సుమిత్ర చరిత్రము/సుమిత్ర చరిత్రము కథ

వికీసోర్స్ నుండి

సుమిత్ర చరిత్రము

పూర్వకాలమున సింహళద్వీపమును సుమిత్రుఁ డను రాజు పాలించుచుండెను. ఆయనకు రూపవతియు, గుణవతియు నగు మంజువాణి యను రాణి గలదు. వా రిరువురును పరస్పరానురాగము గలవారయి, యపారమయిన సుఖము ననుభవించుచుండిరి. ఈ యుత్తమ నాయకామణితోడి ప్రణయము చేత, ఆతనికి బాల్యసఖుఁడును, సహపాఠియు నయిన చంద్రవర్మ యను మలయాళదేశపు రాజును మరలఁజూచి యాతనికి దన ప్రియభామినియొక్క సద్వర్తనమును జెప్పవలెనని యప్పుడప్పుడు పుట్టు అభిలాషతప్ప వేరుకోరిక యేమియు లేక యుండెను. సుమిత్రుడును చంద్రవర్మయు పిన్ననాటినుండియు నొక చోటనే యేకముగాఁ బెరిగిరి; కాని వారితండ్రుల మరణానంతరమున దమతమ దేశముల నేలుట కయిఁ యెడఁబాయ వలసి వచ్చినందున, వారు తఱుచుగా బహుమానములను, ఉత్తర 'ప్రత్యుత్తరములను, ప్రియపూర్వకము లయిన క్షేమ వార్తలను బంపుకొనిచుండినను బహుసంవత్సరములనుండి యనోన్య ముఖావలోకనములు మాత్రము లేక యుండిరి.

ఇట్లు కొంతకాలము జరుగఁగా సుమిత్రుడు తన్నొక సారివచ్చి చూచి పొమ్మని మిత్రునకు మాటిమాటికి వర్తమా నములు పంపుచు వచ్చినందున, మళయాళమునుండి బయలుదేఱి చంద్రవర్మయుఁ బరిమితపరివారముతో మిత్రసందర్శనార్థ మయి సింహళద్వీపమునకు వచ్చెను. ఈసమావేశమువలన జిరకాల మెడబాసియుండి యాకస్మికముగా గలిసిన యా మిత్రుల కిరువురకును గలిగిన యానంద మింతింత యని చెప్ప నలవి కాదు. రాకరాకవచ్చిన తన చిన్ననాటిమిత్రునకు సకలోపచారములను జేయుచు జక్కగా బరామర్శింప వలయు నని భార్యకు బోధించుటయే కాక, తన ప్రాణసమాను డయిన బాల్యమిత్రుడు సరసనుండి చూచుచుండబట్టి యిప్పుడుకదా నాసౌఖ్యము పరిపూర్ణత గాంచె నని సుమిత్రుడు మనసులో బరమానంద భరితుడయియుండెను. మిత్రు లిద్దఱును పూర్వ కాలమును గూర్చి ముచ్చటించుచు, బాల్యావస్థయందు దాము చదువుకొన్న సంగతులను, చిన్ననాటి యాటపాటలను తోడిబాలురతోడ గూడి విహారమునకు బోయినప్పుడు నడచినచర్యలను దలచుకొని యానందించుచు, వారిసల్లాపముల యం దెల్లప్పుడును నుల్లాసమును గనబఱచుచు సమీపమున నుండు మంజువాణితో వేడుకగా జెప్పుచుండిరి. ఇట్లు కొంత కాలము సుఖముగా జరిగినతరువాత చంద్రవర్మ తనదేశమునకు వెళ్ళుట కయి ప్రయాణము కాగా భర్త కోరిక ప్రకారము మఱికొంతకాలముండి వెళ్లు మని యాతనిని మంజువాణి ప్రార్థించి చెప్పెను. ఈ యుత్తమకాంతయొక్క సంతాపదినములు నాటితో బ్రారంభ మాయెను. సుమిత్రుఁ డెంతప్రార్థించినను నిలువ నొడబడనివాడు మంజువాణియొక్క మృదుమధురవాక్యములచే మనసు కరగినవాడై దీనత్వముతో వేడికొనునామె ప్రార్థనను త్రోచిపుచ్చలేక చంద్రవర్మ మఱికొన్ని వారములవరకును తన ప్రయాణమును మానుకొనెను. తన మిత్రునియొక్క సుగుణసంపదయును తన యిల్లాలియొక్క సత్స్వభావమును జిరకాలానుభవమువలన లెస్సగా దెలిసియున్నవా డయ్యును, వేళావిశేషముచేత సుమిత్రుడు భార్యయందును మిత్రుని యందును నిగ్రహింపరాని యసూయ గలవాడయ్యెను. పెనిమిటియొక్క యాజ్ఞచేత నాతని ప్రీతిని బడయుటకొఱకే యాకాంత దినదినమును చంద్రవర్మ విషయ మయి చూపుచు వచ్చిన శ్రద్ధయంతయు దురదృష్టవంతు డైన యానృపాలుని యొక్క మనోవేదనాభివృద్ధికే తోడుపడసాగెను. సుమిత్రుడు పూర్వము ప్రియకాంతయెడ నెంతప్రేమగలవాడును ప్రియ మిత్రునియెడ నెంతదయ గలవాడు నయి యుండెనో యిప్పు డంతయీర్ష్యయు నిర్దయత్వమును గల ఘోరరాక్షసుడుగా మాఱి, తనసభికులలో నొకఁడగు బహుమానును బిలిపించి, రహస్యముగా నాతనితోఁ దనకు గలిగిన యవమానమును జెప్పి, చంద్రవర్మను విషప్రయోగము చేసి చంపుమని యుత్తరువు చేసెను. బహుమానుడు దూరాలోచనగలవాడును మిక్కిలి యోగ్యుడును కాబట్టి తనరాజు పెట్టుకొన్నసందేహమునకు లేశమయినను అవకాశము లేదని యెఱిగినవాడయి, విషము పెట్టుటకు మాఱుగా దనప్రభువుయొక్క యాజ్ఞను ఆయనకు నివేదించి, సింహళద్వీపమునుండి తప్పించుకొని యాయనతోడ గూడి వెడలిపోవుట కొప్పుకొనెను. చంద్రవర్మయు బహుమానుని సాయముచేత దనరాష్ట్రములో సుఖముగాఁ బ్రవేశించెను. అప్పటినుండియు నక్కడ రాజసభలోఁ బ్రధానుఁడుగా నుండి, బహుమాను డారాజునకు ముఖ్యమిత్రుడును అత్యంతప్రియుడును నయి యుండెను.

