పదనిత్యసత్యసం
     సేవనతత్పరప్రకృతి సేకొని యుండెడుమాదృశు ల్జగ
     త్పావన చోద్యమే కుశలభావమునం దనరారు టిమ్మెయిన్.25
తే. నిత్యశుద్ధబుద్ధానందనిర్మలస్వ, భావుఁడవు నీవు నారాక ప్రకటబుద్ధి
     నొలసె ననుట నాపైఁ గృపగలిమిమిగులఁ, జూచు టేఁ గృతార్థుఁడ నైతి సురశరణ్య.26
క. నీ చేప ట్టొకయించుక, గోచరముగఁ గంటిఁ గానఁ గొంకక యింకే
     నాచరితశుభవచఃపూ, జాచతురత మెఱసెదను బ్రసన్నుఁడ వగుమీ.27
వ. అని పలికి దేవముని దేవకీనందను వదనారవిందంబున నాదరంబునఁ జూడ్కి వెల
     యించి.28
శా. వీణావల్లిక సక్కఁ బూన్చి శ్రుతికన్వీతంబుగాఁ దంత్రులన్
     బ్రాణంబుల్ నెలకొల్పినట్లు మధురప్రారంభ[12]సంభూతితో
     రాణం బొయ్యనఁ దీర్చి మూర్ఛన మనోరాగంబు గావింప ని
     ర్వాణానందముఁ బట్టి చూపెడుగతిన్ వాయించె ధీయుక్తతన్.29
వ. అవ్వాద్యవిద్యాప్రయత్నంబుల యంతరంబులయందు.30
సీ. వేర్వేఱ గీతసంవృత్తబంధోదారబంధురోదాహృతిభంగి యలర
     మీనకూర్మవరాహమృగరిపువామనరామరాఘవజన్మరచన లోలిఁ
     బచరించి పదపడి బలభద్రకృష్ణాఖ్యభావముల్ రెండునుఁ బ్రస్తుతించి
     పూతనాశకటావఘాతంబు యమళార్జునాకృష్ణగోపాలనాతి సక్తి
తే. యురగదమనంబు గోవర్ధనోద్ధరణను, ధేనుకారిష్టకేశిమర్థన విభూతి
     కువలయాపీడమల్లసంక్షోభణమ్ము, కంసవిధ్వంసనము మేరగా నుతించె.31
క. అన్నిటియాభోగంబుల, నన్నీరజనాభు శ్రుతిసమారాధ్యయశున్
     [13]బెన్నిధిఁ బడసినవడువునఁ, జెన్నొందఁగఁ బాడె జనులచిత్తము లలరన్.32
తే. పిదపఁ జేతిదండియ యటువెట్టి కేలు, మొగిచి భక్తిరసం బాత్మ ముంచికొనంగ
     నఖిలవేదాంతవిద్యారహస్యభావుఁ, గోరి కీర్తించెఁ బ్రభువు నన్నారదుండు.33
వ. అమ్మహాగోష్ఠియందు గరిష్ఠుం డగుసురజ్యేష్ఠు నగ్రతనయు నగ్రిమవదనంబున
     నుద్గీతార్థసరస యగు సరస్వతివలన సరసీరుహాక్షుసాక్షాన్మహిమ లఖిలంబును విని
     యాదవు లద్భుతప్రమోదమేదురమానసు లై తమలో నియ్యఖిలేశ్వరునకుం
     జుట్టంబులము [14]బంటులము [15]ప్రసాదయోగ్యులము నై మన మింత కృతార్థుల
     మగుదుమె యిమ్మునిపుంగవుండు మన కింతకల్యాణం బొనర్చునె యిన్ని పోకలం
     బోయినవాఁ డింక వెన్నునియొద్ద నేమి చందంబు కోర్కి పడయం దలంచునో
     పాట యుడిగి మఱి యెవ్విధంబు సల్లాపంబునకుఁ దొడంగునో యని కౌతూహల
     చపలచిత్తు లగుచుండఁ గృష్ణుం డయ్యక్లిష్టచరితునిదెస భరితాదరుం డై.34

క. ఒప్పుగఁ బరిపాటి యొకఁడు, దప్పక మాచేతలెల్లఁ దగఁ దడవితి నీ
     విప్పటికి నింతసాలుం, జెప్పుము నీరాక కొకవిశేషం బనఘా.35
వ. అని యడిగిన నయ్యోగీశ్వరుం డఖిలేశ్వరున కి ట్లనియె.36
సీ. దక్షిణాంభోనిధితటమునఁ గోకర్ణ మనుమహాస్థానంబునందు వినుము
     దివ్యలింగాకృతిఁ దేజరిల్లెడు దేవదేవేశు శంకరు దేవపూజ్యు
     వృషభవాహనుఁ జారువీణారవాన్విత యగుగీతపూజ నత్యంతభక్తి
     నారాధనము చేసి యట నివృత్తుండనై యర్ధేశ్వరునిదెస కరుగుచుండి
తే. నడుమఁగంటిఁ గుండినపురనాథుఁ డైన, భీష్మకుని నాతఁడును నన్నుఁ బ్రియమెలర్ప
     నర్చితునిఁ జేసె భువిఁగల యఖిలనృపుల, నాజరాసంధుఁదొట్టి యే నచటఁ గాంచి.37
వ. వీ రేమిటికిం గూడి యున్నా రని విదర్భరాజు నడిగిన నతం డాత్మీయకన్యయగు
     రుక్మిణీదేవిం జైద్యుఁ డగుశీశుపాలున కిచ్చువాఁ డై తాను రావించినఁ దద్వివా
     హంబునకు [16]మగధాదులు వచ్చుటయు నెల్లిరేపాడి లగ్నం బగుటయుం జెప్పిన
     నవ్విధం బెఱింగింప నీయున్నయెడ కరుగుదెంచితి.38
శా. నీ వాకన్నియఁ గోరినాఁడవు [17]మది న్నీ కీక వైదర్భుఁ డి
     ట్లావిద్వేషిమతంబు సేయఁగలవాఁ డైనాఁడు తత్కార్య మిం
     కేవిఘ్నంబును లేక సిద్ధ మగు [18]నట్లేనిన్ యశోహాని యొం
     డీవిశ్వంబున నింతకంటెఁ గలదే యేభంగి నీపేర్మికిన్.39
వ. కావున నుగ్సేనమహారాజుఁ బురస్కరించి బలదేవసహాయుండ వై సాత్యకి
     ప్రముఖనిఖిలయోధవీరులం దోడ్కొని సైన్యం బంతయుఁ దోడనడవ నీ ప్రొద్ద
     కదలి పోయి యక్కడం బ్రోవుగొని యున్న రాచపదువులం గుదియించి సమ్ముదం
     బున ముదితం బరిగ్రహించి తెమ్ము భవదీయబాహుయోగంబున సుదర్శనం బగు
     సుదర్శనంబునకుఁ దీర్ప రానిపను లెక్కడఁ గల వది యట్లుండె.40

నారదుఁడు శ్రీకృష్ణుని రుక్మిణీదేవిం బరిగ్రహించికొని తేర నియోగించుట

క. వీను మంతరిక్షతలమున, ననఘా యంతర్హితుండనై చూచితి న
     వ్వనితారత్నము లీలా, వనమున నెచ్చెలులతోడ వగఁ బొగులంగన్.41
చ. నిను విని నీదెసం దలఁపు నెక్కొని చిక్కిన నెమ్మనంబు నీ
     యనుపమసద్గుణస్తుతికి నమ్ముడు వోయినజిహ్వయుం బ్రియం
     బునఁ దమకించి నీలలితమూర్తిఁ గనుంగొనఁ గోరుచూడ్కియుం
     దన కమరంగ రాజసుత తక్కినభంగు లెఱుంగ దేమియున్.42
సీ. పలుక నెంతయు గ్రుయ్యఁబాఱిననునుఁజెక్కు లందందఁ దడిపెడునశ్రువారి
     యింకినచనుదోయి [19]యేకావళీసూత్రభూషితం బైనది పొలుపు దక్కి
     పాటన యెడలుటఁ బాపటరూపేది కడుమాసినది నీలకచభరంబు
     వేఁడియూర్పుల తోన వెడలునోయుసుఱును [20]ననఁగఁ దూఁగాడెడు నంగవల్లి

తే. తలిరు సెజ్జలు జందనసలిలవృష్టి, [21]యబ్జదళకృతవీజనం బాదిగాఁగ
     సఖులు గావించె శిశిరోపచారవిధులు, గొనక నిగుడెడితాపంబు వనజముఖికి.43
చ. హరి నఖిలేశ్వరేశ్వరు దయానిధి నాశ్రితరక్షణైకత
     త్పరుఁ దగఁ బొందఁ గన్నఁ దనుదాహము గ్రక్కునఁ బాయు నొండు దు
     ష్పురుషులఁ బేరుకొంచు మది చూఁడెద రేని లతాంగులార యే
     నురువుదు నీక్షణంబ యుసు ఱోర్వజుఁడీ యను నింతి బోటులన్.44
తే. అబల [22]యివ్విధమున నున్న యయ్యవస్థఁ, గనిన యెవ్వారిమనసైనఁ గనికరమునఁ
     గరఁగు నైసర్గికాత్యంతకరుణమతివి, నిఖిలవేది వుపేక్షింప నీకుఁ దగునె.45
క. కావున ముద్దియప్రాణము, గాపుము నీవిభుత కింత గడవఁ గృతార్థీ
     భావం బన నొండెయ్యది, భూవనుతచరిత్ర యేను బోయెద నింకన్.46
వ. అని చెప్పి యప్పురాణతపస్వి తపస్సిద్ధ యగుసిద్ధగతిం జనియె ననంతరంబ యంబుజ
     నాభుం డాత్మీయజనంబుల నందఱఁ గనుంగొని.47
క. వింటిరె నారదువాక్యము, గంటిరె మనకు నిట వలయుకర్జములను నీ
     వెంట జయకీర్తిశుభములు, గంటకు ముని పనిచెఁ దడయఁగా నేమిటికిన్.48
వ. ఇమ్ముహూర్తంబునంద పయనం బై కుండినపురంబునకుం జనవలయు మీమీ
     వాహనంబుల నాయితంబు చేసి యెక్కి నిజసేనాసమన్వితుల రై నడువుండు సకల
     బలంబులకు ముందట సాత్యకియును నడుమ బలభద్రదేవుండును వెనుకదిక్కున
     జననాథుఁడును జనువా రేనును దారుకైకసహాయుండ నై సర్వాయుధంబులు
     ధరియించి ముందట నరిగి జరాసంధపరిపాలితుం డై యున్న శిశుపాలుం దొలుత
     గాలగోచరుం గావించి రుక్మిప్రముఖక్షుద్రక్షత్రంబు నఖిలంబును నిరవశేషంబు
     చేసి భోజరాజతనయం గైకొనియెద ననినం దదీయశాసనంబున.49
శా. యాత్రాదుందుభి సర్వదిక్కుహరభేదాభీలనిర్ఘోషమై
     జైత్రోత్సాహము దెల్పఁ బొల్పుమిగులన్ సన్నద్ధులై యాదవుల్
     ధాత్రీకంపనసైన్యసంచరణసిద్ధప్రక్రియ న్వెల్వడన్
     శత్రుచ్ఛేద[23]వధిత్సుఁడై విభుఁడు తత్సామగ్రికి న్మెచ్చుచున్.50
సీ. కౌస్తుభమాణిక్యకమ్రాంశువులు మేనఁ గుంకుమక్షోదంబు కొమరు నొసఁగఁ
     గనకాంబరాంచలఘనకాంతి దిగ్భిత్తి లేఖల హారిద్రలిప్తి పఱపఁ
     బాంచజన్యద్యుతిపటలంబు గెలఁకులఁ బూర్ణచంద్రాతపస్ఫూర్తి నెఱప
     వైజయంతీధామవైభవం బురమున గగనస్థసురచాపకలనఁ జూపఁ
తే. బరమకల్యాణవేషవిభాజమాన, మూర్తి యదుచక్రవర్తి యామోదకీర్తి
     వెడలె సైన్యసుగ్రీవాదివిశదరథ్య, రభసదుర్వార మగుదివ్యరథముతోడ.51

