Jump to content

హంసవింశతి/ఇరువదవ రాత్రి కథ

వికీసోర్స్ నుండి

క. నలుగిడి కుంకుమ పిండిని
దల సంపెఁగనూనె నంటి తావుల గంధా
మలక మొసఁగి పన్నీటన్
జలకం బొనరించి చల్వఁ దడియొత్తి వెసన్. 253

సీ. చీని కలంకారి చీటి కుచ్చుల మీద
సిరిమించు సరిగంచు చీరఁగట్టి
కొదమ రాచిల్కలఁ గూర్చి తీర్చు కసీదు
సవురు మేల్పని చల్వ అవికఁ దొడిగి
తళుకు మానికపు నిద్దా చెక్కడపుఁ బైడి
సొమ్ములు నెమ్మేన నెమ్మిఁ దాల్చి
కమ్మ నెత్తావి చొకాటంపుఁ గలపంబు
నెఱనీటుగా మెడనిండఁ బూసి
తే. తుఱుము లోపల నరవిరి సరులు దుఱిమి
వేడ్కఁ గపురపు బాగాలు వేసికొనుచుఁ
గులుకు జిగిబిగి వగ వింత గొలుప వచ్చె
బోఁటి లావణ్య మదన వధూటిఁ బోలి. 254

క. వచ్చి తన మ్రోల నిలిచిన
యచ్చపలమృగాక్షిఁ జూచి హంసము భళి! నిన్
మెచ్చితి నీ సొగసునకున్
మెచ్చుము కథవిని యటంచు మెలతకు ననియెన్. 255

ఇరువదవ రాత్రి కథ

మంత్రికుమారుని భార్యలిద్దరు నిద్దరినిఁ గూడుట

క. ఉజ్జయిని యనఁగ నొకపుర
మిజ్జగతిఁ బ్రసిద్ధికెక్కు నిద్ధ విభా సం

పజ్జలజరాగహర్మ్యచ
రజ్జారాలింగితాప్సరస్స్త్రీగణమై. 256

మ. నెలఱాలోవలు చిల్క తళ్కు పని వన్నెల్ వన్ను ముత్తెంపుఁ దా
పల కప్రంపు టనంటిమొగ్గ మగఱా బల్బోదె దంతంపు సి
స్తులు గుల్కుం బవడంపుఁ జాపులు రహించున్ గెంపుఱా యోడుబి
ళ్ళల నిద్ధంబగు నిల్వుటద్దముల మేడల్ వేసవే లప్పురిన్. 257

చ. పురవన భూజ పుష్పఫలముల్ గొను వేడుకఁ బూని తద్ద్రుమో
త్కరములమీఁది కెక్కి సతతంబును దండల నుండు నందన
స్ఫురదురువృక్షపంక్తి సుమముల్ వెసఁగైకొని కొప్పులం దలం
కరణ మొనర్తు రాపురిని గల్గిన భిల్ల సుపల్లవాధరల్. 258

వ. ఇట్టి పురంబున. 259

మ. చతురోపాయసమర్థుఁ డప్రతికళాచాతుర్యధుర్యుండు వి
శ్రుతకార్యజ్ఞుఁడు రాజనీతిపథదక్షుం డింగితజ్ఞాని య
ద్భుతశక్తిత్రయపారగుండు గుణసంపూర్ణప్రభావుండు సం
తతభూపాదరణీయుఁ డొక్కరుఁ డమాత్మశ్రేష్ఠుఁ డుండుం బురిన్. 260

తే. అతని నామంబు బహుమానుఁ దండ్రు జనులు
మానినీరత్నమ! పరాకు మాని వినుము
భర్తృహరి చెంగటను గీర్తిఁ బరఁగునట్టి
మంత్రిజనులందు మేటి యా మంత్రిజూటి. 261

సీ. నిర్ణయంబా బ్రహ్మనిర్ణయంబు స్వమాయ
విష్ణుమాయయుఁ జర్య కృష్ణచర్య
వాక్యంబు శ్రీరామవాక్యంబు దృష్టి యీ
శృరదృష్టి దీప్తి భాస్వంతుదీప్తి

బల్మి భీముని బల్మి పద వింద్రపదవి స
త్యము హరిశ్చంద్రు సత్యము ప్రతిజ్ఞ
రాము ప్రతిజ్ఞ ధైర్యము మేరునగ ధైర్య
మాజ్ఞ సుగ్రీవాజ్ఞ ప్రజ్ఞ గురుని
తే. ప్రజ్ఞ బలము సుయోధను బలము కట్ట
డన భరతు కట్టడి కలిమి ధనదుకలిమి
గాఁగఁ బతి మెచ్చ నఘటన ఘటన పటిమ
నమ్మహామంత్రి రాజ్యభారమ్ముఁ దీర్చు. 262

వ. మఱియు గురు మహాప్రధాన సామంత సేనాపతి ద్వారపాలకావసరిక ఘటికా నిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యోతిషిక నైయాయిక వైయాకరణ మీమాంసక కావ్యకారక దేవతార్చక మాలాకారక పరిమళకారక గోష్ఠాధికార గణాధికారాశ్వాధికార భాండాగారాధికార ధాన్యాధికారాంగరక్షక సూత సూద భేతాళ మత తాంబూలిక తాళవృంతిక నరవాహక చ్ఛాత్రిక చామరిక కళాంచిక శరశారిక కీరమాలిక పాదుకాధారక నర్తక గాయక వైణిక శాకునిక మాగధ వైతాళిక స్తుతిపాఠక పరిహాసక క్షౌరక రజక సౌచిక చర్మకారక ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవైద్యాశ్వవైద్య పశువైద్య భేరీవాదక మురజవాదక రౌమక శిలాచ్ఛేదక స్వర్ణకారక కాంస్యకారక కుంభకారక చిత్రకారక వ్యావహారిక మృగయాకారక పక్షివాహిక వణహారికోగ్రాణాధికార వైశ్యజనంబు లాదియైన డెబ్బదిరెండు వినియోగంబులవారు సేవింప నతండు వెలయుచుండు. 263

ఉ. వానికిఁ గొన్నినాళ్ల కిల వార్తకు నెక్కినవాఁడు రూపరే
ఖానవపంచబాణుఁ డనఁగాఁ దగు చక్కనివాఁ డొకండు స
న్మానవిభూషణుండు సుకుమారుఁడు దైవకటాక్షవీక్షణా
నూనకృపాప్తిచేఁ గలుగ నుత్సవ మొప్పఁగఁ బెంచి రెంతయున్. 264



తే. పెంచి యెలప్రాయ మొదవఁగాఁ గాంచి యతని
పెండ్లి సేయుద మనుచు సంప్రీతి నొందు
తల్లిదండ్రులతో బంధుతతులతోడఁ
బరిణయము నొల్ల నేనని పలుకుచుండు. 265

కామినీ గర్హణము

ఉ. ఊరక పెండ్లి యేమిటికి నొల్ల నటంటి వటంచుఁ బల్కినన్
వారల కాతఁ డిట్లనియె “వారిజనేత్రల నమ్మరాదు, మా
యారచనాప్రవీణలు పరానుగతేచ్ఛ లింకేమనన్ వలెన్
వారక యాఁడురూపములు వ్రాసిన యింటను నిలురే? బుధుల్. 266

