హంసవింశతి/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ఆధునిక ప్రబంధములలో హంసవింశతి యొక అపూర్వ ప్రబంధము.

హంస వింశతి అలనాఁటి జనసామాన్యము యొక్క స్థితిగతులకు అద్దము. తెలుఁగు పలుకుబళ్ళకుఁ బుట్ట. బహువిషయ విజ్ఞాన సంపత్తికిఁ గాణాచి. చవులూరించు చిన్న చిన్న కథలతో ముద్దులొలుకు మంచి మంచి పద్యములతో రసికజనమును వశీకరించుకొన్న రమణీయప్రబంధము.

ఈప్రబంధమునందలి దేశీయమైన పలుకుబడి విలువ గుర్తించిన భాషాసేవకులలో బ్రౌన్ దొర ప్రథముఁడు. బ్రౌణ్య నిఘంటువున నెక్కడఁ జూచిన నక్కడ హంస వింశతి పదములు పద్యములు కానవచ్చును.

హంసవింశతి అక్షయ ప్రజాసాహిత్య నిక్షేపము.

కవి

అయ్యలరాజు నారాయణామాత్యుఁడు. కౌండిన్యస గోత్రుఁడు. కొండమాంబా సూరయార్యుల పుత్రుఁడు.

"మంత్రి మాత్రుండె? దుర్మంత్రి మంత్ర తంత్ర సంత్రాసకరణ స్వతంత్రుఁడు" (1-15)

"వెండియు నఖండ తేజఃకాండ మార్తాండ మండల ప్రచండుండు"

"నిజ వితరణ........వ్యూహుండు, నారాయణామాత్య దేవేంద్రుండు" (1-16)

ఇతఁడు ప్రభువు కాఁడు. తేజశ్శాలియైన మంత్రియా? తన ప్రభువు పేరు చెప్పలేదు. కనుక మంత్రియుఁగాఁడు. నియోగి బ్రాహ్మణ కుటుంబి. అమాత్య నియోగి శబ్దములు గ్రామకరణమున కుపలక్షకములుగా నితఁడు ప్రయోగించెను.

“దిగులుం బొంది నియోగి యెట్టు లనుచున్ దేహంబు కంపింప, నా చిగురుంబోఁడి యమాత్యు వీఁ పడఁచి తాఁ జెన్నొంద" (3-100) ఈపద్యమున 'నియోగి', 'అమాత్యుఁడు' ఊరి కరణమే (పదవ కథ). కనుక నారాయణకవి ఒకరికిఁ బెట్టుటకుఁ దాఁ దినుటకుఁ జాలినంత కలిమిగల సంపన్న గృహస్థు, కరణము అని చెప్ప వచ్చును.

అల్లసాని పెద్దనామాత్యుఁడు కరణమేనా ? అన్నచోఁ గరణముకాఁడు. విద్యా శాఖామాత్యుఁడే. ప్రస్తుతకవి కరణ మని చెప్పుటకు గ్రంథమే సాక్షి.

దేశము

అవతారిక యందుఁ గవి తన యింటి చాలు జెప్పికొన్నాఁడు.

ఉ. అయ్యలరాజుఁ దిప్ప సచివాగ్రణిఁ బర్వతరాజు రామ భ
ద్రయ్యను భాస్కరాగ్రణిఁ బ్రధానవరుండగు కొండ ధీరునిన్
జయ్యనఁ దిమ్మయ ప్రభుని సత్కవితా రచనాఢ్యులైన మా
యయ్యలరాజు వంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్. (1-12)

అయ్యలరాజు వంశపుఁ గుదురు కడప మండలమున నున్నది. ఆచార్య కె. వి ఆర్. నరసింహముగారు రామాభ్యుదయ పీఠికయందు “రామభద్రకవి పూర్వులు తర తరములనుండియు నేఁటి కడప మండలము లోని యొంటిమిట్ట యందు నివసించుచుండి రనియు నీ కవి గూడఁ దన బాల్య మంతయు నందే గడపి యుండుననియు మనము నిశ్చయముగాఁ జెప్పవచ్చు” నని వ్రాసిరి. కనుక నీకవి యొంటిమిట్ట ప్రాంతమునఁ బుట్టెనని చెప్పవచ్చును.

కీ|| శే| కావ్యపురాణస్మృతి తీర్థులు జనమంచి శేషాద్రి శర్మగారు, కడప జిల్లా పుల్లంపేట తాలూకాలోని పొత్తపి యను గ్రామమున నారాయణకవి యుండెనని, ఆ ప్రాంతమునఁ జెప్పుకొనుచున్నా రని వ్రాసిరి. ఆ పొత్తపి యొంటిమిట్ట చేరువ నున్నది.

నగర గ్రామ నామముల పట్టికలోఁ గడప మండలము నందలి చిన్నచిన్న యూళ్ళ పేర్లుగూడ వ్రాసెను గనుక ఈకవి “కడపమండల వాసియే యని నిర్ధారణము సేయ నవకాశము కలుగునే కాని వేఱొక యూహ కవకాశము కల్గదు” అని శ్రీ శర్మగా రుద్ఘాటించిరి. “పుష్పగిరి తిరునాళ్ళను గూడఁ బేర్కొనుటయుఁగూడ నా పై యుద్దేశమును బలపఱచు చున్న" దనిరి.

అంతేకాదు, అయిదవ రాత్రి కథలో గొల్ల దంపతులు పిల్లలు లేక పుష్పగిరి తీర్థము కొంగుముళ్ళతో సేవింతురు. ఈ పుష్పగిరి కడపది. గొడ్రాండ్రు సంతానాపేక్షతోఁ బుష్పగిరి గుట్ట తిరుగుట నేఁటికిని గద్దు.

నదుల పట్టికలో బాహుద, కుముద్వతి కలపు, అదే పట్టికలోఁ బునరుక్తి గాఁ జెయ్యేఱు, కుందు చేర్పఁబడినవి. ఇవి కడప మండలమునఁ బాఱు పను నదులు, అభిమానముతో ఆమ్రేడించినాఁడు.

వాస్తవస్థితి యిట్లుండఁగా నీకవి “నఖగర్త పురాంజనేయ నతజన గేయా” యను మకుటముతో నొక శతకము రచించె నని, నఖగర్త పురము "గోరుగుంతల పాడు" అని, అది నెల్లూరు జిల్లాలో నున్నదని, కనుక ఇతని యునికి గోరుగుంతలపాడేమో యని కొంద ఱూహించుట జరిగినది. ఆంజనేయ శతక ప్రస్తావము గ్రంథమున లేదు. లోకమున ఆ శతక మగుపించుట లేదు. తోఁకను జూచి ఆంజనేయు నూహించుకొనుటయే. శతకము హుళక్కియని త్రోసివేయ నక్కఱ లేదు. ఉండిన నుండుఁగాక. నారాయణకవి రామ మంత్ర సిద్ధి పొందినవాఁడు. ఇతని ప్రసిద్ధి విన్న గోరుగుంతలపాటి వారు ఇతని యింటికి వచ్చి యర్థించి, ఆంజనేయ శతకము వ్రాయించుకొని పోయినారేమో ! ఇప్పుడు సుప్రభాతములు వ్రాయించుకొన్నట్లు, లేకున్న అనాఁడు నఖగర్తపురమే ఒంటిమిట్ట దగ్గర నుండె నేమో ! అదియుఁ గాకున్న “పురం పురి శరీరేచ". (విశ్వకోశము) అన్నారు గనుక నతజన గేయుఁడైన నఖగర్త పురాంజనేయుఁడు రిపు నఖక్షత చిహ్నిత గాత్రుఁడై న రణధీరుఁడైన కపివీరుఁ డేమో ! ఒంటిమిట్ట కవుల దొక ప్రత్యేకపు బాణీ, రఘువీర శతకము చెప్పిన తిప్పయ్య మొదలుకొని వీరందఱు సీతా రామస్తుతితోనే కృతికి శ్రీకారము చుట్టుదురు. కవి స్తుతిలో శ్రీనాథుని పేరెత్తరు పోతన్నకు విశిష్ట స్థానమిత్తురు రామభద్రకవి చూడుఁడు.

“గీ. శబ్దశాసన సుకవి కంజలి యొనర్చి
    యుభయకవి మిత్రునకు హస్తయుగళి మోడ్చి
    శంభుదాసుని సోము భాస్కరుఁ దలంచి
    యాంధ్ర వాగ్భాగవత కర్త నభినుతించి.”
                                      (రామాభ్యుదయము. 1-10)

తుదిపాదమంతయుఁ బోతనకే. వీరి రామభక్తి యట్టిది, కాదు. ఆ స్థలమహిమయే అట్టిది. నారాయణకవి పాటించిన వాణిని బట్టి అతఁ డక్కడి వాఁ డనియే చెప్పవలెను.

ఇంత యేల! ఇందలి మాండలిక శబ్ద స్వరూపము మాటతీరు “ఇతఁడు పలానా ప్రాంతమువాఁడు" అని చెప్పక చెప్పుచున్నవి.

కాలము

నారాయణకవి జీవించిన కాలము గుఱించి, పెద్దలు తలకొక రకముగా నూహించి చెప్పిరి. నికరముగాఁ దేల్చి చెప్పినవారు లేరు. కదిరీపతి కంటె అర్వాచీనుఁ డనిమాత్రము అందఱును గంఠోక్తిగాఁ జెప్పిరి. కదిరీపతి కవి క్రీ.శ. 1660 ప్రాంతమున నుండెనని డా॥ నేలటూరి వేంకటరమణయ్యగారు వ్రాసిరి. శ్రీ ఆరుద్రగారు క్రీ.శ. 1648 ప్రాంతాలకే కదిరీపతికి కావ్యనైపుణ్యాదులు పట్టుబడ్డాయన్నారు. “నారాయణ కాలం క్రీ.శ. 1650 అవుతుంది" అన్నారు. ఎవరు ముందో యెవరు వెనుకో అను సందేహము మనకుఁ గలుగును. కాని, కదిరీపతి కావ్యఫక్కి నారాయణకవి “మక్కికిమక్కి అనుకరణ చేశాడు” అన్న పంక్తితో ఆ సందేహము తొలఁగును. సమకాలికులైనచో ఈ వ్యవహారము కోర్టు కెక్కడిది. వారిరువురు సమకాలికులు కారు. దాదాపు ఒక శతాబ్ది కాల మతనికి నితనికి నెడ ముండి యుండును.

వావిళ్ల ప్రతులు అందాజుగా నారాయణకవి క్రీ. శ. 1800 ప్రాంతము వాఁడని ప్రకటించినవి.

అయ్యలరాజువారి వంశవృక్షమున్నది కదా! అది 15 వ శతాబ్ది నుండి లెక్కింపఁబడినది. 16 వ శతాబ్దమున రామభద్ర కవి యున్నాఁడు. 18వ శతాబ్దమున “రెట్టమత శాస్త్ర" కవులున్నారు. వీరొక మంచిపని చేసిరి. తమ గ్రంథము శా|| శ|| 1692 సం॥న రచింపఁబడినట్లు గ్రంథాంతమున సీస పద్వమునఁ దామే వ్రాసికొనిరి. అది క్రీ.శ. 1770. ఆ జంట కవులలో నొకఁడగు భాస్కరకవి మనుమఁడే మన నారాయణకవి. కనుక నారాయణకవి క్రీ. శ. 1750 సం||నకు ముందుండుటకు వీలు లేదు.

బ్రౌన్ దొర క్రీ.శ. 1820 స|| న కడపలోఁ గాఁపుర ముండెను. హంస వింశతి పలుకుబళ్లు అప్పటికే కొన్ని ప్రచారమున లేవు, తమ నిఘంటువులోఁ గొన్నిఁటికి “అర్థము తెలియలేదు" అని వ్రాసిరి. పలువురు పండితులకు జాబులు వ్రాసి పద్యార్థము గ్రహించుటకు శ్రమపడిరి. కనుక 1820 ప్రాంతమున నారాయణకవి లేఁడనుట స్పష్టము. సరికదా, అతని పలుకుబళ్లు అర్థము కాకపోవు స్థితి కొంత కలుగుటకు అర్ధ శతాబ్ది కాలమైనను అప్పటికి జరగి యుండవలెను. కాఁగా నారాయణకవి క్రీ.శ. 1770-75 ప్రాంతముననుండి యుండునని యూహింప వచ్చును.

కథా సాహిత్యము

హంస వింశతి తెనుఁగున నొక స్వతంత్ర కథా ప్రబంధము. ప్రాచీన సంస్కృత ప్రాకృత కథలకు అనువాదము కాదు : అనుకరణమును గాదు: అచ్చముగా జీవకళ యుట్టిపడు తెలుఁగుజాతి లోఁగిళ్ల కథాకదంబము. ఈ జాతికిఁ జెందిన కథా ప్రబంధములలో "శుకసప్తతి" మొదటిది; "హంస వింశతి" చివరిది. శుక సప్తతిలోఁ బంజరస్థ శుకము కథలు చెప్పును. హంసవింశతిలో, బంజరస్థ హంసము కథలు చెప్పును. హంస జలపక్షి కదా! పంజరమున నొదుగునా? అని అడుగరాదు. పక్షులు కథలు చెప్పఁగలవా! కవిత్వము జెప్పఁగలవా? అని యడిగినచో, కాదంబరిలోని చిలుక, నైషధములోని అంచ మనకు జవాబు చెప్పఁగలవు. ఇటువంటి కథలు ఏకాంతమున నాయికకుఁ బురుషునితోఁ జెప్పించుట తప్పు. స్త్రీతోఁ జెప్పించుటయు నంత సరసముగ నుండదు. పక్షితోఁ బలికించుటయే బాగు. సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున, శుచిముఖి యను హంసియొక్క వాక్కౌశలముఁజూచి సహస్రాక్షుడు “విహంగయోషవె? భాషాప్రావీణ్యము చూడఁగ వాగ్దేవతవో, కాక, యాకె దిద్దిన కవివో!” అన్నాఁడు. నల దమయంతులకుఁ బొత్తు గూర్చిన హర్షుని హంస మగది. ప్రభావతీ ప్రద్యుమ్నులకుఁ బొత్తు గూర్చిన సూరన్న హంస ఆఁడుది. హంస వింశతి హంస మగదే. ఇరువది రాత్రులు కాలక్షేపము చేసినది. తొలిరాత్రి శుష్కహితోపదేశముతోఁ దెల్లవాఱించినది. మలిరాత్రి నక్కకథ చెప్పి తెల్లవాఱించినది. మూడవరేయి ఆ పప్పు లుడుకవని తెలిసికొని, పచ్చి శృంగారమున ముంచి తేల్చినది. తుదిదాఁక స్థాయి తగ్గకుండఁ బట్టికొన్నది.

మనకు లెక్కలేనన్ని పిట్టకథ లున్నవి. కాని, వాని తీరు వేఱు. దేవతలు, రాక్షసులు, సర్పములు, భూతములు, పిశాచములు, మాంత్రికులు, రాజులు, రాణులు, వేశ్యలు భూమికలుగాఁ గథకట్టి స్వప్నలోకములు సృష్టించి, వినోదము కలిగించుట వాని ధర్మము. అట్టి కథలను బాలసాహిత్యమునఁ జేర్పవచ్చును. హంసవింశతి ప్రౌడ కథా సాహిత్య ప్రబంధము. కాఁగా హంస వింశతి కథా సాహిత్య ప్రయోజన మేమి ? "తొల్లి పరమేశ్వరుండు సంతోష మొదవఁ బార్వతీదేవి కెఱిఁగించె" నఁట చిత్ర విచిత్రమైన భామల చిత్తవృత్తి రహస్యము. ఆ రహస్యము బట్టబయలుగా విప్పి చెప్పినాఁడు పురోహిత బ్రాహ్మణుఁడు; విన్నాఁడు కొలువై నలమహారాజు. అన్నీ కలియుగ కథలే. ఆ కథలు హంస పక్షి చెప్పినది. ఊరక చెప్పలేదు. ఉబుసుపోకకుఁ జెప్పలేదు. ఆక్కఱపడి చెప్పినది. హేమావతి అందగత్తె. ఆమెను రాజు కోరెను. భర్త దూరదేశ మేఁగెను. అది సందుగా నామె రాజునొద్దకుఁ బయనమయ్యెను. హంస పోనీయ లేదు. పట్టి నిలిపి కథలు చెప్పినది. మంత్రాలకుఁ జింతకాయలు రాలునా? రాలవు. కనుకనే, చక్కగా ముస్తాబై యెప్పుడెప్పుడని త్రొక్కులాడుచు, రాజరతి సుఖ మపేక్షించు రమణిమనస్సు ఏ లోకమున విహరించుచుండెనో కనుగొన్న హంస ఆ లోకమునకు వాకిలి తీసెను. ఆమె మనస్సు కుక్కవలెఁ గథలోనికిఁ దూఱెను. కథ ముగిసెను. మబ్బు విరిసెను. తిరిగి మఱునాఁడు హేమావతి పయనమగుట, హంస అదే మంత్రము ప్రయోగించుట, తూర్పు తెల్లనగుట ఇదే ప్రవృత్తి. ఇరువది రాత్రులు గడచెను. ఇరువది యెకటవ దినమున మగఁ డింటికి వచ్చెను. కథ కంచికిఁ బోయెను. కంచి-కాంచి. కాంచి స్త్రీ మొలనూలు. కథ అక్కడకుఁ బోయెను. సతియుఁ బతియుఁ గలిసి సుఖించుట ప్రధాన కథా పర్యవసానము.

కావ్యాంతమున - ఇన్ని కథలు విన్న యా యన్నుమిన్న “పరపురుషసంగమం బిహపర సుఖ దూరంబు" అన్నది. అనఁగా ఆమెకు బుద్ది వచ్చినదని యర్థము. ఆమెను గోరిన రాజుకో ? అతనికిని బుద్ది వచ్చినది. నోరు దెఱచి "ఉర్విజనావళు లన్యకాంతలన్ బన్నుగఁ గోరరాదు, కడుఁ జాతకము" అన్నాడు. కనుక ఈ కథలు వట్టి కథలు కావు.

ఇంత ప్రయోజనకారియైన యీ గ్రంథము క్రీ.శ. 1911 నుండి 1947 వఱకు ముప్పది యాఱేండ్లు అజ్ఞాతవాసమేల చేసినది? ఇది ప్రశ్న. "ఇంటివాఁడే పెట్టె కంటిలో పుల్ల" అను సామిత యంద ఱెఱిఁగినదే. కొందఱు ప్రబుద్ధులు ఆసభ్యసాహిత్యమని ఆంగ్ల ప్రభువులకుఁ జెప్పి కొన్ని గ్రంథములు నిషేధింపఁజేసిరి. నారాయణామాత్యుఁడేకాదు, శ్రీనాథుఁడును దోషియయ్యెను. ఈ లెక్కను జూచినచోఁ గాళిదాస మహాకవి ప్రథమదోషి కావలసివచ్చును. దశమస్కంధముఁ దీసికొన్నచో బమ్మెర పోతన్నకూడఁ దప్పించుకొనలేఁడు. లక్షోపలక్షల తెలుఁగు రసజ్ఞులను ముద్దాయి (ముత్ + దాయి = సంతోషదాయి) యగు హంసవింశతి ముద్దాయి (దోషి) యయ్యెను. అయిన నేమి ! అశేషప్రజ యెన్ని వ్రాఁతప్రతులు కల్పించుకొనెనో, యెంత శ్రమపడెనో, “ఆంధ్ర కేసరికిఁ” దెలియును. 1947 సం|| న రాహుపీడ తొలఁగి, హంసవింశతికి స్వతంత్ర ప్రకాశము కలిగెను. ఈనాడీగ్రంథ మింత తప్పుల తడకగా మిగులుటకు హేతువు తత్తమోగ్రహ మీ గ్రంథమును మ్రింగి యుమియుటయే.

కథలు కవికపోల కల్పితములా?

ఈ కథలకు మూలము లేదు. లోకమే మూలము. లోక ప్రవృత్తి చిత్ర విచిత్రముగా నుండును. ఈనాఁడొక సంఘటనము విచారించి చూచినచో దానికి మూలబీజము అష్టాదశ పురాణములలో ఎక్కడనో యొకచోట గోచరింపకపోదు. అంతమాత్రమున దానికిది పుత్రిక యని చెప్పలేము, ముమ్మూర్తుల ముక్కున ఊడిపడినట్లు ఆకథకు ఈ కథకుఁ బోలిక లున్నపుడే చెప్పఁగలము, పురాణకథా సంస్కార పక్వబుద్ధికిఁ దత్కథా రేఖలు భాసించు కల్పనలు స్ఫురింప వచ్చును. లేదా, లోకమున అటనట జరుగు నుదంతములు క్రోడీకరించి యొక కథగా మల్చుటయు జరుగవచ్చును. రెండును గాదని విపరీతముగా యోజించి కథ అల్లను వచ్చును. ఈ మువ్విధముల కథలతో నడిమి తరగతికిఁ జెందిన కథలే హంస వింశతి యందధికము. కథావ్యక్తులు సామాన్య మానవులు. శుకసప్తతి కథల కీకథలు కార్బన్ కాపీలు కావు. పూర్తిగా స్వతంత్ర కథలే. తన కథలను గుఱించి హేమావతితో వాచ్యముగనే కవి యిట్లు చెప్పించినాఁడు.

“మ. కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్ గల్పించెదో. కాక పె
     ద్దలచేఁ బూర్వము విన్నవాఁడవొ, మహా దైవ ప్రసాదంబొ; విం
     తలు సుమ్మిట్లు వచింప నన్యులకు మేధాశక్తి నిన్‌బోలు వా
     రలు లేరింక, బలారె!" (4-67)

దీనిని బట్టి యితఁడు స్వబుద్ధిచేఁ గల్పించెనో పెద్దలచే వినెనో దైవప్రసాదముచేఁ గనెనో యని త్రిథాప్రకీర్ణ మనస్సుతో విచికిత్సింపఁ బని లేదు. “మేధాశక్తి నిన్ బోలు వారలు లేరు" అనుటనుబట్టి యీకథ లితఁడే కల్పించెనని గట్టిగాఁ జెప్పవచ్చును. హంసను బ్రశంసించు వ్యాజమున నాత్మస్తుతి చేసికొనెనని మన మూహింపవలసిన పనిలేకుండఁ గృత్యాదియందే పదునేనవ పద్యమునఁ దనకీర్తి యెట్టిదో, తన మేధ యెట్టిదో, తన దాతృత్వ మెట్టిదో, తన రూప మెట్టిదో, తానే బాహాటముగా వర్ణించు కొన్నాఁడు. ఇతని మేధ బ్రహ్మ, శేషుఁడు, బుధుఁడు బృహస్పతి యీ నలువురు మేధావుల మేధకుఁ 'బ్రతివిఘాతి' యఁట. అట్టివాఁడు స్వతంత్రముగ యోజింప కుండునా ? అతనికిఁ దెలియకుండ యాదృచ్ఛికముగా నెక్కడవైనఁ బూర్వ కథలతో సంవదించు సందర్భములో సన్నివేశములో యతని కథలలోఁ బొడసూపినచో దాని కతఁడుత్తరవాది కాఁడనియు మనము గ్రహింప వలెను.

