సుకవి మనోరంజనము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

సుకవి మనోరంజనము

తృతీయాశ్వాసము

శ్రీద శ్రీదా శ్రీదా
మోదర గిరిభేది ధాతృపూజితపాదా!
వేదా వేదిత గుణ! కా
కోదర మణి భూషితాంగ! కుక్కుటలింగా!

1
అవధరింపుము. ఉభయ విశ్రమముల తెఱం గెఱింగించెద. 2

ఉభయ వలులు

1. అంత్యోష్మ సంధియతి

లక్షణము
గీ.

వ్యంజనంబులు నంత్యోష్మ వర్ణమునకు
సంధి చెందిన నంత్యోష్మ సంధి విరతి
యనఁగఁ దనరారు రెండు వ్యంజనములకును
పృథుదయాపాంగ! శ్రీ కుక్కుటేశలింగ!

3
అంత్యోష్మ వర్ణమనగా హకారము.
సూ.

'ఝ యో హోన్యతరస్యామ్'

అను దీనివలన ఉత్ హతి = ఉద్ధతి, జగత్ హిత= జగద్ధిత, కకున్ హస్తి = కకుబ్భస్తి —ఈ ప్రకారము సంధులు గలవు. 'ఉద్ధతి' పదముననున్న ధకారద్వయముకు త థ ద ధ లున్ను, ఆ య హ లున్ను చెల్లును. 4
లక్ష్యములు ఉద్ధతి తకారముకు
శ్రీనాథుని నైషధము (1-9)
సీ.

తన కృపాణము సముద్ధత వైరిశుద్ధాంత
             తాటంకముల కెగ్గు తలఁపుచుండ....

5
హకారముకు
వసుచరిత్రము (1-44)
సీ.

హరి వీరభట మహోద్ధతి నద్ధి గంపింప
             దురమున నిల్చి తద్ద్రోహిఁ దునిమి

6
‘జగద్ధిత' - హకారముకు' '
తిమ్మకవి సార్వభౌముని సర్పపురమాహాత్మ్యము
చ.

మతి మఱపూను నుస్సురను మందతచెందు కృశించు కంటికి
న్వెతబడు నీచవర్తనుల వేడఁగఁ జూచు విధిన్ సడించులో
ధృతి చెడి క్రుంగి బెంగగొను నెట్టిమహోన్నతుఁడైన నీ జగ
ద్ధితకరుణారసప్లుతనిరీక్షణ మబ్బనివేల శ్రీసతీ!

7
నిరీక్ష-ప్రాది గాన ప్రాదియతి (అనియు) అనవచ్చును.

2. నిత్యసంధి యతి

లక్షణము
గీ.

వ్యాకరణసూత్రమున సంధు లతుకునపుడు
నిత్యముగ సంధులుండుట నిత్యసంధి
యతి యనంగను దనరారు నబ్జమౌలి!
భామినీ కృత వనమాలి! పరమ కూలి!

8

సూ.

తోర్లి.
త వర్ణస్య లకారే పరే పరస వర్ణః స్యాత్.

తత్-లయః = తల్లయః, ఉత్-లాసం = ఉల్లాసం సురత్ లీలా-సుర ల్లీలా— ఈ మొదలయిన ద్విత్వలకారములకు త థ ద ధ లు , ల ళ లున్ను

యతి చెల్లును.
లక్ష్యములు
'ఉల్లాస'లకారముకు
పారిజాతాపహరణము (1-60)
మ.

అలి నీలాలక నీవు నీ పతి రహస్యక్రీడ వర్తించు వే
ల లతాంతాయుధుసంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను
జ్జ్వలదీపాంకురమై రతిశ్రమ తనూసంజాతధారాలఘ
ర్మలవంబుల్ దొలగింపఁ బూసురటి యై రంజిల్లు నిచ్ఛాగతిన్.

10
అందఱు దీనిని ఎక్కటి యతి యనుకొందురు. ఎక్కటి యతికాదు.11
తకారముకు
తిమ్మకవి భర్గశతకము
శా.

నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర
ల్లీలన్ నివ్వరి ముంటి చందమున నెంతే పచ్చనై సూక్ష్మమై
చాలా భాసిలు తేజు నీవ యనుచున్ స్వాంతంబునం దెన్నుదు
ర్వాలెంబున్ ఘనులైన తాపసులు భర్గా! పార్వతీవల్లభా!

12
రెండవచరణమందు తకారముకు యతిగాన నిత్యసంధి యతి యనవలె. మొదటి చరణమందు వికల్పసంధి యతి. 13
సూ.

స్తో శ్చునాశ్చుః
స్తోః సకార త వర్గయోః శకార చవర్గాభ్యాం యోగే
శకార చవర్ణౌస్తః.

సత్-చిత్ = సచ్చిత్ సత్-శంఖం = సచ్ఛంఖః

ఉత్-జ్వలం = ఉజ్జ్వలమ్
సూ.

స్తోష్టునా
స్తోః ష్సునా యోగే మః స్యాత్.

తత్-టీకా = తట్టీకా. స్ఫురత్-డమృగం = స్ఫురడ్డమృగమ్. లసత్-ఢక్కా = లసడ్ఢక్కా.
ఈమొద లైనవి నిత్యసంధియతులు. 'సచ్చిత్' అను పదమందు (ద్విత్వచకారముకు) త థ ద ధ లు, చ ఛ జ ఝ లు యతి చెల్లును. తట్టిక అను పదమందు (ద్విత్వటకారముకు) త థ ద ధ లు, ట ఠ డ ఢ లు యతి చెల్లును. 14

3. వికల్ప సంధి యతి

లక్షణము
గీ.

వ్యాకరణసూత్రమున సంధు లతుకునపుడు
రెండువిధముల రూపంబు లుండు కతన
నట్టి వర్ణంబునకు వ్యంజనములు రెండు
నిలుచు ధరను వికల్పసంధి యతి యనఁగ.

15


సూ.

యరోను నాసి౽కేనునాసికో వా
యరః పదాంత స్యానునాసికే పరే అనునాసికో స్యాత్.

ఏతత్-మురారిః = ఏతన్మురారిః (ఏతద్మురారి) సరిత్-నికటం = సరిన్నికటమ్ (సరిద్నికటమ్) తటిత్-నీకాశం =తటిన్నీకాశమ్ (తటిద్నీకాశమ్).
ఈ మొదలైన పదములందు రెండు విధములైన హల్లులు (యతి) చెల్లును. 16
లక్ష్యములు — సరిన్నికట - తకారమునకు
తెనాలి రామలింగము ఇందుధరోపాఖ్యానము
మ.

ఒకనా డిందుధరుండు పార్వతియు లీలోద్యానకేళీసరి
న్నికటానేకవనప్రదేశముల దైతేయేంద్రకన్యాప్సరో

నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబుపైఁ జల్ల ద
రకబాణంబులకెల్ల నెల్లయగు సౌభాగ్యంబు శోభిల్లఁగన్.

17
మనుచరిత్రము (2-16)
మ.

అకలంకౌషధసత్వముం దెలియ మాయాద్వారకావంతి కా
శి కురుక్షేత్ర గయాప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంచుఁగొం
డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్.

18

(ఈ పద్యమును) వికల్పసంధి యతికి అప్పకవిగారు (లక్ష్యముగా) వ్రాసినారు.

అనునాసికయతికి మిగిలిన లాక్షణికులు వ్రాసినారు. రెండు ననవచ్చును. 19
పై మూడువిధములైన యతిభేదములు వ్యంజనవిషయికము లయినప్పటికి సంధివర్ణమైన ద్విత్వా(సంయుక్తా)క్షరపు రెండువిధములైన హల్లులకు యతి చెల్లుటవలన ఉభయ యతులందు నుంచినాము. 20

4. రాగమసంధియతి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి': (3-215)
గీ.

ఆలను పదంబు మొదలను రాగమంబు
వచ్చుసంధికి నుభయంబు వలి తనర్చు
నతివ జవరాలు బాలింతరాలు ముద్ద
రాలు ధర్మాత్మురాలన రాక్షసారి.

21
ఉభయముకు లక్ష్యములున్నవి.
లక్ష్యములు, హల్లుకు
 :
చారుధేష్ణచరిత్రము
క.

ఈలలన వేలుపుం జవ
రాలో యచ్చరయొ కిన్నరవధూమణియో

వ్యాలాంగనయో కాకీ
భూలోకస్త్రీల కిట్టి పొంకము గలదే.

22
అచ్చుకు
మనుచరిత్రము (2-41)
ఉ.

ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే
కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా
గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికిన్‌?

23
లాక్షణికులందఱు 'ఏకాంత' పదమును ప్రధానముచేసి నిత్య సమాసయతికి లక్ష్యము వ్రాసినారు. అప్పకవిగారు రాగమసంధిని ప్రధానము చేసినారు. రెండు ననవచ్చును. కాని మూడవచరణమందు నేయతియో యెవరును వ్రాయలేదు. 24

2. విభాగయతి

లక్షణము
గీ.

అవ యనంగ నేసి యన నొప్పు పదములు
సంధులందు రెండు జరుగుచుండు
సంఖ్యయును బ్రమలు సంజ్ఞయుఁ గలచోట
నగు విభాగయతులు నగనివేశ!

25
అర్థము :- రెండవ, మూడవ ఈ మొదలైన పనములందు 'వ' అను(దానిలోని ఆది) స్వరము కలుసుకొని ఉన్నందున, డకారముకు అ య హ లు చెల్లును. ట ఠ డ ఢ లు చెల్లుట స్పష్టమే. (ఇక) పడేసి, పట్టెడేసి, దోసెడేసి- మొదలైన పదముందు 'ఏసి' అను దానితో సంధిగలదు గాన, ఉభయము చెల్లును.26
లక్ష్యములు
'మూడవ' అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (7-60)
సీ.

సితికంధరునకు నెచ్చెలికాఁడు గాఁడొకో
             యటమటీఁడైన యీ యక్షభర్త
అహికంకణునకు మూఁడవకన్ను గాఁడొకో
             ప్రాల్మాలు నట్టి యీ పావకుండు
పురవైరి కవతంసపుష్పంబు గాఁడొకో
             నిర్భాగ్యుఁడైన యీ నీరజారి
గంగాధరునకు లెంకలలెంక గాఁడొకో
             పెనుగూళి యైన యీ యనిమిషేంద్రుఁ
డేమి కుడువంగ వచ్చినా రిళ్లు వదలి
హరుని వెలివెట్టినట్టి యీ యాగమునకు
పంచవదనుని కను జేవురించెనేని
తత్క్షణమునంద తమయాండ్ర త్రాళ్లు తెగవె.

27
సభాపర్వము (1-47)
సీ.

ఈయంబునందు నాలవభాగ మొండె మూ
             డవభాగ మొండె నం దర్ధ మొండె
గాని మిక్కిలి సేయఁగాదు వ్యయం బని
             యవధరించితె బుద్ధి యవనినాథ
ఆయుధాగారధనాధ్యక్షములయందు
             వరవాణి వారణావలులయందు
బండారములయందు పరమవిశ్వాసులు
             భక్తుల దక్షులఁ బంచితయ్య
గురుల వృద్ధశిల్పి వరవణిగ్బాంధవ
జనుల నాశ్రితులను సాధుజనుల
గరుణఁ బేదఱికము బొరయకుండఁగఁ బ్రోతె
సకలజనులు నిన్ను సంస్తుతింప.

28
పై పద్యములందు మూడవ, నాల్గవ- రెండు పదములున్నవి 'రెండవ' పదముకు౼
పారిజాతాపహరణము (2-95)
చ.

కువలయపత్రనేత్ర కనుగొంటివె కన్నులపండువయ్యె రెం
డవ వినతాతనూభవుని యందమునం గమనీయకాంచన
చ్చని కవచీకృతం బకులిశక్షత పక్షము నైకరత్నసా
నువురలు నీదివాకృత వినోదపరాయణ చంద్రభానువున్.

29
హల్లుకు
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' ( 4 ఆ. 21వ ఛం.)
కనకలత.

జవమున భగభగ యనుచు ప్రజజనముల బొదవినం
దవశిఖి నుడిపిన మధుముర నరకదమన యని పే
లవముగఁ బలువరు నిరువది లఘువులు గము పడమూఁ
డవయెడ విరతి బొసఁగిన బెడగడరు కనకలతన్.

30
లాక్షణికులందఱు ఏసి యను పదమునకేగాని, 'అవ' యను పదముకు చెప్పలేదు. ఈ లక్ష్యములకు నేమి సమాధానము చేసికొనిరో తెలియదు. 31
(ఇక ఏసికి లక్ష్యములు)
‘ఇంతేసి’ - హల్లుకు
హరిశ్చంద్రోపాఖ్యానము (2–176)
గీ.

నీవు చేసిన దోషంబు నీకె యుండె
దీర్ఘరోషంబు మాకు నింతేసి యేల
మొగమునందున్న నీ దైన్యముద్రఁ జూచి
కరుణ జనియింపఁ గాచితి ధరణినాథ!

32
'ఇంతలేసి' - హల్లుకు
రాధామాధవము (4-87)
గీ.

కొదమసంపెంగపూవులగుత్తి పుష్ప
లావి యొక్కతె శ్రీవత్సలాంఛనునకు

దర్శనం బిచ్చె మత్పయోధరము లింత
లేసి కలవని తెలిపెడు లీల దోఁప.

33
అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (2-104)
గీ.

అప్పటికి నియ్యఁగొంటిఁగా కబ్జవదన
ఋషుల పాలిటివే యింతలేసి పనులు
కొదుగ కాబోతు నాబోతు క్రుమ్ములాఁడ
నడిమి యాబెయ్యదెస వచ్చె నాకు నిపుడు.

34

6. భిన్నయతి[1]

(కాకునూరి అప్పకవిగారి లక్షణము)
గీ.

గుడుసుపైఁ గ్రియనడుము నా గుడుసు వచ్చి
భిన్నయతి యగు రానిచోఁ బెఱయతియగు
నెదను లచ్చిని హరి ధరియించె ననఁగ
రిపుల నెల్లను బోర హరించె ననఁగ.

34/1
విజయవిలాసము (3.15)
ఉ.

చిత్తజుఁడల్లి తూపుమొన చేసినఁ జేయఁగ నిమ్ము పై ధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము వచియించెదఁ గల్గినమాట గట్టిగా

నత్తరలాయతేక్షణ కటాక్షవిలాసరసప్రవాహముల్
కుత్తుకబంటి తామరలకున్ దలమున్కలు గండుమీలకున్.

34/2
అందే
ఉ.

చెట్టతనంబునం జనకు జీవనమంతయు వెల్లివుచ్చి తోఁ
బుట్టిన యాపె యిల్విఱిచి పుట్టినబిడ్డనికిం బగైన నీ
యిట్టి నిశాటకృత్యమున నెవ్వరు రోయక సమ్మతించు నీ
వెట్టి ప్రదోషవేళ జనియించినవాడవొ గాక చంద్రమా!

34/3
పెఱయతి
ఆగమము రానందులకు శ్రీరంగమాహాత్మ్యమునందు
ఉ.

గందపుఁగొండ నెత్తములఁ గందువ మేలిమి తీవయిండ్లలో
గెందలిరాకుపాన్పున సుఖించి నితాంతరతిశ్రమంబునుం
జెందిన చెంచుగుబ్బెతల చెక్కులఁ జిమ్ము జవాది వాసనల్
విందులు సేయుచు న్మెలఁగు వేఁకువఁ గోమలగంధవాహముల్.

34/4

7. ప్రభునామయతి

లక్షణము
గీ.

అవ్వ యమ్మక్క యప్పయ్య యన్న యాయి
యరుసు పదములు సంధుల నదుకుచోట
నచ్చుహల్లులు రెండును నలరు నూదఁ
బడకయైనను బ్రభునామ వలి యనంగ.

35
‘ప్రభు' శబ్దముకు నిక్కడ మనుష్యుడని యర్థము గాని, 'రాజు' అని అర్థముగాదు. కావున స్త్రీ పురుష నామధేయులకు (సామాన్యము. ఇట్టిచోట్ల) నుభయమును చెల్లును. కొందఱు లాక్షణికులు దీనిని 'నామాఖండ' మన్నారు. వా రఖండయతి నంగీకరించనివారు. కొందఱు లాక్షణికులు, దొడ్డయ్య, దొడ్డమ్మ, రామయ్య, రామన్న, సీతమ్మ, లక్ష్మమ్మ- ఈ మొదలైన పేరులు దొడ్డయ, దొడ్డమ, రామయ, రామన, సీతమ, లక్ష్మమ- అని తేలబలికినపుడు స్వర
వ్యంజనములు రెండును చెల్లునని లక్షణముచెప్పి, అట్టివే లక్ష్యములు వ్రాసినారు. (మరి) పూర్వ మహాకవి ప్రయోగములు ద్విత్వముగల పేరులకు ఉభయముకు (యతి చెల్లింపు) ఉండగా, గురుత్వ మొప్పకపోవుటకు వారి తాత్పర్యము తెలియదు.
అనంతుని ఛంధము (1-118) నందు—
గీ.

ఒరుల నన్నమ్మ యనుచోట నూదఁబడక
ద్వివిధమగుఁ బ్రభునామాంత విరమణమున
మఱి యయోధ్యకు రాజు రామన యనంగ
నతని పట్టపుదేవి సీతమ యనంగ.

(అని) రంగరాట్ఛందంబు (3-128) నందు—
గీ.

అవనిలో నలమేలు మంగమకు సాటి
యాదిలక్ష్మి, యానంద రంగనకు సాటి
విష్ణు, వటుగాన నోములు వేయు నోచి
మహిని నాతనిఁగన్న లక్ష్మమదె కీర్తి.

37
(అని చెప్పినారు) ఇటువలెనే కొందఱు గురుత్వ మొప్పలేదు. గురుత్వ మొప్పనివారికి గురుత్వములేదు. 38
గురుత్వముకు లక్ష్యములు
అచ్చుకు
తెనాలి మూర్తికవిగారి 'రాజవాహనవిజయము' (అవ. 1-22)
ఉ.

చెప్పిన పద్యమెల్ల చెవిఁజేర్చి వినున్ విన డొంకు గల్గినన్
దప్పులు గిప్పు లెన్నఁ డొకనాడును, నాడును నాడు వేడ చో
యప్పన పెట్టఁ బోఁ డడిగినన్ వివరా లిడు కొండమీఁది తి
మ్మప్పనివఁటి కావ్యపతి యబ్బుట యబ్బుర మిబ్బుధాలికిన్.

39
నంది తిమ్మనగారి చాటుధార
క.

ఇప్పటి దాతల సరిగాఁ
జెప్పకురా భట్టకర్ణ శిబిఖేచరులన్

జెప్పుము మూర్తిఘనుని వెం
కప్పకు దానమున నిర్భయంబున సభనన్.

40
పొట్టూరి గోపన్న చాటుధార
క.

అన్నలుఁడు రూపమున సిం
గన్న కలాయుక్తి, భరతు నన్నకరుణచే
నన్నసముద్రపు పెదచి
న్నన్నకుమారుండు వేంగలామాత్యుఁ డిలన్.

41
శ్రీనాథుని కాశీఖండము (1-18)
సీ.

వచియింతు వేములవాడ భీమనభంగి
             నుద్దండలీల నొక్కాక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
             నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా
             భ్యుచితబంధమున నొక్కొక్కమాటు
పఠియింతువు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
             సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు
నైషధాది మహాప్రబంధములు పెక్కు
జెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ
యిప్పుడు చెప్పంగఁదొడఁగిన యీ ప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్య పేర.

మూడుచోటుల వుకారలోపము. రెండు (చోటుల) ప్రాదియతులు. 43
అందే (1-53)
మ.

హరి దాటించెఁ బురోపకంఠమున వాహ్యాలి ప్రదేశంబునం
దరుదే యల్లయరెడ్డినందనుఁడు దొడ్డయ్య క్షమాధీశ్వరుం
డిరవైనాలుగు మూర్లమేర యదిపో రెక్కింపగా నేల య
ద్ధరణీనాథుని కీర్తిదాటెఁ గడు నుద్దండించి బ్రహ్మాండమున్.

44
కాశీఖండమందు గురుత్వమునకు నీ రెండు పద్యము లుండగా కొందఱు లాక్షణికులు (1–29)
మ.

జయధాటీసమయంబులన్ విలయఝంఝామారుతాడంబరా
న్వయరంహఃప్రవిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం
బయి యొడ్డాది భయంకరోడ్డమరుశౌర్యంబైన శ్రీ రెడ్డి దొ
డ్డయ యల్లాడ నృపాల రాహునకుఁ బిట్టల్లాడ దిక్చక్రముల్.

45
(అను) ఈ పద్యము తేలబలుకుటకు లక్ష్యము వ్రాసినారు. ఈ పద్యము, పై రెండు పద్యముల మధ్య నున్నది. వారి కంటికి నిది మాత్రము కన్పించి యా రెండు పద్యములు నెందుకు కనుపించక పోయెనో తెలియదు. 46
హల్లుకు
హుళక్కి భాస్కరుని చాటుధార
క.

అప్పులిడు నతఁడు ఘనుఁడా
యప్పు డొసఁగి మఱలఁ జెందు నాతఁడు రాజా
చెప్పఁగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు రాజు నటంచున్.

47
తెనాలి రామ[2]కృష్ణుని చాటుధార
క.

చిన్నన్న ద్విపద కెఱుఁగును
పన్నుగ పెదతిరుమలయ్య పదముల కెఱుఁగున్
మిన్నందిమ్రోసె నరసిం
గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్.

48
శ్రీనాథుని కాశీఖండము (4-106)
గీ.

అనిన విని సోమయాజి కోపాగ్రహమునఁ
దత్తిరింపుచు వడి సోమిదమ్మఁ బలికె

నవునె సత్పుత్రజనయిత్రి యవునె సాధ్వి
యవునె సూనృతభాషిణి యవునె భార్య!

49
ఉభయముకు
ఈవని పెద్దిరాజు చాటువులు
క.

ఇమ్మహిలో మహనీయగు
ణమ్ముల నీసాటి గలరె నానావిధదే
శమ్ముల శ్రీరాముని సీ
తమ్మా మాయమ్మ నిత్యహర్షము లిమ్మా!

50


క.

ఇమ్మా మదభీష్టంబులు
కొమ్మా మామ్రొక్కులెల్ల గురుమతి తా మా
యమ్మా రఘునందను సీ
తమ్మా సౌభాగ్యసిద్ధిదాయిని వమ్మా!

51


క.

ఇక్కలియుగశక్తులలో
లెక్కింపకు భట్ట శంకలేక ధరిత్రిన్
మిక్కిలి మల్లేశునియం
బక్కకు సరివేల్పుగలదె యవనీస్థలిలోన్.

52


క.

చొక్కపు శ్రీగిరినిలయుని
మక్కువ మదిలో నెఱింగి మనుజులఁ బ్రోవన్
దిక్కయి నిలచిన మా యం
బక్కకు సరిగలదె సకల భాగ్యస్ఫురణన్.

53
'అయి'
వణుకూరి గురవరాజు 'శమంతకమణిచరిత్ర'
ఉ.

కాయవచోమనః(స్థితులఁ) గల్పితదోషము లెల్లఁ బాయఁగా
నా యెదలోన నిత్యము సనాతనధర్మముఁ బూని నర్మిలిన్
బాయక కొల్తు రామనరపాల నిరంతరసౌఖ్యదాయి సీ
తాయి సమస్తశోభనవిధాయి మహాఫలసిద్ధిదాయిగన్.

54
రాచపూడి వెంకయ్య చాటుధార
క.

వ్యాయామజనితమాయో
పాయసమస్తాఘములు నివారణమగు దు
ష్కాయంబు పూతమగు గం
గాయినిఁ బొడగన్నఁ దానమాడిన మాత్రన్.

55
‘అరుసు' - అనగా మంత్రికర్థము. 56
అచ్చుకు
ఆంధ్రకవితాపితామహుని చాటుధార
క.

చేపట్టిన ధృవులవుదురు
కోపించిన రంభఁ గూడుకొందురు జగతిన్
స్థాపింపఁ బొడువఁజాలని
యాపందలు సాల్వకోనమరుసున కెనయే.

57
హల్లుకు
పలకలూరి గోపన్న చాటుధార
గీ.

గోలకొండ మలక గోవుల భక్షించు
కొండవీటి విప్రకులము నెల్ల
బాచమరుసు చేరి భక్షింపుచున్నాఁడు
మలక మేలొ బాచమరుసు మేలొ.

58
కోన-అరుసు = కోనరసు, బాచ-అరుసు = బాచరుసు అని ఉండవలసినందుకు మధ్య మకారము సంప్రాప్తమైనది.

'క్వచిదత్వం క్వచిచ్చాత్వం, క్వచిదిత్వం క్వచిత్పతా
క్వచిన్మత్వం యథాయోగ్య మన్యచ్చ వ్యవహారతః'

అని అథర్వణాచార్యుల వారి కారిక కలదు. కోనమరుసు, బాచమరుసు - సుష్ఠుప్రయోగములు. రామరాజు, సోమరాజు, రామరాయడు, కృష్ణరాయడు - ఈ మొదలగు పదములందు అత్వము, రామానాయఁడు, తిమ్మానాయడు, మల్లా
రెడ్డి, ఎల్లారెడ్డి - ఈ మొదలగు వాటియందు ఆత్వము. రామిరెడ్డి, సోమిసెట్టి - ఈ మొదలగు వాటియందు ఇత్వము. అయ్యపరాజు, బయ్యపరాజు, సూరపరాజు, నారపరాజు, - ఈ మొదలగు పదములందు పత్వము. కృష్ణమరాజు, కోనమరాజు, కృష్ణమాచార్యులు, కొండమాచార్యులు ఈ మొదలగువాటి యందు మత్వము. 'యథాయోగ్య మన్యచ్ఛ వ్యవహారతః' అనుట వలన, నరసుపండా, వెంకుపండా- ఈ మొదలగు వాటియందు ఉత్వము. రాజు, రావు, రెడ్డి, సెట్టి, జెట్టి, రాయడు, నాయడు, ప్రెగడ- ఈ మొదలగు పదములు కలిసినపుడు పైన చెప్పిన అత్వాదులు వచ్చును. 59

8. ప్రాదియతి

లక్షణము
"శ్లో॥

ప్ర పరా ప్రతి ప ర్యత్యధ్యభ్యవానూప సంసృప
ని వి నిద్దురుద ప్యాఙి త్యుపసర్గాస్తు వింశతిః

ప్ర, ప్రరా, ప్రతి, పరి, అతి, అధి, అభి, అవ, అను, ఉప, సమ్, సు, అప, ని, వి, నిర్, దుర్, ఉత్, అపి, అఙ్-ఇవి యిరువదియును ఉపసర్గలు. ప్రకారోపసర్గం బాదియగుటం జేసి ప్రాదు లనంబడును.
గీ.

ఆంధ్రమునకుఁ జొరని పరాజపులు మూఁడు
గాక తక్కిన యుపసర్గకముల తలల
స్వరము లతికిన వాని కవ్వలను నిలుచు
నచ్చులును హల్లులును బ్రాదియతు లనంగ

60


గీ.

అబ్జయోని రజోగుణప్రాప్తిఁ దనరు
పద్మనాభుండు సాత్త్వికప్రాప్తిఁ దనరు
రజతగిరిమందిరుఁడు తమఃప్రాప్తిఁ దనరు
ననఁగ నిబ్భంగి ప్రాదుల కలరు యతులు"

61

(అ. క. 3-332, 3)

అని అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణియందు చెప్పినారు. ఇందులో పరా, అఙ్, అపి- ఈ మూడు వేదమందేకాని లోకమందు లేవనుట. (అయితే) ఆ మూడింటిలో (పరా అను దానిని గూర్చి).
సూ.

అహ్నో౽దంతాత్. పరాగత మహః పరాహ్నః

అని కౌముది యందున్నది. [3][పరాహ్న పదమొకటి. (కాగా) పరాగతాః ఆపః అస్మాత్ పరాపః = శుష్కహ్రదము. ఈ రెండుపదములందును పరా అను ఉపసర్గము గలదు. ఎఱ్ఱాప్రెగడ హరివంశమందు.
సీ. పా.

అభిగుప్తమంత్రులు నర్థంబులందుఁ బ
రాఙ్ముఖు లార్య భావానుగతులు...]

(అని కలదు) కాని—ఆఙ్, అపి ఈ రెండు మాత్రము లేవు. 'ప్రాప్తి' పదమున (కొకటికి) మాత్రము ఉభయములకు లక్ష్యము వ్రాసి- ఇటువలె కడమవిన్ని చూచుకొమ్మని (అప్పకవి గా)రన్నారు. ప్రాదులు విస్తారము లున్నవి. అంతమాత్రముచేత నందఱికి నెటువలె తెలియును. కొన్ని పదములు తెలియ పరుచుతున్నాము—

ప్రేక్షణ
అపాయ
అపేత
ఉపేంద్ర
సమాస
వ్యాసంగ
వ్యాకుల
ఉపోద్ఘాత
ప్రాంత
సమాకీర్ణ
ప్రత్యు ప్త
అపాదృత
నిరాధార
అపాన
వీక్షణ
ఉపాయ
సమేత
సమంచిత
ప్రాస
వ్యాలోల
వ్యాపార
ప్రోద్భూత
ప్రత్యంత
సమస్త
ప్రత్యగ్ర
వ్యపగత
నిరపేక్ష
వ్యాన
నిరీక్షణ
ఉపాయన
ఉపేక్ష
ప్రాంచిత
వ్యాస
వ్యామోహ
ఉదార
అభ్యుదయ
పర్యంత
సమగ్ర
అన్వర్థ
అత్యుష్ణ
ఉదంచిత
ఉదాన
ప్రోక్షణ
ఉపేత
అపేక్ష
ఉదంచిత
వ్యాకీర
వ్యాయామ
ఉదాహరణ
ప్రత్యాలీఢ
ఉదంత
అత్యుగ్ర
దురంత
నిరాతంక
ప్రాణ
సమాన

ఈ మొదలైనవి ప్రాదులు మరియును–
     సమ్ = సమ్యక్, ఈరితుం - గంతుం శీలమస్య సమీరణః = గాలి.
     సమ్ ఈరయతి ఆమోదం (ఇతి చ) సమీరణః-మరువమరుపరిమలయుక్తభూజము.
     విశేషేణ ఈరయతీతి వీరః = శూరుడు.
     విశేషేణ వీరయతీతి వీరం = కుంకుమపూవు
     అభితః గాః ఈరతీతి ఆభీరః = గొల్లవాడు
     సమ్యక్ ఈరతి గచ్ఛతీతి సమీరః = గాలి
     సమ్ = సమీచీనాః, ఉద్రాః =జలచరవిశేషాః యస్మిన్ సః సముద్రః = (సంద్రము).
     ప్ర అస్యతే శత్రుష్వితి ప్రాసః ('ప్రాస' పదమందలి 'స' ఊష్మములలోని) ద్వితీయాక్షరము = బల్లెము.
     సం సంసక్తం అంతో యస్యా స్సా సమంతా, సమతాయా ఇమే సామంతాః
     సమితిః, సమిత్, సమీకం, సమాధూతః, సమదాయః అభ్యాగమః- ఈ ఆరు యుద్ధ పర్యాయములు.
     సమజ్యా, సభ, పర్యంకః, దురితం, ఉపాధిః, ప్రతీకః, ప్రతీక్ష్యః, ప్రతీతః, సమృద్ధిః, సమృద్ధః- ఈ మొదలైనవి ప్రాదులు.