క. కుల మెంచ రాడికోళ్ళకుఁ
దలఁకరు సడి వావి వరుసఁ దలఁపరు నీతిన్
దలకొనరు సత్య మాడరు
కలకంఠులు వారి నమ్మఁగా నెటు వచ్చున్. 267

ఉ. చన్నులకన్న మున్ పొడము సాహసముల్ బెళికించు దృష్టికిన్
మున్నుగఁ బుట్టుఁ బెద్దలను మోసము పుచ్చు మనీష యౌవనా
సన్నతకన్న మున్నె యగు సత్య మసత్య మసత్య మెన్నఁగాఁ
దిన్నగ సత్యమంచు ధృతి దీకొను ధీరత పువ్వుబోండ్లకున్. 268

ఉ. టెక్కులు నెమ్మెలున్ సొగసు ఠీవియు నాగరికంబు నిద్దపుం
జక్కఁదనంబు జవ్వనము సంపదసౌంపు వినోదపున్ వగల్
చొక్కపు వైఖరుల్ వలపుఁ జూపఁగఁ జాతురి గల్గువారికిన్
దక్కిన యట్లు భర్తలకు దక్కరు నిక్కువ మింతు లెంతయున్. 269

తే. గరగరిక నుండు మోహనాకార విభవ
శుభవయః పాక పురుషులఁ జూచి నపుడె

దృష్టి వారలపై నిల్పి తెవులు లేని
దశలఁ గృశియింతు రింతులఁ దరమె తెలియ! 270

క. అని పల్కెడు తత్పుత్రునిఁ
గనుఁగొని తల్లిదండు లాప్తగణములు బంధుల్
వనితాభిముఖునిగాఁ దమ
యనుపమచాతురి నొనర్చి రతిసంప్రీతిన్. 271

క. కుల గుణ రూప ప్రజ్ఞా
దులు గల కన్యకల మానధూర్వహసంజ్ఞన్
జెలగిన యతనికిఁ బరిణయ
మలరఁగఁ గావించి రంత నతఁడు నిజాత్మన్. 272

తే. నెలఁతలను నమ్మరాదని నిశ్చయించి
పోఁతుటీఁగకు నైనను బోవరాని
యొంటికంబపు మేడలం దునిచెఁ దత్స
తీద్వయంబును హితసఖుల్ తెలిసి ప్రోవ. 273

వ. ఇత్తెఱంగున నన్యులఁ బొంద శక్యంబుగాని సౌధంబుల నిజభార్యాద్వయంబును వేర్వేఱఁ గాఁపురం బుంచి తత్పరిపాలనార్థంబు పెద్దలగు హితవయస్యల నియమించిన నచ్చెలికత్తెల తీరున నన్నపానాద్యుపచారంబులఁ బోషించుచుండునెడ భువనమోహనాకారంబైన యౌవనోదయంబు సంభవించిన. 274

సీ. కంధర కమలారి కార్ముక కంజాత
కాంచనకంబుల గర్వ మణఁచి
పద్మరాగ పటీర పద్మారిఖండ ప
ల్లవపద్మముల సముల్లాస మెంచి
వజ్ర వల్లీద్వయ వసుమతీధర వార
ణారి వారణ వసుధాళిఁ గేరి

కదళికా కాహళ కచ్ఛప కలకంఠ
కనక కర్పూర సంఘముల మీఱి
తే. కచ ముఖ భ్రూ నయన నాసికా గళోష్ఠ
పరిమళ కపోల కోమలపాణి దంత
బాహు కుచ మధ్య గతి నితంబాంక జాను
పద వచో౽౦గ స్మితము లొప్పు భామినులకు. 275

చ. తరుణుల కౌనులాకృతులు తళ్కు మొగంబులు చన్గవల్ సువా
క్సరణులు పాణులున్ మెడలు సారనితంబము లారురేకలున్
దరళవిలోచనంబులు పదంబులు మేలు ముణుంగు లారయన్
హరికమలాబ్జచక్రనివహంబు నయంబు రయంబునన్ నగున్. 276

సీ. ధరజయోన్నతి మించెఁ దనరు చన్నులు, కృష్ణ
వర్త్మ ఘనాకృతి వఱలె నెఱులు
కనుబొమల్ ధర్మవిఖ్యాతిఁ గైకొనె ముఖం
బులు నిశాచరకళాకలనఁ గనియె
జలవరసంభ్రమంబులఁ గేరి నాభులు
కటులు మహాబలోత్కటకతఁ దనరె
నీలకంఠప్రియ శ్రీలందె నారులు
గజవైరి గతిఁ దాల్చెఁ గలికికౌను
తే. లమరకాంతల లీలల నవయవములె
పరిహసింపంగ మెఱయు నప్పద్మపత్ర
సదృశనేత్రల కిఁక ధరాస్థలిఁ జెలంగు
చెలువలన నెంత హాసనిర్జితలతాంత! 277

సీ. మెఱుఁగుమోవులు ప్రభాకరబలంబు వహించె
లపనముల్ చంద్రబలంబుఁ గాంచె
జఘనముల్ వసుమతీజాత బలంబందె
గలితబుద్ధులు సౌమ్యబలముఁ జెందె



గురుబలంబు భరించె గుబ్బచన్గవలు న
ఖంబులు శుక్రబలంబుఁ బూనె
మందబలంబు సమ్యగ్యానములు దాల్చె
స్వర్భానుబలముఁ గచంబు లొందె
తే. నతనుకేతు బలంబూనె నలరుకన్ను
లిట్ల సకలగ్రహబలాప్తి నెనసియు సుమ
నోజ బలవేధఁ దత్సతుల్ నైజనాథ
బలము చాలక కోరిరి పరబలంబు. 278

వ. ఇవ్విధంబున నివ్వటిల్లి యౌవనగర్వాతిరేకంబున నిర్మానుష్యంబులగు సౌధాంతరంబుల నుండుటంజేసి పంజరబద్దకీరంబులదారిని నపారజారవిహారవిచారపూరితమానసలైన యా మానసకాసారగభీరనాభులు స్వాత్మగతంబున. 279

క. పతిరతిఁ దీఱదు తమి పర
పతిరతి యేరీతి దొరకు భావంబున సం
గతమగు నీవెతఁ దీర్చెడి
హితవరు లెవరని తలంచి రెంతయు వంతన్. 280

సీ. అమరఁ దిర్యగ్జాతులందైన వేయక
నరజన్మమేల యందఁగ నొనర్చె
నొనరించుఁగాక నింపొదవంగఁ బురుషులఁ
జేయక మమ్మేల స్త్రీలఁ జేసెఁ
జేయుఁగాక రతీచ్ఛఁ జెందువానికిఁ గూర్ప
కీరీతి నిర్మోహి కేల కూర్చెఁ
గూర్పుఁగాక యథేచ్ఛగొని చరింపఁగ నుంచ
కీ దుర్గమస్థలి నేల యుంచెఁ

