సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/బాలగంగాధర తిలక్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లోకమాన్య బాలగంగాధర తిలక్

స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్య చైతన్యం జాగృతంగా వున్నంతకాలం నేను యువకుణ్ణే! నా విశ్వాసాలను ఏ అస్త్రమూ ఛేదింపజాలదు. ఏ అగ్నీ దహింపజాలదు. ఏ ప్రవాహం కూడా దానిని కొట్టుకొని పోజాలదు. ఏ ప్రభంజనమూ పెకలింపజాలదు. నా దేహానికి ముసలితనం వచ్చినా, నా చైతన్యానికి ముదిమి రాలేదు." అంటారు హోమ్‌ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించుటకు ముందు స్వాతంత్ర్య సమర శంఖారావం పూరించిన అప్రతిమ దేశభక్తుడు లోకమాన్య బాలగంగాధర తిలక్.

మహారాష్ట్రంలోని రత్నగిరిలో తిలక్ 1856 జూలై 23వ తేదీన జన్మించాడు. పార్వతీబాయి, గంగాధర రామచంద్ర తిలక్ అతని తల్లిదండ్రులు. తండ్రి గంగాధర తిలక్ సంస్కృతంలోను, ఆంగ్లంలోను, గణితంలోను పాండిత్యం సంపాదించి, విద్యాశాఖలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు.

బాలగంగాధర తిలక్ పూనాలోని దక్కన్ కాలేజీలో చేరి, గణిత శాస్త్రమును ప్రత్యేక విషయంగా చదివి ఇరువదవ ఏట పట్టభద్రుడయ్యాడు. ఎం.ఏ. చదవాలనుకొన్నాడు. కానీ వీలుకాలేదు. ఎల్.ఎల్.బి.పట్టా పుచ్చుకున్నాడు. విద్యావ్యాప్తి తన కర్తవ్యమని భావించిన తిలక్ 1880లో న్యూ ఇంగ్లీష్ స్కూల్ అను పాఠశాలను ప్రారంభించాడు. 1885 దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి గవర్నర్ ఫెర్గుసన్ పేర కళాశాల ప్రారంభించాడు. గోపాలకృష్ణ గోఖలే ఆ కళాశాలలో ఆంగ్ల భాషాధ్యాపకుడుగా పనిచేసేవాడు.

సాంఘిక సేవారంగ ప్రవేశం చేసి, విద్యావకాశాల మెరుగుదలకు విస్తృతంగా పనిచేశారు. రాజకీయ నాయకుడుగా, పాత్రికేయుడుగా బహుముఖంగా దేశానికి సేవచేసే భాగ్యం ఆయనకు కల్గింది. తిలక్ ముప్పదిమూడేళ్ళ ప్రజాహిత సేవారంగంలో ఎనిమిదేళ్ళు కారాగారంలో గడిపాడు. 1908లో కేసరి పత్రికలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాసం వ్రాశాడన్న కారణంతో 52 ఏళ్ళ బాలగంగాధర తిలక్ గారికి ఆరేళ్ళు దీర్ఘకాల శిక్ష విధించింది నాటి ప్రభుత్వం.

మహ్మద్ ఆలీ జిన్నా, తిలక్ ను హామీపై విడిపింపవలసినదిగా, న్యాయమూర్తి దాపర్ కు అర్జీ పంపుకున్నాడు. ఒకప్పుడు తిలక్ ను ప్రభుత్వం నిర్బంధించినపుడు తిలక్ పరంగా వాదించిన, దాపర్ మహాశయుడు, న్యాయమూర్తి పదవిని చేపట్టిన తర్వాత బ్రిటిష్ వారి తొత్తుగా మారి జిన్నా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు. తిలక్ పై దేశద్రోహ నేరమారోపించింది ప్రభుత్వం. తిలక్ న్యాయస్థానంలో తన నిర్దోషిత్వమును రుజువు చేసికొనుటకు తన వాదమును నిరూపించిన తీరు అతని న్యాయశాస్త్ర ప్రతిభకు అద్దం పట్టింది. ఆయన వాదనను వినుటకు ప్రతిదినం ప్రజలు కోర్టు ఆవరణలో మూగేవారు. రాత్రి 9 గంటల వరకు విచారణ సాగించిన దాపర్, లోకమాన్యుని ఉద్దేశించి "నేను శిక్ష విధించుటకు ముందు నీవేమైనా చెప్పదలచుకొన్నచో చెప్పవచ్చు" అన్నాడు. తిలక్ ధీర గంభీర వదనంతో, "అయ్యా తాము నన్ను దోషిగా తీర్మానించవచ్చు. కానీ నేను ముమ్మాటికీ నిర్దోషిని. ఇది నా దృఢవిశ్వాసం. నేను స్వేఛ్చగా వున్నప్పటికంటే జైలు శిక్ష అనుభవించుటవల్లనే నా ఉద్యమం మరింత విజయవంతం కాగలదు. అదే దైవనిర్ణయమైతే అలాగే కాని" అన్నాడు. న్యాయాధిపతి తిలక్ కు వేయి రూపాయల జరిమానా, ఆరేళ్ళ ద్వీపాంతరవాస శిక్ష విధించాడు. దేశం ఆ తీర్పు విని ఆగ్రహించింది. కాని దాస్యంతో మ్రగ్గుతున్న వారపుడేమి చేయగలరు?

