సుకవి మనోరంజనము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

సుకవి మనోరంజనము

ద్వితీయాశ్వాసము

శ్రీ రమణిప్రియ శయనా
గార నిషంగా కరాబ్జ కలిత కురంగా
[గౌరీ కలితోత్సంగా]
క్రూరాహితపటలభంగ కుక్కుటలింగా!

1

యతిభేదవిచారము

అవధరింపుము, విశ్రమనిర్ణయం బెఱింగించెద : 2
కాకునూరు అప్పకవిగారు తమ ఆంధ్రశబ్దచింతామణి యందు
గీ.

విరతి విశ్రాంతి విశ్రామ విశ్రమములు
శ్రాంతి విరమణ విరమ విరామ యతులు
ననఁగ నివి తొమ్మిదియు వలి కాఖ్యలయ్యె
భవ్య సక్తుఫలాయామ్యభాగగేహ!

3


క.

భీమన పది చెప్పె, ననం
తామాత్యుఁడుఁ జేసె వెనుక యతు లిరువదినా
ల్గామీఁద గొందఱు కవి
గ్రామణు లిరువదియు నేడు గావించి రొగిన్.

4

గీ.

పూర్వకవుల లక్ష్యములు గూర్చి సత్కవి
జనము లవు నటంచు సంనుతింప
విశ్రమంబు లేను వివరింతు నాలుగు
పదులమీఁద నొకటి విదితముగను.

5

యతి భేదములు :

క.

స్వరయతులు వ్యంజనాక్షర
విరతు లుభయవళులు ప్రాస విశ్రాంతులు నాఁ
బరకింప నాల్గు తెఱఁగుల
విరమణములు వరలుచుండు విహగతురంగా!

6


గీ.

రసను స్వరమైత్రివళులు స్వరప్రధాన
వళులు లుప్త విసర్జక స్వరవళులును
ఋవళియును ఋత్వసంబంధి ఋత్వసామ్య
వృద్ధులన స్వరవళు లేడు విధములయ్యె.
                              (3-6, 7, 8, 8, 10)

7


సీ.

క్రమమునఁ బ్రాణి వర్గజ బిందు తద్భవ
             వ్యాజ విశేష సమాహ్వయములు
మహి ననుస్వార సంబంధానునాసికా
             క్షరము విభక్తి ముకార యతులు
మొగి నువర్ణ విరామములు ఋజుప్రత్యేక
             భిన్నైక తరము లభేద విరతు
లోలి నభేద వర్గోష్మ విశ్రాంతులు
             సరస సంయుక్త విశ్రామములును
గరిమ నంత్యోష్మ సంధి వికల్పసంధి
విరమములు నాఁగ వ్యంజనాక్షర విరతులు
నిఖిల సుకవి ప్రయోగము ల్నెమకి చూడ
నేకవింశతి భేదంబు లెఱుఁగవలయు. (3-43)

8


సీ.

సర్వేశ యుష్మదస్మ చ్ఛబ్దయతులును
             బరరూప విరతులు ప్రాదియతులు
వెండి నిత్యసమాస విశ్రాంతి దేశ్యని
             త్య సమాస నిత్యాభిధానములును

రాగమసంధి విభాగ నామాఖండ
             పంచమీ వికృతి విభక్తి యతులు
కాకు స్వరప్లుతాక్షరయుగ విశ్రామ
             ములు నన నుభయాఖ్య వెలయు వళులు
క్రమత శబ్దానుశాసన ప్రభృతి పూర్వ
కవిజనంబుల కృతుల లక్ష్యముల కలిమి
బదియు రెండువిధంబులై పరగుచుండు
దద్విధంబులు తెలియంగఁ దగు ముకుంద. (3-121)

9

—అని స్వర యతులు 7 వ్యంజనాక్షర యతులు 21, ఉభయ వళులు 12, ప్రాసయతి (1) లోగూడ నలుబదొకటి (యతిభేదములు) అప్పకవిగారు చెప్పినారు. పది మొదలుకొని ముప్పది పర్యంతమున్ను కొందఱు కొందఱు లాక్షణికులు చెప్పినారు అందటికన్న అప్పకవిగారే యెక్కువ చెప్పినారు గాని, ఈ నలువదొకటిలోను స్వరమైత్రి, ప్రాణి, ఋజ, ప్రత్యేక, భిన్న, ఏకతర, అంత్యోష్మ, మవర్ణ, యుష్మదస్మచ్ఛబ్ద - ఈ 9 యతులు పరిహరించబడినవి. [1]ఏమి హేతువనంటే10

'గీ.

అబ్జపత్రనేత్ర యార్తావనచరిత్ర...'

ఇటువంటివి—అనగా, అకారముకు, ఆకారముకు, ఐకారముకు, ఔకారముకూ యతి ఆకారయతులనిన్ని—
'గీ.

ఇందు వంశసోమ ఈశ్వరీనుతనామ... '

ఇటువంటివి ఇద్విరామములనిన్ని
'గీ.

ఉరగరాజతాయి యూర్ధ్వవిష్టపదాయి...'

ఇటువంటివి ఉద్విరామము లనిన్ని ఇవన్నియు స్వరమైత్రి వలులనిన్ని (అప్పకవిగారు) వ్రాసినారు. లాక్షణికు లందఱును స్వరయతులని నిర్ణయించినారుగాని ఈ భేదము నెవరు నంగీకరించలేదు. (ఇక) ప్రాణియతులనగా—
'సీ.

కలశాబ్ధి గంభీర కాంచనాచలధీర
             కాలియోరగ వైరి కైటభారి.....'

(అని వ్రాసినారు). వర్గాంత్యాక్షరమును విడిచి మిగిలిన నాలుగు నొకదాని దొకటియైనా, యే యక్షరమున కాయక్షరమైనా నిలిపితే వర్గయతులని ఆదినుంచిన్ని సుప్రసిద్ధిగా నున్నది. కావున వర్గయతిని సర్వమైత్రిప్రధానము చేసి ‘ప్రాణియతి’ యని క్రొత్త పేరుంచు టించుకంతైనా వినియోగము లేదు. వర్గయతులకు తమరు చెప్పిన లక్షణ లక్ష్యములు 11
క.

తమతమ యనునాసిక వ
ర్ణములు విడిచి వెనుకలిపులు నాల్గును దమలో
తమకు నరలేక నిలిచిన
నమరాహితదమన వర్గయతు లనఁబరగున్.

12


గీ.

కంధిమధ్యగేహ ఖండితారి సమూహ
ఖంజనాభదేహ గానమోహ
గరుడపక్షివాహ ఘనవాహజ స్నేహ
భర్గవినుత యనిన వర్గయతులు.

13

(3-349,50)

ఇక్కడ మాత్రము వర్గయతులేమి? కకారముకు కకారముంటే ప్రాణియతి యేమిః నాలిగింటిలో నరలేక నిలిచిన అని తమరే స్పష్టముచేసిరి. ప్రాణియతులని పేరుమాత్రమే గొప్పకాని, విశేషము లేదు. (ఇక) ఋజుయతులనగా, యకార హకారములకు వ్రాసినారు. ఇవియును, అంత్యోష్మయతులు-అనగా, శవర్ణ షకారములకు వ్రాసినారు, ఇవియును 'సరసయతు'లని సుప్రసిద్ధము లైయున్నవి. (మఱి) ఏకతరయతులనగా, రేపముకు రేఫము ఱఆకారముకు అకారము ఏకతరయతులని వ్రాసినారు. ఈ రెండును, య-ల-వ ఈ మూడు ఏ యక్షరమున కాయక్షరము యెక్కటి యతియని పండిత పామర సాధారణమైన యతి. అటువంటిదానికి, రేఫమునకు రేఫము. ఱకారమునకు ఱకారము ఏకతరయతి యనుటయు, య-ల-వ —ఈ మూడక్షరములు ఏయక్షరమున కాయక్షరము యతియగునపుడు ఏ యతో నలుబదొకటి యతులలో చెప్పకపోవుటకు వారి సామర్థ్య మేమనుకోవలెః (ఇక) ప్రత్యేకయతులనగా— 14
గీ.

అరయ శార్జంబు హరిచేతి యది యనంగ
దివ్యచాపంబు శూలి చేతిది యనంగ...'

15
అని వ్రాసినారు. మొదటి (చరణమున) స్వరయతి. రెండవ (చరణమున) వర్గయతి. (మఱి) భిన్నయతు లనగా—
"గీ.

ఎదను లచ్చిని హరి ధరియించె ననఁగ
రిపుల నెల్లన బోర హరించె ననఁగ...'

16
(అని వ్రాసినారు.) మొదటి చరణమున) సరసయతి. రెండవ (చరణమున) ఎక్కటియతి (కావున) ఇటువలె క్రొత్తపేరు లుంచుటకు పనిలేదు. ఈసప్తవిధములు నామనిర్దేశములు మాత్రమే క్రొత్తగాని, దశవిధయతులతో సుప్రసిద్ధములై పండితపామరసాధారణముగా నందఱు నెఱింగినవవును. (ఇక) మవర్ణ విరామము :—17
సీ.

మర్దిత దైత్య సంయమి మనోబ్జాదిత్య
             మహితమేఘాభ సంరక్షితేభ
మాయా ప్రవృత్తి సంలబ్ధ నిర్మల కీర్తి
             మణిహార సురవశంవద విహార

మందరధైర్య వంశ నినాద చాతుర్య
             మా భూపయువతి పుంషండ రూప
మంజుల స్వాంత కంసధరావర కృతాంత
             స్మర హరారాధ్య సింహనిభమధ్య
యనుచుఁ జరమానునాసికంబునకు నిట్లు
గ్రాలుఁ గృతులను వర్ణ విరామములన
దండి సున్నలు దాపల నుండెనేని
పెలుచ నంతస్థములు నూష్మములను గృష్ణః" (3-76).

18
అని బిందువు దాపలగలిగిన య, ర, ల, వ, శ, ష, స, హ,--ఈ యెనిమిదివర్ణములు మవర్ణముల యతి చెల్లునని చెప్పినారు.
లక్ష్యము-భీమనచాటుధార :
చ.

గరలపుముద్ద లోహ మన గాఢమహాశనికోట్లసమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీర సం
హరసుగుణాభిరాముఁడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్.

19
ఈ పద్యము భీమకవిగారిదే అయితే (కవిజనాశ్రయము సంజ్ఞా 62)
"క.

స్వరవర్గాఖండ ప్రా
ద్యురుబిందుప్లుతములుం బ్రయుక్తాక్షరముల్
బరువడి యెక్కటి పోలిక
సరసమనం బదివిధములు జను వళ్లరయన్.”

20

అని యీ పద్యము భీమకవిగారు చెప్పినదని సమస్తలాక్షణికులు నంటారు. భీమన పది (యతిభేదములు) చెప్పినాడని తమరున్ను చెప్పిరి. ఈ పదియతులలో మవర్ణ విరామము లేదుగదా!

లక్షణము చెప్పేవరకు (భీమకవిగారు) మవర్ణ విరామము నెఱుగరనిన్ని, పిదప కొంతకాలముకు ముఖ్యముగా మవర్ణ విరామమును జెప్పక వల్లగాదని తోచి ఈ పద్యము చెప్పినారనుకోవలెను. మంచిదే, మకార హకారములకు (లక్ష్యమున యతి చెల్లింపు ఉంటే, (మకార
ముకు) య ర ల వ శ ష స లకు కూడా యతి చెల్లుతున్నదనుటకంటే, కకారాది యిరువదైదు వర్ణములకున్ను చెల్లునంటే మిక్కిలియు బాగుండును. (నిజమునకు భీమకవిగారు)

'...సం, హర సుగుణాభిరాముఁడగు నైలము...'

అని సరసయతి రచించియుందురు. 'ఐలము' అనుచోట 'మైలము' అని వాడుక కలిగియుండవలె. 'లేములవాడ భీమకవి' అనియుంటే, 'వేములవాడ భీమకవి' అని వాడుక కలదు. ‘లేములవాడ' న్నందుకు :—
ఉ.

లేములవాడ భీము నవలీలఁగఁ జూచి కలింగగంగు 'ఈ
జామునగాదు ఱేపకడ సందడి దీరినవెన్క ర'మ్మనెన్
మో మటు చూచి పల్కె నిటు ముప్పదిరెండు దినాల మీఁదటన్
జాము తదర్థమందు తనసంపద శత్రులపాలు గావుతన్.

అని చాటుధార. కావున నొకరీతిగా నుంటే నొకరీతి వాడుక కలదు అయినా 'మైలము' అనే ఉండుగాక. నన్నయభట్టుగారు చెప్పినదేగాని, మిగిలినది అగ్రాహ్యమని తమరే చెప్పిరి. నన్నయభట్టుగారు అఖండయతి చెప్పితే దిద్దినారు. నన్నయభట్టుగారి లక్ష్యములేని మవర్ణ విరామము నిలిపినారు, ఆయనగారి స్వతంత్రపాండిత్యమహిమ అస్మదాదుల కవాచ్యము.
(ఇట్లు) నలుబదొకటిలోను నెనిమిది (యతిభేదములు) పోగా మిగిలిన ముప్పది మూడు యతులలో అభేదయతి (యందు) వబలకు, లళలకు, లడలకు— మూడువిధములు చెప్పినారు. లడలకు లక్ష్యమొకటియు నెవరిదియు లేనందున నదియును మంచిదికాదు. కాకుస్వరయతులు, ప్లుతయతులు నేకముచేసి ఆరువిధములు చెప్పినారు. కాకుస్వరయతులయొక్క, అభేదయతులయొక్క అంతర్భేదములు కలుపుకుంటే ముప్పది తొమ్మిది విధములు నిలిచినవి. (ఇక) ప్రకృత మనుసరించుతున్నాము. 22

యతిభేదములు

గీ.

అవనియందు స్వరప్రధాన వలులును ఋ
వలియు ఋత్వసంబంధ యతులును ఋత్వ
సామ్య లుప్తవిసర్గక శ్రాంతి వృద్ధి
వలు లనఁగ నాఱువిధముల వలన మీఱుఁ.

23

సీ.

క్రమమున వర్గవిరామములు నఖండ
             విరతు లనుస్వార విశ్రమములు
సంయుక్త మెక్కటి శ్రాంతులు పోలిక
             సరస విరామముల్ చక్కటి యతు
లనునాసికాహ్వయ యతు లనుస్వారసం
             బంధాఖ్య తద్భవ వ్యాజములు న
భేద విశేషాఖ్య విశ్రాంతులు నభేద
             వర్గాగమ యతులు బదియు నైదు
వ్యంజనాక్షరయతులు బొల్పారు చుండు
నెల్ల కవిరాజ రాజ సత్కృతుల యందు
సరస దరహాస పీఠికా పురనివాస
గోధునీకాశ నీకాశ కుక్కుటేశ!

24


సీ.

అంత్యోష్మసంధి నిత్య వికల్పసంధి రా
             గమ సంధులును విభాగములు భిన్న
ప్రభునామ ప్రాది విశ్రామంబులును చతు
             ర్థీ పంచమీ నిత్యదేశ్య నిత్య
సమసన పదరూప శ్రాంతులు యుష్మద
             స్మచ్ఛబ్ద ఘఞ్ విరామములు మఱియు
ఆదేశవలి ససమాసమును నఙ్ స
             మాస నిత్యసమాస యతులు ప్లుత వి
రామములును కాకుస్వరశ్రాంతులు ప్లుత
యుగయతులనగ ద్వివింశతి యుర్వి నుభయ
వలులు సత్కవి కావ్యాలిఁ జెలఁగు చుండు
గోధునీకాశ నీకాశ కుక్కుటేశ!

25
అంత్యోష్మ సంధి, నిత్యసంధి, వికల్పసంధి, రాగమసంధి — అని తెలియవలయును.
స్వరయతులు 6, వ్యంజనాక్షర యతులు 15, ఉభయవలులు 22, ప్రాసయతితో నలుబది నాలుగు యతులు. వీటిలో నభేదయతులు నాలుగు భేదములు, ప్లుతయతులు నాలుగు భేదంబులు, కాకుస్వరయతులు నిరువదియైదు భేదంబులు —ఈ అంతర్భేదంబులతో గూడా డెబ్బది నాలుగు విధంబులును మహాకవి లక్ష్యములతో నేర్పరించుతున్నాము. 27

1. స్వరప్రధానములు

లక్షణము
సీ.

ధారుణియందు నకారయుగంబును
             నైఔలు నొక్కటై యలరుచుండు
నటుల నికారద్వయంబు నెఏలు ఋ
             కారంబు నొక్కటై గలయుచుండు
నరయ నుకారద్వయంబు నొఓలు న
             భేదమై దమలోన వెలయుచుండు
నచ్చును హల్లునునై ఋకారం బెన్న
             వరకవితలయందు వఱలుచుండు
రియతి యనఁ జెల్లు హల్లులకు యతియైనఁ
దక్కినను స్వరయతులని తనరుచుండు
సరస దరహాస పీఠికాపుర నివాస
గోధునీకాశ నీకాశ కుక్కుటేశ!

28
అర్థము :— అ ఆ ఐ ఔలు నొకటి. ఇ, ఈ, ఎ, ఏలు, ఋకారము నొకటి. ఉ, ఊలు, ఓ, ఓలు నొకటి. ఋకారము మాత్రము ఇ, ఈ, ఎ, ఏలకు యతి యగునపుడు స్వరయతి. హల్లులైన రి, రెయను హ్రస్వ దీర్ఘవర్ణములకును, గుడి, యేత్వముగల హల్లులకున్ను, క్రాముడికి చెల్లునపుడు 'రియతి' యని కొందఱు, ఋవలి యని కొందరు నందుఱు. ఋకారమునకు 'వట్రసుడి' సంజ్ఞ కూడా గలదు. కావున వట్రసుడులున్న హల్లులున్ను ఇ, ఈ, ఎ, ఏలున్ను యతులైనపుడు ఋత్వసంబంధయతి. ఏ హల్లులైనను— రెండు హల్లులకున్ను వట్రసుడులుంటే, ఋత్వసామ్య యతులని నామధేయములు గలవు. కొందఱు ఈ భేదములు చెప్పలేదు. 29
కొందఱు లాక్షణికులు స్వరయతి లక్షణము వ్రాసిన పద్యము —
క.

అ ఆ లై ఔలకు మరి
ఇ ఈలు ఋకార సహిత మె ఏఐకు నౌ
ఉ ఊల్ దమలో నొడఁబడి
ఓ ఓలకు వళ్లగున్ నయోన్నతచరితా![2]

ఈ పద్యచరణములందు ఆదిని నున్న అ ఆ ఇ ఈ - ఈ నాలుగున్ను, ఎ ఏలనుచోట ఎకారమున్ను గురువులు, ఏది హేతువుననైనవో తెలియదు. పామరులు బాలురకు చెప్పెడుపట్ల దగ్గిరనున్న ఆ ఈ ఊ ఓ — ఈనాలుగక్షరముల నూతగా నుచ్చరించుట మాత్రముచేత గురుత్వమొందవు. ఎకారమునకు ఆ పామరోక్తియు లేదు. పరిశీలించనందున లక్షణభంగమైనది. 30
స్వర ప్రధానవలులకు లక్ష్యములు :
శ్రీనాథుని కాశీఖండము (4-200)
గీ.

ఆదిగర్భేశ్వరుండౌట అనుచితంబు
మిగుల చక్కనివాఁ డౌట మేలుకాదు
పాప మభినవయౌవనోద్భాసి యగుట
యరయ మంచిగుణంబులే యవగుణములు.

31
రెండు యతులు.
అందే (7-95)
గీ.

ఈశ్వరద్రోహి గర్వాంధ ఋషివరేణ్య
బంధనాశైకకారణ పాపకర్మ
చావు మని యొక్కపెట్టున చక్రధార
దక్షుతలఁ ద్రెళ్లనేసెఁ భాలాక్షసుతుఁడు.

32
చేమకూరవారి విజయవిలాసము: (2-167)
ఉ.

ఎచ్చటఁ గంటిరా విజయు నిక్కువ నిక్కువమౌనె రాఁడుగా
యిచ్చటి కంచుఁ గోరికలు నేకట యేకటఁ బెట్టి పల్కఁగా
నొచ్చెములేని బీర మెద నూఱఁగ నూఱఁగ సాగె వెంటనే
పచ్చనివింటివాఁ డపుడు పైదలిపైఁ దలిరాకుఁగైదువుల్.

