హంసవింశతి/పదమూడవ రాత్రి కథ
హంస వింశతి
చతుర్థాశ్వాసము
శ్రీరాజిత! జితవారిధి!
వారిధితనయాంకజాతవసుధాపుత్రీ
హారిస్తనకుంకుమఘన
సారమృగీమదసుగంధచర్చితవశా! 1
వ. అవధరింపుము. ప్రత్యుత్పన్నమతి నలున కిట్లనియె. అట్లు ప్రభాతకాలంబు కావచ్చినఁ గనుంగొని. 2
క. చిగురాకుఁబోఁడి చొచ్చెను
మగరా జిగి రాయిడించు మందిర భూమిన్
జగరాజిల్లెడు తొగరా
జగరాశికి నది రసించు సాయంబైనన్. 3
క. కని జలకమాడి సొమ్ములు
దనరంగ నలంకరించి తరళేక్షణ రా
ట్తనయునిపై మోహంబునఁ
జనగా రాయంచ చూచి సఖితో ననియెన్. 4
పదమూడవ రాత్రి కథ
నియోగిభార్య జోస్యునిఁ గూడుటతే. "అక్క! రుచిగల్గు చక్కెర లానవాలు
పెట్టెదవె, యొక్కగాథఁ జెప్పెదను వేడ్క
నది నవీన ప్రవాళ రాగాధరోష్ఠి!
వినిన నొక్కింతనేర్పు నీ కెనయుఁజుమ్మి." 5
క. అనవిని చిఱునవ్వొలయం
"బనిచెఱుపుల కథలు చెప్పి పార్థివుఁ జేరం
జననీయ వైనఁజెప్పుము
వినియెద"నన సతికి హంసవిభుఁ డిట్లనియెన్. 6
తే. పూర్వమున బ్రహ్మసభకు నేఁబోయి కొంత
కాలమందుండి యజుఁడంపకంబు సేయ
మానస సరంబునకు వచ్చి మామకీన
కులజులను గాంచి భువిఁజూచు కోర్కి పొడమి.
పర్వతములు.
సీ. హిమవ న్నిషధ మేరు హేమకూ టాస్తోద
య ద్రోణ మలయ వింధ్య త్రికూట
మాల్యవ న్మందర మైనాక గంధమా
దన సహ్య పారియాత్రక సువేల
ఋక్షవ చ్ఛతశృంగ ఋష్యమూ కాంజన
చంద్ర గోశృంగ మహేంద్ర వృషభ
శాలేయ ధూమ్రవజ్ర మతంగ కైలాస
శతకేతు భృగు నీల చక్రవాళ
తే. కనక మేఘాంశుమ త్పుష్ప గరుడ భద్ర
చిత్రకూట సుదర్శన శేష సింహ
రోహణ శ్రీగిరి క్రౌంచ రుద్ర మత్స్య
సూర్య వైద్యుతముఖగిరుల్ చూచియంత. 8
కంప చెట్లు.
సీ. కోరింద నలతుమ్మ గొటికె కోడారెయు
వెణుతు రూడుగు దంతె వెఱ్ఱితుమ్మ
చిటిగార సుందరి చీ కెఱ్ఱతుమ్మయుఁ
దెల్టతు మ్మిళింద కళ్ళి తొట్టి
జమ్మి బలుసు గార చండ్ర పఱికి తెల్ల
పూలి లొద్దుగ జిడ్డు బుడ్డతుమ్మ
కలివే రేఁగుండ్రయు గచ్చ పెన్నంగయు
దుడ్డుమంగయు భూతతొట్రు కోవె
తే. మంగ చిటికొక్కి సీకాయ మండ్రకుక్క
వెలఁగ వాకుడు పల్లేరు ములక జీల్గ
నగిరి నీర్గొబ్బి మొదలుగా జగతిఁ గల్గు
కంపలన్నియు వేవేగఁ గడచి కడచి. 9
చిఱు చెట్లు.
సీసమాలిక.