మాండలే జైలులో వున్నపుడే తిలక్ భగవద్గీతపై గొప్ప వ్యాఖ్యానం వ్రాశాడు. అదే 'గీతా రహస్యం'. కర్మ చేయటమే మన ప్రధాన ధర్మమన్నారు. ఆ వ్యాఖ్యతో ఆ గ్రంథం ప్రపంచ విజ్ఞుల మన్ననలందుకొన్నది.

1914 జూన్ 8వ తేదీన మాండలే జైలు నుండి తిలక్ ను తీసుకొనివచ్చి అర్ధరాత్రివేళ పూనాలోని వారి ఇంటిలో దిగబెట్టింది ప్రభుత్వం. తెల్లవారేసరికి, తిలక్ విడుదల వార్త దేశమంతటా వ్యాపించింది. ప్రజల ఆనందానికి అవధులు లేకపోయాయి.

1916 జూలై 23వ తేదీన లోకమాన్యుని షష్టిపూర్తి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఆ సందర్భంగా మాట్లాడుతూ "నా వంటి సామాన్యుని సేవతో మీరు తృప్తిపడరాదు.... మీరు భేదాలను మరచి జాతీయ వీరసోదరులుగా ఉద్యమించాలి. ఇచట అహంకారానికి, భయానికి తావుండదు. మన తరములో కాకున్నా మన తరువాత తరము వారికైనా విజయం నిశ్చయం" అన్నాడు. తిలక్ ప్రజలలో రాజకీయ చైతన్యంతో పాటు మన ధర్మంపట్ల శ్రద్ధాసక్తులను ప్రబోధించాడు. శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను సంఘటితం కావించి ప్రజలలో నవచైతన్యాన్ని రేకెత్తించాడు.

1896లో మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వ్యాపించినపుడు, ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి వేలాది ప్రజలను పొట్టన పెట్టుకొన్నపుడు తిలక్ సాగించిన ప్రజాసేవా కార్యక్రమాలు చిరస్మరణీయమైనవి. తిలక్ గాంధీజీతో రాజకీయంగా విభేదించాడు. కాని స్వాతంత్ర్య సమరంలో ఒకే బాటపై నడిచారు.

జీవితాంతం అలుపెరుగక పోరాడిన లోక మాన్యుడు 1918 ఆగష్టు ఒకటవ తేదీన రాత్రి గం. 12.40 ని.లకు ప్రశాంతంగా కన్ను మూశాడు. గాంధీజీ తన ' యంగ్ ఇండియా ' పత్రికలో తిలక్ కు శ్రద్ధాంజలులర్పిస్తూ "తిలక్ మహాశయుడు సాధించిన అనురాగం, పలుకుబడి మన కాలంలో మరే నాయకుడు సాధించలేదు. ఆయన ప్రజలకు ఆరాధ్య దైవం, మానవులలో మనోన్నత మూర్తి అస్తమించాడు. భారతదేశమంతటికీ లోక మాన్యుడైన తిలక్ మహాశయుని ధైర్యం, నిరాడంబరత్వం, త్యాగం, మాతృదేశాభిమానం మనమలవరచుకొని ఆయనకు మన హృదయంలో చెక్కుచెదరని స్మృతి చిహ్మం నిలుపుకొందాం " అన్నాడు గాంధీజీ.

తిలక్ భౌతిక కాయాన్ని స్వయంగా భుజంపై మోయాలని గాంధీజీ ముందుకు వెళ్ళినపుడు " బ్రాహ్మణులు మాత్రమే " అతని శవవాహకులుగా వుండాలన్నారు. ప్రజా సేవకుడికి ఆ నియమాలు వర్తింపవని గాంధీజీ శవవాహకుడయ్యాడు.

