హంసవింశతి/నాల్గవ రాత్రి కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రహి గుబ్బలుల నిబ్బరము ద్రొబ్బఁగల గుబ్బ
కవమీఁది పైఠిణి ఱవిక మెఱయ
తే. బళుకు బళుకున గతులయం దళికి బెళుకు
కులుకుఁ గౌనున జాళువా తళుకు లొలుకు
మేటి యొడ్డాణ మలరార నీటుఁ బూని
వచ్చి రాయంచకడ నిల్చె వనరుహాక్షి. 4

వ. ఇత్తెఱంగున నిరుపమ శృంగారతరంగితాంగయై రాజపుంగవసంగమార్థం బరుగుచుఁ దనచెంగట నిల్చిన యా రాజాననావతంసంబునకు రాజహంసం బిట్లనియె. 5

నాల్గవరాత్రి కథ


తొగట మగువ పారుపత్తెగానిఁ గూడుట


క. గమ్మత్తు చిమ్మ నొక కథఁ
గ్రమ్మఱఁ దెల్పెదను వేణిఁగ్రమ్ము విరులపైఁ
దుమ్మెదలు జుమ్ముజుమ్మనఁ
గొమ్మా! తలయూఁచి మెచ్చుకొమ్మా? నన్నున్. 6

వ. అని యిట్లు చెప్పఁ దొడంగె. 7

క. కల దభ్రంకష కేతన
చలదభ్రం బైన చైత్రశక మను పుర ము
జ్జ్వల దభ్రకచా దర్శన
దలదభ్రపురీ సుపర్వదారోదరమై. 8

సీ. వేద శాస్త్ర పురాణ విద్యాగరిష్టులై
విలసిల్లుచుండెడి విప్రవరులు

.

గరిడిలో నెఱ హొంతకారులై సాముల
మీఱిన రాజకుమారమణులుఁ
గోటికిఁ బడగెత్తుకొని యున్న టెక్కెముల్
బెక్కులై వర్ధిల్లు బేరిజనులు
గడు ధాన్యరాసులు గగనంబుతో రాయు
కలిమిచే ముంచిన కాఁపు ప్రజలు
తే. భూరి మదధార లూరెడి వారణములు
ధాటిపాటవమున నొప్పు ఘోటకములు
ఘోరరణరంగపటులైన వీరభటులు
బ్రబలి యుండఁగ వెలయు నప్పట్టణంబు. 9

క. ఆ పట్టణంటు లోపలఁ
జూపట్టును దంతువాయ చూడామణి రే
ఖాపట్టభద్రుఁడై సిరి
నేపట్టున నోరపోర మింతయు లేకన్. 10

నేతగాని యిల్లు


సీ. కుంచె మగ్గపుగుంత గూటంబు పగ్గంబు
పంటె త్రొక్కుడుపట్టె పలక దోనె
పరిపరియచ్చులు చరికుండ యూడిత
చీడు డబ్బలు దండె నాడె క్రోవి
కోఁతిపుల్లలు నాల్క కుడుతరి కొయ్యలుఁ
జొప్పయూఁచలు గోఁతచూఱకత్తి
కారంపుఁ బడుగులు గండెల కప్పెర
గోలెము లాకలు నీలికడవ
తే. గంప డొల్ల కలాసంబు కదురు చెమికె
నూలురాట్నంబు జాలంబు గ్రాలు గోడ

మఱల నాశుభభద్రు నివాసభూమి
యప్పురంబున సంతతం బొప్పుచుండు. 11

తే. గొప్పకన్నులు చిఱునవ్వు గులుకు మోము
బవరిగడ్డము చక్కనై పరగు ముక్కు
నెగుభుజంబులు విపులత్వ మెసఁగు ఱొమ్ము
జిగి మిగులు లీలఁ గనుపట్టుఁ దొగటసెట్టి. 12

ఉ. ఆఁటది నేర్పుతో నగల యందముఁజందముఁ జూపఁబూని కో
లాటము చేయు కైవడిని లాలితదృక్తరళప్రభావళుల్
పాటిగఁ బోఁగు వెంబడిని బార్శ్వములం జరియింప వస్త్రముల్
ధాటిగ నేయు నప్పలుక తట్టున బెట్టు ఖణిల్ఖణిళ్లనన్. 13