64
ఉభయముకు లక్ష్యములు
విక్రమార్కచరిత్ర[4]
సీ.

ప్రమదాజనేక్షణప్రార్థితసౌందర్య
             యాచకసంతతప్రార్థనీయ
పృథివీసురవ్రజాభీష్టసంధాయక
             యిఢముఖ్యసైనికాభీష్టయాత్ర

పరమధర్మక్రియోపాయసంచితకీర్తి
             యరిదుర్గసాధనోపాయవేది
వివిధశాస్త్రాగమవీక్షణతాత్పర్య
             యిందిరాసత్కృపావీక్షణీయ
ప్రబలతరగుణా నిరంతరవైభవ
యష్టసిద్ధి బల నిరంతరాయ
సరగుచుండు నిమియ ప్రాదుల యతులన
విద్వదంబుజార విక్రమార్క.

65
రుక్మాంగదచరిత్రము (2–70)
క.

ఏ గృహపతిచే న
భ్యాగతుఁడు తిరస్కరింపబడుఁ, దన దురితం
బా గృహపతి కిడి చను న
భ్యాగతుఁడు తదీయసుకృతమంతయుఁ గొనుచున్.

66
హల్లులకు
శ్రీనాథుని నైషధము (3-58)
ఉ.

దానకలాకలాపసముదంచితసారవివేకసంపదన్
మానితయాచమానజనమానసవృత్త్యభిపూర్తిబుద్ధి యె
వ్యానికి లే దొకింతయును వాఁడొకరుండు భరంబు ధాత్రికిన్
గానలు గావు శైలములు గావు పయోధులు గావు భారముల్.

67
మనుచరిత్రము (2-68)
శా.

ప్రాంచద్భూషణబాహుమూలరుచితోఁ బాలిండ్లు పొంగార మై
యంచుల్ మ్రోవఁగ గౌఁగిలించి యధరం బాసింప హా శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణుఁ డోరమోమిడి తదీయాంసద్వయంబంటి పొ
మ్మంచున్ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్ ధీరచిత్తంబులన్.

68
వసుచరిత్రము (4-90)
శా.

మాయాశీలురు చంచలాత్ము లనుకంపాశూన్యు లాత్మైకకా
ర్యాయత్తుల్ సమయానుకూలహృదయవ్యాపారగోపాయనో

సాయజ్ఞుల్ మగవార లాపయి మహీపాలు ల్మహావైభవ
శ్రీయోగాంధులఁ జెప్పనేల మరి వారిన్ నమ్మఁగా వచ్చునే.

69
కృష్ణరాయల ఆముక్తమాల్యద (1-58)
మ. స్ర.

స్వనిలింపావాస దత్తాశన దతల మిథ
             స్తారతమ్యంటు లీరెం
డును దీనుల్ గొంచు నమ్మాడుగుల యడంగ
             న్దోచు నుద్యద్రతోన్మే
లన సిద్ధద్వంద్వ బృందాలయ బిలగత క
             ల్యాణ మంథాద్రులోనా
వనజాక్ష స్యందన ద్వంద్వము లిఖితనరా
             వాప్త దాంపత్య మొప్పున్.

70
చివర (పాదమున రెండవది) ప్రాదియతి. రెండవచరణ మందు రెండవది అనునాసికయతి. 71
అచ్చులకు
శ్రీనాథుని నైషధము (4-98)
క.

ఈరీతి నాతలోదరి
సారతరసుధారస ప్రసవ... రసా
సారసరసోక్తి సరణి మ
హారాజకుమారునకు నుపాయన మొసఁగెన్.

72
మనుచరిత్రము (1-78)
క.

ఆ మం దిడి యతఁ డేగిన
భూమీసురుఁ డరిగెఁ దుహినభూధరశృంగ
శ్యామలకోమలకానన
హేమాఢ్యదరీఝరీనిరీక్షాపేక్షన్.

73
రాఘవపాండవీయము (1-12)
సీ.

గంభీరవేదిలక్షణలక్షితంబునై
             తనరారు భద్రదంతావలములు
నారబ్ధసింధుగాంధారాట్టభవములై
             కొఱలు శ్రీవృక్షక ఘోటకములు
పదునాల్గు జాతుల త్రిదివకాంతల మీఱు
             పద్మినీజాతి సౌభాగ్యవతులు
కడునద్భుతములైన కనకరత్నాంశుక
             చందనాది సువస్తుసంపదలును
నఖిలదిగ్దేశభూపసమర్పితంబు
లగుచు నరణంబుగతిఁ దోన నరుగుదేఱఁ
దను వరించు జయశ్రీలఁ గొనుచు నతఁడు
పురికిఁ జనుసొంపు వాగగోచరతఁ బరఁగె.

74
సమర్పితము - ప్రాదియతి.[5]
ప్రాణపదము హల్లుకు
పోతరాజుగారి భాగవతము (అష్టమ-285)
క.

ప్రాణేచ్ఛ వచ్చి సొచ్చిన
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లన్
ప్రాణుల కిత్తురు సాధులు
ప్రాణంబులు నిముషభంగురము లని మగువా!

75
అచ్చుకు
అడిదము సూరకవి 'కవిజనరంజనము'
సీ.

అనుగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు
             మిలవేలుపులను గొల్వు మేమరకను
పతికి ముం దనుభవింపకు మే పదార్థంబు
             జవదాటకుము నిజేశ్వరుని మాట
మగఁడు గావించిన మన్నన కుబ్బకు
             మఱి కృశింపకు మవమానమునకు
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
             నాప్తబంధువులయ ట్లాదరింపు
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తి గొలుపు మెపుడు
దైవమన్నను గురువన్న ధర్మమన్న
ప్రాణనాథుండు సుమ్ము మాయమ్మకాన.

76
ఇటువలెనే తెలుసుకునేది. 77

9. చతుర్థీ విభక్తి విరామము

లక్షణము
గీ.

తనరు నచ్చు హల్లులకుఁ గై యను విభక్తి
తివిరి పదముపై నిడఁ జతుర్థీ విరామ
మంజలి యొనర్తు శశిమౌలికై మురారి
కై సమర్పింతు విరులనఁ గలుషధమన.

78
ఆంధ్రశబ్దచింతామణి యందలి
సూ.

కొఱకు కై చతుర్థ్యాస్తః

అను సూత్రము వలన చతుర్థికి 'కై' యను వర్ణము సిద్ధము. ఆ వర్ణము అచ్చుకు చెల్లునని కొందఱి మతము. హల్లుకు చెందునని కొందఱి మతము. రెండును గలవు. హల్లుకు సులభము. 79
అచ్చుకు
శ్రీనాథుని నైషధము (3-150)
ఉ.

కాంత మెఱుంగుఁజన్నులకుఁ గ్రమ్మఱి క్రమ్మఱి వచ్చి వచ్చి యం
గాంతరసన్నివేశములకై యట నేగియు నేగలేక భూ
కాంతుని దృష్టి దిగ్రృమము గైకొనఁబోలు బలెం దదీయప
ర్యంతమునం దలందిన కురంగమదంబను చిమ్మఁజీకటిన్.

80
చివర (పాదమున) ప్రాదియతి.
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-68)
క.

ఆలి వచః కార్పణ్యం
బా లేమల చెవులుసోక దధమాన్వయ జీ
ర్ణాలావణ్యుల పిల్పున
కై లాభము దెల్పిరేని యవి శ్రీలగుటన్.

81
'ఏని' పదముకు 'యద్యర్థమే' కాని, ఇక్కడ 'అప్యర్థము' చెప్పవలెను.82
మనుచరిత్రము (3-132)

కావున వారలఁ జూడం
గా వేగమె చనఁగవలయుఁ గమలదలాక్షీ
నీ వెఱుఁగని ధర్మాధ
ర్మావస్థలుఁ గలవె దీనికై యడలకుమీ.

83
తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము (అయో.94)
క.

కైకా నీపూనిన పని
కై కాకై కందినట్టి యనుఁగుంగొడు కి
ట్లై కానల కేగెడు
నే కడ నీవంటి తులువ లేరీ పుడమిన్.

84
శాంతిపర్వము (2-28)
గీ.

అరణి నగ్ని బొడముకరణి దేవకియందు
విప్రయజ్ఞకర్మవేదగుప్తి
కై జనించె నెవ్వఁ డవ్వసుదేవనం
దను భజింతు నేకతానిరూఢి.

85
(హల్లుకు)
బ్రహ్మోత్తరఖండము
ఉ.

అంతయు నాత్మలో నరసి యల్లన నవ్వుచు నా నృపాలకుం
డింతికి సర్వముం దెలిపి యెల్లరకుం గతజన్మవాసనా
క్రాంతిని బాపపుణ్యముల కై వశమౌ మది నట్టుగాన నే
కాంతశివార్చనానిరతి గైకొనుమంచు వచించె నేర్పడన్.

86
జైమినీభారతము (2–51)
ఉ.

నావుడు వాయునందనుఁడు నందన! పొమ్ము చమూవధూటి నీ
కై వశమైన లెస్స యటుగాక నినుం దల మీఱెనేని దౌ
దౌవున నిల్చి మద్ఘనగదాపటువిక్రమతాడనంబులం
జేవ యడంతు నెందు గురుశిక్షఁ గదా నుతిగాంతు రంగనల్.

87

10. పంచమీ విభక్తి విరామము

లక్షణము
కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-228)
గీ.

తత్సమంబు సేయు తఱిని పంచమి నన్న
నంటె ననువిభక్తు లదుకు సంధి
మెలఁగుఁ గృతులఁ బంచమీ విభక్తి విరామ
మనఁగ నచ్చునకును హల్లునకును.

88
లక్ష్యములు
ఉభయముకు
చమత్కారరామాయణము
క.

నిన్నుఁ జెఱఁగొన్న హైహయు
కన్నను దోర్వీర్యమెక్కుఁడగు భార్గవు లీ
ల న్నిర్జించిన రాముని
కన్నను శూరుండు ముజ్జగంబులఁ గలఁడే.

89
(హల్లుకు)
ఆదిపర్వము (4-224)
చ.

వితతమఖప్రయోగవిధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుతసుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ
క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్పతి
క్రతువున యాజకోత్తములకన్నఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్.

90
అరణ్యపర్వము (7-488)
చ.

విను మగుడంగ నాఁడు పృథివీపతిఁజూచి ధరిత్రికంటె వే
గన యగుదాని నాకసముకంటెఁ గడుం బొడవైనదాని గా
డ్పునకును నెక్కుడై జపము పొంపిరివోయెడుదానిఁ బూరికం
టెను దఱచైనదానిని ఘటింపఁగఁ జెప్పుము నాకు నావుడున్.

91

11. నిత్యయతి

లక్షణము
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-126)
క.

విదితముగ నేని యనియెడు
పద మన్యపదంబుతోడఁ బద్యంబులలో
నదుకునెడ నిరుదెఱంగులఁ
బొడవున్ నిత్యయతి యనంగ భుజగవిభూషా!

92
లక్ష్యములు
ఉభయముకు
శేషధర్మములు
క.

 మెట్టఁడు నారకమార్గం
బెట్టి మహాక్రూరకర్ముఁ డేనియుఁ దుది ని
ట్టట్టనక నెమ్మనంబున
నెట్టన హరిఁ దలఁప గలిగెనేని మహాత్మా.

93
మొదటి 'ఏని'కి అవ్యర్థము. 94
అచ్చుకు
ఆదిపర్వము (6-48)
గీ.

రాజవరుఁడైన పార్థుతో రాజుగాని
యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని
నెల్లవారలు జూడఁగ నీక్షణంబ
రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి.

95
అందే (7–142)
మత్త.

(మానితంబగు నాతపోమహిమం ద్రిలోకపరాభవం
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్కప్రతిజ్ఞ మున్)
దీని నెట్టులఁ గ్రమ్మఱింతు మదీయభాషిత మెన్నడు
స్నేని మోఘముగాదు దిగ్ధరణీరవీందు లెఱుంగగాన్.

96
శ్రీనాథుని కాశీఖండము (4-249)
గీ.

ఎట్టి యపరాధ మొనరించెనేని తల్లి
కొడుకు శపియింప దిబ్భంగిఁ గ్రూరబుద్ధి
(నతివ సత్యంబు చెప్పు మెవ్వతెవు వీవు
నావుడును శాపభీతి నన్నలిననేత్ర).

97
భాస్కరుని రామాయణము (అయో-887)
శా.

వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్నాథుఁడుం ద్రుంగు ధా
త్రీనాథుండన నెంతవాఁడఁట విచారింపంగ నీ కెంత నే
ర్పేనింబోవు శిరంబు వ్రక్కలయి దప్పెం దప్పె నీ కృత్య మ
జ్ఞానంబుం గడు నోడిచెప్పితివి పశ్చాత్తాపతప్తుండవై.

98

12. దేశ్యనిత్యసమాసయతి

లక్షణము
కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (8-191)
క.

రూపుఁ బెంపఱఁ బెల్లఱ
నే పఱచుట క్రిక్కిఱియుట నిలఁ గ్రచ్చఱయున్
జూపఱి యుక్కఱి మొదలుగ
క్ష్మాపతి దేశీయ నిత్య సమసన పదముల్.

99
కొందఱు దీని దేశ్యాఖండవడి యందురు.' (అని వ్రాసినారు ఇది) స్వతస్సిద్ధమైన అఖండవడి నంగీకరించని వారి మతము. 100
అనంతుని ఛందము (1-100)
గీ.

అఱ యనంగను బోవుట కర్థమైన
సంధి నిత్యసమాసోక్తి జరుగు రెంట
నసురవీరుల నెల్ల నుక్క ఱవధించె
భానుకులుఁడు రావణుని నేపఱచెననఁగ.

101
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-128)
క.

అక్కఱ తెమ్మెఱ రూపఱఁ
గ్రక్కదలగ నోలమాస క్రచ్చఱ యన నీ
పెక్కుపదము లిరుదెఱఁగుల
నిక్కముగ నఖండవడి గణించిరి సుకవుల్.

102
అథర్వణఛందము
గీ.

దేశ్యతెనుఁగు నందుఁ దెలియ నొక్కొకచోట
హల్లులోన నచ్చు నడఁగియుండు
నట్టిచోట రెండు నమరు వళ్లకుఁ జెప్ప
నాదిసుకవివరుల యనుమతమున.

103

184

లక్ష్యములు
'ఉక్కఱ' -హల్లుకు
విరాటపర్వము (5-143)
చ.

చిఱునగ వొప్ప గాండివముఁ జెచ్చెర సజ్యముఁజేసి సేన లు
క్కఱ రభసంబుమై నడువఁ గవ్వడి ద్రౌణియు వీడఁటోక య
త్తఱిఁ దఱుమంగ నస్త్రములు దందడిఁ దార్కొని మండుచుండె చి
చ్చఱ పిడుగు ల్వడిం దొఱఁగుచొప్పున నంబరవీథి నుగ్రమై.

104
అచ్చుకు
అరణ్యపర్వము (6-345)
క.

ఎఱకలుగల కులశైలము
తెఱఁగున మై రయము మెఱయు దివికి నెగసి బి
ట్టుఱము జలధరము క్రియ ను
క్కఱఁ దద్వనమెల్ల నద్రువ నార్చుచుఁ గడిమిన్.

105
'క్రచ్చఱ' - హల్లుకు
నందితిమ్మకవి వాణీవిలాసము
క.

తెఱవా తరువాతను గ్ర
చ్చఱ నీ నాయకుఁడు సొమ్మొసంగు నెటంటే
మఱువక మినుకులఁ గాంచిన
తెఱఁగెల్ల నటంచు తేటతెల్లముగాఁగన్.

106
అచ్చుకు
ఉద్యోగపర్వము (1-176)
చ.

తఱియగు నంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా
కఱపిన యట్లు సేయుము తగం జని యాతనిఁ గాంచి నన్ను నె
త్తెఱఁగున నైనఁ బొందఁగ మదిం గల దేనియు నింత యేల క్ర
చ్చఱ ముని వర్గవాహనుఁడ వై చను దెమ్మను మంతఁ దీరెడున్.

107
'అక్కఱ' -హల్లుకు (క్రచ్చఱ-అచ్చుకు)
అరణ్యపర్వము (7–367)
చ.

ఎఱిఁగితి నిన్ను నేను విబుధేంద్రుఁడ వీవు జగత్త్రయంబు క్ర
చ్చఱ భవదీయరక్షణము నంద వెలుంగుచు నుండె నట్టి ని
న్నుఱవుగ నేను వేడుకొన నొప్పునుగాక మొఱంగి నిన్ను న
క్కఱపడి నీవు వేడుటిది కర్జమె నిర్జితదైత్య చెప్పుమా!

108
అచ్చుకు
పారిజాతాపహరణము (1-49)

(ప్రామినుకులదొంగఁ బాతాలకుహరంబుఁ
             జొరఁబాఱి చీఱిన చోఱ వీవ
తరిగొండ వెన్నుపైఁ దాల్చి వేల్పుల గూటి
             చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ
నీటిలో మునిఁగిన నేలచేడియఁ గొమ్ము
             కొన నుబ్బ నెత్తిన ఘోణి వీవ)
మునిమాపు బలుగంబమునఁ బుట్టి బంటు న
             క్కఱను బ్రోచి నృసింహంబ వీవ...

109
కొందఱు విశ్రమభంగ మనుకొని ('అక్కఱను' అను దానిని) 'నెయ్యమున' అని దిద్దినారు. (వారు) స్ఫూర్తిగా విశ్రమములు తెలియనివారు 110
'ఓలమాస' - హల్లుకు
అనుశాసనికపర్వము (1-68)

అతిథి నినుగోరె నేనియు
మతి కింకిరి పడక నోల మాసగొనక నీ
వతనికిఁ బ్రియంబు సలుపుము
సతికిం బతి పనుపు సేయఁ జను నెల్లవియున్.

111
అచ్చుకు
శ్రీనాథుని నైషధము (4-97)
గీ.

(అని విచారించు చుండె నయ్యవనినాథుఁ
డంతకయమున్న నలునిగా నతని నెఱిఁగి)
ఎదురుగద్దియ డిగ్గి పృథ్వీశతనయ
యవనికాంతరమున నోలమాసగొనియె.

112
ఆంధ్రశేషమందు
"గీ.

ఆహవోన్ముఖతకు నోలమాసగొనక
పిఱువిదియ కీడఁబోకన పేళ్లు దనరు".

113
అని యుద్ధమందు విఱుగుటకు చెప్పినారు. (పై శ్రీనాథుని పద్యమున) సిగ్గుచేత మాటుకు వెళ్లుట స్పష్టమైనది. 114
(ఇక) రంగరాట్ఛందమునందు
క.

దొర దొరయనఁ బరగెడుఁ గ్ర
చ్చఱ విజయానంద [రంగ] హంవీరునియ
బ్బురపునగరివాకిటఁ గ్రి
క్కిఱిసి కవుల్ గాచినా రహీనప్రౌఢిన్.

115
(అని ఉన్నది 'క్రచ్చఱ' 'క్రిక్కిఱిసి' అనువాటి అచ్చుకు లక్ష్యమిది) అయితే ఈ పద్యమందు 'దొర' 'అబ్బురము' రేఫములు. 'కచ్చఱ' 'క్రిక్కిఱియుట' ఱకారములు కవీశ్వరునిది పొరపాటు. 116
'క్రక్కదలు' - హల్లుకు
శల్యపర్వము (1-102)
సీ. గీ.

(చారుభీషణరేఖల భూరిమదభ
రాభిరామయానంబుల వాహనోచి
తోగ్రకల్పనాభంగుల నుల్లసిల్లఁ)
గరులు ధాత్రీతలంబు గ్రక్కదల నడిచె.

117
పెద్దిరాజు కావ్యాలంకారంబున తెమ్మెఱ, ఆఱడి, వీఱడి - దేశ్యనిత్యసమాసయతులందు వ్రాసినారు. మరియు కొన్ని పదములు గలవు. 118
ఉన్నది
శ్రీనాథుని కాశీఖండము (2-71)
గీ.

అమ్మ కుశలంబె, సాధ్వి యనామయంబె,
దేవి భద్రంబె లెస్సలా పూవుబోడి
సార పరమ పతివ్రతాచార వైభ
వాధిరాజ్యంబు జరుగుచున్నదియె తరుణి!

119
శల్యపర్వము (1-383)
క.

అది కొంతఁ బుడమిఁబడు ను
న్నది పాఱినఁ గని యదల్చి యపనీశుఁడు బె
ట్టిదముగ నెలుంగు సూపెను
మదమారగ నబ్బలంబు మగుడు విధమునన్.

120
కన్నది
విరాటపర్వము (2-99)
క.

అది లాతివిల్లె నిను దమ
హృదయంబున నెల్లవారు నెఱుఁగరె యే జె
ప్పుడు నీదు పెంపును గ
న్నది మొదలుగ నెల్లవారి కయ్యయి భంగిన్.

121
అన్నవి, చిన్నవి - మొదలయినవి యిటువలెనే తెలుసుకునేది. 122
కన్నాకు
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (సుందర. 169)
గీ.

అనుచుఁ జేదోయి మోడ్చి యోయంటరాని
వేల్ప నీ సంగడీఁడగు విన్నుచూలి
కనుఁగు కొడుకగు కోతి కన్నాకునందు
నుడుకుసూపక చల్లనై యుండుమయ్య.

123
ఎప్పటి
భీష్మపర్వము (3-36)
సీ.

దనుజేంద్రు నిలుచుట గాని వారి సైన్యమె
             ప్పటి యట్ల పురికొని యనికిఁజొచ్చె.

124
అప్పటి, ఇప్పటి - ఇటువలెనే తెలుసుకొనేది.125
ఆంధ్రభాషాభూషణమందు
క.

అమి లేమికి నిమి కల్మికి
నమరంగాఁ దనము చందమగుట నగుం గా
నమి వినమి తాల్మికూరిమి
తమ మంచితనంబు లోభితనమనఁ జనుటన్. (166)

126
అని యున్నదిగా, కొనమి, అనమి, వినమి - ఈ మొదలైనవిన్ని చెలిమి, కలిమి, బలిమి, ఓరిమి, కూరిమి, తాలిమి - ఈ మొదలైనవిన్ని (పదములలోని) మధ్యమవర్ణ ముభయముకు చెల్లును. మరియును.-
గీ.

ఆఁడునదియును నధమకార్యములఁ దెల్పు
బొంకులాఁ డోగులాఁడును ఱంకులాఁడు
పెంట పెనపరి ముందరి తుంటరియును
కల్లరియు నన నెల్లెడఁ జెల్లుఁగాన (165).

127

అనియున్నది గాన, బొంకులాడు మొదలైనవి ఉదయముకు చెల్లును.

పేదఱికము, ఇల్లఱికము- ఈ మొదలైనవియు ఉభయముకు చెల్లును. 128
గీ.

ఈఁడు బాసఁ దెల్పు నీఁడు గుణముఁ దెల్పు
నీఁడు కులముఁ దెల్పు నెల్లయెడల
కన్నడీఁడు నాఁగ, కపటీఁడు నాఁగ సా
లీఁడునాఁగ వేఱులేక చనుట (163).

129
కొండీఁడు, దుండగీఁడు, సాలీఁడు మొదలైనవిన్ని ఉభయముకు చెల్లును. 130
ఆంధ్రశేషము

పదముపై 'నేది’ నిల్పఁగ నభావార్థమౌ
             'నొండె' వికల్పార్థ మొదవఁజేయు
ఏవకారార్థంబు నెసఁగించు 'న'త్వంబు
             'కు'త్వంబు మర్యాదకును లభించు
అందించు వర్తమానార్థంబు 'చు'త్వంబు
             విధ్యర్థమున 'కది' వెట్టవలయు
ఉపమింపుచో 'వోని' యనఁగూర్పఁగాఁ జెల్లు
             'అర్యము' లస్తినా స్త్యర్థదములు
జడపదంబులమీఁద 'మై' సంఘటింప
నది తృతీయావిభక్తియై యలరుచుండు
ఒప్పుకరణార్థమును కోలుట యనంగ
'ఓ' యిడిన సంశయార్థంబు నొదువఁజేయు.

131

అర్థము :- పొలుపు-ఏది = పొలుపేది. సొగసేది. రాముఁడొండె, లక్ష్మణుఁడొండె, మహేశ! నీవ దిక్కు. నీవే అని అర్థము. మర్యాద అనగా హద్దు. అంతకు లోనవచ్చి. ఇంతకు లోనవెళ్ళి. చేయుచుండె, వినుచుండె. రిపుల సాధించునది. 'మంటయు వోని శాత్రవసమాజము'. నేర్పరి, లావరి, అరి (చేరినది). నేర్పుగలవాడు, బలము (లావు) గలవాడు (అని అర్థము). నేరమి, ప్రోవమి, అమి (చేరినది, నేరకపోవుట, ప్రోవకపోవుట అని అర్థము) భక్తిమై. శాంతిమై. కరణమనగా నిచ్చట తృతీయార్థము. రాజ్యమియ్యనికోలు - ఇవ్వని హేతువు, ఇచ్చుట, వచ్చుట. ఇచ్చిన హేతువు, వచ్చిన హేతువు, ఔనో, కాదో, ఇటువలెనే తెలుసుకునేది.132

వీటిలో పొలుపేది, లావరి, నేరమి, ఇచ్చుట - దేశ్యనిత్యసమాసయతులు. ఆంధ్రభాషాభూషణమందు అరి అను పదము అధమకార్య మవుటన్నారు. ఇచ్చట అస్త్యర్థమన్నారు. రెండును సాధులే.133

సూ. 'ఏదంత తాచ నామ్నా మన్యతరస్యా మియాంతానామ్' అని వాగనుశాసనసూత్ర మున్నది గాన, మల్లియ, ఒల్లియ, పెట్టియ, మట్టియ, మిద్దియ, గద్దియ, లంజియ, తేనియ, నూనియ, గడియ - ఈ మొదలైనవిన్ని,
'మానార్థాన్నిత్య మేకత్వ, మెడుస్యా త్పరిమాణకే' అని అథర్వణాచార్యుల వారి కారిక గావున మానెడు, జానెడు, పుట్టెడు, బుట్టెడు, మూరెడు, బారెడు, వీసెడు, దోసెడు - ఈ మొదలైనవిన్ని ఉభయముకు చెల్లును. 134

13. శకంధ్యాదియతి (పరరూపయతి)

లక్షణము
కాకునూరి అప్పకవి ఆంధ్రశబ్దచింతామణి (2-226) యందు
"సూ.

అచోన్త్యాదిటి
అన్త్యాచ్ ప్రభృతి శబ్దష్టి స్వజ్ఞ స్స్యాత్
శకంధ్వాదిషు టేః పరరూపం వాచ్యమ్.


శ్లో.

శకంధు రథ కర్కంధూః కుద్దాలో లక్త పర్క టీ
లాంగలీషా హలీషా చ మనీషా చ పతంజలిః
కుత్కీలోష్ణీష మంజీర మస్తిష్క కులటాదయః
తథా వృకంధు సీమన్తౌ శకంధ్వాది గణే స్మృతాః.

శకానాం దేశానాం అధుః శకంధుః. శకంధువనగా శకదేశమందున్న బావి. కర్కస్యాంధూః కర్కంధూః 'కర్కంధూ ర్బదరీ కోటీ' త్యమరః. కర్కంధు వనఁగా రేఁగుచెట్లు. కం=శిరః ఉష్ణవీర్యత్వా దుద్ధాలయతీతి కుద్ధాలః; కుం= భూమి ముద్దాలయతీతివా. దలవిశరణే. ఉదిత్యుపసర్గః 'కుద్దాలో బహువారకః' ఇత్యమరః. కుద్దాల మనఁగా విరిగిచెట్టు. పాదమలతీత్యలక్తః. అలభూషణే, 'యావోలక్తోద్రుమామయ' ఇత్యమరః. అలక్త మనఁగా లత్తుకపేరు. పర్చ్యతే = పరస్పరం స్పృజ్యత ఇతిపర్కటీ. పృచి సంపర్కౌ. 'ప్లక్షో జటి పర్కటీస్యా' దిత్యమరః. పర్కటి యఁగా జువిచెట్టు. లాంగలస్య ఈషా లాంగలీషా. 'ఈషాలాంగల దండస్స్యాత్' ఇత్యమరః. హలస్యేషా హలీషా. ఈ రెండు ఏడికోల పేళ్ళు. మనస ఈషా లాంగలవత్సంబద్ధా మనీషా. 'బుద్ధి ర్మనీషా ధిషణా' ఇత్యమరః. మనీష యనఁగా బుద్ధిపేరు. పతన్-ఆంజలిః = పతంజలిః. పతంజలి యనఁగా వ్యాకరణమునకు మహాభాష్యము చేసిన నాగముపేరు. కోర్భూమే రుత్కీలః కుత్కీలః. 'అగకుత్కీలజీమూత సానుమన్నగ పర్వతాః' ఇత్యమరః. కుత్కీల మనఁగా గట్టుపేరు. ఉష్ణస్య ఈషః ఉష్ణీషః. 'ఉష్ణషశ్శిరోవేష్ట కిరీటయో' రితి నానార్థే. ఉష్ణీష మనఁగా దలపాగపేరు. మంజు = రుచ్యం ఈరయతీతి మంజీర.
ఈరస్వనే. 'మంజీరో నూపురోస్త్రియా' మిత్యమరః. మంజీర మనఁగాఁ గాలిగజ్జె. మస్తం - శిరః ఇష్యతే - ప్రాప్నోతీతి మస్తిష్కః. ఇషగతౌ. 'తిలకంక్లోమ మస్తిష్క' మిత్యమరః. మస్కిష్క మనఁగాఁ దలమెదడు పేరు. విటం = విటకులం అటతీతి కులటా. అట గతౌ, 'అసతీ కులటేత్వరీ' త్యమరః కులట యనఁగ లంజెపేరు. ఆది శబ్దముచేత వేదండ, సారంగ శబ్దములు మొదలైనవి మరికొన్ని గలవు. వేదః - సామవేదః, అండః. జననకారణం యస్య సః వేదండః. సామోద్భవ ఇతి ప్రసిద్ధిః 'సామజ స్సింధురోపి సః' ఇత్యమరః. వేదండ మనఁగా నేనుఁగుపేరు. సారాణి అంగాని యస్య సః సారంగః 'సారంగ శ్చాతకే భృంగే కురంగేచ మతంగజే'త్యమరః. సారంగ మనఁగాఁ జాతకాదులపేరు. వృక్షస్య అంధుః వృకంధుః వృకంధువనఁగా వృకదేశమందున్న బావి. సీమ్నోంతస్సీమంతః. సీమంతమనఁగా బాపటపేరు. ఇవి శకంధు శబ్దములు మొదలుగాఁగలవి గావున, శకంధ్వాదిగణం బనఁబడును. 135
క.