శ్రీకృష్ణుఁడు రుక్మిణీపరిణయార్థంబుగాఁ గుండిన పురంబునకు నరుగుట

వ. ఇట్లు వెడలి మహావిభవంబునం జని విదర్భవిషయంబు సొచ్చి నడచి నగరిఁ
     గదియు సమయంబున భీష్మకుం డాత్మీయబంధుసహితుం డై యతని నెదుర్కొని
     తోడ్కొని పోయి పురబహిరంగణంబున విడియించి యప్రమేయంబు లగు
     పూజాక్రమంబులఁ బ్రమదం బొదవునట్లుగా నారాధించె నారాజసమాజంబు
     లోని జనంబులు కొంద ఱితండు దనమేనయత్తకొడుకు పెండ్లికిం జనుదెంచెఁ
     దగున కాదె యనం గొందఱు గోవిందుండు మగధేంద్ర చేదిపతులదెస నప్రియుం
     డి ట్లేతెంచుటకుఁ గతం బేమియో యనుచుండఁ గొంద ఱయ్యిందువదన చందం
     బిమ్ముకుందునందు సంతుష్టసంకల్పం బని విందు మిది యె ట్లగునో యని
     యూహింప నఖిలయదువీరపరివృతుం డై యత్తెఱంగున వచ్చియున్న యాకృష్ణు
     నాకర్ణించి.52
ఉ. ఘోరనిదాఘదాహమునఁ గుందుచునున్న ధరిత్రి యుల్లస
     ద్వారిధరాంబుపూరపరివర్తనభద్రము సంభవించినన్
     భూరి రానుమోదభరమున్ భజియించువిధంబునన్ విప
     ద్భారము నుజ్జగించి వెసఁ బార్థివకన్యక ప్రీతచిత్త యై.53
వ. నిజాంతర్గతంబున.54
మ. నను దుఃఖాంబుధి నుద్ధరించుటకు నై నానాథుఁ డేతెంచె నిం
     కనుమానం బొకఁ డేల యెప్పుడొకొ యయ్యబ్జాయతాక్షు న్మహా
     ఘనవక్షుం దగఁ గాంతు ని ట్లిరిది భాగ్యం బబ్బునే నాకు నా
     జని సాఫల్యము నొందె సర్వజగదర్చ్యం బయ్యె నాకోర్కియున్.55
సీ. చూడ్కులు ననుఁ జెందఁ జొచ్చి గోవిందుడెందములోన నానందధన్య నగుదుఁ
     బలుకులజాడ తీపులు గ్రోలి సోలి గోవర్ధనునకుఁ జాలవలఁతి నగుదుఁ
     గ్రియలకుఁ బూఁచు కోర్కికి నెల్లదెసఁ జిక్కి శ్రీవత్సునకుఁ బ్రియశిష్య నగుదు
     నేర్పులు ప్రసరింప నెఱయుపాకము నొంది హరియం దభేదభావాత్మ నగుదు
తే. నానాప్రియంబును భక్తియు నాతలంపు, వలపుఁ గంసారి యెఱిఁగెడుకొలఁది యెఱిఁగి
     యఖిలజగములు నేన యత్యంతసుభగ, తానిరూఢితో నేలెడుదాన నగుదు.56
వ. అని యవ్యగ్రమనోరథపరిగ్రహంబుల నధికవ్యగ్ర యగు నాప్తసఖీజనంబులం
     గలసి కమలనాభుకల్యాణప్రసంగంబు లగుకథనంబులు వినోదంబు లయి క్రొత్తగా
     వెలయు నమ్మికం జేసి నెమ్మనం బూఱడి యుండి నిండువెన్నెలం బొలుపారు విభా
     వరియందు వినిద్రం బగుభద్రభావంబునం బ్రవర్ధిల్లె నాసమయంబున.57
క. మునురాకపోకలం దా, వనజానన వలపు దెలుప వలను గలుగు న
     త్యనురక్తజనులఁబ్రేమము, వినూతనము సేయఁ గరము వేడుకఁ బ్రభుఁడున్.58

వ. ఏకాంతంబ యక్కాంతదెసఁ జింతాభరంబునఁ గార్యాంతరంబులయందు నిర
     పేక్షుం డై యుండి.59
ఉ. ఎమ్మెయిఁ జూతునొక్కొ తరళేక్షణ నక్కట చూచి యెమ్మెయిం
     గ్రమ్మన నిర్వహింతునొకొ కైకొనుకర్జము [24]వేఁడి శత్రుసం
     ఘముల నెమ్మెయిం దొడరి గర్వము సొంపడఁగింతునొక్కొ యే
     నెమ్మెయి నిశ్చయింతునొకొ యింతిదెస న్మునువిన్నచందముల్.60
తే. నన్నుఁ బొడగన్నచోట నన్నలిననయన, చూపుచూపులఁ బ్రేమంబు సొంపు గనిన
     యపుడ తఱియంగ నురుకుదు. నమరు లడ్డ, [25]పడినఁ బట్టుదు నాపాణిపంకజమున.61
సీ. కమలాస్య నెమ్మోము కమ్మనితావికి దందడిఁ దమకించుతరళతయును
     ముద్దియ యెలదొక్కు ముద్దారుఁబలుకులు వినఁగ నుత్తలపడువేడుకయును
     బూఁబోఁడి నెమ్మేనిఁ బొంది యానందంబు గడగానఁ బూనెడుకౌతుకంబు
     గామిని కొండొండ కడలొత్తుకోర్కులు నిండింపఁ గాంక్షించునెఱగడఁకయు
తే. భామయును నేను నన్యోన్యభావమగ్ను లగుట యెఱింగినయాప్తజనాళి ప్రియము
     నిర్వహింపంగఁ గలుగుట నిక్కమునకు, నవయ నేభంగి భాగధేయంబొ నాకు.62
క. అని యివి మొదలుగఁ బెక్కులు, దనమదిఁ దలపోయునతనితలఁపులు సిద్ధిం
     దనరింపఁగఁ జనుదెంచిన, యనుపమభాగ్యంబు నా నిశాంతం బయ్యెన్.63
ఉ. పాడె మధువ్తావళులు పద్మవనీవిభవంబు శాపముల్
     వీడె రథాంగకంబులకు వేడుకఁగూడి తరంగడోలలం
     దాడె మరాళదంపతులు హాసవిలాసము దక్కి గ్రక్కునన్
     వాడెఁ గుముద్వతీముఖము వావిరి నూడెఁ దమోనిబంధముల్.64
క. అరుణోదయరాగంబునఁ, గర మలరెడు పూర్వదిఙ్ముఖంబున వెలసెన్
     సరసిజమిత్రసమాగమ, పరమోత్సవవార్త భువనపఙ్క్తుల కెల్లన్.65
మ. తనతేజంబున నన్యతేజములు విధ్వంసంబు నొందించి యెం
     దును సన్మార్గము సుప్రకాశవిగళద్దోషంబుగాఁ జూపి య
     త్యనురక్తోజ్జ్వలమండలుం డగుచుఁ బూర్వాద్రీంద్రభద్రాసనం
     బున నొప్పెన్ గ్రహరాజు విశ్వము గరంబుల్ మోడ్చి సేవింపఁగన్.66
వ. ఇట్లు సూర్యోదయం బగుటయు వసుదేవసూనుండు కౌతుకోన్నీయమానుం
     డయి కృతకాల్యకరణీయుండును సముచితాలంకారుండును ననురూపజనపరి
     వేష్టితుండును ననురూపశుభచేష్టి శుంగ తుండును నగుచు రుక్మిణీదర్శనం బవే
     క్షింపుచుఁ దనయొక్కరథంబుతోడన శిబిరంబు వెలువడియె నంత వైదర్భుపురం
     బును జనపతిస్కంధావారంబును గుంకుమద్రవసేకంబుల ముక్తావిసరహారంబులం

     గనకదళీక్రముకస్తంభోన్నయనంబుల మరకతమకరతోరణబంధంబుల నమ్మహా
     నీలప్రాలంబమాలికాకలనంబులఁ బద్మరాగరమ్యధ్వజవైజయంతికావిరచనంబుల
     విచిత్రవిభవవిస్తారంబు లై శోభిల్లె నాసమయంబున.67
సీ. లాలితపర్జన్యలక్ష్మి విభూషించు [26]పర్యాప్తనవమేఘపంక్తు లనఁగ
     రమణీయశారదరాత్రిఁ బ్రకాశించు రాకాసుధాకరప్రభ లనంగ
     నుల్లసితాశోకవల్లరి నలరించు నుదితవసంతసంపద లనంగఁ
     బ్రకటితప్రాభాతపద్మినిఁ బాటించు బాలారుణోదయలీల లనఁగ
తే. వితతమోహనమంత్రదేవతఁ బ్రసన్న, జేయు సాధకసాధనశ్రీ లనంగ
     రుక్మిణీదేవి నభిరూపరుక్మకాంతి, కలితతనుయష్టి గైసేసి రెలమిఁ జెలులు.68
వ. ఇత్తెఱంగున సింగారించి యయ్యంగన లవ్వరాంగి నఖిలమంగళాధిదేవత యగు
     గౌరీదేవికి మ్రొక్కింపఁ దదీయదివ్యాయతనంబు గుఱించి కాంచనశిబికారూఢం
     జేసి తోడ్కొని పురంబు వెలుపలికిం జనుదెంచి రప్పు డచ్చట.69
తే. అలఘుయానావతీర్ణ యై యలరుఁబోఁడి, బోఁటిపదువులు పొదువంగఁ బొలుపు మిగుల
     దేవి దర్శించి తనముగ్ధభావ మధిక, [27]భక్తితాత్పర్యమున ననురక్తి నొప్ప.70
ఉ. అక్షతగంధపుష్పచయ మంజలి [28]నర్పణసేసి నమ్ర యై
     [29]యక్షయపుణ్యుఁ డుత్తముఁ డనంతయశోవిభవుండు పుండరీ
     కేక్షణుఁ డస్మదీయహృదయేశ్వరుఁ డయ్యెడుఁ దల్లి నీకృపా
     వీక్షణలీల నంచుఁ బ్రియ మింపెసలారఁగ మ్రొక్కె గ్రక్కునన్.71

పురంబువెలుపల గౌరీదేవిని సేవించి వచ్చు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుండు గొనిపోవుట

క. గుడి వెడలెడునెడఁ గృష్ణుఁడు, కడుఁ గదియఁగ వచ్చి కాంచెఁ గామినిఁ దఱితోఁ
     బొడమి సుధాజడనిధి య, ప్పుడ వెలువడి యున్నకమలఁ బోలెడుపొలఁతిన్.72
చ. కని పరమేష్ఠి చేసినజగత్త్రయసర్గమునందు నివ్విధం
     బునఁ బొలుపారునద్భుతపుమూర్తులు గల్లెనె దీని విన్నయ
     వ్వినుకలి యెట్టులైన నొకవెంట సహించితి నింక నెట్లు నా
     మనసున కోర్వవచ్చు నసమానవిలోకనరాగవేగమున్.73
సీ. మెలఁగి పైకొని చూడ్కి [30]దలఁకంగఁ గ్రాలెడు దుఱఁగలితొలుకారుమెఱుఁగువోలె
     నురియాడుచిత్తంబు నెరియింపఁ దొడఁగెడు నాలోలపావకజ్వాలవోలె
     భావించి మఱుపునఁ బనుపడుబుద్ధికిఁ దనుపుసూపెడు సుధాధారవోలె
     బహువిలాపంబుల బ్రమయుచైతన్యంబు మరులు గొల్పెడు తీవ్రమాయవోలె
తే. బెనఁగి మరగినకోర్కులఁ బ్రిదులనీక, యాఁగి నిలిపెడు నలఘుదివ్యాజ్ఞవోలెఁ
     దరుణి యింతలోనన నన్నుఁ దనకుఁ దక్క, పిలిచికొనియె నిజాకారకలన నిట్లు.

