Jump to content

సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ సీతారామాంజనేయసంవాదము

ప్రథమాశ్వాసము.

—♦♦♦♦§§♦♦♦♦—

కథాప్రారంభము.

_____________

—♦♦*§కైలాసపర్వతవర్ణనము.§*♦♦—

అవ. ఈ గ్రంథమున వర్ణింపఁబడుచరిత్ర బ్రహ్మాండపురాణములోని గౌరీ
     శంకర సంవాదము గావున నావిషయమును మొట్టమొదట వర్ణించు
     టకై యీ క్రిందఁ గైలాసపర్వతమును వర్ణించు చున్నాఁడు..


సుఖదశుద్ధసత్త్వా
వాసము శివపార్వతీనివాసము సుమహా
భాస మనాభాసము కై
లాసము తనరారుఁ జిద్విలాసం బగుచున్.39


టీక - శ్రీ సు...సము - శ్రీ = సమృద్ధిగల, సుఖ = ధరార్థకామమోక్షములనియెడు పురుషార్థములనలనఁ గలుగుసుఖమును, (లేక, ఇహలోకమునందును, పరలోకమునందును, పరిపూర్ణ మగునానందమును), ద = ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = పరిశుద్ధ మగుసత్త్వగుణముగల, (రజోగుణమును తమోగుణమునునిడిచి పరిశుద్ధ మగు సత్త్వగుణము నాశ్రయించి యున్న అనుట) మునులకు, ఆవాసము=నివాస మైనదియు, శివ... సము - శివ = శంకరునకును, పార్వతీ = పార్వతీదేవికిని, నివాసము = - ఉనికిపట్టు అయినదియు, సు,..సము - సుమహత్ = మిక్కిలి యధిక మైన, భాసము, (లేక, ఆభాసము) = కాంతిగలదియు, అనాభాసము: తనపై నివసించువారలకుఁ గలదుర్గుణములను నశింపఁజేయునట్టిదియు, (అగు) కైలాసము = కైలాసపర్వతము, చిద్విలాసంబు అగుచున్ = సత్యజ్ఞానానందస్వరూపుఁ డగు పరబ్రహ్మముయొక్క విలాసములవంటి విలాసములు గలది యై, (పరబ్రహ్మమువలెననుట) తనరారున్ = ఒప్పుచుండును (కే (శివయోః) లాసః యస్యసః = శిరస్సునందు (పార్వతీపరమేశ్వరుల) విలాసము గలది కేలాసము. కేలాస ఏవ కైలాసః= కేలాసమే కైలాసము, 'కీలయోః అసనం యస్యసః, కీలాసః = భూమియందును జలమునందును నివసించునది కీలాసము. అనఁగా; స్ఫటికము. తస్య అయం కైలాసం = ఆ స్ఫటికమునకు సుగంధించినది కైలాసము, స్ఫటికమయమైనది యనుట).

తా. ధర్మార్థకామమోక్షంబుల నొసంగఁ జాలు సత్త్వగుణము నాశ్రయించి, పరమశాంతులై యున్నమునులకు నివాసమై తన్నాశ్రయించినవారలకుఁ గల అహంకారము మమకారము డంబము మొదలగు సకలదుర్గుణముల నడంచును, పరబ్రహ్మమునుంబోలె కైలాస మనునొకపర్వతము మిగుల ప్రకాశించుచుండును. దానిపై పరమానందముతో పార్వతీపరమేశ్వరులు నివసించుచుందురు. (పైపద్యమునందు చిద్విలాసము అనుటచేత కైలాసపర్వతమును పరబ్రహ్మముతో పోల్చి యున్నాఁడు. కావున నీ పద్యమునందుఁ బరబ్రహ్మపరముగ రెండవ యర్థముకూడఁ గలదు. “కేళీనాం సమూహః కైలం" కేళి యనఁగా, నానందము వానియొక్క - సమూహము కైల మనఁబడును. 'కైలేన ఆస్యత ఇతి కైలాసః, కైలం ఆసో యస్యసః కైలాసః' కైలముచే నిలుచువాడు, కైలము ఉనికిగాఁ గలవాడు. ఆనందరూపుఁడనుట. ఈవ్యుత్పత్తిచే కైలాసపదము పరబ్రహ్మమునందు కూడ వర్తించును.)

బ్రహ్మపరమైన యర్థము.

టీక. శ్రీ = ధర్మార్థ కామములను సంపత్తును, సుఖ = పరమానందరూపమగు మోక్షమును, ద = (కర్మమార్గముచేతను, జ్ఞానమార్గముచేతను, తననుసేవించువారలకు) ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = రజోగుణములతోఁ గాని తమోగుణములతోఁగాని కొంచెమైనను సంబంధములేని , (లేక, తిరస్కరింపబడని పరిశుద్ధ మగుసత్త్వగుణమె స్వరూపముగా గలమాయకు) ఆవాసము = నివాస మైనట్టియు, (మాయకంటె వేఱుగాక తనను కర్మయోగముచే సేవించువారలకు ధర్మార్థకామములను, జ్ఞానయోగముచే సేవించువారలకు మోక్షమును ఇచ్చునట్టి అని భావము.) శివ = ఆనందస్వరూపుఁడగు, లేక, మంగళకరుడగు, పురుషునకును (జీవునకును), పార్వతి = మలినసత్త్వప్రధాన యగు నవిద్యకును, (జీవుఁడు బ్రహ్మమునకంటె వేఱుకాఁడు = అవిద్యయు మాయకంటె వేఱుకాదు. అగ్నికంటె దానియందున్న యుష్ణశక్తియు, యుష్ణశక్తికంటె నగ్నియు వేఱుకానట్లు పరబ్రహ్మమునకంటె మాయయు మాయకంటె పరబ్రహ్మంబును వేఱు కాదు కావున నిచ్చట "జీవుఁడును ఆవిద్యయును బ్రహ్మయం దున్నవి” అని చెప్పఁ బడియున్నది. పార్వతీశబ్దమునకు అవిద్యయని యర్థము చెప్పుట ఔపచారిక మని తెలిసికొనవలయును.) నివాసము, సుమహాభాసము = సూర్యుఁడు చంద్రుడు అగ్ని మొదలగువానిని ప్రకాశింపఁజేయఁజాలు తేజస్సు గలదియు, అనాభాసము = ఈశ్వరుఁడు జీవుఁడు ప్రపంచము అను మొదలగువికారము లేవియును లేనిదియు, అగు, కైలాసము = పరబ్రహ్మము, (లేక పర్వతము. ఇది యుపమాలంకారము కావున విశేషణములయందు మాత్రము శ్లేష యుండినఁజాలును. విశేష్యమగు కైలాసపదమునందు కూడ అర్థద్వయము నంగీకరించినచో శ్లేషాలంకారమగును.) చిద్విలాసంబుఅగుచున్ = అపరోక్షజ్ఞానమే రూపముగాఁ గలదియై, తనరారున్.

తా. శుద్ధసత్త్వప్రధాన మగుమాయకు నాశ్రయమైై తనను కర్మయోగముచే నుపాసించువారలకు (బ్రహ్మము వేఱు; తాను వేఱు, అనుభేదదృష్టి కలిగి సుఖములు కావలయునని పరబ్రహ్మమును సగుణరూపముతో సేవించువారలకు అనుట.) ధర్మార్థ కామముల నొసంగుచు, జ్ఞానయోగముచే నుపాసించువారలకు, (జీవబ్రహ్మైక్యమును తెలిసి కొనినవారలకు) మోక్షము నిచ్చుచు, జీవావిద్యలు తానేయై, నిర్వికారుఁడై సూర్యచంద్రాగ్నులసహితము ప్రకాశింపఁ జేయజాలుదివ్యతేజస్సుతో జ్ఞానరూపుఁ డగు నాపరబ్రహ్మము ప్రకాశించుచున్నది.

వ. అది మఱియు నాదిమధ్యాంతవిహీనంబును స్వజాతీయవిజాతీయ
   స్వగత భేదశూన్యంబును నిత్యాపరోక్షస్వప్రకాశాపహసితానంత
   కోటినూర్యచంద్రానలాలోకంబును వేదశాస్త్రవురాణేతిహాసాగ
   మాగమ్యంబును బహువిధవర్ణధర్మకర్మగుణనామరూపవికారశక్తి
   విరహితంబును బ్రహ్మేంద్రాద్యమరాసురోరగగరుడగంధర్వకిన్నర
   కింపురుషసిద్ధసాధ్యవిద్యాధరచారణాప్సరోయక్షగుహ్యకభూతఖేచర
   దేవర్షి బ్రహ్మఋషీశ్వర యోగీశ్వరమునీశ్వరయతీశ్వరకవీశ్వరాద్యుపా
   స్యంబును నిత్యనిర్గుణనిర్వికల్పనిర్వికారనిరంజననిర్విషయాతీంద్రియా
   వాఙ్మానసగోచరాప్రమేయశుద్ధబుద్ధముక్తకేవలాఖండసచ్చిదానంద
   మయంబు నైన తురీయాతీతపరతత్త్వకైలాసంబున నవ్య క్తమహ
   దాదిసప్తావరణపరివేష్టితంబును జతుర్దశలోకకందరమందరంబును
   సార్వభౌమాదిహిరణ్యగర్భాంతానందగండశైలభాసురంబును
   భానుసోమనక్షత్రతారాగ్రహపావకసౌదామన్యాది వివిధతేజోరత్న
   శర్కరిలంబును బ్రవిమలవైరాగ్యోపరత్యేకాంతాత్యంతముముక్షు
   తాధిత్యకాధ్యాత్మానందజీవనాభిషిక్తనిర్మలనిశ్చలతాకలికాకలితఫలి
   తనిష్కామకర్మోపాసనాయాగయోగజపతపస్సత్యశౌచదయాశీలవ్రత
   దానాదినానావిధానోకహోద్యానవిరాజితంబును శాస్త్రపుష్పోపేత
   నిగమాగమాంతకల్పలతావిలసితంబును షడ్విధసమాధిసౌధవిభ్రాజి
   తంబును బరమాధ్యాత్మవిద్యానందజలాభిషిక్తనిర్మలచిత్తవృత్త్యం
   గణ శమదమోపరతితిక్షాశ్రద్ధాసమాధానామానిత్వాదంభిత్వాది

కల్యాణగుణమణిగణరంగవల్లీప్రకాశితంబును నిరతిశయకైవల్యభాం
డాగారశోభితంబును ఫలకామనాభావస్వభావనియతకర్మాచరణచిత్త
శుద్ధిసర్వకర్మపరిత్యాగగురుభక్తి వేదాంతశ్రవణమనననిధిధ్యాసనజ్ఞా
నాదిసోపానసమన్వితవిజ్ఞానరాజమార్గలలితంబును బంచాక్షరీమహా
మంత్రమాణిక్యతోరణాలంకృతంబును బ్రణవనాదమంగళ వాద్యరవ
పూరితంబును నగుతురీయమహాస్థానమంటపాంతరంబున సర్వోపనిష
త్సారభూత బ్రహ్మాత్తైకత్వదర్శనరూపోంకారసింహాసనాసీనుం డై శుద్ధ
సత్వప్రధానమాయామయదివ్యశోభనవిగ్రహుండును సర్వజ్ఞత్వ
సర్వేశ్వరత్వసర్వాంతర్యామిత్వసర్వస్రష్టృత్వసర్వరక్షకత్వసర్వసంహా
రకత్వాద్యగణితసమగ్రసుగుణపరిగ్రహుండును సత్యజ్ఞానానందస్వరూ
పుండును సర్వవ్యాపకుండును దేవదేవుండునునగు శ్రీమహాదేవుండు
మూర్తిమంతంబు లైనచతుర్వింశతితత్త్వంబులును నిచ్ఛాజ్ఞాన క్రి
యాదిశక్తులును హృషీకేశ్వరవాణీశ్వరసురేశ్వరనందికేశ్వరభృంగీశ్వర
విఘ్నేశ్వరకుమారాదిప్రమథగణాధీశ్వరులును బ్రాహ్మీ మాహేశ్వ
రాదిసప్తమాతృకలును స్వసాన్నిధ్యంబున నిజకరుణాకటాక్షవీక్ష
ణంబు నపేక్షించి కొలువ స్వస్వరూపావలోకనంబు సేయుచు నాత్మా
రాముఁ డై యున్నసమయంబునఁ దదీయవామార్ధశరీరిణియుఁ బరా
పరప్రకృతిస్వరూపిణియు నిఖిలజగదుపాదానకారణభూతయు నఖి
లలోకైకమాతయుఁ ద్రిభువనగేహినియు విశ్వమోహినియు ధీముఖ
యు జ్ఞానవిజ్ఞానలోచనయు విషయవిరక్త్యధరయు విచారమందస్మితయు
నిర్మమతానిరహంతాహస్తయు యోగబోధస్తనియు సందేహమధ్య
యు సంసారచక్రనాభియు రాగద్వేషజఘనయుఁ గామలోభోరు
యుగళయు సంకల్పవికల్పచరణయుఁ గాలానుగతకర్మయానయు
వేదాంతవిద్యావ్యసనవసనోపరతికంచుకధారిణియు రజస్సత్త్వతమో
గుణగ్రంధినీవీబంధకంచుకబంధవేణీబంధసురుచిరయు ఫలత్యాగ
పూర్వవర్ణాశ్రమోచితధర్మానుష్ఠానేశ్వరప్రణిధానాచార్యోపాసనేంద్రి
యాత్మవినిగ్రహస్థితప్రజ్ఞత్వాది సాత్త్వికగుణభూషణాలంకారిణియు
శుద్ధవాసనావాసితయు నిత్యానపాయినియు దేవదేవియు నగుశ్రీమ
హాదేవి యతిప్రీతిపూర్వకంబుగాఁ జతుర్విధశుశ్రూషలు గావిం
చుచు సేవించుచుఁ బూజించుచు భావించుచు సమస్కరించుచు
నారాధించినం బ్రసన్నుండై మెచ్చి నీకు నెయ్యది యిష్టం బిచ్చెద