హంస వింశతి అష్టమరాత్ర కథ.

వసుమతీ ధనచిత్తులు వైశ్య దంపతులు. భర్త పరస్త్రీ సక్తుఁ డయ్యెను. భార్య పరపురుష సక్త యయ్యెను. ఒకనాఁటి చీకటిలో సంకేత స్థలమున నుభయులు తారసిల్లిరి.

తే. తాను గోరిన కన్య యీతరుణి యనుచుఁ
   జేరె నాసక్తిచే ధనచిత్తుఁ డపుడు
   ఆ యువాగ్రేసరుం డీతఁ డౌ నటంచుఁ
   గదిసె వసుమతి యత్యంత కాంక్షతోడ. (2-247)

ప్రాఁత రోఁత క్రొత వింతకదా ! ఆమె నూతన స్త్రీయని యతఁ డనుకొనెను. అతఁడు నూతన పురుషుఁడని యామె యనుకొనెను. ఈ యనుకొనుట. మనస్సు చేసినపని. దాని వికార మెట్లు విజృంభించినదో యీ పద్యముఁ జూడుఁడు.

మ. సహసా సంఘటిత స్తన గ్రహణ సంజాతాంగ రోమోద్గ మం
    బు, హఠాచ్చుంబిత పాటలాధర ముఖాంభోజాక్షి గండంబు, దు
    స్సహ నీవీచ్యుతి కంచుకాహృతి నఖాంచద్దంత గాఢక్షతా
    వహనం బిర్వురకయ్యె సంగమము దిగ్వారార్పితేక్షాళియై. (2-249)

ఇంత జరిగిన తరువాతఁ గాని వారొకళ్లొకళ్లు తెలిసికొనుట జరుగలేదు. దంపతులను గలిపి గమ్మత్తు చేయుట అదొక విలక్షణ శిల్పము. శుకసప్తతియు నిటువంటి దొక కథ చెప్పినది. శుభవతీ మోహన దంపతులు చీఁకటిలోఁ దారస పడుదురు. కాని వారొకళ్లొకళ్లు ముందుగనే గుర్తించు కొందురు. కనుక దానిలో సారస్య మగుపింపదు. ఆ లోపమును హంస వింశతి తీర్చెనా యనిపించును . కాని యీ కథకు శుకసప్తతి కథ యొరవడి కాదు. గీత గోవింద కావ్య పంచమ సర్గమునఁ జెలికతై రాధకుఁ జీఁకటి రేయి జరిగిన తమాషా చెప్పినది.

“ఆశ్లేషా దనుచుంబనా దనునఖోల్లేఖా దనుస్వాంతజ
 ప్రోద్బోధా దనుసంభ్రమా దనుర్మతారంభా దనుప్రీతయోః

 అన్యార్థంగతయో ర్భ్రమాన్మిళితయో
        స్సంభాషణైర్ణానతోః
 దంపత్యో రిహ కోనకోన తమసి
        వ్రీడా విమిశ్రో రసః."

మబ్బులో ఆలుమగలు అదాటుపడిరి. ఆలింగనము, చుంబనము, నఖక్షతము, మన్మథప్రబోధము, సంభ్రమము, సురతము వరుసగాఁ గక్కుర్తిగాఁ జకచక జరిగిపోయినవి. తనిసితీరుబడిగాఁ గూర్చుండి ముచ్చటలకు దిగినారు. అపుడు బయటఁబడినదసలు రహస్యము, అతఁడు భర్త: ఆమె భార్య. ఏమైన నాతురపడినమనస్సు కుదుటఁబడినది. అంతేచాలు. కాని తమ చేష్టితము తలఁచు కొన్నవారు తమలో సిగ్గుపొందరా? అది అనిర్వచనీయమైన రసవిశేషము. జయదేవుని యీ యేకైకశ్లోకమునకు వ్యాఖ్యానప్రాయముగా హంసవింశతి వసుమతీ ధనచిత్త దంపతులకథ చెప్పినది.

మఱొక సన్నివేశము. వశీకరణ ప్రయోగమునకు సంబంధించిన యొక కథ శుకసప్తతిలో నున్నది. సాధకునకు మోహినీదేవత సాక్షాత్కరించి అభీష్టస్త్రీ లాభము గూర్చును, ఆ తంతు హంసవింశతికర్తయు నడిపెను,

    శుకసప్తతిలో - " మోహిని నవ్యప్రథమరస విజృంభణవృత్తిన్."

చ. “కనఁబడి కొప్పువీడ, వలిగబ్బిచనుంగవ పైఁటజాఱఁ బూ
    సిననెఱతావి గందవొడిచిందఁగ, నందెలుమ్రోయ దీర్ఘలో
    చనరుచితోడ వీరమణి జగ్గనవేఁడుచు ముద్దువెట్టుకోఁ
    జనుటయు నిర్వికారమతిఁ జాఁగిలి మ్రొక్కి యతండునిల్చినన్.”
                                                   (శుక. 3-171)

ఈ పద్యమునకుఁ బోటీగా హంసవింశతి.

సీ. మినుకొప్పు నునుగొప్పు మినమినల్ దూలాడఁ
         గన్నుల ధళధళల్ మిన్నులాడఁ
   బునుఁగిడ్డ నెఱపూఁత భుగభుగల్ చెరలాడ
         గుబ్బల చకచకల్ ద్రొబ్బులాడ
   జిగిపూని తగుమేని ధగధగల్ దిరుగాడ
         నగుమోము నిగనిగల్ నాట్యమాడ
   గుమిగూడు విరిదండ ఘుమఘుమల్ పొరలాడ
         నందెల ఝళఝళల్ చిందులాడ

తే. నెదుట సాక్షాత్కరించు మోహినికి నతఁడు
    గరిమతో లేచి మ్రొక్కినఁ గరుణఁజూచి (హంస. 4-98)

ఈ పద్యముఁ జెప్పినది. మోహినిత్రుళ్లుపాటు – మినమినల్, ధళధళల్, భుగభుగల్, చకచకల్, ధగధగల్, నిగనిగల్, ఘుమఘుమల్, ఝళఝళల్ కూర్చి విజృంభితముగాఁజెప్పినది. దానికిది తీసిపోదు; మించును.

శుకసప్తతి మోహిని “దీర్ఘలోచనరుచితోడ వేఁడుచు ముద్దువెట్టుకోఁజనుట, అతఁడు నిర్వికారమతిఁ జాఁగిలిమ్రొక్కి నిలుచుట" మనకవికి రుచింపలేదు. అనుచితమని భావించి మోహిని సాక్షాత్కరించెనని మాత్రమే చెప్పినాఁడు. మోహిని లక్ష్మీ పార్వతీ సరస్వతీదేవతలవంటి దేవత యనుకొన్నాఁడు. కాదు. క్షుద్రదేవత. ప్రథమరస విజృంభణవృత్తితో సాక్షాత్కరించు మోహినిని జూచి, సాధకుఁడు మనసుచెదరి తబ్బిబ్బగు ప్రమాద ముండును. ఆదేవత వానికిఁ గామవికారము రేకెత్తించు చిన్నెలెన్నో చూపును. వాఁడు చలించెనా, నెత్తురుక్రక్కి చచ్చును. ఈ రహస్యము సాధకులెఱుఁగుదురు. మనకవియు “గుబ్బల చకచకల్ ద్రొబ్బులాడ" అనుపంక్తిలో మోహిని గాఢపరిరంభమే యభిలషించు చున్నదను భావము వ్యంజితముచేసినాఁడని సరిపెట్టుకొనఁగూడదా? అన్నచో సరిపెట్టుకొనవచ్చును. కవియుద్దేశ మదికాదే: శుకసప్తతియందలి యనౌచిత్యమును బరిహరింపవలెనను పట్టుదల. ఇది సరికాదు. శుకసప్తతిలో బేతాళభటులొక రాజకుమారు నెత్తుకొనిపోయి వేఱొక రాజ శుద్ధాంతమునఁజేర్చి, యద్భుతశృంగార మొలికించుకథ కలదు. అటువంటి కథల జోలికి మనకవి పోలేదు. ఒకనాతికిఁ బాదుకలిప్పించి గగనయానము సాధ్యము చేసినాఁడు. ఒక గోతికి మంత్రమునిప్పించి యాకసమునఁ ద్రిప్పినాఁడు. ఇంతకు మించి అస్వాభావిక సన్నివేశములు సృష్టింపలేదు.

ఇందు 2,6,11, 13,20 కథలైదు బ్రాహ్మణకుటుంబకథలు. తొలికథలో ఱంకు బొంకు లేదు. కాశినుండి లింగముదెచ్చుట, గుడిగట్టించుట యున్నది. 6 కథలోఁ జలిపందిరిలో బాటసారులకు నీళ్లుపోయు ద్విజ జారిణి ద్విజజారునే కోరును. 11 కథలో ద్విజపండితుని పెద్దభార్య ద్విజభిక్షువునే కోరును.13 కథలో నియోగిద్విజునిభార్య జోస్యునే కోరును. 20 కథలో మంత్రికుమారుని భార్యలకు ద్విజులే తటస్థపడుదురు. ఒక నియోగివటువు 5 కథలోఁ బెండ్లికాని గొల్లపడుచును జెఱచును. ఒక వైదికవటువు 19 కథలో గాండ్ల మగనాలిని గవయును. 10 కథలో నొక భూతచికిత్సకుని భార్యతో నూరికరణము సంబంధము పెట్టుకొనును. ఇందు ద్విజస్త్రీలు నీతిదప్పినను, గులము తప్పి చరింపరు: పురుషులు చరింతురు. కోమటి, తొగట (సాలే, తొగట, జాండ్ర నేఁతనేయు కులములు మూడు) గొల్ల, కంసాలి, చిత్తారి, రెడ్డి (కాఁపు) బెస్త, కుమ్మరి, బలిజ, గాండ్ల కులముల స్త్రీ పురుషులకు నియమము పెట్టలేదు. ఈ కథలలో యథేష్టముగఁ జరింతురు.

కథల పుట్టుక

భర్తృహరి శృంగార శతకమునఁ జెప్పిన

శ్లో. జల్పంతి సార్థ మన్యేన
    పశ్యం త్యన్యం సవిభ్రమాః
    హృద్గతం చింతయం త్యన్యం
    ప్రియః కో నామ యోషితామ్ ?

(ఒకనితోఁ దియ్యగా మాటాడుదురు. ఒకని నొయ్యారముగాఁ జూతురు. ఒకనిని మనసులోఁ దలఁతురు. స్త్రీలకుఁ బ్రియుఁ డెవఁడు? పచ్చి మోసకత్తెలు.) అను శ్లోకార్థమును బుక్కిటఁ బెట్టికాని, కవి యీ కథలు కల్పించెను. దీనికిఁ దోడు మనపాలిటి కింకొక శ్లోకరత్నము - అందఱకుఁ దెలిసిన దున్నది.

శ్లో. స్త్రీణాం ద్విగుణ ఆహారో
    బుద్ధిశ్చాపి చతుర్గుణా
    సాహసం షడ్గుణం చైవ
    కామో౽ష్టగుణ ఉచ్యతే.

నారాయణకవి యీ నాలుగింటిని కోటి కెక్కించి చూపినాఁడు.

తిండి యధికముగాఁ దినుటచేఁ బొడము బెడఁదయు నుడువక విడువలేదు.

తే. పిఱుఁదు పిక్కలు చెక్కులు బెడఁగు దొడలు
    వెడఁద యొడలును జన్నులు వెండ్రుకిడను
    సందు లేకుండ బలియుట సకియ మనసు
    జార సంభోగ కేళికి స్వారి వెడలె. (హంస. 3-133)

గ్రంథము కామినీగర్హణముతోనే మొదలెత్తినాఁడు.

క. మంకులు మాయోపాయలు
   బొంకుల పుట్ట లతిపాపపుం జగజంతల్
   జంకెనలు సేయు యువతులు
   శంకరుఁడుం దగఁడు వారి చర్యలు దెలియన్. (1-37)

బుద్దిచాతుర్యము, దాని మించిన సాహసము, దాని మించిన కామము, స్త్రీ యందు భాసించు తీరులు చూపినాఁడు. ఆవేకథలు. ఏదో యొక విపత్తు పుట్టి మునిఁగినట్లు తటస్థించుట, బుద్ధిశక్తిచే దానిని దేలికగా దాఁటుట కథా సామాన్య లక్షణము. ఈ కథలను శుద్ధముగా వచనమున రచించి పెట్టినచో ఇంత వన్నె కెక్కవు. కథాచమత్కారము యొక్క తలఁదన్ను పద్య రచనా సంబంధి చమత్కారము లిందుఁ గొల్లలుగా నున్నవి. మనుచరిత్రకుఁ బ్రశస్తి వచ్చినది. కవితా పితామహుని శిష్యుఁడు, గురువును మించిన శిష్యు డనిపించు కొనవలెనని మనుచరిత్ర మార్గము ననుసరించి వసుచరిత్ర వ్రాసెను. శ్రమపడి యక్కడలేని చమత్కారము లెన్నో ప్రదర్శించెను. కథను దీసివేసి, లోకము ఆ చమత్కారములనే కై కొనెను. ఆ శిల్పమునకుఁ బ్రత్యేక స్థితి సిద్ధించెను.

కదిరీపతి శుకసప్తతిని జూచి, దాని మించిన దనిపించుకొన వలెనని, నారాయణామాత్యుడు హంసవింశతి రచించెను. శ్రమపడి యక్కడలేని విశేషము లెన్నో ప్రపంచించి ప్రదర్శించెను. లోకమునకు నా విశేషములే యుపా దేయములైనవి.

హంసవింశతి విశేషములు.

మృగ పక్షి జాతులు, కోళ్లు, మేకలు, పొట్టేళ్లు, కొండలు, కంపలు, చెట్లు, దీవులు, మనువులు, మానములు, వర్షములు, ఖండములు, దేశములు, పంటలు, వడ్లు, కూరగాయలు, పడవలు, చేపలు, పుణ్యక్షేత్రములు, తీర్థములు, నదులు, సరస్సులు, పుష్కరిణులు, 108 తిరుపతులు, అమ్మవార్లు, గడ్డి, అప్సరసలు, వస్త్రములు, పాత్రలు, భూషణములు, పట్టణములు, పల్లెలు, బాల బాలికలక్రీడలు ఎన్ని రకము లున్నవో అన్నియు గుది గ్రుచ్చి సీసపద్యములు, అవి చాలకున్న సీసమాలికలు, రగడలు, వచనాలు కుప్పవోయుటయందు నారాయణకవి యందెవేసిన చేయి.

భూగోళ ఖగోళ జ్ఞానము, ఆయుర్వేద ధనుర్వేద పరిచితి, భరత సంగీత కళాశాస్త్ర పరిచితి, జ్యోతిర్గణిత మంత్ర యోగశాస్త్ర పరిచితి, శాస్త్రీయ దేశీయ పద్ధతులు కలియఁ గలిపి చూపించుటకే కొన్ని కథలు సందర్భములు కల్పించుకొనెను.

ఆ కాలపుఁ దెలుఁగు ప్రజల కులాచార వృత్తులు, స్నాన భోజన శయనాదులు, వేష భాషలు, తెలిసికొనఁ గోరు వారి కీ ప్రబంధ మాదర్శముగా, నుండులాగున రచించెను. పై పెచ్చు జిలుగు తెలుఁగు పలుకుబడి నుడికారము సందర్భోచితముగాఁ బొసఁగించెను.

కావ్యోపక్రమము

"సీతాభర్త నన్ బ్రోవుతన్" అన్నాడు. సీత "శ్రీరామాంశజయైన జానకి". తద్బర్త యెవఁడో చెప్పఁడు: ఆయన ఱొమ్మునఁ బెద్ద యద్దమువంటి మణి యున్నది. జానకి మణ్యభిముఖముగా నుండెనా, ఆమె బొమ్మ యామెకు గనఁబడును. ఆమె గోల. కనుక అన్యకాంతయని గోల చేయును. అదొక బెడఁదఁ ఆ బెడఁదఁ దొల గించుకొనుట కామె యాభిముఖ్యమును బరిహరించి, యామె నంకపీఠిఁ జేర్చినాఁడు. ఆంక శబ్దమునకుఁ దొడయనియే కాదు, సమీపమనియు నర్థమున్నది. అమ్మవారికిఁ బ్రక్కనఁ బీఁట పెట్టించినాఁడు. సీతకు నాలంబమైన యా పేరులేని వ్యక్తి, యేకము నిత్యము విమలము నచలము సర్వధీ సాక్షి భూతము నైన స్థితి పొందినాఁడు. అట్టి పరబ్రహ్మము నన్ బ్రోవుతన్ అని ప్రార్థనము.

నరస భూపాలీయ పద్య మిట్టే యున్నది. కాని, తుది మలుపు వేఱు దానితోఁ దాత్పర్యమే తలక్రిందగుచున్నది. చూడుఁడు.

"శా|| శ్రీ లీలావతి దా నురోమణి సభా సింహాసనత్కౌస్తుభా
      వేలాభా ప్రతిబింబితాంగి యగుచున్ వేఱొక్కతం దాల్చినాఁ
      డౌలే యంచుఁ దరించునోయని, యమందానందుఁడై లక్ష్మీ నే
      వేళం గౌఁగిఁటఁజేర్చు శౌరి నరసోర్వీనాయకున్ బ్రోచుతన్".

ఈ పద్యమున విషయానంద నిష్పందుఁడైన శౌరి-వసుదేవుని తండ్రి పేరు శూరుఁడు, ఆ యింటివాఁడు కృష్ణుఁడు-ప్రోచువాఁ డగును.

హంసవింశతి పద్యము నరసభూపాలీయ పద్యమునకు ఛాయ వలె నున్నదే యను శంక వొడమును. ఈ ప్రాచీన స్రగ్ధరను జూచినచో ఆ ఛాయా శంక తొలఁగును.

“వక్షఃపీఠే నిరీక్ష్యస్ఫటిక మణిశిలా మండలస్వచ్ఛ భాసి
 స్వచ్ఛాయాం సాభ్యసూయా త్వమియమితి ముహుస్సత్య మాశ్వాసితా౽పి
 వామే మే దక్షిణే౽స్యాః శ్రవసి కువలయం నాహ మిత్యాలప స్తీ
 దత్తాశ్లేషా సహాసం మదన విజయినా పార్వతీ పః పునాతు"

శ్రీరాముఁడు మదన విజయ స్థానమునఁ జెప్పఁబడినాఁడు. 'శ్రీరామాం శజ' యను దళమున ముద్రాలంకారము. ఇదొక విలక్షణమైన కూర్పు.

చిత్రభోగ మహారాజు షట్చక్రవర్తులవలె, షోడశ మహారాజులవలెఁ బుడమి నేలుచున్నాఁడు. ఒకనాఁడు "హావ భావ విభ్రమ విలాస వైఖరుల్ విస్తరిల్ల మరుని సామ్రాజ్య లక్ష్ముల హరువుఁ జెందు చెలులు గొలువంగఁ గొలువుండె." ఉండఁగా "చెట్టు డిగివచ్చి నట్టుల" నొక మహాయోగురాలు వచ్చి చెంతనిల్చెను. (మల్లన రాజశేఖర చరితఘుస ఉట్టి పడ్డట్టు యోగిని యోర్తు వచ్చి, లీల నారాజశేఖరు మ్రోల నిలిచెను) రాజు లేచి మ్రొక్కి పీఁట వేయించి కూర్చుండఁబెట్టినాఁడు. ఆమె దీవెన లిచ్చినది. తరువాత నిద్దఱు లోకాభిరామయణమున దిగినారు ఆ యోగిని "ఈ నవఖండమండిత మహీస్థలి నెల్లఁ జూచిన దఁట. ఒకతెను మించిన యందగత్తె యొకతె వివిధ దేశములలో నున్నారఁట. ఆందఱి తలదన్ను ప్రపంచ సుందరి ఆయూరిలోనే యున్నదఁట. ఎవరో కాదు. సాతాని విష్ణుదాసుని పెండ్లాము. హేమవతి యఁట. హేమవతీ సౌందర్య మయిదు పద్యములతో వర్ణించెను. చివరి పద్యము లోకోత్తర చమత్కార హృద్యము.

సీ. కబరీభరమునకుఁ గందంబుసెల్లు, ను
          త్పలమాలికలు నేత్రములకుఁ జెల్లు
   గర్ణంబులకును మంగళమహాశ్రీ సెల్లు
          గాత్రంబునకుఁ జంపకంబు చెల్లు
   మధుర వాగ్వృత్తికి మత్తకోకిల చెల్లుఁ
          జనుగుబ్బకవకు- మంజరియుఁ జెల్లు
   బిరుదై న పిఱుఁదుకుఁ బృథివివృత్తము చెల్లు
          మధ్యంబునకుఁ దనుమధ్య చెల్లుఁ

తే. పాదముల కంబుజము చెల్లుఁ బరఁగు నడకుఁ
    దనరు మత్తేభవిక్రీడితంబు సెల్లుఁ
    గృతుల వర్ణింపఁదగు తదాకృతులె కృతులు
    వాంఛచే దానిఁబొందిన వాఁడె సుకృతి.
                                 (హంస. 1-62)

దీనిచే నతనికిఁ బొందువడునది రతిసామ్రాజ్యము కాదు : సరస్వతీ సామ్రాజ్యము మాత్రమే అని ధ్వని.

శివసత్తి వచ్చి ఱేని యెదలోఁ జిచ్చు రగిల్చి పోయినది. ఱేఁడు దిక్కులేని స్థితిలోఁ బడియుండఁగా హేలయను కుటిలాలక వచ్చెను. హేల మాలిని. తాపికత్తె. కార్యభారము తన నెత్తిన వేసికొనెడు. సాతానిరాణి యింటికి దారితీసెను. రాకపోకలు సాఁగించెను. చనవు బలిసెను. ఒకనాఁడు అటునిటు చూచి, తన గ్రంథము విప్పెను. నీవు చక్కని చుక్కవు. రాజోత్సంగమున నుండఁదగిన దానవు. "మర్కటము వంటివాఁడు నీ మగఁడు చూడ వానితోఁ గూడి రతికేళిఁ బూనుటెట్లు?" (1-91) ఈ రీతిగా మాలిని చేఁదు కాయకోసి మనసు విఱిచి, హేమవతిని దన యంకెకుఁ ద్రిప్పుకొన్నది. తెగువచాలక వెనుక ద్రొక్కుట చూచి.

క. ఎక్కడి మగఁ డెక్కడి సఖు
   లెక్కడి నీ యత్తమామ లెక్కడి చుట్టా
   లిక్కొలఁది దొడ్డ కొంచెము
   లెక్కింపకు మరుని హావళిం బడువేళన్.

అని యామెమేలుకోరి ప్రోత్సహించినది. కనుకనే చెడిపెలకుఁ జెవి యీయ రాదనిరి. మాలినికంటె ధూర్త స్త్రీ యుండదు.

“నరాణాం నాపితో ధూర్తః
 పక్షిణాం చైవ వాయసః

 చతుష్పదాం సృగాలస్తు
 స్త్రీణాం ధూర్తాచ మాలినీ.

