సుకవి మనోరంజనము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

సుకవి మనోరంజనము

ప్రథమాశ్వాసము

అవతారిక

శ్రీమహిలాధినాథ సరసీరుహజాత శచీకళత్ర ము
ఖ్యామరసార్వభౌమ మకుటామితరత్నవిభా ఝరీ పరీ
షామలపాదపద్ము మిహికాంశుకిరీటు ధర్మాత్మజామిల
త్కోమలమూర్తి పీఠపుర కుక్కుటలింగవిభుం దలంచెదన్.

1


చ.

వలిమలఁ బుట్టి విన్ను[సిగవాని] యొడల్ సగ మాక్రమించి ని
చ్చలు ప్రియమందఁగాఁ బ్రియుఁడు సామజవక్త్రకుమారులం గుమా
రులఁ గని పన్నమన్నరుల రూఢిగఁ బ్రౌఢిగఁ బ్రోచు సర్వమం
గల కృప సర్వమంగలనికాయము లేయెడ మాకు సేయుతన్.

2


శా.

శ్రీలానీలలఁ గేలులం దనుఫుచుం జేజేల జేజేల క
ల్యాలాపధ్వనులం గ్రహింపుచుఁ గృతోద్యన్మాద్యదింద్రాది శి
క్షాలక్షుండును [సర్వవి]శ్వపరిరక్షాదక్షుఁడౌ గోపకాం
తాలోలుండు కృపామృతామిత నిపానంబై మముం బ్రోచుతన్.

3


ఉ.

కల్యసముజ్జ్వలజ్జలజ గర్భదలోపమమున్ శుభాలిసా
కల్యవదాన్యతాపరమకారణముల్ నిజపాద భక్త హృ
చ్ఛల్యనివారణంబులు సుధాకరసోదరి చూపులెల్ల మాం
గల్యము లిచ్చు గావుత నికామకృపారసభాసితంబులై.

4

చ.

తలపుకొలంకుసాహిణము తామర యవ్వని బువ్వు బాస వా
ల్తల రతనంపు కూన మెయిఁ దాల్చు మెకంబులు తాటియాకు దా
ట్లల కవికోటి నోటి సరు లంతిపురంబులుగాఁగ లోకముల్
దలఁచిన మాత్రఁ జేసెడు విధాత చిరాయువు మా కొసంగుతన్.

5


చ.

వలపులు గ్రుమ్మ బ్రహ్మ నలు వౌ సలువాలన మించు మంచెలం
జెలఁగుచు విప్పు కన్చెలులచే నుడిగంబులు గొంచు [నుండి రా]
చిలుకను గేలఁ బూని దయ నిచ్చలు గొల్చిన వారికెల్ల వి
ద్దెల నిడి మంచు పల్కుపొలఁతిన్ వలతిన్ దలపోయుదున్ మదిన్.

6


మ.

అవనీభృత్తనయా పదాంబురుహ సేవాయాత దేవాంగనా
శ్రవణీకౢప్త విఫుల్ల నిర్జరధునీ సంజాత నీలోత్పల
స్రవదుద్యన్మకరందలుబ్ధ మధులి ట్సంఘాత జంబూఫల
ప్రవణత్వోద్ధృతహస్తునిన్ గజముఖున్ బ్రార్థింతు నశ్రాంతమున్.

7


సీ.

ఖస్థలీ నటదురుగ్రావ వీక్షోద్ధృత
        విబుధేట్సవజ్ర ప్రవేష్టకంబు
లతిరయ భ్రమిత విధ్వంశుమత్ క్షణదిష్ట
        కృత శతకోటి రాత్రిందినములు
గగన జృంభిత సప్తకంధి జలైక కా
        లాప్లుతి ప్రీత దివ్యర్షికులము
లుపరిభాగవిలంబితోరగేభ్యపటాల
        కాయమానితదివౌకఃపథములు
కుంభినీద్ర విరోధి నిష్కులు కుటాగ్ర
పతదమందప్రసూన ప్రవర్ష ముఖ్య
కారణంబులు గరుడపక్షజమరుత్తు
లసదృశాధురజము చాటి విసరుగాత.

8


సీ.

అబ్ధిలంఘన వేగతానిల పాతితాం
        బరచరవరవనీ తరులతాంతు
సమధిక నిజభుజాస్ఫాలన ... సం
        వ్యక్త మంగలసూత్ర దనుజ కాంతు

కాలపాశాభీల వాలకీలిజ్వాల
        పరిదగ్ధ దశకంఠపుర నిశాంతు
కాకుత్స్థ పట్టాభిషేక సీతా దత్త
        ఘనహార కలిత వక్షఃస్థలాంతు
శాంతుఁ గాలుష్యరహితసుస్వాంతు బుద్ధి
మంతు మంతుకృదసురకృతాంతు దాంతు
సంతత జగద్ధితోదంతు శాతనఖర
దంతు హనుమంతు నాదు చిత్తమున నెంతు.

9


సీ.

కూచిమంచ్వస్వయాకూపార చంద్రుల
        శివకేశవాంఘ్రి రాజీవ భక్త
జాతాగ్రసరుల కంజాత సముద్భవేం
        దిందిరవేణి మంజీర నిసద
ప్రత్యర్థి వరకవిత్వ సుధారసానంది
        తాసేతుశీతథరాంతరాధ
రాతల స్థిత కవిరాజుల మత్పితా
        మహ పితామహుల తిమ్మకవి జగ్గ
కవి సమాఖ్యుల కాశరాట్కాశహార
తార నీహార కుంద మందార చంద్ర
హీర హీర సమాఖ్యులఁ బృథు ప్రబంధ
కర్తలఁ దలంతు మది భక్తి గ్రమ్ముకొనఁగ.

10


చ.

అనుదినమున్ భజింతు నకలంకపు భక్తి దలిర్ప భోగికం
కణపదభక్తియుక్తు సకలార్యనుతున్ సరసాగ్రగణ్యు జ
గన తనయున్ శరజ్జలద కైరవ నారద శుభ్రకీర్తి మ
జనకునిఁ దిమ్మసత్కవి సుధాకరు సద్గుణజాలశోభితున్.

11


సీ.

ఏ కోవిదుని జనిచే కులం బంతయు
        ననుపమ ప్రఖ్యాతి నలరుచుండె
నే కవి సుకవితా [హేవాక] వాణి కో
        మల విపంచీ ధ్వని నాదరించు

నే పురాణవిదుని మృదువాక్యపటలి కై
        లాసంబునకును సోపానపఙ్క్తి[1]
యే మహాత్ముని దయా దృష్టి యించుక సోక
        స్థాణువైనను జూడ స్థాణువగును
నట్టి ప్రథిత వంకయలపాటి వేంకట
రాయ విబుధవరు నరాయణాం[2]ఘ్రి
భక్తు సుగుణయుక్తుఁ బంచాక్షరీప్రదు
వీక్షణములు కృతుల వెలయ సేయు.

12


శా.

శ్రీమద్దేవులపల్లి వంశజలధిశ్రీసోదరున్ గుంద తా
రా మందార హరీంద్ర చందన శతారాభ్రాశ్వగోస్రష్టృ కాం
తా మందాకిని చంద్ర పారద మరున్నాగప్రభాంచద్యశో
ధామంబౌ గురునిం దలంతు మతి సీతారామ విద్వన్మణిన్.

13


సీ.

ఏ విబుధుఁడు నాటకావలియు నలంక
        రణ శాస్త్రములను బాల్యమునఁ దెలసె
నే మహనీయుండు కౌమారముననే సి
        ద్ధాంతకౌముదిని సాంతముగఁ జదివె
నే సూక్ష్మబుద్ధివరేంద్రుండు నాంధ్ర శా
        స్త్రరహస్యమును తనంతట నెఱింగె
నే పండితుని కృపాదృష్టి నన్ లక్షణ
        నిధివరులందుఁ బండితునిఁ జేసె

నట్టి దేవులపల్లి వంశాబ్ధి పూర్ణ
శశధరుండైన బుచ్చయశాస్త్రి చక్ర
వర్తి పదపద్మముల కతిభక్తి దనర
వందన మొనర్తు మది వేడ్క గ్రందుకొనఁగ.

14


గ్రంథకర్తృ వంశావతారము

క.

కౌండిన్యగోత్రజాతులు
పండితకవివర్యు లగుచుఁ బరగగ ధర నా
కౌండిన్యు మహిమఁ బొగడఁగ
కుండలిపతికైనఁ దర మగునె గనుఁగొనన్.

15


శా.

చండాంశుప్రభుఁ డన్యదుష్కర తపశ్చర్యా[సప]ర్యోదితా
ఖండాఖండలతుండిపాదపగవీ కాండాసి లేఖాపగా
డిండిరాంబుజ భూకలత్ర శర కంఠేకాల సత్కీర్తియై
కౌండిన్యుం డలరెన్ ద్వితీయవృషకంఖాణాకృతి న్మేదినిన్.

16


శా.

ఆ కౌండిన్యమహర్షి గోత్రమున నుద్యత్కూచిమంచ్యన్వయ
శ్రీకి న్మూలమునై శరద్ఘన శర శ్రీచందన శ్రీగలా
స్తోక గ్లౌక సమీక భక్త మరుదంధోభవ్యకీర్తుల్ దెసల్
బ్రాకన్ బయ్యన మంత్రిశేఖరుఁడు శుంభల్లీలఁ గ్రాలెన్ ధరన్.

17


ఉ.

అ య్యనలాక్షభక్తికి గృహంబన సత్కృపఁ దుంటవింటిదం
టయ్యన బాంధవాలుల కహర్ముఖపద్మ మనంగఁ గుయ్యిడన్
సయ్యన దీనుల న్మనుప జానకి భర్తన మించె నెంచఁగా
బయ్యనమంత్రిశేఖరుఁ డపాంపతియై గుణరత్నపాలికిన్.

18


క.

సనయుఁడు తిమ్మామాత్యుఁడు
తనయుఁ డతని కుద్భవించెఁ దగ నాతని కా
ర్యనుతులు గంగన జగ్గన
లును సింగన సరస మంత్రులు జనించి రొగిన్.

19

క.

ఆ గంగామాత్యు ఘన
త్యాగంబున సేతుహిమధరాంతరభూమీ
భాగాగతనిర్గతధర
ణీగీర్వాణులు రవిసుతునిన్ మెచ్చ రిలన్.

20


చ.

ఇనకులరత్నమౌ దశరథేంద్రుఁ డతంద్రితులైన రామల
క్ష్మణభరతారిహంత లనఁగా సుతులన్ గడు వేడ్కఁ గన్న రీ
తిని ఘనగంగమంత్రియును దిమ్మన సింగన జగ్గనార్య సూ
రన లను పుత్రులం బడసె సంచితమూర్తుల భవ్యకీర్తులన్.

21


వ.

అం దగ్రజుండు

22


సీ.

రాజశేఖరచరితము రుక్మిణీపరి
        ణయము నీలాపరిణయము సింహ
శైలమాహాత్మ్యంబు సప్తసాగరచరి
        త్రంబును సారంగధరచరిత్ర
రామాయణంబు సర్పపురమాహాత్మ్యంబు
        సర్వలక్షణసారసంగ్రహంబు[3]
రసికజనమనోభిరామంబు శ్రీశివ
        లీలావిలాసంబు లాలిత శత
కములు శ్రీకృష్ణదండకం బమలమతి ర
చించి నట్టి మహా ప్రతిభాంచితుండు
రమ్యకీర్తి తృణీకృతబ్రహ్మజిష్ణు
వైభవుఁడు తిమ్మసత్కవీశ్వరుఁడు దనరు.

23

చ.

అతఁడు సమస్తపండితవరావలి ద న్గొనియాడునట్లుగా
నతుల గవి ప్రబంధ శతకాలి నొనర్చి నిరూఢభక్తిచే
గుతుక మెలర్పఁ బీఠపురకుక్కుటమూర్తికి నర్పణం బుదా
రతఁ దగఁ జేసినట్టి కవిరాజశిఖామణి గాడె చూడఁగన్.

24


సీ.

శ్రీ పీఠికానగరీపతి రావు నీ
        లాద్రిమాధవమహారాజ దత్త
కవిసార్వభౌమ విఖ్యాత బిరుదభాస
        మానుఁడు నన్యరామావిముఖుఁడు
పంచాక్షరీమంత్ర పఠనశీలుండును
        సహజపాండిత్యవిశారదుండు
నఖిలవేదాంతవిద్యారహస్యవిదుండు
        శ్రీకుక్కుటేశ కృపాకటాక్ష
వీక్షణ ప్రాప్త కవితావిజృంభితుండు
సకల రాజాధిరాజ మస్తక కిరీట
మణి విరాజిత పాదపద్మయుగలుండు
తిమ్మకవిరాజమౌలి యెంతే చెలంగు.

25


గీ.

విజితకాముఁడు తోషితవిబుధవరుఁడు
రాజపూజితుఁ డార్యానురాగుఁ డమల
మూర్తి పుణ్యజనేశ్వర ముఖ్యసఖుఁడు
నింపెసఁగుచుండుఁ దిమ్మ కవీశ్వరుండు.

26


క.

శ్రీమత్కమలాసన కాం
తా మృదుకర నఖర ముఖరిత మణిఖచిత వీ
ణా మధురారావ శ్రీ
కోమల గోవిదుఁడు తిమ్మకోవిదుఁ డలరున్.

27


గీ.

సకల కవివరులు నవీన శబ్దశాస
నుండటంచును గొనియాడుచుండు కతనఁ

దిమ్మకవిసార్వభౌమున కిమ్మహీత
లమున నిదియు నొక బిరుదు సార్థముగఁ దనరె.

28


చ.

సకలకలాకలాపు సురసాల రసాల రసారసత్వ సూ
చక సుకవిత్వతత్వవిదు శాంత హృదంతర చింతిత్పాత కాం
తకు నకలంక కీర్తిజిత నారద శారద నీరదేందుఁ ది
మ్మకవీంద్రుఁ నెన్నఁ దరమా పరమామరమానవాలికిన్.

29


గీ.

మరియు నమ్మహాత్ముని మహిమ వచియింపఁ
దరమె మూఁడవనాఁడు నీ తనువు విడుచు
ననియు సన్యాస మొనరించి యటుల విడిచి
దివ్యపద మొందె ‘శివరామ తీర్థు' లనఁగ.

30


గీ.

అమ్మహాత్ముని కతనఁ గాదా ప్రసిద్ధి
గలిగెఁ గూచిమంచి సమాఖ్య కులము కెల్ల
గావునను గవిరాజశేఖరుని కేవ
ల కవిరాజ శేఖరుఁ డనరాదు బుధులు.

31


చ.

అతని సహోదరుండు చతురబ్ధి పరీత మహా మహీతల
స్థితి కవిరాజ రాజమణిశేఖర పంకజ రాగపుంజ దీ
థితి లసమానపన్నలుఁ డధీత సమస్త కళారహస్యుఁ డా
ర్జిత వరకీర్తిశౌర్యుఁ డలరెన్ భువి జగ్గకవీంద్రుఁ డెంతయున్.

32


సీ.

ప్రతిభమై జానకీపరిణయంబును నర్మ
        దాపరిణయము రాధాకథాసు
ధానిధానము ద్విపదమ్ము సుభద్రాప
        రిణయ ముమాసంహితయును దండ
కములును బహుశతకములును గీత ప్ర
        బంధముల్ ఖడ్గాది బంధములును
గద్యలు రగడలు ఘనతర మంజరుల్
        బహుసువృత్తంబులు భాసురముగఁ

జెప్పె శ్రీ పురుషోత్తమ క్షేత్రపతికి
శ్రీ జగన్నాయకునకు నర్పించి మించె
ధైర్య గాంభీర్య చాతుర్య శౌర్య ముఖ స
మిద్ధ గుణపాలి జగ్గకవీంద్రమౌలి.

33


గీ.

భారతీ పద పద్మ విభ్రాజమాన
రత్న మంజీర మంజులారావ తులిత
వాగ్విలాసుని జగ్గరాడ్వరకవీంద్రు
నెన్న నెంతవారికి శక్యమే యొకింత.

34


సీ.

శ్రీవత్సవయ తిమ్మ పృధ్వీశరాడ్దత్త
        'బేబదల్' బిరుద జృంభితుఁడు, హరిప
దాంబుజ భక్తవరాగ్రణి శ్రీ జగ
        న్నాథ కటాక్ష లబ్ద కవితా వి
రాజమానుఁడు కవిరాజ పూజితుఁడును
        యాచక నికర మందారతరువు
రిపురాజ మత్త కరీంద్ర పంచాస్యంబు
        ననుపమ సత్కురుణాకరుండు
దైవభక్తి నిరంతర సేవితాగ్ర
జాత తిమ్మకవీశ్వర చరణ సరసి
జాత యుగలుండు దనరు నిజ్జగము నందు
ప్రకటగుణపాలి జగ్గ మంత్రికులమౌలి.

35


గీ.

శ్రీవిజయరామభూమిపాలావతంసు
దత్త శిబికా సమృద్ధితోదార కీర్తి
జగ్గ కవిచక్రవర్తి సమ్యగ్గుణప్ర
వర్తి వర్తిలు పరిహృత బాంధవార్తి.

36


స్రగ్ధర.

జనులెల్లన్ సన్నుతింపన్ సకల భువన ర
        క్షా సుదీక్షా దక్షున్
గణనాథుం గ్రౌంచభేదిం గని చెలగెఁడు గం
        గా జటాజూటు భంగిన్

ఘనుఁడౌ శ్రీ జగ్గ కవ్యగ్రణి తనయులఁ దా
గాంచెఁ దిమ్మప్రధానున్
వినుతుండౌ గంగమంత్రిన్ విపుల నృపసభా
విశ్రుత స్వచ్ఛ కీర్తిన్.

37


లయగ్రాహి.

కమ్మవిలుకాని నలతమ్మిచెలికాని చెలు
        వ మ్మొనయు రూపము ఘనమ్మయిన తేజం
బు మ్మఘవ భూరివిభవ మ్మభవ భక్తి కల
        నమ్ము కరుణామృతరసమ్ము చెలువారన్
నెమ్మి కవిచంద్రులకు ముమ్మరముగాగ నిర
        తమ్ము జిగి కుందనపు సొమ్ములును కంఖా
ణమ్ములును నిష్కనికరమ్ములు నొసంగుడు గొ
        నమ్ములకు నిమ్మనఁగఁ దిమ్మవిభుఁ డొప్పున్.

38


క.

కలనైన నన్యభామలఁ
తలఁపఁడు నెల్లపుడు వేడ్కఁ ద్యాగము సేయున్
కులవృత్తి వదులఁ డనృతము
వలుకఁడు తిమ్మ ప్రధానవర్యుం డెపుడున్.

39


గీ.

అతని తమ్ముఁడు గంగరాజాఖ్యుఁ డలరు
జానకీపతి పల్కు లక్ష్మణుని రీతి
నన్నగారన్న వచన మన్నన్న దాట
కెప్పుడును సత్పురుషుఁడు గాఁడె యతండు.

40


సీ.

తన పెదతండ్రి తిమ్మనమంత్రి గారవం
        బునఁ బెంచి శాస్త్రసమూహమెల్ల
నెఱిఁగింపఁ గల విద్యలెల్లను నేర్చి ని
        రంకుశ కవన విఖ్యాతి నొంది
దండకంబులును శతకములు తారక
        బ్రహ్మరామాయణ రమ్యకావ్య
మును రచియించి శంభునకు సమర్పించి
        దనరు వాని నుతింపఁ దరమె కీర్తి

నిందిత పటీర మందార నందనంద
నాగ్రజ పురంద రాశ్వ నీహార హార
హీర హీరాధ్య తారకా తారపూర
కాశ దర రాజుఁ డెన్న శ్రీ గంగరాజు.

41


గీ.

రావు వేంకటరాయ ధరావరాగ్ర
గణ్య దత్తమహైశ్వర్యకలితుఁ డతుల
సుగుణలలితుఁడు యాచకసురమహీజు
నతని నుతియింప దరమగునా దలంప.

42


భుజంగప్రయాతము.

వలద్రాజరాణ్మౌలిపాలీనితాంతో
జ్జ్వలద్రత్న రత్నప్రభాభాసమానా
వలీ ఢాత్ముఁడై శాస్త్రపాండిత్యసంప
త్యలంకారుఁడై గంగానామాత్యుఁ డొప్పున్.