జిల్లేడు వెంపలి జిడ్డువెంపలి పైఁడి
తంగేడు తంగేడు తగిడి యుస్తె
ములువెంపలి ములుస్తె గలిజేరు గుంటగ
ల్జేరును దంతి బందారి నేల
తంగేడు మెట్టబందారి దుండుగ బ్రహ్మ
దండి భూతుల సెఱ్ఱదొండి చల్ల
పిల్లిమాడుపు చార పిల్లడ్గు చిత్రమూ
లము నల్లతీఁగె కోలాకు పొన్న
ముయ్యాకుపొన్నయు మొగచీర తుత్తెర
బంకదుత్తెర హంసపాది గంటె
కామజిలుగు మెట్టదామర వెఱ్ఱి సె
నగ జంబిరము కాచి నల్లకాచి
శ్రీతులసియు సంబరేణు నేలుసిరి కీ
శ్వరి నేలవే మూటి చల్లగడ్డ
సహదేవి దుష్టుపు చలిపిండి చిటిముటి
పెన్నేరు విషబొద్ది పిండిదొండ
నెమటాయి గొలిమిడి నీరుబచ్చలి ప్రబ్బ
వీర గన్నే రాఁడుబీర నేతి
బీర పేరాముష్టి పీచరములు గొలి
మిడి చేఁదుపొట్ల యుమ్మెత్త తిప్ప
తీఁగె విష్ణుక్రాంత తీండ్రెఱ్ఱ చిత్రమూ
లము దొండతీఁగె ముల్లంగి నల్ల
జీ డెద్దుమట్టాకు చేగొడ్ల చంద్రకాం
తెఱ్ఱని యచ్చంద యెఱ్ఱతుమికి
కుప్పి సూర్యక్రాంత ముప్పుడు నరవండు
గాడిదగడపర కన్నెకొమర
నల్లగెంటెన పూలి తెల్లగెంటెన యుత్త
రేణి గుబ్బిరి సంబరేణు బండి
గురిగింజ గురివింద తురకపత్తియుఁ బత్తి
తలపిడు చబ్బెంద సులియ చిట్టి
వెలఁగ విషమదారి వెట్టికుందెన మంచి
కుందెన కలబంద గువ్వగుత్తి
మామెనయును నేలమామేన యటికమా
మిడి దూల గోవెల మేఁకమేయ
తే. నాకు నల్లేరు నులిజెముడాకు జెముడు
నేలజమ్మి కసిందయుఁ గోలజెముడు
బొంతజెము డుల్లియును సదాముష్టి మొదలు
గాఁ గలుగునట్టి చిఱుచెట్లఁ గాంచి యంత. 10
మహా వృక్షములు
సీస మాలిక.
రావి మామిడి కొండరావి మేడియు బ్రహ్మ
మేడియు జీడిమామిడియుఁ జింత
పులిచింత మోదుగు ములుమోదుగును వెల్ల
పుల్లవెలఁగ వెఱ్ఱిచిల్ల చిల్ల
బూరుగు కలిగొట్టు భూతపాదిరి కొండ
బూరుగు చిటిగొట్టి భూతనెరిద
నేరేడు మఱి యల్లనేరేడు పాదిరి
తడగూబ తడ టేఁకు కడప బట్ట
కడప కొడిసె పాలకొడి సెజ్జలొద్దుగు
చిరిటేఁకు లొద్దుగు జీడిపాల
కలుజువ్వి వావిలి గండువావిలి యేరు
మద్ది ముద్దియును నేలొద్ది యొద్ది
తెల్లకాంచనము తుందిల మెఱ్ఱకాంచన
ముప్పి తెల్లుప్పి నీరుప్పి యిప్ప
తాండ్ర చందన మేపె దాసాన మెఱ్ఱదా
సానము చిందుగ చారజేన
మఱ్ఱి విరిగి తూకి కఱ్ఱితూ కిబ్బెడ
నక్క విరిగి చండ్ర ప్రక్కె దంతె
కాకితూ కందుగు కానుగు వరగోఁగు
గొలుగు బొట్టుగు బిక్కి కొండగోఁగు
గోఁగు పొగడ ములుగోరంట గోరంట
వెలమ సుంకేసరి వెఱ్ఱి బిక్కి
నారువ సురపొన్న వారిజమును బొన్న
నెల్లి మూలుగ బిల్లు నెమిలి యడుగు
కొండగుమ్ముడు రేఁగు కొరవి సంపఁగి కొండ
సంపంగి మారేడు సరళ తగిస
గుమ్ముడు క్రోవియుఁ గమ్మరేఁ గూడుగు