హేమవతి రాజసంగతిఁ గోరి మగఁడులేని తఱిఁ బయనము కట్టినది. అత్తమామల శాసనము బంధుమిత్రుల భయము లెక్క చేయలేదు. కవిత్వము నేర్చిన హంస ఆడ్డగాలు వేయఁగాఁ గాలు కదలింపలేక నిల్చినది. ప్రొద్దు గ్రుంకినంతనే ముస్తాబై పొంగులువాఱు కోర్కులతో గజ్జెల గుఱ్ఱమువలెఁ గడప దాఁటిపో నుంకించు హేమవతిని నిలుపుటకుఁ గవిహంస యుపయోగించిన సామగ్రి, తాను సైకతశ్రోణియగు వాణి నడిగి తెచ్చికొన్న “సుమధు మధుర సుధా వచస్స్ఫూర్తి "యే కాని, అన్యము కాదు. ఆ సామగ్రితో నొకయిల్లు నిలఁబెట్టి పుణ్యము గట్టికానెను.

కావ్యోపసంహారము

చూరదేశమేఁగినమగఁడు తిరిగివచ్చుచున్నాఁడన్నవార్త వచ్చెను. హేమావతి మనసున కంటిన మబ్బు విచ్చెను. "తే. కథలు రేల్ తెల్పుటయే కాదు కరుణఁబ్రొద్దుపోని యపుడెల్ల రాయంచ పూనిచెప్పినట్టి నయవాక్యములచేతనైన సన్మనీష" ఆమెయందు మొగ్గదొడగి పరిమళించినది. ఆమె “పరపురుషసంగమం బిహపర సుఖదూరంబుగానఁ బాతివ్రత్యస్ఫురణగల సతులు మదిఁగోర రటంచును నిశ్చయించు" కొనుట తత్సంస్కార ఫలము.

“పతికి నెదురుగనేఁగె నప్పద్మగంధి". పతిముఖసందర్శనముచే హేమవతి యందు అప్రయత్మముగ నొక శృంగారతరంగము పొంగినది. పొంచియున్న మాలిని గుర్తించెను. హేమవతి నిజముగా భర్త్రనురక్తయయ్యెను. 'పద్మగంధి' సాభిప్రాయవిశేషణము. ఈ క్షణస్ఫురణము, ఓష్ఠాగ్రస్ఫురణము, శ్రోణితటస్పురణము (5-370) కననయ్యెను. దూతిక దుసికిలిపోయి బుట్టలోఁబడిన పిట్ట తప్పించుకొన్నదని రాజుకుఁజెప్పినది. రాజు “కంపిత శిరస్కుండై కొంత తడవు చింతించి," బుద్ధి తెచ్చికొనెను. కొంతతడపు తానెంత ఘోరముగఁ జింతించెనో! “ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులఁగోరి, యేమిసౌఖ్యోన్నతిఁ జెందిరి?" అని ప్రశ్నించుకొన్నాఁడు. రావణుఁడు సీతనెత్తికొనిపోయినట్లు పోఁదలఁచినాఁడు. రౌర్థన్యము వలన లగ్గు కలుగదు. ఎగ్గు కలుగునని తెలిసికొన్నాఁడు. "ఉర్విజనావళు లన్యకాంతలన్ బన్నుగఁగోరరాదు, కడుఁ బాతక మంచుఁ దలఁచి"నాఁడు. పాతకమన్న నిశ్చయమెపుడు కలిగెనో అపుడే “యింతిపై నున్న మనంబు ద్రెక్కొని" యధోచిత పధ్ధతి నుండె". (5–374)

ఇక్కడ మనోలక్షణము చెప్పఁబడెను. ఱేనియెదలో జోగురాలు ముట్టించిన యగ్గి, హేమవతి చెవి యొగ్గినదన్న కుంటెనకత్తెమాటతో ధగ్గుమని ప్రజ్వరిల్లి హేమవతి పతిసక్తయయ్యెనన్న మాటతో బుగ్గియై చల్లబడెను.

“మన ఏవ మనుష్యాణాం
 కారణం బంధ మోక్షయోః "

శుకసప్తతికి హంసవింశతికి పోటీ

శుకసప్తతి కృతికర్త కదిరీపతి. చంద్రవంశ క్షత్రియుఁడు. ప్రభువు. "సర్వజ్ఞమౌళి! కంజకరరూప! కదురభూప!" అని విద్యజ్జనములచేఁ గీర్తింపఁబడ్డవాఁడు. కృతి శ్రీరామాంకితము చేసిన ధన్యుఁడు.

హంసవింశతికర్త నారాయణకవి. "అమాత్య దేవేంద్రుండు." "అంబురుడ్భవ కభుగ్ధవ విధూద్భవ మరుద్ధవగురు ప్రతివిఘాతి" మేధాశక్తిగలవాఁడు. కృతి శ్రీరామాంకితము చేసినవాఁడు, కులముచేత, ఇంద్రపదముచేత, మేధచేత, రూపముచేత, అధికుఁడనని వ్రాసికొన్న ధీరుఁడు.

కదిరీపతి ధౌమ్యుఁడను పురోహితునిచే ధర్మజునకుఁ గథలు చెప్పించెను. మూలకథ పార్వతికిఁ బరమేశ్వరుఁడు చెప్పెను.

నారాయణకవి ప్రత్యుత్పన్నమతియను పురోహితునిచే నలునకుఁ జెప్పించెను. మూలకథ పార్వతికిఁ బరమేశ్వరుఁడు చెప్పినదే. ధర్మజునకంటె నలుఁడు పూర్వుఁడు. అధికుఁడు. శుకసప్తతిలోఁ బ్రధాననాయకుఁడు చిత్రభానుఁడు. కథారంగము పద్మావతీపురము.

హంసవింశతిలోఁ బ్రధాననాయకుఁడు చిత్రభోగుఁడు. కథారంగ ముజ్జయినీపురము.

శుకసప్తతిలోఁ గొరవంజి (ఎఱుకత); హంసవింశతిలో శివసత్తి (జోగురాలు).

శుకసప్తతిలో జగదేకసుందరి మదనసేనుఁడను వైశ్యుని భార్య ప్రభావతి.

హంసవింశతిలో జగదేకసుందరి విష్ణుదాసుఁడను సాతానిబేహారిభార్య హేమావతి. మదనుని తండ్రి విష్ణువు. ప్రభకుఁ దల్లి హేమము. కనుక మదనసేన ప్రభావతులకంటె విష్ణుదాస హేమవతులు అధికులు.

భూపతి జగదేకసుందరిని గోరుట, ఆమె యియ్యకొనుట, అంతలో గృహస్థుఁడు దూరదేశమేఁగుట, యిల్లాలు కడపదాఁటి అడుగిడఁజూచుట, పక్షి అడ్డగాలు వేయుట ఉభయత్ర సమానమే, అది శుకోపదేశము. ఇది (పరమ) హంసోపదేశము.

ఇకఁ బద్యము లెట్లు పోటీపడుచున్నవో చూడుఁడు.

సీ. చంద్రమతీనాథు చందాన, నలుని వై
           ఖరిఁ బురుకుత్సునిగతిఁ బురూర
   వునిమాడ్కి సగరులాగునఁ గార్తవీర్యుని
           యనువున గయునట్టు లంబరీషు
   పొలుపున శశిబిందువలె నంగుపోలికఁ
           బృథునిభాతి మరుత్తురీతి భరతు
   కరణి సుహోత్రుని హరువున రఘులీల
           రామునిక్రియ భగీరథుని ఠేవ

తే. శిబితెఱంగున మాంధాతచెలువమున, య
   యాతిరీతి దిలీపుమర్యాద రంతి
   సరణిఁ బాలించి యలరు నాచక్రవాళ
   వసుమతీచక్ర మమ్మహీవల్లభుండు.
                                         (శుక . 1-93)
సీ. వెలయ హరిశ్చంద్రు విధమున నలుని వీఁ
          కను బురుకుత్సుచాడ్పునఁ బురూర
   వునిలీల సగరులాగునఁ గార్తవీర్యు మ
          ర్యాదను గయుక్రియ నంబరీషు
   మతమున శశిబిందుమహిమ నంగునిఠేవఁ
          బృథునిమాడ్కి మరుత్తవృత్తి భరతు
   నీతి సుహోత్రునిభాతి భార్గవుబలె
          రాముపోలిక భగీరథుని పొలుపు

తే. న శిబిసంగతి మాంధాతనయమునను య
    యాతికరణి దిలీపునియట్ల రంతి
    రీతి నాచక్రవాళపరీత భూత
    ధాత్రిఁబాలించు సవిభుండు తద్విభుండు.
                                          (హంస. 1–42)

ఆరాజున కీరాజు తీసిపోఁడు. ఆద్యుఁడు. ధర్మజునకు పోటి నలుని నిలిపెను. తుదిని యమకము.

రాజదూతి ప్రభావతితోఁ బలికిన పలుకులు –

సీ. బింబోష్ఠి! నీ చంద్రబింబాననము వాని
          వెడఁగునోటను ముద్దువెట్టఁదగునె
    కాంత! నీ సిబ్బెంపు గబ్బిగుబ్బలు వాని
          పరుసుచేతుల నొత్తిపట్టఁదగునె

    యబల! నీ కనకోపమాంగవల్లరి వాని
          కఱకుమేనంటంగ నొఱయఁదగునె
    రామ! నీ మధురాధర ప్రవాళము వాని
          వికటదంతముల కొప్పింపఁదగునె

తే. కొమ్మరో! కుందనపుఁ గీలుబొమ్మకరణి
   నొఱపుగలదాన వీవు వానరమువంటి
   మగనితోఁ గూడి రతికేళిఁ బొగులఁదగునె
   తగదుగా ధాత యీరీతి తగులుసేయ.
                                              (శుక. 1-127.)
సీ. కలికి! నీ సిబ్బెంపు గబ్బిగుబ్బలు వాని
         గడుసుచేతులఁ బట్టి కలఁచఁదగునె
    కాంతరో! నీ తావికావిమో విటువాని
         కొక్కిదంతంబుల నొక్కఁదగునె
    చెలువ! నీ జిగిగోముగల మోము మఱి వాని
         తొట్టినోరున ముద్దువెట్టఁదగునె
    సుదతి! నీ కనకంపు సొంపుదేహము వాని
         కఱకు మేనునఁజేర్చి కలయఁదగునె

తే. కులుకు శృంగార రసములు చిలుకఁ గీలు
    బొమ్మవలె నీటుగలదానవమ్మ! నీవు
    మర్కటమువంటి వాఁడు నీ మగఁడు చూడ
    వానితోఁగూడి రతికేళిఁ బూనుటెట్లు ?
                                                  (హంస. 1-91)

వానర శబ్దమునకు బదులు మర్కట శబ్దము వేయఁబడెను. వానరము నందు నరుని పోలిక యున్నది. మర్కటము శాఖామృగము. ఆ కొమ్మను గనిపెట్టుకొని యున్నాఁడు - కోఁతి యని కొట్టవచ్చినట్టున్నది వెక్కిరింత. కదిరీపతి 'రతికేళిఁ బొగులఁ దగునె' ఏడువ వచ్చునా? అను జాతీయోక్తి వాడెను. నారాయణకవి 'పూనుటెట్లు?' ఆరంభ వైముఖ్యమే తెలిపినాఁడు.

సీ. మగని ప్రక్కనె యుండి తగఁజేరి జోకొట్టి
         మోసపుచ్చని దేటి ముద్దరాలు
    పసుల గోడలనైన వసుధ నిచ్చెనలేక
         యెక్కనేరని దేటి యెమ్మెలాఁడి
    తలవరుల్ గనుగొన్నఁ దప్పునొప్పు ఘటించి
         బొంకనేరని దేటి పుప్వుబోఁడి
    దొరలు గద్దింపఁ గల్లరివార్త నిజముగా
         నిర్వహింపని జేటి నీటుగత్తె.

తే. అత్తమామల గృహకర్త లగుచు మెలఁగు
    నట్టి ధూర్తుల నెల్ల నోరదిమి గదిమి
    పొంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
    చక్కటికి దిద్దుకొనని దే సరసురాలు? (శుక. 1.139)

సీ. కోటగోడల నైన మీటుగా నెగఁబ్రాఁకి
         దాఁటనేరని దేటి తలిరుబోఁడి
   ఘుమఘుమార్బటితోడ ఘోషించు నదులైన
         నీఁదిపోవని దేటి యెమ్మెలాఁడి?
   తనమీఁది తప్పు నొక్కనిమీఁద నిజముగాఁ
         బెట్టనేరని దేటి బిసరుహాక్షి
   ధవుఁడైనఁ దనజాడ తగదని పట్టిన
         నిర్వహింపని దేటి నీటుకత్తె

తే. తలవరులు గన్నచో లేని తాల్మిఁబూని
    బొంకు తథ్యంబు తథ్యంబు బొంకు గాఁగ
    నెంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
    చక్కటికి దేని దదియేటి సరసురాలు? (హంస. 1-102)

పసులదొడ్డి గోడలు దాఁటవలె నన్నాడు కదిరీపతి. అదేమి లెక్క! కోటగోడలు దాఁటవలె నన్నాఁడు నారాయణ కవి. నిండు వఱదలతోడి నదు లీఁదవలెనని కదిరీపతి చెప్పలేదు. దూరదేశమునకుఁ బయనమైన సెట్టికి “టా టా" చెప్పుచుఁ బ్రభావతి,

సీ. మలయుఁబో! మధురాతి మధురాధరల వాఁడి
           చిన్నారిగోరు నీ చెక్కుమీఁద
    నానుఁబో! రంగస్థలాబ్జగంధుల గబ్బి
           మెఱుఁగుఁ జందోయి నీ యురముమీఁద
    మించుఁబో! కాంచికా చంచలాక్షుల ముద్దు
           మొనపంటి గంటు నీ మోవిమీఁదఁ
    జేరుఁబో! నెల్లూరు నారీమణుల కెంపు
           పసమించు నడుగు నీ నొసటిమీఁద

తే. నింట నుండిన నీ సౌఖ్యమేల కల్గు
   ననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁ జేర్చి
   మోవి చిగురంట నొక్కి తమ్ముల మొసంగి
   పోయి రమ్మని పనిచె నప్పువ్వుబోఁడి. (శుక. 1-143)

హేమవతి.

సీ. నీ తావి నెమ్మోవి నిలుచుఁబో! కంచి వా
           ల్గంటుల మొనపంటి గంటి గుఱుతు
    నీ వాలుగన్నుల నెఱయుఁబో! నెల్లూరి
           కొమ్మల కపురంపుఁ దమ్మరసము
    నీ చెక్కుల రహించుఁబో! చెన్నపట్నంపు
           వారిజేక్షణల క్రొవ్వాఁడి గోరు
    నీ యురస్స్థలి మించుఁబో! యఖిలక్షమా
          కోమలాంగుల కుచకుంకుమంబు

తే. లింటనె మెలంగు వారల కీ సుఖంబు
    లెటులఁ జేకూరు నని పల్కి హితము జిల్కి
    పోయి రమ్మని మోము మోమున ఘటించి
    చుంబన మొనర్చి పనిచె నయ్యంబుజాక్షి. (హంస. 1-108)

కంచి చంచలాక్షులు కొఱికేవారు. చెన్నపట్నపుఁ జెలువలు బరికేవారు. వానర లక్షణములు చెప్పఁబడినవి. ఇఁక నెల్లూరి నారీమణుల వ్యాపారము నారాయణ కవికి నచ్చలేదు. పాదము ప్రియుని నుదుటఁ బెట్టుదురా? దాని కెంపు - పస పెన్నలోఁ గలియుఁగాక! అని, కర్పూర తాంబూల రసరంజితాధరసంపుటితోఁ గనుదమ్ముల మీఁద ముద్దు వెట్టించినాఁడు.

చిలుక తొలిపలుకులు

సీ. దశకంధరుని మోహదశ విచారించెనే
         సకల జగన్మాత జనకజాత
   నహుష భూపాలు మన్నన కొప్పుకొనియెనే
         స్త్రీరత్నమైన శచీపురంధ్రి
   యల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనే
         విపుల సద్గుణమాన్య ద్రుపదకన్య
   శబరాధిపుని దురాశలకు లోనయ్యెనే
         రతినిభాకృతి భీమరాజపుత్రి

తే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధ
    కాపురుషు లంగభవ శరాఘాత వికల
    చిత్తులై తమ్ముఁ జేరి యాచించినపుడు
    సిగ్గు వోనాడుకొనిరఁటే! చిగురుబోఁడి! (శుక. 1-155)

అంచ తొలిపలుకులు.

సీ. పంక్తికఁఠుని మోహపరితాప మెంచెనే
          భువనమాత జగత్ప్రపూత సీత
   యల పుళిందుని బొంద నాసక్తి జెందునే
          ప్రియహితామితనయ భీమతనయ
   నహుషుని విరహంపుఁ దహతహల్ చూచెనే
          సాంద్ర సద్గుణచర్య యింద్రుభార్య

    మఱి సింహబలుని పెన్మాయలఁ జిక్కెనే
            యాఱడి పనిఁబూని యాజ్ఞసేని

తే. మునుపటి పతివ్రతలు మహామూర్ఖచిత్తు
    లైన దుర్జను లతిఘోర సూనసాయ
    కాస్త్ర జర్ఝరితాత్ములై యాసపడిన
    మాన ముడివుచ్చుకొనిరఁటే! మచ్చెకంటి! (హంస. 1-127)

'మచ్చెకంటి' సంబోధనము నాయికా కామేంగిత సూచకము . 'చిగురుబోఁడికి' పైచేయి.

సీ. "రాజులు కుటిల సర్ప విషోగ్రతర మూర్తు
    లధరబింబము పంట నదుముటెట్లు"

ఇట్లు సాఁగిన శుక సప్తతి సీసమునకు - "అధిపుల్ క్రూర ఫణిస్వరూపు లధరం బాసించు టేరీతి" అని హంసవింశతి మత్తేభవిక్రీడిత వృత్తము పోటీ. ఇట్టివి పెక్కులు.

సీ. ఏకుతోఁ జెలఁగు కేలెత్తుచో భుజమూల
           కాంతులు బయలు బంగారు సేయ (శుక. 2-422)

సీ. కేలెత్తుచో బాహుమూల జాత ప్రభా
          చకచకల్ పైఁడి వసంత మాడ (హంస. 2–22)

క. రేపటికిఁ గథల్ వినిపించిన నరఁటి
          పండ్ల వేయుము చెలియా! (శుక. 3-596)

మ. వినిపో! నిల్పి ననంటి పండ్లనె
    ననున్ వేయింపు మంతన్ వెసన్. (హంస. 2-70)

చిలుక అరటిపండ్లు తినును. హంస కౌచు తినును. ఆ పక్షి వనచరము. ఈ పక్షి జలచరము. అయినను బాముకుఁ బాలు నేర్పినట్లు హంసకు ననఁటిపండ్లు నేర్పవచ్చును.

ఆ. తెగువయే దేవేంద్ర పదవి యనెడు
    బుద్ది పొదలఁబోలు. (శుక. 1-156)

క. తెగువయె యింద్రపదవి యనఁ
దగు బుద్ధి జనింపఁబోలుఁ దరుణీ ! నీకున్. (హంస. 1-126)

తే. మరుఁడు ప్రక్కలు పొడిచి సమ్మతము జెందు
    మనుచు నిర్బంధ మొనరింప (శుక . 2-479)

ఉ. మారుఁడున్ బ్రక్కలు నెక్కొనన్ బొడువ. (హంస. 1-237)

తే. అరయ నిక్షేప ముంచిన యట్టివారె తెలియవలెఁ గాక. (శుక. 1-539)

క. ఎవ్వరిడు నిక్షేపం బేమఱక వారె కనవలె. (హంస. 2-121)

తే. గుఱ్ఱమై పుట్టి యీగోడు గుడువవలసె. (శుక. 3-405)

తే. గోడిగై పుట్టియును గోడు గుడువవలసె. (హంస. 5-42)

వర్షము కురిపించుట.

సీ. గళదనర్గళ గళద్గళ దుద్ధత ధ్వని. (శుక. 1-276)

సీ. బిబిబిబి ద్గరగరద్భేక భీమధ్వని. (హంస. 5-59)

ఈ రీతిగా గ్రంథమంతయుఁ బోటిపడుచుండుట చూడవచ్చును.

ఈ క్రింది పద్యము వసుచరిత్ర యందీతనికిఁ గల తాత్పర్యమును దెలుపును.

ఉ. ఆరయ నేరెటేటి యసలందుల వెన్నెల తేటనించి తొ
    ల్కారు మెఱుంగు రంగులిడి కమ్మసుధన్ బదనిచ్చి మేటి శృం
    గార రసంబుతోడఁ బొసఁగంగ ననంగవిధాత చేసెఁగా
    కీ రమణిన్ విధాత సృజియించుచు నంటినఁ గందకుండునే!
                                                    (హంస. 5-168)
తే. మేటి జమ్మేటి యసటఁ గ్రొమ్మించు మించుఁ
    బొదివి మదన ప్రతాపాగ్నిఁ బుటమువెట్టి
    తమ్మిగద్దియ దాకటఁ గ్రమ్మి యట్టి
    కొమ్మఁ గావింపఁబోలు నెత్తమ్మిచూలి. (వసుచరిత్ర. 2-32)

పద్యము పద్వమంతయు విఱుపు లేని సంస్కృత సమాసమునఁ గ్రుచ్చి కూర్చుటయు నొక వింతయే. అట్టి వింతలు పూర్వకవి ప్రహత మార్గమున హంసవింశతికవియు నటనటఁ జేసెను. "మేఘేందు కార్ముక మీనదర్పణ వజ్ర" (4-140) అబలావర్ణన సీసమట్టిది. అబల చాల నిఱుకునఁ బడినది. ఈ పద్యమును జూచినచో నితనికిఁ దెనుఁగు ఒదిగి వచ్చినంత సుకరముగా సంస్కృతము ఒదిగి రాలేదని తోఁచును.

శ్రీనాథుని "పతిపాణి పల్లవచ్యుత నీవిబంధన వ్యగ్ర బాలాహస్త వనరుహంబు" పద్యము ననుసరించి పెద్దన “సహసా నఖంపచస్తన దత్త పరిరంభ" పద్యము రచించెను. ఆ సురతవర్ణన పద్దతి తరువాతి ప్రబంధకవులకు మేలుబంతి యయ్యెను. సారంగు తమ్మయ తన వైజయంతీ విలాసమున “జార రతి" నిట్లు వర్ణించెను.

మ. అసుగంధాంగ విలేపనం బనఖ దంతాంకం బతాంబూల మ
    ప్రసవాలంకరణం బనుక్త మణితారావం బశయ్యాతలం
    బసుఖస్వాప మబంధ నైపుణ మసంప్రాప్తాంగ సంక్షాళనం
    బసిధారాటము నైన జారరతి కృత్యం బత్తఱిన్ వర్తిలెన్.
                                               (వైజయంతి 2-40)

జారరతి కృత్యము కత్తిమీఁద నడచుటవంటిదన్న మాట నారాయణకవి మనసున నాటుకొన్నది. "అసిధారా వ్రత” మని వర్ణించెను. అయిదవ రాత్రి కథలో

    “జారశేఖరుఁ డను బ్రహ్మచారి మీఱి
     యెంటిపాటైనఁ దెరువులో నొడిసి పట్టి.”