33
మూడు యతులు
చేమకూరవారి సారంగధర చరిత్ర (2-41)
గీ.

ఔర వీని మోహనాకార రేఖ వే
మారు మారు హరికుమారు మారు
(వీని కన్నుదోయి విరిదమ్మితొగల తీ
రేపు మాపు బాపు! రేపు మాపు)

34
ఇటు వలెనే తెలుసుకొనేది. 35

2. ఋవలి

తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-221)
క.

భావింప ఋకారమునకు
రీ విశ్రమ మిడఁగఁ జెల్లుఁ గృతులఁ గవీంద్రుల్
ధీ వైఖరి విలసిల్లఁగ
భావజ దుర్గర్వహరణ! పర్వతశరణా!

36
లక్ష్యములు
సభాపర్వము (2-11)
సీ.

(ఈతని వృద్ధని యెఱఁగి పూజించితే
             వసుదేవుఁ డుండంగ వసుమతీశ)
ఋత్విజుండని విచారించి పూజించితే
             ద్వైపాయనుం డుండ ధర్మబుద్ధి...

37
ఋకార మనగా వట్రసుడికి సంజ్ఞ కలదు గావున— 38
మనుచరిత్ర (2-36)—
సీ.

ప్రతిఘటించు చివుళ్లపై నెఱ్ఱవారిన
             రీతి నున్నవి వీని మృదుపదములు...

39
చేమకూరవారి విజయవిలాసము (1-18)—
ఉ.

ఆణిమెఱుంగు ముత్తెపుటొయారపుమ్రుగ్గులు రత్నదీపికా
శ్రేణులు ధూపవాసనలు హృద్యనిరంతరవాద్యఘోషముల్
(రాణఁబొసంగఁ బ్రోలు మిగులం గనువిందొనరించు నిత్యక
ల్యాణము పచ్చతోరణమునై జనులందరు నుల్లసిల్లఁగన్).

40
గోపికాహృదయలోలశతకము
సీ.

శ్రీ పద్మవాసినీపృథుతరకుచశీత
             కుంభకుంభవిలిప్తఘుమఘుమాయ
మానచందనమృగమదసంకుమదకుంకు
             మాగురుపంకసమన్వితోరు
బాహాంతరాలవిభ్రాజమానమూల్య
             కౌస్తుభమణిఘృణికలితలలిత
మౌక్తికహారశుంభదుదరభరితలో
             కనికురుఁడవు నీవు కనికరంబు
మీఱ భక్తజనాలి కమేయదివ్య
భాస్వదనపాయ సకలసంపద లొసంగి
సాగి కొనుమయ్య నిరతంబు సరసముగను
మదనగోపాల గోపికాహృదయలోల!

41

3. ఋత్వసంబంధవలి

కాకునూరి అప్పకవి ఆంధ్రశబ్దచింతామణి (3-26) —
గీ.

సొరిదిఁ గాదుల వట్రువసుడుల కెల్ల
ఋత్వమిత్రంబులగు నచ్చు తెనయ నైదుఁ
జెల్లు హయలును స్వరమైత్రిఁ జెందునపుడు
వెలయు నివి ఋత్వసంబంధ వలు లనంగ.

42
అర్థము: కృ గృ మొదలైన వట్రసుడి గల హల్లులన్నియు ఇ, ఈ, ఎ, ఏలు ఋకారము – ఈ అయిదచ్చులకు వడి చెల్లును. 43
లక్ష్యములు—
సుభాషితరత్నావలి
గీ.

నృపులు పండితులగు వారి యెడల గర్వ
కలన మానుఁడు వారి మీ కలిమి తృణము
లీల వారింపలేదు మృణాలగుణము
భూరిమదవారణములకు వారణంబై.

44
తిమ్మకవి రసికజనమనోభిరామము
క.

వృద్ధునకు యువతి విషమగు
వృద్ధాంగనకు యువజనుండు వెలయఁగ సుధయౌ
సిద్ధమని కొంద ఱపుడా
వృద్ధా గౌతముల నెగ్గు లెన్నిరి పెలుచన్.

45
మనుచరిత్రము (1-57)—
సీ.

తీర్ధథసంవాసు లేతెంచినారని విన్న
             నెదురుగా నేగు దవ్వెంతయైన
నేగి తత్పదముల కెరగి యింటికిఁ దెచ్చుఁ
             దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు
నిచ్చి యిష్టాన్నసంతృప్తులుగాఁ జేయుఁ
             జేసి కూర్చున్నచోఁ జేరవచ్చు
వచ్చి యిద్దరగల్గు వనధిపర్వతనదీ
             తీర్థమాహాత్మ్యముల్ తెలియ నడుగు...

46
కృష్ణరాయల ఆముక్తమాల్యద (4-273)—
ఉ.

హితులు భిషగ్గ్రహజ్ఞబుధబృందకవీంద్రపురోహితుల్ హితా
హితులు ధనార్జనాది నృపకృత్యనియుక్తులు వెండి కేసలా
హితులు దశాదశార్పితసమృద్దరమాచరణేచ్ఛులౌట
హితమున నట్ల కాఁ జతురవృత్తిఁ జరింపఁగ నీతి ఱేనికిన్.

47

4. ఋత్వసామ్యవలులు

కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్ద చింతామణి’ (3-84)—
గీ.

వట్రువలు జెంది తమలోన వ్యంజనములు
నన్నియునుగూడ ఋత్వసామ్యవలు లగును
వృష్ణవంశాబ్ధిసోముఁడై పృథివిఁ బుట్టి
మృతునిఁ గావించెఁ గంసునిఁ గృష్ణుఁ డనఁగ.

48
ఆముక్తమాల్యద (2–91)—
మ.

గృహసమ్మార్జనమో జలాహరణమో శృంగారపల్యంకికా
వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో వ్యజినాతపత్రధృతియో ప్రాగ్దీపికారోపమో
నృహరీ! వాదము లేల లేరె యితురుల్ నీలీలకుం బాత్రముల్.

49
అందే (1–41)—
గీ.

తిరుగు హరిపురి సురతరు సురల మఱిగి
బహులహలహలభరితకల్బరిగనగర
సగరపురవరపరివృఢజవనయమన
పృతన భవదసి ననిఁ దెగి కృష్ణరాయ!

50
తిమ్మకవి రసికజనమనోభిరామము
సీ.

వనములఁ బడి మాధవ ప్రసాదము గోరు
             కృష్ణవేష ద్విజబృందములును......

51

5. లుప్తవిసర్గకస్వరయతి

లక్షణసారము
గీ.

స్వరము తుదనుండి లుప్తవిసర్గ కోత్వ
మైన గూఢస్వరయతి దాసోహ మనఁగ
నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు
లనఁగ నమ్మాధవుండు యశోబ్ధి యనఁగ.[3]

52
(లుప్తవిసర్గకస్వరయతినే) కొందఱు 'గూఢస్వరయతి' యని అంటారు. రెండు పేరులును గలవు.53
లక్ష్యములు
చేమకూరవారి విజయవిలాసము (1-49)—
శా.

తా సైరింప కపర్ణ యుండఁగ భవద్గర్భంబునం దాల్చి తే
జో౽సహ్యున్ శరజన్ము గాంచి యల నీహారక్షమాభృత్కుమా
రీసాపత్న్యము గన్నమోహపుఁ బురంధ్రీరత్న మౌ టీవ కా
వే సర్వజ్ఞుఁడు నిన్ను నేల తలపై నెక్కించుకో జాహ్నవీ!

54
—రెండవచరణమందు లుప్తవిసర్గకస్వరయతి, నాలవచరణమందు కాకుస్వరయతి.
మనుచరిత్రము (3−77)—
చ.

అపరిమితానురాగసుమనోలసయై చిగురాకుచేతులం
దపసినిఁ గౌఁగిలించె వనితా! యిది రంభ దలంప..... దా
నపరిమితానురాగసుమనోలసయై చిగురాకుచేతులం
దపసినిఁ గౌఁగిలించు టుచితంబె కదా యని నవ్వె రంభయున్.

56
—ప్రథమ తృతీయ చరణములందు గూఢ (లుప్తవిసర్గక) స్వరయతి. ద్వితీయచరణమందు గాన ప్లుతము. 57

6. వృద్ధివలులు

తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2–186)—
క.

పూని యకారాంతంబుల
పై నే ఓ లదుక నవియె పన్నుగ నై ఔ
లై నిలిచి వృద్ధివలులనఁ
గా నిరుదెఱఁగులఁ బొసంగు గౌరీరమణా!

58
అకారాంతములైన రస, బిడ - మొదలైన పదముల చివర, ఏక, ఓజః - మొదలగు పదములు సంధి చేయగా, రసైక, దానైక. శుభైక, పుణ్యెక, బిడౌజ అని (ఏర్పడును). 'వృద్ధి రేచి' అనుసూత్రము చేత వృద్ధి వచ్చినందున వృద్ధివలులని పేరు. సంధియందు ఐకారము ప్రధానమై, ఆ ఆ ఐ ఔలు చెల్లును. ఎకారము ప్రధానమై ఇ ఈలు ఏలు ఋకారము, వట్రసుడిగల హల్లులన్నియును, గుడియైనా ఏత్వమైనా గలిగిన హకార యకారములును చెల్లును. 'బిడౌజ' అను సంధియందు ఔకారము ప్రధానమై అ ఆ ఐ ఔలున్ను, ఓకారము ప్రధానమై ఉ ఊ ఒ ఓలును చెల్లును. 59
లక్ష్యములు
శ్రీనాథుని కాశీఖండము (7-111)—
సీ.

శైలాది వాగ్భుజాస్తంభం బొనర్చుట
             నజ్ఞానవిరహితుం డయ్యెనేని
ముక్తిమంటపమధ్యమునఁ బురాణంబులు
             శైవంబు లేపొద్దు జదివెనేని

భాగీరథీతటోపాంతస్థలంబున
             లింగప్రతిష్ఠి గల్గించెనేని
పుణ్యపంచక్రోశభూతీర్థమహిమంబు
             నెరవుగా సర్వంబు నెఱిఁగెనేని
తపములకు బాధకములు క్రోధంబు లగుట
తెలిసి యొక్కింతయేని తితీక్ష లేక
నేల శపియించెఁ గాశిఁ బుణ్యైకరాశి
గంధవతిపట్టి యానవీ కార్తికేయ!

60
పుణ్య-ఏకరాశి అని పదవిభాగము. ఇచ్చట ఏకారము ప్రధానము. ‘ఉపాంత' (అనుచోట) ప్రాదియతి. 61
పారిజాతాపహరణము (1-12)—
సీ.

ఎవ్వాని సత్యదానైకవిలాసంబు
             లారూఢతరతులాపూరుషములు...

62
దాన-ఏక అని పదవిభాగము. ఇచ్చట ఏకారము ప్రధానము.63
చేమకూరవారి విజయవిలాసము (1-105)—
ఉ.

అంకె యెఱిగి యాసరసుఁ డంత వివాహవిధిజ్ఞుఁడైన మీ
నాంకుఁ డొనర్చినాఁ డిది శుభైకముహూర్తము రమ్మటంచుఁ బ
ర్యంకముఁ జేర నెచ్చెలి కరగ్రహణం బొనరించె తన్మణీ
కంకణకింకిణీగణవికస్వరసుస్వరముల్ చెలంగఁగన్.

64
శుభ - ఏక అని ఇచ్చట ఐకారము ప్రధానము.65
వసుచరిత్రము (5-28)—
చ.

సతి నడిగించు భవ్యగుణకాలి వసుం డఁట, వేడవచ్చువాఁ
డతులితదేవరాజ్యభరణైకధురంధరుఁడైన యాశత
క్రతువఁట సత్కృపామహిమఁ గన్నియ నిచ్చుట సర్వదేవతా
హితమఁట యింతకన్న శుభ మెయ్యది తొయ్యలిఁ గన్నవారికిన్.

66
భరణ - ఏక అని. ఇచ్చట ఐకారమే (ఇక) ఉభయముకు:
రామచంద్రశతకము
సీ.

ఆనాటి తార తా రమణుని
             ప్రార్థింప వినకయ యరుగు టరయ
నతనికిఁ బాడిగాదా యెవరైన రా
             జత్వాభిమానులు జగతియందు
హిత సుబుద్ధిని వినిరే స్వేచ్ఛ కింపైన
             నడ్డము నొప్పుదు రా పిపీలి
కయు రాజగురుచేత ఖట్వాంగమును దొల
             గించ నాజ్ఞయొసంగె నంచు శాస్త్ర
ము లెఱిఁగింప కపియు రాజు తలఁపగ భువ
నైకశూరుండు నగువాలి యెట్టుల విను
నమలదరహాస భక్తచిత్తాబ్జవాజి
రమ్యగుణసాంద్ర జానకీరామచంద్ర!

67
భువన- ఏక అని. ఏకారము ప్రధానము. రెండవ, మూడవ చరణములందు మూడు కాకుస్వరయతులు 68
అందే
సీ.

గ్రక్కున వాలి పేరక్కున నక్కోల
             దగిలి నంతనె హరిధ్వజము భంగి
వరరత్నభూషణసురుచిరగాత్రుఁ డా
             బలఘాతిసూతి భూతలమునందు,
బడియున్న తఱిని యా సజ్జకు మెల్లనఁ
             జని నీవు నిలుచున్నఁ గని సురేంద్ర
తనయుఁ డహో యేమి తపము గావించెనో
             యనుపమవరభువనైకవీరు

నురుదయారసోజ్జ్వలు ధర్మనిరతుపుత్రు
బడయటకు దశరథజనపాలవరుఁ డ
టంచు పలుకఁడె నిను గూర్చి యలుక బేర్చి
రమ్యగుణసాంద్ర జానకీరామచంద్ర!

69
భువన- ఏక అని. ఇచ్చట ఐకారము ప్రధానము. 70
అయ్యపరాజు రామభద్రుని చాటుధార
క.

రాజ బిడౌజా విద్యా
భోజా దీనార్థికల్పభూజా రిపుసం
జ్ఞాజా వైభవవిజిత బి
రౌణా రవితేజ గుత్తి యప్పలరాజా!

71
బిడ - ఓజ అని. ఇచ్చట ఔకారము ప్రధానము
భాస్కర రామాయణము (సుం. 450)
శా.

నీ కంఠార్పితకాపాశలము శిరోనిర్ఘాతపాతంబు లం
కౌకస్సంచయ కాలరాత్రిగలబద్ధోదగ్రకాలాహి క
న్యా కారాగతమృత్యువున్ జనరకన్యన్ వేగ నొప్పించి లో
కైకత్రాణుని రామునిం గనుము నీ కీబుద్ధి గాకుండినన్.

72
ఇచ్చట, లంక-ఓక అక్షచోట ఓకారము ప్రధానము. లోక-ఏక అనుచోట ఏకారము ప్రధానము, ఇటువలెనే తెలుసుకునేది. 73

'ఓత్వోష్ఠయో స్సమాసే వా'

అను సూత్రముచేత ఓత్వోష్ఠ శబ్దములు ఇతర శబ్దములతో సమాసము చేయునపుడు గుణవృద్ధులు రెండు నగును. గుణమైతే ఓత్వము, వృద్ధి అయితే ఔత్వము. పల్లవోష్ఠి, పల్లవౌష్ఠి; స్థూలోతుః, స్థూలౌతుః- ఈ మొదలైనవి రెండువిధములు గలవు. ఔత్వము గలుగునపుడు వృద్ధియతి గావున ఆ ఆ ఐ ఔలు, ఉ ఊ ఓ ఓలు చెల్లును.

'అక్షా దూహిన్యా ముపసంఖ్యానమ్'.

అను సూత్రముచేత ‘అక్షోహిణీ, అక్షౌహిణీ అని గుణవృద్ధులు రెండును గలవు. కొందఱు లాక్షణికులు అక్షౌహిణీ శబ్దము వృద్ధియతులందు వ్రాసినారు. తిమ్మకవి 'లక్షణసారసంగ్రహ' మందు 'నిత్యసమాసయతు' లందు (2-286) వ్రాసినారు. వృద్ధియతికి అధర్వణచ్ఛందమున :
గీ.

హరియె పరమాత్ముఁడును త్రిలోకైకనాథుఁ
డిందిరాదేవి సర్వలోకైకజనని
యుష్ణకరసూనుఁ డయ్యె న క్షౌహిణీశుఁ
డట్ల శల్యుఁడు నాథుఁ డక్షౌహిణులకు.

74
(అని ఉన్నది.) నిత్యసమాసయతికి తిమ్మకవి 'లక్షణసారసంగ్రహము'నందు (2–296) :
క.

అక్షౌహిణి యనఁగా మణి
యక్షోహిణి యనఁగఁ గృతుల నైత్వోత్వంబుల్
లాక్షణికులు యతు లిడుదురు
దక్షాధ్వరభంగ! పాణితలసారంగా!

75
(అని వ్రాసి)
జైమినీ భారతము(1-84)—
సీ.

సందడించుచు దశాక్షౌహిణీ సైన్యంబు
             లనిశంబు గొలగొల మనుచు నుండ......

76
ఉద్యోగపర్వము (1-226)
క.

బాహుబలఘనుఁడు భీముఁడు
సాహసరసికాత్ముఁ డైన సాత్యకియు మహో
గ్రాహవభూమి సహస్రా
క్షోహిణు లట్లగుట మీరు చూడరె యెందున్.

77
అని హల్లులకు లక్ష్యములు వ్రాసినారు. అచ్చుకు సుప్రసిద్ధమే. కావున.

'..... సహస్రా, క్షోహిణి లట్లగుట మీకు నూహకు రాదే'

అని అచ్చుకును యతి చెప్పవచ్చును. ఇవి స్వరయతులు. 78

వ్యంజనాక్షరయతులు

1. వర్గయతులు

లక్షణము—
క.

అడరఁగ కచటతపంబుల
కడ నొక్కొకవర్ణ ముడుపఁ గడమని నాల్గుం
దొడరి తను తమకె వలులవు
మృడ! పీఠపురీవిహార! మృత్యువిదూరా!

79
లక్ష్యములు
శ్రీనాథుని కాశీఖండము (4-208)
సీ.

ఘనతరాహంకారకాలకూటవిషాన
             లాభీలములు కటాక్షాంచలములు
దుర్వారతరతీవ్రగర్వగలగ్రహా
             కలితగాద్గద్యఘర్ఘరము మాట
లస్మితాసంభూతవిస్మయాపస్మార
             విస్మృతధైర్యంబు వినయగరిమ
యుద్దామదర్పభారోష్మదాహజ్వరా
             రంభసంభృతవికారంబు మనసు
చరణచంక్రమ మభిమానసంనిపాత
జాతసర్వాంగభంగంబు జనపతులకు
భూభుజుల తప్పె యది వారిఁ బొందియున్న
ధరణి సామ్రాజ్యభూతంబు తప్పుగాక.

80
నాలుగు వర్గయతులు.
అందే (4-203)
సీ.

భువనైకధన్వియౌ పుష్పాయుధునిచేతఁ
             బ్రసవాస్త్రమున వ్రేయఁబడని వాఁడు
యతిగాఢమైన క్రోధాంధకారంబునఁ
             గన్నుల నంధుండు గానివాఁడు
నిర్ణిబంధనిరోధనిద్రాభరంబునఁ
             బారవశ్యంబుచేఁ బడనివాఁడు
లక్ష్మీకటాక్షలీలాసీధుమదమున
             మనములోపల నన్ను గొననివాఁడు
లేఁడు నరపతి కలిగె నెవ్వాఁడు నృపతి
విశ్వధాత్రీజనులపాలి వేల్పు గాఁడె.
బాహ్యశత్రులఁ బరిహరింపంగ వచ్చు
నంతరరుల విసర్జింప నలవిగాదు.

81
నాలుగు వర్గయతులు.
కావ్యాలంకారచూడామణి (7-37)
సీ.

కమనీయరాజశిఖామణి కవిరాజు
             గర్వమహీధ్రనిర్ఘాతమునకు.....

82
ఇటువలెనే తెలుసుకొనేది. 83

2. అఖండవడి

లక్షణము
కవిజనాశ్రయము (సంజ్ఞా. 86)
ఉ.

