స్మృతికాలపు స్త్రీలు/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము.
భారతదేశ చరిత్రలో వివిధకాలములలో స్త్రీలస్థితి యెట్లుండెనో తెల్పు గ్రంథములను వ్రాయుటకై నేను సంకల్పించు కొనినట్లు నేనిదివఱలో రచించియుండిన "వేదకాలపు స్త్రీలు" అను గ్రంథముయొక్క యుపోద్ఘాతములో చెప్పియున్నాను. ఆగ్రంథముల ప్రయోజనమును వాని రచనావిధానమును గూడ నట వివరించియుంటిని. అప్పటికే నేను స్మృతి కాలపు స్త్రీలను గూర్చి కూడ కొంత పరిశీధనము చేసియుంటిననికూడ తెల్పితిని. ఈలోపున నాపరిశోధన పూర్తియై తత్ఫలితముగ నీగ్రంథము వెల్వడుచున్నది.
ఋషులచే వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథములకే స్మృతులని పేరు. వేదములను మనస్సుననిడికొని వీనిని ఋషులు స్మరించుటచేతనే (శ్రుతింవశన్తిమునయ: స్మరన్తిచతథా స్మృతిం) వీనికి స్మృతులను నామమువచ్చినదని మనవారు చెప్పియున్నారు. ధర్మశాస్త్ర ప్రవర్తకులైన ఋషుల నామములు యాజ్ఞవల్క్యస్మృతిలో నీయబడినవి.
మన్వత్రివిష్ణుహారీత యాజ్ఞవల్క్యోశనాంగిరా:
యమా స్తంబసంవర్తా: కాత్యాయనబృహస్పతీ
పరాశరవ్యాస శంఖలిఖితా దక్షగౌతమౌ
శాతాతపో వసిష్ఠశ్చ ధర్మశాస్త్ర ప్రయోజకా: [యాజ్ఞ 1-4,6]
శ్రుతామే మానవాధర్మా వాసిష్ఠా: కాశ్యపా స్తథా
గార్జీయా గౌతమీయాశ్చతథా చొఎశనసా:శ్రుతా:
అత్రేర్విష్ణోశ్చ సంవర్తాద్దక్షా దంగిరన స్తథా
శాతాతపాచ్చహారీతా ద్యాజ్ఞవల్క్యాత్తదైవచ
కాత్యాయన కృతాశ్చైపతథా ప్రాచేతసాన్మునే: [పరాశర. 1-13, 14, 15]
ఇట్లు పరాశరయాజ్ఞ వల్క్యులచే పేర్కొన బడిన స్మృతికారుల సంఖ్య యిఱువదిరెండని తేలుచున్నది; (1) మనువు (2) అత్రి (3) విష్ణువు (4) హారితుడు (5) యాజ్ఞవల్కుడు (6) ఉశనుడు (7) ప్రాచేతనుడు (8) యముడు (9) అపస్తంబుడు (10) అంగిరసుడు (11) సంపర్తుడు (12) కాత్యాయనుడు (13) బృహస్పతి (14) పరాశరుడు (15) శంఖుడు (16) లిఖితుడు (17) దక్షుడు (18) గౌతముడు (19) శాతాతవుడు (20) వసిష్ఠుడు (21) కశ్యపుడు (220 గర్గుడు.
వీరుకాక యీక్రిందివారుకూడ స్మృతికర్తలుగ నితర గ్రంథములలో నుదాహరింపబడి యున్నారు; (23) వృద్ధపరాశరుడు (24) దేవలుడు (25) బుధుడు (26) పులస్త్యుడు (27) నారదుడు (28) బోధాయనుడు. ఈ యిఱువది యెనిమిది స్మృతులలోను గర్గవిష్ణు దేవల పులస్త్యకాశ్యపప్రాచేతన స్మృతులను దక్క మిగిలినవాని నన్నిటిని పరిశోధించియే నే నీగ్రంథమును వ్రాసియున్నాను. ఈ దేవలాదిస్మృతులు ప్రస్తుతము లభ్యములు కాకుండుటయే వీనిని వదలివైచుటకు కారణము. దేవలస్మృతి యను పేర నొకస్మృతి యిపుడుగలదు. కాని యది సరియగు దేవలస్మృతి కాదని యందఱు నంగీకరించియున్నారు. పైన పేర్కొన బడిన స్మృతులనే కాక హిరణ్య కేశి బోధాయనాపస్తంబాది విరచితములైన గృహ్యసూత్రములను గూడ పరిశోధించి యందు స్త్రీలనుగూర్చి గల యంశములను గూడ తీసికొంటిని. కొందఱు ధర్మశాస్త్ర కారులే గృహ్యసూత్రములను గూడ వ్రాసియున్నారు. గృహ్యసూత్రములు కూడ స్మృతులవలెనే ప్రమాణములు.