మ. “అసమాలాప మచుంబితాధర మశయ్యాన్యోన్య విక్రీడితం
     బసమాలింగన మస్థిరోత్సవ మదైర్యస్తంబ తాంబూలితం
     బసుదంతాంక మనిర్భయం బమణితం బస్రస్తనీవ్యాదికం
     బసిధారావ్రతమైన చోరరతి కార్యంబప్డు సంధించినన్. (హంస. 2-107)

    “తిరిగి చూచుచుఁ దనయింటి తెరువుఁబట్టి
     గొల్ల ప్రాయంపుఁ జిల్కలకొల్కి చనియె"

పిల్లలమఱ్ఱి పిన వీరభద్రకవి కుక్కలకుఁ బేర్లుపెట్టి సీసము వ్రాసెను. నారాయణకవి కోళ్లకుఁ బేళ్లు పెట్టి సీసము వ్రాసెను.

సీ. పులిమల్లఁ డడవిపోతులరాజు గరుఁడుండు
          గాలివేగంబు పందేల పసిఁడి
   విష్ణు ప్రసాదంబు వెండిగుండుల పరి
          పచ్చిమిర్యము వెఱ్ఱిపుచ్చకాయ
   పేఁట మాణిక్యంబు విరవాది మెడబల్మి
         పెట్టుకాఁడు వకారి పిడుగు తునుక
   జిగురుఁడు చిత్రాంగి శ్రీరామబాణంబు
         పులియండు కస్తూరి బొడ్డుమల్లె

తే. యనఁగ మఱియును బెక్కుతోయముల పేళ్లు
    దారకులు దేరవచ్చె నుద్దండవృత్తి

    వేఁటకుక్కలు మృగరాజ విగ్రహములు
    పటుకనాథుని వాహ్యాళివాహనములు.
                                     (శృంగార శాకుంతలము. 1_108)
సీ. గరుఁడండు శరథంబు కంచుడమారము
         రణభేరి కార్చిచ్చు ఱాతిబొమ్మ
   రాముబాణము .... .... (హంస. 3-215 చూడుఁడు.)

శ్రీనాథుఁడు ప్రమథుల గుంపును. "ఆగడీలు మహాధూర్తు లగడుఁగాకు లుద్ధతులు గొంట్లు పలుగాకు లుదురుమిడుకు లాకతాయులు శఠులు గయ్యాళులు ..." (హర విలాసము. 5-10)

అన్నాఁడుగదా! 15 వ రాత్రికథలో నొక బలిజెసెట్టికొడుకును గుఱించి నారాయణకవి యొక సీసమాలికనే వ్రాసెను.

"ఆకతాయి బికారి యడిబండగుండఁడు మొండికట్టె గులాము మొప్పె..."
                                             (హంస. 5-113 చూ॥)

ఇంతే కాదు. ఒకటికిఁ బది, నూఱు కల్పింపఁగల నేర్పు, నోర్పుగూడ నారాయణ కవికిఁ గలవు.

తల్లికడుపునఁ గొఱగాని కొడుకు పుట్టుట చెఱకుతుద వెన్నుపుట్టుట వంటిదని చెప్పిన నితనికిఁ దృప్తి లేదు. ఈ క్రింది సీసము చిత్తగింతురు...

సీ. గుడిమీఁదఁబడు రావి కడిలోని చెడుగీఁగ
            పుణ్యనదీతీర్థమునను మొసలి
   కంటిలోఁగొరవెండ్రుకయు రచ్చమఱ్ఱిని
            బ్రహ్మరాక్షసి కాపురమ్ము సేయు
   భవనసీమను ద్రాఁచుపాము కల్పకుజంబు
            కడ గచ్చపొద పాలకడలి విషము

    వనమునఁ జిచ్చు దివ్యౌషధికినిఁబుప్పి
           బ్రతుకు బాలెడునింటఁ బరశురాము

తే. హస్త ముదకాన గ్రుడ్డు సస్యమునమల్లె
    జీవవితతికి రోగంబు చెఱకువెన్ను
    మణికి దోషంబు నృపునందు మార్దవంబు
    పుట్టుచందానఁ బుట్టెను బుత్రుఁడొకఁడు.
                                                  (హంస. 5-109)

కథాసంబంధి పద్యశిల్పము

నారాయణకవి చిత్రవాగ్లక్ష్మీ సంపన్నుఁడు. ఏకవింశతి నాయికల నెన్నికొని, యెక్కడ కక్కడఁ గ్రొత్త యనిపించి, బహుముఖమైన ప్రతిభాజ్యోతిని వెలిగించి వర్ణించినాఁడు. ఇతని గ్రంథమున కీ కొమ్మలే పట్టుగొమ్మలు.

ప్రధాన నాయిక హేమవతి. ఆమె రూపరేఖలు సిద్దస్త్రీ వర్ణించెను. ఱేఁడు మరులుకొనెను. యత్నించెను. కాని, యత్నము ఫలించలేదు.

"కబరీభరమునకుఁ గందంబు సెల్లు, నుత్పలమాలికలు నేత్రములకుఁజెల్లు " (1-62) అను పద్యమున ఆ మూర్తి మనసున కందునదేకాని, చేతికందునది కాదు అను ధ్వనివిశేషము చమత్కారము నతిశయించి పొడగట్టును.

ఇట్టిదే మఱొక పద్యము. అది బ్రాహ్మణీ రమణీయ భావము. బ్రహ్మవేత్తలను జీకాకుపఱచుట.

సీ. నెఱిగొప్పు నెఱరంగు నీలంపు సద్రుచుల్
           నారదభావంబు చూఱగొనఁగఁ
    గలికి కాటుకకంటి చెలువు భారద్వాజ
           గరిమంబునైనఁ జీకాకుపఱుప
    మించి సిబ్బెపు గుబ్బమినుకులు కుంభజ
           సద్వృత్తమంతయు జడియఁజేయ

    మందయానపుఁబ్రౌఢిమము మతంగజ ధైర్య
           పర్యాయమెంతయుఁ బగులఁజేయ

తే. నవ సుధామయ మధురోక్తి నైపుణములు
    శుకమనోవృత్తి నెంతయుఁ జులుకఁజేయ
    మెఱుఁగు జిగినిచ్చువగ జగ్గు నెఱతనంబు
    వెలయఁ జరియించు నదియు నవ్వీటిలోన.
                                                  (హంస. 3-130)

నారద భరద్వాజ కుంభజ (అగస్త్య) మతంగ శుకమహర్షులు జితేంద్రియులు. ఆమె జిగిబిగి ఋషుల కొంపలు గూల్చుచుండెనని ఝటితిస్ఫూర్తి. నారదము = మేఘము. భరద్వాజము = ఏట్రింత పక్షి. కుంభము = కుండ, మతంగజము = ఏనుఁగు. శుకము = చిలుక. కొప్పు మేఘమును, కన్నులు ఏట్రింత పులుగును, గుబ్బలు కుండలను, నడక యేనికలను, పలుకులు చిలుకలను భంగించుచుండెనని కవిసమయ వస్తుసిద్ధమగు ప్రకృతార్థము.

చ. పొలఁతుకవేణి కృష్ణతను బొందిన యంతనె మోము సూడుచేఁ
    దలఁకి విధుస్థితిన్ దనరెఁ దాళక చన్నులు నచ్యుతాకృతిం
    బొలిచె, సహింపలేక నడుమున్ హరిరూపు వహించె, నిట్టి వా
    ర్తలకు మధుద్విషత్త్వమును దాల్చెను జక్కెర లొల్కు మోవియున్.
                                                           (2-235)

ఈ పద్యమున వసుమతి యను వణిక్సతి సౌందర్యము చెప్పఁబడినది. కృష్ణవిధ్యచ్యుతహరి మధుద్విషచ్ఛబ్దములు విష్ణుపర్యాయ శబ్దములు. వేణి (జడ) కృష్ణత్వమును (నల్లదనమును) బొందెను. దానిఁజూచి యీర్ష్యచే మొగము విధుస్థితి (చంద్రుని పోడిమి) దనరెను. దానిఁజూచి తాళలేక చనులు అచ్యుతాకృతి (జాఱని బిగి) బొలిచెను. దానిఁజూచి సహింపలేక నడుము హరిరూపు (సింహము నడుమువంటి సన్ననిరూపు) వహించెను. ఈ వార్తలెఱిఁగి పెదవి మధుద్విషత్త్వమును (తేనెను ద్వేషించుపాటి స్థితి) దాల్చెను. వేణ్యాదులు విష్ణుసారూప్యముఁబొందెను. చిత్తశుద్ధితోఁగాదు-పోటీపడి. ఏమైన అది పవిత్రమైన సిద్ధియే. ఈ సిద్ధి బహిరంగములకే చెప్పఁబడెను. అంతరంగ విషయము చెప్పఁ బడలేదు. కనుక, ఇతర నాయికలవలెనే యీమెయు నభిసరింపఁబోవును. సంకేతమున మునిచీఁకటిలో విటుఁడై వచ్చిన తన భర్తను గదిసి భోగించును. ఈలువు చెడదు. తదాదిగా నామె భర్తృసౌముఖ్యమునకుఁ బాత్రమయ్యెను. పవిత్రస్త్రీ యయ్యెను. అదియే విష్ణసారూప్య ఫలము, అది ఘుణాక్షర న్యాయమునఁ గుదిరినది.

పండ్రెండవరాత్రి కథలో నాయిక విశాల. ఆమెభర్త పంచాక్షరీజపపరాయణుఁడు- శివదత్తయోగి. కవి పంచాక్షర ప్రాసపద్యముతో విశాలను వర్ణించెను.

ఉ. సారసమా, నవీనఘృణి సంపదఁ గాంచును నెమ్మొగంబు కా
    సారసమాన విభ్రవము సారె జయించును నాభియున్ సుధా
    సార సమాన మాధురిని జాల రహించును మోవి చంద్రికా౽
    సార సమాన హృద్య రుచిసంతతి మించును గాంతహాసముల్.
                                                              (3-195)

మగని పంచాక్షరీ మంత్రగతమైన మనస్సును స్వమంత్రగతము గావించు కొనుటకు విశాల యెంత ప్రయాసపడుచుండెనో మఱొక పద్యమున విస్పష్టముగాఁ జెప్పెను.

ఆమెరక్తి యతని విరక్తి యౌగపద్యముగ వాన-యెండ తోఁచినట్లెంత విచిత్రముగ నుండెనో చూడుఁడు.

సీ. పదము లొత్తెదనంచుఁ బతిజంఘికలు తన
           తొడలపై వేసికో మిడిసిపడును
    నడుము పట్టెదనంచు నాథుని చిఱుదొడల్
           పుడికినఁ 'జీ' యని పొరలు నవల
    నుతబర్హ మెగద్రోయ నుంకించి మోముపై
           మోముఁ జేర్చినఁ జూచి ముదుగులాడు
    వ్రేల్మెటికలు దీయ వెసనెత్తి హస్తంబు
           కుచములపై వేసికొనినఁ దిట్టుఁ

తే. బ్రక్కలోఁజేరి కౌఁగిఁటఁ జిక్కఁబట్టి
    కులుకు గుబ్బల నెద ఱొమ్ముఁగ్రుమ్మి క్రుమ్మి
    రతి బలాత్కారమునఁ జేయ ధృతివహించు
    ప్రేయసిని జూచి రోయుచుఁ ద్రోయునతఁడు. (3-201)

    పదునాఱవ రాత్రి కథలో నొక బెస్తవాఁ డున్నాఁడు.

తే. మేలు బలువాలుగల నేలు మిసిమిఁగ్రాలు
    కన్నుగవడాలు మరునాలు కరణిఁబోలు
    మురిపెముల ప్రోలు కలదొక్క ముద్దరాలు
    వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. (4-139)

వాలుగలు చేపలు. ఆమె లోచనకాంతి వాలుగల నేలుచుండెను. అనఁగా ఆమె కన్నులు కన్నులవలె లేవు. మిలమిలలాడు మీనముల వలె నున్నవి. "ఈక్షణే విచలతః కూపోదరే మత్స్యవత్... కామేంగితే యోషితామ్." ఆ కన్నులు ఇంగిత మెఱిఁగించుచున్నవి. మగవానిఁ జూచినచోఁ దట్టుకొన లేదు. కనుకనే “వాని యిల్లాలు దొమ్మరవాని డోలు" అన్నాఁడు. డోలుకు దాపటి దెబ్బ, వలపటి దెబ్బ. ఇంటఁ బతిఁ బయట నుపపతి.

జాలరి చేపలను బట్టి చంపును. వాని చెలి చేపల నేలును. ఇదెట్లు? చేపలు లోచనములకు దీప్తి నిచ్చు నాహారము. విటమిన్ ఏ. ప్రభావము నూహింపవలెను.

పదునేడవ రాత్రి కథలోఁ గుమ్మరి ముద్దుగుమ్మ కుచకుంభము లొక యుత్పలమాలతోఁ బ్రత్యేకముగా వర్ణింపఁబడెను. కుమ్మరి సుంత మృత్పిండముఁ గొని, యింతకుండ చేయుట యెట్లుండునో యూహకందునట్లు పరిణామ పేశలముగా వర్ణింపఁబడెను. కుంభకారున కొక దున్నపోతుండెను. అది పోతరించి, ఉక్కు పోఁతపోసినట్లుండెను. వాని భార్య "యింటి యెనుబోతున కంటె మదంబు హెచ్చి" తలవాకిలి కాఁపురముగా నుండెను. నెర మాటలు - అర మాటలు మాటాడును. నెర మాటలు కలుపుగోలుతనముతో మాటాడు మాటలు కావచ్చును. అరమాట లనఁగా నేమి? శకట రేఫమైనచో అఱ = పేటికాదుల అంతర్భాగము. అపుడు మనసులో దాఁచుకొన్న మాటలగును. ఆ మాటల వెనుక నొక చిలిపితనము, దాని వెనుక నొక లెక్కచేయని పొగరుబోతుతనము నుండును. అవి యెట్టివో బాటసారితో ఘటకారనారి జరిపిన సంభాషణక్రమమునఁ జూపఁబడెను.

సీ. దప్పికిమ్మన మదిదప్పినదా? యను
          చెంబుదెమ్మనిన కుచంబె? యనును
    కూరఁబెట్టుమనఁ జేకూరెనా? హితమను
          నన్న మడిగిన నధ్వాన్న మనును
    సున్న మిమ్మన్నఁ గూసున్న మేలనుఁ, బోక
          వక్క లేవనిన గుర్వక్కె యనును
    నిప్పని పలుకఁగా నిప్పనికని యను
          నాకిమ్మనిన మసియాకె యనును

తే. దేహ మలసె నటన్న సందేహమా య
    టంచు నిట్లేపురేఁగి యమ్మించుబోఁడి
    యతని మాటల కరమాట లాడుకొనుచుఁ
    గేరి నవ్విన... (5-70)

ఈ క్రమముఁ జూచినచోఁ, బాప మామెకుఁ జెవుడేమో యనిపించును. కాని చివరఁ గేరి నవ్వుటచేఁ జెవుడు కాదని, కావలసి యన్యార్థముఁ గల్పించి మాటాడుచున్నదని, అరమాటలు వికటోక్తు లని తేటపడుచున్నది.

చమత్కార పద్య శిల్పము

ఈ చమత్కార మధిక భాగము ఛందస్సంబంధియై భాసించును. ఈకవి యేమి? ప్రబంధ కవులందఱు ఈ శిల్పమున కగ్రతాంబూల మిచ్చిన వారే. కని సమయకౢప్తసామగ్రి చేతఁబట్టుకొని భావప్రపంచమున మేడమీఁద మేడ యెన్ని మేడలైనఁ గట్టుదురు. పద్యగత ప్రాసస్థాన మొక క్రీడా స్థానము. వెయ్యి యొయ్యారములు చూపింతురు. కందములు, సీసములు, ఆఁటవెలఁదులు చేయి దిరిగిన కవిచేతిలో ఎన్ని సొంపులు వోవునో చెప్పలేము. ఇవిగాక, పద్యము పద్య మంతయు నేక సమాస ఘటితముగా నిర్మించుట, అచ్చ తెలుఁగులు గుది గ్రుచ్చుట, సర్వగురు, సర్వలఘు, ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, నిరోష్ఠ్య పద్యములు రచించుట, శ్లేష, బంధ, గర్భ, అనులోమ, విలోమ, పాదభ్రమక ప్రముఖ చిత్ర పద్యములు సాధించుట కొద్దిగనో గొప్పగనో చేసి తీరవలయుట యొక మర్యాద యయ్యెను. హంసవింశతి యందు ఆ మర్యాదకు లోటు లేదు.

నారాయణకవి రామరాజ భూషణకవి వలె శ్లేషోక్తి వైచిత్ర్యముఁ జూప యత్నించినాఁడు. కాని యితని కా త్రోవ సుగమము కాలేదు. కారణము తెల్లమే. రామరాజ భూషణుఁడు పిండికలవాఁడు. అతని చేతిలో సంస్కృత వాణి తడిపిన గోదుమ పిండివలె సాఁగును. ఇతనికిఁ జేమకూర వేంకటకవి త్రోవ చక్కగాఁ బట్టువడినది. ఆ ముద్ర యితని కృతిలో సర్వత్ర బారసాఁచి నగుమొగముతోఁ బొడకట్టును. చతుర్థాశ్వాసము 74వ పద్యము, పంచమాశ్వాసము 277వ పద్యము చూడఁగలరు.

కందముల చిందులు

తొడలందము కటిచందము
నడుగుందమ్ముల బెడంగు లాస్యము రంగుల్
జడతళుకున్ మెడకులుకున్
నడబెళుకుం జూడ నా ఘనస్తని కమరున్ . (2-17)

విరులా? నగవులు, నీలపు
సరులా? కురు, లుబ్బు గబ్బి చన్నులు జాళ్వా
గిరులా? యూరు లనంటుల
సిరులా? యని జనులు మెచ్చఁ జెలువ చెలంగున్ . (4-71)

ఆటవెలఁది యొయ్యారములు

వాలుమీలఁ బోలు వామాక్షి చూపులు
సోము సాము గోము భామ మోము
మంచు మించు సంచు నెంచు మై తులకించు
మిన్ను చెన్నుఁ దన్ను సన్న నడుము. (3-69)

మొగము నిండియుండు మోహంపుఁ గన్గవ
యురము నిండియుండు నుబ్బుచనులు
వీఁపు నిండియుండు వేనలి జొంపంబు
దానిఁ బొగడఁ దరమె! మానవులకు. (4-77)

ఇఁక సీసాల విలాసాలకు గ్రంథమే చూడవలెను.

"గోళ్లు రిక్కలజోళ్లు వ్రేళ్లు మావిచిగుళ్లు

చెల్లు పొక్కిళ్లుల్లసిల్లు సుళ్లు" (2-224)
ఇదొక లయ.

4-55 సీసమున నిరువదియేడు నక్షత్రములు, పండ్రెండు రాసులు కూర్చఁబడినవి. సంచారి భావములు ముప్పదిమూడు, సాత్త్విక భావములెనిమిది తడఁబడి తబ్బిబ్బయినవి. శబ్దముగూడ దెబ్బతిన్నది. వచనము వ్రాసియుండిన శుభ్రముగా నుండెడిది.

గీర్వాణ భాషా కౢౢప్తి.

అశీర్నమస్క్రియా సందర్భము లందు గీర్వాణభాష చొనిపి తెనుఁగు పద్యము వ్రాయుట కద్దు. ఇతర సందర్భములందుఁ బ్రాయికముగా వ్రాయరు . వ్రాసినచో విశేషమున్న దన్నమాట.

రెండవ రాత్రి కథలో-

తే. ప్రాము జఠరాగ్నిచేఁ 'గిం కరోమి' యనుచు
    నడరు వేదనచేఁ 'గ్వ యాస్యామి' యనుచు
    విస్మయపు మూర్ఛచే 'నాహతో౽స్మి' యనుచుఁ
    బలువరింపంగ సాఁగె నబ్బక్క నక్క. (1-191)

ఈ నక్క పంచతంత్ర కథలోని కరటక దమనక జంబుక సంతతికిఁ జెందినదేమో! సంస్కృతము పలుకుచున్నదని నవ్వువచ్చును. ఈ శిల్పము నవ్వులాటకుఁ జేసిన శిల్పము కాదు. సద్బ్రాహ్మణుఁడు కాశికిఁ బోయి తెచ్చిన లింగమును బ్రతిష్ఠించి తదర్థము త్రవ్వించిన బావియొద్ద నక్క చావఁబోవుచున్న దన్న భావ్యర్థసూచనము చేయుటకుఁ జేసిన శిల్పము. జీవుఁడు వేల్పునేల పొలిమేరలు చూచుచున్నాఁడు. నక్క యెక్కడ? నాకలోక మెక్కడ ? అను నానుడి యిక్కడఁ బట్టదు. స్థలమహిమకు విలువకట్టవలెను.

పదునొకండవ రాత్రికథలో నొక పండితునిభార్య కఱవునఁబడి, యొకనాఁ డొక భిక్షువును గూడెను. ఆ భిక్షువు బ్రాహ్మణుఁడే కానీ, పొట్ట చించినను అక్షరము లేనివాఁడు. ఆకతాయి. రతి పారవశ్యమున బాపెత సంస్కృతము మాటాడును. అతఁడును మాటాడును. పండిత పత్ని కనుక ఆమె నాలుగు మాటలు కఱచి యుండును. ఇతనికి దేశాటన లాభముచే అబ్బియుండును. వింతయేమి? ఆనవచ్చు, నిజమే, కాని, తనుఁ దామఱచిన మైకమున నప్రయత్నముగా సంస్కృతభాష వెలువడునా? అని చూడవలెను. వీటి విటుల మనస్సులు మహానంద రసప్రవాహమునఁ దేలుచు మర్త్యలోకావరణమును దాఁటి స్వర్గలోకపు టంచున విహరించుచున్నవని చెప్పుట కవ్యభిప్రేత విషయము. ఆమాట వాచ్యముగా ననఁడు. సంస్కృత ప్రసంగముచే ధ్వనింపఁజేయును.

చ. "కురు సురతక్రియాం ప్రణయకోప మతిం త్యజ పూర్వసంగమం
    పరిచిను దేహి గాఢ భుజబంధన మంగజ శాస్త్రవాసనాం

స్మర, రదఖండనం ఘటయ, మామవ మారశరా, నఖక్షతం
విరచయ" యంచుఁ బల్మఱును వేడ్క వచింతురు జారదంపతుల్.
                                                         (3-161)

కల్పనా చమత్కారము

దుర్గములను పరంగులు పిరంగులతో భేదించు కాలము వచ్చినది. అపుడు కవి యిట్లు వ్రాయును.

