Jump to content

హంసవింశతి/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి


హంస వింశతి

పంచమాశ్వాసము

శ్రీధర! ధరధర! వరధా
రాధర నిభవర్ణ! సమదరావణ మకుట
క్ష్మాధర చరశర! విబుధా
బాధిత! కరుణాభిరామ! రఘుకులసోమా! 1

వ. అవధరింపుము. నలరాజన్యునకుఁ బ్రత్యుత్పన్నమతి యిట్లనియె, అట్లు ప్రభాతంబుగా వచ్చిన నిజమందిరంబు చేరి మఱునాఁడు దినాంతంబయిన యనంతరంబ హేమవతికాంత యత్యంత సంతోషంబున. 2

సీ. నిటలాధరీకృత స్ఫుట చంద్రకళ లీల
నెలవంక నామంబు నీటుగులుక
మరుదాప్తి రేఖగా నెరయు పద్మరజంబు
వలె వక్త్రఘనసార తిలక మమర
నంతస్స్థ నృపవిరహాగ్ని పైఁబర్విన
గతి గుబ్బఁ గుంకుమ కలప మలరఁ
జిగిరించి పూచిన చిన్నారి లతరీతిఁ
జిత్రపట్టాంబర గాత్ర మమరఁ
తే. గనక సుమదామ ఘుమఘుమల్ కచములందుఁ
గంబురాపూత భుగభుగల్ గళమునందు
నంద మొందంగ వాసింప హంసమున్న
నెలవునకుఁజేరె సాతాని యలరుఁబోఁడి. 3



తే. చేరినప్పుడె కలహంస శేఖరుండు
తివిరి హేమవతీకాంత దిక్కు జూచి
వేడుకలరంగ నొకగాథ వింటివేని
చెప్పెద నటన్న మంచిది చెప్పుమనిన. 4

వ. హేమావతికి హంసం బిట్లనియె. 5

పదునేడవ రాత్రి కథ

కుమ్మరిగుమ్మ సాలెవానిఁ గూడుట

క. పరఁగు నొక పురము రత్నా
భరణంబనఁ దరణకిరణ పటలీ సంరో
ధ్యురు సౌధస్థిర కేతూ
త్కర చిత్రపటాంశు చిత్రిత ద్యుతలంబై. 6

తే. తనయుఁడగు రాజు ఘనమార్గమునను రాఁగఁ
గోట యాత్రోవ నరికట్టుకొన్న సుద్ది
విని జలధి దానిచుట్టును విడిసె ననఁగ
నారసాతల నిమ్న ఖేయంబు దనరు. 7

ఉ. అందొక కుంభకారక మహాన్వయమండల దుగ్ధవార్థి పూ
ర్ణేందుఁడు చక్రదాసుఁడన నెన్నిక కెక్కిన పేరుగల్గి చె
న్నంది మనోహరాంగ రుచిరాకృతి సంపదచేత నిందిరా
నందనుఁడే యితండగు ననందగి కాపురముండు నెప్పుడున్. 8

ఆ. సలుప కడవ రాయి సారె కలాసంబు
కట్టె యిసుము జల్లి కడవ ముల్లు
మంటిముంత గుబ్బమ్రాను నావంబును
మన్ను మోయఁ బోతు మలయుచుండు. 9

కుమ్మరి - పరిశ్రమ

సీ. ఆదివరాహంబు మేదిని నెత్తిన
మాడ్కి చొప్పడఁగఁ దా మన్ను మోయుఁ
బ్రథమవేళల సృష్టి బ్రహ్మ చేసిన యట్లు
ఘటకోటు లుత్సాహగరిమఁ జేయు
విష్ణువు చక్రంబు వేడుకఁ ద్రిప్పెడు
చాడ్పునఁ బలుమాఱు సారెఁద్రిప్పు
బయలి పురంబులు భర్గుండు గాల్చిన
డంబు సూపట్ట నావంబుఁ గాల్చుఁ
తే. గపివరుఁడు పర్వతంబులు గమిచితెచ్చి
కుప్పలిడురీతిఁ గుండలు కుప్పవెట్టు
నవి దివియు ధాతకాండంబు లడఁచు సరణి
సాధుపథవర్తి ఘటకార చక్రవర్తి. 10

తే. కాఁగు మజ్జిగ ముంతయుఁ గడవ గూన
బాన వెసలయు బుడిగెలు పరపు చట్టి
కడవ ముంత కరిగె దుత్త పిడత గురిగి
కుందె లటికయు మూఁకుడు బిందె ప్రమిద. 11

చ. చెవులపెనంబు గోలమును జిల్లుల సిబ్బియు దోని తొట్టియున్
గువిచిలుమూఁత మాలయును గుమ్మెత యందపు ధూమపాత్రయున్
సవరని బూద పెందొనయు సానికె యొప్పు కమండలంబు వే
డొవతెవ కంబి దుత్త నెరడుల్చియుఁ గప్పెరపంటు లాదిగన్. 12

తే. తీనెపూజలు కులుకులు త్రేటగట్లు
గరల మురువులు పడికట్లు కిరుదుకట్లు
బొద్దుటీనెలు నునుపులు మొదలు గాఁగఁ
బనులు నిర్మించుఁ గుండలపై నతండు. 13



సి. దేవకార్యములకుఁ దిరునాళ్లకును మహో
త్సవములకును గంగజాతరలకు
సంప్రోక్షణములకు జన్నములకుఁ బెండ్లి
వడుగు నోములకును వ్రతములకును
సత్రంబులకు సహస్రంబులకును సమా
రాధన పితృకార్యయూథములకుఁ
బండుగులకు నాలపంబులకును బొంగ
లికిని దేవరకు గొబ్బికిని నడరు
తే. జంగమార్చనలకు బాల[1]దాస భోజ
నములకును దండువెట్టికి నగరివారి
కొండ బక్కలకును భిక్షుకులకు నైనఁ
గొఱఁత వడకుండఁ గుండ లాకుమ్మరిచ్చు. 14

క. ఒకపాటి కలిమిచేతను
గకపిక పడ కప్పులేక కనకాభరణాం
శుకముల గరగరికల నిం
చుక తక్కువగాక యతఁడు సుఖమున నుండున్. 15

క. ఆతని కొక్క కులాంగన
శీతాంశునిభాస్య రూపసేనాఖ్యను వి
ఖ్యాతిని వెలయును గంతుని
చేతి జగా బాఁకనంగ జిగిబిగి వగతోన్. 16

ఆ. ఘనము ఘనము కన్నఁ గచనైల్యవిస్ఫూర్తి
మెఱుఁగు మెఱుఁగుకన్న మేనిచాయ
విపుల విపులకన్న నుపమింపఁ గటితటి
దాని కెనయె భూమిలోని సఖులు? 17

ఉ. పోకల రీతినొంది మెఱుపుల్ గొని మిట్టలు గట్టి పై మొనల్
జోకగఁదీసి తాళముల చొప్పునఁ గన్పడి చెండ్లవైఖరిన్
దీకొని యొప్పి గిండ్లపగిదిన్ గొమరొప్పఁ బసిండికుండలై
వీకను దండనుండి యళివేణికుచంబులు పొల్చు నెంతయున్. 18

ఉ. పంచశరాహితుండికుఁడు భామిని పొక్కిలిపెట్టెలోనఁ దా
నుంచిన కాలసర్పము సమున్నతి నాడఁగ ఠేవమీఱ బు
స్సంచు ఫణాగ్ర మెత్తి యలరారెడు చాడ్పున రోమరాజి య
భ్యంచితలీల మించి మది హర్షముఁ జేయు జనాళి కెప్పుడున్. 19

సీ. చంద్రభాగ నిరూఢి సతిమోము రాణించు
నెఱికొప్పు కృష్ణవేణి గతిఁ గాంచు
నువిద వాల్గనుదోయి యుత్పలావళి నొంచు
సకియపల్కులు సరస్వతిని మించు
శంఖవర్ణారూఢి సఖిగళంబు జయించు
నవ్వులు క్షీరసుందరత మించు
స్తనము లుత్తుంగభద్రసులీల దర్పించు
నారు నీలాకృతి నందగించు
తే. జఘనము విశాలహేలల సంభ్రమించుఁ
బదయుగము పల్లవాకార మద మడంచు
నడలు హంసావళీఖ్యాతిఁ గడు వహించు
నంగము హిరణ్యకళలతో నతిశయించు. 20

క. తమ్ములు చెలికరములు కుం
దమ్ములు పలువరుస పర్వతమ్ములు బలుచం
దమ్ములు చన్నులు తొవలం
దమ్ములు కను లలక లంబుదమ్ములు పొగడన్. 21

చ. హరివరకాంచనాబ్జకమలాళిఘనాకృతులందు టెంత య
బ్బురము పటూక్తి నాస గళముం గరముల్ కుచయుగ్మ మంచు న
త్తెఱవ సుమధ్య దేహ ముఖ దృక్తతి కుంతల కేశపాశముల్
హరివర కాంచనాబ్జ కమలాళి ఘనాకృతులందు నిచ్చలున్. 22

ఉ. దాని మిటారి సోయగపు దట్టపుమోహము లూరు చూపులున్
దాని కచంపు సొంపు వగఁదాల్చిన చాయల రాయడించుకన్
దాని రసోక్తు లాకుల మనంబుఁ గనుంగొని లోనుగాని య
మ్మానవుఁ డెందులేఁడు వినుమా! యనుమానము మాని మానినీ! 23

చ. అది నెఱప్రాయపున్ సొగసుదౌట నొకానొకటైన గర్భముం
బొదలని దౌట నింటి యెనుబోఁతునకంటె మదంబు హెచ్చి నె
మ్మది పరసంగమంబునకు మార్కొని సొక్కఁగ జార వీరులన్
వదలక చూచుచుండఁ దలవాకిలి కాఁపురమయ్యె దానికిన్. 24

క. చిటిపొటి సొమ్ములు వెట్టుక
పుటపుటగా వీధివెంటఁ బొరుగిండ్ల బడిన్
విటుల నిమిత్తము మట్టెలు
చిటుకు చిటుక్కనఁగఁ దిరుగు సిస్తగు వగతోన్. 25

సీ. జేజేల రారాల జిగిఁగ్రాలు నిడువాలు
కురులు వేమఱు దువ్వి కొప్పువెట్టు
బలువాలుగల నేలు తెలిడాలు గల మేలు
కనుల రేఖలఁ దీర్చుఁ గజ్జలంబు
కపురంపు రుచిఁ బెంపు కడునింపుఁ దులకింపు '
పెదవిపైఁ గెంపెక్క విడెము సేయు
వలసిబ్బెముల గుబ్బలుల నిబ్బరపు గుబ్బ
చనులఁ బూయును మంచి చందనమ్ము



తే. మంగళాభంగ రంగద్రథాంగ వృత్త
ఘన జమనసీమ సవరించుఁ గలువచెలువు
నలవరుచు నల్లనైన దువ్వలువ మెఱయఁ
జిత్తజుని దాడి కుమ్మర చిగురుఁబోఁడి. 26

సీ. తరితీపువగలు బిత్తరపుఁజూపులు మోవి
విఱుపులు సొలపులు వింతమాట
లుదుటు చొకాటంపుటొయ్యారిచేష్టలు
సోబాన పాటలు సొగసు గుల్కు
పొగరు వికావిక నగవులు బెళకించు
కనుసన్న నేర్పులు కలికి కతలు
సామెతల్ చిన్నెలు జానతనంబులు
తెచ్చికో ల్మురువులు తేటపడని
తే. జంకెనలు ఱొమ్ముతాటింపు సాహసములు
పచ్చి తేరఁగఁ బల్కెడు ముచ్చటలును
విటులఁ గనుఁగొన్న వేళల విస్తరించు
రూఢిమించిన తమితోన రూపసేన. 27

క. ఈ లాగునఁ జెలి పల్లవ
జాలచకోరముల కెల్లఁ జంద్రోదయమై
చాల విహరించుచుండెడు
కాలమ్మున నొక్కనాటి కడయామమునన్. 28

మ. పరఁగం గూలిన యిండ్లు వెళ్లు గరిసెల్ పల్లేరు లుమ్మెత్తలున్
జిఱిపెంకుల్ చిగిరింతలున్ గునుకలున్ జిల్లేడులున్ మూషికో
త్కరముల్ దున్నిన పెంటదిబ్బలును నక్కల్ పందికొక్కుల్ దరుల్
దొరుఁగన్ బూడిన పాఁతఱల్ పడిన గుళ్ళున్ గల్గు పాడూరిలోన్. 29

ఉ. లాడికి మూఁగు కాకులఁ బలాయన మొందఁగఁ జేయ వీఁపుపైఁ
ద్రాడున వ్రేలు నీఁ కెగుది తాపిన దేహము పేఁడి కాళ్ళకున్
రోడి నశించు తోఁక బలు రోమము లంటిన జోరుటీఁగలున్
గూడిన బంధముం గలిగి కూర్కుచు నుండొక బక్క గుఱ్ఱమున్. 30

తే. మందగుది రిప్ప గొరి సేలు మక్కి రొళ్ళు
బరతుమురు కొమ్ములును దోటు బర్ల తడక
వాటు తెఱడొక్క మిడితోఁక వేటుగాళ్లు
నేరు ద్రోసిన యొక బీద యెద్దుఁ జేరి. 31

వ. అందు పసించియున్న సమయంబన. 32

చ. నలువగు తుంకి చేవనఁ గనంబడు కొమ్ములు వింత చింత ని
ప్పుల సరివచ్చు కన్నుఁగవ పోసరమున్ మెడ ముద్ద ప్రక్కలున్
దెలుపులరాలు లావు పొలతిందగు (?) పాదము లుక్కుపోఁత సం
ధిలిన విధాన నుండు బలు దేహము గల్గిన పోతు వచ్చినన్. 33

ఉ. చేరి, “శుభంబె? ఘోటకమ! శ్రీకరమే! వృషభంబ! మీర లీ
తీరున డస్పియుండు కథఁ దెల్పుఁ" డటంచును బోఁతు వేఁడ, “వే
సారక విన్ము చెప్పెదను సైరిభవర్య! మదీయ గాథ" యం
చారసి యార్తిఁ గ్రుంకుచు వృషాగ్రణి పోతును జూచి యిట్లనున్. 34

సీ. తలయేరుఁ బెట్టి బీడులు దున్ని పడఁగొట్టి
గాలు చిక్కిన బండ్లఁ గట్టి మొత్తి
పొలముకాండ్లకుఁ ఱంచి తలదిమ్ము పట్టించి "
పట్టుడు కవిలెలఁ బదనుఁ జెఱచి
పాపనమ్ములఁ జిక్కుపఱచియు రెండేసి
గొర్లకాఁడి నమర్చి గొట్టు చేసి
బలు గుంటకల చేను పాయుచో, సాగని
ఠావుల సెలకోల దాఁక మొత్తి

తే. గానుగలఁ ద్రిప్పి సరువళఁ గలఁచి బంతి
దుడ్డు బరువెత్తి యెకిరింత దోలి యొడలు
గళ్ళిపడి రెండు దుక్కులు వెళ్ళ దున్ని
యఱ్ఱు గడిగి పోఁ దోల నిట్లైతిఁ జుమ్మి! 35

క. అన విని తలఁ దిప్పెను బో
తనియె “మహోక్షంబ! కష్ట మనుభవమయ్యెన్
వనజభవు వ్రాఁతఁ గడవఁగ
మన తరమా?" యనుచు వగచి మహిషము హరితోన్. 36

తే. నీవు హరిరీతి గంధర్వ నిచయమెల్లఁ
గొలువ దేవమణీ చక్రములు వహించి
విబుధుల భరింపుచుండెడు విధము లెల్లఁ
దొలఁగి చిక్కితి విటులేల తెలుపు మనిన. 37

వ. తురంగంబు మహిషంబున కిట్లనియె. 38

క. ఆనాఁటి కటుల నుండితి
నీనాఁటికి నిటుల నయితి నేమందు నయో!
లేనాఁటి మేని సత్తువ
లేనాటికిఁ గలవె? విను చరించిన విధమున్. 39

సీ. ప్రేమ నెదుర్కోలు పెండ్లివారల కిచ్చి
తెవులైన వారి కద్దెలకు నొసంగి
మేయఁబోయిన చోట మెడవెండ్రుకలు వట్టి
యాకతాయలును వాహ్యాళిఁ దోలి
సారె గృహప్రవేశమువారి నెక్కించి
సంత సారెకులందు స్వారి వెడలి
పల్లె పట్రలనుంచి బర్వు వేసుక వచ్చి
వలసల చేకంట్లముల ఘటించి

తే. తీఱకున్నట్టి కష్టసంసారమునకుఁ
గసవుకట్టెల లద్దుల గాసి పఱచి
లావు సత్తువ చెడఁగొట్టి లాఁడె పోవఁ
జేసి తోలిన నిటకు విచ్చేసినాఁడ. 40

చ. గొఱపము చెడ్డయొట్టు చలి గొట్టినచోఁ గవణంబు కల్ల మే
నఱసిన మాదమాఱ జలమార్చుట యెన్నడు కాని వావి యే
తఱిఁ గలలోననున్ బడెఁడుదాణ యెఱుంగను బేదదంటు ముం
దరఁ బడవేసి యెడ్లకడ దామెనత్రాడునఁ గాలు గట్టినన్. 41

తే. ఎడ్లు పోట్లాడి కొమ్ముల నెత్తివేయ
గేదె లొక దిక్కు సెలఁగఁగఁ గ్రేపుఁదల్లు
లాస్థఁ దన్నంగ నమ్మహావస్థచేత
గోడిగై పుట్టియును గోడు గుడువవలసె. 42

గడ్డి రకములు

సీ. పిల్లపీఁచర నక్కపీఁ చెల్కచెవి గొఱ్ఱె
పాలలంబును మేక పాలలంబు
బుడ్డకాసర యుట్లబొద్ది దొంతరలంబు
మాడుపు గురుగును మదనకట్టె
నూనెముంతలమును నానఁబ్రాలలమును
గొండగురుగు పాలపెండలంబు
పొర్లుగాడియు నల్లపూలల మిసుక చెం
చలి కందికారము గిలకలంబు
తే. కన్నెకొమ రెద్దుమట్టాకు వెన్న వెదురు
లంజెసవరము వెఱ్ఱి ఫూ[2]లలము చిట్టి

బొట్టలము గోళ్లగొండియుఁ గట్టలంబు
నల్లతీఁగాది యలములు సళ్ల విడిచి. 43

తే. కనుము లీడని కోరికె కాకివెదురు
దర్భ చిగిరింత గోరిగె దాడయంబు
జంబు నూదర తుంగ పెన్ జంబు పెద్ద
తుంగ భోజవతియు నక్కతోఁక విడిచి. 44

సీ. కాచిగోగడ నెఱ్ఱకాచి బూడెడ తోల
కాచి పండెడ గోళ్లగడ్డి యూల
ముల్లూపు చెంగాయ మల్లయ కరివెల
యెఱగొయ్యి వెణుతురు మెఱుఁగుగడ్డి
గంప దొల్లొకకొమ్ము కారెపోతర ముల్లు
వట్రింత కదురు కార్వాకు చిత్ర
కదురు బూతరాకాసి పిచ్చుక మియ్య
మశ్మరి వెర్లి చేమర్లు గునుక
తే. చీమచిప్పర చిప్పర చేతిబోద
పుట్టగడ్డుట్ల చిప్పర పూడు కసవు
పొలికె పెనుకెడ కుందేటి పొరుజు గఱిక
పరికి సాళువ సొంబెకుందురు గొలిమిడి. 45