నడుగు మనిన సంతోషభరితచిత్త యై యమ్మత్తకాశిని చిఱునవ్వు నగుచు నిట్లనియె.40

టీక. అది = ఆమహాకైలాసపర్వతము, (పరబ్రహ్మమనియు రెండవయర్థము కలదు. ఈ వచనమునందు పరబ్రహ్మమునకును, కైలాసమునకును ఆ భేదమును వర్ణించుచున్నాఁడు) మఱియున్, ఆది.....నంబును- ఆది = మొదలు, మధ్య=నడుమ, అంత= తుదియు, విహీనంబును = లేనిదియు, (పర్వతపక్షమునందు మిగుల విశాలమైన దనియు, బ్రహ్మపక్షమునందు ఉత్పత్తి స్థితి వినాశములు లేనిదనియు నర్థము.) స్వజా. . .బును- స్వజాతీయ = తనజాతికి సంబంధించినవానివలనఁ గాని, విజాతీయ =మఱియొకజాతికి సంబంధించిన వస్తువులవలనఁ గాని, స్వగత = తనయందేయున్న యనేకపదార్థములవల్లఁ గాని కలుగు, భేద= భేదముతో, శూన్యంబును = లేనిదియును, (ఏక మే వాద్వితీయం బ్రహ్మ ' అను శ్రుతి ప్రకారము ఆ పరబ్రహ్మమునకు తనజాతిలోఁ జేరిన మఱియొక బ్రహ్మవలనఁ గాని యితరజాతిలోఁ జేరిన మాయాప్రపంచము మొదలగువానివలనఁ గాని, తమలోపలనే యుండు నింద్రియములు మనస్సు మొదలగువానివల్లఁగాని భేదము లేదు. అనఁగా; ఆయన యొక్కఁడె యనుట. ఈవిశేషణమునకు పర్వతపక్షమున నంతచక్కనియర్థము దొరకుట లేదు. అయినను అనేక పర్వతములును, వృక్షములును, భేద మేర్పఱుచుటకు వీలులేకుండ చుట్టు నావరించియున్న వనియు, ఆపర్వతముపై మొలచియున్న తీగెలు మొదలగునవి కూడ నట్టే దాని నావరించి యున్నవని కాని; లేక, ప్రపంచమునందున్న సకల పర్వతములును, వృక్షములు రాళ్లు మొదలగునవియును, ఆపర్వతమునందు మొలిచియున్న తీఁగెలు మొదలగునవియును అనఁగా; ప్రపంచమంతయు, ఆ కైలాసపర్వతముయొక్క కాంతిచే తెల్లనై యేది కైలాసమో యేది యితర పదార్థమో అను భేదమును కనిపెట్టుటకు వీలులేక యున్నది అని కాని చెప్పవచ్చును.) నిత్య. . .లోకంలును - నిత్య = శాశ్వతమైన, అపరోక్ష = సకలజనులకును ప్రత్యక్షమైన, (బ్రహ్మపక్షమునందు జ్ఞానులకు ప్రత్యక్షమైన) స్వప్రకాశ = తనయొక్కకాంతిచే, అపహసిత = తిరస్కరింపఁబడిన, అనంతకోటి = లెక్కలేనికోట్లసంఖ్యగల, సూర్య = సూర్యులయొక్కయు, చంద్ర = చంద్రులయొక్కయు, అనల = అగ్నిహోత్రములయొక్కయు, ఆలోకంబును = కాంతి గలదియు (రెండుపక్షములయందును 'అపరోక్ష ' అను స్థలమున తప్ప తక్కినచోట్ల సమానమే. అచ్చటివిశేషమును అచ్చటనే చూపియున్నాను.) వేద ...బును - వేద = చతుర్వేదములచేతను, శాస్త్ర = ఆఱుశాస్త్రములచేతను, పురాణ = పదునెనిమిది పురాణముల చేతను, ఇతిహాస = భారతరామాయణాదీతిహాసములచేతను, ఆగమ = కామికముమొదలగు నిరువదియెనిమిది ఆగమములచేతను, అగమ్యంబును = చక్కఁగాఁ దెలియఁదగినదియును, (పరబ్రహ్మపరమున, అగ మ్యంబును = తెలియనలవికానిదియును అనియర్థము) బహు...బును - బహువిధ= అనేకవిధములగు, వర్ణ = నలుపుపసుపు మొదలగునవర్ణములు, ధర్మ = (పొడుగగుట పొట్టియగుట మొదలగు) ధర్మములును, కర్మ = కదలుట, నడచుట మొదలగు) పనులును, గుణ (స్వభావసిద్ధము లైన గుణములకంటె వేఱైన) గుణములను, నామ = (కైలాసము అను పేరుకంటె వేఱగు) పేర్లును, రూప = (సహజమై యుండు తెలుపునకంటె వేఱైన) రూపంబును, వికార = (సిద్దముగా నుండుట అను దానికంటె వేఱగు) వికారములును, శక్తి = {కఠినముగా నుండుట - అను దానికంటె నితరములగు) శక్తులును, (శిలయొక్కకఠిినత్వము, అగ్నియొక్క వేఁడిమి, మంచుయొక్క చల్లఁదనము, ఇవి యన్నియు వానివానిశక్తు లనఁబడును.) విరహితంబు= లేనిదియు, (బ్రాహ్మణాది వర్గములును, ఆ వర్ణములకుఁ దగిన ధర్మములు, ఆచారములు, సత్త్వరజస్తమోగుణములు, సకలవిధము లగునామరూపములు, ఉండుట పుట్టుక ముదలగువికారములు, సర్వస్వతంత్రుడగుట, దేనితోను సంబంధపడకయుండుట, నాశరహితుఁ డగుట, అనాదియగువిజ్ఞానమే స్వరూపముగాఁ గలిగి యుండుట, సర్వమును దెలిసికొనుట, సర్వకాలములయందును తృప్తి గలిగి యుండుట, అనునట్టి యాఱుశక్తులును లేనివాడు అని పరబ్రహ్మపక్షమునం దర్థము.) బ్రహ్మే ...బును - బ్రహ్మ= చతుర్ముఖుండును, ఇంద్ర = దేవేంద్రుడును, ఆది = మొదలు గాఁగల, అమర = దేవతలును, అసుర= రాక్షసులుసు, ఉరగ =అనంతుఁడు(వాసుకి మొదలగు సర్పములు)ను, గరుడ = గరుడులును, గంధర్వ = గంధర్వులును, కిన్నర= అశ్వముఖు(మనుష్యశరీరము గలకిన్నరు)లును, కింపురుష = (నరముఖము అశ్వశరీరము గల విశ్వవసు పరావసు ప్రభృతులగు) కింపురుషులును, సిద్ధ, సాధ్య, విద్యాధర, చారణ (దేవేంద్రునిచారులు లోకవృత్తాంతమును తెలిసికొనివచ్చి, యాయనకుఁ జెప్పువారు.) అప్సరః = అప్పరసలు (రంభ ఊర్వశి మొదలగు వారు) యక్ష= కుబేరుఁడు మొదలగు యక్షులును, గుహ్యక = (మాణిభద్రుఁడు మొదలైన) గుహ్యకులును, భూత = గ్రహములును, (ఉరగ అనుపదము మొదలిప్పటి వఱకుఁ జెప్పఁబడిన వారందఱును దేవతలే యైనను, వేఱు వేఱుజాతులు గలవారు గావున ప్రత్యేకముగాఁ జెప్పఁబడిరి.) ఖేచర = సూర్యాదులు, దేవర్షి = నారదాదులును, (వీరు దేవతలలోఁ బుట్టి మును లైరి గావున దేవర్షు లనఁబడుచున్నారు) బ్రహ్మఋషీశ్వర సనకాదులును, (భక్తి యోగాదుల నవలంబింపక కేవలజ్ఞాననిష్టులై పరబ్రహ్మనిష్ఠులై యున్న మునులు గావున వీరలకు బ్రహ్మఋషు లని పేరు. బ్రాహ్మణులై జన్మించి ఋషులైనవారికిఁ గూడ నీ పేరు గలదు గానీ యీవిశేషణమునందు మునీశ్వర అని సామాన్యమునివాచక మగు పదము కలదు. గావున నిచ్చట నా యర్థముఁ జెప్పుట వీలులేదు, ఈపదము మొదలు విశేషణాంతమువఱకు ప్రతిపదమునందును గానవచ్చు ఈశ్వరశబ్దము శ్రేష్ఠవాచకమని తెలిసికొనవలయును) యోగీశ్వర = కపిలుఁడు దత్తాత్రేయుఁడు మొద లగుమహాయోగులును, మునీశ్వర =అగస్త్యాదులును, యతీశ్వర = గోవిందభగవత్పాదులు శంకరాచార్యులు మొదలగు యతులును, కవీశ్వర = వాల్మీకిలోనగుకవులును, ఆది = మొదలగువారిచేత, ఉపాస్యంబును = సేవింపఁదగినదియును (ఈ విశేషణమునకు పరబ్రహ్మపక్షమునందును, పర్వతపక్షమునందును, అర్థమొక్కటియే.) నిత్య . . .బును - నిత్య = భూతభవిష్యద్వర్తమానకాలములందు నాశనమును జెందక సర్వకాలములందును స్థిరమై యుండునట్టియు, నిర్గుణ = సత్త్వము రజస్సు మొదలగు గుణములు లేనిదియు, నిర్వికల్ప= చిత్తము లేనిదియగుటచే. సంకల్పించుట, సంశయించుట , మొదలగునవి లేనిదియు, నిర్వికార = వికారములు లేనిదియు, నిరాకార = రూపము లేనిదియు, నిరంజన = ఇతరసాధనములతో పనిలేక తనను తానే యెఱుంగునదియు, (స్వప్రకాశమైనది అనుట) నిర్విషయ = శబ్దము స్పర్శము మొదలగువిషయములు లేనిదియు, (విషయములతో సంబంధపడనిదియు, లేక, విషయములు కూడ తనకంటె వేఱుగాకపోవుటచే, “విషయములను తెలిసికొనుట” అనుమాట లేనిదియు) అతీంద్రియ= ఇంద్రియములకు గోచరము గానిదియు, అవాఙ్మానసగోచర = వాక్కుచే చెప్పుటకును, మనస్సుచే భావించుటకును గూడ వీలుకానిదియు, అప్రమేయ= ఇంకయని పరిమితిఁ జెప్పుటకు వీలులేనిదియు, (లేక, ప్రత్యక్షము మొదలగు నేప్రమాణములకును గోచరము కానిదియు,) శుద్ధ = నిర్మలమైనదియు, బుద్ధ = జ్ఞానముచే తెలియఁదగినదియు, ముక్త = ఇతర పదార్థములతో సంబంధము లేక స్వతంత్రమై యుండునదియు, (ఇచ్చట స్వతంత్రమనగా: “ఏపదార్థముతోఁ గాని, యేగుణముతోఁ గాని సంబంధము లేక యున్నది" అని యర్థము. పైన నొకవిశేషణములో "పరబ్రహ్మమునకు స్వతంత్ర శక్తి లేదు” అని చెప్పఁబడియున్నది. దానికి “తన్ను ప్రేరేపించునాఁడు లేక తాను యథేచ్ఛముగా ప్రపంచమును ఆజ్ఞాపించుట అనుశక్తి లేదు” అని యర్థము.) కేవల = తనకంటే రెండవపదార్థము లేనివాఁడును, అఖండ = విభాగములు చేయుటకు వీలులేనిదియును, సచ్చిదానందమయంబును = సత్యజ్ఞానానందస్వరూపంబును, ఐన, తురీ ..బునన్ - తురీయ = సుషుప్త్యవస్థకంటె నావలనుండు తురీయావస్థను, (జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలు క్రమముగ సత్త్వరజస్తమోగుణస్వరూపము లనియు, ఆయవస్థల కావలనుండు తురీయావస్థ శుద్ధసత్త్వస్వరూపమైనదనియు తెలిసికొనవలయును) అతీత = అతిక్రమించిన, ఐదవయవస్థకంటె,(ఈయయిదవ యవస్థ, పైనఁజూపబడిన నాల్గవయవస్థలోని కడభాగమేకాని క్రొత్తది కాదు.) పర = మిగిలిన, తత్త్వ = పరబ్రహ్మ మనెడు, కైలాసంబునన్ = కైలాసమునందు, అస్య...బును - అవ్యక్త = మూలప్రకృతియును, మహత్ = ప్రపంచోత్పత్తికి ప్రథమావస్థ యగు మహత్తత్త్వము, ఆది = మొదలుగాఁ గల, సప్తావరణ = ఏడు ప్రాకారములచేత, పరివేష్టితంబును = ఆవరింపఁబడినదియును, (మూలప్రకృతి, మహత్తత్వము, శబ్దస్పర్ఫరూపరసగంధము లనియెడు నేడును పరబ్రహ్మమునకు ఆకరణములు అనఁగా : పరబ్రహ్మమును దెలిసికొనకుండునట్లు చేయునది. ఈయేడింటిని ఆస్థానమంటపము యొక్క ప్రాకారముగా చెప్పియున్నాఁడు. ఇట్లే యీ విశేషణములయం దంతటను, వేదాంతమునకు సంబంధించిన విషయముల నన్నిటిని, వృక్షములు గుహలు మొదలగువానినిగాఁ జెప్పియున్నాఁడు.) చతు..బును - చతుర్ధశలోక = పదునాలుగులోకములనియెడు, కందర = గుహలచే, సుందరంబును = మనోహరమైనదియు, సార్వ . . బును - సార్వభౌమాది = చక్రవర్తి మొదలు, హిరణ్యగర్భాంత = చతుర్ముఖబ్రహ్మ వఱకు నుండువారియొక్క, ఆనంద = సుఖము లనెడు, (అనేక తారతమ్యములతో నున్న ఆనందము లనియెడు.) గండశైల = జాఱుడురాళ్లచేత, భాసురంబును = ప్రకాశించుచున్నదియును, (అనఁగా: చక్రవర్తి, మనుష్యగంధర్వులు, ఆదేవతలలోని గంధర్వులు, పితృదేవతలు , ఆజానజానులను దేవతలు, కర్మదేవతలు, దేవతలు, ఇంద్రుడు బృహస్పతి, నవబ్రహ్మలు, చతుర్ముఖబ్రహ్మ , వీరియానందములు క్రమముగా, నొకరియానందమునకంటె నొకరి యానందము నూఱు రెట్లధికము), భాను... రిలంబును - భాను = సూర్యుఁడు, సోమ = చంద్రుడు, నక్షత్ర = నక్షత్రములు, తార = ఆశ్విని మొదలగు నిరువది యేడు నక్షత్రములు. (అశ్విని మొదలగు నిరువదియేడు నక్షత్రములు తప్ప మిగిలినవి నక్షత్రములని సామాన్యముగాఁ జెప్పఁబడును. అశ్విన్యాదులకు తారలు అని పేరు.) గ్రహ = అంగారకాది గ్రహములును (చంద్ర సూర్యులనుగుఱించి యిదివఱకే చెప్పబడియున్నది.) పావక = అగ్నియును, సౌదామని = మెఱుపులును, ఆది = మొదలుగాఁ గల, వివిధ = నానావిధము లైన, తేజః= దీప్తులనెడు, రత్న = మణులచే, శర్కరిలంబును = గండిసుకగలదియును, ప్రవి...బును - ప్రవిమల = నిర్మలమైన, వైరాగ్య, ఉపరతి = చిత్తవిశ్రాంతియును, ఏకాంత = నిశ్చలచిత్తమును, అత్యంతముముక్షుతా = శీఘ్రముగ మోక్షము కావలయు ననుదృఢనిశ్చయమును, (లేక, స్థిరమగుకోర్కియును) అనెడు, అధిత్యకా = పర్వతము పైభాగమునందలి, (పర్వత పై భాగమునందు మొలచియున్న అనుట.) ఆధ్యాత్మానంద = బ్రహ్మానంద మనియెడు, జీవన = జలము చేత, అభిషిక్త = తడుపఁబడినట్టియు, నిర్మల నిశ్చలత్వ కలికా = చాంచల్యము లేక యుండుట అనియెడు మొగ్గలచేత, (లేక, పిందెల చేత,) కలిత = ఒప్పుచున్నట్టియు, ఫలిత = పరిపక్వములైనట్టియు, నిష్కామ = కోరిక లేని, కర్మ = కర్మలును, (కర్మము ఇష్ట మనియును, అపూర్త మనియును రెండు విధములు. అం దిష్టము లనఁగా: శ్లో. 'అగ్నిహోత్రం తపః స్సత్యం వేదానాం చానుపాలనం, ఆతిథ్యం వైశ్వదేవం చ ఇష్ట మి త్యభిధీయతే' = 'అగ్నిహోత్రము చేయుట, జపము నాచరించుట, సత్యము పలుకుట, వేదాధ్యయనము చేయుట, అతిథిపూజ, వైశ్వదేవము అనునవి ఇష్టకర్మలు': శ్లో. 'వాపీకూపతటాకాదిదేవతా యతనాని చ, అన్నప్రదాన మారామః పూర్త మి త్యభిధీయతే.' = 'చెఱువులు బావులు మొదలగువానిని ద్రవ్వించుట, దేవాలయంబులు కట్టుట, అన్నదానము, తోఁటలు వేయించుట అనునవి అపూర్తకర్మములు)(ఉపాసన = మంత్రజపపూర్వకముగా దేవతలను ధ్యానించుటయు, యాగ = యజ్ఞములును, యోగ = అష్టాంగములతోఁ గూడిన రాజయోగము మొదలగు యోగములును, జప = గాయత్రి మొదలగుమంత్రముల జపించుటయును, తపః = శరీరమును శోషింపఁజేయునట్టి కృఛ్రము చాంద్రాయణము మొదలగు వ్రతంబును, సత్య = యథార్థముఁ జెప్పుటయును, శౌచ = లోపల వెలుపల పరిశుద్ధముగా నుండుటయును, దయ = భూతములయందు ప్రేమతో నుండి వానికష్టముల నోర్వలేకపోవుటయును, శీల = సత్స్వభావంబును, వ్రత = బ్రహ్మచర్యాది వ్రతంబులును, దాన = ఈవియు, ఆది= మొదలైనవి యనియెడు, నానావిధ = అనేక విధములైన, అనోకహ = వృక్షములతోఁగూడిన, ఉద్యాన = ఉపవనములచేత, విరాజితంబును = ప్రకాశించుచున్నదియును, శాస్త్ర ...బును - శాస్త్ర = తర్కము మొదలగుశాస్త్రము లనియెడు, పుష్ప = పూవులతోడ, ఉపేత= కూడిన, నిగమ= వేదములయొక్కయు, ఆగమ= కామికము మొదలగు నాగమములయొక్కయు, అంత = కొన లనియెడు, (వేదముయొక్క కొనలు ఉపనిషత్తులు, ఆగమముల యొక్క కొనలు చర్య, క్రియ, యోగ జ్ఞానసాదములయందు జెప్పఁబడు కర్మసాదాఖ్య కర్తృసాదాఖ్య మొదలగునని అని తెలిసికొనవలయును.} కల్పలత = కల్పవృక్షములచేత విలసితంబును, షడ్వి ...బును - షడ్విధ = ఆఱువిధములైన, సమాధి = సమాధులనియెడు. (మనసు నొకవస్తువునం దేకాగ్రముఁజేసి యావస్తువును రూపసహితముగాఁ గాని రహితము గాఁ గాని ధ్యానించుట సమాధి యనఁబడును.) సౌధ = రాజగృహముల చేత, విభ్రాజితంబును = మిగుల ప్రకాశించుచున్నదియును, పరమ . . .బును - పరమ =నిరతిశయమైన, (దీనికంటే నధిక మగునది లేదనుట.) అధ్యాత్మవిద్య = బ్రహ్మజ్ఞానమువలనఁగలిగిన, ఆనంద = బ్రహ్మానంద మనియెడు, జల = నీటిచేత, అభిషిక్త = తడుపఁబడిన, నిర్మల= పరిశుద్ధమైన, చిత్తవృత్తి = మనోవృత్తి యనియెడు (మనస్సుఅనుట.) అంగణ = ముంగిటియందున్న , శమ = మనోనిగ్రహము, దమ = ఇంద్రియముల జయించుట, ఉపరతి = చిత్తవిశ్రాంతి (లేక సన్యాసము,) తితిక్షా =శీతోష్ణాదుల సహించుట, శ్రద్ధా = శ్రద్ధ, సమాధాన = గురువుపదేశించిన విషయములను శాస్త్రములఁ జూచియు తనబుద్ధిచే విచారించియు నిశ్చయించుకొనుట, అమానిత్వ= నిరభిమానము, అదంభిత్వ = డంబము లేకపోవుట, ఆది = మొదలైన, కల్యాణగుణ = సద్గుణములనియెడు, మణిగణ =రత్నములతో నమర్చియున్న , రంగవల్లీ = ముగ్గులచేత ప్రకాశితంబును, నిరతి...బును-నిరతిశయ = మహత్తరమైన, కైవల్య= మోక్షమనెడు, భాండాగార = బొక్కసముచేత, శోభితంబును, ప్రకాశించునదియుసు, ఫలకామ ... లలితంబును — ఫలకామనాభావ = ఫలములనుగోరని, స్వభావనియత = అయాగుణస్వభావములనుబట్టి శాస్త్ర  ములయందు విధింపఁబడిన, కర్మ = తమతమకులములకుఁ గలకర్మలను, ఆచరణ = ఆచరించుటవలనఁ గలిగిన, చిత్తశుద్ధి = మనశ్శుద్ధియును, సర్వకర్మపరిత్యాగ= సకలములగు దుష్కార్యములను విడిచి పెట్టుటయును, గురుభక్తి, వేదాంత = వేదాంతవాక్యములను, శ్రవణ= వినుట మనన = మనసునందు విచారణ సేయుట, నిదిధ్యాసన = నిశ్చయించిన విషయమును ఏకాగ్రచిత్తముతో ధ్యానించుట, జ్ఞాన= స్వస్వరూపజ్ఞానంబును, ఆది = మొదలైనదనెడు, సోపాన = మెట్లతోడ, సమన్విత = కూడిన, విజ్ఞాన = బ్రహ్మానుభవమనెడు, రాజమార్గ = రాజవీథులలో, లలితంబును = మనోహరమైనదియును, పంచ... బును - పంచాక్షరీ = నమశ్శివాయ' అను అయిదక్షరములు గల, మహామంత్ర = గొప్ప మంత్రమనెడు, మాణిక్య = మాణిక్యమైన, తోరణ= వెలుపలివాకిండ్లచేత, అలంకృతంబును = అలంకరింపఁబడినదియును, ప్రణవ....తంబును - ప్రణవనాద = పదివిధములగు ఓంకారనాదము లనియెడు (ఈదశవిధనాదములను గూర్చి ముందు గ్రంథకర్తయే సవిస్తరముగ వివరింపఁగలఁడు.) మంగళవాద్య = శుభకరములైన, వాద్యముల రవ = ధ్వనిచేత, పూరితంబును = నిండింపఁబడినదియు, అగు= అయినట్టి, తురీయ. ..బునన్ - తురీయ = ఉన్మన్యవస్థయనియెడు. (జాగ్రదాది మూఁడవస్థలవలె సహజముగా వచ్చునది గాక యపరోక్షబ్రహ్మజ్ఞానము వలనఁ గలుగునట్టి యీయున్మన్యవస్థయే బ్రహ్మానందానుభవ మనియును నిర్వికల్పసమాధియనియును జెప్పఁబడినది.) మహాస్థానమంటప = గొప్పకొలువుకూటము యొక్క, అంతరంబునన్ = లోపల, (ఇచ్చట ఈ యున్మన్యవస్థకును, పరబ్రహ్మమునకును నామములందుఁ దప్ప రూపములందు భేదము లేదు, గావున బరబ్రహ్మమునకు ఆవరణములగు మూలప్రకృతి మొదలగువానిని ఈ ఆస్థానమంటపమునకు ప్రాకారములు గాను మఱియు నాయావస్తువులను సోపానాదులు గాను వర్ణించి యున్నారు.) "కందరసుందరంబును, గండశైల భాసురంబును" అనుచో రమణీయం బగునొకానొక కైలాసగుహలో నున్నదనియు, ఒకానొకవిశాలమగు బండపైన నమర్చఁబడినదనియు "అధిత్యక...ఉద్యాన” అను విశేషణబలమువలన నాగుహయు బండయు పర్వతముయొక్క పైభాగమునందు (శిఖరమునకంటే కొంచెము క్రింద) నున్న వనియు, అర్థము చెప్పుట యుక్తమని తోఁచుచున్నది. లేకున్న నాస్థానమంటపమందు గుహలు గండశైలములుండుటకు వీలులేదు గదా. (“ఆగుహశిఖరమున కంటెఁ గొంత క్రిందనున్నది” అని చెప్పకున్నయెడల నచ్చట గండశైల ముండుటకు వీలుండదని తెలియవలయును.) సర్వో...నుండై - సర్వ = అశేషములైన, ఉపనిషత్ = వేదాంతములయొక్క, సౌరభూత = సారాంశమైన, బ్రహ్మాత్మకత్వ = జీవుఁడును బ్రహ్మయును ఒక్కటియే అనువిషయమును, దర్శక = చూపునట్టి, రూప = స్వరూపముగల, ఓంకార = ప్రణవ మనియెడు, ఓంకారమును ధ్యానించినవారు శీఘ్రముగ జీవబ్రహ్మై క్యమును దెలిసికొందురనిభావము. ఓంకారమునకు అర్థ మాపరబ్రహ్మయే కావునను "తజ్జపస్తదర్థభావనం"= "దానిని జపించుట దానియర్థమును మనసున ధ్యానించుట” సాక్షాత్కారమునకు సాధనములు “అది యనఁగా ఓంకారము” అనుయోగ సూత్రమునుబట్టి జపకాలమునందు, ఆ పరబ్రహ్మమును (అనగా: ఆయన యథార్థస్వరూపమును) స్మరించుచుండుట యత్యావశ్యక మగుటచేతను, దీనికి శ్రవణాదులుఁగూడ సహాయ మయ్యెనేని జీవబ్రహైక్య జ్ఞాన మతిశీఘ్రములో గలుగు ననుటకు సంశయమేలేదని తెలిసికొనవలయును. సింహాసన = సింహాసనమునందు, ఆసీనుండై = కూర్చున్న వాఁడై, శుద్ధ . . .డును. శుద్ధసత్త్వ = శుద్ధసత్త్వమే, ( లేక గుణసౌమ్యావస్థయే) గుణసామ్యమనఁగా : మూఁడుగుణములును ఎక్కువ తక్కులులేక యుండుట; లేక , గుణసామాన్యసత్త్వరజస్తమము లను భేదములు లేక , వాని కన్నిటికి నాధారమైయుండు గుణత్వజాతి) ప్రధాన = ముఖ్యముగాగల, (అదియే స్వరూపము గాఁ గల యనుట.) మాయామయ-మాయ = మాయయె ఆకారముగాఁ గలిగినట్టియు, దివ్య = శ్రేష్ఠమైనట్టియు, (ఆమాయ ఆవరణము కాఁ గలది అయినను, దానివికారములతోఁ గొంచెమైనను సంబంధపడకుండునట్టి అనుట), శోభన = ఉపాసకులకు శుభముల నొసంగునట్టియు, విగ్రహుండును = శరీరము గలవాడును, ("మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్" = "మాయయె ప్రకృతి. ఆమాయ ఉపాధిగాఁ గలవాఁడు ఈశ్వరుఁడు” అను శ్రుతి ననుసరించి, యిచ్చట ఈశ్వరస్వరూపము వర్ణింపబడె నని చెప్పవలయు) సర్వ.. .డును-సర్వజ్ఞత్వ = సమస్తమును దెలిసికొనుట, సర్వేశ్వరత్వ = సమస్తమునకును ప్రభు పగుట. (లేక , సమస్తప్రపంచమును ఆజ్ఞాపించుట.) సర్వాంతర్యామిత్వ = సమస్తప్రపంచమునందును వ్యాపించి తనమాయాశక్తిచే దానిని స్వకర్మానుగుణముగానడుపుట “ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా” = "శరీర మనుయంత్రముపై నెక్కియున్న యీసకలజీవులను, దనమాయాశక్తిచే తత్తత్కర్మానుగుణముగఁద్రిప్పుచు, నాపరమేశ్వరుడు సర్వభూతములహృదయములయందును ఉన్నాఁడు" అను గీతావాక్య మీవ్యాఖ్యానమునకుఁ బ్రమాణము. ) సర్వసృష్టృత్వ = సకలమును సృష్టి చేయుట, సర్వరక్షకత్వ= సమస్తమును చాలించుట, సర్వసంహారకత్వ= సర్వమును లయింపఁ జేయుట, ఆది = మొదలగు, అగణిత = లెక్క పెట్టఁగూడని, సమగ్ర = సంపూర్ణములైన, సుగుణపరిగ్రహుండును = సద్గుణములు గలవాడును, సత్యజ్ఞానానందస్వరూఫుఁడును, సర్వవ్యాపకుండును, దేవదేవుండును -దేవ = ఇంద్రియాదిదేవతలకు, (లేక, ఇంద్రాది దేవతలకు,) దేవుండును = దేవత యగువాఁడును , (అనఁగా: నియామకుఁ డగువాడును, లేక, తనప్రకాశముచే నింద్రియములఁ బ్రకాశింపఁజేయువాఁడును.) ఆగు శ్రీ మహాదేవుఁడు = అయిన శోభాయుక్తుఁడగు సాంబమూర్తి, మూర్తిమంతంబులు = ఆకారములను ధరించినవి, అయిన చతుర్వింశతితత్త్వంబులును = స్థూలశరమునందుండు నిరువదినాలుగుతత్త్వములును, (ఆకాశాదిభూతము లైదు, జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములు అయిదు, ప్రాణము లయిదు, మనోబుద్ధిచిత్తాహంకారములు నాలుగు, యివి యిరువదినాలుగుతత్త్వములు.) ఇచ్చా.. బును-ఇచ్ఛా = సృష్టి చేయవలయునని తలంచుట అనుశక్తియును, జ్ఞాన = జీవరూపమును ప్రవేశించి సమస్తమును దెలిసి కొనుచుండుశక్తియును, క్రియా = ప్రాణరూపముతో శరీరమునందుండి సమస్తములగు కర్మేంద్రియముల చేతను పనులఁజేయించునట్టి శక్తియును, ఆదిశక్తులును మొదలగు నానావిధము లగుశక్తులును, సత్వశక్తి, రజశ్శక్తి, తమశ్శక్తి మొదలగునని యనుట.) హృషీ...లును హృషీకేశ్వర = విష్ణువు, వాణీశ్వర= బ్రహ్మ, సురేశ్వర = ఇంద్రుఁడు, నందికేశ్వర = నంది, భృంగీశ్వర = భృంగి, విఘ్నేశ్వర = వినాయకుఁడు, కుమార = కుమారస్వామి, ఆది = మొదలైన, ప్రమథగణ = ప్రమథుల సమూహముయొక్క (ప్రమథులు శివునిసభయందు సభ్యులు,) అధీశ్వరులును = ప్రభువులును, బ్రాహ్మీ ... లును, బ్రాహ్మీమహేశ్వర్యాది = బ్రాహ్మి మహేశ్వరి మొదలగు సప్తమాతృకలును, (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనువారేడుగురు మాతృక లనఁబడుదురు.) స్వసాన్నిధ్యంబునన్ = తన సమీపమున, నిజ. . .బున్ - నిజ = తన (రుద్రుని) యొక్క కరుణా = దయతోఁగూడిన, కటాక్ష వీక్షణంబున్ = కడగంటిచూపును, ఆవేక్షించి = కోరి, (దయారసపూర్ణముగ నారుద్రుఁడు తమ వైపుఁ జూచునా యని కోరుచు అనుట.) కొలువన్ = సేవించుచుండఁగా, స్వస్వరూపావలోకనంబు = తనస్వరూపమును, (అనఁగా: పర బ్రహ్మస్వరూపమును,) చూచుటను, (లేక, అనుభవించుటను,) చేయుచున్ = బ్రహ్మానుభవము చేయుచు (పరమానందసముద్రమున మునిఁగి అని భావము.) ఆత్మారాముండు ఐ =తనలోఁ దాను ఆనందించుచున్న వాఁడై, ఉన్న సమయంబునన్ = ఉన్నప్పుడు, తదీయున్ - తదీయ = ఆ యీశ్వరునియొక్క, వామార్థ = ఎడమదగుసగభాగమే, శరీరిణియున్ = శరీరముగాఁ గలదియు, పరాపరప్రకృతి స్వరూపిణియున్ = పరాప్రకృతి అపరాప్రకృతి పరాపరప్రకృతి అనుమూఁడుప్రకృతులును స్వరూపముగాఁ గలదియు, (ఈ ప్రకృతులను గూర్చి మూలమునందే స్పష్టము చేయఁబడును.) నిఖిలజగదుపాదానకారణభూతయున్ = సమస్తజగత్తునకును ఉపాదానకారణ మైనట్టియు, నిఖిల.. .యున్ - నిఖిల = సమస్తమైన,లోక = లోకములకు, ఏక = ముఖ్యమైన, మాతయున్ = తల్లియును, త్రిభువనగేహినియున్ = మూఁడులోకములును దనకుఁగుటుంబముగాఁ గలదియు, విశ్వమోహినియున్ = ప్రపంచమును మోహింపఁ జేయునదియు , ధీముఖియున్ = పరిశుద్ధ మగు బుద్దియే ముఖముగాఁగలదియు, జ్ఞాన...యున్ -జ్ఞాన = పదపదార్థ విజ్ఞానము. (మహావాక్యములయందలి పదములయొక్క వాక్యార్థము. అనఁగా, పైకిదోఁచునర్థము యొక్కయు లక్ష్యార్థము. అనఁగా: వాక్యార్థములయందున్న విరోధములను బోఁగొట్టుటకై యూహింపవలసిన యర్థము యొక్క జ్ఞానము. ) విజ్ఞానము = అనుభవపూర్వకమైన జ్ఞానమును, లోచనయున్ = కన్నులు గాఁగలదియును, విషయ...యున్ - విషయ = శబ్దస్పర్శాదివిషయములయందలి, విరక్తి = వైరాగ్యమే, ఆధరయున్ = పెదవిగాఁ గలదియును, (వైరాగ్యమునకంటే నధికమగు నానందము లేదు గావునను అధరామృతము నాస్వాదించుట పరమానందకరము గావునను ఇట్టియుపమానము చెప్పఁబడినది, ఇట్లే తక్కినచోట్లను అచ్చటసందర్భముల కనుకూలముగ పోలిక గలదని యూహింపవలయును.) విచారమంద...యున్ - విచార = బ్రహ్మవిద్య విచార మనునదియే, మందస్మితయున్ = చిఱునవ్వుగా గలదియును, (పరిశుద్ధముగా నుండుటయే ఇచ్చట బ్రహ్మ వికారమునకును చిఱునగవునకును పోలిక.) నిర్మ...యున్ - నిర్మమతా = ఇది నాది యనునభిమానములేకుండుట, నిరహంతా= నేను అను అభిమానములేకుండుట, (అనునవియే,) హస్తయున్ = హస్తములుగాఁ గలదియును, (సర్వకార్యములును జేయుటకు హస్తములే ముఖ్యసాధనము లైనట్లు ముక్తిని జెందుటకు అహంకారమమకారముల విడుచుటయే ప్రధానసాధనము గావున నిట్లు పోల్పఁబడెను.) యోగబోధస్తనియున్ = రాజయోగంబును, (లేక, కర్మయోగంబును,) జ్ఞానంబును స్తనములుగాఁ గలదియు, (క్షీరమను అమృతమును వర్ణించు స్తనములతో బ్రహ్మానందామృతమును వర్షించు యోగజ్ఞానములకుఁ దగినపోలిక గలదని యెఱుఁగునది.) సందేహమధ్యయున్ = నేను జీవుడనో, బ్రహ్మంబునో అనునట్టి సందేహమే నడుముగాఁగలదియును, (ఇచ్చట "కలదా లేదా అను సందేహమునకు ఆశ్రయ మగు మిగుల సన్ననగు నడుము గలది” అని రెండవయర్థముగలదు, ) సంసారచక్రనాభియున్ = సంసారచక్రమే బొడ్డుగాఁగలదియును, (సంసార మనఁగా : పురుషునిబహువిధములగు కార్యములయందు ప్రవర్తింపఁ జేయు అహంకారము. అది చక్రమువలె ఆద్యంతములు లేనిది కావున ఆద్యంతములు లేకుండుట అనునది అహంకారచక్రములకును, గుండ్రముగా నుండుట అనునది చక్రనాభులకును క్రమముగా పోలిక లని యెఱుంగునది) రాగ...యున్ - రాగ = తనకుఁగావలసిన వస్తువులయందుఁ బ్రేమ. ఆవస్తువును సంపాదింపవలయునని త్వర, ద్వేష = తనకక్కఱ లేనివస్తువుల వైరము, వానిని బరిత్యజించుట, జఘనయున్ = కటిపురోభాగముగాఁ గలదియు, (" క్లీబే తు జఘనం పురః" "జఘన మనునది కటి పురోభాగమునకు పేరు. అది నపుంసక లింగము" అని అమరము) కామ...యున్ = పరస్త్రీ పరధనాదులను గోరుటయు, లోభ = తనధనమును బరుల కీయక తానైనను అనుభవింపక యుండుటయు, అను నవియే, ఊరుయుగళయున్ = తొడలుగాఁ గలదియును, సంకల్పవికల్పచరణయున్ = సంకల్పవికల్పములే పాదములుగాఁ గలదియును. (సంకల్పవికల్పములే సకలవిధములగు ప్రవర్తనములకును సాధనములుగావునఁ జరణములతోఁ బోల్పఁబడినవి, దుర్గుణములన్నియును బరిత్యజింపవలసిన వని సూచించుటకై యధఃకాయరూపముగ వర్ణింపఁబడియున్నవి.) కాలా... యున్ - కాల = కాలములచేత, అవగత = వచ్చిన, పుణ్యపాప మిశ్రకర్మములే, యానయున్ = నడకలుగాఁ గలదియును, వేదాం...యున్ - వేదాంత విద్యావసన = బ్రహ్మవిద్య యనియెడువస్త్రమును, ఉపరతికంచుక = చిత్తవిశ్రాంతి యనియెడు ఱవికను,ధారిణియున్ = ధరించినదియు, రజస్సత్వ ... సురుచిరయున్ -రజః = రజోగుణము యొక్కయు, సత్త్వ = సత్వగుణము యొక్కయు, తమః = తమోగుణముయొక్కయు, గ్రంథి = ముడులను, (సత్త్వగుణము జాగ్రదవస్థ, దానికిని రజోగుణ మగు స్వప్నావస్థకును మధ్యనుండు సంధియును, ఇట్లే తమోగుణరూపమగు సుషుప్త్యవస్థకును స్వప్నావస్థకును మధ్య నుండు సంధియును, ఇట్లే జాగ్రదవస్థకును సుషుప్తికిని మధ్యనుండుసంధియును అను నీమూడుసంధులును, అనగా : ముళ్లును. ) నీవీబంధ = పోకముడియు, కంచుకాబంధ= ఱవిక ముడియు, వేణిబంధ = జడముడియు, కొప్పును, అగునట్లుగా, సురుచిరయున్ = ప్రకాశించుచున్నదియును, (పైనవర్ణించియున్న మూఁడుముడులును, ఈ పార్వతీదేవికిఁ గలకోకముడి మొదలగుమూడుముడులుగా నున్నవి యనుట.) ఫలత్యా... కారిణియున్ - ఫలత్యాగపూర్వక = ఫలమును గోరకుండుటయె ప్రధానముగాఁగల, వర్ణ = బ్రాహణాదివర్ణములకును, ఆశ్రమ + బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమములకును, ఉచిత = తగిన, (అనఁగా; వేదమునందు విధింపఁబడిన,) ధర్మ = స్నానము సంధ్య మొదలగునిత్యకర్మములతోను, శ్రాద్ధము మొదలగు నైమిత్తికకర్మములతోను, గూడిన సకల విధములధర్మములు, అనుష్ఠాన= వాని నాచరించుటయు (లేక, ఫలత్యాగపూర్వకముగ సర్వధర్మములను ఆచరించుటయు,} ఈశ్వరప్రణిదాన = భగవద్ధ్యానమునకు, ఆచార్యోపాసన = సద్గురు సేవ, ఇంద్రియ = జ్ఞానేంద్రియములయొక్కయు కర్మేంద్రియముల యొక్కయు, ఆత్మ = మనస్సుయొక్కయు, వినిగ్రహ = జయించుట, స్థితప్రజ్ఞత్వ = దృఢమగుపరమార్థజ్ఞానము కలిగియుండుట, ఆది= మొదలైన, సాత్త్వికగుణ = సత్త్వగుణమును సంపాదించుకొనుటవలనఁగలిగిన చక్కనిమనోవృత్తులు (దీనికే దైవసంపద యని పేరు.) అనియెడు, భూషణ = నగలు, అలంకారిణియున్ = అలంకారముగాఁ గలదియును, శుద్ధవాస. . యున్ - శుద్ద = సత్త్వరజస్తమోగుణములులేని, (అనఁగా: శుద్ధసత్త్వమయ మైన,) వాసనా - మనోవృత్తులచేతను, చందనము పుష్పములు మొదలగుసుగంధములచేతను; ఈ రెంటికివి శుద్ధసత్వము సమానమే. వాసితయున్ = పరిమ శించుచున్నదియును, (నివసింపఁబడినదియును అనఁగా : పరిశుద్ధము లగు మనోవృత్తుల కాధారమైనదియును. అని రెండవయర్థము “వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధాచ మలినాతథా, మలినా జన్మ కృత్ప్రోక్తా శుద్ధా జన్మవినాశనీ” “శుద్ధవాసన యనియు మలినవాసన యనియు, వాసన మనోవృత్తి, లేక, మనస్సునం దున్న సంస్కారము రెండు విధములు. అందు శుద్ధ వాసన పునర్జన్మమును నశింప జేయును, మలినవాసన దానిని గలిగించును” అని తెలిసికొనవలయును,) నిత్యానపాయినియున్ = శివుని నెప్పుడు నెడఁబాయనిదియు, దేవదేవియున్ = స్వప్రకాశరూపుఁ డగు పరమశివునకు భార్యయును అగు, శ్రీ మహాదేవి = బ్రహ్మవిద్యాస్వరూపిణి యగు పార్వతీదేవి, అతిప్రియపూర్వకంబుగాన్ = మిగుల ప్రీతితో, చతుర్విధశుశ్రూషలు- నాలుగువిధములగుసేవలను (శిష్యులు గురువులకు సేయు సేవకు శుశ్రూష యని పేరు.) కావించుచున్ = చేయుచు, సేవించుచున్ = పూజించుచున్, భావించుచున్ =ధ్యానము చేయుచు, నమస్కరించుచున్, ఆరాధించినన్ = ఆపరమేశ్వరుని మనసునకు సంతసమును గలిగింపఁగా, ప్రసన్నుండు ఐ = అనుగ్రహదృష్టిచేఁ జూచుచు, సుముఖుఁడై, మెచ్చి, నీకున్ ఎయ్యది ఇష్టంబు = నీకేమికావలయును. ఇచ్చెదన్ , అడుగుము, అనినన్ = అని చెప్పఁగా, సంతో .. ఐ -సంతోష = ఆనందముచేత, భరిత = నిండింపఁబడిన, చిత్తయై- మనస్సుగలదై, అమ్మత్తకాశిని = ఆపార్వతీదేవి, చిఱునవ్వు నగుచున్ , ఇట్లు అనియెన్ = ఈ క్రింద రాఁబోవువిధముగా చెప్పెను.

తా. మొదలు నడుమ తుది యనునవి లేక యేవిధ మగునికరవస్తువులవలనఁ గూడ భేదములు చెందక, స్థిరమై ప్రత్యక్షమై యున్న తన కాంతిచే ననేకకోట్లసూర్యచంద్రాగ్నులఁ దిరస్కరించుచు వేదశాస్త్రాగమాదులయందు సుప్రసిద్ధమైన బహువిధము లగు వర్ణములచేతఁగాని, తనకు విరుద్ధములగు పొట్టితనము మొదలైన ధర్మముల చేతఁ గాని, నడక మొదలగు పనులచేతఁ గాని, యితరగుణముల చేతఁ గాని, కైలాస మను ప్రసిద్ధమైన యొకపేరు తప్ప యితరము లగుపేర్లచేతఁగాని, తెలుపుగాని యితరరూపములచేతఁ గాని, వికారములచేత గాని, కఠినత్వము అనునదితప్ప తక్కినశక్తులచేతఁ గాని ఆశ్రయింపఁబడక (కైలాస మని మిగుల ప్రసిద్ధి చెందిన తెల్లనివర్ణము గలదియై అనుట) బ్రహ్మ, దేవేంద్రుఁడు మొదలగు దేవతలును, సిద్ధసాధ్యవిద్యాధరచారణగంధర్వాదులును, నారదాదులగు దేవమునులును, దత్తాత్రేయుఁడు మొదలగు యోగీశ్వరులును, అగస్త్యాదిమహర్షులును, సనకసనందనాదులును, సర్వకాలములయందును సేవించుచుండ నా కైలాసపర్వతము నాశరహితంబును రూపము గుణములు వికారములు సంకల్పములు మొదలగునవి లేనిదియు, ఏసాధనముచేతనైనను తెలిసికొనుటకు వీలుకానిదియు, శబ్దాదివిషయములతోఁ గూడ సంబంధపడనిదియు, ఇంద్రియములకుఁ గాని మనస్సునకుఁ గాని గోచరము గాక, ప్రత్యక్షాదిప్రమాణములచేతఁ దెలియరానిదియు, ఇది యింతయని పరిమితి చెప్పుటకు వీలులేనిదియు, పరిశుద్ధమై సకలప్రపంచమునకంటె వేఱై అనుభవసహిత మగు జ్ఞానమునకుం దక్క మఱిదేనికిని గోచరముగాక సచ్చిదానందరూపమై యుండు నాతురీయాతీతపరబ్రహ్మమో యనఁ బ్రకాశించుచుండును. పరబ్రహ్మరూప మగునాకైలాసపర్వతమున అవ్యక్తము మొదలగు నేడు ప్రాకారములచేత నలంకరింపఁబడినదియు, పదునాల్గు లోకములను గుహయఁదు నిర్మింపఁబడినదియు, చక్రవర్తిమొదలు చతుర్ముఖునివఱకు ననేకతారతమ్యములతో నున్నయానందము లనియెడురాళ్లపైఁ గట్టఁబడినదియు, సూర్యుఁడు చంద్రుడు అగ్ని నక్షత్రములు మెఱపులు మొదలగు జ్యోతులే రత్నములుగా, నారత్నముల యొక్క చూర్ణమే యిసుక గాఁ గలదియు నై, బ్రహ్మానుభవమనియెడు నొక కొలువుకూటమున రాజిల్లుచుండెను. దాని సమీపమున పరిశుద్ధ మగువైరాగ్యమే యేకాగ్రచిత్తముతో ధ్యానము చిత్తవిశ్రాంతి, మిగుల త్వరగామోక్షము కావలయు నని ఇచ్చ అను పర్వతాగ్రభాగమున మొలచి బ్రహ్మానందమను నీరు పోయుటచే పెరిగి నిష్కామకర్మము యాగములు యోగములు జపములు కృఛ్రము చాంద్రాయణము మొదలగు తపస్సులు ఉపాసనలు సత్యముపలుకుట పరిశుద్ధత్వము దయ మంచిస్వభాపము దానము వ్రతము మొదలగు ఫలవృక్షములు మనసు నిశ్చలముగా నుండుట యనియెడు పిందెలతో నొప్పి ఫలించుచునుండును. వేదాంతములును, ఆగమాంతములును అనియెడు కల్పవృక్షపు తీఁగెలును శాస్త్రము లనియెడి పుష్పములచే నొప్పుచుండును. ఇట్లాఫలవృక్షములతోడను, పూఁదీఁగెలతోడను రాజిల్లునుపవనంబులు లెక్కకు మిక్కిలియై యాకొలువుకూటమునకుఁజుట్టును గ్రమ్ముకొని యుండును. షడ్విధసమాధు లనియెడుమేడలు, దాని పార్శ్వములయందు గలవు. మఱియు, పరిశుద్ధమగు చిత్తవృత్తి యనియెడు దానిముంగిలి, బ్రహ్మానందమనియెడు జలముచేఁ దడుపఁబడి మనోనిగ్రహము ఇంద్రియనిగ్రహము చిత్తశాంతి ఓర్పు శ్రద్ధ తృప్తి గర్వము లేకపోవుట డంబము లేకపోవుట మొదలగు సద్గుణములే రత్నములు గా, నారత్నములచే మ్రుగ్గులు పెట్టి యలంకరింపఁబడి యుండును. అచ్చట సర్వాధిక మగుమోక్ష మనియెడుబొక్కస మొకటి గలదు. ఫలమును గోరక వేదోక్తకర్మల నాచరించుటయు, మనశ్శుద్ధియు, సర్వకర్మల శాస్త్రోక్తవిధానంబున విడుచుటయు, గురుభక్తియు వేదాంతవాక్యముల వినుటయు, విచారించుటయు, వాని యర్థమును ధ్యానించుటయు, బ్రహ్మ నెఱుంగుటయు ననుసోపానములచే నలంకరింపఁబడి, అనుభజ్ఞాన మనియెడు రాజవీథియొకటి దానిసమీపమునకుఁ బోవుచుండును. పంచాక్షరీమంత్ర మనియెడు మాణిక్యములచేఁ జెక్కబడి ద్వారములు మిగులఁ బ్రకాశించుచుండును. పదివిధము లగు ఓంకారధ్వములు మంగళవాద్యములై యెప్పుడును అచ్చట మ్రోయుచుండును. ఇట్టి కొలువుకూటమున, ఉపనిషదర్థమగు జీవబ్రహ్మైక్యమును ప్రత్యక్షముగఁ జూపఁజాలు ఓంకార మనియెడు సింహాసనముపై శుద్దసత్త్వప్రధానంబగు మాయయే యాకారముగాఁ గలిగి సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సృష్టిస్థితిసంహారకత్వములు మొదలగు సకలకళ్యాణగుణములచే నొప్పుచు, సత్యజ్ఞానానందస్వరూపుఁడై, దేవతలకు దేవత యై యుండు నా మహాదేవుఁడు కొలువు దీఱి యుండెను. అమ్మహాత్ముని దయారసపూర్ణములగు కటాక్షములఁ గోరుచు, స్వరూపములఁ దాల్చిన యిరువదినాలుగు తత్త్వములును, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనుశక్తులును, విష్ణువు బ్రహ్మ ఇంద్రుఁడు మొదలగు దేవతలును, నందికేశ్వరుఁడు భృంగీశ్వరుఁడు, విఘ్నేశ్వరుఁడు మొదలగు ప్రమథులును, బ్రాహ్మి మొదలగుసప్తమాతృకలును, కుమారస్వామియును సేవించుచుండిరి. అప్పరమశివుఁడు బ్రహ్మానుభవము సేయుచు పరమానందపరవశుఁడై యుండెను. ఆట్లున్నసమయంబున, నమహాత్ముని శరీరమునందలి వామభాగమే తనశరీరముగాఁ గలదియు, పరాప్రకృతి అపరాప్రకృతి పరాపరాప్రకృతి అనియెడు మూఁడు ప్రకృతులును స్వరూపముగాఁ గలదియు, సకలప్రపంచమునకును ఉపాదానకారణ మైనదియు (కార్యరూపముగాఁ బరిణామములు చెందు కారణము ఉపాదానకారణ మనఁబడును. కుండకు మట్టి ఉపాదానకారణము గుడ్డకు నూలు ఉపాదానకారణము) సకలలోకమునకుఁ దల్లియు, మూఁడులోకములు తనకుఁ గుటుంబము గాఁ గలదియు, సకలప్రపంచమును మోహింపఁ జేయునదియు, బ్రహ్మజ్ఞానముచేఁ బ్రకాశించుబుద్దియే ముఖముగా జ్ఞానమును అనుభవసహితజ్ఞానమును నేత్రంబులుగ వైరాగ్యము పెదవిగ వేదాంతవిచారము చిఱునగవుగ మమకారములు లేకుండుట ఆహంకారములు లేకుండుట అనునవి హస్తములుగ రాజయోగము జ్ఞానము అనునవి స్తనములుగ సంశయము నడుముగ సంసారచక్రము బొడ్డుగ అభిలాష, వైరము అనునవి కటిపురోభాగముగ కామము లోభము అనునవి తొడలుగ సంకల్ప వికల్పంబులు పాదములుగ కాలము ననుసరించి వచ్చు ప్రారబ్ధకర్మములు నడకలుగఁ బ్రకాశించుచు, బ్రహ్మజ్ఞాన మనియెడు చీరెయు, చిత్తవిశ్రాంతి యనియెడు ఱవికయు, జాగ్రత్స్వప్నసుషుప్త్యపస్థాసంధు లనియెడు కోకముడి ఱవికముడి కొప్పు అనునవియు, ఫలాపేక్ష లేకుండ తనవర్ణమునకును ఆశ్రమమునకును దగినకర్మల నాచరించుట పరమేశ్వరధ్యానము గురుసేవ ఇంద్రియములను మనస్సును జయించుట దృఢమగువిజ్ఞానము అను మొదలగు సద్గుణములు అనియెడు భూషణములును, తన సౌందర్యమునకు సొంపు గూర్చుచుండఁ బరిశుద్ధ మగు మనోవృత్తు లనియెడు సువాసనలచేఁ గలుగు పరిమళము వ్యాపించుచుండ నప్పార్వతి సర్వకాలములయం దును ఆపరమశివుని విడువక యాశ్రయించియేయుండునది యైనను అధికమగు భక్తిని అనురాగమును జూపుచు నాలుగువిధము లగు (అనఁగా: స్థానశిశ్రూష మొదలగు) శుశ్రూషలఁజేసి సేవించుచుఁ బూజ లొనర్చుచు, మనసున తదేకనిష్ఠతో ధ్యానము చేయుచు మ్రొక్కుచు, నామహాత్మునకు మిగుల సంతోషమును గలిగించెను. అప్పు డనుగ్రహదృష్టితో నాశంకరుండు పరమేశ్వరిం జూచి “నీకిష్ట మేమి ? ఇచ్చెదను - అడుగుము” అనుటము నద్దేవి యానందభరితాంతరంగయై చిఱునగ వొప్ప నీక్రింద జెప్పఁబోవువిధంబునఁ బ్రశ్న చేసెను.