బహుమానుడు పాఱిపోవుటచేత మండిపడి, రాజు మఱింత కోపముతో రాణియున్న యంత:పురమునకు తత్క్షణమే నడచి, అక్కడ తనముద్దులతనయుఁడైన కృష్ణుడు తల్లితో వేడుకగా నేదోకథ చెప్పుచుండగా వినుచు గూర్చున్న భార్యను జూచి, కుమారుని రెక్కపట్టుకొని యావలకీడ్చి, భార్యను చెఱసాలయందు బెట్టబంచెను. కృష్ణుడు మిక్కిలి పసివా డయ్యును తల్లియందు మిగుల ప్రేమకలవాడయి యుండెను. కాబట్టి తల్లిని ఆప్రకారముగా అవమానపఱిచి కారాగృహమునకు బంపుచుండగా జూచినప్పుడు, గుండెలు పగిలిపోయి మనసులో దిగులు పెట్టుకొని, ఆహారనిద్రాదులు మాని దినదినక్రమమున క్షీణించి తుదకు మరణావస్థను బొందు నంతటి స్థితిలోనికి వచ్చెను. రాజును తనరాణిని చెఱసాలకు పంపివేసి, చతురాస్యుడును సత్యసారుడును అనునిద్దఱు భృత్యులను బిలిపించి, మీరు తిరువనందపురముననున్న దుర్గ గుడికిబోయి మంజువాణికి నామీఁద మోహముకలదో లేదో,తెలిసికొని రండని పంపెను.

రాణి కొంచెముకాలము చెరసాలలో నున్న పిమ్మట, ఆమెకు కూఁతురు పుట్టెను. ముద్దులమూటగట్టు నాచిన్న కూఁతును జూచికొనుచుండుటవలన గొంత యూరట చెంది ఆమె "నాకన్నతల్లీ! నీ వెంతనిర్దోషురాలవో నేను నంత నిర్దోషురాలనేజుమీ" యని యాచిన్న దానిని జూచి పలికెను. ఆ పతివ్రతాతిలకమునకు రాజబంధు డైన వక్రచిత్తునిభార్య మిత్రవింద యనునామె ప్రియసఖిగా నుండెను. ఆబిడ రాణికి కూఁతురు గలిగిన దన్న వార్తను విన్నతోడనే యామె యున్న చెఱసాలకు బోయి, అక్కడ నామెకుపచారము నిమిత్తముంచబడిన మాలిని యనుపరిచారికం గాంచి "మాలినీ ! రాణిగారు నాయందు నమ్మక ముంచి కొమార్తెను నావశమున నిత్తురేని,ఆ చిన్న దానిని చూచుటవలన నైన నాతనికి మనసు కరగి రాణిమీద దయవచ్చు నేమో యెన రెఱుగుదురు" అని చెప్పెను. మాలినియు మిత్రవిందను జూచి "తల్లీ ! మీరు సెల విచ్చినదాని నిప్పుడేపోయి రాణిగారితో విన్న వించెదను. ఆమె నేఁటియుదయకాలముననే యాపసిబిడ్డను గొనిపోయి రాజుపాదములమీద బడవైవ సాహసించెడు పుణ్యాత్మురా లెవ్వరైనదొరకునాయని విచారింప జొచ్చినది." అని పలికెను. ఆమాటలకు సంతోషించి, "మాలినీ ! రాజుగారి సమక్షమున నేను దనపక్షమున ధైర్యముతో వాదించెదనని రాణిగారితో జెప్పుము." అని మిత్రవింద చెప్పెను. నిరపరాధినియైన రాణిగారికి మహోపకారమును జేయబూనుకొన్న నీకు శాశ్వత సుఖము కలుగునుగాక యని మిత్రవిందను దీవించి, రాణిగారితో సర్వము విన్నపముచేసి యామెప్రీతిపూర్వకముగా నిచ్చినయాబాలికను పొత్తులలోఁ గొనివచ్చి, మాలిని యా పుణ్యవతియొక్క చేతిలోఁ బెట్టెను.

అప్పుడు పుట్టిన యాపిల్లను పొత్తులలోఁ బెట్టుకొని నడచి, రాజు కోపమునకు భయపడి పోవలదని నిర్బంధించు నిజనాథుని వాక్యములనుసహితము లక్ష్యముచేయక, మూకలలోనుండి త్రోవచేసికొని రాజుసన్నిధికి బోయి, మిత్రవింద యా నెత్తురు గందును ఆయనపాదములమీఁద బడవైచి, మోమోటమి లేక యావఱకు రాజుచేసిన క్రూరకృత్యమును గర్హించి, యేదోషము నెఱుఁగని పిల్లను తల్లిని దయతో జూడమని బహువిధముల వేఁడుకొని, జాలిపుట్టునట్టుగా రాణిపక్షముగాఁ గొంతతడవు ప్రసంగించెను. ఆమె న్యాయనిష్ఠురము లాడి హితము చెప్పినకొలఁదిని రాజున కంతకంత కాగ్రహము బలిసి యామెను దన యెదురనుండి కొనిపొమ్మని యాపె పెనిమిటితో నుత్తరువుచేసెను. మిత్రవింద వెళ్లునపుడు పిల్లది యొంటిగా నున్నప్పుడు శిశువుయొక్క యసహాయతను జూచిననైన నొకవేళ జాలిపుట్టునేమోయని యాబిడ్డను తండ్రి కాళ్ళసమీపముననే దిగవిడిచి పోయెను. ఆమెకొలువు బాసి వెళ్ళినతోడనే దయాశూన్యు డయిన యాతండ్రి వక్రచిత్తుని బిలిచి "నీవీబిడ్డను గొనిపోయి సముద్రమునుదాటి నిర్జనవనములో దిగఁ బెట్టి ర"మ్మని యాజ్ఞాపించెను.