చ. పొలుపగు మావి లేఁజిగురు పొందిక పోఁత పిరంగిలోన నె
    క్కొలిపిన పుష్పగుచ్ఛమను గుండు పరాగపు మందు నించి, వె
    గ్గలపుఁ బరాక్రమాగ్నిఁగొని కంతుఁడనేటి పరంగి భామ గు
    బ్బలనెడు దుర్గముల్ పగులువాఱ గుభుల్లున నేసి యార్చినన్ .
                                                           (1-230)

ఆ కాలమున దొంగలు నిలువు దోపిడి (చీరలతోఁ గూడ) చేసెడివారు. ఈ కల్పన మనోహరము.

తే. కలయఁ గొమ్మలతోఁ గూడి కాననముస
    నుండు విటపుల ననిలచోరుండు పట్టు
    కొని దళాంబరములు దోచుకొనియె ననఁగఁ
    బండుటాకులు గాడ్పులు పర్వ రాలె.
                                                           (5-223)

కొమ్మలతోఁ గూడిన విటపులు శాఖలలోఁ గూడిన వృక్షములు: స్త్రీలతోఁ గూడిన (విట + ప) జార ప్రభువులు.

తే. తనయుఁడగు రాజు ఘనమార్గమునను రాఁగఁ
    గోట యా త్రోవ నరికట్టుకొన్న సుద్ది
    విని, జలధి దాని చుట్టును విడిసె ననఁగ
    నా రసాతల నిమ్న ఖేయంబు ధనరు. (5-7)

కోట వెలుపలి అగడ్త చాలఁబెద్దది, చాల లోఁతైనది. అయినచో సముద్రమా? సముద్రమే! ఇక్కడ కెందుకు వచ్చినది? కోట మీఁది కోపముతో వచ్చినది. కోటమీఁదఁ గోపమెందుకు? సముద్రము కన్నకొడుకైన చంద్రుఁడు గగనమార్గమున రాఁగాఁ గోట అడ్డగించినదఁట. అందుచేత ససైన్యముగాఁ బోరుకు వచ్చినదఁట సముద్రము. ఈ యుత్ప్రేక్ష యపూర్వము.

కుమ్మరి తొయ్యలి పొక్కిలి పాముల బుట్ట. నూఁగారు నల్ల త్రాచు. దాని నాడించువాఁడు మన్మథుఁడు, ఈ యాట చూడుఁడు.

ఉ. పంచశరాహి తుండికుఁడు భామిని పొక్కిలిపెట్టెలోనఁ దా
    నుంచిన కాలసర్చము సమున్నతి నాడఁగ ఠేవమీఱ బు
    స్సంచు ఫణాగ్రమెత్తి యలరారెడు బాడ్పు న రోమరాజి య
    భ్యంచితలీల మించి మది హర్షముఁ జేయు జనాళికెప్పుడున్. (5-19)

గొల్లపిల్ల నూఁగారు వర్ణించిన వైఖరి యింతకంటెఁ జారువుగా నున్నది.

తే. కొమిరె పొక్కిలి బంగారు కుందియందు
    రతియు శృంగారమను ధాన్యరాశి నించి
    దంచనిడినట్టి రోకలి సంచు మీఱి
    రోమరాజి దనర్చు నారూఢిగాఁగ. (2–100)

పొక్కిలి వడ్లు దంచుకొనెడు నేలరోలు. నూఁగారు నల్లని చేవ రోకలి. ఇట్టి ముచ్చటలు కొల్లలు.

సుదతీ రతిక్షుభిత స్థితి అతిశయోక్తిలేక, స్వభావోక్తిమధురముగా నున్నది.

సీ. చిఱుచెమ్మటలతోడ బెరసిన ఫాలమ్ము
           కసవంటి వీడిన కప్పుకొప్పు

     కడు రక్తిమము గల్గు గండస్థలంబులు
           వెనుకకు దిగజాఱి వ్రేలు సరులు
    పులకలు నిండారఁ బొడమిన దేహంబు
          ధూళిధూసరితమై దొరయు వీఁపు
    మందస్మితంబగు మధురాధరంబును
          మంద వీక్షణ నమ్ర మస్తకంబు

తే. తడఁబడ వడంకుచుండెడు తలిరుదొడలు
    వదలిన బిగించి సడలించు వలువదనరఁ
    దిరిగి చూచుచుఁ దనయింటి తెరువుఁబట్టి
    గొల్ల ప్రాయంపుఁ జిల్కలకొల్కి చనియె. (2-108)

లోకజ్ఞత

నారాయణకవి నవీనుఁడు. కవిత్వము నేర్చిన కరణము బిడ్డ. గ్రంథములను జదివి నేర్చికొన్న విషయ పరిజ్ఞానము వేఱు. లోకమును బొదివి కూర్చికొన్న విషయ పరిజ్ఞానము వేఱు. మొదటిది చాలమందికి సంగతము కావచ్చు. రెండవది దుర్లభము. ఈ కవి లోకజ్ఞతా విశేషముసకు ఈ ప్రబంధము పంట పొలము.

పదునేనవ రాత్రి కథలోఁ గాఁపుటిల్లు వర్ణించెను. గొడ్డు గోదము, గింజ గిట్ర గల సంపన్న గృహస్థుని యింటి పోడిమి కనులఁ గట్టినట్లు వర్ణించెను.

ధాన్యముల రకములు చెప్పెను. వడ్ల రకములు చెప్పెను. ఎత్తుగీతిగాక 24 పెద్ద పాదముల సీసమాలిక వడ్ల పేరులు చెప్పుటకే సరిపోయినది. కూరగాయలు, కూరాకులు, పండ్లు, ఊరుగాయలు, వీనికి వేర్వేఱు సీసములు. “రామ గుమ్మడి, యోబరాజు గుమ్మడి, చార గుమ్మడి, బూడిద గుమ్మడులును" అని చతుర్విధ కూష్మాండ భేదములు చెప్పెను. దూరదేశమేఁగు విష్ణుదాసుఁడు తనవెంటఁ గావళ్లలోఁ గొంపోయిన తిండ్లు చిఱుతిండ్లు అలనాఁటి తెలుఁగువారి భోక్తృత్వమును, గవి విశేషజ్ఞత్వమును బ్రకటించును.

బోగమువారి యింటిని జూపెట్టుకొనియుండు అనుజీవు లెందఱుందురో, వారి నందఱిని సంతుష్టులఁజేయవలసిన కష్టము విటుల కెంత యున్నదో చక్కగా వ్రాసెను. ఒక విటుఁడు-

సీ. పంచాంగమయ్యకు బాగ సమర్పించు
           నట్టువకానికిఁ బెట్టు మురువు
    భరతంపు టొజ్జకుఁ బచ్చడం బొగిఁగప్పుఁ
           బొగడు బట్టుకుఁ జేర్చుఁ బోఁగుజోడు
    కథ చెప్పు భూసురాగ్రణికి దోవతొసంగు
           ననువుకానికి బత్తె మెనయ నడుపుఁ
    బూల్గట్టు సాతానిబోటి కుంగర మిచ్చు
           గందొడివానికి విందు సేయుఁ

తే. జతురికకుఁ జీర దూతికి సందిబొందె
    కడెము పరిచారికకు సారికకును రవిక
    తాపికకు సొమ్ము వేశ్యమాతకును గాన్క
    లిచ్చి చెప్పించు రతిసేన కెచ్చుతమిని. (5-134)

వీరుగాక గుండఁడు అడిబండఁడను రౌడీలున్నారు. లండి, గుమ్మెతకాఁడు, భృత్యుఁడు, ఆఁడంగివాఁడు తరువాతి పద్యమునఁ జెప్పఁబడిరి. ఇంత బలగముతో వేశ్యానిలయము కలకల లాడుచుండునఁట.

ఎద్దు, గుఱ్ఱము, తమపాట్లు దున్నపోతుతోఁ జెప్పికొనును.

సీ. తలయేరు బెట్టి బీడులు దున్ని పడఁగొట్టి .
           కాలు చిక్కిన బండ్లఁగట్టి మొత్తి

     పొలముకాండ్లకుఁ బంచి తలదిమ్ము బట్టించి
             పట్టుడు కవిలెలఁ బదను జెఱిచి
     పాపనమ్ములఁ జిక్కుపఱచియు రెండేసి
             గొర్లకాఁడి యమర్చి గొట్టుచేసి
     బలుగుంటకల చేనుపాయుచో సాఁగని
             తావుల సెలకోలఁ దాఁక మొత్తి

తే. గానుగలఁ ద్రిప్పి సరువళ గలచి బంతి
    దుడ్డు బరువెత్తి యెకరింత దోలి యొడలు
    గళ్లిపడి రెండు దుక్కులు వెళ్ల దున్ని
    యఱ్ఱుగడిగి పోఁదోల విట్లైతిఁ జుమ్మి! (5-35)

రైతు దాని రక్తమాంసములు పిండి యెండించి, అఱ్ఱుగడిగి వదలెను. ఇఁక దాని చావు దానిది.

గుఱ్ఱపు గోడు.

సీ. ప్రేమ నెదుర్కోలు పెండ్లివారల కిచ్చి
          తెవులైన వారి కద్దెలకు నొసఁగి
    మేయఁబోయిన చోట మెడవెండ్రుకలు బట్టి
          యాకతాయులును వాహ్యాళి దోలి
    సారె గృహప్రవేశమువారి నెక్కించి
          సంతసారెకులందు స్వారి వెడలి
    పల్లె పట్రల నుండి బర్వువేసుక వచ్చి
         వలసల చే కంట్లముల ఘటించి

తే. తీరకున్నట్టి కష్ట సంసారమునకుఁ
   గసవు కట్టెల లద్దుల గాసి పఱచి
   లావు సత్తువ చెడఁగొట్టి లాడెపోవఁ
   జేసి తోలిన నిటకు విచ్చేసినాఁడ. (5-40)

వృషభఘోటకముల కంటె సైరిభమే ధన్యజీవి. దానియొడయఁడు కుంభకారుఁడు వచ్చి, “లంపులమారిదాన! నిను లాచుక మాదిగవాఁడు గోయ" (5–66) అని తిట్టుచుఁ దోలికొని పోవును. తిట్టిన నేమి! కోయఁదగినంత కండ దానిమేన నున్నది. సరిగాఁ బశువుల నట్లే తిట్టుదురు. లోకజ్ఞుఁడైన కవి వాని నెఱిఁగి యుండును.

దారిద్ర్యదోషమెట్టిదో యొక సీసమునఁ జెప్పినాఁడు (2-150). అది "శశిముఖీ దృక్పాత సంరోధి జంబీర ఫలరసం" బఁట. దరిద్రునిఁ జూచినచో ముద్దియలకుఁ గన్నులలో నిమ్మపులుసు పిండినట్లుండునేమో! ఎంత మంట!!

పర్యాయ పదములు పట్టిగట్టి ప్రదర్శించుటయందు సిద్ధహస్తుఁడగు ఈ కవి కూర్పు 1. “దాక్షిణ్య మనురక్తి దయ" (2–42) 2. "సొగసు మిటారంబు సొంపు నొయ్యారంబు" {5-86) సీసములందు; 3. “ఆకతాయి బికారి” (5-113) సీసమాలిక యందుఁ జూడనగును.

విష్ణుదాసుఁడు ఖరీదు చేసి తెచ్చిన విదేశసామగ్రి పట్టిక గ్రంథాంతమునఁ గలదు. పతి సహచరుఁడు వచ్చి, "మదవేదండ లసద్గమనతో సుధారసధారా పాండిత్య మండితోక్తులఁ బండితమండలికిఁ జెవుల పండువుగాఁగన్" (5-346) చెప్పెను. ఆపట్టిక ఆమె కొఱకుఁ గాదు. మనకొఱకు. ఆ పట్టు చూడుఁడు.

శ్రీరామభక్తుల యింటఁ బుట్టి, కృత్యారంభమునఁ బ్రహ్లాద రుక్మాంగదాది భాగవతుల స్మరించి; కృతి రామాంకితముచేసిన నారాయణ నామధేయుఁ డగు నీకవి పదునాఱవరాత్రికథలోఁ బుణ్యక్షేత్రములను మహానదులను సరస్సులను బుష్కరిణులను దీర్థములను 108 తిరుపతులను అమ్మవార్లను దర్శించి సేవించి దానధర్మములు కావించి తరించి వట్టి చేతులతోఁ దిరిగివచ్చు పోలిసెట్టి కొడుకు హిరణ్యకుఁడు (బంగారు సెట్టి) వానకుఁ దడిసి, తలదాఁచుకొనఁ బోయి, బెస్త చెలియతో “వివాహ హీనుఁడన్", "ఆలికే నంగలార్చుచు నన్యసతులఁజూచి గ్రుక్కిళ్లు మ్రింగుచు సుఖములేని కతన యాత్రఁ జరించెడి కతయె కాని, మనసు సంభోగవాంఛల మరగి తిరుగు" (4-229) అని పలుకులాగునఁ గథతీర్చుట, అంగరసము అంగిరసమును మ్రింగివేయకుండ జాగరూకత వహించుటయే యని సమాధానపడుద మన్నను, 'భక్తుఁ డీపని చేయవచ్చునా?' యను బాధయే మిగులుచున్నది.

ఇరువదవరాత్రి కథ వింతకథ. మంత్రి కుమారుఁడు స్త్రీ విముఖుఁడు. "ఆఁడు రూపములు వ్రాసిన యింటను నిల్తురే బుధుల్?" అనువాఁడు. మఱి తన తల్లియొడిలో నెట్లు పెరిగి పెద్దవాఁ డయ్యెనో! పెండ్లి యొల్ల ననువాని నొప్పించి, పెద్ద లిద్దరు పెండ్లముల నంటఁగట్టినారు. అతఁడు వారిని ఒంటి కంబపు మేడలోఁ బెట్టినాఁడు కనుక లోలోపల సొరంగములు త్రవ్వుకొనిపోయి, ఱంకాడుటకు వీలులేదు. ఆకసమున నెగిరి పోవుటకు స్త్రీలకు ఱెక్కలు లేవు కదా! ఱెక్కలు లేకున్నను వారు గగనయానము చేసిరి. మగని కంటఁబడి, వానికి మసిబూసి తప్పించుకొనిరి? ఈ కథ తక్కిన కథల వంటి సాధారణ కథ కాదు; స్వాభావిక కథ కాదు. దీనిని వానితో జోడింపకుండిన బాగుండెడిది. పింగళి సూరన్న విద్యమీఁది మక్కువ మనసును బీకుటచే మన కవి యీ కథ కల్పించి యుండును.

ఛందో వ్యాకరణ స్ఖాలిత్యములు

దక్షిణాంధ్రదేశమున యక్షగాన సాహిత్య నికుంజములు తీవలుసాఁగి దేశీయ సంస్కృతి సంప్రదాయ సౌరభములు గుబాళించు కాలమునఁ బుట్టిన ప్రబంధములలో ఆ వాసన పుంజుకొన్నది. పద్యమునఁ గొన్ని మెత్తనిమాటలు పొదుగుట, పాటవలె నడిపింపఁజూచుట, ఛందోవ్యాకరణ నియమాదుల అంత గణింపకుండుట అప్పుడే మొదలైనది. రచన మాధుర్య గుణ ప్రధానము గనుక రసికులను ముగ్ధులను జేయుసు. తేనె మాక్షికమే యైనను సేవ్యము కదా!

దక్షిణ శృంగార ప్రబంధముల క్రేవకుఁ జెందినదే హంసవింశతి.

యతి భంగములు

తే. ఉగ్ర భీమాది నామధేయ ప్రసిద్ధ. (1-168)

ఇది ముక్తపద గ్రస్త పద్యము. ఇక్కడ యతి పోయినది. శృంగార కావ్య గ్రంథమండలివారి ప్రతిలో- "ఉగ్ర భీమాది నామధేయోత్రసిద్ధ" అను పాఠము కనఁబడును. యతిని సమర్థించుటకుఁ జేసిన దిద్దుబాటు కాఁబోలు.

తే. దర్శనోత్సాహి పతిచపేట ప్రదాయి (2-52)- యతిభంగము. మద్దులపల్లివారు 'పతి దోహద ప్రదాయి' అని దిద్దిరి.

తథ దధలకు, టఠడఢలు సబిందుకములు చెల్లును. నిర్బిందుకములు చెల్లవు. ఇక్కడ 'దర్శన'మునకు 'డర్శన' మను రూపముగూడ నున్నచోఁ జెల్లింపవచ్చు-దక్కు, డక్కు, దగ్గఱ, డగ్గర వలె. 'త'కు 'ఢ' యతి కల్పించిన వారును ఒక రిద్దఱున్నారు. అది సరికాదు.

తే. జంగమార్చనలకు బాలదాస భోజనములకు (5-14) - యతి భంగము.

    4-36, 37 పద్యములందును యతి సడలినది.

సి. వైకుంఠ కేశవ వాసుదేవ పతంజ
         లి విరజ ధన్వంతరి కురుభోగ. (4-209)

                      ల-ర లకు యతి

                      ప్రాస భంగములు

ఉ. చూచినయంతలో మరుఁడు చొక్కపుఁ గప్రపుటాల పుంతలన్
    లే చివురాకు...(2–81)
    లేఁత + చిగురాకు = లేఁజివురాకు అయి, ప్రాస చెడును.

క. ఆతనికి విశాల యనం
   గాఁ దరుణి యొకర్తు దనరుఁ గమ్మవిరి లకో
   రీ తురక రౌతు లాయము
   లోఁ దేజీరతనమనుచు లోకులు వొగడన్. (3-190)

2,4 చరణములఁ బ్రాస విపర్యాసము.

క. నీవైతె జాణ వౌదువు
   కావోలున్-- (3-226)

కాఁబోలును కావోలు చేయరాదు. ద్రుతబాధ తప్పదు. ఇట్టి యతిప్రాస భంగము లక్కడక్కడ గోచరించును.

తే. పరమ స్వోచ్చాంశ లగ్నముల్ పదిల పఱచి. (3-56)
 
   ఇట్టి గణభంగములును గోచరించును,

సంధి విశేషములు.

ఎవని మేధంబురుడ్భవ (మేధ + అంబు) 1-15
అని దీవిం చక్షతపు 1-48
మహి మెట్టిదియో 1-96
నిల్పి ననంటి పండ్లనె (నిల్పినన్ + అనంటి) 2-70
వరములు దంపతుల్ వడ యవారిగ (వడయ + అవారిగ) 2-85
మహావీర్లకు 2-91
నెలం తదిగాక 2-128
విడివడున్న కంతు మదదంతి 2-148
ఆ వాచా లిరుమాళ్ల 3-30
బో టొప్పగున్ (బోటి + ఒప్పగున్ ) 3-70
పోక ము డూడిపో 3-219
ఆయుధోపజీ వటకు 4-143
సంపద లల రల కాఁపువధూటి 4-162
మహాసర సభ్రసరసి (మహాసరసి + అభ్రసరసి) 4-208

తలద్రి ప్పెనుబోతనియె (5-36)

ఆ జవరాలు దా ల్చొగిన్ (దాల్చి + ఒగిన్) (5-84)

చ. “ఖరకరుఁ డస్తమించుదనుకా నొకరీతి”

(దనుకన్ + ఒకరీతి) ద్రుతముపై నచ్చునకు సంశ్లేషము గూర్చిన నొక విధముగ నుండెడిది. ఇతఁడు కావలసియే కాకు దీర్ఘమిచ్చినాఁడు. వైజయంతీ విలాసమున సారంగు తమ్మయ ప్రయోగ మిట్లే యున్నది.

సీ. "నే నిద్రబోవు దాకా నిద్ర బోవదు” (వైజ. 2–126)

ఇవి వ్యావహారిక సంధులు. వీనినిఁ దప్పు అని చెప్పుటయే తప్పు. చెవి కింపుగా నున్నవా? లేవా? అన్నదే విచారము. ఎబ్బెట్టుగా నున్నచోఁ దప్పులే.

'శుభవాటి' అను సుందరిని వర్ణించునపుడు 'టీ' ల కొఱకు ఏదారిఁ ద్రొక్కినాఁడో చూడుఁడు - గడుసరి.

తే. అతని వధూటి శుకఘోటి నలరు మేటి
   యొడయఁ డేలేటి సీమాటి యొఱపు గోటి
   కొన నెగయ మీటి యిదియేటి కులుకనేటి
   బోటి కెదిరేటి శుభవాటి నీటు మెఱయు. (2–185)

తెనాలి రామకృష్ణుఁడు, పింగళి సూరన్న, 'నుయిదాటే వానికిన్', 'గుడి మ్రింగే వానికిన్' అను ప్రయోగములు చేసిరి, ధూర్జటి శైవకవుల త్రోవఁ ద్రొక్కి మఱీ స్వతంత్రించి, 'చేసిందేటిది', క్రీడించుక' (క్రీడి + ఇంచుక) వంటి సంధులును దీర్చెను. పుచ్చుకొనుటకు 'పుచ్చుక' రూపమిచ్చెను. హంసవింశతి కవి తృతీయా విభక్తి ప్రత్యయ మగు 'తో' హ్రస్వాంతముగాఁ గూడ వాడెను. "ఉపనాయకులతొ” రతికేళి (5-312) ఈ పద్దతి కందార్థములలో దరువులలో గోచరించును. “మా నెఱజాణవు” (4-104) (మహా + నెఱజాణ) వ్యావహారిక ప్రయోగము. "వలపు రేఖాతిశయ వైభవము" (1-78) ప్రౌఢతనము (1-235) ఓ మగరాజ (1-107) అపసిరి (1-126) సర్వబంధకత్తెర (1-206) ఏక తాళాటతాళాదులు (5-122) బహువెలల్‌వెట్టి {5-353) వంటి వైరి సమాసములు నిశ్శంకముగా వాడఁబడెను. వ్యతిరేకక్త్వార్థకములు ద్రుతాంతములు గావించెను. కమండలంబు (5-12) (కమండలువు) ధృవము (ధ్రువము) (5-122) వంటి శబ్దవికారములు, పరోపకారిణి భాగ్యశాలిని అనుటకు 'పరోపకారిరా యిక్కలకంఠకంఠి' (1–237) 'పరమ భాగీరథివి మహాభాగ్యశాలి వనుచు దీవించి' (3-138) వంటి పుంలింగ రూపములు రచింపఁబడెను. 18వ రాత్రి కథలో వొకనారికి "విహారి" యను నామకరణము చేసెను.

సంభాషణ ధోరణి

తే. పంటితో నీళ్లుపట్టుక యింటిలోకిఁ
    బోయి, 'యేడుంటి వీసరి ప్రొద్దుదనుక?" (4-235)

మగని గద్దించి బెస్తబిత్తరి ప్రశ్నించు సందర్భమిది. ఇంటిలోకి, ఇంట్లోకి ఏడుంటివి? యాడికి పొయ్యుంటివి? ఇవి కవి ప్రాంతీయపు మాటలు.