విరతికి వ్యాకరణమునను
వరరుచిచేఁ జెప్పబడిన వాక్యము వల్లన్
బరరూపము నిత్యంబై
పరగు శకంధ్వాదులకు నుభయము చెల్లున్. (3-126)

136

అని చెప్పినారు.

(అయితే) వీటిలో శకంధుః, కర్కంధుః, కులటా, సీమంతః, మనీషా, లాంగలీషా, పతంజలిః, సారంగః (షక్షిః), మార్తండః ఈ పది సిద్ధాంతకౌముది సంధిపంచకమందు వ్రాసినారు. వ్యాఖ్యాకారులు, 'కర్కంధుః కర్కాకో రాజ్ఞాం అంధుః కర్కంధుః'- కర్కులను రాజులయొక్క నుయ్యి- అని వ్రాసినారు. కానీ ఱేగుచెట్టు కర్థము వ్రాయలేదు. అప్పకవిగారు మిగిలిన పదము లన్నింటికి నర్థము వ్రాసి 'కర్కస్య' అనగా నేమిటో, 'అంధూః' అనగా నేమిటో, అర్థము వ్రాయలేదు. రెండు పదములు కలిసి ఱేగుచెట్టు కర్థము వ్రాసినారు. శబ్దశాస్త్రమందు 'శకంధుః, కర్కంధుః' అని ఉకారాంతమనిన్ని, స్త్రీలింగ పుంలింగములు రెండు గలవని వ్యాఖ్యాకారులందఱు వ్రాసినారు గాని, అచ్చున్నటుల సమాస మొకరును వ్రాయలేదు. భానోజీ దీక్షితులుగారు రచించిన 'అమర వ్యాఖ్యాసుధ' యందు- 'కర్కం దధాతీతి కర్కంధూః. కర్కః కోశః
అంధూ దృగ్భూ ఇతిసాధుః' అని వ్రాసినారు. కర్కమనగా పొత్తికాయ కర్థమన్నారు లింగాభట్టుగారు- 'కర్కాణి లోహితాని పర్ణాని ఫలాని దధత్త ఇతి కర్కంధూః, డుధాఞ్ ధారణ పోషణయోః' అని వ్రాసినారు. 'కర్మ' శబ్దమునకు 'శబ్దార్థతరు’ వందు- 'కర్కపి, అదంతఃపుంసి. అమరః శ్వేతాశ్వే. నానార్థ రత్నమాల పుంసి. దర్పణే, 'ఘటీభేదే’ = చిన్నకుండ 'అగ్నౌ విశ్వప్రకాశః. పుంసి, కర్కటకే. లింగాభట్టః క్లీబే లోహితే' అని యున్నది.137
ఉయ్యల మొదలైన పదములను లాక్షణికులందఱు నేకపదములని వ్రాసితే, లేని పదన్వయవిభాగము చేసి, స్వకపోలశాస్త్రము కల్పించి, ఇంచుకంతయు సందర్భములేని అర్థము వ్రాసి, ముద్దరాజు రామన్నగారిని ఏకపద మన్నారని (అప్పకవి గారు) ఆక్షేపించినారు. కర్కంధూ శబ్దముకు పదద్వయవిభాగము చెయ్యడము మాత్రమే కాని, శబ్దశాస్త్రవ్యాఖ్యాకారులను, అమరవ్యాఖ్యాకారులను చూడకనో, ఏమి హేతువునో, ఆక్షేపింపలేదు. సంస్కతాంధ్రములందు స్వతంత్రులు గావున వారిసిద్ధాంత మస్మదాదుల కగోచరము.138
'వృక ఇవ అంధుః =వృకంధుః'- అని శాబ్దిక వ్యుత్పత్తి గానీ, 'వృకస్య అంధుః'-అని గాదు. 'కర్కంధూ' శబ్దమువలె గాకుండగా నచ్చుకలదు. అల్కర్క పర్కటీ శబ్దములు అప్పకవిగారు వ్రాసిన సమాసమున నచ్చులు కనిపించవు. 'వాఖ్యాసుధ' యందు- 'మంజీర' శబ్దము 'శకంధు' (మొదలగు వానిలోని) పదమని వ్రాయలేదు. ‘ఉష్ణస్య ఈషః = ఉష్ణీషః' అని వ్రాసినారు. 'వ్యాఖ్యాసుధ' యందు 'ఉష్ణం ఈషతే, హినస్తి, ఈష గత్యాదౌ, ఇగుపధేతికః, శకంధ్వాదిః 'ఉష్ణోషంతు శిరోవేష్టే కిరీటే లక్షణాంతర. ఇతి విశ్వః' అనిఉన్నది.139
అప్పకవిగారు పదునెనిమిది పదములు వ్రాసినారు. కర్కంధూ పదము మాత్రము బొత్తిగా కుదురలేదు. (ఇక) అమరవ్యాఖ్యావాదులందు పండితులు నిర్ణయించినవి ముప్పదిమూడు పదములు కనుపించినవి వ్రాసుతున్నాము.


శ్లో.

కుబ్జకుంభౌ కూర్మకుతా నశ్మంతం దుదుభిస్తథా
ఇందిందిర స్సుందరీ చ గంధర వృకణావపి
వింధ్యా సారస నాగస్తి ర్థాత్యుహోవరటా తథా
మకరందః పుష్పవంతా శిఖండ రథినామపి

శుద్ధోదనః కలంకశ్చ మార్తండో అర్క ఏవ చ
నీలంగుశ్ఛాపి కుద్దాల పర్కటః కంకణం తథా
చిరస్య నరకం చాపి మృతండః కంకు రేవ చ
గంధర్వాలర్కశబ్దే చ శకం ధ్వాధి గణే స్మృతాః.

140
కౌ ఉబ్జతి ఉబ్జ అర్జవే, యద్వా, కు ఈషదుబ్జ ఆర్జవ మస్యకుబ్జః - పొట్టివాడు. కుంభువం, ఉంభతి, ఉంభ పూరణే, కర్మణ్యణ్, కుంభః-కడవ. కుం శరీరం ఉనత్తి, ఉందీక్లేదనే. బాహులకాత్తః, కుంతః = బల్లెము. కం జలం ఉర్వతీతి కూర్మః బాహులకాన్మః, ఉర్వీ హింసాయామ్ = తాబేలు అశ్మనోత్యంతోత్రేతి అశ్మంతః = పొయ్యి, దుందు శబ్దేన ఉభిరత్రేతి దుందుఖిః = రాజద్వారమందుండెడు వాద్యవిశేషము ఇందతి ఇందిరయా ఇందిందిరః ఇది పరమైశ్వర్వే = తుమ్మెద. సుఆతీవ ఉందతి, ఉంద క్లేదనే. సుపూర్వః బాహులకాదరః గౌరాదిః సుందరీ = చక్కనిమగువ. గంధం అర్వతే, ఆర్వగతౌ, గంధర్వః = దేవయోనివిశేషము. వృకేన కంఠేన అణతి వృకణః = కొక్కెర. వి ఇంధ్యతే. ఇకి ఇంధనదీప్తౌ, అంతర్భావితవ్యార్ధః వింధ్యా అంఘ్నెదిః = పర్వతవిశేషము. సారం బలం అస్యతేనే నేతి సారసనా, అసగతిదీప్యాదానేషు. కరణే ల్యుట్ = నడుముకు బలము కొఱకు కట్టుకొనెడు, కాశకోక మొదలైనవి. అగం ఆస్యతీతి అగస్తిః అగపూర్వ...........దోస్తి ప్రత్యయః = మహర్షి. దిత్యౌహేయం, తస్యేద మిత్యణ్. దేవీకాశంశనే త్యాత్వేవాహ ఊఠ్, ధాత్యూహః = పక్షివిశేషము. వరం అటనం అస్యాఇతి, వర మటతీతివా వరటా = స్త్రీహంస మకరసి అందతి అది బంధనే, కర్మణ్యణ్, మకరందః = పూదేనె పుష్పస్య అవతఇతి పుష్పవంతౌ, పుష్పంప్రకాశః, వికాసశ్చ. అకారాంత తకారాంతౌ రవిచంద్రులు. శిఖయా అత్యుతే, అనుగత్యాదిషు ఇమంతాడ్ఢః 'శిఖండో బర్హచూడయో' రితి హేమచంద్రః. శిఖాయా అండఇవ. ఇనే ప్రతికృతా వితి స్వార్థేశన్. 'శిఖండౌవాశిఖా బర్హే' ఇతి తాలవ్యాదౌ రభసః = నెమలి పించము జుట్టున్ను. రథస్యఇనః రథినః = రథికుడు శుద్ధం న్యాయపరిశుద్ధం ఓదనం భుఙ్క్తే శుద్దోదనః = పరిశుద్ధాన్నము భుజించువాడు అంక్యతేనేనేతిఅంక, కలశ్పాసావంకశ్చ కలంకః. కలకిల క్షేపే = అంకాపవాదములు, మృతే అండే భవః మార్తండః = క్రోధ సూర్యులు. అలం ఆర్క్యతే, అర్చ్యతే. లర్కస్తవనే అర్చపూజాయాం అలర్కః = వెఱ్ఱికుక్క. నీలాని అంగాని యస్య సః నీలంగు = తుమ్మెద. కుం భూమిం ఉద్దాలయతీతి కుద్దాలః = గుద్దలి మొదలయినవి.
పర్పేణ పీఠేన అటతీతి పర్పటః = కుంటివాడు. కంకె గతౌ అణతి. అణశబ్దే. అచ్, కంకణమ్ = హస్తభూషణము. చిరం అస్యతి, ఆసు క్షేపణే ణ్యత్ సంజ్ఞాపూర్వకృతత్వాత్ వృద్ధ్యభావః చిరస్య-తడవు అవ్యయపదము. నరత్వేనోత్కృష్ణ జన్మవతాం నరాణాం నిరతిశయ మకం దుఃఖం యత్రతత్ నరకమ్ = శునకసూకరాది నీచయోని. కం అంగతి, అగి గతౌ ణ్యంతో వా మృగవ్యాదిత్వాత్ కంగః ప్రియాణి అంగాని యస్యసః ప్రియంగుః = కొఱ్ఱ యనెడు ధాన్యవిశేషము. గంధశ్చాసౌ అర్వశ్చ, గంధే అర్వోలోభో యస్యసః గంధర్వః = వట్రువతోక దొడ్డకడుపుగల మృగము, కోకిల, గుర్రమున్ను. అలతి భూషయతీతి అలః అలశ్చా వా వర్కశ్చ అలర్కః = తెల్లజిల్లేడు.141
ఈ ముప్పది మూడు 'శకంధ' పదములు నమర వ్యాఖ్యానాదులయందు చూచి వ్రాసినాము గాని, స్వకపోలకల్పిత మొకటియు లేదు. ప్రియంగు పదమందున నున్న యకారమందు స్వరము లేకపోయినను, అయహలు (చెల్లును) ఏక (పద) మే అయినా, శకంధ్వాదియతియని తెలియవలెగాని, సరసయతి యనరాదు గాన శకంధ్వాదులందు వ్రాసినాము.142
ఉభయముకు లక్ష్యములు
సీసమాలిక.

అపుడు విప్రుండు శకంధు నీరము గ్రోల
             క్షత్రియవరుఁడు శకంధు నీర
మింపుగఁ ద్రావె మనీషియొకండు నిం
             దించెఁ గ్రోధంబు మనీషచేత
నెపుడు విప్రునకు హలీషనంటుటయు, హ
             లీషా పరులతోఁ జెలిమియుఁ గూడ
దెలమితో శిరము నుష్ణీషంబుఁ దాల్చె, ను
             ష్ణీషాధిపతులు పూజింపుచుండ
దెబ్బతో శిరము మస్తిష్కంబు చెదరి యిం
             తింతపైఁ బడెను మస్తిష్క మెల్లఁ
బెలుల పాదముల మంజీరంబు లలరె, మం
             జీరారవంబులు హెచ్చుమీఱె

నార్యజనములు కులటల నంటుదురె, కు
             లటలతోఁ జెల్మి ఖలజనుల కగు
మణిభూష లిడియె సీమంతంబు దీర్చి, సీ
             మంతిని యొకతె యొయ్యార మొదవ
నఖిలజనములు మ్రొక్కె పతంజలికిఁ బ
తంజలి యొనర్చె శబ్దశాస్త్రముకు భాష్య
మనుచుఁ బలికినఁ బరరూపయతులు సుమ్ము
కాశవరకీర్తి శ్రీకుక్కుటేశమూర్తి.

143
హల్లులకు స్పష్టమే, (ఇకమీద) అచ్చులకేర్పరించుతాము. 144
సీసమాలిక.

సుందరీమణి కుచకుంభంబుపై సుమ
             కుంతంబు వేసె ప్రద్యుమ్నుఁ డపుడు
కుబ్జుండు తనదుబాహులఁ బూనె రత్నకం
             కణయుగలంబు కలంకగతిని
కూర్మంబు పూనె సముద్రంబుఁ దరచుచో
             మందరధరముకు మహిమమీఱ
వింధ్యాద్రి దుర్గర్వ మింకఁగాఁజేసి య
             గస్తి ద్రాక్షారామ హరునిఁ గాంచె
యోధాగ్రవరుఁడు దుందుభి మొఱఁజేసె, సా
             రనను బూనె భటాగ్రవరుఁడు
హేమాబ్జమందు నిందిందిరంబున్న గం
             ధర్వుఁడు గనుగొని హర్షమొందె
నలి క్లిష్టమగు మకరందంబు, సూదుండు
             నగ్ని రగిల్చె నశ్మంతమందు
నబ్జాకరముల వరటలు చెలంగె వృ
             కణములు వేడ్క మత్స్యాలి మ్రింగె

నలికనయనున కలరునలర్కపూజ
యంతికమునుండఁ గూడ దలర్కమునక
టంచు వలికినఁ బరరూపయతులు సుమ్ము
హీరహీరాంగ కుక్కుటాధీశలింగ!

145
(కొన్నింటికి లక్ష్యములు)
'వేదండ' పదము, అచ్చుకు
ఆదిపర్వము (3-225)
మత్త.

దండితాహితవీర సూరినిధాన వీరవినోదకో
దండ పార్థపరాక్రమ ప్రియధామ దిక్పరిపూరితా
ఖండ పాండుయశోనిధీ పరగండభైరవ మత్తవే
దండతుండ విదారిఘోర తరాసి కాసి భుజార్గళా!

146
అప్పకవీయ మచ్చుపుస్తకమందు '...వే, దండమండల చండతుండ విదారణాసి భుజార్గలా' అని ఉన్నది పొరపాటు. 147
హల్లుకు
భీష్మపర్వము (1-234)
ఉ.

పాండునృపాలనందనులు పావని మున్నుగఁజేసి యట్ల లీ
మ్మండుఁ గడంకమై నడుచుచోటికిఁ జక్కటి రాఁగఁద్రోచి యెం
డొండఁ గడంగి సేన తన యుబ్బున కుబ్బఁగ నన్యసైన్య వే
దండముఖాంగముల్ వృణవితానముగాఁగొని నిర్వికారుఁడై.

148
'సారంగ' పదము, అచ్చుకు
చంద్రికాపరిణయము
ఉ.

జంగమ రోహణాద్రి సదృశంబులు తత్పురిఁగల్గు భద్రసా
రంగవరేణ్యము ల్పయికి హస్తము లించుక సాచి యవ్వి య
ద్గాంగఝరంబు పీల్చి మఱి తద్వమధుప్రకరంబు దప్పివో
యంగ నెసంగు రంగుగ నిజాఖ్యవహించిన చాతకాలికిన్.

149
హల్లుకు
ద్రోణపర్వము (1-17)
ఉ.

అంగద నాథు మ్రింగిన వృకావలి దన్వెసఁ జుట్టుకున్న స
ర్వాంగములుం జలింప బెగడందుచు దిక్కులు సూచుచున్న సా
రంగియ పోలె నుండెఁ గురురాజ భవత్సుతుసేన భీష్ము నా
జిం గబలించి పాండవులు జృంభితవిక్రమలీలఁ బొల్చుటన్.

150
ఇటువలెనె మిగిలినవి చూచుకునేది. 151
రంగరాట్భందంబునందు స్వాంత, వేదండ, మార్తండ శబ్దములు శకంధ్వాది యతులందు వ్రాసినారు. స్వాంత' నిత్యసమాసముగాని, శకంధ్వాదులలోనిది కాదు. కొందఱు లాక్షణికులు 'వేదండ' పదము నిత్యసమాసములందు వ్రాసినారు.[6] ఏమి పరిశీలించి వ్రాసినారో తెలియదు. 152

14. యుష్మదస్మచ్ఛబ్దయతి

లక్షణము
కాకునూరి అప్పకవి ఆంధ్రశబ్దచింతామణి (3-122) యందు
క.

క్షితి నస్మద్యుష్మత్పద
యతులనఁ గావ్యముల యుష్మదస్మచ్ఛబ్ద
ద్వితీయమునకుఁ బైఁబ్రాణము
లతికిన నుభయంబుఁ జెల్లు నభయవిహారా!

153
(అని వ్రాసి లక్ష్యములు)
సాంబోపాఖ్యానమునందు
క.

చతురానన నందన ది
వ్యతపోధనవర్య యుష్మదాగమనమునన్
గృతకృత్యుఁడ నైతిని నే
నతి పావనమయ్యే నస్మదన్వయ మెల్లన్.

154
ఆదిపర్వము (2-219) నందు
క.

ప్రస్తుత ఫణిసత్రభయ
త్రస్తాత్ములమైన యస్మదాదులకెల్లన్
స్వస్తియని వలుక నవసర
మాస్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా!

అధర్వణాచార్యుల విరాటపర్వమునందు
గీ.

ధర్మతనయ యుష్మదాజ్ఞానిగళ విని
బద్దమగుచుఁ జిక్కువడియెఁగాక
విజయ మత్తగజము విడివడ్డచో నడ్డ
పాటు గలదె విష్టపత్రయమున."

156
అని వ్రాసినారు. ఈ రెండు నఖండయతులు. అయితే అప్పకవిగా రఖండయతి నొప్పరు గాన, ఇచ్చట దిద్దశక్యముగాక 'యుష్మదస్మచ్ఛబ్ద'యతులని పేరుంచినారు. ఇంత మాత్రము చేత నఖండయతికి లోపము రానేరదని యుంచినాము. 157

15. ఘఞ్ యతి

లక్షణము
లక్షణసారము
గీ.

అచ్చు హల్లును తాపశబ్దాది వర్ణ
మునకుఁ జెప్పిన ఘఞ్ యతులనఁగఁ దనరు
నంబురుహగేహిని మధురాలాపయనఁగ
లక్ష్మి వాగ్జిత కోకిలాలాపయనఁగ.

158
లక్ష్యములు
ఉభయముకు
రంగరాట్ఛందము (3-233)
క.

శ్రీ పరిఢవిల్ల సత్యా
లాపవిలాసియగు కృష్ణు నటువలె రంగ

క్ష్మాపతి శ్రీకరసత్యా
లాపవిలాసమునఁ బ్రజల లాలనసేయున్.

159
ఈ రెండు పద్యములందు నుభయ లక్ష్యములున్నవి. హల్లుకు సులభము.160
అచ్చుకు
నాచన సోమన హరివిలాసము[7]
గీ.

అగ్రజన్మ నాతో మృషాలాప మిప్పు
డాడినందుకు ఫలము జిహ్వాంచలంబు
కత్తిరించెద నీ సూరకత్తిచేత
ననుచు దగ్గరి చేరిన నసురఁ జూచి.

161
పింగళి సూరన్న గిరిజాకల్యాణము
క.

కోపాటోపమ్మున ధర
ణీపాలకచంద్రముఁడు మునిశిఖామణులన్
ద్రోపించిన వారి దురా
లాపము లాడుచును బోయి రాసమయమునన్.

162
శ్రీకృష్ణరాయల ఆముక్త మాల్యద (7-31)
ఉ.

గోపురకందరాలికడకున్ శశిపుష్కరిణీకణార్ద్రసం
తాపహరానిలంబులు పతాకరణన్మణికింకిణీకలా
లాపములన్ సుఖంబడుగ నాఱిటిఁ జొచ్చి యకాండగాహనా
చాపలకృన్మరుద్గణముఁ జండుఁ డదల్చెడు లోనివాకిటన్.

163

16. ఆదేశయతి

లక్షణము
గీ.

ద్వీప ప్రేప సమీప ప్రతీపముల న
నూప పద మంతరీప పరేపములును
విశ్రమంబుల నుభయంబు వెలయుఁ గృతుల
కవివినుతి పాత్ర కజనేత్ర కంకపత్ర.

164
ద్విధాగతః ఆపః అస్మిన్నితి ద్వీపః = తిన్నె, సంగతాః ఆపః అస్మిన్నితి సమీపః = చేరువ. ప్రతిగతాః ఆపః అస్నిన్నితి ప్రతీపమ్ = మెరక అనుగతాః ఆపః అస్మిన్నితి అనూపమ్ = ఉదకసమృద్ధిగల దేశము. అంతర్గతాః ఆపః అస్మిన్నితి ఆంతరీపమ్ = యద్వా, అపా మంతః మధ్యం అంతరీపమ్ — నీటినడుమ నుండెడు తిన్నెయు, జలమధ్యమున్ను ద్వ్యంతరుపసర్గేభ్యస్స్యాత్, ఉదనోద్దేశే అను నీ సూత్రములవలన ద్వీపాది పదములకు పైనున్న ఆప అను పదముకు ఈప, ఊప అను పదములు ఆదేశములు. అవర్ణాంతములైన ఉపసర్గములకు పైనున్న ఆప అను శబ్దముకు ఈత్వము వికల్పము. ప్రగతాః ఆపః అస్మాత్ ప్రేపః, ప్రాపః. పరోగతాః ఆపః అస్మాత్ పరేపః, పరాపః = శుష్కహ్రదము. ప్రాప, పరాప పదములు ప్రాదులు. ప్రేప, పరేప పదములు ఆదేశయతులు. 165
కవిరాక్షసచ్ఛందమున
గీ.

ద్వీప నాకాంతరీప ప్రతీపశబ్ద
ములకు నచ్చు హల్లులును యతులు చెలంగు
నితఁడు పటుశక్తి జాంబవద్వీప మేలె
నాకవాసులచే నుతు లందె ననఁగ.

166
అని, రంగరాట్ఛందమున (3–220)
గీ.

ఎలమి సత్కీర్తి జాంబవద్వీపమునకు
భర్తయగు పాదుషాచేతఁ బ్రణతు లంది
నాకప్రభువైభవము బూని యమరి తౌర
రసికమందార యానందరంగధీర!

167
(అని యున్నది. ఈ చెప్పబడ్డపదములలో) 'నాక' పదమున సమాసము గాని, ఆదేశము గాదు. ఆదేశములందు కలుపుటకు పరిశీలించక పోవుట కారణము.
పెద్దిరాజు ‘కావ్యాలంకారచూడామణి' (7-66) యందలి
ఉ.

ద్వీపులఁ జంపి విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁజేయుటయుం బ్రసన్నమై
గోపతిధేను వవ్విభునకుం దనవైభవ మిచ్చెఁగాక యే
భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్రసిద్ధి వహించి రుర్వరన్.

168
అను నీ పద్యమును రంగరాట్ఛందమునందు నాదేశయతికి లక్ష్యము వ్రాసినారు. యుక్తము. (అయితే) అప్పకవిగారు నిత్యసమాసయతికి లక్ష్యము(గా) వ్రాసినారు. ఇంతమాత్రమేకాదు, 169
క.

లోకంబున కర్ణాటవ
నౌకోద్వీపాంతరీప నాస్తిపదార్థా
నేకాన్యోన్య జనార్దన
నాకాదులు నిత్యసమసనము లండ్రు బుధుల్.

170
అని నిత్యసమాసములందు వ్రాసినారు. (వీనిలో) ద్వీపాంతరీపపదములు రెండు నాదేశయతులు. నాస్తి, నాకపదములు రెండు నసమాసయతులు. అనేకపదము నఞ్ సమాసయతి. ఇవి పూర్వకవి లాక్షణికులచేత స్పష్టముగా నేర్పరించబడినవిన్ని, అలాగు భేదములున్ను స్పష్టముగా నున్నవిన్ని నిత్యసమాసములందు కలుపుటయు; ఎవరును భేదము చెప్పనివిన్ని, భేదము లేనివిన్ని అకారయతులని, ఇకారయతులని చెప్పుటయు వారి పాండిత్య మేమిటో గోచరింపదు. 171

17, 18. నసమాస, నఞ్ సమాస యతులు

లక్షణము
ఉత్తమగండచ్ఛందము
క.

నసమాస నఞ్ సమాసము
లసమంబుగ నచ్చు హల్లు యతులందుం దా
పస మానస లసమాస, స
రస జలవిహరణ విలోల రాజమరాలా!

172
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-234)
గీ.

సరవి నసమాస నఞ్ సమాసములు కృతుల
నచ్చుహల్లులు రెంటికి నగును వలులు
నాకలోకాధిప ప్రణుతాంఘ్రియుగల
నాగ కేయూర సంయుతానంద భవన.

173
నాక పదము ససమాసయతి. అనంతపదము నఞ్ సమాసయతి. నసమాస మనగా— న విద్యతే అకం దుఃఖం యస్మి న్నితి నాకః = స్వర్గము. నసత్యం యయోస్తౌ అసత్యౌ, నాసత్యౌ = అశ్వినీదేవతలు, న అకటి, అక కుటిలాయాం గతౌ, బాహులకాదుః, నాకుః = పుట, న ఆప్నోతి అస్పృశత్వాదితి ఆపత్ వ్యాప్తౌ = క్షౌరకుడు, న అస్తి= లేకపోవుట. పద్భ్యాం నాగంతీతి నాగాః = పాములు, న అగః నాగః = ఏనుగు.

'నాకో మతంగజే సర్పే, పున్నాగే నాగకేసరే
క్రూరాచారే నాగదంతే, ముక్తకే వారిదేపి చ
దేహానిల విషేశేచ, శ్రేష్ఠేస్యా దుత్తర...
నాగరంగే సీసపత్రే, స్త్రీబంధే కరణాంతరే'

ఇతి హైమః, 'న భాడి' తిసూత్రేణ నఇః ప్రకృతి భావః దేహానిలవిశేష మనగా వాగ్ద్వారమందు నుండెడు వాయువు.

నాగశ్చ కూర్మ కృకరో, దేవదత్తో ధనంజయః
వాగ్ ద్వారే నాగ అఖ్యాతః కూర్మ ఉన్మీలనే స్మృతః
కృకరాచ్ఛక్షుతే జ్ఞేయం, దేవదత్తా ద్విజృంభణమ్
న ఙహాతి మృతంవాపి, సర్వవ్యాపీ ధనంజయః.

174
లక్ష్యములు
నాక పదము, హల్లుకు
విరాటపర్వము (5-124)
క.

మును వెఱతు నేయ, మీరలు
నను నేసినఁ గాని యనుడు నాకేశసుతున్
ధనురాచార్యులు డెబ్బది
సునిశితబాణంబు లేసెఁ జూపఱ బెగడన్.

175
శ్రీనాథుని కాశీఖండము (2-91)
గీ.

ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవొ
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి
నాక భవనంబునం దాత్మనాథుఁ గూడి
వెఱ పొకింతయు లేక చిచ్చుఱికెనేని.

176
అచ్చుకు
చేమకూరవారి విజయవిలాసము (1-71)
సీ. గీ.

(రాజసము తేజరిల్లు నీ రాజుఁ గూడ
యింపుసొంపులు వెలయఁ గ్రీడింపవలదె)
నాకకలోకంబువారల కైన లేని
యలఘుతరభోగభాగ్యముల్ గల ఫలంబు.

177
నాస్తి పదము, హల్లుకు
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-94)
శా.

ఆ నిష్టానిధి గేహసీమ నడురే యాలించినన్ సాగు నెం
తే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్యప్రబంధానుసం
ధానధ్వానము ‘నాస్తి శాక బహుతా, నాస్త్యుష్ణతా నాస్త్యపూ
పో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్య' మన్మాటలున్.

178
రెండవ చరణమందు 'నమిత' మను కాకుస్వరయతి.
ఉభయముకు
కవుల షష్టము
సీ.గీ.

తల్లి దండ్రియు దైవంబు దలఁప గురుఁడు
కాఁడె యతఁ డేమి చేసిన గనలఁదగునె
నాస్తికాధమ యోరి యన్యాయవృత్తి
నాస్తి తత్వం గురోః పరంబనఁగ విననె.

179
ఇటువలెనే తెలుసుకునేది.180
'నారాయణ' పదముననున్న రేఫము హల్లుకు నచ్చుకు యతి చెల్లునని నిత్యసమాసములందు లాక్షణికు లందఱు వ్రాసినారు. (అయితే) నకారమందును స్వరమున్నదని, (అది) సమాసయతియని యందఱు నెఱుంగరు. నిత్యసమాసములందు నసమాసముకు కూడా సమాసము వ్రాసుతున్నాము.181
'నారాయణ' పదము నకారమందున్న ఆచ్చుకు
పారిజాతాపహరణము (1-96)
క.

ముని యేమి సేయు, రుక్మిణి
ననఁ గారణ మేమి ధూర్తు నారాయణు జే
సిన చెయిద మేమి చెప్పుదు
మన మెరియదె ప్రాణమైన మగ డిట్లయినన్.

182
ఇక్కడ నఖండయతి యనిన్ని, అది మంచిదిగా దనిన్ని పండితంమన్యులు— 'రుక్మిణి, గొనఁగారణమేమి ధూర్తు గోపాలుఁడు' అని దిద్దినారు. అఖండయతి కాని దాని నఖండయతి యనియు, సుప్రసిద్ధమైన అఖండయతిని మంచిదిగాదనుటయు, సరెకదా, ఈ దిద్దిన దైనా అర్థసందర్భము సరిగా లేదు. 'కొనఁ గారణమేమి?' అని గ్రామణ్యము పలుకరాదు. ముని యేమి సేయును? రుక్మిణి ననవలసినదేమి యున్నది? వంచకుడైన నారాయణుడు చేసిన కార్యమేమి చెప్పవలసియున్నది? అనగా... నేర మంతయు పతిదని కోపోక్తి. ప్రాణమైన పెనిమిటియే యిటువంటి వంచన చేసితే మన మెట్లుగా నుంటున్నది. అని అర్థసందర్భముగాని' 'కొనఁగారణమేమి' అని దిద్దినపాఠము పొసగదు. ఈ పద్యముకు పైపద్యములు (అర్థసందర్భము తెలియుటకు వ్రాసుతున్నాము.)183
క.