మానుగ విశ్రమాక్షరసమన్వితమై స్వరమూదినం దదీ
యానుగుణాక్షరంబు గొనియైనను జెప్పఁగ నొప్పు నీ క్రియన్
భాను సహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్థయుక్తమై
పూనినచో నఖండవడి పొల్పగు నాదికవి ప్రణీతమై.

84
తిమ్మకవి లక్షణసార సంగ్రహము (2-120)
గీ.

హల్లునకు హల్లు వడి యిడునపుడు దాని
తుదిని స్వరము ఘటిల్లిన నది యఖండ
వడి యనగఁ బొల్చుఁ గృతుల దేవాధిదేవ
యనుచుఁ జెప్పిన శైలకన్యాసహాయ.

85
లక్ష్యములు
నూత్నదండి ఆంధ్రభాషాభూషణము (16)
క.

ఆదులు స్వరములు నచ్చులు
కాదు లొగిని వ్యంజనములు హల్లులనంగా
మే నెల్లెడఁ జెల్లును
[4]కాదులు నై రైదుఁ గూడఁగా వర్గంబుల్.

86
శ్రీనాథుని నైషధము (4-90)
గీ.

కాంత! యశ్రుబిందుచ్యుతి కైతవమునఁ
దివిరి బిందుచ్యుతక కేలిఁ దవిలె దీవు
సారె సారెకు నాదు సంసారమునను
సారముగఁ జేయవే సారసాభనయన!

87
అందే (6–76)
శా.

వైదర్భీ బహుజన్మనిర్మలతపోవర్ధిష్ణు తల్లోచన
స్వాదు ప్రౌఢవిలాస మీ వసుమతీసంజాత తృష్ణాయుధం
బాదిత్యాన్వయ సార్వభౌమ సుకృతాహంకార[5]దుష్ప్రాభవం
బీ దాంపత్యమునం జిరాయువయి నెమ్మిం బొందుగా కెంతయున్.

88
అఖండవడిలక్షణమందు (కవిజనాశ్రయమున) '... తదీయానుగుణాక్షరంబుఁ గొనియైనను జెప్పఁగ నొప్పు......' అనగా, ఏ యక్షరమున కా యక్షరము సరే, లేని పక్షముకు ఆ యక్షరముకు చెల్లిన యే యక్షరమైనా చెప్పవచ్చునని తాత్పర్యము. గనుకనె, బిందువు దాపలగల బకారము మకారముకు (పైపద్యమున నాల్గవచరణమందు) యతియైనది. 'ఈ దాంపత్య' మని స్వరమున్నందున నఖండవడి, స్వరము లేకపోతే బిందుయతి. ఇదే '... తదీయానుగుణాక్షర...' మనుట. ఈ రహస్యము తెలియలేరు మరియును——89
శ్రీనాథుని నైషధమునందే (7-184)
ఉ.

[6]క్రిక్కిరి సున్నచన్నుఁగవ కేవలఁ గాంతియుఁ బంచబాణు క్రొ
వ్వెక్కఁగఁజేయు హస్తయుగ మెత్తిన హారభరంబు [7]పేర్మి గై
పెక్కి ప్రసూనముల్ గురియు వేనలి వీడిచి కొప్పు వెట్టుచో
చొక్కుల పెట్టి భూవిభుని చూపుల కోమలి బాహుమూలముల్.

90
కైపు-ఎక్కి-కైపెక్కి. స్వరము వ పలకు అభేదమునైన అఖండయతి. 91
శ్రీనాథుని కాశీఖండము (1-33)
క.

అంభోధి వలయితావని
[8]సంభరణ ప్రౌఢ నిజ భుజార్గల యుగలీ
సంభావిత కిటి కచ్ఛప
కుంభీనస సార్వభౌమ కులకుధరునకున్.

92
అందే (6–141)
ఉ.

కైటభదైత్యవైరి యధికంబగు నేర్పున మన్నుఱేని కు
చ్చాటన మాచరించి తన జక్కి ఖగేంద్రుని బంచెఁ గ్రమ్మఱన్
హాటకలేఖ దానును గజాస్యుఁడు లక్ష్మియుఁ జేసినట్టి కై
లాటమునన్ ఘటిల్లె సకలార్థము దేవరయాజ్ఞపెంపునన్.

93
అందే (3–60)
క.

చాకున్న నీదు ముక్తులు
శ్రీ కాశీక్షేత్ర మెవ్వరికి నే నిక్కం
బీ కుధరమిచ్చు శిఖరా
[9]లోకనమాత్రమున ముక్తు లుల్లసిలంగన్.

94
చాకున్న—వకారలోపము.
అందే (5-304)
ఉ.

యంత్రితభక్తిభావమున నగ్ని సమింధన సామిధేని రు
ఙ్మంత్రము లుచ్చరించుచు సమగ్రతరారణిమంథనక్రియా
తంత్రము లాచరించి వసుధావరముఖ్యులు వీతిహోత్రు నా
మంత్రణ సేయలేరయిరి మచ్చరికించియుఁ గాశికాపురిన్.

95
పారిజాతాపహరణము (5-68)
ఉ.

దావవభేది సత్యయును దాను యథోచితవృత్తి మంగల
స్త్నానమొనర్చి శుభ్రవసనంబులు గట్టి యనర్ఘరత్నభూ
షానివహంబుఁ బూని హరిచందనచర్చ వహించి బంధువృ
[10]ద్ధానుమతిన్ సులగ్నమునఁ దద్వ్రతదీక్ష వహించె నయ్యెడన్.

96
నంది మల్లయ కవిన్ని, ఆయన మేనల్లుడు ఘంటా మలయమారుత కవిన్ని రచించిన 'ప్రబోధచంద్రోదయము'
శా.

శ్రీ నిత్యంబుగ నిచ్చుగాత కరుణాశ్రీమత్సుధారాశియై
నానాజీవులలోన రత్నములలోనన్ సూత్రముంబోలెఁ దా
లీనుండయ్యు జగత్కరండక నిచోలీభావముం దాల్చు బో
ధానందైకమయుండు శంకరుఁ డనంతస్వామి గంగయ్యకున్.

97
హరిశ్చంద్రోపాఖ్యానము (2-180)
ఉ.

నేరవు సౌఖ్యమందు ధరణిశ! యజీర్ణముఁ బొందునంచు నా
హారము మాని పెల్లొదవు నాఁకటిచే కృశమై చరించుటల్
సారవివేకమా తలఁప సయ్యన నీ యెలదీఁగెబోఁడులన్
గౌరవశీల! గైకొనుము గాదుసుమీ మది సంశయింపఁగన్.

98
అందే (3–158)
చ.

అలుక జనింపఁ గౌశికమహాముని యేమరిపాటు భీమభం
గులఁ జనుదెంచి మాధనము గొబ్బునఁదెమ్మని యానవెట్టినన్
గలుగుచు నే యుపాయమును గానక నిన్నును నీ తనూజుఁ గొం
[11]దలమున విక్రయించు వసుధాధిపుఁ డెవ్వరినైనఁ జెచ్చెరన్.

99
అందే (4-20)

కుముదమిత్రోపలగోపురంబులచేత
             విద్రుమప్రాకారవితతిచేత
మరకతహరినీలమండపంబులచేత
             బహుశాతశాతకుంభములచేతఁ
జాల దీపించు ముత్యాలమ్రుగ్గులచేతఁ
             గనుపట్టు పట్టుమేల్కట్లచేతఁ
గమనీయపద్మరాగచ్ఛత్రములచేత
             వృషరాజకేతనశ్రేణిచేత
మహితకర్పూరధూపధూమములచేత
నన్యమాణిక్యనీరాజనములచేత
శంఖభేరీమృదంగఘోషములచేత
[12]వెలయు నవ్విశ్వనాథు దేవేశుఁ గాంచి.

100
అందే (4-111)
చ.

అతిశయరోషసంయుతమహాహిభయంకరమండలాగ్రఖం
డితరిపుదంతికుంభతటనిర్ణితమౌక్తికరాజిఁ బూని యా
[13]తతజయలక్ష్మికిన్ పరిణతాంగముగాఁ దలఁబ్రాలు వోయు బా
త్రతగల క్షత్రవంశజు కరంబులు హాలికవృత్తి కోర్చునే.

101
అందే (5-83)
చ.

[14]పరహితమార్గవర్తన శుభాకర నన్నొకకొంత సత్కృపా
సరణి గనుంగొన న్వలయు సంపద గల్గినదానవోలె ని
ష్ఠురగతి మాటలాడెదవు చూడఁగ నే నిరుపేదరాల నె
వ్వరు మరి దిక్కులేరు తగవా నను శోకపయోధి ముంపఁగన్.

102
చతుర్థచరణమందు కాకుస్వరయతి.
రుక్మాంగదచరిత్రము (4-132)
క.

తెలుపెక్కె దిశల వెన్నెల
బలుపెక్కె చకోరములకుఁ బండువులయ్యెన్
బొలుపెక్కెఁ గలువలకు మఱి
నలుపెక్కెం జక్కవలకు నల విరహులకున్.

103
అందే (4–184)
క.

ఆఁకటఁ జిక్కె బలంబుల
కేకరి పెను దప్పిఁ బెదవు లెండఁగ నేడి
ట్టీకలములోన నూరక
[15]నాఁకటికిని నవయనని మనం బురి యాడన్.

104
అందే (4-48)
ఉ.

ఏనుఁగు నెక్కి భేరి మొఱయించుచు నిస్సహణాతిభూరిని
[16]స్సాణము లుల్లసిల్ల జలజాప్తకులేందుని యాజ్ఞ...’

105
అందే (5–195)
సీ.

అక్కథకుఁడు శౌనకాదిసన్మునులకు
             రుక్మాంగదుని కథ రూఢిగాను
జెప్పి, యో మునులార చిరతరభక్తితో
             మది మెచ్చి యీ కథ చదువువారు
పుస్తకంబు లిఖించి పూనిక వినువారు
             కలశాంబునిధిశాయి కరుణచేత
ధనధాన్యపుత్రపౌత్రాయురైశ్వర్యవై
             భవశత్రుజయము సద్భక్తి గలిగి
యంత మీఁదట సిద్ధవిద్యాధరోర
గులకు దుర్లభమైన వైకుంఠపురము
నందు నిజపుత్రపౌత్రదారాన్వితముగ
నూర్జితప్రాభవంబున నుందు రనుచు.

106
చేమకూరవారి విజయవిలాసము (2-84)
క.

[17]చనుఁ డచ్చోటికి నిపుడిం
పెనయ నగ నదుఃఖ పంచభిస్సహ యనుటన్
వినియుందురెకద యేటికి
మనమున నుమ్మలికనొంద మదవతులారా!

107
అందే (1–147)
చ.

ఒకచిగురాకుకొమ్మ పిక మొక్క ప్రసూనలతాగ్రసీమఁ దేం
[18]ట్లొకఫలశాఖ రాచిలుకలున్ రొదసేయఁగ గాడ్పువొందు వా
యక పయివెన్నెల ల్వొలయ నామని యొప్పులఁ జాల నందమౌ
నొకయెలమావిక్రింద మరుఁడో యనఁగా నరుఁడుండె వేడుకన్.

108
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-195)
క.

ఈరీతి శిరసు మజ్జన
[19]మారోగణమైన సుమణి మయపాదుక లొ
య్యారగముగ మెట్టి యుడిగపు
నీరజముఖి కేలుపట్టి నృపుఁ డిం పెసఁగన్.

109
అందే (2–281)
చ.

మిగుల దృఢంబు జేసి వగ మీరడుగం దగఁ బంపఁజెల్లు ని
మ్మగువనె యింక నిక్కమగు మాటకు సందడగింపు డూరకే
బెగడకు మారు నాఱడిని బెట్టఁగఁ జెల్లదు వింటలేదె యిం
ట గెలిచి రచ్చ గెల్వుమను నానుడి నానుడి నిశ్చయంబుగన్.

110
చివరి (చరణనుందు) అనునాసికయతిచేత వచ్చిన యఖండయతి.
అందే (2-144)
ఉ.

కావక రాజుచిత్తము వకావకలై తెగఁ జూచునట్టు లా
హా, విపరీతమైన పలుకాడెడ నంటివి మున్వినాశకా
లే విపరీతబుద్ధి యని లెస్స బయల్పడఁ జెప్పినారె కా
నీ విధియాడు మీయనఁగ నీ విధి యాడెదుసుమ్మి భామినీ!

111
చివర (చరణమం దఖండయతి)
అందే (3–257)
గీ.

కాంచి యపుడు ప్రమోదించి మంచి దింక
నడవగాలేక యుండెడు నాకనికిని
దనకరము లిచ్చి హరిపట్టి యొనర పట్టి
యల నడుగిడఁగ జేసిఁ బాలుడుగఁ జేసి.

112
శ్రీరంగమాహాత్యము
ఉ.

ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందు తృణాగ్నలగ్ననీ
రాకృతి వార్థి నిల్చుట దశాననుఁ డీల్గుట మిథ్యగాదె వా
ల్మీకులు చెప్పకున్నఁ గృతిలేని నరేశ్వరు వర్తనంబు ర
త్నాకరవేష్టితావని విన౦బడ దాతఁడు మేరు వెత్తినన్.

113
జైమినిభారతము (6-249)
క.

ఘోరదురితావహంబగు
[20]శ్రీరామాయణము చదివి రీవిధమున నా
నారాగరచనఁ దుంబుర
నారదు లన నఖిలజనమనఃప్రమోదమునన్.

114
శ్రీనాథాది మహాకవి లక్ష్యములు 26 వ్రాసినాము. మరియును గలవు గాని, కొందఱు భారతలక్ష్యము లేదని, అఖండయతి మంచిది గాదని, కనుకనే, అప్పకవిగా రొప్పినారు కారని తలంతురు. భారతలక్ష్యము లనేకములు గలవు. అప్పకవిగారు దిద్దినవి వ్రాసుతున్నాము. 115
కాకునూరి అప్పకవిగారు "ఆంధ్రశబ్దచింతామణి" యందు (3-202)
ఉ.

నన్నయముఖ్యసత్కవిజనంబుల కావ్యములందు లేఖకుల్
గొన్నియుఁ బాఠకాధములు గొన్నియుఁ బోకడవెట్టి తక్కువై
యున్నెడఁ గాంచి జానపదు లోడక దిద్దినఁ దప్పుత్రోవ లె
ల్ల న్నిజమంచుఁ గైకొనిన లక్షణకర్తలు సమ్మతింతురే.

116

వ.

అది యెట్లనిన, సులక్షణసారంబునందు లింగముగుంట తిమ్మన
వ్రాసిన యప్రశస్తంబులగు లక్ష్యంబుల నాశ్చర్యంబు నొంది, బహుపుస్త
కంబులు నిరీక్షించి, వాని నెల్లను బ్రక్షిప్తంబులుగా నెఱింగినవాఁడనై లక్షణ
వంతంబులగు పురాతనకవిప్రోక్తంబులు వివరించెద—

117
ఆదిపర్వము (5.121)
క.

నా వచనమున నసత్యము
గా విలచుచుం గుంతి నీకుఁ గడునెయ్యమునన్
నీ వగచిన యీ యర్థమ
సూవె మనంబునఁ దలంచు సుందరి! యెపుడున్.

118
అని వ్రాసినారు.
అయితే, 'మునుపున్న పాఠమిది, మధ్యవారు చెప్పిన పాఠమిది' అని వ్రాయలేదు. శ్రోత్రియుడు చండాలుని పేరుచ్చరించనటుల ఆ పాఠమే వ్రాసినారుగాదు. తమరు దిద్దినది ఇదియని యెవరికి తెలియగలదు? మునుపున్నపాఠమని లింగముగుంట తిమ్మన్న మాత్రమే గాదు, లాక్షణికు లందఱును లక్ష్యము వ్రాసినది.

'... సూవె మనంబునఁ దలంచుచుండెద నేనున్'

అని యున్నది. ఇటుల నుండుటే, శ్రీ వ్యాసకృతశ్లోకార్థము ననుసరించి యున్నది.

'మమాప్యేష సదా మాద్రి, హృద్యర్థః పరివర్తతే'

'నా యొక్క హృదయమందున్ను యీ యర్థమే యెపుడు నుండుచున్నది' అని అర్థము గదా: 'సదా స్మరామి, ధ్యాయామి, చింతయా' మీత్యాదిక్రియాపదములు లేవు. 'తలంతు' నని సకర్మకము గాదు. 'ఏ షోర్థ స్సదా పరివర్తతే' అని నందు వలననే, 'తలంచుచుండెద' నని నన్నయభట్టు గారున్ను రచించినారు. కవితాశయ్య నాలోచించితే, యే పాఠము సాఫుగా నున్నదో కవిత్వకలాధురంధరులకు స్పష్టము కాగలదు. 'అప్పకవి గారు మాత్రము కవితాశయ్య నెఱుంగనివారా?' అనరాదు. కవితాశయ్య నెఱింగినా, అఖండ
వడియందు నఖండద్వేషముగాన, కామక్రోధములు గ్రమ్మితే నెంతవారికిని తత్త్వము పట్టుపడదు. కామమే కాకపోతే, ఏ మహాకవి ప్రయోగము లున్నవని 'మవర్ణవిరామము’ నిలిపిరి? ఏ మహాకవిప్రయోగములు లేవని యఖండయతిని ఖండించిరి? ఇంతమాత్రమున నఖండయతి ఖండితమగునా?
(ఇక) ఉద్యోగపర్వము (4-140) నందు దిద్దినది
చ.

అని తగ నిశ్చయించి తగునందఱఁ బిల్వఁగఁ బంచి వారితో
ననిచిన మాటలాడి వినయంబునఁ బ్రార్ధనఁజేసి మీరు మా
కొనరిన సైన్యముల్ పదునొకొంటికిఁ బ్రాభవ మాచరింపఁ జొ
చ్చిన సకలంబు నొప్ప నభిషేకము గైకొనుఁ డుత్సవంబునన్.

దీని మూడవపాదంబునందు పదునొకొంటికి ననియున్న చోట సంధిని గూర్చి స్వరప్రధానవడిగాను సోమయాజులు గారు ప్రయోగించినారు. ఇది తెలియక కొందఱు మూఢులు దేశ్యనిత్యసమాసవడి యని యనుకొందురు” అని వ్రాసినారు.
'ఒకొంటికి' అను పదమందు సంధిలేదు. రెండుపదము లయితే సంధి యుండును. ఇది యఖండపడి. ఇచ్చట దిద్దుటకు శక్యముగాక పదద్వయ మన్నారు. ఉయ్యెల, పయ్యెద- ఎట్టివో, ఇదియున్ను నేకపదమే. ఒకటి-ఒకొటి అని ఒత్వమున్ను తలకట్టున్ను రెండువిధములు గలవు. అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి' (2-92) యందు—
గీ.

కాంచు హ్రస్వద్వితీయ వక్రంబునంద
ఱొక్కఁడను దీని రెండవ యక్కరంబు
హ్రస్వమగు చోటను పదంబునందు మొదటి
వర్ణమును గబ్బములను గావలసినపుడు.

120
అని, అందఱు-అందొఱు, ఒక్కఁడు - ఒక్కొఁడు రెండు విధములు చెప్పి లక్ష్యములున్ను వ్రాసినారు. ఒండు, ఒకటి, ఒక్కటి, ఒక్కండు, ఒక్కొటి, ఒకొటి, ఒకొండు— అని ఉన్నందున, 'పదునొకొంటికి' అనుచోట నకారమందు స్వరమున్నదిగాని, కకారమందు స్వరములేదు. కకారము యతిగాని, నకారము
గాదు. 'ఇంత భ్రాంతత్వ మప్పకవిగారి కుండునా?' అని పండితంమన్యకవులకు భ్రాంతత్వము గలదు. 'ఒకొంటి' కనుచోట స్వరముంటే, స్త్రీపర్వము (1-83) నందలి —
క.