వక్రచిత్తుఁడు ఉత్తమాంగనయైన మిత్రవిందవంటివాఁడు కానందున తనస్వామియాజ్ఞాను శిరసావహించి యానిమిషముననే యొకపడవనెక్కి, ముందుగా నెక్కడ నిర్మానుష్యమైన యడవి కనబడునో యక్కడనాచిన్న దానిని పాఱవేయవలెనను నుద్దేశముతో బయలుదేఱెను. రాజు రాణిమీద మహాకోపముతో నున్నవాడుకాబట్టి, దేవతావాక్యమును దెచ్చుటకయి వెళ్ళియుండిన సత్యసారుడును చతురాస్యుడును వచ్చుటకైన గనిపెట్టుకొనియుండక, యీలోపుగానే కన్నకూతురు గతివిని మూర్ఛపోయి తేఱి కన్నకడుపు దహించుకొనిపోవ రాణి విలపించుచుండఁగా తనసభలోని ప్రముఖుల యొక్కయు మంత్రులయొక్కయు సమక్షమున బహిరంగముగా భార్యనేరమును విచారణ చేయుటకయి యామెను రచ్చకీడ్చెను. ఆమె చేసిననేరమును విమర్శించుట కయి దేశములోఁగల గొప్పవా రును, న్యాయాధికారులును, మంత్రులును రావింపఁ బడిరి. అప్పుడు వారందఱి యెదుటను వీసమంతయు దోషములేని యాయోషిద్రత్నము మహాపరాధము చేసినదానివలె దీనత్వముతో నిలువబడి వారుచెప్పుతీర్పును వినుట కయి యెదురు చూచుచుండెను. ఇంతలో సత్యసారుడును చతురాస్యుడును సభామంటపము ప్రవేశించి, పదిలముగా ముద్రవేసి భద్రపఱిచి తెచ్చిన దేవతావాక్యములుగల యుత్తరమును సగౌరవముగా రాజునకు సమర్పించిరి. అప్పుడు రాజుయొక్క యాజ్ఞానుసారముగా సభికులలో నొకడు ముద్రను విడగొట్టి, అందులోని వాక్యము లందఱకు వినబడునట్లుగా నీప్రకారము చదివెను. - "మంజువాణి కేవలము నిరపరాధిని; చంద్రవర్మ కళంకరహితుడు; బహుమానుడే నిజమైన భృత్యుడు; సుమిత్రుడు నిష్కారణముగా జారత్వశంకను బెట్టుకొన్న క్రూరుఁడు; ఇప్పుడు చంప బంపబడినకూతురు దొరకకపోయినయెడల రాజు సంతులేనివాఁ డయి మృతినొందును." - రాజు ఆమాటలయం దెంత మాత్రమును విశ్వాసముంచక, ఇదియంతయును రాణియొక్క మిత్రులచేత పన్నఁబడిన తంత్ర మని పలికి, న్యాయాధిపతి కభిముఖు డయి నీవు రాణిని విమర్శించుట కారంభించు మని యాన తిచ్చెను. భూపతి యీమాటలు పలుకుచుండఁగానే, ఒకసేవకుడు కొలువుకూటమునకు బరుగెత్తుకొనివచ్చి రాజు గారి పుత్రుడైనకృష్ణుడు తనతల్లిని ప్రాణాంతశిక్షను పొందిం చుట కయి విమర్శచేయుచున్నా రని విని వ్యసనము చేతను సిగ్గుచేతను దేహమును మఱచి యాకస్మికముగ మృతినొందెనని చెప్పెను.

ప్రియనందనుఁడై నకృష్ణుఁడు తనకుసంభవించినదురవస్థ కయికుంది ప్రాణములు విడిచినాడన్న వార్త చెవిసోకినతోడనే మంజువాణి మొదలునఱికినయరటిచెట్టువలె నేలమీఁదఁపడి మూర్ఛపోయెను. పుత్ర మరణవార్త రాజహృదయమునకు శూలమువలె నాటినందున, అభాగ్యురాలైన యిల్లాలియందు గొంతకనికారము జనించి, రాజు తత్క్షణమే మిత్రవిందను ఆమె పరిచారికలను బిలిచి రాణిని ఆవలకు దీసికొనిపోయి శైత్యోపచారములు చేసి మూర్ఛ తేర్పుఁ డని యాజ్ఞాపించెను. రాణి నావలకుఁ గొనిపోయిన కొంతసేపటికి మిత్రవింద మరల జనుదెంచి, ఆమె మరణము నొందెనని చెప్పెను.

సుమిత్రుఁడు భార్య మరణము నొందెనని విన్నప్పుడు, ఆమె విషయమయి తానుచేసిన క్రూరకృత్యములను చింతించి పశ్చాత్తాపపడఁ జొచ్చెను. తానామెను పెట్టినబాధలవలననే యామెమనసు వికలత్వము నొందెననియు, ఆమె నిరపరాధిని యనియు నిప్పుడు తలఁచెను; ఉన్నయొక్కుకుమారుడుఁను మరణము నొందినాడు. కాఁబట్టి చంపబడినకూతురు మరల దొరకనిపక్షమున దాను సంతానము లేకుండ మృతినొంద వలసినది. వాస్తవముగాఁ గనఁబడఁబట్టి యిప్పు డాదేవతా వాక్యములయందును నమ్మకము తోఁచెను; కాఁబట్టి, తన పోయినకూఁతురునిమిత్తమయి తన రాజ్యమునైనను విడిచిపెట్ట వలెనని నిశ్చయించుకొని రాత్రిందివములు దు:ఖసముద్రములో మునిగియుండి, బహుసంవత్సరములు వ్యసనముతోను దీర్ఘ విచారముతోను రాజు కాలమును గడపుచుండెను.