వ. మఱియును. 46

తే. వేరు తొణ్ణంగి తొండును వెళ్లి మూరు
తోప రిట్రింత యెద్దుకొమ్ముప్పి గడ్డి
పుల్ల పూరూచయును బూద పూలగడ్డి
కచురు తుంగాకు తుంగలుఁ గలయ విడిచి. 47



ఉ. చిక్కులమారి యా బలిజసెట్టి వయాళులఁ గట్టె బర్వులన్
సుక్కెడలంగఁ గొట్టి తన సుందరిచేతికి గడ్డికోసమై
చెక్కుడుపాఱ యీయఁ బడిసేటది చక్కని కోడెకాండ్రపైఁ
బ్రక్కల వ్రాలి సోలి నగుబాటునకళ్కక సంజె చీఁకటిన్. 48

తే. దాసకపువాండ్రు లద్దిలోఁ దలఁగఁ దీసి
దిబ్బలను వ్రేయఁ జెడుగత్తు గబ్బుగడ్డి
గంపలో వేసికొని వచ్చి చంపఁజాలు
పూనికను గ్రమ్ముకొని నామొగాన వైచు. 49

క. విను సూపెచర్య కినుమడి
గొనకొని కావించు దానికోడలి నడతల్
కనికని వేసారితి హె
చ్చెను బాపఁపుఁగాల మనుచుఁ జెప్పెడు వేళన్. 50

గాలి - వాన

సీ. చండవేగోత్థ భూమండల ధూళ్యాప్తి
పంకీకృతాభ్ర కూలంకషాంభ
మభ్రోత్పతద్దృష ద్వ్యాఘాత భగ్నధా
త్రండక్షర ద్బాహ్యకాండకాండ
ముద్రిభిత్కేల్యట వ్యగ్ర భాగద్రాక్కృ
త ప్రోద్ధుతక్షమాస్థ క్షమాజ
ముగ్రత్రిపుర ధీకృదుగ్ర త్వరోద్ధుత
ద్యోవీర్యటద్ధరిత్యున్నత పుర
తే. ముద్ధుతాబ్ధి హ్రద హ్రాదినీద్ధ వార్ము
హుర్ముహుర్హతి నిపతద్భహూరుచక్ర

వాళమద్ర్యశ్మపూరితవార్ధి వీచె
భయదగతి నొక్క ఝంఝాప్రభంజనంబు. 51

మ. వరుణాశాగతమారుతోద్దతశిలావ్రాతాహతిద్రాగ్ధళ
త్తరళద్యోపతనాతిభీతిభరితాంతబ్రహ్మదత్తార్జునో
త్కరముత్ప్రస్తరముఖ్యవస్తుఘటితస్తంభభ్రమాపాదిభీ
కరవాతోత్థధరాపరాగవలయౌఘమ్ముల్ దనర్చె న్మహిన్. 52

వ. మఱియు నవ్వాయువు శోషితసింధురాజంబును గర్జవిస్ఫాటనంబును గావున ధనంజయపరాక్రమంబును నష్టకబంధనంబును బలాశివిజయంబును గావున దాశరథిప్రతాపంబును ఖగరాజమానభంగంబును శైలబలఘాతియుఁ గావున మహేంద్రవిక్రమంబు ననుకరించె నంత. 53

ఉ. భేక శుభప్రదం బనలభీమ మనేకప ఘోణికాసరా
నీక శరీరతాపహ మనీర తటాక నదీనదాది నీ
రాకర హర్షకారణ మహఃపతి దీప్తి నిరోధికంధరా
లోకన హృష్ట భీత శిఖిలోక మరాళము సోన దోఁచినన్. 54

చ. జలదము నీలిచల్లడము శక్ర శరాసనమొప్పుకాసె ధా
రలు తెలిజిల్లుపేరు బకరాజి వహించిన బూదిపూఁత ల
గ్గలపు మెఱుంగు లాయుధపుఁ గాంతులు గర్జిత గర్జలొప్పఁగాఁ
దొలకరి వీరముష్టి కడుఁద్రొక్కె నభస్స్థల పణ్య వీథికన్. 55

సీ. ఆకాశ కరికుథంబై యొప్పు మొకమాలు
కాల కువిందోత్థ నీల పటము
మిహిరాంగనాభంగ మేచకోల్లాభంబు
కకుబంగనా నీల కంబళంబు
కమలజాండ భ్రాష్ట్రగత మషీవ్రాతంబు
ద్యుమణి దీపోత్థత ధూమచయము

నడిమిలోకము ఱేని నల్లపట్టు గుడారు
ప్రకృతి కస్తూరికాపంకచర్చ
తే. యనుచు జగముల జనములు వినుతి సేయ
నీల కాకోల కలకంఠ నీలకంఠ
కజ్జల ప్రజ్వల న్నీలకంఠకంఠ
ఖంజరీటాభ ఘనమనాఘనము నెరసె. 56

మ. తగఁ దేజంబను బల్పిరంగి జలధృత్సంఘంబు మందుంచి పొం
దుగ శంబంబను గుండువేసి పటువిద్యుద్వహ్నిచే భ్రాష్ట్ర మం
టఁగఁ గాలంబను యంత్రకారకుఁడు చూడన్ మ్రోయు నామ్రోఁతలై
జగముల్ కంపమునొంద మ్రోసె ఘనముల్ సంభీషణాహంకృతిన్. 57

సీ. వనదాంజనగ్రావమునఁ గనచ్ఛోణాంశు
వితతిగళత్సుధాప్రతతు లనఁగ
జలదపూర్ణాజాండ జలరాశితట మరు
చ్చలితవిద్రుమలతాచయ మనంగ
నమరులకడ వినోదము చూపు సమయమాం
త్రికు నోర వెడ లగ్నిదీప్తు లనఁగ
ధారాధరాహ్వయవారణేంద్రమదారు
ణేక్షణాంచలకాంతు లెసఁగె ననఁగ
తే. ఘనఘనాఘనగహనసంఘాతములను
గర్జితధ్వానములు మ్రోయఁగా రహించు
దావపావళకీల లందంద పర్వె
ననఁగ దళుకొత్తెఁ జంచల లభ్రసరణి 58

సీ. బిబిబిబి ద్గరగర ద్భేకభీమధ్వని
వివిధజంతుశ్రేణిఁ జెవుడుపఱుప
ధిగధిగ ద్ఘృణిగణదేదీప్యవిద్యుచ్ఛ
టల నిశల్ పవలట్ల వెలుఁగుచుండఁ

బెటపెటార్భటి రటచ్చటులాభ్రనిర్ఘోష
ముల ముజ్జగమువార లులికిపడఁగ
ఘుమఘుమారావ సంకులకులాచలకుభృ
త్కుహరానిలముల దిక్కోటు లురుల
తే. ఖిటఖిట యటంచుఁ గరక లుత్కటలురాల
నిగనిగద్యుతి మేఘముల్ నింగి నెరయ
ఫళఫళ పయఃపృషత్పరంపరలు గవియ
ఝోరు ఝోరున దారుణాసార మడరె. 59

క. పటుధాటీరటదుత్కట
పటహలటహ కోటరములు పాటిలినటులన్
నెటనెట పటపట వెటవెట
పిటపిట చటులార్బటులను బిడుగులు పడియెన్. 60

వ. అప్పుడు. 61

సీ. గగనమండల భద్ర కాయమానంబున
ఘసపంక్తులను మేలుకట్లు కట్టి
ధరణి వేదిక మీఁదఁ గరళానికాయ మౌ
క్తికముల రంగవల్లికలు దీర్చి
ఘనఘోష భేరికాధ్వనులు బర్హిణగళ
ధ్వానకాహళ నినాదములు మ్రోయఁ
దెగని మెఱుంగుల దివ్వటీలు చెలంగ
ద్విజరాజమంత్రముల్ విస్తరిల్ల
తే. వృష్టి గజరాజగామినీవిభుఁడు సమయ
పురుషుఁ డయ్యెడ నిమ్నగాపుత్రికలను

గాంచి పెంచి ప్రమోదంబు గడలుకొనఁగఁ
బరిణయమొనర్చె శరధికి భవశరధికి. 62

తే. అప్పు డవ్వానకొట్టున నళికి యుళికి
పడిన గోడలు నొరుగు కంబముల పట్లు
వదలి కూలిన గోపురావళులు గల్గు
పాడుగుడిలోని కెనుబోఁతు పఱచి నిలిచె. 63

క. అంతట వర్షము నిలిచె ది
నాంతము జనియించెఁ గజ్జలాభ్ఠర తమాలా
శ్రాంతరుచి పర్వె నెల్లెడ
సంతమసము చుక్కలమరె సత్ఫథవీథిన్. 64

క. ఎనుబోఁతు నపుడు కుమ్మరి
తన యింటికి రాకయున్నఁ దత్పుర మందున్
వనముల వంకల డొంకలఁ
గనుగొనుచున్ వచ్చివచ్చి కని యచ్చోటన్. 65

ఉ. లంపులమారిదాన! నిను లాచుక మాదిగవాఁడు గోయ, వే
కౌంపకుఁ బొమ్మటంచు మిణుగుర్లు జనింపఁగఁ బండ్లుదీటి మై
కంపముపుట్టఁ జేగుదియకట్టెను దిట్టుచుఁ గొట్టఁ బోఁతు బల్
గుంపెన నింటికై చనినఁ గుమ్మరి గాఁడినిగట్టెఁ గట్టినన్. 66

తే. కట్టు విడువకుమని చెప్పి కాంతతోడ
రేయి యొకరీతిఁ గడపి యా రేపకడను
గుమ్మ రయ్యూరిపల్లెలఁ గుండలమ్మ
వెడలఁ దద్భార్య జాతుల వెదకుచుండె. 67

ఉ. సారణ నామధేయుఁ డొక సాలియవాఁడు మనోజ్ఞమూర్తి కా
శ్మీర ధరిత్రినుండి యల సింధువసుంధరఁ జేరఁ బోవఁగా

దారిని రాఁగ రాగమునఁ దప్పక యాతని దిక్కు చూచి, “యే
యూ? రెటకేఁగె? దేమి పని? యున్న తెఱంగెఱిఁగింపుమా!" యనన్. 68

తే. అతడు దాని నెగాదిగ నరసి చూచి
దుడ్డె గట్టిది పనిలేక తొల్తఁ దానె
పిలిచె నిది పాట్లమారి గావలె నటంచుఁ
జేరి తన పేరు పురి పేరు చెప్పి నిలిచి. 69

సీ. దప్పి కిమ్మన మతి దప్పినదా? యనుఁ
జెంబు దెమ్మనిన్న గుచంబె? యనును
గూరఁ బెట్టుమనఁ జేకూఱెనా? హిత మను
నన్న మడిగిన నధ్వాన్న మనును
సున్న మిమ్మన్నఁ గూసున్న మేలనుఁ బోఁక
వక్కలేవన్న గుర్వక్కె యనును
నిప్పని పలుకఁగా నిప్పనికని యను
నాకిమ్మనిన మసియాకె యనును
తే. దేహ మలసె నటన్న సందేహమా? య
టంచు నిట్లేపురేఁగి యమ్మించుఁబోఁడి
యతని మాటల కరమాట లాడుకొనుచుఁ
గేరి నవ్వినఁ జూచి యా సారణుండు. 70

క. నెఱమాటలఁ గోడిగముల
నరమాటల జాణతనము లతిచతురతలన్
బరిహాసంబుల నీసరి
పెఱకాయపు సతులు లేరు బిసరుహగంధీ! 71

వ. అని పలికి యత. 72

ఉ. కొమ్మరొ! ప్రొద్దుగుంకె నెటకుం జనలేను బరుండ నింత చో
టిమ్మని పల్కరింపఁ దరళేక్షణ మంచి దటంచు నవ్వుచున్
రమ్మని చేరఁబిల్చి యరరమ్మొగి మూసి గడెన్ గదించి మో
దమ్మున రెట్టఁబట్టికొని దర్పకు కేళికి సంభ్రమించినన్. 73,

తే. అతఁడు సురతాభిలాష సంగతుఁడుగాన
మంచిదని సమ్మతించిన మమత తోడఁ
గ్రుచ్చి కౌఁగిఁటఁ జేర్చుక కుచములొత్తి
యెనసి మదనరణక్రీడఁ బెనఁగులాడ. 74

ఉ. అంతట దానిభర్త నిలయాంగణసీమకు వచ్చి నిల్చి య
య్యింతిని దల్పుదీయుమని యెంతయు ఘర్షణతోడఁ బిల్చినం
జింత యొకింతలేక యల చేడియ యేగతి బోంకుఁ? జెప్పు మో
కాంత! యటంచు నంచ యడుగన్ విని యాబిడ యూర్పు సంధిలన్. 75

తే. తెలియ దెటువలె బొంకునో జలజగర్భ
వీతిరత్నమ! చిక్కులు పెట్టనేల?
చెప్పినను జెప్పు మిక్కథఁ జిత్త మలర
వినియెద నటన్న రాయంచవిభుఁడు పలికె. 76

చ. అటువలె భర్త పిల్చిన భయంబున జారుఁడు కంప మొంద నా
కుటిల సుకుంత లయ్యెడను గొబ్బున వాని భయంబు వాపి యు
త్కటధృతి సైరిభంబు మెడఁ గట్టిన త్రాడు వదల్చి దైవమా!
కటకట! యెట్లు సంగతముగా నెనుఁబోతును గల్గఁ జేసితే! 77

తే. గాఁడిపట్టున నిల్వదు కట్టివేయఁ
దరము గాదంచు వాకిలిఁ దెఱచి “పోతు
వెడలి పొయ్యీని వాకిలి వేయు" మంచు
మగనితోఁ జెప్పి యా దిట్ట మమత పుట్ట. 78

తే. ఈ దయానిధి వీథిలో నేఁగుచుండఁ
బిలిచి తోడ్తెచ్చితిని మెడఁదలుగుఁ బెట్ట
వింత మానిసిఁ గని కట్టివేయ నీక
యురుకఁగాఁ దల్పు వేసితి నోయి రమణ! 79

క. అని చెప్పి మగనిచే జా
రుని నుతి సేయించి వారిరుహముఖియు విభుం
డును దొంటి రీతి నుండిరి
యని యంచ వచించునెడ నిశాంతంబయ్యెన్. 80

చ. పొనపొన నిద్రమబ్బునఁ బ్రఫుల్లసరోజదళాయతాక్షి మె
ల్లన నృపమోహతాపమునఁ లంపటతోఁ జనె నంచ దెల్పఁ దా
వినిన కథాచమత్కృతికి వేమఱు నౌఁదల యూఁచికొంచు హా
యనుచు నిడూర్పు పుచ్చుచు నయారె యటంచును బోయె నింటికిన్. 81

తే. పోయి యభ్రంకషంబైన చాయ లొలుకు
కలువరాఱాల కళుకు లోపల రహించు
తళుకు మగరాల గోడలుగల సుపాణి
మేటి క్రొమ్ముత్తియపు ఱాతిమేడలోన. 82

చ. పఱుపు పరంగి పోషుగల బంగరుమంచముపై వసించి భా
స్కరుఁ డుదయింప నూడిగపుఁ గామిని లేపఁగ నిద్ర లేచి త
త్ఖరకరుఁ డస్తమించు దనుకా నొకరీతి మెలంగి చీఁకటుల్
నెరసిన పిమ్మటన్ నలిననేత్ర మహిపతిమీఁది కోరికన్. 83

ఉ. రాలు మెరాలు వాలు సవరాలు మెఱుంగుల నూపురాలు వ
జ్రాలసరాలు మేలు బవరాలు వరాల జిరాలు తూలు హా
రాలు తురాలు ముంగయి మురాలు తతాల సిరాలు సందితో
రా లుదుటుంగరాలు జిగిరాలఁగ నా జవరాలు దా ల్చొగిన్. 84

సీ. చీర కుచ్చులు నేల జీరకుండఁగఁ బట్టు
కాని పార్శ్వముల సఖీజనము నడువఁ
బాదుకల్ మెట్టిరాఁ బదిల మం చుడిగంపు
టింతులు కైదండ లిచ్చి కొలువ
మనవుల కని చెలుల్ గునుకు పర్వున వచ్చి
మొగ తెఱకట్టుతో ముచ్చటాడఁ
బ్రొద్దుననే పనుల్ పూని చేయుద మంచు
బోనకత్తెలు వేగిరాన రాఁగఁ
తే. ద్వరితగతి నిండ్లకుఁ జనంగఁ దమకుఁ దమకు
సెల నొసఁగు మంచుఁ బాటలు సెప్పు విప్ర
యోష లేతేర నొయ్యార ముట్టిపడఁగ
వచ్చి నిల్చిన రాయంచ మెచ్చి యపుడు. 85

సీ. సొగసు మిటారంబు సొంపు నొయ్యారంబు
నీటు జగ్గుఁదనంబు నెఱతనంబు
సొబగు నాగరికంబు చొక్కాటమును డెక్కు
గరగరికతనంబు ఘనత నడత
హొయలు చక్కఁదనంబు నొసపరి నెఱఠీవి
సవరణ చెలువంబు సరసరీతి
హౌసు చమత్కార మారజంబును నేర్పు
గహ్వరంబును (?) నాయకంబు వన్నె
తే. సిస్తు జిగిబిగి వగబాగు చిన్న యొప్పు
పేరు నాణెంబు మురిపెంబు పెద్దతనము
కులుకు ప్రౌఢత్వ మభినుతి గొనబు నెలవు
నడత యిట్లుండ వలదె? హా! యనుచుఁ బలికె. 86

వ. ఇవ్విధంబునఁ దనుమెచ్చి పలికిన రాయంచం జూచి హేమావతి యిట్లనియె. 87

క. తురగము వృషభముతోఁ దన
తెఱఁగెన్నుచుఁ దనకుఁ గసవు దేని చెలిని ద
ద్వర సుతు సతి నెంచెఁ గదా!
యెఱిఁగింపుము దాని చర్య లెట్టివొ యనినన్. 88

ఆ. అంచ మించుఁబోఁడి యాననం బీక్షించి
యడుగవలయు నిట్టు లడిగినపుడు
చెప్పకున్నఁ దనదు శేముషి యది యేల
యనుచు నిట్టు లనియె నాదరమున.