ప్రమాణవివరము.

ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ది అని వేదాంతు లంగీకరించు ప్రమాణములు ఆఱు. ప్రమాణమనఁగా: ఒక వస్తువుకల దని నిర్ధారణ చేయుటకుఁ దగిన యుపాయము. ఇందు. ప్రత్యక్ష మనఁగా: చెవి కన్ను మొదలగు నింద్రియములతో నేవస్తువునైనను తెలుసుకొనుట; అనుమాన మనఁగా: ఏది యైన గుఱుతునుబట్టి యిచ్చట నీ వస్తువుకలదని నిర్ణయించుట. పొగను జూచి యిచ్చట యగ్ని యున్నదని చెప్పుట; చల్లదనమును జూచి యావస్తువు పచ్చిది యని నిర్ణయించుట; ఉపమానమనగా; తానొకమాఱు చూచియున్న వస్తువును బట్టి, దానిని పోలియున్న మఱియొక వస్తువును గ్రహించుట; శబ్దమనగా ; ఆప్తు లగువారు, లేక, సర్వజ్ఞు లగువారు, చెప్పిన దానినిబట్టి వస్తుతత్త్వమును నిర్ణయించుకొనుట; అర్థాపత్తి అనగా : కారణమునకు విరుద్ధ మగు కార్యమును జూచి దానికిఁ దగిన కారణము నూహించుట; దేవదత్తుఁడు బలిసియున్నాడు గాని వాడు పగలు భోజనముసేయఁడు అను మొదలగు సందర్భములయందు భోజనము బొత్తిగా లేకయుండిన బలియుట సంభవింపదు గావున వాడు రాత్రి భోజనము చేసి తీరవలయును అని నిర్ణయించుకొనుట; అనుపలబ్ది అనఁగా: ఈవస్తువు లేదు గనుక కానరాలేదు. కావున నిచ్చట దానియభావ మున్నది యని యభావముల నిర్ణయించుట.

చతుర్విధశుశ్రూషా వివరణము.

౧. గురుని గృహారామక్షేత్ర పశుధనధాన్యాదులు రక్షించుట స్థానశుశ్రూష.

౨. దేశికునకు అభ్యంగనస్నానపాదసంవాహనాదులఁ జేయుట అంగశుశ్రూష.

౩. గురుఁడే తల్లి దండ్రి చుట్టము స్నేహితుఁడు విద్య ధనము దాత దైవము రక్షకుఁడని తలఁచుట భావశుశ్రూష.

౪. గురువున కిష్టములగు పదార్థము లడుగక మునుపే తుష్టిగఁ దెచ్చియిచ్చుట యాత్మశుశ్రూష.

షట్ఛాస్త్రములు.

"తర్కోవ్యాకరణంధర్మశాస్త్రం మీమాంసమిత్యపి, వైద్యశాస్త్రం జ్యౌతిషంచ షట్ఛాస్త్రాణీతికథ్యతే.”

అష్టాదశపురాణములు

"బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా, తథాన్యం నారదీయం చ మార్కండేయం చ సత్తమం. ఆగ్నేయ మష్టమం చైవ భవిష్యన్నవమం స్మృతం, దశమం బ్రహ్మవైవర్తం లైంగ మేకాదశం స్మృతం. వారాహం ద్వాదశం చైవ స్కాందం చాత్ర త్రయోదశం, చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం తథా. మాత్స్యం చ గారుడం చైవ బ్రహ్మాండం చ తతః పరమ్."

షడ్విధసమాధుల వివరణములు.

శ్లో. "సవికల్పో నిర్వికల్ప స్సమాధి ర్ద్వివిధా భవేత్,
     దృశ్యశబ్దానువిద్ధో౽యం సవికల్పః పునర్ద్విధా."

"సమాధి సవికల్పమని నిర్వికల్పమని ద్వివిధము. అందుసవికల్పకము దృశ్యానువిద్దసవికల్పమని శబ్దానువిద్ధసవికల్పమని యిరు తెఱఁగులు గలదియగును.” ఈ రెండును నిర్వికల్ప మొక్కటియునుగూడి మూఁడువిధములయ్యెను. ఈ మూఁడును బాహ్యాంతరభేదములచేత

1. బాహ్యదృశ్యానువిద్ధసవికల్పకసమాధి యని
2. బాహ్యశబ్దానువిద్ధసవికల్పకసమాధి యని
3. బాహ్యనిర్వికల్పకసమాధి యని
4. అంతరదృశ్యానువిద్దసవికల్పకసమాధి యని
5. అంతరశబ్దానువిద్ధసవికల్పకసమాధి యని
6. అంతరనిర్వికల్పకసమాధి యని

ఆఱు విధములు. అందు

1. తనకంటె అన్యములుగ తోఁచెడు బ్రహ్మవిష్ణురుద్రేశ్వరసదాశివాది పిపీలికాంతమగు సమస్తచేతనములును తృణాదిమేరుపర్యంతమైన అచేతనములును తన తెలివియందే పుట్టిగిట్టినవి కాఁబట్టి అవి తన ప్రజ్ఞానకల్పితములని, ఆప్రజ్ఞానమే పరబ్రహ్మమని, ఆపరబ్రహ్మమే తానని చూచుట బాహ్యదృశ్యానువిద్ధసవికల్పకసమాధి.

2. శివరామగోవిందనారాయణవాసుదేవమహాదేవాది సకలనామములలో తన చెవి వినఁబడిన నామము తాను గానని విడిచి సర్వనామవిలక్షణమయిన పరబ్రహ్మ వస్తువు తానని యోచించుటే బాహ్యశబ్దానువిద్ధసవికల్పకసమాధి.

3. కామాదిస్వజ్ఞప్తి వఱకుఁ గలవృత్తులు తనయందుఁ గలిగినప్పుడు వానినన్నిటిని అప్పుడప్పుడు ఒక్కటొక్కటిని క్రమముగా నేను గానని నిగ్రహించి వీనికన్నిటికిని విలక్షణమైన పరబ్రహ్మము, తానని భావించుటే అంతర్దృశ్యానువిద్ధసవికల్పకసమాధి.

4. రాగద్వేషకామక్రోధలోభమోహమదమత్సరేర్ష్యాదర్పాహంకారాదిస్వజ్ఞప్తిపర్యంతమైన సకలాంతరవస్తునామములను నేను గానని విడిచి సర్వవిలక్షణమైన పరమాత్మ తానని యూహిం చుటే అంతరశబ్దానువిద్ధ సవికల్పకసమాధి.

5. ఈ చతుర్విధసవికల్పకసమాధులయందు సుస్థిరతగలిగి అంతర బాహ్యములయందు తనకు నన్యమేమియు తోఁపక, తోఁచినను సముద్రమునందు ముంచినకుండ లోపల వెలుపల పరిపూర్ణమై ఆకాశమందుంచిన కుండ లోపల వెలుపల శూన్యమైనట్లుండుటే బాహ్యనిర్వికల్పసమాధి.

6. పైనఁచెప్పినవృత్తు లేవియులేక ఆఖండపరిపూర్ణ సచ్చిదానందపరబ్రహ్మ స్వరూపమయి ఉండుటే అంతరనిర్వికల్పకసమాధి.

ఆ. ప్రాణనాథ తనదుపతిని గొల్చుటకంటె, వేఱుపనులుగలవె చారుమతికి
    గాన నీదుసేవఁగావించుటయెకాని, యొండుకోర్కి లే దఖండమూర్తి.

టీక. ప్రాణనాథ = ఓ ప్రాణేశ్వరా! చారుమతికిన్ = మంచిమనస్సుగల స్త్రీకి, తనదుపతికిన్ = తనభర్తను, కొల్చుటకంటె = సేవించుటకంటెను, వేఱుపనులు, కలవె = ఉన్నవా? (లేవుఅనుట), కానన్ = కావున, అఖండమూర్తి = ఓసర్వవ్యాపకా! నీదుసేవన్ కావించుట ఎ కాని = నీకు సేవ చేయుటయే తప్ప (నాసేవను ప్రేమతో స్వీకరింపవలయు ననుటయే తప్ప) ఒండుకోర్కి = మఱియొక యిచ్ఛ, లేదు.

తా. ఓ సర్వవ్యాపకా! ప్రాణనాయకా! పతివ్రతలగు స్త్రీలకుఁ బతిని సేవించుటకంటె కావలసినది వేఱేమియు లేదుగదా? కావున నాకును మిమ్ము సేవించుచుండవలయు ననుటకంటె వేఱొకకోర్కి లేదు.

ఆ. అయిన నీ కభీష్ట మడుగు మిచ్చెదనని, యానతిచ్చిరి మహాత్మ ఇపుడు,
    గాన నాకు నెల్ల మానవులకు మేలు, గలుగనొకటియడుగవలసెననఘ.

టీ. ఐనన్ = అట్లు అయినప్పటికినీ, మహాత్మ , ఇపుడు, నీకు, అభీష్టమున్ = కావలసినదానిని, అడుగుము, ఇచ్చెదను, అని, ఆనతిచ్చితిరి = ఆజ్ఞ చేసితిరి. కానన్ అనఘా = పాపరహితుఁడ వైనయో మహాత్మా, ఎల్లమానవులకున్ = సకల జనులకును, మేలు కలుగన్ = మేలగునట్లుగా, ఒకటిన్ = ఒకదానిని, నాకున్, అడుగన్ , వలసెన్

తా. ఓ పాపరహితా! మహానుభావా! భర్త సేవకంటె నితరమైనది పతివ్రతల కక్కఱ లేకపోయినను పతియాజ్ఞను పరిపాలించుట ముఖ్యధర్మము కావున నాకు లోకహితార్థముగా, నొక్క దాని నడుగవలసి వచ్చినది. “నీ కిష్టమైనదాని నడుగుము ఇచ్చెదను" అని మీరు నన్ను ఆజ్ఞాపించియుంటిరి గదా! దాని మీఱుట సరియగునా!

అవతారిక . ఇట్లు గౌరీప్రశ్నమునకుఁ గారణమును వర్ణించి యీ క్రింద ప్రశ్నస్వరూపమును వర్ణించు చున్నాఁడు.

క. నిఖలకలుషసంక్షయకర, మఖిలాభీష్టప్రదం బనంతావ్యయచి,
   త్సుఖదము జగదధిపత్యభి, ముఖకరమగుమంత్రరాజముం గృపఁ జెపుమా.

టీ. నిఖల ...మున్ - నిఖిల = సమస్తమైన, కలుష= పాపముల యొక్క (పంచమహాపాపములయొక్క, లేక, అంహము మొదలగు త్రివిధపాపములయొక్క), సంక్షయ= నాశనమును, కరమున్ = చేయునట్టిదియు, అఖిల... ద్రంబున్ - అఖిల = సమస్తములగు, అభీష్ట = కోరినపదార్థములను, ప్రదంబుఁన్ = ఇచ్చునట్టిదియు, అనంత.. దమున్ - అనంత = మితిలేనిదియు, అవ్యయ= నాశనము లేనిదియు, (ఎంత అనుభవించినను తరుగనిదియు,) చిత్ = జ్ఞానస్వరూపమువలన, (బ్రహ్మస్వరూపమును తెలుసుకొనుటవలన) గలిగిన, సుఖ= మోక్ష సుఖమును, దమున్ = ఇచ్చునట్టిదియు, జగ...రమున్ - జగత్ = ముల్లోకములకును, అధిపతి = ప్రభువైన పరబ్రహ్మమును, అభిముఖకరమున్ = ఎదుట నుండునట్లుగాఁ జేయునదియును, అగుమంత్రరాజమున్ = అయిన మహామంత్రమును, కృపన్ = దయతో, చెప్పుమా= ఉపదేశింపుము.

తా. సకల పాపములను నశింపఁజేసి యైహికాముష్మికములగు సకలభోగముల నిచ్చుటయేకాక శాశ్వతమగు బ్రహానందసుఖమును గూడ నొసంగి పరబ్రహ్మసాక్షాత్కారమునుగూడఁ గలిగించుచు నుపాసకుల నుద్ధరింపఁజాలు నొకమహామంత్రమును నాకు దయతో నుపదేశింపవలయును.

పంచమహాపాపములవివరణము.

కల్లు ద్రావుట, గురుపత్ని గవయుట, విప్రు జంపుట, బ్రహ్మస్వవిషయమైన మ్రుచ్చిమియు; ఇవి గలిగిన క్రూరజనులఁ బ్రీతిఁ బొందుటయును మహాపాతకములు."(బ్రహ్మస్వవిషయము = బ్రాహ్మణధనమునకు సంబంధించిన, మ్రుచ్చిమి= దొంగతనము.)

త్రివిధపాపవివరణము.


శ్లో. "విహిత స్యాననుష్ఠానా న్నిషిద్ధస్య చ సేవనాత్ ,
     అనిగ్రహా ఛ్ఛేంద్రియాణాం నరః పతన మృచ్ఛ్యతి.”

తా. "విధింపఁబడిన కర్మల నాచరింపకుండుట నిషేధింపఁబడిన వాని నాచరించుట, ఇంద్రియముల నిగ్రహింపకుండుట, (అనగా : ధర్మమునకు విరుద్ధమని తలంపక యేయింద్రియ మెట్ల పోయిన నట్లు పోనిచ్చుట) అను నీమూటివలనను పురుషుఁడు పతితుఁ డగును. (పతితుడనగా; బహిష్కారముఁ జెందినవారికంటె నెక్కువగా, నెవ్వరితోడను ఏవిధముగా నైనను సంబంధపడనివాఁడు. పైవర్ణింపఁబడిన మూటిలో మొదటి పాపమునకు అంహమనియు, రెండవదానికి ఆగము అనియు మూడవదానికి ఏనము అనియు సంకేత నామములు.)

తే. అనిన విని నవ్వి గిరిజ కిట్లనియె శంభుఁ
    డడుగరానిరహస్యార్ధ మడిగితీవు

దగనది మదీయనిక్షేప మగుపదార్థ
మైన నెఱిఁగింతు నీకు నెయ్యంబువలన. 44

టీక. అనినన్ = అని పార్వతి ప్రశ్నింపఁగా, విని, నవ్వి, శంభుఁడు, ఇట్లు, అనియెన్, ఈవు = నీవు, అడుగ రానిరహస్యార్థంబున్ = అడుగకూడని మిగుల రహస్యమగు విషయమును, (సంపూర్ణ మగు నధికారము గలవానికిఁ గాని చెప్పకూడదు. అని దాచియుంచిన విషయమును,) అడిగితివి, తగన్ - ఒప్పునట్లుగా, ఇది = నీకుఁ జెప్పఁబోవువిషయము, మదీ ...పము - మదీయ= నాసంబంధమైన, నిక్షేపము=నిధి, అగుపదార్థము = అయినవస్తువు, (ఒకనిధివలె నాచే మిగుల ప్రేమింపఁబడువస్తువు.) ఐనన్ = అయినప్పటికిని, నెయ్యంబువలనన్ = నీయందున్న ప్రేమాతిశయమువలన, నీకున్, ఎఱిఁగింతున్ = ఉపదేశించెదను.

తా. పైనచూపఁ బడినవిధముగాఁ బార్వతీదేవి ప్రశ్న చేయఁగా, దానిని విని “ఏదియో అడుగు నని తలంచు చుంటిని. అట్లుగాక చక్కని ప్రశ్న చేశినది” అని నవ్వి, యా యీశ్వరుఁ డిట్లని చెప్పెను. ఓ పార్వతీ! అడుగఁ గూడనివిషయమును అడిగితివి. నీ ప్రశ్నమునకుఁ జెప్పవలసినయుత్తరము అతిరహస్యమైనది. సర్వసాధారణముగ బయలుపఱుపఁ దగినది కాదు. ముఖ్యముగ నాచే పెన్నిధివలె ప్రేమింపఁబడుచుండు నది. అట్లయినను, నీయందుప్రేమ యధికము గావున నీకు సవిస్తరముగా నెఱింగించెదను వినుము.

ఆప . ప్రశ్నమునకు శివుఁ డిచ్చినయుత్తరమును వర్ణించుచున్నాడు...

తే. శ్రీమనోరామ శ్రీరామరామరామ
    యనుచు రమియింతు రామునియంద రామ
    నామము వరానన సహస్రనామతుల్య
    మట్లు గావున దీని నీ వవధరింపు.45

టీక. వరానన = సుందర మగుముఖము గలిగినట్టియు, శ్రీ...రామ - శ్రీ = బ్రహ్మజ్ఞానమను సంపదతోఁ గూడిన, మనః = (నా) మనస్సును, రామ = రమింపఁ జేయునట్టి, {అనఁగా : ఆనందపఱచునట్టి) ఓ పార్వతీ, శ్రీరామరామరామ అనుచున్ - శ్రీ రామ రామరామ అని జపము చేయుచు, రామునియంద = పరమానందరూపుడగు నాపరబ్రహ్మమునందే, (లేక, రామపదముచేఁ జెప్పఁబడు మహావిష్ణువునందే) నేను, రమియింతున్ = క్రీడించుచుందును . (ఆనఁగా: ఆనందము నొందుచుందును.) నామము = ఈరామనామము, సహస్రనామతుల్యము = కృష్ణ విష్ణు మొదలగు పేర్లు వేయింటితో (లేక ప్రసిద్ధములగు విష్ణుసహస్రనామములతో) సమానము. అట్లు కావునన్, దీనిన్, నీవు అవధరింపు = తెలిసికొనుము. (ఈ పద్యమున మొదటి పాదమందు, రామ, నామమును మూఁడుమాఱులు చెప్పుట స్టూలసూక్ష్మకారణములను మూడుశరీరములకును దాని నభిమానించు మువ్వురు జీవులకును, జాగ్రత్త మొదలగు మూడవస్థలకును, పవిత్రత కలిగించుటకును, ఆధ్యాత్మికము మొదలగు మూఁడు తాపములను శాంతి నొందించుటకును, శ క్తిగలదై యుండుననియు నీవిషయమును సూచించుటకే అట్లు చేయఁబడిన దనియు తెలిసికొనవలయును.)

తా. ఓ సుందరాననా! మనోహారిణీ పార్వతీ నేను శ్రీ రామరామరామయని జపముచేయుచు, సర్వకాలములయందు నారామునియందే నిలచి యానందించు చుండెదను. ఈ రామనామ మితరనామములు వేయింటికంటె నధికమై జపించినవారలకు భోగమోక్షముల నొసంగును. కావున దీనిని గ్రహింపుము. ఈ రామనామమంత్రమే సకలమంత్రములలో నుత్తమము.

శ్రీరామనామార్థము శివుండు పార్వతికిఁ దెలుపుట.

అవ. ఈరామనామమంత్రముయొక్క యర్థమును వివరించి, 'ఈమంత్రమె యన్నిటిలో నుత్తమము' అను విషయమును ఈ క్రింద మూడుపద్యములచే నిరూపించుచున్నాఁడు.

క. ఆది పరబ్రహ్మప్రతి, పాదక మత్యంత పరమపావనము సుమీ
   యీదివ్యమంత్రరాజము, మోదితధర్మార్థకామమోక్షప్రదమున్. 46

టీ. ఈ. . . జము - ఈదివ్య = శ్రేష్ఠమైన, మంత్రరాజము=మంత్రములలో నుత్తమ మగు రామమంత్రము, ఆ...కము - ఆది = ప్రపంచమునకు నాది కారణమగు, లేక “అహ మాదిశ్చ మధ్యం చ భూతానా మంత యేవ చ " " నేను (పరబ్రహ్మమును) సమస్త భూతములకును, ఆది మధ్య అంత స్వరూపుఁడను ”(అనఁగా: ఈ భూతములు పుట్టుటకును, నిలుచుటకును స్థానభూతుఁడను) అనుగీతావాక్యమును బట్టి ఉత్పత్తి స్థితి ప్రళయ కారణభూతుఁడగు (ఇచ్చట ఆదిశబ్దముచే మధ్యాంతములు కూడ చెప్పఁబడినవని తెలిసికొనునది) పరబ్రహ్మ = పరబ్రహ్మమును, ప్రతిపాదకము = తెలియఁజేయునది. (రామనామము పరబ్రహ్మవాచక మనుట) అత్యంతపరమపావనము = మిక్కిలి పవిత్రములని చెప్పదగిన వస్తువులలోనెల్లఁ బవిత్రమైనది. మోది...దమున్ - మోదిత = మంత్రజపముచే సంతసించువారికి (అనఁగా: సర్వకాలములయందును రామనామధ్యానమును జేయుటయే యానందముగాఁ గలవారికి,) ధర్మార్థకామమోక్ష = ధర్మము మొదలగు నాలుగు పురుషార్థములును, ప్రదమున్ = ఇచ్చునది.

తా. ఓ పార్వతీ ! ఈరామనామమంత్రము సకలమంత్రములలోను శ్రేష్ఠమైనది. ఏల యనఁగా; ఇతరమంత్రము లన్నియును ఉపాధివశమున ననేకవికారములు చెందినట్లు తలంపఁబడుచున్న పరబ్రహ్మనుగూర్చి, (అనఁగా : బ్రహ్మవిష్ణురుద్రేంద్రాది దేవతలనుగూర్చి) చెప్పును. ఈమంత్రమట్లు గాక పరమానందస్వరూపుఁడై జ్ఞానయోగుల కందఱకును, విశ్రామస్థాన మైనవా రందఱును ( క్రీడించు స్థాన మైన) శుద్ధపరబ్రహ్మమును గూర్చి చెప్పును. ఈ కారణమువలన సర్వకాలములయందును మిగుల ప్రీతితో నీమంత్ర ముపాసన చేయువారలకు ధర్మార్థకామమోక్షము లనియెడు నాలుగుపురుషార్థములును గలుగును.

అవ. ఇట్లు సామాన్యముగా మంత్రార్ధమును జెప్పి దానిని వివరించువాఁడై రామశబ్దము పరబ్రహ్మను జెప్పువిధమును నిరూపించుచున్నాడు.__

క. సత్యజ్ఞానానంద, ప్రత్యగ్భిన్నాత్మునందు బ్రహ్మాదిబుధుల్
   నిత్యము రమించుచుండఁగఁ, గాత్యాయని, రామపదము గలిగెఁ బరునకున్.

టీక. ఓ కాత్యాయని - ఓ, పార్వతీ సత్య ... నందున్ - సత్య= కాలమువలనఁగాని, దేశమువలనఁ గాని, వస్తువులవలనఁ గాని భేదముఁ జెందక (అనఁగా : సర్వకాలసర్వదేశ సర్వావస్థలయందు నొక్క రీతిగ నిలచి) సత్యమై యుండునట్టియు, జ్ఞాన = ఒక దానిచే తెలిసికొనఁబడక తా నన్నిటిని జూచుచు స్వయం ప్రకాశ స్వరూపముతో నుండునట్టియు, ఆనంద= ఏదుఃఖములతోను సంబంధము లేక పరమానందరూపుఁడై నట్టియు, ప్రత్యక్ష కూటస్థునికంటె (అనఁగా: ఘటాకాశమువలె శరీరోపాధియందున్న అభిన్నబ్రహ్మమునకం టె) జీవునికంటె, వేఱుకాని, ఆత్మునందున్ = పరమాత్మునియందు, బ్రహ్మాదిబుధుల్ = బ్రహ్మ మొదలగు దేవతలు, (లేక, జ్ఞానయోగులు,) నిత్యమున్ - సర్వకాలములయందును, రమించుచుండఁగన్ = క్రీడించుచుండఁగ ,(అనఁగా : జీవబ్రహ్మైక్యజ్ఞానముకలిగి యాఙ్ఞానముచే మోక్షరూప మగు పరమానందము ననుభవించుచుండుట చేత) పరునకున్ = ఆపరబ్రహ్మమునకు, రామపదము = రామనామము, (రమయతీతి రామః, రమంతే అస్మిన్ ఇతి రామః = రమింపజేయువాఁడు గాన రాముఁడు, లేక, యాతని యందు రమింతురు కావున రాముఁడు” అనువ్యుత్పత్తిచే, రామశబ్దము పరబ్రహ్మవాచక మగునని తెలిసికొనవలయును.) కలిగెన్ రామశబ్దముచే పరబ్రహ్మమును చెప్పుచున్నా రనుట.)

తా. ఓపార్వతీ! చతుర్ముఖుఁడు మొదలగుజ్ఞానయోగులందఱును, జీవాభిన్నుఁడగునాపరమాత్రునియందే సర్వావస్థలయందును క్రీడించుచుందురుగదా ! ఇట్లు సకల యోగులకును క్రీడాస్థాన మగుటవలన నాపరబ్రహ్మమునకు రామనామము కలిగెను. కావున రామనామమంత్రము శుద్ధపరబ్రహ్మమును బోధించునదియే యని నిశ్చయించుకొనవలయును.

అవ. రామనామము విష్ణువుయొక్క యవతారములలో నొక్కటి యగురామావతారమునుగూర్చి చెప్పునని లోకమునఁ బ్రసిద్ధి కలదు గదా, ఇది పరబ్రహ్మవాచకమే యని నిర్ణయించుట యెట్లు? అను సంశయము క్రిందిపద్యముతో నివారించు చున్నాఁడు:-

తే. రామపదవాచ్యుఁ డాదినారాయణుండె
    యతనికిని నాకు భేద మింతైనఁ గలుగ
    దద్వయబ్రహ్మమయుల మట్లగుటవలన
    నింతి నాయంద నేను రమింతు నెపుడు. 48

టీక. రామపదవాచ్యుఁడు = రామపదముచే చెప్పతగినవాడు, ఆదినారాయణుండు ఎ = అదిపురుషుఁడగు విష్ణువే, అగును. (విష్ణుమూర్తియవతారములలో నొక్క దానిని చెప్పునది యగుటచే నారామనామము విష్ణు వాచక మగు ననుటలో సంశయము లేదనుట.) ఆతనికిన్ = ఆ విష్ణువునకును, నాకున్, భేదము, ఇంతఐనన్ = కొంచెమైనను, కలుగదు = లేదు. అద్వయబ్రహ్మమయులము = మే మిరువురము కేవలపరబ్రహ్మరూపులము (అనఁగా: ఉపాధు లగుశరీరముకు వేఱువేఱుగా నున్నను, ఆశరీరములయం దున్న పరమాత్మునకు భేదము లేదు కావున మే మిరువురము నొక్కటియే. మఱియు ఈరామనామము విష్ణువును చెప్పునదియే యనినను విష్ణుశరీరోపాధియందున్న పరబ్రహ్మమునుగూర్చియే చెప్పును గాని దేహమునుగూర్చి చెప్పదుగదా ఈరామనామము మాత్రమే కాదు పేరైనను కేవలశరీరమును గూర్చి చెప్పు ననుట సంభవింపదు. నేను అనుశబ్దమునకు అర్థమగునట్టి జీవస్వరూపమే నీవు వాడు అను మొదలగు పదములకుఁ గూడ నర్థమగునని విచారణచే స్పష్ట మగుచుండుటచేత, లోకమునందలి యేపేరు గాని శరీరమును గూర్చి చెప్పుటయే సంభవింపదు. "ఇది శరీరము" అను మొదలగు స్థలముల యందు వ్యవహరింపఁబడుశరీరాదినామములుకూడ ఆయాభూతముల స్వరూపములతో నున్న పరబ్రహ్మమునే చెప్పవలయును. పరబ్రహ్మభిన్న మగువస్తువే లేదుగదా! కావున వాచ్యార్థము (ఫైఁకితోచునట్టియర్ధము.) విష్ణువే యైనను లక్ష్యార్థము (ఊహింప తగినయర్థము, లేక విచారణచే నిర్ణయింపఁదగినయర్థము) పరబ్రహ్మమే యగును. అట్లు అగుటవలనన్ , ఇంతి = ఓ పార్వతీ ! నేను, నాయంద = ఆత్మస్వరూపమునందే, {నలువదియయిదవ పద్యమున "రమియింతు రామునియందు” అని చెప్పఁబడియున్నది దాని కిది వ్యాఖ్యాన మని తెలుసుకొనవలయును.) ఎపుడున్, రమియింతున్ = క్రీడించెదను.

తా. ఓ పార్వతీ! ఈ రామనామము రామావతారమును గూర్చి చెప్పునది యగుటచే విష్ణువాచక మనుటలో సంశయము లేదు. అట్లైనను ఇది విష్ణుశరీరోపాధియం దున్న పరబ్రహ్మమునుగూర్చియే చెప్పును గాని శరీరమును గూర్చి యెన్నటికిని జెప్పదు. ఆపరబ్రహ్మమునకు స్వభావముగ నేయుపాధులును లేవు. కావున రుద్రనామముగల నేనును, విష్ణునామము గలయాహరియును నొక్కటియే. కావున నీరామనామము విష్ణువాచకమైనట్లే రుద్రవాచక మగును. ఇంతయేల? భ్రాంతివలన కనుఁగొన నేరకపోవుటయే కాని చక్కగ విచారించినలోకమున వ్యవహారమునందున్న సర్వ నామములు నిట్టివేకదా అనగా: పరబ్రహ్మము నెఱిగించునవియే కదా! ఇట్లగుటచేత నేను సర్వ కాలములయందును రామపదవాచ్యుఁ డగు నాపరబ్రహ్మమునందే, అనఁగా; నాయందే క్రీడించుచుండు నని తెలిసికొనుము. "రమియింతు రామునియందు" అని చెప్పుట రామునకును "నాకును భేదము కలదు" అని నిరూపించుటకుఁ గాదనియు, పరబ్రహ్మమును తెలిసికొనవలయును” అను మొదలగు వాక్యములయం మువలె నే ఆరామపదము పరబ్రహ్మవాచకముగా మాత్రమే యుపయోగింపఁబడిన దనియుఁ దెలిసికొనుము. పైనిరూపించినయుక్తి వలన "రామనామము పరబ్రహ్మమును జెప్పును" అనునిషయములోఁ గొంచెమైనను సంశయింపవలసినపని లేదు.

