Jump to content

హరివంశము/ఉత్తరభాగము - చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - చతుర్థాశ్వాసము

     మధ్యాంధ్రసందేశ
     క్షేమదకరవాల సుగుణకీర్తితగుణలో
     లా మంజులవాగ్జాలా
     వేమక్షితిపాల నిత్యవిజయ సుశీలా.[1]1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం [2]జెప్పె నివ్విధంబున బలభద్రు నుద్రేకం
     బాకర్ణించి యాపూర్ణవిస్మయస్తిమితమానసుం డై జనమేజయమేదినీశ్వరుండు
     వైశంపాయనమునివరున కి ట్లనియె.2
మ. జగతీచక్ర మశేషముం పృథుఫణాచక్రంబునం దాల్చి దై
     త్యగణోన్మర్దనుఁ డాజనార్దనుఁడు దానై మాననీయోన్నతిన్
     నిగమాంతస్తుతిఁ జేర్చు శేషుఁడు భువిన్ లీలాకృతిం దాల్చె నాఁ
     దగు నీలాంబరుపేర్మి యే వినుటకున్ ధన్యుండఁ బుణ్యవ్రతా.3
వ. ఇంకను నమ్మహాభాగుభాగధేయంబులు విన వేడ్క యయ్యెడు వివరింపు మనినఁ
     గృష్ణ ద్వైపాయన శిష్యుం డా విక్రమగుణవిశేష్యున కి ట్లనియె.4
క. బలమున నసదృశుఁ డగునా, బలదేవబలోదయప్రభావములు వచో
     బలశాలి యనఁగఁ బరఁగిన, బలరిపుగురునకును బొగడ భరము నరేంద్రా!5
వ. అయినను మదీయబుద్ధివాక్యప్రచారంబులకు గోచరంబు లైనవి వినిపించెద.6
తే. అఖిలరాజన్యసహితుఁ డై యరుగుదెంచి, యతనిఁ దొడరి జరాసంధునట్టి[3]జెట్టి
     ఘనగదారణమున నేమిగతి విహీనుఁ, డయ్యె నది మున్ను నీవిన్నయదియె కాదె.7
మ. పదివే లేనుఁగులంతలావున భువిం బ్రఖ్యాతుఁ డై నట్టిదో
     ర్మదనిర్ముద్రుఁడు భీముఁ డాతనికి సమ్యగ్విద్యలన్ శిష్యుఁ డై
     యుదితోత్సాహతఁ గౌతుకాహవములం దొక్కొక్కచో నయ్యశో
     విదితు న్మార్కొన నీడు గాఁడు [4]కడఁకన్ వేమార్లకుం బోరికిన్.8

వ. దుర్యోధనుండు తనకూఁతు లక్షణం గృష్ణతనయుం డగు సాంబుం డెత్తికొనిపోవ
     వెనుకొని యెయిది పట్టి తెచ్చి హస్తినగరంబునఁ జెఱపెట్టిన నవ్విధం బెఱింగి
     సైరింపక సంకర్షణుం డరిగి (పురబహిరంగణోపవనంబున నిలిచి) తొలుత సామంబు
     ప్రయోగించి తత్ప్రకారంబు కౌరవులు గొనక నిరాకరించిన విజృంభించి.9
మ. పౌరశ్రేణులతో నశేషకురుభూపాలాన్వయశ్రీలతో
     నారూఢన్నతవప్రహర్మ్యములతో నవ్వీడు దుర్వార గ
     ర్వారంభంబున గంగలో వయిచువాఁడై ఘోరసీరంబు ప్రా
     కారాంతంబునఁ జొన్పి పెల్లగిల నుగ్రక్రీడమైఁ దివ్వఁగన్.10
తే. తలఁకి కురుపతి తాను జుట్టలును సాంబుఁ, [5]దెఱవఁ గొనివచ్చి యొప్పించి తేర్చుటయును
     దేఱె బలదేవుఁ డన్నరదేవుఁ డతని, నాత్మగురునిగ వరియించి యర్చ లిచ్చె.11
వ. ఇట్లు గదాపరిశ్రమంబునందు సుయోధనుండు రామశిష్యుం డన జగత్ప్రసిద్ధం
     బయ్యె నాఁటనుండియు హలిహలాకర్షంబున హస్తినాపురం బొకదెస నోడ్డ
     గెడవై యుండు నిది యయ్యమునావిభేదను భుజగర్వప్రభావంబు ప్రలంబధేనుక
     ముష్టికహననంబు మొదలుగా మున్ను నీ వాకర్ణించితి మఱియు నతని పౌరు
     షంబు లనేకంబులు గల వవి త్రిభువనఖ్యాతంబు [6]లనుటయు జనమేజయుండు
     మునీంద్రా యుపేంద్రుండు విదర్భనగరంబుననుండి చనుదెంచిన పిమ్మట నెమ్మెయి
     వర్తనంబునం బచరించె నని యడుగుటయు నవ్వాగ్మివరుం డి ట్లనియె.12
సీ. ద్వారకాపురమున దానవాంతకుఁడు యోగక్షేమ[7]శాలి యై కరుణ నఖిల
     జగముల రక్షించు సన్నాహమున నున్నయాసమయంబున నసుర యొకఁడు
     వనరుహాసనదత్తవర[8]సముద్ధతుఁడు ప్రాగ్జ్యోతిషపతి నరకుండు నాఁగ
     ధారుణీదేవికిఁ దనయుండు సర్వదేవతల కవధ్యుండు దితిజవంశ
తే. మంతటికి దాన యొడయఁ డై యదటు మిగిలి, యెల్లలోకంబులకుఁ జాల నెగ్గుసేయ
     నంతయును విని కినుకఁ జక్రాయుధుండు, దివిజరిపుఁ గూల్చి మహిమ నుద్దీప్తుఁ డయ్యె.13
వ. అమ్మహాదనుజుండు మహేంద్రాదులం బరిభవించి పదంపడి కంసమథనుకడిమి
     కగపడి మడిసినకథయును సవిస్తరంబుగా వినిపించెద వినుము.14
క. సురదైత్యాదులదిక్కునఁ, బరాజయము రాక యుండఁ బద్మభవునిచే
     [9]వరము గొని క్రొత్తసిరిపస, సురారసమువోలె [10]నొడలు సొచ్చి కలంచెన్.15
వ. అప్రమేయదైత్యసేనాసహాయుం డై కడంగి యా నరకాసురుండు.16
చ. తొలితొలి యేఁగి [11]భూరిభుజధుర్యత యొప్పఁగ నింద్రువీటివాఁ
     కిలితలుపుల్ ప్రగాఢపరికీలితముష్టిహతిం బగిల్చి వే

     వెలువడు కయ్య మి మ్మని సవేగ సముద్ధత సింహనాద సం
     కలితము గాఁగఁ బిల్చుటయు గ్రక్కున వెల్వడియెన్ మహేంద్రుఁడున్.17
వ. అట్టియెడ.18
శా. అంభోదద్విరదంబుపైఁ బ్రబలవజ్రాభీలహస్తంబుతో
     గంభీరోన్నతరూపభీమపటురేఖం గ్రాలువీరాగ్రణిన్
     జంభారిం గని చీరికింగొనక యస్త్రవ్రాతపాతోగ్రసం
     రంభుం డై దనుజుండు దాఁకెఁ గడకం ద్రైలోక్యమున్ ఘూర్ణిలన్.19
క. ధరణీతనూజుఁ డేయఁగఁ, బురవరుఁడు గులిశనిహతి బోరన నమ్ముల్
     పరిహృతములు సేయఁగ న, య్యిరువుర వెరవులు సమగ్రహేలం బయ్యెన్.20
క. యమవరుణకిన్నరేశులుఁ, దమతమసైన్యములతోడఁ దద్దయు వెసఁ ద
     త్సమయమునఁ గూడుకొని ర, య్యమరాధిపు నఖిలసురసమాజసమేతున్.21
వ. హయగ్రీవ[12]నిశుంభమురాభిధాను లగు దానవనాయకులు మువ్వురు నరకునకుం
     బాసట యై వాసవసహాయు లగు నమ్మువ్వురు లోకపాలురం దలపడి రట్టి కోల్తలం
     బేర్చి సర్వాదిత్యులు నశేషదైత్యులం దాఁకినఁ గయ్యంబు కడింది యై చెల్లె
     నందు రెండు దెఱంగులవారు నొండొరువులఁ దూపుల నరికియుఁ జాపంబులు
     ద్రుంచియుఁ దూణంబులు వ్రచ్చియుఁ గృపాణంబులు నుఱుమాడియుఁ గంకటం
     బులు సించియు నెఱుఁకులు నొంచియు వాహనంబులు వికలంబులు సేసియు
     దేహంబులు తూలించియు నాభీలవిక్రమంబున విజృంభింప నమ్మహాసమ్మర్దంబున.22

హయగ్రీవ నిశుంభ మురాసురులతోఁ బోరి వరుణ యమ కుబేరులు పాఱిపోవుట

సీ. అంబుధీశ్వరుఁడు హయగ్రీవు నుగ్రబాణపరంపరాహననమున నొంప
     నాతఁ డాతని ననేకాంబకంబులఁ జరపీడితుఁ గావించి బెట్టిదంపు
     భల్ల మొక్కట వెస విల్లు ద్రుంచుటయును వరుణుఁడు ఘోరదుర్వారభుజగ
     పాశంబు లమరారిపైఁ బ్రయోగించిన నవి ప్రచండాకృతిఁ గవియుదేర
తే. నసుర యంతంతఁ బట్టి యత్యద్భుతముగ, మగుడ వైచి యంతన సమున్మాదలీలఁ
     బృథుగదాదండమున శిరోభిద యొనర్పఁ, దూలి నెత్తురు గ్రక్కుచు నేల కొఱగె.23
వ. పశ్చిమదిశాధీశుండు నిశ్చేతనుం డైన యట్లుండి యాలోనన గ్రక్కున నంకిలిదేఱి
     మీఱినభయంబునఁ గయ్యంబున నిలువ లేక యెక్కడయేనియు గాడుపడిపోయె
     దైతేయుం డెగువం దదీయసైన్యంబు దైన్యంబునఁ జెల్లాచెద రై పఱచె నప్పుడు.24
తే. పంచవింశతిశరముల నొంచె నంత, కుని [13]నిశుంభుఁడు జముఁ డుగ్రధనువు దాల్చి
     యేసె నొకవాలుఁదూఁపున నింద్రవైరి, నతఁడు వెసం ద్రుంచె నతని శరాసనంబు25

క. విలు విఱిగినఁ గాలుఁడు గ, ట్టలుకం దనతీవ్రదండ మతిరయమునఁ జె
     న్నలవడఁ గైకొని కవిసెం, బెలుచ నహితుమీఁద నఖిలభీషణరేఖన్.26
చ. దనుజుఁడుఁ జేతివి ల్విడిచి తా నొకఖడ్గము దాల్చి ప్రేతనా
     థున కెదురై కడంగుటయు దుర్గమదండకృపాణు లైన య
     య్యినసుత దైత్యపుంగవుల కిద్దఱకున్ సమరంబు ఘోరమై
     తనరెఁ గుతూహలైకభరితస్థితి నయ్యిరువాగుఁ జూడఁగన్.27
క. [14]కొండొకసేపునకుఁ గదిసి, దండధరుఁడు దనప్రచండదండమున శిరం
     బొండొండ వ్రేయుటయు ను, ద్దండతఁ జీరికిని గొనక దర్పోద్ధతుఁ డై.28
తే. అసురవరుఁడు నిస్త్రింశంబు నాయితముగఁ, బట్టి తత్కాంతికాళిమఁ బరఁగి దెసల
     నంధతమసంబుఁ బుట్టింప నర్కతనయు, తనువు వ్రేసె నందంద నెంతయును గినుక.29
చ. అడిదపు వ్రేటులం బఱియ లైన శరీరమునందు నెత్తురుల్
     సొడసొడ గ్రమ్మ నెమ్మనము సొమ్మలు పైకొన నూర్పు లొక్కమై
     నిడుదలు గాఁగ బ్రాణములు నిల్వక తల్లడిలంగ సంగరం
     బుడిగి కృతాంతుఁ డేఁగెఁ దనయూరికి సేన కలంగి పాఱఁగన్.30
వ. కైలాసనాథసఖుం డమ్మురాసురుం దొడరి పెనంగునెడ మాణిభద్రప్రముఖు లగు
     యక్షరాక్షసు లనేకు లతనికిం దలకడచి దానవుం దాఁక వివిధాయుధంబుల నా
     యోధనం బధికదారుణంబుగా నొనర్చిన నలిగి యతండు.31
మ. ప్రణుతం బై నిజచాపకౌశలము దీపస్ఫూర్తి శోభిల్లఁగా
     గుణనిర్ఘోషము సర్వపర్వతగుహాక్రోడంబుఁ బీడింప భీ
     షణబాణోఘముల విరోధిరథినీసంఘంబుపై నొక్కమై
     గణనాతీతముగా నిగుడ్చె జగము ల్గంపింప దోస్సంపదన్.32
క. ఆయంపపదువు పొదివినఁ, జేయార్పఁగ లేక ధనదసేనాగ్ర[15]సరుల్
     పాయఁబడి విభుని విడిచి ప, లాయనపరు లైరి మనసులందుఁ దలఁకుచున్.33
తే. దొరలు విచ్చిన నొంటి యై తిరుగనేర, కున్న కిన్నరనాథు నయ్యుగ్రదైత్యుఁ
     డేసిఁ జేతులతీటవో నేపు మిగుల, దారుణంబుగఁ గ్రొవ్వాఁడి నారసముల.34
చ. ఉరమున మూఁపున న్నుదుట నొక్కట కన్నులఁ జెక్కులం బరం
     పరలయి తత్ప్రయుక్తపటుబాణచయంబులు బెట్టు నాఁటినం
     దిరిగి కలంగి యెంతయును దీనత నర్థవిభుండు వోయె ము
     న్నరిగిన యాత్మభృత్యనివహంబులజాడన రాజతాద్రికిన్.35
వ. ఇవ్విధంబున మువ్వురు లోకపాలకులు నుక్కుదక్కిన దేవసైనికులు దేవేంద్రు
     దెస నిరాశు లై రా శతమన్యుండు విద్రుతసైన్యుం డయ్యును దైన్యంబు

     నొందక మందరప్రమాణం బగు నైరావణంబు నయ్యరాతిబలంబుపైఁ గొలిపి కలహ
     కలనాక్షమంబును నక్షయతూణీరంబును నగు బాణాసనంబు కొని మౌర్వీవిరావ
     విజృంభణంబు దంభోళధ్వనితంబుపోలికం ద్రైలోక్యాకంపనం బొనరింప నకం
     పితరభసంబునం బగఱమొనలమీఁదఁ గడంగినం గని నరకాసురుండు.36
మ. ఇటర మ్మే నిదె యున్నవాఁడ నని గంధేభంబు గంధేభముం
     బటురోషంబునఁ దాఁకుభంగి భుజదర్పం బేర్పడం దాఁకి ది
     క్తటముల్ వ్రయ్యఁగ నార్చి కార్ముకగుణాఘాతధ్వనుల్ [16]సర్వసం
     కటదుర్వ్యాప్తిఁ జెలంగి శాతశరముల్ గ్రందంగ మై గ్రుచ్చినన్.37
సీ. అఖిలగాత్రములు రక్తాక్తంబు లై నొవ్వు దనికినఁ గినిసి శతక్రతుండు
     విశిఖాష్టకంబున విద్వేషి నొంచి డెబ్బదిబాణముల రథబంధనంబు
     నెడలించి కేతువు నేకాస్త్రమునఁ ద్రుంచి సారథిఁ దొమ్మిదిసాయకముల
     సమయించి హయములఁ జతురంబకంబులఁ గూల్చి విల్లొక్కటఁ గూల నఱికె
తే. విరథుఁడు హతాయుధుండు నై సురవిరోధి, యుగ్రఖడ్గంబు గొని వీఁక నుఱికియుఱక
     వ్రేసె నైరావతముల వెస బలారి, యురము నుద్దామహతి వ్రచ్చియుబ్బి యార్చె.38
మ. కరవాలక్షతి స్రుక్కి యేనుఁ గొఱలంగాఁ దాను గ్రొవ్వేది ని
     ర్భరవక్షస్సృతరక్తసిక్తుఁ డగుచుం బై పైని నిశ్వాసముల్
     పరఁగ న్మూర్ఛలు పైకొనంగ దివిషత్పాలుండు వే తూలి సం
     గరరంగంబు దొలంగిపోయె రిపుసంఘం బార్వ నెందేనియున్.39