పదునెనిమిదవ రాత్రి కథ

అత్త కోడండ్రు ఉపపతులఁ గూడుట

శా. శ్రీరామంబను నొక్క పట్టణము ధాత్రిన్ మించుఁ జంచన్మణీ
సౌధస్తోమ వధూముఖేందు మృణి సంస్పర్శస్రవ త్స్వచ్ఛ తా
రాధీశాశ్మ పయఃపృషచ్చయ విధూతాకాశ కూలంకషా
సాధూత్తుంగ తటీ మునీశ్వర తపస్సంజాత సంతాపమై. 90

తే. సాల మున్నతి భూర్భువస్స్వర్మహర్జ
న సుతపస్సత్యములు ఖేయ నైమ్న్య మతల
వితల సుతల తలాతల తం రసాత
లము మహాతల బలిసదనము లెఱుంగు. 91

చ. కనఁ బురిచుట్టు తోఁటల సుగంధఫలంబులు రాల వానిపైఁ
బనసలు పండి త్రెళ్లిపడుపాటున రొంపులు గట్ట వాని మీఁ
దనె రసదాళి వ్రీలి రసధారలు నించఁగనైన యుబ్బలిన్
జనువడిఁ భాంథు లందుఁ బడ సారె హసింతురు శాలిపాలికల్. 92



క. ఆపురమున నొకఁడుండును
గాఁపురముగ బలిజెసెట్టి గణదాసుఁ డనన్
దీపురము గాఁగ నయ్యల
కాపురమున ధనదుఁ డుండుగతిఁ గడు వేడ్కన్ . 93

వ. వెండియు నతండు. 94

చ. సరిపెణతోడిసజ్జ బలు సందిటి తాయెతు లంగవస్త్రముల్
సరిగె చెఱంగుపాగ విలసన్మణి ముద్రిక లంచుకమ్మలున్
మెఱుఁగులు గుల్కు దోవతియు మిన్నగు నీలపుఁ బోఁగుజోడు బి
త్తరపు విభూతిరేఖ లఱుతన్ రుదురక్కలు గల్గి భాసిలున్. 95

ఉ. మోర కసీదుపట్ట మొగముట్ల తలాటము జల్లుపేరు చిం
బోరయుఁ గంచుకుప్పెలును బూచెల గొల్సును బెద్దగంట సిం
గారపు దృష్టిదండ మెడ గజ్జెలపేరులు నందెలొప్పలా
వేరిన దొక్కపస్సె యెకిలింత మహోక్షము పొల్చువానికిన్. 96

చ. తగణము లానుకంట్లములు తండిగముల్ సలకల్ దడెల్ కుతూ
గణములు చెక్కుగుంపు లడిగంబులు పంబులు త్రాడుగట్లు మం
కెణములు గోతముల్ నగలు గెంటెపు బోరెము లాతనింటిలో
గణన కశక్యమై వెలయుఁ గంజసమాన విశాలలోచనా! 97

సీ. గూటపుఁ దిరుగుళ్లు కొలికి దామెన త్రాళ్లు
కందళి కెముకలి కదురుకోల
మఱగజుమును మోడి మెఱుఁగుగాఁ దీసిన
పిల్ల చుట్టులు నల్లుబిళ్ల లొల్లె
త్రాళ్ళును బురికొసల్ దబ్బనములు నుసి
గంతలు నట్టెన కట్టె లసిమి
బలుపొన్ను లలరారు బగిస గూటంబులు
పెలుజోగి పట్టెళ్ళు పిల్లపట్టె

తే. డలును బూవుల కోరగిన్నెలు విభూతి
పండ్లు గంగాళమును గుసిగెండ్లి పాల
మడ్డి బరణియు రుద్రాక్షమాలికా స
మూహములు గల్గియుండుఁ దద్గేహమునను. 98

ఉ. కాముని మేనుగాలెఁ బలుగాకి జయంతుని రూపుగూలె నా
సోముని సత్కళాగరిమ చూడఁగఁ జూడఁ గృశింపఁజాలె నా
భూమి జనించి యాక్షణమె పొల్చువసంతుని యాకురాలె నో
హో! మఱి వీనిరీతిఁ జెలువొందిరె వా? రని యెంతు రంగనల్. 99

చ. అతనికి నొక్కయాలు గల దన్నిట మేటి మిటారి రూపునన్
రతి నిరసించు మీఱి మరురాయని దిగ్జయభేరి వింతలౌ
చతురతలందుఁ గేరి ఘనసాహసచర్యల బల్తుటారి వా
క్తతిఁ జెలువంపుఁగీరి యభిధానము చేత విహారి యారయన్. 100

చ. కమలభవాలయారి గజగర్వమడంచు ముఖంబు యానముల్
కమల భవాలయారి కళలన్ నగుఁ గంఠము శ్రోణిబింబమున్
గమల భవాలయారి గతిఁగైకొనుఁ గన్నులు గబ్బిగుబ్బలున్
గమల భవాలయారి ఘృణిఁగొంచుఁ గరంబులు వేణి యింతికిన్. 101

చ. ఘనము కచంబు చెంబులన గబ్బిచనుంగవ మించు మించులన్
దనురుచి రూపుమాపు నెలతళ్కుల గెల్చు మొగంబు గంబురా
లనఁదగుఁ బల్కుఁ బల్కుదు రయారె! సుపాణులు పాణు లబ్జముల్
మనసిజునారి నారి యసమానపు టారలరారుఁ దీరుగన్. 102

క. ఆ లపమున శశిబింబం
బాలపనము తేనెధార లంబుదవర్ణ
శ్రీ లపనయించుఁ గబరీ
శ్రీల పనలు బొగడఁ దరమె? శేషునకైనన్. 108

ఆ. కాంత కరము గళము కల ముద్దురూపంబు
దరము దరము దరము తరము వరము
వాలు మీలఁ బోలు వనజాక్షి కన్నులు
సారె సారె సారె సారసములు. 104

సీ. మొనయైన నఖరాన మినుకీను నిటలాన
జోక గుల్క విభూతిరే కమర్చి
యయ్యోర జిగిదేఱ నొయ్యార మలరారఁ
బసపుతో సన్నంపుఁ బట్టె దీర్చి
యలదండ కల తండముల నిండుతనముండ
సరస కుంకుమరేఖ సంఘటించి
యా చెంత కాసంత యాసంత జగజంత
సొగసుగా నిడు చాదుచుక్కఁ బెట్టె
తే. మెడను జందనచర్చ ధమ్మిల్లసీమ
విచికిలంబులు గంబూర కుచములందుఁ
గప్రపు విడెంబు పుక్కిట ఘమ్ము మనఁగ
విటుల వలపించు మరునైన వెస భ్రమించు. 105

తే. మీఱి గడిడేఱి భోగము కేరి చేరఁ
జీరి చిన్నారి వగఁగేరి వారి దారి
కోరి విటుఁజీరి రానిచో మారుబారి
సారె వేసారి పొరలు విహారి నారి. 106

వ. ఇత్తెఱంగున. 107

క. పరపురుష చింత నచ్చెలి
నిరతము చరియింపఁ జూలు నిలిచెను వృద్దిం
బరఁగుచు నవమాసంబులు
జరగిన తదనంతరమునఁ జంద్రవదనకున్. 108

కొఱగాని కొడుకు

సీ. గుడిమీఁదఁ బడు రావి కడిలోని చెడుగీఁగ
పుణ్యనదీతీర్థమునను మొసలి
కంటిలోఁ గొర వెండ్రుకయు రచ్చమఱ్ఱిని
బ్రహ్మరాక్షసి కాపురమ్ము సేయు
భవనసీమను ద్రాఁచుపాము కల్పకుజంబు
కడ గచ్చపొద పాలకడలి విషము
వనమునఁ జిచ్చు దివ్యౌషధికినిఁ బుప్పి
బ్రతుకు బాలెడు నింటఁ బరశురాము
తే. హస్త ముదకాన గ్రుడ్డు సస్యమున మల్లె
జీవవితతికి రోగంబు చెఱకు వెన్ను
మణికి బోషంబు నృపునందు మార్దవంబు
పుట్టు చందానఁ బుట్టెను బుత్రుఁ డొకఁడు. 109

తే. వాఁడు నానాఁటి కభివృద్ధి వఱలఁ బెరిగి
కాళికలను దేవ గడిమీఱి గట్టిపాఱి
రాలుఁగాయతనాన బేరజపు దారి
నాఱితేఱియుఁ బలు గుంటమారి యయ్యె. 110

మ. గుణమా? సెబ్రి, వివేకమా? నహి, మనోగూఢత్వమా? లేదు, భా
షణమా? కల్ల, విచారమా? రవళి, వంశాచారమా? నాస్తి, మా
ర్గణ ముఖ్యావన శీలమా? శశక శృంగప్రాయ, మాప్తాది తో
షణమా? దబ్బర, సత్యమా? హుళి, గణించన్ వాని కద్రిస్తనీ! 111

వ. వెండియు నతండు. 112



సీసమాలిక.
ఆకతాయ బికారి యడిబండ గుండఁడు
మొండికట్టె గులాము మొప్పె గోపు
పోలెవాఁ డగచాట్లపోఁతు దుర్మార్గుండు
పడిసేటును గరాసు పంద లండి
కొయ్యద్రిప్పు ఖరాబు కూళ బందెలమారి
ముండరి పాపాలముద్ద ధగిడి
యోగు దూబరదిండి యోచవాఁ డవలక్ష
ణమువాఁడు గోల వ్రాత్యుడు బజారి
పలువిత్తు పలుగాకి ప్రాడ్వాకుఁ డుచ్చిష్ట
మొందు సుద్దులమారి యులిపికట్టె
పాపిష్ఠి బజిగేడి పంచమహాపాత
కియు వ్యతీపాత పోకిళ్లమారి
దరిబేసి చెడుగొట్టు జెరికి దగాకోరు
విషపాలవిత్తు చిల్విషము దగులు
బాజి హరాంకోరు వాజ ప్రక్కల మ్రుచ్చు
చీవాట్లమారి ప్రాచీనవిత్తు
మూసిన ముఱికి నిర్మోహి స్వామిద్రోహి
దుష్టు రోఁతలమారి దోసకారి
బడిమి కూళ్ళకు మిత్తి పడిసె యెంగిలికాయ
పడుపుగూ డెసగొట్టు పాడెగట్టు
గండకుల్లెడము తాకట్లమారి యభాసి
కడుప్రేత నడపీన్గు గలపడింపు
దూర దర్శన మూడు తోఁకచు క్కన గుల్ల
గుఱ్ఱాల గో వోదెకొరుకు బల్లి
తే. కొంటె కసుమాళమును దూబ కొంపచెఱుపు
చేడి గేరి చెరపనచేట రోసు
బడియ దుర్బీజమును భ్రష్టు మడియచేట
పెయ్య కల్ముచ్చు చెడుగు సాపెనల మారి. 113



క. అనుచుం బొరుగిరువారుం
దనవారుం గానివారు తక్కిన వారున్
దనుఁ దిట్టఁజేయు దుడుకులు
మనమున లజ్జింప కతఁడు మణియు న్మఱియున్. 114

తే. వాని కెనిమిది యేండ్లది మేనమామ
కూతుఁ బెండిలి చేసినఁ గోడె వయసు
పాక ముఱ్ఱూత లూఁగెడు భార్యమీద
మనసు చాలించి దుర్మార్గమతి వహించి. 115

క. బోగాలవారి యిండ్లకు
బోగాలకు మించి యరుచిబోఁ గామించున్
బోగాల వలపు విడియపు
బాగా లిడఁ గుసుమదీప్తివలె మూఁపెనయన్. 115

వ. ఇట్లు నిజవధూవైముఖ్యంబును వారవనితాభిముఖ్యంబును వహియించి వల్లవుం డనువాఁడు వర్తింపుచుండ నొక్కనాఁడు. 117

సీ. రంభ ఘృతాచి యూర్వశి మణిప్రభ చిత్ర
రేఖ మేనక శశిరేఖ హరిణి
హేమ స్వయంప్రభ హితమోహ మోహిని
పుంజికస్థల రత్నపుంజ సరస
ధాన్యమాలిని తిలోత్తమ వరూథిని మంజు
ఘోష సౌగంధిని కుంద తార
మణిమాలిక సుమంజు మంజరి మణిభద్ర
మణిక విద్యున్మాల మదమయూర
తే. దివ్యమూర్తి సువర్ణ దేదీప్యమాన
రుచిర మకరంద సుమదామ విచికిలాంగి
యనఁ దనరు నప్పరస్స్త్రీల కన్న మిన్న
చెన్నలరు వారసఖుల హెచ్చెన్నఁ గలఁడు. 119

క. ఆ వారసతులలో సొగ
సై వారణలేని కలిమి నందలరు సుశో
భావార మరుని పసిఁడి జి
రావారణ మన నొకర్తు రతిసేనాఖ్యన్. 119

సీ.కల ధనమెల్లఁ బోకడఁ బెట్టి సన్న్యాసి
యై బిచ్చమెత్తని యగ్రజుండు
చేతికైదువును నాశింపక తెగఁగట్టి
కులశేఖరులఁ గూడుకొనని రాజు
సంచి మూల్యము నిచ్చి సడికోర్చి త్రైవర్ణి
కులజంటఁ దిరుగని కోమటీఁడు
కారు కలప మొదల్ గా నమ్మి సీమపై
జోగులఁ గలియని శూద్రబిడ్డ
తే. లేడు ధరలోన రతిసేనఁ గూడి మాడి
యున్న విటులందు రతియందుచున్న వేళ
సందుగని పెట్టుకొని పెట్టు మందుగుళిగె
మహిమ యెటువంటిదో కాని, మధురవాణి! 120

వ. అది మఱియును.121

నృత్య గాన విశేషములు

సీ. భారుడంబును శుద్ధపద్దతి బహురూప
లక్షణంబులు దండ లాస్యములును
బెక్కణ పద్ధతి పేరణా పద్ధతి
కుండలీ నృత్తంబు భాండికంబు
రాసకాఖ్యము నాటరాసకంబును జిత్ర
పద్ధతియును దేశ్యపద్దతియును
జర్చరీకందుక చానరి కోలాట
ములు నాఁగఁ దగుపేళ్లఁ గలుగునట్టి



తే. షోడశం బగు నృత్తంబు చొరవ లెఱిఁగి
సరవిఁ జంచుపుటంబును జాంపుటమును
ధృవము మధ్యము రూపక త్రిపుట జంపె
యేక తాళాట తాళాదు లెల్ల నెఱిఁగి. 122

సీ. భైరవి మాళవి బంగాళ హిందోళ
రాజమంజరియు శ్రీరాగ గౌళ
భూపాల లెన్మిది పురుష రాగంబులు
దేశాక్షి ఘూర్జరి దేశీ తోడి
దేవక్రియాందోళి దేవగాంధారియు
గౌళ గుండక్రియాహాళి సలలి
త బిలహరి కురంజి ధన్యాసి పూర్వగౌ
ళ వరాళి నాట భల్లాతకి మల
తే. హరులు సారంగ రామక్రియలు ననంగఁ
గన్నడ యనంగ మంగళకౌశికి యన
వెలయు నారాయణియుఁ జతుర్వింశతి విధ
ములను దనరారు స్త్రీరాగములను మరియు. 123

సీ. కాంభోజ కేదార గౌళ శోకవరాళి
పున్నాగ గుమ్మకాంభోజి శంక
రాభరణము మేఘగంజి తోడి వరాళి
నాదనామక్రియా నాట రీతి
గౌళ రామక్రియ మేళ రామక్రియ
గౌళ నారాయణగౌళ మధ్య
మావతియు ముఖారి మలహరి సామంత
పంతువరాళియు బౌళి రాగ
తే. చెంచు మలహరి దేవాక్షి శ్రీవరాళి
మాళవియుఁ బాండి సింధు రామక్రియయు వ
సంత సామంత శుద్ధ వసంత గుజ్జ
రియును హెజ్జిజి నీలాంబరియు ననంగ. 124

తే. పొసఁగు ముప్పది రెండు నపుంసకములు
మాళవశ్రీ యనంగను మలహరి యన
దేవ మలహరి రేగుప్తి దిర ముకుంద
మలహరన నైదు మిత్ర లీ మర్మ మరసి. 125

తే. షడ్జ గాంధార మధ్యమర్షభ నిషాద
పంచమ సుధైవతాఖ్య సప్తస్వరములు
మంద్ర మధ్యమ తారక మహిమలెఱిఁగి
యాడఁ బాడఁగ నేర్చు నయ్యబలఁజూచి. 126

క. వలచి యతఁడు కడుమోహము
తలమునుకలు గాఁగ మరుని తామరవీరి తూ
పుల కకబికలకు లోఁబడి
మలయుచుఁ దా వెంట జాలిమాలం దిరుగున్. 127

వ. ఇట్లు దిరుగుచుఁ దాఁజేయు యత్నంబులఁ దన కభిమతంబు ఘటింపం దలంపని యా రతిసేనను మరులుకొల్ప నూహించి యా వల్లవుండు వైద్యసహవాసం బొనర్చి యంత. 128

స్త్రీ వశీకరణౌషధములు

తే. ఇంద్రగోపంబు రోచన మెఱ్ఱలు వెలి
గారము జలభ్రమణములు నీరుగొబ్బి
వితనాల్ పుట్టపండు రసోత్తరముగ
నూరి మడుపునఁ బెట్టిన నారి వలచు. 129

సీ. నల్లేరు కణికగందము తేనె వగనూరి
లేపించి కూడిన లేమ వలచుఁ
గరక తాండ్ర యుసిరికలు కోష్టు పాలచే
నూరి పట్టించిన వారి చేరు

వెలిగారమును నెఱ్ఱవిసెపూలు నిజతనూ
జలముల నూరిడ్డఁ జెలియ కలియుఁ
గలుగొట్టు నీరావు కాల్మడిచే నూరి
విడెములోఁ దగిలింప వెలఁది చిక్కు
తే. గూర్మి జిల్లేడు దూదిని గోశఫల ర
సమున మేదించి వర్తిగాఁ జక్కఁ జేసి
కుసుమ నూనెను దీపంబు పొసఁగఁ బెట్టి
చూప లోనౌదు రెటువంటి సుదతులైన. 130

తే. జాజికాయలు జాపత్రి చారపప్పు
సెనగ లసుములు గసగసల్ మునుగపువ్వు
మదన విత్తులు కొబ్బెర మందపాల
నూరి త్రాగిన మదమబ్బుఁ జేరు వేళ. 131

క. అనుచు నిజరచిత వితరణ
జనితామోదమున వైద్యజనములు దెలుపన్
వనితావశ్యౌషధములు
విని యట్లొనరించి యింతి వెస వలపింతున్. 132

క. అని నిశ్చయించి యా బొజుఁ
గనుపమ మణిహేమఘటితమై సిరులొలయన్
దనరు రతిసేన మందిర
మును గాపెట్టుకొని యుండు మోహము కల్మిన్. 133

సీ. పంచాంగమయ్యకు బాగ సమర్పించు
నట్టువకానికిఁ బెట్టు మురువు
భరతంపు టొజ్జకుఁ బచ్చడం బొగిఁ గప్పుఁ
బొగడు బట్టుకుఁ జేర్చుఁ బోఁగుజోడు

కథఁ జెప్పు భూసురాగ్రణికి దోవ తొసంగు
ననువుకానికి బత్తె మెనయ నడుపుఁ
బూల్గట్టు సాతానిబోటి కుంగర మిచ్చు
గందొడివానికి విందు సేయు
తే. చతురికకుఁ జీర దూతికి సందిబొందె
కడెము పరిచారికకు సారికకును ఱవిక
తాపికకు సొమ్ము వేశ్యమాతకును గాన్క
లిచ్చిచెప్పించు రతిసేన కెచ్చు తమిని. 134

వ. మఱియును. 135

ఉ. గుండనికిం బసిండి పనికో, రడిబండకు వెండి తాయెతుల్
లండికిఁ జేకడెంబు పదిలంబుగ గుమ్మెతకాని కందెలున్
బెండెము బాడుగోలునకు భృత్యునకున్ మెడనూలు చాటుకృ
త్షండున కుంగరాలు మొలత్రాడులు కుంటెనకాని కియ్యఁగన్. 136

క. వారందఱుఁ దమ చాతురి
మీఱి మహాసంపదాప్తి మించినవాడీ
జారాగ్రణి యని చెప్పిన
నా రతిసే నపుడు మంచిదని యియ్యకొనెన్. 137

క. పడతుక నతఁ డీగతి లోఁ
బడఁజేసుక మురిపె ముట్టిపడఁ గడుఁదమి తుం
దుడు కొనరింపఁగఁ గోరిక
లడరఁగ రతిసేన రతుల కాయత్తంబై. 138

క. పన్నీట జలక మొనరిచి
కన్నర రానున్న మిన్ను గిన్నన్నకు మున్



మున్నొసఁగి సన్నబియ్యపు
టన్నము మితభుక్తి చేసి యమితోత్సుకుఁడై. 138

తే. చాఁదు శ్రీగంధ మగరు కేసరి కదంబ
మంబరు పునుంగు జవ్వాది హరిణమదము
బుక్క యత్తరు గోవ గంబూర బోలు
చట్ట కలపంబు పన్నీటఁ జాఁది పూసి. 140