తే. గటకటా! మాయెఁడా పాపకఠినహృదయుఁ
డాయెఁగాఁబోలు వాణీశుఁ డటులఁగాక
యున్న నిట్లేల చేయ నం చువిద లాత్మఁ
బరితపింతురు మరుజారి విరహమొదవ. 281

వ.ఇట్లు తమకు వలయునెడఁ బడఁతులగొడవ తడవని తమ యొడయఁడు తమ్ము మిగులఁ గూడిమాడి యుండమికి దుర్గమస్థలసంస్థితలగుట జారక్రీడకుఁ బొసఁగమికిఁ గంతుశరసంతతసంతాపమ్మునకు సంతపించుచుఁ జిన్ననాఁటనుండియును దమ్మునెత్తిపెంచిన దాదులకు సైతము నెఱుంగనీయక యొండొకతెఱంగున నయ్యంగనలు మెలంగుచుండి రయ్యెడ సువర్ణయను తదగ్రభార్య మోహంబున మదనాదుల నుద్దేశించి తన మనంబున. 282

సీ. నీ సుమశరముల నీసుమ సమ హాస
నీ సుమతిని నేయ నేల? మదన!
నీరాక కులుకు నన్నీరాఁక విడక పో
నీరా! కళాకర! నీరజారి!
ఘనమార్గ ముడిగించి ఘనమా? వధూవధ
ఘనమా విషాపాది వనరె? నిన్నుఁ
బవమాన! కరుణ నింపప! మానగతిఁ జరిం
పవ మానమున కల్కుపడవు నీవు
తే. మధురధర్ముఁడు సర్వజ్ఞమౌళి సురప
థానువర్తి మహాబలుం డనెడు నిజమ
హత్త్వములు మాని యిట్లు స్త్రీహత్యఁ జేయు
చున్న మీరీతి నెవరైన విన్న నగరె? 283

క. తారాధిప! రజనీకర!
కైరవ భేదన సమర్థ! గౌరీశ శిరో౽



దూర! కమలాభి శంసన
కారణ! వారాశి భంగ కార్యభ్యుదయా! 284

చ. పరిధి మిషంబు, మూలికల బంతి కళంకపుఁ గావుబొట్టు భీ
కరకిరణంబులన్ జడలు కౌముది భూతియుఁ దాల్చి మంత్రివై
విరహులఁ జంప సాగితివి వేయన నేమిటి కూరు ముక్కఁడిం
బరఁగిన తోడుబోఁతుల రవం బనుమాట నిజంబె పో! శశీ! 285

క. కీరమణీ! నీ కోడక
కీరమణీ రత్న మిదియ కిల్బిష మతివే
కీ రమణీయపుఁ జనవు శు
కీరమణా! కాని వారె కీరాలాపల్. 286

మాటి మాటికి వేఁడు సీమాటి యెడలఁ
బాటి దప్పిన వార లేపాటి వారు?
కావున దయార్ద్రబుద్ధి నన్గావు నీకుఁ
దేఁటి! నామీఁదఁ గోప మింతేటి కరయ. 287

క. పికమా! ఘోరాకృతి చూ
పిఁక మాదృశ విరహిణుల రతీశ మహోద్దీ
పకమార్గము చూపఁగ నో
పిక మానసమూని యేఁచి బింకమె నీకున్? 288

వ. అని వెండియు నయ్యండజయాన పెక్కుతెఱంగుల నయ్యనంగుని సైన్యసమేతంబుగఁ బలుకుచున్న సమయంబున దైవయోగంబున 289

ఆ. ఆ సువర్ణమందిరాంగణమున నొక్క
పాదుకాద్వయంబు పడియె నంత
దాని వెంబడిన మహీనిర్జరుం డొకఁ
డతిరయఘునఁ బడియె నంగ మద్రువ. 290

వ. ఇట్లు పడిన యప్పుడమి తెఱగంటి కొమరు నత్యనుపమమోహనాకారు నిరీక్షించి భయవిస్మయహర్షాదులు ముప్పిరిగొనుచిత్తంబున డాయంజని యొంటిపాటగుట వివిధోపచారంబుల సేదఁ దీర్చి, నీ వెవ్వండ? :విట్లిందుఁ బడుటకు నిమిత్తంబేమి యనిన నా సువర్ణకు నతం డిట్లనియె. 291

మ. హిమవత్పర్వతమందు మందుఁడను మౌనీంద్రుం డొకండుండు సం
యమిచంద్రుండు తపఃప్రభావుఁ డల సన్న్యాసిన్ వెసన్ మోసపు
చ్చి మహాభ్రస్థలి వాయువేగమున వేంచేయన్ సమర్థంబులై
యమరం బావలు, వానిఁ బూని చనుచో నాకాశమార్గంబునన్. 292

ఉ. మున్నలవాటులేమిఁ బదముక్తములై పడె నిందుఁబావ, లే
ను న్నిలుపోపలేక దివినుండిట వ్రాలితి నట్టి పావలెం
దున్నవొ చూపుమంచనిన నుగ్మలి యందొకచోటఁ గాంచె మేల్
సొన్నపుసన్నపుంబనుల సొంపుఘటింపఁగఁజాలు పాదుకల్. 293

వ. వాని గ్రహించి యచ్చంచలాక్షి యాహారాదివిధుల సంతుష్టుం జేసి యా బ్రాహ్మణకుమారు నెత్తుకొని తత్పాదుకాసామర్థ్యంబున నిలయనికటనిజపతికేళికారామంబు చేరి తదనంతరంబ. 294

ఆ. తగిన ప్రహరిగోడ దక్షిణోత్తరముల
నలరు వెడఁదకూట మందమొందు
మందిరంబుగాంచి యందొక్కయఱఁ దన
పడకటిల్లు చేసెఁ బద్మనయన. 295

ఉ. అందొకయింతసేపు వసుధామరపుత్రునితోడ వేడుకన్
గెందలిరాకువిల్తురణకేళిని దేలి యజస్రమిట్లు పొ
ల్పొందిన యిప్పురంబున శుభోన్నతిచే వసియించినన్ రతిన్
జెంది సుఖింపు నీ వితరచింతలు మానుము భూసురాగ్రణీ! 296

క. నీ కితరభయంబులు రా
నీక మెలంగుదునటంచు హితవుఁగఱపి బి
బ్బోకిని యతనికి వ్యయమున
కై కొంతపదార్థ మిచ్చి యనిచెన్ బురికిన్. 297

వ. ఇట్లతనిఁ బ్రియపూర్వకంబుగా నాదరించి సెలవొసంగి క్రమ్మరఁ దనయిల్లు చేరె నివ్విధంబునఁ దత్పాదుకాసామర్థ్యంబున. 298

క. కేళీవనమున సముచిత
కాలంబున నతనితోడఁ గంతురణక్రీ
డాలలితసౌఖ్యవారిధి
నా లోలమృగాక్షి యోలలాడుచునుండెన్. 299

వ. ఇవ్విధంబునఁ బ్రథమభార్య సుఖించె నంత ద్వితీయభార్యయగు సుప్రభయు సపత్నిరీతినుండియుఁ బరపురుషవాంఛ వొడమి కడుమిడుకుటంజేసి యేచందంబునం బ్రొద్దువోక యొక్కనాఁడు సౌధాగ్రంబున. 300