అరణ భోజను మతకము
లా రుక్మిణి నటన, లామురాంతకు చెయువుల్
చేరి కనుంగొనఁగా నె
వ్వారికిఁ గోపంబురాదె వారిజనేత్రా!

184


చ.

అనుటయు వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నెయ్యివోయ భ
గ్గని దరికొన్న భీషణహుతాశనకీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయికెంపు దనచెక్కులఁ గుంకుమపత్రభంగసం
జనితనవీనకాంతి వెదఁజల్లఁగ గద్గదఖిన్నకంఠియై.

185


శా.

ఏమేమీ కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడె నా
యా మాటల్ చెవి యొగ్గి తా వినియెనా యా గోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీసతియు నీ వింకేటికిం దాచెదే
నీమోమాటలు మాని నీరజముఖి నిక్కం బెఱింగింపుమా.

186

చ.

ఆతులమహానుభావమని యవ్విరిఁ దానొక పెద్ద చేసి య
చ్యుతునకు నిచ్చకం బొదవ సూడిద యిచ్చెను, నిచ్చెఁగాక తా
నతఁడు ప్రియంబుగల్గునెడ నర్పణ చేసెను, జేసెఁగాక యా
మతకరివేలుపుందపసి మమ్ముఁ దలంపఁగ నేల నచ్చటన్.

187


క.

పలు దెఱఁగు ముళ్లమాటల
కలహమె కల్యాణమని జగంబుల వెంటన్
మెలఁగెడు మౌనికి సహజము
వలదని వారింప రాదె వల్లభుఁ డతనిన్.

188


క.

ముని యేమి సేయు....

189

(1,81–88)

కొన్ని పుస్తకములందు '... రుక్మిణి, ననఁ గారణ మేమి ధూర్తగోపాలుఁడు......' అని యున్నది. యతిభంగమైనది (కానరు) 190
తిమ్మకవి సర్పపురమాహాత్మ్యము
క.

నీరజగర్భాండోదరు
నారాయణు నఖిలమునిబుధావనవిద్యా
పారీణు సకలజనతా
ధారు ననాధారు మదినిఁ దలఁతున్ భక్తిన్.

191
జగ్గకవి సుభద్రాపరిణయము
క.

ఆరూఢభక్తి నచ్చట
నారాయణుఁ బూజచేసి హరిపుణ్యకథా
సారామృతపానుండై
యా రాకొమరుండు జనెఁ బ్రయాగంబునకున్.

192
(ఇక) నఞ్ సమాసములు
న విద్యతే అంగం యస్య సః అనంగః (-మన్మథుడు). ఇటువలెనే, అనూరు, అనాది, అనేక, అనంత, అనల, అనూన, అనామయ, అనాహత ఈ మొదలయినవి నఞ్ సమాసములని తెలియవలెను. 193
లక్ష్యములు
'అనేక' పదము, హల్లుకు
కర్ణపర్వము (2-355)
ఉ.

మ్రొగ్గెడు వాహనంబులును మోములు ద్రెవ్వఁగఁ బాఱు వాజులున్
డిగ్గి తొలంగు సైనికు లనేకులు కష్టపుపాటు చొప్పడన్
(ద్రగ్గు సిడంబులుం గులముఁ దన్నుఁ దలంచి యెదిర్చి యొంటిమై
మ్రగ్గెడువారు నై కురుధరావరుసైన్యము రూపు మాయఁగన్)

194
తిమ్మకవి సర్పపురమాహాత్మ్యము
ఉ.

నీ కరుణావలోకనము నిల్పినచోఁ గులహీనుఁడున్ హయా
నేకపహేమచామరమణీరమణీయవిభూషణాదికా
స్తోకవిభూతిఁ జెంది పరిశుద్ధకులుం డన మించు, లేనిచో
నాకనివాసుఁడున్ వెతల నందుఁ గదమ్మ జగత్కుటుంబినీ!

195
అచ్చుకు
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-85)
క.

తునియలు తొమ్మిదియఁట పడు
నెనమండ్రఁట మోచువా రనేకప కిటి కూ
ర్మనగాహు లేటి లావరు
లని తావకబాహు వొకటి యవని భరింపన్.

196
రంగరాట్ఛందము (3-157)

ఇలఁ గుటుంబప్రతిష్ఠ లనేకములు న
నంతగుణనిధియైన యానందరంగఁ
డమరఁ గావించి కాంచె ననంతకీర్తి
నూత్నమా యెన్న యతని యనుపమమహిమ.

197
న విద్యతే ఉత్తమాః యస్మాత్ సః అనుత్తమః, ఉత్తమో న భవతీ త్యనుత్తమః — ఇటువంటి విన్ని నఞ్ సమాసయతులు.198

19. నిత్యసమాసయతి

లక్షణము
కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-135) యందు
గీ.

ఒక్క సమసనమున శబ్దయుగము గూడి
పదము వేర్పాటుగాఁ గానఁబడని ప్రాణ
సంధులకు నిత్యసమసనశ్రాంతులును న
ఖండవిశ్రమములు నన రెండు జెల్లు.

199
అని నిత్యసమాసయతికి నఖండయతి యనిగూడా చెప్పినారు. స్వతస్సిద్ధమైన యఖండయతిని పరిహరించుటకు కాని వాటిని యఖండయతు లనుటకు వారి సామర్థ్య మవార్యము.200

అప్పకవి నిర్ణయించిన నిత్యసమాసయతులు

విశ్రామిత్ర
రాద్ధాంత
బాదరాయణ
పరాయణ
ఉత్తరాయణ
నాక
రామాయణ
లతాంత
శాకటాయన
పలాయన
వాతాయన
నాస్తి
స్వాంత
ప్రాంత
కాత్యాయన
సాంఖ్యాయన
ఆపోశన
మందార
ఏకాంత
నిశాంత
వాత్స్యాయన
బోధాయన
ద్వీప
నారికేల
సిద్ధాంత
ఉపాయన
రసాయన
దక్షిణాయన
అంతరీప

(వీనిలో) ద్వీప, అంతరీప ఈ రెండు ఆదేశయతులు. ప్రాంత, ఉపాయన - ఇవి ప్రాదియతులు. నాక, నాస్తి - ఇవి నసమాసయతులు. "అనాద్య నంతనూరు శబ్దములు మొదలైన నఞ్ సమాసముల కన్నింటికిని నిటువలెనే రెండునుం జెప్పవచ్చును." అని తమరే నఞ్ సమాసము లనిరి. ఇవి నఞ్ సమాసములు. పూర్వలాక్షణికులు నిర్ణయించినారు. బాదరాయణ, శాకటాయన పదములకు— 'బదరస్య గోత్రాపత్యం బాదరాయణః, శకటస్య గోత్రాపత్యం శకటాయనః' – అని వ్యుత్పత్తి, గోత్రార్థమందు నడాది గణప్రయుక్తమై ఫక్ ప్రత్యయము, ఆయనాదేశము. 'యస్యే'తి లోపముచేత టకారముకు లోపము

గాని, ప్రాణసంధిలేనిది. ప్రకృతి ప్రత్యయములు కాని పదద్వయముకు వచ్చిన సమాసము గాదు. కావున టకారోపరి ఆకారము లేదు. స్వరము చెల్లదు. 'బదరోనామఋషిః, శకటోనామ ఋషిః' బదరశబ్దమును నడాదిగణమందు పాణిన్యాచార్యులవారు పఠించుటవలన ఫక్ప్రత్యయము గాని, సమాసము కాదని శాబ్దికులు వ్యవహరించుచున్నారు. కాత్యాయన, వాత్స్యాయన శబ్దములున్ను, గర్గాది యఞంతములైన 'కాత్య, వాత్స్య' శబ్దములమీద యఞ్ ఞోశ్చే'తి సూత్రవిహిత ఫక్ ప్రత్యయాంతములు. శాకటాయన శబ్దమువలె 'యస్యేతి' లోపము గాని, ప్రాణసంధిలేదు. పదద్వయముగాదు. యకార మున్నందున (కాత్యాయన, వాత్స్యాయన శబ్దములకు) అకార హకార యకారములు చెల్లును. సంయుక్తయతి (యగును) గాని, నిత్యసమాస యతిగాదు.

ఈ నిత్యసమాసములందే అప్పకవిగారు. "కుమారవ దాచరితా శక్తిః కుమారాయిత శక్తిః, కుమారాయితతయా శక్త్యా శాలత ఇతి కుమారాయిత శక్తిశాలీ, కుమారసమాన పరాక్రమవా నిత్యర్థః. భద్రవ దాచరితా మూర్తిర్యస్య తత్ భద్రాయితమూర్తి, శోభనమూర్తి మదితియావత్. అయసి క్యఙ్ ప్రత్యయాంతః'- అది గానఁ గొంద ఱారెండుశబ్దములమీఁదను 'ఆకారము లున్నవి. నిత్యసమాసము' లని భ్రమింతురు. శబ్దసూత్రమువలన వానికే దీర్ఘములు వచ్చినవి గాని యందులో సత్తులు లేవు" అని వ్రాసిరి. (మరి) శాకటాయనాది శబ్దములందు మాత్రము అత్తులు ఎక్కడనుంచి వచ్చె ననుకొనిరో తెలియదు.202

'ఆపోశన' శబ్దమునకు స్వరమున్నదిగాని, 'అప్ అశనం = అబశనం' అని యుండవలెను. 'ఆపోశన మని యెటువలె నిష్పన్నమాయెనో వ్రాయలేదు. కొందఱు— 'అపాం సమూహో ఆపం, ఆపస్య అశనఁ, గూఢోత్మావత్ వర్ణవికృతి' యని వ్రాసినారు కాని, 'గూఢోత్మా' అని పఠితము గాని, అకృతిగణము గాని కాదు కావున, నది బాగులేదు. ఆప్ఛబ్దము సకారాంతము, స్త్రీ లింగము, నిత్యబహువచనమని యందఱు నెఱుంగుదురు 'ఆపః, ఆపసీ, ఆపాంసి' అని సకారాంతమున్ను, నపుంసకలింగమున్ను, మూడు వచనములు గలవని ద్విరూపకోశమందు నున్నదిగాన, 'ఆపసాం అశనం ఆపోశనం'- ఇది సమాసము. 'ఆపః, ఆపసి, ఆపాంసి; అప్నః, అప్నసి, అప్నాంసి' అనిన్ని కలదు.203

(ఇక) ‘వాతస్య అయనం వాతాయనమ్'- ఇటువంటివి నిత్యసమాసములందు వ్రాసుట తగదు. 'ఒక్క సమసనమున శబ్దయుగముగూడి, పదము లేర్పాటుగాఁ గానఁబడని ప్రాణసంధులకు నిత్యసమసనశ్రాంతు' లని లక్షణము చెప్పిరి. 'వాత' శబ్దము, 'అయన' శబ్దము వేర్పాటుగా గానబడెను. 'అప'శ్శబ్ద 'అశన' శబ్దములు వేర్పాటుగా గానబడెను. గాన, నిటువంటివి అచ్చుకు నచ్చుకు చెల్లితే స్వరయతి. స్వరమూదిన హల్లుకు చెల్లితే అఖండయతి చెప్పవలె గాని నిత్యసమాసయతి యని చెప్పరాదు.204

మరియును, 'నారాః ఆపః అయనం స్థానం అస్య నారాయణః' అని సమాసము వ్రాసినారు. నార శబ్దము, అయన శబ్దములు వేర్పాటుగా గానబడెను. ఇది నిత్యసమాస మయితే, పీతాంబర, గగనాంబర, చిత్రాంగి, కనకాంగి - మొదలగు సమాసములును నిత్యసమాసములే కావలె. మందార, నారికేల శబ్దములకు సమాసములు వ్రాయలేదు. మేము వ్రాసుకున్నాము. 'మందాన్ క్షుద్రరోగాన్ ఔషధత్వేన ఆరయతి పీడయతీతి మందారః = జిల్లేడు చెట్టు' ఇది నిత్యసమాసము (కాని) 'మందాని సూక్ష్మాణి అరాణి కంటకాని యస్య మందారః ఎఱ్ఱని గొప్పపూలు గల వృక్షము' 'మందాః అరాః-ధారాః యస్య, సరలత్వాదితి మందారః' = దేవలోకమం దుండెడు వృక్షము' ఈ రెండు నిత్యసమాసములు కావు. (ఇక) 'నాల్యాకముదక మీరయతీతి నాలికేరః యద్వా, నాలీకాని నాలయుక్తాని పుష్పఫలాని ఈరతీతి నాలికేరః, ఈరక్షేపే, రలయో రభేదః, నారికేలః, నారికేరః'— రెండువిధములు గలదు. ఇవి నిత్యసమాసములు.205

(ఇక) 'నారాయణ' శబ్దముకు నిత్యసమాసములు వ్రాసుతున్నాము.— 1. నారం నర సమూహం అయతి స్వకర్మేతివా నారాయణః 2. నారం నరసమూహం అయతే జానేతీతివా నారాయణః, 3. గత్యర్థానాం జగ్ధ్యర్థ త్వాదయధాతుః జ్ఞానే వర్తతే'— ఈమూడు విధములు నిత్యసమాసములు. మరియును స్వరములున్నవి. వ్రాసుతున్నాము— 1. నారం నరాణాంసమూహం అయనం యస్య నారాయణః పూర్వపదాదితి ణత్వమ్ 2. నారస్య నరసమూహస్య అయనమితి వా నారాయణః; 3. యథా ప్రలయే నరాణాం అయనత్వాన్నారాయణః సఏవ నారాయణః: స్వార్థే కః ప్రజ్ఞాద్యణ్: 4. నారస్య నరసమూహస్య ఆయనం (య) స్మాత్స
నారాయణః; 5. నర అత్మా, తతోజాతాని ఆకాశాదీని కార్యాణి అయనం అస్యవా నారాయణః; 6. నారాణి తత్త్వాని అయనమస్యేతివా నారాయణః' శాంతి పర్వమందు—

'నరాజ్జాతాని తత్త్వాని నారాణీతి తతో విదుః
తాన్యేవ చాయనం యస్య తేన నారాయణః స్మృతః'

(అని ఉన్నది) 7. నారం సరోరుహం తస్య ఆయనమితి నారాయణః.

“నారం సరోరహం ప్రోక్తం జగద్యోనిమయం పురా
యస్య నాభే సముత్పన్నం స నారాయణ ఉచ్యతే

(అని అందే ఉన్నది). 8. నారాణి చరాచరాణి భూతాని అయన యస్యేతివా.'—

ఈ ఎనిమిది విధములు నిత్యసమాసములు కావు. స్వర మున్నందున స్వరయతి అఖండయతి యనవచ్చును.

(ఇక) లింగాభట్టుగారు 'రాయః శబ్దాః అయంతే నిర్గచ్ఛంతి యస్మాత్ స రాయణః రాయణా దన్యః అరాయణః, అరాయణా దన్యః నారాయణః,న అరాయణ ఇతి వా నారాయణః. రై శబ్దే'- అని వ్రాసినారు. ఈయన వ్రాసినవే గురుబాలప్రబోధికయందును వ్రాయబడినవి, మరికొందఱు కవులును ఇదే వ్రాసినారు. అయితే, అటుల సమాసము కుదురదు. 'రై' అను పదముకు 'అయనః' అను పదము పైనున్నపుడు 'ఏ చోయ వాయావః' అను సూత్రముచేత వచ్చిన (ఆదేశమందలి) యకారమునకు లోపము వచ్చెడు నాకరము కనుపించదు. 'రాయయణః' అనవలెను. 'రాయణాదన్యః అరాయయణః, అరాయణా దన్యః

నారాయయణః' అగును గాన, నటుల సమాసము పొసగదు. (పొసగెడు విధము వ్రాసుతున్నాము). "అరాణాం దోషాణాం ఆయనం అస్య అరాయణః, స నభవతీతి నారాయణః యద్వా, న అరాణి నారాణి పుణ్యాని అయన మస్య వా నారాయణః. సకలదోషరహితః, సకలపుణ్యాకరః ఇత్యర్థః. 'అర మంచల దోషయో' ఇతి శాశ్వతః." నకార మందు స్వరమున్నది, రేఫమునందు స్వరమున్నది. ఈ సమాస మొకటి మాత్రము శాబ్దిక మతానుసారముగా మేము వ్రాసినాము. (ఇక) నరాః అయనం యస్యేతి నరాయణః.206

'అథ నారాయణో విష్ణు రూర్థ్వకర్మా నరాయణః'

ఇతి శబ్దార్ణవః

'వాసు ర్నరాయణ పునర్వసు విశ్వరూపాః'

ఇతి త్రికాండశేషశ్చ.

'ముకుందశ్చాపి కుందశ్చ, నారాయణ నరాయణౌ
వాసుదేవో హి వాసు స్స్యాత్, వామదేవశ్చ వామవత్'

ఇతి ద్విరూపకోశశ్చ.
'ఇవి యన్నియు నిత్యసమాసములు కాకున్నను అనేక విధములు సమాసములు గల వనిన్ని, సకలపాపహర మైనటువంటిన్ని, సకలశుభద మైనటువంటిన్ని శబ్దమగుటచేత, పూర్వపండితులు నిర్ణయించినవిన్ని, మాకు గోచరించినవిన్ని వ్రాసినాము.

అప్పకవిగారు—'జనాన్ అర్దయతి సుఖయతీతి జనార్దనః, అర్ధగతౌ, యాచనేచ' - అని వ్రాసినారు, మరియును వ్యాఖ్యాకారులు వ్రాసిన సమాసములు ఇట్లున్నవి- 1. జనాన్ దుర్జనాన్ అర్దయతి నరకాన్ గమయతీతి జనార్దనః; 2. జనాః సముద్ర మధ్యస్థ దైత్యభేదా స్తేషాం మర్దన ఇతివా జనార్దనః; 3. ప్రలయకాలే సర్వాన్ జనాన్ అర్ధయతీతి వా జనార్దనః; 4. జనః జన్మ అర్ధయతి హినస్తీతివా జనార్దనః; 5.జనం జననోప లక్షితం జీవస్య సంసారం అర్ధయతీతివా జనార్దనః; 6. జనం జననం తత్కారణ మజ్ఞానం చ స్వసాక్షాత్కారేణ అర్దయతీతివా జనార్దనః; 7. జనైః సుజనైః పురుషార్థం అభ్యుదయకం నిశ్శ్రేయసలక్షణం చ

అర్ద్యతే యాచ్యత ఇతి వా జనార్దనః. 207
అమర వ్యాఖ్యానాదులందు పండితులు వ్రాసిన నిత్యసమాసములు వ్రాసుతున్నాము— 208
1. కేలీనాం సమూహో కై లం, తేనాస్యతే స్థేయత ఇతి కైలాసః; ఆస ఉపనివేశనే; 2. కం జలం అరవ్యత్ర కాసారః; కస్య ఉదకస్య సార అసమంతా దత్రేతి వా కాసారః 3. కి ఇతి శబ్దేన ఈష్టే కీశః. ఈశఐశ్వర్యే యద్వా,
కిః హనుమాన్ ఈశః ఏషాం తే కీశాః; 4. కేన జలేన ఉద్యతే సిచ్యత ఇతి కోద్రవః = అఱుగ 5. కుచ్చిత మంబతే కదంబకః = ఆవాలు; 6. కవం శబ్దం అటతే కవాటం = తలుపు 7. అంగాని ఆరయతి పీడయతి అంగారకః. 8. లులః లోలనం అయతి లులాయః = దున్నపోతు 8. లడ విలాపే లడయో రేకత్వం, లలం విలాపం అటతే, అటగతౌ లలాటః; యద్వా లలంతశ్చలంతః, అటంతి అలకా అత్రేతి వా లలాటం; 10. మాం లక్ష్మీం ఈఖతి వా, మా ఈఖతి వా, మాశబ్దో నిషేధే, ఈఖగతౌ, బాహులకా దచ్, మేఖలా = మొలనూలు. 11. కిరతి కౄవిక్షేపే, ఇగుపధేతి కః, అతసాంతత్సగమనే, అచ్, కిరళ్చాసౌ అతశ్చ కిరాతః. "కిరాతో మ్లేచ్ఛభేదేస్యాత్ భూనింబే చేకనావపి; స్త్రియాంచా సుర వాహిన్యాం కుట్టనీ దుర్గయోరపి". 12. పంచభిర్వర్ణై రల్వతే, అల భూషణాదౌ షుఞ్ స్వార్థే అణ్, అదంతాత్ కన్, టాప్, సంజ్ఞా పూర్వకత్వాత్ వృద్ధిః, పాంచాలికా = బొమ్మ . 13. కుచ్చితం అంబరః, కోఅకట్ తత్పురుషేతి కచాదేశః, కదఃబరం, నీలాంబరం, అస్యాస్తీతి, అర్శఅద్యచ్, కదంబరః = బలరామః తస్యేయం, త స్యేద మిత్యణ్, కాదంబరీ = మద్యము 14. కుచ్చితోద్యః. కదర్యః; 15. శలశ్చాసా వటుశ్చ శలాటుః. శలవల సంవరణయోః, పచాద్యచ్. ఆటగతౌమృగద్యాదిత్వాత్కుః శలాటుః = కాయ 16. వరం శ్రేష్ఠం సస్యం ఆహం తీతి వరాహః 17. వరైః శ్రేష్ఠైః అస్యతే వరాసిః "వరాసిరుత్తమే ఖడ్గే, వరాసిః స్థూలశాలుక' ఇతి రత్నకోశః. 18. శృంగైః అటం తస్మిన్నితి శృంగాటకం, యద్వా, శృంగం ప్రాధాన్యం అటతి, అటగతౌ, సంజ్జాయాంకన్, శృంగాటకం = నాలుగు త్రోవలు గల స్థలము. 19. కూర్పరే కపోణౌ అస్యతే కూర్పాసకః. అనుక్షేపణే. పృషోదరాదిత్వాద్రేధలోపః = ఱవికె, చొక్కా. 20. మంజతి మంజి ధ్వనౌసౌత్రః బాహులకాదీరన్ మంజీరః = అందె. 21. కం జలం అలతి భూషయతి కమలం అభూపణాదౌ = వేయు దలములు గల పద్మము 22. 'కమ్ కాంతా' వితిధాతో రల ప్రత్యయేపరే ఉపధాయాః కారాదేశేచ, కోమలం. 23. వల్చాసౌవక్షశ్చ వలక్షః వల సంచలనే అక్షూవ్యాప్తౌ. 24. కటం గండం అక్షతి కటాక్షః అక్షూ వ్యాప్త కర్మణ్యణ్ 25. 'కటాక్షకాక్షా' వితి రభసౌత్. రభసోనామ పూర్వోకవిః కాక్షః. 26. సహ అరంగచ్ఛతీతి సారంగః "సారంగ శ్చాతకే భృంగే కురంగే చ మతంగజే." భానోజీ దీక్షితులవారు 'మంజీర, సారంగ శబ్దములు 'శకంధు’ లందు వ్రాసినారు గారు, మిగిలినవారు శకంధులందు
వ్రాసినారు. 27. కం జలం అండే మధ్యే లాతీతి కమండలుః. 28. పారేణ బలేన అవతీతి పారావతః 29. తటాని అకతీతి తటాకః అక కుటిలాయాం గతౌ 30. కీలాన్ జ్వాలాన్ అరతి నారయతీతి కీలాలం = ఉదకము. 31. పాదాభ్యాం అతతీతి పదాతిః. 'పాదస్య పదాజ్యాతి గోపహలేషు' ఇతి సూత్రేణ పాదశబ్ద స్వపదాదేశః = భటుడు 32. నారం నరసమూహం అంచతీతి నారాచః. అచుగతి పూజనయోః = బాణము 33. నారం నరసమూహం అంచతీతి నారాచం = త్రాసు. 34. వృక్షాద్యనేనేతి వృక్షాదనః = గొడ్డలి 35. కురాన్ వృక్షాన్ ఇయర్తీతి కుఠారః = గొడ్డలి. 36. కులం పక్షికులం అయతి ఇతి కులాయః = గూడు 37. తులాం ఆసమంతాత్ కుటతీతి తులాకోటిః, తుల ఉన్మాదే కుటి కౌటిల్యే = పెండెరము, అందెయును. 38. చండం గుహ్యస్థానం అతతీతి చండాతకం = చల్లడము 39. లలం విలాస మమతి లలామం అనుగత్వాదిషు = విలాసము గలది, అనగా బాసికము మొదలైన వాటికి చెల్లును. 40. వాతం అయతే వాతాయుః = ఇఱ్ఱి 41. గాం ఆయతే సదృశత్వాద్గవయః = మృగవిశేషము 42. రాదిఫః రేఫః = ర వర్ణము 43. ద్విరేఫః = తుమ్మెద గండం కపోలం ఉలతి ఆవృణోతి గండాలీ = ఎఱ్ఱని తుమ్మెద; కొందఱు కణుసురీగ అందురు. 44. పిష్టం అతతి పిష్టాతః = బుక్కా. 45. పరాన్ అక్రమ్యతే అనేనేతి పరాక్రమః 46. సహ ఆప అనమంతి అస్మిన్నితి సోపానం. సమ్ హ్రస్వత్వే శబ్దే 47. స్వరాంతరస్య గంధం లేశం అరాతి గాంధారః = స్వరవిశేషము 48. బలేన మేఘమాలాం అకతి బలాకా = తెల్లకొక్కెర 49. సహ అంద్యతే బధ్యత ఇతి సాంద్రం. అది బంధనే 50. అవశ్యం నిశాయాం అమ్యతే గమ్యత ఇతి నిశాంతం అను గతౌ = ఇల్లు 51. అగాన్ వృక్షాన్ స్తంభభూతాన్ ఇయర్తీతి ఆగారం ఋ గతౌ = ఇల్లు. నిశాయాం అమృతే, అనుగత్యాదిషుక్తః. 52. పారం అవృణోతీతి పారావారః = సముద్రము 53. కందరాన్ సానూన్ అలతి కందరాలః = కొండగోగు. 54. కందరం గుహాప్రదేశం అలతీతి కందరాలః = కలజువ్వి. 55. మధు మధురసః ఉచ్యతే యజ్య తేత్రేతి మధూకః. ఉచ సమవాయే = ఇప్పచెట్టు 56. మధు ఉతతీతి మధూలకః. ఉల ఆవరణే = నీటి ఇప్పచెట్టు. 57. కలాం స్వర్ణశిల్పం ఆదత్త ఇతి కలాదః = కంసాలి. 58. కలాం ఆప్నోతి. ఆపౢ్ వ్యాప్తౌ, కర్మణ్యణ్. యద్వా, కలాః ఆద్యతే అనేనవా. హలశ్చేతి ఘఞ్. కలాపః, "కలాపస్సంహతౌ బర్హే, కాంచ్యాం భూషణ మాణయో" రిత్యజయః. 59. పిశితం అశ్నంతీతి పిశాచాః. 60. కత్
కుచ్చితం అంబతే కదంబకం. అవి శబ్దే= సముదాయము. 61. కుచ్చితః ఊష్మా అండేషు బీజేషు అస్యేతి కూష్మాండః =గుమ్మడి చెట్టు. 92. తృప్తిం కరోతీతి కర్కః. ఇయర్తీతి అరుః. కర్కశ్చావారుశ్చ కర్కారుః = గుమ్మడి పండు, 93. ఉరు మూత్రం ఆరయతి నిస్సారయతీతి ఉర్వారుః = దోసచెట్టు. 65. ఇక్షుమపి అకయతి కుటిలయతి తిక్తత్వేన ఇక్ష్వాకుః = చేదు ఆనపచెట్టు. 65. తుండికాన్ వదనగత రోగాన్ ఈరయతి ప్రేరయతీతి తుండికేరీ. ఈరక్షేపే = పత్తిచెట్టు 66. గాంగం గంగా సంబంధం జలం ఈరయతి గాంగేరుకీ = బీర చెట్టు. 67. పటం పటసదృశం పుష్పసమూహం ఉలతి ఆవృణోతీతి పటోలికా = పొట్లచెట్టు. 68. పలం మాంసం అశ్నాతీవ తిష్ఠతీతి పలాశః = మోదుగుచెట్టు. 69. అనసః శకటస్య అకం గమనం హంతీతి అనోకహః = వృక్షము. 70. శక్రం ఆనయతి. జీవయతీతి శక్రాణీ = శచీదేవి. 71. ఇంద్రాణీ = శచీదేవి. 72. భవానీ. 73. శర్వాణీ. 74. రుద్రాణీ. 75. మృడానీ- (ఈ నాలుగు) పార్వతీదేవికి (పేళ్లు). 76. హిమానీ = మంచు సముదాయము 77. అరణ్యానీ = అడవుల సముదాయము 78. యవనానీ = యవనలిపి 79. మాతులానీ = మేనమామ భార్య 80. ఆచార్యాణీ = గురుపత్ని. "ఇంద్ర భవ శర్వ రుద్ర మృడ హిమారణ్య యవన మాతులాచార్యాణా మానుక్” ఈ సూత్రముచేత అచ్చు నిష్పన్నమైనది: అరణ్య, ఆచార్య పదములలో (అరణ్యాని, ఆచార్యాణి) యకార మున్నందున అచ్చులకు చెల్లును గాని సంయుక్తయతి యనరాదు. నిత్య సమాసమని తెలియుటకై వ్రాసినాము. 81 శృంగం ప్రాధాన్యం ఇయర్తీతి శృంగారః 82. ఉరూన్ మహతః అశ్నుతే వ్యాప్నోతి వశీకరోతీతి, కర్మణ్యణ్ సంజ్ఞా పూర్వకస్య విధికని త్వత్వాన్న వృద్ధిః ఉర్వశీ, 83. ఊరు అశ్నాతీతి ఊర్వశీ. 84. కస్య సుఖస్య జలస్యవా అంతం ఋచ్చతి ఋ గతౌ, కర్మణ్యణ్. కాంతారం = వనము 85. రామం అయతి జ్ఞాపయతీతి రామాయణం. అయ పయ గతౌ, సర్వేగత్యర్థాః జ్ఞానార్థాః. 86. నమశ్శివాయ—

“నమస్కారేణ జీవత్వం శివేతి పరమాత్మని
అయేత్యైకమతో మంత్రః పరబ్రహ్మ మయోహ్యసౌ"

ఆని 'స్కందపురాణ' మందలి 'బ్రహ్మోత్తరఖండ' మందున్నది. (అయితే) నమశ్శివాయ, నమశ్శంకరాయ నమఃకేశవాయ — ఈ మొదలైన చతుర్ధ్యంతములందు స్వరములేదు. మంత్రమందు 'శివ-అయ = శివాయ' అని స్వరమున్నది.
(మరి) ‘సుపీచ’ అను పాణినీయసూత్రము వలన దీర్ఘము వచ్చినందున ఇవి నిత్యసమాసములు కావు. కాని, (మంత్రమును బట్టి) స్వరములు గల పదములని తెలియపరుచుతున్నాము. (ఇక) రా౽కుచ్చితః ఊర్మః వేగః అస్య కూర్మః 88 కస్యశిరసః ఈశః కేశః 89, కశ్చ ఈశశ్చ కేశౌ, తావస్మింస్త ఇతి కేశవః, యద్వా కశ్చ అశ్చ ఈశశ్చ కేశాః తే౽నంత్యస్మిన్నితి కేశవః 90 కం జలం ఆననం ప్రాణనం అస్య కాననం. 91. దివా ఆకీ ర్తనం అస్య దివాకీర్తిః = మాలఁడు. 92. పుంసా అరుహ్యత ఇతి ఆరోహః = కటి. వరః ఆరోహే యస్యాః సా వరారోహా =చక్కని మగువ. 93. అసూనాం అంతోత్ర అస్వంతం = పొయ్యి. 94. కస్య సుఖస్య అంతం కాంతం. 95. మృత్అంగం అస్యేతి మృదంగః. 96. మందమక్షి అత్రేతి మందాక్షం. మందమక్షం ఇంద్రియ మత్రేతి వా = సిగ్గు. 97. విబోః గతి విశేషస్య ఓకః స్థానం విబ్బోక వబయోరభేదః, బిబ్బోకః, విపూర్వకోవా గతిబంధనయోః ఇతి ధాతుః. 'విబు' అనగా గతివిశేషము, అందుకు స్థానము. సాపరాధుడైన ప్రియుని కథ వినునపుడు ఇంచుకంత యనాదరము బిబ్బోక మని వ్యాఖ్యాకారులు వ్రాసినారు గాని, 'విలాస' మని ప్రయోగములు గలవు.
చేమకూరవారి విజయ విలాసము (1-84) నందు
గీ.