43


గీ.

ఆతనికిఁ దిమ్మకవి పుత్రుఁడై జనించె
నించె దెసలను నసము నెన్నిక గడించె
డించె నింద్రియ మదము పండితులఁ బెంచె
మించె హరిభక్తి నతని వర్ణించ దరమె.

44


మ.

శతకస్తుత్యగుణం డతఁడు గనియెన్ సన్మిత్రులం బుత్రులన్
ప్రతిభాఖండలమంత్రి గంగవిభు దీవ్యత్కావ్యనిర్మాణమ
ర్మతరాంవేత్తను భాగయప్రభుసభాప్రఖ్యాతశశ్వద్యశో
ప్రతిము న్వేంకటరాజమంత్రివరునిన్ బద్మాక్షసేవాదరున్.

45


క.

అల తిమ్మకవికిఁ దనయుఁడు
లలిఁ బుట్టెం జగ్గకవి కలాపూర్ణుండై
జలనిధికి జలజవైరియు
జలజాతాక్షునకు జలజజన్ముఁడు వోలెన్.

46


శా.

పారావారగభీరుఁ డంబుజముఖీపంచాస్త్రుఁ డబ్జారిమం
దారేందూపలశుభ్రకీర్తి కరుణాధామం బుమానాథ పూ

జారాజీవవిలోచనుండు జనరాసన్మోదకృత్యత్వసం
ధారాముం డన మించె జగ్గవిభుఁ డేతన్మాత్రుఁడే చూడగన్.

47


గీ.

సాహితీగానవిద్యావిశారదుండు
శారదాదయార్ద్రేక్షణజనితకవన
భాసమానుండు దనరారె భాసమానుఁ
డఖిలసుగుణాకరుండు జగ్గనవిభుండు.

48


క.

ఆ జగ్గకవికి జోగమ
కాజి ధనంజయుఁడు తిమ్మనార్యుఁడు రాజ
తేజుఁడు పానకాలున్
రాజనిభుఁడు కామరాజు ప్రభవించి రిలన్.

49


కరిబృంహితము.

అమ్మువురు సచివాగ్రమణులకు నగ్రజుండు గుణరత్నపుం
జమ్ములకు జలరాశి జనహితజాగ్రదురుకరుణాకరుం
డుమ్మదభరితవైరినికరకఠోరతరహృదయుఁడు నౌ
తిమ్మసుకవికి సాటి బలుక సుధీప్రవరుఁ డిలఁ గల్గునే.

50


మదనదర్పణము.

దానగరిమ సూతపుత్రు నింద సేయు సీ యనున్
మానపటిమ బొబ్బపెట్టు నమ్మతంగజారి స
ద్దానమహిమఁ జంచలాత్ము పంకజాతజాతునిన్
దాను పరిహరించుఁ దిమ్మసత్కవీంద్రుఁ డెంతయున్.

51


మంగళమహాశ్రీ.

హీరదర సిరధర హీరశర సౌరకరి హీరవర ముక్తా
హార ఘనసార వనజారి ఘనతార కశతార హిమవారనిధి కాంతా
తార హర కైరవ సుధారస ఝరీ శరదుదారశరదప్రకర భూరి
స్ఫార సితకీర్తి రుచి బర్వఁగ జగంబులను భాసిలెను తిమ్మకవి ధాత్రిన్.

52

క.

త్రైదశభాషాకావ్యము
మోద మలర సరసహృత్కుముదచంద్రిక నా
నాదగ వాసవదత్తా
కాదంబరు లెఁసఁగ దిమ్మకవి రచియించెన్.

53


మ.

స్ఫుట వంకాయలపాటివంశ విలసద్భూషాయమానుండు వేం
కటనారాయణ మంత్రివర్యుఁ డలరెన్ గంజాత జాతాంగనా
తటినీనాథ తనూభవామరధునీ తారాశతారామరే
ట్కుట ధిక్కరి యశస్సితీకృత దిశాకుంభీంద్రుఁడై కుంభినిన్.

54


క.

లలి వేంకటనారాయణుఁ
డల కామాంబను వివాహ మగు రీతిని ని
య్యిల వేంకటనారాయణు
డల కామాంబను వివాహమయ్యె ముదమునన్.

55


గీ.

ఘనుఁడు వేంకటనారాయణునకుఁ గామ
మాంబకు జనించె సుబ్బాంబ యనెడు తనయ
తన యనూనాభిజాత్య శాంత నయ వినయ
ధన యశంబులు బుధులు మెచ్చ నయలీల.

56


క.

తన మేనయల్లుఁడగు తి
మ్మనార్యునకు భార్యగా సమర్పించెఁ బ్రియ
మ్మున వేంకటనారాయణు
డనూనవిభవమున సుబ్బమాంబను బ్రీతిన్.

57


క.

ఆ సుబ్బాంబను బెండిలి
యై సెలఁగుచుండెఁ దిమ్మనార్యుఁడు విభవో
ద్భాసి గృహస్థాశ్రమధ
ర్మాసక్తిన్ సకలజనము లభినుతి సేయన్.

58


సీ.

అతిథిపూజావిధి ననసూయ ననసూయ
        భర్తృశుశ్రూషణ పరమరక్తి
పతికృప సుకృతాభిరతి కరుంధతి యరుం
        ధతి మనోనాయక వితతభక్తి

సకలగుణా కూర జననంబునకు సీత
        సీత పాతివ్రత్యశీలమునకు
ఖలజననికరశిక్షకు దక్షపుత్రిక
        దక్షపుత్రి పతివ్రతాత్వమున క


గీ.

టంచు సజ్జను లెంచంగ మించె సంత
తాన్నపాన సువర్ణ వస్త్రాదికాఖి
తర్పితానేక విబుధబాంధవకదంబ
సుమహిత కృపావలంబ శ్రీసుబ్బమాంబ.

59


సీ.

పతిభక్తి నింతయు వదల దెల్లప్పుడు
        పరుషవాక్యంబులు పలుకబోదు
సాధ్వీమణులతోడ సఖ్యంబు గావించు
        నతిథుల బిడ్డల యట్ల చూచు
గురుసేవ గావించు గొఱకొఱ నింతైన
        మానసం బందైన నూన దెపుడు
కుత్సితస్త్రీజనగోష్ఠికి నడువదు
        కలనైన కల్లలు పలుకఁ బోవ


గీ.

దత్తమామల సెలవుల కడుగు దాట
దట్టి సుబ్బాంబను నుతింప నలవియగునె
వేయినోళ్లు గల భుజగవిభున కైనఁ
బలుకుకలికికిఁ జెలువుఁడౌ నలువకైన.

60


మత్తకోకిల.

వీటి కుంకుమ కంచుకంబును వేడ్కఁ దాల్చు హరిద్రయున్
కాటు కెప్పుడు సుబ్బమాంబ యఖండభాగ్యసమేతయై
సాటివారలలోన మెచ్చుగ సంతతంబును శ్రీదిశా
శాటి పాటల గంధి పూజలు సల్పు నాథుని యానతిన్.

61


సీ.

పతియేమి వల్కిన నతిభక్తితో జేయు
        నాత్మమందిరముల యందె మెలఁగు
మఱఁదులఁ బుత్రుల మాడ్కి భావించును
        పలుకుల నొవ్వఁగఁ బలుక దెపుడు

గురుజనం బేమన్న గోపంబు తాల్పదు
        విందులు వచ్చిన విందు సేయు
మంచికృత్యములె గావించు నెల్లప్పుడు
        నోర్మిని వదలక నుండు నట్టి


మహితగుణమణి నికురుంబ కహరహః ప్ర
వర్థిత యశో విజిత శ్వేత భాను శార
దాంబుద కదంబకా సుబ్బమాంబ కెన్న
సతులు సవతు గలరె జగత్త్రితయమందు.

62


గీ.

కలశ జలనిధి పుత్రినిఁ గలసి చెలఁగు
నంబుజాక్షునివలె సుబ్బమాంబఁ గూడి
నిరుపమానంద భరిత హృన్నీరజుఁ డయి
తిమ్మయామాత్యవర్యుండు దేజరిల్లె.

63


క.

తిమ్మకవిరాజ మౌలికి
కొమ్మల తలమిన్న యగుచుఁ గొమరారెడు సు
బ్బమ్మ యనఁగఁ బరుగు సతికి
నెమ్మి కుమారుండనై జనించినవాఁడన్.

64


సీ.

మజ్జనకుండు తిమ్మకవి జల్దంకి రా
        మయకుఁ బుత్రికయును నుదంచితగుణ
[రంజి]త భాగ్య శక్రాణియు వితతక్ష
        మాక్షమ పతిహిత మధురవాణి
పరమ పతివ్రత పావనతా గంగ
        యైనట్టి శ్రీ గంగమాంబికను వి
వాహమై యా సతివలన జగ్గనమంత్రి
        శేఖరు రామసచివ సుధాంశుఁ


గనియె నస్మత్సహోదరులు నయవిదులు
రాముని సెలవు లక్ష్మణస్వామి శత్రు
హంతయునుఁ జేయుగతి మదీయాజ్ఞ నిర్వు
రు నొనరింతురు గడుబత్తి దనరుచుండ.

65

సీ.

శ్రీకుక్కుటేశ్వర పృథు కరుణార్ద్ర క
        టాక్ష సంప్రాప్త విద్యాకలాప
సరస విద్వత్కవి సంశ్లాఘనీయ బృం
        దారక కేవలాంధ్రాంధ్ర లలిత
వాగ్గద్యపద్య కవన రచనా జాత
        జాతరూప నగేంద్ర చాప తార
తారతావార శతార మందార నీ
        హార హార పటీర హీరహీర


చంద్ర చంద్ర తటాగ్రజ శారదాభ్ర
శుభ్ర విభ్రాజమాన యశో లసితుఁడ
కూచిమంచి కులాబ్ధి చకోరహితుఁడ
సుకవి వేంకటరాయఁడ సుజనహితుఁడ.

66


పిఠాపురవర్ణన

క.

పటుతర కరుణామృతరస
తటినీశ మదిష్టదేవతా పరివృఢ కు
క్కుట పతి సంపుట పీఠా
పుట భేదన మహిత మహిమము స్వర్ణింతున్.

67


(క.

శరదిందు శరకుసుమ దీ
ప్తి రమా శోభిత మదిష్ట దేవాస్పదమౌ
వర పీఠాపుర సురుచిర
తర చిరతర మహిత మనుమఁ దగ వర్ణింతున్.[4])


మ.

క్షితిపైఁ బీఠపురీవరం బలరు నచ్ఛిన్నాచ్ఛ రత్న ప్రఘ
ట్టిత కార్తస్వర సౌధ జాలక గతోడ్డీనత్వభాక్సౌరభో
గి తమామర్త్య వధూ రతోత్సవ విధాకృత్ కుట్టనీ భావ సం
తత రాజన్మధుజిత్పదీపద మదోద్యజ్జాల పాదాఢ్యమై.

69

గీ.

తత్పురీకృత చంద్రమస్తరణి రోధ
సౌధ జల నిర్గమన నీలజాలకముల
గగన గాంగేయ హంసార్భకములు దూఱు
క్రౌంచ బిలవేశనాభ్యాస గరిమ దోప.

70


మ.

జలజాతాక్ష పదీ సమాన ధనదాశాక్ష్మాంచ దేలా నదీ
జలసిక్తోపవనస్థ పుష్పఫలపుంజ వ్యాప్త కుంజ ద్రు సం
వల దున్మత్త షడంఘ్రి కీర మధుర ధ్వానంబులం దే తఱిం
దలమై పర్వ పురి న్మనోజ రణగాథల్ దెల్పఁగా నేటికిన్?

71


ప్రాససీసము.

శ్రీకేళికా గృహ వ్యాకోచ మృదుల నా
        లీక సంకీర్ణ పద్మాకరంబు
పాకారి కుంభి శంకాకర మత్త మ
        హా కరివ్రాత సమాకులంబు
ప్రాకార మణిమయ ప్రాకారకాంచనై
        డూక గేహాదిక ప్రాకటంబు
రాకాసుధాకరాస్యోకనద్రుచిర వి
        లోకనాచిర రుగ్విభాకరంబు


లోకనుత సింహ నీకాశ నైక నవ్య
చాకచక్యాఢ్య కుంచగదా కలిత స
మీక పటు వీరభట ఝూట భీకరంబు
నాకసంనిభ పీఠికాఖ్యాకపురము.

72


శా.

జారుల్ చోరులు ఘోరపాతకులు మత్సంరక్షచే నిచ్చలున్
లేరెవ్వార లటంచు సౌరభట పాలిం జేరఁగానీక దా
వారింపన్ వసియించెనో యనఁగ దీవ్యత్తత్పురీ దక్షిణ
ద్వారంబందునఁ గుంతిమాధవ పరబ్రహ్మంబు భాసిల్లెడున్.

73


గీ.

రాక్షసాదిక పీడ లత్రత్య జనుల
కేను గల్గనీనని వ్రత మూనినట్టు

లాపురికిఁ గోణపదిశాముఖాంతరమున
భూతపతి కుక్కుటేశుండు ప్రీతి నుండు.

74


గీ.

కుక్కుటేశ నటేశ ప్రాక్షోణిదేశ
పాద గయవారి మునిగెడు పంచజనుఁడు
ఘోర భూరి జవంజవాపార వార్థి
మజ్జనము సేయఁ డిఁక ధరామండలమున.

75


గీ.

తత్పదాయుధపతి సముద్యచ్చిరత్న
రత్నవలయ గేహఘంటికారవము జనుఁడు
వినిన వినకుండు మహిషవాహన లులాయ
కంఠభాగ్ఘంటికా ఘలంఘలరవంబు.

76


గీ.

భుజగభూషణు మందిరంబునకు భక్తి
[5]తో ప్రదక్షిణములు సేయు నాప్రపూజ్యు
చుట్టునెపుడు దిరుగుదురు సూరిసుకవి
సుజన రాజరాజులు గ్రమ్మి సురుచిరముగ.

77


గీ.

కుక్కుటేశ్వర మందిర క్షోణిరజము
వక్షముల సోక మ్రొక్కు నా భవ్యతముల
వక్షములు చెలువొందు దేవాంగనా కు
చ లికుచాంచిత మృగమదచర్చచేత.

78


గీ.

విధుకలాపుని దివ్యసంనిధి వెలుంగు
తైల దీపాలిఁ గాంచు నా ధన్యతముఁడు
రత్నమణిదీపరాజి విరాజితోరు
భర్మ హర్మ్యాంతరంబుల వఱలుచుండు.

79

గీ.

భక్తి దైవారఁ గుక్కుదేశ్వరుని నుతులు
వీను లలరార వినువాడు వినుచునుండు
గరుడ గంధర్వ యక్ష కింనర నిలింప
సిద్ధ విద్యాధరోరగశ్రేణి నుతులు.

80


సీ.

విశ్రుతాష్టాదశపీఠంబులను బురు
        హూతి కావాసమై ఖ్యాతిఁ గాంచెఁ
బంచమాధవులలోపలఁ గుంతి మాధవు
        సదనమై మిగులఁ బ్రశంస కెక్కెఁ
ద్రిగయల లోనఁ బాదగయకు భవనమై
        ధాత్రిఁ బవిత్రాత్పవిత్రమయ్యెఁ
గుతల స్వయం వ్యక్త కుక్కుటేశ్వరరాజ
        రాజేశ్వరీస్థితిఁ దేజరిల్లె


వ్యాసమునివర వినుత ప్రభావ భరిత
భాస్వదేలానదీ పరిప్రాప్తి నలరె
నట్టి శ్రీపీఠపుర మహిమాతిశయము
వశమె వర్ణింప శేషవాక్పతులకైన.

81


చ.

మలయ తుషార శైలముల మానుగఁ జుట్టిన వౌటఁ గారణం
బుల గుణము ల్వహించె నన భూరి సుగంధన మాధు సంపదల్
గలిగి మహోన్నత స్థితులఁ గాంచి సముద్ర గభీర వేదితా
కలన బలంబు లుప్పతిలగా నగరిం గరిరాజరాజులున్.

82


చ.

చెలు వలరారు నట్టి బహుచిత్రగతుల్ గురువర్ణ కంకణం
బులు సుడులున్ గనుంగొని సుబుద్ధులు సింధుభవంబులే యటం
చు లలిఁ దలంచఁగా జటలు శుభ్రమరీచులు మానవైఖరుల్
దెలుప హరిత్వ లక్షణము ధీరతురంగము లొప్పు లప్పురిన్.

83


చ.

పురిఁ గల భూసురుల్ సవనముల్ బహుభంగుల సేయఁ బుట్టి ని
ర్భర తర హోమధూమము నభశ్చర పుష్కరయానభా ఙ్నభ

శ్చర తరుణీమణీ వదన సంతతిపైఁ బ్రసరించు నిచ్చలుం
బొరిఁ బొరిఁ బంకజంబులకుఁ బోవు మధువ్రతపుంజమో యనన్.

84


చ.

కరి తురగాది దానము లఖండముగా సమరాంగణంబులం
గరితరగాది దానము లఖండముగా సమరాంగణంబులం
బొరి బొరి సేయుచు న్విమల పుణ్యచరిత్రములుం బ్రతాపము
ల్కర మరుదారఁ గీర్తిజిత రాజులు రాజులు పొల్తు రప్పురిన్.

85


గీ.

సరసగుణరత్నగణ పరీక్షా విశేష
చణులు సకలాభినందిత చరిత యతులు
పరమ సౌష్ఠవకలిత సువర్ణపదులు
వఱలుచుంద్రు వరార్యు లప్పట్టణమున.

86


క.

అతుల గుణమణి కలాపులు
క్షితిసురసమ్మోదకర సుశీలాలాపుల్
గతపాపులు హృతతాపులు
సితరోపులు సమితి నందుఁ జెలఁగెడు కాపుల్.

87


సీ.

తగటు బంగరుగిండ్ల దుగఁ దెగడఁగఁ దగు
        పొగరు గుబ్బల నిగన్నిగలతోడ
బెళుకు బేడిసమీల బెడఁ గడరెడు గడు
        సొలపు చూపుల తళత్తళలతోడ
మొగి సిద్ధమగు నద్దముల సొలపులు గల
        జిగి చెక్కుగవ ధగద్ధగలతోడ
వక్తాబ్జ కలిత భంభర సురుచిరతర
        చికురపాలిక చకచ్చకలతోడ


వెలసి బలసిన వలపుల బలసి తమ్ము
గలసి యలసిన విటులతోఁ గలసిమెలసి
సొలసి సొక్కించి రతితంత్ర విలసితముల
బలుసిరుల నొప్పు నప్పురి పణ్యసతులు.

88

సీ.

వేదండయాన నే నీ దండకై వచ్చి
        తది వెలవెట్ట కెట్లబ్బు నీకుఁ
జనుబంతు లొసఁగుము సకియరో యవి యెట్లు
        కరము సేర్పకయుండఁగా లభించు
వలపుగల్గుట చెలి తెలుపు మీ జాతికి
        ముఖవికాసము చూచి పోల్చవచ్చు
నలరారు కలువగావలె నిప్పు డది యెట
        సమకూరు తమ్ము లుజ్జ్వలత నుండ


ననుచు రసికులొ విటులు వల్కిన సరసపు
పలుకులకుఁ దగ నాసలు గొలుపు నుత్త
రములతోఁ గూడఁగాఁ బ్రసూనము లొసఁగుచు
పుష్పలావిక లుందు రప్పురమునందు.

89


సీ.

పరభటోద్భటధైర్య పాటన పాటవ
        ప్రహతోగ్రభేరికా భాంకృతులును
భీకరశాత్రవానీక కుట్టాక ఘ
        టాచ్ఛ ఘంటికా టాంకృతులును
ప్రావృడారంభ శుంభదమోఘ మేఘగ
        [6]ర్జాతుల్యమర్ధల ఝంకృతులును
పరిఫుల్ల హల్లక భరిత సరోవర
        ఖేలచ్ఛితచ్ఛద కేంకృతులును


గలిగి దివ్యభవన జాలక మరు ఫణిత
రంగబాడబ కవిఘన భ్రాజమాన
ఘూర్ణమాణ రత్నాకరాక్షుద్రసరణిఁ
బొసఁగుఁ బురి శ్రీరమా జన్మభూమి యనుచు.