వక్రచిత్తుడు రాజపుత్రిక నెక్కించుకొనిపోయినపడవ గాలివానవలన గొట్టుకొనిపోయి, చంద్రవర్మ రాజ్యము చేయుచున్న మలయాళదేశతీరముననే చేరెను. వక్రచిత్తుఁ డక్కడదిగి కావుకావున నేడ్చుచున్న యాపసిపిల్లను దయ మాలి యొకచోట విడిచిపెట్టి తనపడవవై పునకు వెళ్ళెను. కాని 'నీకూఁతు నచ్చట దిగవిడిచి వచ్చినా' నని సుమిత్రునితో జెప్పుట కయి సింహళద్వీపమునకుమాత్ర మాతడు మరల రాలేదు. ఆతఁడు వెనుకదిరిగి తనపడవలోనికి వెళ్ళుటకయి పోవుచుండగా, చేరువయడవిలోనుండి యొక వ్యాఘ్రము వచ్చి యాతనిపయికి దూకి, మెడ పట్టుకొని చంపి తనప్రభువు యొక్క దుర్మార్గమయిన యాజ్ఞను నెఱవేర్చనందునకై తగిన శిక్షను చేసిపోయెను. రాణి యాచిన్న దానిని రాజుకడకంపి నప్పుడు సాధ్యమయినంత యందముగాఁ గనబడునట్లు చేసి మఱి పంపినది. కాబట్టి, యిప్పు డాచిన్నది యమూల్యవస్త్రములతోను రత్నఖచితము లయిన స్వర్ణాభరణములతోను అలంకరింపఁబడి యుండెను. వక్రచిత్తుఁడును తాను బైలుదేఱి వచ్చునప్పుడు ఒక కాగితముమీద 'ప్రమతి' యని వ్రాసి దాని నాచిన్న దానివస్త్రమున కంటించిపోయెను. ఆకాగితముమీదనే ఆమెది గొప్పవంశమనియు దైవవశమున దుర్దశప్రాప్తించిన దనియు సూచించుపదములుకూడ గొన్ని వ్రాయబడియుండెను. గాని యవి స్పష్టముగా దెలియదగినవిగా నుండ లేదు.

మేకలను మేపుటకై యాయరణ్యమునకు వచ్చిన గొల్ల వాడొక్కడు ఆచిన్న దానియేడుపు విని దయార్ద్రహృదయుడై దాపునకు వచ్చి చూచి, పిల్ల దాని నెత్తుకొని యింటికిపోయి పెంచుటకై తనభార్య కిచ్చెను. ఆగొల్లదియు పిల్లదానిని తనకుమార్తెలకన్నను ప్రేమతో బెంచుచుండెను గాని, యాగోప కుటుంబమువారు తమయొక్క నిరుపేదతనమునుబట్టి సర్వాభరణములతో నాచిన్నది తమకు దొరికినసంగతిని దాచవలసిన వారైరి. కాబట్టి ఆగొల్లవాడు తనభార్య మెక్కడనుండి వచ్చెనో యెవ్వరికిని తెలియకుండుట కయి కుటుంబముతోఁ గూడ తానుండుప్రదేశమును వదలివేసి, ఆ దేశమునకు రాజధానియైన యనంతసేవమునకు సమీపముననున్న పల్లె చేరి, ప్రమతియొక్క నగలలో గొన్నిటిని విక్రయించి పశువులమందలను గొని యచ్చట విశేషధనవంతుడుగా నుండెను. వాడు ప్రమతిని తనకూఁతునుగానే భావించుకొని పెంచుచుండెనేకాని, ఆమె రాచకూఁతురన్నమాటను లేశమైన నెఱిఁగినవాడు కాడు. ఆమెయు సంవత్సరక్రమమునఁ బెరిఁగి, యంతకంతకు సౌందర్యవతియై యౌవనదశను పొందెను. ఆమె గొల్లపిల్లలు సాధారణముగా నేర్చుకొనుదానికంటె విశేషవిద్యను నేర్చుకొన్నది కాకపోయినను, ఆమెస్వభావసిద్ధములైన తెలివితేటలను నడవడికను జూచినవా రందఱును చిన్న నాటినుండియు నామె రాజమందిరములోఁ బెరిఁగినది కాదని యెంచుట కవకాశము లేనివారుగా నుండిరి.

మలయాళదేశపు రాజైన చంద్రవర్మకును రామవర్మ యను పేరుగల కొమారు డొక్కఁడే యుండెను. అతఁ డొకనాడు వేటకు బోయి ఆగొల్ల వాని యింటిసమీపముననుండి వచ్చుచు గుమ్మములో నిలుచున్న ఆచిన్నదానిని జూచి ఆమెయొక్క రూపలావణ్యాదుల కద్భుతపడి, మోహపరవశు డయ్యెను. అతడు తక్షణమే మాఱువేషమును వేసికొని కందర్పుఁడను పేరున నాగోపగృహమునకు బోయి నాడు మొదలుకొని తఱుచుగా వానియింటికి రాకపోకలు చేయుచుండెను. చంద్రవర్మయు దనకొమారుడు మునుపటివలె నిల్లు పట్టక తిరుగుచుండుటచూచి సందేహపడి, అతని జాడలను కనిపెట్టుటకై 'దూతలను, నియమించి, వారివలన దనపుత్రుడు గోపకామినిమీద మనసుతగిలియుండుటను దెలిసికొనెను. చంద్రవర్మ వెంటనే తనప్రాణమిత్రుడైన బహుమానుని రప్పించి, ఆసంగతియంతయు నతనితోఁ జెప్పి, ప్రమతితండ్రి యైన గొల్లవానియింటికి, దనతోఁగూడ రమ్మని కోరెను. చంద్రవర్మయు బహుమానుఁడును ఇద్దరును మారువేషమును వేసికొని గొల్ల వాండ్రు ఇంద్రోత్సవము జరిగించుచున్న సమయమున నావృద్ధగోపకుని మందిరముదగ్గరకు వెళ్ళిరి. వా రిరువురును క్రొత్తవారేయైనను, ఇంద్రోత్సవ సమయమున వచ్చినవారి నందఱిని ఆదరింతురు కాఁబట్టి, గొల్లవాడు వారి కతిథిసత్కారములు చేయుటయేకాక యుత్సవములో బ్రవేశించి తనతోడగూడ నానంద మనుభవింప బ్రార్థించెను. ఆనందభరితు లయి యెల్ల వారును త్రుళ్ళుచు కేరుచు నుండిరి. కులమువా రందఱును బంతులుసాగి కూరుచుండిరి; ఎక్కడ జూచినను ఉత్సవమునకువలయు సంభారములు కూర్పబడు చుండెను; చిన్నపిల్లలును పిల్ల వాండ్రును గృహముముందఱ నున్న పచ్చికబయలిమీద గంతులు వేయుచు కేరుచుండిరి. వారికంటె పెద్దవాండ్రు గుమ్మమువద్దకు వచ్చిన మన్నారు వానియొద్ద బొమ్మసామానులను ఇత్తడి నగలను అద్దములను గొనుచుండిరి.