నరకుఁడు దేవలోకం బాక్రమించి యదితికుండలంబు లపహరించి యచ్చరలఁ జెఱగొనుట

క. అమరేంద్రుఁ దోలి భూసుతుఁ, డమరావతి సొచ్చి యరిది యగు తన విజయం
     బమరభవనంబు లన్నిటఁ, గ్రమమునఁ జాటింపఁ బనిచెఁ గడుమోదమునన్.40
వ. వాసవసింహాసనం బెక్కి యూర్వశి రావించి భావం [17]బనురాగతరళంబుగా
     నత్తరళనయనతోడ.41
మ. వరుణుం దోలితి నర్థపుం జదిపితిన్ వైవస్వతున్ గెల్చితిన్
     హరిఁ బోఁ జోఁపితి నేన యీశ్వరుఁడ సర్వామర్త్యసిద్ధోరగా
     సురగంధర్వవియచ్చరాదులకు మెచ్చు ల్మీఱ నీ వింక న
     న్నరవిందానన సత్కరింపుము [18]మనోజానీకసంక్రీడలన్.42
చ. అనుటయు నమ్మృగాక్షి యిది యట్టిగ యంతటివాఁడ వైన నీ
     పెను [19]పసదే తలంప రిపుభేదన సంయమికోటి భక్తితో
     నిను నఖిలాధ్వరంబులను నిత్యసమర్చితుఁ [20]జేసిరేని నే
     నును ముద మొప్పఁ గైకొని వినూత్నవిహారరసాబ్ధిఁ దేల్చెదన్.43

వ. అంతటి మహత్త్వంబు గని నన్నుం గామింపు మనిన నట్ల కాక యని యనంతరంబ
     యతండు.44
సీ. సురపతి వీడెల్లఁ జూ ఱాడి సురతరుకోటి యున్మూలించి కొని సుమేరు
     రత్నంబు లన్నియుఁ ద్రవ్వి తండమ్ములు గొని సురకన్యల వినుతరూప
     యౌవనగర్విత లగువారి నెనిమిదివేల వే చెఱకొని వేఱయొకతె
     విశ్వకర్మనికూఁతు విశదలావణ్యసముజ్జ్వలఁ జేకొని మూరిఁబోయి
తే. యదితిదేవికుండలము లనర్ఘరత్న, శోభితంబు లెవ్వారికిఁ జూడఁగోరఁ
     గొనఁగరానివి హరియించి కోర్కి నిండఁ, ద్రిదివభూమి వెల్వడియె నుద్దీప్తుఁ డగుచు.45
వ. ఇట్లు వెలువడి నిజపురంబునకుం జనుదెంచి యనుచరులం జూచి.46
క. ఈపదునాలుగు జగముల, నేపగిది సువస్తుకోటి యెచటఁ గనిన మీ
     రోపి కొనివచ్చి నన్నుం, బ్రాపింపం జేయుఁ డిదియ పని మీ కింకన్.47
వ. అనిన నతనియాజ్ఞ ననేకదానవులు సకలదిక్కులం జరించి సర్వజీవులకుం బరి
     పీడనంబు గావించి సమస్తవస్తువులుం జూఱగొని యశేషపురుషులం బరిభ
     వించి సమంచితరూపవిభవాభిరామ లగు రామలం జెఱలు దెచ్చి యొప్పింప నప్సర
     స్స్త్రీలు గలయంతవట్టువారునుం బట్టువడిరి పదియాఱువేలునూర్వురు. గంధర్వ
     [21]కన్యకలు సేపడిరి యక్షకాంతలు లక్షల సంఖ్య లగపడిరి కిన్నరసిద్ధసాధ్యవిద్యా
     ధరసుందరు లిందఱింద ఱని కొలందియిడ రా ది ట్లందఱు నేకవేణీధారిణులు నన
     వరతబాష్పలోచనలును నజస్రనిశ్వాసవ్యాకులవదనలు నై యుండ నింతటికి
     నధిష్ఠానం బై తదీయరాజధాని యగు ప్రాగ్జ్యోతిషంబు విద్యోతించె నవ్వీటి
     నాల్గుపొలిమేరలకుం గావలి యై మురహయగ్రీవనిశుంభపంచజను లను దనుజు లనే
     కంబు లగు ననీకంబులతో సమీకరసైకాయత్తచిత్తతం దనరుదు రందు
     మురాసురుండు సుతసహస్రంబుకలిమిఁ గరంబు బలిమిం బెంపారి ఘోరంబు లగు
     పాశంబు లాశావలంబితంబు లయి వట్రిల్ల నెల్లతెరువుల నరికట్టి యెట్టివారికిం
     జొరవ యీక యెసంగు నీదృశసన్నాహదుస్సహుం డగు నమ్మహాదనుజుండు
     మనుజలోకంబు గెలుచు తలంపునం గడంగి.48
మ. భువి నెచ్చోటఁ జరించి పూజ్యయజనంబు ల్గాసినేసె న్మహీ
     దివిజశ్రేణి వధించెఁ దాపసుల బాధించె న్నరేంద్రావలిన్
     వివిధోపాయములం గలంచెఁ బ్రజల న్వేమాఱు గారించే ధ
     ర్మవిరోధంబ యొకండునుం దనకుఁ గర్తవ్యంబుగాఁ జూచుచున్.49
వ. ఒక్కనాఁడు బదరీవనంబునం బుణ్యయజనతత్పరు లై కూడియున్న తపస్విపుంగ
     పులం బెక్కండ్రం గాంచి యూర్వశివాక్యంబు దలంచి వారిం జేర నరిగి.50

క. ఏవానిగుఱచి చేసేద, రీవిధి యనుటయును వార లింద్రుఁడు యజమా
     నావలికిఁ బూజ్యుఁ డాతని, కై వేదంబులు విధించె నఖిలక్రియలన్.51
వ. కావున నస్మదనుష్ఠానంబు తదీయోద్దేశంబునం జెల్లుచున్నది యనినఁ గోపంబు
     తోడి యేపున న వ్వెలర్ప నవ్విప్రులం జూచి.52
చ. యముండు గుబేరుఁ డబ్ధిపతి యాదిగఁ గల్గిన దేవకోటితో
     నమరవరేణ్యు నూర్జితబలాతిశయంబున భగ్నుఁ జేసి త
     త్సమధికరాజ్యవైభవము సర్వముఁ జేకొని యున్నవాఁడ వి
     శ్వమునకు నేన కాక పెఱవాఁ డొడయండు గలండె యెప్పుడున్.53
తే. నన్నుఁ గొలువుఁడు మ్రొక్కుఁడు నాకు నభిమ
     తాధ్వరంబులు మత్ప్రీ కై యొనర్పుఁ
     డేను గడుమేలు సేయుదు నిట్ల యైన
     నొండుతెఱుఁగులపనులు మీ రుడుగుఁ డనిన.54
చ. మును లిది యేటిమాట జగముల్ పరిపాలన సేయఁ గర్త యై
     తనరు మహేంద్రుఁ డుండ నిను దానవు దుష్టమనస్కు నల్పు నే
     మనయముఁ గొల్చువారమె యనర్హవిధం బిది యన్నఁ గన్నులం
     గనలునఁ గెంపుసొం పడరఁగా నసురాధముఁ డాక్షణంబునన్.55
వ. తన బంట్లం బిలిచి యిప్పాణులు క్రొవ్వి వెడయఱపు లఱిచెదరు వీండ్రు దొడం
     గిన యిప్పని గాసి సేయుం డనినం గో యని యార్చుచుం బేర్చి.56
సీ. యజ్ఞశాలలు వ్రచ్చి [22]యగ్నికుండంబులు పూడ్చి పశుశ్రేణి మాఁడ్చి విడిచి
     హోతలఁ బ్రామి యుద్గాతలఁ బొరిగొని యుపదర్శకుల సదస్యులను మోఁది
     యరణులు గాల్చి యూపావలి విఱిచి దర్భలు స్రుక్ప్రువములును బాఱవైచి
     చరువులు భక్షించి సర్వాన్నరాసులు వెదచల్లి సోమంబు పదటఁ గలిపి
తే. తాపసస్త్రీలఁ జెఱిచి తత్కన్యకాచ, యంబు జెఱపట్టి యజమాను లైన వారి
     జడలు మ్రాఁకులతోఁ గట్టి చదియ నడిచి, యాప్రదేశము దార యై యసురవరులు.57
వ. కొంతదడవు విచ్చలవిడిం ద్రుళ్ళి రిట్లు సేయించి తన్నుం గృతక ర్తవ్యుండుగాఁ
     దలంచుచు నిలింపమర్దనుండు ప్రాగ్జ్యోతిషంబున కరిగె నీట వసిష్ఠుండు వాసు
     దేవుండు కపిలుండు కశ్యపుండు కణ్వుండు జాబాలి ధూమ్యుండు భరద్వాజుండు
     మంకణుండు మొదలుగా ననేకమహామునులు తమక్రియాకలాపంబు విఘ్నంబు

     నొందుటకు నధికతమశ్శీలు రగు బ్రాహ్మణులు పరిపీడితు లగుటకుఁ బాతివ్రత్య
     [23]భూషణం బగు యోషిద్గణంబు దూషణంబునం బడుటకును డెందంబు లెరియ
     నందఱుంగూడి విచారించి.58
క. [24]ఈ చందంపుఁ జెయిది యి, న్నీ చుఁడు నొనరించెనేని నిఖలజగంబుల్
     వే చెడు మన [25]కిఁక నొక్కఁడు, గాచుప్రభుఁడు లేకయున్నఁ గలవే బ్రతుకుల్.59
మ. అడియాసం దొలఁగంగఁజాల కిటు ఘోరావస్థపాలైతి మే
     ర్పడఁ ద్రైలోక్యము గావఁబూని యవతారక్రీడ గైకొన్నవాఁ
     డొడయం డా వసుదేవసూనుఁ డజుఁ డాద్యుం డచ్యుతుం డాతనిన్
     గడు[26]భక్తిన్ ముపాశ్రయింపఁగ నగుం గల్యాణ మెబ్భంగులన్.60
క. [27]ద్వారవతి కేఁగి మన మీ, దారుణవిధి సెప్పఁ దడవ తడయక కడిమిన్
     దా రక్షకుఁ డై కడఁగు ను, దారపరాక్రముఁడు చక్రి దయ దళుకొత్తన్.61

వసిష్ఠాదిమహర్షులు ద్వారకకు వచ్చుట

వ. ఇంక నాలస్యం బేల లెండు గదలుం డని పయనంబున కాయితం బైయందఱు
     వృద్ధపురస్సరంబుగా దక్షిణాభిముఖు లై నడచి యెడనెడఁ బుణ్యతీర్థంబుల నవ
     గాహనంబు సేయుచు దైత్యావమానదూనంబు లైన మానసంబుల
     దేర్చుచు భాగీరథి సేరి యం దభిషిక్తు లై సర్వప్రాయశ్చిత్తంబులు గని యంతట
     నుండి నిత్యప్రయాణంబులం జని.62
సీ. త్రిదివంబుకంటె నుద్దీపితం బై విశ్వకర్మమానససృష్టి కలన నగుట
     యంభోధిపరిఘయై యలరార దేవతాదులకు నసాధ్యంపుదుర్గ మగుట
     [28]తనునేలువాఁడు నిత్యస్థిరలక్ష్మితోఁ బ్రాణేశుఁ డై జగద్భర్త యగుట
     హరుకోపశిఖఁ గ్రాఁగి యడఁగినమదనుండు తనయందుఁ దనుసిద్ధి ధన్యుఁ డగుట
ఆ. దనక కాని వేఱు ధరణీతలంబున, నితరనగరములను నెందు లేక
     [29]యుల్లసిల్లి యనుపమోదాత్తవిభవమై, పొలుచు యాదవేంద్రుపురము గనిరి.63
వ. కని తదీయవిభూతికి నద్భుతంబు నొందుచుఁ గృతప్రవేశు లై యందఱు రాజ
     మార్గంబున నల్లన యరిగి నగరివాకిట నిలిచి పణిహారులతో బదరీవననివాసు లగు
     తపస్వులు వచ్చినా రని దేవరకు విన్నపంబు సేయుం డనిన వారు లోపలికిం జని
     యవ్విధం బట్ల సేయుటయు.64
క. మునివరులరాక విని తన, మనమున సంభ్రమముతోడ మధురిపుఁడు గుమా
     రునిఁ బ్రద్యుమ్నుని జెచ్చఱఁ బనిచె[30]న్ దదనునయమునకుఁ బరమప్రీతిన్.65
తే. అతఁడు వారి నెదుర్కొని యాదరమున, సంప్రవేశంబు నడప నాసౌమ్యచరితు
     లరుగుదెంచి సుధర్మాఖ్య యగు మనోజ్ఞ, దివ్యసభ నున్నయట్టి యా దేవపూజ్యు.66

క. యాదవులుఁ గుమారులును మ, హీదేవోత్తములు వృద్ధహితమంత్రులు స
     మ్మోదమున బలసికొలువ మ, హాదీప్తాసనముమీఁద నలరుమహాత్మున్.67
సీ. నీలాద్రిఁ దనరుమాణిక్యపుశిఖరంబుక్రియ రత్ననూత్నకిరీట మెసఁగ
     గగనంబునడిమిచక్కటి నొప్పునరుణాంశుకరణిఁ గౌస్తుభము వక్షమున వెలుఁగ
     జలరాశిఁ బొదివినసాంధ్యపయోదంబుక్రమమునఁ బీతాంబరము దలిర్ప
     మేచకాభ్రంబున మెఱయుసురేంద్రచాపములీల వనమాల ప్రస్ఫురిల్ల
తే. నల్లనునుఁజాయ మే నొప్పఁ దెల్లదమ్మి, విరుల సిరిగన్న కన్నుదో యరుదుగాఁగ
     నమరుజగదీశు సకల[31]హితార్థజను, జన్మవిరహితు వసుదేవజాతుఁ గాంచి.68
వ. ఆనందశీతలచేతస్కులై యంతంతం దమలోన.69
ఉ. అక్కఱ లెల్లఁ దేల్చి జను లందఱఁ బ్రోచుటకున్ బ్రసన్నుఁ డై
     యిక్కరుణాకరుం డిచట నిట్లెలరారఁగ నింతకాలమున్
     రక్కసుచేత నక్కట పరాభవ మొందిత మెవ్విధంబులన్
     నెక్కొనకున్నె మర్త్యులకు నిక్కము ప్రాక్తనభోగ్యకర్మముల్.70
వ. అదియునుం గాక.71
మ. పరమాత్మున్ హరిఁ జూత మంచుఁ గనుఱెప్ప ల్మోడ్చి లోలోన వే
     తెరువుల్ వాఱుమనంబుఁ బట్టి బలిమిన్ [32]దివ్వంగఁ దివ్వంగ దు
     స్తరదుశ్శాసిక యయ్యెఁ [33]బూర్వవిధి ప్రత్యక్షంబుగా నమ్మహా
     పురుషుం గంటిమి నేటనుండి సుకరంబుల్ సిద్ధిపారంపరుల్.72
క. తపము తప మంచు నడవుల, నుపగతజడబుద్ధి [34]మనికి యొందఁగ హరిఁ జూ
     పుపకారంబయ్యె రిపుని, యపకారం బిట్టిభాగ్య మబ్బుటకతనన్.73
వ. అనుచుం గదియఁ జనుదెంచుటయు జనార్దనుండు ససంభ్రమంబుగా సముత్థి
     తుం డై సంయమితతికిం బ్రణామంబు సేసి యాసనార్ఘ్యపాద్యమధుపర్కం
     బులఁ బరిపాటితోడం బూజ యొనరించి తదనుమతి నార్మీయం బగు నాసనం
     బున నాసీనుం డయ్యె వృష్ణ్యంధకభోజవరులును వారలకు నమస్కరించి యథో
     చితస్థానంబుల నుండి రప్పుడు కృష్ణుండు కృతాంజలి యై యమ్మహామునుల
     కి ట్లనియె.74
క. క్రతువులు నిర్విఘ్నము లే, శ్రుతములు ధృతము లై యసన్నిరుద్ధము నై మహా
     వ్రతములు తపములును ననుప, హతము లై కళ మేమీ యుష్మదాగమమునకున్.75
మ. పరమబ్రహ్మపదైక్యబోధమహిమం బ్రాజ్యంబు మీయోగభా
     స్వరసామ్రాజ్యము ధర్మనిత్యము భవత్సత్యంబు మీ రీయెడన్