పాండవుల వలన గీడొ
క్కొండును లేదరిప నీదు కొడుకులు ధరణీ
మండల మంతయు మ్రింగిరి
పాండు నృపతి భాగమునకుఁ బాపిరి వారిన్'

121
(అను పద్యమందు) ‘కొడుకు' లనుచోట స్వరము లేకపోవుట పామరులకును స్పష్టమే గనుక ఇచ్చట అప్పకవిగారి మతమున (గూడ) నఖండవడి యనక వల్లగాదు. అయితే, వాస్తవమునకు నిచ్చట వర్గయతి. అచ్చట నఖండయతి. ఈ పద్యము నప్పకవిగారు చూచితే, అచ్చట స్వరప్రధానవడియని సోమయాజిగారు తమతో చెప్పినట్టు వ్రాయరు. 'ఒకొంట' కనుచోట స్వరమయితే లేదుగాని, మూఢు లవలంబించిన మార్గము తమరు అవలంబించితే, దేశ్యనిత్యసమాసము ఉభయవడి గనుక తమ మతము నిలువబట్టును. సుప్రసిద్ధమైన యఖండవడిని ఖండించబోతే, అప్పకవిగారి పాండిత్యమహిమకు చెప్పరానిమహిమ సంభవించినది. మరియును భారతమందు ఖండించిన పద్యము లిటువంటివే కలవు. అవి యన్నియు నెన్నియని వ్రాయము!122
అచ్చు పుస్తకములందు '...మీరలీ, యొనరిన సైన్యముల్...' అని దిద్దినారు. అర్ధ మెదుగలేదు, సరే కదా, యతిభంగమును గానరు. 123
అప్పకవిగారు ('ఆంధ్రశబ్దచింతామణి' యందు)
క.

వీఁకఁ బఱతెంచి నల్గడ
దాకినఁ గడునలిగి ఘోరతరశరతతి న
మ్మూకలు విరియఁగ నర్జునుఁ
డా కరమున నేసె నుగ్రుఁడై రణభూమిన్' (ఆది. 8.200)

124
అని అర్ధబిందుప్రాసముకు లక్ష్యము వ్రాసినారు. 'అర్జునుడు ఆ కరమున నేసె' అని అర్థము చెప్పవలెగదా. 'ఆ కరమ'నగా, నదివరకు నొక కర
ముతో యుద్ధము చేసినట్లు లేదు. కావున 'ఆకరము' అనుట పొసగదు. ఈపద్యముకు పైనున్న పద్యము (ఇది).
ఉ.

వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తములైన సీరి దై
త్యారు లెఱుంగకుండగ మహారథుఁడై తరుణిన్ సుభద్ర నం
భోరుహనేత్రఁ దోడ్కొనుచుఁ బోయెడు నీతనిఁ బోవ నిచ్చినన్
ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదు రంచు నడ్డమై.

125


క.

'వీఁకఁ బఱతెంచి........

అని పద్యమున్నది. 'కవ్వడి డాకరమున నేసె' అని యుండవలె గాని అర్జునుడంటే కుదురదు. ఇదియు నఖండయతి. 126
(ఇక) భాస్కర రామాయణమందు దిద్దినవి.
ఉ.

అన్నను తండ్రియట్ల విను మంతియకా దటమీద రాజ వే
మన్నఁ గొఱంతలేదు మణిమండన ముఖ్యములైన కానుకల్
మున్నుగ సీతనిచ్చి జనలోకవిభున్ శరణంబు వేడుమీ
సన్నపుకార్యముల్ వలదు సంధియె మే, లటుగాక తక్కినన్.

127
ఈ పద్యము నప్పకవిగారికి పూర్వలాక్షణికులును, నవీనలాక్షణికులును నఖండవడికి లక్ష్యము వ్రాసినారు. “... మణి హారము లాదిగ బెక్కుకానుకల్..." అని ఎనిమిదక్షరములు దిద్దినారు. మఱిన్ని—128
ఉ.

ఓ కపివీరులార! కరుణోదధి నీ రఘురాము సర్వలో
కైకశరణ్యునిం గొలువఁగా నిటు వచ్చితి నొండుగాదు నా
రాక మహాపరాధియగు రాపణు తమ్ముఁడ నే విభీషణా
ఖ్యాకుఁడ వీరు నాసచివు లర్కకులాగ్రణితోడఁ జెప్పరే.

129
అను ఈ పద్యమందు "లోకైక... గొలువ నిప్పుడు వచ్చితి..." అని దిద్దినారు. దిద్దిన దేకవి కవిత్వమో, మునుపున్న పాఠము లేకవి కవిత్వమో సుకవు లాలోచించితే స్పష్టమే కాగలదు. ఒకచోటనైనా, మునుపున్న పాఠ మిది అని వ్రాయలేదు. అఖండవడియందు నఖండద్వేషముగలవారు, కవిజనాశ్రయ మందలి “మానుగ విశ్రమాక్షరసమన్వితమై...” అను నీ పద్యము
ఉపసర్గ సంధివడికి లక్ష్యము వ్రాసినారు, అనేక లక్ష్యము లుండఁగా, తమకు విరోధమైన ఈ పద్యము నుదహరించి నందున ఛాందసత్వముకు సంతోషించినాము. 130
ఇటువలెనే దిద్దినవి మరియును గలవు. భారతమందు దిద్దినవి 3, రామాయణమందు దిద్దినవి 2 (పైన చూపినాము.) ఆయన దిద్దుటకు శక్యము కాకనో, లేక చూడకనో దిగనాడిన పద్యములు నన్నయభట్టు గారివి, ప్రెగడగారివి, సోమయాజిగారివి అనేకములు గలవు. వ్రాసుతున్నాము. 131
ఆదిపర్వము (5-134)
ఉ.

వీరలు దైవశక్తిఁ బ్రభవించినవా రనుటేమి [21]సందియం
బీ రమణీయకాంతి నుపమింపఁగ శిల్పులెగాక యిట్టియా
కారవిశేషసంపద ప్రకాశితతేజము పేర్మిఁజూడ సా
ధారణమర్త్యులే యని ముదంబునఁ జేరుట తమ్ముఁ జూడఁగన్.

132
—"సందియంబు- ఈ రమణీయ" అని స్వరమున్నది. ఇది బిందుయతిచే నైన యఖండయతి. 'ఉపమింపగ' ననుచోట స్వరములేదు. నైషధమందు పద్యములు రెండు, సారంగధరచరిత్ర యందు నొకటియు, [22]నిదియు నొక విధమైనవి. కొందఱు ‘ఉపమ-ఇంపగ' అని స్వరమనుకొందురు. కాని,
సభాపర్వ మందలి 2-114
ఉ.

భావిపురాతనాద్యతన పార్థివలక్ష్ములు పాండవేయు ల
క్ష్మీవిభవంబుతోడ నుపమింప సమంబులుగా వశేష గా
జావలిలోన నత్యధికులైన సపత్నులపేర్మి సూచియేఁ
జూవె సహింపనోపక కృకుండ వివర్ణుఁడ నైతి నెంతయున్.

133
అను ఈ పద్యమున రెండవ చరణమందు "ఉపమింప"లో ఉపము-ఇంపగ అని స్వరము లేదని తేలును. 134
ఆదిపర్వము (6-200) నందే
ఉ.

క్రచ్చఱ నొక్కరక్కసుఁడు కాడు సురాసురులెల్ల నొక్కటై
వచ్చిన నీవ చూడఁగ నవార్య బలోన్నతిఁ జేసి వారలన్
వచ్చి వధింతుగాక యిటు వచ్చి శ్రమంపడి[23]యున్నచోట నే
నిచ్చగ వీరిదైన సుఖనిద్రకు భంగము సేయనేర్తునే.

135
చివర చరణమందు అఖండయతి.
అరణ్యపర్వము (2-248)
క.

అమరచరులందుఁ బురుషో
త్తముఁ డెట్లు విశేషమట్ల ధరణిం గల [24]తీ
ర్థములందును పుష్కరతీ
ర్థము గరము విశేష మభిమతార్థప్రదమై.

136
అందే (4–148)
క.

వాసవనందనసఖుఁడగు
భూసురుఁ డొకఁ డరుగుదెంచి భూవినుతగుణో
ద్భాసితు ధర్మజు [25]డీప్రస
థాసీనుం గాంచి పలికెఁ బరమప్రేమన్.

137
అందే (5-289)
ఉ.

ఒక్కదినంబునందు బలియుండు సురారులనెల్లఁ దున్మి పెం
పెక్కి దయార్ద్రుఁడై యభయమిచ్చె జనంబులకెల్ల షణ్ముఖుం
డిక్కడ భక్తి తో వినిన నెప్పుడు కీర్తన చేసినం జనుల్
నిక్కము సర్వదోషముల నీగి భజింతురు భవ్యభద్రముల్.

138
చివర (చరణమునం దఖండయతి)
అందే (6–1)
క.

శ్రీ లలితమూర్తిసుమహ
చ్చాలుక్యవరేణ్య పుణ్యచారిత్ర విచి
త్రాలంకారోజ్వల [26]కలి
తాలాపకలాపసంతతస్మేరమతీ!

139
అందే (7-21)
సీ.

అయ్యలార జటాయు వని వల్కెదరు మీర
             లెవ్వరు చెప్పరే, యేను వాని
నగ్రజుండ, ననూరు నాత్మజన్ముల మేము
             సంపాతి నా పేరు సమ్మదమున
నేనును దమ్ముండు నినమండలమునకుఁ
             జన వేడ్క నొకనాడు చదల నెగసి
చనఁ జన తీవ్రాంశుసంతాపమునఁజేసి
             కమరె నాఱెక్కలు కమరవయ్యె

ననుజపక్షమ్ము లే నిమ్మహాచలమునందు
[27]నాటగోలెను నెచటికి నరుగనేర
కున్నవాఁడ నాతమ్ముఁ డెట్లున్నవాఁడొ
యెఱుఁగ, నెఱిఁగింపరే నాకు నిష్టమెసఁగ.

(సీస గీతపు రెండవ చరణమందు) "అరుగనేర" అని స్వరము. 140
అందే (7-406)
సీ.

అపగత జనశబ్దమై యనభివ్యక్తి
             మార్గమై యవిరలదుర్గశైల
తరుగుల్మవల్లీవితానమై గజసింహ
             శరభశార్దూలసూకరలులాయ
బహులమై బహువిధపక్షికోలాహల
             భయదమై కడుపరపైన యడవి[28]
ననుజుల వెదుకుచు ననఘుండు సని కాంచె
             కమలాకరంబు తీరమునఁ బడిన
వారిఁజారువంశవరుల భీమార్జున
యముల నమితబలుల విమలమతుల
ప్రలయపతితలోకపాలసంకాశుల
భూరిపుణ్యధనుల వీరవరుల.

141
(మూడవచరణము ఉత్తరభాగమున) “పరపు-అయిన” స్వరము.
అందే (7–412)
చ.

పుడమియు నర్థసంపదయుఁ బొల్పఱ వైరుల పాలుజేసి యీ
యడవికి వచ్చి భీకరమృగావలి పొందున నున్న వీరి వె
న్నడికొని యిట్లు సేసెనె యనాథులవోలె విధాతృఁ డింక నె
క్కడ జనువాఁడ నేది కడగాఁ దరియింతు దురంతదుఃఖముల్.

142
విరాటపర్వము (1-234)
ఉ.

ఆయతబాహులు న్వెడదయైన సమున్నతవక్షమున్ [29]సరో
జాయతలోచనంబులు ప్రసన్నముఖంబు నుదాత్తరేఖయున్
(గాయజుఁ గ్రేణిసేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీయును బెంపునుం గలుఁగఁజేసి విధాతృఁడు పేఁడిఁ జేసెనే).

143
అందే (5-19)
క.

వివిధములగు లక్ష్యంబుల
నవలీలం దునియనాట నవయఁగఁ జేయన్
భువనైకధన్వి నత్యు
గ్రవిచేష్టితు నోర్చి పరశురాముం బోరన్.

(రెండవచరణమందు) “నవియగ" అను పదమందు అచ్చులేదు.
(ఉదాహరణకు) అరణ్యపర్వము (4-118) నందు
సీ. గీ.

కలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి
నగుమ యనుచు శాప మనఘుఁ డిచ్చె.

144

మునివరేణ్యుశాపమునఁ జేసి యప్పాట
నవయుచున్నవాఁడ నాటఁగోలె.

145
(అను పద్యము చివరచరణమున “నవయు”లో అచ్చు లేదని తేలును.
ఉద్యోగపర్వము (2-259)
క.

దేవత లేటికి పార్థుఁడు
దేవసముఁడె గాఁడు వాఁడు దివిజులచేతం
బోవని దైత్యులఁ జంపడె
[30]నీవును నీవారు నతని నెఱుఁగ(రె చెపుమా).

146
అందే (3–165)
క.

అనవుడు భీష్ముఁడు ధృతరా
ష్ట్రున కిట్లను నీవు నీకొడుకు నేమేమి
చ్చిన నొకటి యీఁగి లేకు
న్నను వేరొక్కటి దలంచు నా కేశవుఁడున్.

147
అందే (3–188)
సీ.

నీశిక్షఁ బెరుగుట నీతిమంతులు పుణ్య
             పరులు శూరులుగదా పాండుసుతులు
సుఖవృత్తిఁ బెక్కండ్రు సూరెలఁ గొలువ నుం
             డెడు వార లిడుమలఁ బడుచు నిర్జ
నంబైన కానలోనన యెట్టులుండిరి
             ననుబెట్టి నాయెడఁ గొనుచుఁ జనిరి
[31]నేను వడ్డింపంగ నింపారఁ గుడిచి మె
             త్తనిసెజ్జ నిద్రించి (వినుత)భద్ర

గాన కరిబృంహితముల మేల్కాంచునట్టి
వారు కందమూలంబు లాహారములుగఁ
బొదలఁ బుట్టలఁ బడియుండి పులుఁగు మెకము
లఱవ మేల్కనుచుండిరే యక్కటకట.

148
(నాల్గవ చరణమందు) "ఇంపార" స్వరము. "ఏను వడ్డింపంగ" నంటే, విసంధి. అఖండయతినైనను, విసంధినైన నొకటి నంగీకరింపవలెను. 149
అందే (4–181)
సీ.

కయ్యంబునకుఁ బెద్దగాలమేనియుఁ జూచి
             పట్టివచ్చితిఁ గడుఁబరవసమున
సంజయుతో మీరు శంకలేకాడిన
             యెక్కుడుమాటలు పెక్కు గలవు
భూమిభాగము గోలుపోయిన యలుకయు
             ద్రౌపడి బన్నంపుదైన్యమునకుఁ
దగ మంచిబంటవై తఱి యిది బాహుబ
             లాస్త్రవిద్యలు సూప నని తలంచి
నిలువవలయు నీకుఁ గలవారి నెల్లను
గూర్చి మోహరించికొని కడంగి
[32]నడుపు సమరమునకు నలికినఁ బోదింకఁ
దప్పఁ గ్రుంకఁ జనదు తఱికిఁ జొనుము.

150
(సీసగీతము మూడవచరణమందు) “అలికిన" స్వరము.
భీష్మపర్వము (1-6)
క.

కాలంబగుటయు నృపులకు
నాలము సమకూరె దీనికడలకు మది నీ

వాలోకింపఁగ [33]వలసిన
నీ లోనికి దివ్యదృష్టి నిచ్చెద పుత్రా!

151
అందే (2–187)
క.

పదిటం ధృష్టద్యుమ్నునిఁ
బదియమ్ముల నతనిసూతుఁ బటురయమున ను
న్మదుఁడై నొప్పించిన కెం[34]
పొదవిన మోమల్లనవ్వు పొలుపున నొప్పెన్.

152
ద్రోణపర్వము (1–64)
ఉ.

ప్రాయపుకల్మి నొక్కట నభవ్యధృతి న్మహనీయశీలతన్
సాయకపంజరం బటుభుజావిభవంబునఁ గార్యతంత్ర[35]శి
క్షాయతబుద్ధి వృద్ధుఁడవు గావె ధరామరచర్య మున్ను గాం
గేయుఁడు మాకు నెల్ల నెఱిఁగింపఁడె నీదు మహానుభావమున్.

153
అందే (3–59)
గీ.

[36]నఱికి తోడన హరిమేన నతని యొడల
నేయు గురు విల్లు విఱువంగనేయఁ దలఁచె
నక్కిరీటి యాలోనన నతని మౌర్వి
వికలముగఁజేసె నాధనుర్వేది గురుఁడు.

154
అందే (4–248)
క.

విను మడుగులపైఁ బడియై
నను నెంగిలిఁ గుడిచియైన నరులకుఁ బగ లోఁ

గొని యరుల పెను పడచి బ్రతు
కన వలయు నిహమ్ము పరము గలుగునె చెడినన్.[37]

155
కర్ణపర్వము (2-355)
ఉ.

మ్రొగ్గెడు వాహనంబులును మోములు వాడఁగ వాహనంబులన్
డిగ్గి తొలంగు సైనికు లనేకులు కష్టపు చొప్పు చొప్పడన్
దగ్గు సిడంబులున్ గులముఁ దన్నుఁ దలంచి యెదిర్చి యొంటిమై
[38]మ్రగ్గెడువారునై ధరాధిపు సైన్యము రూపు మాయఁగన్.

156
అప్పకవిగారు 'కురుధరావరు' అని దిద్దినారు. అందఱు 'ధరాధిపు' అనే అంగీకరించినారు. ఆ పద మతికి యున్నది. 157
శల్యపర్వము (1-87)
శా.

గంగానందనుపోటు మెచ్చక గురుం గాదంచు రాధాతనూ
జుం గీడాడుచు నీతఁ డెవ్వఁడొకొ యంచున్ శల్యుఁడే యిట్టివా
నిం గయ్యంబుల మున్ను గాన మనుచున్ వేభంగులం [39]జూపఱె
ల్లం గీర్తింప ధనుఃకలానిపుణలీలాభీలతం జూపెదన్.

158
అందే (2–337)
క.

గురుకర్ణుల యస్త్రాగ్నుల
[40]నెరసినయది మున్ను దీని నిటుగా నుండున్

బరువడి రక్షించితి సం
గరము దెగినఁ దొలఁగి యిపుడు కాలవిడచితిన్.

159
(రెండవచరణమందు) 'ఇటు' స్వరము.
సౌప్తికపర్వము (1-61)
సీ.

పఱచిన వారికిఁ బగ మారు సలుపంగ
             నుత్సహించుట కడు నొప్పుగాదె
దైవయోగంబునఁ దగిన యుద్యోగంబు
             నీ మానసంబున నెలవు కొనియె
మాకు నీపూన్కి సమ్మత మది మేమును
             నీ తోడివారము నీవు డస్సి
యున్నవాఁడవు నిద్రయును లేకయున్నది
             [41]వేగిర పడియెద వేల యింత
నెమ్మి డప్పిదేఱ నిద్రించి వేగిన
తెలిచితోడ నత్యుదీర్ణవృత్తిఁ
గడఁగి మేము తోడ నడతేర నడరిన
యరిగణంబు గెలుతు నశ్రమమున.

160
అందే (2-81)
క.

ఏ నొక్కని పాండవ సం
తానార్థముగాగ నిత్తు ధర్మముల మహా
దానంబులఁ గ్రతువుల [42]జన
తా నందితుఁడగుచుఁ బెంపు దలకొనువానిన్.

161
అందే (2-99)
ఉ.

[43]నామనమార దీనిఁ గనునప్పుడె సంతసమయ్యెఁ జాలు నా
కీ మహనీయరత్నము వహింపఁగ నర్హుఁ డితండె యంచు నా
భూమిపుచేతఁ బెట్టుటయు భూవర యాతఁడు ద్రౌణి గౌరవ
శ్రీమది భక్తిపెంపుగ ధరించే శిరంబునఁ దాన ప్రీతుఁడై.

162
శాంతిపర్వము (1-108)
సీ.

దక్షుఁడై భూపతి దండనీతి సయింప
             కున్న సన్యాసులు నుత్పథప్ర
వర్తకు లగుదురు వావిరి నన్యోన్య
             ధనధాన్య పశుభూమి దారహరణ
మాచరింతురు జను లప్పాప మవ్విభు
             నొందు దండము హింసయుగఁ దలంప
వలదు దుర్వృత్తుల వధియించు రుద్రుని
             గోవిందు వాసవు గుహునిఁ [44]జూడు
మమ్మహాత్ములు తక్కు దుర్మార్గచరులు
దండితులచేత వినమె యధర్మమడఁగు
ధర్మమెసఁగు దండమున నర్థమును కామ
మును నదూష్యంబులై సిద్ధిఁ బొందు నధిప.