ఈప్రకార మందఱును సందడిగానుండఁగా రామవర్మయు ప్రమతియు అక్కడ నడుచుచున్న వేడుకలయందుఁ బ్రొద్దు పుచ్చుటకంటె నన్యోన్యమును సరససల్లాపములతో కాలక్షేపము చేయుటకయి మిక్కిలి కౌతూహలము కలవా రయి యా సమ్మర్దముపొంతకుఁ బోవక దూరముగా నొక రహస్య స్థలమునఁ గూరుచుండిరి. తన కొమారుడు తన్నెంతమాత్రము నానవాలుపట్టుటకు వలనుగాకుండ మాఱువేషము వేసికొని యుండుటచే రాజును వారిరువురసంభాషణములు వినబడునంత సమీపమునకు వెళ్ళియుండెను. ఆ చిన్నది తనకొమారునితో మాటాడిన వాక్యములు ప్రౌఢములు కాకపోయినను మిక్కిలి మధురములుగా నున్నందున రాజునకుగలిగిన యద్భుతమునకు బరిమితిలేదు. అప్పుడు రాజు బహుమానునివంక జూచి "హీనజాతివారిలో నింత సౌందర్యవతిని వినియు గనియు నుండలేదు; నేను కనిపెట్టినంతవఱకు ఈ చిన్న దాని మాటలలోను ప్రవర్తనలోను హీనజాతియని యూహించుటకుఁ దగిన యాధార మేదియుఁ గనబడలేదు." అని చెప్పెను. "నిస్సంశయముగా నీకన్య గోపకులమునకెల్లను రాణియైయుండు" నని బహుమానుఁడు మాఱు పలికెను.

అప్పుడు రాజు ముసలిగొల్ల వానికడకు వచ్చి "ఓయీ! నీ కొమార్తెతో మాటలాడుచున్న యా చిన్న వాఁడెవ"డని యడిగెను. "అతనిపేరు కందర్పుడు. తనకొమార్తెమీద ప్రేమ గలదని చెప్పుచున్నాడు; అతనికి నాకూతురును వివాహము చేసికొనుయోగముండెనేని ఆతఁ డెప్పుడును కలలో నైన నెదురు చూడని లాభముతోడగూడ నామెరాగలదు" అని, అమ్మగా మిగిలిన ప్రమతియొక్క యాభరణములని భావమునం దుంచు కొని వాఁడు పలికెను. ఆగొల్లఁ వాడు నాఁడట్లు నగలుకొన్ని విక్రయించి పశువులమందలను కొన్న తరువాత, శేషించిన నగ వలసినదని యావృద్ధుని నడిగెను. రాజంతట మాఱువేషమును దీసివేసి నిజస్వరూపముతో కొడుకును గద్దించుచు "వివాహ విమోచనమును జూచెద"నని పలుకుచు వెఱ్ఱిగొల్ల వానియింటఁ బుట్టిన యీ కులహీనురాలిని వివాహము చేసికొన సాహసించి నందులకయి పలువిధముల నిందించి ప్రమతివంక జూచి "యిక ముందెప్పుడైన నీవు నాకొమారుని మరల నిక్కడకువచ్చుట కంగీకరించితివేని నిన్నును నీతండ్రియైన ముసలిగొల్ల వానిని గూడ క్రూరముగా జంపించెద" నని బెదరించెను. తక్షణమే బహుమానునితోఁ దనకొమారుని వెంటఁబెట్టుకొనిరమ్మని చెప్పి, మహాకోపముతో రాజు తాను ముందుగా మందిరమునకు బోయెను.

రాచబిడ్డయొక్క స్వభావము దాగియుండదు కాబట్టి రాజు వెళ్ళినతరువాత ఆతని దూషణభాషణముల వలన గోపమువచ్చినదయి ప్రమతి, "మన కందఱకును హాని ప్రాప్తము గానున్నను, నేనిప్పు డేమియు భయపడ లేదు; ఒకటిరెండు మాఱులు రాజును పలుకరించి, ఆయనతో మీ రాజభవనము మీద ప్రకాశించుసూర్యుడే సంకోచపడక మా కుటీరనిలయముమీఁద సహితము ప్రకాశించుచు మిమ్మును మమ్మును సమానదృష్టితోనే చూచుచున్నాడని స్పష్టముగా మొగము మీఁదనే యనవలె ననుకొంటి" ననిపలికి, పిమ్మట విచారగ్రస్తురాలయి "యీవఱకు నేనేమో కలగనుచున్నాను కాఁబోలు! ఇప్పుడు మేలుకొన్నాను. ఈ విషయమై యిక మనసున కేమియు బాధ కలుగజేయను. నన్ను విడిచి మీదారినిపొండి; నేను నామేకలపాలు పితుకుకొనుచు నాపాట్లు నేను పడుచుండెదను" అని నిస్పృహతో బలికెను.