క. ఆ సుప్రభ సంగీతక
ళాసరసత గలదియౌట లలితముగ సము
ల్లాసమున వీణమీటుచుఁ
జేసెన్ గానంబు సౌధశిలలు స్రవింపన్. 301

క. సురపథమున నపుడొక ముని
యరుగుచు నిజగాననిస్వనాకర్ణనవి
స్ఫురితానందంబున నట
కరుదెంచిన లేచి చూచి యతనికి మ్రొక్కెన్. 302

ఆ. మ్రొక్కి నిలిచి వనిత మునితో స్వవృత్తాంత
మంత మనము గరగునటులఁ దెలిపి



“దేవ! నీవు రతులఁదేలించి ననుఁ బ్రోవు”
మనుచు వేఁడుకొనిన నబలఁ జూచి. 303

“నేను విజితేంద్రియుండను గాన సతులఁ
జెందఁగారాదు నాకుఁ బూర్ణేందువదన!
యైన నీయిష్ట మీడేరునట్టి నేర్పు
తెలియఁజెప్పెద విను”మని తెఱవకపుడు. 304

వ. కారుణికాగ్రేసరుండై యొక్క సిద్ధమంత్రంబు చెప్పి యీ మంత్రస్మరణంబున వలయునెడకుం బోయిరావచ్చుఁ గావున నీవాంఛితంబు దీనం దీర్చుకొమ్మని యానతిచ్చి మౌని విచ్చేయుడు, నంత నాకాంత యత్యంతసంతోషంబున నొంటిపాటైన సమయంబున. 305

క. ఆ రాజన్మంత్రస్మృతి
నారామముఁ జేరియున్న యపు డచ్చటికై
చేరిన తద్వనపాలుని
మారసమాకారుఁ జూచి మది ముద మొదవన్. 306

తే. ఓరచూపులఁ జిన్నెల బేరజముల
మనసుఁ గరఁగించి తనమీఁద మరులుగొలిపి
వానిఁ దోడ్కొనిపోయి యా వాలుఁగంటి
కడమయఱలోన రతికేళిఁ గలిసి చనియె. 307

క. అది మొదలు వానిఁ గవగొని
మదవతి యారామమధ్యమందిరమున నిం
పొదవఁగ రమింపఁ దొడఁగెను
మదనుఁడు విల్లెక్కుడించి మరలిచనంగన్. 308

ఉ. అంతట నొక్కనాఁటి నిశియందు శశిగ్రహణంబుగానఁ ద
చ్ఛాంతికి స్నానదానములు సల్పను వేకువజాము వచ్చు ప



ర్యంతము పట్టు నందనుక రాఁడిపు డింటికి నాథుఁడంచు దా
దెంతయు వచ్చి చెప్పిన మృగేక్షణ ఆత్మల వేడ్కలూనుచున్. 309

వ. ఒంటిపాటైయున్న సమయంబున. 310

తే. జలక మొనరించి జిలుగు వల్వలు ధరించి
కమ్మనెత్తావి కలపంబు కలయనలఁది
యరవిరుల కొప్పులమరించి యారగించి
తమ సమర్థతఁ దద్వనాంతరముఁజేరి. 311

క. ఒకరి నొక రెఱుఁగనీయక
సకియలు పడకిండ్లు చేరి చౌశీతిసుబం
ధకళానైపుణి నుపనా
యకులతో రతికేళిఁ బెనఁగులాడెడివేళన్. 312

సీ. ఫణిరాజతల్పంబుపైఁ బద్మనాభుండు
తిన్నగా శయనించు వన్నెఁదెగడి
తనరు శ్వేతద్వీపమున గాఢతమ మొక్క
దెసనుండి పర్వెడు పస హసించి
క్రమమునఁ బుష్పగుచ్ఛముమీఁద మగతేఁటి
మొత్తంబు వ్రాలెడు దత్తు మీఱి
హిమశైలతుంగశృంగమున నీలాభ్రంబు
పర్యాయమునఁ గప్పు భాతి మెఱసి
తే. సారకర్పూరడిండీరహారహీర
తారకోదారధవళాంశువారకలిత
నీరజారాతిబింబ మున్నిద్రరౌద్ర
గతి గ్రసించెను రాహు వక్కాలమునను. 313



సీ. మంత్రికుమారుఁ డామానధూర్వహుఁడు ది
వ్యౌషధం బవ్వనందిందుఁ గలుగు
టెఱిఁగియుండుటఁజేసి హితమిత్రపరిజనా
న్వితముగ దివ్వటీ ల్వెలుఁగ నేఁగి
బదనికగల పాదపముఁ జూచి యది తీసి
కొనిరండు పొండని కొందఱ హిత
వరుల నంపించి వారరుదెంచు నందాఁకఁ
దా విశ్రమింపఁగాఁ దలఁచి తనదు
తే. సతుల కెప్పుడు సంకేతసదనమైన
తద్వనీమధ్యసద్మంబు దండకరుగఁ
బ్రస్ఫురత్కరదీపికాప్రభలు చూచి
పరులెవరొ వచ్చిరని యుపపతులు వడక. 314

తే. వెఱవకుఁడటంచు వెరవుచే వెన్నుఁ జఱచి
యుపపతుల నిండ్లలోననే యుండఁజేసి
నిలయములనుండి వెలువడి నెలఁతలు తన
కెదురుగా రాఁగ మదిఁ గోప మొదవఁ జూచి. 315

తే. పరులకటు తొంగిచూడను బాటుగాని
దుర్గమస్థలి నుండెడి తోయజాక్షు
లివ్వనంబున కేరీతి నెమ్మె మెఱసి
వచ్చినారను సందియం బిచ్చఁబూని. 316

తే. “ఇమ్మహానిశి నిచ్చోటి కేమిపనికి
వచ్చితి?”రటంచు గద్దించి హెచ్చరించు
వల్లభునితోడ నవ్వేళ వనిత లెట్లు
బొంకిపోవలె? నెఱిఁగింపు పంకజాక్షి! 317

క. అని యడిగిన హేమావతి
తనతలఁ గదలించి తెలిసి తానిది వివరిం
పనుజాల నీవె తెల్పుము
వినియెద నన హంస మపుడు వెలఁదికి ననియెన్. 318

తే. మానధూర్వహుఁ డప్పుడా మానవతులఁ
గాంచి వీరలు మత్కులకాంతలనుచు
నిశ్చయించుక రౌద్రనిర్ణిద్రబుద్ధి
“మీర లివ్వేళ నిట కేల చేరినారు? 319

ఉ. చెప్పుఁడు చెప్పకున్న మిముఁ జిత్రముగా వధియింతు”నంచు ఱేఁ
డప్పుడు తమ్మురొప్పిన భయంబు వహింపక యాసువర్ణ సొం
పొప్పఁగ భర్తకిట్లను సుఖోన్నతలీలల నివ్వనంబునన్
దప్పక సంచరించు వనదైవతకాంతల మమ్ముఁ జుల్కఁగన్. 320