'పోతు వెడలి పొయ్యీని, వాకిలివేయు మనుచు మగనితోఁ' గుమ్మరి యెమ్మెలాడి పలుకును. (5-78)

‘అరుగుమింద కూచోబెట్టినావు. బిడ్డ కిందపడీని' అనుట కలదుకదా! వీనివిఁ దక్కువ తరగతి స్త్రీలు మాటాడుమాట లనరాదు. ఎక్కువ తరగతి సుదతియు- "చేనంట, అమ్మ! నొచ్చీనె యనును” (రాధికాసాంత్వనము. 1-124)

గ్రంథ పరిస్థితి

1964 సం.న వావిళ్ళవారు హంసవింశతి కొక నూతనరూప మిప్పించిరి. కీ. శే. మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు మిక్కిలి శ్రమించి పరిశోధించి, చాలఁబద్యములకు నర్థ తాత్పర్యాదులుగూడా వ్రాసిరి. అర్థాన్వయ నియమాదులు పొసఁగని పద్యములను దిద్దితీర్చి పొసఁగించిరి. అభేద్యములుగానున్న పద్యము లను దొలఁగించి, తద్రచనయకాఁ బూరించి యలంకరించిరి. ఒట్టుమొత్తముమీఁదఁ జాల గొప్పపనిచేసిరి. కనుక, “మణౌవజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః" అని నేను సంబరపడి కనులు మూసికొని వావిళ్లవారి క్రొత్తప్రతి ననుసరింపఁ జూచితిని. కాని, “గోషుపేషు" శబ్దము నాకనులు తెఱపించినది. పూర్వముద్రణమున “సంపఁగివిరి.... పాగ, శిరీషపు గోషుపేషు” (4-86} కలవు, నూత్న ముద్రణమున “పాగ"కడ “పాయపోసులు" చేరినవి. పాయపోసులు = ముచ్చెలు. 'గోషుపేషు' తొలఁగించి వీనినిఁజేర్చిరి. మన నిఘంటువులలో 'గోషుపేషు' కనఁబడదు. బ్రౌన్‌దొరగారు అరబ్బీ హిందుస్తానీ పదముల పట్టికలో దీనియర్ధము వివరించిరి. “గోషుపేషు=పాగామీఁద సొగసుగా కట్టుకోబడ్డ వస్త్రము." దవతు, హుశారు, సుపాణి శబ్దములు కవి ప్రయుక్తములే. అయినను నిట్టివి తొలఁగింపఁ బడినవి. పంచమాశ్వాసము నందలి 285 వ పద్యమున "తోడుబోతుల రవంబు" “సివంబు"గా మార్పఁబడినది, తోడుబోతులనగా సహచరులని శాస్త్రిగారు తలఁచిరి. కాదు. మాంత్రికులు, సాహిత్య అకాడెమి ప్రకటించిన “పదబంధ పారిజాతము"న తోడుబోతు చేయు=మంత్రాలద్వారా ఎదుటివారికి కీడు గలిగించు ఆభిచారికక్రియ చేయు అని యున్నది. ఇది రాయలసీమవాడుక అనియు నున్నది. ఇంకొకటి మాత్రము చూపింతును.

క. పన్నీట జలక మొనరిచి
   కన్నురి రానున్న మిన్నగన్నన్నకు మున్
   మున్నొసఁగి సన్నబియ్యపు
   టన్నము మితభుక్తిచేసి యమితోత్సుకుఁడై .
                                            పూర్వప్రతి. (5-139)
క. పన్నీట జలక మొనరిచి
   కన్నెఱి సిరియన్నుమిన్న గన్నన్నకు
                                            నూత్నప్రతి. (5-139)

శాస్త్రిగారు కన్నెఱి=కంటికాహ్లాదకరమైన సౌందర్యముగల, సిరియన్ను మిన్న గన్నన్న = మన్మథుఁడు అని వివరించిరి. అది కన్నురికాదు, కన్నెఱి కాదు. కన్నర (ఱ). ఈ కవి తాతగారు 'కన్నర' శబ్దమును 'వెత' అను నర్థమునఁ బ్రయోగించిరి. (రామాభ్యుదయము. 2-41). ప్రస్తుత పద్యమున 'వెత' కేమి ప్రసక్తియో సందర్భము చూడవలెను. వల్లపుఁడను వాఁడు రతిసేనయను వేశ్యను గూడుటకుఁ దహతహపడుచున్నాఁడు. స్నానముచేసి, "కన్నర రానున్న మిన్ను గన్నన్నకు" = చంద్రునకు నివేదించి, సన్నబియ్యపుటన్నము భుజించినాఁడు. విటులకుఁ జంద్రోదయము 'కన్నర' - పీడ. ఇక్కడ మన్మథప్రసక్తికిఁ దావు లేదు. కనుక, రానున్నవాఁడు మిన్నుగన్నయ్యయే, చంద్రుఁడే. "కన్నర రా నున్న మిన్నుగన్నయ్య" అను పాఠము సరియైనదని నాతలఁపు.

చమత్కార కవిత్వప్రియులగు శాస్త్రిగారు హంసవింశతి కృతి నభిమానించి, నిండుమనస్సుతో నోర్పుతో సరిచేసి ప్రకటించిరి. వారి కృషి నిస్సంశయముగాఁ జాల దొడ్డది. నేఁడు నాకుఁ జాల నక్కఱకువచ్చినది.

దొరకినంతవఱకు దొరగారి పాఠములను బట్టికొని నడచితిని, 150 ఏండ్ల క్రితము దొరగారి పండితులకుఁ గొఱుకుడు వడని పద్యములు, పదములు, మద్రాసు, బందరు గ్రంథ ప్రకాశకుల పరిష్కర్తలకుఁ గొఱుకుడు వడని పద్యములు, పదములు మిగిలినవి-నేఁటికిని మిగిలియే యున్నవి. అట్టివానిని సవరించు పనికిఁ బూనుకొన లేదు, ఇప్పటి కింతమాత్రము చేయఁగలిగితిని. తప్పులున్న మన్నింప వేఁడుచున్నాను.

నాకీ అవకాశము కల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి సారథి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి, రథి డా||బెజవాడ గోపాలరెడ్డిగారికిఁ గృతజ్ఞతాభివందనము లర్పించుచున్నాను.

– సి. వి. సుబ్బన్న శతావధాని

★ ★ ★



పీఠిక.

అయ్యలరాజు నారాయణామాత్యకవి.

“నిందతునందతు వా సన్నసూయు రనసూయు రత్ర కింతేన,
 య త్సన్మానసగమనా యైవేదం మమ తు పాథేయమ్”

ప్రాచీనకవి.

హంసవింశతి యనునీపద్యకావ్యమును రచించిన యీమహాకవి యాఱువేలనియోగి బ్రాహ్మణుఁడు. కౌండిన్యసగోత్రుఁడు, సూరనార్యునకుం బుత్త్రుడు. ఈయన తల్లి కొండమాంబ. ఇంటిపే రయ్యలరాజువారు. ఇక్కవి స్వవిషయము నిట్లు చెప్పుకొన్నాఁడు.

“వ. వెండియు నఖండతేజఃకాండమార్తాండమండల ప్రచండుండును, నిజవితరణాకర్ణనకృశీభూతపారావారపునరభ్యుదయకారణానూనదానధారాప్రవాహసంజాతమహావాహినీవ్యూహుండును, నిస్తులప్రశస్తసద్గుణరత్నాకరుండును, .......... నారాయణామాత్య దేవేంద్రుఁడు కొండొక శుభవాసరంబున నత్యంతసంతోషితాంతఃకరుణుండై" అని

దీనింబట్టి చూడఁ గవులకు నైజమగు దరిద్రము తన్ను బాధింపఁ జాలకుండఁగా ధనసంపన్నుండై గొప్పదాతయై యున్నట్టు పొడకట్టుచున్నది. తన్నొకరు పురికొల్పఁ గాఁ గవిత్వమున కారంభించినట్లుగూడ నీతఁడు చెప్పుకొనకపోవుటంజూడఁ బైవిషయము స్థిరపడుచున్నది. ఇష్టదైవమగు శ్రీరామముర్తి స్వప్నమున సాక్షాత్కరించి నట్లు, గ్రంథమొనర్పం బురికొలిపినట్లు గూడఁ జెప్పుకొనలేదు. కారణమేమో. ఆశ్వాసాంత్యగద్యమునందు

"నిస్సహాయకవితానిర్మాణచాతుర్యనిస్తంద్ర,
 శ్రీరామనామపారాయణ నారాయణామాత్య ప్రణీతము.

అని చెప్పుకొనుటంబట్టి పరికింపఁగా గ్రంథమును జెప్పి యితరులకుంజూపి వారిసంస్కరణముల నంగీకరించుకవి కాఁడనియుఁ బండితకవియనియు, శ్రీరామభక్తుఁడనియు స్పష్టము గాక మానదు. మఱియు భగవద్భక్తాగ్రగణ్యులనం బ్రఖ్యాతివహించినప్రహ్లాదాదిపరమభాగవతుల నిష్టదేవతాస్తుతిలోఁ జేర్చుటంజూడ నీమహాకవి భక్తఁడనుమాట దృఢపడకపోదు. ఈమహాకవి యీగ్రంథమున నింతకుముందు దానుఁ గ్రంథముల నొనరించినట్లు చెప్పుకొన కుండుటం జూడ నిదియే ప్రథమగ్రంథమని తేట పడుచున్నది.

ఆంజనేయశతకము తొలుత రచించి తరువాత హంసవింశతి నొనరించి యాపిదప దశావతారకథాసంగ్రహమును రచించినట్లు కొందఱు వ్రాసియున్నారు. కాని ఆంజనేయ శతకవిషయమిందు వ్రాసియుండక పోవుటచే నిర్ధారణముచేయ వీలులేదు. ఒకప్పు డది శతకమైనందున నీస్వల్పవిషయము నేల చెప్పు కొనవలయు నని యూరక విడిచియున్న నుండవచ్చును. దశావతారకథాసంగ్రహము నాచేతఁ బడలేదు కాన నావిషయమును నేను జర్చింపఁజాలకున్నాఁడను.

ఇఁక నీతఁ డేగ్రామమునఁ గాపురముండెనో యనువిషయము చర్చింపఁదగిన దైయున్నది. అయ్యలరాజురామభద్రమహాకవి ఒంటిమెట్ట యనంబడు నేకశిలానగర వాసియనుట సర్వజనాంగీకృత మగువిషయము. రామాభ్యుదయము రామభద్రవిరచితముగదా. అయ్యలరాజు, భాస్కరకవి యీయిరువురును రెట్టమతమును రచించినమహాకవులు. వీరు కర్నూలు మండలములోని యెఱ్ఱపాలెమునకు బాలకుఁ డయి, యహోబలక్షేత్రమునకు ధర్మకర్త యయిన వేంకటరాజునకు రెట్టమతగ్రంథము నంకితముచేసియన్నారు. కనుక వీరిరువురును గర్నూలుమండలములో నివసించువారే యనుట స్పష్టము. రాజాశ్రయమునకై యితరమండలములలోనున్నవారు రాఁగూడదా యన్నఁ బైవేంకటరాజు పాళెగాఁడే కాని గొప్పరాజ్యము కలవాఁడు కాఁడు. అట్టివానినాశ్రయించుట కెంతయో దూరమునుండి కవులు చనుదెంచి రన్నమాట విశ్వాసపాత్రము గాదు; ఆప్రాంతముల నివసించువారికి వారియందు విశ్వాసము గల్గియుండును గాన వారాశ్రయించియుండుట స్వభావము. కాఁబట్టి పైయిద్దరును గర్నూలుమండలవాసులో లేక యాచెంతనున్న కడపమండలవాసులో యై యుందురు. కడపమండలమున కహోబిలము మిగుల సమీపము.

ఈనారాయణకవి హంసవింశతిలోఁ బూర్వకవిస్తుతింజేయుచు

“ఉ. ఆయ్యలరాజు తిప్పసచివాగ్రణిఁ బర్వతరాజు రామభ
     ద్రయ్యను భాస్కరాగ్రణిఁ బ్రధానవరుండగుకొండధీరునిం

జయ్యనఁ దిమ్మయప్రభుని సత్కవితారచనాఢ్యులైనమా
యయ్యలరాజువంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్.”

అని చెప్పుకొన్నాడు. దీనిం బరికించి చూడఁగాఁ దమపూర్వులు మహాకవులైనట్లును దానావంశసంభూతుఁడననియు, నయ్యలరాజు వారికుటుంబము విద్వత్కవికుటుంబ మనియుఁ జెప్పుకొన్నట్లు స్పష్టము. ఇందతిశయోక్తి యెంతమాత్రములేదు. పయిపద్యమునఁ బేర్కొనఁబడిన రామభద్రాదికవులు కడప కర్నూలు మండలములోని వారయిసట్లు స్పష్టమైనందున నీతఁడుగూడ నీప్రాంతముల నివసించినవాఁడే యని తోఁపక మానదు. ఇతని దీగ్రామ మని నిశ్చయింపఁ దగినయాధారము లీ గ్రంథమున లేవు. ఊహ లెవరి కెట్లుతోఁచునో యట్లు నిర్ధారణము చేయునవకాశ మిందువలనఁ గలగుచున్నది. ఇటీవల నాకుఁ దెలియవచ్చిన విషయ మేమనఁగా ఈనారాయణకవి కడప మండలములోని పుల్లంపేట తాలూకాలోనున్న పొత్తపియనుగ్రామములోనివాఁ డని, దానికిం దగినన్ని సాధనములు దొరకినంగాని 'ఇదమిత్థ' మ్మని సిద్ధాంతము సేయఁజాల కున్నాను.

కొందఱు నారాయణకవి నెల్లూరుమండలములోని గోరుగుంతలపా డనుగ్రామముస నుండినవాఁడనియుఁ గావున తనయొక్కయు తన మేనమామయొక్కయు గ్రామములకుఁ జెంతనున్న కంభము, మార్కాపురము మొదలగు గ్రామముల పేరులు చెప్పె ననియు వ్రాసిరి. ఆమాట విశ్వాసపాత్రముమాత్రము గాదు.

హంసవింశతి పంచమాశ్వాసములో గ్రామములపట్టికలో "రాయదుర్గము, గుత్తి, రాయవేలూ, రానుగొంది, మాహురి, కాశి, గోలకొండ,...” అని ప్రారంభించి కలగూరగంపగా నామములు చెప్పఁబడియున్నందున దత్తమండలవాసియే యని స్పష్టమగునేకాని యితరవిధముగాదు, మఱియుఁ దక్కిన కొన్ని మండలములోని పెద్ద పెద్ద గ్రామములపేరులు చెప్పి దత్తమండలములోనున్న చిన్నపల్లెలపేరులు కూడఁ జెప్పియున్నందున బైయూహకుఁ బ్రబల మగునాధారము కనఁబడక పోదు. అందును గడపమండలములోనున్న పోరుమామిళ్ల, సిద్ధవటము, కనూరు, (కసునూరు) గండికోట, సింహాద్రిపల్లి, ఫుట్లూరు, చింతగుంట మొదలగు గ్రామముల పేరులు చెప్పబడియుండుటంబట్టి పరికించినను దత్తమండలములలోఁ గడపమండలవాసియే యని నిర్ధారణము చేయ నవకాశముగల్గునే కాని వేఱొకయూహ కవకాశము కల్గదు. ఇంతమాత్రముచేతనే యీ నాయూహయు నిశ్చయముకానేరదు. దత్తమండలకవి చరిత్రమును, వ్రాయుచున్నాఁడను గాన, నప్పుడు చర్చించి వ్రాసెద పుష్పగిరితిరు ణాళ్ళనుగూడఁ బేర్కొనుటయుఁ గూడ నాపైయుద్దేశ్యమును బలపఱచుచు న న్నాచరిత్రమునమిగుల శ్రమించి చర్పింపఁ బురికొలుపు చున్నది.

పంచమాశ్వాసములో "ముంగిస, సివంగి, జోణంగి, యింగిలీషు, కుక్కగుంపులఁ గోతులఁ గొన్ని గొనియె” అని చెప్పియుండుటంబట్టి చూడ నూఱు నూటయేఁబది సంవత్సరముల క్రిందట నున్నవాఁ డని చెప్పవచ్చునేమో ఇఁక నీవిషయమును వదలి ప్రకృతవిషయముసకుం గడంగెదను.

ఇక్కవికవితాశక్తి యెట్టిదనియే యిపుడు విచారింపవలయు. దేశకాలాదుల నిర్ణయించు గ్రంథములు వేఱుగా నున్నవి. ఆవిషయ మిట నంతగాఁ జర్చింపఁ దగినది కాకపోయినను సందర్భమును బట్టి మూఁడుమాటలు వ్రాయవలసివచ్చినది. ఈహంసవింశతి యైదాశ్వాసముల గ్రంథము, హంస హేమావతికి నిరువదిదినములు కథలు చెప్పి యామె పరునింటికిఁ బోకుండఁజేసినది. కావున హంసవింశతి యని గ్రంథమునకు నామముగల్గినది. గ్రంథ మంతపెద్దదిగాకపోయినను నవరత్నములను దిరస్కరించు పద్యము లిందుఁగూర్పఁబడియుండుటచే నిది వరమణిహారమని చెప్పకతప్పదు. ఒక్కదానినిమించి వేఱొక్క పద్య మలరారుచుండును. శైలియో రసికజనహృదయానందజనకము. కథలో నొకదానిని మించి వేఱొకటి బుద్ధిచమత్కారమును జూపుచున్నవి. ఇట్టి యుత్కృష్టగ్రంథరాజమునువ్రాసి యిమ్మహాకవి సమానులలో నుత్తమశ్లోకుఁ డయ్యెను. వేయిమాటలేలగాని యిక్కవిమహేంద్రునివలెఁ గవిత్వము చెప్పుట కడుదుర్లభము. కందమునకుఁ గవిబ్రహ్మ యగుతిక్కయజ్వ యని విని యుంటిమి. తరువాత నే నని యాధునికులలోని కవిచౌడప్ప చెప్పుకొనియెను. ఇమ్మహాకవి కందపద్యముల నల్లుటలోఁ దిక్కయజ్వను మించె నని చెప్పి మహాపాతకము నార్జించుకొన సభిలషింపనుగాని యంతవాఁ డని చెప్ప జంకుపడి వెనుకంజవేయను. ఒక్క కందములేగా దేపద్యము చదివినను సెబాసని శిరఃకంపము చేయవలసియే వచ్చును. నారాయణకవిని నోటికసి దీరఁ దిట్టవలయు నని పూనుకొన్న కఠినాత్ముఁడుగూడ సాంతముగాఁ జదివినచో నమస్కరించి శతథాసహస్రథా పొగడునే గాని వేఱొక మాట నోటఁ జెప్పఁజాలడని నానిశ్చయ మని త్రికరణశుద్ధిగాఁ జెప్ప సాహసింపు చున్నాను.

ఈ గ్రంథము నీతిబోధకము గా దనియుఁ జెడుతలంపులను వృద్ధిచేయు ననియుఁ గాన ససద్గ్రంథమనియు నిట్టి గ్రంథమునఁ దనశక్తిని వినియోగించి కవి తనజీవితమును వ్యర్థముచేసికొనియె ననియును గొందఱ తాత్పర్యము, నే నట్లనఁ జాలకున్నాను, అల్బ మతినగుటచే నే నొక్కఁడనెకాదు నిష్పక్షపాతమతు లగుపెక్కుమంది యట్లనక తప్పదనియు నాభావము.

ఇందు హేమావతి యిరువదిదినములు భర్త దేశాంతరము పోయిన కారణముచేతను, హేల యను నొకదూతిక ప్రోత్సాహముచేయుట చేతను, జిత్రభోగుఁడను నాపురపాలకుఁ డైనరాజు నొద్దకుఁ బోవఁ బ్రయత్నింపఁగా నామె యింటనున్న హంస యాహేమావతి కేమోకథలు చెప్పి యాబుద్ధిమాన్పె నని చెప్పఁబడి యున్నది,

పరసంగమమునకై యువ్విళ్ళూరుచు నింటదండించుపెద్దలు లేక తానే యధికారముగలదిగా వున్న నవయువతికి నాబుద్ధిమాన్పుటకు వేదాంతవాక్యములు పనికివచ్చునో, ఆమెకు విన రుచించునట్లు అలాటి కథలనే చెప్పి, యట్టికృత్యములలో రాఁగల కష్టములందెల్పి, చిక్కులు సంభవించినపుడు తప్పించుకొనునంత శక్తి నీకుఁ గలదా యని ప్రశ్నించి, యామె చెప్పఁజాలక యూరకుండఁగాఁ దా నాయుక్తిని దెల్పి, నీకిట్టిశక్తికూడ లేదే యె ట్లిప్పనికిఁ బూనెద వని చీవాట్లుపెట్టి, యామె బుద్ధిని మరలించి సద్భుద్ధిని నెలకొల్పిన నామాటలుపనికి వచ్చునో, బుద్ధిమంతులే నిశ్చయింతురుగాక.

దుర్జనుని సజ్జనునిగాఁ జేయుటకు దండనముపనికిరాదు. సామోపాయ మావశ్యకము. శ్రోతకు హితముగా ముందు మాటలాడి, సమయోచితముగా నీతులునేర్పి, యతనిమార్గము తప్పుగా నున్నదని యతనికేతోఁచునట్లు చేసి క్రమముగా సజ్జనుల మార్గమునకు నతని దేవచ్చునే గాని గుబాలున నొక్క పెట్టున నీతివాక్యములు తాను జిన్నతనమున వల్లించినవి చదివి వెంటనే వానిని సజ్జనశిఖామణి జనకునిజనకునిగాఁ జేయ శక్యముగా దని నానమ్మకము.

మొత్తముమీఁద నట్టివిషయములు గలగ్రంథము తొలుదొల్త నీతిబాహ్య మనియే తోఁపకపోదు. అంతమాత్రముననే దానిని దూషింపఁగూడదు. అట్టి గ్రంధమునఁ జివఱకుఁ దేలునీతి యేమని విచారింపవలయు.

ఆనీతి చెడుత్రోవలఁ బోవఁ జూచునొక యన్నులమిన్నను సన్మార్గమునఁ బోవునట్లు చేయుట యని తేలినపుడు దానిని మెచ్చవలయునేకాని యందున్న కధాంతర్బూతములగు పద్యముల నాల్గింటిని వ్రాసిచూపి యిట్టియవినీతి బోధకపద్యములున్నవి గాన నీగ్రంథము దుర్ణయమును బోధించుననరాదు. ఈవిషయమై యీ గ్రంథమున నైదవ యాశ్వాసమునందు

క. పరపురుషసంగమంబిహ, పరసుఖదూరంబుగానఁ బాతి వ్రత్య
   స్ఫురణగలసతులు మదిఁగో,రరటంచునునిశ్చయించి ప్రమదం బెసఁగ౯

     అనియు,

ఉ. మున్నలరావణాదులుసముద్ధతి సాధ్వులఁ గోరి యేమిసౌ
    ఖ్యోన్నతిఁ జెందిరిట్లగుట నుర్విజ నావళులన్య కాంతలం
    బన్నుగఁగోరరాదు కడుఁ బాతకమంచుఁ దలంచి యింతపై
    నున్నమనంబు ద్రెక్కొనియథోచితపద్ధతినుండె భూవరా.