క. సిగ సరవిరి సరములు పొం
దుగవేసి రుమాలు గట్టి దుప్పటి వలెవా
టుగ వైచి విడెము సేయుచు
సొగ సుట్టిపడంగ నతఁడు సొంపు జనింపన్. 141

సీ. సకినెల పట్టెమంచము పాన్పు తలగడ
బిళ్ళలు చందువ మల్లెవిరులు
కరడె సురటి గిండి గద్దె సున్నపుఁగాయ
గాజద్ద మడపము కలపము చిటి
చాఁప తబుకుసాన జాలవల్లిక దీప
ములు గందవడిదట్ట పునుఁగుబరణి
యాకుసంబెళ తంబు రగురుధూపము పాదు
కలు తమ్మపడిగము కప్పురంబు
తే. క్రోవి కస్తూరి వీణె కుంకుమ సుమంబు
పొట్లములు రుద్రవీణ మేల్కట్లు బాగ
ముల కరండంబు రతిబంధ కలిత చిత్ర
ములు గలుగు కేళినిలయ మింపలరఁ జేరి. 142

తే. బలసి కూకీలు నొడ్డీలు పల్లటీలు
పావురాయులు బకదార్లు బట్టిగాండ్రు

రంచలు నెమళ్లు కేర్జముల్ పంచవన్నె
చిలుకలు పికాది శకునముల్ గలసి పలుక. 143

తే. చంద్రకావి ఖురాళంబు సరిగెచెఱఁగు
జిలుఁగు కెందమ్మి దోదుమ్మి చీని కమ్మి
పైకిణికమ్మి తెఱచాటు పాన్పుమీఁదఁ
బదటు తమినుండునంత నప్పణ్యకాంత. 144

వ. మజ్జన భోజనాదివిధుల సంతుష్టహృదయయై భావసూచక బిబ్బోక హావభావ లలిత కుతూహల కిలికించిత విహృత విచ్చిత్తి విభ్రమ ధైర్య లీలాహాస మాధుర్యహేలా విలాస చకితాది శృంగారచేష్టల కనువైన యాలింగనంబులలో సరసాలింగనంబు దృఢాలింగనంబు సర్వాలింగనంబు స్పృష్టక చిద్దక ఉద్ఘృష్ట స్ఫుటక పీడితక ఊరూపగూహన జఘనోపగూహన కుచాలింగన లాలాటిక నిరూపణ లతావేష్టిత వృక్షాధిరూఢ తిలతండులక క్షీరనీరకంబులను చతుర్దశాలింగనంబులు గావించి యుప్పొంగు తమకంబున నతఁడు. 145

తే. చుంబితంబును బరిమృష్టకంబు కబళి
తంబు చూషిత మనుపేళ్ళఁ దనరు నాల్గు
గతుల ముఖరతి భేదముల్ గలయఁ జేసి
ద్రవముఁ బుట్టించు తానకాల్ తడవి చూచి. 146

తే. సకియ యంగుష్ఠ పదగుల్భ జాను జఘన
నాభ్యుర స్స్తన కక్ష కంఠ సుకపోల
దంత గల్లాక్షి ఫాల మస్తక శిరోజ
ములు ప్రతిపదాదిగాఁ గళాస్థలములంటి. 147

సీ. చెవుల నిమిత్తంబు చెక్కుల స్ఫుటితంబు
నధరోష్ఠమున భ్రాంత మడరఁ గన్ను

గవఁ దిర్యగంబును గక్షదేశంబులం
బ్రథితంబు చనుదోయి నధరకంబు
చిత్తము గృహమున నుత్తరస్ఫుటితంబు
పొక్కిట సంపుటంబును శిరోధి
ననుపదం బూరుల నన్వితం బన నొప్పు
దళచుంబనములుఁ దత్తత్స్థలములఁ
తే. బొదలు ముదముసఁ బర్యాయమున ఘటించి
కలయ శశకవ్రత మయూర ఫలక రంజి
సుచ్చురిక మండలిక గండ సుత్రిభాగ
ముఖ ముఖ నఖక్షతంబులు మొనయఁజేసి. 148

తే. క్షతరదోచ్ఛూన ఖండాభ్రక ప్రవాళ
మణిక గూఢక రుచిబిందు మణికబిందు
మాలికా కోల చర్వితాఖ్యాళి వెలయు
పదిరదక్షతముల వేడ్కఁ గదియ నొక్కి. 149

క. స్థితమును దిర్యగ ముత్తా
నితమును నాభిస్థితమన నిపుణజనులు ప్ర
స్తుతిగొనఁ దనరు చతుర్విధ
రతుల గతుల నతుల మబ్బురము గావించెన్. 150

వ. వెండియు నఖండసురతపాండిత్యంబున విటుండును నయ్యండజయానయు, మదవేదండంబులరీతి జృంథక కూర్మక రణస్కంధయుగ గర్భపీడిత సాధుక దృఢలావుక కర్కట సముద్గక వేణుదారిత సంయమ కృత కోపరతి ధృతోరుక నాగరక ప్రేమాభిరామ చక్రభ్రమణ ప్రసాదిత శూలాంచిత పాదవేక్షిత బాణరంజన మదనరంజన పార్శ్వఘట్టన భావికోల్బణ మండూకకరణ గ్రామ్యకరణ సర్వతోభద్ర మండలప్రభ మధురకంపితాంగసంపుటార్ధసంపుట పద్మక అర్ధపద్మక అంబురుహ భారచరణ పాదపదక పాదబంధపాదాశ్లేషణమదనడోలన చంద్రార్ధ మండలార్ధ ఊరు చరణ కక్షపాద వేష్టితక హళికకరణ నాగపాశాంగ చక్ర గుహ్యక ద్విరదావలంబన చిత్రలాఘవ మదనకుంచిత గగనకరణోర్ద్వ బాహూత్ఫుల్లక మర్కట విమర్దన వేణుకోద్వేగ పరావృత్త గణాంగ దృఢాంగ సింహావలోకన పాదారోహణ ప్రియాంగ బాడబబాణ కృత్తమదన రాజహస్త లాఘవ బాహుచరణ చక్రపాద మదన సంఘట్టన పాదమేళన గోముఖాంగ సంవేద్యకరణ సమితాంగ కరణంబులను చౌశీతిబంధంబులను జమత్కారంబులఁ బెనంగుచుండి రయ్యవసరంబున. 151

మర్లు మందు

సీ. గంబూరమును జాజికాయ లుమ్మెత్త వి
త్తులు మర్లు మాతంగి కలువగడ్డ
పచ్చయెన్నులు కోష్టు పచ్చిక మంచేసుఁ
గుమదము గుళ్ళసున్నమును రుద్ర
జడవేరు వస ఖురాసాని వామము పుడు
కల పోలుగాఁడు మైఁగారు చెమట
నీరావు గజ్జల చేరిన మష్టును
గాల్మడి ఱాతంటుగాను నూరి
తే. కలయ గురిగింజలంతేసి గుళిక లమరఁ
జేసి నీడనె యాఱించి తీసి దాచి
యున్న మంచింత మడుపుతో నొసఁగె నతని
కధికతరమోహ మూన నా హంసయాన. 152

క. ఈ బాళిమందు మసగొని
యాబిడ తనకండ్లు గట్టినట్లుండ నతం
డేబుద్ధి లేక యచ్చెలి
సోబెల కెదఁ జిక్కిచిక్కి చొక్కుచుఁ దిరుగున్. 153



తే. వాఁడటుల మీఱి బోగమువారి గేరి
చేరి రతిసేన రతిఠాణఁ జెలఁగు మదిని
దాని సొమ్మైన, నమ్మైన దట్టమైన
వయసు మరుబారిఁబడఁజేయ వానిజాయ. 154

సీ. బొమ్మలపెండ్లిండ్లు బువ్వఁపుబంతులు
పుణికిళ్లు నిట్టుక్కి బొమ్మరిండ్లు
గుజగుజరేకులు గొబ్బిళ్లు నీఁగలు
బుడిగించు జాబిల్లి పుక్కటిల్లు
గుజ్జనగూడులు కోటకోలన్నలు
గీరనగింజలు పారుపట్లు
పిప్పిళ్లు త్రొక్కిళ్లు బేడిసె తిరుగుళ్లు
నచ్చనగండ్లు దాయాలు పొళ్లు
తే. లడరు వామనగుంట లాదైన దట్టి
యాటపాటలఁ బ్రొద్దువో ననుఁగుఁజెలులఁ
బాయక చరించు బాల కీప్రాయమేల
వచ్చె విరహాగ్ని యిటులేల హెచ్చెననుచు. 155

క. నెఱవయసు పిక్కటిల్లఁగ
సురతం బొకవేళనైనఁ జొప్పడని మదిన్
బరపురుషవాంఛ వొడమిన
విరహంబున రేయిపవలు వేఁగుచునుండున్. 156

చ. ఉదుటగువానిఁ బ్రాయమున నుండెడువాని మనోజ్ఞలీల సం
పద గడిదేఱువాని గుణపాటవమొందెడువాని నేపుచేఁ
బొదలెడువాని గీతములపొల్పు లెఱింగినవాని సంగమో
న్మదమున మించువానిఁ గనినన్ మరుబారికి నగ్గమై పడున్. 157

తే. ఇరుగు పొరుగుల దంపతు లేపురేఁగి
సంగమక్రీడ నోలాడి సరసమాడు
సొవసొవలు విన్నమాత్ర నుస్సురుమటంచు
మన్మథునిబాడి గొఱ్ఱెయై మగువ దలఁకు. 158

వ. అంత నక్కాంత వేఱొక్క వాసరంబున. 159

చ. అటువలె వేఁగుచుండి మగఁడత్తయు మామయు నింటలేమి వె
ల్పటికి హుషారునం జని గుబాదెబ వీథులవెంట జంటలై
చిటిలిన పూఁతగందముల సిస్తగు పాగల నిండుచల్వ దు
ప్పటుల విభూషణావళుల బాగుగనేఁగెడు దుండెకాండ్రలోన్. 160

సీ. పసిఁడికుప్పెలఠీవి బారుకుచ్చులు నింద్ర
గోపంపు జగజంపు గుంపు వారి
కుచ్చుక్కు సిగ్గెముల్ గొల్పెల్లు ముసనాబు
చెక్కడపుల బచ్చ చిలుకచెండ్లు
పట్టుపట్టంచు తాప్తాలేపు జీవదం
తపు గోడియలు పట్టుత్రాళ్లు దిండ్లు
నేనుంగు కొమ్ము కాటేరికిఁ బేటాకు
విలకెలమ్ములు సెల్లు వెండవీటి
తే. కేను లీవంగి సోఁక పొక్కిలుల పోలు
పుష్పి చినుతిండియును లేఁతముదురు నిడుద
గణపు సదులావు నీల రక్తముల పన్ని
కొమ్ము పున్నాగమమ రందలమ్ములందు. 161

క. వగ లుట్టిపడఁగఁ దమతమ
సొగసులతో విఱ్ఱవీఁగు సొంపుల మీసాల్
వగలున వడివేయుచుఁ జిఱు
నగవులఁ బధమనుచు జారనాయకు లలరన్. 162

సీ. పైచర మోరడి బలిమికం బొద్దిక
ముల్లడితాఁకుడు జల్లికట్టు
మైసళ్లు మెడగుడు మారువెంబడి బిట్టు
జతుకు సమాధాన జతన మడుగు
లోదాటు నడ్డకాలువ పాదబెళకు ని
బ్బరము నీరడికందు బలిమిదిరుగు
నుమ్మలిసెలవు పాదొత్తుకలు ధుతాళి
తొడిగట్టయును గాల జడుపులావు
తే. హొయలు బూరుగ వన్నాగహొయలు బిగువు
బొట్టు డేగురు రేకప్పు బెట్ట డిసుము
పటమ తాకుడు మొగవొయల్ పదిల మదిగొ!
హెచ్చరికటంచు వడిబోయ లేఁగుచుండ. 163

ఉ. సంచపురేకుదుప్పటులు జారుసిగల్ బిగిచల్లడాలు వా
సించెడి గందపట్టియలు జిల్గురుమాలలు సందితాయెతుల్
మించఁగ సాన చిమ్ము నునుమీసలు దీటుచు మీఱి కేరి ధి
క్కెంచు వటంచు గుంపుగొని కేకలువేయుచు వచ్చువారిలోన్. 164

తే. మంతుఁడన నొప్పు నెఱవింత హొంతకారి
సొగసు బయకారిఁ జానయుఁ జూచి దగ్గి
కేకరించిన నాతఁడు కెరళి కాంచి
యిదియు వగలాఁడిరా యని కదియఁజనఁగ. 165

ఉ. గేదకి రేకుటత్తమునఁ గీల్కొను చూతధళంబు నాళ మిం
పూఁదిన జాజిమొగ్గ గజముత్పలపున్ జలికట్టు సంపఁగిన్
బాదురుగా నొనర్చిన తుపాకిని బుప్పొడిమందు కప్రపుం
బూడిగుండునుంచి మరుబోయఁ డమీయన నేసె నిర్వురన్. 166

వ. అప్పు డామంతుఁ డాయింతిచెంతకు సంతసంబున వచ్చుచు నిజాంతర్గతంబున. 167

ఉ. ఆరయ నేరెదేటి యనలందుల వెన్నెలతేట నించి తొ
ల్కారు మెఱుంగురంగు లిడి కమ్మసుధన్ బదనిచ్చి మేటి శృం
గారరసంబుతోడఁ బొసఁగంగ ననంగవిధాత చేసెఁ గా
కీ రమణిన్ విధాత సృజియించుచు నంటినఁ గందకుండునే? 168

సీ. దీర్ఘమై విలసిల్లుఁ దేటవాల్గనుదోయి
గుడుసౌచు నాభియుఁ గుల్కుచుండుఁ
గొమ్ములగతి హెచ్చుఁ గొమిరెచేతుల రీతు
లుత్వంబు చందాననొప్పు జఘన
మౌత్వంబుభాతిని నమరుఁ గర్ణద్వయం
బేత్వమై జడపొంక మెసఁగుచుండు
నైత్వంటు విధమున నల యూరు లలరారుఁ
దలకట్టువలె మించుఁ దళుకునొసలు
తే. సున్న నడుము విసర్గలు చన్ను లారు
పొసఁగు వలపలి గిలక యద్భుతములనఁగ
నలరు గుణితంబు వైఖరిఁ జెలఁగు నంగ
సౌష్ఠవముతోడ నున్నది సకియ యనుచు. 169

వ. కదియంజేరి యప్పుడు. 170

చ. “చెలియరొ! యేపురం? బెటకుఁ జేరఁగవ చ్చిట నిల్చినావు? వీ
ణెలరవమొప్ప దగ్గితివి నెమ్మదిలోఁగలపూన్కిఁ దెల్పు మా
యలు పచరింపఁబో"కనిన, నమ్మకచెల్లరొ! యీతఁడెందు కెం
దుల కురులొగ్గె నేచి కడుదొమ్మికి రాఁదలఁచెన్ సెబాసుపో! 171

తే. అనుచుఁ జిఱునవ్వు మోవిపై నంకురింప
భయము సిగ్గును దనుముంపఁ బలుకునెడల
గర్గదరవంబు జనియింపఁ "గన్నెదాన
మేలు పడినాను జాణ! న న్నేలుకొనర!" 172

క. అనిన విని మంచిరని యొ
క్కనివాసస్థలముఁ జేరఁగా రమ్మని వ
చ్చినఁ జేరి ముద్దులిడి మె
ల్లనఁ జేష్టల నుబుసుపుచ్చి లాలిత్యమునన్. 173

క. కళలంటి ముద్దువెట్టుక
వెలసినతమి మోవినొక్కి వీఁపునఁ జనుము
క్కులు వెళ్లఁ గౌఁగిలింపుచుఁ
బలురీతుల రతురిఁ గలసి భ్రమనొందించెన్. 174

క. ఈచక్కి నీవు నిచ్చలు
రాచిలుకసిపాయిరౌతురణమున పలఫుల్
పీ చణఁచు మనిన హాయని
యా చిగురుంబోఁడి కాతఁ డభయం బిచ్చెన్. 175

తే. ఇచ్చి సందైన యపుడెల్ల వచ్చి సైగ
చేసి విటుఁడేఁగఁ దానేఁగి చెలియ యింట
సురతకేళుల నలరింప సుఖము మరగి
తిరిగెఁ దన యత్తకన్నఁ గావరము పట్టి. 176

ఆ. అత్తకన్న కోడ లయ్యత్త కోడలి
కన్న నేపు రేఁగి యాప్తజార
జనులఁ గూడి మాడి చరియింప సాఁగిరి
యొంటిపాటు దొరకియున్న యెడల. 177

తే. అత్త యేమఱి యుండెడు నంతలోనఁ
గోడలు చరించి వచ్చును గొంత తడవు
కలయఁగ గుణాలు వచ్చు నాక్షణమె బుద్ధి
కోడలికిఁ జెప్పి యత్త ఱంకాడఁ బోవు. 178

క. ఈ మాడ్కిని నన్యోన్యం
బేమాత్రము తెలియకుండ నిచ్ఛావృత్తిన్
గామించుచు నొక దినమున
లే మాపునఁ గోడలింట లేకుండు నెడన్. 179

క. వలవని సతిపురుషులకును
వలపులు పుట్టించు మందు వగనెఱిఁగి రతిన్
వలపులు మరుపంజాలిన
బలియుండగు హొంతకారి పథమున రాఁగన్. 180

ఉ. అత్తయు హొంతకారిని రయంబునఁ దోడ్కొని మూల యింటిలో
హత్తుక కేళి సల్పునెడ నంతటఁ గోడలు వచ్చి యింట మా
మత్త విభుండు లేరనుచు మంతునిఁ దోడ్కొని యిల్లు సేరినన్
దత్తరమారఁ గోడలిని దద్విటునిం గని యత్త కిన్కతోన్. 181

తే. అపుడు గృహమధ్యమున నుండు నత్త, నత్త
విటునిఁ గోడలు గాంచె నవ్వేళ యందు
నేర మొక్కింత రాకుండ నేర్పు మెఱసి
వార లిరువురు బొంకఁగా వలయుఁ జెపుమ! 182

క. అన విని హేమావతి యే
యనువమరఁగ నితరశంక లంటక యుండన్
ఘనకచలు బొంకి తమ విట
జనముల నిల్వెడల నంపఁజాలిరొ యెఱుఁగన్. 183

క. నీ వెఱఁగించిన వినియెద
నా విని, హేమావతీ! వినన్ గడు వేడ్కల్
భావమున నున్న వినుమని
ధీవిభవము హంసవంశతిలకం బనియెన్. 184

తే. అటుల విటయుక్తయె యింటి కరుగుదెంచు
కోడలిని జూచి యత్త సక్రోధ యగుచు
“వీఁ డెవఁడు? వీనిఁ దోడ్కొని వేశ్మమునకు
సంజకడ రాఁ బనే ? " మని జడియ నడుగ. 185

క. దిట చెడక దిగులుగొని సొట
సొటపోవక వెనుకముందుఁ జూడక బొంకే
దెటు లని చింతింపక యా
ఘటకుచ తడఁబడక యత్తఁ గల్గొని పలికెన్. 186

తే. “తల్లిదండ్రులు మీరు బాంధవులు మఱియుఁ
జిక్కి తక్కినవారలు చెప్పినపుడు
వినక నా పతి నన్నిట్లు విడిచి పెట్టి
తిరుగుచున్నది మీ కెల్లఁ దేట గాదె? 187

క. వనితాపురుషుల కీయన
యనువున నన్యోన్యమోహ మందఁగ జేయున్
ఘనుఁడని కొందఱు చెప్పఁగ
విని తోడ్కొని తెచ్చినాను విభు ననుఁ గూర్పన్. 188