చ. ఇది సనుయంబు నాకుఁ దరళేక్షణ గైకొన నింతకాలమున్
     గదిరినయార్తి కంతటన గ్రక్కున నుజ్జనసేయువాఁడ న
     భ్యుదయవిధాయి యై యొదవె నొప్పుగ దైవము దీని కిప్డు నే
     ర్పు దనరఁ బౌరుషంబు ననురూపము సేయక యున్కి యొప్పునే.75
క. అని మదిలోఁ జింతించుచు, ననఘుఁడు గనుఁగొనఁగఁ బార్థివాత్మజ యాలోఁ
     గనియెఁ గమలాకు లక్ష్మీ, ఘనఘనరుచిరాంగుఁ బరమకల్యాణు హరిన్.76
క. అతఁ డచ్యుతుఁ డగుట దెలియ, హితకారిణు లయినయువిద లెఱిఁగింపఁగ నీ
     ప్సితము కరస్థం బగుటకు, నతిశయితవిలాసవికసితాలోకన యై.77
చ. తనమునువిన్నయప్పొడవుఁ దత్పరయై యనిశంబు నాత్మలోఁ
     గనుఁగొనునట్టి దన్విభుఁడు గ్రక్కున ముందట వచ్చి నిల్చినం
     గని వనజాక్షి విస్మయముఁ గంపము హర్షము నొండొకంటితో
     బెనఁగొన శీతలాశ్రువులపెందడిఁ దోఁచె ముఖారవిందమున్.78
తే. అఖలసౌందర్యనిధి యైనయాదిపురుషుఁ
     జెందుచూడ్కితో మదిలోనఁ జిక్కుటయును
     బరమయోగనిరూఢాత్ముపగిదిఁ దన్ను
     మఱచెఁ జెలువ చెలులు సూచి వెఱఁగువడఁగ.79
మ. పతిచూపున్ సతిచూడ్కియున్ సమగతిం బ్రస్ఫీతరాగంబు లై
     ధృతివాయం బుయిలోట యొల్లగిల నుద్వేగం బఱన్ హ్రీపరి
     చ్యుతి వాటిల్లఁ బరస్పరాంగముల పై నొండొండ ప్రాఁకంగఁ ద
     చ్చతురావస్థ గృతార్థదంపతులయోజం బొల్చె నిర్వ్యాజతన్.80
వ. అట్టియెడ నక్కాంత యంతర్గతంబున.81
సీ. అఖిలలోకేశ్వరుం డాగమనిర్వాచ్యుం డచ్యుతుఁ డవిచింత్యుఁ డజరుఁ డమరుఁ
     డమరవంద్యుఁ డనింద్యుఁ డనఁగ ననేకావతారధురీణుఁడై దారుణంబు
     లగుచక్రశార్ఙ్గణఖడ్గాదిసాధనముల దైతేయవిదళితోదారకేళి
     నతిశయిల్లెడుదేవుఁ డర్థి దేవకిపట్టి యై బలానుజుఁడు నా నలరుచుండు
తే. నితఁడు వ్రేపల్లె గోపాలనేచ్ఛ సలిపె, నెలమిఁ గాళిందిఁ గాళియాహీంద్రుతలలు
     ద్రొక్కియాడె గోవులకునై యక్కజముగ, నొక్కవ్రేలన తాల్చె నత్యున్నతాద్రి.82
శా. గోపాలీకుచపీడనంబులఁ గడుంగ్రూరత్వముం జూపి పెం
     పేపారెం గరపద్మ మీతనిది లోకైకాపకారిన్ మహా
     కోపుం గంసు వధించి యీతఁడె లసత్కుంభీంద్రనిర్భేదన
     వ్యాపారోగ్రమృగాధిపున్ దొరసె నుద్యద్వీర్యధౌరేయతన్.83

తే. ఇతనివలననె యుగములం దెల్ల సుప్ర, తిష్టమై యాద్యధర్మంబు దేజరిల్లు
     సిరియుఁ గీర్తియు జీవితపరమగతియు, నితనిఁ జెందియ మెఱయ నూర్జితవిభూతి.84
ఉ. ఈతని పాదపద్మముల కే ననిశంబును భక్తియుం బ్రియ
     త్వాతిశయంబు నొప్పఁగ సమంచితసేవ యొనర్తు నంబుద
     స్ఫీతమనోజ్ఞమూ ర్తి కనపేతదయావిభవైకవర్తి కు
     ద్యోతితకీర్తి [31]కీతనికి నుత్తమదాస్యనిరూఢిఁ జిక్కితిన్.85
వ. అని యి ట్లాదేవు దివ్యమహిమ లన్నియు ము న్ననేకవిధంబుల వినికిం జేసి
     యద్దేవి [32]నిశ్చించలం బగునిశ్చయంబున నిరపోహతృష్ణయై నిలిచెఁ గృష్ణుండు
     నట ముందట సంకేతించినవాఁడు గావున నపుడు దన్నుఁ గూడ[33]వచ్చిన బల
     దేవున కొక్కింత యెఱింగించి.86
తే. నెచ్చెలులలోన నున్నయన్నీరజాక్షి, నొదవువేడుక నొయ్యనఁ బొదివిపట్టి
     తెచ్చి రథమున నిడఁగఁ దదీయసఖులు, గలఁగి రచ్చటిసైన్యంబు గలిసె మీఁద.87
క. తరు వొకటి వెఱికి లాంగల, ధరుఁ డుద్ధతిఁ బూంచి హయరథద్విపసుభటో
     త్కరముల మ్రగ్గింపఁగ న, న్నెరవులు వచ్చుటయు మేదినీధరుఁ డలరెన్.88
వ. అమ్మహోత్సాహం బెఱింగి యుగ్రసేనుండు సాత్యకి శతద్యుమ్నుండు విదూ
     రథుండు ప్రసేనజిత్తు మొదలయిన యదువృష్ణిభోజాంధకవీరు లనేకు లనేకరథ
     తురంగదంతావళసహస్రంబులతోడం బన్ని యేతెంచి రామపురస్సరు లై నిలిచి.89
క. ద్వారావతి కరుగుము గ, న్యారత్నముఁ గొనుచు నీవు నలినాక్ష మహా
     వైరుల నందఱ నేమ ని, వారించెద మనుచు దుర్నివారస్ఫూర్తిన్.90
వ. సమరంబునకుం బ్రవర్తిల్లిరి హతశేషు లైన కన్యారక్షకు లరిగి జరాసంధునకు
     రుక్మికి భీష్మకునకుం బౌండ్రకునకు శిశుపాలునకు దంతవక్త్రునకు మఱియునుం
     గల రాజుల కెల్లను బ్రత్యేకంబ రుక్మిణీహరణం బెఱింగించిన విని యద్భుతంబు
     నొంది రప్పు డచ్చటి జనంబులు.91
తే. ఎట్టిలా వెట్టిదీమస మెట్టితెగువ, యెట్టికడిమి కృష్ణుఁడు జగదేకవీరుఁ
     డగుచు నీకూడియున్న ధరాధిపతుల, భంగపఱిచె నిం కే మని పలుకఁగలదు.92

శ్రీకృష్ణుఁడు రుక్మిణీదేవిం గొనిపోవునెడ జరాసంధాదు లెదిరి పోరుట

క. అని రత్తఱి మగధేశ్వరుఁ, డనయము కన లగ్గలింప నౌడు కఱచి కెం
     పున నుగ్రము లగుచూడ్కుల, జననాథుల కిట్టు లనియె [34]సంభ్రాంతమతిన్.93
ఉ. వ్రేనితనూజుఁ డొక్కఁ డతివీర్యసమగ్రుఁడ పోలె వచ్చి నా
     [35]పూనినపూన్కి యంతయును బొం కగునట్లుగఁ జేసె నేను నా

     నేనయు దాడివెట్టెద విశృంఖలతం బ్రతిపక్షువెంట మీ
     రీనెఱికిన్ సహాయపడు టీప్సిరమేనిఁ గడంగుఁ డుక్కునన్.94
ఉ. ద్వారక సొచ్చె నేనియును వారక యుగ్రతఁ గిట్టి పట్టి య
     వ్వారిధిదుర్గ మంతయును వ్రచ్చి విరోధి సబాంధవంబుగాఁ
     బోర వధించి రుక్మిణిఁ బ్రభూతనిభూతి యెలర్పఁ దెంతు నా
     పేరును బెంపు నూకక యవేతత నొందుట కోర్వవచ్చునే.95
వ. అని సంరంభంబున సముత్థితుం డగుటయుఁ బౌండ్రకవాసుదేవుం డతని కడ్డంబు
     వచ్చి.96
తే. ఏను నీబంట నుండంగ నింత యేల, నీకు ధరణీశ ననుఁ బంపు నిలువు మీవు
     శౌరిఁ దునుమాడి తత్తనుశకలకోటి, పంచిపెట్టుదుఁ గాంతారపత్రితతికి.97
చ. ఇరువురు వాసుదేవులు మహిం గలరే యది మాన్పఁ గోరు నా
     కిరవగుకాల మిప్పగిది నింపెసలారఁగ నేఁగుఁదెంచె ను
     ద్ధుర యగు మద్భుజావిభవధుర్యత లోకము మెచ్చఁ జేసెద
     న్నరవర నీమనఃప్రియ మొనర్పంగఁ గాంచుట యల్పకృత్యమే.98
క. అనునెడ శిశుపాలుం డొక, ఘనపరిఘము కేలఁ దాల్చి గ్రక్కున జననా
     థుని యెదుర నిల్చి గర్వం, బెనయ నఖిలనృపులు వినఁగ నిట్లనియెఁ దగన్.99
తే. పెండ్లియాడుదు నని కడుఁ బేర్మితోడ, నిట్లు గైసేసి తుది నింత యెడరునొంది
     యున్న నాక కా కీయొచ్చ మొరుల కేమి, గారణము నిల్వుఁ డెవ్వారుఁ గదలవలదు.100
క. ఈపరిఘ మొక్కటన ద, ర్పోపేతునిఁ గృష్ణుఁ బెఱయదూత్కరము ననిన్
     రూపెడలఁ జేసి నేఁడీ, భూపతి[36]బంట నగు టుర్విఁ బొగ డొందింతున్.101
క. క్షత్రియుఁ డగువాఁ డన్యక, ళత్రంబున కాసపడునె లఘుచరితుఁ డిలన్
     క్షత్రియుఁడు గామి నయ్యదు, గోత్రం డిటు సేసెఁ గాక కుత్సితవిధమున్.102
తే. అదియునుం గాక జనియించు టాదిగాఁగఁ, బసులలోనన పెరిగిన పాలనుండు
     వావి మాలినపశుమార్గవర్తనంబు, నూను టరిదియె యిది యేల యుగ్గడింప.103
వ. ఎల్లవిధంబులఁ గృష్ణు వధియించి భోజకన్యకం గ్రమ్మరించుట నాకుఁ గర్తవ్యం
     బనియె నంత జరాసంధప్రముఖు లగుమహారథులందఱు నారూఢ
     రథులు నుదాత్తకోదండులు నాబద్ధకవచులు నై యాయోధనంబునకు వెడలిన
     నఖిలసైన్యంబులు సన్నద్ధంబు లై భేరీమృదంగశంఖకాహళాదివాదిత్రనాదంబులు
     రోదసీభేదనంబు లై చెలంగం గదలె ని ట్లరిగి వారలు రుక్మిణీహరణపారగుం డై
     దూరంబున ముందటం జను ముకుందునకుఁ బిఱుం దై నడచు యాదవసైన్యం
     బులు గదిసిన.104