-:శ్రీ రామనామ ప్రభావము:-

ఆవ. ఇట్లు రామనామమంత్రార్థమును వివరించి, సాధకులకు దానియం దభిరుచిని గలిగించుటకై యర్థవాద ముపక్రమించు చున్నాఁడు__

తే. రామ తారకపావనరామనామ
    మెంతపాపంబు నడగించు నంతయఘము
    శ్వపచుఁ డైనను జేయఁగాఁ జాలఁ డనఁగఁ
    దత్ప్రభావంబు నెన్నంగ దరమె నాకు.49

టీ. రామ = పార్వతీ తారకపావనరామనామము = సంసారమును దరింపఁజేయగల (లేక, ఓంకారార్థమైన పవిత్రమగు రామనామము.) ఎంతపాపంబున్, అడఁగించున్ = పోఁగొట్టునో, అంతయఘమున్ = అంత పాపమును, శ్వపచుఁడు ఐననున్ = కుక్కమాంసము తినుచండాలుఁడైనను, (ఈజాతి మిక్కిలి యధిక మగుతమోగుణము గలది యగుటచేత నిట్లు చెప్పఁబడెను.) చేయఁగాచాలఁడు = చేయలేఁడు, అనఁగన్ = అని చెప్పుచుండఁగ, తత్ప్రభావంబు = ఆమంత్రముయొక్క సామర్థ్యమును, నాకున్ వర్ణింప తరము ఎ= నేను వర్ణింపఁగలనా ?

తా. ఓపార్వతీ! ఈరామనామమెంతపాపమును బోఁగొట్టఁగలదో అంతపాపమును జండాలుఁడు కూడఁ జేయలేఁడని చెప్పుదురు. ఇట్లుండ దీనిప్రభావమునుగూర్చి నే నే మని వర్ణింపఁగలను. అయినను నాశక్తికొలది కొంత వర్ణించి చెప్పెదను.

క. ఈ రేడుజగములందును, నారీమణి విమలరామనామముచేతం
   జీరఁబడనిఘనదుర్భర, ఘోరమహాఘంబు లేదు కోరి వెదకినన్. 50

టీ. నారీమణీ= స్త్రీరత్న మగు ఓ పార్వతీ, ఈరేడుజగములందు = ఈపదునాలుగు లోకములయందును, విమల...చేతన్, విమల = పవిత్రమైన, రామనామముచేతన్ = రామనామమంత్రముచేత, జీర..ఘంబు - జీరఁబడని = నశింపఁజేయఁబడని, ఘన= అధికమైన, దుర్భర= ఓర్వరాని, ఘోర = భయంకరమైన, మహత్ = గొప్పదైన, అఘంబు= పాపము, కోరివెదకినన్ = కావలయునని వెదకినప్పటికిని, లేదు = దొరకదు.

తా. ఓ పార్వతీ ! ఈపదునాలుగులోకములయందు నెచ్చట వెదకినను, ఎంత శ్రద్ధతో విమర్శించినను, రామనామజపము నశింపఁజేయలేని పాపమేలేదు. (అనఁగా: ఎంతగొప్ప దైనను, ఎంత భయంకరమైన దైనను, ఎన్నిమాఱులు మనఃపూర్వకముగాఁ జేయఁబడిన దైనను పాపము రామనామజపముచేఁ దక్షణమే ధ్వంస మగును.)

తే. బ్రహ్మహత్యాయుతము మద్యపానదశశ
    తమును గుర్వంగనాకోటిగమనదురిత
    మపరిమితహేమచౌర్యంబు లనవరతము
    రామనామాభిహతము లోరాజవదన.51

టీ. ఓ రాజవదన = చంద్రునివంటి ముఖము గల యో పార్వతీ, బ్రహ్మహత్యాయుతము = పదివేల బ్రహ్మహత్యలును, మద్యపానదశశతంబు = వేయిమద్యపానదోషములును, గుర్వంగనాకోటిగమనదురితము = కోటిసంఖ్య గలగురుపత్నులఁ గవయుదోషంబును (ఇచ్చట ఆయుతాదిశబ్దములకు “లెక్కకు మిక్కిలి యైనవి” అనియే యర్థము గాని, ఆయాసంఖ్యలు మాత్రమే యర్థములుగావని దెలిసికొనవలయును.) అపరిమితహేమచౌర్యంబులు = లెక్కకుమిక్కిలియగుస్వర్ణస్తేయమహాపాపములును (స్వర్ణస్తేయమనఁగా: బంగారమును దొంగిలించుట (పరులధనమునపహరించుట,) ఈ విధముగ పంచమహాపాతకములలోని నాలుగు పాపములను గూర్చియు చెప్పఁబడియుండుటచే పైనాలుగుపాపములలో దేనినైనను చేసినవారితో స్నేహము చేయుట యను నైదవ పాపమును గూర్చి కూడ చెప్పఁబడియెను.} అనవరతమున్ = ఎల్లప్పుడును, రామ...ములు - రామనామ = రామమంత్రముచేత, అభిహతములు = పోఁగొట్టఁబడినవి, (ఈ పాపము లన్నిటిని రామమంత్రము పోఁగొట్టుననుట.)

తా. ఓ పార్వతీ, పదివేలబ్రహ్మహత్యలు గాని, లెక్కకు మిక్కిలి యగు మద్యపానదోషములు గాని, గురువధూసంగమదోషములు గాని, సువర్ణస్తేయములు గాని, ఇట్టిపాపులతో సహవాసము చేయుటవలనఁ గలుగుదోషములుకాని (అనఁగా: మహాపాపములు అని చెప్పఁబడు అయిదును), రామమంత్ర జపముచే నిమిషమాత్ర మున తొలఁగిపోవును. ఈ పాపములన్నియు, రామమంత్రమును జూచిన నెప్పుడును భయపడుచుండును.

సీ. బ్రహ్మహత్యాఖ్యపాపతమోర్కబింబంబు
         మధుపానదోషాభ్రమారుతంబు
    తపనీయచౌర్యపాతకశైలభిదురంబు
         గురువధూగమనాఘకుంజరహరి
    జననీపితృభ్రాతృవనితార్భకాచార్య
         గోవధారణ్యోరుదావవహ్ని
    పరసతీసంగమ పరధనహరణాది
         ఘోరపంకోరగక్రూరబర్హి
తే. యనృతభాషణవల్లీమహాలవిత్ర
    మార్యదూషణపంకేరుహద్విపేంద్ర
    మఖిలకలుషాంబునిధిబడబానలంబు
    రామనామంబు హిమశైలరాజతనయ.52

టీక. హిమశైలరాజతనయ - పర్వతరాజగుహిమవంతునకుఁబుత్రికవగునో పార్వతీ, రామనామంబు = రామమంత్రము, బ్రహ...బంబు - బ్రహ్మహత్యాఖ్య= బ్రహహత్య యనియెడుపేరుగల, పాప = పంచమహాపాతకములలో మొదటిదగు పాపమను, తమః = చీకటికి, అర్కబింబంబు = సూర్యబింబము వంటిది. (సూర్యుఁడుదయింపఁగానే, యెంతగాఢమగు చీఁకటియు విచ్చిపోవునట్లు ఈ రామనామము స్మరింపఁబడినతోడనే బ్రహ్మహత్య తొలంగిపోవుననుట) ; మధు... తంబు - మధుపానదోష = మద్యపానమనియెడు, అభ్ర = మేఘమునకు, మారుతంబు = ప్రబలమగువాయువువంటిది, తప...రంబు - తపనీయచౌర్యపాతక = స్వర్ణస్తేయపాప మనియెడు, శైల = పర్వతమునకు, భిదురంబు = వజ్రాయుధమువంటిది. గురు... హరి - గురుగమనాఘ = గురువధూగమనపాప మనియెడు, కుంజర = ఏనుగునకు, హరి = సింహమువంటిది, జననీ . . వహ్ని- జననీ = తల్లియొక్కయు, పితృ = తండ్రి యొక్కయు, భ్రాతృ = అన్నదమ్ముల యొక్కయు, వనితా = స్త్రీలయొక్కయు, అర్భక = శిశువులయొక్కయు, ఆచార్య = గురువుల యొక్కయు, గో = గోవులయొక్కయు, వధ = సంహారమనియెడు, అరణ్య = అరణ్యమునకు, ఉరుదావవహ్ని = గొప్ప (అరణ్యమునంతయును దహింపఁగల) దావానలము వంటిది. పర... . బర్హి - పరసతీసంగమ - పరస్త్రీసమాగమము, పరధనహరణ = ఇతరులధనముల నపహరించుట, ఆది = మొదలుగాఁగల, ఘోర = భయంకరములైన, పంక = పాపములనియెడు, ఉరగ = సర్పములకు, క్రూరబర్హి = క్రూరమైన నెమలివంటిది. ( నెమలి సర్పముల కెంతశత్రు వైనను గొంతశాంతగుణముగలది యయ్యెనేని యొకానొక సర్పము నొకానొకప్పుడు చంపక విడచినను విడువవచ్చును గావున నట్టిశంక కవకాశము లేకుండుటకై ఇచ్చట క్రూరపదము ప్రయోగింపఁబడినది.) అనృ...త్రము - అనృతభాషణ = అసత్యమాడుట యనియెడు, వల్లీ = తీఁగెకు , మహా లవిత్రము= గొప్ప (మిగులపదునుగల) కొడవలివంటిది. ఆర్య ... ద్రము - ఆర్యదూషణ = పెద్దలఁదిరస్కరించుట యనియెడు, పంకేరుహ = పద్మములకు, ద్విపేంద్రము = గజశ్రేష్ఠమువంటిది. అఖి. . . లంబు - అఖిల = సమస్తమైన, కలుష = పాపములనియెడు, అంబునిధి = సముద్రమునకు, బడబానలంబు=బడబాగ్ని వంటిది.

తా. ఓపర్వతరాజపుత్రీ! ఈ రామనామము సూర్యుడు చీకటిని పోఁగొట్టునట్లు బ్రహ్మహత్యను బోఁగొట్టును. గాలి మేఘముల చెదరగొట్టునట్లు మద్యపాన మహాపాపమును చెదరగొట్టును. వజ్రాయుధము కొండల నురు మాడునట్లు స్వర్ణస్తేయమహాపాపమును ధ్వంసము చేయును. సింహము మదగజమును బరిమార్చునట్లు గురువధూసంగమమహాపాపమును రూపు మాపును. దావానలము మహారణ్యములఁ గాల్చునట్లు తల్లి తండ్రి, యన్న దమ్ములు శిశువులు స్త్రీలు గురువులు మొదలగువాని వధించు పాపములఁ గాల్చి వేయును. క్రూరస్వభావము గల నెమలి తాఁజూచిన పాము నెల్ల వధించునట్లు పరస్త్రీసంగమ పరధనాపహారాదిమహా పాపములఁ దలలెత్తకుండునట్లు చేయును. మిక్కిలి పదను గలకొడవలి మృదువగుతీఁగెను అతిసులభముగ ఛేదించునట్లు అసత్యభాషణదోషమును ఛేదించును. మదపుటేనుఁగు తామరతీఁగెల నున్మూలించునట్లు సజ్జనదూషణ మనియెడు పాపము నున్మూలించును. ఇంత యేల? బడబానలము మహాసముద్రముల నింకించునట్లు సకలవిధము లగుపాపముల నింకించును. దీనితో సమానమగునది మఱియొకటి లేదు.

తే. రమణి యవశముచే నైన రామనామ
    మమర వర్తింపఁ బడు చుండ నఖలపాత
    కములచే విడ్వఁబడుసుమ్ము సుమతి యపుడె
    సింహ మతిభీతమృగములచేతఁబోలె.58

టీక. రమణి = ఓ పార్వతీ!, అవశముచేన్ ఐనన్ = మనఃపూర్వకముగాఁ గాక నేదియో యొకకారణము చేత నైనను, రామనామము, అమరన్ = ఒప్పునట్లుగా, వర్తింపఁ బడుచుండన్ = ఉచ్చరింపఁబడఁగా, సుమతి ఆరామనామము నుచ్చరించిన మహాత్ముఁడు, సింహము, అతిభీతమృగములచేత పోలెన్ = తనను చూచినతోడనే మిగులభయముఁజెందుస్వభావము గలలేళ్లచేతవలె, అపుడె = రామనామోచ్చారణఁ జేసినసమయమునందే, అఖిలపాతకములచేన్ = సమస్తము లైనపాతకములచేతను, విడ్వఁబడున్ సుమ్ము = విడిచిపెట్టఁబడును సుమా!

తా. ఓ పార్వతీ! రామనామమును జపింపవలయు ననియు అట్లు జపించిన సకలపాపములును దొలఁగి పోవు ననియుఁ దెలియక పోయినను, ఆజపమునందు శ్రద్ధ లేకపోయినను, ఏది యైననొక కారణమువలనఁ బ్రమాదమువలన నైనను రామనామము నొక్కమాఱైనను స్మరించినఁజాలును. సింహ మనిన పేరు వినినతోడనే భయముఁ జెంది పరుగిడులేళ్లు ఆసింహమును ప్రత్యక్షముగాఁజూచిన నచ్చట బొత్తిగనే నిలు వనియట్లు, రామనామ మనినతోడనే భయము నొందుపాపములు ఆనామము నుచ్చరించిన క్షణముననే సంపూర్ణముగ తొలఁగిపోవును.

తే. అనవరత రామనామకీర్తనపరుండు
    వెనుకటియఘంబులఁ దలంచి వెఱవవలదు
    ఘనత నేనుఁగు నెక్కి కుక్కలను గాంచి
    భయపడఁగ నేల మనుజుఁ డోపంకజాక్షి.54

టీక. ఓపంకజాక్షి = పద్మములవంటినేత్రములు గల పార్వతీ! అన... రుండు - అనవరత-ఎల్లపుడును, రామనామ = రామనామముయొక్క, కీర్తన = జపించుటయందు, పరుండు = ఆసక్తి గలవాఁడు. (లేక, రామనామకీర్తనమే ముఖ్యము గాఁగలవాడు; అనఁగా: మనఃపూర్వకముగా నాజపము నాచరించువాఁడు) వెనుకటియఘంబులన్ = తానంతకు పూర్వము చేసిన పాపంబులను, తలంచి, వెఱవన్ వలదు = భయపడనక్కర లేదు. (ప్రమాదముగా రామనామమును జపించినను, సకలపాపములు పోవుచుండ సర్వకాలములయందును భక్తియుక్తుఁడై యాజపము నాచరించువానికి పాపభయము గల్గునాయని భావము.) మనుజుఁడు = మనుష్యుడు, ఘనతన్ = గొప్పగా, ఏనుఁగును, ఎక్కి, కుక్కలను, కాంచి = చూచి, భయపడఁగన్ ఏల = ఏలభయపడవలయును.

తా. ఓకమలలోచనా! రామనామమును జపింపవలయు ననుసంకల్పమే లేక ప్రమాదమువలన నొక్కమాఱు "రామ" యనినను, సకలపాపములు తొలగిపోవుచుండ సర్వకాలములయందును భక్తియుక్తుఁడై రామమంత్రజపము నాచరించువాఁడు "ఇంతకుముందు నే ననేక పాపముల నాచరించితినే" అని ఏల భయపడవలయును? ఏనుఁగుపై నెక్కినవాఁడు క్రిందనున్న కుక్కలు తన్ను కఱచునని భయపడునా? ఎప్పటికిని భయపడఁడు.

క. ఇలలోన రామనామము, సులభంబై వెలుఁగుచుండఁ జులకఁగఁ బలుకం
   గలనాలుక కలగఁగ న, ల్పులు మిన్నక నరకములను బొందెద రకటా! 55

టీక . ఇలలోనన్ = భూమియందు, రామనామము, సులభంబు ఐ = సుఖముగ దొరకునదియై, వెలుఁగుచున్ ఉండన్ = ప్రకాశించుచుండఁగా, చులకఁగన్ , పలుకం గల నాలుక = ఉచ్చరించుశక్తి గల నాలుక, కలుగఁగన్ = ఉండఁగ, అల్పులు = జ్ఞానహీనులు, మిన్నకన్ = నిరర్థకముగ, నరకములన్ , పొందెదరు, అకటా = అయ్యో

తా. ఇట్లు రామనామము సర్వజనులకును అనాయాసముగనె దొరకునదియై యున్నను , దానిని సుఖముగ నుచ్చరింపఁగలవారలయి యుండినను (అనఁగా: దాని ననాయాసముగ నే యుచ్చరింపఁ గలిగి యున్నను, జ్ఞానహీను లగువారు ఆమంత్రజపమును జేయక పాపములకు లోఁబడి నరకములఁ జెందు చున్నారు. ఆహా ! ఇంతకంటె వేఱాశ్చర్య మేమి గలదు?

ఉ. ప్రాపుగ రామనామము నిరంతరమున్ భజియించువారికిం
    బాపము లే దటంచుఁ బెనుపామును బట్టఁగ వచ్చు నగ్ని సం
    దీపితలోహఖండము నతిత్వరితంబుగ మ్రింగవచ్చు బ
    ల్కోపముఁ బెంచుపెద్దపులికోఱలుఁ దీయఁగవచ్చు నిద్ధరన్. 56

టీక. ఇద్దరన్ = భూమియందు, ప్రాపుగన్ = ఆశ్రయ మగునట్లుగ, (అనఁగా : ఆరామునేశరణముగా నమ్మి) రామనామమున్ , నిరంతరమున్ = ఎల్లప్పుడును, భజియించువారికిన్ = సేవచేయువారికి, (అనఁగా : జపము సేయుచు, దాని యర్థమును, పరబ్రహ్మమును, మనసున ధ్యానము చేయువారికి పాపము లేదు) అటంచున్ = అని చెప్పుచు, పెనుపామున్ = పెద్దపామును, పట్టఁగన్ వచ్చున్ = ( శపధము చేయుటకై), పట్టుకొనవచ్చును. అగ్ని . . .డమున్ - అగ్ని = అగ్నిహోత్రము చేత, సందీపిత = బాగుగఁ గాల్చఁబడిన, లోహఖండమునున్ = ఇనుపతునకను, అతిత్వరితంబుగన్ = మిగుల త్వరతో, మ్రింగన్, వచ్చు , బల్...ఱలు - బల్కోపము = విశేషమగు కోపమును, పెంచు = వృద్ధిఁజెందించు, పెద్దపులికోఱలు, తియ్యఁగన్ వచ్చున్

తా. రామనామమే శరణ మని నమ్మి దాని సర్వదా జపించుచు దానియర్థమగు పరబ్రహ్మమును సర్వదా ధ్యానించుచు నుండువారలకుఁ బాప మేమాత్రము నంటదని చెప్పుచు నెట్టిఘోరప్రతిజ్ఞల నైనను జే యవచ్చును. అత్యుగ్ర మగుసర్పమును జేతితో పట్టుకొనవచ్చును. బాగుగఁ గాలినయినుపతునుక నైనను మ్రింగవచ్చును. మిగులఁ గోపము కలిగియున్న పెద్దపులిని సమీపించి దానికోఱలను గూడ బలాత్కారముగ నూడఁబెరుకవచ్చును. ఇట్లెన్ని సాహసములు చేసినను సత్యప్రభావము వలన నాపురుషున కేమియును బాధ కలుగనేరదు.

క. ఏపాపము నైనఁ దగం, బాపఁ గలదు రామనామభజనపరునకున్
   బాపము గలదనిపలుకుమ, హాపాతకియఘమునడఁప నదియో దిలన్.57

టీక. అదే = ఆ రామనామము, ఏపాపమును ఐనన్ = ఎట్టిమహాపాపమునైనను, తగన్ = ఒప్పునట్లుగా, పాపఁగలదు = పోగొట్టఁగలదు. (అయినను), ఇలన్ = ఈ భూమియందు, రామ...నకున్ - రామనామ = రామనామమును, భజన = సేవించుటయే, పరునకున్ = ప్రధానముగాగల పురుషునకు (ఎప్పుడును రామనామజపముకూడ} పాపము, కలదు, అని, పలుకు. . . అనఘున్ - పలుకు = చెప్పునట్టి, మహాపాతకి = మహా పాపాత్మునియొక్క, అఘమున్ = పాపమును, అడపన్ = పోఁగొట్టుటకు, ఓపదు = సమర్థము.

ఇట్టిప్రభావము కలదియైనను ఆరామనామము సకలపాపములను హరింపం గలదే కాని "రామనామజపము చేయువానికి గూడ బాపము కలదు" అని చెప్పు పాపాత్ముని పాపమును మాత్రము పోఁగొట్టనేరదు.

-: శ్రీరామనామమంత్రాధికారివివరణము :-

అవ. ఈరామమంత్రము సకలమంత్రములలో శ్రేష్ఠమనుటకు మఱియొక కారణమునుగూడఁ జూపుచు తజ్జపమున నధికారుల నిరూపించుచున్నాఁడు._____

సీ. ద్విజనవరేణ్యులకును విప్రోత్తములకు యో
          గీశ్వరులకును యతీశ్వరులకు
    భక్తివైరాగ్యసంపద్విశిష్టులకు నే
          కాంతవాసులకు వేదాంతులకును
    జండాలపుల్కసశ్వపచకంకకిరాత
          శబరహూణాంగనాసంగతులకు
    బ్రహ్మహత్యాసురాపానహేమస్తేయ
          గురువధూసంగమకరవరులకు
తే. సుందరీక్షత్రియోరవ్యశూద్రులకును
    మఱియు నానావిధానేకమానవులకుఁ
    బరమపావన మై శుభప్రదము నైన
    రామనామంబు శరణంబు రాజవదన!58

టీక. ఓరాజవదనా = చంద్రునివంటిముఖము గలయోపార్వతీ! ద్విజవరేణ్యులకునున్ = ('జన్మనా జాయతే శూద్రః. కర్మణా జాయతే ద్విజః' పుట్టినప్పుడు కేవలము బ్రాహ్మణుఁ డనునామ మొక్కటియే యుండును. గావుననప్పుడు ఆశిశువు శూద్రప్రాయుఁడగును. పిదప నుపనయనసంస్కారము జరుగఁగానే ద్విజుండని చెప్పబడును.

అనువాక్యముల ననుసరించి ఉపనయన సంస్కారసంస్కృతు లగు) బ్రాహ్మణోత్తములకును, విప్రోత్తములకున్ (వేదపాఠేన విప్రస్స్యాత్" 'వేదాధ్యయనము వలన విప్రుఁడగును' "విశేషేణ పరాన్ పాతీతి విప్రః" (విశేషముగఁ బరులఁ గడతేర్చువాఁడు. ” ఇది సర్వపురుషార్థ సాధన మగు వేదాధ్యయనము వలనం గాని కలగదు గదా! అను మొదలగు వాక్యములం బట్టి) విప్రు లనఁదగినవారిలో శ్రేష్ఠులగువారికిని, యోగీశ్వరులకునున్ = యోగము చేయువారిలో (అనగా జీవబ్రహ్మము లొక్కటియే యని తెలుసుకొనువారలలో, లేక , తారకాదియోగముల నభ్యసించువారలలో) శ్రేష్ఠులగువారలకును యతీశ్వరులకున్ = బ్రహ్మజ్ఞానమునకై యత్నించు సన్యాసిశ్రేష్ఠులకును, భక్తి = గురు వేదాంతవాక్యములయందు శ్రద్ధయనునట్టియు (లేక, దైవభక్తియనునట్టియు,) వైరాగ్య = ఇహలోక పరలోక భోగములయం దిచ్ఛలేకపోవుటయనునట్టియు, సంపత్ =సంపదలచేత, విశిష్టులకున్ = కూడుకొనిన వారికిని, ఏకాంతవాసులకున్ = ఏకాంతస్థలము లగునరణ్యము మొదలగువానియం దుండి పరమేశ్వర సాక్షాత్కారము కొఱకుఁగాని చిత్తవిశ్రాంతికికొఱకుఁగాని ప్రయత్నించువారిని, వేదాంతులకున్ = వేదాంత శాస్త్రజ్ఞానము కలిగి (అనఁగా : పరోక్షజ్ఞానము కలిగి) యున్నవారికిని, చండాల ..కున్ - చండాల = మాలవాడు, పుల్కస = ఉరియల యందలి మాంసమును దినువారు, శ్వపచ = కుక్కమాంసమును, తినువారు, కంక = పక్షులను తినువారు, కిరాత = బోయలు, శబర = ఎఱుకులు, హూణ = హూణులు, (అనఁగా ఆంగ్లేయులు ఇంగ్లీషు వారు) వీరియొక్క, అంగనా= స్త్రీలతో, సంగతులకున్ = సమాగమముఁజేసిన వారికిని (అనఁగా: అనాచారపరులై యుండువారికిని) బ్రహ్మ ...కున్ , బ్రహ్మహత్యా= బ్రహ్మహత్య, సురాపాన = కల్లుద్రాగుట, హేమస్తేయ = సువర్ణమును దొంగిలించుట, గురువధూసంగమ, (ఈమహాపాపములను) కర = చేసినవారిలో, వరులకున్ = శ్రేష్ఠులైనవారికిని, (అనఁగా : కేవలమనాచారపరులగుటయే కాక, పంచమహాపాపములనఁబడు బ్రహ్మహత్యాదులఁ బలుమాఱు లొనరించిన వారికిని ) సుంద... కున్ - సుందరీ= స్త్రీలు, క్షత్రియ = క్షత్రియులు, ఊరవ్య = వైశ్యులు, శూద్రులకును, (సర్వవర్ణముల వారికిని అనుట, ఇతరమంత్రములకు అన్ని వర్ణముల వారు నధికారులు కారు అని తెలుసుకొనవలయును.) మఱియున్ నానా.. లకున్ - నానావిధ = అనేకవిధములైన, (అనఁగా: ఆచారములయం దనేకభేదములుగల,) అనేక = లెక్కకు మిక్కిలి యగు (అనఁగా : అనేకజాతి భేదములుగల,) మానవులకున్ = మనుష్యులకును, పరమపావనము ఐ = పవిత్రము లగుపదార్థములలో నెల్లఁబవిత్రమై, శుభప్రదమును ఐన రామనామంబు = సకలశుభముల నిచ్చునట్టిదియు నైనఆరామనామమే శరణంబు = రక్షకము. తా. ఓ పార్వతీ! ఉపనయనసంస్కారమును మాత్రముఁ జెంది నిష్ఠాపరులై ద్విజశ్రేష్టు లనిపించుకొనువార లైనను, సకలవిధము లగుజ్ఞానములకు నాధారమగు వేదమును బాగుగ నభ్యసించి దానియందుఁ జెప్పఁబడిన స్నానసంధ్యాదికర్మల నాచరించుచుఁ దాము కడతేరి పరులం గడతేర్చు సామర్థ్యము గల విప్రులైనను, తారకసాంఖ్యామనస్కరూప మగుయోగము నభ్యసించుచు, నిశ్చలచిత్తు లగుమహాత్ములైనను, బ్రహ్మజ్ఞానమునకై ప్రయత్నించుచు శాస్త్రోక్తప్రకారముగ సకలకర్మలఁ బరిత్యజించిన సన్న్యాసులైనను, గురువులయందును, దైవమునందును మిగుల భక్తిగలిగి యుపాసనలఁ జేయువారైనను, పరిపూర్ణ మగువైరాగ్యము గలిగి మోక్షమును గోరువారైనను, వనములు మొదలగు నేకాంతస్థలముల యందుండి చిత్తవిశ్రాంతికై ప్రయత్నించుచుఁ గాని తన కత్యధిక మగుస్థితి గలుగవలయు నని పరమేశ్వరసాక్షాత్కారము గోరుచుఁ గాని యుండువారైనను పరోక్షజ్ఞానము (పరబ్రహ్మమొక్కడున్నాడు అనుజ్ఞానము, లేక, పరబ్రహ్మమే నేను అనుజ్ఞానము) కలిగి యది యనుభవపూర్వకముగ దృఢము కావలయు నని ప్రయత్నించువారు అయినను, యీరామనామమునే ఆశ్రయింపలయును. పరబ్రహ్మము నెఱిగించు నీరామమంత్రమునకంటే శ్రేష్ఠమగునది పైఁ జూపఁబడిన యధికారులస్థితి నభివృద్ధి సేయఁగలది వేఱొక్కటి లేదు గదా. వీరే కాదు. మిగుల ననాచారపరులైన మాలవారు, ఉరియలలోని మాంసము తినువారు, కుక్కలఁ దినువారు, పక్షుల దినువారు, బోయలు, ఎఱుకులు, హూణులు, మొదలగు (తాఁకుటకు సైతము వీలులేని) జాతులవారి స్త్రీలతో సంబంధముకలవారైనను, కేవల మనాచారమాత్రమే కాదు బ్రహ్మహత్య, మద్యపానము, సువర్ణమును దొంగలించుట, గురువధూసంగమము అనుమహాపాపములను సైతము పలుమా ఱాచరించినవారైనను, తమపరిశుద్దికై రామనామమునే యాశ్రయింపవలయును. స్త్రీలుగాని క్షత్రియాదిజాతులవారు గాని, యీమంత్రజపమునం దధికారులే. ఇంతయేల? పరమపవిత్రమై సకలశుభములఁ గలిగించునది యై యున్న ఈ రామనామ మెట్టి మనోవైకల్యము కలవారి నైనను, ఏజాతికలవారి నైనను బ్రోవగలదు. వారి నభివృద్ధి జేయఁ గలదు; ఇట్లు అధికారిభేదము లేక సకలవిధము లగువారును, సకలజాతులవారును ఈమంత్రజపమున (లేక, నామజపమున) నధికారులై యుండుటయె దీనికిని ఇతరమంత్రములకును గలభేదము. ఇతరమంత్రములకు నధికారినియమము కలదు. దీని కానియమము లేదు. వీఁడు వాఁడు అనక నిది సర్వజనుల నుద్దరించును కావున నిది సర్వమంత్రములలో నుత్తమ మనుటకు సందియము లేదు.

చ. కనదురురామనామమునకంటె ఘనం బగుపాపనాశసా
    ధనము నిరంత రేష్టఫలదాయక మైనవిశేషకారణం

     బును మఱి లేదు లోకమున మూఢు లెఱుంగరు దాని నాశ్రయిం
     చిన సకలార్థసంపదలు చేకుఱు సిద్ధము శైలనందనా. 59

టీక. శైలనందనా = పార్వతీ! కన...కంటెన్ - కనత్ = ప్రకాశించుచున్న, ఉరు = గొప్పది యైన, రామనామమునకంటెన్, ఘనంబు = శ్రేష్టమైనది. అగుపాపనాశ సాధనము = ఐనట్టి పాపముల నశింపఁజేయఁగలయుపాయము, నిరం...కము. నిరంతర = సర్వకాలములయందును, (లేక , ఆటంక మేమియును లేకుండ) ఇష్ట = కోరిన, ఫల = ఫలములను, దాయకము= ఇచ్చునట్టిదియు, ఐనవిశేషకారణంబును = అగునట్టిముఖ్యమైన కారణంబును, (అనగా : ఉపాయంబును,) లోకమున్, మఱి = మఱియొక్కటి లేదు, మూఢులు - ఎఱుఁగరు = ఈవిషయమును తెలిసికొనలేరు. దానిన్ = ఆరామనామమును, ఆశ్రయించినన్, సకలార్థసంపదలు = సకలవిధము లగునిష్టఫలసమృద్దులు, చేకురున్ = కలుగును, సిద్ధము = యథార్థము.

తా. ఓపార్వతీ ! ఈలోకమున సకలపాపములు నశింపఁజేయుటకుఁ గానీ, కోరినకోర్కుల నొసంగుటకుగానీ, రామనామమునకంటే శక్తిగలపదార్దము వేఱొకటి లేదు. అయినను, ఈవిషయమును మూఢులు తెలిసికొన నేరరు. వివేకవంతులై యారామనామము నాశ్రయించిరేని వారు పొందరానిదెద్దియునులేదు. ఇది యథార్థము.

అష్టభోగములవివరణము.

శ్లో. "దాసో భృత్య స్సుతో బంధు ర్వస్తు వాహన మేవ చ,
    ధనధాన్య సమృద్ధిశ్చా ప్యష్ట భోగాః ప్రకీర్తితాః"

ఇచ్చట దాసుఁ డనఁగా, తనవలన జీతము తీసుకొనుచు సేవచేయువాడు, భృత్యుఁ డనఁగా తనయనుగ్రహమును కోరి కాని, లేక తనయం దున్న గౌరవమువలనఁగాని తనకు లోబడి తనకార్యములఁ జక్కబెట్టువాఁడు; ఈఅష్టభోగములకంటె కోరతగినది మఱియేదియుండదు కావున వీని నిచ్చట వివరించుచున్నాము.