90


వ.

మఱియు నప్పుటభేదనం బభేద వేదవాదామోదమేదుర వేదశాస్త్రాధ్యయన భాసుర భూసుర ప్రసంగభంగీతరంగిత ప్రతిసభాంగణంబై

మార సుకుమార కుమార వీరభూరమణకుమార సమారూఢ ప్రౌఢారట్టజ ఘోట్టాణ ప్రపంచ పంచధారా ప్రచార ప్రచలిత చటుల కుటల ఖురపుట పటల సముద్ఘాతోద్ధూత ధరాపరాగ రేఖా యవనికానికాయ లాసకీవిలాస కర్ణార్ణోజపాతద్యుతి మంజరీపుంజ సారంగ రంగదుత్తుంగ సౌధవీథికా సజాలక జాలక విశాల చంద్రశాలాంతర కేలికాలోల బాలికా చూలికా పాలికా నీలకాంతి సంపతి దంతురిత దృక్ప్రసారపూర పూరితంబై, పురాధిరాజ రాజదౌదార్యధుర్యతా సమాఖ్యాతాసమ సమాఖ్యావమానితుం డగుట బహులార్తిఁ గృశించు శుభ్రదీప్తిని సనామ సౌహార్ధంబున నంతఃకలహంబువలనం దొలంగించు చెలువునఁ జలి నెలవుపావల యేపునఁ జాపలంబునొందు కుంద విశదేందు మణీరమణీయ కమనీయోచ్ఛ్రాయ గేయప్రసాద నికాయ శిఖర నికర సంస్థాన సంస్థాపిత కేతనవ్రాత దండాగ్ర జాగ్రత్పటంబుల పటపటాత్కారంబులు దర్పకదారక దర్శన కౌతుకాయాస్యచ్చతురాస్య స్యందన సందానిత హంససంసద్భ్రాంతి నొసంగ నెసంగుచుఁ జొక్కంపు జింక పొక్కిలి బొట్టుల వగ గులుకుఁ జిఱునగవు వన్నెలల తలతలలకు నెలవులను తమ ముద్దుమొగంబుల చెలిమికిఁ బలె సోరణగండ్లదారి దాఱి పాఱి సారెసారెకు దూఱివచ్చు పచ్చ వీలుదారి మాను ప్రేముడిం బూజల నోజులఁ దేలించుటకై నిగనిగని జిగినెగడు మగరాల జగతులఁ దళుకొత్త గ్రొత్తనెత్తమ్మికెంపుకెంపు కెంపుగుంపుల రూపుల చెంగలువలని చిదుమఁబోవు ముగుదల ముగుదతనంబుల కెద మెచ్చి క్రచ్చలెచ్చ నచ్చిగురాకుబాకు సాదనకాని చెయువులకై మచ్చికం గ్రుచ్చి కౌఁగిలించి యంచతూలంపు సెజ్జల పజ్జలకుం దార్చెడు నెడపొడము నప్పడంతుల యడుగు డెండమ్ములందుఁ జెలువొందు రతనంపు గుందనంపుటందియలఁ గ్రందుకొను జిలుగు బలుకులకు మారువలుకు తెలిపులుఁగుఱేఁడుల పువుఁబోఁడు గూడులకు వాడలగు పైడిమేడలకుఁ దానకంబగుచు; దానవాంతకుపురంబునుం బోలె సుపర్ణవర్ణాకీర్ణంబై, సత్యలోకంబునుం బోలె సుకవిసంభాషణమనోహరంబై , గ్రహమండలంబునుం బోలె మహితనయజ్ఞసూర్యాదిమేదురంబై, పురందరపురంబునుం బోలె సుమహితసౌరభవనపరిపూరితంబై, ప్రావృట్కాలంటునుం బోలె రుచిరశిశిరకరకాంతంబై, కమలాకరంబు గావున సారసవనోపశోభితంబై, రత్నాకరంబు గావున రాజశేఖరకలాపంబై, నిగమశేఖరంబు గావున

సదానందప్రతిపాదకంబై, కల్యాణధర్మనిలయంబు గావున సర్వమంగలాభిరామంబై, బ్రహ్మాస్పదంబు గావున వాణీవిలాసభాసమానంబై, రాజరాజనివాసంబు గావున గంధర్వవిలసితంబై, పరమార్యాన్వితంబు గావున జంద్రరుచిసాంద్రంబై, శూద్రధరంబు గావున సానుచరభద్రేంద్రంబై, మహేశ్వరనివాసంబయ్యును గుసుమకదంబోపేతంబై, శ్రీపతినికేతనంబయ్యును బుణ్యజనసంభాధంబై, భూతలప్రఖ్యాతంబయ్యు భోగవతీలాలితంబై, ద్విజరాజరాజితంబయ్యును గంచుకిగణోదంచితంబై, గజాయుతంబయ్యు నగజాయుతంబై, లీనపంకజాతంబయ్యు నలీనపంకజాతంబై, బలావలీరమ్యంబయ్యు నబలావలీరమ్యంబై, వనీమణీవలయితంబయ్యు నవనీమణీవలయితంబై వెలయుచుండు.

91


సీ.

సరస విద్వత్కవి సన్నుతౌదార్యజ
        కీర్తి జితాసుర క్షితిరుహుండు
ప్రత్యర్థి పృథ్వీశరా డ్బాహు గర్వత
        మోంబుజ మిత్ర భుజార్గలుండు
సకల కలా కలాప కలానులాప వై
        దగ్ధ్య ధిక్కృత భోజ ధరణివిభుఁడు
శ్రీరావు వంశవారిధి సుధాధామ గం
        గాధరరామావనీధవుండు


పాలనము సేయఁ జిరయశోభాసమాన
పరమ శోభాసమానమై పరగుచుండు
రాజమాహేంద్రవర దేశ రాజితంబు
భౌమనాకంబు పీఠికాపట్టణంబు.

92


షష్ఠ్యంతములు

క.

ఏ తత్పుర సద్మునకున్
జాతక సంఘాత హంతృ పదపద్మునకున్
ధూతారిచ్ఛద్మునకున్
శాత శరీ భవదురోవసత్పద్మునకున్.

93

క.

సేవధిపతి నుత గుణికిన్
సేవక జన భావితార్థ చింతామణికిన్
భావ భవతమో ద్యుమణికి
భావిజిత శతాయుతాబ్ద బాంధవఘృణికిన్.

94


క.

పద నమ్ర సుపర్వునకున్
గదన శరీకృత ఖగేంద్ర గంధర్వునకున్
మదనోదధ్యౌర్యునకున్
మద భద్రార్వుపక ఖర్వునకు శర్వునకున్.

95


క.

కోపార్జిత హంకృతి హృత
పాపాట నిశాట ఝాట బహులార్భటికిన్
ద్వీపి పటుకరట కృత్తి ప
టీ పరివృత విపుల కటితటికి ధూర్జటికిన్.

96


క.

చరణాంబుజ సేవా త
త్సర ధిషణాయాత శరభవ తురంగ శిఖీ
శ్వర నిరుపమాన సమ్మద
కర కమ్ర మరీచినామ కచభారునకున్.

97


క.

శర దర హరిణాకృతికిన్
సరస గుణోన్నతికి స్వర్గసమ పీఠపురీ
వర మందిరాభిరతికిన్
చరణాయుధ పతికి శైలజాహితమతికిన్.

98


వ.

సమర్పణంబుగాఁ బురాతన సుకవి నికర విరచిత గ్రంథ గుణదోషపరిశీలన లక్షణ లక్షితంబుగా నా యొనర్పం బూనినఁ 'సుకవి మనోరంజనం' బను లక్షణగ్రంథంబునం దాద్యంబగు పంచాశద్వర్ణ నిర్ణయం బెట్టిదనిన—

99

సుకవి మనోరంజనము

పంచాశద్వర్ణనిర్ణయము

క.

శాంభవికలితోత్సంగా
జృంభితనాట్యప్రసంగ ధృతసితగంగా
శుంభద్దంభనిగుంభిత
కుంభదనుజభంగసంగ! కుక్కుటలింగా!

100


వ.

అవధరింపుము.

101

సంస్కృతాంధ్రవర్ణనిర్ణయము

"ఆద్యాయాః పంచాశద్వర్ణాః ప్రకృతే స్తుతే దశోనాస్స్యుః
షట్త్రింశదత్ర తే౽న్యే చానుప్రవిశన్తి శబ్దయోగవశాత్"

(ఆం. శ. చిం, సం. 5 కారిక)

దీనికి కాకునూరి అప్పకవిగారి ‘ఆంధ్రశబ్దచింతామణి’
గీ.

 అయిదు పదులగు సురభాష కక్షరమ్ము
లందుఁ బది ప్రాకృతమునకు నడఁగిపోవుఁ
దొలగి చనుఁ బదమూఁడును దెలుఁగు బాస
నెసఁగుఁ దత్సమ పదముల నేఁబదియును. (2-47)”

102
వరరుచి వచనము

ద్విధాక ఏచోనుస్వారో విసర్గ షోడశ స్వరాః
స్పర్శా అంత స్థళోష్మాణ శ్చతుస్త్రింశద్ధలస్స్మృతాః.

      ద్విధా = రెండువిధములైన, అకః = అక్ ప్రత్యాహారంబును, అక్కు
లనగా- 'ఆ, ఇ, ఉ, ఋ, ఌ'- ఈ అయిదక్షరములకుఁ బేరు. అది యెట్లనగా-
బాణినీయ సూత్రములు:

      'హలన్త్యమ్'- 'ఉపదేశేన్త్యం హలిత్ స్యాత్'
      ఉపదేశే = సూత్రమునందు, అన్త్యమ్ = కడపటిదయిన హల్ =
వ్యంజనాక్షరము; ఇత్ = ఇత్తను సంజ్ఞకలది, స్యాత్ = అగును, ఇందుచేత
ఇత్తనగా సూత్రము కొననున్న పొల్లనుట.

      'ఆదిరన్త్యేన సహేతా- అంత్యేన ఇతాసహితః ఆదిః మధ్యగానాం, స్వస్య చ సంజ్ఞా స్యాత్'

      అంత్యేన = కడపటనున్న, ఇతా = ఇత్తుతో, సహితః = కూడుకొనిన,
ఆదిః = మొదటి అక్షరము, మధ్యగానాం = నడుమనుండెడు నక్షరములకును,
స్వస్యచ = తనకును, సంజ్ఞా స్యాత్ = పేరగును. అన్నందుచేత తుదనున్న
కకారమునకు పొల్లు పనిలేదాయె, గనుక -

      'తస్యలోపః"
      తస్యేతో లోపస్స్యాత్

      దాని కొననున్న ఇత్తునకు లోపమవును. ఇందున్న క వర్ణము పొల్లు
లోపించగా జిక్కిన యయిదక్షరములును హ్రస్వములు, దీర్ఘములుగాను నుచ్చ
రింపగా, అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ" అని పది యక్షరము
లయ్యెను.

      ఏచః = ఏ, ఓ, ఐ, ఔ,

      'చ్' అను ఏచ్ ప్రత్యాహారమునందు మునుపటివలె కొననున్న చకా
రము లోపించగా, మిగిలినవి నాలుగాయెను.

      'ఏజ్ హ్రస్వో నాస్తి'

      అను సూత్రముచేత నీ ఏచ్చునకు హ్రస్వములేదు. ఏ; ఓ కారములు
గీర్వాణభాషయందు కుఱచలు లేవు, అనుస్వారః = పూర్ణబిందు వొకటి.
సంస్కృతమునందు అర్ధానుస్వారములేదు. విసర్గః = విసర్జనీయ మొకటి.
ఇవన్నియు గూడగా, స్వరాః = అచ్చులు; షోడశ = పదియాఱు. స్పర్శాః =

స్పర్శములు ఇరువదియైదు. అంతస్థశోష్మాణః = అంతస్థములు నాలుగు, దొడ్డ
ళకారమును హలః = వ్యంజనములు, చతు స్త్రింశత్ = ముప్పదినాలుగు, అచ్చులు
పదాఱు, హల్లులు ముప్పదినాలుగు, ఉభయములుగూడ నేబది వర్ణము లాయెను. 103

గీ.

అచ్చు లొక పదియాఱును వ్యంజనములు
పాండుపుత్రసహాయ! ముప్పదియుమూఁడు
దొడ్డ ళా యందులోపల దొరలనయ్యె
నమరభాషకు నేఁబది యక్షరములు (2–49)

104


సీ.

ఏళ నీళము దేవ హేళనంటు నటంచు
             యాజుషామ్నాయంబు నందు లేదొ
కాళ నాళ వ్యాళ గోళ హింతాళంబు
             లనుచు సంస్కృతభాష యందు లేదొ
గయ్యాళి త్రుళ్ళు నగళ్ళు వజ్రపు తళ్కు
             తాళికి నంచు నాంధ్రమున లేదొ
పాళం బెఱుంగని కూళ విరాళి పి
             సాళించు ననియు దేశ్యమున లేదొ
యాగమజ్ఞులు దొడ్డ బీజాక్షరంబు
లందు లేకున్కి సన్నంబు నదియుఁ గూడ
నొకటిగాఁ జేసి బీజోపయోగిఁ గాన
క్షాను జేకొని రది శబ్దసరణి గాదు (2-50)

105

      ఆగమజ్ఞులు పంచాశద్వర్ణంబులలో నున్న క్ష కారమును గూర్చుకొన్నం
దుకు మహావిద్యలోని శ్లోకంబులు.106

మూలాధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనమ్
నాభిస్తు మణిపూరాఖ్యం హృదయాజ్ఞ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్య మాజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర మిత్యాగమవిదో విదుః.

107

ఆధారస్తు చతుర్దళారుణరుచి ర్వాసాంత వర్ణాశ్రయః
స్వాధిష్ఠాన మనేక వైద్యుతనిభం బాలాంత షట్పత్రకం,
రత్నాభం మణిపూరకం దశదళం డాద్యం ఫకారాంతకం
పత్రైర్ద్వాదశభిస్త్వనాహతపురీ హైమీకఠాంతాన్వితా.

108


ద్వ్యష్టారం స్వరషోడశైశ్చ సహితం జ్యోతి ర్విశుద్ధాంబుజం
హంక్షేత్యక్షర పద్మపత్రయుగళం రత్నోపమాజ్ఞాపురీ
తస్మా దూర్ధ్వ మధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం
నిత్యానందమయీ సదాశివపురీ శక్తే నమశ్శాశ్వతం"

109


గీ.⁠

కాకు షా జడ్డయైన క్షకారమగుట
దలఁప కేఁబది లిపులలో దాని గూర్చి
తొలుత భిన్నాక్షరంబైన దొడ్డ ళాను
విడిచి పెట్టె ననంతుండు వెఱ్ఱిగాఁడె (2-62)

110
ఛందమునందు ననంతుఁడు చెప్పిన విధము
క.

యరలవ లంతస్థలు నాఁ
బరగును శషసహలు దేటపడు నూష్మలనన్
సొరిది క్షకారము గూడుక
సరి నేఁబదియయ్యె వర్ణసంఖ్య ధరిత్రిన్.

111


క.

ల ళ లకు భేదము లేదను
పలుకున ళా దొఱగి యైదు పదులగు వర్ణం
బులు సంస్కృత భాషకు, మఱి
తెలుఁగున ఱ ళ లనఁగ రెండధికమగుఁ గృష్ణా.

(అనం.ఛంద. 4.47-55)

112

     అని 'ఆద్యాయః పంశాశద్వర్ణాః' అను సూత్రమునకు (అప్పకవిగారు)
వ్రాసినారు.113

     అప్పకవిగారి ముఖ్యాభిప్రాయము, భ కారము కలుపుకుని 50 వర్ణముల
నిన్ని, అనంతుడు క్ష కారము కలుపుకుని 50 వర్ణము లన్నాడు. క్షకారము
కషయోగమునైన వర్ణముగావున నాగమజ్ఞులు నిలిపినా రన్నంత మాత్రమున

నిది యొక వర్ణ మనరాదనిన్ని అనంతుడు వెఱ్ఱివాడు గనుక క్ష కారమును
నిలిపి ప్రత్యేకవర్ణమైన ళ కారమును విడిచినాడని అనంతుని నాక్షేపించినారు.
'ఏళ నీళము దేవ హేళనము' అని యజుర్వేదమం దున్నదని వ్రాసినారు.
కుమారవ్యాకరణముచేత డ కారమునకు ళ కారము వచ్చును.114

హేమపూర్వే సహప్రశ్నే, డుత్వ మేధాంభ సోర్నని
ప్రాకటే పద మధ్యస్థో, డకారో ళత్వమాప్నుయాత్.

115

    ఆదేశమైతే నేమి, స్వతస్సిద్ధమైతే నేమి, వేదమందు ళకార మున్నదని
లోకమందుకూడా కల దనరాదు. లోకమందు 50 వర్ణములు చెప్పితే, వేద
మందు 60, 63, 64, వర్ణములని యున్నది. కుమారవ్యాకరణమందు:-

'అనేన క్రమేణ యజుర్వేదిక వర్ణానాం షష్టిసంఖ్యా సూత్రత ఏవ
విస్పష్టం ద్రష్టవ్యా. నను త్రిషష్ఠిర్వా చతుషష్టిర్వా వర్ణాః శంభుమతే
మతాః'

    ప్రాకృతవ్యాకరణముచేత ప్రాకృతమందు, ఆంధ్రవ్యాకరణముచేత
నాంధ్రమందున్ను ళ కారము గలదని స్పష్టమైయున్నది. పాణినీయ సూత్రము
చేత సంస్కృత మందు ళ కార మున్నదని శాబ్దికులెవరు నంగీకరించలేదు.
కాళ, నాళ, వ్యాళాదులు ల కారములంటే వచ్చిన దోషము కనిపించదు. అవి
ళకారములని సిద్ధాంత మేమిటో తెలియదు. ఏ యాకరము నవలంబించి యనం
తుని 'వెఱ్ఱి' యనిరో ఆ సాహసము తెలియదు.116

ఈ సూత్రమునకే 'కవిశిరోభూషణము' నందు

సంస్కృత భాషా శబ్దానాం పంచాశద్వర్ణైః సిద్ధిః భవతి అత్ర కేచిత్ -
ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ఏ, ఐ, ఓ, ఔ అనుస్వార
విసర్గౌచ అచః స్వరా ఇతి చ కథ్యంతే. స్పర్శా, అంతస్థాక్షళ వర్ణసహితా
ఊష్మాణశ్చ హల ఇత్యుంచతే, మిలిత్వా పంచాశద్వర్ణా భవంతీతి వదంతి.
తేషాం మతే ప్రకృతే స్తుతే దళోనా ' ఇత్యత్ర- ఋ, ౠ, ఌ, ఐ, ఔ,
ఙ, ఞ, శ, ష (క్ష) వర్ణా, విసర్గశ్చ న్యూనా భవంతి. కేషాంచిన్మతే ఌ
వర్ణస్య దీర్ఘగ్రహణం, ళ వర్ణస్యాగ్రహణం చ సమ్మతం.

అత్ర సంప్రదాయాభిమానినః వదంతి- 'ఆది క్షాంతా స్మృతా వర్ణా'
ఇత్యాగమజ్ఞ వ్యవహార మాత్రేణ న క్షకారస్య వర్ణాంతరత్వేన గణనా
అన్యథా సంయుక్తత్వా విశేషాత్ స్తాదీనామపి వర్ణాంతరత్వేన గణనా
స్వాత్, క్షస్య వర్ణాంతరత్వా భావే, ధాతు పారాయణికైః భిక్షాది
ధాతూనాం షాంతమధ్యే పాఠ ఏవ మానం.

న చైవం శకారస్యా వ్యవర్ణాంతరత్వం, తస్య మహేశ్వర సూత్రాను
క్తత్వే౽పి లడయో ర్లళయో శ్చైకత్వమితి శాబ్దిక శిఖావతంపై రుక్త
త్వాత్ 'లోళ', ఇతి వాల్మీకిభిరుక్తత్వాత్, ళలయో రుచ్చారణస్మ లోక
వేదయోః భిన్నత్వేన ప్రతీయమానత్వాచ్చ న ళస్య వర్ణాంతరత్వం
వక్తుం వార్యతే.