మ. బలభద్రాదులు భద్రదంతిచయదృప్యద్వాహశుంభద్రథా
     వళితో భూరిపదాతిసంకులముగా వైరిప్రతానంబు న
     గ్గలికన్ దార్కొని తీవ్రమార్గణము లాకాశంబునం జీఁకటుల్
     గొలుప న్నిల్చి పెనంగి [37]రయ్యహితులన్ ఘోరప్రకారంబులన్.105
క. ఇరుదెస సేనాంగంబులు, బెరపినపెంధూళి యెగసి పేర్చి రవికరో
     త్కరసంరోధనలీలా, పరిణతమై మ్రింగె దిగ్విభాగము లెల్లన్.106
తే. కొంచెమయ్యును యదుసేన కొలఁది కెక్కు, డైసరిపుసైన్యకోటితో నలవుఁజలము
     మిగులఁ బోరి పుట్టించె నిమేషమాత్ర, బహుళకీలాలపూరంబుఁ బ్రథనభూమి.107
క. ఆ నెత్తురు పృథురేణువి, తానము నడఁచుటయు సమ్మద మ్ముత్కటయై
     మానసములు పొంగ నుభయ, సేనల[38]జోదులు గడంగి చెలువారంగన్.108
క. సాత్యకి మగధమహీపతి నత్యుగ్రతఁ దాఁకి యేసె నాఱమ్ముల నౌ
     ద్ధత్యమున నతఁ డాతనిఁ, బ్రత్యాహతుఁ గా నొనర్చె బహుబాణములన్.109
సీ. శక్రదేవుండును నక్రూరుండును దంకవక్త్రునిఁ దలపడి వరుస నొకటఁ
     దొమ్మిదింటను నేసి రమ్మహాబాహుండు బలియుఁడై పదియు నేఁబదియు నమ్ము
     లోలి నయ్యిద్దఱయొడళుల నాటించి యాలో విదూరథుం డఱుముటయును
     నాఱునారసముల నతని నొప్పించెను విపృథుఁ డుగ్రతఁ జేదివిభునిఁ దాఁకి
తే. యేడుతూపులు నిగుడింప నెనిమిదింటఁ, బ్రతిహతునిఁ జేసె నాశిశుపాలుఁ డతని
     వెస గవేషుండు చైద్యుని విశిఖషట్క, తాడితుండుగఁ జేసెఁ గ్రోధమున నతఁడు.110
వ. అన్నియ మార్గణంబుల నాతని నొప్పించె బృహద్దుర్గుం డనువాఁడునుం గదిసి
     యతనిన యేసె నిట్లు మువ్వురు మహారథులతోడం బెనంగుచుండియు నొక్కిం
     తయు లెక్కసేయక యాదమఘోషసుతుండు.111
తే. తోర మగుభల్లమున బృహద్దుర్గుశిరము, దునిమి నాలుగమ్ముల నపృథునిరథంబు
     గుఱ్ఱముల నాలుగింటిని గూల్ప నతఁడు, తొలఁగి చని యెక్కె నాబృహద్దుర్గురథము.112
వ. ఎక్కి క్రమ్మఱం బగతుపైఁ గడంగిన నబ్బలియుండు మఱియు ననేకసాయకం
     బుల నయ్యాదవుదేహం బాచ్ఛాదించి కోదండమౌర్వీటంకారంబులు సకలాతం
     కావహంబు లై పరఁగ సంగరరంగస్థలంబునఁ బరాక్రమవర్తనంబు కీర్తనీయంబుగాఁ
     బ్రవర్తిల్లె మఱియును.113
క. కృతవర్మ పౌండ్రు ముప్పది, శితశరముల నేసె సూతుఁ జెయ్వేదఁగ నొం
     చి తురంగంబుల నస్త్ర, క్షతాంగములు చేసి పడగ ఖండించి వెసన్.114
వ. సింహనాదంబున రోదోవిదారణం బొనర్చి దారుణాకారుం డైన నవ్వీరుండు
     గినిసి హార్టిక్యునివిల్లు నరికి యంగములం దాఱమ్ముల గ్రుచ్చినం దూలియుం

     దాలిమి విడువక యతండు వేఱొక్క శరాసనంబునం బరాక్రమవ్యవహారంబు
     నడుపుచుండె నంత.115
క. కరి నెక్కి సత్యకుం డు, ద్ధుఁరుఁ డయి యంగాధినాథుఁ దొడరి కడిఁది తో
     మరమున వైచిన నతఁ డ, న్నరవరు నపరిమితమార్గణంబులఁ బొదెవెన్.116
వ. సత్యకునకుం దోడ్పడి చిత్రకుండును శ్వఫలుండును వంగబలంబులం జలంబు
     మిగులం గలంచి యాడి యంత నిలువక.117
క. కాళింగుని కరిఘటలం, గ్రాలి కలముఁ దూలనడఁచు ఘనపవనముల
     [39]ట్లాలంబున వాలంపఱఁ, దూలించిన దోర్విలాసదుర్దము లగుచున్.

బలరాముండు సంరంభవిజృంభితుం డై నంగాదిసైన్యంబులఁ దునుమాడుట

ఉ. అత్తఱిఁ దేరు డిగ్గి హరియగ్రజుఁ డుగ్రహలంబు దాల్చి యు
     ద్వృత్తిఁ గడంగి వంగజగతీపతి యొక్కినకుంజరంబుఁ బె
     ల్లొత్తి యుదగ్రకుంభదళనోద్ధతకేళి యొనర్పఁగా నతం
     డత్తల దాఁటి యెంతయు భయాతురుఁ డై తొలఁగంగఁ బాఱినన్.119
క. క్రమ్మఱ రథ మెక్కి బలి, ష్ఠమ్మగుచాపంబుఁ దాల్చి సంకర్షణుఁ డ
     స్త్రములు పఱగించి రణా, గ్రమ్మునఁ బలువుర వధించెఁ [40]గాశ్యులఁ గడిమిన్.120
వ. అమ్ముఖంబున మఱియు నార్వుఱు గారూశుల నూర్వురు మాగధుల గీటడం
     గించె నిట్లు మహోద్దతుం డై మాఱులేక మలసి మగధనాథుదెసకు నడిచిన.121
ఉ. రామునిఁ గాంచి మార్కొని శరత్రితయంబున నొంచె మాగధుం
     డామనుజేంద్రుఁ దీవ్రవిశిఖాష్టకవిద్ధుని జేసి యయ్యదు
     గ్రామణి రత్నమయకాంచనకేతువు ద్రుంచి వైచి యు
     ద్ధామశరాసనంబు త్రుటితంబుగఁ జేసి చెలంగి వెండియున్.122
క. తిలమాత్రశకలములుగా, నిలపైఁ దొరఁగించి రథ మనేకాస్త్రచయం
     బుల నతఁడు విగతచాపుఁడు, దళితరథుఁడు నై మహాగదాభుజుఁ డగుచున్.123
తే. అడరి యమ్ముసలాయుధు నరద మల్ప, కణములుగఁ బడ నడచి వే కదిసి యతని
     వ్రేయుటయు వ్రేటువడి నొచ్చి వివశుఁ డగుచు, నలఘుగద చేతఁ గొని యంతఁ దొలఁగ నుఱికి.124
వ. బలదేవుండు సాత్యకిరథం బెక్కె జరాసంధుండును గదాహస్తుం డై ప్రతి
     వీరులం గనుపుగొట్టుచుండె నప్పు డుభయసైన్యంబులు నొండొంటిం
     సందడి పెనఁకువఁ బెనంగునెడ రథికసముదయంబు లడరి యేసినం బిడుగుల
     వాన దందడిం బడిన పెనుగొండలపగిదిఁ బగిలియు ముఱిసియుఁ ద్రెవ్వియుం
     దొరుఁగు నవయవంబులతో నధికాతంకంబున ఘీంకారఘోరంబుగాఁ

     దెరలు కరులును గరిఘటలు సొచ్చినం గొమ్ములం దగిలియుఁ దొండంబులం
     దొడరియుఁ ద్రొక్కుడునం జిక్కియుఁ జిక్కుజీరువడు తురంగంబులును దురంగ
     ధట్టంబులు నడచిన దట్టంబు లై పడియుం బొడియయ్యునుం జెడియును వికలంబు
     లగు కాల్బలంబులును, ఒక్కొక్కయెడ నెక్కడెక్కడ యని పలాయితులం బురి
     కొలిపి నిలిపి పోరి భూరిశోణితంబులు బహుళపలలంబులు మేదురమేదంబులు
     మేదిని దొరఁగించి మానంబు మానక చచ్చియు నొచ్చియు గెలిచియుఁ గలిత
     నంబు నెఱపు నెఱబిరుదుమగలమగఁటిమిఁ గని కడఁక దెచ్చుకొని మాఱు
     మూఁకల కెదురెదు రై దళితశరీ[41]రు లయినను మధ్యమశూరులు నై (?) కదిసి
     పోట్లాడు పోటరులకైదువు లొకటొకటిం దొడరి క్రంగన నదరులు సెదరం
     బొదలు కఠోరనినాదంబులుం బరస్పరవిదారణదారుణంబు లగువారణంబులం
     దుర్వార విషాణాకర్షణరావంబులు నధికరభసంబున సారథులు పఱప
     నొండొంటిం బెరయు తేరుల బలునొగలతాఁకుమ్రోఁతలుం గరికుంభస్ఫోటన
     కపాలభేదనప్రముఖంబులఁ బ్రచండస్వనంబులును బహుప్రకారంబు లగునస్త్ర
     ప్రహారంబుల పాల్పడి వావిడిచి యఱచు నరనాగతురంగనికరంబుల యాక్రోశ
     నాదంబులు నొండొండ పర్వి శబ్దాంతరంబు నడంచి నభోంతరం బంతయు
     వాచాలంబు గావించె నయ్యనసరంబున.125
తే. సత్యకాత్మజురథ మెక్కి సంగరమున, కట్టు లెడయైన బలదేవుఁ డంతలోన
     గమితఖేదుఁ డై యుగ్రంపుగద యమర్చి, కొనుచుఁ జని తాఁకె మాగధమనుజనాథు.126
క. అతఁడును నభిముఖుఁ డై యు, ద్ధత గద సారించుచుం బ్రతాపసమగ్రుం
     బ్రతివీరుని దలపడియెన్, బ్రతి[42]భయగర్జారవంబు ప్రస్ఫురితముగాన్.127
వ. ఇవ్విధంబునం దలపడి.128
మ. గద లొండొంటిఁ బ్రచండతం జఱచి యుల్కాపాతభీమాగ్నిసం
     పదఁ బుట్టింపఁ బదాగ్రపాతపటుశబ్దంబు ల్మహాహుంకృతు
     ల్పొదలం గూడి నభోదిగంతరపరిస్ఫోటంబు గావింప ను
     న్మదవేగం బెలరార నిద్దఱును సామర్థ్యంబునం బోరఁగన్.129
క. వెరవున సంకర్షణుఁ డ, న్నరనాథునిఁ గదిసి వ్రేసినం బెలుచనఁ బే
     రురమున గద వడుటయుఁ జె, చ్చెర మూర్ఛిలిపడియె నతఁడు చెయ్వేదిమహిన్.130
వ. ఇట్లు జరాసంధుండు మూర్ఛితుండగుటయుఁ దత్సారథి యతని నెత్తి రథంబు
     పై నిడికొని కలనికిఁ దొలంగించె నవ్విధంబు గనుంగొని తదీయసైన్యంబులు
     గలంగి పఱచె సాత్యకి యొక్కదెస నంగవంగకళింగబర్బరులం బఱపె నంత నఖిల
     క్షత్రియానీకంబులు నాకులంబునం జెదరె దొరలునుం దిరిగిరి బలదేవుండును

     సత్యకతనయుండును నహితుల నపజితులం జేసి యార్చి శంఖం బొత్తిన నయ్యులివు
     విని జనార్దనుండు జరాసంధపలాయనంబు నిశ్చయించి తానును బాంచజన్య
     స్వనంబు నలు[43]దెసలఁ నిండించె నంత.131