పొల్కి గుగ్గిల మెఱ్ఱపొల్కి జమ్మి
దేవదా రుసిరిక తిలకము తెల్లన
గిరి వేఁప కరివేఁప తురకవేఁప
వేరుపనస గుత్తి వెఱ్ఱినారువ రేల
పనస కరక కొమ్మి పలుకరేణి
బండచింతయు నల్లబలుసు సురభిచీకి
రేని కుంకుడు నెమ్మి ప్రేంకణమ్ము
భూతాంకుశ మశోక భూర్జపత్రమ్ము లం
బాళము మంకెన బలుసు గంగ
రేఁగు తక్కిలి ములువేగి భూచక్రము
మొక్కస కొక్కస మొల్లమ్రాను
హనుమంతబీర మంకెన గిరికర్ణిక
పెడమల్లె కొండముక్కిడియుఁ గోల
ముక్కు దాడిమ బీర మొగలింగ గోదాడు
నేదాడు ఖర్జూర మీఁత నేల
తాడి బగిస పోఁక తాడు కొబ్బెర చెట్టు
పెద్దమాను పతంగి బెండ గలుగు
తే. కణుదు రిరుకుడు కాలుగ కాన సన్న
విరిగి సోమింద గున్నంగి దిరిసెనంబు
మొదలుగాఁగల్గు బహువిధ భూరుహములు
నిండియుండెడు కానల పిండు లరసి. 11
క. వెస జంబూ ప్లక్ష క్రౌం
చ సుపుష్కర శాల్మలి కుశ శాక ద్వీపా
లెసఁగఁ గనుఁగొంటి లవణే
క్షు సురా ఘృత దధి పయో విశుద్ధజల్బుధుల్. 12
సీ. స్వాయంభువోత్తమ స్వారోచిష బ్రహ్మ
దక్ష వైవస్వత తామసేంద్ర
రౌచ్య రైవత రుద్ర భౌచ్య చాక్షుష సూర్యు
లనెడు చతుర్దశ మనువు లమరి
బ్రాహ్మార్ష దివ్య బార్హస్పత్య సౌర చాం
ద్రగురు పావన పితృ నామక నవ
మానమ్ములును గేతుమాల కింపురుష హి
రణ్మయేలావృత రమ్యక కురు
తే. భరత భద్రాశ్వ హరిసంజ్ఞ వర్షములును
భారతేంద్ర కశేరు గభస్తి నాగ
తామ్ర రౌహిణ సౌమ్య గాంధర్వకాఖ్య
లమరు నవఖండముల నొప్పు నవనియందు. 13
సీ. ద్రవిడ విదేహ మాళవ మత్స్య మళయాళ
కొంకణాంగ విదర్భ కురు పుళింద
చేది టంకణ వత్న సింహళ కర్ణాట
మగధ ఘోట కళింగ మద్ర యవన
కుకురు బాహ్లిక పౌండ్ర ఘూర్జర నేపాళ
శక వంగ కాంభోజ సాల్వ లాట
సౌరాష్ట్ర చోళాంధ్ర శబర పాండ్య వరాట
కుంతల కేకయావంతి కాశ
తే. నాట కరహాట సింధు గాంధార నిషధ
కేరళ తురుష్క పాంచాల శూరసేన
కోసలోత్కల కాశ్మీర కుత్స బర్బ
ర మరు హూణాఖ్య సర్వ దేశములు చూచి.
క. యమునా తమసా మధ్య
క్షమఁ గమలోత్పల మరంద సంగ్రహణాద
భ్ర మతిభ్రమ ద్భ్రమర వి
భ్రమ గీత తతాభ్ర సురతరంగిణిచెంతన్. 15
సీ. పొడయెండ గాయని పొన్నగున్నల నీడఁ
గ్రొమ్ముత్తియపుటరంగులు చెలంగ
గొజ్జంగి పొదరిండ్ల పజ్జలఁ బచ్చక
ప్రములు, నిండిన ద్రాక్ష పందిలి తగ
శశికాంత కుట్టిమ స్థలులఁ బన్నీటి తుం
పర జల్లు జలయంత్రపాళి దనరఁ
గేళి కేళాకూళి క్రేవఁ జక్ర చకోర
హంస భ్రమత్సారసాదికలిత
తే. కలకలారావ విస్తార కమల కుముద
సౌర భాగార నీహార నీరపూర
వీచికానార దుర్వార విహృతి ధీర
శీతల సమీర కాసార సీమఁ గంటి. 16