     బరిపూర్ణాత్మకులార నేఁడు నను సంభావ్యాన్వయోదగ్రుఁగాఁ
     గరుణింపంగఁ దలంచు టొక్కటియగా కర్జంబు మీరాకకున్.76
తే. అయిన నిత్తఱి నెయ్యది యైన నొక్క, కృత్య మాజ్ఞాపనము సేయుఁ డత్యుదాత్త
     హృదయులార! యవ్విధి నిర్వహింప నుత్సు, కంబు లైనవి యంతరంగములు మాకు.77
క. అని గోవిందుఁడు పలికిన, యనుపమరసభరితమంజులాలాపనపూ
     జనముఖ్యక్రియతో న, మ్మును లందఱు సంప్రముదితమూర్తులు వెలయన్.78
క. తమతెచ్చిన బదరీఫల, సముదయములు శిష్యహస్తసంసక్తము ల
     క్కమలోదరునకు నుపహా, రముగ సమర్పించి [35]భక్తిరాగాన్వితు లై.79
వ. అంజలిపుటంబులు నిటలంబునం గదియించి దేవా యివి నీవు దొల్లి నరసఖుండ వై
     విహరించినపుణ్యాశ్రమంబు తరువులవలన నానీతంబు లైనవి నీచేతం బూర్వ
     భుక్తంబు లయిన నప్పదార్థంబు లిప్పుడు నీకుం గానుక గావించితిమి మావచ్చిన
     కార్యం బెంతేనియుఁ గల దత్యంతావధానంబుతో నాకర్ణింపుము.80
క. ధరణీదేవి తనూజుఁడు, నరకుఁడు నా నసురవంశనాయకుఁడు పురం
     దరహృద్రోగసముద్యముఁ, డరయంగా సిద్ధసాధ్యయక్షాదులకున్.81

వసిష్ఠాదిమహర్షులు శ్రీకృష్ణునితో నరకాసురుని దుశ్చేష్టలు చెప్పుట

మ. జలధివ్రాతము నైనఁ గ్రోలఁగఁ గులక్ష్మాభృత్సమూహంబు నై
     న లుఠత్కూలము గాఁ గదల్ప [36]భువినైనన్ లోపడం ద్రొక్కఁగాఁ
     బ్రళయోదగ్రకృశాను నైనఁ గబళింపం జాలునాభీలదో
     ర్బలనిష్ణాతుఁ డభీతుఁ డాతతభయోత్పాతప్రభావుం డిలన్.82
వ. అద్దురాత్ముండు త్రైలోక్యపరాభవకరణంబ తనకు వినోదంబుగా నెందునుం జరి
     యించువాఁ డొక్కసమయంబున బదరీవనంబునకుం జనుదెంచి యజనతత్పరవృత్తి
     నున్న మముఁ గనుంగొని యిట్లేల బేలుదనంబున వేల్పులగుఱించి వేల్చెదరు యజ
     నంబులకు భాజనం బేన కాక యన్యు లెవ్వరు గలరు కర్తవ్యంబు లన్నియు నన్ను
     నుద్దేశించి చేయుం డని పలికిన మాపలుకు నుత్తరంబులకు నలుక వొదమి తన
     యనుచరులం గనుగిలిపి వనిచి వారునుం దానును.83
తే. అగ్ను లార్చి హోతల నొంచి యఖలయోగ్య, వస్తువిస్తారములును విధ్వస్తములుగఁ
     జేసి యాఁడువారలనెల్లఁ జెఱులువట్టి, కొనుచుఁ[37]బోయె నేమని చెప్ప ననఘశౌర్య.84

మ. క్రియఁ గోల్పోయి తపంబు పెద్దఱికమున్ గీడ్పాటునంబొంది య
     స్వయముం గంది కలంగి యిప్పగిది నే మత్యంతదుఃఖార్తియున్
     భయమున్ భావములందుఁ బైకొనఁగ నిన్ భక్తైకరక్షాస్ఫుర
     ద్దయు దేవేశు నుపాశ్రయించితిమి నిత్యస్తుత్య రక్షింపవే.85
క. నరకుం డిటు ప్రత్యక్షపు, నరకంబునఁ ద్రోచె నీవు నరసంతతికిన్
     నరకచ్ఛేదనకరుఁడవు, నరసఖ కరుణింపఁ దగు ననాథులఁ మమ్మున్.86
మ. త్రిజగద్రక్షణలీలకై తగు ధరిత్రిన్ దేవకీపుణ్యగ
     ర్భజుఁ డీ దేవుఁ డనంగ నుద్యదనుకంపా[38]శాలి వై తోఁచి యీ
     వృజినం బిప్పు డుపేక్ష చేసిన నగున్ విశ్వవ్యవచ్చేద మీ
     శ జితామిత్ర యొకింతవిక్రమసముత్సాహంబు నూహింపవే.87
చ. అను మునికోటిమాటలకు నచ్చెరువున్ వగపు న్మనంబులో
     బెనఁగొన దైత్యుచేతలకుఁ బేర్చినరోషము విస్ఫురద్విలో
     చనయుగళంబు భ్రాంతవిలసత్కరుణారుణకాంతిఁ జేయ న
     ద్దనుజ[39]విభేది మ్రానుపడి తానొకపల్కును బల్క కత్తఱిన్.88
వ. చింతాస్తిమితమూర్తియై యున్నం జూచి వెఱుపును సంశయంబును సంభ్రమం
     బును సందడింప మునీంద్రు లందఱు నొండొరుల [40]మొగంబులు చూచి యేక
     ముఖం బగు చిత్తంబుతో నయ్యుత్తమశ్లోకు నుదాత్తశ్లోకసనాథ లగు [41]దివ్య
     గాథల ని ట్లని పరికీర్తనం బొనర్చిరి.89
సీ. జయజయ జగదీశ జయ దనుజధ్వంసీ జయ జనార్దన జయ సర్వవంద్య
     జయజయ గోవింద జయ కృష్ణ వల్లవీవల్లభ జయ యాదివరవరాహ
     జయజయ నరమృగాశ్చర్యశుభాకార జయ కుబ్జకూర్మప్రసన్నరూప
     జయజయ సర్వజ్ఞ జయ హృషీకేశ నారాయణ జయ సరోజూక్ష వరద
తే. జయ శరణ్యపదాంభోజ జయ ప్రసన్న, జయ మనోరథదాయక జయ ముకుంద
     జయ జయావాస జయ నిత్యసత్యకీర్తి, మమ్ము నిటు సూడవే కృపామధురదృష్టి.90
క. నీవు విషణ్ణుఁడ వగుటయు, నీవిశ్వంబునకుఁ జాల నెగ్గు జనించున్
     నీవిశ్రుతప్రసాదస, మావేశము సర్వమంగళావహము హరీ.91
మ. సకలంబు గలిగింపఁ బెంప నణఁపన్ శక్తంబు మూర్తిత్రయా
     త్మక మక్షోభ్యము నీమహత్త్వము భవన్మాయానుభావంబు వా
     రక యవ్వారిరుహాసనాదుల కనిర్వాచ్యంబు సర్వాత్మ నీ
     ప్రకృతిం జూతు రనాదిమధ్యనిధనప్రాధాన్యగా బోధనుల్.92
మ. ప్రణతత్రాణపరాయణత్వ మెద సంభావించి సంభూతియున్
     గుణకర్మప్రవిభాగపాటవముఁ గైకొంటన్ భవత్పూజన

     ప్రణిథానంబులు భక్తితోడ నొనరింపం గల్గెఁగా కొండ ని
     ర్గుణ యెవ్వారు నెఱుంగ నోపుదురె [42]నీరూపంబు నీరూపమున్.93
తే. అక్షరత్రయాత్మక మగు నప్రమేయ, వర్ణమునకు నీ తత్త్వంబ వాచ్యపదము
     ఋగ్యజుస్సామములు నీకు నెల్లనాఁడు, దేవదేవ సమీహితస్థాపకములు.94
క. క్రతుమూర్తివి క్రతుకర్తవు, క్రతుఫలయోగాత్మకుఁడవు క్రతురిపుహనన
     వ్రతధరుఁడవు క్రతుపతి వీ, వతులదయోపేతహృదయ యంభోధిశయా.95
ఉ. నీకొనరించు పూజలు మనీషితసిద్ధివిధాయినుల్ సము
     ల్లోక[43]విధావిదాశయలు లోకయుగస్థితిదాయినుల్ గుణా
     త్సేకసమగ్ర లట్లగుటఁ జేసి భవత్ప్రియభక్తు లూర్జిత
     శ్రీకులు వీకశోకులు గరిష్ఠవివేకులు దైత్యమర్దనా!96
వ. అని మహామునులు మహనీయవాక్యంబులఁ త్రైలోక్యపూజ్యు నతనిం బూజించి
     వినతు లై యుండ నఖిలయాదవులును సాత్యకి పురస్సరంబుగా సముత్థితు లై
     మోడ్పుచేతులు నౌదలలం గదియించి దేవా ప్రసన్నుండ వగుము ని న్నెఱింగి
     తెలుప నింత లీ మహానుభావు లెఱుంగనేర కున్నవార లే మెవ్వారము
     వాత్సల్యం బొక్కటియ కారణంబుగాఁ గారుణ్యంబుతో భవదీయాశ్రయుల
     మమ్ము నాలోకించి కైకొను మని యభ్యర్థించిన నాదరించి వాసుదేవుం డమ్మహీ
     దేవోత్తముల నాలోకించి.97
శా. పాపాత్ముం డగు దైత్యుచేఁ బడిన మీపాటంతయుం జెప్పఁగాఁ
     గోపం బుత్కట మై మనంబునకు సంక్షోభంబు ప్రాపించె మ
     ద్రూపం బొండొకభంగి మీకు నిటు లై తోఁచెన్ భవన్మంజులా
     లాపంబుల్ ప్రకృతిస్థుఁ జేసె నను నుల్లాసంబుతోఁ గ్రమ్మఱన్.98
వ. కావున నింకఁ బెక్కుమాటలకుం బని లేదు మదీయవాక్యం బొక్కటి వినుండు.99
మ. విలయోద్దీప్తపతంగమండలసమావిర్భావదుర్భావసం
     కలనారౌద్రపరిక్రమం బయిన చక్రం బస్మదాభీల[44]దో
     ర్వలభీక్షేపవిరూప మై నిగిడి గీర్వాణారిఁ గంఠచ్ఛిదా
     చలితోదగ్రకబంధుఁ జేయు నపహృత్సైన్యంబుగాఁ జెచ్చెరన్.100
క. మీ రేమియుఁ దలఁకక చని, ప్రారంభింపుఁడు సమస్తభవ్యవిధుల్ బృం
     దారకయువతీలోచన, వారులు వెస నింకుఁగాక వారక యింకన్.101
క. స్థావరజంగమరూపము, లై వెలసిన యీజగంబు లన్నియు భీతి
     వ్యావేగవిరహితంబులు, గావుత మద్విక్రమంబు గని శీఘ్రమునన్.102
తే. అని జగత్పతి ప్రతిన సేయంగ నాక్ష, ణంబ దివినుండి దేవగణం బొనర్చు
     జయజయధ్వని యుప్పొంగి సర్వదిశలఁ, బరఁగె నఖిలజనశ్రోత్రపథము లలర.103

వ. సంయమిపుంగవులు సమ్మోదలీలావికసీతాకారు లై యమ్మహావీరు వీరరసోత్సేకం
     బనేకభంగుల నభినందించి మఱియును.104
మ. అనుకూలస్థిరలీలమై నఖిలలోకాత్యంత[45]దుఃఖావమో
     చనకృత్యంబున కర్థితోఁ గడఁగు యుష్మద్విక్రమప్రక్రమం
     బనపాయంబు [46]నపేతనిఘ్నమును నై యాఢ్యం బగుం గాత యెం
     దును ధన్యం బగుఁ గాత ధర్మ మిరవొందుం గాతఁ గల్యాణముల్.105
వ. దేవా యేము వోయి వచ్చెద మని యమ్మహానుభావుచేత వీడుకోలు వడసి యం
     దఱును శిష్యసహితు లయి యాప్రొద్ద కదలి బదరికాశ్రమంబునకుం జనిరి. ఇక్కడ
     నశేషయాదవులును మునిసమాగమంబునం బ్రకటం బైన కృష్ణమాహాత్మ్యంబు
     గొనియాడుచు విస్మయంబు నొందుచు నతండునుం దారును నరకాసురవధంబు
     నకు నుద్యోగంబు చింతించుచున్న సమయంబున.106

ఇంద్రుఁడు ద్వారకానగరంబునకు వచ్చి కృష్ణునిఁ జూచుట

సీ. ఆకాశగంగోర్మిశీకరంబులు మోచి మందారసౌరభస్యంది యగుచు
     నమరవిమానగత్యనుకూలమై లీల దివ్యవాయువు చనుదెంచెఁ దోన
     గురిసె దేవోద్యానతరుపుష్పవర్షంబు ఖచరకోలాహలకలనతోడ
     [47]ననిమిషహృద్యవాద్యారావములు మించె నాలోనఁ దోతెంచె నంబరమున
తే. నతిమనోహరతేజోమయప్రపంచ, మంచితార్కతేజస్ఫూర్తి ననుకరించి
     యాగ్రహంబున సకలజనావలోక, నీయబహుమూర్తు లై ధాత్రి నిలిచి వెలసె.107
వ. ఆమూర్తి సముదయంబునందు.108
మ. రజతాద్రిప్రతిమాన మై చను చతుర్దంతోజ్జ్వలాంగస్ఫుర
     ద్గజరత్నంబుపయిన్ సవజ్రకరుఁ డై కల్యాణముక్తామణి
     వ్రజభూషామహనీయదివ్యవసనస్రగ్గంధవిస్ఫూర్తితో
     ద్రిజగద్భర్త శచీవిభుండు వొలిచెన్ దేదీప్యమానోన్నతిన్.109
ఉ. ఆతని సూ రెలం దమ సమంచితయానము లుల్లసిల్ల న
     త్యాతతవైభవంబు లెలరార నలంకృతు లై దిగీశ్వరుల్
     ప్రీతిఁ దనర్చి రెంతయును బెంపునఁ దక్కును గల్గుదేవతా
     జాతము నొప్పె నప్డు దమ సన్నహనంబులతోడ నచ్చటన్.110
వ. ఇవ్విధంబునం జను దేంచిన దివిజపాలుర నాలోకించి నీలవర్ణుండు నీలాంబరసహి
     తంబుగాఁ బ్రత్యుత్థానం బొనర్చి బాంధవులుం దానును నెదుర్కొనియె నమ్మహేం
     ద్రుండును గజేంద్రావతరణంబు సేసి నిజవాహనావతీర్ణు లగు త్రిదశులు వొదివి
     కొని రాఁ గదిసి ముకుందుం దొలుతం [48]గౌఁగిలించి తదీయాగ్రజు నుగ్రసేనుం
     గ్రమంబున నాలింగనంబు గావించి, ప్రద్యుమ్నకుమారు నిరుగేలం గ్రుచ్చియెత్తి