తే. అబల శ్రీరామరామనామాఖ్యమంత్ర
   మీప్సితంబుల నర్థుల కిచ్చుచుండఁ
   గాంచి నెఱి సిగ్గుపడుచుండుఁ గల్పతరువు
   కామధేనువు నలఘుచింతామణియును.60

టీక. అబల = పార్వతీ! శ్రీ.... త్రము - శ్రీ = బ్రహ్మవిద్యారూపముగలచిత్ప్రకృతికి, (లేక, లక్ష్మికి,) రామ = మనోహరుఁడైన, రామ = రామునియొక్క ( లేక, విష్ణువుయొక్క, లేక, పరబ్రహ్మముయొక్క) నామ = పేరని, ఆఖ్య = ప్రసిద్ధిఁ జెందియున్న (రామనామమనియెడు మంత్రము. (మంతారంత్రాయత ఇతి మంత్రః - ధ్యానించువానిని రక్షించునది), అర్థులకున్ = యాచకులకు, ఈప్సితంబులన్ = కోర్కులను, ఇచ్చుచుండన్ = ఇచ్చుచుండఁగా, కాంచి చూచి, కల్పతరువు = కల్పవృక్షంబును, కామధేనువు = కోరినకోర్కుల నీయఁజాలు కామధేనువును, అలఘు = గొప్పది యగు (అనగా: కోరినకోర్కుల నిచ్చువానిలోనుత్తమమగు; చింతామణియును, నెఱిన్ = మిగుల, సిగ్గుపడుచుండున్ .

తా. ఓ పార్వతీ, మూలప్రకృతికి మనోహరుం డగు (లేక, లక్ష్మీనాయకుఁడగు) నా రాముని నామమంత్రము తన్ను సేవించువారలకు కోరినకోర్కుల నెల్ల— (మోక్షమునుసహితము) నిచ్చుచుండుటను జూచి, "మన క ట్లన్నికోర్కు లిచ్చుటకు శక్తి లేదు కదా నిరర్థకముగా కల్పవృక్షము కామధేనువు చింతామణి అను ప్రసిద్ధిని మాత్రము జెంది యున్నాము. ఈ ప్రసిద్ది హాస్యకారణ మగుచున్నది” అని కల్పవృక్షాదులు మితి లేని లజ్జచే బాధింపఁబడుచుండును. (అనఁగా : కల్పవృక్షమునకంటెను, కామధేనువునకంటెను, చింతామణికంటెను అధికముగా ఈరామనామము భక్తులయభీష్టముల నొసంగుననుట.)

-: శ్రీ రామనామమంత్రోపాసనాఫలము :-

సీ. ధర్మార్థులకు సర్వధర్మంబులొనగూర్చు
           నర్దార్థులకుఁ జేయు నర్థములను
    గామార్థులకు నెల్లకామంబుల నొసంగు
           నాత్మజార్థుల కిచ్చు నాత్మజులను
    శ్రీధృతిస్మృతియశశ్శ్రేయస్సుఖక్షమా
           విద్యార్థులకు వాని వెలయ నిచ్చు
    ఛత్రచామరగజాశ్వప్రభుత్వార్థుల
           కవియు సంపాదించు ననవరతముఁ
తే. జంద్రసూర్యాలయంబుల స్వర్గలోక
    సత్యవైకుంఠకైలాససదనములను
    గోరువారల కవియుఁ జేకూఱఁ జేయు
    రామనామంబు విలసిల్లి రాజవదన.

టీక. రాజవదన = పార్వతీ, రామనామంబు, విలసిల్లి = ప్రకాశించి, అనవరతమున్ = ఎల్లప్పుడును, ధర్మార్థులకు = ధర్మమును కోరువారికి (అనఁగా : స్వకులాచారధర్మముల నేకాగ్రచిత్తముతో నాచరించి దానిచే కృతార్థులు కాదలంచువారికి), సర్వధర్మంబులు = సమస్తమైన ధర్మములను, ఒనఁగూర్చున్ = కలిగించును (అనఁగా: వారితలంపుప్రకారము ధర్మముల చక్కగ నాచరించు సామర్థ్య మొసంగి దానిమూలమున వారి నుద్దరించును). అర్ధార్థులకున్ = ధనమును గోరువారికి, అర్థములను = ధనములను, చేయున్ = కలిగించును. కామార్డులకున్ = సకలవిధము లగుభోగముల ననుభవింపఁదలంచువారికి, ఎల్ల కామంబులను = కోర్కులనెల్లను (అనఁగా : భోగసాధనములను), ఒసఁగున్ = ఇచ్చును. ఆత్మజార్థులకున్ = సంతానమును గోరువారికి, (లేక , సత్పుత్రులను గోరువారికి), ఆత్మజులన్ = పుత్త్రులను, ఇచ్చున్ , శ్రీ... లకున్ - శ్రీ = సంపత్తు, ధృతి = ధైర్యము, (అనఁగా : ఆపదలు కలిగినను జలింపకుండుట) స్మృతి = సర్వవిషయములను బాగుగ జ్ఞప్తియందుంచుకొని సమయోచితముగ స్మరింపఁగల సామర్థ్యము, యశః = కీర్తి, శ్రేయః = సర్వకాలములయందును, శుభపరంపరలు, సుఖ = శరీరమునకును మనస్సునకును, సుఖము, క్షమ = ఓర్పు, (అనఁగా: క్రోధములేకుండుట) ఇట్లు చెప్పుటవలన కామాదిశత్రువుల జయించు సామర్థ్యము అని కూడ నర్థము.) విద్యా = సకలవిద్యలు (అనఁగా : వేదాదిచతుర్దశవిద్యలు లేక, అన్వీక్షకి మొదలగు రాజవిద్యలు) వీనిని, అర్థులకున్ = కోరువారికి, వానిన్ = పై జెప్పినధనాదులను, వెలయన్ = ఒప్పునట్లుగా, (లేక, యభివృద్ధియగునట్లుగా) ఇచ్చున్, ఛత్ర... లకున్ ఛత్ర = శ్వేతచ్ఛత్రము, చామర = వింజామరములు, గజ = ఏనుఁగులు, అశ్వ = గుఱ్ఱములు, ప్రభుత్వ = రాజ్యాధిపత్యము (వీనిని అర్థులకున్ = కోరువారికి,) అవియున్ = ఆ ఛత్రాదులను గూడ, సంపాదించున్ = కలిగించును, (ఇచ్చట ఛత్రాదులు ప్రభుత్వమునకు ఆంగములే అయినను, మరల, ప్రత్యేకముగాఁ జెప్పఁబడి యున్నని కావున ప్రభుత్వశబ్దమునకు స్వల్పరాజ్యాధిపత్యము అనియును, ఛత్రాదిపదములకు "ఏకచ్ఛత్రాధిపత్యము" అనియును అర్థము) చంద్రసూర్యాలయంబులన్ = చంద్రలోక సూర్యలోకములను, స్వర్గ....లను - స్వర్గలోక, సత్య = బ్రహ్మలోకము, వైకుంఠ, కైలాస, సదనములన్ = స్థానములను, కోరువారలకున్, అవియున్, చేకూరన్ చేయున్ = ఇచ్చును.

తా. ఓ పార్వతీ! ఈ రామనామమంత్రము సర్వకాలములయందును, ఇతర సాధనములతోఁ బనిలేకయే ధర్మములఁగోరువారికి ధర్మముల నొసంగును. (అనఁగా : మనసును నిర్మలము చేసి ధర్మమునందు స్థిరతఁజేయును.) ధనములనుగాని సకలవిధములగు భోగములను గాని సత్పుత్రులను గాని, గోరువారలకు అవియెల్ల నొసంగును. సకలవిధములగు సమృద్ధులును గావలయునని గాని, చిత్తము స్థిరముగ నుండవలయు నని కానీ, చక్కని ధారణాశక్తి కావలయు నని కాని, కీర్తి కావలయు నని కాని, సర్వకాలములయందును శుభములుకలుగుచుండవలయు నని కాని, శరీరమున కారోగ్యసుఖము మనసునకు విశ్రాంతిసుఖముకలుగవలయు నని కాని, కామక్రోధాదులబాధ తొలంగ వలయు నని కాని, విద్యాభివృద్ధికావలయునని కాని, తన్నాశ్రయించినవారి కెల్ల వాని నొసంగును. ఇంతమాత్రమే కాదు. రాజ్యము కావలయునన్నను, అశ్వసమృద్ధి గజసమృద్ధి కావలయునన్నను, కట్టకడకు ఏకచ్ఛత్రము వింజామరములు (అనఁగా: చక్రవర్తిత్వము) కావలయునన్నను, వానినొసంగును. ఇంతయే కాదు. ఏపుణ్యముల నాచరింపకయే, చంద్రసూర్యలోకములను గాని, స్వర్గసత్యవైకుంఠకైలాసలోకములను గాని కావలయునని కోరినను వాని నన్నిటిని ఒసంగును.

అన్వీక్షక్యాదిచతుర్విద్యావివరణము.

     "అన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతిశ్చ శాశ్వతీ,
     విద్యా హ్యేతా చతస్రస్స్యుర్లోకసంస్థితిహేతవః."

అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి, అని లోకాధారములగు విద్యలు నాలుగు. ఇవి శాశ్వతములైనవి.

     "అన్వీక్షక్యాంతు విజ్ఞానం దండనీత్యాం నయానయౌ,
     అర్ధానర్థౌ చవార్తాయాం ధర్మాధర్మౌ త్రయీస్థితౌ."

అన్వీక్షకియందు సకలవిధములగు (తర్కవేదాంతాదిసంబంధములైన) జ్ఞానములు, దండనీతి (అర్థశాస్త్రము) యందు నీతి దుర్నీతులు, వార్త (ఆర్థికవిషయములని వ్యవహరింపఁబడుచున్నది.) యందు మనుష్యులకు హితములును ఆహితములును అనువిషయములు, త్రయి (వేదములు) యందు ధర్మాధర్మములు విమర్శింపఁబడియుండును. ఈ నాలుగింటిని సమకూర్చుకొని పురుషుఁడు తనజీవయాత్ర నడుపవలయును.

వ. అదియునుంగాక.62

టీక. అదియునున్ కాక = ఇట్లు కోరినకోర్కుల నిచ్చుటయే కాక.

సీ. నిఖిలరోగంబుల నిర్మూలముగఁ జేయు
          భవభయంబుల నెల్లఁ బాఱఁదోలు
    బంధనంబులఁ బటాపంచలు గావించు
          నొలయునాపదలను నులిమివైచు
    శాత్రవవిజయంబు సతతంబు సమకూర్చుఁ
          దూలించు బహువిధదుఃఖములను
    దలఁ జూప కుండ దుర్దశలను దొలఁగించు
           సకలశుభంబుల సంగ్రహించు
తే. బరమపావనమంగళప్రదము గానఁ
    గలితధర్మార్థకామమోక్షములలోన

   నెసఁగుభక్తుల కొసఁగని దెద్ది లేదు
   ఏమి చెప్పుదు శ్రీరామనామమహిమ. 63

టీక. నిఖిలరోగంబుల = సమస్తమైనవ్యాధులను, నిర్మూలముగన్ = నిశ్శేషములగునట్లుగా చేయున్ (పోఁగొట్టు ననుట) భవభయంబులన్ = జన్మములవలన (అనగా: జననమరణములవలన, లేక, సంసారమువలన) కలుగుభయములను, ఎల్ల= అన్నిటిని, పాఱన్, తోలున్ = పోఁగొట్టును. బంధనంబులన్ = సకలవిధములగు నిర్బంధములను (అనఁగా అష్టపాశములవలనఁ దనకుఁగలిగినట్లు తోచుచున్న నిర్బంధములను,) పటాపంచలు గావించున్ = చెదరిపోవునట్లు చేయును. ఒలయునాపదలనున్ = వచ్చుచున్న యష్టకష్టములను, నులిమి వైచున్ = నశింపఁజేయును. సతతంబున్ = ఎల్లప్పుడును, శాత్రవవిజయంబున్ = శత్రు జయమును, సమకూర్చున్ , బహువిధదుఃఖములను =అనేకవిధము లైనదుఃఖములను, (లేక, సర్వదుఃఖములకును. కారణము లైన పంచక్లేశములను,) తూలించున్ = ధ్వంసము చేయును. దుర్దశలనున్ = హీనము లైనస్థితులను, తలఁ జూపకుండన్ = కొంచెమైనను పుట్ట కుండ, తొలఁగించున్ = అణచివేయును. సకలశుభంబులన్ = సమస్తవిధములగు శుభములను, సంగ్రహించున్ = సంపాదించును. పర ...దము పరమపావన= పవిత్రము లగువానిలో నెల్ల పవిత్రంబును, మంగళప్రదము = సకలములగుశుభముల నిచ్చునదియు, కానన్ = కావున, కలి...లోనన్ - కలిత = ప్రసిద్ధములైన, ధర్మార్థకామమోక్షములలోనన్, ఎసఁగుభక్తులకున్ = ఒప్పుచున్న (లేక , మీగుల శ్రద్ధగల) భక్తులకు (అనఁగా తన్ను సేవించువారలకు) ఒసఁగనిది = ఇయ్యకుండునది, ఎద్ది = ఏదియును, లేదు, (అనఁగా నాలుగుపురుషార్థములలో దేనిని కోరినను దాని నిచ్చుననుట) శ్రీరామనామమహిమ = రామనామప్రభావమునుగూర్చి, ఏమి చెప్పుదు = ఏమని చెప్పఁగలను.

తా. అట్లు అన్ని కోర్కుల నిచ్చుటయే కాక సాధకునకుఁ (అనఁగా  : జపము చేయువానికి) గల సకలవిధవ్యాధులను నిశ్శేషముగ ధ్వంసముఁ జేయును. జన్మ మరణరూపమగు సంసారమువలన జనించిన భయమును నివృత్తి చేయను, (అనఁగా: ముక్తినిగలిగించును . ) సకలవిధనిర్బంధములను జెదరఁగొట్టును అష్టకష్టములనుదొలఁగించును. సకలశత్రువుల పయింపఁగల సామర్థ్యము నిచ్చును. ఇంతయేకాక యే విధము లగు దుఃఖము లున్నను సర్వదుఃఖములకు మూలకారణములగు పంచక్లేశములతోఁ గూడ దొలఁగించును. (అనఁగా : మఱియెప్పటికిఁగూడఁ గలగకుండునట్లు చేయును.) సకలదుర్దశలను పోగొట్టి శుభములఁ గలిగించును. ఈరామనామము పవిత్రము లగువానిలో నెల్ల పవిత్ర మైనదియు, సకలవిధములగు మంగళముల సంపాదించు సామర్థ్యము గలదియు నగుటచేఁ దన్నాశ్రయించిన భక్తులు ధర్మార్థకామమోక్షములలో దేనిని గోరినను దాని నొసఁ గును. ధర్మార్థకామమోక్షములకంటె వేఱై కోరఁదగినవస్తువేదియును లోకమున లేదు కదా! కావున ఓ పార్వతీ! ఈరామనామప్రభావము నెంత యని వర్ణింపఁగలను? నా కీవర్ణన మలవి గాదు.

పంచక్లేశవివరణము.

అవిద్యాక్లేశము, అభినవక్లేశము, అస్థిగతక్లేశము, రాగక్లేశము, ద్వేషక్లేశము, అని క్లేశము లైదువిధములు. అందు నేను జీవుఁడ నని నిర్ణయించుట అవిద్యాక్లేశము. సంసారమును, దానికి కారణమయిన మనస్సును పరిత్యజింపకుండుట అభినవక్లేశము. విషయాభిలాష కలిగి విఱ్ఱవీగుచుండుట అస్థిక్లేశము. అర్థములయందు అధికానురక్తికలిగి యుండుట రాగక్లేశము, ఉదరపోషణార్థము పరుల నాశ్రయించి వారివలన తన యభిమతము కొనసాగనందున వారల దూషించుట ద్వేషక్లేశము.

అష్టపాశవివరణము.


క. దయయు జుగుప్పయు మోహము, భయమును సంశయముఁ గులము బలశీలము ల
   న్నియుఁగూడ నష్టపాశము, లయి వెలయును వాని నాత్ముఁ డంటకయుండున్.

(శుక చరిత్రము.)


 

అష్టకష్టములవివరణము.


    "శ్లో. ఋణం యాచ్ఞా చ వృద్ధత్యం జారచోరదరిద్రతాః,
          రోగశ్చ భుక్తశేష శ్చా స్యష్ట కష్టాః ప్రకీర్తితాః."

క. అచ్చటనె సరస్వతియును, నచ్చట భాగీరథియును యమునానదియున్
   నచ్చట సమస్తతీర్థము, లెచ్చట శ్రీరామనామ మెప్పుడు గలుగున్.

టీక. శ్రీ రామనామము, ఎచ్చటన్ = ఏస్థలమునందు, ఎప్పుడున్, కలుగున్ = జపింపఁబడుచుండునో, అచ్చటనే = ఆస్థలమునందే, సరస్వతియున్ = సరస్వతీనదియును, అచ్చటన్ = ఆస్థలమునందే, భాగీరథియున్ = గంగానదియును, అచ్చటన్, సమస్తతీర్థములు, (కలుగున్) యమునానదియున్ (కలుగున్ అని అధ్యాహార్యము.)

తా. ఏస్థలమునందు రామనామజపము సర్వకాలములయందును జరుగుచుండునో ఆస్థలమునందే సర్వతీర్థోత్తమములని చెప్పదగిన గంగాయమునాసరస్వతులు, మఱియు లోకమునఁగల సకలతీర్థములును ఎప్పుడును నివసించుచుండును. కావున నాస్థలము సర్వతీర్థమయమై చూచువారలకును గూడ మోక్షమును గలిగించుచుండును.

తే. తెలివి శ్రీరామనామసుధారసంబు
   నమృతులై గ్రోలుభక్తుల కమృత మేల?

   నమర నమృతాంధసులచేత నదియె మిగులఁ
   గోరఁబడుచుండుఁ గావున వారిజాక్షి.65

టీక. వారిజాక్షి = కమలములవంటి నేత్రములుగల యో పార్వతీ !, అమరన్ = ఒప్పునట్లుగా, అమృతాంధసులచేతన్ = అమృతమును పానము చేయునట్టిదేవతలచేత కూడ, అదియె = ఆరామనామమే, మిగులన్ = అధికముగ, గోరఁబడుచుండు కావునన్, (దేవతలు అమృతమును పానము చేసినవా రయ్యును, ఆరామనామమును మిగులకు శ్రద్దతోఁ గోరుచుందురు కావున) తవిలి = తత్పరులై (అనఁగా : రెండవ పనిలేకుండ అమృతులై రామనామమంత్ర ప్రభావమువలన మరణము లేనివారై అనఁగా : జననమరణ రూప మగుసంసారమునుండి ముక్తులై) శ్రీ రామనామసుధారసంబున్ = శ్రీరామనామామృతమును, క్రోలుభక్తులకున్ = పానముచేయు నుపాసకులకు, అమృతము = క్షీరసముద్రమునుండి చిలికి సంపాదించియున్న యమృతము, ఏల = ఎందుకు ?

తా. కమలములవలె విశాలనేత్రములు గలయోపార్వతీ! సంసారబంధవిముక్తులై (అనఁగా అహంకారమమకారముల బాధవలన బహుముఖములుగఁ దిరుగుచుండు మనసును నిలిపి పరమశాంతిని బూని) సర్వకాల సర్వావస్థలయందును రెండవపని లేక నీ శ్రీరామనామామృతమును పానము చేయుచుండు భక్తులకు, ప్రసిద్ధమగునమృతముతో పనియే లేదనుట నిశ్చయము. ఏల యనఁగా : మిగుల శ్రమపడి యమృతమును సంపాదించి, దానిని బానము చేయుటవలన జరామరణ భయంబులనుండి తొలగినవారైనను, దేవతలు ఆయమృతము మోక్షప్రదము కాకపోవుటచే శ్రీరామనామామృతమునే సర్వకాలములయందును గోరుచుందురు. ఇట్లుండ రామనామమంత్రసాధకునకు, క్షీరసముద్రములోఁ బుట్టిన యాయమృతముతో పనియేలేదుకదా!

తే. కోరి మును గాననిమనుష్యుఁ బేరు వాడి
   చీరిన నతం డతని చెంతఁ జేరినట్లు
   తన్నెఱుంగక తనపేరుఁ దలఁచినంతఁ
   గరుణచే రాముఁ డపుడె సాక్షాత్కరించు.66

టీక. కోరి = ఇష్టపడి, మునున్ = ఇంతకుపూర్వము, కాననిమనుష్యుని = చూడని మనుష్యుని, పేరువాడి చీరినన్ = పేరుపెట్టి పిలువఁగానే, అతండు = ఆ మనుష్యుఁడు, అతనిచెంతన్ = పిలిచినవాని సమీపమునకు, చేరునట్లు, తనున్, (రాముని) ఎఱుంగకన్ = తెలిసికొనకయున్నను, తనపేరున్, తలఁచినంతన్ = స్మరింపఁగానే, అపుడె = ఆక్షణముననే, రాముఁడు, కరుణతోన్ = దయతో, సాక్షాత్కరించున్ = ప్రత్యక్షమగును. తా. ఒక మనుష్యుని, మన మెఱుంగకున్నను బేరు పెట్టి పిలిచినచో వాడు మనదగ్గరకు వచ్చునట్లు, ఆరాముని మన మెఱుఁగకున్నను, (అనగా నారామునిరూపము, లేక యారాముని తత్త్వము మనకింతకుముందు ప్రత్యక్షము కాకున్నను) అమ్మహాత్ముని నామమును జపించినయెడల నాదయామయుఁడు తత్క్షణమే ప్రత్యక్షమగును.

సుగంధివృత్తము.
    రామ రామ రామ రామ రామ రామ యంచు శ్రీ
    రామ రామ రామ రామ రామ రామ యంచు శ్రీ
    రామ రామ రామ రామ రామ రామ యంచుఁ ద
    న్నామకీర్తనంబుఁ జేసినం గలుంగు మోక్షమున్. 67

టీక. తన్నామకీర్తనంబున్ = ఆరామనామము యొక్క స్మరణను, (తక్కిన యర్థము సులభము.)

తా. "త్రిషట్కానిచ నామాని పఠే ద్రామస్య యో నరః, సత్రయోపాధిరహితః మోక్షం సమధిగచ్ఛతి " ఏమనుష్యుఁడు రామనామమును పదునెనిమిది మాఱులు (అనఁగా : ఒక్కొక్క పర్యాయమునకు ఆఱు నామములుగా మూఁడుమాఱులు) జపించునో వాఁడు క్రమముగా స్థూలసూక్ష్మకారణశరీరము లనుమూఁడు ఉపాధుల నతిక్రమించి మోక్షమును జెందును” అనువాక్యము ననుసరించి, రామనామజపమువలన మోక్ష మవశ్యముగ సిద్ధించును.

క. నిరతంబు రామనామ, స్మరణంబునకంటె మోక్షసాధన మితరం
   బరయంగ లేదు ధరలోఁ, బరమసులభ మైనలసదుపాయం బబలా.68

టీక. ఆబల= ఓ పార్వతీ!, నిరతంబున్ = ఎల్లప్పుడును, రామనామస్మరణంబునకంటెన్ = రామనామజపము సేయుటకంటె, ఇతరంబు = వేఱైన, మోక్షసాధనము = మోక్షమునుసాధింపఁగలిగినట్టియు, పరమసులభము = మిగులసులభమైనదియు, ఐనలసదుపాయము = ఐనట్టిశ్రేష్ఠమైనయుపాయము, ధరలో = ఈభూమిలో, అరయంగన్ = విచారింపఁగా, లేదు.

తా. పార్వతీ! మనస్సునకును, శరీరమునకును శ్రమ కలిగించుమోక్ష సాధనము లనేకములున్నను ఈరామనామజప మంత సులభమైనవి, ఇంత దృఢముగా మోక్షఫలమునిచ్చునవి ఎవ్వియును లేవు. కావున నీరామనామము, సకలమనుష్యులచేతను ఉపాసింపఁదగినది.

వ. అని యిట్లు శ్రీరామమంత్రంబును దత్ప్రభావంబు నుపదేశించిన నా
కర్ణించి పరమానందభరితస్వాంత యై యక్కాంతామణి యత్యంత

భక్తిపూర్వకంబుగా ననేకప్రణామంబు లాచరించి వినుతించి స్వామీ
తన్మంత్రాధిష్టానదేవతాశ్రీరామతత్త్వస్వరూపం బెట్టిది యెఱిఁగింపు
మనిన నొక్కింత విచారించి శ్రీరామహృదయంబనుపరమేతిహాసం
బు గల దందు శ్రీరామతత్త్వం బతివిస్పష్టంబుగా విలసిల్లు నది
యతిరహస్యంబు గావున నెవ్వరికి గోచరంబు గాకుండు దాని నేఁ
దెలియం జెప్పెద విను మని శ్రీమహాదేవుం డప్పార్వతీదేవి కి
ట్లనియె.

టీక. అని, ఇట్లు. శ్రీరామమంత్రంబును, తత్ప్రభావంబున్ = ఆరామమంత్రముయొక్క సామర్థ్యమును, ఉపదేశించినన్ = తెలియఁజేయఁగా, ఆకర్ణించి = వి ని, పర...యై - పరమ = అధికమగు, ఆనంద = సంతోషముచేత (అనఁగా : లోకులనుద్దరించుటకు చక్కనియుపాయము దొరకెను గదా యను సంతసము చేత ) భరిత = సంపూర్ణమైన, స్వాంత యై = మనస్సు కలది యై, అక్కాంతామణి = ఆ స్త్రీ రత్న మగు పార్వతీ దేవి, అత్యంతభ క్తిపూర్వకంబుగాన్ = అధికమగుభ క్తితో, అనేక ప్రణామంబులు = అనేక నమస్కారములను, ఆచరించి = చేసి, వినుతించి = స్తోత్రము చేసి, స్వామీ = ఓ ప్రభువా! త...పంబు తన్మంత్ర = ఆ శ్రీరామనామమంత్రమునకు, అధిష్టానదేవతా= దేవతయగు (అనఁగా : మంత్ర మెవ్వనిని గూర్చి జపింప వలయునో ఆ దేవతయగు ) శ్రీరామ = శ్రీరాముని యొక్క, తత్త్వస్వరూపంబు = యథార్థస్వరూపము. ఎట్టిది (రామునియథార్థస్వరూప మేమి?) ఎఱింగింపుము = తెలియఁజేయుము " అనినన్ = అని చెప్పఁగా, ఒక్కింత కొంచెము, విచారించి ఆలోచన చేసి, (అనఁగా: అతిరహస్య మగు నీ శ్రీ రామతత్త్వస్వరూపము నీయమకుఁ జెప్పవచ్చునా కూడదా?, అది చెప్పుట కీయమ తగినయధికారిణి యగునా కాదా ? అని కొంతవిచారించి, " శ్రీరామహృదయంబను = శ్రీరామహృదయ మను పేరు గల, పరమ...... ఇతిహాసంబు = శ్రేష్టమగునొక్క పూర్వకథ గలదు, అందున్ = ఆకథయందు, శ్రీరామతత్త్వంబు = శ్రీరాముని యథార్థస్వరూపము, (అనఁగా: ఆయథార్థస్వరూపమును గూర్చినవివరము), అతి విస్పష్టంబుగాన్ - మిగుల స్పష్టముగ, విలసిల్లున్ = ప్రకాశించుచుండును, అది = ఆకథ, (లేక, ఆ తత్త్వస్వరూపము) అతిరహస్యంబు= మిక్కిలి రహస్యమైనది. (అనఁగా : మిగుల నుత్తమములగునధికారులకుఁ గాని, చెప్పరానిది) కావునన్ = కాబట్టి, ఎవ్వరికిన్, గోచరంబు కాకన్ ఉండున్ = తెలియకుండును -(అనఁగా; దాని నెవ్వరు నెఱుంగరు.) దాని = =ఆతత్త్వస్వరూపమును (లేక కథను ,) ఏన్ = నేను, తెలియన్ చెప్పెదన్ = బాగుగ బోధపడునట్లుగా నీకు చెప్పెదను, వినుము” అని, శ్రీ మహాదేవుండు = శోభాయుక్తుఁ డగు నాయీశ్వరుఁడు, పార్వతీదేవికిన్ , ఇట్లు = ఈ క్రింద రాఁబోవు విధముగ, అనియెన్ - చెప్పెను. తా. పైఁ జెప్పిన విధముగ నాపరమేశ్వరుఁడు రామమంత్రము నుపదేశించి దాని సామర్థ్యము తెలుపఁగానే "లోకుల నుద్ధరించుటకు చక్కని యుపాయము దొరకెనుగదా అని మిగుల సంతసించి యాపార్వతీదేవి తన ప్రియుని గొనియాడి పలుమాఱు నమస్కరించి యిట్లనియె. "ఓ స్వామీ. మీరు మంత్రమును దాని ఫలమును దెలియఁ జేసితిరి; గానీ ఆమంత్రమునకు అధిదేవతయగు శ్రీరామునితత్త్వస్వరూపమును గూర్చి వివరింపలేదు. కావున దానిని వివరించి యనుగ్రహింపవలయును" అని వేఁడుకొనఁగానే, ఆపరమేశ్వరుఁడు మొదట కొంత సంశయించియు పార్వతీదేవి మిగులజ్ఞానవతి యగుట చేత శ్రీరామతత్త్వస్వరూపమును ప్రకటింప నిశ్చయించి ఇట్లనియె. “ఓ పార్వతీ! రామహృదయ మను నొక కథ గలదు. అది సాధారణముగ నందఱకును తెలియునది కాదు. అట్లయినను నీపు జ్ఞానసతివగుటచే, నీకు దాని వివరించి చెప్పెదను. అందు నీవడిగిన విషయమంతయు స్వష్టము కాగలదు." అని చెప్పి క్రింద రాఁబోవువిధముగ శ్రీరామహృదయమును జెప్పుట కారంభించెను.

పార్వతీసంశయవివరణము.

శ్రీరామునియధార్థస్వరూపమును గూర్చి పార్వతికి సంశయము కలదని యధ్యాత్మరామాయణమునం దున్నది.

“వదంతి రామం పర మేక మాద్యం, నిరస్తమాయాగుణసంప్రసారమ్,
 భజంతి చాహర్నిశ మప్రమత్తాః, పరం పదం యాంతి తధైవ సిద్దాః"

ఓపరమేశ్వరా! ఈ రాముఁడు అద్వితీయఁ డగు పరబ్రహ్మ మనియు, సకల జగత్తులకును కారణభూతుఁ డనియు, మాయతోఁ గాని దానిగుణము లగు సత్త్వరజస్తమస్సులతోఁగాని, సంబంధ మేమియును లేని పరిశుద్ధుఁడనియు చెప్పుచున్నారు. ఇంతమాత్రమేకాక నారామునిపై వర్ణింపఁబడిన స్వరూపముతోనే రేయుంబవ లొక్కరీతిగ మనసును రెండవదానిపైకిఁ బోనీయక సేవించుచున్నారు. ఆసేవయందు సిద్ది జెందినవారు పునరావృత్తిరహిత మగు మోక్షమును గూడఁ జెందుచున్నారు. ఇది భక్తజనులలో ప్రత్యక్ష మయియే యున్నది.

"వదంతి కేచిత్పరమో౽పి రామః, స్వావిద్యయా సంవృత మాత్మ సంజ్ఞం,
 జానాతి నాత్మాన మతః పరేణ, స బోధితో వేద పరాత్మతత్త్వం .
 యదిస్మ జానాతి కుతో విలాపః, సితాకృతే తేన కృతః పరేణ,
 జానాతి నైవం యది కేన దేవః, సమో౽పి సర్వైరపి జీవజాలైః."

ఇట్లున్నను మఱికొందఱు మఱియొక విధముగఁ జెప్పుచున్నారు. ఈరాముడు పరబ్రహ్మస్వరూపుఁ డగుటలో సంశయము లేదు; కాని అట్లయినను ఆయన తనయథార్థస్వరూపము నెఱుఁగ లేడు. అజ్ఞానము ఆవరించి యుండుటచేత తాను తనయథార్థస్వరూపము నెఱుంగ లేడు అజ్ఞానము ఆవరించి యుండుట చేత తాను సామాన్యుఁ డనియే తలంచెను గాని, పరమాత్మరూపు డని యెఱుంగడు. ఈకారణము వలననే ప్రతిస్థలమునం దుండును. రామునకు యథార్థస్వరూపము దెలియుటకై ఇతరులగు అగస్త్యుడు మొదలగువారే బోధించుచుండినట్లు ఆరామాయణమువలనఁ దెలియుచున్నది. మఱియు ఆరామునకు స్వయముగానే తనయథార్థస్వరూపము తెలిసియుండిన యెడల నిర్వికారుఁ డైన తాను సీతానిమిత్తమై దుఃఖించునా! ఆయనకు తన స్వరూపమె ఎప్పటికిని తెలియ దనిన సకలజీవులతో సమానుఁడే యగును గదా! అప్పు డాయన పరబ్రహ్మ మగుట ఎట్లు! కావున రాముఁడు పరబ్రహ్మమే యైనను అజ్ఞానావరణము కలిగియున్నా డనవలయును."