క. నీమనమున మద్భామిను
లీ మగువ లటంచు మమ్ము నెంచితి వాదిన్
మేము భవదీయసతులము
గా మస్మత్కళలు నీదు కామిను లనఘా! 321

వ. అదియునుం గాక. 322

క. ఈయెడ మేము చరింపను
మాయంశమ్ముల జనించు మదిరేక్షణలన్
నా యిల్లాండ్రని పల్కితి
వే! యేమి నిమి త్తమనిన నెఱిఁగింతు మొగిన్. 323

తే. చైత్రరథమున మును మేము సరసగతుల
సంచరింపఁగ నవ్వేళఁ జైత్రుఁ డచటి



కరుగుదెంచినఁ గాంచి యనాదరమున
లేవకుండిన సక్రోధలీలఁ జూచి. 324

తే. సాపరాధల మమ్మా వసంతుఁ డరసి
మర్త్యసేవను నూఱేండ్లు మహిని మెలఁగుఁ
డని శపించినఁ బ్రత్యక్ష మటుల నుండఁ
జాలమని మేము ప్రార్థింప సదయుఁడగుచు. 325

సీ. ఆరీతి మీరు ప్రత్యక్షంబున మెలంగ
కున్న నేరంబేమి? యువిదలార!
మీయంశములఁ బుట్టు మెలఁతల మానధూ
ర్వహుఁడను బహుమానవరకుమారుఁ
డగు విప్రునకు భార్యలై యుండ నియమింపుఁ
డని తెల్సి యావేల్పు చనిన, నచటఁ
గూర్మితో నీకు మే ల్గోరుచునున్నవా
రము సుపర్ణయన సుప్రభయనంగ
తే. మామకాంశముల జనించు మనుజసతులు
నీకుఁ గులకాంత లైనారు నిక్క మిదియ
రూపయౌవనసంపదారూఢి నీదు
చానలకు మాకు భేద మింతైనలేదు. 326

తే. ఇట్టి చుట్టఱికం బుండు టెఱిఁగి కాదే
నిను సహించితి మితర భూజనులు మేము
మెలఁగుచోటికి నివ్వేళఁ బొలసినపుడె
చెడ శపింతుము నీవింక సుడియరాకు. 327

క. చుట్టఱిక మెంతగలిగిన
రట్టున రారానియెడకు రా వారలపై

నెట్టి సుబుద్ధులకైనను
బుట్టును రోషంబు దానఁ బుట్టున్ జెట్టల్. 328

క. కావున నీ విచటికి నిఁక
రావలదు వసంతశాపరాహితలమై మా
దేవవని కేఁగినంతట
నీవిట నెమ్మదిఁ జరింపు నీయాప్తులతోన్. 329

క. అని సంతోషము భీతియు
జనియింప సువర్ణపలుకుజాడనె పలికెన్
వనితామణి సుప్రభయును
విని తద్వాక్యములు మాని విభుఁ డపు డాత్మన్. 330

ఆ. ఏపు జవ్వనంబు రూ పొక్కటైయుండు
టాత్మసతులు వీర లనుచు నుండి
నేము నీసతులను గా మస్మదంశజ
లీ లతాంగులని రిదేమొ సతులు. 301

క. ఇంటికిఁ జని కనఁదగు వా
ల్గంటుల నీపలుకు లాత్మకామిను లింటన్
దొంటిగతి నున్న సత్యం
బింటను లేకున్నఁ గల్ల యిది దృఢ మరయన్. 332

ఆ. అనుచు నిశ్చయించి యతఁ డింటి కేఁగెను
వానికన్న మున్నె వనజముఖులు
నిజసమర్థతాప్తి నిలయంబులకుఁ బోయి
పవ్వళించియుండి రవ్విభుండు. 333

చ. వెసఁ జనుదెంచి యింట నళివేణులఁ గన్గొని తద్వధూవచో
విసరము సత్యమౌననుచు వేడుకఁగైకొని తప్పునిద్రలం

బసగలహంసతూలికలపాన్పులపై శయనించియున్న యా
త్మసతుల లేపి తొంటి వనితావిముఖత్వము మానె మానినీ! 334

తే. అరమరలులేని కూటమి నధిపుఁ డపుడు
కులవధూటుల నెంతయుఁ గుస్తరించి
పచ్చివగదేరు రతులతో నిచ్చనిచ్చ
లిచ్చకము పుట్టఁజేయుచు నెనసియుండె. 335

క. ఈమహిమ నీకుఁ గల్గిన
భూమివిభున్ రతులఁ గలయఁబొమ్మని హంస
గ్రామణి వినిపించిన విని
హేమావతి మెచ్చుకొని ఖగేంద్రుని కనియెన్. 336

తే. జనపతిని జేరఁబోనీక దినముదినము
కతలు చెప్పఁగ సాఁగితో కతలకారి!
చిన్ని రాయంచ! యిఁకనైన సెలవొసంగు
పోయివచ్చెద నన హంస పొలఁతి కనియె. 337

క. ఇరువది దినముల కింటికిఁ
బరతెంతునటంచు నీదుపతి చనుచో నా
కెఱిఁగించె రేపవశ్యము
బరతెంచునుగాన నీకుఁ బఱవం దగునే? 338

చ. నరపతిఁ జేర దర్శకరణక్రియలన్ దగఁ బ్రొద్దువుచ్చి ని
ద్దురగొనియైన రాజు నినుఁదోడనె పొయఁగలేనికూర్మి మం
దిరమున కేఁగు మంచనక నిల్సిన నిల్చుటలైన నింటిలో
దెఱవరొ! నీవులేమి నరుదెంచిన నీపతి కేమి దోఁచునో! 339

క. కావున భూవిభుఁ జేరం
బోవుట కార్యంబుగాదు పొమ్మింటి కటం

చా వనజాక్షికి హంసధ
రావరమణి దెల్పునపుడు రవి యుదయించెన్. 340

తే. అంత హేమావతియు హృదయాంతరమున
భూమివిభుమీఁది మోహంబు పొంగిపొరలఁ
బడకయిలు సేరి వేఱొక్క పగిది నుండె
నపుడు తత్పతి సహచరుం డరుగుదెంచె. 341

క. అదిగో! నీపతి వచ్చెన్
ముదమున నగరోపకంఠ భూమిని విడిసెన్
సుదతి! నినుఁ జూచి రమ్మని
పదరక ముందుగను నన్నుఁ బనిచెన్ వేడ్కన్. 342

క. అని చెప్పినఁ దద్వాక్యం
బనలశిఖాతప్తకీలమై చెవి నాటన్
ఘసభయ విస్మయ లజ్జా
తను హర్ష భరాదు లాత్మఁ దగిలిన వగతోన్. 343

ఉ. దిగ్గున లేచినిల్చి సుదతీమణి భూవిభుమీఁది బుద్దితోఁ
దగ్గుచు మ్రగ్గ నిగ్గు సిరి తగ్గని తామరమొగ్గదోయి బల్
జగ్గుల మొగ్గు లింపెసఁగు చక్కని చిక్కని గబ్బి గుబ్బలున్
సుగ్గడితంపుఁ బయ్యెదయు సొంపగు క్రొమ్ముడిఁ జక్క దిద్దుచున్. 344