వ. మఱియుఁ తత్కాసారం బనిమిషసంచారయోగ్యంబై యమరావతిపురంబును, శంఖమకరకచ్ఛపాధిష్టానంబై యలకాపట్టణంబును, ధార్తరాష్ట్రవిహారస్థలంబై హస్తినగరంబును, బకనివాసంబై యేకచక్రపురంబును, శంబరాధారంపై కాంతారంబును, శింశుమారచక్రవికాసితంబై మేరువునుం బురుడించుఁ దత్తీరంబున. 17
క. పల్లవితకలితపుష్పిత
సల్లలితమరందవళితసత్ఫలితమహీ
జోల్లసితాభ్రంకషమై
యుల్లము రంజిల్లఁజేయు నొక వన మొప్పున్. 18
ఉ.ఆ వనసీమ నొక్క తరు వంబరచుంబిత శాఖమై ముదం
బావహిలంగఁ జేయఁ గని యాగమనశ్రమమున్ క్షుధా ర్తియున్
బోవ నొకింతకాల మల భూజముపై వసియించి నాకగం
గా వనజాత జాత బిసఖండము లానుచు నుంటి నయ్యెడన్. 18
ఉ. కొండలు క్రిందుమీదుగను గూల దిశావళి వ్రీల సుష్ట్రవే
దండము లుర్వివ్రాలఁ ద్వరితంబుగ వారధు లింకిక్రాల బ్ర
హ్మాండము తూల నాది మహాహిప సూకర కూర్మమూరు లొం
దొండఁ గలంగి సోలఁ జటులోద్ధతి నుర్లెను నేల యమ్మొగిన్. 20
వ. అప్పుడు. 21
చ. హరి శిఖి దండి దైత్య వరుణానిల యక్షప భర్గులెక్కి యా
మరకరి మేష వాహరిపు మానవ నక్ర మృగాశ్వ నందులన్
గురుపవి శక్తి దండ వర కుంత గుణధ్వజ ఖడ్గశూల భృ
త్కరులయి కుంభయంత్ర గతిఁ దాల్చిరి దిక్పుర సైన్య సంగతిన్. 22
క. ఆ తటి నే నాకసమున
కాతత సంరంభగతుల నతిజవ మొప్పం
గాఁ దెలివి నెగసి చూడఁగ
భూతల చలనం బడంగి పోయిన పిదపన్. 23
క. ధరణీసుర భూభృద్వి
ట్చరణజ భట రథ గజాశ్వ సద్వస్తులచే
నిరవొందు పాండ్య భూమిని
బరిపూర్ణం బనఁగ నొక్క పట్టణ మున్నన్. 24
తే. కని మహామోద మొనరింపఁగాఁ బురంబు
కాఁపురంబుగ నుండెడు ఘనజనముల
కలిమి బలిమియు వీక్షించు కాంక్ష వొడమి
యొక్క సౌధంబుపై డిగ్గి యుంటి నందు. 25
తే. పరక తలగుడ్డ యొకపాటి పచ్చడంబు
ముదుక నీర్కావి దోవతి మొలను సంచి
తిత్తి వెండుంగరము వ్రేల హత్తి యొప్ప
నుండు శఠుఁడను పేద నియోగి యొకడు. 26
సీ. క్షేత్రఘాతంబుల స్థితులు వక్కాణించి
సౌవర్ణ గణితోక్త సంఖ్యఁ దెలిసి
మిశ్రిత గణితార్థ మిళిత మనస్కుడై
గాఢ ప్రకీర్ణక గణిత మెఱిఁగి
త్రైరాశికాద్యంత సారాంశము గ్రహించి
సూత్రగణితంబుఁ జొచ్చి కలఁచి
మఱి భిన్న గణితంబు మార్గమెల్లను గాంచి
పర గణితంబులఁ బాఱఁజూచి
తే. నిఖిల సిద్ధాంతసూత్రముల్ నేర్చి జగతి
గణక కుల సారభౌమత్వ గణనకుఁ దగి
గణిత మర్మజ్ఞుఁ డితఁడని ఘనులు మెచ్చఁ
దెలిసి యత(డెంత లెక్కైనఁ దేటపటచు. 27
సీ. త్రైరాశికప్రకీర్ణ సువర్ణ పంచరా
శిక మేరు పౌర్ణరాశిక సమాధి
కార వీరాచార ఘాట కుంటాహ్వయ
చ్చాయార్యభట బృహజ్జాతకోత్క
లిత సప్తరాశిక లీలావతీ వర్గ
వర్గమూల క్షేత్ర వాస్తు భాగ