“ఓ పరమేశ్వరా ! ఈ రెంటియందును ఏది సత్యమో యని (అనఁగా: రామునకు మాయాగుణములతో సంబంధము కలదా లేదా? యని) నాకు సంశయముకలుగుచున్నది.ఈసంశయమును పోగొట్టుడు.” అని పార్వతీదేవి ప్రశ్న చేసెనని తెలిసికొనవలయును.

రామాయణకథాసంగ్రహము

ఆవ. పైన వర్ణించినవిధముగ శ్రీరామహృదయమును జెప్పెద నని ప్రతిజ్ఞ చేసి దాని కుపోద్ఘాతముగ రామాయణమును సంక్షేపముగా వర్ణించుచున్నాఁడు.

సీ. ఆదినారాయణుం డార్తరక్షణపరా
          యణుడు లోకోపకారార్థముగను
   శ్రీరామచంద్రుఁ డై క్షితిపై నవతరించి
          ప్రేమతో సీతను బెండ్లియాడి
   సాకేతపురమున సంభ్రమించుచు నుండి
          జగముల రక్షింప జననివరము
   జనకుని వాక్యంబు సమకూర్చి చెల్లింపఁ
         దమ్ముఁడు భార్యయుఁ దాను గూడి
తే. తాపసుల వేషములు దాల్చి తాల్మి మీఱ
   దండకారణ్య భూములఁ దగఁ జరించి,
   సకలరాక్షసగణముల సంహరించి
   యరిగి సీతానిమిత్తమై యంతమీఁద. 71

టీ. అర్త...నుడు ఆర్త = ఆధ్యాత్మికాదితాపత్రయము వలన బాధపడువారిని, రక్షణ = రక్షించుటయే, పర = శ్రేష్ఠమగు, అయనుఁడు = గతి(పని) గాగల, ఆదినారాయణుండు = సకల జగత్తులకు నాదికారణభూతుఁడగు మహావిష్ణువు లోకోపకా రార్థముగను = దుష్టుల శిక్షించి శిష్టుల రక్షించి లోకమున కుపకారము చేయుటకై, శ్రీరామచంద్రుఁడు ఐ= రాముఁడను పేర దశరథునకుఁ పుత్రుఁడై, క్షితిపై = భూమి యందు , అవతరించి = పుట్టి, ప్రేమతో = అనురాగముతో, సీతను, పెండ్లియాడి= సాకేతపురమునన్ = అయోధ్యాపట్టణమునందు , సంభ్రమించుచున్ = సంతసించుచు, ఉండి = పండ్రెండుసంవత్సరము లుండి, (వివాహమైనపిదప రాముఁడు పండ్రెండుసం వత్సరములకు అరణ్యమునకు పోయె ననుట రామాయణమున ప్రసిద్ధము.) జగములన్ = ప్రపంచములను, రక్షింపన్ = రావణబాధలేకుండ రక్షించుటకును, జననివరమున్ = కైకకు దశరథుఁ డంతకు పూర్వమిచ్చియున్న వరములను , జనకునివాక్యమున్ = దశరధుని మాటను, (లేక, ప్రతిజ్ఞను,) సమకూర్చి చెల్లింపవ్ = సిద్ధించునట్లుచేయుటకును, తమ్ముఁడు = లక్ష్మణుఁడు, భార్యయున్ = సీతాదేవియును, తానున్ , కూడి, తాపసులవేషములు = ఋషులవేషములను (అనఁగా : నారచీరలు మొదలగువానిని,) తాల్చి = ధరించి, తాల్మి = ఓర్పు, మీరన్ = అతిశయించునట్లుగా, (అనఁగా : ఈవనవాసము చేయవలసి వచ్చేనే యని కొంచెమైనను విసిగికొనక) దండకారణ్యభూములన్ = దండకారణ్యమునందు, తగన్ = ఒప్పునట్లుగా , చరించి = తిరిగి, సకలరాక్షసగణములన్ = సమస్తరాక్షసులను, (అనఁగా విరాధఖరదూషణాదులను,) సంహరించి, (ఈ రాక్షసవధయె రావణు నకు రామునిపై క్రోధముకలిగించినది కావున నీ వధను చెప్పుటచే రావణసంహారమునకుఁ గారణము లగు సీతాపహారాదులను గూర్చి చెప్పినట్లె యని యూహించునది.) అంత మీఁదన్ = అటుతర్వాత (అనఁగా : సీత రావణుని యంతఃపురమున నున్న దని ఆంజ నేయువలన నెఱింగినపిదప, సీతానిమిత్తమై = సీతను గొనివచ్చుటకై, అరిగి = లంకకు జని.

తా. భక్తులతాపత్రయమును జల్లార్చుటయే ముఖ్య మగుకార్యముగాఁ గలిగి సంచరించు నామహావిష్ణువు దేవతలప్రార్థనమువలన రావణసంహారము చేసి లోకమున కుపకారము చేయుటకై రాముఁ డను పేర దశరథపుత్త్రుఁడై భూలోకమున జన్మించి, భూమికి పుత్త్రికయై సీత యను పేర జనకునియింటఁ బెరుగుచున్న లక్ష్మీదేవిని వివాహ మయ్యెను. ఆవివాహమున కనంతరము పండ్రెండు సంవత్సరములు సకలభోగముల నను భవించుచు నయోధ్యయందుండి తాను వచ్చిన పనిని (రావణసంహారమును) శీఘ్రముగు నిర్వహించు తలంపునఁ దనతండ్రి యగుదశరథుని ప్రతిజ్ఞను బరిపాలింపవలయు ననియుఁ దల్లికిచ్చినవరములఁ జెల్లింపవలయు ననియు మిషచే సీతాలక్ష్మణులతోఁ గూడి ఋషివేషము ధరించి దండకారణ్యమును బ్రవేశించెను. అచ్చట విరాథుఁడు ఖరదూషణాదులు మొదలగు రాక్షసుల ననేకుల సంహరించి యావృత్తాంతమువలనఁ గోపించిన రావణాసురుఁడు మాయచే సీతాదేవిని లంకకుఁ గొనిపోవ, సుగ్రీవసహాయమువలన నాయమను వెదకించి, హనుమంతునివలన లంకలో నాయమ యుండుట నెఱింగి

యాలంకకు వాసరసైన్యసమేతుఁ డై చనియెను.

మ. రణభూమిం దగ రావణాసురునిఁ బుత్ర భ్రాతృబంధూరువా
    రణగంధర్వశతాంగయుక్తముగ నస్త్రశ్రేణిచేఁ ద్రుంచి ల
    క్ష్మణసుగ్రీవహనూమదాదియుతుఁ డై కాంక్షించి సీతావధూ
    మణితో వచ్చె నయౌధ్య కార్యులు నుతింపం బుష్పకారూఢుడై.70

టీ. రణభూమిన్ = యుద్ధ భూమియందు, తగన్ = ఒప్పునట్లుగా, పుత్ర...
ముగన్ = పుత్రులతో, భ్రాతృ = సోదరులతో, బంధు = బంధువులతో, ఉరు =
గొప్పవియగు, వారణ= ఏనుఁగులతో, గంధర్వ = గుఱ్ఱములతో, శతాంగ = రథములతో,
యుక్తముగన్ = కూడినట్లు, రావణాసురునిన్ , అస్త్రశ్రేణిచేన్ = బాణసమూహాము
చేత, త్రుంచి = సంహరించి, లక్ష్మణ...తుఁడై - లక్ష్మణ, సుగ్రీవ, హనూమత్ = హను
మంతుఁడు, ఆది = మొదలగువారితో (ఇచ్చట ఆదిశబ్దమువలన విభీషణుఁడు మొదలగు
రాక్షసులుకూడఁ జెప్పఁబడిరి) యుతుఁడై = కూడిన వాఁడై, కాంక్షించి = కోరి, పుష్పకా
రూఢుఁడై = పుప్పక మనువిమానము నెక్కి (ఇది కుబేరుని గెలిచి రావణుఁడు సంపాదించిన
విమానము), సీతావధూమణితోన్ = స్త్రీరత్న మగుసీతాదేవితో, ఆర్యులు - మహాత్ములు,
నుతింపన్ = స్తోత్రములఁజేయుచుండ, ఆయోధ్యకున్ - (తనరాజధానియగు) నయో
ధ్యా పట్టణమునకు, వచ్చెన్.

తా. ఇట్లు సీతను గొనితెచ్చుటకై లంకా పట్టణమునకుఁజని, ఆచ్చట రావణా
సురుని పుత్రమిత్రబంధుసహితముగాఁ జతురంగసైన్యసమేతముగా రూపు మాపి లోకముల
భయముఁ బాపెను, తమ్ముఁ డగు లక్ష్మణునితోను, సుగ్రీవుఁడు హనుమంతుఁడు -
మొదలగు వానరులతోను, విభీషణాది రాక్షసులతోను దనకు ప్రాణసమాన యగు సీతా
దేవితోనుఁ గూడి పరమానందభరిత స్వాంతుఁ డగుచు పుష్పకవిమానము నధిష్ఠించి
యయోధ్యాపట్టణమును జేరెను. మహాత్ములందఱు తన శౌర్యధైర్యాదుల వినుతించుచుండఁ
జిరవియోగమువలన నాతురులైయున్న పురజనుల పరమానందభరితులఁ గావించెను.

తే. ఇట్లరుగుదెంచి రాముఁడు హితపురోహి
    తార్యబాంధవసచివభృత్యప్రభృతులు
    ననుజులును గొల్వ సక్తు డై జనకజాభి
    యుక్తుఁ డై యంతఁ బట్టాభిషిక్తుఁ డయ్యె. 71

టీ. అంత = పిమ్మట, రాముఁడు, ఇట్లు = పైఁజెప్పినట్లు, అరుగుదెంచి = అయో
ధ్యాపట్టణమునకువచ్చి, హిత...లును-హిత = మిత్రులును, పురోహిత = పురోహితులును
(లేక, గురువులును), ఆర్య= పెద్దలును, బాంధవ = బంధువులును, సచివ = మంత్రులును,
భృత్య = సేనకులును, ప్రభృతులును = మొదలగునందఱును, అనుజులును = తమ్ములగు


లక్ష్మణ, భరత, శత్రుఘ్నులును, కొల్వన్ = సేవించుచుండఁగా, సక్తుఁడై = ప్రీతిగలవాడై (లోకము ననుగ్రహించు నిచ్ఛగలవాఁడై అనుట.) జనకజాభియుక్తుఁడై = సీతాదేవితోఁగూడినవాఁడై , పట్టాభిషిక్తుఁడయ్యెన్ = పట్టాభిషేకముఁజేసికొనియెను.

తా. పైన వర్ణించిన విధముగా నయోధ్యాపురముఁ జేరినపిమ్మట మంత్రిపురోహిత
-బంధుగురుమిత్రసేవకాదిజనంబులును దమ్ములును కాలోచితముగురీతి సేవించు
చుండిరి. రామభద్రుండును ప్రజల ననుగ్రహింపవలయు ననుతలంపున సీతాసమన్వి
తుఁడై పట్టాభిషేకమహోత్సవము ననుభవించి కులక్రమగతమగు రాజ్యభారము
వహించెను.

-:శ్రీరామపట్టాభిషేకము.:-


సీ. శృంగార మేపార సీతాంగనామణి
         మును నిజవామాంకమున వసింపఁ
    దనపాదుకలు శిరంబున మోచి ముందఱ
         హనుమంతుఁ డతిభ క్తి ననుసరింప
    ధవళాతపత్ర మాతతధనుర్బాణముల్
         దాల్చి లక్ష్మణుడు కై దండ నలర
    సరి నిరుగడల వింజామరంబులు పూని
         భరతశత్రుఘ్నులు పరిఢవింప

తే. ననుపమోజ్జ్వలరత్నసింహాసనమున
    నమరఁ గూర్చుండి కోటిసూర్యప్రకాశుఁ
    డై వసిష్ఠాదిమునిసమూహములచేతఁ
    జెలఁగి రాముండు పట్టాభిషిక్తుఁడయ్యె.72

టీ. సీతాంగనామణి = సీతాదేవి, శృంగారమేపారన్ - శృంగారము = శృంగార
రసము, (లేక సౌందర్యము,) ఏపారన్ = అభివృద్ధియగుచుండఁగా, మును = ముందు
నిజవామాంకమునన్, నిజ = తనయొక్క, వామాంకమునన్ = ఎడమతొడపై, వసింపన్ =
ఉండఁగా, హనుమంతుఁడు, అతిభక్తి = మిగులభక్తితో, తనపాదుకలు = తనపావుకోళ్ళను, శిరంబునమోచి = తలపైనుంచుకొని, ముందఱన్ = ఎదుట, అనుసరింపన్ = నిలచియుండఁగా (లేక , సేవించుచుం డగా) లక్ష్మణుఁడు, ధవళాతపత్రములు = తెల్లనిగొడుగును,
ఆత ... ములు ఆతత = గొప్పవియగు, ధనుః = ధనువును, బాణములు - బాణములును,
తాల్చి = ధరించి, కైదండన్ = చేతిప్రక్కన, ఆలరన్ = ఉండఁగా భరతశత్రుఘ్నులు,
సరిన్ = సమముగా, ఇరుగడలన్ = రెండుపార్శ్వములయందును, వింజామరములు = సుర


టీలను, పూని = ధరించి, పరిఢవింపన్ = ఒప్పుచుండఁగా, అను... మునన్ - అనుపమ =
సరిలేని, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, రత్న = నవరత్నఖచితమైన, సింహాసనమునన్ =
సింహాసనముపై, అమరన్ = బాగుగా కూర్చుండి, కోటిసూర్యప్రకాశుఁడై =
కోటిసూర్యులకు సమానమైన కాంతిగలనాఁడై, వసిష్ఠాదిముని సమూహములచేతన్ = వసిష్ఠుఁడు
మొదలగు ఋషుల సమూహములగేత (అనఁగాఁ బెక్కండ్రుమునులచేత,) చెలగి =
ప్రకాశించి, రాముండు, పట్టాభిషిక్తుఁడయ్యెన్ = పట్టాభిషేకముఁ జేయఁబడియెను,
(వసిష్ఠాది మునులందఱు నారాముని సభిషేకించి రనిభావము.)

తా, ఆపట్టాభిషేకసమయమున సౌందర్యరాశి యగుసీతాదేవి రాముని యెడమ
తొడపైఁ గూర్చుండి యుండెను. అగ్రభాగమున పరమభక్తుఁ డగునాంజనేయుఁ
డమ్మహత్ముని పాదుకల శిరమునఁ దాల్చి సేవించుచుండెను. శ్వేతచ్చత్రంబును
ధనుర్బాణంబులును గూడ ధరించి లక్ష్మణుఁడు చేతి ప్రక్క నిలచి యుండెను. భరతశత్రుఘ్నులును సురటీల వీచుచు నుభయపార్శ్వముల నలంకరించు చుండిరి. ఇట్టి మహావైభవముతోఁ
దనరారుచు కోటి సూర్యప్రకాశుఁడై యొప్పుచున్న యారాజచంద్రుని
నవరత్నఖచితసింహాసనముపై నిలిపి పసిష్ఠాది మహామునులు అభిషేకము నొనర్చిరి.

అవ. ఇట్లు పట్టాభిషేకమును వర్ణించి యామహోత్సవమును ఉపసంహారము
చేయుచు రామహృదయము నుపక్రమించుచున్నాఁడు.-

వ. ఇట్లు పట్టాభిషిక్తుండై శ్రీ రామచంద్రుండు హితపురోహితామాత్య
   సుహృద్విద్వద్బ్రాహ్మణదాసదాసీజనంబులకును నానాదేశాధీశ్వరులకును...
   విభీషణ సుగ్రీవ జాంబవ త్సుషేణ నల నీల గజగవయ గవాక్ష గంధ...
   మాదనాదులకును వందిమాగధపాఠకలోకంబునకును దక్కినవారల
   కందఱకును మనోరథంబులుదీరం దగీనరథతురగవారణగో-
   భూహిరణ్యాగ్రహారరత్నదివ్యవస్త్రాభరణగంధమాల్యాదు లొసంగి సత్కరించి...
   యంతటఁ దనపురోభాగవర్తియుఁ బుణ్యకీర్తియు నిటలతటఘటితాం...
   జలియును గృతకార్యుండును నిరాకాంక్షుండును నిత్యానిత్యవస్తువి-...
   వేకయుక్తుండును సకలవిధైహికాముష్మికభోగవిరక్తుండును శమాది...
   షట్కసంపత్తియుతుండును ముముక్షుతాసమన్వితుఁడును మహాబుద్ధిమంతుఁడు
   నైనహనుమంతుం గనుంగొని కరుణారసంబు పొంగార
   జనకజాంగనామణి నెమ్మొగంబుఁ జూచి మనకు నిత్యభక్తుండును
   మదీయజ్ఞానాసక్తుండును బరమభాగవతశిఖామణియు నేనయితనికి
   మద్దివ్యతత్త్వస్వరూపం బుపదేశింపు మనిన బంగారంబునకుఁ బరిమళంబు



    గలిగిన తెఱంగున నుప్పొంగి మందస్మితముఖారవింద యై విశ్వమో
    హీని యైనసీతామహాదేవి యాంజనేయుని కభిముఖయై యి ట్లనియె.

టీ. ఇట్లు = పైనఁజెప్పినవిధముగా, శ్రీ రామచంద్రుఁడు, పట్టాభిషిక్తుండై =
పట్టాభిషేకమునొనర్చుకొని, హిత... .లకున్ హిత= ఇష్టులకు, పురోహిత = పురోహితులకు,
అమాత్య = మంత్రులకు, సుహృత్ = స్నేహితులకు, ("మొట్ట మొదటఁ గొంచె
మనిష్టము గాఁ దోఁచునట్లున్న ను శంకింపక యుత్తర కాలమున శుభముఁగూర్పగల
బోధచేయువారుహితులు, ఇతరులు సుహృత్తులు) విద్వత్ = విద్వాంసులకు, బ్రాహ్మణ=
బ్రాహ్మణులకు, దాస = సేవకులకు, దాసీజనంబులకు = దాసీజనులకును,
నానాదేశాధీశ్వరులకున్ = సకల దేశముల ప్రభువులకును, విభీషణసుగ్రీవజాంబవత్సుషేణనలనీలగజ
గవయగవాక్షగంధమాదనాదులకున్ = విభీషణుడు మొదలగు రాక్షసులకును,
సుగ్రీవుఁడు జాంబవంతుఁడు సుషేణుఁడు నలుఁడు నీలుఁడు గజుఁడు గవయుఁడు గవాక్షుఁడు గంధమాదనుఁడు మొదలగు వానర భల్లూక శ్రేష్ఠులకును, వంది. . . నకున్ - వంది = స్తుతి
పాఠకుల యొక్కయు మాగధ= రాజవంశావళినిఁ గొనియాడువారియొక్కయు, పాఠక =
గాయకుల యొక్కయు, లోకంబునకున్ = సమూహమునకును, తక్కినవారలకందఱకున్ =
మిగిలిన సకలవిధము లగుజనులకును, మనోరథంబులుదీరన్ = కోర్కులు దీరునట్లు
(సమృద్ధిగా } తగి... దులు - తగిన = వారివారియోగ్యతకు నుచితములగు, రథ =రథములు,
తురగ =గుఱ్ఱములు, వారణ = ఏనుఁగులు, గో = గోవులు, భూ = భూమి, హిరణ్య = సువర్ణము, అగ్రహార= అగ్రహారములు, రత్న = నవరత్నములు, దివ్య = శ్రేష్ఠములైన వస్త్ర = వస్త్రములు, ఆభరణ= సొమ్ములు, గంధ = గంధము, మాల్య = పుష్పమాలికలు, ఆదులు= మొదలగువానిని, ఒసఁగి ఇచ్చి,
సత్కరించి = గౌరవించి, అంతటన్ = తర్వాత (వారల నందఱను స్వస్థానములకుఁ బంపిన పిదప )
తనపురోభాగవర్తియున్ = తనయగ్రభాగమున నుండునట్టివాఁడును, పుణ్యకీర్తియున్ =
పవిత్రమగు కీర్తిగలిగినట్టివాఁడును (ధర్మపరుఁడగుటచే లోకమున మిగులఁ బ్రశంసింపఁబడుచున్నట్టియు,) నిట... లియున్ - నిటలతట= ఫాలభాగమున, ఘటిత = కదియింపఁబడిన, ఆంజలియున్ = చేమోడ్పుఁ గలిగినవాడును, కృతకార్యుండును = తన కార్యమును సాధించినవాఁడుసు, నిరాకాంక్షుండును =
ఆశయేమియు లేనివాఁడును (సువర్ణ అగ్రహారాదులలో దేనినిఁ గోరనట్టియు)
నిత్యానిత్యవస్తువివేకయుక్తుండును = బ్రహ్మము నిత్యము ప్రపంచ మనిత్యము అను వివేకము గలిగినట్టివాఁడును, సకల...డును - సకలవిధ= సమస్తవిధములగు, ఐహిక = పూర్వ
జన్మకర్మమువలనఁ గలిగి అనిత్యములై యిహలోకమున ననుభవింపఁబడుచున్నవియు,
అముష్మికభోగ = యజ్ఞాదులవలనఁ బుట్టి స్వర్గాదులయం దనుభవింపఁ బడుచున్నవియు
నగుభోగములయందు, విరక్తుండును = వైరాగ్యముకలవాడును, శమా.. డును - శమాది


= శమము మొదలగు (శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము లను),
షట్క= ఆఱుగుణములయొక్క, సంపత్తి = సంపదతో, యుతుండును = కూడియున్నవాడును,
ముము. . .డును - ముముక్షుతా = మోక్షేచ్ఛచే, సమన్వితుండును=కూడియున్నవాడును,
(సాధనచతుష్టయసంపత్తి గలవాఁడును),మహాబుద్ధిమంతుండును = అధికమగు సూక్ష్మబుద్ధి
గలవాడును, ఐన హనుమంతున్ = అయిన యాంజనేయని, కనుంగొని = చూచి, కరుణారసంబు = దయారసము, పొంగారన్ = అభివృద్ధి యగుచుండ, జనకజాంగనా మణిమొగంబున్ = సీతాదేవి ముఖమును, చూచి, మనకున్, నిత్యభక్తుండును = ఎప్పుడును మిగులభక్తితో సేవయొనర్చువాఁడును, మదీ....ను - మదీయ= నాదగు (నా సంబంధమైన), జ్ఞాన = యథార్థజ్ఞానమునందు (నాస్వరూపమును యథార్థము గాఁ దెలిసికొనుటయందు), ఆసక్తుండును= ఇచ్ఛ గలవాఁడును, పర....యున్ - పరమ = శ్రేష్ఠులగు, భాగవత = భగవద్భక్తులలో, శిఖామణియున్ = శిరోరత్నమువంటివాడును, ఐనయితనికిన్ =
అగు నీహనుమంతునికి, మద్ది...పంబున్ మత్ = నా యొక్క దివ్య = శ్రేష్ఠమగు, (లేక, లోకోత్తరమైన , తత్త్వస్వరూపంబున్ = యథార్థస్వరూపమును (బ్రహ్మ స్వరూపమును), ఉపదేశింపుమనినన్ = ఉపదేశింపవలయునని చెప్పఁగానె , బంగారంబునకున్ = సువర్ణమునకు, పరిమళంబు = సువాసన, కలిగిన తేఱంగునన్ = కలిగినవిధంబున, ఉప్పొంగి = సంతోషించి, మంద.....దయై - మందస్మిత = చిఱునగవుతోఁ గూడిన, ముఖారవిందయై = ముఖపద్మము కలదియై, (సర్వసాక్షి, సర్వవ్యాపకుఁడై, జీవునికంటె నభిన్నుఁడైయున్న బ్రహ్మమును దెలిసికొనుట కింత ప్రయత్నము కావలయునా ” అను నభిప్రాయము చే సీతాదేవి నవ్వె నని తెలిసికొనవలయును). విశ్వ = సకలప్రపంచమును, మోహినియై = మోహింపజేయునది యైన (మాయా స్వరూపిణియైన) సీతామహాదేవి, ఆంజనేయునికిన్, అభిముఖియై = ఎదురై , ఇట్లనియె = ఈ క్రింద రాఁబోవు విధముగా నుపదేశించెను.

తా. రామభద్రుడు పట్టాభిషేకోత్సవము పైన వర్ణించిన విధముగా మహావైభవముతో ముగియఁగానే హితపురోహితమంత్రిమిత్రదాసదాసీజనులకును అభిషేకోత్సవమును జూడవచ్చిన రాజులకును
విభీషణాదిరాక్షసులకును సుగ్రీవాదివానరులకును జాంబవదాదిభల్లూకవరులకును వందిమాగధాదులకును మఱియు సకలవిధము లగు వారికిని, వారివారిమనస్సులు తృప్తిఁ జెందునట్లు
రథగజతురగసువర్ణాగ్రహారాది బహువిధబహుమానములనొసంగి వీడ్కోల్పెను. హనుమంతుఁడుమాత్రము నిత్యానిత్యవస్తువివేకము వైరాగ్యము శమాదిషట్కసంపత్తి మోక్షేచ్ఛ యనుజ్ఞానసాధనములచేఁ
బ్రకాశించుచు రామునియొక్క యథార్థస్వరూపము దెలిసికొనఁ గోరుచు నుండువాఁడగుటచేత
నమ్మహాత్ముఁడిచ్చు బహుమానముల నపేక్షింసక ఫాలభాగంబునఁ జేమోడ్పు


గదియించి యెదుట నిలచియుండెను. ఇట్లు తన కంతటి మహా కార్యమును సాధించి
యు నేమియుఁ గోరకున్న సత్స్వభావుఁడగు నాహనుమంతుని మహాబుద్ధిమంతుని
నవలోకించి యాతని మనోరథము నూహించి దయారసము మఱియు నుప్పొంగ సీతా
దేవితో నిటనియె, 'దేవీ ఈతఁడు మనయెడల మిగుల భక్తికలవాఁడు. పరమభాగవతులలో శిరోరత్న ముంబోలువాఁడు. నాయథార్థ స్వరూపము నెఱుంగఁ దలంచుచున్నాఁడు.
కావున నీతనికి లోకోత్తరమగు నాయథార్థ స్వరూపము నెఱింగింపుము"
అని యిట్లు రామచంద్రుఁ డాజ్ఞాపింపఁగానే జగన్మోహిని యగునా సీతాదేవియు
బంగారమునకు సుగంధముఁ గలిగినట్లు సంతసించి యాయాంజనేయుని కెదురై
ముఖకమలంబున చిఱునగవు తళుకొత్త నిట్లని యుపదేశింప నారంభించెను.

-: సీత హనుమంతునకు దారకయోగంబు బోధించుట :-


మ. సుమతీ! రాముఁడు నిర్వికారము సదా శుద్ధంబు బుద్ధం బచిం...
    త్య మవాచ్యం బతులం బతీంద్రియము సత్తామాత్రమున్ స్వప్రకా...
    శము నిర్ద్వంద్వము నిర్వికల్ప మజమున్ సత్సంవిదానందరూ
    ప మమూ ర్తం బజరంబు కేవలపరబ్రహ్మంబు చింతింపఁగన్. 74

టీక. సుమతీ= ఓసూక్ష్మబుద్ధిగలహనుమంతుఁడా, చింతింపఁగన్ = బాగుగ,
విచారించినయెడల, రాముఁడు, నిర్వికారము = షడ్వికారములు లేనట్టియు, సదా =,
ఎల్లప్పుడు, శుద్ధంబు = దేనితోను సంబంధము లేక స్వచ్ఛమై యుండునట్టియు, బుద్ధంబు =
జ్ఞానస్వరూపమైనదియు, అచింత్యము = మనసుచే తలంపరానిదియు, ఆవాచ్యంబు
 = నోటిచే వచింపరానిదియు, అతులంబు = తనతో సమానమగు మఱియొకవస్తువు
లేనిదియు (లోకోత్తరమైనదియు), అతీంద్రియము= ఇంద్రియములకు గోచరము కానిదియు,
సత్తామాత్రమున్ = సర్వకాలములందును సర్వదేశములందును సర్వవస్తువులయం
దును ఒక్కటే విధముగ నుండుటయే స్వరూపముగాఁగలదియును (నిత్యమైనదియును)
స్వప్రకాశము = పరుని సహాయము లేక స్వతంత్రమై ప్రకాశించునదియు, (అనఁగా,
తెలిసికొనఁబడునదియు, పరబ్రహ్మమును దెలిసికొనువాఁడు మఱియొకఁడు లేఁడని
భావము) నిర్ద్వంద్వము = సుఖదుఃఖములు శీతోష్ణములు మొదలగుద్వంద్వములు ఒకటి
విడచిన మఱియొకటి పురుషుని నాశ్రయించియే యుండు స్వభావము గలగుణములు
లేనిదియు, వానిచే బాధింపఁబడనిదియు) నిర్వికల్పము - సంకల్ప వికల్పములు
లేనిదియును, అజమున్ = ఉత్పత్తి లేనిదియు, సత్సం... పఘు - సత్ = సత్యము, సంవిత్ =
జ్ఞానము, ఆనంద = ఆనందము, రూపము = స్వరూపముగాఁ గలదియు, అమూర్తంబు =
ఇంద్రియములకు గోచర మగునాకారము లేనిదియు, అజరంబు = ముదిమి లేనిదియునగు,


కేన... బు - కేవల = ఆద్వితీయమైన, (తనకంటే నన్య మగు వస్తువు లేని) పరబ్రహ్మంబు =
పరబ్రహ్మస్వరూపుఁడే.

తా. ఆంజనేయా ! రాముని సామాన్య మనుష్యునిగా భావింపుచున్నావేమో
ఆఘనుని యథార్థ స్వరూపమును దెల్పెద వినుము. ఉండుట పుట్టుట అభివృద్ధి యగుట
పరిణామముఁ జెందుట క్షీణించుట నశించుట యనురూపములతో ప్రత్యక్షములైయున్న
వికారములతో సంబంధముఁజెందనిదనియు, నిర్మలమైయుండునదనియు, ఙ్ఞానరూప
మనియు, లేక , వివేకు లగుమహాత్ముల కెఱుంగవచ్చునదనియు, 'ఇది యిట్లని'
యూహింపరానిదనియు, వాక్కుల కగోచరమైనదనియు, దృష్టాంతములఁ జెప్పి నిరూ
పింస నశక్యమైనదియు, ఇంద్రియములకు గోచరముకానిదనియు, ఉనికియే
స్వరూపముగాఁగలదనియు, పరులచే నెఱుంగఁబడకఁ దన్నుతానే యెఱుంగునది (అనఁగా:
తనంతఁదానే ప్రకాశించునదియనియు) సుఖదుఃఖాదిద్వంద్వములతోఁ గాని లేక
భేదవాదు లొనర్చు నానావిధములగు వికల్పములతోఁగాని (అనఁగా : "చైతన్యరూపుని
యందు జీవబ్రహ్మభేదముకలదు.జ్ఞాన మాత్మకు గుణమే కాని స్వరూపము కాదు.”
అను మొదలగువిరుద్ధకల్పనలతోఁగాని) పుట్టుక ముదిమి 'మొదలగువానితోఁగాని
సంబంధము లేనిదనియు, సత్యజ్ఞానానందరూపమైనదనియు, వేదము లేపరబ్రహ్మమునుగూర్చి
యుద్ఘోషించుచున్నవో ఆట్టిపరబ్రహ్మమే యీ రాముఁడని తెలిసికొనుము.

అవ. ఇ ట్లీరాముఁడు నిర్వికారుఁడగునేని యీతనివలనఁ బ్రపంచము పుట్టు
ననుట సంభవింపదుగదా. అట్లైన రాముని (పరబ్రహ్మమును) జగత్కర్తనుగాఁ జెప్పు
శ్రుతుల ప్రమాణములు కావచ్చును. శ్రుతి యప్రమాణ మగుట సమ్మతము గాదు కదా
యని సమాధానముఁ జెప్పుచున్నాఁడు.___

క. అవికారుఁ డయ్యుఁ గనకము, వివిధాభరణంబు లై నవిధమున నితఁడే
   దివియై భువియై రవియై,కవియై సర్వాత్ముడై ప్రకాశించుఁదగన్.