ఆ. ఓడ బేరమాడ వేడుకఁ దానేఁగి
నదియు మొదలు శుభమె యందఱకును?
ననుచు బాంధవాది జనుల యోగక్షేమ
మడుగ భద్రమఖిల మనియె నతఁడు. 345

క. వెండియు నిట్లను మదవే
దండ లసద్గమనతో సుధారసధారా

పాండిత్య మండితోక్తులఁ
బండితమండలికిఁ జెవుల పండువు గాఁగన్. 346

క. జనపదములు పురగిరులున్
గనులు వనులు నదులు నిధులు కట్టల్ మిట్టల్
కనుమలు పేఁటలు తోఁటలు
మునుకొని కనుఁగొనుచుఁ బోయి మ్రోలన్ లీలన్. 347

సీ. ముజ్జగంబును బూతముగఁ జేయనగు ధౌత
వనభంగ గంగ యెవ్వనికి భార్య
దేవావనోత్సాహ దృఢకళాసందోహ
మున ముంచు చంద్రుఁ డెవ్వనికి సుతుఁడు
కడలేని సిరులీనఁగల రమా గజయాన
యలరారు నెవ్వాని యనుఁగుకన్య
బహుళ పద్మభవాండ పరిపాలనా ఖండ ,
వాత్సల్య శౌరి యెవ్వనికి నల్లు
తే. డట్టి నక్ర ఢులీ కుశీరాళి వాశ్చ
రావళీయాన కేళీ మహాబహూర్మి
మాలికా డోలికా పాళికా లసన్మ
రాళికోల్లాసి కలశవారాశి డాసి. 348

వ. సభయభ క్తి నమస్కారంబుఁ గావించి, తదుత్కట తటంబున. 349

సీ. జాతి విలాయతి సకలాతు మేల్కట్లు
కాబల పసకి ముఖాబులోవఁ
బైఠిణీ జర బాబు పసల గోడ సరాలు
మేలరబ్బీ మొకమాలు దిండ్లు
గోవ బూర్నీసు నిగ్గుల బిల్ల సంతన
బలుచీనీ హొంబట్టు ప్రగ్గములును

దగటు రుమ్మీ తాపుతా నవారు కసీదు
నేస్తు బందరు చీటి లస్తరీలు
తే. ఖాతువా జంబుఖాన మఖ్ఖా తివాసు
లరల సుగదాసుల బనాతు లమర దిండ్లు
కాంచనస్తంభములు రత్నకలశతతులు
వాళ్లులును గుజ్జుగుండాగు త్రాళ్లు మెఱయ. 350

క. హితవరులతోడ యుష్మ
త్పతి వేడుక విడిసి సకల పరిమళ వస్తు
ప్రతతులు మౌక్తిక విద్రుమ
వితతులు మొదలైన రస్తు వెలఁదీ! కొనియెన్. 351

విదేశముల నుండి దిగుమతియగు వస్తువులు

సీ. తళ్కుటద్దంపు నిద్దపు నిల్వుటద్దముల్
దంతపు దువ్వెనల్ తావులొల్కు
నత్తరు పునుఁగును నంబరు గౌళ క
చ్చూరముల్ నఖము గంబూర చోవ
జల్లి సవరములు జిల్లరసము కదం
బము గోవ జవ్వాజి పచ్చిపునుఁగు
కురువేరు పచ్చకప్పురము పన్నీరు బే
డెము మలాకెలు కుంకుమమును మంచి
తే. బుక్క కస్తూరి వీణెలు చొక్కటంపు
టగరు సంపెంగనూనెలు నాదియైన
మెచ్చఁగల దీవులందుండి తెచ్చినట్టి
వివిధ పరిమళ వస్తువుల్ వెలకుఁ దీసి. 352

సీ. గర్గరికలును బింగాండ్లు తాంబాణాలు
గిన్నెలు తంబిగల్ గిండ్లు స్నపన

పాత్రలు చట్లును బానపాత్రలు మేలు
చట్టువంబులు మంచి మట్టిగిండ్లు
సంపుటంబులు గొప్పస్థాలీలు తబుకులు
కంచముల్ తట్లు గంగాళములును
జెంబులు పడిగముల్ చిప్పలు హస్తావ
ళులు కంకణములు ఘంటలును గజ్జె
తే. లాదిగాఁ గల్గు దీవులయందు వెలయు
కంచరపు జాతి వగవగల్ మించఁ జేసి
నట్టి సామగ్రి బహు వెల ల్వెట్టి కొనియెఁ
గాంత! భూకాంతమణులకుఁ గాన్క జేయ. 358

తే. లేటి కొదమల వింతయౌ నేటి పునుఁగు
పిల్లుల జవాజి పిల్లుల బెట్టు రురుల
ముంగిస సివంగి జోణంగి యింగిలీషు
కుక్క గుంపులఁ గ్రోఁతులఁ గొన్ని గొనియె. 354

సీ. సింపంగి కావులు జందురు కావులు
వెలిపట్టు పుట్టముల్ వేఁట చాళ్లు
జిలుఁగు బొమ్మంచుల లీరలు నాచులు
నుదయరాగంబులు నుడుత వన్నె
లొప్పు ముయ్యంచుల పుప్పొళ్లు హొన్నంచు
వలువలు గరకంచు వస్త్రతతులు
ముత్తేల పందిళ్లు నుత్తర గోగ్రహ
ణములు నిగమగోచరములుఁ బద్మ
తే. పు లతికలు నిండువన్నెలు బొడలు పచ్చ
లును హరిణవళ్లు హంసవళులును రంగ
వళ్లు పొదలును సామంతపదులు ననఁగఁ
దనరెడు పసందు పటములు గొనియె వెలకు. 355



రగడ.
చౌకట్లు నొంట్లు బేసరులునున్ మొలకట్లు
రాకట్టు చుట్టుంగరములు బల్చేకట్లు
మురువు లొప్పు కిరీటములు మేటి తాళీలు
సరిపణలు మించులును సాటిలేని తురాలు
రంగుగల ముంగామురాలు నాభరణములు
నంగదంబులు మంచి హంవీర తాయెతులు
కంఠమాలికలు జిగిగల్టు చేకడియములు
కంఠసరములు బిరుదు గండపెండేరములు
నందంపు టుత్తరిగెలలరు చిఱుగజ్జియలు
కుందనపుఁ జక్కడము గుల్కు మణిఘంటలును
[1]మితి లేని వెల లిడిన మేఖలలు నందియలు
చకచకల్ గల జాతి సకలమణి నికరములు
నకలంక వర్ణ పట్టాంబర ప్రకరములు
పీతాంబరంబులును బేర్వడిన బురుసాలు
జాతి నీలాదులును సాలువులు చీనీలు
పచ్చపట్టులు తగటు పాగలును నంగీలు
నచ్చపు మెఱుఁగుగల యపురంగజేబీలు
బురుసకాసీలు మహముదులు నిరాసీలు
సరి సేయరాని హంసావళులు లాకీలు
మాదళంబులు వెన్నమడుగులు ముసజ్జీలు
చాదరలు పైఠిణిలు చక్కని కబాయీలు
నడరు చిళ్లాని తేంట్లమరు బుర్నీసులును
నడికట్లు మేఘవర్ణంబులును ద్రోపులుసు
మొకమాలులును సూర్యపుటములు బనాతులును
సకళాతులం దెలుపు చలికప్పడంబులును