గణితసార చతురంగ ప్రశంసౌబల
నాధీయ బీజ భిన్న నవరాశి
తే. క ఘన ఘనమూల శిల్పసంకలిత సూర్య
సోమ సిద్ధాంతయుగ లబ్ధ శోధ రత్న
ఘట్టితైకోనరాశ్యాది గణిత తతులు
దెలిసి యతఁడెట్టి లెక్కైనఁ దేటపఱచు. 28
తే. సరవి గుడిగట్టు గాచెంగ సరసివ్రాసి
యంతకము సేసి కులవర్గు లాయకట్లు
దీర్చి దినవహి నపరగతి ప్రతీర
నౌరవణి నిర్ణయింప శేషాహి యతఁడు. 29
చ. చదువులు చెప్పిచూచె మఱి సారెకుఁ గూలికి లెక్క వ్రాసి చూ
చదవదఁ గోలుకాఁడగుచు నన్నిఁట మండువలన్ నటించి చూ
చదియునుగాక రాయసపు టార్యుల ఘంటము లాకు దుద్దులన్
వదలక మోసి చూచె నొకపట్టునఁ బొట్టకులేక తక్కినన్. 30
క. పొరుగిరుగువారి కలిమికి
గుఱిగాఁ దానింత కూడు గుడుచుచు, వీటం
దిరుగాడి ప్రొద్దు గ్రుంకెడు
వఱ కొక పాతికకుఁ గొలుచు వడిఁగొని తెచ్చున్. 31
తే. తెచ్చి సుఖమతి యను నామధేయమునను
బరఁగు ప్రియురాలిచేతి కేర్పడఁగ నీయ
నాబి డన్నంబు సంకటి యంబలియును
జేయ సమరేయి వేళ బోసేసి పోవు. 32
క. అతఁ డీలాగున గ్రాస
స్థితికై యూరెల్లఁ గలయఁ దిరుగాడంగా
నతనాలు మరునికేళికి
వెతఁగొని తిరుగు భుజంగవీరులఁ గలియన్. 33
క. ఒసవరి వగలది ముద్దుల
నసియాడెడు గౌనుగలది యందముగల పైఁ
డి సరైన మేని చాయల
పస గలదని విటులు దాని పని కలవడుచున్. 34
తే. ఎనయ నేవేళ నెందైన నేపురేఁగి
పురిని గల జారు లత్యంతమోహు లగుచుఁ
గ్రుక్కిళులు మ్రింగికౌనుచు నొక్కొక్క రొకరె
తిరుగుచుందురు దానింటి తెరువుఁ బట్టి. 35
ఉ. ఇందుఁడు కందు, నిద్దపు రహిందగు సుందరి మోముగోము తా
నందమి, నిందిరేందుముఖినందనుఁడుం దన డెందమందు నిం
దిందిర కంద బృంద కచ దృక్తతి చందముఁ జెందఁజాలు వా
లొందమిఁ గుందు, జారులిఁక నుగ్మలిఁ బొందమిఁ గంది కుందరే! 36
శా. నెత్తావుల్ వెదచల్లు పుష్పలతలన్ నెమ్మేను, సింగంపు రా
మొత్తంబున్ నునుఁగౌను, శ్రీల గరిమంబున్ వీను, లందమ్ము ద
ళ్కొత్తుం గ్రొవ్విరి గుత్తులన్ మినుకులొల్కుం గబ్బి చన్గుబ్బలున్
నెత్తమ్మిన్ గళదేరు మోము చెగడున్, సీమాటి రంభన్, నగున్. 37
క. ఆ సుఖమతి తరుణవయ
శ్శ్రీ సంగతి నలరు విటులఁ జేరి రతులకున్
వేసారక యుసికొల్పఁగఁ
దా సుఖపడి వచ్చు నట్టి ధన్యులలోనన్. 38
చ. ఒకనికి మోముచుంబనము లొక్కనికిన్ మొనగుబ్బపోటు వే
ఱొకనికిఁ జెంపపెట్టు మఱియొక్కనికిన్ బిగికౌఁగిలింత లొం
డొకనికి గాఢసంగమము లొక్కనికిన్ రతిబంధనైపుణుల్
కకవికఁ జూపు మన్మథుఁడు గట్టినధట్టి సడల్ప నియ్యకన్. 39
చ. దుసికిలఁబాఱు చీఁకటులు దూఁకొనుచుండెడు గీలుగంటుపైఁ
బసగల పూలు నిగ్గుగల ఫాలతలంబునఁ జాదుబొట్టు దృ