దయార్ద్రమానసుఁడైన బహుమానుఁడు ప్రమతియొక్క యనువర్తనమునకు ధైర్యమునకును మెచ్చుపుట్టి, మోహాంధకార నిమగ్నుఁడై యున్న రాజనందనుఁడు జనకుని యాజ్ఞా మాత్రమునఁ బ్రాణసమానయైన యామానినిని విడువగల వాడు కాఁడని రూఢిగా నెఱిఁగినవాడు కాన, ఏలగుననైన నా కాముకీకాముకుల నేకీభవింప జేయు మార్గమును వెదకి యందువలన జిరకాలమునుండి తనమనసులోనున్న యొక యాలోచనను ఈడేరుచుకొనవలె నని నిశ్చయించెను. సింహళ ద్వీపాధినాధుఁ డగు సుమిత్రుఁడు నిజముగా బశ్చాత్తప్తుడయి యున్నా డన్నసంగతి బహుమానుఁడు చిరకాలముక్రిందనే యెఱిగియుండెను. ఇప్పుడు బహుమానుడు చంద్రవర్మకు ప్రియమిత్రుడుగా నుండినను, తన పూర్వప్రభువును జన్మ భూమిని మఱియొకసారి పోయిచూడవలెనను నాశనుమాత్రము బొత్తిగా వదలి పెట్టినవాడు కాడు. కాబట్టి రామవర్మను ప్రమతిని తనతోఁడ సింహళద్వీపమునకు రావలసినదనియు, అచ్చట సుమిత్రుని మధ్యవర్తిత్వమున జంద్రవర్మవలన క్షమాపణమును వడసి వివాహమున కనుమతిని పొందువఱకును మిమ్ముఁ గాపాడుట కారాజు నొడఁబఱిచెద ననియుఁ చెప్పెను. ఈ యాలోచనకు వారిద్దఱును సంతోషముతో నంగీకరించినందున బహుమానుఁడే ప్రయాణమునకు గావలసిన సర్వ సామగ్రిని సిద్ధముచేసి యావృద్ధగోపకునిగూడఁ దమతో వచ్చుట కొడఁబఱిచెను. ఆ గోపవృద్ధు ప్రమతియొక్క మిగిలియున్న యాభరణములను, ఆమెచిన్ననాటి బట్టలను, ఆ బట్టల కంటించియున్న కాగితమునుగూడ దనతో గొనిపోయెను. కొన్నాళ్లు సముద్రముమీద సుఖయాత్ర చేసినతరువాత, వారందఱును క్షేమముగా సుమిత్రుని రాజధానికివచ్చి చేరిరి. పోయిన భార్యను కొమార్తెను దలఁచుకొని మనోవ్యాధితో బరితపించు చున్న సుమిత్రుడు బహుమానుని నత్యంతప్రేమతోఁ నాదరించి, పరమప్రమోదముతో రామవర్మకును అతిధిసత్కారము నెఱపి గారవించెను. బహుమానుడు తీసికొనిపోయి రామవర్మ యొక్క కాబోవురాణియని కనబఱచిన ప్రమతిమీదనే రాజు దృష్టియంతయు నుండెను. ఆమెయందు దన పోయిన భార్యయొక్కపోలిక కనబడినందున, ఆయన కప్పుడు క్రొత్తగా దు:ఖము లోపలినుండి బయలు దేఱి "నేనట్లు కఠినచిత్తుడనై చంపింపకుంటినేని, నాకూతురు నిటువంటి చక్కనికన్నియయే యగునుజుండీ" యని కంట దడిపెట్టెను. ఆ వెనుక రాజు రామవర్మవంక దిరిగి "ఉత్తముడైన నీతండ్రియొక్క చెలిమిని నిష్కారణముగా బోగొట్టుకొంటిని; ప్రాణాధికుడైన యాతని నేలాగుననైన నొకసారి చూడవలెనని నాకెంతో యభిలాష మున్నది" అని పలికెను. ఆ చిన్న దానిని రా జంత శ్రద్ధతో జూచుటయు తనకూతుఁ రెప్పుడో చిన్న తనములో దనయాజ్ఞ చేతనే యడవులలో విడిచిపెట్టబడిన దని చెప్పుటయు విచారించి యాగొల్లవాఁడు చిన్న దానిని విడిచిపెట్టిరన్న గాలమున విధమును, ఆమె గొప్పవంశమందు బుట్టినదౌటకు సాక్ష్యమిచ్చు తనకుదొరకిన యమూల్య వస్త్రాభరణములను దలఁచుకొని మనసులో బరిపరివిధముల జింతింపసాగెను. ఆసంగతు లన్నిటిని బాగుగ విమర్శించి వాఁడు రాజు పోయినదనుకొన్నుచున్న కూతురే యీ ప్రమతియని నిశ్చయము చేసికొనెను.

అప్పుడు రామవర్మయు, ప్రమతియు, బహుమానుఁడును, మిత్రవిందయు, అందఱును గూరుచుండియుండగా ఆ ముసలి గొల్లవాడు తనకు ప్రమతిదొరకిన విధమును, ఆమెనుగొని వచ్చి విడిచినమనుష్యుని పెద్దపులిపట్టుకొనగా దాను జూచుటయు జెప్పి, ఆసమయమున బ్రమతికి గట్టబడిన విలువవస్త్రమును మెడయందున్న కంఠాభరణమును బట్టకుగట్టియున్న కాగితమును గొనివచ్చి రాజుముందఱ బెట్టెను. వానిని జూచిన తోడనే మిత్రవింద యావస్త్రమును నగయు మంజువాణి తన కూతున కలంకరించినవే యనియు, ఆ కాగితముమీఁదవ్రాత తన మగనియక్షరములే యనియు, ఆనవాలుపట్టెను. అప్పు డక్కడనున్న వారి కందఱికిని సందేహము నివర్తియయి, ఆమె సుమిత్రుని పుత్రికయౌట విస్పష్టమాయెను. పోయినదనుకొను చున్న కూఁతురు దొరకినది కాబట్టి దేవతావాక్యప్రకారము రాజుయొక్క వంశము భూమిమీద నిలిచినదన్న సంతోషమును, భర్తపోయినాడన్న దు:ఖమును, మిత్రవిందను గొంతతడవు నిశ్చేష్టురాలినిగా జేసెను. ప్రమతి తనకొమార్తెయే యయిన సంగతి తెలిసినతోడనే తనబిడ్డను చూచుకొనుటకు దల్లికి ఋణములేకపోయెగదాయన దు:ఖించి, యేమో చెప్పదలచుకొని "నీతల్లి నీతల్లి--" అనుమాటలు దక్క మఱియేమియుఁ బలుక లేక కొంతతడవు నివ్వెఱగొంది యుండెను.