రుక్మిణీసహోదరుండగు రుక్మి యనువాఁడు శ్రీకృష్ణునితో యుద్ధంబు సేయుట

సీ. ఆమగధేశుఁడు నఖిలరాజన్యులు నమ్మెయి వృష్ణిసైన్యంబు పిఱుఁద
     నరిగెడునప్పుడ యట రుక్మియును రుక్మిణీహృతివార్తకు నిబ్బరంబు
     కోపంబుతో నాజి గోవిందుఁ దునిమి రుక్మిణిఁ గొని రాక యాత్మీయపురము
     సొర నని తండ్రియుఁ జుట్టలు వినఁ బంతమిచ్చి సన్నద్ధుఁడై యేపు మిగులఁ
తే. గదలె గదుఁడు కైశికుఁ డాదిగాఁగఁ గలుగు, యోధముఖ్యులు బహుళసైన్యోద్భటముగ
     నాయితంబయి యాతని ననుసరించి, రనుజహితబంధుకోటియు [44]నడరెఁ గడిమి.132
వ. మఱియు దక్షిణాపథనివాసు లగు నంశుమత్క్రోధ శ్రుతపర్వ వేణుధారి
     ప్రముఖమహీపతులు తమతమవర్గంబులం గొని యతనితో నేకకార్యు లై కడంగి
     రట్లు నడచి నర్మదాతటానుసారి యై యరుగు శౌరిరథం బొక్కటియు దవ్వులం
     గడచి యుద్ధార్థుం డై చని వైదర్భకుమారుండు శూరమాని గావున నందరం
     గని తనతేరు దోలుకొని గోవిందు నెయిదంబోయి యెలుంగెత్తి.133
క. ఓరిపశుపాలపుత్రక, దూరీకృతధర్మ పరవధూదూషక నా
     బారిఁ బడి తెందు వోయెదు, వీరుని నను రుక్మి నెఱుఁగవే వైదర్భున్.134
ఆ. ఉసుఱు గాచికొనఁగ నుల్లంబు గలిగిన, నిపుడ బాల విడిచి యేఁగు మట్లు
     గాక నిలిచితేని గ్రక్కున నిదె తల, గొను మదీయనిశితఘోరశరము.135
క. అని యతఁ [45]డఱువదిశరములు, వనజాక్షునిమీఁద నేయ వడి నాతఁడు నా
     తని నేసె డెబ్బదమ్ముల, ఘనమౌర్వీనినదభరితగగనుం డగుచున్.136
ఉ. కేతువు [46]ద్రుంచి చాపము నికృత్తముగా నొనరించి లీలమై
     సూతునికంఠముం దునిమి చోద్యపుటమ్ముల మేను నొంపఁగా
     నాతురుఁ డైనరుక్మిఁ గని యాతనిమిత్రులు దాక్షిణాత్యు ల
     త్యాతతవేగులై పొదివి రంతటిలోఁ జనుదెంచి మాధవున్.137
వ. ఆ రాజు లొక్కటఁ గూడి యేయు సాయకసహస్రంబులు సహస్రకరుండు తిమి
     రంబు విరియించుకరణి విరియించి విష్ణుండు వేణుధారిపడగ పుడమిం బడనేసి
     యంతట నిలువక తదీయదక్షిణభుజచ్ఛేదనంబు గావించి శ్రుతపర్వుం బటుబాణ
     పంచకంబున నొప్పించిన నతందు కేతుదండం బూఁతగా నొఱిగి యాలోనన
     తెలిసి యతనిపైఁ బెక్కువిశిఖంబులు పరఁగించె మఱియును.138

క. క్రథకైశికు లాదిగఁగల, రథికులు బహురథసముత్కరంబులతో నా
     రథచరణపాణిమీఁదం, బ్రథితోత్సాహమునఁ గదిసి బలువిడి [47]నేయన్.139
ఉ. వారల బాణవర్షములు వారక నిల్పుచుఁ దాను వారి దు
     ర్వారశరవితానపరివారితదేహులఁగా నొనర్చుచున్
     వారిజనాభుఁ [48]డుద్యదనివారితశోణితవారిధారలన్
     వారలఁ దోచె వీరు లగువారలకెల్ల నొకండ మేటియై.140
క. అంతటిలో రుక్మియును ర, థాంతరగతుఁ డై మహారయంబుమెయిన్ దై
     త్యాంతకు మార్కొని విశిఖ, ధ్వాంతము దిగంతరాతతమ్ముగఁ జేసెన్.141
తే. హరియు నతనిపైఁ బెల్లుగ నంపగములు, వఱపే వైదర్భుఁ డచ్యుతు గరుడకేతు
     వొక్కయమ్మున సారథి నొకశరమునఁ, దాఁక నేసి రథ్యంబులఁ దరల నేసె.142
క. కినిసి విభుఁ డహితువిలు ద్రుం, చిన నారుక్మియును గరము శీఘ్రమున శరా
     సనమొం డొక్కటిఁ గైకొని, దనుజధ్వంసకుని గెలువఁ దమకించి వడిన్.143
తే. వరుసమాహేంద్రవాయవ్యవారుణములు, రౌద్రగాంధర్వపైశాచరాక్షసములు
     నైనదివ్యాస్త్రములు వారిజాక్షుమీఁద, వెసఁ బ్రయోగించె జతనంబు విస్తరిల్ల.144
క. అని యన్నియు దామోదరుఁ, డపహితచిత్తుఁ డయి తత్తదస్త్రమ్ముల సం
     ప్రవిహతములు చేసి యతని, యవయవములు బహుళశరచయంబులఁ బొదివెన్.145
వ. పొదివి తోడన కోదండంబు [49]ఖండించి రథ్యంబుల వధియించి సారథిం దెగటార్చి
     రథంబు నఱికిన నతం డొండ్డనంబు నడిదంబునుం గొని తొలంగ నురికి విపక్షుండు
     సపక్షం బగునద్భుతభుజంగంబుభంగి నాభుజంగభంజనుదెసం గవియుదెంచిన.146
ఆ. పలుక వగుల నేసి యలుఁగు దుత్తునియలు, గా నొనర్చి శౌరి గనలు మిగుల
     నారసములు మూఁటఁ బేరురం బుఱక వ్ర, చ్చినఁ గరంబు నొచ్చి చేష్టదక్కి.147
వ. రుక్మి ధరణీతలంబున ముడింగి పడియె నట్లైన యతనిం జూచి.148
క. బలమెల్లఁ జెదరి నాలుగు, వలఁకులఁ జెడిపోయే దొరలు వడి నాఁబోతుం
     బులిగొనినఁ గలుగుపసుల, ట్లలఘుభ్రమఁ బొంది యొదిఁగి రచ్చటనచటన్.149
క. శరదలితదేహుఁడై భువిఁ, బొరలుచు నున్నతనితోడఁబుట్టువుఁ గని ని
     ర్భరశోకంబున రుక్మిణి, యరదముపై వ్రాల యార్తి నాక్రందించెన్.150

శ్రీకృష్ణుఁడు రుక్మి మూర్ఛితుం జేసి రుక్మిణిం గొని ద్వారకకు వచ్చుట

వ. వృష్ణిపుంగవుండు నయ్యంగనం గౌఁగలించి మెత్తన యెత్తి యాశ్వాసించి రుక్మికి
     నభయం బిచ్చి రథంబు గ్రమ్మఱింప సారథి నాజ్ఞాపించి ప్రియకుం బ్రియం బొన
     ర్చినవాఁడై.151

క. సరసము లగునుచితవచో, విరచనములఁ దెరువునందు వెలఁదిఁ బ్రణయసుం
     దరుఁ డయి మఱియును దేర్చుచు, నరిగెఁ బురికిఁ బ్రమదనిర్భరాత్మకుఁ డగుచున్.152
వ. యాదవులును మగధరాజప్రముఖుల జయించి రామసాత్యకుల మున్నిడికొని
     యార్పులు పెడబొబ్బలు విజయతూర్యంబులమ్రోఁతలు నొక్కటి యై యెదు
     ర్కొను పౌరుల హర్ష సంకలితనినాదంబులతో నెదుర్కొని కలయం బురప్రవేశం
     బొనర్చి రట కైటభారి గడచిపోయిన యనంతరంబ శ్రుతపర్వుండు రుక్మిం దన
     యరదంబుపై నిడికొని చనియె నతండును రుక్మిణిం గ్రమ్మఱింపక కుండినపురంబు
     సొర నని ప్రతిన చేసినవాఁడు గావున నట్లు భగ్నప్రతిజ్ఞుం డగుటం దనపేర భోజ
     కటకం బను నగరంబు గావించి యందు వసియించె మగధపతియును మూర్ఛదేఱి
     చెదరిన సైన్యంబులం గూర్చుకొని విదర్భకటకవాసులచేత నగవులకుం బాలైన
     శిశుపాలుం దోడ్కొని తనదేశంబునకుం బోయె నంత నక్కడ.153
చ. యదుకులవృద్ధు లందఱును నానకదుందుభి లోనుఁగాఁ బ్రియం
     బొదవఁగ శౌరి పెండ్లికి ముహూర్తము మేలుగఁ బెట్టి చుట్టపుం
     బదువును దక్కునుం గలుగుపార్థివకోటినిఁ బిల్వఁ బంచి యొ
     ప్పిదము లొనర్పఁ బంచిరి గభీరవిభూతి యెలర్ప వీటికిన్.154
వ. ఇట్లు పనుచుటయు రాచనగరునను నగరంబునందును.155
సీ. మణికుడ్యములు కుంకుమంబునఁ జెలువొందఁ దొడసిరి మెఱుఁగులు దుఱఁగలింపఁ
     గాంచనస్తంభము ల్గవుసెనల్ పుచ్చి [50]రింపారుశిల్పము లెల్ల నచ్చుపడఁగ
     మృదులకుట్టిమముల మృగమదసలిలంబు [51]లలికిరి చూడ్కులు నొలసి జాఱ
     ముక్తాఫలంబుల మ్రుగ్గులు పెట్టిరి పలుదెఱంగులరచనలు దలిర్పఁ
తే. గ్రముకకదళికాకమనీయకాండసమితిఁ, జేర్చే యభినవాశ్వద్ధవిచిత్రచూత
     పల్లవంబులఁ దోరణప్రతతు లమరఁ, గట్టియెత్తిరి చీనాంశుకధ్వజములు.156
మ. అతులైశ్వర్యసమేతు లై వెలయుసౌహార్దంబునన్ బంధుభూ
     [52]పతు లుద్దామరథద్విపాశ్వములతో భవ్యోజ్జ్వలాలంకృతుల్
     వితతశ్రీలఁ దలిర్ప వచ్చిరి మహావీరుం ద్రిలోకార్చ్యు న
     చ్యుతుఁ గల్యాణవిధానవేళఁ బ్రియముల్ సొంపార నర్చింపగన్.157
క. మును లేతెంచిరి చిత్తము, లనురాగరసాబ్ధి నోలలాడఁగఁ దపముల్
     గనియంగఁబండెఁ దమకని, యనుపమభద్రు, బలభద్రుననుజునిఁ జూడన్.158
తే. వసుధఁ గలవిప్రభూవరవైశ్యశూద్ర, వర్ణముఖ్యులుఁ దక్కినవారు నర్థి
     నరుగుదెంచిరి హరివివాహాభిజాత, మంగళం బనుమోదింప మనము లలరి.159

క. అందఱకు నుచితసత్కృతు, లొందఁగ నొనరించెఁ బ్రభునియోగంబున న
     స్పందమతియుతుఁడు సత్యక, నందనుఁ డభినందనీయనైపుణయుక్తిన్.160
వ. తదనంతరంబ లగ్నదివసం [53]బుదితం బగుటయు.161
సీ. ఆపూర్ణవర్ణసమర్థస్వరంబుల నలరుభూసురులయధ్యయనరవము
     మధురసల్లాపసమ్మదరసోత్సవమునఁ బొదలు రాజులవచోభ్యుదితరవము
     లలితవిలాసలీలాఖేలలను గ్రోలుచపలలోచనలభూషణరవంబు
     జన్యజనారూఢచతురంబు లగుహస్తిహకులబృంహితహేషితారవంబుఁ
తే. గలసి కల్యాణవాదిత్రకలితగేయ, రవముతో సాంద్రమై మనోరంజనముగ
     దెసలు నిండించి దివమున దేవదుందు, భిప్రణాదంబు లొక్కట బెరసి చెలఁగ.162
వ. అంత నత్యంతమనోహరానేకసంస్కారపరిణతం బగుపరిణయమండపంబునం గమ
     నీయకాంచనస్తంభచతుష్టయసంభృతయు మాణిక్యఖచితవిచిత్రవితానవికసితయు
     మంగళరంగవల్లీరచనారుచిరయుఁ జతురంతనిబద్ద[54]మరకతతోరణమణిదర్పణాభి
     రామయు సువర్ణపాలికాసమర్పితకుసుమాంకురాలంకృతయు నుపాంతవిన్యస్త
     రత్నదీపికాశోభితయు నగుభద్రవేదికయందుఁ బురోహితుం డగ్నిముఖంబు చేసి
     వేల్వ నుగ్రసేన వసుదేవ బలదేవ ప్రభృతి గురువృద్ధవరులును బ్రసిద్ధతపస్వి
     [55]పుంగవులును బలసి యుండ వాసుదేవుండు తదనుజ్ఞాపూర్వకంబుగా శుభ
     ముహూర్తంబున.

