Jump to content

సులక్షణసారము

వికీసోర్స్ నుండి

లక్షణసారసంగ్రహము

శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు, బి. ఏ., బి. ఇడి.

లింగమగుంట తిమ్మకవి రచించిన లక్షణసారసంగ్రహమను పేరుగల సులక్షణసారము యొక్క తాళపత్రప్రతి దొరికిన విధమును మొదటఁ గొంత చెప్పవలసియున్నది. గుడియాత్తములో నొకరివద్ద నొక చిన్నతాళపత్రములకట్ట యున్నదని విని యతని నొకయేఁడాదిగా వేడితిని. ఎట్టకేలకు దానిని నా కతఁ డిచ్చెను. అతనికి నాతాటాకులకట్టలో నేమి కలదో తెలియదు కాని దానిని నాచేతఁ బెట్టిన మఱుక్షణమునుండి, తిరిగి యిచ్చివేయుమని ప్రాణముఁ దీసినాఁడు. అంతట వానిలో ముఖ్యమైనవానిని గ్రహించి తక్కిన తుక్కును వానికి నిచ్చివేసితిని. తనకట్ట తనకుఁ జేరినదని బహ్మానందభరితుఁడైనాఁడు. నాకు నిచ్చునప్పటికే వానికట్టలోఁ గొన్నిటి నెలుకలు, పురుగులు కొట్టివేసినవి. తక్కినవాని గతికూడ నంతియే. ఇట్టికారణములచే నతఁడు తన పేరు నిప్పట్టునఁ బ్రకటింపఁబడు భాగ్యమునుఁ గోల్పోయినాఁడు.

నేను చేఁజిక్కించుకొన్నకట్టలో సులక్షణసార భాగమేగాక, కవిరాజు వేంకటరాజు అను నతని సూర్యచ్ఛందము - దీనికి మొదలు లేదు - కవిగజాంకుశము; కవివాగ్బంధము గలవు. వీనిలో సూర్యచ్ఛందము కొత్తగ్రంథము.

నేను 1921లో వెలకుఁ దెప్పించిన సులక్షణసారముమీఁద వెల్లంకి తాతంభట్టు రచితమనియే కలదు. అది నిజముగా విచారింపఁదగిన విషయము. ఏలయన, శ్రీకందుకూరి వీరేశలింగముగారు 1899 లో నచ్చువేసిన కవులచరిత్రములో సులక్షణసారము తిమ్మకవి కృతమని స్పష్టముగా వ్రాసినారు. వావిళ్లవా రటుపిమ్మటనైనను దాము చేసినలోపమును గ్రహించి సవరించుకొన్నారు. నే నీలక్షణగ్రంథభాగమును సవరించుటలో వావిళ్ళవారు 1953 లో నచ్చువేసిన సులక్షణసారమునుండియే అధోజ్ఞాపికలలో నెల్లెడలనుఁ బద్యసంఖ్యలఁ జూపినాను.

లింగమగుంట తిమ్మకవి కవిపండితవంశమునకుఁ జెందినవాడు. నెల్లూరు జిల్లాలోని గుండ్లకమ్మ (కుండికానది)యేటితీరమున లింగమగుంట గ్రామమున్నది. ఇందు వసించుటచే లింగమగుంట యింటిపేరైనది. వీరివంశవృక్షము —

(రామకవి వ్రాసిన చతుర్వాటికామాహాత్మ్యములోని తిమ్మకవి వ్రాసిన సులక్షణసారములోని వంశవర్ణన పద్యములనుండి పైవంశవృక్షము వాయఁబడినది. రెండు పుస్తకములలోఁ జెప్పఁబడినవానిలో స్వల్పభేదములు లేకపోలేదు. రామకవి తన తండ్రిపేరు, రామయని జెప్పగా, తిమ్మకవి లక్ష్మణ యని చెప్పినాఁడు. మొత్తముమీఁద నివి విశేషప్రమాదకరమైన భేదములై, సిద్ధాంతములను దాఱుమాఱుచేయునవి గాకుండుటచేఁ బ్రస్తుతము విడువబడినవి.)