తే. అరవిరుల తేనియల చాలు మరునివాలు
మిసమిసలప్రోలు వలరాజు మేటిరాడాలు
మురిపెముల మెచ్చుకొనఁజాలు ముద్దరాలు
వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. 14

ఉ. దాని ముఖప్రఖాగరిమ దాని కపోలకళావిశేషముల్
దాని బెడంగుచూపులును దాని కుచంబులఁ జెందు నందమున్
దాని వచోవిలాసములు దాని కచాళిరుచుల్ గణింపఁగా
మానవతీలలామ! విను మర్త్యు లమర్త్యులు నైన శక్తులే? 15

క. జిగిఁజిలుకు కులుకు గుబ్బలు
నిగనిగలు చెలంగు నెఱులు నిద్దపుఁ గన్నుల్
నగవు దళుకొత్తు మోమును
మగువా! యాబిడకె కాక మఱి కలదటవే? 16క. తొడలందము కటిచందము
నడుగుందమ్ముల బెడంగు లాస్యము రంగుల్
జడతళుకున్ మెడకులుకున్
నడబెళుకున్ జూడ నాఘనస్తని కమరున్. 17

తే. చిన్నచీమల నునుబారు చెలువయారు
కదళికాకాండముల మీఱుఁ గాంతయూరు
లందములఁ జెందు రతిఁగేరు నతివసౌరు
దానికెనయైన నారు లిద్ధరణి లేరు. 18

క. కందర మా చెలిపొక్కిలి
కంద రమా విలసనములు కచములు, రదముల్
కుంద రమా సమములు నా
కుం దరమా? పొగడ నల కుకుందరసుకటిన్. 19

సీ. మిళదంబు జలదంబు బలుడంబు చెలువంబు
దులకించు నమ్ముద్దుఁగలికివేణి
సిరిపట్టుగల గట్టుజిగిగుట్టు వెలిఁబెట్టు
చెన్నారు నక్కన్నె చన్నుదోయి
నునుకందు పైఁజెందునని యిందురుచిఁ గ్రించు
పఱుపఁగాఁ జాలు నబ్బాలమోము
తెలిదమ్ములను గ్రమ్ము కళఁ జిమ్ము ననయమ్ము
మిన్నయౌ నబ్బోటి కన్నుఁగవయుఁ
తే. దావి తేనియబావి యందముల దీవి
మావి చిగురుచెంగావి మారుఠీవి
కప్పురంబుల క్రోవి యక్కాంతమోవి
యనుచు వినుతింప నానేఁతవనిత యలరు. 20తే. పరిమళ మెసంగు బంగారు ప్రతిమవంటి
తొగటవాల్గంటి జిగినీటు తొలకరింప
సొగసుకొండకు మోహరాసులు జనింప
నూర నొకయోరఁ జెలువార బారసాఁచి. 21

సీ. పోఁగువెంబడిఁబర్వి పొల్బు వాల్చూపుల
ధళధళల్ పూదండకళల నీనఁ
బుంజంపుఁ గట్లు దెంపుటకుఁ బర్వెత్తుచో
మట్టెల ఖజఖణల్ బెట్టు మ్రోయఁ
గేలెత్తుచో బాహుమూలజాతప్రభా
చకచకల్ పైఁడి వసంతమాడ
బరిటఁ ద్రిప్పఁగ జాఱు పైఁటలోఁ గన్పట్టు
గుబ్బల మిసమిసల్ ద్రొబ్బులాడ
తే. వింతవగ కప్పునెఱిగొప్పు వీడ మెఱయు
నిగనిగల్ జాతినీలాల నిగ్గునింపఁ
గుచభరంబున నడుము కొంకుచు వడంక
నూలు దోడును వేడ్క నవ్వాలుఁగంటి. 22

చ. కరములఁ గంకణాళి ఘలుఘల్లన రాట్నముఁ ద్రిప్పువేళఁ బైఁ
టరదిగజాఱ వెల్కుఱుకు నబ్బురపున్ వెలిగబ్బిగుబ్బపై
సరు లిసుమంత చిందుగొనఁ జక్కనిచూడ్కులుచూచువారి పే
రురమైన గాఁడ నవ్వెలఁది యోర్పునఁ గండెలుచుట్టు నేర్పునన్. 28