     యక్కునం జేర్చి మఱియు యాదవులలోన సమ్మానార్హులైన వారి నెల్లను బరి
     రంభణంబున సంభావించి.111
క. పోరానిచుట్ట మితఁ డనఁ, గూరిమి చెలికాఁ డనంగఁ గోరి వరుస గో
     త్రారి హరిబాంధవులఁ బే, ర్వేరం గుశలంబు లడిగెఁ బ్రియ మెలరారన్.112
వ. బలదేవ పురస్సరుం డై గోవిందుండును బురందరుం దోడ్కొని యతని వేడుక
     పట్టగుసుధర్మలోనికిం దెచ్చి యుచితాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదుల నర్చించి
     తక్కిన లోకపాలుర నుచితోపచారంబు లాచరించె నంత నందఱు నర్హస్థానంబుల
     నుండ నా ఖండలుండు పుండరీకాక్షుకరంబు కరంబునఁ దెమల్చుచుం దదాన
     నంబునఁ జూడ్కి నిలిపి యి ట్లనియె.113

ఇంద్రుఁడు శ్రీకృష్ణుని నరకాసురవధకుఁ బ్రేరేపించుట

తే. ఏను నీయున్నకడకు ని ట్లేగుదేర, వలసినట్టికార్యము సాధువత్సలాత్మ
     దేవకీపుత్ర యుత్తమధీసమగ్ర, కలిగె నొక్కటి యది నీవు తెలియ వినుము.114
చ. నరకుఁ డనంగ దైత్యకులనాథుఁ డొకండు సరోజసూతిచే
     వరములు గాంచి పేర్చి సురవర్గము నెల్లను గాసిచేసె సం
     గరమున నేము వానిభుజగర్వము సైపఁగ లేక యిండులున్
     సిరులుఁ [49]దొఱంగి వచ్చితిమి చెన్నఱి మానుషజాతిలోనికిన్.115
మ. అమరావాసము [50]లెల్లఁ జొచ్చి దనుజుం డభ్యర్చితద్రవ్యజా
     తము లెల్లం బొరిఁ జూఱలాడినకథల్ ద్రవ్వంగఁ బె క్కేమి సె
     ప్ప మహాభంగ మొకండు గల్గె విను మాభంగంబు నీకు న్సమా
     నమె యేఁ జెప్పఁగఁ జిత్తగింపుము జగన్మానోల్లసద్విక్రమా.116
తే. అనపహార్యంబు లెవ్వాని కదితిదేవి, కుండలంబులు సురలోకమండనములు
     గొనియె విబుధాళి వంతలఁ గుందుచుండ, నింతయును మాధవా! నీవ యెఱుఁగుదింక.117
క. ఖలుఁడు మునుల యాశ్రమములు, గలయన్నియుఁ జొచ్చి చెరిచెఁ గ్రతువులు ధర్మ
     స్ఖలనం బొనర్చె సాధుల, యలజడి కిది గుఱుతు కొలఁది యన లే దనఘా.118
వ. ఇంతియకా దమ్మహాదైత్యుండు.119
శా. నీవాశ్చర్యపరాక్రమంబున మహి న్వీశ్వైకరక్షార్థి వై
     దేవారాతులఁ గూల్చుచున్కి విని నీతేజంబు సైరింప కు
     గ్రావష్టంభత నిన్నునుం దొడరి నీ కాజిం బరీభావమున్
     గావింపన్ భవదంతరంబ మది నాకాంక్షిచు నెల్లప్పుడున్.120
క. కావున నూర్జితబాహు, శ్రీ వెలయఁగ నరిగి రిపునిఁ జెఱుచుటయ తగన్
     గోవింద కర్జ మిత్తఱి, నీ విశ్వంబునకుఁ జేయు మిట్టిహితంబున్.121

శా. విక్రాంతిం ద్రిజగంబులందును గడున్ విఖ్యాతుఁ డుద్దామని
     ర్వక్రస్వైరజవంబునన్ బవనునిన్ భంజించు పక్షిప్రభుం
     డక్రూరాతుఁడు వీఁ డనన్ నెగడువాఁ డబ్జాక్ష యుద్యన్మహా
     చక్రుం దాల్పఁగలండు శాత్రవవధేచ్ఛం జేయు కయ్యంబులన్.122
వ. అని పలికి తనతోడన చనుదెంచి వినయావనతుం డగు వినతాతనయుం జూపి
     యింద్రుండు మఱియును.123
మ. మును నీమెచ్చినవాహనంబ యిపుడు న్మోదంబుతోఁ జేరె గ్ర
     క్కున నారూఢుఁడవై జగంబులకుఁ జక్షుఃప్రీతి గావించుచుం
     జని [51]వే కౌశల ముల్లసిల్ల జయప్రస్థానంబునుం జేయుమా
     వనజాతేక్షణ యీక్షణంబ తగ సర్వంబున్ సుసిద్ధంబుగన్.124
వ. అయ్యసుర యున్న ప్రాగ్జ్యోతిషపురంబున కేఁగ దెరువు వెట్టెద విజయం చేయు
     మనుడు నద్దేవుండు దేవేంద్రుం జూచి యిత్తెఱంగు మున్న యెఱుంగుదు
     నె ట్లనిన బదరీవననివాసు లగు తాపసపుంగవు లేతెంచి దైతేయుచేతఁ దమ
     పడినపాట్లుం జెప్పి దివిజుల కజేయుం డని నాకును ప్రోద్బలకారి యగు నుపదేశం
     బొనర్చి పోయిరి తదనంతరంబ నీవును వచ్చితి నాకడంకకు సహ కారంబు వాటించి
     తిది యెంతయు లెస్స నీతోడఁ జనుదెంచెదఁ బోద మని గద్దియ డిగ్గి యదువృద్ధుల
     వీడుకొని యాయితం బైన చక్రశార్ఙ్గాదిసాధనంబులు గైకొని సత్యభామ
     రావించి తత్సహితుం డై గరుడస్కంధారోహణంబు సేసి.125
మ. గురుబంధుద్విజకోటిదీవనలు ప్రక్షుభ్యన్నభోభంగి బం
     ధురతూర్యధ్వనులున్ సమస్తసుమనస్తోత్రప్రణామంబులున్
     వరవైతాళికవందిబృందజయజీవస్ఫారశబ్దంబులున్
     [52]వెరవై పేర్చి చెలంగ వెల్వడియె సంప్రీతి న్నిజావాసమున్.126
వ. ఇట్లు పురుహూతుం బురోయాయిం జేసి పురంబు నిర్గమించి మహీమార్గంబునఁ
     గొంతదవ్వు చని రంతనుండి యంబరమార్గంబునఁ గృష్ణజిష్ణు లిద్దఱు నుద్దామంబు
     లభిరామంబు లై వెలయ నేకముఖంబున నడచు శీతకిరణతీవ్రమయూఖరేఖ
     లలమికొనఁ దేజరిల్లి రంత.127
మ. పవనస్కంధము లేడిటం బటుకళాపర్యాప్తపర్యాయ[53]సి
     ధ్రవిచిత్రక్రమణం బొనర్చుచు లసద్వైమానికస్థానముల్
     వివిధాలోకనకౌతుకంబు వెలయ న్వీక్షించుచున్ వృష్ణిసం
     భవుఁ డొందెన్ సురసంచయంబు లలరన్ బ్రాగ్జ్యోతిషప్రాంతమున్.128

వ. అచ్చట నమరపతివలన నహితుని నగరంబు దురధిగమత్వంబును దచ్చమూసమూ
     హంబుల సన్నాహంబును సమ్యగ్భంగి నెరింగి తదీయ[54]విదళనవ్యవసాయంబునకు
     ననాయాసంబు లగు నాలాపంబులు విని సపరిజనంబుగా నతని వీడ్కొలిపి
     యద్భుతాటోపదీపితుం డై కదియ నడచి.129
మ. స్ఫురదుద్దామరథాశ్వకుంజరభటస్తోమప్రభాస్వచ్చమూ
     దురధిక్షేపము లైన సన్నహనముల్ తోరంబు లై యొప్పఁగా
     నరకావాసము గాచియున్న ఘనులన్ దైతేయులం దాఁకెఁ బ
     ల్వురఁ జెండాడె నఖండకాండవిసరవ్యుచ్ఛేదనక్రీడలన్.130
వ. తదనంతరంబ.131
సీ. మురదైత్యుచేత నుధ్ధురనిజమాయాబలంబునఁ బ్రాగ్జ్యోతిషంబుచుట్టు
     నొడ్డంగఁబడి నిశితోగ్రనిరంతరగురుముఖంబులు గల్గి సురభుజంగ
     గరుడగంధర్వాదు లొరసినఁ బేర్చు విస్ఫారపాశంబులు బహుసహస్ర
     సంఖ్యంబు లొరుల కసాధ్యంబు లాతఁడు గావించినవి తీవ్రకఠినచక్ర
తే. ధార నన్నియుఁ దునిమి యాదైత్యుఁ దొడరి, చటులశార్ఙ్గవినిర్ముక్తశరచయములఁ
     బొదివె త్రిదశారియును నీడఁబోక సింహ, నాద మఖిలనభోభేదనముగ నెదిరి.132
క. బలితపుగద గరుడునినడు, తల వ్రేసి కడంగి పటుగదాళూలసము
     జ్జ్వలశక్తిపరశుతోమర, ము లనేకము లతనిమీఁదఁ బొరిఁ దొఱఁగించెన్.133

శ్రీకృష్ణునిచేత మురాసురుఁడు మొదలైన మహారాక్షసవీరులు చంపఁబడుట

మ. కినుకం గెంపు గనుంగవం గదురఁగాఁ గృష్ణుండు గృష్ణోరగం
     బున కత్యుగ్రఫణంబు పేర్చినక్రియం [55]బొల్పొందు తీవ్రక్షుర
     ప్రనిశాతాస్త్రము కార్ముకంబునఁ గఠోరస్ఫూర్తి సంధించి యీ
     సున నేసెన్ రిపుమస్తకంబు మకుటాంశుల్ పర్వి యుర్విం బడన్.134
వ. ఇట్లు మురాసురుం బరిమార్చి కృష్ణుండు మర్దితరిపుదైన్యం బగు పాంచజన్యంబు
     పూరించినం దదారావంబు ద్రైలోక్యరంధ్రబాధాకరం బై పరఁగుటయు.135
మ. జలధుల్ పిండలివండుగాఁ గలఁగె నాశావారణశ్రేణి బె
     గ్గిలి మ్రొగ్గంబడియెం [56]జరాచరచయక్లేశోత్తరం బై ధరా
     వలయం బంతయు గ్రక్కునం గదలె [57]గీర్వాణావళుల్ సాధ్వసా
     కులమయ్యెన్ హరపంకజాసనులు ప్రక్షోభించి రంతర్గతిన్.136
వ. అతని నెదిర్చి నిసుందుండు బృందారకద్విరదభిదాచండం బగు గదాదండం
     బమర్చి పేర్చి తద్వక్షంబు వ్రేసి శార్ఙ్గచ్యుతంబు లై కవియు సాయకంబు లందంద

     జడియుచు మఱియు నక్కడింది కైదువు విసరి యఱిముఱి సత్యభామబాహువు
     దాఁకించి శోణితంబు దొఱఁగించి విల్లుఁ గైకొని పెల్లేసినం గనలి కృష్ణుండు.137
క. రెండమ్ములఁ గరయుగ్మము, ఖండించి పటుప్రచండకాండం బొకటన్
     గుండలదీప్తులతోడన్, మొండెము భువి డొల్లఁ జేసి ముదమున నార్చెన్.138
తే. ఎసఁగి వేవురుదైత్యులయెత్తు నెనయ,వచ్చె నెవ్వఁ డొకఁ డసురవ్రజముఁ గలఁచు
     నట్టియానిసుందుఁడు హతుఁ డైనఁ గలఁగె, నసురసైన్యంబు నరకునియాసమాలె.139
క. అంత హయగ్రీవుఁడు దు, ర్దాంతధనుఃపాణి యై మురద్విషుపై న
     శ్రాంతశరకోటిఁ బఱపె ని, తాంతఘనము వృష్టిఁ బర్వతముఁ బొదువుగతిన్.140
ఉ. దారుణదైత్యసాయకవితానవిజృంభణ మాత్మలోపలం
     జీరికినైనఁ గైకొనక సీరధరానుజుఁ డద్రిభేదన
     స్ఫారబలోగ్ర మైన పవిభంగి వెలింగెడుబాణ మొక్కటన్
     వైరియురంబు వ్రచ్చి యసువర్గముతో నెడఁబాపెఁ జెచ్చెరన్.141
వ. ఆభంగిం గంసాంతకప్రదరవిదళితం బై దనుజదేహలోహితంబు గంగలోపలం బడి
     తదీయజలంబు రక్తపూరంబు గావించెఁ బురుషోత్తముం డయ్యసురం
     బరిమార్చి యమ్మునుమున నఘోరపాలుండు విరూపాక్షుండు ప్రాపణుండు
     పంచజనుండు ననుమేటిమగలం దొట్టి యెనుబదినాల్గువేల రాక్షసులం జంపి
     ప్రాకారబాహ్యంబున రక్తప్రవాహంబు వఱపి పురద్వారంబు గదియు
     నవసరంబున.142
ఉ. అచ్చటఁ బన్నియున్నసముదగ్రసురారిచమూసమూహముల్
     చెచ్చెరఁ బేర్చి యాసుభటసింహుని మార్కొని విక్రమోద్యమం
     బచ్చెరు వై తలిర్ప వివిధాయుధసంప్రహతిం బెనంగె శా
     ర్ఙ్గోచ్చలితాస్త్రజాలముల కొక్కడుఁ దూలక యశ్రమంబునన్.143
వ. అట్టి సంకులంబున.144
తే. మేరుతటసంగతం బగుమేఘ మొకటి, పృథుల[58]ధారాస్త్రవర్షియై పేర్చునట్లు
     కశ్యపాత్మజుబంధురస్కంధలగ్నుఁ, డైనవిభుఁ డొప్పె బాణవర్షాఢ్యుఁ డగుచు.145
వ. ఆసమయంబున వాసుదేవుసాయకపరంపరలపరుసదనంబున వరుసం గెడసియుఁ
     జక్రపాతంబులం బొలిసియు గదాసికౌమోదకీఘాతంబుల మడిసియు నందక
     ప్రహారంబుల సమసియుఁ బాంచజన్యధ్వానంబుల గుండియ లవిసియుఁ గరతల
     ప్రహతులఁ జదిసియుం దార్క్ష్యపక్షపవనంబులం దూలియుఁ దద్రోషవీక్షణ
     విస్ఫులింగంబులం [59]బ్రేలియుఁ దదీయచంచుభేదనంబుల ముఱిసి రాలియుం
     గరాళకాయు లగు దైత్యులు పదునెనిమిదివేలు దెగిరి తురంగమమాతంగపురుష
     శరీరశకలంబులు దరతరంబ ధరణీతలంబు దంతురంబు గావింపఁ బెనురొంపు లై