163
అందే(4-205)

ఆతఁడు కాలకలితమై కర్మమునకు సం
సారవర్తనంబు సలుపుచుండు

స్వప్నసంప్రవృత్తి సలిపెడు నరు[45]మాడ్కి
నింద్రియములతోడ నెఱయఁ బొరసి.

164
చివరచరణమందు అఖండయతి.
అందే (4-392)
సీ.

అనవిని బలదేవతాధీశుతో [46]నీకు
             నా విభవంబు గానంగరాదు
గుప్తమైయున్నది గుహయంచు నా కిచ్చ
             పుట్టినయప్పుడు పొలిచి తోచు
నది యట్టులుండి, నీ వధికుండ, వల్పుల
             యెదుర ఱజ్జులు పల్కు టేమి పెంపు
పొమ్ము దుశ్చ్యవన నీ పోయెడు తెఱుపున
             నావుడు నవ్వుచు నతనిఁ జూచి
మున్ను వలికినట్లు మోమోట లేక ప
లుటయు నతఁడు భూతకోటి మంచు
వోలెఁ దోచె విరియు బుద్ధిమంతులు దాని
కిచ్చ వగవ రింత యెఱుఁగవెట్లు.

165
అందే (6–440)

[47]నరుఁడు నారాయణుండును ననఁగ లోక
రక్షణార్థంబుగాఁగ ధర్మమున కేను
బుట్టినాఁడఁ గావునఁ బాండుభూపతనయ
నాకు ధర్మజుఁ డనియెడు నామమయ్యె.

166
అందే (5–84)
గీ.

ధూతపాపుఁడైన పూతాత్మకుండు ల
ఘ్వాశి యగుచు నింద్రియముల గెల్చి
మనములోన కామమును క్రోధమును కోర
నీక బ్రహ్మపదము నిచ్చఁ గోరు.

167
(చివరచరణమందు) ‘నిచ్చ' - ఎపుడు అని అర్థము గాని, కోరిక అని అర్థము గాదు.

...గ్రచ్చ కోరిక తమి కోర్కె యిచ్చ యనఁగ'

అని 'ఆంధ్రనామసంగ్రహము' (మానవ 27) పౌరాణికులు కోరిక యని యర్థము చెప్పుతారు కాని, పునరుక్తి దోషము సంభవించుచున్నది. 168
అనుశాసనికపర్వము (1-362)
గీ.

వారు పూజ లొనర్పఁగా గారవంపుఁ
జూడ్కి నద్దేవుఁ డందఱఁ జూచు చరిగె
మఱియునుం దత్ప్రదేశంబు మహితవహ్ని
[48]మయతఁజేసి భయంకరమై వెలింగె.

169
అందే (5–107)
సీ.

దాసత్వమొంది యదల్పులఁ దిట్టుల
             నాటులఁ బడుచుండు నట్టి నీచు
లప్పాట తోలుమేన నతిగర్వులై ప్రల్ల
             దమ్మునఁ బెక్కండ్రఁ దప్పులేక
తిట్టియు నడచియుఁ దిరిగిన వార లా
             పొలువలపైఁ గృపగలిమి మేలు
ధనిక గృహద్వారమునఁ బ్రతిహారి త
             మ్మాగంగ నుండి దైన్యమున దుఃఖ

పడు జగంబులు భోగైకపరతఁ దొల్లి
మాననీయుల కవసర మీని వారు
రాజ దండితుఁ డకృతాపరాధుఁ గూర
దండ దూషితుఁజేసి నతండు సూవె.

170
(మొదటిచరణము ఉత్తరభాగమున) 'అట్టి నీచు' స్వరము.
అశ్వమేధపర్వము (4-93)
క.

నీవును దల్లులు బంధు[49]
నావలి పరిజనులు హస్తినగరంబునకున్
రావలయు ధర్మజుని సం
భావనయును బడయుఁ డెసఁగు పరమసుఖంబుల్.

171
ఈ పద్యము పూర్యపు లాక్షణికులు అఖండవడికి లక్ష్యము వ్రాసినారు. అచ్చుపుస్తకములందు (పైపద్యము రెండవచరణము) "...జ, నావలియుం బరిజనములు హస్తినగిరికిన్...' అని వ్రాసినారు. ఇది అతికినట్లున్నదిగాని సాఫు లేదు.172
ఆశ్రమవాసపర్వము (1-131)
చ.

కనకము మేనిరత్నములు గ్రామములున్ హయగోవ్రజంబులుం
[50]దనియఁగ నిమ్ము సర్వవసుధామరకోటులకు న్నిజేచ్చ నీ
తనయులు పుణ్యలోకసుఖధాములునై విలసిల్లు నట్లుగా
ననుటయు నాంబికేయు హృదయంబున మోదమెలర్చె భూవరా!

173
వసుధామరులు, గోత్రామరులు, భూసురులు, మహీసురులు అనవలెగాని, భృమరులు, మహ్యమరులు, (వసుధాసురులు), గోత్రాసురులు, ధరాసురులు- (ఇత్యాదిగా) అనరాదు. 174
అందే (1–141)
క.

నరుఁ డనునయించి వెన న
[51]న్నరపతి నెత్తుచును దాను ననయము వనటం
బురబురఁ జొక్కెం గురుభూ
వర యద్దెస తెఱఁగు రాదు వా క్రువ్వంగన్.

175
స్వర్గారోహణపర్వము (1-31)
సీ.

ధర్మనందనుఁడు చిత్తమ్మున నుద్వేగ
             మావహిల్లగ దైవ మకట యిట్లు
సేసె కీడేమి సేసిరొకో వీర
             లిన్నరకములకు నేగుదేర
వలసిన యట్టేని వాసవాద్యమరులు
             నీచులువో వీరి నే విచార
మించుకయును లేక యిట్టి కష్టపుటిడు
             మలఁ బెట్టి రిది ధర్మమా తెఱంగు
మాలితే నీవు సజ్జన మాన్యులలఘు
సత్యపరులు దయాఢ్యులు నిత్యదాన
రతులు బహుదక్షిణాంచితక్రతువిధాన
పాలితాత్ము లనర్హంపుపాటుపడిరి.

176
భారతప్రయోగములు రెండు మూడు చాలవా? ఇన్నెందుకు వ్రాసినామంటే, అక్కడక్కడ భారతమందు నఖండయతి లేకుండగ నప్పకవిగారు దిద్దినారనిన్ని, ఆయన మతమునే పట్టుకొని కొందఱు కవులు అఖండయతి కూడదనుటవలననున్ను, ఇన్ని యతులుండగా రెండుమూడు దిద్దినంత మాత్రముచేత నేమి వినియోగమున్నదనిన్ని, ఈ యతులు నప్పకవిగారు చూచినారా? లేదా? ఏలాగునైనా అప్పకవిగారి పాండిత్యమహిమ స్పష్టము కాగలందులకున్నూ ఇప్పుడైనా పామరులన్నియు దిద్దుటకు శక్యముగాద నిన్నీ సుకవుల కిది విశదము కొఱకున్ను వ్రాసినాముగాని, ఒక లక్ష్యమే చాలును. 177

శ్రీనాథాది మహాకవి ప్రయోగములు 26, భారత ప్రయోగములు 40, (మొత్తము) అరువదియాఱు లక్ష్యములు వ్రాసినాము.178

భారతతుల్యమే గాన పోతరాజుగారి భాగవతము (నుంచి గూడా కొన్నిప్రయోగములు చూపుతున్నాము). 179
ప్రథమస్కంధము (1)
శా.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కలాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేలిలోల విలసదృగ్జాలసంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

180
అష్టమస్కంధము (245)
మ.

కదలం బాఱవు పాపపేరు లొడలన్ ఘర్మాంబుజాలంబు వు
ట్టదు నేత్రంబులు నెఱ్ఱగావు నిజ జూటార్ధేందుడుం గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో డాయుచో
పదిలం గడిసేయుచోఁ గుదియుచో భక్షించుచో మ్రింగుచోన్.

181
అందే (394)
శా.

శ్రీకంఠా నిను నీవు నేమఱకుమీ చిత్తంబు రంజించెదన్
నాకద్వేషుల డాగురించుటకునై నా డేను గైకొన్న కాం
తాకారంబు జగన్నిమజ్జనము గన్నన్ జూచితే చూపెదన్
గైకో నర్హములండ్రు కాముకులు సంకల్పప్రభావంబులన్.

182
–'కాంతా'– ఆకారము. బిందుయతిచే నైన అఖండయతి. 183
దశమస్కంధము (పూ. భా. 689)
ఉ.

ఆకులమయ్యె భోగమిదె యౌదలలన్నియు వ్రస్సె ప్రాణముల్
రాకల పోకలం బొలిచె రాయిడి పెట్టక మా నిజేశు పై
నీ కరుణాకటాక్షములు నిల్పఁగదే తగుదో సమస్తలో
కైకశరణ్య యో యుభయకారణ యో కమలామనోహరా.

184
అందే (1706)
సీ.

'ఏ నీ శుభాకార మీక్షింపఁ గన్నుల
             కఖిలార్థలాభంబు గలుగుచుండు...'

185
మరియును
క.

స్వరవర్గాఖండ ప్రా
ద్యురుబిందుపుతములుం బ్రయుక్తాక్షరముల్
బరువడి ఎక్కటి పోలిక
సరసమనఁగఁ బదివిధములఁ జను వడు లరయన్.

186
(అని లక్షణము చెప్పి—)
సిీ.

[52]అబ్జగర్భ శివ స్వరాఢ్య పూజ్యపదాబ్జ
             కవివర్గనుత గుణగణకలాప
వైభవాఖండ దేవాదిదేవ కృపాబ్ధి
             యఖిలవిప్రాదికప్రాణినిలయ
నుతపుణ్యహాస బిందుయుతా నవాంభోజ
             యతిదయాప్లుత నిజాత్మా మహాత్మ
చారు సంయుక్త నిశ్చల గుణాలంకార
             మహిమ నెక్కటి యైన మాన్యచరిత
పోల్చ నీ పోలికకు దైవములును గలరె
సరసగుణపాత్ర భక్తరంజనచరిత్ర
ప్రాస నిర్భిన్న చండతరామరేంద్ర
యఖిల యతిగమ్య రఘురామ యఘవిరామ.

187

(అని లక్ష్యములు వ్రాసిన ఈ పద్యములకు) కవిత్రయము వారికి పూర్వమహాకవియైన భీమకవిగారు రచించిన లక్షణగ్రంథ) మందలి పద్యములని వాడుక కలదు.

భారత భాగవత రామాయణాది మహాకావ్య లక్ష్యములు డెబ్బదినాలుగు వ్రాసినాము. ఇక్కడికే గ్రంథవిస్తర మైనందున నఖండవడిని గురించి గ్రంథము నిలిపి ప్రకృతము ననుసరించుతున్నాము. 188

3. బిందుయతి (అనుస్వారయతి)

లక్షణము
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (2-152)
గీ.

వరుస టతప వర్ణ చతుష్కము
పిఱుద సున్నలూని నెఱయ నంత్య
వర్ణములకుఁ గృతుల వలులగు నవి బిందు
యతు లటండ్రు సుకవు లభ్రకేశ!

189
లక్ష్యము
గీ.

ణాకు వడిచెల్లు కనకమండప మనంగ
నాకు వడి చెల్లు దివ్యగంధం బనంగ
మాకు వడిచెల్లు విజితశంబరుఁ డనంగ
వరలు నీ చందమున ననుస్వారయతులు.

190
'జ్ఞాకు వడిచెల్లు రత్నకంకణ మనంగ' అని కొందఱు లాక్షణికులు ప్రథమవర్గముకు లక్ష్యము వ్రాసినారు. (కాని) బిందువు లేకుండగనే జ్ఞకార - కకారములకు యతి చెల్లుచుండగా బిందువుతో పనిలేదు. 191

'జ్ఞాన వేద్యాయ తప్తకాంచన విభూష
ణాయ (మేచక వర్ణకంఠ ప్రియాయ

నగధరాయ నమోస్తు సౌందర్యవిజిత
మనసిజాతాయ గోపదింభాయ యనఁగ)

192
అని అప్పకవిగారు (ఆంధ్రశబ్దచింతానుణి 3-53) చెప్పినారు. బిందువు లేకుండగనే చ ఛ జ ఝ లకు జ్ఞ వర్ణము (యతి) చెల్లుచుండగా, బిందువు చేర్చుట వ్యర్థము. జ్ఞ కారముకు చకారము (యతి చెల్లుటకు లక్ష్యము)—
వసుచరిత్రము (3-101)

ఆతన్వంగి యనంగ ఝాంకరణవజ్జ్యాముక్తనారాచని
ర్ఘాతం బోర్వక తమ్ములంచుఁ దటినీగర్భైకసంజాతకం
జాతవ్రాతము మాటు చెందనని యేచం జాగె మున్మున్నుగా,
‘జ్ఞాతిశ్చేదనలేన కి’మ్మనెడు వాచారూఢి సత్యమ్ముగన్.

193
(మఱియు) జ్ఞకారముకు శషసలు సరసయతి (గా) చెల్లును. లక్ష్యము—
ఆదిపర్వము (1-157)
ఉ.

భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టినతోడనె పుట్టు నుత్తమ
జ్ఞానము సర్వభూతహితసంహితబుద్ధియుఁ జిత్తశాంతియున్
మానమదప్రహారము సమత్వము సంతతవేదవిద్యను
ష్ఠా్నము సత్యవాక్యము దృఢవ్రతముం గరుణాపరత్వమున్.

194
ఇటువలె మహాకవి ప్రయోగములుండగా, అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి'యందు —
క.

పనిఁ బూని నిలుచుఁ దమ తమ
యనునాసికములకు బిందుయతులను వెనుకన్
గనుపట్టు నాల్గు లిపులును
బెనుసున్నలు డాసి తమకుఁ బిఱుదఁ గదియుచోన్.

195
అని లక్షణము చెప్పినారు. జకార, ఞకారములు కలుసుకుని జ్ఞా యైనది. జకారము ద్వితీయవర్గాక్షరము గావున లక్ష్యమున్ను బాగులేదు. ప్రథమ
వర్గాంతమైన ఙ కారమునకున్ను, ద్వితీయవర్గాంత్యమైన ఞ కారమునకున్ను ప్రత్యేకవ్యవహారోపయోగములు లేవు గావున ట త ప వర్గములు మూడుమాత్రమే బిందుయతులకు ప్రసిద్ధి. 196
లక్ష్యములు
మనుచరిత్రము (2–11)
మ.

తలమే బ్రహ్మకునైన నీనగమహత్త్వం బెన్న నేనీ యెడం
గల చోద్యంబులు ఱేపు గన్గొనియెదం గాకేమి నే డేగెదన్
నలినీబాంధవ భానుతప్త రవికాంత స్యంది నీహారకం
దల చూత్కార పరంపరల్ పయిపయి న్మధ్యాహ్మముం దెల్పెడున్.

197

రెండు యతులు గలవు.

'తరమే' అనుటకు 'తలమే' అని లకారమున్ను గలదు. 198
సుభాషితరత్నావలి
చ.

సకలకలావిభూషితులు శబ్దవిదుల్ నయతత్వకోవిదుల్
ప్రకటకవీంద్రు లేనృపతిపజ్జల నిర్ధనులై చరింతు రా
వికృతపుజాడ్య మాదొరది విత్తములేకయ వారు పూజ్యు లం
ధకజనదూషితంబులు ఘనంబులు గావె యమూల్యరత్నముల్.

199
చేమకూరవారి విజయవిలాసము (2-158)
చ.

చిలుకలకొల్కి లే యెడమచేముడి గొల్పెడు జాఱుకొప్పు నిం
పులు దులకింపుచుండ భుజమూలరుచుల్ జిలుగుంబయంటలో
కులుకు నొయారి గబ్బిచనుగుబ్బలు చూచుటెకాని క్రీడి క
ర్మిలి మెయిలేదు భోజనముమీఁది యపేక్ష యొకింతనేనియున్.

200
అందే (1–129)
సీ.

మంగలస్త్నానసంభ్రమము దెల్పెడులీల
             ....................................................

201

4. సంయుక్తయతులు

లక్షణము
తిమ్మకవి లక్షణసారసంగ్రహము
గీ.

వలుల యెడఁ బ్రయుక్తవర్ణముల్ గూడిన
యక్కరంబు మాత్ర లనువు మీఱ
తమకుఁ దామె విశ్రమములై విరాజిల్లు
క్ష్మాశతాంగ దక్షసవనభంగ.

202
లక్ష్యములు
కవి ధూర్జటిగారి (కాలహస్తీశ్వరశతకము)
మ.

'క్షితినాథోత్తమ! సత్కవీశ్వరుఁడు వచ్చె న్మిమ్ములం జూడఁగా'
'నతఁ డేపాటికవిత్వవైఖరిని' 'సద్యస్యావ్యనిర్మాత', 'తత్
ప్రతిభల్ వింటిమి, తిట్టుపద్యములొ?' 'చెప్పంజాలఁ' 'దైతే మముం
గ్రితమే సూచెను పొ'మ్మటందు రధముల్ శ్రీకాలహస్తీశ్వరా!

203
అందే
శా.

రాజన్నంతనె పోవు నా కృపయు ధర్మం బాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వద్విప్రసంరక్షయున్
సౌజన్యంబు కృతం బెఱుంగుటయు విశ్వాసంబు, రాకున్నదు
ర్వీజశ్రేష్ఠుల కాగతంబు గలదా! శ్రీకాలహస్తీశ్వరా!

204
ఈ రెండుపద్యములం దున్న వన్నియును సంయుక్తయతులు.
స్త్నాన శబ్దము (నందు) తకారమున్ను గలదని యెఱుంగరు[53]. తకారయుక్తమైనందుకు లక్ష్యములు— 205
శ్రీనాథుని కాశీఖండము (7-115)
సీ.

వసియింప వలయు యావజ్జీద మనురక్తి
             పరత వారాణసీపట్టణమున
చక్రపుష్కరిణి నిచ్చలు తీర్థమాడంగ
             వలయు సంకల్పపూర్వకముగాఁగ
నర్చింపవలయు గంధాక్షతంబుల పుష్ప
             ఫలపత్రముల విశ్వపతి మహేశు
నిలుపంగవలయును నెరసు వాటిలకుండ
             నాత్మధర్మస్వవర్ణాశ్రమముల
స్త్నానమహిమంబు భక్తితాత్పర్యగరిమ
వినఁగవలయుఁ బురాణార్ధవిదుల వలనఁ
దన యథాశక్తి వలయును దానమిడఁగ
కాశిఁ గైవల్య మింటింటఁగాని లేదు.

206
రుక్మాంగదచరిత్రము (1-95)
ఉ.

స్నానము చేసి భౌతపరిధానములం ధరియించి యంటగాఁ
గాని మనుష్యులం గనక కల్లలు వల్కక నుగ్రకృత్యముల్
మాని వినిద్రుఁడై నియమమానసుఁడై తమలంబు దక్కి శ్రీ
జాని పురాణముల్ వినుట సంగతి శ్రీహరివాసరంబునన్.

207
ఈ రెండు పద్యములందు అచ్చుపుస్తకములందు తకారము వ్రాయలేదు... విశ్రమ మేమనుకొనిరో తెలియదు. 208
హరిశ్చంద్రోపాఖ్యానము (4–18)
శా.

తాత్పర్యంబున జాహ్నవీజలములన్ స్త్నానంబు గావించి తా
హృత్పీఠంబున భక్తి నివ్వటిల విశ్వేశున్ మహాదేవునిన్
బత్పంకేజ నతామరున్ గిరిసుతా ప్రాణేశుఁ బూజించు సం
విత్సారీణుల కబ్బు నెల్లపుడు తన్వీ ముక్తిసామ్రాజ్యముల్.

209
చివర (పాదమున) గాన ప్లుతయతి.
శ్రీనాథుని హరవిలాసము (2–37)
ఉ.

(దీనిధి సెట్టినంబి తనదేహము నిండ విభూతి మంగళ)
స్త్నానము చేసి ధౌతపరిధానము గట్టి (త్రిపుండ్రధారియై
వే నమృతాంశుమౌళిని వశీకృతభక్తి ధరించి సంతత
ధ్యానముఁ జేసి యెంతయును దత్పరభావము ప్రస్ఫుటింపగన్.)