ఆ. పడుగుఁజేయువేళఁ బటములల్లెడువేళఁ
గూడుదినెడువేళఁ గూర్కువేళ
మగని కన్మొరంగి మార్మగలను గూడు
నింటిపొరుగుసఖుల యిండ్లలోన. 24క. గడిదేఱి జారవిద్యకు
వడిఁగట్టి దురంతకంతు వనజశరార్తిన్
బడఁజాలనికతమున నా
వడువున నత్తొగటబోటి వర్తిలఁదొడఁన్. 25

వ. ఇత్తెఱంగున నత్తెఱవ చిత్తజాయత్తచిత్తయై వర్తింపుచున్న సమయంబున. 26

సీ. నొసలిపైఁ జుక్కలమిసిమి నామపురేఖ
లనువొంద భుజముపై నసిమిసంచి
వాలువీనుల గాజునీలాల పోఁగులు
పై నొప్పు పప్పళి పచ్చడంబు
మెలిగొనఁ జుట్టిన తలపాగ చెఱఁగుంచి
పైఁటపేటాచుట్టు పట్టుశాలు
కడిఁది మీఱఁగఁ జతనిడిన బొట్టియకోల
డాక మ్రోసెడు డుబుడక్క కేల
తే. వఱల దిక్కులనెంచి దుర్వారమైన
కిీడుమేలును దెల్పుచుఁ గేక లిడుచుఁ
గెర్లికొనుచును దనపేరు కేరికొనుచు
వచ్చె నచటికి డుబుడక్కి వాఁడొకండు. 27

ఉ. ఆ డుబుడక్కివానికి రయంబున భిక్ష యొసంగ నేత్రపూఁ
బోఁడి ప్రకోష్ఠకస్థలికిఁ బోయి తనున్ గొనియాడువాని నా
మ్రేడితసూక్తి పైఁబెదవిమీఁదను లేనగ వంకురించి చిం
దాడఁగ ముష్టిఁబెట్టి బహిరంగణభూమిని నిల్చియుండఁగన్. 28

సీ. మెలిఁబెట్టి చుట్టిన తెలిపైఠిణీపాగ
చెవిసందిపాగలోఁ జెక్కు కలముఁదొడిగిన నెఱచల్వ నడరు నంగీజోడు
జీరాడు నడికట్టు చెఱఁగుకొనలుఁ
బదతలంబుల నెఱ్ఱవాఱు పాపోసులు
టెక్కుగాఁ జంకఁ జీటీఖలీతి
నడికట్టులో మొలనిడిన కలందాను
హస్తాగ్రమున వ్రేలు దస్తరంబు
తే. మించుబాహువుమీఁదఁ గాశ్మీరుశాలుఁ
జెవుల ముత్యాలపోఁగులు చెలువుదనర
నలఁతి నీర్కావిదోవతి యమర నటకుఁ
బారుపత్తెంబు సేయు వ్యాపారి వచ్చె. 29

తే. వచ్చుచుండెడి వ్యాపారి పెచ్చువగలు
మెచ్చి యచ్చలి తమి హెచ్చి రచ్చ సేయఁ
బగటు వగమీఱఁ గోర్కులు బారుదీరఁ
బొగరుఁ జూపులతోఁ బడావగలఁ జూచె. 30

ఉ. చూచినయంతలో మరుఁడు చొక్కపుఁ గప్రపుటాలపుంటలన్
లేఁజివురాకుఁగ్రోవి నల లేమ పయోధరచక్రవాకముల్
వే చలియింప హృత్పుటము బీటలువాఱఁగఁ దెప్పు తెప్పునన్
గోఁచిలఁదాఁకనూఁది మదిగోలుపడన్ వడినార్చి వ్రేసినన్. 31

క. ఊహలు కుత్తుకబంటై
మోహము తలమునుక లగుచు ముద్దియ మదిలో
బాహాబాహి కచాకచి,
కూహకమతిఁబట్టి పెనఁగి, కోయనుచు వడిన్. 32