     మేదోమస్తిష్కపటలంబులు దొరుఁగ నురికి నెత్తురు వెల్లువ లై పెల్లొదవినఁ ద్రిదశ
     సంయమిలోకంబుల కుత్సేకంబు లొదవె నివ్విధంబునఁ దన బలంబులు బలాధిప
     పూర్వకంబుగా వికలంబు లగుటయు.146
మ. భ్రుకుటీజంధనబంధురోగ్రవదనంబున్ దష్టదంష్ట్రాంధర
     ప్రకటాహంకరణోచ్చహుంకృతియుఁ [60]బ్రస్పందాతివృత్తాంసలో
     త్సుకబాహాయుగళంబునై వసుమతీసూనుం డనూనైకసా
     ధనసన్నాహముతోడ వెల్వడియె నుత్సాహానపోహాకృతిన్.147
క. వెలువడి సమస్తశాత్రవ, [61]విలూననక్షమత నేకవీరుఁడు తానై
     వెలుఁగొందుకృష్ణుఁ గనుఁగొని, యలఘుకఠోరాట్టహాసుఁ డై యి ట్లనియెన్.148
మ. అనిలో నింద్రునిగోము మాన్పి పెఱదేవానీకము న్జీరికిం
     గొన కీమూఁడుజగంబులం [62]గలఁచి యక్షోభ్యుండ నై యెందుఁ బే
     ర్చినవాఁడ న్నరకుండు నాఁ జనుసురారిశ్రేష్ఠుఁడన్ నన్నుఁ బే
     ర్కొనుచోటం [63]గొఱగావ యన్యసుభటప్రోత్సాహమాహాత్మ్యముల్.149
క. నీ వేల వచ్చి తిచటికి, నేవాఁడవు [64]మోపుటఱక నేపారెడునీ
     లావరిపులుఁ గెక్కడియది, యీవారిజనయన యెవ్వ రేర్పడఁ జెపుమా.150
తే. నిన్ను నీప్రొద్ద చల మొప్ప నిహతుఁ జేసి, యేను గైకొనఁగలవాఁడ నీలతాంగిఁ
     దలఁక కొక్కింత బంటవై నిలువు మోపి, తేని [65]నన నవ్వుచును బరమేశ్వరుండు.151
వ. అద్దురాత్మున కి ట్లను నేను నీ త్రిలోకప్రసిద్ధుం డగు వాసుదేవుండ నీకు శ్రుత
     పూర్వుండ నగుదునో కానో యెఱుంగ నీభామ సత్యభామ యనునది మదీయ
     ప్రేయసి యివ్విహంగమంబు విహంగమకులచక్రవర్తి యగు వైనతేయుండు
     మద్వాహనం బిచ్చోటికి నఖిలలోకహితార్థంబు సమస్తకార్యధుర్యుండ నై
     నిన్నుం బొరిగొనఁ జను దెంచితి నింక నెయ్యది సెప్పెదు చెప్పు మనిన మఱియుం
     బెలుచ నవ్వి యవ్విబుధశత్రుండు.152
శా. ఏ మేమీ వసుదేవనందనుఁడవే యీ వెట్టిభాగ్యంబొ సం
     గ్రామం బెన్నఁ డొనర్తునో కడిమి మైఁ గంసారితో నంచుఁ జే
     తోమోదంబునఁ గోరుచుండుదుఁ గడున్ దోరంబుగా నుండె మ
     త్కామం బోపినయంతయుం బెనఁగు నీదర్పంబు పెం పేర్పడన్.153
వ. నాచేతం జిక్కి [66]వెడలంబడ నేర్చెదే యని యదల్చి యసురవీరుండు వృష్ణివీరుం
     దాఁకి పెల్లేసిన నతండును మందహాసవికాసభాసమానుం డగు నాదానవు నెదు
     ర్కొనియె నయ్యిద్దఱకు నుద్ధామం బగు సంగ్రామంబు భీమం బై సుత్రామవృత్రు
     లకు రామదశగ్రీవులకుంబోలెఁ బ్రవర్తిల్లె విస్తరింప నలవిగాదు సంక్షేపరూపం
     బున వినుపించెద నాకర్ణింపుము.154

సీ. కొలఁదిపెట్టఁగ రానికోలలు హరిమీఁద నేసె దిగ్భాగంబు లెల్లఁ గప్ప
     భౌముండు పేర్చి సప్తతిసహస్రాంబకముల వైనతేయునిఁ బొదివె దాన
     నొక్కింత యలిగి యదూద్వహుం డయిదునెన్మిదియును బదియును మెఱుఁగుతూఁపు
     లోలి రక్కసునిపై నొండొండ నిగుడించి మఱియు నేడమ్ముల నెఱఁకులందు
తే. నాట నరకుఁడు నలిగి యానలిననాభు, నంగకంబులఁ గీలించె నాఱు తీవ్ర
     సాయకంబుల నొచ్చి యాచక్రధరుఁడు, దట్టకెంపున లోచనాంతములు మెఱయ.155
ఉ. శాత్రవుప్రాణముల్ గొనఁగఁ జాలెడుతోరపుఁ దూపొకండు లో
     కత్రయవిస్మయావహముగా నడరింపఁగ దాని దానవుం
     డత్రసదంతరంగుఁ డయి యంతరమార్గమునంద త్రుంచి వే
     పత్రరథేంద్రు నొక్కపటుబాణమునం [67]దరలంగ నేసినన్.156
తే. వజ్రహతిచేత శైలంబు వడఁకుభంగి, వైనతేయుణడు వడవడవడఁకి యలుకఁ
     గడిఁది పగతుని నెఱకల నడిచి తీవ్ర, ముష్టిఁ బొడిచినఁ జెచ్చెర మూర్ఛ మునిఁగి.157
క. నరకాతురుఁ డగు కిల్బిషు, పరుసున నరకుండు దలఁకి భావము నొయ్యం
     బురికొల్పికొని శరాసన, పరిస్ఫురిత[68]గుణరవంబు పర్వఁగ మఱియున్.158
మ. అతిఘోరం బగు శాతసాయక మొకం డాకర్ణపూరంబుగాఁ
     గృతహస్తుం డగుటన్ వెసం దిగిచి లక్ష్మీనాథుఫాలంబు ప్ర
     క్షతిఁ బొందంగఁ గడంక నేయుటయు రక్తం బాస్యము న్ముంప మూ
     ర్ఛితుఁ డై వ్రాలె జగత్ప్రభుండు భుజగారిస్కంధపీఠంబునన్.159
చ. కనుఁగొని సత్యభామ మదిఁ గంపము నొందక నాఁటియున్నయా
     సునిశితబాణము న్బెఱికి శోణితము న్గరపల్లవప్రమా
     ర్జనముల నొయ్యఁ బాపుచును జామరమారుతసంప్రయుక్తిచేఁ
     దను పొనరించి వల్లభు గతవ్యధుఁ జేసే ముహూర్తమాత్రలోన్.160
వ. సుపర్ణుండును నిజపక్షపవనంబునఁ బ్రభునకు నాశ్వాసం బొనరించె నట్లు దెలిసి
     నగుచు నగధరుండు మగువ నెమ్మొగంబునం జూడ్కి నిలిపి యేను పరిపీడితుండ నై
     డస్సితి నొక్కింత నీవు కయ్యంపుమోపు మోవు మని [69]సమంచితోత్సాహసాహస
     విభాసిని యగు నాభామినిచేతికిఁ దన శార్ఙ్గం బిచ్చి యంపపొదు లనువుగా నమ
     ర్చినం బేర్చి యాక్షణంబ.161

సత్యభామ నరకాసురునితో యుద్ధంబు చేయుట

శా. వీరం బాఁడుఁదనంబు నొందె నవఁగా విక్రాంతి[70]సౌందర్యల
     క్ష్మీరేఖం [71]బచరించె నాఁగ ధృతి యక్షీణాకృతిం జెందె నా

     ధీరోదాత్త[72]పతిప్రియాచరణభక్తిప్రౌఢ యాతన్వి దాఁ
     బ్రారంభించె మహారణక్రియకు నాప్రత్యర్థితో నుక్కునన్.162
తే. శ్రమను మెఱయ భల్లార్థచంద్రక్షురప్రముఖశిలీముఖములు బహుముఖములందు
     సత్య యేయంగ సత్యంబు సత్యరహితు, నొంచుమాడ్కి నయ్యంపఱ నొంచె నరకు.163
చ. తనపని మాని యింక వనితం బురికొల్పి రణంబొనర్పఁ బం
     చి నను జయింపనోపునె యిసీ యిది యేటిది యంచు భూమినం
     దనుఁ డపహాసవిస్మయ[73]మదప్రకటాననుఁ డై కడంగి యే
     సె నఖిలలోకరక్షకునిచెల్వపయిం బటుదీప్తబాణముల్.164
క. తోడన చనుఁగవ యొక్కట, నేడమ్ములఁ బార్శ్వయుగ్మ మెసఁగుకరయుగం
     బాడఁగ నాఱిట నేసినఁ, జేడియ యించుకయు లెక్క చేయక యలుకన్.165
శా. విల్లుం గేతువుఁ ద్రుంచి రథ్యముల నుర్విం గూల్చి సూతున్ వెసం
     ద్రెళ్లంజేయఁగ హీనసారతమెయిన్ దీనత్వ [74]మ ట్లొందియున్
     భల్లంబుల్ నిగిడింప రాక్షసుఁడు చాపం బొండు గైకొన్న న
     వ్విల్లు న్నుగ్గుగఁ జేసె నాక్షణము దేవీరత్న ముగ్రోద్ధతిన్.166
క. మూఁడవవి ల్లెత్తిన నది, పోడిమి చెడిపోవ నసుర పొలుపరి యలుకన్
     వాఁడిమి యొసఁగఁగ నొకగద, వేఁడిమితో వైచె వృష్ణివిభుసతిదెసకున్.167
వ. దాని నడుమన తిలప్రమాణశకలంబులు గావించి సత్యభామ భీమాటోపపరిదీపిత
     యై మఱియుం బ్రతివీరుచేఁ బర్యాయప్రయుక్తంబు లగు శక్తిపరిఘంబులు
     పొడిసేసి భాసితముఖంబు లగు శిలీముఖంబుల నతని వెఱచఱవ నేసినం జూచి
     ఖేచరులు ప్రశంసించి రట్టి సంరంభంబునకుఁ బ్రీతుం డై పీతాంబరుండు.168
మ. చెలువం జక్కఁగఁ గౌఁగిలించి సమరస్వేదోజ్జ్వలం బైన యు
     గ్మలిఫాలంబుఁ గపోలయుగ్మకము నున్మార్జించుచుం దేవి య
     గ్గలికం బెద్దపెనంగి డస్సి తిటు లింకం జాలు నిల్మంచు మె
     చ్చులు దోడ్తోడ మనంబునం బ్రియము లై సొంపారు ప్రేమంబునన్.169
క. తనయఱుత నేవళం బొకఁ, డనుకూలతఁ [75]గేలఁ బుచ్చి యాసతియఱుతన్
     వనరుహలోచనుఁ డిడి లో, చనపారణ సేసెఁ దత్ప్రసాదనదృష్టిన్.170
సీ. ఎయ్యది గాంక్షించి యెన్నఁడుఁ గానలే దయ్యె రుక్మిణీయంత యదియుఁ దొల్లి
     కౌస్తుభాభరణంబుకంటెను వల్లభం బై యుండు నెయ్యది యవ్విభునకు
     నఖిలలోకములవిఖ్యాతమై యెయ్యది [76]వెలవెట్టరానిపెంపులఁ దనర్చు
     జగతి జనాలోకచ ద్రికగాఁ జేయు నెయ్యది దనకాంతి నెల్లనాఁడు

తే. శయనరతికళావిహరణసమయములఁ బ్రి, యంబుతోడ నర్థించి యెయ్యది పడయఁగ
     నేరకుండుఁ దానును నట్టిచారుకంఠ, భూష గని యప్పు డలరె నప్పువ్వుఁబోఁడి.171
వ. ఇట్లు హృదయేశ్వరి సంభావించి యా దేవుం డద్దేవిచేతి విల్లు గైకొని యుల్లాసం
     బెసంగ సమరంబునకుఁ గడంగె నంతటిలోన నన్నరకాసురుండు వేఱొక్కరథం
     బెక్కి యెక్కుడు మగంటిమిఁ గార్ముకంబు ధరియించి బరవసంబున నడరి యేడమ్ములఁ
     గృష్ణునిఁ బదిసాయకంబుల సత్యభామను గరుత్మంతుని నైదుశరంబుల నేసి
     యార్చిన.172
చ. కినిసి మురారి తద్ధనువు గృత్తముగా నొనరించి సూతునిం
     దునిమి తురంగమప్రతతిఁ ద్రుంచి పతాకధరిత్రిఁ గూల్చుడున్
     దనుజభటుండు చెచ్చెర గదాభుజుఁ డై యరదంబు డిగ్గి వీఁ
     క నడరి బిట్టువ్రేసె హరికౌస్తుభరమ్యవిశాలవక్షమున్.173
క. అమ్మెయిన వైనతేయుని, గ్రమ్మఱ నొకవ్రేటు గొని తగం దిరుగునెడన్
     నెమ్మది నవ్వుచుఁ బ్రభుఁ డొక, యమ్మునఁ దునుమాడె నతనియాయుధవరమున్.174
క. నరకుఁడు మఱియును బట్టిన, పరశుపరిఘశక్తిభిండివాలముసలము
     ద్గరతోమరకుంతాదిక, పరంపరలు వఱపె భువనపతిపై నోలిన్.175
వ. అవియుం దదీయశరవిదళితంబు లగుటయుం దదనంతరంబ తరుశిలాకోటి
     పరఁగింప నన్నియుఁ దునుదూడి యా సర్వజైత్రుం డమ్మహాశత్రుం బరిమార్పఁ
     దలంచి.176

శ్రీకృష్ణుఁడు సుదర్శనచక్రంబుచేత నరకాసురుని ఖండించుట

సీ. ప్రబలసంగరములఁ బలుమాఱు దైత్యదానవదేహదళనపాటవము దనకు
     నభ్యస్తమై సమస్తామరసిద్ధగంధర్వకిన్నరఫణాధరకళత్ర
     కంఠసూత్రంబులు గాచుట వ్రతముగా వెలుఁగొందుచును మహాద్విజతపస్వి
     నియమనిర్వహణైకనిష్ఠ గ్రాలెడు సుదర్శనసంజ్ఞ మగు మహాచక్ర మమిత
తే. విభవనిర్వక్ర మాక్రాంతవిశ్వభువన, చక్ర మఖిలప్రశస్తహస్తమునఁ దాల్చి
     పగతుదెసఁ బూఁచి వైచెఁ బ్రస్ఫారవిలయ, వహ్నిమండలచండమై వఱలఁ జదల.177
మ. వికటస్ఫూర్తిఁ దదస్త్రరాజ మసురన్ వే తాఁకి యాపాదమ
     స్తకసర్వాంగము రెండు వ్రయ్యలుగఁ బెల్బం బాపె ఱంపంపుఁబెం
     పొకడుం దప్పక యుండునట్లు హతుఁ డై యుర్వీస్థలిన్ శోణితో
     దకపూరంబునఁ దేలె దైత్యుఁడు జగత్సంత్రాసవిచ్ఛిత్తిగాన్.178
వ. అయ్యవసరంబున ధరణీదేవి సాకార యై చేరి ఘోరసమరమధ్య నిపతితుం డై
     యున్నసుతుశరీరంబు కౌఁగిలించి యతని కర్ణంబుల సుదీర్ణదీప్తిఁ దేజరిల్లు దివ్యమణి