తిలక్ సంస్కరణవాదియైన మహామానవుడు పదునారేళ్ళ వయసు పూర్తి అయిన తర్వాతనే మహిళలకు వివాహం జరపాలని, 40 ఏళ్ళ వయసు మీరిన పురుషులు వివాహం చేసుకోదలచిన వితంతువులనే వివాహమాడ వలెనని, వరకట్నం తీసుకోరాదని, మధ్య పానం విసర్జించాలని, సంఘసేవకులు తమ ఆదాయంలో ఒక శాతాన్నైనా సంఘసేవకు వినియోగించాలని బోధించాడు.

లోకమాన్యుడు 30 ఏళ్ళపాటు కేసరి, మరాఠా పత్రికలను నిర్వహించి భారతీయ పత్రికోద్యమానికి నవోత్తేజం కలిగించాడు. ప్రజా సమస్యల నిరూపణకు పత్రికలు వేదికలు కావాలన్నాడు. పత్రిక ఎట్టి పరిస్థితులలోనైనా సకాలంలో వెలువడాలన్నది ఆయన లక్ష్యం.

ఒకమారు ' కేసరి ' పత్రిక సంపాదకీయం వ్రాస్తుండగా, కొడుకు ప్లేగు వ్యాధికి గురై మరణించాడు. ఏమాత్రం చలించని తిలక్ పత్రికను సకాలంలో వెలువరించాడు. కఠోరమైన నియమ పాలకుడాయన. 36 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ పత్రికను వెలువరించిన రోజులెన్నో ఆయన జీవితంలో. అచ్చు పనిలో అన్ని విభాగాలపై ఆయనకు పట్టు వుండేది.

తిలక్ జైలులో వున్నప్పటికీ పత్రిక సకాలంలో వెలువడుతుండేది. ఉపసంపాదకులకు ఆయన ఇచ్చిన శిక్షణ అట్టిది. అది అమూల్యం. తమ పత్రిక ఉపసంపాదకులనుద్దేశించి వ్రాస్తూ " మీ రచనా శైలి పల్లె ప్రజలతో మాట్లాడినట్లుండాలి. విద్యావంతులతో మాట్లాడిన రీతిగా క్లిష్టంగా వుండరాదు. కఠిన పదాలను, సంస్కృత పదాలను వాడకండి " అనేవారు.

తిలక్ ' ఒరాయన్ ', ఆర్కిటిక్ హోం ఇన్ ది వేదాస్ ' 'గీతా రహస్య ' అను ఉద్గ్రంథాలను వ్రాశాడు.

తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసిన మానవతావాది తిలక్. ' జ్ఞాన ప్రకాశ ' అను పత్రిక ' కేసరి ' పత్రికకు బద్ధ విరోధి. రెండు పత్రికలూ ఒకే ప్రెస్ లో ముద్రితమవుతుండేవి.

ఒకమారు అనివార్య పరిస్థితులలో ' జ్ఞానప్రకాశ్ ' మేనేజర్ తిలక్ గారి వద్దకు వచ్చి ' అయ్యా ఈనాడు మా పత్రికలో సంపాదకీయం వ్రాసేవారెవరూ లేరు. దయచేసి మీరు వ్రాసిస్తారా ' అని కోరాడు తిలక్ సమ్మతించి వ్రాసివచ్చాడు. విభిన్న ధోరణలు గల పత్రికలు అవి. కాని మరుసటి రోజున ఆయా పత్రికల ధ్యేయానికి అనుగుణంగా సంపాదకీయాలు వ్రాయబడినాయి !

హిందూ-ముస్లిమ్‌ తగాదాలు తలయెత్తినపుడు ' కేసరి ' పత్రికలో ఇలా వ్రాశారు. "భారతదేశంలో హిందువులు, ముస్లిములు శతాబ్దాలుగా సమైక్య భావంతో మెలుగు తున్నారు. వారి హక్కులు ఏనాడో నిర్ణయింపబడినాయి. ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబించటం వల్ల వైమనస్యాలు తలయెత్తుతున్నాయి. ఈ తగాదాలన్నిటికీ ప్రభుత్వమే కారణం" అన్నారు.

భాతరజాతిని స్వాతంత్ర్య సమరోత్సాహంతో జాగృతమొనర్చిన మహానేత లోకమాన్య బాల గంగాధర తిలక్.