తే. అంత నయ్యింతి యింతింత యనఁగరాని
వంత మదిఁగొంత చింతించి కంతు నిశితకుంతహతి కోర్వలేక దినాంతవేళ
మంచనంబున వెడలి గేహాంతరమున. 33

చ. ఉరిసిన పల్లవెండ్రుకలు నూడినదంతము లంబకంబులం
గురిసెడు బాష్పజాలములు గూను వడంకెడు మస్తకంబుఁ గల
ధరఁదగుతోలు పాదములు దర్శనముల్వడి చీరపోతు నూ
ల్మెఱసెడు మంత్రసానిఁ గని మించెడువేడ్క నుతించి మ్రొక్కినన్. 34

ఆ. ఆలకించి లేచి యది యెవ్వరని చీరి
యమ్మ! నీవఁటే యఁటంచుఁ బొదివి
యేమిపనికి వచ్చి తీసందెవేళలో
ననుచు నడుగఁ దొగటవనిత పలికె. 35

ఉ. ఆరయ నిమ్మహాపురికి హాసము మీసముమీఁదఁజిల్క వ్యా
పారియొకండు నిండు రతిభర్తను బోలినవాఁడు వచ్చె, నే
నా రసికాగ్రణిన్ గదియునాస వహించితినమ్మ! వానితోఁ
గోరిన పొందు నాకు నొనఁగూర్చిన నీ కొనరింతు సంపదల్. 36

సీ. నవురైన రతనాల బవిరికమ్మల నిత్తు
నవి నీకు మనసురా వంటివేని
యాణిముత్యమ్ముల హారమ్ము లొసఁగుదు
వానిపై నీ కిచ్చ పూనదేని
గరుడపచ్చల కీలు కడియంబు లర్పింతు
నందుకు నీ యాస చెందదేని
తళుకుఁ గెంపుల సందిదండలు చెల్లింతు
వానిపై నీబుద్ధి యానదేని
తే. సూసకము తీఁగ మెడనూలు సొబగునాను
గుండ్లపేరును గైకాన్క కోరి సేతు

నమ్మ! నా విన్నపంబు నీ వాలకించి
వాని ననుఁ గూర్పు నీ నేర్పు పూని మెఱసి. 37

మ. అనుచున్ వేఁడిన మంత్రసాని విని నెయ్యంబారఁగాఁ బల్కె నో
ననఁబోఁడీ! నినుఁజూడ మన్మథునకైనన్ మోహముల్ పుట్టఁగా
మనుజుం డీతఁడు భీష్ముఁడో సనకుఁడో మౌనీంద్రుఁడో వ్యాసనం
దనుఁడో యెంతటివాఁడు వీఁడనఁగ బందాకోరుఁగాఁ జేసెదన్. 38

క. సొనమందు రసముఁ బసరును
ఘనమణిమంత్రౌషధములుఁ గైకర్ణిక కా
వును మగసిరిక్రియ బంతిబ
దనిక గుళికె మూల్కె బూతిఁ దవిలిచి దెత్తున్. 39

వ. అని చెప్పి వీడ్కొల్పిన. 40

క. తన యింటికి హేమంతిని
చనె నానిశిఁ గడిపి మంత్రసాని రహస్యం
బునఁ బారుపత్తెగాఁ డుం
డిన చక్కికిఁ బోయి మ్రొక్కి నిపుణత మెఱయన్. 41

సీ. దాక్షిణ్య మనురక్తి దయయు విశ్వాసంబు
బాంధవ్యము హితంబు భయము భక్తి
యంతఃకరణము సఖ్యంబుఁ బోరామియు
నేస్తంబుఁ జెలిమియు నెనరుఁ బ్రేమఁ
జల్లఁదనంబు వాత్సల్యంబుఁ గలుపుగో
ల్తనముం బ్రీతియు మంచితనము మైత్రి
ప్రాణపదంబుఁ దాత్పర్యంబు గారాబ
మనుగుణ మనుబంధ మనుసరింపుతే. మచ్చికయు; జుట్టఱిక మైక్య మిచ్చకంబు
స్నేహ మనురాగ మాసక్తి మోహనియతి
సలిపి కడుఁ చక్కె ననిపించి సొలయఁజేసి
నెగడుపడ కప్పు దాత్మప్రవీణ మహిమ. 42