(నువ్వు పువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురు సవురు జవురు నువిద మోవి)
మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి
(మెఱుపు నొఱపుఁ బఱపుఁ దెఱవ మేను)

209
మరియు నందే 2-191
క.

(గబ్బిమరుం డొఱ పెఱుఁగక
గొబ్బునఁ బై బడును; నీవుఁ గూడనివార్తల్
సుబ్బిన కార్యం బెక్కడఁ)
దబ్బిబ్బో కాక పూర్వతనుబిబ్బోకా.

210
అని యున్నది. 'ఓక' శబ్దము సకారాంతము అకారాంతము, నపుంసకలింగము (గూడ) కలదు. 98. పారం అపారం అస్య పారావారః సముద్రము. 99. కృతః ఆంతో వినాశో యేన సః కృతాంతః. 100. ఈషత్

అంకం కుటిలగతికం ఉదక మస్యేతివా కాకోదరః = పాము. కాకోదర, కాంతార, కూష్మాండ పదములందును, సారంగ, సోపాన పదములందును రెండుస్వరములు కలవు.211

పూర్వలాక్షిణికులు నిత్యసమాసములని వ్రాసిన లక్ష్యములు (కొన్ని కుదురవు. వ్రాసుతున్నాము)— 212
‘వాతాయన' పదము, హల్లుకు
విరాటపర్వము (2-238)
సీ.పా.

 తరుణులో పతులు వాతాయనంబుల నుల్ల
             మలకలై వేఁబోక మలయపవను...

213
ఇది అఖండయతి గాని, నిత్యసమాసయతి గాదు.214
అచ్చుకు
వసుచరిత్రము (1-116)
సీ.పా.

తన యశోవిశదముక్తాసౌధపాలికి
             నంబుదాయనము వాతాయనముగ...

215
ఇది స్వరయతి. ఈ రెండు నిత్యసమాసయతులన్నారు.216
‘రసాయన' పదము, అచ్చుకు
గీ.

నాస్తి యనక మహి ననంతసంపదలు నా
రాయణుం డొసంగు, రమ్యమగు ర
సాయనంబు బుధుల కతఁ డన నిత్య స
మాసయతులు రెంట నంటియుండు.

217
అని అనంతుడు (అనంతుని ఛందము 1. ఆ.) చెప్పినారు. 'నాస్తి'— నసమాసయతి, 'అనంత' — నఙ్ సమాసయతి గాని, నిత్యసమాసయతులు గావు, 'రసాయన' స్వరయతి. 218
హల్లుకు
జైమినీ భారతము (1-22)
గీ.

మఱ్ఱి మాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు
పేరు వలె గాదు శారదాపీఠకంబు
వారిలోపల పినవీరు వాక్యసరణి
సరసులకు నెల్లఁ గర్ణరసాయనంబు.

219
ఇది అఖండయతి. 220
‘ఆపోశన' శబ్దము, అచ్చుకు
చమత్కారరామాయణము
క.

ఓ శశిముఖి లోపాము
ద్రేశుండు కలశభవుండు నిట నతఁడు తపో
రాశి మహాత్ముఁడు మును నా
పోశనముగఁ గొనియె సాగరాంబువు లెల్లన్.

221
ఇది స్వరయతి 222
హల్లుకు
కవుల షష్ఠము
సీ.గీ.

తత్తరమున నాపోశన మెత్తఁబోయి
భూసురుం డెత్తె నుత్తరాపోశనంబు-

223
ఇది అఖండయతి. 224
భీమఖండము (2-188)
గీ.

పోసి రా యెల్లవారి కాపోశనంబు
లారగింపుఁడు లెండు మీకమృతమస్తు
ప్రొద్దుపోయింది సుండని బుజ్జగించి
మ్రొక్కె నంజలి చేసి యమ్ముదుకపడఁతి.

225
ఇది ప్రాసయతియు, నఖండయతియు ననవలె. ఇవి నిత్యసమాసయతులైతే, 'గ్రామాంత, సీమాంతా'ది షష్ఠీతత్పురుషసమాసములన్నియను నిత్యసమాసములే కావలెను.226
'సాంగ' శబ్దము, అచ్చుకు
విరాటపర్వము (5-118)
గీ.

సకలకురుకుమారచాపశిక్షాచార్యుఁ
డాజి దుస్సహుండు సాంగవేద
వేది నీతిశాస్త్రవిదుఁడు (దివ్యాస్త్ర
విదుఁడు సుజనహితుఁడు విమలబుద్ధి)

227
ఇది స్వరయతి. 228
హల్లుకు
ఆదిపర్వము (4-169)
సీ.

సాంగంబులగుచున్న సకలవేదంబులు
             సదివె వశిష్ఠుతో సకలధర్మ
(శాస్త్రాది బహువిధశాస్త్రముల్ శుక్రబృ
             హస్పతుల్ నేర్చినయట్ల నేర్చె...)

229
ఇది అఖండయతి. 230
‘సాంబ', పదము; అచ్చుకు
మౌసలపర్వము (1-9)
క.

అంబుజనాభుని కొడు కీ
సాంబుఁడు గను యాదవక్షయాపాదన క
ల్యంబగు ముసలము మా వచ
నంబున కనృతంబు గలదె నందుఁడు మీరల్.

231
ఇది స్వరయతి. 232
హల్లుకు
సాంబవిలాసము
గీ.

హలికి నెదురేగి సకలపదార్థములు, ను
పాయనము వెట్టి నీముద్దుపట్టితోడ
జాంబవంతుని దౌహిత్రు శౌరిపుత్రు
సాంబు నొప్పించు బ్రతికించు సకలజనుల.

233
ఇది అఖండయతి. సాంబనారాయణాదిశబ్దములు ఆ యా దైవములకు మాత్రమే కాదు మానవ నామములకున్ను నుభయము చెల్లును. 234
వనౌకశ్శబ్దము; అచ్చుకు
అథర్వణాచార్యుల విరాటపర్వము
క.

శ్రీకంఠుఁ డెదురు నపుడు వ
నౌకోధ్వజ మింద్రమకుట మర్జున తురగా
నీకము దివ్యశతాంగము
నాకవ్వడి కబ్బియున్న నతడేమగునో.

235
హల్లుకు, అందే
క.

ఆకర్ణు దురాలాపము
లాకర్ణింపఁగ నసహ్యమై ద్రోణునితో
నాకనదీసుతుఁ డనియె వ
నౌకధ్వజ మెఱుఁగవచ్చు నరు జూపి తగన్.

236
ఇవియు నిత్యసమాసములు గావు. వనశబ్ద, ఓక శ్శబ్దములు స్పష్టములు. 237
‘ఏకాంత' పదము, హల్లుకు
ఆదిపర్వము (8-74)
గీ.

కామసుఖసంగములకు నేకాంతగృహము
పోలి పొలిచియు ధర్మార్థములకు నిదియ
యాస్పదంబన వర్గత్రయానురమ్యు
లైన జనులకు నెంతయు నప్పురంబు.

233
అరణ్యపర్వము (3-319)
సీ.

(హస్వపీనగ్రీవు నచలితాయతహను
             నతి చపల స్వభావాభిరాము
....................................................)
ఊర్ధ్వలాంగూల మత్యున్నత ధ్వజలీలఁ
             గ్రాలుచునుండి నేకాంతయోగ
నిద్రనున్న ధర్మనిర్మలు హనుమంతు
(జూచి పాండురాజసుతుఁడు వాని
నిద్రఁ జెఱుపఁ గడఁగి నిజసత్వ మేర్పడ
సింహనాద మొప్పఁజేసె డాసి)

239
వసుచరిత్ర (5–123)
శా.

 కాంతన్ శుక్తిమతీ నగేంద్రభవ ముక్తారత్నరాజిం దదే
కాంతస్వచ్ఛశరీరయుక్తి నగజాకల్యాణ వేలార్హస
త్కాంతుల్ నించిరికాక (కానియెడ లోకశ్లాఘ్యసౌభాగ్యసు
క్కాంతాలోకమణి న్మణీశతములం గైసేయఁగా ముగ్ధలే)

240
ఇవి అఖండయతులు. ఈ మొదలైనవి నిత్యసమాసములని లాక్షణికులు వ్రాసినారు. వారు చెప్పిన లక్షణముకు లక్ష్యములకు కుదురదు. పదము వేర్పాటు కాకుండగ నుండవలెనని లక్షణము చెప్పిరి. (పదములు) స్పష్టముగ వేర్పడియుండెను. బహువ్రీహి, తత్పురుషాదులన్నియు నిత్యసమాసములే అయితే, వేరే నిత్యసమాసములని చెప్ప బని లేదు. అఖండయతి నొప్పక నివి (యన్ని)యు నిత్యసమాసము లన్నారు కాని, యివి నిత్యసమాసములు గావు. 241
నిత్యసమాసయతు లనగా
'కర్ణాట' పదము, హల్లుకు
శ్రీనాథుని గారి వీథి నాటకము
మ.

కుసుమంబద్దిన చీరకొంగు వొలయం గ్రొవ్వారు పాలిండ్లపై
ద్రిసరంబుల్ పొలుపార వేణి యవటూదేశంబుపై రాయగా
బస నెవ్వాఁడొ యొకండు రాత్రి రతులం బల్గాసి గావించిన
న్వసివాల్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనన్ గంటిరే

242
ఇందు కర్ణశబ్ద, ఆటశబ్దములు వీడి యుండవుగాన, వేర్పాటు గానబడని ప్రాణసంధి గలదు. 243
అచ్చుకు
భాస్కరుని రామాయణము (కిష్కిం. 831)
శా.

లాటీ చందన చర్చ చోల మహితా లావణ్య సామగ్రి క
ర్ణాటీ గీతకలా సరస్వతి కలింగాంతఃపురీ మల్లికా
వాటీ మంజరి గౌల వామనయనా వక్షోజహారాలియై
పాటింపందగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ సాహిణీ.

244
ఇటు వలెనే, జనార్దన, రామాయణాది శబ్దములకు లక్ష్యములు వ్రాసినారు. ఇవి నిత్యసమాసము లౌను. (ఇక) కైలాసాది నిత్యసమాసయతులకు లక్ష్యములు వ్రాసుతున్నాము. 245
స్వరములకు
సీసమాలిక.

అబ్జనాభుండు కైలాసంబు జొచ్చి క
             మలములఁ బూజించె సాంబశివుని
కాసారకమలకోమలమారుతము వీచె
             పారంగి దనరారె కాననముల
కాకోదరములు కాంతారమందుండును
             కాంతారమందు వరాహ మలరు
కాననంబులను లులాయంబు దనరు, శ
             క్రాణి ధరించు మందారసుమము,
లిభవక్త్రునకు నారికేలంబు సంప్రీతి
             కోళులె శ్రీరాము పృతన కెల్ల
కేశముల్ జడవేసి మేఖలఁబూని వ
             రారోహ చెలఁగె పాంచాలి యనఁగ

సారంగమదము లలాటంబునను బెట్టి
             కాంతంబు మీఱ లలామకమును
కూష్మాండఫలము మధూకసుమములు గాం
             గేరి శలాటు ద్విరేఫవేణి
యవనిసురునకు నిచ్చె, శృంగారవతులు
నందఱును జల్లుకొనిరి పిష్టాతపటల
మనుచుఁ జెప్పిన నిత్యసమాసయతులు
చనుఁ బ్రబంధాలి బాలశశాంకమౌలి!

246
హల్లులకు హల్లులు సులభమే. కానీ నిత్యసమాసయతులని తెలియజాలరు గాన, వ్యంజనములకున్ను తెలియపరచుతున్నాము. 247
సీసమాలిక.

రమణీయమైన కైలాసంబు జూడ క
             మలనేత్రుఁ డరిగె జంభరిపుతోడఁ
గాననంబులయందుఁ గాసారములు గల్లఁ
             గాకోదరాలియుఁ గాసరములు
క్రీడించుఁగద నారికేరంబు దినుమంచు
             కేశవునకు దేవకి తమినొసఁగ
మేఖలఁదొల్చె సంప్రతి నొక్కర్తు వ
             రారోహ బెట్టె లలాట మందు
సారంగమదము పాంచాలినిఁ గనుఁగొని
             కాంతంబు మీఱఁగాఁ గ్రాలి యపుడు
తోరంబులైన మధూకసుమములుగా
             గేరి శలాటు సుకేశియొకతె
ప్రేమతో నొక్క ద్విరేఫాలక కిడె లు
             లాయంబు మత్తవరాహము బవ
రము సేయుచున్న కిరాంతుడు మదిమెచ్చె
             చక్కఁగా మృదులపిష్టాతపటలి

మగువయొక్కతె చిమ్మె కోమలము మీఱ
కలిగి చూపుల నగగ శక్రాణి యపుడ
టంచుఁ జెప్పిన నిత్యసమాసయతులు
జనుఁ బ్రబంధాలి బాలశశాంకమౌలి!

248
ఇవి నిత్యసమాసయతులు గాని, వర్గయతులు మొదలయినవి గావు, కేశి, కేశవ పదములు మాత్రము అఖండయతి. ఇటువలెనె తెలుసుకొనేది. 249

20. కాకుస్వరయతి

లక్షణము
అనంతుని ఛందము (1-94)
క.

కాకుస్వరయతియగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వడించె ననఁగఁ బ్ర
శ్నాకలిత దీర్ఘమున నితఁ
డే కవ్వడి రథము గడపె నిమ్ముల ననఁగన్.

250
ఈ పద్యమందు 'ఇతడే' అను చోట ప్రశ్న అని చెప్పినారు గాని, (ఆ పదము) నిశ్చయార్థమును చెప్పుచున్నది గాని ప్రశ్నార్థమును చెప్పదు. రంగరాట్చందమున నీ పద్యములకు లక్ష్యము చెప్పిన పద్యము—
క.

వసుమతి రసికాగ్రణియై
యెసఁగిన యానందరంగఁడే బ్రోచు సుధీ
విసరముల నామహాత్ముని
యసమసమఖ్యాతి వింటిరా కవులారా!

251
మొదట నిశ్చయము, రెండవచోట నిబోధమును తెలుపుచున్నది. 252
(ఇక) కాకునూరి అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణి (3-241,2) యందు
క.

వలుకుల తలఁగల వ్రాలకు
వలనగుచోఁ బ్లుతము నిలిపి వానికి రెండున్
వలులుగఁ జెప్పిన కావ్యం
బుల నది కాకుస్వరంబు ప్లుతవలియు నగున్.

253

గీ.

ఏక మాత్ర హ్రస్వ మినుమడించిన దీర్ఘ
మయ్యే మూఁడు మాత్రలైనఁ బ్లుతము
భీతి శోకతర్క గీత దూరాహ్వాన
సంశయార్థములను జరుగుఁ బ్లుతము.

254
అని చెప్పినారు కాని, అనాదిగా దూరాహ్వాన, సంగీత, రోదన, సంశయములు - నాలుగు విధములు ప్లుతయతులని సుప్రసిద్ధిగా నున్నవి. కాకుస్వరయతులు-ప్లుతయతులు — కనక, సువర్ణ శబ్దములవలె శబ్దభేదమేవాని అర్ధభేదము లేనటుల నెవరును చెప్పలేదు. భీతి, తర్కములు రెండు మాత్రము కాకుస్వరయతులు, ప్లుతయతులు నాలుగు కన్నను (భిన్నముగా) కనుపించుచున్నవి. మరికొందఱు లాక్షణికులు శోక, భయ, సంశయ. ప్రశ్న – ఈ యర్థములందు కాకుప్లుతయతులన్నారు. ప్లుతయతులయిన రోదన, సంశయములు కాకుస్వరయతులందు వ్రాసుట పొరపాటు. సకలలాక్షణికాభిప్రాయము కనుగొనగా, భయ, తర్క, పశ్న- ఈ మూడు విధములు మాత్రము ప్లుతయతులు నాలుగు విధముల కన్నను (భిన్నముగా) కనుపించుచున్నవి; కాని వారు వ్రాసిన లక్ష్యములు పరిశీలించితే వారిమతము (నని) యనుసరించవు. 255
కాకు స్వరయతు లనేకవిధములు కనుపించుచున్నవి. ఇరవై అయిదు విధములకు లక్ష్యములు కనుపించినవి. అవి తెలియపరుచుచున్నాము— 256
సీ.

కాకుస్వరంబు లనేక విధంబులు
             దలప, నమిత నిబోధనములందు
వ్యంగ్య నిందా నిశ్చయ వ్యర్థతా క్షేప
             ణానంది తోద్ధతత్వానునయము
లందు ప్రశ్న ప్రార్థ నాశ్చర్య పరిహాస
             తర్క బోధకతానుతాపములను
వ్యాజస్తుతి విచార ప్రాగల్భ్య భీతి శం
             కాంగీకరణ కృతులందు పృచ్ఛ
శ్లాఘలను జెందు సుకవి కావ్యౌఘములను
హల్లులకు నచ్చులకు మేర్వహార్యచాప!
చక్రధరరోపపరిహృతసకలతాప!
ఢక్కికోద్దీప! శ్రీకుక్కుటస్వరూప!

257
అర్థము — 1. అమిత - ఆపరిమితమందున్ను, అనగా, తదర్ధప్రతిపాదకస్థలమందు ననుట - అంతట నిదే తాత్పర్యము. 2. నిబోధన - చెప్పుటయందును, 3. వ్యంగ్య - ధ్వనియందును, 4. నింద - నిందయందును, 5. నిశ్చయ - ఖలు, ఏవ కారార్థములందున్ను, 6. వ్యర్థత - వైఫల్యమందును, 7. ఆక్షేపణ - ఆక్షేపించుట యందున్ను, 8. ఆనందిత - ఆనందించుట యందున్ను, 9. ఉద్ధత - ఔద్ధత్యమందున్ను, 10. అనునయ - బతిమాలుకొనుట యందున్ను, 11. ప్రశ్న - ప్రశ్నయందున్ను, 12 ప్రార్థన - ప్రార్థించుట యందున్ను. 13. ఆశ్చర్య - ఆశ్చర్యమందున్ను, 14. పరిహాస - పరిహాసమందున్ను, 15. తర్క - తర్కించుట యందున్ను, 16. బోధకత - హితోపదేశము చెప్పుటయందును, 17. అనుతాప - పరితపించుటయందును, 18. వ్యాజస్తుతి - వ్యాజస్తుతియందును, 19. విచార - విచారమందును, 20. ప్రాగల్భ్య - ప్రౌఢతయందును, 21. భీతి - భయమందును, 22. శంక - శంకయందును, 23. అంగీకరణ కృతి - ఒప్పించుటయందును, 24. పృచ్ఛ - అడుగుటయందును, 25. శ్లాఘ - శ్లాఘించుట యందును; - ఈ యర్థప్రతిపాదకస్థలములందు హల్లులకు, నచ్చులకు చెల్లును258
లక్ష్యములు
1. 'అమితము' కు; హల్లుకు
చేమకూరవారి విజయ విలాసము (3-138)
మ.

సకియల్ గొందఱు వెంటవచ్చి మణిభూషల్ చక్కఁగాఁ దీర్చి చం
ద్రిక పూవన్నియ జిల్గు చేలకటి నెంతే గట్టిగా గట్టి పెం
డ్లికుమారుండు కరాగ్ర మూత యొసఁగున్ వ్రీడావతిం దేరుమీఁ
దికి నెక్కించిరి మందహాసకలనాదేదీప్యమానాస్యలై.

259
'ఎంతే' అనుచోట అమితము. మూడవచరణమందు ననునాసికయతి 'చేల' అని స్త్రీలింగమున్ను గలదు.260
అందే (3–154)
మ.

రకపుంజెయ్వులఁ దా వినోదమున సారథ్యంబు గావించు క
న్యకపైఁ బెట్టిన చూపెకాని యట సేనల్ జూచుట ల్లేదు, సా

యక పఙ్క్తుల్ నడచున్ సహస్రములుగా నయ్యారె వివ్వచ్చు చే
తికి కన్నుల్ గలవంచు నెంచి రపు డెంతే యోధవీరాగ్రణుల్.

261
ఇవి వర్గయతు లనుకొందురు. 262
అచ్చుకు
కృష్ణరాయల ఆముక్తమాల్యద (4-107)
ఉ.

సారెకు మింట మేఘుఁడు నిజస్ఫురణం ఒఱఁ గ్రూరమౌ పురోం
గారక యోగ మూఁది తిరుగన్ సకుటుంబము తద్గృహంబు నెం
తే రుషఁ ద్రొబ్బ నంతలును నింతలునై పడు తన్నభశ్చ్యుతాం
గార శిశు ప్రతానముల కైవడి రాలెను నింద్రగోపముల్.

263
ఇక్కడ నఖండయతి గాదు. 'అమిత' మను కాకుస్వరయతి చెప్పవలె. రెండవ నాల్గవ చరణములందు నిత్యసమాసయతులు గాని, వర్గయతులు గావు. 264
అందే (4–112)
స్రగ్ధర.

గ్రావాలం గేతకీ కోరకకుటజరజో రాజి దూర్వాంకురశ్రీ
తో వీక్షింపం దినాను త్రుటి మఱుపడుచుం దోచు నిట్లే విరోధా
నావిర్భావంబులన్ బాయక పొరయు నభస్యాభ్రమల్ గప్పె నెం
తే విప్పై పింఛికల్ బర్హణులు దిరుగఁబెల్లింద్రజాలంబు సూపెన్.

265
నాలవ చరణమందు రెండు చోట్లను స్వరమున్నందున 'నమిత' మను కాకుస్వరయతి నంగీకరించక విధిలేదు. 266
కవి ధూర్జటిగారి కాళహస్తీశ్వరశతకము
మ.

అతిదుర్గంధము మూత్రపూరితము నేహ్యంబున్ మహారోమసం
యుతమౌ బెత్తెఁడు యోని జూచి నరు లెంతో మోహవిభ్రాంతులై
మతి నూహించి సురేంద్రభోగ మనుచున్ మానంగలే రెంతయున్
క్షితిలో మూఢు లదెట్టి చోద్య మహహా శ్రీకాళహస్తీశ్వరా!

267
'ఎంతో' అనుచోట. 268
హల్లుకు
చేమకూర వారి విజయవిలాసము (అవ 20)
ఉ.

శైలము చెక్కి యష్టమద సామజమౌలుల మీఁదుగా మహా
కోల కులేంద్రు దాటి బలుగొమ్ము మొనం బడి సర్వదా విష
జ్వాలలు గ్రమ్ము శేషువుని చాయనె యోడకవచ్చి కూడె నౌ
భూలలితాంగి కెంత వలపో రఘునాథ నృపాలునందునన్.

269
'వలపో' అను చోట.270
మరియు నందే (1-16)
సీ.

నీ తృణముఁ జేయు నెంతే వాని నైన నీ
             నీలంపు ముంగర నీలవేణి...

271
'ఎంతటి వాని' నని ప్రతి పుస్తకమునందున్నది. యతిభంగము కానరు. 272
పూర్వలాక్షణికులు నిర్ణయించిన భీతి, శోక, తర్క, గీత, దూరాహ్వాన, సంశయ, ప్రశ్న— ఈ యర్థములలో నొకటియు నిచ్చట కనుపించదు. హల్లులు ప్రధానమైనచోట వర్గయతి మొదలైనవి చెప్పవచ్చును. అచ్చులు ప్రధానమైనచోట మరియొక యతి చెప్పవల్ల లేదు, గాన నేను నిర్ణయించిన 'యమిత' మను కాకుస్వరయతి చెప్పు టొప్పగును. 273
2. 'నిబోధము' కు, హల్లుకు
చేమకూర వారి విజయవిలాసము (1-199)
శా.

చెండ్లా గుబ్బలు జాళువా తళుకులా చెక్కిళ్లు డాల్ సింగిణీ
విండ్లా కన్బొమ లింద్రనీలమణులా వేణీరుచుల్ దమ్మిలేఁ
దూండ్లా బాహువు లింతచక్కదన మెందుంగాన మీజవ్వనిం
బెండ్లాడం గలవాఁడు చేసినది సుమ్మీ భాగ్య మూహింపఁగన్.

274
'సుమ్మీ' అనుచోట. ఇది బిందుయతి యనరాదు. అందఱును బిందుయతి యని చెప్పినారు. 275
అందే (2–168)
ఉ.

కోమలి యీగతిన్ మది దగుల్కొన వల్కిన (నవ్వి) నిర్జర
గ్రామణి సూను మీరెచటఁగంటిరొ యంటివి కన్నమాత్రమే
యేమని చెప్పవచ్చు నొక యించుక భేదము లేక యాయనే
మేమయి యున్నవారము సుమీ వికచాంబుజపత్రలోచనా.

276
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-96)
క.

మేలాఱడి బెట్టంగా
మేలా నిలు పోవలదు సుమీ చలమేలా
మేలా వరసుతరూపస
మేలా రమియింపు మనుచు మీఁదం బడియెన్.

277
ఇవి ఎక్కటియతు లనరాదు. 'మీ' అనుచోట స్వరమున్నది. 278
అచ్చుకు
అందే (2-24)
గీ.

ఈ సుబుద్ధిమాట యెంత లేదని పోవ
నీసు బుద్ధి నిడు సుమీ లతాంగి
నిలు పరాకుమాని తలపోసి చూడుమా
నిలుపరాకు మనుచు నలుగనేల.

279
అందే (2-233)
ఉ.

ఇంతకుఁ గీర్తి రాగ త్యజియింతును బ్రాణమదెంత యీ విధం
బంతయు నీకుఁ దెల్పుటకునై యిటు లుండితి నీదుపట్టి న
న్నెంతయుఁ బ్రేమఁబట్టి రమియించిన యప్పుడె మామవైతి నీ
కింతటి నుండి కోడలఁ జుమీ ననుముట్టకు రాజశేఖరా.

280
అందే (2-63)
ఉ.

అందు వినోదమార్గములయందు విశేషములందు హర్వులిం
పొందఁగఁ జూచి మానికపు టోవరిలో సొగసుల్ నటింపఁగా

గందము వక్కలాకులును గైకొను వేడ్క నొకింత సేపు నీ
వందుల విశ్రమించి చనుమా చనుమానముతోడ నావుడున్.

281
'చనుమా' అనుచోట.282
చేమకూర వారి విజయవిలాసము (2-122)
శా.

కామాది స్ఫురణంబులెల్ల నణగంగాఁ జేసి ధన్యాత్ములా
స్వాముల్ వీరలు వీరి కింపొదవు ఠేవన్ సేవ గావింపు మెం
తో మోదంబున నానతిచ్చి బలభద్రుండే నియోగించి నాఁ
డేమో చెప్పితినంచునుండెదవు సుమ్మీ నీమదిన్ సోదరీ.

283
మూడవ చరణమందు ‘నమిత' మను కాకుస్వరయతియు (నున్నది.) 284
కృష్ణరాయల ఆముక్తమాల్యద (1-14)
ఉ.

ఎన్నిను గూర్తు నన్న వినుమీ మునుదాల్చిన మాల్యమిచ్చు న
ప్పిన్నది రంగమందయిన పెండ్లియె చెప్పుము, మున్ను గొంటినే
వన్నన దండ యొక్క మగవాఁడిడ నేన తెలుంగు రాయఁడన్
గన్నడరాయ యక్కొదువఁ గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్.

285
అడిదము సూరకవి 'కవిజనరంజనము'
క.

ప్రేమ విడెమొసఁగఁ గైకొను
మీ మగనినిఁ గౌఁగిలింత కెడసేయకుమీ
మోమెత్తి ముద్దొసంగుమి
యో ముద్దులగుమ్మ యింకకుండెడు సుమ్మీ.

286
సుమీ, సుమ్మీ, సూ, చనుమా, చనుమీ, వినుమా, వినుమీ, వినవో ఈ మొదలైన పదముల చివర స్వరమున్నది గాన నుభయము చెల్లును. 287
మనుచరిత్రము (3-99)
ఉ.

ఓ సరసీరుహాక్షి వినవో రతిఁగౌఁగిట నిన్ను చేర్పు నిం
పా సురభర్త కైనఁ గలదా వలదంచుఁ బెనంగనేల స
న్యాసినె యొక్కటే తహతహ న్మన పొగ్గరు కేలికైన 'నా
శ్వాసితదుఃఖితే మనసి సర్వమసహ్య'ముగా నెఱుంగవే.

288
రెండవ చరణమందు వ్యంగ్యకాకుస్వరయతి (యు నున్నది.) 289
ఉభయముకు
పారిజాతాపహరణము (5-86)
సీ.

మేలవించినవి సుమ్మీ దీని మెట్లని
             మాంసలాంసంబున మహతిఁ జేర్చి
మిన్నేటిజలము సుమ్మీ తొలఁకెడునని
             డాచేత మణికమండలు వొసంగి
యిది జపోచితము సుమ్మీ జతనంబని
             వలచేతఁ బద్మాక్షవలయ మిచ్చి
యీశానుఁ డిచ్చె సుమ్మీ మాకు నిది యని
             శార్దూలచర్మంబుఁ జంకఁ జొనిపి
పొమ్ము పొమ్మని యొకకొంత పోవఁబనిచి
రమ్ము రమ్మని యొకకొంత రాగఁ బిలిచి
కపటనటనాపరుండైన కంసవైరి
బరమముని నవ్వుటాలకుఁ బనులు గొనియె.

290
అందే (2-28)
చ.

అదితి మొఱంగి కుండలము లానరకుండు హరించె వాని నే
కదనములోన ద్రంచి యవి గైకొని దాచితి నాటనుండియుం
బదిలముగాఁగ నన్నడుగఁ బంపని కారణమేమి లాతినే
యిదె చనుదెంచి యిత్తుననుమీ శతమన్యునితోడ సంయమీ.