యద్య వ్యనుస్వార విసర్గ జిహ్వామూలీయోపధ్మానీయ యమానామకారో
పరి శర్షుచ పారస్యోపసంఖ్యాన మితి కాత్యాయన వ్యవహారా దనుస్వార
విసర్గయోః హల్త్వం చాప్యస్తి తథాపి వర్ణ పరిగణన దశాయాం
తయోః అచ్త్వేనైన ప్రామాణికైః వ్యవహారః కృతః అత ఏవ హరిం
వందే హరిః కరోతీత్యాదౌ త్రిపాదిగతత్వేన అనుస్వార విసర్గ కార్యయోః
అసిద్ధత్వాత్ న యణాదేశ ప్రసక్తిః ఇత్యాద్య వ్యాకరణ పారీణాః
ఫేణుః.

జిహ్వామూలీయోపధ్మానీయయోస్తు నోభయత్రాపి పరిగణనం, తయోః
విసర్గాదేశత్వేన వర్ణాంతరత్వాభావాత్. ళస్య గ్రాహ్యత్వే, క్షస్య అగ్రా
హ్యత్వే, ఌ వర్ణస్య ద్వైవిధ్యేచ -

"ద్విధాక ఏచోనుస్వారో, విసర్గః షోడశస్వరాః
స్పర్శా అంతస్థళోష్మాణః, చతుస్త్రింశత్ హలః స్మృతాః
సిద్ధి స్సంస్కృత భాషాయాః, భవేత్ పంచాశదక్షరై :
ప్రాకృతాయాశ్చ సిద్ధి స్స్యాత్, తైశ్చత్వారింశ దక్షరైః
ఋ ఌ వర్ణౌ, వినైకారౌకారాభ్యాం చ దశ స్వరాః
శషా వసంయుక్త ఙ ఞ వినైనాన్యే హలో మతాః
ఋ ఌ వర్ణౌ హ్రస్వదీర్ఘౌ ఐజాద్యా వనునాసికౌ
శషౌ చేతే దశ న్యూనా ప్రాకృతోక్తిషు సర్వతః."

ఇత్యాది వరరుచి హేమచంద్రాది వ్యాకరణ ప్రవీణోక్తిః మానమితి.

ఌ వర్ణస్య ద్వైవిధ్య మిత్రత్య తస్య దీర్ఘాభావాత్, ఫ్లుతేన ద్వైవిధ్యమితి
కేచి దూచుః, తస్య సాక్షాత్ దీర్ఘాభావేపి ఋ వర్ణ సవర్ణత్వేన తదీర్ఘత్వ
మితి కేచి దవదన్.

ఆత్రేయం చింతా- హ్రస్వస్యేవ దీర్ఘస్యాపి సిద్ధత్వేనద్వయోః పార
క్యేన గణనా, ప్లుతస్యతు విధి విషయత్వాత్ న పరిగణనేతి సంప్ర
దాయః. ఏవం స్థితే ఌ కార ప్లుతస్యైవ విశిష్య గ్రహణమిత్యప్రామా
ణిక మేవ, న వా తేన ప్రయోజనమితి. ఋ వర్ణ దీర్ఘణైవ దీర్ఘత్వం
ప్రామాణికం. 'అణు దిత్సవర్ణస్య చాప్రత్యయ' ఇతి గ్రహణక శాస్త్రా
నుగమాత్ ఋ కారః త్రింశత స్సంజ్ఞా ఌ కారశ్చ తథావిధ ఇతి సిద్ధాం
తాత్, అత ఏవ హోత్ౡకార ఇతి రూపం సిద్ధం.

అత్ర.

‘కేషాంచిద్వర్ణానాం క్వచి దభిన్నతా వ్యవహారః
లడయో ర్లళయో రలయో ర్వబయోర్భిదా'

ఇత్యుక్తే, తత్రాపి, లడయోః, లళయోః అభేదస్తు వైయాకరణ వ్యవ
హారేణ గరీయాన్. వబయో రభిన్నత్వంతు ప్రాకృత వ్యాకరణ రూఢం
తథాహి— 'నీ వీ స్వప్నే' త్యత్ర [వస్య మాదేశో విధీయతే. తత్ర చ
వస్య సానిత్వం మస్యాదేశత్వం 'బోమశ్శబ్ద' ఇతి పూర్వ సూత్రాదున్నే
తవ్యం. ఏతచ్చ వబయో రభేదం వినా దుర్ఘట మితి స్పష్టమేవ. తేనాబ్ధ
మిత్రత్య][7] ‘దవలా మథశ్చ' ఇతి బ లోపః ఫలం. ప్రపంచస్తు చంద్రి
కాదేః అవగంతవ్యః, రలయో స్త్వ భిన్నతాతు (చింతామణౌ)

'శ్రీరామచంద్ర సూర్యేణ తమః పౌరస్త్యదేశజమ్'

ఇత్యాదౌ కవిభిరేవ వ్యవహృతే త్యవగంతవ్యం.
తదుక్తం శ్రీ భోజేన—

'రలయో ర్లడయో శ్చైవ లళయో శ్శసయో రపి
వబయో ర్నణయో శ్చాంతే, స విసర్గా విసర్గయోః
సబిందుకా బిందుకయోః, స్యాదభేదేన కల్పనం.

ఇతి. (క. శి. భూ. పు. 161-166) 117

     అని అహోబల పండితులవారు వ్రాసినారు. ఈయన తాత్పర్యమున్ను
ళకారమునే కల్పుకొని 50 వర్ణములని స్పష్టముగా నున్నది. ఆయన గ్రంథముల
వలననే కొందఱు క్షకారము గ్రహించినా రనిన్ని, ధాతువు యొక్క షాంత
మధ్యమందు క్షకార ముండుటవలన, క్షకారము ప్రత్యేకవర్ణ మనరా దనిన్ని,
మాహేశ్వరసూత్రములందు లేకపోయినప్పటికీ, కాత్యాయనులవారు వర్ణసమా
మ్నాయమందు చెప్పకపోయినప్పటికిన్ని, ళకారము మాత్రము ప్రత్యేకవర్ణ
మనిన్ని, క్షకారమువలె ళకారమును నెవరికి తప్పించ శక్యముగా దనిన్ని కను
పించుచున్నది. శబ్దశాస్త్రమునందు లేని ళకారము (విషయమున) 'లవయోః'
అని అభేదమున్నంత మాత్రమున నేమి కార్యము : 'లోళః' అని వాల్మీకి
సూత్రము వ్రాసినారు. సంస్కృతమందు ళకారము లేదు గనుకనే, వాల్మీకుల
వారు ప్రాకృతమందు 'కమళం' అని ళకారమే కాని లకారము లేదని చెప్పి
నారు. ఈ సూత్రము వలననే, సంస్కృతమందు ళకారము, ప్రాకృతమందు
లకారము లేవని స్పష్టముగా నున్నది. ఌకారము ద్వైవిధ్యమునకు కొందఱు
దీర్ఘము లేదన్నారు గనుక, ప్లుతముచేత ద్వైవిధ్య మనిన్ని, కొందఱు సాక్షా
ద్దీర్ఘాభావ మైనప్పటికి, ఋకార సవర్ణ మగుటచేత, నా ఋకార దీర్ఘమునుబట్టి
దీనికి దీర్ఘమన్నా రనిన్ని వ్రాసినారు. అయితే, 'రయోస్తు నిత్యం స్యాత్'
(చిం. సం. 22) అన్న సూత్ర వ్యాఖ్య యందు:-

‘కశ్చి ద్వదతి సాంగత్యం యతా వేవానయో స్తదా
అవద చ్చాత్ర సాంగత్యం ప్రాసేష్వపి చ కశ్చన'

       (అను) ఈ కారిక వ్రాసి, యతి కొకడు, ప్రాస కొకడు నంగీకరించుట
వలన నుభయమతము కూడదని కశ్చిచ్ఛబ్ద ప్రయోగముచేత నక్కడ
ఖండించినారు.[8] ఇచ్చట ఏ మాత్ర మా న్యాయము ఎందుకు కలుగదాయెనో

తెలియదు. ఋకారమునకు హ్రస్వ దీర్ఘములు రెండును గలవు. ఌకారమునకు
హ్రస్వమే కాని దీర్ఘ మెచ్చటను కనుపించదు.118

       'కఃకరోతి' అనుచోట కకారమునకు ముందున్న యర్ధవిసర్గాకృతిచే
నుచ్చరింపబడుచున్న (దానికి) 'జిహ్వామూలీయ' మనిపేరు. 'కఃపచతి' అను
చోట, ప వర్ణముకు ముందున్న అర్ధవిసర్గాకృతిచే నుచ్చరింపబడు (దానికి)
'ఉపధ్మానీయ' మని పేరు. పాణినీయ వ్యాకరణమందు శిక్షాకారకులు :-

"అ క హ విసర్జనీయానాం కంఠః
ఇ చు య శానాం తాలూ
ఋ టు రషాణాం మూర్ధా
ఌ తు లసానా దంతాః
ఉపూపధ్మానీయానా మోష్ఠా
ఞ మ ఙ ణ నానాం నాసికా చ
ఏ దైతోః కంఠ తాలూ
ఓ దౌతోః కంఠోష్ఠం
నకారస్య దాంతోష్ఠం
జిహ్వామూలీయస్య జిహ్వా మూలం
నాసికానుస్వారస్య"

       (అని) జిహ్వామూలీయమునకు జిహ్వమూలము, ఉపధ్మానీయమునకు
ఓష్ఠములు (ఉత్పత్తి) స్థానములని స్పష్టముగా చెప్పినారు. స్థానములుగల జిహ్వా
మూలీయోపధ్మానీయములను, విసర్జనీయమున కాదేశములు గాని, ప్రత్యేకవర్ణ
ములు కావనిన్ని, అచ్చులుగావు, హల్లులుగావు అని పరిహరించుటకు అహోబల
పండితులవారి సామంతమేమో తెలియదు. రేఫ కాదేశమైన విసర్జనీయము నెటు
వలె నచ్చులందు స్వీకరించుకొనిరో తెలియదు. శాస్త్రమందు లేని ళకారము
నిలుపుటకు శాస్త్రమందున్న జిహ్వామూలీయోపధ్మానీయములను పరిహరించుటకు
నాకరము కనుపించదు. ఒకానొకచోట నన్నయభట్టు, సోమయాజి, పెద్దన్న
గారలను ఆకరము లేదని ఆక్షేపించిన అహోబల పండితులవారు తమ యిష్టమే
ప్రధానమనుకున్నారు కాని, పూర్వోత్తరసందర్భము పరిశీలించినారు కాదు. 119

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ఏ, ఐ, ఓ, ఔ
౦ (అనుస్వారము), ః (విసర్గ) = 15
జిహ్వామూలీయోపధ్మానీయములు = 2
మొత్తము 17 అచ్చులు. ఇవియే స్వరములు
క, ఖ, గ, ఘ, ఙ, - చ, ఛ, జ, ఝ, ఞ, -
ట, ఠ, డ, ఢ, ణ, - త, థ, ద, ధ, న, -
ప, ఫ, బ, భ, మ - ఈ 25 స్పర్శలు
య, ర, ల, వ - ఈ 4 అంతస్థలు
శ, ష, స, హ - ఈ నాలుగు ఊష్మలు
ఈ 33 హల్లులు, ఇవియే వ్యంజనములు
అచ్చులు 17 + హల్లులు 33 = 50

       పంచాశద్వర్ణము లివి యని మా మతము. బుద్ధిమంతులు ఈ మూడు
మతములందు నెవరి మతము బాగుంటే దానిని స్వీకరించవలెను. బాలసరస్వ
తులవారు ఏబదివర్ణములన్నారుగాని, వివరించలేదు. ఆయనే బుద్ధిమంతులు. 120

ఆంధ్రభాషకు
సూ.

ద్వివిధా దిదు దే తోచో
వక్రతమా వనుస్వారౌ
క గ చ జ యుగ ట ఢ ణ త ద న
పబమ - యరలవ - స హ ళం తు హల్వర్గః'

(ఆం. శ. చిం. 6)

       అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, ఐ, ఔ, ౦ (అనుస్వారము)
ఁ(అర్ధానుస్వారము) - ఈ పదునాలుగున్ను అచ్చులు, క, గ, చ, చె(ౘ), జ, జె
(ౙ), ట, డ, ణ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, స, హ, ళ - ఈ ఇరు
వది రెండు హల్లులు. అచ్చులు (14) హల్లులు (22) మొత్తము 36.
'షట్త్రింశత్' అని వ్యాఖ్యాకారు లందఱు వ్రాసినారు. ఆంధ్రమందు సుప్రసిద్ధ
మైన ఱకారమును చెప్పలేదు. శాలు, కాశ, జఱబి, భళీ, జెం(ౙం)ఝాటము,
ఖజ్జము - ఈ మొదలయిన పదములందు శ, ఝ, భ, ఖ (అను) నాలుగు
వర్ణములున్ను, ఠవర, ఠీవి, దేవ, ఠావు, ఢాక, — ఈ పదము లప్పకవిగారే

వ్రాసినారు. వీటియందు ఠ, ఢ రెండు వర్ణములున్ను గలవు. (ఈ యీ వర్ణము
లను కలుపుకుని) 43 వర్ణములుఁడగా 'షట్త్రింశత్' అన్నారు.

ఇందుకున్ను

‘అర్ధంత్యస్తాలవ్య శ్చుర్వక్రస్యాన్మిథ స్సవర్ణళ్ఛ'

(ఆం. శ. చిం. 23 సూ.)

       చలి, చమురు, చాన, చప్పుడు- ఇత్యాదులు దంత్యము లనిన్ని, చెలి,
జేవురు, చెమట, చెలువు. ఈ మొదలైనవి తాలవ్యములనిన్ని నిర్ణయించినారు.
ఇవి- 'మిథస్సవర్ణశ్చ'- యతి ప్రాసములందు సవర్ణము లంటారు. వీటికి
సూత్రమేమి? కకారాదులకు (ను) గలదు. కలికి, కెరలి, కాన, కేరుచు- ఈ
మొదలైనవిన్ని రెండు విధములని యెందు కనరాదు? ఇందుకున్న వారి తాత్ప
ర్యము తెలియదు.121

       చలము=కూపకము, చలము = పాత్రవిశేషము, చాఱు, చామకూఱ.
ఈ మొదలయినవి గీర్వాణ వర్ణములైన చారు, చారిత్రము — ఈ మొదలయిన
పదములవలె నుచ్చరింపబడుట భేదమైయున్నది.
       చామ చేను చామలు = స్త్రీలు, చామనార ఈ మొదలయిన పదము లుచ్చ
రించుట భేదమైయున్నది.
       కూజా, కేజా, జాణ—
       ఈ మొదలయినవి, జాగరూకుడు, జామిత్రము— ఈ మొదలయిన గీర్వాణ
పదములవలె నుచ్చరించుట భేదమైయున్నది.
       జాము, జావ, జారీచెంబు
       ఈ మొదలయిన పదము లుచ్చరించుట భేదమైయున్నది. ఇవి రెండు
విధములు, వీటికి యతి ప్రాసములు చెల్లునని చెప్పితే, యుక్తముగా నుండును.122

సూ.

'క్వచిదపి నస్త ఉదోతౌ
దంతోష్ఠ భవస్య వికృతి శబ్దాదౌ'

       తెలుగున వకారమునకు కొమ్ము నోత్వమును లేదన్నారు. 'వోఢ్ర'
శబ్దముకు వకారోత్వమని అహోబలపతి మొదలయినవారు వ్రాసినారు. ఓడ, ఓల,
ఒంటరి - ఈ మొదలైనవి అజాదికములుగాని, వకారాదులుగావు.'123

సూ.

సిద్ధ స్సాధ్యశ్చానుస్వారః
పూర్ణార్ధ భేదతో ద్వివిధః
హ్రస్వాత్ పూర్ణోపి భవేత్
దీర్ఘాచ్చేత్ ఖండ ఏవ స జ్ఞేయః

(ఆ. శ. చిం. 7 కా.)

       దీర్ఘాక్షరమందు నర్ధబిందువే యని నిశ్చయించినారు. అహోబలుడు కవి
శిరోభూషణమందు—

'పూంచెన్, పూడిచెన్, పూన్చెన్ ఇతి రూపత్రయం.

బుద్ధరాజు రామభద్రకవినా
క.

'పూంచెన్, మంచెన్, మన్చె న
టంచుఁ బ్రయోగింప నమరు, నమరశ్రేణిన్
మంచి మనోరథనికరము
పరమాధిపుఁడు భక్తపోపణుఁ డగుచున్'

ఇతి లక్షణ ముక్త్వా
క.

'కాంచనమాలాలంకృత
చంచత్తనులీల మెఱయ జవనాశ్వములన్
పూంచిన రథమున మణిమయ
పంచాననకేతు వెత్తె బంధురఫణితిన్'

—భార. విరాట, 4-45


ఇతి తిక్కయజ్వవచన ముదాహృతమ్' అని వ్రాసినారు.

124


సూ.

 'ఆద్యః క్రియాను భూతార్థ
ద్యోతిక మాద్యగం వినా సర్వం'

—ఆం. శ. చిం. సూ. 20)

దీనికి బాలసరస్వతిగారి వ్యాఖ్య

       క్రియాసు = క్రియలయందు, భూతార్థద్యోతితం = భూతార్థములను
గనిపించేదిన్ని, ఆద్యగం = నామాదినుండెడిదిన్నీ, వినా = వినాగాను,

సర్వః = సమస్తమైన, యః = యకారము, అత్ - అకారము, అకారమనగా
తలకట్టులనుట, చనియె, వినియె మొదలయినవి క్రియాభూతార్ధస్థిత య
కారైత్వాలు. యెప్పుడు మొదలైనవి నామాది యకారైత్వాలు. ఈ రెండు
విడిచి పెట్టి కడమ యకారములన్ని తలకట్టుగా తెలిసేది.125

ఆధునిక వ్యాఖ్య

       "క్రియాసు = క్రియలయందు, భూతార్ధద్యోతినం— భూతార్థ = భూతార్థ
ములను, ద్యోతినం = ప్రకాశింపజేయు యకారమును, ఆద్యగం - పదాదిగత
యకారమును, వినా = తప్ప, సర్వః = సమస్తమైన, యః = యకారము, అత్ =
అకారము, తాత్పర్యము :— అనగా చనియె, వినియె, కనియె ఇత్యాది క్రియా
పదములందున్న యకారమును, యెవ్వడు, యెలమి ఇత్యాదులందు పదాదిగత
యకారమును ఎకారాంతము. కాయ, చాయ, బయలు మొదలయిన సమస్త
శబ్దములందున్న యకారము అకారాంతమనుట. సూత్రకారులు పదాదియందు
యకారముగలదని చెప్పిరి. అథర్వణాచార్యులు మొదలయిన పండితులు పదాది
యందు యకారము లేదని చెప్పిరి. కావున నా పక్షమందు ఎవడు, ఎలమి అని
అజాదికమే యుండును.”126

మరియు అహోబలుని కవిశిరోమణి వ్యాఖ్య

       "క్రియాసు భూతార్థ ప్రకాశకం నామాద్యగం చ వినా యః యకారః అత్
అకారవాన్ భవతి. తయోస్తు నిత్యమిత్యర్థః. యెవ్వడు, యెప్పుడు, చనియె,
వినియె నిత్యాద్యుదాహరణం. తత్రక్రియాయాం 'క్వాభూతయోః క్రియాం
తస్యేది'తీత్వం. 'వర్ణాగమో విశేష' ఇతి యత్వం. 'ప్రథమైకస్యైద్భవేచ్ఛ
భూతార్థే' ఇతి ఎత్వం. చినెన్, వినెస్, కనెన్ ఇత్యాది క్రియాప్రయోగోపి
ప్రబంధేషు వర్తతే. తత్ర 'ఎదంతతాచ నామ్నా మన్యతరస్యా మియంతానం'
ఇతి సూత్రం న ప్రవర్తతే. నామ్నామితి నామమాత్రస్యైన గ్రహణాత్, కింతు
వికృతివివేకసూత్రేణ తన్నిర్వాహః.

       'యస్యాద్దేశ్య క్రియాంత్యే తు భూత ఏకత్వవాచకః' ఇతి యః
       'ఇత్స్యాత్ భూత బహుత్వే తు, దేశ్య తూభయతో భవేత్' ఇతి ఇత్వం.