టీక. అవికారుఁడయ్యున్ = స్వయముగ నెట్టిమార్పును జెందనివాఁడయ్యును,
కసకము = సువర్ణము, వివిధాధరణములైనవిధమునన్ = అనేక విధము లగు నాభరణము
లైనట్లు, ఇతఁడే = ఈ పరబ్రహ్మ మగురాముఁడే, దివియై = ఆకాశరూపుఁడై, భువియై
= భూస్వరూప్లుఁడై, రవియై = సూర్యస్వరూపుడై, కవియై = బ్రహ్మస్వరూపియైన
చంద్రుఁడై (లేక,శుక్రగ్రహస్వరూపుఁడై), సర్వాత్ముడై = సర్వప్రపంచరూపుఁడై ,
తగన్ = ఒప్పునట్లుగా, ప్రకాశించున్ = ప్రకాశించుచున్నాఁడు.

తా. పరబ్రహ్మము నిర్వికారుఁడని చెప్పుట కాక్షేపమేమియు లేదు. ప్రపంచ
మాబ్రహ్మమునకంటెవేఱగునేని యప్పుడు ఆ ప్రపంచము యొక్క యుత్పత్తి
వలనఁగాని


వినాశమువలనఁ గాని ఆపరబ్రహ్మమునకు వికారములు కలుగు నని చెప్పవచ్చును గాని
ప్రకృతి విషయముమాత్ర మట్టిది కాదు. ప్రపంచమునకును పరబ్రహ్మమునకును భేదము
కొంచె మైనను లేదు. ఎంతవిచారించి చూచినను ఈ ప్రపంచమున నామరూపముల
కంటె నికర మగుపదార్థ మేదియును గానవచ్చుట లేదుగదా కావున, సువర్ణముచే
జేయఁబడిన భూషణములు ఎన్ని రూపభేదములు కలవి యైనను నానికిఁ గారణమగు
సువర్ణమునకంటె వేఱుకానట్లు ఈ ప్రపంచము ఎన్నినామరూపభేదములు కలదియైనను
కారణభూత మగుపరబ్రహ్మమునకంటె వేఱగునది కానేరదు, అభూపణములయందలి
వికారములవలన సువర్ణమున కేమియు వికారముఁ గలుగనట్లు ప్రపంచమునందలి
వికారములవలనఁగూడ నాపరబ్రహ్మమునకు వికారములు గలుగ నేరవు. కావున నోయాంజ
నేయా: మన కెన్ని భేదములతోఁ గానవచ్చుచున్న ను భూమి ఆకాశముమొదలగు
భూతములుగాని, సూర్యచంద్రాదిగ్రహములు గాని, జంగమస్థావరములు గాని యీ
రామునికంటె బ్రహ్మము వేఱుకావని తెలిసికొనుము.

అవ. ఇట్లు చెప్పినచో 'పరమాత్మకర్త' అని చెప్పు శ్రుతులకే కాదు.'పర
బ్రహ్మమునందు సత్వరజస్తమోగుణరూప యగు నొకశక్తి గలదు. ఆశక్తి ప్రపంచ
మునుఁ బుట్టించును.' అని చెప్పుశ్రుతులకు గూడ నప్రామాణ్యము వచ్చును. అనిన
సమాధానమును జెప్పుచున్నాడు.

క. త్రిగుణాత్మికయై యనిశము, జగములఁబుట్టింపఁ బెంపఁ సమయింపంగాన్
   దగుమూలప్రకృతియ నే, నగుదుఁ జుమీ సత్యముగ మహాగుణశాలీ!

టీక. మహాగుణశాలి = సద్గుణవంతుఁడ వగు నోయాంజనేయా ! త్రిగుణాత్మికయై =
సత్త్వరజస్తమోగుణములే స్వరూపముగాఁ గలిగి, అనిశమున్ = ఎల్లప్పుడును,
జగములన్ = లోకములను, పుట్టింపన్ , పెంపన్ , సమయింపఁగాన్ = నశింపఁజేయుటకును
(అనఁగా : సృష్టిస్థితిసంహారములఁ జేయుటకు), తగు... ప్రకృతియ - తగు =
సామర్థ్యముగల, మూలప్రకృతియ = మూలప్రకృతియే (మాయాశక్తియే), సత్యముగన్ =
నిజముగా, నేనగుదుఁజుమీ = నేను అయి యున్నాను సుమా !

తా. మూలప్రకృతి యను శక్తి పరబ్రహ్మమునందు కలదనియు ఆశక్తియే
ప్రపంచమును సృజించుచు సంహరించుచు నున్నదనియు వేదములు చెప్పుచున్నవనుట
సత్యము, మూలప్రకృతియనినను, అవిద్యయనినను , అజ్ఞానమనినను, మాయ యనిన
నొక్కటియే, ఆశక్తిని నేనే యని తెలిసికొనుము. వేద మిట్లు చెప్పినను పరబ్రహ్మమునకు
మాత్రము వికారము కలుగ నక్కఱలేదు. యథార్థస్థితిలో నీ మూలప్రకృతి
కూడ నాబ్రహ్మముసకంటె వేఱుకానేరదు. వేఱైయుండిననే కానీ యాయనకు


వికారమును గలిగింప నేరదుగదా, ఆపరబ్రహ్మ మొక్కఁడే సత్తాస్వరూపుఁ డగుట
చేతను (ఉనికియే స్వరూపము గాఁ గలవాఁ డగుటచేతన్ళు మఱియొక సత్త (ఉనికి)
యున్నదనిన రెండుసత్తలకుఁ గల భేదమును నిరూపించుటకు వీలులేకపోవుటచేతను
పరబ్రహ్మముసకంటె నితర మగుపదార్థముముండుటకే వీలు లేదు.

మఱియు ఉత్పత్తి వినాశము అనుపదములయర్థమును గూర్చి విచారణీయాంశము
కొంత గలదు. ఎట్లనిన, ఉత్పత్తి యనఁగా నింతకుఁ బూర్వము లేనిపదార్థము
క్రొత్తగా పుట్టుటయా? లేక అంతర్ధానమైయుండునది ప్రకాశించుటయా? క్రొత్తగాఁ
బుట్టుట యుత్పత్తి శబ్దార్థమనిన నది యుక్తియుక్తము కానేరదు. ఆ భావమునుండి
భావ ముత్పత్తి యగుననుట ప్రత్యక్ష విరుద్ధముగదా! కావున నీవిషయమున నవశ్యముగ
రెండవపక్షము నే యంగీకరింపవలయును. (అనఁగా : ఏదియో యొక కారణమునఁ
గొంతకాలము నుండియుఁ బ్రకాశింపకున్న పదార్థము ప్రకాశించుటయే యుత్పత్తి
శబ్దార్థ మనవలయును.) ఈయుక్తి ననుసరించియే విచారించిన, అంతర్థానమునుఁ
జెందుటయే వినాశశబ్దార్థమని చెప్పవలసివచ్చును. కొంతకాల మవిచ్ఛిన్నముగఁ
బ్రకాశించుచుండుటయే స్థితిశబ్దమునకుఁ గూడ నర్థమని యేర్పడును.

ఇప్పు డాలోచించి చూడుము. మూల ప్రకృతిచే ప్రపంచము పుట్టింపఁ
బడును. (అనఁగా : మూలప్రకృతిచే ప్రపంచముతోఁచునట్లు చేయఁబడును.) అని
యర్థమేర్పడును. మూలప్రకృతి యనినను అజ్ఞానమనినను ఒక్కటియే యని
యిదివఱకే చెప్పియున్నాను. కావున “మూలప్రకృతి ప్రపంచమును సృష్టించును.” అనిన
‘అజ్ఞానముచే ప్రపంచ మున్నట్లు తోఁచును” అనియే యర్థము. అజ్ఞానులకుఁ గూడ
ప్రారబ్ధ వశమునఁ గొంతకాలమువఱకు (అనఁగాఁ : బ్రళయమగునంతవఱకు) ఇహపర
లోకరూప మగు ప్రపంచము తోఁచుచు మఱికొంతకాలము (అనఁగా: వారివారికర్మలు
ఫలముల నిచ్చుట కభిముఖము లగునంతవఱకు) దోఁపదు. కావున ప్రపంచాంతర్థాన
రూపమగు వినాశముగూడ మూలప్రకృతిచేతనే చేయఁబడుచున్న దని శ్రుతులు చెప్పు
చున్నవి. ఈ ప్రపంచమంతయు నజ్ఞానకల్పితమే యని యెఱింగినవారలగుట చేత,
వారికది బ్రహ్మభిన్నముగా నెప్పటికిని తోఁపదు. కావున నెట్లు చూచినను పరబ్రహ్మము
నకు వికారములు కలుగనక్కఱలేదని తెలిసికొనుము. ఆమూలప్రకృతియు నేనే యని
నిశ్చయించుకొనుము.

అవ. ఇట్లు చెప్పినను పరబ్రహ్మము కర్తయగుటకు వీలులేకపోవుటచే శ్రుతికి
విరోధము వచ్చియే తీరును. సృష్టియనఁగా నుత్పత్తి యైనను, వికాసమైనను,
దానికొక కర్తయవశ్య ముండితీరవలయును గదా. అజ్ఞానమే దానికి కర్త యనిన
పరబ్రహ్మము జగత్కారణమని చెప్పుశ్రుతులకు విరోధము వచ్చును. కావున మూల ప్రకృతి

పరబ్రహ్మమునకంటె వేఱనియు, ఆపరబ్రహ్మము దానిమూలమున ప్రపంచమును
సృజించుచున్నాడనియు, ఇట్టివాఁ డగుటచే నాబ్రహ్మము సవికారమే యనియు,
కర్త యనియుఁ జెప్పితీరవలయును. పరబ్రహ్మమునకుఁ గలశక్తియే ప్రకృతి యని
శ్రుతులు చెప్పుచున్నవిగదా' అనిన సమాధానముఁ జెప్పుచున్నాఁడు:-

క. అమలుఁ డగునితనిసాన్ని
   ధ్యమువలన సృజింతు జగ మతంద్రితనై యి
   ట్లమర జడులచేఁ డత్సృ
   ష్టము కల్పింపఁబడు నీయసంగునియందున్.77

టీక. అమలుఁడు = నిత్యసిద్ధుఁడు (నిర్వికారుఁడు.) అగునితనిసాన్నిధ్యమువలనన్ =
అయినయీపరబ్రహ్మము యొక్క సామీప్యమువలన (అనఁగా: ఈ రాముఁడు నా
సమీపమున నుండుటచేత) అతంద్రిత = ఏమఱుపాటులేనిదాననై, జగము = లోకము,
సృజింతున్ = సృష్టిచేయుచున్నాను, ఇట్లమరన్ = ఈవిధముగా, నుండఁగా, జడులచేన్ = అజ్ఞానులచేత, తత్సృష్టము = నాచేఁజేయుఁబడిన సృష్టి, ఈయసంగునియందున్ =
నిర్వికారుఁడగు (లేక, దేనితోసంబంధము లేని) యీ రామునియందు, కల్పింపబ
డున్ = ఆరోపింపఁబడును.

తా. ఇట్లాత్మ నిర్వికారుఁడైనను శ్రుతులయందుఁ గొన్నిచోట్లనాయనయే జగత్కర్తయని
చెప్పఁ బడి యున్నది. మూలప్రకృతికిని ఆ బ్రహ్మమునకును భేదము లేదని
యిదివఱకే నిరూపించి యున్నాను. పారమార్థికస్థితి యిదియే యైనను, వేదము జనుల
క్రమక్రముగ నుద్ధరించుతలంపుచే నారంభమున నట్లు చెప్పుచున్నది, తిమిరరోగము
గలఁవాఁ డొకచంద్రబింబమును రెండుగాను మూఁడుగాను చూచినట్లు లోకులును
తమభ్రాంతివలనఁ బరబ్రహ్మమునందు భేదమున్నట్లు తలంచుచున్నారు. వేదము
కూడ తత్త్వస్వరూపము దానికి సుఖముగ గోచరమగుటకై మొట్టమొదట వారవలంబించియున్న
భేదమునే యధారము చేసికొని యుపదేశించుచుఁ గ్రమక్రమముగ యుక్తులచే
దానిని నిరాకరించి పరమార్థతత్వమును మనసున నాటింపఁ బ్రయత్నించుచున్నది.
ఇంతియేకాని ఆశ్రుతికి భేదమును జెప్పుటయందుఁ దాత్పర్యము లేదు. ఒకని
కొకగొప్పవిషయము బోధింపవలయు ననిన మొట్టమొదట వారికిఁ గలజ్ఞానమును తలంపులను
గమనించి వానికిఁదగినట్లు బోధయొనర్చుచుఁ గ్రమక్రమముముగఁ జిత్తమును
బరిపక్వముఁ జేసియే కదా యావిషయము ముపదేశింపవలయును. ఇట్లు చేయక
యొక్కమాఱిట్టివిషయముల నుపదేశించినవారిమనను (శిష్యులమనను) దానిని సంపూర్ణముగ
గ్రహింపలేక, 'నాకు సర్వముఁదెలిసె నని యభిమానించుచు ముందున్నస్థితియందు
నిలువ నొల్లక యుభయభ్రష్టమై చెడిపోవు ననుటయు ప్రత్యక్షసిద్ధమే కదా. కావున

మూల ప్రకృతి పరబ్రహ్మమునకంటే వేఱనియు, అదే పరబ్రహ్మశక్తి యనియు, ఆ శక్తిమూలముననే పరబ్రహ్మము సృజించుచు న్నాడనియు జెప్పుటవలనదోషమేమియును లేదు.

యథార్థ స్థితిలో నిట్లు చెప్పినను పరబ్రహ్మముమాత్రము సవికారుఁడు కానక్కఱలేదు. ఏలయనిన ; లోకమునందు కర్తృత్వము రెండుతెఱఁగులై యున్నది. కొందఱు స్వయముగఁ గొన్ని సాధనములఁ గైకొని కార్యములు సాధించు చున్నారు. మఱిికొందఱు తామేమియుఁ జేయకయే పరులచేఁ సర్వ కార్యములఁ జేయించుచున్నారు. ఈ రెండు తెఱంగుల వారిని కూడ లోకమునఁ గర్తలనియే చెప్పుచున్నారు. ఇందు మొదటిది సాధన సాధ్యకర్తృత్వము (సాధనములఁ గైకొనియే కార్యముల సాధించుట వలనఁగలుగు కర్తృత్వము), రెండవది సాన్నిధ్యమాత్రసాధ్యకర్తృత్వము (స్వయముగ సాధనములఁ గైకొన కున్నను తన సామీప్యమువలనఁ బరులచేఁ గార్యముల సాధింపఁజేయుటవలనఁ గలుఁగుకర్తృత్వము) ఈ రెండవకర్తృత్వము పరబ్రహ్మమునకుఁ గలదు. ఆయనయుఁ దనకంటె వేఱుగా నున్న ప్రకృతిచేఁ బ్రపంచ సృష్టినిఁ జేయించుచుండవచ్చును గదా!

ఈ ప్రకృతి పరబ్రహ్మమునకు శక్తియే యైననుగూడ నీకర్తృత్వమునకు భంగము రాదు. పురుషునికంటె వాని యందున్నశక్తి వేఱనుటలో సంశయ మేమియును లేదు. శక్తికిని శక్తిగలవానికిని సమవాయసంబంధము, (అనఁగా : నిత్యసంబంధము) కల దని తార్కికు లందురు గాని అ ది వేదాంతులకు సమ్మతము కాదు గదా. యథార్థ స్థితిలో పదార్థములు రెండైనప్పుడు అవియొక్కటిగానే యున్నట్లు భ్రాంతివలనఁ దోఁపవచ్చునేకాని ఆట్టినిత్యసంబంధముకూడ నొకటి కలదనుట యుక్తిశూన్యముకదా ! ఇట్లు సర్వమును విమర్శించిన భ్రాంతిసిద్ధమగు భేదము నాశ్రయించి పరబ్రహ్మము నందు కర్తృత్వ మారోపింపఁ బడుచున్నను అపరబ్రహ్మమునకు మాత్రము వికార ములు కలుగ నక్కఱలేదు.

ఈతత్త్వము నెఱుంగలేక యజ్ఞానులగువారు నాచే (మూల ప్రకృతిచే) జేయఁబడుచున్న సకలకార్యములను నిర్వికారుఁడగునాపరబ్రహ్మమునం దారోపించు చున్నారు. అమ్మహాత్మునకు దేనితోను సంబంధము లేకుండినను, ఆకాశమువలె సర్వవ్యాపకుఁడై యుండుటచేత నా ప్రకృతియందుగూఁడ వ్యాపించియే యన్నాడు. కావుననట్లు కల్పించుచున్నారు. మాయ ఆ బ్రహ్మమున కుపాధి యనియు, పరబ్రహ్మము తన యందుండుటచే నామాయయే సర్వమును సృజించుచున్న దనియు, బ్రహ్మమునకు నీసృష్టితో నేమియుసంబంధము లేదనియుఁ దెలిసికొన లేకున్నారు. కావుననే యాయనకుఁ గల సాన్నిధ్యమాత్ర సాధ్యకర్తృత్వమును, సాధనసాధ్యకర్తృత్వమునుగా భావించి

పరబ్రహ్మముకూడ సవికారమే యనుచున్నారు. "బ్రహ్మమునకు సాన్నిధ్యమాత్ర
సాధ్యకర్తృత్వము గలదనిచెప్పినను, ఆయన నిర్వికారుఁ డగుటుకునీలు లేదు. పరులచే
గార్యములఁ జేయింపవలయునన్న నుఁ గర్తయగువారికి సంకల్పము మొదలగునవి యుం
డియే తీరవలయును గదా" అనుటయు యుక్తియుక్తము గాదు. అయస్కాంతశిల,
యినుము నాకర్షించుచున్నది కదా. ఆ శిలకు సంకల్పము గల దనుట కవకాశము
గలదా? కావున సాన్నిధ్యమాత్రసాధ్యకర్తృత్వము గలవాఁడు సంకల్పము మొదలగు
వికారములు కలిగియుండవలయుననుట నియమము కాదు. కావున నీవేదాంతసిద్ధాంతమే
శ్రుతికిఁ గూడ విరుద్ధము కాదని తెలిసికొనవలయును.

ఆవ. పై నిరూపించిన విషయమును అనుభవసిద్ధముగ నిరూపించి చూపుచున్నాఁడు.-

వ. అది యెట్లనిన నాకర్ణింపు మయోధ్యానగరంబున నతినిర్మలం బయిన
రఘువంశంబునం దితనిజన్మంబును విశ్వామిత్రసహాయత్వంబును
దన్మఖరక్షణంబు నహల్యాశాపశమనంబును హరధనుర్భంగంబును
మత్పాణిగ్రహణంబును పరశురానుపరాక్రమభంజనంబును బుర
ప్రవేశంబును దండకారణ్యగమనంబును విరాధవధంబును
శూర్పణఖాకర్ణనాసికాచ్ఛేదనంబును ఖరదూషణత్రిశిరః ప్రముఖ రాక్షస
ఖండనంబును మాయామారీచహరణంబును మాయాసీతాపహర
ణంబును జటాయుకబంధమోక్షలాభంబును శబరీపూజనంబును
సుగ్రీవసమాగమంబును వాలివధంబును సీతాన్వేషణంబును సముద్ర
సేతుబంధనంబును. లంకానిరోధంబును భీమసంగ్రామంబున భ్రాతృ
పుత్రపౌత్రబాంధసహితజనాదిసహితంబుగా రావణహరణంబును విభీషణ
రాజ్యప్రదానంబును బుష్పకారోహణంబును మత్సమేతంబుగా
సాకేతపురగమనంబును రాజ్యాభిషేకంబును మొదలుగాఁ గలకా
ర్యంబు లన్నియు నాచేత నాచరితంబు లయ్యె నట్లగుచుండ
నిర్వికారుఁడఖిలాత్మకుం డైనయీరామునియం దజ్ఞానులచే నారో
పింపఁబడుఁ గావున.

టీక. అది యెట్లనినన్ = ఆయారోపణ యెట్లనఁగా, ఆకర్ణింపుము = వినుము,
ఆయోధ్యానగరంబునన్ = అయోధ్యాపట్టణమునందు, అతి నిర్మలంబైన = మిగులపరి
శుద్ధమగు, రఘువంశంబునందున్ = రఘుమహారాజుయొక్క వంశమునందు, ఇతని
జన్మంబు = ఈ రాముఁడు పుట్టుటయు, విశ్వామిత్రసహాయత్వంబును = విశ్వామిత్రు
నికి సహాయుండగుటయును, తన్మ ...బును - తత్ = ఆవిశ్వామిత్ర మహామునియొక్క,
మఖ =

యజ్ఞమును, రక్షణంబును = రక్షించుటయు, ఆహ.. బును - అహల్యా = అహల్య
యొక్క, శాపశమనంబును - శాపమును బోఁగొట్టుటయు, హరధనుర్భంగంబును =
శివునివిల్లు విఱచుటయు, మత్పా.. బును - మత్ = నాయొక్క పాణిగ్రహణంబును =
వివాహంబును (అనఁగా : నన్ను వివాహముఁ జేసికొనుటము), పర .. బును - పరశు
రామ = పరశురామునియొక్క, పరాక్రమ = శౌర్యమును, {లేక, బలమును, భంజనంబును =
అడంచుటయు, పురప్రవేశంబును = మరల అయోధ్యాపట్టణమునకు
వచ్చుటయు, దండకారణ్యగమనంబును = దండకారణ్యమునకుఁ బోవుటయు,
విరాధవధంబును = విరాధుఁ డనురక్కసుని సంహరించుటయు, శూర్ప.. బును - శూర్పణఖా =
రావణాసురుని చెలియలగు శూర్పణఖ యొక్క, కర్ణ = చెవులను, నాసికా = ముక్కును,
ఛేదనంబును = కోయుటయు, ఖర.. బును = ఖర = ఖరుఁడు, దూషణ = దూషణుఁడు,
త్రిశిరః = త్రిశిరుఁడు, ప్రముఖ= మొదలుగాగల, రాక్షస = రాక్షసులయొక్క, ఖండనంబును = ఖండించుటయును, మాయా మారీచ హరణంబును - మాయలేడియై వచ్చిన
మారీచుని సంహరించుటయు, మాయాసీతాపహరణంబును = రావణుఁడు మాయ
సీత నెత్తికొని పోవుటయు (రావణుఁడు మాయాసీతను గొనిపోయెననుట యధ్యాత్మ
రామాయణ సంప్రదాయము. వాల్మీకి రామాయణమున నీవిషయము ప్రత్యేకముగ
ఖండింపఁబడియుండక పోవుటచేత నామునికి కూడ నిదియే యభిప్రాయమనితోఁచుచున్నది.
ఒక విషయము సామాన్యము గానొకచోటఁ జెప్పబడినప్పుడు మఱియెచ్చటనైనను
దానిని గూర్చిన విశేషమున్న యెడల గ్రహింపవచ్చు ననుట సుప్రసిద్ధము.)
జటా... ను..జటాయు = గృధ్రరాజగుజటాయువునకును, కబంధ = కబంధుఁడగు
రాక్షసునకును, మోక్షలాభంబును - మోక్షమునిచ్చుటయు, శబ. ..బును, శబరీ = శబరి
యను బోయవనిత, పూజనంబును = పూజించుటయు (లేక , శబరి ననుగ్రహించు
టయు,) సుగ్రీ ...బును - సుగ్రీవ = సుగ్రీవుని తో, సమాగమంబును = స్నేహముఁ
జేయుటయు, వాలివధంబును = వాలిని సంహరించుటయ, సీతాన్వేషణంబును - సీతా-
సీతయొక్క (ను), అన్వేషణంబును - వెదకుటయు (లేక, వెదకించుటయు) సముద్ర
సేతుబంధనమును = సముద్రమున సేతువుం గట్టుటయు, లంకానిరోధంబును = లంకను
ముట్టడించుటయు భీమ. . .బునన్ - భీమ = భయంకరమైన, సంగ్రామంబునన్ =
యుద్ధమునందు, భ్రాతృ...గాన్ - భ్రాతృ = తమ్ములు, పుత్ర = కుమారులు, పౌత్ర = మనుమలు,
బాంధవ = బంధువులు, హితజన = ఇష్టజనులు, ఆది = మొదలగు వారితో, సహితంబుగాన్ = కూడునట్లుగా, రావణహరణంబును = రావణునిసంహరించుటయు,
విభీషణరాజ్యప్రదానంబును = విభీషణునికి లంకా రాజ్య మొసంగుటయు, పుష్పకారోహాణంబును =
పుష్పకవిమానము నెక్కుటయు , మత్సమేతంబుగాన్ = నాతోకూడి,
సాకేతపురగమనంబును = అయోధ్యాపట్టణమునకు వచ్చుటయు, రాజ్యాభిషేకంబును =

పట్టాభిషేకముఁ జేసికొనుటయు మొదలుగా గలకార్యంబులన్నియున్ , నాచేత
నాచరితంబులయ్యెన్ = నాచే నాచరింపఁబడినవి. అట్లగుచుండన్ = ఇట్లీకార్యముల
నన్నిటిని నేనే చేసియున్నను, నిర్వికారుండు = ఏవికారములను లేనివాఁడును,
అఖిలాత్మకుండు = సకల ప్రపంచరూపుఁడును, ఐన, ఈ రామునియందున్, అజ్ఞానులచేతన్ ,
ఆరోపింపఁబడుగావునన్ = ఆరోపణ చేయఁబడుచున్నది గాన (అనఁగా: ఈ కార్యములనన్నిటిని
రాముఁడే చేసె నని జ్ఞానశూన్యు లగువారు తలంచుచున్నారు గావునననుట.)

తా. నేను (మూల ప్రకృతి) చేయుకార్యముల నీ రామునియందు (పరబ్రహ్మము
నందు) నారోపించువిధమును వివరించెదను వినుము. ఈరామునకు పుట్టుక గాని
కామక్రోధాదులతో సంబంధము గాని లేదు. శత్రువులు గాని, మిత్రులు గాని లేరు.
హర్ష శోకములు లేవు. ఈవికారము లన్నియు నాచేఁ (జ్ఞానముచే) గల్పింపఁబడినవి.
ఇట్లున్నను అజ్ఞానులగువారు ఈ రాముఁడే రఘువంశమున జనించి, విశ్వామిత్రునకుఁ
దోడ్పడి యమ్మహాత్మునియజ్ఞమును గొనసాగించి, అహల్యాశాపమును దీర్చి శివునివిల్లు
విఱచి నన్ను బెండ్లియాడెననియు, పరశురాముని భంగపఱిచి యయోధ్యకుఁజేరి యచ్చట
కొంతకాల నుండి లక్ష్మణునితోను నాతోను గూడి దండకారణ్యమును బ్రవేశించె
సనియుఁ జెప్పుచున్నారు. అచ్చట విరాధుఁడు మొదలగు రాక్షసుల ననేకుల
సంహరించి, మునుల కభయ మిచ్చి, మాయచే బంగరులేడియై వచ్చిన మారీచుని
సంహరించెననియు , మరలి యాశ్రమమునకు వచ్చునప్పటికి, మాయామయ
మగురూపఘుతో నున్న నన్ను రావణుఁడుఁ గొనిపోవఁగా నాకై బహువిధముల
విలపించె ననియు, నన్ను వెదకుచు నరణ్యములఁ దిరిగి తిరిగి జటాయుకబంధులకు
మోక్ష మిచ్చి,శబరిచే పూజలఁ గొని, వారు చెప్పినచొప్పున సుగ్రీవునితో
మైత్రి జేసెననియు, భావించు చున్నారు. సుగ్రీవునకుఁ బ్రియంబుగా
వాలిని ద్రుంచి, వానర రాజ్యమును సంపాదించి యిచ్చి వాని సహాయము చే
నన్ను వెదకించి తెలిసికొని లంకాపురమును నిరోధించి రావణుని సంహరించి,
యారాక్షసరాజ్యమును విభీషణున కిచ్చెననియు, పుష్పకారూఢుడై నాతో
గూడి యయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుఁ డయ్యె ననియుఁ దలంచు చున్నారు.
ఈ కార్యముల నన్నిటిని నే నాచరించితిని గాని రాముఁ డాచరింపలేదు. ఇట్లైనను
భ్రాంతివలన నజ్ఞాను లగువారు నిర్వికారుడై సర్వమయుఁడై యున్న యీ రాముని
యందే వీని నెల్ల నారోపించు చున్నారు. పైన నిరూపింపఁ బడియున్నట్లు ఈతని
సాన్నిధ్యమువలన నే నీ కార్యముల నెల్ల నాచరించుచుండుట నెఱుంగ లేక యిట్లు
భ్రాంతి నొందుచున్నారు, కావున.


అవ. ఈ క్రింది రెండు పద్యములచే రామతత్త్వస్వరూపవ్యాఖ్యానము నుపసంహ రించుచున్నాఁడు. —

ఉ. రాముఁడు నిర్వికారుఁడు నిరామయుఁ డవ్యయుఁ డక్షరుండు ని
    ష్కాముఁ డతీంద్రియుం డజుఁ డకర్త యభోక్త యసంగుఁ డంతరా
    రాముఁడు నిర్వికల్పుఁడు నిరంజనుఁ డద్వయుఁ డైనయాపరం
    ధాముఁడు గాని చారుగుణధాముఁడు గాఁడు సమీరనందనా! 79

టీక. సమీరనందనా- వాయుపుత్రుఁడ నగు నాంజనేయా ! రాముఁడు, నిర్వికారుఁడు =
వికారములు లేనివాఁడును, నిరామయుఁడు = శరీరము లేని వ్యాడగుటచే రోగములు లేని వాఁడును, ఆవ్యయుఁడు== నాశములేనివాఁడును, (లేక, స్త్రీ పురుషాదిలింగభేదములు లేని వాఁడును), అక్షరుండు=నశింపనివాఁడును, నిష్కాముఁడు = కోరఁదగినది లేనివాఁడును (పరమానందమె ఆయనకు స్వరూప మగుటచేతను జనులచేఁ గోరఁబడునదియు నానంద మే యగుటచేతను, పరబ్రహ్మము కోరవలసిన పదార్థ మేదియు నుండదని భావము.) అతీంద్రియుండు = ఇంద్రియములకు గోచరము కాని వాఁడును, అజుఁడు = ఉత్పత్తిలేనివాఁడును, అకర్త = యేకార్యమును జేయనివాఁడును, ఆభోక్త= ఏ ఫలమును అనుభవింపనివాఁడును, అసంగుఁడు=దేనితోను సంబంధపడనివాఁడును, అంతరారాముఁడు = సకలభూతములయందు అంతర్యామియై విహరించువాఁడును, నిర్వికల్పుఁడు = సంకల్పవికల్పములు లేనివాఁడును, నిరంజనుఁడు = మఱియొకదాని సహాయము లేకయే స్వయముగఁ బ్రకాశించువాఁడును, అద్వయుఁడు = తనకంటె వేఱగు పదార్థము లేని వాఁడును, అయిన = అయినట్టి, ఆపరంధాముఁడుగాని ఆ పరమాత్ముఁడేకాని, చారు ...గాఁడు - చారు = మనోహరములైన, గుణ = గుణములకు, ధాముఁడుగాఁడు = ఆధారభూతుఁడు కాఁడు. (అనఁగా: సగుణుఁడును శరీరవిశిష్టుఁడును కాఁడనుట. )

తా. ఓఆంజనేయా! వికారములు లేనివాఁడును, దేనితోను సంబంధము లేనివాఁడును, ఆద్వితీయుఁడును, శరీరము మొదలగునవి లేనివాఁ డగుటచే రోగములు మొదలగునవి లేనివాఁడును, కామక్రోధాదులు లేనివాఁడును, ఇంద్రియములకుఁ గోచరముకానివాఁడును, ఒక పనిని జేయుట గాని, దాని ఫలము ననుభవించుట గాని లేనివాఁడును, అంతర్యామి యగువాఁడును, జాతిభేదములు వినాశము లేనివాఁడును,
ప్రత్యక్షాదిప్రమాణములతో నక్కఱ లేకయే స్వయముగఁ బ్రకాశించువాఁడు నగు నాపరబ్రహ్మ మీరాముఁడు. లోకు లనుకొనునట్లు శరీరాదియుక్తుఁడు కాఁడు, అనితెలిసికొనుము.

క. మాయాగుణానుగతుఁ డై, పాయక నానావిధ ప్రపంచం బితఁడే
   చేయు నని తోఁచు నేమియుఁ, జేయఁ డసంగుం డకర్త సిద్ధము వత్సా.

టీక. వత్సా=బిడ్డా . మా .....డై - మాయా = మాయయొక్క గుణ = సత్త్వరజస్తమో గుణములను,అనుగతుడై = అనుసరించువాఁడై, పాయక = విడువక , నానా... చంబు- నానావిధ = అనేకవిధములైన, ప్రపంచంబు = లోకములను, ఇతఁడే = ఈరాముఁడే, చేయునని = చేయుచున్నాఁడని (అనఁగా : సృష్టించుచున్నాఁడని) తోచున్ , ఏమి యుఁజేయఁడు = యథార్థ స్థితిలో ఈ రాముఁ డే కార్యమును జేయువాఁడుకాఁడు, అసంగుండు = వాస్తవములో నాయనకు దేనితోను సంబంధము లేదు. అకర్త = ఇట్లగుటచే నేమియుఁ జేయఁడు, సిద్ధము = ఈ విషయము సిద్ధాంత మైనది.