291
లాక్షణికులు సంశయప్లుతమందు 'అనుమీ' అనునది వ్రాసినారు. సంశయ మెక్కడను కనుపించదు నిబోధనమే స్పష్టముగా నున్నది. 292
మరియును, హల్లుకు
శ్రీనాథుని కాశీఖండము (3-198)
శా.

పౌనఃపున్యమునన్ ఘటింపఁ దొడఁగెన్ బ్రహ్మాన్వయోత్తంస, గో
ష్ఠీనాగ్రంబున లేగపెయ్య యది కంటే కామధేనూద్భవం

బానందంబున డెందముబ్బఁగ జనన్యాపీన వాపీసుధా
పానోత్పుచ్ఛ మనూనమై చటుల ఝంపాతాండవాటోపమున్.

293
'కంటే’ ఆనుచోట నిబోధనము సంయుక్తయతి యనరాదు. స్వర మున్నది.204
వసుచరిత్రము (2–8)
మ.

ఘనజాంబూనదకావ్యరత్నరుచులన్ గన్పట్టు నీ గట్టుఁజు
ట్టిన గండోపలమండలంబుఁ గనుగొంటే మేదినీశైలశా
సన, యుష్మచ్చరణావధూతమగు నీశైలంబు నూరార్పఁగా
ననుకంపామతిఁ జేరు మేరు ముఖగోత్రాధీశులన్ బోలెడున్.

295
విరాటపర్వము (5-129)
క.

ద్రోణుఁడు రయమున నేసిన
బాణము లెడఁదెగక యొక్కబాణమ పోలెన్
శ్రేణి యయి పోవఁ బార్ధుఁడు
రేణువు గావించెఁ గంటిరే చిత్రగతిన్.

296
పారిజాతాపహరణము (2-25)
మ.

అనికైనం బతి నిన్నుఁ బాసి చనునో ప్రాణంబు ప్రాణంబుగా
నిను మన్నింపఁడొ నీమనోరథములున్ నెయ్యంబునం జేయఁడో
చనవుల్ నీవలె నెవ్వరేనిఁ గనిరో సౌభాగ్య మింతింతయే
నినుఁ బోలంగల రబ్జగంధులన వింటే యెందు సాత్రాజితీ.

297
(చివర చరణమందు) అనునాసికయతి గాదు. 298
అచ్చుకు
అందే (2-91)
శా.

ఏణీశాబవిలోలనేత్ర కనుగొంటే వీరు విద్యాధరుల్
మాణిక్యోజ్జ్వలరత్నకుండలులు సంబద్ధాసిధేనుల్ రణ
ద్వీణాపాణులు చంద్రికామలశిరోవేష్టుల్ త్రిపుండ్రాంకితుల్
నాణీయస్తవతారహారులు శివధ్యానైకనిష్ఠాపరుల్.

299
'కనుగొంటె' అనే చోట స్వరప్రధానమైనందున, నంతట స్వర మున్నది గాన (ఇట) నిబోధన కాకుస్వరయతి. ఇచ్చట మరొకటి పొసగదు.300
శ్రీనాథుని నైషధము (3-134)
క.

ఇందుండి యూర్ధ్వగతియును
నందుఁడి యధోగతియును నవసానమునం
బొందును సజ్జనుఁ డిందును
నందును గల వాసి చూడుమా డెందమునన్.

301
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-259)
చ.

పొలయక నీరు గానఁబడఁ బొందుగఁ దెల్పు టదే నిజంబుగా
దలఁచెద నీ వదంతయును దబ్బరసూ మగవాఁడు బొంకెనా
యల దడిగట్టి నట్టులగు నాడుది బొంకిన గోడ వెట్టిన
ట్లలవడునన్న మాట వినరా వనరాశిపరీతభూభుజా!

302
'వినరా' అనుచోట. 303
బాలురకు తెలియుటకై యిన్నిలక్ష్యములు వ్రాసినాము.304
3. 'వ్యంగ్యము'కు, హల్లుకు
ద్రోణపర్వము (2-308)
క.

కౌరవసైన్యంబులఁ గల
వీరుల యస్త్రములు నాదు వివిధాస్త్రగతి
క్రూరప్రవాహముల కెదు
రే రాజీవాక్ష యాదరింపకు వారిన్.

305
‘ఎదురే' అనగా, ఎదురుగాదనుట. ఇదే వ్యంగ్యము.306
చేమకూరవారి విజయవిలాసము (1-182)
ఉ.

చెప్పెడిదేమి కన్నుఁగవ చేరల కెక్కుడు చంద్రబింబమో
తప్పదు మోము మోవి సవతా చివు, రెక్కడి మాట గొప్పకున్
గొప్పపిఱుందు గబ్బిచనుగుబ్బలు కౌఁగిటి కెచ్చు జాలువా
యొప్పులకుప్పమేను నడుమున్నదొ లేదొ యెఱుంగ మింతకున్.

307
'సవతా' అనగా, (సవతు) సమానము గాదనుట.308
అచ్చుకు
అందే (అవ. 54)
ఉ.

ఆనతి యిచ్చెనా యది శిలాక్షర మెవ్వరినైన మెచ్చెనా
గృతార్థుఁజేయుఁ బగవాఁడయినన్ శరణంబుఁ జొచ్చెనా
యా నరు నేరమెంచక తనంతటివాని నొనర్చు, నిచ్చెనా
యేనుఁగు పాడి యీడుగలరే రఘునాథ నృపాల శౌరికిన్.

309
'ఈడుగలరే' అనుచోట. 310
చేమకూరవారి సారంగధరచరిత్రము (3-100)[8]
సీ.

చంద్రోదయంబైన చందాన నీరాక
             కన్నులు చల్లఁగాఁ గాంతు నెపుడు
నిను గొండఁగాఁ జూచుకొని యేవిచారంబు
             లేక నుండుదు నాత్మ లేశమైన
నిసుమంత దవ్వైన నీవు రాకుండిన
             నిదియేమొ రాఁడని యెదురుచూతుఁ
తెలియఁజూచినయెడ దృష్టిదాకునొ యని
             వేడ్కదప్పక చూడ వెఱతు నిన్ను
నెటులఁ దరియింతు నీరూప మెటులఁ గాంతు
నీ విఁకను వత్తువని యెదురెదురు జూతు
మనసులో నిన్ను నేలాగు మఱువవచ్చు
నీవు లేనిది యొక బ్రతుకే కుమార!

311
‘బ్రతుకే'- బ్రతుకు కాదనుట ఇటువలెనే తెలుసుకునేది. 312
4. 'నింద’ - హల్లుకు
కవిధూర్జటిగారి శ్రీకాళహస్తీశ్వరశతకము
శా.

రాజై దుష్కృతిఁ జెంది చందురుఁడు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డా మాటనే
యాజింగూలె సమస్తబంధువులతో నా రాజశబ్దంబు సీ
నీ జన్మాంతరమందు నొప్పదు సుమీ శ్రీకాళహస్తీశ్వరా!

313
అందే
శా.

వేధం దిట్టఁగరాదుగాని భువిలో విద్వాంసులం జేయనే
లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులా మాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ గలిగించనేల యవికృత్యంబైన దుర్మార్గులన్
సీ ధాత్రీశులఁ జేయనేటి కకటా శ్రీకాళహస్తీశ్వరా!

314
రెండవ చరణమందు 'వ్యర్థత'నే కాకువు. 315
జగ్గకవి సుభద్రాపరిణయము
ఉ.

అక్కట నేనుగోరిన శుభాంగుఁడు నన్ను వరించు వేడుకన్
మక్కువ పిక్కటిల్ల యతి మాడ్కిని డగ్గరివచ్చి వేడినన్
జిక్కని గుబ్బచన్ను లెడఁజేర్చి కవుంగిట బిగ్గఁజేర్చకేఁ
జిక్కులు బెట్టి వచ్చితి నిసీ యతఁ డెంత విరాలిఁదూలెనో.

316
'సీ' యనుచోట నింద. 317
అచ్చుకు
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (అయో. 86)
గీ.

ఆలి మాటకొరకు బేలయై కోడలిఁ
కొడుకుఁ బోవద్రోచుకొనియె నితని
దేటి మగతనం బిసీ కడు కొదువేని
ఱట్టువొందె నింక ఱంతు లేల.

318
సీ, ఇసీ, ఇస్సీరో- ఈ మొదలయినవి నింద (ఇటువలెనే తెలుసుకొనేది.)319
5. 'నిశ్చయము'. హల్లుకు
వసుచరిత్రము (1-11)
శా.

భావం బేకడ లేక వృత్తనియమాపాయంబు చింతింప కెం
దే వర్తించు పరార్థవంచనలచే దీపించి మూర్ఖాలి సం
భావింపం గుకవిప్రణీతకృతి సామాన్యాకృతింబూని పై
పై వన్నెల్ బచరింప, దానిఁ దిలకింపంబోరు ధీరోత్తముల్.

320
'ఎందే' అనుచోట. మొదటి చరణమందు ప్రాదియతి. 321
చేమకూరవారి విజయవిలాసము (3–34)
ఉ.

లెంకగ నేలుకోగలదులే మగనిం దఱితీపుజేసి మీ
నాంకుని పాదమాన మన మాదట వేడిన మాఱు వల్కఁగాఁ
గొంకెడునంచు మీరిపుడు గోలని చూడకుఁడమ్మ నేర్చుఁబో
చంకల బిడ్డ లూడిపడ సారసలోచన మాట లాడఁగన్.

322
మొదటి (చరణమందు) 323
అచ్చుకు
చేమకూరవారి విజయవిలాసము (2-147)
ఉ.

సుందరి రానిచో నెదురు సూచుచునుండఁగఁబట్టు, వచ్చుచో
నిందునిభాస్య చక్కదనమే గని చొక్కుచు నుండఁబట్టు, నీ
సందడి చేతనే యరుగ సాగెను ప్రొద్దిఁక వేల యెప్పుడో
సందెజపంబు లర్చనలు సల్పఁగ నా కపటత్రిదండికిన్.

324
'చక్కదనమే' (అనుచోట). 325
అందే (1-131)
క.

వాతెరకు నమృతమే తుల
మే తులకింపగు పిసాలి మిసిమికిఁ గ్రొమ్మిం

బే తుల, చేతుల కబ్జము
తే తుల లేతుల వెలందు నీచెలి తులయే.

326
‘అబ్జములే' (అనుచోట.) 327
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1−7)
ఉ.

యాదవసార్వభౌము భయదాయతబాహు నియుక్తిఁ జేసి యం
దే దనుజేంద్ర సాల్వపుర హేమమణీవరణంబు సంగతం
బై దివి నాత్మకంకణములం దొకకంకణ మయ్యె నట్టి కౌ
మోదకి మోదకీలితసముజ్జ్వలకల్పకమాల్యఁ గొల్చెదన్.

328
చివర (చరణమందు) ప్రాదియతి. 329
కవిజనరంజనము
క.

లోకాలోక మహీధర
మే కోట కులాచలములు కృతకాద్రులు కే
ళాకూళులు జలరాశులు
శ్రీకర ధృతి సాంద్రుఁడౌ హరిశ్చంద్ర నృపతికిన్.

330
‘మహీధరమే’ (అనుచోట.) 331
కాకునూరి అప్పకవి ఆంధ్రశబ్దచింతామణి (1-96)
క.

రసమునకు నాశ్రయంబై
యసదృశమగు నెద్ది యదిగదా శబ్దము రా
క్షసదమన రసికులనఁగా
వసుమతిఁ దద్విధ మెఱుంగు వారలు సుమ్మీ.

332
ఈ పద్యమందు నప్పకవిగారు నిర్ణయించిన భీత్యాదులు నాఱింటిలో నొకటియు గనుపించదు. (మరి) యేమి నిశ్చయించుకుని యచ్చుకు యతి నిడిరో తెలియదు. 333
6. 'వ్యర్థత', హల్లుకు
పారిజాతాపహరణము (1-125)
ఉ.

ఈ నయగారపుం బ్రియము లీ పను లీ మొగమెప్పు మాట లే
లా నిను నమ్మియుండిన ఫలంబిది తోడనె కల్గె నాకు నీ
యాన జుమీ ననుం జెనకి యాఱడి బెట్టుకు నవ్వువారలం
గాన నెఱుంగునే పసులకాపరి భావజ మర్మకర్మముల్.

334
'ఏలా' అని వ్యర్థ(త్వ)ము. 335
మనుచరిత్రము (2–64)
శా.

ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయివినా వచించెదవు మే లోహో త్రయీధర్మము
ల్పాపంబుల్ రతిపుణ్యమంచు నిక నేలా తర్కముల్ మోక్షల
క్ష్మీ పద్యాగమ సూత్రపఙ్క్తి కివెపో మీ సంప్రదాయార్థముల్.

336
అచ్చుకు
అందే (3-84)
శా.

రా వైరాగ్యము పూని నీవు దగ నిర్దాక్షిణ్యచిత్తంబునన్
రావైతే జనిగాని యందులకు హోరాహోరిగాఁ బోరి యే
లా వాలాయము సేయఁగా బ్రతుకు మీ వాచారవంతుండవై
చావో యెక్కుడు నీ యెడంబొడము నెచ్చం భూసురగ్రామణీ.

337
శ్రీనాథుని నైషధము (5-28)
ఉ.

భావజు కేలివైభవము పట్టున నీచికురాగు మోవి యా
శీ విషనాయకుం డెవఁడు సేవ యొనర్చుట నర్థకారిగా
దో వనజాక్షి, యయ్యమృతమున్నది నీయధరంబు నందు నే
లా వెఱువన్ సుధారసమునందు విషంబు పరిస్ఫురించునే.

338
7. 'ఆక్షేపణ', హల్లుకు
వసుచరిత్రము (4-28)
ఉ.

ఇంతుల నేచు పాప మిది యింతటఁ బోవదు సుమ్ము పాంథ లో
కాంతక నిన్ను ఘోరతమమై ఘనమై యజహత్కలంకమై
వంతల బెట్టి యాఱు పది వ్రక్కలు సేయక పూర్వపక్షపుం
గంతులకేమి చూచెదవుగా తుది నీ బహులార్తి ఖేదముల్.

339
'చూచెదవుగా' అనుచోట 340
అచ్చుకు
అశ్వమేధపర్వము (4-52)
ఉ.

యాగవిముక్తమై చను హయంబున కడ్డము వచ్చి పట్టికా
కీ గతి మెత్తఁబాటు దగునే నృపధర్మవిహీనతన్ రణో
ద్యోగము లేక తక్కి భయ ముల్లము జేరఁగ నిచ్చు రాజు రా
జే గుణహీన పొమ్మనిన నేమియుఁ బల్క కతండు గ్రమ్మఱన్.

341
రెండవ; నాల్గవ చరణంబులందు. 342
చేమకూరవారి సారంగధరచరిత్రము (3-58)
ఉ.

ఏల బజారి ఱంతులివి యెవ్వరు మెత్తురు నోరిలోపలన్
వ్రేలిడి నప్పుడుం గఱువనేరఁడు నీ సుతుఁ డడ్డపాప గా
డే లలితాంగి నీవనక నేరికనందు రయారె పొమ్ము చా
ల్చాలును వ్రేళ్లసందులను జారెడు చారలు లేరిటెవ్వరున్.

343
'గాఁడే' (అనుచోట) 344
మనుచరిత్రము (2-64)
శా.

ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే...

345
8. 'ఆనందము': హల్లుకు
వసుచరిత్రము (2-125)
చ.

అన విని గట్టు రాకొమరుఁ డాననగహ్వరరోచమాననూ
తనతరదంతహీరరుచిధారలు వెల్వడ నొక్కలేఁతన
వ్వు నగి నిజంబె వల్కితి వవున్ ధువనాశయ సన్నివేశ వే
దీని సరసాగ్రగణ్యవు గదే యన యన్నది వల్కు వెండియున్.

346
చేమకూరవారి విజయవిలాసము (1-66)
ఉ.

తీరిచినట్టు లున్నవిగదే కనుబొమ్మలు కన్నులంటి మా
చేరలఁ గొల్వఁగావలయుఁ (జేతుల యందముఁ జెప్ప గిప్పరా
దూరులు మల్చివేసి నటులున్నవి; బాపురె ఱొమ్ములోని సిం
గారము; శేషుఁడే పొగడఁగా వలె నీతని రూపరేఖలన్.)

347
'గదే’ అనుచోట్ల. 348
అచ్చుకు
అందే (3–126)
ఉ.

ఈయపురాల వైతివి గదే[9] యిపు డత్తవు తొంటివావి నో
తోయజనేత్రు గాంచిన వధూమణి (నీ సుతఁ బెండ్లి యాడఁగా
నాయము నా కుమారునకు నర్మిలి హత్తఁగ; నత్తవావిచే
నాయువు గల్గువాఁడవు నటండ్రు శుభంబగు దీన నెంతయున్.

349
అందే (2–18)
ఉ.

చక్కనికన్యకామణికిఁ జక్కనివాఁడగు ప్రాణనాథుఁడున్
జక్కనిశోభనాంగునకుఁ జక్కనియింతియుఁ గల్గు టబ్బురం
బెక్కడ నిట్లులుండ వలదే రతిదేవికి సాటి వచ్చుఁబో
యిక్కనకాంగి; మన్మథున కీ డితఁ డీడితరూపసంపదన్.

350
'వలదే' అనుచోట. 351
9. ‘ఔద్ధత్యము' హల్లుకు
చేమకూరవారి విజయవిలాసము (3-163)
శా.

ఏతన్మాత్రమే భారకార్యమనిపై యెత్తెన్నకే నేఁడు ని
ర్భీతిన్ బాలికఁ గొంచుఁబోవ నుచితంబే కండ గర్వంబు దు
ర్నీతుల్ యాదవవీరసింహములతోనేనా, బలారా, బలా
రాతిప్రోద్భవుఁ డెంతచేసె నిది మేరా వీరరాణ్మౌలికిన్.

353
("మేరా' అనుచోట)
10. ‘అనునయము’, హల్లుకు
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-127)
సీ.

లతకూనయని తగుల్ మతిఁగలంపఁడుగదా
             వేడి తావులు చల్లి వేచుఁగాని
జలజగంధి యటంచు సంభ్రమింపఁడుగదా
             చురుకు సోకులమీఁద సుడియుఁగాని
చిలుకలకొలికి యంచెలమిఁ బైకొనఁడుగా
             చిగురుటాకు కటారిఁ జిమ్ముఁగాని
కలువకంటి యటంచు నలరఁజేయఁడుగదా
             యుడుకువెన్నెల గాయఁ దొడఁగుఁగాని
మధుఁడు సారంగరథుఁడు మన్మథుఁడు విధుఁడు
వసుల పాతర వీరెందు మసలనీయ
రెటుల నిఁకఁ దాళగలదని యెఱుఁగవైతి
కటకటా నీకు దయరాదుగా యొకింత.

354
చివర చరణమందు 355
అచ్చుకు
అందే (2–212)
శా.

ఏమే పల్కవు మోహనాంగి యిటు లేలే యల్క చిత్రాంగి ని
న్నేమంటిం గలకంఠి నావలని తప్పేమే వయారీ యయో
నామీఁదం దయ లేదటే చెలి నను న్మన్నింపవే కోమలీ
నీ మాటల్ జవదాటకుండుదుగదే నీరేజపత్రేక్షణా!

356
మొదట చరణమందు 357
పారిజాతాపహరణము (1-123)
చ.

నను భవదీయదాసుని మనంబున నెయ్యపుటల్క దోచి తా
చినయది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము నాటిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన మదాలికుంతలా.

358
చివర చరణమందు. 359
శశిబిందుచరిత్ర
ఉ.

పయ్యెద బాపి గుబ్బలను బాహులఁ బట్టఁగ నిచ్చి మోవిపై
తియ్యని మోవియు న్మనసు దీరఁగఁ గ్రోలఁగ నిచ్చి యిప్పుడో
తొయ్యలి నీవి ముట్టినను ద్రోచెద వేనుఁగు నిచ్చి యంకుశం
బియ్యక కయ్యమాడ దగునే నను నీగతి వేచఁ బాడియే.

360
చివర చరణమందు 361
ఉభయముకు
తిమ్మకవి
చ.

కటకట యిప్పు డింత యలుకా యులుకా బలుకానలోన న
న్నటమట నొందఁజేయఁదగవా మగువా పగవాఁడనె యింక నె
న్నటికి నిన్నుఁ బాయఁగలనా లలనా వలనా కలంచ నే
నెటువలె తాళువాఁడ వలతీ పొలతి కలతీరు తెల్పుమా.

362
నాలుగు చరణము లందున్ను. 363
11. 'ప్రశ్న'. హల్లుకు
చేమకూరి వారి సారంగధరచరిత్రము (1-34)
శా.

లేవే భోజనమేటి కొల్ల విటు లేలే మేన బల్సొమ్ము లే
వే వేఁ బూనవు (వెల్లఁబాఱె మొగమేమీ రాజుతో నల్గి నా

వో వామాక్షిరొ తెల్పవే యనుచు గర్భోక్తుల్ చెలు ల్వల్కఁగా
వేవిళ్లం బొరలెన్ లతాంగి పతికిన్ వేడ్కల్ కొనల్సాఁగఁగన్)

364
మొదటి చరణమందు. 365
అచ్చుకు
వసుచరిత్రము (4-78)
శా.

ఏమే హేమలతా యటంచుఁ బనియేమే మాధవీ యంచు, నీ
భామా మన్మథుచంద మే మనుచుఁ జెప్పంజాల భూపాలుఁడా
రామక్షోణికిఁ జిన్ననాటగొలె నిద్రాసౌఖ్యము ల్మానినాఁ
డేమో యంచు వచింప వింటిఁ దమలో నేకాంతలీలాగతిన్.

366
మొదటి చరణమందు 'గొలె' యని హ్రస్వమున్ను గలదు. 367
శ్రీనాథుని నైషధము (7-19)
శా.

ఏమో క్రొత్తయపూర్వవార్త విను చేమీ చెప్పుచుం దండనా
థామాత్యాదులు పాదచారమున సేవాసక్తిమైఁ గొల్వఁగా
భూమీశాగ్రణి సొచ్చెఁ బట్టణము సంపూర్ణానురాగంబుతో
భామానేత్రచకోరచుంబితముఖప్రాలేయరుగ్బింబుఁడై.

368
(ఈ పద్యము మొదటి చరణము) అన్ని పుస్తకములందు 'వినుచేమో జెప్పుచున్' అని యున్నది. యతి భంగమైనది ఈ తప్పు పాఠముకే పండితు లర్థమును చెప్పుతారు. ఆ అర్థమున్ను తప్పు పాఠముకు కుదురదు. మొదట విమర్శ లేనివారికి నర్థవిమర్శ మాత్రమెటుల కలుగునుః 369
దమయంతీవివాహానంతరము నలమహారాజు స్వపురప్రవేశసమయమందలి పద్య (మిది) 'ఏమో నూతన వార్త వినుచు 'ఏమీ' అని రాజు ప్రశ్న చేసిన పిమ్మట (మరలనేమో) చెప్పుచు సరదారులు, మంత్రులు మొదలయినవారు పాదచారులయి—' మీద సులభమే. దండనాథామాత్య ప్రధానమంత్రి శబ్దములు నియోగులకు పేరులవును. దండనాథు లనఁగా యుద్ధసన్నద్ధులకు రూఢి
గావున పునరుక్తి దోషము లేదు. వార్తలు వినునపుడు 'ఏమీ' అనుట సామంతులకు స్వభావమే గావున నాశబ్దముంచుట ముఖ్యమే. 370
చేమకూరవారి విజయవిలాసము (3-31)
ఉ.

ఎవ్వనిఁ జూచి మేలుపడితే యరవిందదలాక్షి, నీ మనం
బెవ్వఁడు వచ్చుఁ జెప్పఁ గదవే మదకోకిల వాణి, నిన్న నే
డెవ్వని చెల్వు నీ యెదుట నెన్నఁబడెన్ లతాంగి, నేనకా
కెవ్వరు నీకు ప్రాణపద మేటికి దాచెదవే తలోదరీ.

371
ప్రథమ, ద్వితీయ చరణములందు. 372
12. ‘ప్రార్థన', హల్లుకు
ద్రోణపర్వము (2-379)
క.

మునినాథ దేవకీసుతుఁ
డును సంక్రందనతనూజుఁడుం బూనిన యా
పని యెమ్మెయిఁ గడతేఱెనొ
వినవలతుం దేటపరుపవే పరిపాటిన్.

373
కర్ణపర్వము (1-246)
చ.

గురుఁడును భీష్ముఁడుం బడినఁ గొంచెపుమూఁకలతోడ నేను సం
గరవిజయంబు గోరి భుజగర్వమునన్ సడిసన్న పాండుభూ
వరసుతవర్గముం దొడరు వాఁడనకా మది నిశ్చయించు టె
వ్వరిఁగొని యింత నీ వెఱుఁగవా నిను గర్ణునిఁ గాదె నమ్మితిన్.

374
శాంతిపర్వము (6–27)
క.

అనుపమ మజర మతీంద్రియ
మనామయ మనంత మమల మన వెలుఁగు నొకం
డని వేదశాస్త్రములచే
వినియుండుదు దానిఁ దెలుపవే కృప నాకున్.

375
అచ్చుకు
అందే (5–506)
గీ.

అనిన జనకుఁ డిట్టు లను వినినవియైన
వలయుఁ దెలియ వినఁగ వర్ణధర్మ
సమితిఁగల విశేషసాధారణత్వంబు
వేర్పరించి చెప్పవే మునీంద్ర.

376
అందే (2-54)
క.

శరణాగతుండ భక్తుఁడ
పరమపదవి గోరెదను శుభంబుగ నన్నున్
బరికించి యేది మేల
య్యిరవు దొరకొనంగఁ జేయవే కమలాక్షా!

377
మహాప్రస్థానికపర్వము (1-52)
సీ.

అనుటయు ధర్మజుం డమరేంద్రుతో నన్ను
             నత్యంత దృఢభక్తి నాశ్రయించి
పుర మేను వెడలు నప్పుడు మొదలుగ...
             జనుదెంచె నీ భవ్య సారమేయ
మిది యట రావలదే నామనంబు ని
             స్ఠురవృత్తి కోర్వ దస్తోకపుణ్య
నిరతాత్మ నావుడు దరహాస మొప్ప న
             బ్బలవైరి యిట్లంట పాడియే య
మర్త్యభావము కుక్కకే మాడ్కిఁగలుగు
ననఘ నీచింత తెఱుఁ గశక్యంబు దీని
విడిచి చనుటేల నిష్ఠురవృత్తియయ్యె
నిచటఁ దడయఁగ నేటికి నెక్కు రథము.

378
మనుచరిత్రము (2-78)
క.

జైమిని యాదివ్యఖగ
గ్రామణులం జూచి వేడ్క గడలుకొనంగా
నా మీఁది వరూధిని విధ
మేమయ్యె నెఱుంగఁ జెప్పవే నా కనుడున్.

379
చేమకూరవారి విజయవిలాసము (3-50)
క.

వలపెక్కడ లేదా యీ
యలికుంతల తలనె పుడైనా యేచ కిఁకన్
జలిగాలఁ ద్రోచి విడువుము
చెలి మిక్కిలి మనసు పేద శీతలపాదా!

380
13. 'ఆశ్చర్యము', హల్లుకు
రాజవాహనవిజయము
ఉ.

రామపయోధరంబు లదెరాఁ దనపై ఘనమయ్యె నంచుఁ దా
వేమరు వేరె రూపునఁ బ్రవీణతఁ గ్రిందొనరింప మేరు వు
ద్దామత నుండియుం గను స్వతంత్రులతో నఖవజ్రఘాతలన్
గ్రామము లెంత వింతలయిన న్మరి కర్మము లంత లింతలే.

381
మొదటి (చరణమందు) 382
అచ్చుకు
చేమకూరవారి విజయవిలాసము (1-106)
మ.

ఒకమాణిక్యపుబొమ్మ యెట్టివగ కీలో జాలువా జాలవ
ల్లిక బాగా ల్కపురంపుటాకుమడుపు ల్వేతెచ్చి రాజున్న చా
యకు నందియ్య నతండు లేనగవుతో నవ్వేల నావ్యాలక
న్యక కెంగేల నొసంగఁ గైకొనియె సయ్యాటంబు వాటిల్లినన్!

383
మొదటి (చరణమందు) 384
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-38)
చ.

ఉరుకుచ డెంద మెంత మృదువో మరి తియ్యనితుంటవింట న
వ్విరి విరిబోవు వారినిడి వేనలి గొజ్జఁగిపూవుచేత మ
చ్చరమునఁ బొంచి చచ్చియును జావనివాఁ డవు డేసి యార్చెఁబో
సురసుర స్రుక్కి (మెత్తనగు చోటనె) గుద్దలి వాడియౌ గదా!

385
మొదటి (చరణమందు) 386
అందే (3-215)
ఉ.

ఆయెడ రాజునానతి మృగాక్షిని రజ్జు నిబద్ధఁజేసి య
న్యాయము రాకుమారు సుగుణాగ్రణి పావనశీలు నుత్తమున్
మాయలు పన్ని మచ్చరము మై మని మించెను జూడనున్న ద
న్నా యిది మేకవన్నె పులి యంచుఁ దలారులు గొంచుఁబోవఁగన్.

387
చివరి (చరణమందు) 388
14 ‘పరిహాసము', హల్లుకు
చేమకూరవారి సారంగధరచరిత్రము (1-34)
శా.

లేవే భోజన మేటికొల్ల విటు లేలే మేన బల్సొమ్ము లే
వే వేఁబూనవు వెల్లఁబాఱె మొగమేమీ రాజుతో నల్గి నా
వో వామాక్షిరొ దెల్పవే యనుగు నర్మోక్తుల్ చెలుల్ వల్కఁగా
వే విళ్లం బొదలెన్ లతాంగి పతికిన్ వేడ్కల్ కొనల్ సాఁగఁగా.

369
అచ్చుకు
మనుచరిత్రము (2–41)
ఉ.

ఇంతలు కన్నులుండఁ దెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతము నందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతయ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు, నీ
కింత భయమ్ములే కడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్.

390
మూడవ చరణమందు 391
15 'తర్కము', హల్లుకు
శ్రీనాథుని కాశీఖండము (6-273)
మ.

గయకేలా యరుగంగ మానవులకుం గాశీపురీ వాహినీ
త్రయవేణీ పులినంబు లందు నిడరాదా తల్లినిం దండ్రినిం
బ్రియమాతామహులం బితామహులనుం బేర్కొంచుఁ బిండాన్నముల్
గయికోరోటు ప్రియంబుతోడఁ బితడల్ హస్తాబ్జముల్ సాచుచున్.

392
రెండవ చరణమందు 393
తారాశశాంకవిజయము
మ.