రుక్మిణీకల్యాణమహోత్సవప్రకారము

సీ. సౌకుమార్యమునకు సౌకుమార్యస్ఫూర్తి గలిగించు[56]నవయవకల్పనంబు
     సౌందర్యమునకును సౌందర్యసంపద యొదవించులావణ్యయోగరుచియు
     సౌభాగ్యమునకును సౌభాగ్యవిభవంబు [57]గావించు సరసరేఖాశ్రమంబు
     సౌశీల్యమునకును సౌశీల్య [58]కలనంబు నందించునాభిజాత్యస్థితియును
తే. దనకు నైజంబులుగ నొప్పుధన్య ref>జన్మ</ref>జన్య, రుక్మిణీదేవి నానందరుచిరమూర్తి
     బాణిశంకజగ్రహణకల్యాణలీలఁ, బ్రీతి గడలొత్తుచుండఁ బరిగ్రహించె.163
క. లలిఁ బుణ్యాంగన లొలికెడు, లలితాక్షతములు వియత్తలమున నమరకాం
     తలు గురియుకుసుమవర్షం, బులు నొక్కట కృష్ణు[59]మేను భూషించె సరిన్.164
తే. సురలయిచ్చుదీవనలు భూసురులయిచ్చు, దీవనలుఁ గూడి యద్భుతోదీర్ణలీల
     జనులయాకర్ణనంబు లుత్సవమునొంద, బరఁగె [60]నభినవార్థోదాత్తపదము లగుచు.165
వ. ఇవ్విధంబునఁ గృతవివాహుం డై గోవిందుండు జననీజనకులకు వంశవృద్ధులకు
     నమస్కరించి వారి వాగ్విశేషంబుల నభినందితుం డై యనేకబ్రాహ్మణోత్తములకు

     నెనిమిదివేలు రథంబులుఁ బదనొకండువేలు నేనూరు గజంబులు నపరిమిత
     హయంబులు నసంఖ్యగోగణంబులు దానంబుగా నిచ్చి భూషణసంచయంబులు
     మణికాంచనరజతరాసులును వాసోవిభవంబులును దాసదాసీసముదయంబులు
     నొసంగి సూతమాగధగాయకనర్తకవందివైతాళికాదుల కపరిమికధనత్యాగంబుల
     ననురాగంబు గావించి సకలజనంబుల నభీష్టాన్నపానంబులఁ దృప్తులం జేసి
     మఱియును.167
క. కుడువుఁడు కట్టుఁడు కైకొని, యడుగుఁడు మీవలసినట్టి యర్థము లస్థుల్
     గడమ యొకింతయు వల దని, యెడపక ఘోషింషఁ బనిచె నెల్లెడ నెలమిన్.168
వ. వివాహదివసంబు లన్నియు నివ్విధంబునన కడచినం జతుర్ధకర్మానంతరంబున.169
తే. కట్ట నిప్పించుకొని తానుఁ గట్ట నిచ్చి, చుట్టములకును [61]లాఁతిరాజులకుఁ గరము
     నెయ్యమును గారవంబును నెఱయఁ బ్రీతి, సాలఁ గలిగించి తగవీడుకో లొనర్చె.170
క. మునుల నతిభక్తియోగం, బున నర్చనలను ముదంబుఁ బొందించి తదా
     నననిర్గతవాక్పూజల, జనితానందుఁ డయి ప్రియ మెసఁగ వీడ్కొలిపెన్.171
వ. తక్కినజనంబులును సముచితంబు లగుసత్కృతులం దదీయాదరంబుఁ గని ప్రమో
     దించి నిజనివాసంబుల కరిగిరి పదంపడి.172
మ. అనురాగంబులు ధన్యతన్ బొరయ నెయ్యంబుల్ ప్రియంబంద నె
     మ్మనముల్ గోర్కులు చూఱలాడఁ దనియన్ మాధుర్యముల్ ధుర్యతం
     గని జృంభింపఁగ సోయగంబులు సముత్కర్షంబు వాటింప న
     వ్వనజాక్షుండు విదర్భరాజసుతయున్ వర్తిల్లి రిచ్ఛాగతిన్.173
ఉ. చారువిహారసౌధముల సాగరతీరవనాంతరంబులన్
     భూరిమనోజ్ఞరైవతకభూధరకందరమందిరంబులన్
     హారీసరస్సమీపలతికావసధంబుల నమ్మృగాక్షి నిం
     పారఁగఁ దార్చి కేళిరతుఁ డయ్యె ముకుందుఁ డమందలోలతన్.174
సీ. రాగపల్లవముల [62]రమ్యలై యితరేతరాలోకలతలు పై నలమికొనఁగ
     నిష్టార్థరచనలయిక్కలై యన్యోన్యసల్లాపములు సుధాస్యందములుగ
     రోమాంచలీలలప్రోవులై యొండొరువులమూర్తు లాశ్లేషకలన సొగియఁ
     గ్రామ్యపూరములకళికలై సరిఁ బరస్పరచేష్ట లానందపదవి గొనఁగఁ
తే. గ్రమపరీపాక[63]భరమునఁ గలసి మెలసి, మనసు లొండొంటిమమతల మరగి [64]కరఁగ
     సతియుఁ బతియునుఁ బొలివోనిసౌఖ్యలహరిఁ, జిక్కి రనుభావనూత్నవిచిత్రతతుల.175
వ. రుక్మిణీవివాహానంతరంబ క్రమంబునఁ గృష్ణునకు మిత్రవిందయు జాంబవతియు
     సత్యభామయుఁ గాళిందియు లక్షణయు సుదంతయు నన నేడ్వురు భార్య లైరి

     వారియందు నతండు తుల్యభోగవిభాసి యయ్యె నిట్లుండ ననతిచిరం బగు
     కాలంబున.176
క. పురుషోత్తము నగ్రమహిషి, ధరియించె నితాంతసౌమ్యతానిత్యమనో
     హరమగుగర్భము పౌరం, దరి యగుదిశ తుహినధాము ధరియించుక్రియన్.177
మ. నడు మొయ్యొయ్యనతోర మయ్యె దనరె న్నాభీతలం బంగముల్
     జడనొందెన్ బలిసెం గుచద్వయము వెల్లంబారె మైదీఁగ యు
     గ్గడువై కోర్కులు మూఁగె వస్తువులపైఁ గన్లోనలం దంద్ర యె
     క్కుడు దోఁచెం గమనీయదౌహృదపరిక్షోభంబునం బొల్తికిన్.178
క. తనపేర్మికి ననుగుణముగ, వనరుహలోచనుఁడు పుంసవనసీమంతా
     ద్యనుపమకల్యాణంబులు, [65]వొనరిచి సమ్మోదవిభవపూర్ణత నొప్పెన్.179
వ. తదనంతరంబ.180
క. మును పురహరుఫాలానల, మునఁ జిక్కి యనంగ భావమున బొందినయ
     మ్మనసిజు మాధవవల్లభ, గనియెం బ్రద్యుమ్నునాముఁ గాదిలితనయున్.181
తే. జాతమాత్రుఁ డైనశౌరిసూనునకు నా, కాశవాణి సుప్రకాశభంగిఁ
     జేసె నామ మిటు ప్రసిద్ధిగాఁ బుట్టిన, యక్కుమారుఁ డుజ్జ్వలాంగుఁ డగుచు.182
వ. సూతికాతల్పంబున జననిముందటం దేజరిల్లుచుండ సప్తమనిశానిశీథకాలంబునఁ
     గాలవశంబున శంబరుం డనుదానవుండు దనకు మృత్యు వగు నని యాదేశంబు
     గలదు గావునం జనుదెంచి బాలునిం బట్టి యెత్తికొనిపోయి.183
క. వననిధిలో వైచిన నొక, ఘనమీనము మ్రింగె జాలికప్రవరుఁ డొకం
     డనుపమజాలాకర్షణ, మున నజ్జలచరముఁ బట్టి ముద మెసలారన్.184
వ. అయ్యసురపతినివాసం బైన యిక్షుమతీపురంబువాఁడు గావునఁ దదీయవల్లభ
     యగు మాయావతికి గానుకగాఁ గొనిపోయి యిచ్చిన.185
తే. తాన యద్దేవి తత్కు క్షిదళన మొయ్యఁ, జేసి యసమానసౌందర్యచిత్రమూర్తి
     నర్భకునిఁ గాంచి సమ్మోద మతిశయిల్ల, నర్థిఁ గైకొని గారవం బారఁ బెనిచె.186
వ. శంబకుండు ననపత్యుం డగుట నంగనచేత నంగీకృతం బైన కృతకాపత్యంబు కలి
     మికి సమ్మతించి యుండె నంత.187
తే. అసురకులమునఁ గలుగు మాయాప్రపంచ, మఖిలమును నెఱిఁగించి మృగాయతాక్షి
     యక్కుమారుని సకలవిద్యలఁ బ్రవీణుఁ, గా నొనర్చెఁ బ్రేమార్ద్రహృత్కమల యగుచు.188
క. క్రమమున శైశవము విము, క్తముగా సుకుమారసుభగతారుణ్యమనో
     రమదశ నొందె నృపాత్మజుఁ డమృతాంశుఁడు పూర్ణదేహుఁడై యొప్పుక్రియన్.189
సీ. చెలువంబు లగునెఱ్ఱ సెరలవిశాలనిర్మలనేత్రములు నవశ్మశ్రురాజి
     కమనీయ మగుముఖకమలంబు గంబుసమగ్రీవయును వృత్తమధ్యమంబు

     నిడుదలై యెంతయు బెడఁ గగుబాహులు పొడవైనమూఁపులు వెడఁదయురము
     గర మొప్పు సింహచంక్రమణరేఖయు వచోగాంభీర్యమాధుర్యగౌరవములు
తే. దనరు త్రైలోక్యమోహనోదాత్తమూర్తిఁ, బ్రకటపౌరుషోదారవిభ్రాజమాను
     నతనిఁ గామించి నానాఁటి కంతరంగ, మెలయురాగంబుకతన నాకులత నొంద.190
వ. అమ్మాయావతి పలుకులం జూపులం దనకోర్కి బయలుపఱచినం బ్రకటవివేక
     విద్యావిదుం డగు నయ్యుదాత్తచిత్తుం డత్తెరంగునకు సంశయించి యొక్కనాఁ
     డేకాంతంబున నయ్యింతి నుపలక్షించి.191
తే. తల్లి వీవు పుత్రుఁడ నేను దగునె మాతృ, భావ మురివినా నీకుఁ బాపచేష్ట
     యిట్లు సూపంగ నక్కటా యేమి చెప్పఁ, గామినీజాతి లోకైకకష్ట గాదె.192
క. నీతలం పెయ్యది యే మని, యీతుచ్ఛపుఁబనికి దొడఁగి తింతయుఁ దెలియ
     న్నాతీ చెపుమా యనవుడు, నాతరుణి తదాననార్చితాలోలన యై.193
సీ. అనఘ మీతండ్రి మహానుభావుఁడు యదువంశవర్ధనుఁ డగు వాసుదేవుఁ
     డఖిలపురంధ్రీజనాభ్యర్చ్య కల్యాణి తల్లి రుక్మిణి మహోదారతేజు
     నినుఁ గన్న పురిటిలోనన శంబరుఁడు దెచ్చి యుదధిలో వైచిన నొకక్రమమున
     నిటు చేర్చె దైవ మే నిందాఁకఁ బ్రోచితి నన్యులయం దిట్టి యసమకాంతి
తే. నెసఁగుమూర్తులు వుట్టునే యిట్టిపట్టిఁ, బాసి వగఁ బొక్కుచున్నది పంకజాక్షి
     యరుగు మీప్రొద్ద జననిఁ గృతార్థఁ జేయు, మాత్మదర్శనచిత్రోత్సవాగమమున.194
క. నీరూపు చూచి వలచితిఁ, గారుణికాగ్రణివి నన్నుఁ గైకొనుము పరీ
     హారంబునకుం గారణ, మీరూపున లేదు నిక్క మిది గుణదుహితా.195
వ. శంబరుని నేను మాయావిమోహితుం జేసి మిథ్యాకళత్రభావంబున కాలంబు
     గడపితి నివ్విరోధిని గాలగోచరుంగాఁ జూపు మని తెలిపినం బ్రద్యుమ్నుండు
     తద్వచనబోధితుం డై కలుషించి యమ్మహాసుకు నాహవంబునకు నాహ్వానంబు
     సేయుటయు.196