పైవంశములోని వారిలో -

(1) సర్వకవి కవిసార్వభౌముఁడని వర్ణింపఁబడినాఁడు. ఇతఁడు క్రీ. శ. 1500 ప్రాంతపువాఁడు కావచ్చును. రచించిన గ్రంథములేవో తెలియవు.

(2) రామకవి క్రీ. శ. 1350 ప్రాంతపువాఁడు కావచ్చును. ఆనందకాననమాహాత్మ్యము, చతుర్వాటికామాహాత్మ్యము, వేంకటమాహాత్మ్యము, మత్స్యపురాణము, వామనపురాణమునను గ్రంథములను రచించెను. వీనిలోఁ జివరి మూఁడు లభించుటలేదు. ఇతఁడు సుప్రసిద్ధకవియైన తెనాలి రామలింగని యల్లుఁడు.

3) తిమ్మకవి కీ. శ. 1560 ప్ర్రాంతపువాఁడు. అన్నదమ్ము లిరువురునుఁ జిక్కంభట్టరుయొక్క శిష్యులు. ఇతఁడు రామభక్తుఁడు. తిమ్మన సులక్షణసారమును రచించెను. బాలబోధయను మఱియొకలక్షణగ్రంథమునకుఁగూడఁ గర్తయని పండితులు గొందఱు చెప్పుచున్నారు. దీనిని గుఱించి కొంచె మిక్కడ వివరించెదను.

“బాలబోధఛందస్సుకర్త పేరెఱుంగరాదు. అందు బహుప్ర్రాచీనగ్రంథము లుదాహృతములయ్యెను. ప్రాచ్యలిఖితపుస్తకశాలలోఁ గొంత, మానవల్లి రామకృష్ణ కవిగారిదగ్గఱఁ గొంత కలద”ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పిరి. మానవల్లి రామకృష్ణకవిగారు దీనికి బాలబోధమనియు, గవిసంజీవినియనియు సందిగ్ధనామములు గలవని వ్రాసియున్నారు. "లింగమగుంట తిమ్మన బాలబోధచ్ఛందస్సును వ్రాసినట్లు పాకనాఁటియందుగల కౌలూరి యాంజనేయకవి తనసుకవికర్ణామృతమను లక్షణగ్రంథమున నుడివియున్నా” డని శ్రీ నిడదవోలు వేంకటరావుగారు వ్రాసియున్నారు[1]. ఈలక్షణగ్రంథ మింతవఱకు ముద్రణభాగ్యమును నోచుకొనలేదు గాన దీనినిగుఱించి యధికముఁగా జెప్పుటకు వీలు లేదు.

లక్షణగ్రంథములలో కెల్ల లింగమగుంట తిమ్మన వ్రాసిన సులక్షణసారమునకు మిక్కిలి జనత (పాప్యులారిటి) గలదు. కాని యాజనతయంతయు గణములు, యతులు, ప్ర్రాసలు దెలుపు భాగమునకే, కాని మిగత దానికిఁ గాదు. కావున నాగణాదుల భాగమే క్రీ. శ. 1862 లో ముద్రణ కెక్కినది.

సులక్షణ సారములోఁ గొంతభాగమే యచ్చున కెక్కినదని ముద్రాపకులు, పండితులు క్రమక్రమముగా గ్రహించిరి. మిగతభాగమునకై కొందఱు శ్రమపడినాడు. కాని లాభించలేదు. ఇతరగ్రంథములలో నుదహరింపఁబడిన పద్యములను మాత్రమే యొకచోటఁ జేర్చి తృప్తి నొందవలసివచ్చినది.

శ్రీ వీరేశలింగముగారు తమ కవులచరిత్రలోఁ సులక్షణసారము చిన్నది కాదు. వారి కంటఁబడిన పుస్తకము పెద్దదియే. కాని యది యేలకో యచ్చునకు రాలేదు. దానిగతి యేమైనదో కూడ తెలియదు. ఇప్పుడు నాకు దొరికిన పుస్తకభాగములో వా రుదాహరించిన కవుల పేరులు, పద్యములు చాలవఱకు గలవు.

నాకు దొరకిన పుస్తకములోఁ దిమ్మకవి తన వంశాదికమునుగుఱించి చెప్పికొన్న పద్యములకుఁ బిమ్మట నక్షరముల, గణములయొక్క యాధ్యాత్మికప్రభావము (స్పిరిచ్యుయాలిటి) గలదు. ఈమాత్రము గ్రంథమైనకు లభించినదే!