210
విష్ణుభజనానందము
గీ.

స్త్నానమును సంధ్యయును బితృతర్పణంబు...

211
మత్స్యపురాణము
సీ.

స్త్నానంబు దీర్చి ధౌతములైన వస్త్రముల్
             ధరియించి సాంధ్యకృత్యముల నడపి....

212
జగ్గకవి సుభద్రాపరిణయము
గీ.

కదలి యంత మాతృగమనాపహారిణి
యును సమస్తకల్మషోగ్రభుజగ
ఖగవరంటు నైన గౌతమి కేతించి
స్త్నానదానవిధులఁ తగ నొనర్చి.

213
ఇవియు సంయుక్తయతులే[54] మరియును—
రుక్మాంగదచరిత్రము (2-26)
క.

హరిపాదభక్తులై యీ
శ్వరనిందయు, శంభుభజనసంసేవకులై
హరినిందయుఁ గావించిన
దురితాత్ముల లేదు రాళ్లతో నడపగనీన్.

214

5.ఎక్కటి యతి

లక్షణము
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-168)
క.

అక్కజముగ మ ర వ ఱ లా
లొక్కొక్కటి తమకుఁ దమకె యొనరఁగ వడులై
చక్కంబడి కబ్బంబుల
నెక్కటి వడులనఁగఁ దనరు నిభదైత్యహరా!

216


గీ.

మరునితండ్రి లోకమహితుండు యాదవ
రాజసింహమూర్తి రక్షకుండు
ఱాఁగ వేలుపనఁగ ఱంపిల్లు నెక్కటి
వడులు నాఁగ నిట్లు వనజనాభ.

217

6. పోలికయతి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' (39)
గీ.

పుం నపుంసకతత్సమంబుల కడపల
తత్సమానాంధ్ర దేశ్య శబ్దముల తుదలఁ
గదిసిన మకార శృంగముల్ కావ్యములకు
బొసఁగు ము విభక్తి యతులనఁ బు వు బు భు లకు.

218
ఇదే పోలికయతి. పుష్కరము, మధ్యమము, వక్త్రము, దరహాసము, ఈ మొదలైనవి తత్సమములు. నిక్కము, కంబము- ఈ మొదలైనవి దేశ్యములు. వీటి (చివర 'ము' విభక్తికి) పు పు బు భు లు చెల్లును. 219
లక్ష్యములు
అందే (8-70)
గీ.

పుష్కరము సూక్ష్మమధ్యమముగ నొనర్చె
ఫుల్లపంకేరుహము వక్షముగ నొనర్చె
బొందు ఓల్లె ఒకడోసము నొనర్చె
భోజనృపనందనను నిక్కముగ నజుండు.

220

7. సరసయతి

లక్షణము
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము
క.

పరగు న్న ణ లొండొంటికి
సరవిన్ శ ష స లు దనర్చు చ భ జ ఝ ములకున్
పరికింప న హ య లేకము
సరసవిరామంబు లివి నిశాకరమకుటా.

221
యకార హకారములకు ఆ ఆ ఐ ఔ లున్ను, యకార, హకారములకు గుడియు నేత్వమైనా ఉంటే, ఇ ఈ ఎ ఏ లున్ను, కొమ్మైనా, ఓత్వమైనా ఉంటే ఊ ఊ ఒ ఓ లున్ను చెల్లును. ఇవి సరసయతులు. 222
లక్ష్యములు
స-జ లకు,
రుక్మాంగదచరిత్రము (1-58)
క.

తరణి నొకటొకటి పావకు
సరసిజభవు రెండు నాల్గు బలశాయిని శం
కరు బదియుఁ గా బురాణము
లిరవుగ వర్ణించుఁ బదియునెనిమిది వరుసన్.

223
అ యహలకు
శ్రీనాథుని కాశీఖండము (7-85)
సీ.

తనమీఁద వైవఁగ దంభోలి యెత్తినఁ
             జెలగి సంస్తంబించె జిష్ణు భుజము
కైటభారాతి చక్రము ప్రయోగించిన
             వెసఁ జక్కిలము పోల్కి విఱిచి బొక్కెఁ
బటు చపేటంబునఁ బండ్లు డుల్లఁగ మొత్తి
             పూషార్కువదనంబు బోసి జేసె
చిప్ప ముత్యంబు రాల్చిన భంగి నలవోక
             భగుని గ్రుడ్డుల ధరఁ బడఁగ దిగిచె
నర్ధచంద్రబాణంబున యజ్ఞమృగము
శిరము దెగనేసెఁ గట్టె సంబరము మీద
ధాతృసతి ముక్కు శోణంబు దాకఁ గోసెఁ
బ్రకటవిస్ఫూర్తి శ్రీ వీరభద్రమూర్తి.

224
అందే (7–108)
శా.

ఎట్టెట్టో వినమైతి మింక నొకమా టేర్పాటుగాఁ జెప్పుమా
భట్టారాయని నందికేశ్వరుఁడు విస్పష్టంబుగాఁ బల్కినన్
బట్టెం గంఠబిలంబు చెయ్యి దివియన్ రాడయ్యె వారాణశీ
హట్టస్థానమునందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లగన్.

225
చేమకూరివారి విజయవిలాసము (1-99)
ఉ.

చెప్పెడిదేమి నా వలపు చేసినసేతను గొల్వులోన ని
న్నెప్పుడు గంటి నప్పుడె పయింబడ నీడిచె నిల్వఁబడ్డ పా
టప్పు డదెంజయైనఁ గల దట్టి హళాహళి కింతసేపు నీ
వొప్పెడు దాక దాళుట కయో మది మెచ్చవుగా నృపాలకా.

226
మృత్యుంజయవిలాసము
సీ.

ఉదయాద్రి కరిమీఁద హురుమంజి చౌడోలు......

227

8. చక్కటి యతి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి ఆంధ్రశబ్దచింతామణి (3-72)
క.

హెచ్చరికన పు ఫు బు భు లకు
నచ్చపు మా కొమ్ములే మహాకవు లాదిన్
మెచ్చులుగ నిలిపి రచ్చట
నచ్చట చక్కటి విరామ మనుచును గృతులన్.

228
అచ్చపు ము కారములనగా, వనము, ధనము, నిక్కము— ఈ మొదలుగా నంతమున (విభక్తి రూపముగ లేని) మునర్జము లనుట. ఇవి (చెల్లిన) పోలికయతులు. పదాదిమధ్యములందు మువర్ణముగల మురువు, మూలము మొదలు— ఈ మొదలైన విన్ని, చమురు, నిమురుట, సమున్నత, సముజ్జ్వల — ఈ మొదలైన విన్ని చక్కటియతులు. పోలికయతికి, చక్కటియతికి భేదము తెలియదు. స్పష్టముగా నెవరును చెప్పలేదు. కొందలు 'చక్కటియతి మంచిదిగాదు, కవిత్రయము వారి ప్రయోగము లేదు' అంటారు. కవిత్రయము వారి ప్రయోగములేని తద్భవవ్యాజయతిని పావులూరి మల్లన ప్రయోగము నెటువలె నంగీకరించిరో తెలియదు. భారతప్రయోగముతో తుల్యమైన శ్రీనాథుడు గారి ప్రయోగముంటే కవిత్రయము వారి ప్రయోగమెందుకు! 229
శ్రీనాథుని నైషథము (2-66)
సీ.

అతఁడు పాణిగ్రహణార్హుండు విను నీకు
             నతనిఁ గూర్పగ నేర్తు నతివ యేను
పిన్నపాపవు నీవు పితృపరాధీనవు
             కార్యనిర్ణయశక్తి గలదె నీకు
నావల నిషధరా జఖిలలోకేశ్వరుఁ
             డీవల పరమేష్ఠిహితుఁడ నేను
సందేహడోలాధిశాయియైన ప్రసంగ
             మిప్పట్టునందు నే నెట్టు లోర్తు

మొదల సంఘటియించినఁ బొందు పిదప
కార్యమ ఘటించెనేని సత్కార మెదలు
ప్రాణమగు నన్ను రమ్మను నా నృపాలు
నెదుర తలవంచికొనియుండ నెట్టు లోర్తు.

230
శ్రీనాథుని కాశీఖండము (1-91)
సీ.

ఉరగవల్లీగాఢపరిరంభణంబులఁ
             బోకమ్రాకుల సొంపు ముడువు కొనఁగ...

231
శ్రీనాథుని భీమఖండము (5-50)
సీ. గీ.

భువనబీజంబు కైవల్యమోక్షదాయి
యఖిలకల్యాణకారి విశ్వాద్భుతంబు
(పూజ కొనియెను మురభిదంబుజభవాది
దేవతాకోటిచే సుప్రతిష్ఠఁ బొంది.)

232
భాస్కర రామాయణము (యు. 1785)
గీ.

పెక్కుమారులు వడి వీచి ద్రెక్కొనంగ
వరలి వారిధిలోపల వైవ నతఁడు
ముక్తకేశాంబరోజ్జ్వలభూషుఁ డగుచుఁ
బడి రసాతలగతుఁడయ్యె బలము దక్కి.

233
యయాతిచరిత్ర (1-36)
గీ.

అగరు లేలకి విరవాది యాగ దీఁగె
మల్లియలు గొజ్జగులు దాకమొల్ల మొగలి
మొదలుగా నివి యెప్పుడు బూచి కాచి
యుండు తోట లమీను భానుండు నిలిపె.

234
అనంతుని భోజరాజీయము (5–61)
క.

అని యతని భ్రమయ నడచును
మునుఁ దత్సతి నిలిపి చనిన భూజము కడకున్
గొనిపోవ నచట నదిలే
కునికి పునశ్శోకవహ్ని నుల్ల మెఱియఁగాన్.

235
నాచన సోముని వసంతవిలాసము
క.

అత్తటి విట నాగరికలు
సుకవి మనోరంజసము
చిత్తముల వసంతకేలి చివురొత్తంగా
మొత్తములు గట్టి తీర్చిరి
ముతైపుజల్లులకుఁ దోడి బూరట కొమ్ముల్.

236
పోతరాజుగారి భాగవతము-అష్టమస్కంధము (883)
సీ.

అంగీకరించిన నభిలంబు వోవుచో
             ననృతంబుగాదు లేదనిన నధిప
యాత్మవృక్షముమూల మనృతంబు నిశ్చయ
             మనృతమూలము గల్గ నాత్మ జెడదు
పుష్పఫలం బాత్మభూజంబునకు సత్య
             మా మాను బ్రతుకమి నదియుఁ జెడును
ఫలపుష్పములు లేక పస చెడి వృక్షంబు
             మూలంబుతో వృద్ధిఁ బొందుగాదె
చేటుఁ గొఱతయు లఘిమయుఁ జెందకుండ
నిచ్చు పురుషుండు చెడకుండ నిద్ధచరిత
కాక నంచితసత్వసంగతి ఘటించి
నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు.

237
శ్రీరంగమాహాత్మ్యము
చ.

పరిచయుఁ గాఁగ నేలె నిరపాయచరిత్రుని శత్రుకానన
స్ఫురదురువీతిహోత్రుని సముజ్జ్వలమేరుసమానగాత్రునిన్
బరమపవిత్రునిన్ ముని సుపర్వ వరస్తుతిపాత్రునిన్ మనో
హరఫలశేముషీకబలితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్.

238
(‘సముజ్జ్వల’ అనుచోట) సమ్-ఉత్ అని ఉపసర్గలౌను. ప్రాదియతి యనవలసిన దౌను. పువర్ణ మువర్ణములు ప్రధానము చేసి చక్కటియతియందు లాక్షణికులు వ్రాసినారు. (అ)సందర్భముగా నున్నది. 239
అరణ్యపర్వము (8-357)
చ.

ఉరమున రెండు కన్నులు పృథూదరదేశమునందు నోరు ప్ర
స్ఫురితభుజద్వయంబును సముజ్జ్వల దున్నతభావముం గరం
బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్వ ఘ
స్మరుఁడగుచున్నవాని దివిజారిఁ గబంధుని గాంచి రచ్చటన్.

240
(అని ప్రాదియతికి) భారతప్రయోగ మున్నప్పటికి పరిశీలించక మంచిది గాదనుట మంచిదిగాదు. (ఇక ఇందే-) ...సత్వసం, హరుఁ'డని అప్పకవిగారు (అఖండయతిని తొలగించుటకు) దిద్దినారు. ఆయన మాత్రమేకాని, అందఱును '... ఘ, స్మరుడు...' అన్నారు. 241

9. అనునాసికయతి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-62)
గీ.

అల ద్రుతంబునకును మధ్యమానునాసి
కమునకును జెల్లు ననునాసిక యతులనఁగ
డాపలను బూర్ణములు గల్గి ట ఠ డ ఢ లును
త థ ద ధ లును గ్రమంబున దానవారి!

242
దాపల నిండుసున్నలు గలిగిన ట ఠ డ ఢ లు నకారముకున్ను, దాపల నిండుసున్నలున్న త థ ద ధ లు ణకారముకున్ను చెల్లును. లాక్షణికులందఱు ట ఠ డ ఢ లకు నకారము చెల్లునని చెప్పినారు. 243
అడిదము సూరకవి 'కవిజనరంజనము'
గీ.

గంధ గజరాజగామిని కనదుదార
హారమణి శర్కరిల కుచాహార్య విహర
ణమున శ్రమ మందఁడయ్యె కందర్పకుండు
భవ్యనిశ్వాసపవనసంప్రాప్తికతన.

244
(అయితే)
క.

'మనుసంతతి మండన భం
డన నిర్ణీత కార్తవీర్య నరనాయక ఖం
డన పఙ్క స్యందన నం
దన చందన శక్రవారణ లసత్కీర్తీ'

245
అని అప్పకవిగారు లక్ష్యము (3–63) గా తమరు రచించిన పద్యముమాత్రము దణలకు వ్రాసినారు. ట ఠ డ ఢ లకు మహాకవి ప్రయోగములు కలవు. 246
ట—నలకు
పారిజాతాపహరణము (1-18)
శా.

శ్రీరంగేశ్వరనాభిపంకజరజశ్శ్రీకంటెఁ, జోలేంద్రత
న్వీరాజత్కుచపాలిమంజరులకంటెన్ సహ్యభూధృత్తటీ
నీరంధ్రోజ్జ్వలగైరికద్రుమముకంటెన్ వన్నె గావించుఁ గా
వేరీతోయముఁ గృష్ణరాయఁ డహితోర్వీనాథరక్తప్రభన్.

247
రెండు యతులు
శ్రీనాథుని చాటుధార

ధాటీఘోటకరత్నఘట్టన మిల ద్ద్రాఘిష్ఠ కల్యాణ ఘం
టా టంకార విలుంఠలుంఠిత మహోన్మత్తాహిత క్షోణిభృ
ట్కోటీ ఠోకిత కుంభినీధర మహత్కూటాటవీ ఝాట క
ర్ణాటాంధ్రాధిప సాంపరాయని తెలుంగా నీకు బ్రహ్మాయురా!

248
రెండవచరణమందు వికల్పయతిన్ని, అనునాసికయతిన్ని రెండు ననవచ్చును. నాలవచరణమందు నిత్యసమాసయతిన్ని గానప్లుతయతిన్నీ అనవచ్చును. 249
శ్రీనాథుని హరవిలాసము (2–73)
ఉ.

హస్తగృహీతపుస్తకమునందు లిఖించిన యట్టి నీలకం
ఠస్తవముం బఠించుచు ఘనస్థిరధీగుణవైభవోన్నతుల్
విస్తరిలింగ (బాలకులు వేవురిలో సిరియాళుఁడుండె నా
భస్తలిపి ప్రపంచుఁడు గ్రహంబులలో నుడురాజుకైవడిన్)

250
డ-న లకు :
భాస్కరుని రామాయణము (కిష్కిం 616)
క.

బలవంతుఁడైన వాలికిఁ
దలఁకుచుఁ గిష్కింధ వెడలి త్వరలో నలుది
క్కులకుం బాఱి మహీమం
డల మెల్లను జూచినాఁడ నాడు నరేంద్రా.

251
లాక్షణికు లెవరును భారతలక్ష్యము వ్రాయలేదు.
ఆదిపర్వము (5-66)
క.

అమవస గావున నే డ
క్కమలజుఁ గొలువఁగ మహర్షిగణములు పితృసం
ఘములను బోవును బ్రహ్మాం
డమునం గల వారలం దొనంగూరంగన్.

252

10. అనుస్వారసంబంధయతి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-58)
గీ.

ఆది పూర్ణయుతములై ట త వర్గాక్ష
రములు తుదను గలుగు వ్రాలు తక్కఁ
బొసఁగు నొకటి కొకటి భువి ననుస్వారసం
బంధయతులు నాఁ బ్రబంధములను.

253
ట ఠ డ ఢ లు నాలుగున్ను, త థ ద ధ లు నాలుగున్ను దాపల పూర్ణబిందులు గలిగి పరస్పరము యతి చెల్లును. 254
టలకు—
మనుచరిత్రము (1-55)
శా.

శీలంబుం, గులమున్‌, శమంబు, దమముం, జెల్వంబు లేఁబ్రాయమున్
బోలం జూచి యితండె పాత్రుఁ డని యే భూపాలుఁ డీ వచ్చినన్‌
సాలగ్రామము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్‌ పెక్కు చం
దాలం బండు నొకప్పుడుం దఱుఁగ దింటం బాఁడియున్‌ బంటయున్‌.

255

'చందాలు' అని చోట (చందములు) ముకారము పోయి ఉకారమునకు

దీర్ఘము వచ్చినది. 256
కృష్ణరాయల ఆముక్తమాల్యద
మ.

పురి నేగించి తదీయమైన నగరంబుం జేర్పుడంచుం బడిం
దొరలన్ రాజకుమారులన్ బనుపఁగాఁ దూర్యస్వనంబుల్ నిరం
తరవందిస్తుతులుం గజేంద్రహయఘంటావారకాంతాంఘ్రినూ
పురముల్ మ్రోయఁగఁ గొల్చి దారిరుగడిన్ బో మార్గమధ్యంబునన్.

257
అందే
మ.

దవధూమంపుఁ దమంబులోఁ దమ రసద్రవ్యంబుఁ బంకేజబాం
ధవభానుప్రతతుల్ హరింపఁ గుయి వెంటన్ వెళ్లు శూన్యోరు కూ
పవితానంబుల జాడఁ జూడఁ బుడమిం బాటిల్లెఁ బైవిప్పులై
యవసం బంచుల నాడఁగా నెగయు వాత్యాలిన్ రజశ్చక్రముల్.

258
ఈ పద్య మప్పకవీయముందు నచ్చువుస్తకమునఁదు '....కుయివెట్టన్ వెళ్లు...' అని టకారమునకు దాపల బిందువు లేకుండగ వ్రాసినారు. పొరపాటున వ్రాసినా రనుకోరాదు. తప్పులు పరిశీలించి ఒప్పులు వ్రాసిన వాటిలో ఇది వ్రాయలేదు. అనుస్వారసఁబంధయతికి లక్ష్యము వ్రాసిరి (గదా:). ఒకచోట (బిందు) స బంధము లేకపోతే విశ్రమ మేమనుకొనిరో, తెలియదు.
ఆముక్తమాల్యదకు వ్యాఖ్యానకర్తలు 'కుయివెట్టన్ వెళ్ళు = మొఱపెట్టుకొనుటకు వెళ్లు...' అని అర్థము వ్రాసినారు విశ్రమభంగము కానలేదు. అర్థమున్ను కుదరలేదు. 'కుయి = మొఱతో, వెంటనే వెళ్లు = కూడా వెళ్లుతున్న' అని చెప్పితే, యతి భంగము కాదు అర్థమున్ను సందర్భముగా నున్నది. లోకమునందు సొమ్ము దొంగలు పట్టుకుపోవుచుఁడగా మొఱపెట్టుట ప్రత్యక్షమే. వ్యాఖ్యాకారులు 'సూర్యునివద్దకు మొఱపెట్టుటకు వెళుతున్న' వనుట 'పరిశీలించని యర్ధ' మని వ్రాయనక్కరలేదు. కుకవుల నాదరించక, సుకవులకు గౌరవము కలుగు నప్పటికాలముందే ఈ పరిశీలించులు లేకపోయినది. వినిమయము గలుగు నిప్పటికాలమందు ఇటుల జెప్పుట ఆశ్చర్యము కాదు. ఇప్పటికవులకు తప్పున్నదే తోచలేదు. 'ఇంత తప్పు ఎవరికి నెందుకు తోచదాయె' ననరాదు. భగవన్మాయచే సత్య మసత్య మసత్యము సత్యము ఎటులైనదో, మూఢత్వముచే నిదియు నటులనైనది. ఇటువంటి కల్పనగల పద్యము కట్టవరపు చిట్టం రాజుగారి ద్వాదశరాజచరిత్రయందు— 259
చ.