     కుండలంబులు గొని గోవిందునిసన్నిధికిం జనుదెంచి బాష్పకణకరాళకపోల
     యగుచుఁ గేలు మొగిచి యి ట్లనియె.179
మ. కరుణం బుత్రుని నీవ యిచ్చితి త్రిలోకద్రోహిగాఁ జూచి చె
     చ్చెర నిప్పోకులఁ బుచ్చి తింక దివిజుల్ సిద్ధుల్ తపస్వుల్ గత
     జ్వరులై తాల్తురుగాక మోదభరమున్ సౌస్థిత్య మొప్పం జరా
     చరభూతాళి యెలర్చుఁగావుత భవత్సంప్రాప్తరక్షావిధిన్.180
క. ఇవె రత్నకుండలంబులు, దివిజద్విషుఁ డింద్రు నొడిచి తెచ్చినయవి శ్రీ
     ధవ గోనుము త త్తనూసం, భవుఁ గావుము నిలుపు తండ్రిపదమున వానిన్.181
వ. అని ప్రార్థించిన పృధివి పలుకు లాదరించి యా దేవుం డాదేవి నాశ్వాసించిన
     నయ్యింతి యంతర్ధానంబు నొందె మందరధరుండు ధరానందనుదేహంబు సంస్క
     రింపం బనిచి యతని పుత్రుం డగు భగదత్తు నుదాత్తరాజ్యస్థుం గా నభిషేకింప
     మంత్రివరుల నాజ్ఞాపించె నివ్విధంబున విజయశ్రీవిభాసితుం డై శ్రీవిభుండు నిజభుజ
     విజితవిమతవైభవంబుఁ గైకొనెడి తలంపునం బురంబు ప్రవేశించి రాజమందిర
     ద్వారంబున సుపర్ణావతీర్ణుం డై భాండాగారంబులకడ కరిగి యం దనర్ఘ్యంబు లగు
     మాణిక్యంబులును వజ్రవైడూర్యమరకతంబులును ముక్తావిద్రుమంబులును నిర్మ
     లంబు లగుధర్మరౌప్యంబులుఁ గాంచి హైమంబులు రాజతంబులు రత్నమయంబులు
     నైన శయనాసనభోజనప్రముఖంబుల నాలోకించి.182
మ. అని నాపశ్చిమదిక్పతిన్ గెలిచి దైత్యాధీశ్వరుం డర్థిం దె
     చ్చినదివ్యస్ఫురితాతపత్రము లసచ్ఛీతాంశుతుల్యంబు గాం
     చనధారాపరివర్ణరత్నమయచంచద్దండ మాపద్మలో
     చనుఁ డచ్చోఁ గని మానసంబు బహుళాశ్చర్యావృతిం బొందినన్.183
వ. ఆత్మగతంబున.184
తే. అపజితాబ్ధిపవైభవం బస్తమితకు, బేరసంపద్వరంబు నిష్పీడితేంద్ర
     విభవ మిక్కల్మి రక్కసువిక్రమంబు, చే నుపార్జిత మిది ప్రశంసింప వశమె.185
వ. అనుచుండ భాండారికాద్యఖిలస్థానాధికారులు నంతఃపురాధ్యక్షులు మున్నుగా
     నవ్వెన్నుని యెదిరి కరుగుదెంచి కృతాంజలు లై దేవా యివె దివిజద్విషుధనంబులు
     (వివిధంబులు) విన నవధరింపుము నిరంతరమదోదకధారాతరంగితకపోలంబు లగు
     భద్రశుండాలంబు లిరువదివేలు నన్నియకరేణువులు గలవు సులక్షణాశ్వంబులు
     లక్షయునెనిమిదివే లున్నయవి గోవు లజావికంబులు నపరిమేయంబులు
     సూక్ష్మంబరంబులు నలికోమలకంబళాజినవల్కలంబులుం జందనాగురుకర్పూర

     కస్తూరికాదులు [77]ననల్పంబు లిన్నియు దేవరకు సమర్పించితి మిట్టిసంపద
     యంతయు భవదీయవిచిత్రక్షాత్రధర్మంబునం జేరినయవి యాత్మీయంబుగాఁ
     జిత్తగింపు మాజ్ఞాకారు లగు మమ్ము ననుశాసించి యనుగ్రహింపు మనుటయు.186
క. వారలవిజ్ఞాపన మ, వ్వారిరుహోదరుఁడు విని ప్రవర్థితహర్షో
     దారహృదయుఁ డై యెంతయు, గారవమున నంతపట్టుఁ గైకొని వరుసన్.187
వ. ఆవస్తువులు ప్రత్యేకంబ పరీక్షించి యారాక్షసులచేతన నిజనగరంబునకుం గొని
     పోవ నుచితప్రయత్నంబునం బుచ్చి యవ్వారుణచ్ఛత్రంబు దాన కరంబునం దాల్చి.188
తే. కనకధారలు సోన లై కడలుకొనఁగ, నావిహంగమవరు నెక్కి యాక్షణంబ
     వినయమున నధికారులు గొలిచిపోవఁ, బోయె మణి శైలమునకుఁ బ్రభూతయశుఁడు.189

శ్రీకృష్ణుండు పదియాఱువేల నూర్గురు సురకన్యకలం గ్రహించుట

సీ. ఆపర్వతముచుట్టు నభిరామహేమతోరణపతాకావళుల్ ప్రజ్వరిల్ల
     లలితంబు లగుసౌధవలయంబు లుజ్జ్వలశంపాలతారమ్యశారదాభ్ర
     మండలంబులపోలె మహితంబులై యొప్పఁ గని తార్క్ష్యు డిగి చొచ్చి యనుపమాన
     కమనీయమూర్తులు గంధర్వనాథులకూఁతులు గన్యలు గుణసమగ్ర
తే. లసురపతి చేతఁ జెఱవడి యార్తితోడ, నేకవేణీధరలు నియతేంద్రియలును
     నై నిజాభిజాత్యముఁ గాచి యాత్మదర్శ, నంబ గోరుచుండఁగఁ బద్మనాభుఁ డచట.190
క. పదియాఱువేలనూర్వురఁ, బొదివినయెలజవ్వనములఁ బొలివోవక యిం
     పొదవెడువారిఁ గనియె న, మ్ముదితలు నద్దేవుదెస సముత్సుక లగుచున్.191
వ. మురహయగ్రీవనిసుందపూర్వకంబుగా నుర్వీసుతుండు [78]దగ్ధదోర్విభవుం డగుట
     యెఱింగినవారు గావున.192
తే. నిండు చందురు లొక్కట నెఱసి మెఱయు, కరణి నెమ్మోము లభినవకాంతి నలర
     నందఱును నెదురుగ వచ్చి యతనిచుట్టు, నిలిచి విరచితాంజలు లైరి లలితలీల.193
వ. వారలకుం గావలి యున్న వృద్ధకంచుకులు నంతంత మ్రొక్కి నిలిచి రంత నా
     కన్నియ లతని కి ట్లనిరి.194
క. సురకన్యల మే మసురే, శ్వరుచెఱ నిట్లుండి యధికసంతాపమునం
     బొరలఁగ నొకతటి సుయమి, వరుఁ డగు నారదుఁడు కరుణవత్సలబుద్ధిన్.195
వ. ఇచ్చటికి వచ్చి మమ్ముం జూచి మీరు శోకింపకుండుఁడు శంఖచక్రగదాధరుం డగు
     నారాయణుండు ధరణీభారావతరణార్థంబు గారణమానుషుం డై నరకాసురుం బరి
     మార్చి మీకు భర్త యయ్యెడి నని యాశ్వాసించె విశ్వభూతాత్ముం డైన

     మారుతుండు ని ట్లని పలికెఁ దదాదేశంబు పరిక్లేశక్షమత యిచ్చిన నే మింత కాలం
     బును శీలంబు గోలుపోక జీవంబులతోడ నుండి నేఁడు ధన్యత్వంబు నొందితి మని
     విన్నపంబు సేసిన.196
శా. ప్రేమోదాత్తము లైనతద్వచనముల్ పెంపారుసాకూతలీ
     లాముగ్ధం బగుచూడ్కితో బెరసి యుల్లాసంబు గావింప నా
     శ్రీమంతుండును దాని కియ్యకొని సస్నేహావలోకంబు వా
     క్యామోదంబున వెల్లిగొల్చి ప్రమసం బందించె నయ్యందఱన్.197
వ. ఇట్లు దేవకన్యలం గైకొని యనేకసంఖ్యలు గల రాక్షసకింకరుల రావించి మణి
     కనకరచనారుచినంబు శిబికాచయంబుల నయ్యింతులం దోడ్కొనితెర
     నాజ్ఞాపనంబు సేసి.198
ఉ. అమ్మణిపర్వతంబు గలయం జరియించి తదీయ [79]మైనశృం
     గమ్మొక టిద్ధకానననికాయముతో మృగపక్షిజాతిజా
     తములతో, జల[80]జ్ఝరవితానముతో వెసం ద్రుంచి తార్క్ష్యుపై
     నిమ్ముగణించి తాను [81]దగ నెక్కె సముత్సుకచిత్తవృత్తి యై.199
తే. భామినీసమన్వితుఁ డగు నాముకుందు, నమ్మహాశైలశిఖరంబు నచ్చెరువుగ
     మోచ నశ్రమముగఁ బక్షిముఖ్యుఁ డంబ, రమునఁ బవమానసమజవప్రౌఢి మెఱయ.200
వ. ఇవ్విధంబున.201
సీ. స్వామిచేతోవృత్తిసరణి యెఱింగి యవ్వైనతేయుఁడు హేమవర్ణలలిత
     పటుపక్షవిక్షేపభంగంబు లై గోత్ర[82]గురుశృంగములు రాలఁ జరణజాను
     లగ్నంబులై సముల్లసితాభ్రచయములు నలుదెసఁ దూల నున్మార్గలీలఁ
     జనఁ గ్రమంబున జనార్దనుఁడు మరుద్వసుతపనేందుసిద్ధసాధ్యప్రధాన
     భవ్యధామంబు లెల్ల నతిక్రమించి, సురవరులలోకములను జూచుచును వేడ్క
     నరిగి కనియె ననేకశతాశ్వమేధ, రమ్యగమ్యము నగు శతక్రతువునెలవు.202
వ. కని ప్రవేశించి వాహనంబు డిగ్గి శచీసమేతుం డైన యద్దేవునకు నమస్కరించి
     యదితీదేవికుండలంబు లిచ్చి తత్ప్రతిపూజితుం డై సముచితసంభాషణం బొనర్చెఁ
     బౌలోమియు సత్యభామయు నొండొరులం గౌఁగిలించుకొని.203
క. తగుమాటలఁ జిత్తంబులు, సిగురొత్తంగఁ గలసి మెలసి చెన్నగుగోష్ఠిన్
     సొగియించునెడ ముకుందుని, మగువకు శచి యిట్టు లనియె మంజులఫణితిన్.204
క. దేవీ నీహృదయేశుఁడు, దేవసమానుఁడు సమస్తదేవనివహవి
     ప్లావకుని నరకుఁ గూల్చి మ, హావిక్రమకేళి ద్రిజగదభయం బొసఁగెన్.205
వ. నీసౌభాగ్యం బనన్యదుర్లభసంభావనోపభోగ్యంబు నిన్నుఁ జూచి ప్రియంబు నొం
     దితి నీయభిమతం బొక్కటి గావింపఁ గోరెద ననుటయు నవ్వనజవదన వినమ్ర

     యగుచు నా కేమిటం గొఱంత లేదు నీనెయ్యం బొక్కటియ కలిగినం జాలు
     ననియె నంత.206
తే. ఇంద్రుఁడు నుపేంద్రుఁడును సముదీర్ణపూర్ణ, హర్షచిత్తులై కూడి యయ్యదితిదేవి
     సదనమున కేఁగి తత్పుణ్యచరణములకు, వినతులై రట్టియెడ శచీవిభుఁడు నెమ్మి.207
వ. అయ్యఖండితచారిత్రకుఁ దదీయకుండలంబులు సమర్పణంబు సేసి కృష్ణుపరాక్ర
     మంబు సవిశేషంబుగాఁ గీర్తించిన నాయమ్మ సమ్మోదంబు నొంది యమ్మధురిపునకు
     వేనవేలు దీవన లిచ్చి యయ్యిద్దఱు నందనుల నభినందించి శచీసత్యభామలు
     ప్రణామం బొనర్చిన నాదరించి.208
మ. ఆరవిందోదరుఁ జూచి నాపగపు నీవాత్మీయదోర్వీర్యబం
     ధురతం జేసి తొలంగఁ ద్రోచితి భవత్పుత్రత్వ[83]మర్త్యత్వముల్
     బరికీర్ణంబయి యేకవాక్కుననె చెప్పన్ లేరు నీతోడ నె
     వ్వరుఁ ద్రైలోక్యహితాత్మజన్మవిధి భవ్యం బయ్యె నీ కెమ్మెయిన్.209
తే. అమరవిభుఁ డెట్లు సశ్వభూతావళికి న, వధ్యుఁడై యుండు నట్లు ప్రవర్ధనంబు
     నొందు నీవును రిపులకు నుర్వి నందు, నెవ్వరికి నోర్వరాక పెంపెసఁగుకడిమి.210
చ. వనితల కెల్ల నెక్కు డన వాలినపేర్మి వహించు నివ్వరా
     నన యగుసత్యభామయు ననన్యవిలాస మెలర్ప నిత్యయౌ
     వనరుచి నొప్పుఁగాత మనవద్యత నీవు మహీతలంబు పై
     ననఘ మనుష్యమూర్తి నెలరారఁగ నుండెడునంతగాలమున్.211
వ. అనియె నట్లు దేవమాతవలన లబ్ధవరుం డై యా సర్వలోకవరదుఁడు తల్లినిం
     దోబుట్టువును వీడ్కొని వైనతేయసమారోహణంబు సేసి దేవీసమేతంబుగా
     దేవోద్యానంబు నాలోకించుకౌతుకంబునం జని నందనప్రముఖంబు లగు వాని
     యందుఁ బరియించుచు.212

శ్రీకృష్ణుఁడు సత్యభామాప్రేరితుఁడై పారిజాతంబు గొని తెచ్చుట

సీ. మందాకినీపద్మమధువుల మాని తుమ్మెద లిద్ధకుసుమసంపదకుఁ జేర
     నిత్యంబు వేల్పుఁగన్నియలు శాఖాడోలలొంది యాటల వేడ్క నుల్లసిల్ల
     నాఁడునాఁటికి వచ్చి నవనవంబుగ నచ్చరలు హృద్యనైపథ్యరచన వడయ
     భువనసంచరణ విస్ఫుట[84]ఖేదమున సిద్ధమిథునముల్ నీడలు మెచ్చి నిలువ
తే. మేరునిర్ఝరపవనంబు మెలఁగ నూత్న, మంజరులఁ గదలించి వైమానికులకు
     సౌరభంబులు గొనిపోవ సార్వకాల, గరిమ నొప్పొరుకల్పవృక్షములు గాంచి.213
వ. అమ్మహీరుహంబులందు.214