క. ఇది యేక్రియ నీయనచే
ముదమునఁ జేయింపవలెనొ ముగ్ధను బ్రాయం
బొదవిన దానను మోహము
మది సైపఁగజాల" ననుచు మమత ఘటిల్లన్. 189



ఉ. కోడలు పల్కు పల్కు విని కొంకక నిక్కముగాఁ దలంచి యీ
చేడియ నాదు జారుఁ గని చిత్తములో నెటులం దలంచునో
దూడెల నమ్మరాదని విధుంతుదవేణి తనందు సత్యపుం
జాడ గనంబడన్ స్వతనుజాతలతాంగిని జూచి యిట్లనున్. 190

క. నీ వింత యడుగ నేటికి
నీ విభుఁడు పరేచ్ఛంబూని నిను విడిచి చరిం
చే విధము తెలిసి కాదే
యీ వైద్యునిఁ దోడి తెచ్చి తింటికిఁ దరుణీ! 191

వ. అని యజ్ఞగజంత నిశాంతంబున నున్న తన యుపకాంతునిఁ జూపి వెండియుఁ గోడలి కిట్లనియె. 192

క. నీపతి నిన్ను వరింపన్
బ్రాపగు యత్నంబు నితఁడు భవ్యస్థలిలో
నేపున నొనర్చినాఁ డిఁక
రేపట మర్నాట సీదు ప్రేమ ఘటిల్లున్. 193

తే. అనుచుఁ దనయందుఁ జెలి సందియమ్ముఁ జెంద
కుండ నెఱిఁగించి యత్త “యో యుత్పలాక్షి
యతని నంపించు మిప్పటి కితనిచేతఁ
గాక యుండినఁ జూతముగాక" యనిన. 194

క. విని కోడలు నాయందలి
నెనరున నీయత్త యతని నిక్కమ తోడ్తె
చ్చినయది పతి ననుఁ గూర్చుట
కని తలఁ చటు సందుగామి ననిచెన్ విటునిన్.195

ఆ. అంత దానియత్త యాత్మోపపరిఁ జూచి
సైగ సేయఁ దెలిసి జారుఁ డపుడు

తత్ప్రయత్న మపుడె తగఁ జేసితని వార
లిరువు లెఱుఁగఁ బలికి యింటి కరిగె. 196

చ. అని కలహంసవంశమణి సాంగముగా వినిపించె వీనుదో
యినిఁ గడు సమ్మదమ్ము జనియింపఁగఁ దత్కథ యాలకించి కాం
చనసుమగంధి యా సతుల చాతురికాత్మ సెబాసటంచు మే
లనుచు గణించుకొంచు నిలయంబున కేగె నినుండు దోఁచినన్. 187

క. ఈరీతిఁ బడకటింటికి
జేరంజని మఱుసనాఁడు చీఁకటి జేజే
రారా కళ రా రాఁగల
యా రజనీవేళ విరహ మగ్గల మైనన్. 198

సీ. విరిదండ నెత్తావి నెఱి గుంపు గండుతు
మ్మెద పిండునకు మోద మొదవఁజేయఁ
గాశ్మీర తిలకంబు కాంతులు వదనేందు
బింబంబునకు సంజ డంబు గూర్పఁ
గస్తూరి పత్ర భంగముల నిగ్గు కపోల
శశి ఖండములకు లాంఛనము లీన
వాసించు నెఱ గందవడి పూఁత చనుగుబ్బ
పువ్వుగుత్తులకుఁ బుప్పొడులఁ గురియ
తే. నీలమణి కాంచి ఘృణులు విశాల జఘన
ధరణి కంబుధి మేఖలాత్వము ఘటింప
నృపతిమణిఁ జేరు కోర్కె నన్నీరజాక్షి
వచ్చి రాయంచకడ నిల్చె మెచ్చు లొల్క. 199

వ. అప్పుడు హేమావతికి హంసం బిట్లనియె. 200

పందొమ్మిదవ రాత్రి కథ

గాండ్లచేడె ద్విజవటువును గూడుట

క. శ్రీకర మను నొక పురము సు
ధాకర బింబ భ్రమప్రద స్వర్ణమణి
ప్రాకార గోపుర వర
ప్రాకార సువజ్ర కలశమై సిరులొందున్. 201

శా. సాలాగ్రస్థల కేళి తత్పర మహీస్వామ్యర్భక వ్యూహ దోః
పాళీ క్రీడిత రత్నకందుక మహా బాఢ వ్రణావ్యాప్తిచే
నాళీకప్రియ ధీరసారథికి మున్ పాటిల్లి యీనాఁటికిన్
బోలేదయ్యె ననూరునామ మదివో మూలంబు తత్సంజ్ఞకున్. 202

మ. పరిఘాంభః పరిదృశ్యమాన విలస త్పాతాళ సంచార బం
ధుర దర్పోత్కర భోగ రత్న ఘృణి సందోహంబు కెందమ్మి మొ
గ్గ రహిన్ గుల్క హరింపఁ బూని యది రాకన్ దక్కినన్ బల్మఱున్
గరముల్ సాఁచఁగ బోంట్లు, నవ్వుదురు వీఁకన్ వారికేళిన్ సతుల్. 203

తే. ఆ పురంబున ఫణిహారుఁ డనెడు పేరఁ
గాపురము సేయు నొక తిలఘాతకుండు
సంభ్రమంబున నాకార సౌష్ఠవమున
వాఁడు కందర్పునకుఁ జీటి వ్రాయఁగలఁడు. 204

తే. గానుగ కడెంబు మోకులు గడ్డపాఱ
కాఁడి సిద్దెలు గూటంబు కడవ జల్లి
గంప కనుగంత తక్కెడ గట్టి యెద్దు
చుట్టు చవికెయు సర్వ వస్తువులు దనరు. 205

తే. వెల్లగిసెనూనె కుఱునూనె వెఱ్ఱినూనె
నల్లనూ నిప్పనూనెయుఁ దెల్లనూనె
కుసుమ గానుగ దుండుగ కొబ్బరయును
నూనె పొగనూనె తగిరెసనూనె దీయు. 206

క. పరిపాటి కల్మి చేతను
గరగరిక వహించి మించి కడు నాగరిక
స్పురణన్ దమ వంశంబున
కరయంగాఁ బిన్న పెద్దయై యతఁ డుండున్. 207

చ. అతనికి నొక్క యింతిగల దంగజు పట్టపుదంతి జారిణీ
సతులకు మేలుబంతి విటజాలము లాడెడు పూలబంతి యా
యతమతి జార చిత్తజ మహా విరహాగ్నికి శాంతి దేహ ని
ర్జిత చపలా సుకాంతి మణిచిత్రిణి నాఁ దనరారు పేరునన్. 208

నిరోష్ఠ్య కందము.
దర గళ ఘన రసధర కచ
ధర సదృఢ స్తన సురదన తరళ నయన సుం
దర కంఠ కక్ష కరయుగ
సరస చరణ యనఁగఁ దరుణి సరసతఁ దనరున్. 209

సీ. నీల ధారాధర నిర్మల కాంతుల
గడియలో మాయించుఁ గలికి వేణి
సంపూర్ణ పూర్ణిమా చంద్రబింబ స్ఫూర్తి
దినము కుందఁగఁ జేయుఁ దెఱవ ముఖము
నిద్దంపు రుచు లొల్కు నద్దమ్ము వీక్షించి
గవిసెనల్ పెట్టించుఁ గాంత చెక్కు

లలరారు జిగిదేఱు నల చకోరంబులఁ
బుట్టు గ్రుడ్లని పల్కుఁ బొలఁతి కనులు
తే. నెట్టుకొని గట్టువగ పట్టు పుట్టచెండ్ల
బట్టి కొట్టించు వీఁపునఁ గొట్టుఁ బాఱఁ
గొమిరె సిబ్బెంపు గబ్బి చన్గుబ్బబోయి
విను మదారంభ గంభీర వేది గమన! 210

క. తనుకాంతి మెఱుఁగు మినుకా
మినకావర మఱఁచుగౌను మేలిమి గనకా
కనకాద్రి తోడ సరిచనుఁ
జను కాఠిన్యమ్ము పొగడ సన్మణి తునుకా! 211

తే. నీరజేక్షణ సిబ్బెంపు నిబ్బరంపు
గబ్బి గుబ్బల నెఱ రూపు గాంచి తొడరు
కాంతిఁ బొంగారు బంగారు కలశములకుఁ
గసలు బిబ్బోక నిరాకఁ గలుగఁ జేసి. 212

మ. వనజాతాక్షి పయోధరంబు లలకవ్రాతంబు కంఠంబు మో
హనలీలం దగు ఫాలభాగమును నూగారున్ గనల్లీలచే
ఘన నీలాబ్జ కళాకలాప జయకాంక్షన్ మించుటే మబ్రమౌ
ఘన నీలాబ్జ కళాకలాప జయ కాంక్షన్ వేణి రాణించఁగన్. 213

ఆ. దాని జవ్వనంబు దనువు నిరీక్షింప
మౌని కైన నెనయ మనసుపుట్టు
నితర జనులు చూచి యేణాక్షి రతిఁ జెంద
నిచ్చయింతు రనుట కేమి యరుదు? 214

తే. త్రుప్పు తుల్లిన నొప్పారు తోయజాస్త్రు
చికిలి నిద్దంపుఁ గైదువు చెలువు తోఁప

నూనె మెఱుఁగున నునుచాయ మేను దనర
నది విటాళుల కన్నాసయై మెలంగు. 215

చ. నడవడి గల్గువాఁడు కడు నాణెము చేఁ గలవాఁడు రూపునన్
బెడగగువాఁడు బల్ రతుల బేరజమై తగువాఁడు నిద్ధరన్
జెడుఁగడు బ్రహ్మ దీనిని నిసీ! మగనాలుగఁ జేసెనంచు లో
మిడుకుచు దాని యింటికడ మీసలు దీటుచు నుందు రెప్పుడున్. 216

సీ. పనిలేని పని పూనుకొని వచ్చి ముంగిలి
నెలవుగఁ దిరుగని నీటుకాఁడు
వేఱొక్కకడ కేఁగు వేళల నటు తొంగి
చూచిపోఁ దలఁపని సొగసుకాఁడు
సంగడికాఁ డిందుఁ జనుదెంచెనా? యని
వాకిలిఁ ద్రొక్కని వన్నెకాఁడు
గానుగ యీ ప్రొద్దు కట్టలేదా? యంచుఁ
గూర్చి యింటికిరాని కోడెకాఁడు
తే. మందునకు నైనఁ బ్రాయంపు మనుజులందు
వెదకి చూచిన నొకఁడైన వీటిలోనఁ
గలుగఁ డటువంటి మహిమ గల్గంగ దాని
కేమి జనవశ్య మున్నదో యెఱుఁగ రాదు. 217

ఉ. ఆ మణిచిత్రిణీ సుదతి యన్యజనోత్కరసంగమంబుపైఁ
బ్రేమ జనింప నాత్మ పిరువీకులు పెట్టఁగ వీటిలో విట
స్వాముల గారవించుఁ గృకవాకు భుజంగమ ధేనుకేభ ము
ఖ్యామిత బంధకేళులఁ గళాదు లెఱింగి కరంగఁ జేయుచున్. 218

తే. ప్రేమఁ గన్పట్టి వేథిలో బెళుకు మగల
సరసి కనుసైగ చేసేడి యంద, మంత

లోనె లోఁబడఁ జేయంగనైన నేర్పు
దానికే కాక కలుగ దేచాన కైన. 219

తే. ఇరుగుపొరుగింత వినకుండ నింటిమగఁడు
తెలియకుండఁగఁ బరరతిఁ దేలి నంగ
నాచివలె నుండుఁ గాని యా నాతిగుట్టు
బ్రహ్మదేవునకైనను బయలుపడదు. 220

వ. వెండియు నయ్యండజయాన విటకాండంబులఁ గూడి యఖండమోహంబునఁ బలుదెఱంగులఁ జరించుచుండె నివ్విధంబున. 221

వసంతము

ఉ. అంత వసంతవేళఁ జెలువంతట నెంతయు సంతసిల్లె న
త్యంతలతాంతకుంతసమరాంతదురంతనితాంతతాంతతా
శాంతికరంబు కంతుశరసంతతి సంతత కాంతతాసమా
క్రాంతవనాంతరంబు కలికాతతి దంతురిత ద్రుమాంతమై. 222

తే. కలయఁ గొమ్మలతోఁగూడి కాననమున
నుండువిటపుల ననిలచోరుండు పట్టు
కొని దళాంబరముల దోఁచుకొనియె ననఁగఁ
బండుటాకులు గాడ్పులుపర్వ రాలె. 223

క. వనలక్ష్మి మాధవ శో
భనమగు నత్తఱిని బాదపలతా పురుషాం
గన లన్యోన్యము క్రీడిం
చిన నెరయు వసంతమనఁగఁ జివురులు మొలిచెన్. 224

చ. వనకమలారుణాంబర షువారితకుంజ పికౌఘశోణలో
చన ఘృణిమండలంబు తరుసంఘ దిగంబరపంక్తి మస్తకో



కనదభ సజ్జటావృతము కాననమేఘు తటిల్లతోత్కరం
బనఁగ నవీన పల్లవచయంబు రహించె నరణ్యభూములన్. 225

చ. ఆళితతి డక్కి డొల్ల కుసుమావళి చుక్కలనామ ముల్లస
త్కళికలు పూసపేర్లు నన దట్టపు బట్టగఁబూని మావిజా
జులకు శుభాశుభాలు పికసూక్తులు దెల్పుచుఁ జైత్రకుం డనే
యల బుడబుక్కివాడు కలయన్ జరియించె వనాలయంబునన్. 226

చ. అళికుల గానవైభవము హర్ష మొనర్పఁ బరాగపూగ మన్
చలువపుఁదావి గందవడి సమ్మదమీయఁగఁ గల్కిచిల్క ప
ల్కులు నలరింపఁ క్రొత్త విరిగుత్తి చనుంగవ లింపునింపఁ బొ
ల్పలరు లతాలతాంగులను జాయుట లెట్లగుఁ బల్లవాళికిన్. 227

ఉ. చారుతరాతపత్రములు చామరముల్ సురటీలు పావడల్
సారతరోత్తరీయములు చల్వపు వల్పెపు దుప్పటంబు లిం
పారు సుగంధలేపనము లందముఁజిందు వితానపంక్తులై
మీఱె వనీరమాసతికి మెల్లనిగాడ్పుల రేఁగు పుప్పొడుల్. 228

వ. ఇత్తెఱంగున జగన్మోహనంబైన వసంతసమయంబున నవనీసురాదు లగ్నిష్టోమంబును షోడశ్యాప్తోర్యామంబు ద్వాదశాహస్సు వీజపేయంబు పౌండరీకం బతిరాత్రంబు చయనంబు గరుడచయనం బశ్వమేధంబు గవాలంభనంబు ప్రతిపత్స్తోమంబు మహావ్రతంబు విశ్వజిత్తు రాజసూయంబు సర్వతోముఖంబు విశ్వతోముఖంబు సత్రయాగంబు బృహస్పతిసవనంబు ప్రాతస్సవనంబు మాధ్యందినంబు సౌత్రామణియు నాగ్నేయం బుషస్యం బాశ్వినంబు హేమంత ప్రచ్యవరోహణంబు వృషభయజ్ఞంబును మొదలగు సకలక్రతువు లొనరింపం దొడంగి రట్టిసమయంబున. 229

. హరిశర్మ యనెడు పేరునఁ
బరఁగిన యొకసోమయాజి పనిచిన నొకభూ
సురసుతుఁ డొకదిక్కున న
ధ్వరపశువును బట్టుకొని ముదంబున రాఁగన్. 230

క. కంతు వసంత జయంతులఁ
బంతంబున గెల్చు నతని భవ్యాకృతి న
త్యంతముదంబునఁ గన్గొని
కంతు శరాహతుల కళికి క్రాఁగుచు నాత్మన్. 231

చ. కలికి చొకాటపున్ సొగసుకాయము కాయజుఁ గేరిమీఱు నీ
కలికి వయోవిలాసు బిగికౌఁగిఁట సొక్కుచునుండలేని యా
కులుకు టొయారిగబ్బి నసగూఁటి మిటారుల యందమేల? యె
మ్మెలపస యేల? యం చతనిమీఁదను గొంత దృఢానురాగయై. 232

ఉ. చెంతకుఁ జేరనేఁగి ముఖసీమ దరస్మితమొప్ప వారసీ
మంతిని కీయనో! వెలకు మార్చనొ! యేటికిఁ గొంచుఁబోయె ద
త్యంతరయానభాగము నటంచును మాటలు దీసిపల్క న
శ్రాంతముదంబుఁ గైకొని ధరామరసూనుఁడు విచ్చుఁగన్నులన్. 233

మ. ఆనవద్యాకృతి యౌవనంబుదగు నయ్యబ్జాక్షి నీక్షించి హా!
వనజాతాసమసృష్టికౌశలము ఠేవన్ దీని నిర్మించినం
తనె కానంబడె నేర్పరౌననుచుఁ దద్వాణీశుఁ గీర్తించి మె
ల్లనె చేరంజని దానిచెంగటను మేలంబాడుచున్ నిల్చినన్. 234

తే. అలరుకన్నులఁ దేలించి హర్ష మొదవ
సరసమాడుచుఁ గనుసైగ నెఱపి వేగ
నింటికేఁగిన నచ్చెలి వెంటనేఁగి
క్రతుపశువు నాతఁ డొకచోటఁ గట్టివైచి. 235

వ. అప్పుడు. 236

క. మోహంబుమీఱఁ గంద
ర్పాహవమున వారలిరువు రతుల ప్రౌఢిన్
బాహాబాహి కచాకచి
దేహాదేహిని బెనఁగి ధృతినున్నంతన్. 237

ఆ. దానివిభుఁడు వచ్చి తలుపుదీయు మటంచుఁ
దనదు సతిని బిల్వ విని విటుండు
కడుభయంబు వొడమఁ గంపితదేహుఁడై
యింక నెట్టులనుచు నింతి కనియె. 238

ఉ. అత్తఱి నెట్లు బొంకి వసుధామరశేఖరుఁడైన యా జం
గోత్తము వెళ్లనంపవలె నుత్పలగంధసుగంధి! లెస్సగాఁ
జిత్తములోన యోజనలు చేసుక తెల్పుమటన్న హంసతో
బిత్తరి నేనెఱుంగ నిది పెంపుగ నీవు వచింపు నావుడున్. 238

క. మంచి దిది విను మటంచున్
గాంచనగర్భాశ్వ మబలఁ గన్గొని పలికెన్
బ్రాంచ న్మధుర సుధారస
చంచ న్మకరంద బృంద సదృశ మృదూక్తిన్. 240

ఆ. లలన నటుల భర్త పిలిచినఁ దా విని
వసుమతీసురుండు వడఁకుచుండ
వెఱవ వలదటంచు వీపు దట్టి లతాంగి
వేగ మేకపోఁతు విడిచి పెట్టి. 241

తే. “పొదువు పోనీక పట్టుము భూమిదేవ
వర్య!” యనుకొంచు వచ్చి కవాటము గడె

యెడపినంతనె తద్భర్త యింతి తోడ
“నెవ్వఁ డీతండు? గజిబిజి యేమి?” యనుచు. 242

చ. గదిమిన నా వధూటి కలఁగంబడ కాత్మ భయంబు లేక “భూ
మిదివిజుఁ డితఁ డీ సవనమేషముఁ బట్టుక పోవఁ ద్రాడు చే
వదలిన వేగవచ్చి మన వాసముఁ జొచ్చుక చిక్కకుండినన్
బదపడి తల్పు మూసికొనఁ బల్మఱు మేషము ద్రిప్పు లాడెడిన్. 248