రాజా ప్రకారము సంతోషములోను, దు:ఖములోను మునిగియుండగా మిత్రవింద సమీపమునకు వచ్చి సుప్రసిద్ధుడగు నొక శిల్పకాఱునిచే క్రొత్తగాచేయించిన మంజువాణి యొక్క విగ్రహ మొకటి తనయింట నున్నదనియు, దానిపని యేలినవారు మాగృహమునకు వచ్చి చిత్తగింతురేని నిజముగా మంజువాణియే యక్కడ నున్నదనుకొనునంత విచిత్రముగా నున్నదనియు రాజుతో మనవిచేసెను. రాజు తనభార్యయొక్క రూపమును జూడవలెనని యత్యాసక్తుడయి యున్నందునను, ప్రమతి తా నెప్పుడును జూచియెఱుగని తల్లి యాకార మేప్రకారముగా నుండునో కనవలెనని యతి కుతూహలయయి యున్నందునను, అందఱును గలిసి యక్కడకు వెళ్ళిరి. ఆ వింతయైన విగ్రహమున కడ్డముగానున్న తెరనుదీసి మిత్రవింద చూపగానే, అచ్చముగా విగ్రహము మంజువాణిని బోలియున్నందున రాజు నకు దు:ఖ మాగక మనసులోనుండి పొరలిపొరలి రాసాగెను. కాఁబట్టి కొంతసే పాతడు మాటాడుటకును కదలుటకును శక్తుడుగాక చిత్రపుప్రతిమవలె నిలువఁబడి యుండెను.

మిత్రవింద యప్పుడు రాజున కభిముఖురాలయి "మహా ప్రభూ! మీరు నిశ్చేష్టులయి యుండుట చూడఁ బనివాని శిల్పకళాకౌశల్యమున కత్యద్భుత పడుచున్నట్టు కనుపట్టు చున్నారుగాన నేను మిక్కిలి ప్రమోదించుచున్నాను. ఈ విగ్రహము కేవలము శ్రీ రాజ్ఞిగారివలె నుండలేదా ?" అని యడిగెను. రాజును తుదకు హృదయము పదిలపఱచుకొని, "నిస్సందేహముగా నేను మొట్టమొదట నామెను వరించినప్పు డేప్రకారముగా నున్నదో యిప్పుడు నదేప్రకారము గంభీరముగా నిలుచున్నది. కాని మంజువాణి నిజముగా నీవిగ్రహము కనుపట్టునంతవయస్సు చెల్లినదికాదు" అని చెప్పెను. "అట్లయినచో మంజువాణి యిప్పటివఱకును జీవించియుండిన నిప్పు డేరీతి నుండునో యారీతినే విగ్రహమును సిద్ధముచేసిన పనివాని యొక్క నేర్పును మనము మఱింత మెచ్చుకోవలసియున్నది. దేవరవారు చూడగా జూడగా విగ్రహము కదలుచున్నదని కూడ భ్రమంతురేమో యని భయమగుచున్నది. ఇక తెర వేయనిండు" అని మిత్రవింద మరల బలికెను. "తెర వేయబోకు బహుమానుఁడా ! చూడు -- నీకది శ్వాసము నిడుచు చున్నట్టు కనఁబడలేదా? దాని కనురెప్పయందు చలన మున్నట్టుకూడఁ గనుపట్టుచున్నది" అని రాజు బహుమానునకు జూపెను. ఇంతలో మిత్రవింద "దేవరవారి కిప్పుడు గలిగిన సంతోషమునుబట్టి విచారింపగా అది జీవించియున్నదని సహితము తలంతురు. ఇప్పుడు నేను తెరవేయవలెను" అనెను. రాజు "మిత్రవిందా! ఇరువది సంవత్సరము లయినను నన్నాలాగుననే తలఁచునట్లు చేయుము. ఇప్పుడును ఆ దివ్యసుందర విగ్రహమునుండి యూపిరి వచ్చుచున్నట్లే నాకుఁ గనబడుచున్నది. ఎంతవింతయులియైనను విగ్రహమున కూపిరివచ్చునట్టు చెక్క గలుగునా? దానిని పోయి యొక్కసారి ముద్దుపెట్టుకొనెదను; మీరెవ్వరును బరిహసింపకుడు" అని మోహపరవశు డయి పలికెను. "దేవా! తాళుఁడు, ఆమె పెదవికివేసిన యెఱ్ఱరం గింకను పచ్చిగానే యున్నది; మీరు ముద్దుపెట్టుకొందురేని మీపెదవి కంటుకొనును. నేను తెర దిగవేయుదునా?" అని మిత్రవింద యడిగెను. "వద్దువద్దు" ఇరువదియేండ్లయినను అలాగుననే యుండనిమ్మ"ని రాజు వేఁడుకొనెను.