  • ,

హొంబట్టు లోడీలు హొనకా దుకూలాలు
కంబావతులు డాలుగల్గు జిరబాబీలు
వింతవింతలుగాఁగ వెలసిన బవంతీలు
కాంతితతి వెదచల్లఁ గల్గిన సరంతీలు
దుద్దుకంబళ్లు చందువలు తివాచీలు
పద్దులకుఁ గైకొన్న బలుజంబుఖానాలు
ప్రతిలేని పట్టంచు పలురత్న కంబళ్లు
నతులితములైన చతురంగముల వల్వలును
తళుకు పగడపుఁ గోళ్లఁ దగు పట్టె మంచములు
కులుకు నెత్తావి కుంకుమపువ్వు తల్పములు
ఏకరంగి తలాట లిడు గోర లేజీలు
ఢాక చూపట్టు సురతాణి సింగాణీలు
కళలుదేరు పిరంగి కత్తులును జూరీలు
పొలుపొందు నందలపు బొంగులును గేడీలు
వీరికై కొనిన హరబ్బీకెలును వన్నియలు
పేరైన సూరత్తు పింగాణి గిన్నియలు
రాయంచ లైదు వర్ణములైన కీరములు
మాయురే యని యెంచ మరుపట్టు జీనీలు
చీర్ణంపుఁ బనుల మించిన పిరగి పీఠములు
నిర్ణయింపఁగరాని నిఖిల సద్వస్తువులు. 356

క. స్వరమండలములు కిన్నెర
లురజాబులు దండవీణ లురు జారుతరా
ల్వర రావణహస్తంబులు
మఱి తంత్రులు తంబురలు సమస్తము గొనియెన్. 357

వ. అయ్యవసరంబున. 358

భారతదేశ పుర గ్రామములు

సీసమాలిక.
రాయదుర్గము గుత్తి రాయవేలూ రానే
గొంది మాహురి కాశి గోలకొండ
ముంగిపైరిణి ఢిల్లీ ముళువాయ జాబురా
శాదు మఖ్ఖా మహామూదు మచిలి
బందరు సూరతు చెందరు గోవేరు
శ్రీరంగపట్నంబు జింజి కాంచి
బాదయు నౌరంగబాదు దౌల్తాబాదు
కప్పర గాగర గదగు బిదరు
కోట కల్యాణము గొందాన మహాముదా
సగరంబు బంగాళ నరవ గోన
పన్నాళ చదరంగపట్నంబు గలగర
గజరాజధాని బంగాపురంబు
కాంబాగర ప్రయాగ ద్వార కాయోధ్య
లక్ష్మీశ్వరంబు షోలాపురంబు
మధుర కొల్లాపురి మగధ మా యావంతి
కా పురాణపురముల్ కాబలగయు
నాదవేని కళింగ మాదూరు వినుకొండ
కొండవీడును నేలకొండపల్లి
పొదిలి తంజాపురం బుదగిరి కైసూరు
మైసూరు పెనుగొండ మంగళగిరి
బసువపట్నము సీర్సి భద్రాచలము పాల
పంచ నిజాంపురి వందవాసి
కుందుర్తి బెల్లంకొండ దేవరకొండ
రాచర్ల మునిమడ్లు రాయపురము

సైదాపురము గోవ సాళ్వాక దూపాడు
రాపర్తి మాచెర్ల రాచవీడు
బనగానిపల్లె కంబము పోరుమామిళ్ల
ధారాపురము చీని తాడిపర్తి
నంద్యాల చిరువళ్ళి నందవరము కందు
కూరు రామయపట్న మారుబండ
హంపి విరూపాక్ష మారణి వెంపల్లి
కాంపిల్యనగరంబు కందనూరు
కడప సిద్దవటంబు గండికోట కసూరు
సింహాద్రి పుట్లూరు చింతకుంట
గయ చెన్నపట్నంబు గండవరం బోరు
గల్లు దామెనచెర్వు వెల్లటూరు
కల్లూరు కలువాము నెల్లూరు వేలూరు
రాచూరు చడుమూరు రాచకొండ
కదిరి కూటాగుళ్ల గంగేరు శృంగేరు
రామళ్లకోట వజ్రగిరి నొసుము
సూగూరు చోబాడ బాగూరు కొళ్ళాల
గుడిబండ బళ్ళారి కొత్తకోట
గుమినేనిపాళెంబు గొబ్బూరు బళ్ళాపు
రము పుంగనూ రౌకు రామటెంకి
మాసవ కౌతాళ మానుకొండైనూరు
జలవూరు పెదవలి జల్లికోట
కుంభకోణము కోటకొండ తంజావూరు
పెరవలి దువ్వూరు బెంగళూరు
నొత్తూరు చిత్తూరు హుణి తిర్చనాపల్లి
రాజనోల్ గద్వాలు రాచనగరు
తిరుతని కాళహస్తి సినూరు మధ్యార్జు
నము తిరునామల నాముకొండ



పాకల కావేరిపాక మోహనగిరి
చదుకూరు మల్లూరు చాదుకొండ
పాగొండ వావిలి నాగోలు తాళ్లూరు
మైలాపురము పెద్దమంగళంబు
రామసముద్రంబు రామాపురము జట
ప్రొలూరు వెల్లారి భువనగిరియు
హర్పణహల్లి కొండాపు
రము గౌరి మాయలూ రమరవీడు
నడిగల్లు కొక్కల్లు కడవకొలను రత్న
గిరి వెలిగోడు తంగెళ్ల దర్శి
కంగొంది తరిగొండ గడవనెత్తము దూసి
శివనగ ళ్ళలవంది సింహళంబు
మన్నారుకోవెల సొన్నగలు చిదంబ
రము వాగె నగరి పురాణపురము
నడియారుపాళెంబు నుడిపి సుబ్రహ్మణ్య
ముజ్జంగి మండువా హొసవగళ్లు
రామనాథపురంబు మాముగోళ్ల బెడంద
ధర్మవరంబును దాడిగోళ్ల
మవణికె మందము మారికాపురి కుంభి
హారంగ ముజ్జారి హళికెహళ్ళి
రెట్టిహళ్ళి కురంజి రేపణి సన్నక్కి
పామూరు కనిగిరి పాలువాయి
రామచంద్రాపుర మామూరు బెజవాడ
కొండూరు కాండూరు కోటకొండ
తే. మొదలుగాఁ గల్గు జనపదమ్ములను దుర్గ
ములను బేఁటలఁ బాళేలఁ బురుల వెలయు
వర్తకులు వచ్చి రచ్చటి వస్తుతతులు
బేరసారంబు లాడెడు పేర్మి మెఱసి. 350

క. ఆరీతి వచ్చువారల
కారయఁ దాఁ బిన్నపెద్దయై నీ విభుఁ డిం
పారఁగ వస్తువు లన్నియు
బేరము పొసఁగించి చేసి వెల కిప్పించెన్. 360