గ్వసతికి గజ్జలంబు నరకాలున నంచులు జీఱు చీర, తా
రసమగు పుష్కకంచుకము రంజిలఁగాఁ జరియించు వీథులన్. 40
తే. ఇటుల జరియింపఁగా దాని యెమ్మె లెఱిఁగి
వట్టి యనుమానమలచేత బెట్టు గుంది
కని విరూపిణిగాఁ జేసి కాంత వీడి
చనియెద నటంచు నెమ్మది శఠుఁడు దలఁచి. 41
క. ఒకనాఁటి రాత్రి యింటను
సకియ కడన్ బవ్వళించి సంభ్రమమునఁ బౌం
డ్రక దేశమునకుఁ జనియెద
నొక పనికని వేగ యామముండెడు వేళన్. 42
తే. పయనమై లేచిపోవుచో భార్యతోడఁ
జెప్ప నొక్కింతదూర మచ్చిగురుఁబోఁడి
సాఁగ నంపి బహిశ్శంక కేఁగ, నతఁడు
దిరిగి కికురించి వేగ మందిరము చొచ్చి. 43
ఉ. దూలముమీఁది యట్టుకను దొంగవిధంబున నిశ్చలాంగుఁడై
తాలిమిఁ జిక్కఁబట్టి కులతామరసేక్షణ చర్యలెల్ల నా
మూలముగాఁ గనుంగొనెడు బుద్ధిని నాశఠుడుండు నంతఁ బ్రా
క్శైలశిఖాగ్రభాగమున సారసమిత్రుఁడు తోఁచె నంతటన్. 44
క. పనిపాటుఁ దీర్చి సుఖమతి
పనివడ నేఁడింటితొడుసు బాసెగదా యం
చును వెల్వడిచని వీథిని
మనసిజ వేదనల జాలిమాలి తిరుగఁగాన్. 45
సీ. గౌరి పంచాంగంబు గౌళిపల్కుల పంతు
పక్షుల శకునముల్ పైఁడికంటి
పలుకుల రీతులు ప్రశ్న భాగంబులు
గబ్బుల్గు కూఁతలఁ గలుగు మేలు
కీడును, బోచిళ్ల జాడెఱింగెడు నేర్పు
దిగ్విదిక్కులఁ జూచి తెలుపు నుడువుఁ
దుమ్ము లక్షణములు తొడరు కాకరవంబు
సాముద్రికస్థితిఁ జతురమహిమఁ
తే. తెలియనేర్చిన యొక మహాధీరవరుఁడు
శకునవిద్యావిచక్షణాధికుఁడు సౌకు
మార్యరేఖల మాఱట మారుఁడైన
యవనిదివిజుండు మతిమంతుఁ డనెడువాఁడు. 46
క. ఎదురైనఁ జూచి సుఖమతి
కదియంజని వాని సొబగు కలిమికి మోదం
బెదనొంది యతని “నో నవ
మదనా!" యని పిలుచునంతమాత్రనె యతఁడున్. 47
తే. దీనిఁ దగిలించుకొనవలెఁ దియ్యవిలుతు
దురము పనిలోకి నేఁడు ముద్దుగ నటంచుఁ
దలఁచు నంతటిలో జాణతనము లాడి
లోఁ బఱచి వానిఁ దోడ్తెచ్చె లోలనయన. 48
మ. అటులం దోడ్కొని వచ్చుచోఁ గులుకు టొయ్యారంబుగాఁ జూచుఁ, జొ
క్కటపున్ సిబ్బెపు గబ్బిగుబ్బ నెలవంకల్ సాముగాన్పింపఁ బై
పట మొక్కింత సడల్చుఁ, బచ్చి దొరలన్ భాషించు, లేనవ్వుతో
సటలుం జేష్టలొనర్చుఁ బై పయిఁబడున్ జారుఁడు హర్షింపగన్. 40
చ. నిలయములోని కిట్లు విటునిన్ వెసఁ దోడ్కొనివచ్చి హెచ్చి కం
బళము ముదంబునం బఱచి పల్లవుఁడందు వసించినంత న
య్వళికచ యేక్రియం గనెనొ యట్టుకపై నిజభర్త యుండుటల్
తెలిసిన భీతిలేక సుదతీ! యపుడేమని బొంకెఁ జెప్పుమా! 50
చ. అని యల వానజాలిపులుఁగా వనజాక్షినిఁ జీరి వేఁడినన్
విని తలపోసి చూచి యిది వింతసుమీ! తెలియంగ లేను నే
