స్వీయ చరిత్రము - రెండవ భాగము/అవతారిక
అవతారిక
ఈ స్వీయచరిత్రముయొక్క ద్వితీయ భాగములోని మొదటి ప్రకరణము విశేషభాగము 1910-వ సంవత్సరము జూను నెలలో నాభార్య సజీవురాలయి యుండఁగా బెంగుళూరిలో వ్రాయఁబడినది. మిగిలిన భాగమునంతను 1913 వ సంవత్సరము వేసవికాలములో నేను బెంగుళూరికి వెళ్లినప్పడు మెయిజానునెలలలో వ్రాసితిని. 1912 వ సంవత్సరము డిసంబరునెల మొదలుకొని 1913 వ సంవత్సరము ఏప్రిల్ నెల వఱకును స్థానికపత్రికలలో రెంటిలో నాకు వినోధముగా కొన్ని యారోపణములు చేయఁబడినందున, ఆవిషయమున నాలుగవ ప్రకరణములో గొంతవ్రాసితినిగాని తరువాత నేతత్ప్రకటన విషయమున ధర్మస్థానములలో, దండశాఖలోను, వ్యవహారశాఖలోను, కొన్ని యభియోగము లారంభమయి యిది ముద్రింసఁ బడుచుండినప్పడు ముగియనందున వ్యవహారమధ్యమున దానిని ప్రకటించుట యుచితముకాదని నిలిపివేయవలసిన వాఁడనైతిని. పుస్తకమంతయు నేక సంపుటముగా ముద్రింపఁబడునప్పడు తద్విషయమయి మఱియొక ప్రకరణము చేర్పఁబడును. నాకిప్పడఱువదియేఁడేండ్లు నిండి యఱువదియెనిమిదవ యేఁడు ప్రారంభమయినది. ఏండ్లుగడచిన కొలఁదిని నాకంతకంతకు దేహ దార్ఢ్యమును ధారణా సామర్థ్యమును తగ్గిపోవుచున్నవి. ఇటు వంటి యవస్థలో నీస్వీయ చరిత్రములో భ్రమ ప్రమాదాదులవలనఁ గలిగిన దోషములేవేని పడినచో మహాజను లుపేక్షించి క్షమింతురుగాక !
రాజమహేంద్రవరము
1వ ఏప్రిల్ 1915.వ సం|| కందుకూరి-వీరేశలింగము.