క. చూడు” మని చూపి, “బాపన
బోడిక ముగ్ధుండు మేకపోఁతును బట్టి
మ్మేడకుఁ బోవలెనో” యని
చేడియ చెప్పిన నతండు చిఱునవ్వొలయన్. 244

తే. తఱిమి మేషంబు పట్టిచ్చి తఱలు మయ్య
బ్రాహ్మణోత్తమ! యని పంపి భార్యమీఁద
సందియము లేక యెప్పటి చందమునను
వేడ్క లిగురొత్తగా నుండె వెలఁది మగఁడు. 245

క. ఈ మర్యాదఁ జరింపం
గా మహిమ యొకింత నీకుఁ గలిగిన భూమి
స్వామినిఁ జేరఁగఁ బొమ్మని
హేమావతితో మరాళ మిట్లను వేళన్. 248

సీ. కృకవాకు కంఠకీచక నివృత్తి కదంబ
కములకుఁ బడమటికడ మరుత్తు
బహుళ నిద్రాముద్ర పద్మకానన పద్మ
భవనను మేల్కొల్పు పాఠకుండు
చక్రవాక ద్వంద్వ సంబంధ సంధాన
శేముషీ భూషణ చేటకుండు

సురమార్గ దీర్ఘికాంతర తీర బిసఖండ
భక్షణాయాత వలక్ష పక్షి
తే. భూరి కైరవ వనరమా ముఖ వివర్ణ
భాగ సంపత్కరంబైన పగలువత్తి
కులట లెదస్రుక్కుఁ జోరులు గుట్టలెక్క
వేగ జనియించె జిగినిక్క వేగుఁజుక్క. 247

చ. అపుడు కథాచమత్కృతికి నద్భుతమై తలఁదిప్పి యద్దిరా!
నిపుణత! తద్ద మెచ్చఁగల నేర్పరి వౌదని పల్కి యంత న
చ్చపలమృగాక్షి దివ్యమణిసౌధములో విరిదమ్మిపాన్పుపై
విపులనృపాలమోహపరివేదనచే శయనించెఁ బొక్కుచున్. 248

వ. ఇట్లు శయనించి కొంతతడవు నిద్రించి హేమావతి రాజదూతి యగు హేలతో ముదంబున నిట్లనియె. 249

చ. కల యొకటేను గంటిఁ గలకంఠ సుకంఠి! శుకాశ్వకేళికా
కలితకళాకలాపపతిగాఢభుజాపరిరంభణక్రియా
సలలితపారవశ్యసుఖసంభ్రమగుంభనజృంభమానపుం
గలనల మేలుకొంటి రవిఁ గంటి నకుంఠతరోదయోపరిన్. 250

వ. అనిన హేమావతింగాంచి నీ యిష్టంబు శీఘ్రంబునన యీడేరు నని దూతి చెప్పిన విని సంతోషించి యమ్మగువ క్రమ్మర దినాంతంబున. 251

తే. నీలకాకోల కాకోల నీల నీల
కంఠ శ్రీకంఠ శ్రీకంఠ మనఘనాఘ
మనఘనాఘ ఘటాఘట ఘటన రుచుల
పెంపు గనిపించు చీఁకటి పేర్చువేళ. 252

క. నలుగిడి కుంకుమ పిండిని
దల సంపెఁగనూనె నంటి తావుల గంధా
మలక మొసఁగి పన్నీటన్
జలకం బొనరించి చల్వఁ దడియొత్తి వెసన్. 253

సీ. చీని కలంకారి చీటి కుచ్చుల మీద
సిరిమించు సరిగంచు చీరఁగట్టి
కొదమ రాచిల్కలఁ గూర్చి తీర్చు కసీదు
సవురు మేల్పని చల్వ అవికఁ దొడిగి
తళుకు మానికపు నిద్దా చెక్కడపుఁ బైడి
సొమ్ములు నెమ్మేన నెమ్మిఁ దాల్చి
కమ్మ నెత్తావి చొకాటంపుఁ గలపంబు
నెఱనీటుగా మెడనిండఁ బూసి
తే. తుఱుము లోపల నరవిరి సరులు దుఱిమి
వేడ్కఁ గపురపు బాగాలు వేసికొనుచుఁ
గులుకు జిగిబిగి వగ వింత గొలుప వచ్చె
బోఁటి లావణ్య మదన వధూటిఁ బోలి. 254

క. వచ్చి తన మ్రోల నిలిచిన
యచ్చపలమృగాక్షిఁ జూచి హంసము భళి! నిన్
మెచ్చితి నీ సొగసునకున్
మెచ్చుము కథవిని యటంచు మెలతకు ననియెన్. 255

ఇరువదవ రాత్రి కథ

మంత్రికుమారుని భార్యలిద్దరు నిద్దరినిఁ గూడుట

క. ఉజ్జయిని యనఁగ నొకపుర
మిజ్జగతిఁ బ్రసిద్ధికెక్కు నిద్ధ విభా సం

పజ్జలజరాగహర్మ్యచ
రజ్జారాలింగితాప్సరస్స్త్రీగణమై. 256

మ. నెలఱాలోవలు చిల్క తళ్కు పని వన్నెల్ వన్ను ముత్తెంపుఁ దా
పల కప్రంపు టనంటిమొగ్గ మగఱా బల్బోదె దంతంపు సి
స్తులు గుల్కుం బవడంపుఁ జాపులు రహించున్ గెంపుఱా యోడుబి
ళ్ళల నిద్ధంబగు నిల్వుటద్దముల మేడల్ వేసవే లప్పురిన్. 257

చ. పురవన భూజ పుష్పఫలముల్ గొను వేడుకఁ బూని తద్ద్రుమో
త్కరములమీఁది కెక్కి సతతంబును దండల నుండు నందన
స్ఫురదురువృక్షపంక్తి సుమముల్ వెసఁగైకొని కొప్పులం దలం
కరణ మొనర్తు రాపురిని గల్గిన భిల్ల సుపల్లవాధరల్. 258

వ. ఇట్టి పురంబున. 259

మ. చతురోపాయసమర్థుఁ డప్రతికళాచాతుర్యధుర్యుండు వి
శ్రుతకార్యజ్ఞుఁడు రాజనీతిపథదక్షుం డింగితజ్ఞాని య
ద్భుతశక్తిత్రయపారగుండు గుణసంపూర్ణప్రభావుండు సం
తతభూపాదరణీయుఁ డొక్కరుఁ డమాత్మశ్రేష్ఠుఁ డుండుం బురిన్. 260

తే. అతని నామంబు బహుమానుఁ దండ్రు జనులు
మానినీరత్నమ! పరాకు మాని వినుము
భర్తృహరి చెంగటను గీర్తిఁ బరఁగునట్టి
మంత్రిజనులందు మేటి యా మంత్రిజూటి. 261

సీ. నిర్ణయంబా బ్రహ్మనిర్ణయంబు స్వమాయ
విష్ణుమాయయుఁ జర్య కృష్ణచర్య
వాక్యంబు శ్రీరామవాక్యంబు దృష్టి యీ
శృరదృష్టి దీప్తి భాస్వంతుదీప్తి

బల్మి భీముని బల్మి పద వింద్రపదవి స
త్యము హరిశ్చంద్రు సత్యము ప్రతిజ్ఞ
రాము ప్రతిజ్ఞ ధైర్యము మేరునగ ధైర్య
మాజ్ఞ సుగ్రీవాజ్ఞ ప్రజ్ఞ గురుని
తే. ప్రజ్ఞ బలము సుయోధను బలము కట్ట
డన భరతు కట్టడి కలిమి ధనదుకలిమి
గాఁగఁ బతి మెచ్చ నఘటన ఘటన పటిమ
నమ్మహామంత్రి రాజ్యభారమ్ముఁ దీర్చు. 262

వ. మఱియు గురు మహాప్రధాన సామంత సేనాపతి ద్వారపాలకావసరిక ఘటికా నిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యోతిషిక నైయాయిక వైయాకరణ మీమాంసక కావ్యకారక దేవతార్చక మాలాకారక పరిమళకారక గోష్ఠాధికార గణాధికారాశ్వాధికార భాండాగారాధికార ధాన్యాధికారాంగరక్షక సూత సూద భేతాళ మత తాంబూలిక తాళవృంతిక నరవాహక చ్ఛాత్రిక చామరిక కళాంచిక శరశారిక కీరమాలిక పాదుకాధారక నర్తక గాయక వైణిక శాకునిక మాగధ వైతాళిక స్తుతిపాఠక పరిహాసక క్షౌరక రజక సౌచిక చర్మకారక ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవైద్యాశ్వవైద్య పశువైద్య భేరీవాదక మురజవాదక రౌమక శిలాచ్ఛేదక స్వర్ణకారక కాంస్యకారక కుంభకారక చిత్రకారక వ్యావహారిక మృగయాకారక పక్షివాహిక వణహారికోగ్రాణాధికార వైశ్యజనంబు లాదియైన డెబ్బదిరెండు వినియోగంబులవారు సేవింప నతండు వెలయుచుండు. 263

ఉ. వానికిఁ గొన్నినాళ్ల కిల వార్తకు నెక్కినవాఁడు రూపరే
ఖానవపంచబాణుఁ డనఁగాఁ దగు చక్కనివాఁ డొకండు స
న్మానవిభూషణుండు సుకుమారుఁడు దైవకటాక్షవీక్షణా
నూనకృపాప్తిచేఁ గలుగ నుత్సవ మొప్పఁగఁ బెంచి రెంతయున్. 264



తే. పెంచి యెలప్రాయ మొదవఁగాఁ గాంచి యతని
పెండ్లి సేయుద మనుచు సంప్రీతి నొందు
తల్లిదండ్రులతో బంధుతతులతోడఁ
బరిణయము నొల్ల నేనని పలుకుచుండు. 265

కామినీ గర్హణము

ఉ. ఊరక పెండ్లి యేమిటికి నొల్ల నటంటి వటంచుఁ బల్కినన్
వారల కాతఁ డిట్లనియె “వారిజనేత్రల నమ్మరాదు, మా
యారచనాప్రవీణలు పరానుగతేచ్ఛ లింకేమనన్ వలెన్
వారక యాఁడురూపములు వ్రాసిన యింటను నిలురే? బుధుల్. 266

క. కుల మెంచ రాడికోళ్ళకుఁ
దలఁకరు సడి వావి వరుసఁ దలఁపరు నీతిన్
దలకొనరు సత్య మాడరు
కలకంఠులు వారి నమ్మఁగా నెటు వచ్చున్. 267

ఉ. చన్నులకన్న మున్ పొడము సాహసముల్ బెళికించు దృష్టికిన్
మున్నుగఁ బుట్టుఁ బెద్దలను మోసము పుచ్చు మనీష యౌవనా
సన్నతకన్న మున్నె యగు సత్య మసత్య మసత్య మెన్నఁగాఁ
దిన్నగ సత్యమంచు ధృతి దీకొను ధీరత పువ్వుబోండ్లకున్. 268

ఉ. టెక్కులు నెమ్మెలున్ సొగసు ఠీవియు నాగరికంబు నిద్దపుం
జక్కఁదనంబు జవ్వనము సంపదసౌంపు వినోదపున్ వగల్
చొక్కపు వైఖరుల్ వలపుఁ జూపఁగఁ జాతురి గల్గువారికిన్
దక్కిన యట్లు భర్తలకు దక్కరు నిక్కువ మింతు లెంతయున్. 269

తే. గరగరిక నుండు మోహనాకార విభవ
శుభవయః పాక పురుషులఁ జూచి నపుడె

దృష్టి వారలపై నిల్పి తెవులు లేని
దశలఁ గృశియింతు రింతులఁ దరమె తెలియ! 270

క. అని పల్కెడు తత్పుత్రునిఁ
గనుఁగొని తల్లిదండు లాప్తగణములు బంధుల్
వనితాభిముఖునిగాఁ దమ
యనుపమచాతురి నొనర్చి రతిసంప్రీతిన్. 271

క. కుల గుణ రూప ప్రజ్ఞా
దులు గల కన్యకల మానధూర్వహసంజ్ఞన్
జెలగిన యతనికిఁ బరిణయ
మలరఁగఁ గావించి రంత నతఁడు నిజాత్మన్. 272

తే. నెలఁతలను నమ్మరాదని నిశ్చయించి
పోఁతుటీఁగకు నైనను బోవరాని
యొంటికంబపు మేడలం దునిచెఁ దత్స
తీద్వయంబును హితసఖుల్ తెలిసి ప్రోవ. 273

వ. ఇత్తెఱంగున నన్యులఁ బొంద శక్యంబుగాని సౌధంబుల నిజభార్యాద్వయంబును వేర్వేఱఁ గాఁపురం బుంచి తత్పరిపాలనార్థంబు పెద్దలగు హితవయస్యల నియమించిన నచ్చెలికత్తెల తీరున నన్నపానాద్యుపచారంబులఁ బోషించుచుండునెడ భువనమోహనాకారంబైన యౌవనోదయంబు సంభవించిన. 274

సీ. కంధర కమలారి కార్ముక కంజాత
కాంచనకంబుల గర్వ మణఁచి
పద్మరాగ పటీర పద్మారిఖండ ప
ల్లవపద్మముల సముల్లాస మెంచి
వజ్ర వల్లీద్వయ వసుమతీధర వార
ణారి వారణ వసుధాళిఁ గేరి

కదళికా కాహళ కచ్ఛప కలకంఠ
కనక కర్పూర సంఘముల మీఱి
తే. కచ ముఖ భ్రూ నయన నాసికా గళోష్ఠ
పరిమళ కపోల కోమలపాణి దంత
బాహు కుచ మధ్య గతి నితంబాంక జాను
పద వచో౽౦గ స్మితము లొప్పు భామినులకు. 275

చ. తరుణుల కౌనులాకృతులు తళ్కు మొగంబులు చన్గవల్ సువా
క్సరణులు పాణులున్ మెడలు సారనితంబము లారురేకలున్
దరళవిలోచనంబులు పదంబులు మేలు ముణుంగు లారయన్
హరికమలాబ్జచక్రనివహంబు నయంబు రయంబునన్ నగున్. 276

సీ. ధరజయోన్నతి మించెఁ దనరు చన్నులు, కృష్ణ
వర్త్మ ఘనాకృతి వఱలె నెఱులు
కనుబొమల్ ధర్మవిఖ్యాతిఁ గైకొనె ముఖం
బులు నిశాచరకళాకలనఁ గనియె
జలవరసంభ్రమంబులఁ గేరి నాభులు
కటులు మహాబలోత్కటకతఁ దనరె
నీలకంఠప్రియ శ్రీలందె నారులు
గజవైరి గతిఁ దాల్చెఁ గలికికౌను
తే. లమరకాంతల లీలల నవయవములె
పరిహసింపంగ మెఱయు నప్పద్మపత్ర
సదృశనేత్రల కిఁక ధరాస్థలిఁ జెలంగు
చెలువలన నెంత హాసనిర్జితలతాంత! 277

సీ. మెఱుఁగుమోవులు ప్రభాకరబలంబు వహించె
లపనముల్ చంద్రబలంబుఁ గాంచె
జఘనముల్ వసుమతీజాత బలంబందె
గలితబుద్ధులు సౌమ్యబలముఁ జెందె



గురుబలంబు భరించె గుబ్బచన్గవలు న
ఖంబులు శుక్రబలంబుఁ బూనె
మందబలంబు సమ్యగ్యానములు దాల్చె
స్వర్భానుబలముఁ గచంబు లొందె
తే. నతనుకేతు బలంబూనె నలరుకన్ను
లిట్ల సకలగ్రహబలాప్తి నెనసియు సుమ
నోజ బలవేధఁ దత్సతుల్ నైజనాథ
బలము చాలక కోరిరి పరబలంబు. 278

వ. ఇవ్విధంబున నివ్వటిల్లి యౌవనగర్వాతిరేకంబున నిర్మానుష్యంబులగు సౌధాంతరంబుల నుండుటంజేసి పంజరబద్దకీరంబులదారిని నపారజారవిహారవిచారపూరితమానసలైన యా మానసకాసారగభీరనాభులు స్వాత్మగతంబున. 279

క. పతిరతిఁ దీఱదు తమి పర
పతిరతి యేరీతి దొరకు భావంబున సం
గతమగు నీవెతఁ దీర్చెడి
హితవరు లెవరని తలంచి రెంతయు వంతన్. 280

సీ. అమరఁ దిర్యగ్జాతులందైన వేయక
నరజన్మమేల యందఁగ నొనర్చె
నొనరించుఁగాక నింపొదవంగఁ బురుషులఁ
జేయక మమ్మేల స్త్రీలఁ జేసెఁ
జేయుఁగాక రతీచ్ఛఁ జెందువానికిఁ గూర్ప
కీరీతి నిర్మోహి కేల కూర్చెఁ
గూర్పుఁగాక యథేచ్ఛగొని చరింపఁగ నుంచ
కీ దుర్గమస్థలి నేల యుంచెఁ

తే. గటకటా! మాయెఁడా పాపకఠినహృదయుఁ
డాయెఁగాఁబోలు వాణీశుఁ డటులఁగాక
యున్న నిట్లేల చేయ నం చువిద లాత్మఁ
బరితపింతురు మరుజారి విరహమొదవ. 281

వ.ఇట్లు తమకు వలయునెడఁ బడఁతులగొడవ తడవని తమ యొడయఁడు తమ్ము మిగులఁ గూడిమాడి యుండమికి దుర్గమస్థలసంస్థితలగుట జారక్రీడకుఁ బొసఁగమికిఁ గంతుశరసంతతసంతాపమ్మునకు సంతపించుచుఁ జిన్ననాఁటనుండియును దమ్మునెత్తిపెంచిన దాదులకు సైతము నెఱుంగనీయక యొండొకతెఱంగున నయ్యంగనలు మెలంగుచుండి రయ్యెడ సువర్ణయను తదగ్రభార్య మోహంబున మదనాదుల నుద్దేశించి తన మనంబున. 282

సీ. నీ సుమశరముల నీసుమ సమ హాస
నీ సుమతిని నేయ నేల? మదన!
నీరాక కులుకు నన్నీరాఁక విడక పో
నీరా! కళాకర! నీరజారి!
ఘనమార్గ ముడిగించి ఘనమా? వధూవధ
ఘనమా విషాపాది వనరె? నిన్నుఁ
బవమాన! కరుణ నింపప! మానగతిఁ జరిం
పవ మానమున కల్కుపడవు నీవు
తే. మధురధర్ముఁడు సర్వజ్ఞమౌళి సురప
థానువర్తి మహాబలుం డనెడు నిజమ
హత్త్వములు మాని యిట్లు స్త్రీహత్యఁ జేయు
చున్న మీరీతి నెవరైన విన్న నగరె? 283

క. తారాధిప! రజనీకర!
కైరవ భేదన సమర్థ! గౌరీశ శిరో౽



దూర! కమలాభి శంసన
కారణ! వారాశి భంగ కార్యభ్యుదయా! 284

చ. పరిధి మిషంబు, మూలికల బంతి కళంకపుఁ గావుబొట్టు భీ
కరకిరణంబులన్ జడలు కౌముది భూతియుఁ దాల్చి మంత్రివై
విరహులఁ జంప సాగితివి వేయన నేమిటి కూరు ముక్కఁడిం
బరఁగిన తోడుబోఁతుల రవం బనుమాట నిజంబె పో! శశీ! 285

క. కీరమణీ! నీ కోడక
కీరమణీ రత్న మిదియ కిల్బిష మతివే
కీ రమణీయపుఁ జనవు శు
కీరమణా! కాని వారె కీరాలాపల్. 286