అనియుఁ జెప్పఁబడి యున్నయది. ఈనీతులను మనంబునం దుంచుకొనియే యీమహాకవి యింతగ్రంథమును బెంచివ్రాసియున్నాఁడు.

★ ★ ★

కథాచమత్కారములు.

ఇంక నిందలి కథాచమత్కారములం గూర్చి యించుక తెలుపవలసియున్నది. తొలిరేయి హేమావతి హేలయను దూతిక పురికొల్ప శృంగారించుకొని చిత్రభోగునింటికిఁ బయనమై ప్రాణపద మనఁదగియున్న హంసయొద్దకు వచ్చి తన యుద్యమమును దెల్పఁగా హంస యామెకు భర్తలేనితఱి నిల్లువెడలి పోఁగూడఁదనియు బరఫురుషసాంగత్యము మహాపాపహేతు వనియుఁ జెప్పెను. అప్పట్టునందు

ఉ. అక్కట! భర్తఁ గాపురము నారడిపుచ్చి నృపాలమౌళితోఁ
    జొక్కి రమించు నందులకుఁ జొచ్చినఁ దావకబంధువర్గముల్
    దక్కువసేతురమ్మ చరితవ్రతముల్ చెడునమ్మ జాతికిం
    బక్కున నిందఁజెంది తలవంపులు దెత్తు రఁటమ్మ మానినీ. 124

సీ. అత్తమామలు గన్న నారడిపుత్తురు బావ పరీక్షింప నేవగించు
    మఱఁదులు గాంచిన గఱకఱి నెంతురు వదినె లెఱింగిన వాసిచెడును
    బంధువుల్ గనినచో బరఁగనిందింతురు తోడికోడలు చూడ నాడికొనును
    బతి గనుఁగొన్నచోఁ బ్రాణహాని యొనర్చు నాడవా రెఱిఁగిన వన్నెదఱుగు

    నరయ నిది గాక యన్నిట నాఁడుపుట్టు
    పుట్టఁ బాపంబు ఫుట్టినఁ బుట్టినింటి
    కేని మఱి చొచ్చినింటికిఁ గీర్తి ఘనత
    దేక యపకీర్తి దెత్తురే తెఱవ లెచట. 125

సీ. పంక్తికంఠునిమోహపరితాప మెంచెనే భువనమాత జగత్ప్రపూత సీత
   యలపుళిందునిబొంద నాసక్తిఁ జెందెనే ప్రియహితామితనయభీమతనయ
   నహషునివిరహంపుఁ దహతహ ల్చూచెనే సాంద్రసద్గుణచర్య యింద్రుభార్య
   మఱి సింహబలునిపెన్మాయలఁ జిక్కెనే యారడి పనిఁబూని యాజ్ఞసేని

తే. మునుపటిపతివ్రతలు మహామూర్ఖచిత్తు
    లైనదుర్జను లతిఘోరసూనసాయ
    కాస్త్రజర్ఝరితాత్ము లై యాసపడిన
    మాన ముడిపుచ్చుకొని రటే మచ్చకంటి. 127

చ. పతిహితభక్తిచే వెలయు పద్మదళప్రతిమాననేత్రకు౯
   వ్రతములసోద లేటికి ధ్రువంబుగఁ బుణ్యము లబ్బు నెప్పుడుం
   బతిని దిరస్కరించి పరభర్తలఁ జెందినభామపుణ్యముల్
   గతజలసేతుబంధములు గావె వచింపఁగ నెంతనోచినన్. 123

అను నీ మొదలగుపద్యరత్నములను గ్రంథకర్త కూర్చి యీ గ్రంథము నలరారఁజేసి యున్నాఁడు. ఆమెచిత్తస్థితి నెఱింగి తగినయుపాయము నాలోచించి యెట్టులేని కాలము పుచ్చవలెనని యూహించియే

మ. ఆధిపుల్ క్రూరఫణిస్వరూపుల............లీడేర్చుకో. 135

అను మొదలగు మాటలు చెప్పి నాఁటిరేయి పుచ్చెను. మఱుదినము రాత్రి ఆమె యథాపూర్వముగ సింగారించుకొని రాఁగా నిఁక నీతులవలన లాభములేదని యుపాయము తెలిసినఁగాని యిప్పనిలో మెలఁగరా దనిచెప్పి య దెట్లని యామె ప్రశ్నించునట్లు చేసి యొకకథచెప్పి కథాంతమున నిట్టి యిక్కట్టున నెట్లు బొంకవలెనో తెల్పుమని యడిగి యామె చెప్పలేకపోఁగా తానే యాపద్దతిని జెప్పుచు నాటిరేయిని బుచ్చెను. అట్లే యిరువది దినములు గడిపెను. ఇందలి కథలన్నియు నొక దానికన్న నింకొకటి యుక్తిలో మించునట్లుండును. ఒకకథకన్న నింకొకకధలో నడిగిన ప్రశ్నమునకు సమాధానము చెప్పుటకు బుద్దిచమత్కార మెక్కువ కావలసియుండును. పోనుపోను కథలు మిగులఁ జమత్కృతి గలిగి చెన్నారుచుండును . ఇట్టు లిరువదిదినములు గడిపి హంస హేమావతిని దుర్వృత్తికి లోనుగాకుండఁ జేసెనని కవి గ్రంథరూపమునఁ దెలియఁజేసెను.

ఒక్కొక్కకథయు వ్యభిచారమునే బోధించుచున్నదే యెట్లిది నీతిబోధకమగు ననరాదు. హేమావతిదుర్వృత్తిని రూపుమాపుటకు నితరోపాయము సాధ్యముకాదు గాన నీయపాయమే తగినదని భావించి యామార్గముననే తుట్టతుద కామెను సచ్ఛీలాలంకార భూషితనుగా నొనరించెను. కావున మొత్తముమీఁద గ్రంథము దుర్ణీతిబోధక మనరాదు. గ్రంథకర్తయాశయముగూడ నట్టిది కాదు.

వేడినీరు పోసిన నిండ్లు మండిపోవునేమో యని శంకనొందినట్లు ఒక్కొక్క కథను బఠించి కొంప మునిఁగిపోయేనే యని విభ్రాంతినొందుధీరస్వాంతుల కొక్కనమస్కార మనుటకన్న నెక్కునవ్రాయ నా కవసర మిటఁ గనఁబడలేదు.

ఇంతట నీవిషయ ముజ్జగించి యిమహాగ్రంథమునం గల పద్యములయందలి చమత్కృతింగూర్చి యించుక తెలిపెదను.

ఇమ్మహానుభావునకుం గలలోకజ్ఞాన మసమానమనుట యతిశయోక్తియని యెవ్వ రన రని నానమ్మకము, ఒక్కొక్క కథలోఁ బ్రస్తాపమునకుం దగిలినకులముల వారివిషయములు చర్చించునపు డీయనకుంగలలోకజ్ఞానము తేటపడఁగలదు. ఒక్కొక్క తెగవారికిం గావలసిన వస్తువులపేరులు, వారియాఁడువారికింగల యాభరణముల నామము లెట్లు తెలిసికొని కూర్చెనో యని యోజించునపుడు మనస్సు ఆశ్చర్యమును బొందక పోదు. పెక్కుప్రదేశములుతిరిగి యందున్న వారియాచారములు పరిశీలించుటలో నీతని శక్తి యనుపమానము. ఇంతమాత్రమే కాదు. ఒక్కయర్థముగలపదము లెన్నిగలవో యన్నియు నీతఁడు కూర్చి కవులకు మహోపకార మొనర్చెను. ఈక్రిందిపద్యములం బఠింపుఁడు.

సీ. వెలయ హరిశ్చంద్రువిధమున నలుని వీఁకను బురుకుత్సుచాడ్పునఁ బురూర
   వునిలీల, సగరు లాగునఁ, గార్తవీర్యుమర్యాదను గయుక్రియ నంబరీషు
   మతమున శశిబిందుమహిమ నంగుని ఠేవఁ బృథునిమాడ్కి మరుత్తవృత్తిభరతు
   నీతి సుహోత్రునిభాతి భార్గవుబలె రాముపోలిక భగీరథునిపొలుపు
   న, శిబిసంగతి, మాంధాత నయమునను, యయాతికరణి దిలీపునియట్ల రంతి
   రీతి నాచక్రవాళపరీతభూతధాత్రిపాలించుసవిభుండుదద్విభుండు. ౧ ఆ. 42ప.

ఇట్టిపద్యము లింకనుం గలవు. 2 ఆ. 14 ప. 5 ఆ. 86 పద్యములను జూచునది.

ఇంతియకాక శ్రుతిస్మృతి శాస్త్రపురాణేతిహాసాదుల నామములను, ధాన్యవిశేషముల పేర్లను, గూర్చినపద్యముల నొక్కసారి చదివినయెడలఁ బరమానందమును బాఠకు లనుభవింపకపోరు. సంస్కృతసమాసములు గలపద్యములను, దేశ్యపదములు గలపద్యములను జూచితిమా శిరఃకంప మొనర్చి బళీ యనకుండ వీలుండదు.

ఈయుదాహరణములు పైవిషయమును సిద్ధాంతీకరింపఁగలవు.

సీ. వ్రీడావహిత్థప్రవేగోన్మదోగ్రరోషప్రదోష వితర్క చపలధైర్య
    .... ...... .. ............ జడిసి తెలిసి. 4ఆ. 83 ప.

ఉ. అంత వసంతవేళఁ జెలు వంతట నెంతయు సంతసిల్లె న
    త్యంతలతాంతకుంతదళపత్ర నిశాంతదురంతతాంతతా
    శాంతికరంబు ........... .......... ......... 5 ఆ 222 ప

దేశ్యపదములకూర్పు

చం. సకినెలకీలుకంఠమునఁ జాయమెఱుంగులసొంపు కెంపు ము
     క్కుకొనల పచ్చరాచిలుక కోళ్లఁ దనర్చినపట్టు పట్టెయ
     ల్లికపయి జాఫరాజినుఁ గులేపునఁ జెందుపలంగుపోషుత
     క్కికగలజాళువాగొలుసు గీల్కొను మంచముపై మహోన్నతిన్. 1 అ. 239 ప.

ఇట్టిపద్యముల నింకనుం జూఫుటకంటె బుస్తకమునే పఠించి చూడుఁ డని చెప్పుట మేలని తోఁచుచున్నది.

ఆర్థచమత్కృతి యీతనికి నుగ్గుతోఁబెట్టినట్లున్నదని యీ క్రిందిపద్యము తేట పఱుపకపోదు.

సీ. కువలయానందంబుఁ గూర్చి యేలు ఘనుండు విబుధులఁబ్రోచుసద్వితరణుండు
    సర్వజ్ఞమౌళిభూపణ మైనధన్యుండు లలితవిభ్రమరూపలక్షణుండు
    సరవిగళల్నించు శ్యామాభిరాముండు వఱలెడుసన్మార్గవర్తనుండు
    విష్ణుపదార్చితవిహితశుభ్రకరుండు శమితతమోహారి యమితశీలుఁ
    డమ్మహారాజచంద్రుఁ డాయననిజాంత, రంగమంతయు నినుఁజేర్చి రమణతోడ
    నేలఁగలఁడమ్మ నీపుణ్యమెసఁగెనమ్మ, తమిని నీడేర్చనమ్మ కుందనపుబొమ్మ 1 అ. 93 ప.

ముక్తపదగ్రస్తము.

సీ. శ్రీపార్వతీకుచశిఖరస్థలవిహార హారాయమాణమహాభుజంగ
    జంగమస్థానరసంచారసమభాస, భావజరూప ప్రభావహరణ
    రణరంగనిర్జితరౌద్రమహాసుర, సురయక్షసేవితచరణయుగళ
    గళదరస్థాపితకాలకూటక్షీర, క్షీరాబ్ధిపుత్రీశఘోరబాణ
    బాణనామకరాక్షసత్రాణదక్ష, దక్షకల్పితయాగవిచారణోగ్ర
    యుగ్రభీమాదినామధేయప్రసిద్ద, సిద్ధ భయభంగ కాశివిశ్వేశలింగ. 1 అ. 168 ప

శృంగారము.

సీ. జల్లిమాటలుగాక సరిచేయవచ్చునే సవరంబు లీశిరోజాతములకుఁ
    బూఁతసుద్దులు గాక పోల్పంగవచ్చునే చందనం బీమేనిగందమునకు
    ............................ నొక్కొకవేళనదియు. 1ఆ. 210ప.

కందము.

గమ్మత్తు చిమ్మ నొకకథఁ గ్రమ్మఱఁ దెల్పెదను వేణిఁ గ్రమ్మవిరులపైఁ
దుమ్మెదలు జుమ్ముజుమ్మనఁ గొమ్మా తలయూఁచి మెచ్చు కొమ్మా నన్నున్.
                                                       2 ఆ. 6 ప.

స్వభావోక్తి.

ఉ. మోమువహించెఁ దెల్వి జగిమోవి రుచు ల్దగ సందడించె మృ
    త్స్నామతి మించెఁ జన్మొనలు శ్యామలకాంతి వహించె యానముల్
    వేమఱు మందగించెఁ గడువృద్ధి భజించెను గౌను చిట్టుముల్
    రామకు సంభవించె నభిరామతరంబుగఁ జీరచిక్కినన్. 2 ఆ. 93 ప.

కల్పనలు.

తే. కొమరె పొక్కిలి బంగారుకుందెయందు రతియు శృంగార మనుధాన్యరాశి నించి
   దంచ నిడినట్టిరోకలిసంచుమీఱి, రోమరాజి దనర్చు నారూఢిగాఁగ.
                                                        2 ఆ. 100 ప.
తే. వక్రయానంబుతో నాగచక్రకుచలు, నిలువుఁ గన్నులతో దేవనీలకచలు
    నాతిమృదుగతిచపలేక్షణములకలికి, క్రిందుమీదయ్యెఁ గాదె పూర్ణేందువదన.
                                                         2 ఆ. 141 ప.

ఇట్లెన్నెన్నివిషయముల నెత్తిచూపినను దృప్తికాఁజాలదు. ఇంకను బెంచి వ్రాయుట గ్రంథమంతయు నిందు వ్రాసినట్టులగును. కాన వదలితిని.

ఎట్టి మహాత్ములకైనను బ్రమాదము లుండకపోవు. "ప్రమాదోధీమతామసి" ఆనుట స్పష్టమేకదా. ఇమ్మహాకవియన్నివిషయములలోఁ బండితుఁడై, లోకానుభవము గలిగి సొంపుగఁ గవిత్వముఁ జెప్పనేర్చియు వ్యాకరణమును బెక్కుతావుల మఱచిపోయి స్వేచ్ఛగాఁ బ్రవర్తించి “నిరంకుశాఃకవయః” అనుమాటను సార్థకము చేయఁ జూచెనని చెప్పవలసి వచ్చెఁగదాయని చింతించెదను. కొన్నికొన్నితావులఁ బద్యములలోఁ గూర్చినపదములు శ్రుతికటువులై కనఁబడుచున్నవి. అందుఁ గొన్నిఁటినిం దుదాహరించెదను.

తత్సమసంధులు

అసాధువు సాధువు
నెలంతదిగాక 2 ఆ. 128 ప. నెలంతయదిగాక
కుటిలకుంతలయ్యెడన్ 5 ఆ 77 ప కుటికుంతలయయ్యెడన్
ఆరతిసేనపుడు 5 అ. 137 ప. ఆరతిసేనయపుడు

ద్రుతముపై నున్నయచ్చునకు సంశ్లేషము.

జలాభిపూర్ణమగుచున్నాబావి 1 ఆ. 185 ప.

అటుకన్నెలమిన్ 3 ఆ. 91 ప.

ఈక్రిందిసంధికి దేవుఁడే శరణము.

ఖరకరుఁ డస్తమించుదనుకా నొకరీతి. 5 ఆ. 83 ప.

విభక్తి ప్రత్యయపుఁ జమత్కారము.

ఉపనాయకులతొ రతి 5 ఆ. 312 ప.

క్త్వార్థకసంధులు.

అసాధువు. సాధువు
అనిదీవించక్షత 1 ఆ. 48 ప. అనిదీవించియక్షత
చూచిదితెలియదు 3 ఆ. 43 ప. చూచియిది తెలియదు
చూచిటురమ్ము 3 ఆ. 157 ప. చూచియిటురమ్ము
చూచదయత 4 ఆ. 30 ప. చూచియదయత
తాల్చొగిన్ 5 ఆ. 84 ప. తాల్చియొగిన్
తలఁచటు 5 ఆ. 195 ప. తలఁచియటు
వచ్చిట 5 ఆ. 171 ప. వచ్చియిట

వచ్చిట యనునది యడిదము సూరకవిమతమునుబట్టి సాధువే. "ఇడఁగవచ్చు నుల్యప్పుపై నిత్వసంధి" అని. అయినను శ్రుతి కటువుగా నున్నది.

కువర్ణమునకు ముందునగాగములేమి

బరుదైనపిఱుఁదుకు 1 ఆ. 62 ప.

వాదుకెదిరి 1 ఆ. 233 ప.

ద్రుతసంధులు.

ఏఁటిమీఁదాఱునెలలు 3 ఆ. 151 ప. ఏఁటిమీఁదనాఱునెలలు
తోడితెచ్చితింటికి 5 ఆ. 151 ప. తోడితెచ్చితినింటికి అనవలయు

నుగాగమము రాకుండుటకు

నోరవెడలగ్ని దీప్తులు. 5 ఆ. 58 ప. వెడలునగ్నిదీప్తు లనియుండవలయు

ఈక్రిందివి వింతరూపములు.

తప్పులు ఒప్పులు
పొందుపఱచుక 1 ఆ. 182 ప పొందుపఱచుకొని
హత్తుక 1 ఆ. 199 ప. హత్తుకొని
తెలుసుక 1 ఆ. 231 ప తెలిసికొని
కట్టుక 1 ఆ. 259 ప కట్టుకొని
అలవఱచుక 2 ఆ. 111 ప అలవఱచుకొని
అక్కునఁజేర్చుక 2 ఆ. 164 ప అక్కునఁజేర్చుకొని
అలవరించుక 2 ఆ. 205ప అలవరించుకొని
త్రొక్కుక 2ఆ. 236ప త్రొక్కుకొని
పెట్టుక 4 ఆ. 113ప పెట్టుకొని
తెఱచుక 4ఆ. 168ప తెఱచుకొని

ఇట్టి వింక నెన్నియో కలవు. గ్రంథవిస్తృతి భీతి మానితి.

ధాతువులు.

చేతురమ్మ 1 ఆ. 124 ప. ఈరూపము పెక్కుతావుల నీగ్రంథమునఁ గానఁబడుచున్నది. "చువర్ణకంబుతోడ దుగ్దకారంబు తకారంబగు" బాలవ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 108 సూ. "చేతురు కోతురిత్యాదు లసాధువులని యెఱుంగునది. కొంద ఱివి సాధువే యని యుపయోగించుచున్నారు. ప్రయోగములు గలవనుచున్నారు.

తప్పుసమాసములు.

అష్టోత్తరశతతిరుపతులు 4 ఆ. 215 వచనము.

అఖండయతి.

క్రుక్కిళులు మ్రింగుకొనుచు నొక్కొక్కరొకరె. 4 ఆ. 35 పద్యము ఈ యఖండయతిని సాధింపఁబూని కొందఱు భారత ద్రోణపర్వమున నాల్గవయాశ్వాసమున సాత్యకితో భూరిశ్రవుఁడు చెప్పుమాటలలో నున్న "తేఁకులేక పుత్తెంచినయప్పాండవజ్యేష్ఠునకుఁ దలవంపుగాఁగ" అనుపద్యమును "తేఁకువలేక పుత్తెంచిన యప్పాండవాగ్రజునకుఁ దలవంపుగాఁగ" అను తప్పుపాఠముగా గ్రహించి సాధువే యనుచున్నారు.

మఱికొన్నితప్పురూపములు.

కండ్లు 5 అ. 153 ప. ఎలవిన్, శాయి, ప్రౌఢతనము ఇత్యాదికములు పెక్కులు గానంబడుచున్నవి. వీనిని బ్రమాణములుగాఁ గైకొనినచో భాషాలలనామణి శృంగారము చెడుననుటకు సందియముండదు.

ఇట్టి వెన్నియో యిందున్నవి. కొన్నియతులుకూడఁ జెడినవి. వానినెల్ల వ్రాయుట యనవసరమని మానితి. చూపినవానిలోఁ గొన్ని సాధువులని తమకుఁ దోఁచిన నన్ను మన్నింతురుగాక. నాకుఁ దోఁచినవానిని మీకుఁ దెలియఁజేసితిని.

ఇట్టి వెన్ని తప్పు లుండినను ఈమహామహుని కవిత్వము నిరుపమానమై శృంగారసాగరమని చెప్పఁదగి సుజననుతికిం దగియున్నదని మూటికిముమ్మాటికి నిరాఘాటముగాఁ జెప్పఁగలను. ఈగ్రంథమునఁ బ్రమాదపతితములగు తప్పులను ద్రోసివైచి సాధురూపములం గైకొని యీసుకవిశైలి నవలంబించి కవిత్వము చెప్పినఁ గర్ణరసాయనమై యుండుననుట కావంతయుసంశయములేదు. ఇంకను బెంచివ్రాసిన గ్రంథవిస్తర మగు నన్నభీతిచే మానితిని.

ఇట్లు విన్నవించువిధేయుఁడు,

జనమంచి శేషాద్రిశర్మ

కడప

10-10-1919

కథా సంగ్రహము

ప్రధాన కథ

చిత్రభోగుఁడు రాజు. శివసత్తి నానాదేశములు చూచిన జోగురాలు. ఆమె వచ్చి, హేమవతియను ఆయూరి సాతాని చిన్నది- విష్ణుదాసుని యిల్లాలు- అన్నులమిన్నయని చెప్పి, రాజుకు మోజు కలిగించెను. రాజదూతిక వెళ్లి హేమవతికి రాజుపై మోజు కలిగించెను. ఇంతలో విష్ణుదాసుఁడు దూరదేశమేఁగుట సంభవించెను. ఇదే సందని ఆ యిల్లాలు ప్రొద్దు గ్రుంకినంతనే రాజునొద్దకుఁ బయనమయ్యెను. పెంపుడు హంస పోనీయలేదు. నిలిపి కథ చెప్పుచుండెను. ఈ రీతిగా నిరువది రోజులు గడచెను. ఇరువది యొకటవ రోజున ఇంటివాఁడు దిగెను. సతి పతివ్రత యయ్యెను. రాజు సద్బుద్ధియయ్యెను.

హంస ఒక కథల పుస్తకము. వింశతి విభావరులు కాలక్షేపము జరిగెను.

మొదటి రాత్రి కథ

ఇల్లాండ్రు ఱంకాడరాదని ధర్మోపదేశము. కథ లేదు.