       ‘డుడ్యాదివర్ణే భూతార్థే చాపి తస్యైద్భవేత్సదా' ఇతి ఎత్వం. చనియెన్,
వినియెన్, కనియెన్ ఇత్యాది.
       'ఇయాంతా స్సాధవశ్శబ్దాః క్వచిదంతతాపి వా' ఇతి వా ఎత్వం.
       ‘అచోచి కుత్రచిల్లోపో, బహులం స్యాత్ ప్రయోగతః' ఇతి ఇకారస్య
లోపః. చనెన్ ఇత్యాది.
       అత్రేయం చింతా :— వాడెవ్వడు ఇత్యాదౌ సర్వత్రా౽జంశేన సంధి
శ్రవణాత్ .
       'ఎవ్వని వాకిట నిభమదపంకంబు'
       ఇత్యాదౌ ఎకారం ప్రత్యేవ ఇకార వలేః ప్రయక్తత్వాత్ ప్రయోజనా
భావాచ్చ అద్యగ యకారస్య ప్రాణ్యంశో౽నుపపన్న ఇతి తత్త్యాగో వక్తవ్యః
వికృతి వివేకే౽పి, శ్రీకవి మతే౽పి ప్రాణ్యంశత్యాగ ఏవ విహితః'

'వికృత్యాది గతో యో౽త్ర స్యాచ్ఛష్టాంతర యోగతః
ప్రాణమాత్రావ శేషస్స్యా దత్ర శ్రీకవి సమ్మతే'

వి. వి. సం. 22 కా.
(క. శి. భూ. పు. 189-90)

అని (ఇట్లు) సకల పండితులును పదాదియందున అచ్చేకాని యకారము లేదన్నా
రని వ్రాసినారు. బాలసరస్వతిగారు, సూత్రార్థము మాత్రము వ్రాసినారు. మిగిలిన
వారు సూత్రార్థము వ్రాసి వెంటనే పదాది యకారము లేదని ఖండించినారు.127

అప్పకవీయమునం దీ సూత్రార్థమే
సీ.

ఆంధ్రోక్తి మొదల నాద్యంతస్థ ముండదు
             ప్రాణమై యది గనుపట్టుగాని
నుడువుల నడుమను కడను యా కెందును
             తలకట్టు దక్క నెత్వంబు లేదు
యాకు భూతాది క్రియాద్యోతితములఁ జూ
             పట్టు నెత్వము తలకట్టుగాదు
తలకట్టు వక్రముల్ దొలుచు నీ రెండును
             నలఘు యకారంబు లనఁగ బరఁగు

నిప్పు డీవంకఁ గనుగొంటి నింతలోన
నెచ్చటికి నేగెద వన నాద్యచ్చు లయ్యెఁ
గయ్యమయ్యెను గానిమ్ము గాయకమున
గాయవలె శౌరి ననఁ దలకట్టు లయ్యె. (2-175)


సీ.

ఎక్కడ గనబడియెడు చక్రి చెలులార
             యింక నెవ్వరు చని యెదరు వెదుక
నీ వేళ నెటకుఁ బోయెదవన్న మిన్నక
             నేగెద నన్నే మనియెదరు మీరు
హేమాంగదము లిడియెదఁ జెప్పరే వాని
             నేరీతిఁ బొడగనియెదము మనము
హితము దలంప డాయెను నన్నుఁ గని నగి
             యెడు సవతుల కిది హేతువయ్యె
ననుచు నిట్లు భూతాది క్రియాపదాంత
ముల విశేషణ భావి క్రియలను దక్క
మొదలి యంతస్థముల కేత్వములు త్రిలింగ
దేశ భాషను బుట్టవు దితిజభేది!(2-176)

129
ఆదియకారమునకు నుద్యోగపర్వమునందు
గీ.

కొంచెమైనను దగఁ బంచి కుడువ మేలు
పనులయెడ దుఃఖమోర్చి యల్పంబు సుఖము
ననుభవించుట హితము శత్రునకునైన
నిచ్చుటయే లెస్స యడిగినయెడ నృపాల! (2-47)

130
అని వ్రాసినారు.
సూ.

'అద్యః క్రియాసు భూతా
ద్యర్థసముద్యోతితం వినా సర్వః'

అని, 'ఆద్యగం' అను పదములను తీసివేసి, 'సముద్యోతితం' అను
పదమునుంచి దిద్దినారు. మునుపున్న పాఠము అంతటను "అద్యః క్రియాసు

భూతార్థ ద్యోతిత మాద్యగం వినా సర్వః" (అని, దీనిని) దిద్దుటకు కారణ
మేమంటే, పదాదియుందు యకారములేదు. సూత్ర మందున్నది. సూత్రము
కొట్టుబడి పోకుండగా నుండుటకు దిద్దినారు. ఈ దిద్దినదైనా నిలువదు. ఏమి
హేతువనంటే—కనబడియెడు, చనియెవరు, చనియె —ఈ మొదలయిన పదము
లందు యకారముల కేత్వము అన్నారు. సరే, కయ్యము, సయ్యన-ఈ మొద
లయిన పదములందు యకారమునకు కలకట్టు లన్నారు, సరే, కనియె, వినియె-
ఈ మొదలైన క్రియాపదాంతములందు యకారమున కేత్వములని చెప్పలేదు.
కాని, ఏత్వములును ప్రసిద్ధి. "ఉయ్యలా"ది పదములందు తలకట్టులును
గలవు. కావున, నచ్చట కొట్టుబడి పోయింది. అయితే ఉయ్యలాది పదములను
గురించి విస్తరించి, వ్యర్థశ్రమపడి వ్రాసినారు. కాని అందువలన పాండిత్యాతి
శయము పోవుటకు కారణ మైనది.131

కాకునూరి (అప్పకవిగారి) ఆంధ్ర శబ్ద చింతామణి
గీ.

ధరణి నుయ్యెల పయ్యెద తాయెతులను
గల యకారంబులకు వక్రములు నిజంబు
ముద్దరాజు రామన వాని మూఁటినిఁ బద
మధ్య యాలని చెప్పె నమ్మాట మిథ్య. (2-184)

132

       అప్పకవిగారి తాత్పర్యము: ఉయ్యెల, పయ్యెద, తాయెతులు అను
నీ పద మధ్యమందున్న యకారములకు ఏత్వములు నిజంబనియును, "ముద్ద
రాజు రామన్న పద మధ్య యకారము లంటాడు, ఆమాట అబద్ధము” అని
అర్థము. అయితే, యకార మనిన్ని, ఏత్వమనిన్ని తమ రంగీకరించియు,
రామన్న మాట మిథ్య. ఆనగా అప్పకవిగారు పద మధ్యద్వయ విభాగము
చేసినారు. ప్రత్యేక పదములుగావు, రెండు అచ్చులు కలుసుకొని, వచ్చిన
యకారమని అప్పకవిగారి తాత్పర్యము. అందుకు అప్పకవిగారు చెప్పిన
పద్యము. 133

గీ.

ఊయ నెలకా కగుటచేత నుయ్యెలయ్యెఁ
బయిని యెదకున్కి వక్రోక్తిఁ బయ్యెదయ్యెఁ
తల్లి కాపునకై కట్ట దగిన సరులు
తేలఁ బల్కఁగఁ దాయెతు ల్దేశ్యమునను.

134

వ.

హేలా శబ్దమునకు తద్భవము 'ఏల'. అది కుఱుచకాకు చే(యగా),
హ్రస్వముగా బలుకగా "ఎల" అయినది. ఊచు నెల కనుక 'ఉయ్యెల'
హృదయ శబ్దమునకు తద్భవము "ఎద" ఆయెను. దానికి పైనుండేది
గనుక వక్రసమాసమున “పయ్యెద" ఆయెను. "ఎత్తు" అనగా
దక్షిణ దేశీయముగా దండలకు పేరు. దాని జడ్డలను తేల బలికితే 'ఎతు'
లాయెను, తాయి అనగా తల్లి. ఆ తాయి శిశువులకు శరీరరక్షణగా
గట్టినవి ఎతులు గనుక “తాయెతులు". అటుగనుక, శబ్దాదినున్న
అచ్చులుగాని హల్లులుగావు. సంధిచేతను లఘు యకారము లైనవి,
ఇవి మూడును ప్రత్యేక పదములుగాని యేకపదములుగావు. దీనిని
దెలియక ముద్దరాజు రామన “కవిలోకసంజీవని" యందు చెప్పికొనిన
పద్యము—

135


గీ.

"తాయెతులు నుయ్యెలయుఁ బయ్యెదయును దక్కఁ
గలుగ దెత్వంబు మధ్య యకారమునకు
తుదినిఁ గ్రియఁ దక్క నెత్వంబు గదియ, దాది
నత్వ మొందదు దెనుఁగున నబ్జనాభ!" (2-185, 186, 187)

136

       అని వ్రాసినారు. ఈ వ్రాసిన గ్రంథములో నొక పదమైనా తాము
నిర్ణయించిన మూడు పదములకు పదద్వయ విభాగమును నిలువ బట్టెడు
సూత్రములు మొదలైనవి లేవు. సరికదా, ఊచు ఎల = ఉయ్యెల అయినందున
కేలాగు ద్విత్వయకారము సిద్దమాయెనో? తాయి యెతులు = తాయెతులు అని
యిక్కడ ద్విత్వము లేకపోవుటకు కారణ మేమో? తోచినటుల వ్రాయవలసిన
దౌను. అసందర్భములో నసందర్భము సంభవించినది. నుడువుల నడుమను
కడను యాకెందును తలకట్టు తక్క నేత్వంబు లేదని సిద్ధాంతము చేసినందుకు
తదర్థమై యింత ప్రయాస పడితే, పాండిత్య గురుత్వ మనుకున్నారు.

ఇందుకు

అథర్వణ గ్రంధే తు, పోయెద నిత్యాదౌ-
'భావి క్రియాసు యస్య స్యా దెత్వమేవ ప్రయోగతః'
ఇతి భావిక్రియావ్యవహారేణ ఎత్వం విహితం. పయ్యెద ఇత్యాది నుగతస్యాపి

'డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయే'

ఇతి పృథగెత్వం విహితమేవ, అప్పకవిస్తు పయ్యెద ఇత్యాదౌ అచ్త్వం యశ్రుతి
త్వం చాహ. ఏతత్సూత్ర ప్రామాణ్యాత్ స్వకపోలకల్పితమేవే త్యనుసంధేయం
                                                  (క. శి. భూ. పు. 190)

       అనగా— ఉయ్యెల, తాయెతులు, పయ్యెద— ఈ మూడు పదములు
వినాగా మిగిలిన పదమధ్యయకారములకు తలకట్టులనిన్ని వీటికి మాత్ర మెత్వము
లనిన్నీ అథర్వణాచార్యుల వారి కారిక యున్నది గావున, నప్పకవి చేసిన పద
ద్వయవిభాగము స్వకపోలకల్పితమని అప్పకవిగారి మతమును (అహోబల
పతి) పరిహరించినారు.137

వసుచరిత్ర వ్యాఖ్యయందు సోమనాథ పండితులు వ్రాసిన గ్రంథము
సీ.

ఎదలపైఁ బొదవలు పయ్యెదలు జాఱగఁ బాఱు
బిబ్బీలకు ముసుంగు లబ్బఁజేసె.......

       దీని వ్యాఖ్యయందు అహోబలపండితులవారి గ్రంథమును వ్రాసి ఇందు
చేతనే (పయ్యెద) ఏక పదమనియున్ను, పద మధ్య యకార మెత్వయుక్త మని
యున్ను గ్రహించవలెనని వ్రాసినారు.138

       అప్పకవిగారి ఆంధ్రశబ్దచింతామణి అచ్చు పుస్తకములందు 'అద్యః
క్రియాసు భూతాద్యర్థ సముద్యోతిత మాద్యగం వినా సర్వః' అని యున్నది. అది
అచ్చువేసినవారి పాండిత్యము. ఆర్యావృత్త లక్షణ భంగమైనది.[9] కనినారు
కాదు అర్థవిమర్శ లేకపోయినది.139

       (ఇక) ఉయ్యాల, ఉయ్యెల, ఊయెల, ఉయ్యెల అని నాల్గు విధములు
గలదు.140

ఉయ్యాలకు చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర (1-48)
క.

జోలల్వాడిరి యమృతపు
జాలున్ జోకొట్టఁజాలు సరసపు చూపుల్
డోలాయమానముగ ను
య్యాలో జంపాల యనుచు నా లోలాక్షుల్.

141
ఎఱ్ఱనగారి హరివంశము (6-88)
సీ.

ఔదలఁ జదలేటి లేఁదరగలు బాలుఁ
             డగు చందమామ నుయ్యాల లూప.

142
చాటుధార
శా.

శ్రీలోలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదు వైరి క్షమా
పాలు ర్వీఁగి హయాధిరూఢులగుచున్ బాఱన్ వనిన్ శాఖిశా
ఖాలగ్నాయతకేశపాశులయి తూగన్ గేకిసల్ గొట్టి యు
య్యాలో జంపము లంచు నాడుదురు భిల్లాంభోజపత్రేక్షణల్.

143
తిక్కనగారి ఉత్తరరామాయణము (6-11)
క.

తా సొబఁగున నున్మత్తుం
డై శంకింపక కడంగి యాతం డింతల్
చేసెగదె లేడి తమి పులి
మీసలు నుయ్యాల లూగి మెయిమెయిబోయెన్.

కృష్ణరాయల ఆముక్తమాల్యద (7-16)
సీ.

(కటినుండి చనుమట గడిగాగ బిగియించి
             కట్టిన నిడునీలికాసె మెఱయఁ)
బిల్లిగడ్డము మించఁ బెరిగి మీసలు కుక్షి
             గోలంబు మీఁద నుయ్యాలఁ లూగ .......

145
ఊయెల
తిమ్మకవి అచ్చ తెలుఁగు రామాయణము : (ఆరణ్య-59)
సీ. గీ.

మఱియుఁ దక్కిన కడల ఱేండ్లుఱక మంచి
సేయుటకుఁ బంచు నపరంజి యూయెలలును
(గద్దియలు మేలిసెజ్జలు పెద్దతొడవు
లెపుడు నాయింటఁ గొదలేక యెనసియుండు.)

146
‘ఊయల' అనవచ్చును. 'ఉయ్యల' కు
శ్రీనాథుని భీమేశ్వరపురాణము (8-52)
గీ.

ఆడుచున్నవి పింపిళ్ల నంబరమున
చేయుచున్నవి త్రిభువనాశ్లేషకంబు
లబ్జనాభుని తూగుటుయ్యలలు గంటె
వేనవేలు పయోరాశి వీచిఘటలు.

147
కళాపూర్ణోదయము (6-163)
క.

పలుమరు దలయంటి దగన్
నలుగిడి దోయిళ్ల జలమునం బోర్కాదిం
చి లలిం జన్నిచ్చుచు ను
య్యల నూపుచు బెనుప దొడగె నాఱవశిశువున్.

148
‘పయ్యద' కు
భాస్కర రామాయణము (యుద్ధ. 2357)
చ.

కదిరిన వేడి బాష్పములు గ్రమ్మి పయిం బయిఁ బర్వ భీతిమై
నదరుచు విన్ననైన హృదయంబునఁ బొల్పగు హారయష్టి ప
య్యద దడియంగఁ గానఁబడె నంచిత నిర్మల[10]రత్నభూస్థలిన్
(దదుచిత దృశ్యమాన మణిధామ సముజ్జ్వల భాతి దోఁపగన్)

149

—ఈ మహాకవి లక్ష్యములవలన పదద్వయ విభాగము చేసిన అప్ప
కవిగారి సిద్ధాంత మెగిరిపోయినది.150

ఉయ్యెల ఎత్వమునకు
అరణ్యపర్వము (2-79)
చ.

కలి దమయంతిఁ బాప సమకట్టి పొరింబొరిఁ బాయనోపఁ డా
లలనను దీర్ఘసౌహృద బలంబున నిట్టులు రెంటియందున
న్నలుఁడు విమోహరజ్జులఁ బెనంగి గతాగత కారియయ్యె ను
య్యెలయునుబోలె నూరకయ యెంతయుఁబొద్దు వినిశ్చితాత్ముఁడై.

151
పయ్యెదకు
యయాతి చరిత్ర (8–84)
సీ.

వలఁబడ్డ జక్కవల్ వలె నున్న జిల్గు ప
             య్యెదలోని గుబ్బపాలిండ్లు మెఱయ...

152
కవుల షష్ఠము
మ.

పదముల్ దొట్రిలఁ గౌఁను దీఁగె చలియింపం గేశముల్ దూల ప
య్యెద వక్షోరుహపాలి జేరఁ కనుదోయిన్ బాష్పముల్ గ్రమ్మ గ
ద్గదకంఠంబున వాక్యముల్ డడబడన్ దద్దేహముం జొచ్చి యా
సుదతీరత్నముఁ గాంచె బాలుని మనశ్శోకానలజ్వాలునిన్.

153

       —ఈ మహాకవుల లక్ష్యములచేత పదమధ్య యకారములకు తలకట్టు
దక్క నెత్వము లేదను సిద్ధాంత మెగిరి పోయినది.

       తాయెతులకు, తల్లి శరీరరక్ష కొఱకు చుట్టిన దండలని అర్థము చెప్పుట
నన్ని విధములను జెడిపోయినది. అప్పకవిగారు వ్రాసిన లక్ష్యము

“చంద్రభాను చరిత్ర" సీస పాదము (1-99)

“ఒక యింత యొరిగిన సికమీది ముడి పువ్వు
             టెత్తులు దొరయ తాయెతులు జుట్టి"

వ్రాసినారు, పువ్వుటెత్తు లనగా పుష్పమాలికలుగదా! తాయెతు అనగా తల్లి
చుట్టిన పుష్పమాలికలుగదా! యీ యర్థము సరసముగా నున్నదేమో సరసు
లాలోచించ వచ్చును.155

       "డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయ" ఇతి, కారికకు,
డోల అనగా ఉయ్యాల, భూషా అనగ నగ, ఉత్తరీయ మనగా పయ్యద, ఇది
యర్థము సుప్రసిద్ధి. భూషా శబ్దమునకు దండ లర్థమనుట యొకటి. తాయి

చుట్టిన యెతులనుట రెండు. తకారద్విత్వము లేకపోవుట మూడు శంకలు
సాధారణముగా గనుపించుచున్నవి. భూషలనగా నగల కర్థము. నగలనగా
బంగారు, వెండి మొదలయిన వాటిచేత గుండ్రగాను, కోలగాను చేసిన వస్తు
వులు. ఆ వస్తువులలో శరీరరక్షకొఱకు వృక్షాదుల వేళ్లు మొదలైనవి వేసి
సికను, కంఠమందు, భుజముల, మొలను కట్టు(ట) లోకప్రసిద్ధము. ఆ
వస్తువులను తాయెదలని కొందఱు, తాయెతులని కొందరు తావేజులని కొందరు
ననుట కలదు. తిమ్మకవిసార్వభౌముడుగారు లక్షణసారసంగ్రహమందు
తాయెద అని వ్రాసినారు. పామరులు తావేజు లంటారు. అప్పకవిగారికి
ఉయ్యల మొదలయిన శబ్దములకు లేని పదద్వయవిభాగము సేయుటకు పొసగని
అర్థము వ్రాసుటకు సూత్రములు దిద్దుటకు నింతసామర్ధ్యము కలుగుటకు కారణ
మాయనే గ్రంథాదియందు స్పష్టము చేసినారు. భగవంతులు స్వప్నమందు
ప్రత్యక్షమగునప్పటి పద్యములు:156

క.

కరములు రెంటను దాల్చిన
పరికరములు చూచి యతనిఁ బరమేశునిగా
బరికించి లేచి వలగొని
మురియుచు సాష్టాంగదండము లొనర్చి వెసన్.

157


గీ.

మోడ్పుకేలు భాలమున జేర్చుకొనియున్నఁ
గరుణ నతఁడు నన్ను గాంచి పలికె
నన్నెఱింగి వందనం బొనర్చితి వాత్మ
మెప్పుపుట్టె నీదు మెలకువకును.

158


ఉ.