నాకు లభించిన పుస్తకము లింగమగుంట తిమ్మన రచించిన సులక్షణసార మౌనా, కాదా యను ప్రశ్న యుత్తరమును గోరు చున్నది. అట్టిపశ్నకుఁ దగినకారణము లేకపోలేదు. సాధారణముగా శాస్త్రగ్రంథములలో ననేకముఖ్యకవుల గ్రంథములనుండి భాగముల నెత్తి యొకచోట వ్రాసికొను నాచారముగలదు. ఇట్టివి సంకలనగ్రంథములు. నాకు లభించిన పుస్తకము గూడ నొక సంకలనగ్రంథమేనా?

తిమ్మకవి తనవంశాదికమునుగుఱించి చెప్పుకొన్న మీఁదట గ్రంథరచనకుఁ దొడంగినాఁడు. ఈగ్రంథములో నున్న పద్యములే మిగత లక్షణగ్రంథములలోఁ దిమ్మకవి గ్రంథములోనివి యని యుదాహరింపఁబడినవి. సులక్షణసారములోనివని వీరేశలింగముగారు తమ కవులచరిత్రలో నెత్తి చూపించిన కవుల నామములు, పద్యములు నాగ్రంథములోఁగలవు. తిమ్మకవి క్రీ. శ. 1560 ప్ర్రాంతపువాఁడు. గ్రంథభాగములో నుదాహరింపఁబడిన కవుల నామములు గ్రంథములు క్రీ. శ. 1560 కి పూర్వపువెగాని తర్వాతివి కాఁజాలవు కదా! కావున నిది సులక్షణసార భాగమేగాని వేఱొండు కాదని ఖండితముగాఁ జెప్పవచ్చును. ఈ భాగ మొకపూర్తిప్రకరణమైనను గాకుండుటచే ఇది గద్యకైనను నోచుకొనలేదు.

లింగమగుంట తిమ్మకవికాలమును గుఱించి వాదోపవాదములు లేవు. ఇతఁడు క్రీ. శ. 1560 ప్రాంతపువాఁ డనియె పెక్కుమంది యుద్దేశము. ఇతనికిఁ గొంచెముగా ముందువెనుకలనున్న లక్షణకవుల నామములనుఁ దెలిసికొనవచ్చును.

వెల్లంకి తాతంభట్టుక్రీ.శ.1480 ప్రాంతము
చిత్రకవి పెద్దన్నక్రీ.శ.1550 ప్రాంతము
ముద్దరాజు రామనక్రీ.శ.1550 ప్రాంతము
లింగమగుంట తిమ్మకవిక్రీ.శ.1560 ప్రాంతము

తిమ్మకవి వ్రాసిన లక్షణగ్రంథమునకు సులక్షణసారమను పేరొక్కటియె గలదా, లేక మఱియొకపేరు గూడ నున్నదా? నాకు దొరకిన తాళపతిపత్రిలో ప్రారంభ పద్యమునకు మున్ను లక్షణసారసంగ్రహమనియే కలదు, కాని వేఱొక్కటిలేదు. కావున దీనిముఖ్యనామము లక్షణసారసంగ్రహమనియు, సులక్షణసారమనునది రెండవపేరనియు గ్రహింపవచ్చును. ఈపుస్తకముయొక్క అసలు పేరు లక్షణసారసంగ్రహమని దెలియక పోవుటచే బెక్కు చిక్కు లేర్పడినవి.

తిమ్మకవి కంటె నించుక పూర్వుఁడైన చిత్రకవి పెద్దన్న యొక లక్షణసారసంగ్రహమును రచించియున్నాఁడు. ఇట్లు వీరిరువురు రచించిన గ్రంధములకు నొకే పేరుండుటచేఁ జిక్కులు ప్రాప్తించుటలో చిత్రము లేదు. కాఁబట్టి దీని రెండవ పేరైన సులక్షణసారము ప్రచానములోనికి వచ్చినది.