ప్రద్యుమ్నుండు శంబరాసురుం జంపి దేవీసమేతముగా ద్వారావతికి వచ్చుట

మ. అలుకం బేర్చి సురారి యాతని నుదగ్రాకారుఁ డై తాఁకినం
     గలహం బిద్దఱకుం బ్రగాఢకఠినాక్రాంతిం బ్రవర్తిల్లె నం
     దలఘుం డయ్యదురాజసూతి నిజవిద్యా[66]వ్యాప్తి మై సప్తమా
     యల నోలిం బ్రసరించి యెన్మిదవుమాయం గూల్చె విద్వేషునిన్.197
వ. ఇట్లు శంబరుం గాలగోచరుం జేసి కుమారుండు మాయావతిం గై కొని మాయా
     బలంబున నంతరిక్షంబున దైత్యాంతకుపురంబునకుం జని రాజాంతఃపురంబున నవ
     తీర్ణుం డగుటయు.198

ఆ. [67]వెఱుఁగుపాటుతోడి వెఱపు నాకస్మిక, సమ్మదంబు మానసంబు నొలయఁ
     గృష్ణభామలెల్లఁ దృష్ణాతిలోలేక్ష, ణములఁ గ్రోలి రతని నవ్యమూర్తి.199
వ. రుక్మిణియు నద్భుతాకాంతస్వాంత యై నిజాంతర్గతంబున.200
చ. అతులితయౌవనోదయుఁడు హారిసలక్షణమార్తి యీతఁ డి
     య్యతివయుఁ దాను నిచ్చటికి నాదటమైఁ జను దెంచు టేమియో
     యితనిఁ దనూజుఁగాఁ గనినయింతి జగంబున నెందుఁ దాన యూ
     ర్జిత యగు భాగ్యసంపదఁ బ్రసిద్ధివహింపక యున్నె యున్నతిన్.201
తే. అకట ప్రద్యుమ్నుఁ డాభంగి నవధిఁబోయె, సదయుఁ డైన[68]విధాతచే నసురచెయిది
     ననుపమాకారుఁ డవికారుఁ డట్టిపట్టి, [69]బ్రదికెనే నింతకును నింతబంటు గాఁడె.202
మ. [70]ఇతఁ డాపాపనియట్ల వెండ్రుకలు మో మింపారుకన్ను ల్జగ
     న్నుతుఁ డబ్జాక్షునిపోల్కి కేలు నురము న్మూర్ధంబు మోమోటకుం
     బ్రతి యే మే నొకదైవసంఘటన మైఁ బ్రాణవ్యపాయంబు లే
     క తగం బుత్రుఁడు వచ్చెనొక్కొ నను మాంగల్యోజ్జ్వలన్ జేయఁగన్.203
వ. అని తలంచుచుండఁ బుండరీకాక్షుండును [71]బ్రమోదవికృతాక్షుం డగుచుం
     బుత్రు నాలోకించె నాలోనన నారదుండు చనుదెంచి నారాయణునకు నక్కు
     మారు జన్మకారణంబును శంబరవధావసానం బగు తచ్చరితంబును నెఱింగించిన
     నమ్మునీంద్రుని మున్నిడుకొని కృష్ణుండు రుక్మిణిపాలి కరుగుదెంచి.204
మ. ఉవిచా యీతఁడు నీతనూజుఁ డగు ప్రద్యుమ్నుండు దుర్దాంతచా
     ప[72]విశేషోజ్జ్వలహస్తుఁ డాహవమునం బ్రత్యర్థి నత్యుగ్రదా
     నవు నాశంబరుఁ గూల్చి ఘోర మగ తన్మాయాచయం బంతయుం
     బ్రవరుండై హరియించి వచ్చె నెలమిన్ భార్యాసమేతంబుగన్.205
క. ఈయమ నీకోడలు విను, మాయావతి యనఁగ భువనమాన్యచరిత్ర
     శ్రీయుత యైనది సుమన, స్సాయకునకుఁ దా నభీష్టసహచరి మొదలన్.206
వ. అమ్మకరకేతనుండు భూతేశ్వరునయనజ్వాలాకలాపంబున నాపన్నుండైన నిన్నాతి
     శంబరువశంబునం జిక్కి తన మాయామయం బగు రూపం బొక్కటి వాని కను
     భవగోచరంబు సేసి తాను బొందక యనిందితం బగు చందంబున నింతగాలంబు
     నడపి జన్మాంతరగతుం డగు నిజభర్తం గ్రమ్మఱ భజియించె నిప్పుణ్యశీల నాత్మ
     గృహాలంకారంబుగాఁ గైకొను మని చెప్పిన.207
క. విని సమ్మదంబు చిత్తం, బునఁ గడలుకొనంగఁ బ్రణతమూర్తి యగు తనూ

     జుని [73]గౌఁగిలించె రుక్మిణి, యనుమోదము నొంది రచ్యుతాంగన లెల్లన్. 208
వ. ఇట్లు కుమారుండు ప్రత్యాగతుం డైన యమ్మహోత్సవం బంతఃపురంబున ననేక
     ప్రకారం బై పరఁగి సర్వజనంబులం బ్రహర్షభరితులం గావించె నని చెప్పి వైశం
     పాయనుండు వెండియు జనమేజయున కి ట్లనియె.209
క. విను ప్రద్యుమ్నుఁడు రుక్మిణి, కనఘా తొలుపట్టిఁ గాఁగ నాత్మజులు క్రమం
     బునఁ దొమ్మండ్రు [74]మఱియు సం, జనితు లయిరి కన్య [75]యొకత జనియించెఁ దుదిన్.210
వ. వారలు చారుధేష్ణుండును సుధేష్ణుండును సుషేణుండును జారుగుప్తుండును జారు
     వాహనుండును జారువిందుండును జారుదద్రుండును జారుగర్భుండును జారుం
     డును [76]జారుమతియు ననఁ దదీయనామంబులు దక్కిన దేవులయందును భానుం
     డును భానువిందుండు సంగ్రామజిత్తు దీప్తిమంతుండు వృకుండు మొదలుగాఁ
     బెక్కండ్రు గొడుకులును మిత్రవతీప్రముఖ లగు కన్నియలును జనియించిరి.211
క. విను ప్రద్యుమ్నుఁడు జనియిం, చిన నెలలోపలన పుణ్యశీలుఁడు పుత్రుం
     డనుపమశౌర్యుఁడు సాంబుఁడు, జనియించెను జాంబవతికి జగదభినుతుఁ డై.212
తే. శైశవమునంద కరము వాత్సల్య మెసఁగ, నక్కుమారు నాలధ్వజుఁ డాత్మతనయుఁ
     గాఁగఁ గైకొని పెనిచి విఖ్యాతుఁ జేసె, హయగజారోహశస్త్రాస్త్రచయములందు.213
వ. ఆబలభద్రునకు రేవతీదేవియందు నిశాతుండు నుల్ముకుండు ననుపుత్రులు మహాస
     త్త్వులు జనియించి రిట్లు పుత్రవంతుం డై యదుకులైకకాంతుం డనంతగజతురగ
     సంకీర్ణయు నపరిమితవస్తుపరిపూర్ణయు నగు రాజలక్ష్మి ననన్యసాధారణసామ
     ర్థ్యంబున ననుభవించుచుండె నట్టి సమయంబున.214

ప్రద్యుమ్నుండు రుక్మికూఁతు రగు శుభాంగిని స్వయంవరంబున వరించి వివాహం బగుట

సీ. అట విదర్భాధీశుఁ డగు రుక్మి దనపుత్రి యైన శుభాంగి నన్వర్థనామ
     నసమయౌవనసముల్ల[77]సన యై యుండంగఁ గనుఁగొని యనురూపకాంతుఁ డింతి
     కొదవెడుతెఱఁ గాత్మ నూహించి మహితస్వయంవరోత్సవము సమ్యగ్విభూతి
     నాచరింపంగఁ దదాహూతు లై యుర్విఁ గలరాజు లెల్ల నగ్గలపువేడ్క
తే. నంచితైశ్వర్యలీల నింపారభోజ, పురికిఁ బోవఁగ రుక్మిణీవరసుతుండు
     నుచితపరివారసహితుఁ డై యుల్లమలర, నరిగెఁ దల్లియుఁ దండ్రియు ననుమతింప.215
వ. ఇవ్విధంబున సముపాగతు లైన భూపతులం బ్రభూతసంభావనలం బ్రముదితులం
     గావించి శుభదినంబున రుక్మి యమ్మహోత్సవంబు ప్రవర్తించిన.216
మ. మును గోవిందసుతుండు దానునుఁ బ్రియంబు ల్మీఱ నన్యోన్యశో
     భనరూ[78]పోరుగుణావళు ల్వినికిఁ దో బద్ధానురాగాత్ము లై
     యునికిం గన్నియ యత్తఱిం దగిలి సర్వర్వీశులుం జూడ నా
     తనిఁ బ్రీతిన్ వరియించెఁ గోర్కులు కృతార్థత్వంబునుం బొందఁగన్.217

క. ఈరూపవంతుఁ గోరుట, యీ[79]రమణీకి నొప్పు నీమృగేక్షణమీఁదం
     గోరిక యితనిక తగె నని, భోరన నయ్యుత్సవమునఁ బొగడిరి జనముల్.218
వ. ఇట్లు నిజమనోరథానుకూల యగు నప్పుణ్యశీలం గైకొని ప్రద్యుమ్నకుమా
     రుండు సకలరాజన్యకుమారులుఁ దమతమపురంబుల కరుగఁ దానును దనపురం
     బున కరుగుదెంచి కరగ్రహణానందం బనుభవించి.219
చ. అనుపమయౌవనంబులు శుభాకృతులు న్విలసద్గుణంబులుం
     దనరు మనోరథంబులును దద్దయు ధన్యత నొంద నిత్యమో
     హనరతి నిద్దఱుం గలసియాడఁగ నమ్మదిరాక్షి గర్భశో
     భనము వహించి కాంచె సుతుఁ బ్రాగ్దిశ భానునిఁ గాంచు కైవడిన్.220
వ. అక్కుమారుం డనిరుద్ధుం డనుపేరం బ్రసిద్ధుం డై వేదంబులు ధనుర్వేదసహితం
     బులు గా నధిగమించి సకలశాస్త్రంబులను సమస్తశస్త్రాస్త్రంబులం బ్రశస్తినొంది
     గజతురగస్యందనారోహణములందు నసమానరూఢి వహించి యెలప్రాయం
     బున నెలరారు సమయంబున.221
ఆ. రుక్మవతి యనంగ రుచిరాంగి రుక్మికిఁ, బౌత్రి యైన కన్యఁ బంకజాక్షు
     నాజ్ఞ నడిగిపుచ్చె నక్కుమారునకుఁ బ్ర, ద్యుమ్నుఁ డాత్మజనని యుల్లసిల్ల.222
క. హరిదిక్కున మునుగల మ, చ్చర మించుక విడిచి మిగుల సంప్రీతిపుర
     స్పరముగ నీ నొడఁబడియెను, హరిపౌత్రున కాత్మపౌత్రి నన్నరపతియున్.223
వ. ఆ వ్వివాహోత్సవంబున రుక్మిణీసహితుం డై యనిరుద్ధుం దోడ్కొని వాసు
     దేవుండు బలదేవాదియదుముఖ్యులుం బుత్రవర్గంబును దోడ రా నుచిత
     సైన్యంబు సమకట్టి సమధికవిభవంబున విదర్భనగరంబున కరిగి వైదర్భుండు
     రావింప నతనిచుట్టంబు లగు రాజు లనేకులు వచ్చి రంతఁ బ్రశస్తతిథినక్షత్రం
     బగు దివసంబునందు శుభముహూర్తంబునఁ గుమారుండు కుమారిఁ బాణి
     గ్రహణం బొనర్చిన.224
తే. కుడిచి కట్టి చుట్టము లెల్లఁ గూడి కలసి, బెలసి పెండ్లిదినంబులు పెంపు మిగుల
     నిచ్చ నాడుచుండిరి యాదవేశ్వరుండు, నావిదర్భాధిపతియును నాత్మ లలర.225
వ. అంత వేణుధారియు [80]శ్రుతపర్వుం, గుడును నంశుమంతుండును జయత్సేనుండును
     మొదలయిన దాక్షిణాత్యులు తమలో విచారించి రుక్మిపాలికిం జని యేకాంతం
     బున నతని కి ట్లనిరి.226
ఉ. నెత్తముమీఁదఁ గౌతుకము నిర్భర మై జనియించె నిప్డు మా
     చిత్తములందు నీవు గడుఁ జిత్రపుజూదరి వాత్మలోన ను
     ద్వృత్తుఁడు సీరపాణి కడువేడుకకాఁ డతనిన్ జయింతు మే
     మిత్తఱి మ మ్మొకింత గదియింపు మొనర్పుము [81]తత్ప్రసంగమున్.227

