స్మృతికాలపు స్త్రీలు/సంపాదకుని తొలిపలుకు

వికీసోర్స్ నుండి

సంపాదకుని తొలిపలుకు

ఈ గ్రంథమును, దీనికి పూర్వము వెలువడిన "వేదకాలపు స్తీలు" అను గ్రంథమును చదివి, వానిలోని విషయములను జాగ్రతగ పరిశీలించువారికి, మన భారతదేశములోని ఆర్యులలో, సాంఘికధర్మము లితర మానవసంఘములలో వలెనే, యెట్లు మారుచుండెనో స్పష్టముగ తెలియగలదు. సనాతన ధర్మములనగా అనాది ధర్మములనియు, అవి, సత్యము, అహింస మొదలగు నైతికధర్మములుగాని, కేవలము లౌకికములైన సాంఘికధర్మములు కావనియు, కాశీ కృష్ణాచార్యులు మొదలగు పండితుల యభిప్రాయము. తక్కిన వారిలో కొందరు, మన పూర్వమతగ్రంథములగు శృతిస్మృతి పురాణేతిహాసములలో చెప్పబడిన ధర్మములన్నియు, సనాతనధర్మములే యనియు, వీనిలో పైకి కన్పడు పరస్పరవిరుద్ధములు సమర్థించుకొనజాలకుండుటకు, కారణము మన నవనాగరికుల యసమర్థతయే యనియు, యీ ధర్మములన్నియు అనుల్లంఘనీయములనియు వాదించెదరు. సనాతనధర్మపరులమని చెప్పుకొనువారి యీవాదన నెంతగా ఖండించినను నది యక్కడక్కడ తనతలను యెత్తుచునే యుండును. గనుక, మేముకూడ మా శక్తికొలది దీనిని ప్రతిహతము గావింప బ్రయత్నించుచుందుము. కాశీ కృష్ణాచార్యులుగారి అనాది సిద్ధములైనవను వైదికధర్మములు కూడ, పరిణామము వలన యేర్పడినవేగాని, మానవులు, మొట్టమొదట క్రిందితరగతుల జీవములనుండి ఉద్భవమైనపుడు యెట్టిధర్మములు లేనేలేవనియు దేవుడను వాడొకడున్నను ఆయన మన మనఃఫలకములమీద యెన్నడు, యెట్టిధర్మములు వ్యాసియుండలేదనియు, వివిధ మానవసంఘములలో వాని యభివృద్ధి కొఱకు దేశకాలములను బట్టి, అనేక రకములగు మతసాంఘికధర్మములు బయలుదేరినవనియు, ప్రపంచములోని అనాగరికజాతుల సాంఘికచరిత్రవలన స్పష్టపడుచున్నది. ఇంతయేల ? మానవకోటిలో ప్రస్తూ మందవలంబించబడుచున్న వివిధ మతాచారములన్నియు, మానవకల్పితములే యనియు, వేదాంతసూత్రములన్నియు, వట్టి ఊహాజన్యములనియు నా నిశ్చితాభిప్రాయము. దీని నెల్లపుడు, మతసాంప్రదాయములలో చిక్కుకొను మన భారతీయులకు నచ్చజెప్పి, వారి మూడవిశ్వాసములను పారద్రోలి, మానవసౌభ్రాతృత్వమునకు వీరిని పురిగొల్పుటయే నా యాశయము. ముఖ్యముగా మనయాంధ్రులు, సంఘసంస్కరణములందు, ఈ ప్రపంచములోని తక్కిన మానవసంఘములతో సంపూర్ణ సానుభూతి చూపించుచు, ముందంజవైచుటకు, కొంతవరకు తోడ్పడవచ్చుననియే మన పూర్వగ్రంథములలోని మతసాంఘిక సూత్రములను, ఉన్నవి ఉన్నట్లు, నిష్పక్షపాత బుద్ధితో తెలుపుచుందుము. మనలో యెట్టి బిన్నాభిప్రాయములు పూర్వకాలమునుండి యున్నను, మేము వానిలో నేవియును దాచము. మతసాంఘికాచారము లన్నియు మానవ కల్పితములే యని మా వాదనయైనపుడు, మాకు రుచించనివైనను దాచవలసినంత భయము మా కేల ? ఏమత గ్రంథము గాని అపౌరుషేయమనిగాని, అనుల్లంఘనీయమని గాని, పవిత్రమనిగాని మే మెంచనపుడు, దానిలోని విషయములను వ్యక్తీకరించుటలో మాకు దాపరికముండవలసిన పనిలేదు. మన మూఢమత విశ్వాసములేగాక, మన నైతిక ధర్మములు కూడ ప్రకృతియంతయు వలెనే, పరిణామజన్యములనియే మేము నొక్కి చెప్పుచున్నాము. మా విద్యాపీఠములలో, తక్కిన మతగ్రంథములతో పాటు, మన వేదశాస్త్రములను కూడ స్తనశల్యపరీక్షచేసి విమర్శించ సాహసించుచున్నాము. ఇంతామాత్రము చేత, వానియందును, ఆ గ్రంథకర్తలయందును మాకు గౌరవము లేదని భావించజనదు. వానిలోని విషయములు భగవంతుని నూటనుండి వెలువడినవనియు, అవి పరమప్రమాణమనియు, వాదించువారితో మేమేకీభవించము. ప్రస్తుత మతి సాంఘిక సాంప్రదాయముల పునాదులనే విమర్శించి, ఖండించుచున్నగాని, మానవసౌభ్రాతృత్వము దుర్లభముగనుక, నైతికధర్మములు కూడ, మానవసంఘాభివృద్ధికై యెట్లు పరిణామమును పొందెనో, పొందుచున్నవో తెలుపుట, యీ విద్యాపీఠమువారి ముఖ్యాశయము - అహింసాసత్యములు మొదలగు ధర్మములు, నిత్యములు, అనాదులు కావనియు, వీనిలో కూడ సూక్ష్మస్థూలభేదములుండి తీరుననియు, యివన్నియు, సర్వకాలసర్వావస్థలయందును అనుల్లంఘనీయములని యెంచకూడదనియు, మన పురాతనవైదికగ్రంథములే చాటుచున్నవి. వీనినన్నిటిని మరియొక గ్రంథములో తెలిపెదము.