మానవల్లి రామకృష్ణకవిగారు కొన్నిచోట్ల లక్షణసారసంగ్రహమనియు, దానికర్త పెద్దన్న లేక చిత్రకవి పెద్దనయనియుఁ జెప్పుచు, నందుదహరింపఁబడిన కవులను, కావ్యములకు, గుఱించి చెప్పిరి. చిత్రకవి పెద్దన్న వ్రాసిన లక్షణసార సంగ్రహము మనకు లభించినది; ఆంధ్రసాహిత్యపరిషత్తు వారు ప్రకటించిరి. కాని మానపల్లి రామకృష్ణకవిగారు చెప్పిన కవులు నామములు గ్రంథములు నందు మచ్చునకైనఁ గన్నింపవు. లక్షణసారసంగ్రహమును చిత్రకవి పెద్దన వ్రాసెనను విషయ మెఱిఁగిన రామకృష్ణకవిగారికి మొదలు తుదలు లేని లక్షణసారసంగ్రహప్రతి యేదియో లభింపగా, దానిని వారు చూచి యది చిత్రకవి పెద్దన రచించిన గ్రంథముగా భావించి, ఫైవిధముగా వ్రాసియున్నారనియు, వారికి దొరికిన ప్రతి పెద్దన విరచితము కాదనియు, నిప్పుడు స్పష్టమగుచున్నది. తిమ్మకవిమాత్రమే తన లక్షణసారసంగ్రహములో నితరకవులను, కావ్యముల నెన్నింటినైన నుదాహరించియున్నాఁడు. పెద్దన యట్టిపనినిఁ దలపెట్టలేదు. కాబట్టి యుదాహృతపద్యములుగల పెద్దపుస్తకమేదో పెద్దన వ్రాసినది గలదని మనము భావింపనక్కఱలేదు. పెద్దన తనగ్రంథమున లక్ష్యములనన్నింటినిఁ దానే వ్రాయుటచేత గాఁబోలు తిమ్మన యితరులలక్ష్యములను జూపుపుస్తకమును వ్రాయుటకు దొరగొని, దానికిఁకూడ నదియేపేరుఁ పెట్టినాఁడు. పెద్దన తిమ్మనలు వ్రాసిన పుస్తకములపే రొక్కటియే యగుటచేత నింతగజిబిజి పుట్టినది. తిమ్మన తన పుస్తకమునకు లక్షణసారసంగ్రహమని పేరు పెట్టుకొని, దానిని మంచిలక్షణసారముగాఁ జేసెదనని ప్రతిజ్ఞ చేసినాఁడు.

క.

లక్ష్మణశాస్త్రము లెల్లఁ బ
రీక్షించుటఁ గొంతకొంత యెఱిఁగిన వాఁడన్
లాక్షిణికా నుగ్రహతను
లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్.

పుస్తకతత్త్వమును దెల్పుమాటయే తర్వాత దానికిఁ బేరై వెలసినది. పేర్లలోని గజిబిజిని లోకులు సులక్షణసారమను పేరిడి తీర్చినారు.

లక్షణసారసంగ్రహమను మఱియొక A Triennial catalogue of Manuscripts 1913-14 to 1915-16. R No. 285 పుట 691 పుస్తకమున్నది. ఇది సంకలనగ్రంథము. కూర్పరిపేరు దంతి యప్పకవియని భావింపబడుచున్నది. ఇది సమగ్రముగానున్నది. దీనిలో సులక్షణసారము, కవిజనాశ్రయము, అనంతచ్ఛందము, వాదాంగచూడామణి, కవిసర్పగారుడము మున్నగు గ్రంథముల భాగములుగలవు. ఇందలి ప్ర్రారంభపద్యము సులక్షణసారపద్యముకంటె వేఱుగానున్నది. ఇది తిమ్మకవి కృతమగు సులక్షణసారముకంటె వేఱు.

లక్షణసారసంగ్రహమను నామమునకు ముందొకపదమునుఁ జేర్చి పేరుమార్చిన లక్షణశాస్త్రజ్ఞులు గొందఱున్నారు. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమును, ఉప్పులూరి వేంకటరెడ్డి సకలలక్షణసారసంగ్రహమును గూర్చిరి.