క. ఏతరువు సురాభ్యర్చిత, మేతరువు గరం బభీష్ట మింద్రాణికి వి
     ఖ్యాతం బేతరువు [85]నిజవి, భూతిఁ ద్రిభువనంబులం బ్రభూతస్థితులన్.215
క. ఏతరువు సమీపమునకు, నేతేరఁగ నాక్షణంబ యెంతయు నరుదై
     జాతిస్మరత్వ మగు నే, జాతికినే నట్టి పారిజాతముఁ గనియెన్.216
ఉ. అత్తఱి సత్యభామ తను నాదిసురాంగనగాఁ దలంచు చ
     య్యుత్తమదివ్యవాసనసముత్థితయై మది నుల్లసిల్ల పె
     ల్లెత్తిన వీడు నవ్వరమహీరుహముం దనసొమ్ముసేఁతకై
     మెత్తన వేఁడె జిత్తవిభు మేకొని యచ్చతురుండుఁ జెచ్చెరన్.217
తే. పెఱికి పారిజాతముఁ దార్క్ష్యు పెద్దవీఁపు, మీఁద నిడుకొని ప్రియకాంత మెచ్చియలర
     దేవలోకంబు వెలువడఁగా వనంబుఁ, గాచి యున్న కింకరులు పెక్కండ్రు గడఁగి.218
వ. అడ్డపడి యనేకశస్త్రాస్త్రవిలసనంబుఁ జూపిన నవ్వుచు నవ్వీరుండు.219
మ. స్ఫుటశార్ఙ్గచ్యుతతీవ్రబాణపటలస్ఫూర్జత్ప్రభావంబులన్
     ద్రుటితగ్రీవుల దారితోదరుల నిర్లూనాంఘ్రులన్ భిన్నహృ
     త్తటులం జేయఁగఁ గొంద ఱేఁగి యధికత్రాసంబునం జెప్పి ర
     ప్పటుబాహావిభవుం డొనర్చిన క్రియాపర్యాప్తి గోత్రారికిన్.220
క. దేవాధిపతియు మదిలో, నావిభుఁడు త్రిలోకహితసమాచరణకళా
     కోవిదుఁ డగుట యెఱింగి య, థావిధ మగుతత్కృతంబు తగ నొడఁబడియున్.221
ఆ. మనసు పట్టలేక యనిమిషకోటితో, నరిగి యతనిఁ దాఁకి యనియొనర్చి
     వజ్ర మతనిమీఁద వైచి తద్వేగసం, స్తంభనమున మదము దక్కి స్రుగ్గి.222
వ. అమ్మహాత్ముతోఁ దదీయనివృత్తిపర్యంతంబు దివ్యమహీరుహంబు మహీతలస్పర్శిగా
     నొడంబఱచి యమరావతికిం జనియె కృష్ణుండు నిత్తెఱంగునం బారిజాతంబు
     గైకొని నిజపురాభిముఖుం డయ్యె నటమున్న (నరకాసురవధానంతరంబున
     నయ్యనంతగుణమణిపర్వతుండు) యతండు మణిపర్వతాభిగమనం బొనర్చు
     సమయంబున నమరవల్లభుండు విశ్వకర్మ రావించి గోవిందుండు దేవతాహితార్థం
     బనేకసంగ్రామంబుల నచ్చెరువుగఁ బరాక్రమం బాచరించువాఁ డీనాకంబున
     నే నెట్లు విహరింతు న ట్లతండు మర్త్యలోకంబునం గ్రీడింపవలవదే తన్నగరంబున
     కింకను జెలువంబు లక్కజంబుగా నొనర్పుము జగంబుల నెన్నియేని సద్వస్తువులు
     గల వన్నియుం దెచ్చి యచ్చటన యునుపుము నాకుఁ బ్రియంబు సేయవలతేని
     నింతయు శీఘ్రంబ కావించుట కర్తవ్యం బనిన నియ్యకొని యమ్మహానుభావుండు.223

క. తనవిద్యాతపములచే, త నుపార్జిత మై పేర్మిఁ దగ నఖిలంబున్
     వినియోగించి విభునిపం, చినకంటె నుదాత్తచిత్రశిల్పము దొడఁగెన్.224
వ. ఇట్లు దొడంగి యెనిమిది యోజనంబులపఱపును బండ్రెండు యోజనంబుల నిడు
     పును నైనయమ్మహానగరి తద్ద్విగుణప్రమాణోపనివేశమహనీయయు ననేకరాజ
     మార్గరథ్యాచరణలలితయు మణికనకభాసురప్రాసాదసహస్రశోభితయుఁ గావించి
     వాసుదేవునగరు నలుదెసల నాలుగుయోజనంబులు గలుగ రచియించి మొగసా
     లలు నరుఁగులుఁ బసిఁడిన తీర్చి యతనిమందిరం బర్ధయోజనవిస్తీర్ణం బై విరజం బను
     పేర నూరు[86]హస్తంబులపొడవునం బొలుపార స్ఫటికంపుఁగంబంబులు వైడూర్య
     పట్టికలు వజ్రకవాటంబులుం గనకకుట్టిమంబులు గరుడాశ్మకుడ్యంబులు గా
     నొనర్చి రుక్మిణ్యాదు లగువారి కెనమండ్రకు వేర్వేఱ తగినగృహంబులు
     నిర్మించి యన్నిటికిం ద్రిదివసవనంబులం గలయొప్పులెల్లఁ దెచ్చిపెట్టి వైజయంతం
     బను నచలంబును షష్టితాలోచ్ఛ్రితం బగుహంసకూటంబును నినమార్గగామి
     యగు మేరుశిఖరంబును లోకంబులు గనుంగొన క్రీడాపర్వతంబులుగా నిలిపి
     దివ్యసరస్సులు దెచ్చి కేళీదీర్ఘికలుగా నునిచి నందనప్రముఖవనంబులలోని తరు
     వులు పెక్కు దెచ్చి శృంగారపుఁదోఁటలో నాఁటి కోటలు గోపురంబులు
     దివ్యంబు లగుసర్వద్వారసంక్రమంబులును దేవాసురుల కసాధ్యంబుగా నంగనల
     కైన నిలిచి కై చేయవచ్చునట్లుగా నపరిమితయంత్రాట్టాలకపతాకాకలితంబులు
     గా సంఘటించి పరిఖలు పాతాళస్పర్శినులును దుస్పర్శతిమిమకరసంకీర్ణలుం బూర్ణ
     సలిలసేవ్యలు సపరిభావ్యసన్నివేశప్రకాశితలుఁగా బచరించి పురంబు తూర్పున
     రైవతకంబు దక్షిణంబున లతావేష్టనంబు పడమట నక్షమయంబు నుత్తరంబున
     వేణుమంతంబును నను గిరులకుఁ గనకశైలకైలాసమందిరంబులు మొదలయిన నగ
     రంబుల నేమేమివిశేషంబులు గల వవియన్నియుం గలుగ నుత్పాదించి వాని
     కెలంకులఁ జిత్రకంబు భార్గవంబు పాంచజన్యంబు పుష్పకం బను దేవోద్యానం
     బులు ప్రతిష్ఠించి నలిని పుష్కరిణి లోనైనసురసరిత్తులు పురపరిసరంబున సాగర
     గామినులుగాఁ గల్పించి యీదృశప్రభావవిభాసితయైన ద్వారవతి యమరావతి
     నతిశయించునట్టిపేర్మి యావహించి దేవశిల్పి దివంబునకుఁ జనియెఁ దదనంత
     రంబ.225

శ్రీకృష్ణుఁడు పారిజాతంబుతో నిజపురంబునకు వచ్చుట

క. చనుదెంచె గరుడగరుదం, చనచంచలసకలభువనసంచయుఁ డగుచున్
     వనజాక్షుఁడు నిజనగరికి, వనితాప్రియపూరణోత్సవపురస్సరుఁడై.226

ఉ. అప్పురియొప్పిదంబులు ప్రియం బెలరారఁగఁ జూచుచుం బ్రభుం
     డుప్పరవీథి నేఁగి తగుయుత్తమధన్యనివేశనంబునం
     దొప్పఁగఁ విశ్వకర్మరచితోజ్జ్వలబంధురసౌధనాథుపై
     నప్పతగేం ద్రునోలి డిగి యక్కడనుండి సముత్సుకద్యుతిన్.227
తే. పాంచజన్యంబు సకలదిగ్భాగకంప, [87]కారిభూరిఘోషంబుగాఁ గడఁగి యొత్తు
     టయును యదుసమూహముఁ బౌరచయము నద్భు, తమున సంభ్రమమున నుద్యతంబు లయ్యె.228
వ. అంత నయ్యనంతశాయి చుట్టలుం జెలులును గరుడోపరిభాగంబున శంఖచక్ర
     శార్ఙ్గాదిపరికరంబు లలర సత్యభామాసమేతుం డై తేజంబున దినరాజతేజోవిరాజ
     మానుం డగునాజగత్పూజితుం గని విగతశోకులుఁ బ్రమోదమేదురమానసులు
     నగుచు ననేకకల్యాణతూర్యనాదంబులతో నుగ్రసేనవసుదేవబలదేవులం బురస్క
     రించుకొని తదీయం బగునాదివ్యగృహంబునకుం జనుదెంచిన.229
సీ. వైనతేయుని డిగ్గి వచ్చి వృద్ధులకును గురులకు భక్తితో వరుస నెరఁగి
     తమ్ములఁ గొడుకులఁ దత్సమవాత్సల్యయోగ్యులఁ బరిరంభణోపచార
     ముల నాదరించి యంభోరుహనాభుండు తల్లు లేతెంచినఁ దత్ప్రమోద
     ముప్పొంగ వినతుఁడై యుచితమంత్రిపురోహితాచార్యులను వల్లభాదిజనుల
ఆ. సత్కరించి నారు సంప్రీతిఁ దను వేన, ref>వేలువిధుల</ref>వేల్విధముల గారవింప నపుడ
     యవ్విహంగవిభుని యఱకటిపై మణి, పర్వతాగ్ర మిష్టభంగి డించి. 230
వ. పారిజాతంబును నవతారితంబు సేసి ప్రద్యుమ్ను నాజ్ఞాపింప నతం డయ్యుత్తమ
     తరువు నంతఃపురంబునకుం గొనిపోయెఁ దత్సన్నిధానంబున సకలకుకురాంధక
     వరులుఁ గుమారులును దివ్యంబు లగుతమపూర్వజన్మంబులు సంస్మరించి యది
     తదీయప్రభావంబుగా నెఱింగి యద్భుతంబు నొందిరి గోవర్ధనధరుం డాధరణీధర
     శిఖరంబును గల్పవృక్షంబును బ్రశస్తంబు లగు నెలవులం బ్రతిష్ఠింబులు
     సేయించి.231
తే. అసురకింకరకోటిచే నతులకనక, శిబికలందుఁ దెప్పించిన విబుధకన్య
     లందఱను వృష్ణివృద్ధులయనుమతమునఁ, దాన వరియించువాఁడయి తత్క్షణంబ.232
చ. తొడవులఁ జీరలన్ వివిధతోషకవస్తువులం బ్రకర్ష మిం
     పడరఁగఁ జేసి యందఱకు నర్హగృహావళు లేర్పడించె న
     ప్పడఁతుక లత్తఱిన్ సకలబంధులు దేవులు గారవింపఁగా
     నొడఁబడి వింతచంద మొకఁ డొందక చెందిరి సంప్రమోదమున్.233

క. అత్తలకు మ్రొక్కి తక్కటి, [88]క్రొత్తడు లందఱకుఁ బ్రియము గొనలు నిగుడఁగా
     నత్తఱిఁ దిలకించె వరవ, ధూత్తమ యై సత్యభామ యుజ్జ్వలగరిమన్.234
వ. తదనంతరంబ.235
సీ. బహుసంగరక్లేశభారసహిష్ణుఁ డై తనకుఁ దోడ్పడి సమ్మదం బొనర్చి
     గొలిచినయాపక్షికులనాథు వీక్షించి వనజాక్షుఁ డాదరార్చనలఁ బ్రీతుఁ
     గావించి చెలికానిఁగాఁగ నున్నించి పొమ్మని వీడుకోలుపంగ నమ్మహాత్ముఁ
     డతిభక్తిఁ బ్రణమిల్లి ప్రాంజలియై దేవదేవేశ యెప్పుడు నీవిశుద్ధ
తే. బుద్ధి నాదెస నొలయ నద్భుతము గాఁగ, నప్పు డేతెంచువాఁడ నీయాజ్ఞఁ జేసి
     యిది సునిశ్చత మని దివి కేఁగెఁ బక్ష, పవనధూతోర్ములై సరిత్పతులు గలఁగ.236
వ. ఇట నయ్యాదవేశ్వరుండు యదుకులం బఖిలంబు తనవిజయం బభినందింప సభా
     మండపంబు ప్రవేశించి యుగ్రసేనవసుదేవుల నగ్రాసనంబుల నునిచి రోహిణీ
     సహిత యగుదేవకీదేవి నభ్యర్ధించి యదితిం బూజించుబిడౌజుండునుబోలె
     నొప్పి యప్పుణ్యశాలిని నంతఃపురంబునకుం బనిచి యగ్రజుండునుం దాను నంచి
     తోజ్జ్వలపీఠంబుల నాసీనులై వృష్ణివీరు లుచితప్రదేశంబుల నుపవేశింపఁ గింకర
     సమానీతంబు లగునిజభుజవిజితధనంబులు వేర్వేఱ యాలోకించి.237
క. కమనీయములును బహుమూ, ల్యములు ననర్ఘ్యములునైనయవి గురులకుఁ జు
     ట్టములకుఁ జెలులకు నుచిత, క్రమ మొప్పంగ నిచ్చెఁ బ్రియము గడలుకొనంగన్.238
వ. విశేషించి సాందిపుని నధికార్చనంబులం దనిపి యుగ్రసేనకళత్రంబునకు నగ్రిమ
     భూషాంబరాదు లిచ్చి పుచ్చి శేషించినయర్థంబులు భాండాగారంబుగా నునిచి
     రథగజతురగాదులకు నధికారుల నియోగించి గ్రహనక్షత్రపరిపూరితయైన వియ
     ద్వీథిం బొలుపారుపూర్ణచంద్రుచందంబున ననేకయదువీరపరికీర్ణ యగుసభకు
     నొక్కరుండ యలంకారంబై మెఱసి యందఱఁ గలయం గనుంగొని యి ట్లనియె.239
చ. అనుపమపుణ్యకీర్తు లగునట్టి మహాతులు మీర లిందఱున్
     గొనకొని నిర్వహించునవికుంఠితదానదయాదిసాధువ
     ర్తనముల లావ చూవె సురదైత్యుల కైన నవధ్యుఁ డైనశ
     త్రుని నడఁగించె నాదయినదోర్బల మె ట్లది యిట్టిసేఁతకున్.240
తే. పెద్దగాలంబు చెఱపడి పీడితాత్మ, లైనదివికన్నియలు ముక్తలైరి రత్న
     శిఖరమును బారిజాతంబు చేరె నాత్మ, భాగ్యమై యవ్విధం బైన పనియలఁతియె?241
క. సొమ్మున కొడయలు మీ రా, జ్యమునకుం గర్త లీర యంచితకల్యా
     ణములకుఁ బ్రవర్తకులరు, మి మ్మలరించుటయె యెల్లమేలును నాకున్.242
వ. అనినఁ గృతాంజలులై వార లద్దేవు నుపలక్షించి,243

జా. నీమాహాత్మ్యము నిక్కువం బెఱిఁగి వర్ణింపంగఁ బూర్ణోక్తియం
     దే మెవ్వార మశక్తు లిప్పనికి వాగీశాదులు న్నిర్జర
     క్షేమస్తోమ మొనర్చి ధర్మమున కుత్సేకంబుఁ గావించి తౌఁ
     బ్రేమన్ ధన్యము సజ్జనప్రకర మన్వీతార్థముల్ లోకముల్.244
వ. భవత్ప్రసాదోప[89]జీవు లయినయస్మదాదులు త్రైలోక్యవిజయు లగుట సెప్పనేల
     యని మఱియును బెక్కువిధంబులం గొనియాడుచున్నసమయంబున నారదుం
     డరుగుదెంచి యదుసమాజంబుచేతం బూజితుండై పరమాసనంబున నుండి.245