ఈ సంభాషణము నడుచుచున్నంతతడవును మోకాలిమీఁద నిలువబడి నోరు కదలింపక సావధానముగా జనని యొక్క నిరుపమానమైన విగ్రహమువంకనే చూచుచున్న ప్రమతి "నా ప్రియమాతవంక జూచుచు, ఎంతకాలమయిన నీప్రకారముగా నిలుచుచుండగల"నని పలికెను. అంతట మిత్రవింద రాజువంక జూడ్కి నిగిడించి, 'యీ యాలోకనసౌఖ్య మును గొంతసేపు మఱచి తెరయైనను వేయ ననుజ్ఞయిండు; లేదా యింతకంటె నద్భుతము నొక దానిని జేసెద నందుకైన సమ్మతింపుడు. నిశ్చయముగానే నేనీ విగ్రహమును కదలునట్లు చేయఁగలను; అంతియేకాదు - దేవరవారి సెలవయ్యె నేని, పీఠమునుండి దిగివచ్చి మీహస్తము పట్టుకొనునట్టుసహితము చేయగలను. కాని నేనాలాగున జేసినపక్షమున, నేనేదో క్షుద్రదేవతయొక్క యుపాసనవలన జేయుచున్నా నని మీరు తలంతురు--- కాదని నేను ప్రమాణము చేయఁగలను" అని చెప్పెను. ఆమాటలకు రాజు విస్మయపడి, "నీవామెచేత నేమి చేయింపగలవో దానినంతను జేయింపుము; కన్నులపండువుగా జూచెదను. విగ్రహము చలించునట్టు చేయుదానికి మాటాడునట్టుకూడ జేయుట కష్టము కాదు; కాబట్టి ఆమెచేత నీవేమి పలికించిననుగూఁడఁ గర్ణరసాయనముగా వినఁగల" నని పలికెను.

ఈ పనికొఱ కావఱకే మిత్రవింద సిద్ధముచేసి యుంచిన వాద్యములును సంగీతములును మంగళధ్వనులతో మ్రోగసాగెను. చూచువారందఱును అద్భుత రసాక్రాంతు లగునట్టుగా విగ్రహమప్పుడు పీఠమునుండి దిగివచ్చి, చేతులతో సుమిత్రుని కంఠమును కౌగిలించుకొని, భర్తకును కూతురుకును శుభములు ప్రసాదించుటకయి భగవంతునిఁ బ్రార్థించుచు, మాటాడ సాఁగెను. ఆ విగ్రహమట్లు సుమిత్రుని నాలింగనము చేసికొని వల్లభుని పుత్రికను దీవించినందున కంత యాశ్చర్యపడవలసిన పని లేదు - నిజముగా ఆ విగ్రహము జీవించియున్న రాణియే.

వెనుకటి యాపత్సమయమున రాణి ప్రాణములను గాపాడుటకు మఱియొక యుపాయము తోఁచనందున, మిత్రవింద యప్పుడు రాణి కాలము చేసినదని రాజుతో గొప్ప యసత్యమును జెప్పెను. నేడు ప్రమతి దొరికినదన్న శుభవార్తను వినువఱకును తాను జీవించియున్నట్టు రాజునకు దెలియుట యిష్టము లేనిదై, మంజువాణి యప్పటినుండియు యోగ్యురాలయిన మిత్రవిందతో గలిసి యన్యు లెఱుగకుండ నామె యింటనె తలదాచుకొని యుండెను. ఆమె రాజు తనవిషయమున జేసిన యాపదలను నాడే మఱచిపోయినను, నోరులేని పసిపిల్లవిషయ మయి చేసిన క్రూరకృత్యములనుమాత్రము మఱచిపోఁగలిగినది కాదు.

పోయినదనుకొన్న భార్య జీవించుటయు, చిన్ననాఁడే యెడబాసినకూతురు గృహము చేరుటయు, విలోకించి దీర్ఘ కాలము విచారములపాలయి యున్న యా రాజప్పుడు పొందిన యానందమునకు మితము లేదు. ఏమూల జూచినను సంతోష వాక్యములును మంగళతూర్యములును దప్ప మఱియేమియు వినఁబడ లేదు. సంతుష్టాంతరంగులైన యాదంపతులు హీనజాతి నాతిగా నెన్నఁబడినపుడు సహితము తమకూఁతును వరించినందుకయి రామవర్మను ఆమెను వాత్సల్యముతో బెంచి పెద్దదానిని జేసినందునకయి గొల్లవానిని బహువిధముల గొనియాడిరి. తాము చేసిన ప్రయత్నములన్నియుఁ దుద కనుకూలముగా ఫలించినందున బహుమానుఁడును మిత్రవిందయు నమందానందము నొందిరి. ఎవ్వరును ప్రతీక్షింపని యీసంతోషములో నేదియు లోపము లేకుండ; జేయుటకో యన జంద్రవర్మసహిత మప్పుడు వచ్చి రాజమందిరమును జొచ్చెను. ఆతఁడు మొట్టమొదట గొడుకును బహుమానుడును గనబడకపోయినప్పుడు ఆవఱకే బహుమానుడు స్వదేశమునకు బోవగోరి యున్న సంగతి నెఱిగినవాడుగాన వారిరువురును సింహళ ద్వీపములో దొరకుదురని యూహచేసి, సాధ్యమయినంత శీఘ్రముగా బయలుదేఱి, సుమిత్రుని జీవితకాలములో నెల్లను మిక్కిలి సుదినమయిన యీ సంతోషసమయముననే యచ్చట నుట్టిబడెను.

చంద్రవర్మ వారితోఁగూడ సంతోషము ననుభవించుటయేకాక, అక్రమముగా దనమీద జారత్వశంకను మోపిన సుమిత్రుని యపరాధమును మన్నించి బాల్యములో నాతనితో నెంతమైత్రి గలిగియుండెనో యిప్పుడును మరల నంతమైత్రి గలవాడాయెను; చంద్రవర్మ ప్రమతిని తన కొడుకునకు జేసికొననని నిరాకరించునన్న భయమిప్పు డేమియులేదు. ఇప్పుడామె కులహీనురా లయిన గొల్లపడుచుగాక, సింహళ ద్వీప రాజ్యమున కుత్తరాధికారిణియైన రాజయువతి యాయెను. గాఁబట్టి ప్రమతికిని రామవర్మకును మహావైభవముతో వివాహ మహోత్సవము జరిగెను. చిరకాలము కష్టపరంపర ననుభవించిన సుకృతాత్మురా లయిన మంజువాణియొక్క శ్రమ యంతయు నాఁటితో నివారణ మయినందున ఆమె పుత్రిక తోను బెనిమిటితోను గలిసి సకల సంపదలతోను దులఁదూగుచు బహుకాలము సమస్త సౌఖ్యముల ననుభవింపుచుండెను.


సంపూర్ణము

---o0(O)00---