తొలి దేవేంద్రుఁడు మాకులంబుఁ జొరలేదో మేము నార్మోము రా
యల యంకస్థితిఁ గాంచలేదొ స్వరవిద్యల్ మున్ను మావారి శి
క్షలచేఁ బాణిని నేర్వఁడో యని కులస్థానప్రతిష్ఠన్ ద్రిభం
గుల ఘోషించె ననంగఁ గోళ్లు కలయం గూసెన్ ధరామండలిన్.

394
మొదటి చరణమందు 395
శాంతిపర్వము (1-287)
మ.

అనుమానింపక తోడఁబుట్టువులఁ గాదా దున్మి దూటాడె నెం
దును క్రొన్నెత్తురు టేఱులై పఱవ నింద్రుం డుగ్రతన్ దైత్యులన్
మును లవ్వీరు భజింపరో క్రతువు లామోదంబుతో నమ్మహా
త్ముని యాజింపరొ యార్ధ్వలోక మదికాదో యేలఁడో నాకమున్.

396
చివర చరణమందు అచ్చుకు:- 397
హరిశ్చంద్రోప్యాఖ్యానము (2-147)
శా.

ఓరీ రాజకులాధమా నృపులు లేరో వేటరారో మద
క్రూరాభీలమృగావలిం దునుమరో ఘోరాటవు ల్లేవొ నా
యారామంబుఁ గలంచి జంతుతతి మాయంజేసి యస్మత్కుమా
రీరత్నంబులు వేడ వచ్చినను వారిని నొంచినావేమిరా!

398
చేమకూరవారి సారంగధరచరిత్రము (3.63)
మ.

తొలుతన్ రాజులు భోగకామినుల యందున్ మోహితుల్గారొ యిం
పొలయన్ వారి కపారమైనధన మీరో యందుకే మిట్లు పు
త్రుల దండింపఁగ నిచ్చువారి వినమెందున్ నేడు చిత్రాంగి మం
దులు నీకుం దలకెక్కెనో పరవశాత్ముల్ గారె కామాతురుల్.

399
ఆముక్తమాల్యద (2–66)
మ.

తరుణుల్ తల్లియొరం గుచంబులునుపం దచ్ఛైత్యముల్ దీములై
పెరరేపం జనుదెంచెఁగాక రవి దీప్తిం జెంది పాతాలగ
హ్వరమం దూరిన వారి నీ యతుకుఁ ద్రాళ్ళాతెచ్చు (నాదీర్ఘ త
చ్ఛిరకృష్టిం గను నీటిశైత్య మలరించెన్ నూతులం దత్తఱిన్).

400
రంగనాథుని రామాయణము
ద్విపద.

అట్టినామీఁద నీవా యడరెదవు
పట్టి చట్టలువాపి పాఱవైచెదను.

401
మొదటి చరణమందు. 402
16. ‘బోధకత' – హల్లుకు
జగ్గకవి సుభద్రాపరిణయము
క.

యర్జునుఁ డీ బాయనె
మాయాయతివేషమూని మసలుచునున్నాఁ
డీ యిక్కువ నీ వెఱుఁగవు
గా యొక్కింతైన మత్తకరివరయానా!

403
చివర చరణమందు 404
అచ్చుకు
మనుచరిత్రము (3-34)
చ.

ఉడుపతి బారికి న్వెఱచి యూఱటమౌనని పేరుటామనిన్
ముడవడు కంతుసేనలకు ముయ్యలగుట్టగు నట్టి యిందురా

నడఁగక తాపవహ్ని ఘనమై హరిణేక్షణ ముల్లువుచ్చి కొ
ఱ్ఱడచిన చందమయ్యె పదమా యెఱదోటఁ జరింప కింటికిన్.

405
చివర చరణమందు. 406
17. ‘అనుతాపము'-అచ్చుకు
మనుచరిత్రము (3-36)
క.

ఓ చెల్ల విరహిణీవధ
మే చతురత నీకు దురితమే సేయుపనుల్
రాచరికమునకు ఫల మ
య్యో చంద్ర వివేక మెఱుఁగవో మరుసేవన్.

407
రెండవ చరణమున నిశ్చయము, నాలవచరణమున అనుతాపము 408
18. ‘వ్యాజస్తుతి’, హల్లుకు
పారిజాతాపహరణము (1-88)
ఉ.

నా మోగమాటకై వలని నాటకముల్ ఘటియించి రుక్మిణీ
కామినిమీఁదటం గలుగు గౌరవముం గృపయుం బ్రియంబుఁ దా
నేమియుఁ గానరాక నిటు లిన్నిదినంబులు నన్ను దేల్చెనో
తామరసాక్షి మెచ్చవలదా మురదానవభేది కృత్యముల్.

409
చివర చరణమందు. 410
19 ‘విచారము’, హల్లుకు
ఉద్యోగపర్వము (2–62)
ఉ.

డక్కెను రాజ్యమంచు నగటా యిటు తమ్మునిభాగ మీక నీ
వెక్కటి మ్రింగఁజూచెద వదెట్లఱుగున్ విను మీను లోలతన్
గ్రక్కున నామిషంబు చవి గాలము మ్రింగిన మాడ్కి సువ్వె యి
ట్లుక్కివుఁడైన నీ కొడుకు నుల్లము నన్నిటు లాడఁగూడునే.

411
'అక్కటా' అనుచోట. 412
చేమకూరవారి సారంగధరచరిత్రము (3-49)
చ.

పొలతుక లెస్సయున్న యొక పూటయుఁ జూడఁగఁజాల నీవు మా
యల గొడిగట్టి తెంతటి గయాళివి చేక జవు న్విచారముల్
దెలియనివారిపైఁ గలవి లేనివి చాం ఘటించి తండ్రి బి
డ్డల కెడ సేయఁజూచి తకటా మడి నీ కిది యెంత దోసమే.

413
అందే (3-80)
చ.

వలదని మీరలైన యొకపాల్ దెలుపంగదరయ్య యాలిమా
టలు వినియందు బట్టి యకటా తెగటార్తురె యంచు నాపె పె
ద్దల గని పుత్రమోహమున దైన్యపడెం గడు రాజు మొత్తగా
నల మొగసాలకు న్మొఱయు టన్నది నిక్క ముగాగ నయ్యెడన్.

414
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (యుద్ధ. 29)
క.

పంతము మెఱయఁగ రాచప
డంతి న్విడలేక యక్కటా యొకట కొలం
బంతయుఁ జెఱుపఁగఁ జూచెద
వింతయు మేల్గొనము పూనకేమి యనఁ జనున్.

415
అచ్చుకు
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-176)
చ.

సకలము కాలకూట సహజన్ము సుధాకరుఁ డండ్రు నిక్క మౌ
నొకొ యిదియంచు నోసితమయూఖ నినున్ దెలియంగఁగోరి యూ
రక యటు జేరినంతఁ దలప్రాణము తోకకు వచ్చె లెక్క సే
యక నిను మ్రింగెనేని యకటా యలరాహువు నేమి యయ్యెడున్.

416
ద్రోణపర్వము (1-14)
ఉ.

అప్పుడు భీష్ము లేమి హృదయంబును నుమ్మలికంబు గూరగా
నెప్పటి చందము న్విడిచి యేడ్తెఱఁ దక్కిన చూడ్కు లొండొరున్
ఱెప్పలమాటునం బొలయ నీసుతు పాలికి వచ్చు రాజులం
దిప్పు డితండు రావలువదే యని కర్ణుఁ దలంచి రందఱున్.

417
అందే (2-233)
క.

ఆననములు వెలవెల్లం
గా నడ లొదవినది మీకుఁగాద దడవ మీ
లో నభిమన్యుఁడు లేఁడే
మో నాకుం జెప్పు డేల యూరక యుండన్.

418
'ఏమో' అనుచోట విచారము, సందేహము కాదు. 419
అందే (2–842)
సీ.

అభిమన్యుఁ డీల్గిన నర్జునుఁ డధికశో
             కావేశ మంది సాహసికవృత్తి
నతిదుర్ఘటంబైన ప్రతిన యట్టులె పట్టు
             నే కౌరవులు దీని నెట్టులైనఁ
దప్పింపఁజూతురు దర్పంబు వెరవును
             గలవారు వారి కగ్గలము గలరు
కడు దెప్పరంబైన కార్యంబు వాటిల్లె
             నెమ్మెయి నిధి నిర్వహించువాఁడొ
యకట దినములోన నా సైంధవునిఁ జంప
నబ్బకున్న నతని నగ్ని సొరఁగ
వలయు నాతఁ డనృతవాదిగాఁ డిక్కార్య
మెట్టు లగునొ మనకు నేది గతియొ.

420
రెండవ చరణమందు రెండవ యతి. 421
అందే (3–24)
సీ.

పుత్రశోకానలంబును గ్రోధవహ్నియు
             మనమున ముప్పిరి గొనఁగ మృత్యు
భంగి నేతెంచు భీభత్సుని కౌరవుల్
             సెనకజాలరు నేమి చేటు మూడె

నో వురిలో నొక్క యుమ్మడి నింటింట
             నార్తనాదములు పెక్కయ్యె నెల్ల
రవములు మిగిలి సైంధవునింటిదిక్కున
             నాక్రందనధ్వను లతిశయించె
నేను ద్రోణుఁడు భీష్ముండుఁ బూని చెప్ప
శౌరి మాటలు మీరాజు సరకుగొనఁడు
సంధిగానక కర్ణుండు సౌబలుండు
దుస్ససేనుండు నందఱఁ ద్రోచికొనిరి.

422
మూడవ చరణమందు మొదటియతి 423
శ్రీనాథుని కాశీఖండము (6-88)
సీ.

బ్రహ్మ మానందరూపం బట్టి తథ్యంబు
             నానాత్మపరికల్పనంబు మిథ్య
ముదిమి నింద్రియశక్తి మొఱవవోకుండఁగ
             మైధునక్రీడ యేమఱని యురువు
సౌఖ్యార్థి యైన యాచకుని కిచ్చట పాడి
             పంచభూతాంశుకప్రకృతి తనువు
యౌవనంబులు పోయెనా రావు క్రమ్మఱ
             సపరిక్షయమ్ములు సంచయములు
గడచి నప్పుడు క్రిములొండెఁ గాకులొండె
గుక్కలొండేసియును భుక్తిగొనెడు దేహ
మొకఁడు ప్రార్థించి యడిగిన నొసఁగవలదె
తన్ను నిచ్చిన యది గదా దానగుణము.

424
నాలవ చరణమందు మొదటియతి 425
హల్లుకు
అందే (6–165)
సీ.

ఒకనాడు మేనక యుర్వీధరేంద్రుని
             యొద్దఁ గూర్మి తనూజ యునికిఁ దలఁచి

పేదజీవన మయ్యె బిడ్డకు రాగుండె
             వాఁడవుగాన నీవా యరయవు
కాశి నెట్లున్నదో కమలాయతేక్షణ
             దర్శించి వచ్చుట తగవుగాదె
యెలనాగ పుట్టిన యింటివారలు దన్ను
             నరయ నుపేక్షించి నపుడె బెగడు
ననిన బహుసంపదలతోడ నరిగి యతఁడు
క్రతుభుగీశ్వరు పురలక్ష్మి నతిశయించు
తత్పురము సూచి శివుఁ జూచి తనయఁ జూచి
తెలసి యవ్వీట లింగప్రతిష్ఠ చేసె.

426
రెండవ చరణమందు రెండవ యతి 427
20. 'ప్రాగల్భ్యము" అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (6-295)
చ.

అన విని పారువంబు నవయౌవనగర్వమునం బడంతి కి
ట్లను నిదియేమి నా బలపరాక్రమసంపద యింత మాత్రమే
తన సరివారికి న్వెఱచి ధామము పాడఱజేసి డాగబో
యిన సరియిళ్లవారు నగరే ఖగమో యది యేమి దయ్యమో.

428

చివర చరణమందు (ఇక) రెండవ చరణమందు నిత్యసమాసాఖండాభేదయతులు

గలవు. 429
21. 'భీతి', హల్లుకు
వసుచరిత్రము (4-103)
చ.

చెలుల మొఱంగి నాడు మణిచిత్రగృహంబున మోమువాంచి తొ
య్యలి భవదేకదర్శన మదాకృతిఁ జూచెఁగదా వినీలకుం
తల హృదయంబు నీకు విదితంబు గదా యిఁక దాపనేటికిన్
వెలది మనంఁబుఁ దెల్పగదవే మణిహారమ సారె వేడెదన్.

430
అచ్చుకు
మనుచరిత్రము (2-39)
ఉ.

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటిఁజరించె దోటు లే
కివ్వనభూమి భూసురుఁడ నేఁబ్రవరాఖ్యుఁడఁ ద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ దెల్పఁగదవే[10] తెరువేది శుభంబు నీకగున్.

431
'తెల్పఁగదవే' అనుచోట 432
22. 'శంక', అచ్చుకు
ఆముక్తమాల్యద (2-42)
శా.

దానత్యాగపతత్రియై తొలుత పత్రం బంబుధారన్ సదా
నానందత్సితకీర్తిహంసి జనుమింటం గ్రొత్తనా నేల నా
నా నీరార్ద్ర పతత్రి యయ్యు వడి మింటం బాఱు తజ్జాతి కే
లా నిల్చుంగతి యన్యపత్రిగతి పత్త్రైకప్రదేశాప్లుతిన్.

433
‘ఏలా' అని శంక. 'పత్త్రైక' వృద్ధియతియును గలదు. రెండవ మూడవచరణములందు ననునాసికయతులు. 434
23 'అంగీకరణ కృతి', అచ్చుకు
అనుశాసనికపర్వము (3-114)
సీ.

సిరి ధేనువులలోని కలిగిన నెవ్వతె
             వనియని యడిగిన నమ్మహాత్మ
శ్రీ నేను మీలో వసింపఁగా వచ్చితి
             ననవుడు చంచలవైన నిన్ను

నొల్లము మాలోన నునుపఁగా ననియె న
             గ్గోవులు దాని కద్దేవి వగచి
యేను బాసిన సర్వదానవకులము గీ
             డ్పడియెఁ బొందిన సురల్ ప్రభుత నొంది
రేను వచ్చుట కోరిగదే తపంబు
లాచరింతురు నన్ను నిట్లభిభవించు
టుఱువె మీకన్న నధ్రువ నొల్లమనుట
యభిభవమె నీకుఁబోలిన యచట కరుగు.

435
'కోరికాదే' అనుచోట ఒప్పించుట 436
24 'పృచ్ఛ', హల్లుకు
:
చేమకూరవారి విజయవిలాసము (2-137)
గీ.

వినుతి చేసిన, భిక్షగావింపుఁ డనిన
మాఱు వడ్డింప నిది తెత్తుమా యటన్న
పలుకు నారాయణా యను భాషణంబె
యిల నిజాలకు సన్యాసివలె నతండు.

437
అచ్చుకు
అందే (2–182)
గీ.

ఓ మహానుభావ యేవి గావలె దేవ
పూజ కిపుడు పత్రపుష్పఫలజ
లాదికములు దెత్తుమా యనవుడు నట్ల
సేయు మనుచు నతఁడు సేయిచూప.

438
'తెత్తుమా' అన చోట అడుగుటే. ఇంతకన్న వేరొకటి లేదు. 439
హల్లుకు
శాంతిపర్వము (1-235)
సీ.

అర్థి విశ్వావసుం డాదిగాఁ గలుగు గం
             ధర్వులు హృద్యవాదన మొనర్ప

నప్సరో నికురుంబ మాటలు పాటలు
             నై వినోదింపఁగ నమరగణము
బహువిధాలంకారభంగుల విన్నాణ
             ములు సూడ దివ్యమునులు నుతింప
మనుజలోకం బెల్ల కనకాన్నవస్త్రభూ
             షణదానములఁ దృప్తి సనఁగ నశ్వ
మేధసమితిఁ జేసి మెప్పించె నింద్రుని
శతతమాధ్వరమున నతఁడు హయము
నాసపడిన నిచ్చె నా దిలీపునిఁ జూపు
మా ధరిత్రి నిపుడు మనుజనాథ.

440
చూపుమా' అనుచోట 441
అచ్చుకు
అందే (1-237)
సీ.

అనిమిషాసురయుద్ధమున సువర్ణావలి
             సమయించి వర్ణశ్రమములు నేర్ప
రించి భూమి నలంకరించి యగ్నిష్టోమ
             హయమేధ వాజపేయాతి రాత్ర
పౌండరీకములనఁ బరిగిన యధ్వర్య
             ము లనేకముల చేసి భూసురులకు
నఖిలభూములఁ గల యర్థంబు నెల్లను
             దనకని యేమియు నునుప కిచ్చె
శుక్రుఁ డల్లుఁ డనఁగ శోభిల్లెఁ దనయందు
ధర్మతత్వ మూర్జితముగ నియమ
నిష్ఠుఁడై యయాతి నెగడి శాశ్వతుఁడయ్యె
నే నృపాల యమ్మహీశ్వరుండు.

442
'అయ్యెనే' అనుచోట 443
హల్లుకు
జగ్గకవి సుభద్రాపరిణయము
సుగంధి.

జాలమేల బాలఁ జూపు సాలమా రసాలమా
తాలజాల మాలతీ లతా వృతాలి జాలమా

వాలుగంటిఁ జూడఁ జూడవా వనీరసాలమా
నీలవేణిఁ గానవోటు నీవు నేడు తాలమా!

444
మూడవ చరణమందు 'చూడవా' అనుచోట. 445
అచ్చుకు
రామాభ్యుదయము (5-239)
సుగంధి.

అంగనాలలామ గానవా లతాకుడుంగ మా
తంగమా భుజంగమా పతంగమా కురంగమా
లుంగమా లవంగమాతులుంగ మాధవీ నటద్
భృంగమా నీరమా కరీరమా సమీరమా!

446
'కానవా' అనుచోట. 447
ఈ పద్యమును అప్పకవిగారు సంశయ కాకుస్వరయతికి లక్ష్యము వ్రాసినారు. వృక్షాదుల నడుగుట కనపించుచున్నది గాని సంశయము లేశమైనా కనుపించదు. 448
25. ‘శ్లాఘ' అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (1-14)
శా.

ఈ క్షోణిన్ నిను బోలు సత్కవులు వేరీ నేటి కాలంబునన్
దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభారంబు న
ద్యక్షించుం గవిసార్వభౌము భవదీయ ప్రౌఢసాహిత్యముల్.

449
మొదటి చరణమందు. 450
'వేరీ' యను ఓ అపశబ్ద మనుకొని లేఖకులు 'సత్కవు లిఁకేరీ' అని దిద్దినారు. 'వేరీ' అనిన్నికలదు. మరియును ననేకశబ్దములు - ఎన్ను, వెన్ను మొదలైనవి గలవు (పంచమా)శ్వాసమునందు తెలియపరుచుతాము.451

21. ఫ్లుతయతి

లక్షణము
క.

దూరాహ్వానము లందును
హా రోదన గాన సంశయార్థము లందున్
సూరి నుత ప్లుతాన్వితంబులు
నారయ నుభయంబునకును యతు లలరు ధరన్.

452
అర్థము:- పిలుచుటయందు, రోదనమందు, గానమందు, సంశయమందు ప్లుతముతో గూడిన హల్లులు స్వరములకు, వ్యంజనములకు యతులొప్పును. ఈ నాలుగు విధములు ప్లుతయతులని చిరకాలప్రసిద్ధి. లాక్షణికులు స్వరములకు మాత్రమే చెప్పినారు గాని వ్యంజనములకు చెప్పలేదు. అప్పకవి గారయితే ఉభయముకు చెప్పినారు గాని వేఱువేఱైన ప్లుత-కాకు స్వరములను ఏకము చేసినారు. దళవిధయతులలోను ప్రసిద్ధమయినది ప్లుతము. మిగిలిన యతులలో ప్రసిద్ధమైనది కాకుస్వరము. బుద్ధిమంతులు పరిశ్రమించితే ఆ యాయాభేదములు స్పష్టముగానే యున్నవి. 453
'దూరాహ్వానము', హల్లుకు
వసుచరిత్రము (4–27)
శా.

రాజీవాక్షుల నేచు పాతకివి చంద్రా రాజవా నీవు నీ
రాజత్వంబునఁ జక్రముల్ మనియెనో రంజిల్లి సత్సంతతుల్
తేజంబందెనొ డిందెనో యహిభయోద్రేకంబు, నే జెల్ల రే
రాజై పుట్టుట రశ్మిమాత్ర ఫలమా రాజౌట దోషార్థమా.

454
పిల్లలమఱ్ఱి వీరన్నగారి శాకుంతలాపరిణయము (3-188)
మ.

జననం బొందితి దుగ్ధవారినిధి నా సర్వేశు జూటంబవై
జనునే ప్రొద్దు ప్రశంససేయ నవతంసంబైతి నీ ప్రాభవం
బునకున్ బాంథజనాపకారి యగు నా పూవిల్తునిం గూడి నా
పని దుష్కీర్తిగఁ దిట్టునం బడకు చంద్రా! రోహిణీవల్లభా!

455
'చంద్రా' అనుచోట్ల. 456
తిమ్మకవి భర్గశతకము
మ.

కవి విద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా
సి వడిం జేతులు దోయిలించుకుని యాశీర్వాదముల్ సేయ నె
క్కువ దర్పంబున నిట్టులం గదలకే కొర్మించి నట్లుండ్రుగా
రవళిం దుర్నృపు లేమి యీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా!

457
అచ్చుకు
తిమ్మకవి భర్గశతకము
శా.

మన్నెల్లం దమ సొమ్మటంచు వసుధామర్త్యోత్తమక్షేత్రముల్
గన్నారంగని యోర్వలేక దిగ మ్రింగం జూతు రల్పప్రభుల్
వెన్నప్పంబులొ బూరెలో వడలొ భావింపంగ బొబ్బట్లొ కా
యనా యెన్నఁగ వారి పాలికవి భర్గా! పార్వతీవల్లభా!

458
'భర్గా' అనుచోట 459
జగ్గకవి సుభద్రాపరిణయము
శా.

నీహారాంశుముఖీకదంబకమణిన్ నిన్గోరి సన్యాసినై
యాహారాదివిహారము ల్మరచి యత్యంతానురాగంబుతో
బాహాలింగనసౌఖ్యవాంఛ మదిలో బాటిల్ల నేనుండుచో
నాహా యిట్లఱఁజేసి యేగితె సుభద్రా! భద్రకుంభస్తనీ!

460
చివర చరణ మందు.461
భాస్కర రామాయణము (యుద్ధ 41)
ఉ.

ఏ జనకాత్మజం దశరథేశ్వరు కోడల రాముభార్యఁజుం
డో జనులార యడ్డపడరో సురలార సురారికంచు నం
భోజదలాక్షి శైలవనభూములు దాటి విభీతి నేగుచో
నీజలరాశిఁ జూచి మతి నెంతఁదలంకెనౌ యేమి సేయుదున్.

462
'అడ్డ పడరో' అనుచోట 463
ఈ పద్యమును లాక్షణికు లందఱు రోదనప్లుతయతికి లక్ష్యము వ్రాసినారు. వారి తాత్పర్యము- రావణాసురు డెత్తుకుపోతున్నాడు గాన రోదనమను
కున్నారు. అప్పకవిగారు– 'భీతి నేగుచో' అనియున్నందున భీతికాకుస్వరముకు లక్ష్యము వ్రాసినారు. 'ఓజనులార, సురలార, అడ్డపడరో' అని పిలుచుటే ముఖ్యమని మాతాత్పర్యము. కుశాగ్రబుద్ధి (గల) సుకవి రాజశేఖరులు ఏది గ్రాహ్యమో దాని గ్రహించవలయును. 464
అందే (అరణ్య. 111)
శా.

అన్నా లక్ష్మణ నిన్నుఁ బుణ్యనిధి నే నజ్ఞానినై వల్కితిన్
నన్నా పాపము వచ్చిచుట్టుకొనియెన్ నా పాలి దైవంబవై
యిన్నీచుం బరిమార్ప వేగఁ బరతేవే నన్ను రక్షింపు మీ
యన్నం గ్రక్కున జీరవే యరుగవే యత్యుగ్ర శీఘ్రంబుగన్.

465
'వేగఁబరతేవే' అనుచోట. 466
ఇది అప్పకవిగారు శోకప్లుత మన్నారు. దూరాహ్వానమని మాతాత్పర్యము.467
శ్రీనాథుని కాశీఖండము (7-161)
ఉ.

వేదపురాణశాస్త్రపదవిన్ నదవీయసియైన పెద్దము
త్తైదువ హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమశక్తి సంయమివరా యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరనీలరత్నకటకాభరణంబులు ఘల్లుఘల్లురన్.

468
వసుచరిత్రము (2-141)
ఉ.

ఓ వసుధాతలేంద్ర కరుణోదధి యీ తడవేల ప్రోవరా
వే వసుభూప యంచు నెలుగెత్తి వెస న్మొఱవెట్టు చాడ్పునన్
(శైవలినీరవం బెసఁగె శైవలినీనినదంబు కన్న ము
న్నావిలభూరి వారి విహగారవగౌరవ మెచ్చె నెల్లెడన్).

469
కళాపూర్ణోదయము (4–116)
మ.

అకటా యేమని దూఱుదాన నిను నాథా వేఁగు జామయ్యె (బొం
దికఁగాఁ బాదములొత్త రమ్మనుట గానీ యొంటియేమో కదా
నికటక్షోణికి నేగుదెమ్మనుట గానీ కొంత నెయ్యంపుఁ బూ
నికతోఁగన్నులు విచ్చిచూచుటయ కానీ లేద యొక్కింతయున్).

470
‘రోదనము', హల్లుకు
భీష్మపర్వము (3-515)
క.

నీ చెలువును నీ బలువును
నీ చతురత నీ బలంబు నీ సాహసమున్
నీ చక్కఁదనము నేనే
రాచూలికిఁ గలుగనందురా రా కుఱ్ఱా.

471
చివర చరణమందు. 472
ద్రోణపర్వము (2-242)
ఉ.

హాయను ధర్మరాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁ జ
న్నే యను దల్లి నేచఁ జనునే యను గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటి నేగఁదగవే యను నేగతిఁ బోవు వాఁడనే
నో యభిమన్యుఁడా యను బ్రియోక్తుల నుత్తరఁ దేర్చవే యనున్.

478
తిమ్మకవి అచ్చతెనుఁగు రామాయణము (అయో 88)
ఉ.

రా యనుగా యనం దొగల రాయనిఁ గేరు నిగారపుం గొటా
రా యను మేటి నాడెపు దొరా యను గిన్క యొనర్చెదేమి మే
రా యను నింపనీకుఁ గనరా యను దయ్యము పాటిఁ దప్పెనౌ
రా యను గన్నవారు నగరా యను నిప్పని మానరా యనున్.

474
అందే (అయో. 60)
ఉ.

కా యిది నేటి తప్పు కొడుకా యను నిద్దపు పూతమామిబో
కా యను బంజరంపుఁ జిలుకా యను నబ్రపు సోయగంపు బ్రో
కా యను బల్కవేమి యలుకా యను బంతము దీఱెనోటు కై
కా యను నేరయిట్లు దుడుకా యను బాయఁగ గోలికా యనున్.

475
ఈ పద్యములందు దూరాహ్వానాదుల జెప్పరాదు. ఈ పద్యములకు పైపద్యము నందు 'వేఁడొ వేడి వెలుంగు వెంగడపు రే వెల్గంచు బిట్టేడ్చుచున్' (అయో. 88) అని స్పష్టముగా నున్నది. అనేకవిధములు విలపించుట లోకప్రసిద్ధమున్ను మరియును— (అందే) 476
ఉ.

దాయను గెల్చుటింకఁ గలడా యను రాచకొలంపు గల్వ విం
దా యను నాడెమైన బిరుదాయను రక్కసి కార్మొగుళ్ల యీ
దాయను బీరమూన వలదా యను బిల్చిన నాలకింప రా
దా యను బన్నమొందతి గదా యను నీకును నంగదా యనున్.

477

(యుద్ధ. 388)

ఉ.

డాయ నదేల రావు బెగఁడా యను నెక్కటి చివ్వ గెల్పుకాఁ
డా యను ముద్దురా కొమరుఁడా యను మేలిగొనంబులూను ప్రో
డా యను సోయగంపు మరుఁడా యను నెన్నిక గన్న నేల ఱేఁ
డా యను మేటి జెట్టి మగఁడా యను బల్కర తమ్ముఁడా యనున్.

478

(యుద్ధ. 400)

శ్రీరామమూర్తి ధీరోదాత్తుడైనప్పటికి సహోదరుని యందు దయార్ద్రహృదయుఁడుగాన కారుణ్యమున రఘుక్ష్మావరేణ్యుని బోలి... అనికరుణాకరులలో శ్రీరామమూర్తి కన్న నెవరును లేరు గావున నిచ్చట కరుణరసము కవి వర్ణించు టలంకారమే.479
గీ.

అంత నచ్చట రాచూలి నంతఁ బెరయఁ
దోడ బుట్టువుఁ గాడిన తూపు వెఱికి
వైచి క్రొవ్వేది కన్నీరు వఱద వాఱఁ
బలుదెఱంగుల నిట్లని పలువరించె.

480

(యుద్ధ. 391)

అని కవి సార్వభౌముడే స్పష్టము చేసినారు. మరియును—
ఉ.

మా యనుఁగుం జెలి న్వెదుకుమా యను వొప్పఁ దుటారి చిల్క లే
మా యను గండు దేటి కొదుమా యను నిద్దపు ముద్ద చందమా
మా యను జుట్టు పుల్గు తుటుమాయను గద్దఱికాఱు బింకకూ
మా యను నింక నోర్వఁదరమా యను నక్కట దయ్యమా యనున్.

481

(ఆరణ్య. 66)

ఉ.

పాయను నేరమేమి బులుపా యను నాడెపు ప్రోడరాచ పా
పా యను గుందనంపు మెఱుపా యను బూవిలుకాని వాలుదూ
పా యను బల్కవేమి దిసపా యను బంటవలంతి ముద్దుకా
న్పా యను నిట్టు లింత మఱపా యను నీకిది నేరుపా యనున్.

482
అంబరీష మహారాజును, ఆయన పుత్రికైన శ్రీమతి యందు నారద పర్వతులను దేవమునులకు అనురాగోదయమై, ఉభయులు తమ కిమ్మని కోరితే, శ్రీమతి యెవరిని వరించితే వారికి వివాహ మొనరించుతానని అంబరీషు డనగా, శ్రీమన్నారాయణమూర్తి వద్దకు వెళ్లి శ్రీమతి చూపులకు ఒకడు కోతియు, నొకడు కొండముచ్చువలె కనిపించేలాగు చెయ్యమని ప్రార్థించితే, ఆ ప్రకారమే భగవంతులు వరమిచ్చినందున, శ్రీమతి వరించనందున, శ్రీమన్నారాయణమూర్తి యెవరెఱుంగకుండ (శ్రీమతిని) పాణిగ్రహణము చేసి వైకుంఠముకు తీసుకువెళ్లితే, భగవన్మాయ తెలియనేరక, రాజు తమను వంచించినాడనుకుని, యిద్దరు మునులు ‘మోహము నిన్ను కశ్మలము చేసుగాక ' యని శపించితే, మునిశాపము కొట్టివెయ్య(రాని) దనిన్ని, అంబరీషుని యందున్న దయచేత రాజుకు శాపము తగలకుండగ 'ముందు నేను దశరథపుత్రుడ కాగలను. అప్పుడు నన్నావరించమని ఆ శాపమును మరలించి, యిపు డవలంబించి కాముకాగ్రణివలె నటించినాడు (శ్రీ మన్నారాయణావతారమైన శ్రీరామచంద్రమూర్తి). ఇది లింగపురాణ ప్రసిద్ధి. 483
జగ్గకవి సుభద్రాపరిణయము
చ.