నారదమహాముని శ్రీకృష్ణునిప్రభావము యాదవుల కెఱిఁగించుట

క. అంభోజాక్షుని కేలు క, రాంభోజమునం దెమల్చి యయ్యందఱితో
     సంభోదనాదనిర్బర, గంభీరస్వర మెలర్పఁగా ని ట్లనియెన్.246
క. యాదవులార మహాభుజుఁ, డీదేవుం డిప్పు డెలమి నిలను గృతార్థ
     ప్రాదుర్భావము నొందిన, యాదిపురుషుఁ డిట్టు లగుట నద్భుతభంగిన్.247
తే. ఇతనిమహిమ మీ కిందఱ కెఱుఁగునట్లు, గా సవిస్తర వ్యాఖ్యానకలన సేయ
     నరుగుదెంచితి నేను నిర్జరవరేణ్యు, ప్రార్థనంబున సమ్మోదభరితబుద్ధి.248
వ. ఇమ్మహానుభావుండు బాల్యంబున నుండి యెయ్యవి యొనర్చె నింక నెయ్యవి
     సేయ నున్నవాఁ డాసుకర్మంబు లన్నియుం గ్రమంబున వివరించెద వినుండు.249
సీ. ఉగ్రసేనాత్మజుఁ డుగ్రపరాక్రముఁ డాకంసుఁ డదయుఁడై యఖిలవృష్ణి
     కులమును జీరికిఁ గొనక జరాసంధుప్రాపున నేపారి భవ్యరాజ్య
     పదవైభవము దాన బలిమిమైఁ గొని తండ్రిఁ జఱవెట్టె నట్టిదుశ్శీలుఁ జంపఁ
     బుట్టినవాఁడుగా బుద్ధిలోఁ గనుఁగొని వసుదేవుఁ డనఘుఁ డీవాసుదేవు
తే. మధురయుపవనంబున నొప్పుమహిత గోకు, లంబునం దుంచె నీతఁ డలంఘ్యతేజుఁ
     డగుట యెన్నిభంగుల నపాయంబు నొంద, కిద్ధవహ్నియుఁబోలె నుదీర్ణుఁ డయ్యె.250
ఉ. చంట విషంబు మెత్తుకొని చంపుదు నర్భకు నంచు వచ్చి ము
     వ్వంటులనాఁడ పూతన యవారణ నెత్తికొనంగఁ జన్నుఁబా
     ల్గొంటయుఁ బ్రాణము ల్డిగిచికోలును నొక్కటి గాఁగ నీతఁ డా
     గొంటునిశాచరి న్వసుధఁ గూల్చుట వింటిమ కాదె యేర్పడన్.251
క. ఇరుమూఁడునెలలశిశువై చరణకలనకేళిఁ గపటశకటముఁ దాఁచెం
     బురుషోత్తముఁ డింతింతలు, మురియలుగా నిట్టిసత్వములు మహిఁ గలవే.252
మ. చనుమా చూతము నీతేజం బనుచు నుత్సాహంబుతోఁ దల్లి దా
     మెనత్రాటన్ బెనుఱోలితో నడుము బల్మిం గట్టినం బాఱి సం
     దున వేగంబ తగిల్చి యీడ్చి బలుమద్దుల్ రెండు నున్మూలనం
     బును బొందించె మురాంతకుం డరిది యీ పొల్పొందుటల్ చెప్పఁగన్.253

వ. దానన కాదె దామోదరనామం బిమ్మహాతునకుం బ్రసిద్ధం బయ్యె
     మఱియు.254
శా. కాళిందీనది సొచ్చి కాళియమహాకాలహి నుద్యద్విష
     జ్వాలాకర్లకరాళవక్త్రుఁ బడగల్ స్రగ్ధం బడం ద్రొక్కుచుం
     గేళీనర్తన మాచరించి యడఁచెన్ గృష్ణుండు గోపాలనా
     వేళం [90]జేసెను నమ్మహాతునకునుం ద్వేషంబు లాభీలముల్.255
క. జడిదాఁకి వడఁకుపసులకు, గొడుగుగ దివసంబు లేడు గోవర్ధనమున్
     [91]వడిఁ బెరికి యట్లు దాల్చిన, కడిఁదిబలం బరయ హరికిఁ గలరే సదృశుల్.256
మ. సకలారిష్టుఁ డరిష్టుఁ డన్ దనుజుఁ డిచ్చన్ గోపికాభీకర
     ప్రకటోత్తుంగశరీరుఁడై వృషభరూపస్ఫూర్తిమైఁ బాఱుదెం
     చి కఠోరం బగుశౌరిబల్లిదపుముష్టిం గష్టమృత్యుప్రస
     క్తికిఁ బాలయ్యెఁ బ్రవృద్ధిబొందదె త్రిలోకీహర్ష మై యిమ్మెయిన్. 257
క. తురగాకృతి యగ దానవు, నిరుపరియలు గాఁగఁ జీరె నేమని పొగడన్
     బురుషోత్తముశితనఖభీ, కరపాణిక్రకచ మెట్టికడిమియొ కనుఁడా.258
తే. స్నానవేళన యక్రూరునకు భుజంగ, భోగశాయిని యగునిజపుణ్యమూర్తి
     నియతి [92]బ్రత్యక్షముగఁ జూపి నిరతమహిమ, దెలుపఁడే యాతఁ డతిధన్యదృష్టి నలర.259
క. అవలీలఁ గువలయాపీ, డవిభేదనశక్తి నుత్కటం బగుయశ మి
     య్యవనీధరుం డొనర్పఁడె, యవిరళవిస్ఫూర్తిఁ గువలయాపీడముగాన్.260
క. లీల మెయిం జాణూరుం, గోలెమ్ము లితండు విఱిచి ఘోరధ్వని జం
     ఘాలుం డై పంపెఁ గదే, త్రైలోక్యమునకు మనోజ్ఞతరశుభవార్తన్.261
చ. ఘనచరణావఘాతమునఁ గంసుశిరోమణు లుర్వి రాల్చి యి
     య్యనుపమశౌర్యుఁ డంఘ్రినఖరాభిహతిం గరికుంభపీఠభే
     దన మొనరించి మౌక్తికవితానము రాల్చుమృగేంద్రువిక్రమం
     బు ననుకరించెఁ దత్కథలు మ్రోయుచు నున్నవి లోకపఙ్క్తులన్.262
క. చచ్చినసాందీపునిసుతుఁ, దెచ్చె జముని నొడిచి యనుచు దితిజధ్వంసున్
     మెచ్చుట [93]యాటది యీతని, యిచ్చకు మార్పడఁగ వశమె యేవేల్పులకున్.263
వ. మఱియు ననేకవీరలోకసహాయుం డగుజరాసంధుం బరాజితుం గావించుటయుఁ
     గాలయవనుం గాలవశంబు నొందించుటయు రుక్మిం బరిభవించి రుక్మిణీదేవి
     నుద్వహించుటయు మురపాశకర్తనంబులు మొదలయినపనులు మున్నుగా నరకుం
     గూల్చుటయుఁ బారిజాతంబు నపహరించుటయు నాలోకింప వైకుంఠపౌరు
     షోత్సేకంబు లతిలోకంబు లిటమిఁదను వాణాసురావనంబు శిశుపాలపాతనంబు
     సాల్వహననంబు ధనంజయసాహాయ్యకంబు మొదలుగా నిమ్మహాత్ముండు విచిత్రంబు
     లగుదివ్య చరిత్రంబులు ప్రకటింపం గలవాఁ డివ్విధంబున నివ్వసుంధరపై నతి చిరం

     బగుకాలంబు కేళిసలిపి భూభారావతరణం బొనర్చి సమంచితోద్యానప్రాకార
     గోపురశోభిని యగునిజరాజధాని నంబుధికి సమర్పించి మానుషత్వంబు త్యజించి
     యాత్మప్రకృతియందు సందీప్తుం డయ్యెడు నిట్టి మాహాత్మ్యంబునం బరఁగు
     నియ్యాదిదేవుండు.264
చ. అనుపముఁ డప్రతర్క్యుఁ డజరామరుఁ డాఢ్యుఁ డనంతుఁ డచ్యుతుం
     డనఘుఁ డపేతదోషుఁ డనపాస్తగుణుం డతివాఙ్మనఃప్రవ
     ర్తనుఁడు నితాంతభక్తికలితస్థితిఁ దన్ భజియించు పుణ్యుల
     న్మనుచు సమస్తసంపదసమానులఁగాఁ బరికించు సత్కృపన్.265
క. మీరును నివ్విభుమహిమల, నారసి కనుఁగొని కృతార్థతావాప్తికి నై
     యారూఢి మనోవాక్క, ర్మారబ్ధసపర్యు లగుఁ డనారతభక్తిన్.266
క. అని చెప్పిననారదముని, ననఘులు యాదవులు బహువిధార్చనములఁ బ్రీ
     తునిఁ జేసిరి హరి వీడ్కొని, చనియె నతం డాత్మయోగసన్నద్ధగతిన్.267

శ్రీకృష్ణుఁడు పారిజాతకుసుమసమర్పణంబున సత్యభామాదులకుఁ బ్రియంబు సేయుట

వ. గోవిందుండు నందఱం బ్రియపూర్వకంబుగా వీడ్కొలిపి యుగ్రసేనవసుదేవులఁ
     దన్మందిరంబుల కనిపి నిజదివ్యగేహంబు ప్రవేశించి ప్రతిదివసోచితంబు లగు నభి
     మతవిహారంబులం బ్రవరిల్లుచు.268
సీ. ఎలరారుక్రొవ్విరు లెత్తులు గట్టి యొయ్యారంపుఁగ్రొమ్ముడి నలవరించి
     పరువంపుఁబుప్పొడి బాగుగాఁ దీర్చినయలకలపైఁ బొలుపార నలికి
     జిగిదేఱు నెసకంపుఁజగురు [94]చెక్కున నీడ గానరా నవతంసకం బొనర్చి
     నవకంబు మీఱుక్రొన్ననదండ సవరించి వలిచన్నుఁగవకుఁ జె న్నొలయఁజేసి
తే. సర్వకాలసమృద్ధి నాశ్చర్యమైన, పారిజాతంబు సిరియెల్లఁ బ్రణయ మలర
     సత్యభామకు నిచ్చి నిచ్చలుఁ బ్రమోద, జలధి నోలాడె సరసతాకలన వెలయ.269
వ. మఱియు నతండు.270
క. ఆకల్పతరువు గురియు న, వాకల్పోత్కరము లమ్మృగాక్షి నిజసప
     త్నీకోటి కొసఁగి పెంపుం, గైకొనఁ గని యలరు నంతఁ గామోత్సవుఁడై.271
మ. తనప్రత్యర్థులఁ గూల్చి యాత్మవిభవస్థైర్యంబు గావించి నాఁ
     డని యవ్విష్ణుదెసం దిరం బగుప్రియం బందంగ గర్తవ్యమై
     నను దేవేంద్రుఁడు పారిజాతతరుశూన్యం బైనయుద్యానమున్
     గనుపౌలోమిమొగంబు దైన్యమునకుం గాఁ గందుఁ దా నద్దివిన్.272
తే. అదితిదేవికి మణికుండలార్పణంబు, శచికిఁ బారిజాతావతంసకవిరతియుఁ
     జేసి హరిభక్తి వాసవుచిత్తమునకు, మోదఖేదపాత్రత తుల్యముగ నొనర్చె.273

క. పదియాఱువేలునూర్వురు, మదవతులందును విచిత్రమంజులరతిసం
     పద మెఱసె నమ్ముకుందుఁడు, మదివారును వద్భుతైకమగ్నత నలరన్.274
క. అందఱు హరిదెసఁ బ్రణయ, స్యందిమనోజ్ఞలును లబ్ధసంతానలు నై
     నందించిరి హరిమహిమల, చందము నజునకును బొగడ శక్యమె బుద్ధిన్.275
తే. అని పరీక్షిత్తనూజున కతులబుద్ధి, యుతుఁడు సాత్యవతేయశిష్యుఁడు ప్రియమున
     వాసుదేవమాహాత్మ్యవిలాసభంగు, లెఱుఁగఁ జెప్పిన కథయెల్ల నింపు మిగుల.276
శా. వీరశ్రీ సహకారిదక్షిణభుజావిస్ఫూర్జితాలంక్రియా
     సైరంధ్రీవ్రతశాలిఖడ్గలతికాసంభావ్యభవ్యోద్యమ
     స్వైరాకృష్టవిరోధిపార్థివరమాసర్వస్వనిర్వంచక
     స్మేరాంతఃకరణానుపాలితజగన్మిత్రాయతోద్యద్గుణా.277
క. పండితగోపవిమతవే, దండదళనచండఖడ్గదండధరిత్రీ
     మండలమహాప్రియానయ, మండలికరగండభువనమండనమహిమా.278
మాలిని. స్మరవిగమితకాంతామాన మానా[95]ద్యగణ్యా
     శరవిగళితశత్రుత్సాహ సాహాయ్యసిద్ధా
     కరవిలసితదానాకల్పకల్పప్రతిష్ఠా
     దరవిరహితచేతోధర్మధర్మార్థజన్మా.279
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూర్యనారాయణసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ
     నామధేయప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందుఁ జతుర్థా
     శ్వాసము.


  1. శ్రీపర్వతేశభక్తి, ఖ్యాపితగుణఘోడెరాయగంగగురుకృపా
    స్థాపిత సామ్రాజ్యసము, ద్దీపితవేమక్షితీంద్ర దీప్తదినేంద్రా.
  2. జెప్పినవిధంబున
  3. ధట్టి
  4. గదియ న్వేదండశౌర్యక్రియన్.
  5. తెఱవతోఁ దగఁగొని వచ్చి తేర్చుటయును
  6. లగుటయు
  7. కారియై
  8. సహాయుండు
  9. వరముగఁ గని క్రొత్తకలిమి
  10. గడిమి
  11. తీవ్రభుజధుర్యత యేఁపఁగ
  12. సుందానుసుంద
  13. సునందుండు
  14. కొండుక
  15. చరుల్
  16. పర్వ
  17. బున సంతసంబునొంది యనురాగతరళంబుగా
  18. మనోజ్ఞానేక
  19. పెనుపరుదే
  20. జేసెనేని
  21. కన్యక లవిసిపడిరి; చెఱపడిరి
  22. యజ్ఞ
  23. భూషణలగు
  24. ఏచందము సేయుద మి
  25. కింకొక్కఁడు
  26. రక్తిన్
  27. ద్వారావతికిం జని యీ
  28. సుగతి నేలెడువాఁడు సుస్థిరలక్ష్మికిఁ
  29. యరయ నుల్లసిల్లు ననుమోద
  30. ఁదదానయనమునకు
  31. జాతాహితార్థు
  32. దింపంగ దింగంగ
  33. దుఃఖాదిక
  34. నునికి వొందర
  35. రోతి
  36. విభునైనం బ్రోపడం
  37. బోయి రే మని
  38. కారి వై
  39. విరోధి
  40. ముఖంబులు
  41. వీర్య
  42. నీరూపింప
  43. విధాశయంబులును; విధావిశాయినులు
  44. దోర్వలనక్షేపనిరూపమై
  45. దుఃఖోప
  46. నవీత
  47. ననిమిషాలోడ్యహృద్యారవంబులు ; . . . నృత్యారవంబులు
  48. గవుంగలించి
  49. దొలంగి
  50. లోలిఁ
  51. పైఁ గౌతుక
  52. బెరపై
  53. నవ్య
  54. విఫలన
  55. బొందొందు
  56. జెలంగి కలకన్
  57. గీర్వాణాదులున్
  58. పాషాణ
  59. జెదరి
  60. బ్రస్పందాలివృత్రాంసనో
  61. విలోలనక్షమత
  62. గెలిచి
  63. భయమందు నన్య
  64. మ్రోపుటఱక, మోసపుటెఱుక లే.
  65. ననుటయు నగి పర
  66. వెలువడ
  67. దలరంగ
  68. రణగుణంబు
  69. జనితోత్సాహ
  70. శాలిత్వ (పదపట్టిక చూ.?)
  71. బనరించె
  72. పరిష్క్రియావరణశక్తిప్రౌఢ యాతన్వియున్
  73. విధావిధుతాననుడై; వికాసనిజాననుఁడై
  74. మట్లుండియున్
  75. బెలయ
  76. వెలకట్ట
  77. భగోచరంబు
  78. తద్దోర్విభవచర్వితుం
  79. శృంగమోఘ మ్మగుదాన
  80. జ్వల
  81. వెస
  82. శిఖరంబులును దరుశ్రేణికలుకు
  83. మత్యర్థమున్, పరికీర్త్యం బయి యెక్కె నాకు నుపమింపన్ లేరు
  84. ఖేదనంబున సిద్ధమిథునములు సేరి నిలువ
  85. సకల
  86. చేతుల
  87. కారి భూరిఘోషంబునుగాఁగ నాగి
    పట్టుట యదునమూహంబు పౌరచయము, నద్భుశము సంభ్రమంబు నుద్యతము లయ్యె.
  88. కొత్తరి యంతటికి; కొత్తటి యందఱికి.
  89. జీవను లైన; జీవకులైన.
  90. జూచిన నమ్మహాతునకునుం ద్వేషంబు
  91. కడఁకఁ బెరిగి యది
  92. బ్రత్యయ
  93. యేఁటిది; యేలది.
  94. నెక్కొన నీడ కానరా
  95. త్వగమాం