తిమ్మకవికృత లక్షణసారసంగ్రహము కొంత చిత్రముగా నున్నది. సంస్కృత గ్రంథములనుండియు, తెలుఁగు పుస్తకముల నుండియు నుద్ధృతముల నెత్తి కనఁబఱచుటయే గాక గ్రంథాదుల నామాదులను సంస్కృతభాషలోనే యిట్లుతెలియఁజేసినాఁడు. ఉదాహరణములు:-

'ఆంధ్ర భాషాయామ్- అధర్వణ ఛందసి' 'కవిసర్పగారుడే' 'మగణస్య' ఇత్యాదులు.

ఇట్లు కవి తనకుఁ గల సంస్కృతభాషాభిమానమును వెల్లడిచేసికొన్నాఁడు. లేఖకుల ప్రమాదము వలననే అక్కడక్కడ నట్టిసందర్భములలోఁ దెలుఁగు పదములు దొర్లినవి. అట్టివానిని నేను మార్చలేదు.

లక్షణగ్రంధములను రచించుటలోఁ బ్రాచీను లొక్కొక్క రొక్కపద్ధతి నవలంబించినట్లు తోఁచుచున్నది. కొందఱు అక్షరాదుల యాధ్యాత్మికప్రభావము (స్పిరిచ్యుయాలిటి)నకుఁ బ్రాముఖ్యము నిచ్చి రచించినారు — కవివాగ్బంధము, కవిరాజగజాంకుశము నిట్టివియే. మఱియుఁ గొందఱు గణయతిప్రాసవృత్తాదులను బ్రధానముగా నెంచినారు. అనంతుని ఛందస్సు, ముద్దరాజు రామనకవి సంజీవిని, మొదలగునవి. ఇంకను గొందఱు వ్యాకరణాద్యలంకారములఁగూడ సదసముగా జేర్చినారు – కావ్యాలంకారచూడామణి, అప్పకవీయము వంటివి.

ఇప్పుడు దొరకిన యీసులక్షణసార భాగములో నక్షరగణాదుల దివ్యత్వము దెల్పఁబడినది. తిమ్మకవి వ్రాసిన పూర్తిగ్రంథ మెట్లుండునో మనమూహించుకొనుటకుఁగూడ నొకచక్కని మార్గమున్నది. ఈకవిగ్రంథమును సన్నిహితముగా ననుసరించి గ్రంథరచన చేసినవాఁడు కస్తూరిరంగకవి. అతని గ్రంథము పేరు ఆనందరంగరాట్ఛందము. సులక్షణసారము పోయినను కస్తూరిరంగకవి గ్రంథము మిగిలిన యెడల సుక్షణసారము నూటికి దొంబదిపాళ్లు మిగిలినదనియే చెప్పవచ్చును. కాఁబట్టి మనకు దొరకని భాగము రంగకవియొక్క ఆనందరంగరాట్ఛందములోని తక్కినభాగమువలె నుండునని యూహింపవచ్చును.

లక్షణసారసంగ్రహములో ననేకకవుల నామములు కావ్యములు నుద్ధరింపబడినవి. వాని నిక్కడ సంస్కృతమునకునుఁ, దెలుఁగునకును వేఱువేఱుగా వర్గీకరించి చూపెదను.

సంస్కృత లక్షణగ్రంథములు

  • అలంకారచూడామణి
  • అలంకారసంగ్రహము
  • కవికంఠపాశము
  • గోకర్ణచ్ఛందస్సు (ఋషిప్రోక్తే)
  • చమత్కారచంద్రిక
  • నానాలంకారము
  • లక్షణాదినికాయము (వీరాద్యుఁడు)
  • వృత్తరత్నాకరము (కేదారకవి)
  • సాహిత్యచంద్రోదయము
  • సాహిత్యచూడామణి
  • సాహిత్యరత్నాలయము
  • సాహిత్యరత్నాకరము

సంస్కృతోదాహృతగ్రంథములు

  • అమరుకము
  • ఉత్తరరామాయణము
  • ఏకావళి
  • కాలనిథానము
  • కుమారసంభవము (కాళిదాసు)
  • కుసుమాయుధ వ్యాకరణము
  • కృష్ణజయము (కృష్ణభట్టు)
  • కేదారకవి (వృత్తరత్నాకరమా?)
  • గణితశాస్త్రము
  • ఛప్పన్నము
  • తర్కభాష
  • నలోదయము
  • భారవి
  • భోజరాజీయము
  • మంత్రదర్పణము (శంకరాచార్యులు)
  • మణిదర్పణము
  • మాఘము
  • రఘువంశము
  • వామనశకునము
  • శివభద్రము
  • శ్యామలాదండకము
  • సార్వభౌమకవి
  • సాహసాంకము (పృథ్వీధరాచార్యులు)
  • సూర్యసిద్ధాంతము