రుక్మి బలరామునితో జూదమాడ నారంభించుట

వ. అతండు నిర్జితుం డగుట మనకు గీర్తికరం బనిన యారంతుకాండ్రకఱపులు విని
     రుక్మి వారునుం దానును మనోజ్ఞగంధమాల్యాభరణభూషితు లై కాంచనస్తంభ
     శతసంభృతంబును వితతవితానవిలసితంబును రుచిరచందనోదకసిక్తంబును ముక్తా
     ఫలప్రాలంబమాలికంబును నిరంతరకుసుమోపహారమండితంబును నగు సభామండ
     పంబునఁ బసిండిపలుకయుఁ బాచికలును నమర్చి.228
క. ద్యూతమునకు బలభద్రునిఁ, బ్రీతిసమేతంబు గాఁగఁ బిలిపించుటయున్
     ద్యూతాధికకుతుకుం డై, యాతఁడు దత్కితవగోష్ఠికై యేతెంచెన్.229
వ. దాక్షిణాత్యు లందఱుంగూడి రుక్మి నతనితో నాడుటకు నియోగించి విశదముక్తా
     మణిబహుళహేమరాసులు పణంబులుగా చెప్పించి జూదంబునకుం దొడంగి
     రందు బలదేవుండు.230
తే. పసిఁడిమాడలు పదివేలు పణము గాఁగ, నొడ్డె నొడ్డిన నాడి యత్యుద్ధతుండు
     గెలిచె వైదర్భుఁ డతని నయ్యలఘుచిత్తుఁ, డోడె నంతియ పసిఁడియ యొడ్డి మఱియు.231
క. ఆపలకయు రుక్మి సము, ద్దీపితుఁ డై గెలిచె నలుక దీపింపఁ జలం
     బేపార నిట్లు పలుమఱు, నోపిగ నాడుచును బలఁడ యోడుచు వచ్చెన్.232
వ. తదనంతరంబ కోటిసువర్ణంబులు పణంబు సేసి యాడి రౌహిణేయుండు జయంబు
     నొందిన నవ్విపక్షుం డక్షధూర్తుండు గావునం గడవ నార్చి.233
క. బలభద్రు నక్షవిద్యా, బలవిరహితు దుర్జయప్రబలసత్త్వధనున్
     గెలిచి బహుసంఖ్యహేమా, వళు లివె యేఁగొంటి ననుచు వడిఁ బలుకుటయున్.234
వ. అప్పలుకులకుం దోడ్పడి కళింగరాజును నిది యట్టిద యని దంతపంక్తి వెలిగా
     వెలయం గలకల నవ్వె నవ్విధంబు నాగడంబునకుఁ గోపం బెత్తియు మెత్తనఁ
     జిత్తంబు నియమించియు నయ్యవక్రవిక్రమోదాముం డగు రాముండు సభి
     కులం జూచి.235
క. [82]తా నిది గెలిచితి ననియెడు, నేను గెలిచి యుండ నీతఁ డిది యేటికి మీ
     రేనెఱికి నిజము సెపుఁడా, నా నొకరును బలుకరైరి నమితానను లై.236
వ. భీష్మకాత్మజుండు మఱియును.237
క. [83]ఇం దేమియునుం గలదే, సందియ మస్మజ్జయంబు సత్యము
     పొందొందని పలుకులు పలు, కం దగునే యోడి యకట కక్కుఱితి మెయిన్.238
తే. అనినఁ గేవలకపటోక్తి విని యొకటియు, ననక యూరకయుండె నయ్యదువరేణ్యుఁ
     డప్పు డాకాశవాణి యయ్యందఱకును, వినంగ నయ్యెడుకొలఁది ని ట్లనియెఁ దెలియ.239
క. నిజము వలికె హలధరుఁ డితఁ, డజితుఁడు వైదర్భుమాట యాహతము మహా
     భుజులు మహీభుజు లిట్లగు, [84]నె జడాకృతితోడఁ దగవు నెఱపక యుండన్.240

జూదంబున ననృతం బాడిన రుక్మినిం గళింగుని బలరాముఁడు దునుమాడుట

వ. అనినఁ దద్వచనంబు లాకర్ణించి మూకు లై యున్న యచ్చోటిదొరలం జూచి
     సైరింపక సీరాయుధుండు సంరంభంబున సముత్థితుం డై పటుముష్టిఘాతంబున
     రుక్మిం జిదిపి యుఱికి నెత్తపలక యెత్తి కాళింగుఁ దలపగుల నడిచి పండ్లు డులిపి
     చంపి యంత నిలువక.241
క. అడిదంబు పెఱికి త్రెవ్వఁగ, నడిచెం బలువుర మహారినరనాయకులం
     బొడిసేసెం గొందఱఁ దన, కడిమిం బెఱవారు సెదరి కనుకనిఁ బఱవన్.242
వ. ఇట్లు మత్తదంతావళంబు విడివడి యనర్గళక్రీడం గ్రాలుచందంబునం జరియించుచు
     రుక్మిం గొప్పువట్టి సబాద్వారంబునందాకఁ దిగిచి నిహతప్రాయుం జేసి విడిచి నిజ
     శిబిరంబునకుం జని జనార్దనున కవ్విధం బెఱింగించిన.243
ఉ. కాదని యల్గ కాననవికాసము నొందక యూరకుండె దా
     మోదరుఁ డమ్మహావిభునియుగ్రభుజాభవంబు సర్వమున్
     యాదవు లొక్కమై బహువిధాభినవస్ఫుటవాక్యదర్శితా
     హ్లాదవిశేషు లై పొగడి రాబలదేవుఁడు నిచ్చఁ గైకొనన్.244
వ. అంత నయ్యందఱు గోవిందపురస్సరు లై నిర్వికారప్రకారంబునఁ గన్యాకుమా
     రులం దోడ్కొని పురంబునకుం జనుదెంచి సమ్మదంబునం బొదలి రని వైశంపా
     యన వ్యాఖ్యాతం బైన వాక్యజాతం బభిజాతార్థసమర్థంబుగ.245
స్రగ్ధర. ధీరప్రజ్ఞావికాసా దివిజపతియశస్తేయసంపద్విలాసా
     వీర[85]ప్రాధాన్యధన్యా వినయజితమహావిద్వదిచ్ఛావదాన్యా
     భీరుక్ష్మాభృచ్ఛరణ్యా పృథుభుజశిరస్ఫీతభూగణ్యపుణ్యా
     మేరుప్రస్ఫారసారా మితహితవచనస్మేరరేఖాగభీరా.246
క. ధీయుక్త మల్లరథినీ, నాయక మంత్రప్రయుక్త నయపూర్వకకా
     ర్యాయర్తఖడ్గవిభవ, స్ఫాయద్విషవాభిపోష భాసురవేషా.247
మాలిని. జలధివలయసేవాశాలినిర్ణిద్రకీర్తీ
     [86]విలసదలసవామావీక్షితానందమూర్తీ
     లులితి[87]విమతహేలాలోలఖేలత్కరాసీ
     లలితవినయవిద్యాలాభశశ్వద్విభాసీ.248
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. అన్నను
  2. దనరునా
  3. సిక్కి బీఱు
  4. చూపుచుం జవులఁ గోరిక
  5. పెట్టి
  6. కరూషా
  7. చుట్టు ల్నడవన్
  8. విలాసంబున
  9. నీవీణకున్
  10. కు న్వీతార్థముల్
  11. సంయమీశ్వరా
  12. సంభూరితా
  13. పెన్నిధి పడసిన
  14. బంధులము
  15. ప్రసాదహృదయులము
  16. మగధాధిపతి
  17. తుది
  18. నట్లైన
  19. యేకాళిమాత్రని
  20. నందందఁ దూఁగాడు
  21. యబ్జినీదళవీజనం బాది
  22. యివ్విధంబునఁ బడియెడు నయ్యవస్థ
  23. విలిప్సుఁడై
  24. వెండి
  25. పడినఁ ద్రోచిపట్టుదు పాణిపంకజంబు
  26. పర్యాయ
  27. భక్తికరముగ ననురక్తిభావ మొప్ప
  28. నర్చన
  29. యక్షతపుణ్యుఁ డుత్తముఁ డనంతుఁ డనంతయశుండు
  30. దలఁగక, దలఁగఁగ.
  31. యాతనికి
  32. నిశ్చయం బగునిశ్చలంబున
  33. నరుదెంచిన
  34. సంభ్రాంతగతిన్; సంభ్రాంతిమెయిన్.
  35. పూని యంతయు న్నిపుడు
  36. బంటగుదు నుర్వి
  37. రయ్యహితతుల్; రయ్యహితులున్
  38. యోధులు
  39. ట్లాలమున వాలుటంపఱ
  40. గాస్యులఁ
  41. లశరీరగుణమధ్యమశూరులు నై
  42. రవ; రయ.
  43. దిక్కులు
  44. నతనివెనుక
  45. డుపదిశరంబులు
  46. గూల్చి
  47. గవియన్
  48. డుద్యత
  49. ద్రుంచి
  50. యరుదారుశిల్పంబు లచ్చుపడఁగ
  51. లరివిచూడ్కులమించు లొలసి జార
  52. పతులుం దాము
  53. ముత్థితం
  54. మకర
  55. పరులును
  56. నవనవ
  57. గలిగించు
  58. కల్పితయం
  59. మీఁద
  60. నభినవోదాత్తసత్పథము
  61. లాతికిఁ జోద్యముగను, నిచ్చె సర్వంబు శ్రీకృష్ణుఁ డీప్సితములు
  62. రమ్యమై
  63. కామరూపములఁ గలసి; ఫలమునఁ గలసి బెరసి
  64. కొనఁగ
  65. నొనరించి సమోద
  66. పూర్తి
  67. ఆ. వెఱఁగుపాటుతోడి వేడ్క నాకస్మిక, ములను మానసంబు నొలయ నందుఁ
    గృష్ణభామ లెల్లఁ దృష్టావిలోకన, ములను గ్రోలి రతనిమూ ర్తిఁ బ్రీతి.
  68. విధాతృచెయిది కరంబు
  69. బ్రతికియుండిన నింతకు బంటు గాఁడె; బ్రతికెనేని యింతకు బట్టునింతరాఁడె.
  70. ఇతఁడా నాసుతుఁబోలు వానివలె
  71. ద్రికాలవేది యగుచు
  72. వరాస్త్రాదుల
  73. గౌఁగలించె
  74. రు దగ
  75. యొకతి
  76. జారువతి
  77. సితయై
  78. పంబు
  79. రమణిక యొప్పు
  80. శ్రుతవర్ముండును
  81. దత్ప్రకారమున్; దత్ప్రకాశతన్
  82. క. తా నిటు గెలిచితి నని యితఁ, డేను గెలిచియుండ నీతఁ డిది యాడెఁ దుదిన్
         మీనోర నిజము సెప్పుడు, నా నొకరుం బలకరైరి నమితానను లై.
  83. ఇందే నేమియుఁ గలదే
  84. నె జయాకృతితోడఁ దగవు నెఱపకయుండన్
  85. ప్రౌఢాన్య
  86. విలసదళిత
  87. విమలహాలా