చ. స్తుతులు ప్రసంగముల్ కథలు సుద్దులు వార్తలు రాచకార్యముల్
చతురతరేతిహాసములు శాస్త్రములం దగు జాతిగాథలున్
సతకడముల్ పురాణములు సామెతలున్ బరిహాసకంబు లిం
గితములు జారజారిణుల కేళిచరిత్రములన్ వచించుచున్. 43

ఉ. దేవ? పరాకు, హౌసుకళఁ దేఱెడు నీ దగు రూపవైభవం
బే విధినో కనుంగొన రతీచ్ఛకుఁ బాల్పడి చిక్కి సొక్కి నీ
సేవయ చేయఁగోరి నిను శీఘ్రమె రమ్మని చెప్పి పంపె నో
రావణరూప! యా తొగటభామిని కామవికారచిత్తయై. 44

తే. హత్తుకొనవచ్చు నీవంటి యందగాని
కట్టి ముద్దుగుమ్మను గుట్టుతోడ
ననిన మనసిచ్చి మదిలోన హర్ష మెచ్చి
మంత్రసానికి విడెమిచ్చి మమత తోడ. 45

క. ఆ పనులకె యేఁకారెడు
తాపము గలవాఁడు గనుకఁ దగనాతఁడు ని
క్షేపముఁ గనిన దరిద్రుని
యేపున ముదమంది దాని కిట్లని పలికెన్. 46

ఉ. అచ్చటి కేను వచ్చు సమయంబగువేళ యెఱుంగఁ దెల్పినన్
ముచ్చటఁ దీర్తునంచు ముది ముద్దియతో వివరించి పంపగాఁ
నచ్చెలి తంతువాయ కులటాంగన చెంగట నీ ప్రసంగముల్
చెచ్చరఁ జేయు నత్తఱిని సెట్టి దుకూలము లమ్ము వేడుకన్. 47

సీ. కల సమీపపుటూళ్ళ కాఁపుగుబ్బెతల నె
మ్మదుల నాకర్షింప మంత్రవిద్య
బచ్చుఁ జాయపు వృషభవ్యూహములనెల్ల
వఱలంగ గుమిగూర్ప వల్లెత్రాడు
చిల్లరసరకుల సెట్టి బేరాల కిం
పుగ లాభమొందింపఁ బూఁటకాఁపు
పెనుకోటకాండ్రకు జనసమూహంబుల
గణితి చూపెడు నాయకప్రభుండు
తే.ముద్రగరిఁటియ భుజముపై మొనయఁబెట్టి
ఘంట ఖంగని మ్రోయ సంగళ్ళఁ బడిని
మరగి తిరుగు సళాదికి మణియకాండ్ర
కవనిఁ బడికాఁపునా వింత నలరు సంత. 48

క. అంతట నాసంతకుఁ దన
కాంతుఁడు వస్త్రమ్ము లమ్మఁగా నేఁగిన హే
మంతిని వ్యాపారి విటో
పాంతమునకు మంత్రసాని నడిపిన నదియున్. 49

తే. పోయి సమయంబుఁ దెలుప నబ్బొజుఁగు వేడ్క
వింత నెఱపూఁత గందంబు విరులు సరులు
కప్రపు విడెంబు జిగిచెల్వు గులుక సొగసుఁ
దనర హేమంతి యిలు సేరెఁ దత్క్షణమున. 50

ఉ. చేరినఁ దంతువాయసతి సిస్తుగ నిస్తుల రత్నవస్తు వి
స్తా సువర్ణవర్ణముల సంపద లింపొనరించు కేళికా
గారములోన దివ్యమగు కమ్మనితావుల హంసతూలికం
జేరిచి మేరమీఱు తమిఁ జీరగ మారుని పోరి కయ్యెడన్. 51