అపుడు సమీరచోరుఁడు గవాక్షపుఁ గన్నపుగండి దూఱి ర
త్యపరిమితాదిభేదభరితాంచితకోమలమంచకస్వప
చ్చపలవిలోచనావదనసౌరభవిత్తము గొంచుఁ బద్మినీ
విపినముఁ జేర వెంటఁ గుయి వెళ్లె మదాళి భటప్రతానముల్.

260
అని ఉన్నది. ఈ పద్యమందు స్పష్టమే. మూడవచరణ మందు నిత్యసంధి యతి.

11. తత్భవవ్యాజయతి

లక్షణము
కాకనూరి అప్పకవి గారి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-64)
సీ.

విజ్ఞానమునకు భావింప విన్నాణంబు
             విజ్ఞాపనమునకు విన్నపంబు
సంజ్ఞకు సన్న యజ్ఞమునకు జన్నంబు
             నాజ్ఞప్తి కానతి యాజ్ఞ కాన

యని యిట్లు సంస్కృత వ్యాహార మధ్యావ
             సానంబులు ద్వితీయ సరలమునకు
నడుగున గల తాలుజానునాసికములు
             తద్భవంబున ద్రుతత్వంబు నొంది
వెలయుటను తద్భవవ్యాజవిశ్రమమున
జరిగి నణలకు రెంటికి జ్ఞా తనర్చు
జ్ఞాని చేతోంబుజాత శోణకర యనఁగ
జ్ఞాతి విద్వేషి నృపనాశనకర యనఁగ.

261
ఈ పద్యము రెండవచరణ మందు సకారముకు, గీతపద్య ద్వితీయచరణమందు జకారమునకు జ్ఞకారము విశ్రమ ముంచినారు. మొదట సరసయతి. తరువాత వర్గయతి. బిందువు లేకుండగ తమరే ప్రయోగించిరి. బిందుయతులందు సున్న ఉంటే కాని చెల్లదనిరి. (అప్పకవిగారు) స్వసిద్ధాంతవ్యాఘాతము కానరైరి. (ఇక)262
లక్ష్యములు
పావులూరి మల్లన గణితము
ఉ.

శ్రీనిధియైన శివ్వనను జిమ్మననున్ మఱి సూర్యదేవునిన్
దీనిధి పోలనార్యులను దేజమునన్ రవితుల్యులైన యా
సూనులు నల్వురం బడసె సూరి జనస్తుత సత్య భారతీ
జ్ఞానులఁ బద్మగర్భవదనంబులు నాలుగు పోలువారిలోన్.

263
రుక్మాంగదచరిత్రము (2-63)
క.

శ్వానమునకుఁ జండాలున
కైనను నాకొన్న నిడఁగ నగు నన్నము దు
ర్మానసుఁడై పెట్టక య
జ్ఞానంబునఁ గడపెనేని నరకమునఁ బడున్.

264
[55]తద్భవవ్యాజయతికి కవిత్రయము వారిలో నొకరి లక్ష్యము (గూడ) వ్రాయలేదు. (వ్రాసుతున్నాము).265
ఎఱ్ఱాప్రెగడ హరివంశము (పూ. భా. 9-47)
సీ.

(అవధరింపుము దేవ యాశ్చర్య మొక్కటి
             మన విల్లు పూజించు మందిరంబు
లోనికి నిద్దఱు లోకాధికంబగు
             తేజంబు గలవారు దేవనిభులు)
నవయౌవనులు మనోజ్ఞవిచిత్రగంధమా
             ల్యాలంకృతాంగులు నీలపీత
వసనులు దివినుండి వసుధపై (కుట్టిప
             డ్డట్టు లెవ్వరు వీర లని యెఱుంగ
నేరకుండ నేతెంచిరి వారిలోనఁ
దెల్లదామరఱేకుల ట్లుల్లసిల్లు
కన్నుదోయి నొప్పారెడు కఱ్ఱియాతఁ
డొకఁడు వెసఁ బుచ్చుకొనియె విల్లొక్కకేల.)

266

12. అభేదయతి

లక్షణము
గీ.

రలలు వపబలు దడలును లళలు తమకుఁ
దామె విరతులు నగు నభేదాఖ్య నొంది
సుకవి కావ్యములందు నీ క్షోణియందు
హీర హీరాబ్జ చంద్రాంగ వృషతురంగ.

267
(ర ల ల కనగా) ఱకారముకు లకారముకున్ను, రేఫముకు లకారముకున్ను (అని అర్థము.) 'రశ్చఱాశ్చరౌ' అని ఏకశేషము. వకారముకు ప బ ల కున్ను, ద డ లకు, ల ళ లకు అభేదయతులు చెల్లును. ల ళ లకు, వ ప బ లకు నందఱు లాక్షణికులు నభేదయతి నంగీకరించినారు. కొందఱు ర ల లకున్ను, కొందఱు ద డ లకున్ను అంగీకరించినారు. అప్పకవిగారు సుప్రసిద్ధముగా మహాకావ్యలక్ష్యములుగల ర ల లకు, ద డ లకు నభేద మొప్పక, నొకటియు లక్ష్యములేని ల డ లకు నభేద మంగీకరించినారు. వ బ లకు నభేదమనిన్ని వ-ప ఫ భ లకు నభేదవర్గమనిన్ని నిర్ణయించినారు. (అయితే,)268
క.

'వఫయో రభేద' యనియెడు
నెపమున ప ఫ బ భ లు వాకు నిజముగ వడులౌ
(నుపమింపవచ్చుఁ గృతులం
దుపనిషదుచితార్థసూక్తు లొలసినచోటన్.)

269
అని లాక్షణికులందఱు 'వపయోరభేద' మే ముఖ్యము చేసినారు. వ ప బ లకు నభేదము. వ ఫ భ లకు, గ డ లకు ధ డ లకు నభేదవర్గము.270
లక్ష్యములు
శ్రీనాథుని నైషధము (1-112)
క.

కేలాదిరాయ యభినవ
లీలా మకరాంక చంద్ర రేఖాంకుర చూ
డాలంకార పదాంబురు
హాలింగిత సుఖిత నిర్మలాంతఃకరణా!

271
భాస్కరుని రామాయణము (యుద్ధ. 2333)
క.

దానవసుందరు లత్తఱి
జానకి నందలముమీఁద సమ్మద మొదవం
గా నిలుప శారదాభ్రవి
లీనత నేపారు చంద్రరేఖయపోలెన్.

272
లాక్షణికులు ర ల లకు లక్ష్యములు వ్రాసినారు. అప్పకవిగారు – సంస్కృతమందు రేఖా, లేఖా శబ్దములు రెండు గలవుగాన నీ రెండు పద్యములందు చెప్పిన రేఖాశబ్దము మొదలి (వర్ణము) తృతీయాంతస్థమని యెఱుంగునది. తృతీయాంతస్థమనగా లకారమనుట'...
వసుచరిత్రము (3-66) నందు
శా.

ఓ లంబాలక యోల యోల యన నోలోలంచు మేలంబునన్
లోలంబాలక యోర్తుగ్రుంకి బిసవల్లు ల్దున్మి తూఁటాడి కేం
గేలం బూని తటాలున న్నెగసె నక్షీణాంబునాథాంబుజా
క్షీలోకంబు జయించి వారల యశఃశ్రీఁ దెచ్చు చందంబునన్.

273
ఈ పద్యము రెండవచరణము మొదలను 'లోలంబాలక'యని కవిహృదయము. ఇదిగానక కొందఱు "ఇందిందిర శ్చంచరీకో రోలంబో బంభరోపి చ" అని నిఘంటున నున్నదని 'రోలంబాలక' యని చదువుదురు. ఇట్లని రామరాజభూషణుని తలంపు గాదు' అని అప్పకవిగారు అన్నారు.274
కొందఱు 'ఓ లోలాఁబక' అనిన్నీ, లో = నీటిలోను, లంబ = వ్రేలుచున్న, అలక = ముంగురులు గలదనిన్ని రెండుచోట్ల దిద్దినారు[56]. రల లకు (యతి) నంగీకరించలేదు. (కాని, దిద్దుబాటు కాని ప్రయోగములున్నవి.)275
శ్రీనాథుని కాశీఖండము (6-210)
శా.

హాలాపాన మొనర్చి యిద్దరును నన్యోన్యంబు మత్తిల్లి రౌ
కేలీనృత్తవినోదకందుకమణిక్రీడావిహారక్రియా
లీలాహాస్యకలాప్రసంగముల నుద్దేశించి వర్తింతు రె
క్కాలంబున్ ఘటజన్మ కాశినడుమన్ గర్వించి యద్దేవతల్.

276
శ్రీనాథుని మరుత్తచరిత్ర
సీ.

శాశ్వతవిశ్వవిశ్వంభరాచక్ర మీ
             రాజకుమారుఁ డేలంగ గలఁడు.....[57]

277
కొందఱు 'కవిత్రయమువారి ప్రయోగము లేదుగాన, మంచిది కాదంటారు. శ్రీనాథుడుగారు కవిత్రయమువారి కన్న తక్కువవారు కారు. అయినా[58]278
తిక్కనగారి ఉత్తరరామాయణము (3-62)
క.

అని గోకర్ణమునకుఁ జని
యనుజన్ములు తాను నెడ్డ నజు నిల్పి తపం
బొనరించి రత్తెఱం గె
ల్లను జెప్పెద వినుము నీవు రఘుకులతిలకా!

279
కాశీఖండము, ఉత్తర రామాయణము (నుండి) అప్పకవిగారు లక్ష్యములు వ్రాసినవేను. ఇచ్చట (వారు) దిద్దకపోవుటకు కారణము తెలియదు. (ఇక)280
అహోబలపండితులవారు కవిశిరోభూషణము (పు. 167) నందు

"అప్పకవినా యదుక్తం — యతౌ రలయోర్మిత్రతాస్తీతి లాక్షణికానా ముక్తి ర్నప్రామాణికీతి. 'లీలా మకరాంక చంద్రరేఖాంకు' రేత్యాదౌ రేఖాశబ్దస్య లాదిత్వమపి నైఘంటుకై రుక్తత్వా న్న రేఫాదిత్వమితి తదవిచారితాభిధానమే వేతి స్పష్టమేవ. ఏతేన, 'రాయంచ కాళ్ల దౌలకయ మన్నె' ఇత్యాది కవిప్రయోగాణాం నకించిద వ్యసామంజస్య మితి ధ్యేయమ్. ప్రాసే తు తదభిన్నత్వం కవిభి ర్న వ్యవహృతమితి జ్ఞేయమ్”

అని వ్రాసినారు. అప్పకవి తెలివితక్కువేగాని, ర ల లకు యతి చెల్లును. ప్రాసము చెల్లదని చెప్పినారు.281
కొందఱు లాక్షణికులు 'రాయంచ కాళ్ల దొరయకమున్నె' అని దిద్దినారు. దిద్దినవా రంతటా దిద్దవలె.282
ప వ లకు—
ఆదిపర్వము (1-125)
ఉ.

(ప్రల్లదుఁడైన యొక్కకులపాంసను చేసిన దానఁ దత్కులం
బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము) గావునన్ మహీ
వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ
ద్రెళ్లగ (సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసమ్మతిన్.)

283
వ బ లకు—
అందే (4-94)
చ.

నుతజలపూరితంబులగు నూతులు నూఱిఁటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిఁటికంటె నొక్కస
త్క్రతు వది మేలు, సత్కతుశతంబున కంటె సుతుండు మేలు, ద
త్సుతశతకంబుకంటె నొకసూనృతవాక్యము మేలు, భూవరా!

284
ద డ లకు—
శ్రీనాథుని నైషధము (7-93)
సీ.

కఱుకులై వీడిన కుఱుచవెండ్రుకలతో
             బట్టనౌదల కావిపాగ తనర
కుఱచ పూరేడు బాగుగ గుస్తరించిన
             గడ్డంబుతో ఱొమ్ము గమ్మలింప
బండి కందెనకాయ ప్రతివచ్చు నేచాయ
             నీలిపచ్చడముతో మేళవింప
నవరక్తచందనద్రవకల్పితంబైన
            నూత్నత్రిపుండ్రంబు నొసల నొప్పఁ
గోఱమీసాలు మిడిగ్రుడ్లు కుఱచ పొడవు
దొప్పచెవులును గొగ్గిపండులును గలిగి
యున్నమద్గ్రీవుఁడై వచ్చుచున్నవాని
గని మహారాజు కనిరి దిక్పాలవరులు.

285
కొందఱు లాక్షణికులు ద డ లకు నభేద మొప్పక ఈ పద్యమందు దొప్ప–డొప్ప అని రెండువిధములు గలవు గనుక, 'డొప్ప చెవులు' అన్నారు. 286
శ్రీనాథుని కాశీఖండము (7-80)
సీ.

వదనంబు దెఱచి మ్రింగుదునె బ్రహ్మాండంబు
             బలు మోపకుండఁగ బాండు రాంగ
పిండి పీచంబుగా పృథివీధరంబులఁ
             దంతునే కాలదండమున నభవ
దందశూకాధీశు తలలు దండ సిలంగఁ
             దాటింతునే కాల ధర మహేశ
వచ్చి వైతునె కేలి వాలారు నఖముల
             నఖిలదిక్కులు శశాంకార్ధమకుట
యేమి సేయుదు నానతి యిమ్ము నాకు
ననుచుఁ గ్రమ్మఱ మ్రొక్కె బాహప్పళించి
తన్మహాధ్వనిఁ కలిఁగి యుత్కటము లగుచు
జలధు లేడును ఘూర్ణిల్ల శంభుసుతుఁడు.

287
(ఇందు) దంచుటను డంచుట అని దిద్దలేదు. ఏమి హేతువునో తెలియదు. 'బాహువు'లో ఉకార లోపము. (ఇక) కవిత్రయమువారి లక్ష్యము లేదని కొందఱు (అందురు. ఉన్నది.)288
అనుశాసనికపర్వము (4-17)
గీ.

దైవతార్చలపుడు డాకినీభూతర
క్షోముఖంబులైన కుత్సితంపు
జాతులెల్ల దీపసన్నిధి నణఁగు, న
ట్లగుట దీపదాన మధికఫలము.

289
ల ళ లకు (ప్రయోగములు) బహులములు గలవు. (ఇక) కాకునూరి అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి' యందు అభేదయతులకు :-
గీ.

'వేదముఖమున వబయో రభేద యనుట
వలన వబ లొక్కటొకటికి నిలుచు విరతి
కవని ల డ లకు ల ళ లకు నట్ల కలిమిఁ
జేసి తమలోన నవియును జెల్లుచుండు'

290
అని లక్షణము చెప్పి :
గీ.

వసుమతీ కలత్ర బకజైత్ర గానక
లా లసత్కలాప డంబ గోప
లలితదేహ పింగళపుర దక్షిణ గేహ
యన నభేద నిరతు లప్రమేయ

291
అని లక్ష్యములు చెప్పి, అనంతుని ఛందమునందు ల డ లకు లక్ష్యము వ్రాసిన :-
క.

కాకుస్వరయతి యగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వళించె ననం బ్ర
శ్నా కలిత దీర్ఘమున నితఁ
డే కవ్వడి రథము గడిపె నిమ్ముల ననఁగన్.

292
అను పద్యము వ్రాసినారు. (అయితే) పవ్వళించె, పవ్వడించె అని రెండువిధములు గలదు. ఆంధ్రనామసంగ్రహమునందు :-
'గీ.

ఒప్పు శయనించె ననుట తొన్నుండెఁ బండె
పవ్వళించెఁ బరుండెను బవ్వడించె... '

293
అని యున్నది. రేఖా, లేదా అని (రెండు విధములు) ఉన్నందున ర లల కభేదము కూడదని (అప్పకవిగారు) వ్రాసిరి. ఇక్కడ మాత్రము తత్పాండిత్యమహిమ ఏమయిపోయెనో తెలియదు. ర ల లకు బహులములు లక్ష్యములు గలవు (కాని), లడలకు నొకటియు లేదాయెను. ఉన్నవి కొట్టివేయుటకు, లేనివి నిలుపుటకు (వారు) స్వతంత్రులు.294

13. విశేషవలి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి ఆంధ్రశబ్దచింతామణి (3-56)
గీ.

ప్రౌఢకవులు కొందఱు జ్ఞకారంబునకును
ప్రధమవర్గంబు తొలియక్కరములు నాల్గు
నిడుదురు ప్రబంధముల నొక్కయెడ విశేష
వడు లనుచు సోమయాజులు వాడు కతన.

295
లక్ష్యము: శాంతిపర్వము (4-255)
క.

జ్ఞానము కేవల కృప న
జ్ఞానికి నుపదేశవిధిఁ బ్రకాశము సేయం
గా నది సకధరిత్రీ
దానంబున కంటె నధికతరఫలదమగున్.

296

14. అభేద వర్గయతి

లక్షణము
గీ.

అవని దంతోష్ఠజంబైన వ్యంజనముకు
ఫ భ లును, దకారమునకు ఢ వర్ణకంబు
యతులగు నభేద వర్గాఖ్య నంది కృతుల
కాశ కాశేశ నీకాశ కలుషనాశ!

297
దంతోష్ఠజ వ్యంజనమనగా వకారము.298
లక్ష్యములు
ప బ లకు—
ఆదిపర్వము (8-29)
మత్త.

ధీరు లీ ధృతరాష్ట్ర పాండు లతిప్రశస్తగుణుల్ ప్రసి
ద్ధోరుకీర్తులు నాకు నిద్దఱు నొక్కరూప తలంపఁగా

వీరు వారను నట్టిబుద్ధివిభేద మెన్నడు లేదు గాం
ధారి పుత్రశతంబునందుఁ బృథా తనూజుల యందునున్.

299
ద డ లకు
శ్రీనాథుని కాశీఖండము (7-34)
ఉ.

చంపుదుమే కృతాంతు శిఖచండమయూఖుల బారిగొందుమే
దంపుదుమే కుభృత్పరివృఢంబులు మొత్తుదుమే యజాండముల్
చింపుదుమే చతుర్దశలు జృంభితబాహుపరాక్రమక్రియా
సంపద సొంపు మీఱఁ బురశాసను నానతి యింత కల్గినన్.

300
ప్రబోధచంద్రోదయము
ఉ.

నావుడు తద్విజుం డహహ నాదగు శీలము వర్తనంబునం
బావనముం గులం బనియు తాగగు వింతలు గౌడదేశరా
ధావరపట్టణంబునఁ గని మదీయగృహంబు తండ్రి ధా
త్రీవినుతుండు తత్సుతులు శ్రేష్ఠులు నే నధికుండ వారిలోన్.

301
అప్పకవిగారు అభేదవర్గయతుల (విషయమున) పూర్వలాక్షణికుల నాక్షేపించి వ్రాసిన గ్రంథ (మిట్లున్నది.) 302
"గీ.

భరితభువనార్ణవంబుతో వ్రంత సరియె
రమ్యమణిరాజరాజితో లక్క సరియె
లలితవీణారవంబుతో ఢక్క సరియె
ననఁగ జెల్లు నభేదాఖ్య నమరు వళ్లు.