ర్పున నది భర్త కింపు మదిఁబుట్టఁగ నెట్టుల బొంకెఁ జెప్పవే
యనఁ గలహంస వంశ కలశాంబుధిచంద్రుఁడు కాంత కిట్లనున్. 51
క. విను హేమావతి! సుఖమతి
తన వల్లభుఁ డటుకమీఁద దాఁకొని యున్నాఁ
డని తెలిసి ధృతి చలింపక
యనుపమచాతుర్యధుర్యయై విటు మ్రోలన్. 52
క. వక్కాకిడి సద్భక్తిని
మ్రొక్కి కనుం గీఁటి, “శకునములు చూడు వరుం
డె క్కార్యంబున కేగెనో
యక్కార్యము లెసఁగ సఫల మౌనో? కావో! 53
తే. లెస్సగాఁ జూచి చెప్పుము లేమిచేతఁ
జనిన నాపతి శీఘ్రంబె సఫలుఁడై సు
రక్షితంబుగ వచ్చునో రాఁడొ" యనుచుఁ
దెఱవ యడిగిన నా సైఁగఁ దెలిసి యతఁడు. 54
జోస్యుని సరకులు
సీ. అంగుళి క్రమమున నశ్విని భరణియుఁ
గృత్తిక రోహిణి మృగశిరార్ద్ర
పొసఁగఁ బునర్వసు పుష్య మాశ్లేషయు
మఖ పుబ్బ యుత్తర మఱియు హస్త
సరవిఁ జిత్రయు స్వాతి పరఁగ విశాఖాను
రాధలు జ్యేష్ఠయు రమణ మూల
పూర్వోత్తరాషాఢ లుర్విని శ్రవణ ధ
నిష్ఠలు శతభిష క్రోష్ఠపదలు
తే. నుత్తరాభాద్ర రేవతు లొనర నెంచి
మేష వృషభ మిథున కర్కి మృగప కన్య
కా తులాళి ధనుర్నక్ర కలశ మీన
రాశి సంఖ్యలు వరుస నేర్పడ గణించి. 55
తే. సూర్య శశి భౌమ బుధ జీవ శుక్ర మంద
రాహు కేతు గ్రహస్థాన రాశి కూట
చార కోణోపచయ కేంద్ర సార నీచ
పరమ స్వోచ్చాంశ లగ్నముల్ పదిల పఱచి. 56
తే. జన్మ కర్మ సాంఖ్యాతిక సాముదాయి
కాంగ జామిత్ర వైనాసికారి వామ
పార్శ్వవేధలు లత్తలు భావ దుస్స్వ
భావ నీచాస్తమయములఁ బరిహరించి. 57
సీ. ద్వాదశాబ్దాబమాత్ర గ్రహ మాతృ న
క్షత్రాంశ రాశి మాస దిన మరసి
పద్మ సింహాసన పణకూర్మ నర చాప
కుంతల ఖలజీవ కుంభవర్గు
శని ఖడ్గ రథ గణాశ్వవ్యూహ నాడికా
దిగ్విధ చ్ఛత్ర ద్వితీయ పంచ
విధ దశవిధ రాహు వృశ్చిక లాంగూల
పంచ సప్తశలాక పక్షిడింభ
కౌమాఖ్య తోర్మణ గౌళిక్షుత శ్యేన
యాత్రా త్రికాల సూర్యఫణి జయక
ఘోర కాలానల గూఢకాలానల
భూచర ఖేచర పుణ్యభూమి
చంద్రకాలానల సంకట సూర్యకా
లానల రాహు కాలానల కలి
వర్తుల భాస్వర వామ గౌడ ద్వితీ
య తృతీయ మాతృకా చతుర దీర్ఘ
వర్ణేశ్వరాహ్వ దైవతయోగ తుంబురు
ప్రస్తార సర్వతోభద్ర కులకు
లాల కోటా మహాలక్ష్మీనఖక్షితి
వలయ లక్ష క్షేత్ర వాల భూమి
తే. ఘన పుళింద కొల్లాపురి వెనక పటక
కాలరేఖ మహామాలికా నిరామ
యాఖ్య లలరారు చక్రము లందు బీజ
పంక్తి లిఖియించి తత్ఫలాఫలము లరసి. 58
క. ఈలాగు చక్రముల గ్రహ
జాలము లిఖియించి చూచి చంద్రాస్య వరుం
డాలయమున దాఁగుండుట
కాలజ్ఞుఁడు తెలిసి పలికెఁ గౌతుక మెసఁగన్. 59
తే. "కడుపులోఁ జల్ల గదలక కలికి! వినుము
నేడు రేపటఁ దలపువ్వు వాడ కతఁడు
రాఁ గలఁ" డటంచు శపథ మేర్పడఁగఁ జెప్పి