ఈ యువతుల్ రమాధరణు లేను పయోరుహపత్రనేత్రుఁడన్
నీయెడఁ గూర్మికల్గి ధరణీదివిజోత్తమ వచ్చినాడ స్వ
శ్రేయస మబ్బు నీకు నిక సిద్ధము నన్నయ ఫక్కి యాంధ్రముం
జేయుము మా యనుగ్రహముచే కవు లచ్చెరువంది మెచ్చగన్.

159


క.

వినియును గనియును నెఱుఁగని
ఘనఫక్కిం దెలుఁగు సేయఁగా నెట్లగు నా

కనవలదు దాని లక్షణ
మును నీకది కల్గు చందమును విను మింకన్.
                                           (అ. క. పీఠి 38-41)

160


క.

ఇల నెనుబదిరెం డార్యలు
గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగు నీ
విలసిత ఫక్కి మతంగా
చల విప్రుని వలన నీదు సదనము చేరున్.

161


క.

మును నారాయణ ధీరుఁడు
దనకు సహాయుఁడుగ సంస్కృతము వాగనుశా
సనుఁడు రచియించె దానిం
దెనిఁగింపఁగ నీకుఁదోడు నేనిపు డగుదున్.
                                         (అ. క. పీఠి 52-53)

162


క.

తాతనయు నూత్న దండియు
నీ తెనుఁగుల లక్షణం బొకించుక యైనన్
జేతః ప్రౌఢిమ చెప్పిరి
క్ష్మాతలమున దీని తెఱఁగు గావవి యెల్లన్.

163


గీ.

ఆంధ్రభాషామహాకాననాంతరమున
సంతసంబున శబ్దాపశబ్దసరణు
లెఱుఁగ నేరక మది సంశయించు తెలుఁగు
కవులు సుపథంబు లిందును గాంతు రిలను.
                                         (అ. క. పీఠి 59–60)

164

అని భగవంతులే చెప్పినారని అప్పకవిగారు చెప్పినారు. భగవద్గీత లెటు
వంటివో, అప్పకవి గీతలు నటువలె సకలజనములకు తోచగలందులకు చెప్పు
కొన్నారు. భగవదప్పకవు లిద్దఱు నేకమై రచించిన గ్రంథమందు నిటువంటి
సిద్ధాంతములు బహులములు గలవు. అక్కడక్కడ ప్రసక్తమైనపుడు
వ్రాసుతాము.165

       అహోబల పండితులవారు ఉయ్యల, పయ్యదకు ఆధర్వణ కారికే ప్రధా
నము చేసి యకారములకు ఏత్వము లేదన్నారు. కాని తలకట్టుగలదని పరి
శీలించినారు కారు. అప్పకవిగారికి నన్నయభట్టు గారి కారికలు ప్రధానము.
ఆహోబల పండితులవారికి నన్నయభట్టుగారివి, అథర్వణాచార్యుల వారివి
రెండును ప్రధానము. "డోలా భూషోత్తరీయాణి" అను అథర్వణాచార్యులవారి
కారిక నెఱింగితే, ఆ కారికను తెలిగించిన ముద్దరాజు రామన్నగారి నప్పకవిగా
రాక్షేపించరు. అంత కష్టపడి లేని పదద్వయ విభాగమును చెయ్యరు.166
       ఇంచుకంత సంస్కృత మందు నించుకంత యాంధ్ర మందు తెలిసీ
తెలియని పండితంమన్యులు నన్నయ భట్టుగారి సూత్రముల ననుసరించిన
ప్రయోగములే సాధువులుగాని, సూత్రముల ననుసరించనివి అసాధువు
లంటారు.167
       పదాది యకారము లేదాయెను. పదాది వకారముకు వోఢ్ర శబ్దమందు
నోత్వ ముండెను. పూంచెన్-దీర్ఘమందు పూర్ణబిందు వుండెను. 36 వర్ణ
ములే కాకుండగా మఱియును గలిగి యుండెను.168
       ఇటువలెనే సూత్ర మొకరీతినుంటే, మహాకవి ప్రయోగము లొకరీతి
నున్నవి బహుళములు గలవు. ముందు ప్రసక్తమైనచోట వ్రాసుతాము.169
       ఆంధ్ర వ్యాకరణ మందేకాదు, పాణినీయ వ్యాకరణమందును కొన్ని
సూత్రములు ప్రవర్తించవు. అంత మాత్రమున వారి మహత్వమునకు లోపము
రాదు.170
       సంస్కృతాంధ్ర వర్ణనిర్ణయము సేయుటకునై యిదివరకే గ్రంథవిస్తర
మైనందున (ఇక) ప్రాస నిర్ణయమును చేయుచున్నాము.171

ప్రాసములు

1. ఉభయప్రాసము

గీ.

శసలు నొకదాని కొకటి బొల్పెసఁగు, నటుల
నణలు రెండుఁ బ్రాసంబులై దనరుచుండు
సత్కవీశ్వర కావ్యాలిఁ జంద్రమౌళి
పృథు దయాపాంగ! శ్రీ కుక్కుటేశ లింగ!

172
లక్ష్యము, హరిశ్చంద్రోపాఖ్యానము (1-129)
ఉ.

కౌశిక మౌనివర్య! కడఁకన్ నను ధన్యుని జేయఁగోరి వేం
చేసితివే, గృతార్థమతి చెందితి సాంగమహాధ్వరక్రియా
కౌశలపుణ్యసంపదలు గాంచితి మించితి రాజకోటిలో
వాసికి నెక్కి మీకుఁ దగు వాంఛితి సిద్ధియు వేడుఁ డిచ్చెదన్.

173
అందే (1-162)
శా.

కాశాకాశధునీతరంగచయనీకాశద్యుతిం దట్టమై
కాశం బొందఁగఁ జక్కఁగా సకలదిగ్భాగంబుల న్మన్మథుం
డేసెన్ పాంథజనవ్రజంబులపయి న్నేపార లీలాధను
ర్వైశారద్యము నివ్వటిల్ల ప్రసవాస్త్రశ్రేణులన్ బెల్లుగాన్.

174
పద్మపురాణము
ఉ.

ఆ శతమన్యువైభవుఁ డహర్పతితేజుఁడు చంద్రచంద్రికా
కాశసమానకీర్తి యగు గౌరన మల్లన మంత్రి దిక్కులన్
వాసికి నెక్కి భక్తి ననివారణమై గుడికట్టె గట్టురా
మేశుఁ బ్రతిష్ఠచేసె నుతికెక్కగ నా మొలగూరి వాకిటన్.

175
అప్పన్న పరమభాగవతచరిత్ర
క.

ఆశీర్వదించి శుకుఁ డుచి
తాసీనుం డగుచు రాజు నంద నునిచి యా
వేశకృపామతి శాప
క్లేశవిషాదాత్ముఁ డగుచుఁ గృతనిశ్చయుఁడై.

176
భాస్కర రామాయణము (యుద్ధ. 1447)
ఉ.

వ్రేసియుఁ జీరియుం బొడిచి వ్రేసియు గ్రుచ్చియు చించి నొంచి బి
ట్టేసియుఁ గూల్చియుం బగుల నెమ్ములు రాల్చియు వ్రచ్చి నుగ్గుగాఁ
జేసియుఁ గంఠము ల్దునిమి చిందరవందరగాఁగ మోదినన్
గీశులు భీతినొంది తలకింపుచు రాఘవు మర్వు సొచ్చినన్.

177
శసలకు ప్రాసములు మహాకవి ప్రయోగము లనేకము లుండగా అప్పకవి
"ఆంధ్రశబ్దచింతామణి" (2-258) యందు
సీ.

వికృతి పదాదిని వెలయు నాఱవ హల్లు
             మొదలి విభక్తి పైఁ గదిసెనేని
యరయఁ దృతీయోష్మమగు శౌరి సీరలు
             దాచిఁ గోపస్త్రీల నేఁచె ననఁగ
ప్రథమోష్మవర్ణంబు పరికింప తద్భవా
             ద్యంధ్రదేశోక్తులయందు లేదు
సింగంబు, సింగిణి, సెవమును, సెలగోల
             వాసెడు పసిగొనఁ జేసి రనఁగ
భీష్మ సన్నుత! యివి తృతీయోష్మలిపులు
గాని ప్రథమోష్మవర్ణము ల్గావు, దీని
దెలియక రచించు కృతులు ధాత్రీతలమును
బ్రాస భంగంబులై నగుబాటు చెందు.

184

       అని చెప్పినారు. మహాకవి ప్రయోగములు పరిశీలించనందున స్వపాండి
త్యమునకు నగుబాటనుకోక, శసలు ప్రాసలుగల కృతులు నగుబాటనుట గొప్ప
సామర్థ్య మగును.

(ఇక) నణలకు లక్ష్యములు
రుక్మాంగదచరిత్రము (4–46)
ఉ.

 ఏనుఁగు నెక్కి భేరి మొఱయించుచు నిస్సహణాది [11]భూరిని
స్సాణము లుల్లసిల్ల జలజాప్తకులేంద్రునియాజ్ఞ వీథులన్
మానుగఁ జాటువాక్యములు మానవనాయకుఁ డాలకించి బి
ట్టూనిన భీతిఁ గేల్వదలి యుగ్మలి కౌఁగిలి వాసి గ్రక్కునన్.

186
రెండవచరణమందు నఖండయతి
పారిజాతాపహరణము: (4-9)
మ.

విను మింతుల్ తిలకంబు చంపకము గ్రోవిన్ సిందువారంబుఁ బ్రేం
కణమున్ మామిడి గోగు పొన్నపొగడన్ గంకేలి నూహించి గ
న్గొన మోమెత్తగఁ, గౌఁగిలించుకొన, మూర్కోఁ, బాడ, జేనంట, బ
ల్క, నగం, గల్లుమియంగఁ, దన్నననుచున్ గల్పాగమయ్యై విరుల్.

187

       ఇందులో (మూడవ చరణమందు) "మూర్కొన" నకారలోపమై,
(పూర్వాచ్చునకు) దీర్ఘము వచ్చినది. ప్రేంకణపదము తెలుగు. శ్యామా,
కారంభా ప్రియంగు వృక్షము. పేరుగాన రేఫవచ్చిన ణత్వముగాదు. 'ప్రేంకన'
మని వాడుక లేదు.188

శ్రీనాథుని కాశీఖండము: (7-20)
సీ.

కుదియించునది నెట్టుకొని యింద్రియవ్యాప్తి
       మనసు చాంచల్యంబు మాన్పునదియు
మదిలోన మోక్షకామము వీడుకొనునది
       ప్రాయంగ నిడునది ప్రాణభయము
వ్రతదానధర్మసంరక్షణార్థంబుగాఁ
       గావించునది యాత్మకాయరక్ష
తత్కాలదేహయాత్రామాత్రమునకుఁగా
       సమకూర్చునది ధాన్యసంగ్రహంబు
నణచునది దంభ ముజ్జగించునది యీర్ష్య
యుడుగునది రాగలోభగర్వోదయముల
శాంతి దాంతి తితీక్షా నృశంస్య సత్య
నిరతుఁడగునది కాశిలో నిలుచు నరుఁడు.

189
— నడచుట — డకారమన్నారు. ఇత్వమునకు ప్రయోగమున్నది. 190
శ్రీనాథుని కాశీఖండము (2-150)
క.

త్రినయనుని రాణివాసము
నణిమాద్వైశ్వర్యవితరణామరతరువున్
మణికర్ణిక ముక్తి వధూ
మణికర్ణికఁ దలఁచుఁ దపసి మానసవీథిన్.

191

       నణలకు సాధారణముగా ప్రాసము చెల్లుచుండగా, అప్పకవి మొదలయిన
(వారి) మతములు వేరువేరై యున్నవి.192

కాకునూరి అప్పకవి “ఆంధ్రశబ్దచింతామణి' (3-328)
గీ.

'ధాత్రిఁ బాణినీయ సూత్రములను దృతీ
యోష్మమును ద్రుతంబు నొక్కచోట
క్రమత షాక్షరము ణకారమునై ప్రాస
ములకు నుభయసంజ్ఞ బొసఁగ రెండు'

193

       అనగా—నకారమునకు వచ్చిన ఇత్వము, సకారమునకు వచ్చిన
షత్వము నణలకున్ను, సషలకున్ను క్రమముగా చెల్లునని అప్పకవిగారి
తాత్పర్యము.194

రంగరాట్ఛందము (3-35)
గీ.

"ప్రాదియైన నకార శబ్దములు మూఁటి
కొక నకారంబు, రేపు సంయుక్తమగు న
కార మొకటుండి మూఁడు ణకారములును
బ్రాసములు చెందు నానందరంగధీర!"

195
అనంతుని ఛందము— (1-48)
గీ.

 ప్రాదియైయన శబ్దంబు ప్రాణమగుట,
బరగ నణలకు వేర్వేఱఁ బ్రాసమయ్యె
(క్షోణిధరుఁ డెత్తె నేనుఁగు ప్రాణమనఁగ
దానవారాశి వ్రేతల ప్రాణమనఁగ)

196

       ఇందులో "ప్రాణ" పదముకేగాని, మిగిలిన పదములకు చెల్లవనిన్ని,
మూఁడు వర్ణము లనిన్ని — యీ భేదములు స్పష్టమై యున్నవి.197

మధుసేనము
క.

పో నుద్యోగము చేసిన
ప్రాణంబా! యింక నీకు పాథేయంబా
మానిని మందస్మితమధు
రాసనచంద్రికలు గ్రోలి యరుగుము పిదపన్.

198

       —ఇటువంటివి ప్రాణపదములున్నవి మాత్రమే లక్ష్యములు వ్రాసినారు.
వారివారిమతానుసారముగా చెప్పినారేకాని, పూర్వ మహాకవి లక్ష్యములు పరిశీ
లించలేదు. శ్రీనాథాది మహాకవుల ప్రయోగము లేమనికొనిరో తెలియదు.
అప్పకవిగారు కాశీఖండమందలి 'క. త్రిణయనుని రాణివాసము' (2-150)
అను పద్యము (లక్ష్యము) వ్రాసినారు. త్రిశబ్దము రేఫయుక్త మయినది
గనుక 'నయన' శబ్దమును (ఆది నకారముకు) ణత్వమనుకున్నారు. త్రినయన,
త్రినేత్ర పదములకు వికల్పముననైనా శాబ్దికులు ణత్వము లేదన్నారు. ణత్వము
ఏకపదముందున్నది.199

'రషాభ్యాం నోణ స్సమానపదే'

       ఈ సూత్రముచేత కృపణః, భ్రూణః, రమణః, వారణః, భూషణం.
దూషణం——ఇత్యాది (ఏర్పడును). భిన్నపదములైనను సంజ్ఞయందు ణత్వం
నిత్యం.

'పూర్వపదాత్సంజ్ఞాయా మగః'

       నారాయణః, రామాయణం, చాంద్రాయణం (వ్రతవిశేషం),
అగః కిం? ఋగయనం. అసంజ్ఞయందు ణత్వము రాదు. రఘునాథః,
త్రినేత్రః, త్రినయనః, రామనామ ఇత్యాది.

       అసంజ్ఞయందు, సంజ్ఞయందు నిత్యముగా ణత్వమువచ్చెడు సూత్రము—
'ప్రనిరంతర శ్శరేక్ష ప్లక్షామ కార్ష్య ఖదిర పీయూక్షాభ్యో- సంజ్ఞాయా మపి'

       ప్రవణం. నిర్వణః—వనాన్నిర్గత ఇత్యర్థః, వనస్యాంతః అంతర్వ
ణం, శరాణాం వనం శరవణం, ఇక్షూనాం వనం ఇక్షువణం, ప్లక్షవణం,
ఆద్రువణం, కార్ష్యవణం, ఖదిరవణం, పీయూక్షావణం.
       కొన్నిచోట్ల వన శబ్దము (నకారమునకు) ణత్వము వికల్పము.

‘విభాషౌషధి వనస్పతిభ్యః'


       దూర్వావణం- దూర్వావనం. శిరీషవణం-శిరీషవనం.
       కొన్నిచోట్ల రాదు. దేవదారువనం, సిందువారవనం. పానశబ్దమునకు
సమాసము చేత దేశమర్థమై తోచునపుడు ణత్వము నిత్యము.

'పానం దేశే. '


       సురాపాణాః ప్రాగ్దేశీయాః. క్షీరపాణాః ఉశీనరదేశీయాః.
       పానశబ్దముకు పానపాత్రము, పానము సేయుట అర్థమగునపుడు
ణత్వం వికల్పము. వీరపాణం-వీరపానం-త్రాగుట-గిన్నెయును. గిరి,
చక్ర, నితంబ — ఈ శబ్దములందు వికల్పము. గిరినదీ—గిరిణదీ. చక్రనితంబా—
చక్రణితంబా. ప్రాణి వహించియున్నపుడు వాహన శబ్దమునకు నిత్యం. ఇక్షు
వాహణం. ఉపసర్గలకు పరమైయున్నపుడు ధామ నకారముకు నిత్యం. ప్రణయం,
పరిణయం, నిర్ణయం. కొన్నిచోట్ల ఉవసర్గకు పరమైయున్న 'ని' అను ఉప
సర్గకు నిత్యము. ప్రణిపాతః, ప్రణిధానం. కొన్నిచోట్ల వికల్పము. ప్రణి
భవనం. ప్రనిభవనం.200

       ఈ ప్రకారముగా (ణత్వము) నిత్యమైన పదములు, వికల్పమైన పదములు
మరియును గలవు. త్రినయన, త్రినేత్ర పదములు వికల్పముననైనా ణత్వములు
(గలవి) కావు. అప్పకవిగారు ణత్వమని యేయాకరమునుబట్టి వ్రాసిరో
తెలియదు. శాబ్దికులు ణత్వ మంగీకరించలేదు.201

       'త్రినయన' పదము ణత్వము (గలది) అగుగాక, ఆ కాశీఖండమెందే
సీసపద్యమున్ను, రుక్మాంగద చరిత్రము (నందలి) ఉత్పలమాలయున్ను,
పారిజాతాపహరణము (నందలి) మత్తేభమున్ను (చూడవలసినది.) ఈ గ్రంథ

ముల (నుండి ఇతరత్రయు) లక్ష్యములు వ్రాసిరి. ఈ పద్యముల నుదాహ
రించక పోవుటకు కారణము తెలియదు.202

(ఇక) శబ్దశాస్త్రమున సకారము చెడిన షకారము సకార, షకారములకు
ప్రాసమగును. లక్ష్యములు—

త్రైశంకోపాఖ్యానము
క.

ఝుషకేతు ద్విషునకు కి
ల్బిష పర్వత వృషున కమృత విషనిధి జామా
త్రిషునకు ఋషి పూజితునకు
విషమాక్షున కింద్రముఖ దివిజ పక్షునకున్.

203
సాంబవిలాసము
క.

వసుధా కలత్రునకు సా
రసదలనేత్రునకు మరుదరాతి మదతమో
విసరాంబుజ మిత్రునకున్
విషమ శిలీముఖ సహస్ర నిభ గాత్రునకున్.

204


ఇది "ఉభయప్రాస" మంటారు.

205

2. ఋప్రాసము

లక్షణము— రేఫ ఋకారములకు ప్రాసమగును. 206
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (2-68)
క.

స్వరగణ మయ్యు ఋకారము
పరికింపఁగ రేఫతోడఁ బ్రాసం బగుచున్
గర మొప్పు వట్రసుడి య
క్కరమును బ్రాసమగు హల్లుగదిసి మహేశా!

207
లక్ష్యములు:- ఆరణ్యపర్వము (8-104)
క.

ఆ ఋషికుమారు గట్టిన
చీరలు మృదులములు కడువిచిత్రములు మనో
హారము లుడని బృహత్కటి
భారమునం దొక్క కనక పట్టము వ్రేలున్.

208

       (మొదటి పాదమున) “కుమారుడు" అని "డు" వర్ణము లేదు గాన,
నసాధువనుకొని “పుత్రుఁడు" అని కొన్ని పుస్తకము లందున్నది. డు వర్ణము
లేకుండుటకు చతుర్థాశ్వాసమందు తెలియపరచుతున్నాము.209

       లాక్షణికు లందఱు (లక్ష్యముగా) పై పద్యమే వ్రాసినారు. (కాని) ఋషి
పదము రేఫమున్ను గలదు. ద్విరూపకోశమందు - ఋషిః, రుషి అని
యున్నది.