కనుగవ నశ్రుబిందువులు గ్రమ్మఁగ గద్గదకంఠియై మొగం
బునఁ గడువిన్నబా టొదవ ముప్పిరి గొన్వలవంతఁ బల్కె నో
జనవరచంద్ర యో నయవిశారద యో జనరంజనైకశో
భనతరరూప యో ఘనకృపా యిటు లాన తిడంగఁ జెల్లునే.

484
‘ఘనకృపా' యనుచోట రోదనప్లుతము. అందరును వర్గయతి యనుకుందురు. పవర్ణముపై ప్లుతమున్నది గాన వర్గముకాదు. ప్లుతమైనా దూరాహ్వాన మనరాదు. నాయకసమీపవర్తియై యున్నది గాన, గానప్లుత మనరాదు. ( ఎందుకనగా) ‘కనుగవ నశ్రుబిందువులు గ్రమ్మఁగ గద్గదకంఠియై మొగంబునఁ గడువిన్నబా టొదవ ముప్పిరి గొన్వలవంత...' ఈ పదములచేత రోదనమే ముఖ్యము (గాన). వ్యాజస్తుతి యనే కాకుస్వరయతి యనరాదు, నాయకునికి కరుణ పుట్టుటకై వచించుచున్నది గాన. కరుణారసమునకు శోకము స్థాయీభావము.

శృంగార హాస్య కరుణా రౌద్రవీర భయానకాః
భీభత్సాద్భుత శాంతాశ్చ రసాః పూర్వై రుదీరితాః॥
రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహౌ భయం తథా
జుగుప్సా విస్మయ శమాః స్థాయీ భావాః ప్రకీర్తితాః॥

ఈ లాగున నని అలంకారశాస్త్రము. నాయికలు నాయకులకు దయవచ్చేకొఱకు శోకించుట లోకప్రసిద్ధమున్ను.485
అచ్చుకు
అరణ్యపర్వము (5-177)
గీ.

ఒక్క దనుజాధముఁడు మొఱ్ఱో యనంగ
ననుఁ జెఱఁగొని పోయెడు నన్నలార
యెవ్వ రిట విడిపింపరే యింత వట్టు
పుణ్యమునఁ బోవరయ్య కారుణ్యబుద్ధి.

486
చేమకూరవారి సారంగధరచరిత్రము (3-86)
ఉ.

రంగదపారమోహజలరాశి మునింగి రహిం దొరంగి ర
త్నాంగి యొకింతసేపునకు హా సుకుమార కుమార నేడు చి
త్రాంగికి నప్పగించుకొఱకా నవమాసములుం భరించి వే
డ్కంగని నిన్ను గూరిమి గడల్కొన గోమున నెత్తి పెంచుటల్.

487
మూడవ చరణమందు 488
అందే (3–88)
శా.

నిన్నున్ సద్గుణవంతుఁ డంచు నెపుడు న్వేనోళ్ల మెత్తుంగదా
యన్నా నేడిది యేమి చేసితివి యేలా పుట్టె నీ మర్లు నీ
కిన్నాళ్లే నిది చెల్లఁబో జనని గాదే యల్ల చిత్రాంగి దా
నన్నం జూచినకంటఁ జూడవలదా నామాఱుగా నాయనున్.

489
రెండవ మూడవ చరణములందు 490
ప్రబోధచంద్రోదయము
సీ.

ఏ జెంత బోధించె నే తల్లి నిన్ను కా
             గాని పాషండసంగతులు మెలఁగ
నే బొడ్డి బోధించె నే యింత విడనాడ
             తల్లి నీ కుపనిషత్తరుణి తోడ
నే దండ యెడఁబాపె నే తల్లి నీకు నా
             మీఁద హత్తిన కూరిమియునుఁ గృపయు
నే లంజె భ్రమియించె నే తల్లి నిన్ను స
             ద్ధర్మమోక్షము లబద్ధంబు లనుచు
నంచు దుఃఖించుఁ గన్నీరు నించు దిశలు
గలయ వీక్షించుఁ గానక కలవరించు
నించు కించుక గమకించుఁ జంచలించు
తల్లిమొఱుగుడు లేగ చందమున మఱియు.

491
గానప్లుతము; హల్లుకు
అనుశాసనిక పర్వము (3-180)
క.

వ్యాకరణ ధర్మశాస్త్ర వి
వేకములు బురాణజాతవేదిత్వము బ్ర
హ్మైకత్వబోధనము నధి
పా కలిగినవారు పఙ్క్తి పావనులు గడున్.

492
వసుచరిత్రము (2–3)
ఉ.

ఆ యెడ నొక్క నర్మసచివాగ్రణి యిట్లను నో యఖండతే
జోయుత యద్భుతం బొకటిఁ జూచితె చూపితె నీకు నాదు చే
జాయనె చూడు మభ్రమునఁ జక్కగ నల్లదె నల్లమబ్బులో
బాయవు కొన్ని మ్రాకులు నృపా యవుజుమ్మని నాకభూజముల్.

493
చివరి చరణమందు 494
అందే (5–18)
మ.

ఘనముల్ వాహనముల్ వదాన్యమణి యాకల్పంబు కల్పాగముల్
వనమల్ వేలుపుగిడ్డి దొడ్డి పసి దేవా నీకు పాదార్ఘ్య మి
త్తునొ రత్నాంజలి యిత్తునో యలరుటెత్తుల్ దివ్యసద్వస్తు లి
త్తునొ నీవేమిట మెత్తు వేమి దగ నిత్తున్ భక్తపూజాప్రియా.

495
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-103)
మ.

వలదమ్మా యిటువంటి కానిపను లో వామాక్షి యీ వెఱ్ఱిబు
ద్ధులు నీ కేల ఘటిల్లె నమ్మ తెగువన్ దుర్భాష లిట్లాడి యీ
కొల నాకేటికిఁ గట్టెదమ్మ మరి లోకుల్ విన్న నేమందు ర
మ్మ లఘుత్వంబుగఁ జూతురమ్మ, దగదమ్మా ధర్మ మూహింపుమా.

486
గానప్లుతము (అనగా) స్తుతించుట యని కొందఱు, 'తనరీ' యని సంగీతమందని కొందఱు నందురు. అటు లనరాదు. భ క్తి, గౌరవము, వాత్సల్యము, అనురాగము– ఈ మొదలైన వాటిచేత, ననగా తద్ధర్మప్రతిపాదకశబ్దములచేత సంబోధనమాత్రమున గానప్లుతము. 497
అచ్చుకు
వసుచరిత్రము (5-21)
మ.

అన నింద్రుండను లాఁతిరీతి నచలేంద్రా యేల యిట్లాడ నీ
జనకుం డధ్వరభాగభోక్త యనిమేషశ్రేణిలోఁ బెద్ద త
త్తన(యగ్రామణి) వైన నీకు నరుదే ధాత్రీధరేంద్రాభివం
ద్యనితాంతోన్నతి కీర్తి వైభవము మేనా శుక్తిముక్తామణీ.

498
అందే (4–101)
మ.

నిన్ను భాగ్యాక్షరపఙ్క్తిగాఁ దలఁతునో నిర్వేల మూర్ఛాపనో
దనదివ్యామృతధారగా మనమునం దర్కింతునో కాక మ
ద్ఘనపుణ్యద్రుమ రికావలియ కాఁగన్గొందునో ప్రేమ నే
మని వర్ణింతుఁ బ్రియాపయోధరవిహారాహారవంశోత్తమా.

499
అందే (3–61)
చ.

అనఁ జనభర్త వల్కు ముదితా విదితాతను మంత్రజాలు ని
మ్మునిఁ గొనియాడ శక్యమై సముజ్జ్వలరూపకలాపయైన మీ
యనుఁగు వయస్యఁగాంచు సుకృతాతిశయం బవలీలఁ గూర్చె నీ
యనఘుఁ డితండు మాకుఁ బరమాప్తుఁడు గాక మునీంద్రమాత్రుఁడే.

500
అందే (2–91)
చ.

అన మునిరాజు వల్కు వనితా బనతా వినుతాభిధేయుఁడై
యొనరిన (గౌతమున్ మునికులోత్తముఁ జెప్పఁగ విందురేకదా
యనఘ తదన్వవాయ కలశాంబుధిఁ బుట్టినవాఁడ గౌతమా
ఖ్యనెసఁగువాఁడ నే (బరమ హాసరస ప్రతిభానుభావుఁడన్).

501
శ్రీనాథుని నైషధము (8-191)
మ.

ఇదె వీక్షింపు చకోరశాబక నిభాక్షీ దీర్ఘికాహంసి యీ
యుదకాంతఃప్రతిబింబితున్ గగనమధ్యోపస్థితున్ జంద్రుని
న్మది దర్శించి నిజాధినాథుఁ డనుచు న్వాత్సల్య మేపారఁగాఁ
జదురొప్పం బరిచుంబనం బొనరించెం జంచూపుటాగ్రంబునన్.

502
మనుచరిత్రము (1-68)
శా.

ఏ యే దేశములం జరించితిరి మీ రే యే గిరుల్ సూచినా
రే యే తీర్థములందుఁ గ్రుంకిడితి రే యే ద్వీపముల్ మెట్టినా
రే యే పుణ్యవనాలిఁ ద్రిమ్మరితి రే యే తోయధుల్ డాసినా
రా యా చోటులఁ గల్గు వింతలు మహాత్మా నా కెఱింగింపరే.

503
అందే (1-65)
క.

నావుడు ముని యిట్లను వ
త్సా విను మావంటి తైర్థికావలి కెల్లన్
మీవంటి గృహస్థుల సుఖ
జీవనమునఁగాదె తీర్థసేవయుఁ దపమున్.

504
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-121)
ఉ.

నావుడు నిట్లు వల్కు జననాయకుఁ డీ వెడ మాట లేల త
ల్లీ వినవమ్మ యీ జగము లెల్ల సృజింప భరింప నొంప జా
ల్దేవత లెట్లు వర్తిలిన లెస్సవుగా కివి చెల్ల వొడ్లకున్
నీ విపుడన్న రంభరతి నీగతిఁ బుత్రుల బల్మిఁ బట్టిరే.

505
అందే (3-93)
మ.

అని శోకింపుచునున్న తల్లిఁ గని యమ్మా నేను చిత్రాంగి న
ట్లనె నీ మాఱుగనే దలంపుడు మరు ల్వాటిల్లి యాయమ్మ న
న్నెనయంగోరిన నియ్యకోక... కే నేతెంచితం గాని పా
వని యే దోషము నేనెఱుంగను మనోవాక్కాయకర్మంబులన్.

506
'కొనక' అను శబ్దమునుందు నకారము లోపమై‘కోక'అని యున్నది. 507
చాటుధార
శా.

కాండావిర్భవభాండ భూపరివృఢ గ్రైవేయ శైలేయసూ
కాండాటాధిప కేతుమాతుల బలాకాశ స్రవంతీ మరు
త్కాండాఖండలతుండి పాండురయశః కర్పూరపేటీ భవ
త్కాండా రాయనమంత్రి భాస్కరుని కొండా దండనాథాగ్రణీ!

508
కొందఱు లాక్షణికులు, గానప్లుతమనగా, స్తుతి చేయుట యందు వచ్చినదని యీ పద్యము (లక్ష్యముగా) వ్రాసినారు. స్తుతి యంతయు 'పేటీ భవత్కాండా' అనుట తోడనే సరిపోయినది. 'రాయన మంత్రి భాస్కరుని కొండా' అని సంబోధన మాత్రమే యున్నది. స్తుతి యందే గానప్లుత మయితే 'అమ్మా, తల్లీ, వనితా, ముదితా, వత్సా' ఈ మొదలయిన వాటియందు నేమి స్తుతి యున్నది! (కావున) గానస్తుతి యందు (మాత్రమే) గానప్లుత మనుట బాగులేదు. 509
చేమకూరవారి విజయవిలాసము (1-89)
ఉ.

నావుడు మోమునన్ మొలక న వ్వొలయన్ వలగబ్బి గుబ్బచన్
ఠీవికిఁగా నొకించుక నటింపఁ గవున్ గనుపింపఁ బల్కె రా

జీవదలాక్షి యో రసికశేఖర యో జనరంజనైకలీ
లావహరూప యో నుతగుణా తగునా యిటు లానతియ్యఁగన్.

510
చివర (చరణ మందు). కొందఱు లాక్షణికులు (దీనిని) శోకప్లుతముకు లక్ష్యము వ్రాసినారు. 'మోమున మొలకనవ్వు... ' అని చెప్పుచుండగా శోకమనుట చిన్ని పూదేనె (ను)కారమను టెట్టిదో, యిదియు నట్టిది. ఈ పద్యముకు పదమూడవ పద్యమందు కరుణరసము కనుపించుచున్నది. 511
చేమకూరవారి విజయవిలాసము (2-193)

ఏలే శైలేయస్తని[11]
యేలే ప్రాలేయకరముఖీ యేల నయో
యేలే యాలేఖ్యాకృతి
యేలే బాలేందునిటల యేలాతి నటే.

512
తిమ్మకవి రసికజనమనోభిరామము
క.

ఏమే యామేచకకచ
యే మే వామేక్షణామణీహేమఘృణీ
యేమే సోమోపమముఖీ
యేమే మోమెత్తి చూప కిటు లేతురుటే.

513
తారాశశాంకవిజయము (2-46)
మా.

అనినన్ సంతస మంది గీష్పతి కుమారా యత్రి గర్భంబునం
జననం బొందిన నీకు నీ వినయమున్ సౌజన్య మర్యాద వ
ర్తన మంచన్మధురోక్తులుం దలఁప వింతల్ గావు రాజత్కలా
ఖనివై యొప్పెడు నీవు శిష్యుఁడగు భాగ్యం బెన్న సామాన్యమే.

514
అనుశాసనికపర్వము (2-393)
ఉ.

ఆ నగనాయకుం డొక మహాధ్వర మెంతయు వేడ్కఁ జేయఁగా
బూని మహీసురావలికిఁ బూజ యొనర్పఁగఁ దాను బ్రాహ్మణుం

డై నయమారఁగా ననలుఁ డాతని పాలికి వచ్చి నాకు నీ
వే నృప నీదు పుత్రుఁ గృప యేర్పడ దానముగాఁగ నావుడున్.

515
ఈ పద్యమును అప్పకవిగారు గానప్లుతముకు లక్ష్యము వ్రాసినారు. దూరాహ్వానము మాత్రము స్వకవిత్వము. అచ్చులకు హల్లులకు లక్ష్యము వ్రాసినారు. మిగిలిన వాటికి స్వరములే వ్రాసినారు గాని వ్యంజన మొకటియు వ్రాయలేదు. (పై పద్యమందు చివర చరణమున 'ఏర్పడ' అని యున్నది. ‘వేర్పడ' అని హల్లున్ను (ఆదినున్నది) గలదు. ఇక్కడ 'ఈవే' అని కాంక్షించుట కనుపించుచున్నది. 516
వసుచరిత్రము (4–83)
ఉ.

ఏమిటి కల్గితే కువలయేక్షణ పల్కవదేటికే వధూ
టీమణి నీవు రాఁ గడిఁది డెందము పూనితివే లతాంగి య
య్యో మనసారఁ దావక పయోధరపాలి దృఢంకపాలి యీ
వే మృదువాణి నీకు నొక యెగ్గును జేయఁగదే తలోదరీ.

517
చివర (చరణమందు) 518
రాజశేఖరచరిత్రము (2-4)
శా.

కేలీకాంచనసౌధవీథికల చక్కిం దొట్టి లోఁబెట్టి యో
ప్రాలేయాచలకన్యకాధవ కృపాపారంగతా నిద్రవో
వే లావణ్యపయోనిధీ యనుచు నావిర్ఫూతమోదంబుతో
జోలల్వాడుదు రక్కుమారకునకున్ శుద్ధాంతకాంతామణుల్.

519
స్పష్టముగా తెలియగలందులకు నిన్నిలక్ష్యము లిచ్చినాము. 520
"సంశయము" హల్లుకు
వసుచరిత్రము
ఉ.

తొంగలి ఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ బైపయి విస్తరిల్లి క
న్నుంగవ యాక్రమించుకొనునో ముఖచంద్రు నటంచుఁ బోవ నీ
కంగజుఁ డానవెట్టి కదియం గుఱివ్రాసె ననంగ జాఱె సా
రంగమదంబు లేఁజెమట క్రమ్మ లలాటము డిగ్గి చెక్కులన్.

521
అస్మదీయ 'గోపికాహృదయలోల' శతకము
సీ.

భామ నాపయిని గోపము బూను టరయ మ
             నము గనటకొ లేక నవ్వుటాల
కో కాక నన్నుఁ జిక్కులఁ బెట్టుటకొ జడి
             పించుటకో లేనివి గలిపించి
చెలులు చెప్పుటనొ వంచించుటకును నన్ను
             లంచంబు చాల వలసిన వేల
నిడకుండుటను జేసి యింతెకా కను మత్త
             కోకిలాలాప నిక్కువము వినుము
స్వప్న మందైన నీయాన భద్రయాన
దాటగలవాఁడనే నను దయను జూడు
మనుచు బతిమాలు నిన్నెన్న నలవే మాకు
మదనగోపాల! గోపికాహృదయలోల!

522
రెండవ చరణమందు (మొదటి యతి) 523
అస్మదీయ 'రామచంద్ర' శతకము
సీ.

తల్లిదండ్రుల మాడ్కిఁ దద్దయు భక్తిచే
             మిముఁ గొల్చుచుండు సౌమిత్రి నటులు
ననరాని వినరాని యా మాట లాడుట
             సపరివారంబుగ సకలలోక
కంటకుఁడగు దశకంఠునిఁ ద్రుంచుట
             కో లేక నారుల గుణము లిట్టి
వని తెల్పుటకొ నిర్నయము గానఁగారాదు
             [కల నిజ] మెవరైనఁ దెలియఁగలరె
యని పురాణముల్ దెల్పుచో నఖిలభువన
జాతవిఖ్యాతసద్గుణాపేత యైన
సీత చేతంబు తెలియు టేరీతిఁ గలుగు
రమ్య...........................................

524
మూడవచరణ ముందు రెండవయతి. 525
అచ్చుకు
విరాటపర్వము (2-84)
ఉ.

చిత్తము మెచ్చినా వలనఁ జిక్కఁగ వెండియు నాలతాంగి య
చ్చొత్తిన యట్లు నాకుఁ దన యుల్లముఁ దెల్లము చేయకున్కిఁదా
నత్తరిఁ క్రొత్త కాన్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు న
న్నుత్తల మందఁ జేయుటకునో తల పోసి యెఱుంగ నయ్యెదన్.

526
శ్రీనాథుని నైషధము (4-65)
చ.

హరి హయుఁ డేమి యయ్యెనొకదా మదనానలతాపవేదనన్
(వరుణుఁడు విప్రయోగమున వాడఁడె యింతకు, దండపాణి తా
విరహభరంబున న్మిగుల వేగఁడె, నొవ్వఁడె వీతిహోత్రుఁడున్
బరిసరకేళికాననసమాగతమందసమీరణంబులన్).

527
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-68)
ఉ.

పాయక మోహతాపమున భామిని యుండఁగ నందు మీఁద నేఁ
డీ యెడ హానివచ్చునని యెంచక యూరక పిట్టరేపు నే
యీయన రేచ వచ్చునొకొ యిచ్చనె వచ్చెనొ యమ్మచెల్ల యే
నో యిది కారణం బనుచు నూహలు సేయుచుఁ బ్రోడచేడియన్.

528
శ్రీనాథుని కాశీఖండము (4-191)
సీ.

ప్రతిబింబమోకాని రజనివల్లభున క
             ధ్యాహారమోకాని యమృతరుచికి
వినిమయంబోకాని వధున కన్యాదేశ
             మోకాని యత్రి నేత్రోద్భవునకు
వీప్సయోకాని పూవిలుకాని సఖునకు
             నామ్రేడితమొ కాని యబ్ధిజునకు
నభిధాంతరమొకాని యరవిందవైరికి
             సారూప్యమోకాని చందురునకు

ద్రుమిడి యీడ్చినవాఁడు భర్గుని కిరీట
కోటికాభరణంబైన కువలయాప్తు
మిగులఁ జక్కని కొడుకండ్రు మింట నడుమ
గ్రహములం దీతఁ డెవ్వఁడో గణములార.

529
రెండవ చరణమందు రెండవ యతి.530

స్వరయుగయతి (ఫ్లుతయుగయతి)

లక్షణము
గీ.

వ్యంజనము లేవి యైనను వాటితలను
గలుగు కాకుస్వరప్లుతములకు మైత్రి
దనరి స్వరయుగయతి యన నొనరు సుకవf
కృతుల సంస్ఫూర్తి శ్రీకుక్కుటేశమూర్తి.

531
అర్థము :- కాకుస్వరములకు ప్లుతమునకునైనా, ప్లుతముకు ప్లుతమునకునైనా, కాకుస్వరమునకు కాకుస్వరమునకునైనా, కేవల స్వరములకే యతి చెల్లును. అప్పకవిగారు ఇదే ప్లుతయుగయతి యన్నారు. 532
"క.

తా మే వర్ణములైనను
క్ష్మామండలమునను బ్రాణమైత్రి గలిగినన్
దామోదర ప్లుతయుగ వి
శ్రామము లనఁగాఁ బ్లుతాక్షరద్వయ మమరున్."

533
(అని లక్షణము వ్రాసి) అప్పకవిగారు
వజ్రపంజరశతకము
ఉ.

శ్రీ గజగామినీమణిని సీతనుగా నిరపాయిఁగాఁ ద్రిలో
కీగృహమేధిగా గరుడకేతనుగా భవరోగవైద్యుఁగా
నా గురునాన నిన్నె మది నమ్మితి వేఱొకవేల్పుఁ గొల్వ నీ
వే గతి కావవే రఘుపతీ శరణాగత వజ్రపంజరా!

534
(అను) ఈ పద్యమును మాత్రము లక్ష్యము వ్రాసినారు. 'నీవే' అనుచోట తాము నిర్ణయించిన భీతి, శోక, తర్క, గీత, దూరాహ్వాన, సంశయములు కనుపించవు. 'నిశ్చయ' మనే కాకుస్వరము స్పష్టముగా నున్నది. 'రఘుపతీ' (అనుచోట) దూరాహ్వానము. కాకుస్వర ప్లుతములకు యతి. మరియు ననేకములు గలవు. 535
విరాటపర్వము (2-212)
క.

మాయరవి యేల గ్రుంకడొ
కో యను నిట్టేలఁ దడసెనో యనుఁ గ్రుంకం
బోయెడుఁ బొ మ్మిప్పుడ యను
దాయపఱచె నను మనోజతాపము పేర్కిన్.

536
చేమకూరవారి సారఁగధరచరిత్రము (1-34)
శా.

'లేలే భోజన మేటి కొల్ల విటు లే లే మేన బల్సొమ్ములే
వే లే పూనవు వెల్లఁబాఱె మొగమే మీ రాజుతో...'

537
రెండవ చరణమందు రెండును ప్రశ్నలు. 538
హరిశ్చంద్రోపాఖ్యానము (4-143)
క.

కౌశికసంయమి మాయా
పాశంబును జేతఁ గట్టువడితిమి మదిలో
లేశము ధైర్యము వదలకు
డీ శాశ్వతకీర్తి సత్యమే యొనగూర్చున్.

539
నిబోధకత నిశ్చయము (చివరి చరణమందు) 540
తారాశశాంకవిజయము (4-73)
శా.

ఔనే ముద్దులగుమ్మ కల్కి తగునే యందంపు పూరెమ్మ హౌ
దౌనే చక్కదనాల యిక్క యదియౌ నబ్జాస్త్రు చేఢక్క మే
రే నీలాలక యంచు నే బొగడ నెంతే వింత పుంభావకే
లీనాట్యంబున నన్ను నేలిన వగన్ నేనెంతుఁ గాంతామణీ!

541
రెండవ చరణమందు శ్లాఘకు, నమితముకు. 542
జగ్గకవి చంద్రరేఖావిలాపము (2-21)
క.

నా వగ నా యొసపరినడ
నా వాలుంచూపు కోపు నా మాటలతీ
రావంతయు నీ వెఱుఁగవు
గా వన్నెలెగాని కూతురా యిది మేరా[12]!

543
(చివరి చరణమందు) నిబోధకత, గానప్లుతము.544
అస్మదీయ 'రామచంద్ర' శతకము
సీ.

ధనమె సమస్తసౌఖ్యనిధి కీర్తికరము
             ధర్మమూలము గుణస్థానకంబు
ధనవిహీనుఁడును జచ్చినవాఁడు నొకటని
             సౌమిత్రి మిముఁ గూర్చి చాల చెప్పె
నప్పటిదశకొద్ది నప్పండితుఁడు చెప్పు
             టేకాక నది సత్యమే తలంప
మీరు నెమ్మి వశిష్ఠుగారితో విన్నవిం
             చిన వచనమ్ములు సిద్ధమయ్య
రాజప్రకృతివలెను మూఢురాలు లక్ష్మి
పార్శ్వమందున్న వానినే పట్టుకొనును
సుగుణ దుర్గుణములు మదిఁ జూచుకొనక
రమ్య.............................................

545
మూడవచరణమందు నిశ్చయము, వ్యంగ్యము 546
అస్మదీయ 'కుక్కుటేశ్వర' శతకము

'హర చంద్రశేఖర నారాయణాస్త్ర భ
ర్గా మహాదేవ భీమా కృపాబ్ధి......'

547
రెండును దూరాహ్వానములు. మొదట నసమాసయతి. స్వరయుగవిరామము నెవరు నెఱుంగరు. 548
స్వరయతులు, వ్యంజనయతులు, ఉభయయతులు వివరించడమైనది. 549

ప్రాసయతులు

ప్రాసయతులు

లక్ష్యములు
అనుశాసనిక పర్వము (3-175)

జూదరి గరదుండు వేదంబు జదువని
             వాఁడు వడ్డికి నిచ్చువాఁడు గాయ
కుండు గ్రామము పని గుడుచు నాతడు గృహ
             దాహి కష్టముగల తనువునాతఁ
డఱ దెవుల్గొన్నాతఁ డఖిలవస్తువులను
             నమ్మెడు నతఁడు సోమమ్ము విక్ర
యించిన యతఁ డబ్ధి సంచార లాభోప
             జీవకుం డుర్వీశసేవకుండు
భార్యయును దాను బుత్రులు పంచికొన్న
వాఁడు పనులఁ బెక్కేలెడువాఁడు కపట
కృత్యముల మృచ్చిలిని శిల్పకృతుల బ్రతుకు
వారు బఙ్తిదూషణు లండ్రు గౌరవేంద్ర!

550
(ఒకటవ, నాలవ చరణములందు మొదటియతులు, మూడవ చరణమున రెండవయతి, గీతము నాలవచరణమున-మొత్తము) నాలుగు ప్రాసయతు లున్నవి. 551
ప్రాసయతులు (ఆది) ప్రాసనియమముగల పద్యములకు చెల్లవు. గీతపద్య సీసపద్యములకు చెల్లును. 552
  1. 'భిన్నయతి'ని వేంకటరాయడు ఉభయయతులలో పరిగణించినాడు. (చూ. 2 అ. 25 ప.) కాని దానికి ఇక్కడ లక్ష్య లక్షణములు చూపలేదు. మూలతాళపత్రప్రతులు రెండింటియందు నెక్కడను ఈ యతి వివరణ లేదు. 'ఇ' ప్రతియందు మాత్రము వికల్పయతి ప్రదర్శన తరువాత, 'రాగమసంధియతి వివరణకు మొదట 'భిన్నయతికి లక్షణము సీ॥ ధరియించె భరియించె వరియించె సుఖియించె' అని మాత్రము కుండలీకరణములో వ్రాయబడియున్నది. గాని ఈ లక్షణపద్యము పూర్తిచేసి లక్ష్యము లెక్కడను ప్రదర్శింపబడలేదు. అందువలన గ్రంథసమగ్రతకొరకు అప్పకవీయము నుండి ఈ యతికి లక్ష్య లక్షణములు చూపబడుచున్నవి.
  2. ‘కృష్ణమ్మ’ అని మూ. ప్ర. లో ఉన్నది.
  3. 'పరాహ్న పదమొకటి' అను దగ్గరి నుండి ఎఱ్ఱాప్రెగడ సీసపాదాంతమువరకున్న [ ] లోని భాగము మూలప్రతియందు 'మార్జిన్' వ్రాయబడియున్నది.
  4. ఈ పద్యము 'సింహాసనద్వాత్రింశిక' (కొరవి గోపరాజు) లోనిది. 4-210.
  5. ఇక్కడ 'ఈ పద్యార్థము తెలియుటకు ముద్దరాజు రామన్న గారు రచించిన వ్యాఖ్యానము వ్రాసుతున్నాము' అని ప్రారంభించి ఆ పద్యవ్యాఖ్య వ్రాసి, వ్యాఖ్యలో 'పదునెనిమిది జాతులు 'పేరులు మాత్రము వ్రాసినారు. ఏ జాతివలన నేజాతి పుట్టినదో అది వ్రాయలేదు. ఈ నిర్ణయము ముఖ్యముగా తెలియవలసిన దౌను' అని 'స్కందవురాణము' నుండి 11½ శ్లోకములు వ్రాయబడినవి. చివరి శ్లోకార్థభాగ మిది' —ఏవం సంకర వర్ణానాం జనానాం జన్మలక్షణమ్.’
  6. ‘వేదండ' శబ్దమును నిత్యసమాసయతులలో ప్రదర్శించినవాడు కూచిమంచి తిమ్మన (లక్షణసారసంగ్రహము 2.263,64)
  7. రంగరాట్ఛందమున నిది 'హరివంశము' లోనిదిగా ఉదాహృతము. రంగ. ఛంద. 3-237
  8. ఇక్కడినుండి ఈ ఆశ్వాసాంతము వరకున్న భాగము 'ఇ. ప్రతి'లోనిది. చూ సమాలోకనము - మూలప్రతి.
  9. ము: ప్ర: 'వీయపురాలవైతిగదవే...'
  10. తెల్పగదవే' అన్నది ప్రార్థన కావచ్చును.
  11. ముద్రితప్రతులం దీపద్యపు బేసిపాదములు వ్యత్యస్తముగా నున్నవి.
  12. ము. ప్ర. 'నీ వెఱుగవ, హా వన్నెలకాని కూతురా...'