ఆంధ్ర లక్షణగ్రంథములు

  • అధర్వణ ఛందస్సు
  • అనంతుని ఛందస్సు
  • ఉత్తమగండ ఛందస్సు
  • కవిరాజగజాంకుశము
  • కవిసర్పగారుడము
  • కావ్యచింతామణి (తాతంభట్టు)
  • కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దరాజు)
  • గోకర్ణచ్ఛందము
  • వాదాంగచూడామణి
  • విశ్వేశ్వరచ్ఛందము
  • వేములవాడ భీమకవి
  • శ్రీధరచ్ఛందస్సు

ఆంధ్రోదాహృతగ్రంథములు

  • అరణ్యపర్వము (ప్రబంధపరమేశ్వరుఁడు)
  • ఆదిపర్వము (శబ్దశాసనుఁడు)
  • కల్పవల్లరి
  • త్రిస్థలిదండకము (నంది తిమ్మన)
  • ద్వితీయస్కంధము (భాగవతము)
  • యుద్ధకాండము (రామాయణము)
  • విరాటపర్వము (ఉభయకవిమిత్రుఁడు)
  • శరభాంకుఁడు పైవానిలోఁ గొన్ని నూతనములు. కల్పవల్లరి క్రొత్తపేరు. సర్వత్ర వాదాంగచూడామణి యనియే పేరుగలదు; పాదాంగచూడామణి మొదలగు పేరు మార్పులతోఁ గానఁరాఁదు. ఇది మల్లన్న కృతమని యితర లక్షణగ్రంథములనుండి దెలియుచున్నది.

కవిరాజగజాంకుశము పే రొకతూరియైనఁ జెప్పబడినదిగాని కవివాగ్బంధము పేరు స్పృశింపఁబడనైనలేదు. కాఁబట్టి తిక్కన సోమయాజికృతమని చెప్పబడెడు నీగ్రంథము నిజముగా తిక్కనదిగాక అతనిపేరున వేరెవరో కూర్చినదని దృఢముగ జెప్పవచ్చును. భీమకవి యాదికవిగాఁ బేర్కొనఁబడినాఁడు. అతని పుస్తకము పేరు మాత్రము చెప్పఁబడ లేదు. అట్లే రేచని పేరెత్తఁబడలేదు. అటులే కవిజనాశ్రయము పేరు గూడలేదు. ఇందుఁ బేర్కొనఁబడిన లక్షణగ్రంథములలోఁ గొన్ని ఇతర లక్షణగ్రంథములలో మాత్రమె గుర్తింపఁబడుచున్నవి; విడిగ్రంథములు దొరకుటలేదు, పై జెప్పఁబడిన గ్రంథములలో, మనకుఁ దెలిసింత మట్టుకు నొకటిఁ గూడ క్రీ.శ. 1550 దాఁటివచ్చునది లేదను విషయమును గుర్తింపవచ్చును.

ఈలక్షణసారసంగ్రహమును కస్తూరిరంగకవి జాలవఱకు ననుసరించినాఁడని ముందే చెప్పియుంటిని. కాని కేవలము గుడ్డిగా ననుకరించలేదు. ఒక్కొక్కయెడ మూలములోని యంశములను విడిచిపెట్టినాఁడు. ఒక పెద్దభేదమునుఁ జెప్పెదను. తిమ్మకవి యక్షరమాలలోని యేఁబదియక్షరములయొక్క తాత్త్వికప్రభావము నేఁబదిపద్యములలో వ్రాసినాఁడు. ఇవి చాలవఱకు సంస్కృతమునకుఁ దెలుఁగే. సంస్కృతములో దీనిని పాణిని వ్రాసినాఁడని కవిరాజు వేంకట రాజకృతసూర్యచ్ఛందమునుండి తెలియుచున్నది. ఆయేఁబదిపద్యముల లోని భావమును రంగకవి రెండు మూఁడు పద్యములలోఁ జక్కగ నిమిర్చినాఁడు. కాబట్టి రంగకవి కొన్నిపట్టులలోఁ గొంత స్వతంత్రించినాఁడని చెప్పవలసియున్నది.