ఉ. అంచితబుద్ధి వర్తకజనావళి కిట్లు సమస్తవస్తు లి
ప్పించి తదీయభూములకు వేడ్కఁ జనుండని వారి నెల్ల నం
పించి వృషోష్ట్రవాజిరథబృందముపైఁ దనకొన్న రస్తుఁ బొం
దించి సమిత్రుఁడై యరుగుదెంచెను నీ విభుఁడూరు చేరఁగన్. 361

వ. అనిన విని హేమావతీకాంత సంతోషంబున భోజనాదుల సంతుష్టుఁజేసి తన యోగక్షేమంబులఁ బతి కెఱిఁగింపు మని యతని నంపి తదనంతరంబ. 362

తే. కథలు రేల్ తెల్పుటయే కాదు కరుణఁ బ్రొద్దు
పోనియపుడెల్ల రాయంచ పూని చెప్పి
నట్టి నయవాక్యముల చేతనైన సన్మ
నీష హేమవతి మంజుభాష యపుడు. 363

క. పరపురుషసంగమం బిహ
పరసుఖదూరంబు గానఁ బాతివ్రత్య
స్ఫురణగల సతులు మదిఁ గో
ర రటంచును నిశ్చయించి ప్రమదంబెసఁగన్. 364

తే. చిత్రభోగునిపైఁ బ్రేమ చిందఁ జేసి
నిజవిభుని రాక కలరి యన్నీరజాక్షి
తనదు గృహకృత్యములు దీర్చుకొనుచు నుండె
నంతఁ దత్పతి యింటికీ నరుగు దేర. 365

క. కుందనపు బిందియల హరి
చందన తరుఖండ వహ్ని సంతప్తంబై
క్రొందావు లొల్కు పన్నీ
టం దగ జలకం బొనర్చి తడయక యంతన్. 366

ఉ. ఆ జవరాలు కీలుజడ నంబురుహోత్పల కేసరాలు వ
క్షోజధరాలఁ గప్పుకొను క్రొమ్మగరాల సరాలు నంగుళీ
రాజ వినూత్న రత్నముల రంగు చెలంగెడి యుంగరాలు వి
భ్రాజిత నూపురాలు పదపద్మములన్ సవరించి వెండియున్. 367

సీ. వనచరంబులు గాన వచ్చె మైత్రికి నన
వేణి కాళిశ్రేణి విరుల దుఱిమి
నీటఁ బుట్టిన వోట నెమ్మిడాసె ననంగ
గళ శంఖమున హారములు ధరించి
జలజంబు లౌటనె చెలిమిఁ జెందె ననంగఁ
గర వారిజములఁ గంకణము లుంచి
సారంగజము లౌట సఖిత నొందె నన వ
క్షోజ కుంభములఁ గస్తూరిఁ బూసి
తే. కనకరుచులౌట మిత్రత ననఁగి పెనఁగె
ననఁగ దను హేమలతను మిన్నగు పదాఱు
వన్నె బంగారు పువ్వుల వలువఁ దాల్చి
పతికి నెదురుగ నేఁగె నప్పద్మగంధి. 368

వ. ఆ సమయంబున. 369

సీ. మిసమిస చూపులు మిరుమిట్లు గొలుపంగఁ
గిలకిల నవ్వులు చెలువొనర్ప
ఘలుఘల్లుమని చిఱుగజ్జెలు రొద సేయ
దళధళ ద్యుతులఁ గమ్మలు చలింప



ఝణ ఝణం కృతులఁ గంకణములు మెఱయంగ
ఘనఘన ధ్వనుల మేఖల నటింప
ధగధగద్దీప్తి రత్నపు సొమ్ము లలరార
నిగనిగ బావిలీల్ నీటుసూప
తే. భుగభుగలు గల్గు మైపూఁత సొగసు గుల్క
గమగమలఁ గప్రపు విడెంబు గంధ మొలయ
మినమినల్ కుంకుమపు రేఖ మించులొల్క
ఖణిఖణిల్లని మెట్టియల్ కడు రహింప. 370

క. తన కెదురుగ వచ్చిన తన
వనితామణి నపుడు చూచి వదనాంభోజం
బునఁ జిఱునవ్వొలయఁగ నె
మ్మనమున నానందమొందె మానిని యంతన్. 317

తే. విభుని పదములు పన్నీట వేడ్కఁగడిగి
నెచ్చెలులతోడ వెస నివాళిచ్చి వైచి
యింటిలోనికిఁ దో డ్తెచ్చి యింతులెంచ
భర్తతోఁ గూడ నతిసుఖప్రాప్తి నుండె. 372
వ. అంత హేమావతీకాంత వృతాంత మంతయు నాత్మీయదూతి విన్నవించిన విని కంపితశిరస్కుండై కొంత తడవు చింతించి, మహారాజచంద్రుండును నీతిజ్ఞుండును నకళంకుడును వివేకధురంధరుండును గావునఁ జిత్రభోగనృపాలుండు దన మనంబున. 373

ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులఁ గోరి యేమి సౌ
ఖ్యోన్నతిఁ జెంది రిట్లగుట నుర్విజనావళు లన్యకాంతలన్
బన్నుగఁ గోరరాదు కడుఁబాతకమంచుఁ దలంచి యింతిపై
నున్నమనంబు ద్రెక్కొని యథోచితపద్దతి నుండె భూవరా! 374

క. అనుచుఁ బురోహితుఁ డెఱిఁగిం
చిన నలరాజన్యమౌళి చిత్తాంభోజం
బున నద్భుత ప్రమోదము
లెనయఁగ మెచ్చుకొని రాజ్యమేలుచు నుండెన్. 375

మ. నత సంజీవన! జీవనేశ భయకృన్నారాచ! నారాచర
వ్రత బృందారక! దారికత్యన పదారక్షోభి రక్షోభట
శ్రుత సంధారణ! ధారణార్హమణి భాసుగ్రీవ! సుగ్రీవము
ద్ధతలాలాపన! లాపనద్యుతి చితా తారాప! తారాపహా! 376

క. అక్ష ద్విడ్లక్ష క్షి
ప్తక్షేమ కటాక్ష దక్ష! దక్ష తనూజా!
ధ్యక్షనుత పక్ష! పక్ష
ప్రక్షుణోర్క్ష్.మ విపక్ష రక్షా శిక్షా! 377

స్రగ్విణి
పద్మ పత్రేక్షణా! భక్త సంరక్షణా!
పద్మ గర్భస్తుతా! భాను బింబస్థితా!
పద్మ బాణాకృతీ! భవ్యశౌర్యోన్నతీ!
పద్మ సర్వేశ్వరా! పాలితోర్వీశ్వరా!

గద్యము
ఇది కౌండిన్యసగోత్ర పవిత్రాయ్యల రాజాన్వయ సుధావార్ధి పూర్ణిమాచంద్ర
నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర శ్రీరామనామ పారాయణ
నారాయణామాత్య ప్రణీతంబైన హంసవింశతి యను
మహాప్రబంధంబునందు సర్వంబును
బంచమాశ్వాసము.

  1. ఈ పాదమునకు జతగా మటొక్క పాదము ఉండవలెను. లేదు.