యతఁడు తా నిల్లు వెలువడి యపుడ చనియె. 60
ఉ. ఆ సమయంబునందు శఠుఁ డట్టుకపై వసియించి యుండి యెం
తో సుముఖత్వ మొప్పఁ గని తొయ్యలిభక్తికి సచ్చరిత్రలీ
లా సుగుణ ప్రసిద్ధికి భళా! యని మెచ్చుచు డిగ్గివచ్చి “రా
వే! సరసీరుహాక్షి!" యని వేగమె కౌఁగిఁటఁ జేర్చి వేడుకన్. 61
క. "ప్రమదా: నీ పాతివ్ర
త్యము భక్తియుఁ గంటి సందియము లేదిఁక" నం
చు మనోరాగంబున శఠుఁ
డమిత స్తుతు లొనరఁ జేయ, నది యిట్లనియెన్. 62
తే. “కాంత! నే నెన్నుకోరాదు గాని నన్నుఁ
బోలఁగల సాధ్వు లున్నారె? పుడమిలోన"
ననుచుఁ బతితోడఁ జెలరేఁగి యాడుకొనఁగ
నిండుమోదంబున సుఖాన నుండె నతఁడు. 63
చ. అని కలహంస చెప్పిన నయారె! కథాస్థితి యంచు మెచ్చుకొం
చును దపనోదయ ప్రభలు సుందరి కన్గొని యింటిలోనికిం
జని పవ లెల్లఁ బోఁగడపి సారసమిత్రుఁడు పశ్చిమాద్రికిం
జనిన యనంతరంబ మనుజప్రభుపై విరహంబు మీఱినన్. 64
సీ. కళదేరు కస్తూరి తిలకంబు వాసనల్
లపన గంధములకు లంచ మొసఁగ
నవరత్న తాటంక వివిధ కాంతిచ్ఛటల్
నునుఁ జెక్కు జిగికిఁ గానుక నొసంగ
నలరు మానికపు సోయగపు దండల టెక్కు
కనకాంగ దీప్తికిఁ గట్న మిడఁగఁ
జెంగావి వలిపంపుఁ జీరంచు సరిగడాల్
పదశోణ ఘృణులకుఁ బగిడిఁ బెట్ట
తే. మదన మదహస్తి విడిపడ్డ మాడ్కిఁ బడఁతి
పుడమియొడయని కడ కేఁగ బెడఁగు నడల
నడచు వడిఁ గడుఁ గ్రొమ్ముడి సడలి విరుల
జడి పొడమ నిల్లు వెలువడి చనఁగ నపుడు. 65
క. కని రాజహంసవరుఁ డి
ట్లను “భళి! మేల్జాణ వౌదువౌ సొగ సమరెన్
జననాథు నెనయఁ బోయేదొ
విని పొ మ్మొక కథ” యటన్న వెలఁ దిట్లనియెన్. 68
మ. “కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్ గల్పించెదో! కాక పె
ద్దలచేఁ బూర్వము విన్నవాఁడవొ! మహాదైవ ప్రసాదంబొ! విం
తలు సుమ్మట్లు వచింప నన్యులకు, మేధాశక్తి నిన్ బోలు వా
రలు లేరింక, బలారె; చెప్పు” మనుచున్ రాజాస్య ప్రార్థించినన్. 67
పదునాల్గవ రాత్రి కథ
కోమటిబోటి సుంకరి కొల్వుకానిఁ గూడుట
క. ఆ మానసౌక మభినవ
తామరస మరంద బిందు తత బృందంబుల్
నేమించి కురియు వాక్కుల
హేమావతి కనియె మోద మిగురొత్తంగన్. 68
చ. వినుము విదర్భ దేశమున విశ్రుతమై సిరులందు విహ్వలం
బన నొక పట్టణం బమరు, నచ్చట నొండొక వైశ్యుఁ డెంతయున్
దనరు హిరణ్యగుప్తుఁ డను నామముతోడఁ దదీయ భార్య హ
స్తిని యను పేరునన్ బరఁగుఁ జెప్ప నశక్యము దాని వైఖరుల్. 69
క. మిల మిల మను మెయి తళుకులు
పొల యలరుల వలపు గులుకు పొలుపగు నగవుల్
చిలుకల కదుపుల నదలుచు
చెలి సొలపుల పలుకు లలరుఁ జిలుకలకొలికీ! 70