పై పునాది సూత్రముల నంగీకరించువారు, తమసాంఘిక సౌఖ్యమునకు గాను, యెట్టి మతాచారము నవలంబించి, తమకు నచ్చిన యే సంఘములో చేరియున్నను, తమలో తమకు తగవు లుండవలసిన పనియేలేదు. మానవుడు సాంఘికజీవి యగుటవలన, కొన్ని మతసాంఘిక సాంప్రదాయములతో కూడుకొన్న యే సంఘములో నైనను తాను చేరియుండక తప్పదు. కాని, యితనికి, పరమతములమీద అసహనము, అన్యమత స్వీకరణనిరసనము, మతావేశము, దురభిమానము, మూర్ఖపక్షపాతము మొదలగు దుర్గుణములుండవు. ఇతను, తనసౌఖ్యమునకు ఒక సంఘములో చేరవలసియుండుటచేత, దాని కట్టుబాట్లకు లోబడియున్నానని, యనుకొనును గాని, అవి దైవనిర్మితములని యెంచడు. ఇట్టి దృక్పధము మనకు కలిగినపుడే, మనము యే సంఘములో చేరియున్నను, ప్రస్తుత మతకలహములను నిరసించుచు, సోదరభావముతో మెలగగలము.

వల్లూరి సూర్యనారాయణరావు

సెక్రటరీ

ఆంధ్రగీర్వాణవిద్యాపీఠము

కొవ్వూరు

3-10-35