మాటి మాటికి వేఁడు సీమాటి యెడలఁ
బాటి దప్పిన వార లేపాటి వారు?
కావున దయార్ద్రబుద్ధి నన్గావు నీకుఁ
దేఁటి! నామీఁదఁ గోప మింతేటి కరయ. 287

క. పికమా! ఘోరాకృతి చూ
పిఁక మాదృశ విరహిణుల రతీశ మహోద్దీ
పకమార్గము చూపఁగ నో
పిక మానసమూని యేఁచి బింకమె నీకున్? 288

వ. అని వెండియు నయ్యండజయాన పెక్కుతెఱంగుల నయ్యనంగుని సైన్యసమేతంబుగఁ బలుకుచున్న సమయంబున దైవయోగంబున 289

ఆ. ఆ సువర్ణమందిరాంగణమున నొక్క
పాదుకాద్వయంబు పడియె నంత
దాని వెంబడిన మహీనిర్జరుం డొకఁ
డతిరయఘునఁ బడియె నంగ మద్రువ. 290

వ. ఇట్లు పడిన యప్పుడమి తెఱగంటి కొమరు నత్యనుపమమోహనాకారు నిరీక్షించి భయవిస్మయహర్షాదులు ముప్పిరిగొనుచిత్తంబున డాయంజని యొంటిపాటగుట వివిధోపచారంబుల సేదఁ దీర్చి, నీ వెవ్వండ? :విట్లిందుఁ బడుటకు నిమిత్తంబేమి యనిన నా సువర్ణకు నతం డిట్లనియె. 291

మ. హిమవత్పర్వతమందు మందుఁడను మౌనీంద్రుం డొకండుండు సం
యమిచంద్రుండు తపఃప్రభావుఁ డల సన్న్యాసిన్ వెసన్ మోసపు
చ్చి మహాభ్రస్థలి వాయువేగమున వేంచేయన్ సమర్థంబులై
యమరం బావలు, వానిఁ బూని చనుచో నాకాశమార్గంబునన్. 292

ఉ. మున్నలవాటులేమిఁ బదముక్తములై పడె నిందుఁబావ, లే
ను న్నిలుపోపలేక దివినుండిట వ్రాలితి నట్టి పావలెం
దున్నవొ చూపుమంచనిన నుగ్మలి యందొకచోటఁ గాంచె మేల్
సొన్నపుసన్నపుంబనుల సొంపుఘటింపఁగఁజాలు పాదుకల్. 293

వ. వాని గ్రహించి యచ్చంచలాక్షి యాహారాదివిధుల సంతుష్టుం జేసి యా బ్రాహ్మణకుమారు నెత్తుకొని తత్పాదుకాసామర్థ్యంబున నిలయనికటనిజపతికేళికారామంబు చేరి తదనంతరంబ. 294

ఆ. తగిన ప్రహరిగోడ దక్షిణోత్తరముల
నలరు వెడఁదకూట మందమొందు
మందిరంబుగాంచి యందొక్కయఱఁ దన
పడకటిల్లు చేసెఁ బద్మనయన. 295

ఉ. అందొకయింతసేపు వసుధామరపుత్రునితోడ వేడుకన్
గెందలిరాకువిల్తురణకేళిని దేలి యజస్రమిట్లు పొ
ల్పొందిన యిప్పురంబున శుభోన్నతిచే వసియించినన్ రతిన్
జెంది సుఖింపు నీ వితరచింతలు మానుము భూసురాగ్రణీ! 296

క. నీ కితరభయంబులు రా
నీక మెలంగుదునటంచు హితవుఁగఱపి బి
బ్బోకిని యతనికి వ్యయమున
కై కొంతపదార్థ మిచ్చి యనిచెన్ బురికిన్. 297

వ. ఇట్లతనిఁ బ్రియపూర్వకంబుగా నాదరించి సెలవొసంగి క్రమ్మరఁ దనయిల్లు చేరె నివ్విధంబునఁ దత్పాదుకాసామర్థ్యంబున. 298

క. కేళీవనమున సముచిత
కాలంబున నతనితోడఁ గంతురణక్రీ
డాలలితసౌఖ్యవారిధి
నా లోలమృగాక్షి యోలలాడుచునుండెన్. 299

వ. ఇవ్విధంబునఁ బ్రథమభార్య సుఖించె నంత ద్వితీయభార్యయగు సుప్రభయు సపత్నిరీతినుండియుఁ బరపురుషవాంఛ వొడమి కడుమిడుకుటంజేసి యేచందంబునం బ్రొద్దువోక యొక్కనాఁడు సౌధాగ్రంబున. 300

క. ఆ సుప్రభ సంగీతక
ళాసరసత గలదియౌట లలితముగ సము
ల్లాసమున వీణమీటుచుఁ
జేసెన్ గానంబు సౌధశిలలు స్రవింపన్. 301

క. సురపథమున నపుడొక ముని
యరుగుచు నిజగాననిస్వనాకర్ణనవి
స్ఫురితానందంబున నట
కరుదెంచిన లేచి చూచి యతనికి మ్రొక్కెన్. 302

ఆ. మ్రొక్కి నిలిచి వనిత మునితో స్వవృత్తాంత
మంత మనము గరగునటులఁ దెలిపి



“దేవ! నీవు రతులఁదేలించి ననుఁ బ్రోవు”
మనుచు వేఁడుకొనిన నబలఁ జూచి. 303

“నేను విజితేంద్రియుండను గాన సతులఁ
జెందఁగారాదు నాకుఁ బూర్ణేందువదన!
యైన నీయిష్ట మీడేరునట్టి నేర్పు
తెలియఁజెప్పెద విను”మని తెఱవకపుడు. 304

వ. కారుణికాగ్రేసరుండై యొక్క సిద్ధమంత్రంబు చెప్పి యీ మంత్రస్మరణంబున వలయునెడకుం బోయిరావచ్చుఁ గావున నీవాంఛితంబు దీనం దీర్చుకొమ్మని యానతిచ్చి మౌని విచ్చేయుడు, నంత నాకాంత యత్యంతసంతోషంబున నొంటిపాటైన సమయంబున. 305

క. ఆ రాజన్మంత్రస్మృతి
నారామముఁ జేరియున్న యపు డచ్చటికై
చేరిన తద్వనపాలుని
మారసమాకారుఁ జూచి మది ముద మొదవన్. 306

తే. ఓరచూపులఁ జిన్నెల బేరజముల
మనసుఁ గరఁగించి తనమీఁద మరులుగొలిపి
వానిఁ దోడ్కొనిపోయి యా వాలుఁగంటి
కడమయఱలోన రతికేళిఁ గలిసి చనియె. 307

క. అది మొదలు వానిఁ గవగొని
మదవతి యారామమధ్యమందిరమున నిం
పొదవఁగ రమింపఁ దొడఁగెను
మదనుఁడు విల్లెక్కుడించి మరలిచనంగన్. 308

ఉ. అంతట నొక్కనాఁటి నిశియందు శశిగ్రహణంబుగానఁ ద
చ్ఛాంతికి స్నానదానములు సల్పను వేకువజాము వచ్చు ప



ర్యంతము పట్టు నందనుక రాఁడిపు డింటికి నాథుఁడంచు దా
దెంతయు వచ్చి చెప్పిన మృగేక్షణ ఆత్మల వేడ్కలూనుచున్. 309

వ. ఒంటిపాటైయున్న సమయంబున. 310

తే. జలక మొనరించి జిలుగు వల్వలు ధరించి
కమ్మనెత్తావి కలపంబు కలయనలఁది
యరవిరుల కొప్పులమరించి యారగించి
తమ సమర్థతఁ దద్వనాంతరముఁజేరి. 311

క. ఒకరి నొక రెఱుఁగనీయక
సకియలు పడకిండ్లు చేరి చౌశీతిసుబం
ధకళానైపుణి నుపనా
యకులతో రతికేళిఁ బెనఁగులాడెడివేళన్. 312

సీ. ఫణిరాజతల్పంబుపైఁ బద్మనాభుండు
తిన్నగా శయనించు వన్నెఁదెగడి
తనరు శ్వేతద్వీపమున గాఢతమ మొక్క
దెసనుండి పర్వెడు పస హసించి
క్రమమునఁ బుష్పగుచ్ఛముమీఁద మగతేఁటి
మొత్తంబు వ్రాలెడు దత్తు మీఱి
హిమశైలతుంగశృంగమున నీలాభ్రంబు
పర్యాయమునఁ గప్పు భాతి మెఱసి
తే. సారకర్పూరడిండీరహారహీర
తారకోదారధవళాంశువారకలిత
నీరజారాతిబింబ మున్నిద్రరౌద్ర
గతి గ్రసించెను రాహు వక్కాలమునను. 313



సీ. మంత్రికుమారుఁ డామానధూర్వహుఁడు ది
వ్యౌషధం బవ్వనందిందుఁ గలుగు
టెఱిఁగియుండుటఁజేసి హితమిత్రపరిజనా
న్వితముగ దివ్వటీ ల్వెలుఁగ నేఁగి
బదనికగల పాదపముఁ జూచి యది తీసి
కొనిరండు పొండని కొందఱ హిత
వరుల నంపించి వారరుదెంచు నందాఁకఁ
దా విశ్రమింపఁగాఁ దలఁచి తనదు
తే. సతుల కెప్పుడు సంకేతసదనమైన
తద్వనీమధ్యసద్మంబు దండకరుగఁ
బ్రస్ఫురత్కరదీపికాప్రభలు చూచి
పరులెవరొ వచ్చిరని యుపపతులు వడక. 314

తే. వెఱవకుఁడటంచు వెరవుచే వెన్నుఁ జఱచి
యుపపతుల నిండ్లలోననే యుండఁజేసి
నిలయములనుండి వెలువడి నెలఁతలు తన
కెదురుగా రాఁగ మదిఁ గోప మొదవఁ జూచి. 315

తే. పరులకటు తొంగిచూడను బాటుగాని
దుర్గమస్థలి నుండెడి తోయజాక్షు
లివ్వనంబున కేరీతి నెమ్మె మెఱసి
వచ్చినారను సందియం బిచ్చఁబూని. 316

తే. “ఇమ్మహానిశి నిచ్చోటి కేమిపనికి
వచ్చితి?”రటంచు గద్దించి హెచ్చరించు
వల్లభునితోడ నవ్వేళ వనిత లెట్లు
బొంకిపోవలె? నెఱిఁగింపు పంకజాక్షి! 317

క. అని యడిగిన హేమావతి
తనతలఁ గదలించి తెలిసి తానిది వివరిం
పనుజాల నీవె తెల్పుము
వినియెద నన హంస మపుడు వెలఁదికి ననియెన్. 318

తే. మానధూర్వహుఁ డప్పుడా మానవతులఁ
గాంచి వీరలు మత్కులకాంతలనుచు
నిశ్చయించుక రౌద్రనిర్ణిద్రబుద్ధి
“మీర లివ్వేళ నిట కేల చేరినారు? 319

ఉ. చెప్పుఁడు చెప్పకున్న మిముఁ జిత్రముగా వధియింతు”నంచు ఱేఁ
డప్పుడు తమ్మురొప్పిన భయంబు వహింపక యాసువర్ణ సొం
పొప్పఁగ భర్తకిట్లను సుఖోన్నతలీలల నివ్వనంబునన్
దప్పక సంచరించు వనదైవతకాంతల మమ్ముఁ జుల్కఁగన్. 320

క. నీమనమున మద్భామిను
లీ మగువ లటంచు మమ్ము నెంచితి వాదిన్
మేము భవదీయసతులము
గా మస్మత్కళలు నీదు కామిను లనఘా! 321

వ. అదియునుం గాక. 322

క. ఈయెడ మేము చరింపను
మాయంశమ్ముల జనించు మదిరేక్షణలన్
నా యిల్లాండ్రని పల్కితి
వే! యేమి నిమి త్తమనిన నెఱిఁగింతు మొగిన్. 323

తే. చైత్రరథమున మును మేము సరసగతుల
సంచరింపఁగ నవ్వేళఁ జైత్రుఁ డచటి



కరుగుదెంచినఁ గాంచి యనాదరమున
లేవకుండిన సక్రోధలీలఁ జూచి. 324

తే. సాపరాధల మమ్మా వసంతుఁ డరసి
మర్త్యసేవను నూఱేండ్లు మహిని మెలఁగుఁ
డని శపించినఁ బ్రత్యక్ష మటుల నుండఁ
జాలమని మేము ప్రార్థింప సదయుఁడగుచు. 325

సీ. ఆరీతి మీరు ప్రత్యక్షంబున మెలంగ
కున్న నేరంబేమి? యువిదలార!
మీయంశములఁ బుట్టు మెలఁతల మానధూ
ర్వహుఁడను బహుమానవరకుమారుఁ
డగు విప్రునకు భార్యలై యుండ నియమింపుఁ
డని తెల్సి యావేల్పు చనిన, నచటఁ
గూర్మితో నీకు మే ల్గోరుచునున్నవా
రము సుపర్ణయన సుప్రభయనంగ
తే. మామకాంశముల జనించు మనుజసతులు
నీకుఁ గులకాంత లైనారు నిక్క మిదియ
రూపయౌవనసంపదారూఢి నీదు
చానలకు మాకు భేద మింతైనలేదు. 326

తే. ఇట్టి చుట్టఱికం బుండు టెఱిఁగి కాదే
నిను సహించితి మితర భూజనులు మేము
మెలఁగుచోటికి నివ్వేళఁ బొలసినపుడె
చెడ శపింతుము నీవింక సుడియరాకు. 327

క. చుట్టఱిక మెంతగలిగిన
రట్టున రారానియెడకు రా వారలపై

నెట్టి సుబుద్ధులకైనను
బుట్టును రోషంబు దానఁ బుట్టున్ జెట్టల్. 328

క. కావున నీ విచటికి నిఁక
రావలదు వసంతశాపరాహితలమై మా
దేవవని కేఁగినంతట
నీవిట నెమ్మదిఁ జరింపు నీయాప్తులతోన్. 329

క. అని సంతోషము భీతియు
జనియింప సువర్ణపలుకుజాడనె పలికెన్
వనితామణి సుప్రభయును
విని తద్వాక్యములు మాని విభుఁ డపు డాత్మన్. 330

ఆ. ఏపు జవ్వనంబు రూ పొక్కటైయుండు
టాత్మసతులు వీర లనుచు నుండి
నేము నీసతులను గా మస్మదంశజ
లీ లతాంగులని రిదేమొ సతులు. 301

క. ఇంటికిఁ జని కనఁదగు వా
ల్గంటుల నీపలుకు లాత్మకామిను లింటన్
దొంటిగతి నున్న సత్యం
బింటను లేకున్నఁ గల్ల యిది దృఢ మరయన్. 332

ఆ. అనుచు నిశ్చయించి యతఁ డింటి కేఁగెను
వానికన్న మున్నె వనజముఖులు
నిజసమర్థతాప్తి నిలయంబులకుఁ బోయి
పవ్వళించియుండి రవ్విభుండు. 333

చ. వెసఁ జనుదెంచి యింట నళివేణులఁ గన్గొని తద్వధూవచో
విసరము సత్యమౌననుచు వేడుకఁగైకొని తప్పునిద్రలం

బసగలహంసతూలికలపాన్పులపై శయనించియున్న యా
త్మసతుల లేపి తొంటి వనితావిముఖత్వము మానె మానినీ! 334

తే. అరమరలులేని కూటమి నధిపుఁ డపుడు
కులవధూటుల నెంతయుఁ గుస్తరించి
పచ్చివగదేరు రతులతో నిచ్చనిచ్చ
లిచ్చకము పుట్టఁజేయుచు నెనసియుండె. 335

క. ఈమహిమ నీకుఁ గల్గిన
భూమివిభున్ రతులఁ గలయఁబొమ్మని హంస
గ్రామణి వినిపించిన విని
హేమావతి మెచ్చుకొని ఖగేంద్రుని కనియెన్. 336

తే. జనపతిని జేరఁబోనీక దినముదినము
కతలు చెప్పఁగ సాఁగితో కతలకారి!
చిన్ని రాయంచ! యిఁకనైన సెలవొసంగు
పోయివచ్చెద నన హంస పొలఁతి కనియె. 337

క. ఇరువది దినముల కింటికిఁ
బరతెంతునటంచు నీదుపతి చనుచో నా
కెఱిఁగించె రేపవశ్యము
బరతెంచునుగాన నీకుఁ బఱవం దగునే? 338

చ. నరపతిఁ జేర దర్శకరణక్రియలన్ దగఁ బ్రొద్దువుచ్చి ని
ద్దురగొనియైన రాజు నినుఁదోడనె పొయఁగలేనికూర్మి మం
దిరమున కేఁగు మంచనక నిల్సిన నిల్చుటలైన నింటిలో
దెఱవరొ! నీవులేమి నరుదెంచిన నీపతి కేమి దోఁచునో! 339

క. కావున భూవిభుఁ జేరం
బోవుట కార్యంబుగాదు పొమ్మింటి కటం

చా వనజాక్షికి హంసధ
రావరమణి దెల్పునపుడు రవి యుదయించెన్. 340

తే. అంత హేమావతియు హృదయాంతరమున
భూమివిభుమీఁది మోహంబు పొంగిపొరలఁ
బడకయిలు సేరి వేఱొక్క పగిది నుండె
నపుడు తత్పతి సహచరుం డరుగుదెంచె. 341

క. అదిగో! నీపతి వచ్చెన్
ముదమున నగరోపకంఠ భూమిని విడిసెన్
సుదతి! నినుఁ జూచి రమ్మని
పదరక ముందుగను నన్నుఁ బనిచెన్ వేడ్కన్. 342

క. అని చెప్పినఁ దద్వాక్యం
బనలశిఖాతప్తకీలమై చెవి నాటన్
ఘసభయ విస్మయ లజ్జా
తను హర్ష భరాదు లాత్మఁ దగిలిన వగతోన్. 343

ఉ. దిగ్గున లేచినిల్చి సుదతీమణి భూవిభుమీఁది బుద్దితోఁ
దగ్గుచు మ్రగ్గ నిగ్గు సిరి తగ్గని తామరమొగ్గదోయి బల్
జగ్గుల మొగ్గు లింపెసఁగు చక్కని చిక్కని గబ్బి గుబ్బలున్
సుగ్గడితంపుఁ బయ్యెదయు సొంపగు క్రొమ్ముడిఁ జక్క దిద్దుచున్. 344

ఆ. ఓడ బేరమాడ వేడుకఁ దానేఁగి
నదియు మొదలు శుభమె యందఱకును?
ననుచు బాంధవాది జనుల యోగక్షేమ
మడుగ భద్రమఖిల మనియె నతఁడు. 345

క. వెండియు నిట్లను మదవే
దండ లసద్గమనతో సుధారసధారా

పాండిత్య మండితోక్తులఁ
బండితమండలికిఁ జెవుల పండువు గాఁగన్. 346

క. జనపదములు పురగిరులున్
గనులు వనులు నదులు నిధులు కట్టల్ మిట్టల్
కనుమలు పేఁటలు తోఁటలు
మునుకొని కనుఁగొనుచుఁ బోయి మ్రోలన్ లీలన్. 347

సీ. ముజ్జగంబును బూతముగఁ జేయనగు ధౌత
వనభంగ గంగ యెవ్వనికి భార్య
దేవావనోత్సాహ దృఢకళాసందోహ
మున ముంచు చంద్రుఁ డెవ్వనికి సుతుఁడు
కడలేని సిరులీనఁగల రమా గజయాన
యలరారు నెవ్వాని యనుఁగుకన్య
బహుళ పద్మభవాండ పరిపాలనా ఖండ ,
వాత్సల్య శౌరి యెవ్వనికి నల్లు
తే. డట్టి నక్ర ఢులీ కుశీరాళి వాశ్చ
రావళీయాన కేళీ మహాబహూర్మి
మాలికా డోలికా పాళికా లసన్మ
రాళికోల్లాసి కలశవారాశి డాసి. 348