303
ఈ మూఁటిలోను భకార వకారములకు నభేద వర్గయతి గనుక, ప్రయోగించవచ్చును. ల వర్ణ ఢ వర్ణములకు నభేదవర్గయతులు గావు కావున ప్రయోగించరాదు. ర వర్ణమునకును లకారమునకును గ్రాహ్యంబుగాదు. వానికి 'లక్షణవిలాసము'వారు తెలియక కొన్ని యుదాహరణలు వ్రాసినారు. అవియును వివరించెద.” 304
ర ల లకు దిద్దినవి ఇదివరలో వ్రాసినాము. ల డ లకు నభేదమంటే, ల ఢ ల కభేదవర్గమున్ను కలుగును. (అయితే) రెండును అగ్రాహ్యములు. మరియు ర ల లకు దిద్దినదిన్ని, ఆ దిద్దినందుకు పొరబాటున్ను వ్రాసుతున్నాము. 305
"హరిశ్చంద్రకథ
ద్విపద.

చీఁకటి విరియించు చిరునవ్వు పసిడి
రేకులతో నెదిరించు చెక్కులును

306
కొందఱు 'రేకులతో మురాళించు చెక్కులును' అని చదువుదురు. అది వ్రాత తప్పుగాని, కవిహృదయము గాదు” 307
అని అప్పకవిగారు పరిష్కరించి వ్రాసినారు. 'ఱేకు' పదము ఱకారము గాని, రేఫము గాదు. కవీశ్వరుడు రేఫ మనుకుని 'మురాళించు చెక్కులు' అని ప్రయోగించినాడు. ‘మురాశించు' పదమే ముద్దుగా నున్నది. ఇక్కడ దిద్దదలచుకునే (అప్పకవిగారు) ఱేకు పదమును (రేఫఱకారముల నిర్ణయించు చోట) రేఫములందు వ్రాసినారు. అప్పకవిగారికి దిద్దుటంటే తాత్పర్యము కాని, విమర్శించకపోవుట నైజగుణము, కాని తెలియదని ఎన్ని చోటుల వ్రాయము! 308
'ఱేకు' ఱకారముకు—
భీష్మపర్వము (2-30)
ఉ.

ఱెక్కలు చించి కంఠమున ఱేకులు వాపి శిరంబు వ్రచ్చి పే
రుక్కున క్రౌంచి చందమగు నొడ్డణముం గలగంగ భీష్ముఁ డే
దిక్కునఁ దానయై దిశలు దీటుకొనన్ శరకోటి నింప గెం
పెక్కిన కంటిక్రేవ చెలువెక్కుడు సేయఁగఁ గ్రీడి కృష్ణుతోన్.

309
శ్రీనాథుని నైషధము (6–22)
సీ.

కబరికాభరముపైఁ గన్నెగేదంగిపూ
             ఱేకుతోఁ గూడ రేఱేనిఁ జెరివి...

310
అప్పకవిగారు 'ఱెక్కలు', 'ఱేఁడు'లను ఱకారములందు వ్రాసినారు. 'రేకు' రేఫములందు వ్రాసినారు. (మరి) ఈ రెండు పద్యములందు నేమి పరిశీలించిరో తెలియదు. ఱెక్కలు, ఱేఁడు ఈ రెండు పదములు కూడా రేఫములందు వ్రాసితే బాగుండును. లేదా, రేకు పదము నుభయరేఫములందు వ్రాసినా బాగుగా నుండును. ఈ పద్యములు చూడలేదని తోచుచున్నది. చూచితే మరియొకరీతిని దిద్దుదురు.

15. ఆగమయతి

గీ.

అవని ట త ప వర్గముల నంత్యాక్షరములు
పరమునందున గల యూష్మవర్ణములకు
మొదలివర్ణంబు లాగమంబులయి నిలుచు
నాగమ విరామ మనఁగ రామార్థదేహ.

312
అర్థము :- ణ, న, మ- ఈ వర్ణములందుగల శ ష స హ లకు, ట త ప-ఈ వర్ణములు ఆగమముల(గును), ఆనగా మధ్యను వచ్చుననుట, ఆగమ మైనందున 'ఆగమయతి' అని పేరు. ఇందుకు కుమార వ్యాకరణ సూత్రము —

"అఘోషా దూష్మణః పరః ప్రథమోభినిధాన స్పర్శపరాత్తస్య స స్థానః"

ఈ సూత్రార్థము :- టకారము వచ్చుటకు. 'కృష్ణ' శబ్దమునందు షకారము ఊష్మము, ణకారము స్పర్శము. ణకారము ట వర్గములోనిదిగాన ప్రథమవర్ణము-టకారము-(ఆగమము) అగును. కృష్ట్ణుఁడు.

'ఏవం జిష్ట్ణు, రోచిష్ట్ణు, ధిష్ట్ణ్యాది.'

(తకారము వచ్చుటకు:- స్నాన శబ్దమునందు సకారము ఊష్మము, నకారము స్పర్శము. అది తవర్గములోనిది గాన ప్రథమవర్ణము-తకారము—వచ్చును. స్త్నానము.

'ఏవం స్త్నానాది.'

(పకారము వచ్చుటకు :-) భీష్మ శబ్దము నందు షకారము ఊష్మము. మకారము స్పర్శము. మకారము పవర్గములోదిగాన ప్రథమవర్ణము-పకారము-వచ్చును. భీష్ప్ముడు.

‘ఏవం గ్రీష్ట్మాది.'

అనుష్ట్ణః = మందుడు. అపత్రపిష్ట్ణుః = లజ్జపడువాడు. ఉష్ట్ణమ్ = వెచ్చన. ఉష్ట్ణికా = కాల్చిన గంజి. ఉష్ట్టీషః = పాగా, కిరీటమున్ను, కృష్ట్ణః = శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇఱ్ఱి, నలుపువర్ణము. కృష్ట్ణా = నదీవిశేషము, ద్రౌపదియు. జిష్ట్ణుః = ఇంద్రుడు, అర్జునుడు, జయశీలుడు ... ధృష్ట్ణుః = ధైర్యశాలి. నిష్ట్ణాతః = నేర్పరి. షరోష్ట్ణీ, పార్ష్ట్ణిః = మడమ. రోచిష్ట్ణుః = ప్రకాశము గలవాడు. విష్ట్ణుడు = విష్ట్ణుక్రాంతా లతా. వృష్ట్ణిః = .......తృష్ట్ణా = ఆశ. తూష్ట్ణీంశీలః = ఊరుకున్నవాడు. తీక్ష్ట్ణః = ..
  1. ఈ 9 యతులు పరిహరింపబడుటకు 'ఏమి హేతువనంటే-' అని కారణములు చెప్పుటలో 'యుష్మదస్మచ్ఛబ్దయతి'ని పరిహరించుట కారణము చెప్పబడలేదు. మరియు 'ఉభయముల'లో వేంకటరాయకవి 'యుష్మదస్మచ్ఛబ్ద' యతి నొకభేదముగా కూడా చెప్పినాడు. ఉభయయతులలో ఈయతి లక్ష్య లక్షణములు ప్రదర్శించి 'అప్పకవిగా రఖండయతి నొప్పరుగాన నిచ్చట దిద్దశక్యముగాక యుష్మదస్మచ్ఛబ్దయతులని పేరుంచినారు. ఇంతమాత్రముచేత నఖండయతికి లోపము రానేరదని ఉంచినాము' అని వ్రాసినాడు. అఖండయతిలో నిది అంతర్భవించు ననుకొని మొదట పరిహరింపబడినదని చెప్పి 'లోపము లేద'ని ఉంచుటచే నిక్కడ 8 యతులే పరిహరింపబడినవని భావించవలెను. మరియు ఈ 8 లో 'అంత్యోష్మ' మని పేర్కొనబడినది. 'అంత్యోష్మసంధి' యతి ఉభయయతులలో వేం. రా. కవి అంత్యోష్మసంధి యతిని చెప్పినాడు. మరియు వీటిని నిరాకరించు వరుసలో అంత్యోష్మసంధి నిరాకరణ హేతువు చెప్పబడలేదు. యుష్మదస్మచ్ఛబ్ద, అంత్యోష్మసంధి' తప్ప మిగిలినవాటినే నిరాకరించి 'ఈ సప్తవిధములు నామనిర్దేశములు మాత్రమే...' (2-17) అని చెప్పినాడు. కాన ఇక్కడ 9 అని చెప్పుటకు హేతువు కన్పించదు.
  2. ఇది కవిజనాశ్రయమున కన్పించును. సంజ్ఞ, 63. కస్తూరి రంగకవి 'భీమనచ్ఛందము'లోనిదిగా నీపద్యము నుదాహరించినాడు. (ఆనందరంగరాట్ఛందము. 3-114)
  3. నన్నయ లక్షణసారము నందలి దీ పద్యమని కస్తూరి రంగకవి తన 'ఆనందరంగచ్ఛందము'న ఉదాహరించినాడు. కాని ఇది అనంతునిఛందమందు స్వల్పమైన మార్పులతో కన్పించును. రెండవపాదమున 'గూఢస్వరయతి'కి బదులు 'స్వరవిరామంబు' అని నాల్గవపాదమున 'యశోబ్ధి'కి బదులు 'యశోర్థి' యన్నవా మార్పులు (చూ. అనం.ఛం. 1-85) వేంకటరాయకవి రంగకవిని చూచి ఉదాహరించినట్లున్నది.
  4. ము. ప్ర.'.......కాదులు నైదైదు గూర్పనగు వర్గంబుల్'. (వావిళ్ల ప్రచురణ. 1949.)
  5. ము. ప్ర. ......దుష్ర్పాస భై,
              మీ దాంపత్యమునం జిరాయువయి నెమ్మిం...
  6. ము. ప్ర. ‘క్రిక్కిరి చన్నుదోయి యిరు గ్రేవల'...
  7. ము. ప్ర. '... పేర్మికిన్
    విక్కి ప్రమానము ల్గురియు వేనలి వీడిచి...'
  8. ము. ప్ర. 'సంభరణ ప్రౌఢ నిజ భుజయుగ యుగళీ'
  9. ము. ప్ర. ...లోకనమాత్రమున ముక్తులు కురంగాజీ
  10. ము. ప్ర. ....వృద్ధస
    ఖ్యానుమతి న్సులగ్నమున నావ్రతదీక్ష వహించె నయ్యెడన్.
                                                 (ఎమెస్కో ప్రచురణ)
  11. ము. ప్ర. '...కొం, దలమున విక్రయించు వసుధాధవు...'
                                              (వావిళ్ల ప్రచురణ. 1916)
  12. ము. ప్ర. 'వెలయు నవ్విశ్వనాథుదేవళముఁ గాంచె'
                                             (వావిళ్ల ప్రచురణ. 1916)
  13. ము. ప్ర. '...యా, యత జయలక్ష్మికిన్ బరిణయాంగముగా...'
                                                 (వావిళ్ల ప్రచురణ. 1916)
  14. ము. ప్ర. 'పరహితమార్గవర్తన శుభంకర...'
                                                (వావిళ్ల ప్రచురణ. 1918)
  15. ము. ప్ర. 'నా కేటికి నవయ నని మనం బురియాడన్'
                                                (వావిళ్ల ప్రచురణ 1954)
  16. ము. ప్ర....ని, స్స్వానము లుల్లసిల్లఁ జలజాతహితేందు విశాలవీథులన్'
                                              (వావిళ్ల ప్రచురణ. 1954)
  17. ము. ప్ర. 'చనుఁ డచటికి నిపు డింపెన
               య, 'న దుఃఖం పంచభిస్సహ' యనంగా మున్...'
  18. ము. ప్ర. '...దేం, ట్లొకఫలశాఖ రాచిలుకయున్ రొదసేయఁగ...'
  19. ము. ప్ర. 'మజ్జన, మారోగిణమయి మణీమయవుఁబాదుక...'
  20. ము. ప్ర. '.... శ్రీరామాయణము చదివిరి వివిధమగు నా నారాగ రచన...'
                                                                               (వావిళ్ల. 1958)
  21. "....సందియం
    బే, రమణీయ కాంతి నుమమింపఁగ ..." అని వ్రాతప్రతులలో గనుపించు నొకపాఠాంతరమని శ్రీ చిలుకూరి నారాయణరావుగారు 'నన్నయ యతులు' అను వ్యాసమున (భారతి జూన్ 1927) వ్రాసినారు. అప్పుడిది బిందుయతి యగును గాని యఖండయతి కాదు.
    "ఉదయించిన.." "కాంతిని వహింపగ..." అని ఉ. వి. వ. ప్రతియందు పాఠాంతరములు చూపబడినవి. 'మరియు ఈ పద్యము ప్రథమ ద్వితీయ చరణములలో 'నిత్య సమాసవడి'

    'పదము విభజించి చెప్పఁ జొప్పడని యదియు
    నన్యశబ్దంబు గొని విగ్రహంబుఁ జెప్పు
    నదియు నిత్యసమాసమై యలరుచుండు

    నట్టిసఁధుల నచ్చు హల్లైన విరతి'

    అని లక్షణము. అని భారతము లక్ష్మీపతి కూర్చిన వ్యాఖ్యలో నున్నట్లు చెప్పబడినది, కాని "ప్రభవించు" "ఉంపమింపగ" అనునవి నిత్యసమాసములగుట కుదురదు.

  22. ఇదే ఆశ్వాస మందలి 88, 90, 117వ పద్యములు.
  23. ము. ప్ర.'...యున్న నిచ్చట
    న్మెచగు వీరిదైన సుఖనిద్రకు...'
  24. ము. ప్ర. '...తీ, ర్థములందుఁ బుష్కరత్రిత
    యము, గరము విశేషమభిమతార్థ ప్రదమై'
  25. ము. ప్ర. '... విప్రస
    ఖాసీనుంగాంచి యిట్టు లనియెం బ్రీతిన్'
  26. ము. ప్ర....కవి, తాలాపకలాపసంతతానందమతీ'
  27. ము. ప్ర. 'నాఁటఁగోలె నెచ్చటికిఁ జనంగ నేర '
  28. ఈసీసము నన్నయగారి సీసపద్యరచనాపద్ధతి ననుసరించి సీసపాదపూర్వదళమున సరూపాక్షరయతి, ఉత్తరదళమున ప్రాసయతి చెల్లెడుతీరుకు చెందినది. తృతీయపాదమున ఉత్తరదళమున 'పరమైన' అని అన్న చో పద్ధతి (సరూపాక్షరయతి చెల్లుటవలన) చెడును. సా.అ. ప్రతి. ఉ.వి. ప్రతియందు పాఠ మిట్లే యున్నది. కాని "భయద మై కడుపర-వయిన యడవి' యని యున్నచో ప్రాసయతి చెల్లి సీసము సరిగా నుండును. (ఎఱ్ఱనగారు సీసపద్యరచనలో యతి ప్రాసయతుల చెల్లింపులో నన్నయగారినే భారతమున అనుసరించినారు. అప్పుడు ఈ అఖండయతి చెల్లినదనుటకు వీలుండదు.
  29. 'సరోజాయత' అని పెక్కుప్రతులయం దున్నదని చెప్పుచు ఉ. వి. వి.ప్రతిలో 'కాని యతిభంగము' అని కుండలీకరణమున వ్రాయబడినది. కాగా ఇది ‘అఖండయతి’యని స్పష్టము.
  30. ము. ప్ర. 'యీపును నీవారు నతని నెఱుఁగరె చెపుమా'
  31. ము. ప్ర. 'యేను వడ్డింపంగ నింపారఁ గుడిచి... '
  32. ము. ప్ర. 'నడపు సమరమునకు వెడ జంకఁబో దింక
  33. ము. ప్ర. ‘...వలసిన, నే లోనికి దివ్యదృష్టి నిచ్చేడఁ బుత్రా'
  34. ము. ప్ర. ... కెం, పొదవినమో మలతినవ్వు నొప్పున నొప్పెన్'
  35. ము. ప్ర. ‘....శి, క్షాయుత బుద్ధివృద్ధుఁడవు గావె...'
  36. ము. ప్ర. 'నఱికి తోడన హరిమేన నరునియొడల'
  37. ఈపద్యమున అఖండయతి కన్పించదు. 'ఐనను' లో 'న' మీద అచ్చు విరుగదు. 'బ్రతుకనవలయు' నన్నప్పుడును 'క' మీద కూడ అచ్చు విరుగదు. 'బ్రతుకనేవలయు' నని యర్ధము. 'బ్రతుకు + అనవలయు' అని వేం.రా. పదవిభాగము చేసినట్లు తోచును. గాని అది సరికాదు.
  38. ము. ప్ర. 'మగ్గెడు వారునై కురుధరావరు...'
  39. ము. ప్ర. '... జూపఱె, ల్లం గీర్తింప ధనుఃకలా నిపుణ లీలాఖేలతన్ జూపెదన్'
  40. 'నెరయు' హలాదిగా నున్నదనవలెను. 'నెరసినయది' అని ము. ప్ర. 'అగ్నులన్ + ఎరిసిన అని విభాగము. అప్పు డఖండయతి కాదు.
  41. ము. ప్ర. 'వెడగర పడియె దీ యడవిలోన'
  42. 'జనతా + అనందితుఁడు' అని ' విరిగిన అఖండయతి. జనతా + నందితుడు' అనినచో అఖండయతి కాదు.
  43. ము. ప్ర. 'నామనమార దీనిఁగని నందముఁ బొందితి...
  44. ము. ప్ర... చూడు
    మా మహాత్ములు దక్కు నున్మార్గచరులు...' 'చూడుమా' అని కం. వీరేశలింగముగారు 1991 ప్రచురణలో ఉభయయతిగా దీనిని గుర్తించినట్లు ఉ.వి.వి. ప్రతి.
  45. ము. ప్ర. 'మాడ్కి, నింద్రియములతోడ నెనయఁ బెరసి'
  46. 'నీకున్ + ఆ విభవంబు' అని వేం. రా. భావించినట్లున్నది. 'నాయొక్క విభవ'మన్నచో సందర్భమున కనుగుణముగును. అప్పుడు అఖండయతి గాదు.
  47. ము. ప్ర. 'నరుఁడు నారాయణుండు ననంగలోక...'
  48. ము. ప్ర. 'మయతఁజేసి భయంకరమయి వెలింగె' ఈ పాఠ మందును అఖండయతి తప్పలేదు. పాఠాంతరముగూడ లేదు.
  49. ము. ప్ర. ...జ, నావలియుం బరిజనములు హస్తినగరికిన్'
  50. ము ప్ర. ‘దనియఁగ నిమ్ము సర్వవసుధాసురకోటులకున్...'
  51. ము. ప్ర. '...నరపతి నెత్తుచును దాన నయమున్ వనటం.
  52. ఈ పద్యము 'కవిజనాశ్రయము'న కనుపించదు. ఆం.సా.పరిషత్ ప్రచురించిన క. జ. పు. 28లో అధోజ్ఞాపికయందు 'పదివళ్ళను, వాటి లక్ష్యములను జెప్పుచు రామస్తుతిగా నున్న భీమనచాటు వని ఈ పద్యమున్నట్లు వ్రాయబడినది.
  53. 'స్నాన' శబ్దమున తకార మెట్లుండుటకు వీలున్నది ఆగమయతి (ఈ ఆశ్వాసము చివర) వద్ద ప్రదర్శింపబడినది.
  54. సీ. 'తరుణికి మంగళస్త్నానంబు సేయింత, మనిపెట్టె నింద్రుఁ డనర్ఘమైన' అని భాగవతప్రయోగము గూడ కన్పించును (అష్టమ. 270)
  55. 'తద్భవవ్యాజయతికి...' నుండి సీసపద్యోదాహరణము వరకు మూలప్రతియందు వ్రాసి కొట్టివేయబడి ఉన్నది. కాగా తద్భవవ్యాజయతికి ఎఱ్ఱన గారి ఈ ప్రయోగము గ్రంథమునం దుండగూడదని వేంకటరాయడు భావించినట్లు కన్పించును. వివరములకు చూ. ఈ గ్రంథ పీఠిక.
  56. ఇట్లు దిద్దినవాడు కూ. తిమ్మన. చూ. ల. సా. సం. 2-194.
  57. ఈ పద్యపాదము రంగరాట్ఛందమున 'సునందనచరిత్ర' లోనిదిగా ఉదాహరింపబడినది, చూ. రంగ. చంద. 3-274.
  58. ఇక్కడ 'అయినా ర ల లకు హరికథాసారము, ఎ. హ. (ఎఱ్ఱాప్రెగడ హరికథాసారము) రెండు పద్యాలు' అని మూలప్రతియం దున్నది కాని రెండు పద్యాలేవో వ్రాసిలేవు.