రెండవ రాత్రి కథ

చారుశీలా గుణదీపకులు బ్రాహ్మణ దంపతులు. వారి సుపుత్రుఁడు కాశీలింగము తెచ్చి శివాలయము కట్టించెను. ఆలయపుఁ బూలతోఁట బావికడ, ఏతపువాఱు కొఱికి, యొక నక్క చచ్చెను. ఆ నక్క 'ఆహారంబె చూచెఁగాని, తనచేటు తెలియదయ్యె'. అట్లే-ఱేనిపట్ల కక్కుర్తి పడినచోఁ జేటు తప్పదని హెచ్చరిక.

మూడవ రాత్రి కథ

అసహాయుఁడు నాయకుఁడు. అతనిభార్య హేమరేఖ. ఆ విలాసిని యొకనాఁడు తలుపువేసి, గుప్తగుణుఁడను వైద్యునితోఁ గ్రీడించుచుండెను. ఆసమయ మున మగఁడువచ్చి, తలుపు తట్టెను. హేమరేఖ జంకక కొంకక, యిట్లు బొంకెను. “నాథా! నాకుఁ దీవ్రముగాఁ గడుపునొప్పి లేచెను. చచ్చెడిదాననే. ఇతఁడు వచ్చి బ్రతికించెను"

అసహాయుఁ డది విని ఓహో! మేలు చేసితివని వైద్యుని సత్కరించి సాఁగనంపెను.

నాలుగవ రాత్రి కథ

ఒక తొగటసెట్టి భార్య ఒకనాఁడొక పారుపత్తెగానిఁ జూచి వలచినది, ఒక మంత్రసాని ముదుకును బతిమాలుకొని వాని నింటికి రప్పించుకొన్నది. ఇద్దఱు గూడియుండిరి. సంతకు బట్ట లమ్మఁబోయిన భర్త అప్పుడేవచ్చి తలుపు దీయుమనెను. ఆ తొగటబోటి దిసమొలతోఁబోయి తటాలునఁ దలుపుదీసి పతి కన్నులు మూసి పారుపత్తెగాని వెళ్లిపొమ్మని సైగ చేసి మఱలఁ దలుపువేసి సిగ్గున కడ్డముగాఁ బతిపంచె చుట్టుకొని, “చీరవిప్పి జలకమాడఁ బోవుచుంటిని. నీ కంఠధ్వని విని ఆదరబాదర వచ్చితి"నని చెప్పుచుఁ గౌఁగిలించుకొనెను.

ఐదవ రాత్రి కథ

విజయుఁడు-మంజుల గొల్ల దంపతులు. చాలఁ ద్రిప్పలుపడి ఒక పిల్లను గనిరి. ఆ పిల్ల పిల్లకాదు; పిడుగు. అందుచేతఁ ద్వరపడి తలిదండ్రులు పెండ్లి చేయించి సాఁగనంపిరి. నూతన వధూవరులు వెనుక ముందు పోవుచున్నారు. దారిలో మఱ్ఱిచెట్టు వచ్చెను. అక్కడ జారశేఖరుఁడను ప్రాఁత నేస్తుఁ డెదురుపడెను. ఆ పిల్ల వానిని హత్తుకొనెను. భర్త తిరిగిచూచెను. ఇద్దఱొకఁడై యుండిరి. అపుడాపిల్ల తన వీఁపు తట్టుచుండుమని జారునికిఁ జెప్పెను. 'ఏమి ఏ' మని భర్త సమీపించెను. పిల్ల యిట్లనెను. “ఈ దయ్యాల మఱ్ఱి చెట్టును జూడఁగనే నా గుండెలు వకావక లయ్యెను. ఈ మహానుభావుఁడు నన్నుఁ గాపాడెను."

ఆఱవ రాత్రి కథ

గాఁపురము చేయుచుండెను. ఈమె పేరు చారు భాస్వతి. ఆలు మగలిద్దఱును వేసవిలోఁ గూళికిఁ జలివెందర నడపుచుండిరి. ఒకనాఁ డొక బ్రాహ్మణసుందరుఁడు దప్పిగొని వచ్చెను. తమకము పట్టలేక చారు భాస్వతి పట్టపగలే పతి కట్టెదుటనే వానినిఁ గౌఁగిలించుకొనెను. హరిశర్మ అదలించినను వినక యితఁడు మా మేనమామకొడుకని చెప్పి మఱిమఱి కౌఁగిలించుకొనెను. ఇంటిలోఁ గొన్నాళ్లు వాని నుంచుకొని సుఖించెను.

ఏడవ రాత్రి కథ

శుభవాటీ భద్రకారులు కంసాలి దంపతులు. దూర్తుఁడనువాఁడు వారికి శిష్యుడు - పేరుకుఁ దగినవాఁడు. బయట భద్రకారుఁడు, ఇంట శుభవాటి వానికి విద్య నేర్పుచుండిరి. ఒకనాఁడు చిన్న త్రాసుఁ దెమ్మని గురుఁడు శిష్యునకుఁ జెప్పెను. శిష్యుఁ డింటిలోనికిఁ బోయెను. గురుపత్ని తలుపు బిగించెను. ఎంత సేపటికిఁ ద్రాసు తేలేదు . గురుఁడు లేచి వచ్చెను. తలుపు చూచి శిష్యుని గద్దించి పిల్చెను. శుభవాటి పుటపుట త్రాసు త్రాళ్లు త్రెంచి వాని చేతఁబెట్టి వాకిలితీసి మటమటలాడుచు శిష్యుఁడు పనికిమాలినవాఁడని త్రాళ్లు త్రెంచి ముడివేసికొనుచున్నాఁడని భయపడి వాకిలి మూసికొన్నాఁడని పలికెను. భద్రకారుఁడు శిష్యుని తప్పు సర్ది భార్య ననునయించెను.

ఎనిమిదవ రాత్రి కథ

వసుమతీ ధనచిత్తులు వైశ్యదంపతులు. ఇద్దఱిద్దరే. పతి ముండల పాలు; సతి మిండల పాలు. ఒకనాఁటి చీఁకటిలో సంకేతమున-పొరపాటున-ఆలుమగలే కలిసికొన్నారు. పతి గుర్తించి కనిసి “ఈ నిశిలో నీవిటకు నొంటి నేమిటికిఁగా వచ్చితి?" వని ప్రశ్నించెను. ఆమె యిట్లనెను, “నా గోడు కాళికాదేవికి విన్నవించుకొనఁగా ఆమె యిపుడే నీకు నీపతి పొందు గలుగును. పొమ్మనెను. నేను వచ్చితిని. అంతా ఆ తల్లి ప్రసాదము" అప్పటికి ఆమెకై వచ్చియుండిన విటుఁడు పొదచాటుననుండి 'ఔ నిజ' మని - ఆకాశవాణీ ప్రసారము చేసెను. ఈ రీతిగాఁ గాళికా ప్రసాదముఁ గన్న సతికి సాష్టాంగపడి ప్రశంసించి సెట్టి యింటికిఁ దోడ్కొని పోయి సుఖముండెను.

తొమ్మిదవ రాత్రి కథ

చిత్రఘనుఁడు చిత్తారివాఁడు. అతని భార్య వాచాలి. ఎన్నో తంటాలుపడి ఒక కొడుకును బుట్టించుకొనెను. అయినను స్వైర విహారము మానలేదు. ఒకనాఁటి ముని మాపునఁ గాళికాలయ ప్రాంతమునఁ దారాడుచు “ఏరా! తాళఁగ లేరా! రారా!" అని ఉపపతిని బిలుచుచుండెను. దాని గొంతువిని ఆదారిఁబోవు దాని భర్త దగ్గరి యెవరిఁబిల్చుచుంటి వని యడిగెను. వాచాలి అన్నది గదా! "అయ్యో! పసివాఁ డింటికి రాలేదు. నీ వెంబడి వచ్చి నాఁడేమో అని పిల్చుచున్నాను" అని. వాఁడు శిశుగతప్రాణి. అడలెత్తి వెదుకఁబోయెను. ఆమె యింటికిఁ బోయి తిరిగి, ఊరిలో బాలుని వెదకుచున్న పతి కెదురేఁగి “పసివాఁడు వచ్చి పండుకొని నిద్రబోవుచున్నాఁడు. రండి" అని తోడ్కొని పోయెను.

పదవ రాత్రి కథ.

భూతవైద్యుని భార్య ఘనురాలు. ఘనురాలికి ఉపపతులు నలుగురు: 1. కరణము 2. రెడ్డి 3. పారు పెత్తెగాఁడు 4. తలారి. ఒక నాఁటిరేయి వరుసగా నలుగురు, నొకరి పిదప నొకరు వచ్చిరి. ఆమె యందఱి నలరించెను. అయిదవ వాఁడు, వెళ్ళియుండిన పతి వచ్చెను. విటులు నలుగురు నాలుగు దిక్కుల నటుకలపై నుండిరి. తెచ్చిన బహుమానములు జూపుమని ఘనురాలు పతి నడిగెను. అతఁడు దివ్వె తెమ్మనెను. దివ్వె తెచ్చునంతలో అటుకలమీఁది వారు నలుగురు గబ గబ దూఁకి యుఱికిరి. 'ఎవరు వీరు. చెప్పు'మని కను లెఱ్ఱచేసి, కత్తి దూసి భూతవైద్యుఁడు భార్యనడిగెను. ఆమె యిట్లనెను. "నీవు పొరుగూరికిఁ బోయి చికిత్స చేయుచుంటివి. ఆ భూతము లిక్కడకు వచ్చి, నా మీఁదఁ బడి త్రొక్కుచున్నవి. నేను తాళఁజాల కున్నాను. నీవు భూతముల జోలికిఁ బోఁగూడ దఁట. పోయినచో నన్నుఁ జంపునఁట. ఇపుడు నిన్నుఁజూచి పరుగెత్తినవి. భూతముల చేతిలోఁ జచ్చుటకంటె నీ చేతిలోఁ జచ్చుట మేలుకదా ! చంపుము."

అతఁడు మెత్తబడి చేరఁధీసి మంత్రించి భయము బాఫెను.

పదునొకండవ రాత్రి కథ.

చండరశ్మి కిద్దఱు భార్యలు. చీటికి మాటికిఁ గొట్లాడుచుండిరి. ఆ బ్రాహ్మణుఁడు పెద్దభార్యను బయటికిఁ ద్రోసెను. ఆమె కడగానుండెను. ఉండి తట్టుకొనలేక, ఒకనాఁడొక ఆకతాయి భిక్షువురాఁగా, వానితో సంబంధము పెట్టుకొనెను. వాఁడు పగలు ఊరిలో అడిగికొనితిని, రేయి బ్రాహ్మణియొద్ద నిదురించుచుండెను. ఒకనాఁటి రేయి, చిన్న భార్యతో జగడమాడి, భర్త పెద్దభార్య యింటికి వచ్చెను. అపుడామె జారుని రెట్టబట్టుకొని తలుపుమూల నిలిపి తలుపు తెఱచి, భర్త పాదములకు మ్రొక్కి లోపలికిఁ బిల్చుకొని శయ్యఁజేర్చి, తలుపువంకఁ జూచి, “నేఁ డెయ్యెడకై న నేఁగవె చెలీ!" యనెను. ఆ సంకేతము గ్రహించి విటుఁడు వెడలి పోయెను. ఎవతెయో ఆఁడుతోడు కాఁబోలు ననుకొనునట్లు చేసెను.

పండ్రెండవ రాత్రి కథ.

శివదత్తుఁడు భక్తుఁడు, సాధకుఁడు. అతని భార్య విశాల, విశాలలోచన. ఆమె నతఁడు చెంతఁ జేరనీయఁడు. చేరెనా? "చీ! ఱంకులాఁడి! చను" మనెడువాఁడు. ఆమె చూచి, చూచి, తెగించి, ఒకని నింటికిఁ దెచ్చికొని రమించుచుండెను. పతి వచ్చి చూచి మండిపడెను. అపుడామె యేమన్నది ? “అయో! మగఁడా! నీవే నా కొంప దీసితివి. “ఱంకులాఁడి, ఱంకులాఁడి" యంటివి. నీ వాక్కు తాఁకి నే నిట్లైతిని. యోగులపలుకు రిత్తపోదు. పతివ్రతవు గమ్మని పలుమాఱు పల్కుము. లేకున్న నేను ఆత్మహత్యకుఁ బాల్పడుదును" అన్నది. శివదత్తుఁడు తన వాక్కునకు అంతటి ప్రభావ మబ్బినదని మిక్కిలి సంతోషించెను; ఆశీర్వదించెను.

పదుమూడవ రాత్రి కథ.

శఠుఁడను ద్విజుని సతి సుఖమతి. ఆమె నడవడిక సరిగా లేదని అతని కనుమానము గలిగెను. కావలసి యొకనాఁడు దూరదేశ మేఁగుచున్నానని చెప్పి వేకువజామున బయలుదేరెను. సుఖమతి ఊరి వెలుపలిదనుక సాగనంపి, బహి శ్శంక కేఁగెను. శఠుఁడు కికురించి యింటికిఁబోయి, దూలము మీఁది యట్టుకఁ జేరి దాఁగియుండెను. తెల్లవాఱెను. సుఖమతి మహోల్లాసముతో నొకజోస్యుని లంకించుకొని యింటికిఁ దెచ్చెను. కలియఁబోవు నదనునఁ బతి యునికి గనిపెట్టెను. కనిపెట్టి ప్లేటు త్రిప్పెను. "అయ్యా! జోస్యుఁడా! నాపతి చాల శ్రమపడుచున్నాఁడు. పోయినపని అగునా? కాదా? ఎప్పుడింటికి వచ్చును?" అని వక్కాకిడి ప్రశ్నించెను. సైగ తెలిసికొన్న జోస్యుఁడు- “నీ భర్త నేఁడే వచ్చును. చూడు నా మాట" అని వెడలిపోయెను. శఠుఁ డప్పుడే అటుక దిగి, “సెబాసు! నీ పాతివ్రత్య " మని శ్లాఘించి, సుఖమతినిఁ గౌఁగిలించుకొనెను.

పదునాల్గవ రాత్రి కథ.

హిరణ్యగుప్తుని భార్య హస్తిని. ఆమెను జూచి సుంకరి కొల్వుకాఁడొకఁడు మోహించెను. మోహినీ శక్తిని బ్రయోగించి వశపఱచుకొనెను. ఇరువురకుఁ జనవు బలిసెను. వారు క్రీడించుచుండఁగా నొకనాఁడు గృహస్థుఁడు వచ్చి తలుపు దీయు మనెను. హస్తిని విటునకు ముసుఁగుబెట్టి యరుగు మీఁదం బరుండఁబెట్టి వాకిలిఁదీసి "తడవాయెను సుంకరీఁడు తమ లెక్కలకై పడియున్నాఁ డిదె" యని హీన స్వరముతోఁ జెప్పి చూపించెను. సెట్టి చప్పుడు గాకుండ వైదొలఁగి పొరుగింటఁ దల దాఁచుకొనెను. తరువాత విటుని సంతుష్టుని జేసి పంపించి, పతిని బిల్చెను. పతి వచ్చి సతిచర్య నభినందించెను.

పదునైదవ రాత్రి కథ.

సత్యకేశిని రెడ్డిసాని. ఒక బంట్రౌతును మరగి యుండెను. ఒకనాఁడు రత్నగుప్తుఁడను సెట్టిని లోఁగొని, రమించుచుండఁగా బంట్రౌతు వచ్చి తలుపు దట్టెను. సెట్టిని గాదెలో దాఁచి, తలుపు దీసి బంట్రౌతుతో రమించుచుండఁగా, రెడ్డి వచ్చెను. రెడ్డిసాని తలుపు దెఱచి, పగ చాటుచు వదరుకొనుచుఁ బొమ్మని బంట్రౌతును బంపెను. వాఁడు తిట్టుకొనుచుఁ బోయెను. “ఏమి వాఁ డెందుకు వచ్చినాఁడు? వదరుకొనుచుఁ బోవుచున్నాఁడే!" అని రెడ్డి గద్దించి యడిగెను. రెడ్డిసాని నవ్వుచు గాదెను జూపి, “ఈ సెట్టిగానిఁ దఱుముకొనుచు వచ్చెను. వీఁడు మనయింట దూఱెను. నేను వాకిలి వేసితిని. వాడు దూఁకి వచ్చి, సెట్టిని బట్టుకొనఁబోయెను. నేనడ్డపడి, రెడ్డి లేఁడు. నీవు రావద్దు, పొమ్మంటిని. ఇంతలో నీవు వచ్చితివి. వాఁడు నామీఁదఁబడి యేడ్చి పోవుచున్నాఁడు." అని చెప్పి సెట్టిని బయటికి రమ్మనెను. రెడ్డి సెట్టికి అభయమిచ్చి, తన యౌదార్యము ప్రకటించి, పొమ్మనెను.

పదునాఱవ రాత్రి కథ.

హిరణ్యకుఁ డనువాఁడు తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చుచు, నొకనాఁడు వానకుఁ దడిసి, బెస్తవాని పంచఁ జేరెను. ఆ యింటి మచ్చెకంటి వానిని వలలో వేసికొనెను. ఇద్దరు కలిసియుండఁగా ఇంటివాఁడు వచ్చి, "ఎవరది?" యనెను. ఆ యిల్లాలు ముసుఁగులోనుండి పండుకొనియే మాఱుగొంతు వెట్టి “మేము యాత్రికులము. తలదాఁచుకొన్నాము. తెల్లవాఱఁగనే వెళ్ళిపోదు" మనెను. అతఁడు మంచిదని లోపలికిఁ బోయెను. ఈమె లేచి, నీళ్ళకుండ యెత్తుకొని, మగని వెనుకనే యింటి లోనికిఁబోయి, “ఏడుంటి వీసరి ప్రొద్దుదనుక?"అని గద్దించెను .

పదునేడవ రాత్రి కథ

రూపసేన యను కుమ్మరి బిత్తరి సారణుఁడను సాలెవానిఁ గూడియుండఁగా మగఁడు తలుపు దట్టెను.

ఆమె దున్నపోతు తలుగువిప్పి హడావిడి చేసి తలుపు దీసి, తలుపు వేయుమని మగనిఁ దొందరించెను. దున్నపోతు విడిపించుకొని చెలరేఁగినది. ఈ తెరువరి సాయము వచ్చినాఁడని చెప్పెను. అతఁడు నమ్మెను .

పదునెనిమిదవ రాత్రి కథ

విహారి బలిజెసెట్టి భార్య. చెడి యొక కొడుకును గనెను, వాఁడు పెద్దవాఁడై బోగముదాని పంచఁబడెను, వాని గృహిణి, విధి లేక, జారిణి యయ్యెసు, వానితల్లి పూర్వసాంగత్యమును విడువదయ్యెను. ఇంట ఆత్త కోడలు చెఱి యొక దారి యైరి. ఒకనాఁడు కోడలు లేదుగదా యని అత్త ఒక జెట్టితోఁ బెనఁగుచుండెను. అత్త లేదుగదా యని కోడలు అపుడొక విటునిఁదెచ్చికొనెను. అత్తకోడండ్రు ఒకరిమొగ మొకరు చూచుకొనిరి. గడిదేఱినది గదా అత్త "వీఁడెవఁడే? సంజకడ, ఇంటికిఁదెచ్చినావు" అని యడిగెను. కోడలు మెత్తగా బదులిచ్చెను. “అత్తా! యీ మహానుభావుడు ఆలుమగలకు అనురక్తి ఘటించువాఁడు, నేను చిన్నదానను. అనుభవము లేనిదానను, ఇతనినడిగి ఆ తంతు నీవే నడిపింపుము". అత్త అందుకొన్నది. “నేనును అదే ఆలోచించి వైద్యుని బిల్చుకొనివచ్చినాను. పని చేసినాఁడు ఈతనితోఁ గాకున్నచోఁ జూడవచ్చు. ఆతనిఁ బంపించు"మనెను. విటులిద్దఱు వెడలిపోయిరి. అత్త అనుమానించలేదు. కోడలు అనుమానించలేదు. ఎవరిగుట్టు వారిది.

పందొమ్మిదవ రాత్రి కథ

గాండ్లసెట్టిభార్య మణిచిత్రిణి. మేకపోతును బట్టికొనిపోవు బ్రాహ్మణకుమారుని బట్టికొని భోగించుచుండఁగా మగఁడువచ్చెను. మేక పోతును విడిచి “పట్టుకో పోనీకు" అని అఱచుచు వచ్చి, వాకిలి దీసెను, మగఁడువచ్చి, మేషమును బట్టియిచ్చి బ్రాహ్మణునిఁ బంపెను.

ఇరువదవ రాత్రి కథ

మంత్రికొడుకు పెండ్లి వద్దని కూర్చుండెను. ఏమిరా? అనిన, స్త్రీలను నమ్మరాదనెను. చుట్టపక్కాలు పెద్దలంతా వానికి నచ్చఁజెప్పి, ఒకేసారి యిద్దఱిని ముడివేసిరి, వాఁడు భార్యల నిద్దఱిని వేర్వేఱు గదులలో నాకసమంటు నొంటికంబపు మేడలో నిలిపెను. వారికి సతతమైథునచింత. పెద్దామె సువర్ణ. చిన్నామె సుప్రభ.

ఒకనాఁడు సువర్ణముంగిట రెండు పాదుకలు పడెను. వానివెంట నొక బాపఁడు దిగెను. సువర్ణ అతని కాతిథ్యమిచ్చి, పాదుకాసాహాయ్యమున ఉపవనికి దోడ్కొనిపోయి సుఖమిచ్చి పంపెను. ఒకనాఁడు సుప్రభ దిక్కుతోఁపక పాడుకొనుచుండఁగా నాకసమునఁబోవు ముని యొకఁడు దిగివచ్చెను. ఈమె యతనిఁ గవయఁ బోయెను. ఆతఁడు జితేంద్రియుఁడు. అతనికిఁ గావలసినది సంగీతమేకాని సాంగత్యము కాదు. దయ దలఁచి యతఁడొక మంత్రమిచ్చి పోయెను. ఆ మంత్రప్రభావమున సుప్రభయు నుపవనికిఁ బోయి వనపాలకుని గూడెను.

సవతు లిద్దఱు యథేచ్చముగాఁ దమ యుపవనిలోఁ దమ యుపపతులతోఁ గేళి సలుపుచుండిరి.

ఒకనాఁటిరేయి భర్త రాఁడని తెలిసి భార్య లుపవనికిఁ బోయిరి. ఏదో మూలిక కావలెనని భర్తయు నపుడే యుపవనికిఁ బోయేను. భార్య లిద్దఱు భర్త కంటఁబడిరి. అతఁడు ఘర్షించి ప్రశ్నించెను. సతులు నవ్వి "మేము నీ భార్యలము కాము. వనదేవతలము. నీ భార్యలు మా యంశజలు. మేము వసంతుని శాపముచే మానవసేవ చేయవలసిన వారము. ఆ కర్మము మా యంశజల కిచ్చి, బతిమాలుకొని మేము బయటఁ బడితిమి. అందుఛేత మా పోలికలు నీ సతులందుఁ గలవు పొ" మ్మనిరి. ఆతఁడు విశ్వసింపక, తన మేడకుఁ జూడఁ బోయెను. వారతనికంటె ముందుగనే పోయి పవళించియుండిరి. అతఁడు వారినిఁ జూచి విశ్వసించి సుఖపడెను.


★ ★ ★