చ. త్వరపడి గబ్బిగుబ్బకవ వాఁడి నఖంబులఁ జీరి చీరి పై
సిరి తళుకొత్త తేట నునుఁజెక్కులు ముద్దులు వెట్టివెట్టి వా
తెఱ మొనపంటికొద్ది కసిదీఱఁ జుఱుక్కున నొక్కినొక్కి యీ
కరణిఁ బరస్పరంబు జయకాంక్ష బెనంగఁగ నింతి పై కొనెన్. 52

సీ. చిటిలెడు గందంబుఁ బెటిలెడు కస్తూరి
చలియించు రత్నకుండలయుగంబు
గదలెడు నెఱివేణి వదలెడు పువ్వులు
జెమటఁ గరంగు కుంకుమపుబొట్టు
వికసించు కన్నులఁ బ్రకటించు మణితముల్
కంగణ ఝణఝణత్కారరవముఁ
బొదలెడు చనుదోయి కదలెడు హారముల్
ఘననితంబాఘాతనినద మడర
తే. నిటల సంచల దలక ముత్కటసఖాంక
మమిత నిశ్శ్వాసమారుతం బతనుగేహ
[1]దర్శనోత్సాహి పతిచపేటప్రదాయి
యైన పుంభావసురత మయ్యతివ సలిపె. 53

వ. మఱియు నయ్యుపరిసురతంబు తమి యెక్కువయై దృఢకుచాశ్లేషంబు విడువఁజేయంజాలక శీతకాలంబును బ్రకటీకృతతారకంబును సంశ్లిష్టప్రియతముంబును గావున నిశాసమయంబును సంచలితపయోధరంబును నిర్గళితకృష్ణవేణ్యాది కమలంబుఁ గావున శరత్కాలంబును బల్లవరాగసంపాదకంబును గలకంఠకూజితంబునుం గావున వసంతకాలంబును ధ్వనిప్రధానంబును గలితవిశ్రమంబును గావున సత్రబంధంబును గళితవసనంబుసు బహుబంధబంధురంబును గావునఁ బ్రబుద్ధసిద్ధమార్గంబును బోలి వెలయుచుండె. 54

"

ఉ. ఆ సమయమ్మునన్ జెమట లాస్యముఁ గప్పఁగ నిండు బళ్ళికల్
గాసిలఁ జేయఁగాఁ గబళకాంక్షకు జీవము వేగురింప, ని
శ్శ్వాసము బారుఁదీర నిజవల్లభుఁడౌ శుభభద్రుఁ డట్లు సం
వాసముఁ జేరవచ్చి తలవాకిలిఁ దీ యని పిల్చె వల్లభన్. 55

తే. అప్పు డేరీతి నుపనాథు నవల కనుప
సుందరీ! యే యుపాయంబుఁ జూడవలయు?
జాణవౌదువు జారవాంఛలకు నైతె
తెలుపు మని పల్కెఁ గలహంస దేవవిభుఁడు. 56

క. అని యడిగిన హేమావతి
విని దీర్ఘోచ్ఛ్వాస మొనర విడిచి నిజాంఘ్రిన్
గనుదృష్టి నిలిపి మెల్లన
మునివ్రేలన్ నేలగీచి మునుకొని పలికెన్. 57

క. తెలియ దెటు పనుపవలెనో
పలుమఱు నే బ్రహ్మలోకపర్యంతంబున్
గలయ వివరించి చూచితి
నలవడ దది నీవె తెలుపు హంసబిడౌజా! 58

క. అని యడిగిన హేమావతి
కనురాగం బొప్ప రాజహంసం బనియెన్
వినుము నిజాధిపుఁ డటువలెఁ
దనుఁ బిలిచిన యువతి లేచి తరలక ప్రీతిన్. 59

క. పిలిచిన గుండె లొటుక్కనఁ
గలఁగుచు వ్యాపారి వెడలఁగా నెటు లనుచున్
దలఁచినచో వెఱవకు మని
నిలిచిన దార్ఢ్యమున మానినీమణి వేడ్కన్. 60ఉ. అత్తఱి చిత్తలై ఘనముదాత్తసుబిత్తపుమత్తుపొత్తుతో
బిత్తరి తత్తలం పరయ పేర్కొని వాకిలిఁ దీసి, వేగమే
చిత్తజువంటి నాయకుని చెంతను నిల్చి తదీయనేత్రముల్
మెత్తనిచేత మూసి దయ మించఁగఁ దోడ్కొనివచ్చెఁ జెచ్చరన్. 61

