సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/డా. యల్లాప్రగడ సుబ్బారావు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వైద్యరంగంలో ధృవతార

యల్లాప్రగడ సుబ్బారావు

తమ్ముడు పదిరోజులుగా బాధపడుతున్నాడు. రక్తహీనత వల్ల నానాటికీ కృషిస్తున్నాడు. పలుమార్లు విరేచనాలవుతున్నాయి. వ్యాధి మరింత తీవ్రమైంది. తమ్ముని బాధను చూస్తూ నిస్సహాయుడై నిల్చున్నాడు అన్న. పెద్ద వైద్యం చేయించేందుకు డబ్బుల్లేని వాడా బాలుని తండ్రి. చూస్తున్నట్లే తమ్ముడు శాశ్వతంగా కన్నుమూశాడు. పన్నెండేళ్ళ అన్న కన్నీరు కారుస్తూ 'ఈ రోగానికి మందే లేదా?' అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.

భయంకరమైన ఈ వ్యాధిని నిర్మూలించాలి. ఇందుకు మందు కనిపెట్టాలి. నేను డాక్టర్ కావాలి అని నిశ్చయించుకొన్నాడు ఆ బాలుడు. ఆ బాలుడే దీక్ష, నిరంతర శ్రమ, పరిశోధనల వల్ల గొప్ప వైద్యశాస్త్రవేత్తగా ప్రపంచ ప్రజల మన్ననలందుకున్న డా. యల్లాప్రగడ సుబ్బారావు.

యల్లాప్రగడ సుబ్బారావుగారు 1.7.1896న రాజమహేంద్రవరంలో జన్మించారు. తండ్రి తాలూకా కచ్చేరిలో గుమాస్తా. వారిది బీద కుటుంబం. అందుకుతోడు బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు సుబ్బారావుగారు. బాల్యం నుండి దైవచింతన కలవాడాయన. రామకృష్ణమఠం వారి సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజి నుండి పట్టభద్రులైనారు. విద్యార్ధి వేతనం లభించినందున, లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నారు. 1923లో మల్లాది సత్యలింగనాయకర్ ధర్మ సంస్థ సహాయంతో అమెరికా వెళ్ళారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలో లైబ్రేరియన్ గా చేరాడు. జీవరసాయన శాస్త్రంలో అభిరుచి పెరగడంతో డాక్టర్ ఓటోపోలిన్ అను ఆచార్యుని నేతృత్వంలో పరిశోధన సాగించి పి.హెచ్.డి. పట్టా పొందారు. విరామము దొరికనప్పుడల్లా వైద్యశాలలో ఆర్డర్లీగా పనిచేస్తూ, తన చదువుకు కావలసిన పైకం సంపాదించుకొనేవారు.

తన తమ్ముని బలిగోన్న 'స్ప్రూ' వ్యాధిని నిర్మూలించుటకు తగిన మందులను సాధించుటకు కంకణం కట్టుకున్నారు. సుబ్బారావుగారి అవిశ్రాంత పరిశోధనాసక్తిని గమనించిన సియానమిడ్ వైద్య పరిశోధనా సంస్థ వారాయన తమ లెడర్లీ సంస్థలో పరిశోధకుడుగా ఎన్నుకొన్నారు. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుకొన్నారు సుబ్బారావుగారు. 1945 జూలై 20వ తేదీన ఫోలికి ఆమ్లం నుండి బంగారు వన్నె భస్మాన్ని కనుగొన్నారు. ఆపోడి స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది.

పాతికేళ్ళపాటు ఆకలి, నిద్ర, అలసటలను విస్మరించి సాగించిన కృషి ఫలితంతో సుబ్బారావుగారెంతో సంతోషించారు. తమ్ముని ప్రాణాలను బలిగొన్న వ్యాధిని ప్రపంచం నుండి పారద్రోలగలగినానన్న తృప్తి కలిగిందాయనకు. ప్రపంచమందలి రక్త విజ్ఞాన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యులుగా మన్ననలందుకున్నారు. లెడర్లీ సంస్థ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. ఒక భారతీయునికి, ఆ కాలంలో అంత గొప్ప పదవి లభించడం అపూర్వం!

భారతదేశం వచ్చి తన ప్రజలకు సేవ చేయాలనే కోరిక కల్గింది. కలకత్తాలోని 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజిన్ అండ్ పబ్లిక్ హెల్త్' అనే సంస్థకు ఆచార్యునిగా వెళ్ళడానికి ఫోర్డు ధర్మ సంస్థ నిధి సుబ్బారావుగారిని ప్రోత్సహించింది. కాని ఆ సంస్థ నిర్వాహకులైన ఆంగ్లేయులు భారతీయుడన్న ఒకే ఒక కారణంతో సుబ్బారావు గారికి ఆ పదవినివ్వ నిరాకరించారు.

సుబ్బారావుగారు క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల గొప్ప మందులను కనుగొన్నారు.

విద్యార్ధుల పట్ల సుబ్బారావుగారికెంతో ప్రేమ. ఎందరో విద్యార్ధులకు ఆర్థిక సాయమందించారు.

ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా పరిశోధనలు సాగించిన సుబ్బారావుగారి ఆరోగ్యం దెబ్బతింది. 36 గంటలపాటు నిద్రాహారాలు లేక పరిశోధనలో నిమగ్నులయ్యేవారు.

ఆయనలోని మానవుడు, పరిశోధకునికంటే గొప్పవాడై వెలిగాడు. తనతో పాటు పరిశోధన సాగిస్తున్న యువ పరిశోధకురాలు క్షయవ్యాధితో శ్యానిటోరియం చేరింది. ఆమె చికిత్స కోసం తమ వేతనం నుండి 6 సంవత్సరాలపాటు ఆర్థికసాయం ప్రతి నెలా పంపేవారు. తాను అనాధనని ఏ రోగీ భావింపరాదని చెప్పేవారాయన.

'నేను పుట్టుకతో ఏమీ పట్టుకుని రాలేదు. చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను. నా ఆదాయ వ్యయాలు నా జీవనోపాధికి తగినంత వుండిన చాలు' అన్న ఉదారాశయం కలవారు సుబ్బారావుగారు.

ఆయన నైష్టిక బ్రహ్మచారి. క్రిస్టమస్ పండుగనాడు ఎందరో బీదపిల్లలకు ఉదారంగా కానుకలిచ్చేవారు. విజ్ఞాన శాస్త్రవేత్త అయిన సుబ్బారావుగారు ప్రగాఢ దైవభక్తిగలవారు. వేకువనే ప్రార్ధన చేయనిదే ఏ పనీ ప్రారంభించేవారు కారు. తనను ప్రోత్సహించిన సహకరించిన రామకృష్ణ మఠం వారికి క్రమంగా ధన సహాయం చేసేవారు.

1948 లో ఆయనకు అమెరికా పౌరసత్వమిచ్చి గౌరవించింది. లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై ఉన్న డా.యల్లాప్రగడ సుబ్బారావుగారి చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సోదర ప్రజానీకం రోగ విముక్తులు కావాలన్న తపనతో రేయింబగళ్ళు కృషి చేసిన డాక్టర్ యల్లాప్రగడ వారు 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వతేదిన అమెరికాలో కన్నుమూశారు.

ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు లెడర్లీ సంస్థ వారు.

ఆయన మానవాళికందించిన వైద్యవిధానాలు చిరకాలం జీవించి ఉంటాయి.