“విద్యా విదగ్ధమతయః రుషయః ప్రబుద్ధాః"

       అని "భాకందుని" ప్రయోగమని గురుబాల(ప్రబోధిక) ఋషిః =
మునీశ్వరుడు. రుషిః = మునీశ్వరుడున్ను, దిగంబరుడున్ను, వేదమందున్ను,
జ్ఞానవృద్ధునియందున్ను, ఋషి మతప్రవర్తకుని యందున్ను అర్థము గల
దని "శబ్దార్థకల్పతరు” వందున్నది. కావుని నీ పద్యముచేత చెల్లదు.210

హరిశ్చంద్రోపాఖ్యానము (4-230)
ఉ.

నీ ఋణ మెల్లఁ దీర్చి యవనీపతిఁ గింకరుగాగ నేలుదున్
కోరుము నీదు విత్తమునకు న్మితమెయ్యది, యన్న, సమ్మదం
బారగ వల్కె మౌనినుతుఁ డంత్యజుఁ గన్గొని యెంతవట్టు నీ
పేరుగఁజేసి నామదికి ప్రీతియొనర్పుము నీవు దాతవై.

211
—ఈ లక్ష్యముచేత చెల్లును.
కాకునూరి అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి' (2-72) యందు
సీ.

ఋష్యమూకాద్రియు ఋశ్యశృంగుండును
             ఋక్ష మృగేంద్రుడు ఋక్షపదము
ఋతము ఋత్విక్కు నైఋతి ఋతుషట్కము
             ఋతుపర్ణ భూపతి ఋతుమతియును
ఋషభవాహుండును ఋషియు ఋగ్వేదంబు
             ఋధురాజు ఋణమును ఋద్ధి ఋజువు
నను నీపదంబుల కాదివర్ణంబులు
             సప్తమస్వరమునై జగతిఁ బరఁగుఁ

(గృష్ణ వృత్తాంతకా హృషీకేశ మదన
జనక పృథ్వీకుమారభంజన యటంచు
హల్లులందును వట్రువ లమరియుండు
సంస్కృతంబున యదువంశసార్వభౌమ!)

అని నిశ్చయించినారు కాని, ఇందులో ఋషిః = రుషిః, ఋశ్యః = రిశ్యః అని
రెండును గలవు. మఱియునుగలవు. ఋష్టిః = రిష్టిః = ఖడ్గమును, సమృద్ధియును,
ఋక్థం = రిక్థం = సొమ్ము.214

       కొందఱు లాక్షణికులు ఋత్వముగల హల్లులు మూడు, లేని హల్లు
ఒకటి, లేనివి మూడు, కలది ఒకటి అని చెప్పినారు. కాని,215

ఉద్యోగపర్వము: (3–351)
క.

ఈ కృష్ణుని సారథ్యము
నా కృష్ణుని గాండివంబునై దోఁపక ము
న్నీకొలఁది చక్కబడి నీ
వీకురువంశంబు నిలుపు మిభపురనాథా!

216
అని యున్నది గావున తన్నియమము లేదు. 217

3. సంయుతాసంయుతప్రాసము

ఇది ఋప్రాస మంటారు. 218

       లక్షణము : క్రాముడి గల హల్లులకు, వట్రసుడిగల హల్లులకు ప్రాస
మగును.219

లక్ష్యములు-ఆదిపర్వము (2-175)
ఉ.

క్షత్రియవంశ్యులై ధరణి గానఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియ వైశ్య శూద్రులనఁగాఁ దగు నాలుగుజాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితుఁ గాచిన యట్ల రామ మాం
ధాతృ రఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబునన్.

220
శాంతిపర్వము (4-374)
క.

శత్రుజనులఁ జెఱచుటయును
మిత్రులఁ బ్రతికించుటయును మిన్నక యాస
త్పాత్రక సంపదయనఁగ వి
ధాతృఁడు చెందించుఁజూవె తఱితోఁ బురుషున్.

221
క్రాముడి గల హల్లులు లేని హల్లులు ప్రాసమగును.222
లక్ష్యములు - భాస్కర రామాయణము
క.

నాకింకను దిక్కెవ్వరు
శోకాంబుధి నెట్లు గడతు శూరతమై భూ
లోకాధిపసుతు ననిలో
నే క్రియ నిర్జించువాఁడ నెట్టిది వెఱవో?

223
నాచన సోముని హరివంశము
శా.

నాతో మార్కొనలేరు నిర్జరపురీ నాగేంద్ర బృందారకా
రాతుల్ మున్నుగ దేవసంఘములు బోరం ధీర సాంగ్రామికుం
డీ త్రైలోక్యమునందు గల్గఁడు రణం బెచ్చోట లేకుండఁగా
చేతుల్ వేయు వృథాభరంబగుచు వచ్చెన్ దేవ యీ మేనికిన్.

224
ఎఱ్ఱాప్రెగ్గడ హరివంశము
క.

భూపతివై యటఁ బుట్టిన
నీ ప్రెగడల మగుట మాకు నిక్కము వాంఛా
రూపం బని వలుక తదా
లాపం బా పక్షి సముపలాలన జేసెన్.

225
దేవీవిజయము
గీ.

వాక్త్రినేత్రాంగనా శచీ శక్తు లధిక
సంభ్రమంబున కుంభి నికుంభ దైత్య
హంత్రిఁ బూజింపుదురు త్రయీ మంత్రములను
(స్తోత్రములు చేసి మంగళారాత్రిక లిడి.)

226
ఇది సంయుతా సంయుత ప్రాసమంటారు.227
(అయితే) కాకునూరి అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి'యందు :
గీ.

రలలు తమక్రింద జడ్డలై గ్రాలు వ్రాలు
ప్రాసవర్ణంబులై వానిఁ బాసియైన
గూడియైననుఁ బెఱయడుగులను నిలుచు
నవని సంయుతాసంయుతప్రాస మనఁగ.

228


గీ.

పాఁడి ద్రచ్చఁగనిమ్ము నా తండ్రి కృష్ణ
వేఁడుకొనియెద నందాక పండ్లు దినుము
దుండగపుచేష్టలును నోటి గాంద్రతనము
మెండుగాజొచ్చె నీకు నైదేండ్ల కనఁగ. (3-314, 315)

229

       —అని లక్షణము చెప్పినారు. ఇందులో, 'దుండ-గాండ్ర' - ఇది
మాత్రము బాగున్నది. 'వేడు - పండ్లు' ఇది మంచిదిగాదు. 'పాడి - తండ్రి'
'పాండి' అని పదమునందు బిందువులేదు. తండ్రి బిందువున్నది. ప్రాస
మెక్కడ నుండదు. అర్ధబిందుప్రాసముకు భారతాది లక్ష్యము లనేకములు,
పనిలేనిది వ్రాసిరి. అర్ధబిందు వున్నదానికి, లేనిదానికి సాధారణముగా ప్రాస
ములు గలవు. "మేండు - ఏండ్లు', ఎక్కడను లకారమున్నదానికి, లేనిదానికి
ప్రాసములేదు. 'మెండు' బిందువు. 'ఏఁడ్లు' అర్ధబిందువు. బిందువుకు నర్ధ
బిందువుకు (ప్రాసము)లేదు. రెండు పొరపాటులు కౢప్తపదమందున్న ఌకారమును
లకార మనుకొని భ్రాంతత్వమొంది యీ లక్ష్యము వ్రాసినారు. ఇది యనగా 230

లకార శ్లిష్టమునకు రాఘవపాండవీయము (1 - 3)
శా.

లోకత్రాణరతిం దదాదిమ మహీలోక ప్రవేశోత్క భా
షాకౢప్త ప్రథమ ద్వితీయ పదగుంజ న్మంజుమంజీరగ
ర్జాకల్పామల రామభారతకథాసర్గంబులన్ మించు వా
ల్మీకి వ్యాసులఁ గొల్చెదన్ దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

231

       —కౢప్త పదమందున్నది, శుక్ల - విక్షణ - శ్లేషాది పదములందున్న
లకారము వంటిది గాదు. లాక్షణికులందఱు—

గీ.

కబ్బముల కౢప్తియను స్వరల్కార మితర
హల్లుతోఁ బ్రాసముల గూర్పఁజెల్లు...

నని లక్షణము చెప్పి, లక్ష్య మీపద్యమే వ్రాసినారు. అప్పకవిగారు మాత్రమే
లకార మన్నారు. 'కౢప్తిపదము లకారమేమో? ఆ లాక్షణికులకే భ్రాంతత్వ
మనుకోరాదా :'- అంటే,

చేమకూరవారి విజయవిలాసము (1 – 43)
మ.

ఒక భూమీదివిజుండు చోరహృతధేనూత్తంసుఁడై వేఁడుకొం
టకుఁ దా ధర్మజు కేలిమందిరము దండంబోయె కోదండసా
యకము ల్దెచ్చుట, పూర్వకౢప్తసమయన్యాయానుకూలంబుగా
నొకయే డుర్విప్రదక్షిణం బరుగు నుద్యోగంబు వాటిల్లఁగన్.

'కౢ' లకారమైతే 'ర్వ' గురువుకావలె. ఛందోభంగమగును.
కావ్యప్రకాశిక

కర్పూరధూలిధవలద్యుతిపూరధౌత
దిఙ్మండలే శిశిరరోచిషి తస్య యూనః
లీలా శిరాంశుక నివేళ విశేష కౢప్తి
వ్యక్తస్తనోన్నతి రభూ...నా ననేసా.

.. ‘విశేష' యనుచోట షకారము గురువుకావలె.
శ్రీనాథుని కాశీఖండము (5-281)
సీ.

ఘృతపయోరాశి సంకౢప్తావధికమైన
             చంచత్కుశద్వీపజగతిఁ జేరి—

       —లకారమైతే యతిభంగము కావలె. క్రాముడిగల హల్లుకు దాపలి
వర్ణము లఘువున్ను నగుటవలన, క్రాముడిగల వర్ణము లేని వర్ణము ప్రాస
మగును. స్వరమైనప్పటికిన్నీ ఋకారము మాత్రము వ్యంజనమైన రేఫముతో
యతి ప్రాసములు చెల్లును. స్వరమైన ఌ కారమును వ్యంజనమైన లకార
మనుకొనుట మాత్రమే భ్రాంతత్వముగాదు. బిందువున్న వర్ణముకు లేని వర్ణ
ముకు ప్రాసము గూర్చుట —ఇది శుద్ధ ఛాందసత్వము. ఈ గ్రంథమందు
నెవరును శంకలు లేకుండగా భగవంతుడుగూడా తమకు సహాయుడై చెప్పినట్లు
మొదటనే (అప్పకవిగారు) చెప్పినారు. మరియును ( తమ 'ఆం.శ.చి.'
యందు)233

క.

ఇది చదివిన పిమ్మట మరి
యెదియేనియుఁ జదువుబుద్ధి యేలా పొడమున్?
పదపడి గ్రంథము లన్నియు
వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్?

234


గీ.

పర్వతము లెల్ల నొక్క దర్పణమునందు
చూపడు తెఱంగునను కవిత్వోపయోగ
లక్షణము లన్నియును సరలంబుగాగ
నెఱుఁగఁబడు నిఁదు తెలియ నూహించిరేని.

235


గీ.

సౌరభాషకు శబ్దశాస్త్రంబు పగిది
తెనుఁగునకు నవశ్యంబిది దీనిఁ జదివి
జెప్పిన ప్రబంధము జగత్ప్రసిద్ధి నొందు
నుఱక రచియించినది యప్రయోజకమగు. (1.7-9)

236

       —(అని) తమ మహిమను, తమ గ్రంథమహిమను విశేషముగా
(అప్పకవిగారు) ప్రకటము జేసినారు.237

4. ప్రాసమైత్రి ప్రాసము

       లక్షణము: క్ష కారము దాపల బిందువు గలిగి ద్విత్వ మకారముకు
ప్రాసమగును.238

లక్ష్యములు: ఆదిపర్వము (1–77)
ఉ.

ఇమ్ముగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాశుబిం
బమ్మున నుద్భవంబయిన భారతవాగమృతంబు కర్ణరం
ధమ్మను నంజలిం ధవిలి ద్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.

239
పినవీరభద్రుని జైమినీభారతము (7-145)
ఉ.

అమ్మఖవాజి పాండుతనయాధ్వరవాహ మెదిర్చి మోముమో
వం బసివెట్టి ఘోషితరవంబున (వక్షముఁ బూర్వపత్ఖురా
గ్రంబున వ్రేయఱేసి మది కందము వట్టి విదల్పఁబో నమి
త్రంబయి కేలికిం గడఁగి దంతములన్ గళ మప్పళింపఁగన్.)

240
ఇది ప్రాసమైత్రి ప్రాస మంటారు.

(అయితే) కాకునూరి అప్పకవిగారి "ఆంధ్రశబ్దచింతామణి"

(3-343) యందు 241
గీ.

గట్టి బిందువుమీది బకారమునకు
జమిలి మా ప్రాసమైత్రినాఁ బరగుచుండు
కమ్మతావులు వెదజల్లు నంబుజములు
శంబరారాతి చేతివాలమ్ము లనఁగ.

242
(కాని) లక్షణసారసంగ్రహమందు (2-78)
గీ.

బమలు బిందుపూర్వకముగ, బ్రాసంబుల
నిలుపఁజెల్లు, ల ళల కిల నభేద
మొదవుచుండుఁ గృతుల నుడురాజకోటీర
దురితదూర! పీఠపురవిహార!

243

—అని తిమ్మకవి సార్వభౌముడుగారు చెప్పినారు. కావున బిందువు లేకపోతే
జమిలి మా లేదు. కంమ్మ, ఇంమ్మ, అంమ్ము —ఈ మొదలైనవి బిందు
పులు గలవని తెలియవలయును.244

5. స్వవర్గజప్రాసము

లక్షణము
గీ.

వర్గు మొదటి వర్ణము మూఁడవదియు నైన
వర్ణమును మఱియును రెండవదియు నైన
వర్ణము చతుర్థ వర్ణంబు ప్రాసమగు స్వ
వర్గజ ప్రాసమన, రిపువర్గశమన!

245
ప్రథమ తృతీయ వర్ణములకు లక్ష్యములు :
ఆది పర్వము (8-259)
చ.

పెటిలి సువర్ణపర్వతము పెక్కుతెఱంగుల వ్రయ్యునట్టు ల
ప్పుడు వివిధప్రకారముల భూరిశిథావలి ఖాండవంబు న
ల్గడఁ గడుఁ బర్వఁగాఁ బెరసి కాల్పఁదొడంగె హుతాశనుండు చే
ట్పడఁగ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్.

246
విరాట పర్వము (1-135)
ఉ.

ఎండకు వానకోర్చి తన యిల్లు ప్రవాసపు చోటునాక నా
కొంటి నఱంగితిన్ నిదురకుం దఱి తప్పెను డప్పివుట్టె నొ
క్కండును నెల్లరో యనఁగ కార్యముగల్గిన నేలనేలు నా
తం డొకచాయ జూపినను దత్పరతం బని సేయు టొప్పగున్.

247

—అచ్చుపుస్తకములందు 'నా, కొండు నలంగుదు' అని వ్రాసినారు. స్వవర్గజ
ప్రాసముకు లక్ష్యము వ్రాసిన పద్యము (ఇది,) నాలుగు చరణములందు డకార
ములే ఉంటే యీ పద్యము లక్ష్యము (గా) వ్రాయ పని లేదు.248

ద్రోణపర్వము: (4-89)
క.

అటుకులు తిన్నట్లగునే
కడుపున కుట్లెత్తినపుడు కడు బఱచితి నా
డొడ లెఱుఁగక పాండుసుతుల
నుడిగి నుడుగ వలసె నిప్పు డొకసాత్యకిచేన్.

249
(ఇక) ద్వితీయ చతుర్థ వర్ణములకు లక్ష్యములు
ఆదిపర్వము (2-201)
ఉ.

కాదన కిట్టిపాటి యపకారము తక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసిచేసి నృపపుంగవ! నీవు ననేకభూసురా
సాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయంబులన్.

250
విరాటపర్వము (1-301)
క.

ముదమొదవ రమ్యహర్మ్యము
మదినిలుపున నిష్టసఖులతోడ విహారా
స్పదమగు నెలవున మెలఁగెడు
సుధేష్ణ తజ్జాలకములఁ జూచెం బ్రీతిన్.

251
ద్రోణపర్వము (5-170)
క.

వింధ్యాద్రిఁ బోలు నా ప్రతి
వింద్యుఁ డచలితోగ్రమూర్తి వెలయ నిలచి గ
ర్వాంధ్య మెడలఁగను దీప్తా
వంధ్యాస్త్రము లక్కుమారవరుపైఁ బఱపెన్.

252
అలసాని పెద్దకవి హరికథాసారము (ఆనందరంగరాట్ఛందము 3-66)
క.

ఆదేవోత్తముఁడు సుధాం
భోధి వటైకాగ్రిమదలమున బాలుండై
చేదోయిచేత దక్షిణ
పాదము గొని నోటఁ జేర్చి పకపకనగుచున్.

253
ఎఱ్ఱాప్రెగడ సంక్షేపరామాయణము
క.

ఆ దశరథసూనుండు ప
యోధిజలం బింకఁ జేసి యొకశరమునఁ గ్ర
వ్యాదవిభుఁ దునిమి సీతను
మోదంబునఁ జేకొనె సురపుంగవు లెన్నన్.

254
(అయితే) కొందఱు లాక్షణికులు
ఆదిపర్వము (1-70) నందలి
శా.

ఏ డక్షోహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షోహిణుల్
రూడిం గౌరవసైన్య మీ యుభయమున్ రోషాహితాన్యోన్యమై
(యీడన్బోవక వీఁకమైఁ బొడువఁగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ రాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్.)

255
అంగర బసవయ్య ఇందుమతీకల్యాణము నందలి
ఉ.

బీదశచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మరున్
బాదలు పెట్టఁగాఁ జెఱలువట్టఁగ నుండుట భారమంచు రం
బాది మరున్నివాసలసదప్సరసల్ చనుదెంచి వచ్చిరో
నా, దతఫుల్లపద్మవదనల్ విహరింపుదు రప్పురంబునన్.

256
కర్ణపర్వము (3-55) నందలి
క.

కాదేని బిరుసులాడక
సాదులమై వినయమొప్పఁ జని కురునాథుం
డేది పనిచినం జేసి ద
యాదృష్టి నతండు సూచు నట్లుండదగున్.

257
స్త్రీపర్వము (2-40) నందలి
క.

విదురుఁడు తండ్రియుఁ దనకుం
బది వేల్విధములను జెప్పఁ బాటింపఁడు దు
ర్మదమునఁ దగియెడు బుద్ధులు
విది మూడిన మర్త్యుఁ డేల వినును హితోక్తుల్?

258

—అని యీ పద్యములందు, రూడి, బీద, సాదు, విది —యీ పదములు
తద్భవములని తద్భవప్రకరణమందు వ్రాసినారు.[12]

     అంతేకాని, ప్రాసప్రకరణమందు తృతీయ చతుర్థ వర్గములు, కూడదని
వారి తాత్పర్యము. దిద్దశక్యముగాని లక్ష్యములు వ్రాసినాము గావున ప్రాసము
లందు నుంచవలసిన వవును.259

(ఇక) ద్వితీయ చతుర్ధ వర్ణములు ప్రాసములకు లక్ష్యములు :
అరణ్యపర్వము (4–159)
ఉ.

అంధక వృష్ణిభోజ కుకురాన్వయ భూపతులెల్ల నీదెసన్
బాంధవ సౌహృదప్రణయ భక్తివిశేషము లొప్ప నీ మనో
గ్రంథి యడంగఁజేయు నెసకంబునఁ బూనినవారు లోభమో
హాంధులు ధార్తరాష్ట్రులు నయంబు మెయి న్మన కుర్వి యిత్తురే?

260
గంధిశబ్దము (నందు) ద్వితీయ వర్ణము
విరాటపర్వము (1-333)
ఉ.

భాంధవ శాత్రవాకలిత భావభవా భవపాశ బంధ సం
బంధి విరామ కామపరిపక్వ వివేక నిరూఢభక్తి హృ
ద్గ్రంథి విభేదనా పరమ కారుణికా పరిమాణదూర దుః
ఖేంధన పావకాయిత సమీక్షణ శైత్య మహాధ్భుతాత్మకా!