ఉ. ఆ వగఁ జూచి యవ్విట మహామకరాంకుఁడు చిత్తవీథిలో
నౌ వగమాని మానిని నయంబొదవం గనుసైగ చేసినం
దావగు చోటి కేఁగెఁ దదనంతర, "మక్షు లివేల మూసితే?
పోవఁగరా" దటంచుఁ బతి ముద్దియ నిట్లడిగెన్ బ్రియంబునన్. 62

తే. అటుల నడిగిన ప్రియభర్త యంబకముల
మూత చాలించి యామించు ముద్దుగుమ్మ
సిగ్గు కడ్డంబుగాఁ బతిచేల మలిమి
కొనుచుఁ బలికెను జిన్నెలు కొసరు జూప. 63

చ. జలకములాడఁ గోరి బురుసాపని చీర సడల్చి సందులో
పలికిఁ జనంగ నీదు నునుఁ బల్కు వినంబడఁ దల్పుఁదీయఁగా
వెలువడి వచ్చితిన్ వలపు వెల్లువ దొట్టఁగ, నంచు నాయకున్
గులుకుమిటారి గబ్బిచనుగుబ్బలఁ గౌఁగిటఁ జేర్చి పల్కినన్. 64.

తే. భామ తనమీఁద నెనరైన బాగుఁ జూచి
చిత్తము గరంగి శుభభద్ర శేఖరుండు
గుణవతివటంచుఁ బ్రియురాలిఁ గుస్తరించి
నిండుమోదమ్మున సుఖాన సుండె నపుడు. 65

క. ఇంత యుపాయము గలిగిస
నింతీ! చనవచ్చు జారునెనయఁగ, లేదా
కాంతుఁ డెఱింగిన నృషమణి
చెంతకు నేమొగముతోడఁ జేరెదొ చెపుమా! 66తే. అనుచు రాయంచ నుడివిన విని శిరంబుఁ
ద్రిప్పి హేమావతి ప్రమోద మొప్పఁ బలికె
నౌనె! మజ్ఝారె! యదిగాక యాఁడువారి
తెలివి యనుచును జిఱునవ్వు దలకొనంగ. 67

క. తెలవాఱె నపుడు దీపపుఁ
గళికలతో వెల్లఁ బాఱఁగాఁ దనమోమున్
భళిర! కథాలాపంబని
జలజేక్షణ చనియెఁ గేళిసదనంబునకున్. 68

చ. చని జలజాప్తుఁ డస్తగిరి చాటున కేఁగినయంత మజ్జనం
బొనరించి వ్రాఁతనుంబనులనొప్పు దుకూలముఁ గట్టి రత్నకాం
చకమయ భూషణంలును సారపు మేల్తిలకం బమర్చి ఘ
మ్మను విరు లూని యచ్చెలి నృపాగ్రణి చెంగటి కేఁగు చున్నెడన్. 69

మ. కని చక్రాంగబిడౌజుఁ డిట్లనియె, శృంగారంబు లెస్సాయె మే
ల్దనరారెన్ భళి! హొంతకారివి గదే తన్వంగి! రాజాంతికం
బునకుం బోయెదవేమొ! యొక్క కథ యొప్పున్, దచ్చమత్కారముల్
వినిపో! నిల్పి ననంటిపండ్లనె ననున్ వ్రేయించుమంతన్ వెసన్. 70

క. అన విని హేమావతి మో
మున నవ్వు జనింపఁ గతల మునిపుట్ట సుమీ!
కన నీదు కడుపు బ్రహ్మకు
వినఁ దరమా! యనుచుఁ బలికి వినిపింపుమనన్. 71

క. కప్పురపుఁ దునుక లలవడ
విప్పుగ విరితేనెవాన విడివడి కురియం
జొప్పడర హంససురపతి
చెప్పెను హేమావతీ కుశేశయముఖికిన్. 72

  1. ఎత్తుగీతి మూడవ చరణమున యతిభంగము