పై గ్రంథము లన్నిటిని మూలములోనే పరిశోధించితిని కాని భాషాన్తరీకరణములను తీసికొనలేదు. వీని నర్థము చేసికొనుటలో ముఖ్యముగ స్వబుద్ధినే యుపయోగించితిని. భాషక్లిష్టముగ నున్నచోటులలోను కొన్ని యితరస్థలములలోను వ్యాఖ్యానములను జూచియున్నను మూలగ్రంథా ధారము లేకుండ వ్యాఖ్యాత లేమి చెప్పినను నేను తీసికొనలేదు. కొన్నిస్థలములలో వ్యాఖ్యాతలు చేసిన యర్థములకు భిన్నముగ కూడ నర్థము చెప్పితిని.
హిందువులకు శ్రుతులకు బిమ్మట స్మృతులే యెక్కుడు ప్రమాణము లగుటచేతను, కాలములో గూడ నివివేదముల కంటె నర్వాచీనములే కావునను నా పరిశోధనకు వేదకాలపు స్త్రీలకు బిమ్మట స్మృతికాలపు స్త్రీలను తీసికొంటిని. స్మృతి వాజ్మయమారంభమైనది మొదలంతమగు వఱకును నడుమ చాలకాలము కలదనియు నీ కాలములో ననేకములగు నితర విధములగు వాజ్మయములు గూడ బయలుదేరినవనియు స్పష్టముగ తెలియుచున్నది. కాన స్మృతియుగమని మనము దేనిని చెప్పలేము. ప్రథమచరమస్మృతులకు నడుమ చాలకాలము గడచెనను సంశమును మన ప్రాచీనులును నవీనులును గూడ నంగీకరించియున్నారు. ఇఱువురి మతములలోను గూడ మనుస్మృతి ప్రథమమును (ఆ మనుస్మృతి చాలమారి ప్రస్తుతమను స్మృతియైనదని నవీనులు చెప్పుదురు) పరాశరస్మృతి చరమమునై యున్నవి. మిగిలిన వీ నడుమకాలమున రచింపబడినవి. కల్పారంభమున మనుస్మృతియు కల్యారంభమున పరాశరస్మృతియు రచింపబడినవని యా స్మృతులలోనే కలదు. మఱియు త్రేతాయుగములో గౌతమస్మృతియు, ద్వాపరములో శంఖలిఖితస్మృతియు రచింపబడినవని పరాశరస్మృతి చెప్పు చున్నది. కాన మన ప్రాచీనులదృష్టిలోకూడ స్మృతులన్నియు నొకేకాలమున రచింపబడలేదు. ఆధునికులు స్మృతుల కింత ప్రాచీనతయొప్పరు. ప్రస్తుతస్మృతులలో ప్రాచీనతమమైన గౌతమధర్మసూత్రము క్రీ.పూ ఏడవశతాబ్దమునను, సర్వాచీనతమమైన పరాశరస్మృతి క్రీ.శ పదమూడవశతాబ్దమునను రచింపబడినవని వారందురు. ఈ రెండువేల సంవత్సరముల కాలములోను నపుడపుడు దేశములో గల్గుచుండిన యాచార పరిణామముల ననుసరించి యాయాస్మృతులు వ్రాయబడు చుండినవని విమర్శకుల యభిప్రాయము.
మన ప్రాచీనులుగూడ నొక్కొకస్మృతి యొక్కక యుగమునకు ముఖ్యప్రమాణమనిరి. మను గౌతమశంఖలిఖిత పరాశరస్మృతులు కృత త్రేతా ద్వాపర కలియుగములలో ముఖ్య ప్రమాణములు. ఈ నియమమునకు లోబడి స్మృతులన్నియు సమప్రమాణములే. ఆధునికవిమర్శకులు కొన్నిస్మృతులకు కాలనిర్ణయము చేసియున్నారు. ఆ నిర్ణయము లిట్లున్నవి. గౌతముడు క్రీ.పూ 600. బోధాయనుడు క్రీ.పూ 550. హిరణ్యకేశి క్రీ.పూ 500. ఆపస్తంబుడు క్రీ.పూ 500. ప్రస్తుతమనుస్మృతి క్రీ.పూ 200. మొదలు క్రీ.శ 100. లోపున. సంవర్తుడు క్రీ.పూ. 200. యాజ్ఞవల్క్యుడు క్రీ. పూ 100 కిని క్రీ.శ. 200.కును నడుమ. బృహస్పతి క్రీ.శ.200. హారితుడు క్రీ.శ. 400 కును 700 కును నడుమ. పరాశరుడు క్రీ.శ. 1200. పరాశరస్మృతికి పిమ్మట పుట్టిన ధర్మశాస్త్ర గ్రంథములన్నియు వ్యాఖ్యానములో నిబంధన గ్రంథములో యైయున్నవి.