261
ద్రోణపర్వము (1–38)
క.

సింధురము మహోద్రేకమ
దాంధంబై వచ్చునోజ నాచార్యునిపై
గంధవహసుతుఁడు గవయఁగ
మంథరగతి నెవ్వఁడాగు మనయోధులలోన్?

262
మంథర శబ్దము (నందు) ద్వితీయవర్ణము, మరియును బహులములుగలవు. 263

3. బిందుప్రాసము

లక్షణము : నకారము గలిపిన హల్లున్ను బిందువు దాపలగల హల్లున్ను
ప్రాసమగును.264

లక్ష్యములు : చేమకూరవారి సారంగధరచరిత్ర (3-15)
క.

కన్దోయి చల్లఁగా నిడు
కన్దోయి నృపాల లెస్సఁగా నిఁక నౌక మా
టందఱ ముందఱ నీవని
చిందఱ వందఱల గుట్టు చిట్టాడంగన్.

265
ఆంధ్రలక్షణచక్రవర్తి బమ్మెర పోతరాజుగారి దశమస్కంధము: (పూర్వభాగము)
ఉ.

కిన్కలు ముద్దుపల్కులును గెంపుగనుంగవ తీయమోవియున్
జంకెన దేరుచూపు లెకసక్కెములు న్నెలవంక బొమ్మలున్
గొంకక వీడనాడుటలు కూరిమియుంగల కాంతఁ గూడుటల్
అంకిలిలేక జన్మఫలమబ్బుట కాదె కురంగలోచనా!

266
రంగరాట్ఛంధము (3-39)
గీ.

రహినిఁ బ్రాసాక్షరాది వర్ణంబు గిలుక (పొల్లు)
నమరియుండిన నది బిందువగును, బిందు
వర్ణములఁ జేరి ప్రాసమై వన్నెకెక్కు
సున్దరీమోహనాంగ యానందరంగ.

267
అనంతుని చంధము (1-51)
గీ.

పేర్చి పొల్లు నకారంబు బిందువగుట
మీఁదిసున్న ధకారంబు నూది ప్రాస
బంధమగుఁ గృష్ణుఁ డుదయించిన న్ధరిత్రి
యంతయును నిరుపద్రవంబయ్యె ననఁగ.

268
ఆరణ్యపర్వము (3-113)
మత్త.

అమ్మునీంద్రు నివాసశక్తిఁ దదంగరాజ్యమునందు మే
ఘమ్ము లెల్లఁ గెలంకులం గడు గ్రమ్మీ సర్వజనప్రమో
దమ్ముగాఁ బ్రచలద్ బృహజ్జలధార లొప్పఁగ వృష్టిచే
సెం మహానదులుం మహాసరసీచయంబులు నిండఁగాన్.

269
ఇది బిందుప్రాస మన్నారు. 270

ప్రాసభేద విమర్శ

కాకునూరి అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణియందు
శా.

సింగం బాకటితో గుహాంతరమునం జేడ్పాటు మైనొంది మా
తఁగ స్పూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చునో
జం గాంతార నివాస ఖిన్నమతి యస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్.

271

(అని విరాటపర్వము నందలి (4-95) పద్యమందు సంధిగత ప్రాసమని వ్రాసి
నారు. (మఱియు)

సీ.

అర్ధబిందు సమాహ్వయము, పూర్ణబిందు, ఖం
             డాఖండములు, సంయుతాక్షరంబు,
ధర సంయుతాసంయుతము రేఫయుత, లఘు
             ద్విత్వ, వికల్పముల్, వెస నుభయము
ననునాసిక ప్రాసమును, బ్రాసమైత్రియుఁ,
             బ్రాసవైరంబు, స్వవర్గజంబు,
ఋప్రాస, లఘు యకారప్రాసములు, నభే
             దంబును, సంధిగతంబు ననఁగ
బదియు నేడు దెఱంగులఁ బరిఢవిల్లు
ప్రాసములు పూర్వసుకవిప్రబంధములను
గ్రమత లక్షణ లక్ష్యయుక్తంబుగాఁగ
దేటపఱచెద వాని నిశాటదమన!
                                                  (కా. ఆం. 3-298)

272

అవి 17 విధములు చెప్పినారు. వీటిలో ప్రాసమైత్రి, స్వవర్గజము, ఋప్రాసము—
ఈ మూడున్ను భేదములు కనుపించుచున్నవి గాన గ్రాహ్యంబులు. ప్రాసవైర
మని పేరుమాత్రమేకాని, యొక్కడనైనను లేనందుననున్ను, తమరు లక్ష్య
మొకటైనా వ్రాయనందుననున్ను, పూర్వసుకవిప్రబంధములయందు నున్నవన్ని

చెప్పుటవలన నున్ను- ఇంత సందర్భముగా రచించుటకు గగనారవింద, శశి
విషాణ, వంధ్యాపుత్రుల వంటిదిగా నెంచి సంతోషించినాము. విశ్రమ ప్రకరణ
మందును 'విశ్రమవైర' విశ్రమమని చెప్పవలసినదౌను. పరాకు నొందినారని
తోచుచున్నది. (ఇక) సంయుతాసంయుత ప్రాసములో రేఫశ్లిష్టమునకు మహా
కవి ప్రయోగములు గలవు. లకారశ్లిష్టములకు లేవు. ఉభయప్రాసమందు
విషమపదము సషలకు రెంటి(కిని ప్రయోగ) ములున్నవి. చెప్పవలసినదౌను.
నణలకును సాధారణముగా నున్నవాటికి నకారముకు వచ్చిన ణత్వము మాత్రమే
ఉభయములకు చెల్లుననుట పరిశీలించనిమాట. వీఁక దాఁకి ఇది అర్ధబిందు
ప్రాసము. పొందింప బృందావనము - ఇది బిందుప్రాసము, నాకొఱత- చీఁకటి -
ఇది ఖండాఖండప్రాసము.273

క.

సంగ్రామరంగమున పెలు
చం గ్రుమ్మరుచున్న సాల్వజగతీపతి మే
నం గుచ్చి పార నాటిం
చెం గ్రూరాస్త్రములు నాల్గు శ్రీకృష్ణుఁ డొగిన్.
                                        (కా. ఆం. 3-324)

274
—ఇది రేఫయుత ప్రాసము.
'గీతపాదము.

విద్రుచె వినతాత్మజుండు దిక్కు లద్రువ ననఁగ'
                                        (కా. అం. 3-326)

275
—ఇది లఘుద్విత్వ ప్రాసము.
'గీ.

ప్రాఙ్నగ సమానధృతి సుధారుఙ్నిభాస్య...'
                                        (కా. ఆం. 3-328)

276
—ఇది వికల్పప్రాసము
'క.

మిన్నేఱు పాదమున ధా
తం నాభిని, (గుసుమశరు నెదఁ గాంచిన నీ
సాంనిధ్యము దొరకుటకై
సంనుతి సేయుదురు నిన్ను సనకాదు లజా!)'

277
—ఇదియును
'క.

తమ్ములను మల్లికాకుసు
మమ్ముల మరువాది పత్రమాలికలను భ
క్తిం మురహరు (పూజలు
సంమదమున సలుపఁగలుగు సకలార్థంబుల్.)'
                                        (కా. ఆం. 3-341, 2)

278

—ఇదియును అనునాసికప్రాసము. ఏయెడ — ఆయత = ఇది లఘు
యకార ప్రాసము. 'శా. సింగం బాఁకటితో...వ, చ్చెం గుంతీసుత...' =
ఇది సంధిగత ప్రాసము — ఈతొమ్మిది విధములును సాధారణమైనవి గనుక
నామనిర్దేశము మాత్రమే ఫలము. ఇన్ని ప్రాసము లప్పకవిగారు చెప్పినారను
గొప్పకేకాని, మరేమియు లేదు.279

(ఇక) అభేదప్రాసముకు చెప్పిన లక్ష్య లక్షణములు :—
లక్షణము
గీ.

పెద్దలాకుఁను దనకు నభేదమగుట
లళలకు నభేదమట్లును గలుగుకతన
క్షితిని మూఁడవ సరళంబు యతులఁ బ్రాస
ములను లఘ్వలఘు లకారములకు నిలుచు.
                               (కా. ఆం. 3-386)

280
లక్ష్యములు, ప్రభావతీప్రద్యుమ్నము (1-57)
క.

జలనిధియను తెరమఱు గటు
వెడలి నిలిచినట్టి యాటవెలదియపోలెన్
గడు నింపులు గులుకుచుఁ దన
రెడు పురలక్ష్మి నవధరించితె యధిపా!

281
4వ చరణమందు లక్షణభంగము. 'పురవరలక్ష్మి' సుష్ఠు 282
భీష్మపర్వము (1-93)
క.

కొడుకులు దానును గుఱ్ఱపు
దళములు కరిఘటలు భట రథ వ్రాతములుం
బుడమి చలింపఁగ ద్రుపదుఁడు
గడు వేడుకఁ దోడుసూపె కౌరవ్యునకున్.

283

—అని లడలకు, ళడలకు, లక్ష్యములు వ్రాసినారు. అచ్చు పుస్తకములందు,
'జడనిధి'—'దడములు' అని వ్రాసినారు కవిత్వ మచ్చుపుస్తకములందున్నటులనే
సుష్ఠువు, అప్పకవిగారి మత మదికాదు. 'జలనిధి' - 'దళములు' అని నిశ్చయము.
అటులనే కాకపోతే లక్షణ లక్ష్యములకు విరోధము. నిశ్చయించుట అప్పకవి
గారిదిన్ని, వ్రాసుట అచ్చువేసిన వారిదిన్ని పొరపాటు.284

నైషధము (4-24)
చ.

చిలుకలు కూయునో చెవులు చిల్లులువోవఁగ నంచు నెన్నడున్
వెడలఁడు నందనోపనన వీథులకై యట, మౌలిభాగ ని
ర్మల శశిరేఖచేయు నపరాధమునన్ గజదైత్యశాసనున్
గొలువఁడు పాకశాసనుఁడు కోమలి నీదెసఁ గూర్కియెట్టిదో.

285
కూర్మపురాణము
తోటక.

తాలిమి దూలిన తాపసపత్నుల్
వ్రీడ మనంబున వీడ్కొని జాఱున్
లోల మదాలస లోచన పఙ్తుల్
జాల దలర్చిరి శంకరులీలన్.

286
అని (అప్పకవిగారు) వ్రాసినారు

     (అయితే) తిమ్మకవి సార్వభౌముడుగారు లక్షణసారసంగ్రహము
నందు (2-82)

క.

లడలకు నభేద మనుచున్
వెడఁగులు గడు ప్రాసములను విశ్రమముల ను
బ్బడరఁగఁ గలుపుదు రది యె
య్యెడలను సౌష్ఠవముగాదు హిమకరమకుటా!

287

ఆ.

మొసలి మొసడి వ్యాళమును వ్యాడమును వ్రీళ
వ్రీడ వెలుడుటయును వెడలుటయును
దళము దడము నాఁగ జలము జడము నాఁగ
లడలు రెండుఁ జెల్లు నుడుపభూష! (2-83)

288


ఆ.

వెలుడె నన్పదంబు వెడలుటయంచు ల
క్ష్యంబు నైషధమున నరసి లడల
కిల నభేదమనుచు నల ముద్దరాజు రా
మన్న వలికెఁ దలఁప నది హుళక్కి. (2-84)

289
ఆంధ్రనామసంగ్రహము (నందు)
క.

కలవు వివరింపఁగా నా
ఖ్యలు వరుస న్నిర్గమించె ననుటకు ధరలో
వెలువడియె, వెళ్లె, వెడలెను
వెలుడెననం జిత్ప్రకాశ విశ్వాధీశా (మానవ. 63)

290
అని పైడిపాటి లక్ష్మణకవి చెప్పినాడు గనుక 'వెలుడె' ననిన్ని కలదు.
ఉదాహరణము - నైషధము

"చిలుకలు కూయునో...................

291
రామాభ్యుదయము (8–54)
క.

వెలుడి చనుదెంచె నపుడ
ప్పలభుక్కుల కన్యవన్యఫలభుక్కులకుం
గలనయ్యెఁ నందుఁ జేకొని
గెలుపున గపివీరు లొడ్డగిల దొరకొనినన్.

292
దడమనుటకు భీష్మపర్వము
'క.

కొడుకులు దానును.................

293
వ్రీళ యనుటకు భీమఖండము : (3-198)
క.

బాలోవ్మత్త పిశాచ ద
శాలంబనమునఁ జరించు నంగరవీథిన్
వ్రీళా శూన్యత కంఠే
కాలుని పాదములమీఁద గల్గు విరాలిన్.

294

అని చెప్పినారు. గనుక, జలము - జడము, దళము - దడము, వ్రీళ - వ్రీడ, ఈ మొదలైనపదము లాంధ్రగీర్వాణములందు బహులములు రెండువిధములు

గలవు. అప్పకవిగారున్ను 'ఆంధ్రశబ్దచింతామణి' యందు
సీ.

క్ష్వేళంబు క్ష్వేడంబు, చోళుండు చోడుఁడు
             తాళంబు తాడంబు, దళము దడము
క్రోళంబు క్రోడంబు, నాళంబు నాడంబు,
             నీళంబు నీడంబు, గౌళి గౌడి,
వ్యాళంబు వ్యాడంబు, చూళిక చూడిక,
             వళి వడి, హేళి సర్వజ్ఞ హేడి,
జళకేళి జడగేడి, వెలుడడు వెడలడు ,
             కేళంబు కేడంబు, పాళి పాడి,
నేవళము నేవడం బిట్లు నిర్జరాంధ్ర
భాషలను రెండు గొన్ని శబ్దంబులందు
నరయ 'ళడయోరభేద' యటన్న సూత్ర
మున ళకారంబునకు డతములు ఘటించు.

295


సీ.

డిండీర దీప్తి పోడిమి మీరు నీ కీర్తి
             దిండీర పాండిమఁ దెగడు నవ్వు
డంభ మిచ్చటను గూడదు కృష్ణ నీ వేగి
             దంభంబు మిత్రవిందకడఁ జేయు
డాడిమీఫల మియ్యెడకు నేల కొనిపొమ్ము
             దాడిమీఫలము సుదంత కిమ్ము
డోలికనూగు వేడుక నీకుఁ గల్గిన
             దోలిక లక్షణతోడ నెక్కు

మంచు నీపద్యమునఁ జరణాదులందు
నిలుపు పదముల మొదలను గలుగు వ్రాలు
డత్వ దత్వంబులందు రెంటను బొసంగు
శాబ్దికమయంబునను వనజాతనయన!

296


గీ.

డంభ డిండీర డోలికా డాడిముది
శబ్దముల కాదివర్గముల్ సంస్కృతమున
నుపరివర్గ తృతీయమై యొప్పునట్లు
తెనుఁగున డకారము దవర్గ మొనర్చుచుండు.

(కా. అం. 2-146, 7, 8)

297

— అని ళడలే కాకుండా, దడలున్ను రెండు విధములు గలవని చెప్పిరి.
ఇందులో ‘జళకేళి - జడకేళి', దళము - దడము, వెలుడఁడు - వెడలఁడు,-
ఈ పదములు రెండువిధములు చెప్పిన్నీ, ఆలక్ష్యము లెందుకు (అప్పకవిగారు)
వ్రాసిరో తెలియదు. (మరియు) విశ్రమప్రకరణమందు నైషధమందలి (1-110):

క.

కేళాది రాయ యభినవ
లీలామకరాంక చంద్రరేఖాంకుర (చూ
డా లంకార పదాంబురు
హాలింగిత సుఖిత నిర్మలాంతఃకరణా!)

298

— అని (రెండవ చరణమున) 'దల' లకు విశ్రమము 'లేఖా-రేఖా' అని రెండు
విధములున్నవి గనుక పనికిరాదని '...చంద్రలేఖాంకుర ...' అని వ్రాసిరి.
ఇచ్చటమాత్రము తత్పాండిత్యమహిమ ఏమయిపోయెనో తెలియదు. లడలకు
ప్రాస మెక్కడనున్ను లేదు. 'జలంచ జడమిత్యపి' అని ద్విరూపకోశమం
దున్నది గనుకనే— 299

మహాప్రస్థానిక పర్వము (1-32) నందు

క. పడమర మొగమై పశ్చిమ
జడనిధి తీరంబు సేరఁ జని యుత్తర మె
క్కుడు నియతి నడిచి వారిధి
పొడవడిగిన యాదవేంద్ర పురిచేరువగన్.

300
(అని 'జడనిధి' ప్రయోగము జరిగినది).
  1. కైలాస సోపాన పదములు నిత్యసమాసములు. (చూ. ఇదే గ్రంథమున నిత్యసమాసయతులు). వాటి స్వరములు ఇక్కడ యతి చెల్లినవి. ఇట్లు చెల్లుట 'సౌభాగ్యయతి' అని సులక్షణసారము. (యతి ప్రకరణము. 198)
  2. నారాయణ - నరాయణ పదములు రెండునున్నవి. చూ. ఇదే గ్రంథమున నిత్యసమాసయతులు
  3. ఇక్కడ 'సర్వలక్షణసారసంగ్రహ' మని పేర్కొన్నను ముందుముందు గ్రంథమందంతట 'తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహ' మనియే 'సర్వ' పద విరహితముగా వేంకటరాయకవి పేర్కొన్నాడు. నిజమునకు అది 'లక్షణసారసంగ్రహ'మే. చూ. ఆం. ప్ర. సాహిత్య అకాడమీ ప్రచురించిన 'లక్షణసార సంగ్రహ'మునకు నా వ్రాసిన సమీక్షణము.
  4. మూలప్రతియందే ఈ పద్యము కుండలీకరింపబడియున్నది.
  5. 'లోన్' అనునది ద్రుతాంతము. ద్రుతసంధి ప్రకారము ఇక్కడ ‘తోఁబ్రదక్షిణ’ అని యుండవలెను. కాని అట్లున్నచో ఈ పాదంమం దుపయుక్తమైన ప్రాసయతికి భంగము కలుగును.
  6. ... ర్జితతుల్య మర్థల ఝెంకృతులును...' అని మూలప్రతి.
  7. ఈ కుండలీకరణములోని భాగము మూలమునలేదు. అహోబల పండితీయము (ఆంధ్ర రచయితలసంఘ ప్రచురణ)నుండి గ్రహించబడినది.
  8. "కశ్చిద్వదతి... కశ్చన“ ఇత్యుక్త్వా కయోశ్చిత్త న్మైత్రీ
    కల్పకయోర్మత ముభయత్ర కశ్చిచ్ఛబ్ద ప్రయోగేణ అత్యంత పండిత
    మ్మన్యతా ధ్వనన ద్వారా పరాకృత్య, ద్వితీయాచార్యేణ- "అనయో
    స్సంగతిం యస్తు, కరోతి కవితాకృతౌ. అస్యా అత్యంతదోషత్వాత్,
    దుష్కవి స్సహి కథ్యతే" (అధర్వ సం 27 కా) ఇతి స్వమతం ప్రకాశితమ్.

    (క. శి. భూ. పు. 195-196)

  9. ఆర్యాపూర్వార్ధమందు ఏడు చతుర్మాత్రాగణములు మరియు వొక
    గురువుండవలెను. ఇందు ఒక చతుర్మాత్రాగణ మెక్కవైనది. "అద్యః ।
    క్రియాసు। భూతా । ద్యర్థన ।ముద్యో । తితమా । ద్యగంవి । నాస । ర్వః" ఇది
    ఆర్యాగీతియు కాదు. ఆర్యాగీతియం దెనిమిదిమాత్రమే చతుర్మాత్రాగణ
    ములుండును. ఇందొక గురువెక్కువ. మరియు 'ఆద్యగ' మని యుండుట అప్ప
    కవి ఉద్దేశ్యమునకు భిన్నముగూడ.
  10. ము. పు రత్నభూషలన్
  11. ....భేరిని, స్స్వానము లుల్లసిల్ల జలజాతహితేందువిశాలవీథులన్
  12. వీటిని తద్భవములందు వ్రాసినవాడు కూచిమంచి తిమ్మన. (లక్షణసారసంగ్రహము 1.80-84 )