సులక్షణసారములో నక్కడక్కడ టీకా వివరణలుగలవు. ఇవి వ్యావహారికభాషలోనున్నవి. తిమ్మకవియే వీనినిరచించియు౦డునని వేఱుగఁ జెప్పనవసరములేదు. కస్తూరి రంగకవి వీనిలోఁ గొన్నిటికి గ్రాంథికములోనికి మార్చినాఁడు ఉదాహరణము:-

తిమ్మకవి టీక:- శ్రీకారం బెటువలెనంటే - శవర్ణ, రేఫ, ఈకారములు కూడగా శ్రీకారమాయెను. అందు శవర్ణరేఫలకు గ్రహం చంద్రుడు. కనుక ఈకారానకు గ్రహం సూర్యుడు. వారిద్దరి కన్యోన్యమైత్రి, కనుక శవర్ణ ఈకారముల కధిదేవత లక్ష్మి. రేఫకు అగ్నిదేవత. అయితేనేమి అగ్ని లక్ష్మీప్రదుండు. ఇందుకు సమ్మతి- (లక్షణ. సా వ 220).

కస్తూరి రంగకవి- శవర్ణమను ఈకారమును రేఫయును గూడిన శ్రీకారమయ్యెను. అందు శవర్ణ రేఫలకుఁ జంద్రుడు గ్రహము. ఈకారమునకు సూర్యుఁడు గ్రహము గనుక వారికిద్దఱికి నన్యోన్యమైత్రి. ఈ కారశవర్ణముల కధిదేవత లక్ష్మీదేవి, రేఫ కధిపతియగ్ని- (ఆనంరం. ఛం. వ 148)

ఈలక్షణసారసంగ్రహభాగములో 248 గద్యపద్యములున్నవి. నీనిలో 48 వఱకు వావిళ్లవారు బ్రకటించిన సులక్షణసారప్రతిని గన్నడుచున్నవి. ఆగ్రంథపరిష్కర్తలు మిగుల శ్రమపడి, యితర లక్షణగ్రంథములను బరిశీలించి, వానిని జేర్చినారు. వారు పడినశ్రమ బహుబ్రశంసనీయము. వారిచే నితరగ్రంథములనుండి సేకరింపఁబడినట్టి యాపద్యములు మూలగ్రంథమైన లక్షణసారసంగ్రహములో నేక్రమములో నున్నవో యిప్పుడు పరిశీలింపవచ్చును. ఈపుస్తకములోఁ బాఠాంతరములు నట్లేయుంచితిని. దీనిలోని పద్యములకు సంఖ్యలను నేనిచ్చితిని.

పీఠికను ముగించుటకుముం దీతాళపత్రప్రతినిగుఱించి మఱియొకమాట చెప్పవలసియున్నది. దీనిని వ్రాసిన లేఖకుఁడు నావలెనే పండితుడు గాఁడు. ఉత్సాహవంతుఁడు. అతని యుత్సాహమువలననే మనకీ పుస్తకభాగ్యము దక్కినది. కాని పాండిత్యము లేకపోవుటచేఁ బంక్తి యొక్కంటికిఁ బదితప్పులకుఁ దక్కువలేని పంక్తి యీ గ్రంథములో లేదు. ఇతరగ్రంథముల సహాయముస దీనిలో నొక మార్గమును గనుఁగొనఁగలిగితిని. అట్టిసహాయము లేని చోట్ల సంస్కరణకుఁ దగ్గించితిని, ఉన్న బాధలకుఁదోడు మఱియొకటి కలదు. తాళపత్రప్రతిలో అరసున్నలన్నియు నిండుసున్నలుగా నుండును వానిసంస్కరణ వేఱొకపని. ఇట్టిది బహుబాధకరమైన కార్యమైనది. శక్తివంచనలేక కృషి చేసితిని.

  1. చాగంటి శేషయ్య గారి యాంధ్రకవితరంగిణి సం 9. పుట 185.