మొత్తముపై స్మృతులలో నాయాకాలముల నాటి స్త్రీలపరిస్థితులు ప్రతిబింబింపబడినవని చెప్పవచ్చును గాని యందు గన్పట్టు స్త్రీవిషయకవిధి నిషేధవాక్యములన్నియు పూర్తిగా పాటింపబడుచుండెనని చెప్పుటకు వీలులేదు. కాన స్మృతు లాయాకాలముల నాటి స్త్రీ విషయకములగు నాదర్శములను క్రోడీకరించుచున్నవని కూడ చెప్పవలెను. ఈ స్థితులును నాధర్మములును గూడ నీ గ్రంథములో వివరింపబడినవి కాన చారిత్రకదృష్టి కలవారికిని నదిలేక కేవలము స్మృతులలోని ధర్మముల నా చరణలో పెట్టవలెనని కోరువారికిని గూడ నీ గ్రంథముపయోగించును.
నే నీగ్రంథములో నేమి చెప్పిననుగూడ నందుల కాధారములగు స్మృతివాక్యములనట నిచ్చియున్నాను. ఆ వాక్యముల స్థలనిర్దేశమును గూడ చేసి వాని యర్థములను గూడ నిచ్చియున్నాను. నాకు గలస్త్రీ విషయకాభిప్రాయములను స్మృతివాక్యములలోనికి చొప్పించుటకు నే నెచటను యత్నిం పలేదు. అట్లే నా యాశయములకు భిన్నములగు స్మృతివాక్యములను వేనిని బుద్ధిపూర్వకముగ వదలివేయలేదు. కాన నేను చెప్పినయర్థములలోని లోపములనుగాని నేను వదలివైచిన ముఖ్యములగు స్మృతివాక్యములను గాని యెవరైనను నా దృష్టిపథమునకు తెచ్చుచో నా లోపములను తగువిధమున సవరించుకొందును.
గ్రంథము ముద్రణములోనున్న కాలములో గూడ నదివఱలో నాదృష్టినుండి తప్పిపోయిన కొన్ని స్మృతివాక్యములు నాకు కన్పట్టుచుండినందువలనను కొన్ని వాక్యములకు నూతనార్థములు స్ఫురించుచుండినందువలనను రెండవప్రూపులో గూడ చాల సవరణలు చేయుచువచ్చితిని. అన్నిటికిని నోపికపట్టి గ్రంథమును చక్కగ ముద్రించిన శ్రీ సరస్వతీ పవర్ ప్రెస్సు వారికి కృతజ్ఞుడను. గ్రంథము పూర్తిగా ముద్రింపబడిన పిమ్మట గూడ కొలది సవరణలను జేయవలసిన యావశ్యకత నాకు గన్పట్టినది. కాన నొక సవరణలపట్టికను గ్రంథా స్తమున వేసితిని. మూలగ్రంథముద్రణము పూర్తియగువఱకును సిద్ధాన్తమును చేసికొనకుండ నన్ను కలవరపఱచిన సమావేశన స్త్రీ పునర్వివాహ విషయకములగు కొన్ని యంశములను గూడ నిందు చేర్చితిని. ఈగ్రంథ పరంపర వెలువడుటకు కారణభూతులగు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకవర్గము వారికిని పుస్తక ప్రచురణ నిధిని విద్యాపీఠమునకొసగి మూలకారకులైన మహారాజశ్రీ వల్లూరి సూర్యనారాయణరావు పంతులుగారికిని నాకృతజ్ఞతా వందనము లర్పించుచున్నాను.
జటావల్లభుల పురుషోత్తము ఎం.ఏ.
ప్రిన్సిపల్, ఆం.గీ.వి.పీఠము.
శ్రీ. వా. జో. వే. శా. కళాశాల. కొవ్వూరు.