వ. సభయభ క్తి నమస్కారంబుఁ గావించి, తదుత్కట తటంబున. 349

సీ. జాతి విలాయతి సకలాతు మేల్కట్లు
కాబల పసకి ముఖాబులోవఁ
బైఠిణీ జర బాబు పసల గోడ సరాలు
మేలరబ్బీ మొకమాలు దిండ్లు
గోవ బూర్నీసు నిగ్గుల బిల్ల సంతన
బలుచీనీ హొంబట్టు ప్రగ్గములును

దగటు రుమ్మీ తాపుతా నవారు కసీదు
నేస్తు బందరు చీటి లస్తరీలు
తే. ఖాతువా జంబుఖాన మఖ్ఖా తివాసు
లరల సుగదాసుల బనాతు లమర దిండ్లు
కాంచనస్తంభములు రత్నకలశతతులు
వాళ్లులును గుజ్జుగుండాగు త్రాళ్లు మెఱయ. 350

క. హితవరులతోడ యుష్మ
త్పతి వేడుక విడిసి సకల పరిమళ వస్తు
ప్రతతులు మౌక్తిక విద్రుమ
వితతులు మొదలైన రస్తు వెలఁదీ! కొనియెన్. 351

విదేశముల నుండి దిగుమతియగు వస్తువులు

సీ. తళ్కుటద్దంపు నిద్దపు నిల్వుటద్దముల్
దంతపు దువ్వెనల్ తావులొల్కు
నత్తరు పునుఁగును నంబరు గౌళ క
చ్చూరముల్ నఖము గంబూర చోవ
జల్లి సవరములు జిల్లరసము కదం
బము గోవ జవ్వాజి పచ్చిపునుఁగు
కురువేరు పచ్చకప్పురము పన్నీరు బే
డెము మలాకెలు కుంకుమమును మంచి
తే. బుక్క కస్తూరి వీణెలు చొక్కటంపు
టగరు సంపెంగనూనెలు నాదియైన
మెచ్చఁగల దీవులందుండి తెచ్చినట్టి
వివిధ పరిమళ వస్తువుల్ వెలకుఁ దీసి. 352

సీ. గర్గరికలును బింగాండ్లు తాంబాణాలు
గిన్నెలు తంబిగల్ గిండ్లు స్నపన

పాత్రలు చట్లును బానపాత్రలు మేలు
చట్టువంబులు మంచి మట్టిగిండ్లు
సంపుటంబులు గొప్పస్థాలీలు తబుకులు
కంచముల్ తట్లు గంగాళములును
జెంబులు పడిగముల్ చిప్పలు హస్తావ
ళులు కంకణములు ఘంటలును గజ్జె
తే. లాదిగాఁ గల్గు దీవులయందు వెలయు
కంచరపు జాతి వగవగల్ మించఁ జేసి
నట్టి సామగ్రి బహు వెల ల్వెట్టి కొనియెఁ
గాంత! భూకాంతమణులకుఁ గాన్క జేయ. 358

తే. లేటి కొదమల వింతయౌ నేటి పునుఁగు
పిల్లుల జవాజి పిల్లుల బెట్టు రురుల
ముంగిస సివంగి జోణంగి యింగిలీషు
కుక్క గుంపులఁ గ్రోఁతులఁ గొన్ని గొనియె. 354

సీ. సింపంగి కావులు జందురు కావులు
వెలిపట్టు పుట్టముల్ వేఁట చాళ్లు
జిలుఁగు బొమ్మంచుల లీరలు నాచులు
నుదయరాగంబులు నుడుత వన్నె
లొప్పు ముయ్యంచుల పుప్పొళ్లు హొన్నంచు
వలువలు గరకంచు వస్త్రతతులు
ముత్తేల పందిళ్లు నుత్తర గోగ్రహ
ణములు నిగమగోచరములుఁ బద్మ
తే. పు లతికలు నిండువన్నెలు బొడలు పచ్చ
లును హరిణవళ్లు హంసవళులును రంగ
వళ్లు పొదలును సామంతపదులు ననఁగఁ
దనరెడు పసందు పటములు గొనియె వెలకు. 355



రగడ.
చౌకట్లు నొంట్లు బేసరులునున్ మొలకట్లు
రాకట్టు చుట్టుంగరములు బల్చేకట్లు
మురువు లొప్పు కిరీటములు మేటి తాళీలు
సరిపణలు మించులును సాటిలేని తురాలు
రంగుగల ముంగామురాలు నాభరణములు
నంగదంబులు మంచి హంవీర తాయెతులు
కంఠమాలికలు జిగిగల్టు చేకడియములు
కంఠసరములు బిరుదు గండపెండేరములు
నందంపు టుత్తరిగెలలరు చిఱుగజ్జియలు
కుందనపుఁ జక్కడము గుల్కు మణిఘంటలును
[3]మితి లేని వెల లిడిన మేఖలలు నందియలు
చకచకల్ గల జాతి సకలమణి నికరములు
నకలంక వర్ణ పట్టాంబర ప్రకరములు
పీతాంబరంబులును బేర్వడిన బురుసాలు
జాతి నీలాదులును సాలువులు చీనీలు
పచ్చపట్టులు తగటు పాగలును నంగీలు
నచ్చపు మెఱుఁగుగల యపురంగజేబీలు
బురుసకాసీలు మహముదులు నిరాసీలు
సరి సేయరాని హంసావళులు లాకీలు
మాదళంబులు వెన్నమడుగులు ముసజ్జీలు
చాదరలు పైఠిణిలు చక్కని కబాయీలు
నడరు చిళ్లాని తేంట్లమరు బుర్నీసులును
నడికట్లు మేఘవర్ణంబులును ద్రోపులుసు
మొకమాలులును సూర్యపుటములు బనాతులును
సకళాతులం దెలుపు చలికప్పడంబులును

  • ,

హొంబట్టు లోడీలు హొనకా దుకూలాలు
కంబావతులు డాలుగల్గు జిరబాబీలు
వింతవింతలుగాఁగ వెలసిన బవంతీలు
కాంతితతి వెదచల్లఁ గల్గిన సరంతీలు
దుద్దుకంబళ్లు చందువలు తివాచీలు
పద్దులకుఁ గైకొన్న బలుజంబుఖానాలు
ప్రతిలేని పట్టంచు పలురత్న కంబళ్లు
నతులితములైన చతురంగముల వల్వలును
తళుకు పగడపుఁ గోళ్లఁ దగు పట్టె మంచములు
కులుకు నెత్తావి కుంకుమపువ్వు తల్పములు
ఏకరంగి తలాట లిడు గోర లేజీలు
ఢాక చూపట్టు సురతాణి సింగాణీలు
కళలుదేరు పిరంగి కత్తులును జూరీలు
పొలుపొందు నందలపు బొంగులును గేడీలు
వీరికై కొనిన హరబ్బీకెలును వన్నియలు
పేరైన సూరత్తు పింగాణి గిన్నియలు
రాయంచ లైదు వర్ణములైన కీరములు
మాయురే యని యెంచ మరుపట్టు జీనీలు
చీర్ణంపుఁ బనుల మించిన పిరగి పీఠములు
నిర్ణయింపఁగరాని నిఖిల సద్వస్తువులు. 356

క. స్వరమండలములు కిన్నెర
లురజాబులు దండవీణ లురు జారుతరా
ల్వర రావణహస్తంబులు
మఱి తంత్రులు తంబురలు సమస్తము గొనియెన్. 357

వ. అయ్యవసరంబున. 358

భారతదేశ పుర గ్రామములు

సీసమాలిక.
రాయదుర్గము గుత్తి రాయవేలూ రానే
గొంది మాహురి కాశి గోలకొండ
ముంగిపైరిణి ఢిల్లీ ముళువాయ జాబురా
శాదు మఖ్ఖా మహామూదు మచిలి
బందరు సూరతు చెందరు గోవేరు
శ్రీరంగపట్నంబు జింజి కాంచి
బాదయు నౌరంగబాదు దౌల్తాబాదు
కప్పర గాగర గదగు బిదరు
కోట కల్యాణము గొందాన మహాముదా
సగరంబు బంగాళ నరవ గోన
పన్నాళ చదరంగపట్నంబు గలగర
గజరాజధాని బంగాపురంబు
కాంబాగర ప్రయాగ ద్వార కాయోధ్య
లక్ష్మీశ్వరంబు షోలాపురంబు
మధుర కొల్లాపురి మగధ మా యావంతి
కా పురాణపురముల్ కాబలగయు
నాదవేని కళింగ మాదూరు వినుకొండ
కొండవీడును నేలకొండపల్లి
పొదిలి తంజాపురం బుదగిరి కైసూరు
మైసూరు పెనుగొండ మంగళగిరి
బసువపట్నము సీర్సి భద్రాచలము పాల
పంచ నిజాంపురి వందవాసి
కుందుర్తి బెల్లంకొండ దేవరకొండ
రాచర్ల మునిమడ్లు రాయపురము

సైదాపురము గోవ సాళ్వాక దూపాడు
రాపర్తి మాచెర్ల రాచవీడు
బనగానిపల్లె కంబము పోరుమామిళ్ల
ధారాపురము చీని తాడిపర్తి
నంద్యాల చిరువళ్ళి నందవరము కందు
కూరు రామయపట్న మారుబండ
హంపి విరూపాక్ష మారణి వెంపల్లి
కాంపిల్యనగరంబు కందనూరు
కడప సిద్దవటంబు గండికోట కసూరు
సింహాద్రి పుట్లూరు చింతకుంట
గయ చెన్నపట్నంబు గండవరం బోరు
గల్లు దామెనచెర్వు వెల్లటూరు
కల్లూరు కలువాము నెల్లూరు వేలూరు
రాచూరు చడుమూరు రాచకొండ
కదిరి కూటాగుళ్ల గంగేరు శృంగేరు
రామళ్లకోట వజ్రగిరి నొసుము
సూగూరు చోబాడ బాగూరు కొళ్ళాల
గుడిబండ బళ్ళారి కొత్తకోట
గుమినేనిపాళెంబు గొబ్బూరు బళ్ళాపు
రము పుంగనూ రౌకు రామటెంకి
మాసవ కౌతాళ మానుకొండైనూరు
జలవూరు పెదవలి జల్లికోట
కుంభకోణము కోటకొండ తంజావూరు
పెరవలి దువ్వూరు బెంగళూరు
నొత్తూరు చిత్తూరు హుణి తిర్చనాపల్లి
రాజనోల్ గద్వాలు రాచనగరు
తిరుతని కాళహస్తి సినూరు మధ్యార్జు
నము తిరునామల నాముకొండ



పాకల కావేరిపాక మోహనగిరి
చదుకూరు మల్లూరు చాదుకొండ
పాగొండ వావిలి నాగోలు తాళ్లూరు
మైలాపురము పెద్దమంగళంబు
రామసముద్రంబు రామాపురము జట
ప్రొలూరు వెల్లారి భువనగిరియు
హర్పణహల్లి కొండాపు
రము గౌరి మాయలూ రమరవీడు
నడిగల్లు కొక్కల్లు కడవకొలను రత్న
గిరి వెలిగోడు తంగెళ్ల దర్శి
కంగొంది తరిగొండ గడవనెత్తము దూసి
శివనగ ళ్ళలవంది సింహళంబు
మన్నారుకోవెల సొన్నగలు చిదంబ
రము వాగె నగరి పురాణపురము
నడియారుపాళెంబు నుడిపి సుబ్రహ్మణ్య
ముజ్జంగి మండువా హొసవగళ్లు
రామనాథపురంబు మాముగోళ్ల బెడంద
ధర్మవరంబును దాడిగోళ్ల
మవణికె మందము మారికాపురి కుంభి
హారంగ ముజ్జారి హళికెహళ్ళి
రెట్టిహళ్ళి కురంజి రేపణి సన్నక్కి
పామూరు కనిగిరి పాలువాయి
రామచంద్రాపుర మామూరు బెజవాడ
కొండూరు కాండూరు కోటకొండ
తే. మొదలుగాఁ గల్గు జనపదమ్ములను దుర్గ
ములను బేఁటలఁ బాళేలఁ బురుల వెలయు
వర్తకులు వచ్చి రచ్చటి వస్తుతతులు
బేరసారంబు లాడెడు పేర్మి మెఱసి. 350

క. ఆరీతి వచ్చువారల
కారయఁ దాఁ బిన్నపెద్దయై నీ విభుఁ డిం
పారఁగ వస్తువు లన్నియు
బేరము పొసఁగించి చేసి వెల కిప్పించెన్. 360

ఉ. అంచితబుద్ధి వర్తకజనావళి కిట్లు సమస్తవస్తు లి
ప్పించి తదీయభూములకు వేడ్కఁ జనుండని వారి నెల్ల నం
పించి వృషోష్ట్రవాజిరథబృందముపైఁ దనకొన్న రస్తుఁ బొం
దించి సమిత్రుఁడై యరుగుదెంచెను నీ విభుఁడూరు చేరఁగన్. 361

వ. అనిన విని హేమావతీకాంత సంతోషంబున భోజనాదుల సంతుష్టుఁజేసి తన యోగక్షేమంబులఁ బతి కెఱిఁగింపు మని యతని నంపి తదనంతరంబ. 362

తే. కథలు రేల్ తెల్పుటయే కాదు కరుణఁ బ్రొద్దు
పోనియపుడెల్ల రాయంచ పూని చెప్పి
నట్టి నయవాక్యముల చేతనైన సన్మ
నీష హేమవతి మంజుభాష యపుడు. 363

క. పరపురుషసంగమం బిహ
పరసుఖదూరంబు గానఁ బాతివ్రత్య
స్ఫురణగల సతులు మదిఁ గో
ర రటంచును నిశ్చయించి ప్రమదంబెసఁగన్. 364

తే. చిత్రభోగునిపైఁ బ్రేమ చిందఁ జేసి
నిజవిభుని రాక కలరి యన్నీరజాక్షి
తనదు గృహకృత్యములు దీర్చుకొనుచు నుండె
నంతఁ దత్పతి యింటికీ నరుగు దేర. 365

క. కుందనపు బిందియల హరి
చందన తరుఖండ వహ్ని సంతప్తంబై
క్రొందావు లొల్కు పన్నీ
టం దగ జలకం బొనర్చి తడయక యంతన్. 366

ఉ. ఆ జవరాలు కీలుజడ నంబురుహోత్పల కేసరాలు వ
క్షోజధరాలఁ గప్పుకొను క్రొమ్మగరాల సరాలు నంగుళీ
రాజ వినూత్న రత్నముల రంగు చెలంగెడి యుంగరాలు వి
భ్రాజిత నూపురాలు పదపద్మములన్ సవరించి వెండియున్. 367

సీ. వనచరంబులు గాన వచ్చె మైత్రికి నన
వేణి కాళిశ్రేణి విరుల దుఱిమి
నీటఁ బుట్టిన వోట నెమ్మిడాసె ననంగ
గళ శంఖమున హారములు ధరించి
జలజంబు లౌటనె చెలిమిఁ జెందె ననంగఁ
గర వారిజములఁ గంకణము లుంచి
సారంగజము లౌట సఖిత నొందె నన వ
క్షోజ కుంభములఁ గస్తూరిఁ బూసి
తే. కనకరుచులౌట మిత్రత ననఁగి పెనఁగె
ననఁగ దను హేమలతను మిన్నగు పదాఱు
వన్నె బంగారు పువ్వుల వలువఁ దాల్చి
పతికి నెదురుగ నేఁగె నప్పద్మగంధి. 368

వ. ఆ సమయంబున. 369

సీ. మిసమిస చూపులు మిరుమిట్లు గొలుపంగఁ
గిలకిల నవ్వులు చెలువొనర్ప
ఘలుఘల్లుమని చిఱుగజ్జెలు రొద సేయ
దళధళ ద్యుతులఁ గమ్మలు చలింప



ఝణ ఝణం కృతులఁ గంకణములు మెఱయంగ
ఘనఘన ధ్వనుల మేఖల నటింప
ధగధగద్దీప్తి రత్నపు సొమ్ము లలరార
నిగనిగ బావిలీల్ నీటుసూప
తే. భుగభుగలు గల్గు మైపూఁత సొగసు గుల్క
గమగమలఁ గప్రపు విడెంబు గంధ మొలయ
మినమినల్ కుంకుమపు రేఖ మించులొల్క
ఖణిఖణిల్లని మెట్టియల్ కడు రహింప. 370

క. తన కెదురుగ వచ్చిన తన
వనితామణి నపుడు చూచి వదనాంభోజం
బునఁ జిఱునవ్వొలయఁగ నె
మ్మనమున నానందమొందె మానిని యంతన్. 317

తే. విభుని పదములు పన్నీట వేడ్కఁగడిగి
నెచ్చెలులతోడ వెస నివాళిచ్చి వైచి
యింటిలోనికిఁ దో డ్తెచ్చి యింతులెంచ
భర్తతోఁ గూడ నతిసుఖప్రాప్తి నుండె. 372
వ. అంత హేమావతీకాంత వృతాంత మంతయు నాత్మీయదూతి విన్నవించిన విని కంపితశిరస్కుండై కొంత తడవు చింతించి, మహారాజచంద్రుండును నీతిజ్ఞుండును నకళంకుడును వివేకధురంధరుండును గావునఁ జిత్రభోగనృపాలుండు దన మనంబున. 373

ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులఁ గోరి యేమి సౌ
ఖ్యోన్నతిఁ జెంది రిట్లగుట నుర్విజనావళు లన్యకాంతలన్
బన్నుగఁ గోరరాదు కడుఁబాతకమంచుఁ దలంచి యింతిపై
నున్నమనంబు ద్రెక్కొని యథోచితపద్దతి నుండె భూవరా! 374

క. అనుచుఁ బురోహితుఁ డెఱిఁగిం
చిన నలరాజన్యమౌళి చిత్తాంభోజం
బున నద్భుత ప్రమోదము
లెనయఁగ మెచ్చుకొని రాజ్యమేలుచు నుండెన్. 375

మ. నత సంజీవన! జీవనేశ భయకృన్నారాచ! నారాచర
వ్రత బృందారక! దారికత్యన పదారక్షోభి రక్షోభట
శ్రుత సంధారణ! ధారణార్హమణి భాసుగ్రీవ! సుగ్రీవము
ద్ధతలాలాపన! లాపనద్యుతి చితా తారాప! తారాపహా! 376

క. అక్ష ద్విడ్లక్ష క్షి
ప్తక్షేమ కటాక్ష దక్ష! దక్ష తనూజా!
ధ్యక్షనుత పక్ష! పక్ష
ప్రక్షుణోర్క్ష్.మ విపక్ష రక్షా శిక్షా! 377

స్రగ్విణి
పద్మ పత్రేక్షణా! భక్త సంరక్షణా!
పద్మ గర్భస్తుతా! భాను బింబస్థితా!
పద్మ బాణాకృతీ! భవ్యశౌర్యోన్నతీ!
పద్మ సర్వేశ్వరా! పాలితోర్వీశ్వరా!

గద్యము
ఇది కౌండిన్యసగోత్ర పవిత్రాయ్యల రాజాన్వయ సుధావార్ధి పూర్ణిమాచంద్ర
నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర శ్రీరామనామ పారాయణ
నారాయణామాత్య ప్రణీతంబైన హంసవింశతి యను
మహాప్రబంధంబునందు సర్వంబును
బంచమాశ్వాసము.

  1. యతిభంగము
  2. యతి దుర్బలము
  3. ఈ పాదమునకు జతగా మటొక్క పాదము ఉండవలెను. లేదు.