తా. ఓహనునుంతుఁడా, సత్త్వరజస్తమోగుణముల వికారమువలన (అనఁగా సత్వరజస్తమోగుణము లే మాయ కావున నది చేయుచుండుకార్యములవలన) సర్వవ్యా పకుఁడగు ఏరాముఁడు కర్తయైనట్లు తోఁచుచుండును. ఆగుణములయంను వ్యాపించి " యున్న పరమాత్మునిసహాయముచే నాగుణములే యిట్లు సృష్ట్యాదులను చేయుచున్న పని తెలిసికొననేరక జను లిట్లు భ్రాంతి గాంచుచున్నారు. పరబ్రహ్మమాత్ర మేమియును చేయువాడు కాఁ డనుట సిద్ధాంతము.

అవ. ఇ ట్లాపరమేశ్వరుఁడు సంక్షిప్తముగ సీతాకృతోపజేశరూపమున రామతత్త్వము నెఱింగించి పా ర్వతీదేవికిఁ గలిగినసంశయము నివారించి యాతత్త్వముననే విస్తరించి చెప్పు నుద్దేశముతో నాంజనేయకృత ప్రశ్న మీ క్రింద నభివర్ణించు చున్నాడు___

వ. అనిన విని హనుమంతుండు సీతాదేవి కిట్లనియె.81

టీక. అనినవిని = అని చెప్పఁగావిని, హనుమంతుండు, సీతాదేవికిట్లనియెన్ = సీతాదేవిని జూచి యీ క్రింది విధముగా ప్రశ్నఁజేసెను .

శా. ఓ పార్వతీ. ఈవిధముగ సీతాదేవి శ్రీ రామతత్త్వము నుపదేశించిన విని హనుమంతుఁ డామెతో నిట్లనియెను.

తే. రామచంద్రుడు తారకబ్రహ్మ మగుట
    సత్యమగుఁ గాని యిమ్మహాసర్యమయుని
    సులభముగఁ గాంచు పరమసూత్ర మెద్ది
    నా కెఱింగింపవమ్మ లోకైక జనని! 82

టీక. లోకైకజనని- లోకైక = సకలలోకములకును ముఖ్యమైన, జనని= తల్లీ (సీతాదేవీ), రామచంద్రుఁడు, తారక బ్రహ్మమగుట = సంసారమును తరింపఁజేయఁ గల పరబ్రహ్మస్వరూపుడై యుండుట, సత్యమగుఁగాని = యథార్థమే యగును గాని,

ఇమ్మహాసర్వమయుని = సకల ప్రపంచరూపుఁడగు నీసర్వవ్యాపకుని, సులభమున్


కాంచు . . త్రము కాంచు = తెలిసికొనుటకు వీలగు, పరమ = శ్రేష్ఠమైన సుసూత్రము =
సుఖమగునుపాయము, ఎద్ది = ఏది, (కలదు), నా కెఱిఁగింపవమ్మ.

తా. ఓలోకమాతా సీతా! నీ వాక్యములవలన రాముఁడు పరబ్రహ్మమనువృత్తాం
తము బాగుగఁ దెలియవచ్చెను గాని యనుభవసిద్ధముగ స్పష్టము గాలేదు. కావున
దానిని స్పష్టముగాఁ జేసికొనుటకుఁ దగినయుపాయము కలదేని దయచే నానతిమ్ము.
ఆయుపాయము మిగులఁ గష్టసాధ్యము గాక సులభముగ నుండవలయును. ఆట్లుండిన
గాని మముఁబోంట్లకు సాధ్యము కాదు గదా.

అవ. పైప్రశ్నమునకు సీతాదేవి చెప్పినయుత్తరము నభివర్ణించుచు నాత్మతత్త్వమును
బ్రకటింప నుపక్రమించుచున్నాఁడు.___

వ. అనిన విని నవ్వుచు సీతాదేవి హనుమంతున కిట్లనియె. 83

టీక. అనినవిని, నవ్వుచున్, సీతాదేవి, హనుమంతునకును = హనుమంతునితో,
ఇట్లనియెన్ = ఈ క్రింది విధముగాఁ జెప్పెను.

తా. ఇట్లు హనుమంతుఁడు ప్రశ్నఁ జేయఁగా విని అతని యజ్ఞానమునకు (అనఁగా: తనకంటె వేఱుగాని పరబ్రహ్మమును వేఱుగా నున్నట్లు భావించుచుండుటకు) నాశ్చర్యపడి నవ్వి క్రమక్రమముగా నాతని చిత్తమును నిర్మలముఁ జేసి జీవ బ్రహ్మైక్యము నుపదేశించునదియై సీతాదేవి యాతని కిట్లనియె.

తే. ప్రత్యగాత్మస్వరూపుఁడై పరఁగుతనకు
    రమణపరమాత్ముఁ డైనశ్రీరామునకును
    నమర నై క్యానుసంధానసరణి యెద్ది
    యదియ యోగంబు సదుపాయమాంజనేయ! 84

టీక. ఆంజనేయ!, ప్రత్యగాత్మస్వరూపుఁడై = జీవరూపుడై, పరఁగుతనకున్ -
పరఁగు = ఒప్పుచున్న, తనకున్, రమ. . . త్ముఁడు - రమణ= సర్వేశ్వరుండై, పరమాత్ముడు =
పరబ్రహ్మరూపుడు, ఐన శ్రీరామునకున్, సమ... సరణి - సమరస = వేఱుపఱుప
రాని (అనఁగా; స్వాభావికమైన) ఐక్య = భేదమును (అనఁగా : 'నేను' అను పదమున
కర్థమైన జీవుఁడును పరమాత్మయు నొక్కటియే యను విషయమును) , అనుసంధాన =
ధ్యానించుటకు (అనగా: శరీరాభిమానము మొదలగు దోషములవలన కలుగు సంశయ
ముల నివారించుకొనుచు జీవబ్రహ్మైక్యజ్ఞానమును మనసున దృఢము చేసికొనుటకు),
సరణి = తగినమార్గము, ఎద్ది = ఏది, కలదో, అదియ = ఆమార్గమే, యోగంబు = యోగమని
చెప్పఁబడును. అదియ = అదే, సదుపాయము = పరమాత్ముని యథార్థరూపము
నెఱుఁగుటకుఁ జక్కనియుపాయము,

తా. ఓఆంజనేయా: వినుము. నీవు, పరబ్రహ్మము నాకంటే వేఱని తలంచుచుండుటచే, నమ్మహాత్మునిఁ దెలిసికొనుట కుపాయమేదియని ప్రశ్నఁజేయుచున్నావు. యథార్థ స్థితిలో నీకంటె (జీవునికంటె) రాముఁడు (బ్రహ్మము) వేఱు కాదు. కావున అనాదినుండియు వచ్చుచున్న భ్రాంతిచే వేఱు వేఱుగా గానవచ్చుచుండు జీవబ్రహ్మము లిరువురు నొక్కటియే యని శాస్త్ర సిద్ధాంతముల చేతను, గురూపదేశముచేతను, యుక్తుల చేతను, నిశ్చయించుకొని యావిషయమును మనసునందు ధృఢముఁ జేసికొనుటకై పలుమాఱు ధ్యానము మాత్రము చేయఁబడుచుండవలయునే కాని మఱి యేమియు నక్కఱలేదు. ఈ ధ్యానమున కనుకూలమగుమార్గ మేదికలదో అది యోగమని చెప్పఁబడును. ఈయోగమొక్కటియే పరమాత్ముని యధార్థ స్వరూపము నెఱుంగుటకుఁ జక్కని యుపాయమని తెలిసికొనుము.

  

—♦♦♦♦§అభ్యాసాదియోగ నిర్ణయము.§♦♦♦♦—


అవ. సీతాదేవినవ్వుటకుఁ గల కారణమును విశదము చేయుచు నాయమచే జెప్పఁబడిన యుత్తరమును వివరించుచున్నాఁడు.___

వ. ఆయోగం బభ్యాసయోగంబు జ్ఞాన యోగం బన ద్వివిధం బై
   యొప్పు నం దభ్యాసయోగంబు ప్రాణాయామం బన విలసిల్లు నది
   యుఁ బ్రాకృతంబు వైకృతంబు గేవలకుంభకంబు ననం ద్రివిధం
   బయ్యె నందుఁ బ్రాకృతంబు మంత్ర యోగంబు వైకృతంబు లయ
   యోగంబు గేవలకుంభకంబు హఠయోగం బీత్రివిధప్రాణాయామ'
   యోగులకు యమనియమాసన ప్రాణాయామంబులు పూర్వాంగం
   బులు ప్రత్యాహారధ్యానధారణాసమాధు లుత్తరాంగంబు లగు నం
   దహింసాసత్యాస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహంబులుయమంబులు. శౌచ
   తపస్సంతోషస్వాధ్యాయేశ్వరప్రణిధానంబులు నియమంబులు.
   వీరాసన స్వస్తికాసన పద్మాసన యోగాసన కూర్మాసన భద్రాసన సిద్ధా
   సన సింహాసనాదికంబులు చతురుత్తరాశీత్యాసనంబులగు నీమూఁడింటి
   నభ్యసించి యంతటఁ బ్రాణనిరోధంబు సేయం దగు నందు స్వభావ
   నియతరేచకపూరకకుంభకక్రమంబులచేత నేకవింశతిసహస్రషట్ఛ
   తాధిక సంఖ్యాజపామంత్రానుష్టానంబు మంత్రయోగంబు. ప్రతిదివసా
   భ్యన్తరేచకాదిత్రివిధానిలసంయమనపూర్వకంబుగాఁ బ్రాణవృత్తి


యం దపానంబు నపానవృత్తియందుఁ బ్రాణంబును లయంబుగావిం
చుట లయయోగంబు. మూలబంధోడ్యాణబంధజాలంధరబంధ
పూర్వకంబుగా రేచక పూరకంబుల నుడిగించి ప్రాణాపానంబుల
రెంటీని రేయింబగ లొక్క చందంబునం గుంభించుట హఠయోగం
బివి త్రివిధ ప్రాణాయామంబులు. విషయంబులవలన నింద్రియంబుల
మరలించుట ప్రత్యాహారంబు. సగుణనిర్గుణాత్మకవస్తుచింతనంబు
ధ్యానంబు. మూలాధారాదిదేశంబులఁ జిత్తంబు నరికట్టుట ధారణా
యోగంబు. నిర్మలనిశ్చలచిత్తవృత్తి నిర్గుణ బ్రహ్మత్వంబు సంపాదిం
చుట సవికల్పనిర్వికల్పాత్మకసమాధియోగం బి ట్లష్టాంగంబులుగలిగి
యభ్యాసయోగంబు ప్రకాశించు నదియ పరిపక్వచిత్తులకు యోగ్యం
బతిదుర్లభం బిది యణిమాద్యష్టైశ్వర్యంబుల నొసంగుచు నాత్మజ్ఞా
నంబు ప్రకటంబుగాఁ జేయు. మఱియుఁ బ్రవిమలచిత్తులకు జీవబ్రహ్మై
క్యజ్ఞానమాత్రంబు నిచ్చు నతిసులభం బైనవిజ్ఞానయోగంబు రాజ
యోగం బనంబడు నీ రెంటికి శ్రీ రామచరణకమలభక్తి కారణంబు.
దానికి వైరాగ్యంబు మూలంబు వినుము. 85

టీక. ఆయోగంబు = జీవబ్రహ్మైక్యజ్ఞానమును మనసున దృఢముఁ జేసికొనుట
మార్గమని చెప్పఁబడినయోగము, ఆభ్యాసయోగంబు = అభ్యాసయోగము (మనసునకుఁ
కగినపరిపాకము లేనప్పుడు దానినిఁ గ్రమక్రమముగా నభ్యాసము వలన నిగ్రహించి
పరిపక్వముఁజేయుట కుపయోగించుయోగమభ్యాసయోగము. పరిపక్వమైన పిదప
దానినిజ్ఞాన బలమువలనఁ బరమాత్మునితో నేకముసేయ సుపయోగింపఁబడుయోగము
జ్ఞానయోగము అని తెలిసికొనవలయును), జ్ఞానయోగంబు = జ్ఞానయోగము, అనన్ =
అని, ద్వివిధంబై = రెండు విధములుగలదై, ఒప్పున్ = ఉన్నది. అందున్ = ఈఅభ్యాస
జ్ఞాన యోగములలో, అభ్యాసయోగంబు = అపరిపక్వచిత్తులకై చెప్పఁబడినయభ్యాస
యోగము. ప్రాణాయామం బనన్ = ప్రాణాయామమను పేర (వాయువును బంధించుట. )
విలసిల్లున్ = ప్రకాశించుచున్నది. (వాయువును బంధించుటయే మనోనిగ్రహమునకు
బ్రధానోపాయము గావున నభ్యాసయోగమునకు ప్రాణాయామమను పేరుకలిగిన దని
తెలిసికొనవలయును.) అదియున్ = ఆ ప్రాణాయామము, ప్రాకృతంబున్ =
స్వభావసిద్ధమైన ప్రాణాయామ మనియు, వైకృతంబు = వైకృతప్రాణాయామ మనియు
(స్వభావము గాక ప్రయత్నమువలనఁ గలిగిన ప్రాణాయామ మనియు, కేవలకుంభ

కంబు = కుంభక ప్రాణాయామ మనియు (బలాత్కారముగా వాయువును స్తంభించు
టవలనఁగలిగిన ప్రాణాయామ మనియు), అనన్ , త్రివిధంబయ్యెన్ = మూఁడువిధము
లై యున్నది. అందున్ = అమూఁడువిధము లగు ప్రాణాయామములలో, ప్రాకృతంబు
= ప్రాకృత ప్రాణాయామమనునది, మంత్రయోగంబు = అజపామంత్రము
ననుష్ఠానము చేయుటయే స్వరూపముగాఁ గలమంత్రయోగము. వైకృతంబు = వైకృత
ప్రాణాయామమనఁగా, లయయోగంబు = ప్రాణవాయువులలో ఒకదానిని మఱియొక
దానియందు లయము చేయుటయే స్వరూపముగాఁగల లయయోగము. కేవలకుంభ
కంబు = కుంభకప్రాణాయామమనఁగా, హఠయోగంబు = {వాయువును వెలికి రానీక
బలాత్కారముగా లోన బంధించి బంధములచే నాభిమొదలగు బ్రహ్మరంధ్రమువఱకు
నచ్చటచ్చట సరికట్టుచునుండుటయే స్వరూపము గాఁగల హఠయోగము, ఉడ్యాణ
బంధము మొదలగు బంధములనుగూర్చి వెనుక వివరించబడును). బంధములచే నాభి .
మొదలగు బ్రహ్మరంధ్రమువరకు నచ్చటచ్చట నరికట్టుచునుండుటయే స్వరూపముగా
గల హఠయోగము. ఈ త్రివిధప్రాణాయామయోగులకున్ = మూఁడువిధములగు నీ
ప్రాణాయామయోగము నభ్యసించువారికి, యమనియమాసన ప్రాణాయామంబులు = యమము, నియమము, ఆసనము ప్రాణాయామము అనునవి, పూర్వాంగంబులు = యోగము
నకుఁ బూర్వమె యభ్యసింపఁబడవలసినవి, ప్రత్యాహారధ్యానధారణసమాధులు =
ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధిఅనునవి. ఉత్తరాంగంబులగున్ =
యోగాభ్యాసమునకు ప్రారంభించిన పిదప నభ్యసింపఁబడవలసినవి అగుచున్నవి. అందున్ =
ఆయమనియమాదులలో, అహిం...బులు - అహింసా = పరునిహింసింపకుండుట,
సత్య = సత్యసుఁబల్కుట, ఆస్తేయ = పరధనమును హరింపకుండుటయు, బ్రహ్మచర్య =
బ్రహ్మచర్యవ్రతమును, అపరిగ్రహంబులు = ఒకనియీవిని గ్రహింపకుండుటయు,
యమంబులు = అనునివియమములనఁబడును. శాచం ...బులు- శౌచ = వెలుపల లోపల
పరిశుద్ధముగ నుండుట, తపః = కృచ్ఛ్రము చాంద్రాయణము మొదలగు వ్రతముల
నాచరించుట, సంతోష = తనకు భగవంతుఁ డిచ్చిన దానికి దృప్తిఁబడుట,
స్వాధ్యాయ = వేదాధ్యయనముఁ జేయుట, ఈశ్వరప్రణిధానంబులు = ఈశ్వరధ్యానము,
నియమంబులు = ఇవి నియమము అనఁబడును. వీరాసన, స్వస్తికాసన, పద్మాసన,
యోగాసన, కూర్మాసన, భద్రాసన) సిద్ధాసన, సింహాసనాదికంబులు = వీరాసనము,
స్వస్తికాసనము, పద్మాసనము, యోగాసనము, కూర్మాసనము, భద్రాసనము, సిద్ధాసనము,
సింహాసనము మొదలగునవి. (యోగము చేయునప్పుడు శరీరము నుంచుకొనవలసిన
భేదములేయీపేర్లతో వ్యవహరింపఁబడుచున్నవి) చతురుత్తరాశీత్యాసనంబులున్ = ఆసనములని చెప్పఁబడును. ఇవి 84. ఈమూడింటన్ = ఈయమనియమాసనముల,
అభ్యసించి = ఆలవరుచుకొని, అంతటన్ = పిదప, ప్రొణనిరోధంబు = ప్రాణవా

యువునాటంకపఱుచుటయే స్వరూపముగాఁ గల ప్రాణాయామమును (లేక, ప్రాణా
యామమని పిలుపఁబడుచున్న యోగమును,) అందున్ = ఆయోగమునందు, స్వభా...
చేతన్ - స్వభావనియత = మనుజులకుస్వాభావికముగా దైవముచే నియమింపఁబడి
యున్న, రేచక = వాయువును వెలుపలికివదలుట (నిశ్వాసము), పూరక = వాయువును
లోనికిఁ బీల్చుట (ఉచ్ఛ్వాసము); కుంభక = వాయువునులోపలనిలుపుకొనుట (ఇది
యుచ్ఛ్వాస, నిశ్శ్వాసములకునడుమనుండుస్థితి), (ఊర్ధ్వకుంభకము అధఃకుంభకము
ఈరెండునుకుంభకములలోని భేదములు) వీనియొక్క విక్రమంబుల చేతన్ = వరుసలచే,
ఏక . . .నంబు - ఏకవింశతిసహస్రషట్ఛతాధికసంఖ్య = ఇరువదియొక్క వేయునాఱు
సూఱుసంఖ్యగల, ఆజపామంత్రానుష్ఠానంబు అజపాగాయత్రీ మంత్రమును అను
ష్ఠించుట (స్వభావసిద్ధములైన రేచక, పూరక, కుంభకములు, అనఁగా:నిశ్వాసోచ్ఛ్వా
సములు. స్వస్థుఁ డగు వానికి దినమున కిరువదియొక్క వేల నాఱునూఱుమాఱులు తిరు
గుచుండును. ఇవి “హంస” అను మంత్రమును జపించుచున్నవి యని యోగి భావిం
పవలయును. హంసమంత్రమునకు “అహం సః = నేనే బ్రహ్మను” అని యర్థము. ఈమంత్రమునకే
అజపామంత్రమని పేరు, పైఁ జెప్పినవిధముగా భావించుటయే అజపామం
త్రానుష్ఠానము. ఇదియే మంత్రయోగ మని తెలిసికొనవలయును.) మంత్ర యోగంబు =
మంత్రయోగమనఁబడును [ఇదియే ప్రాకృత (స్వాభావిక) ప్రాణాయామయోగము,]
ప్రతి . . . బుగాన్ - ప్రతిదివస = ప్రతిదినమునందును, అభ్యస్త = అలవాటు చేయఁబ
డిన, రేచకాది= రేచకము మొదలగు, త్రివిధ = మూఁడు విధములైన, అనిలసంయమన
పూర్వకంబుగాన్ = వాయునిరోధములే ప్రధానముగా (అనఁగాః వాయువునునిరో
ధించుటవలన), ప్రాణవృత్తియందు = ప్రాణవాయువు చేయునట్టి కార్యమునందు,
అపానంబును = ఆపానవాయువును, అపానవృత్తియందున్ = అపానవాయువు చేయు
నట్టి కార్యమందు, ప్రాణంబును = ప్రాణవాయవును, (నాసికయందును గుదమునం
దును జనించువాయువులు ప్రాణాపానములు, యోగమువలన వానిస్థానములను
మార్చుటయే లయయోగము.) లయంబు గావించుట = లీనమగునట్లు చేయుఁటయే,
లయయోగంబు = లయయోగ మని చెప్పబడును. [ఇడియే వైకృత (అస్వాభానిక )
ప్రాణాయామయోగము] మూలబంధోడ్యాణబంధజాలంధరబంధపూర్వకంబుగాన్ =
మూలబంధము, ఉడ్యాణబంధము జాలంధర బంధము అను బంధముల మూలమున,
రేచకపూరకంబులన్ = నిశ్వాసోచ్ఛ్వాసములను, ఉడిగించి = నశింపఁజేసి, ప్రాణాపా
నంబులన్ - ప్రాణ = నిశ్వాసరూపమగు ప్రాణవాయువును, అపానఁబులన్ = ఉచ్ఛ్వా
సరూప మగునపానవాయువును, రెంటిన్ = ఈరెంటిని, రేయింబగలొక్క చందంబునన్ =
రాత్రింబగలు నొక్కటేవిధముగనే, కుంభించుట = లోపలవాయువును
స్తంభించుట, హఠయోగంబు = హఠయోగమని చెప్పబడును. (ఇదియే కేవలకుంభక


ప్రాణాయామయోగము,) ఇవిత్రివిధప్రాణాయామంబులు = ఈ చెప్పఁబడిన మంత్ర
లయ హఠయోగములే కేవలకుంభకము లని చెప్పఁబడిన మూఁడువిధములగు ప్రాణా
యోగములు, లేక యోగమునకు పూర్వాంగ మని చెప్పబడి ప్రాణాయామయోగ
ములువిషయంబులవలనన్ = శబ్దస్పర్శరూపరసగంధములనియెడు విషయములనుండి
(అనఁగా: అవిషయముల పైకిఁ బోనీక), ఇంద్రియంబులన్ = జ్ఞానేంద్రియములను
జ్ఞానేంద్రియముల సహాయము లేనిది కర్మేంద్రియములు సంచరింపవు కావున జ్ఞానేంద్రియ
ములను నిరోధించినచోఁ గర్మేంద్రియములు కూడ నిరుద్ధములగును.) మరలించుట =
త్రిప్పుట, ప్రత్యాహారంబు = ప్రత్యాహారమనఁబడును. (ఇదియోగముల కుత్తరాంగము
అని చెప్పఁబడినవానిలో మొదటిది.) సగుణ....నంబు - సగుణ = గుణములతో
కూడినట్టిగాని, నిర్గుణాత్మక = గుణములేనట్టిగాని స్వరూపముగల, వస్తు = పరమాత్మ
వస్తువును, చింతనంబు = మనసున భావించుట (విష్ణ్వాదిరూపములతోఁ గాని శుద్ధస్వ
రూపముతోఁ గాని ఆపరమాత్మను ధ్యానించుట,) ధ్యానంబు = ధ్యాన మనఁబడును,
మూలా...బుల౯ - మూలాధార = మూలాధారచక్రము, ఆది = మొదలగు, దేశంబునన్ = స్థలములయందు, చిత్తంబు = మనసును, అరికట్టుట = నిరోధించుట (లేక,
నిలుపుట,) ధారణయోగంబు = ధారణాయోగమనఁబడును. నిర్మల... వృత్తిన్ -
నిర్మల = పరిశుద్ధమైనట్టియు, నిశ్చల = చలింపనట్టియు, చిత్తవృత్తిన్ = మనోవ్యాపార
ముచేత, నిర్గుణత్వంబున్ = త్రిగుణశూన్యమైనపరబ్రహ్మభావమును, సంపాదించుట =
కలుగఁజేసికొనుట (అనఁగాః ధ్యానించువాఁడు ధ్యానము ధ్యానింపఁబడునది అను
భేదములు లేక యేకరూపముతో నిలుచుట,) సవి... గంబు - సవికల్ప = భేదసహితమైనది
యు, నిర్వికల్పాత్మక = భేదరహితమైనదియు (అనురూపములు గల,) సమాధియోగంబు =
సమాధియోగము అని చెప్పఁబడును. (సగుణపదార్ధమునుఁ గాని, నిర్గుణపదార్థమును గాని ధ్యానింప నారంభించినప్పుడు యోగచిత్తమునకు ధ్యాతృధ్యానధ్యేయభేదములును బాహ్యము లగు మఱికొన్నిభేదములను గూడఁ దోఁచుచుండును. కావున ప్రథమావస్థయం దీసమాధికి సవికల్పసమాధియనియు పైభేదము లన్నియు తోపకుండు నట్టి యంత్యావస్థయందు నిర్వికల్పసమాధియనియుఁ బేరని తెలిసికొనవలయును.) ఇట్లు = ఈవిధముగా; అష్టాంగంబులు = శమాదులగు నెనిమిదియవయవంబులును గలిగి, అభ్యాసయోగంబు = అభ్యాసయోగము,
ప్రకాశించున్ = ఒప్పుచుండును. అది = ఆ అభ్యాసయోగము, ఆపరిపక్వచిత్తులకున్ =
పరిశుద్ధము గాని మనసుగలవారికి,యోగ్యంబు = తగినది, అతిదుర్లభంబు = సాధించుటకు
మిగుల నశక్యమైనది. ఇది = ఈయభ్యాసయోగము, ఆణిమాద్యష్టైశ్వర్యంబులన్ = అణిమ మొదలైన యష్టసిద్ధులను, ఒసంగున్ = ఇచ్చును. ఆత్మజ్ఞానంబున్ = బ్రహ్మజ్ఞానమును, ప్రకటంబుగాఁజేయున్ = విస్తారముగాఁ జేయును (అనఁగా దృఢముఁ జేయును).

109 వ పుట లేదు.


లగు ననేక భేదములతో నెనుబదినాలుగు విధములై యున్నవి. ఇట్లీయమనియమాసనముల
బాగుగ నభ్యసించిన పిదప ప్రాణాయామము నభ్యసింపవలయును. ప్రాణాయామ
మనఁగా వాయువుకు నిరోధించుటయే, అదియే యభ్యాసయోగస్వరూపమని కూడ
నిదివఱకే చెప్పియున్నాను. ఆప్రాణాయామము మూఁడు విధము అనికూడఁ దెలియఁజేసి
యున్నాను. అందు మంత్రి యోగమని చెప్పఁబడు ప్రాకృతప్రాణాయామమును వివరిం
చెదను వినుము. లోకమునందలి ప్రతిభూతమును సాధారణముగ veలుపలనుండి లోని
కిని, లోపలనుండి వెలికని వాయువు నాకర్షించుచు విడుచుచు నున్నదికదా. వెలికి
వచ్చుదానిని నిశ్శ్వాసమనియు లోనికి, బోవుదానిని యుచ్ఛ్వాస మనియుఁ జెప్పుచు
న్నాము. శాస్త్రమునందు వీనికే క్రమముగ రేచకపూరకము లను నామధేయములు
గలవు, రేచకపూరకముల మధ్యమునఁ గొంతకాలము వాయువు లోన నిలుచుచున్నది.
దానికే కుంభకమని `పేరు, ఇట్లు స్వాభావికములై యున్న రేచకపూరక కుంభకములలో
హంస మంత్రాక్షరముల నిలిపి ధ్యానించుట మంత్రయోగము, ఇదియే ప్రాకృత
ప్రాణాయామము, కుంభకములలో నూర్ధ్వకుంభకమనియు, ఆధఃకుంభక మనియు కూడ
భేదములు గలవు. ఇఁక వైకృతప్రాణాయామ మనఁగా దినదినమును ప్రాణముల నిరో
ధించుట యభ్యాసముఁ జేసిచేసి ప్రాణమునం దపానమును, ఆపానమునందు ప్రాణమును
(అనఁగా: ఉచ్ఛ్వాసములలోనొక దానియందు మఱియొక దానిని)లయము గావించుట.
ఇదియే లయయోగము. వాయువును బలాత్కారముగ లోపల నిలిపి రేచకపూరకముల
"సంపూర్ణముగ నశింపఁ జేయుట కేవలకుంభకము, ఇదియే హఠయోగము, రేచకపూరకముల
నశింపఁజేసి ప్రాణాపానముల (అనఁగాః నిశ్శ్వాసోచ్ఛ్వాసముల) బంధించుటకు
మూలబంధము, ఉడ్యాణబంధము, జలంధరబంధము నను నుపాయములు కలవు. ఈ
విధముగ అభ్యాసయోగమునకు పూర్వాంగము లగుయమనియమాసనప్రాణాయామములు
వివరింపఁబడెను. ఇంకనుత్తరాంగంబుల వివరించెద వినుము.

శబ్దస్పర్శాదివిషయముల ననుసరింపనీక శ్రోత్రాదీంద్రియముల నిర్బంధించుట
ప్రత్యాహారము. సగుణరూపముగాఁగాని, నిర్గుణరూపముగాఁగాని పరమాత్ముని ధ్యానించుట
ధ్యానమనఁబడును. మూలాధారము, స్వాధిష్ఠానము మొదలగుస్థలములయందు
వాయుసహితముగ మనసునునిర్బంధించుట ధారణయనఁబడును, ధ్యానింపఁబడుచున్న
వస్తువునందు చిత్తముఁజేర్చుట సమాధి. ఆదిరెండువిధములు. ధ్యానించువాఁడు ధ్యానము,
ధ్యానింపఁబడునది అనుభేదములే సమాధియందుఁగానఁబడునో, అది సవికల్పకసమాధి,
ఏసమాధియందుఁ గానరాదో అది నిర్వికల్పసమాధి. ఇట్లభ్యాసయోగమునకుఁ గోల
యష్టాంగములస్వరూపములను క్రమముగ వివరించితిని. ఈయభ్యాసయోగము చిత్తపరి
పాకములేనివారికిఁ గావలయును. దీనిని సాధించుట మిగులఁ గష్టము. ఇది సాధిం


పఁబడియెనేని అణిమామహిమాదులగు సంసిద్ధుల నొసంగును. బ్రహ్మజ్ఞానమును
బ్రకటించును. పరిశుద్ధమగు మనసుగలవారల కీయోగముతోఁ బనిలేదు. వారలు
జ్ఞానయోగమునే యాశ్రయించిన జాలును . ఆయోగమునకే రాజయోగ
మనికూడఁ బేరుగలదు. ఇది వారలకు బ్రహ్మజ్ఞానము మాత్ర మొసంగును. ఈరెండు
యోగములలో నేదిసిద్ధింపవలయునన్నను శ్రీ రామపాదపద్మములయందు భక్తియత్యా
వశ్యకము. ఆభక్తియు వైరాగ్యము లేక గలుగనేరదు . ఈజ్ఞానయోగమును వివరించెద
వినుము.

అహింసాలక్షణము.


ఉత్సాహ. "ఈరు పేను నల్లి చీమ యీఁగ మొదలుజంతులన్
         గ్రూర సర్పవృశ్చికాదిగురువిష ప్రదావళిన్
         ఘోరమృగముల స్వధింపఁ గోర కునికి నాగమో
         క్తోరుహింస సేయ రెండు నొప్పు నాయహింసకున్"
 
తా. “ఈరు పేను నల్లి ఈగ చీమ లోనగు స్వల్పజంతువులను, క్రూరముల
యిన పాములు తేళ్ళు మండ్రగబ్బలు మొదలగు విషజంతువులను, భయంకరములయిన
శరభములు సింహములు ఏనుఁగులు పులులు చిఱుతపులులు అడవిపందులు మొదలగు
మృగములను చంపకయుండుటయు, వేదోక్తములగు యజ్ఞములయందు పశువులజంపు
టయును ఈ రెండును అహింసయే.”

సత్యలక్షణము.


క. "ఉన్నది కన్నది విన్నది
    యున్నట్లుగఁ బలుకుటయును నొరునకు నత్యా
    పన్నత గలుగఁగఁ గల్యా
    ణోన్నతి గలకల్లనూటయును సత్యమగున్”

తా. “ఉన్న సంగతి యున్నట్టుగను, చూచిన సంగతిచూచినట్లుగను, విన్న సంగతి
విన్నట్లుగను తప్పక చెప్పుటయును, ఒకనికి సంభవించిన ఆపద దప్పి మేలుగలుగుటకై
యాడిన కల్లమాటయును సత్యమే యగును.”

అస్తేయలక్షణము.


క. "ప్రస్తుతిన నెట్టిదశపర
    వస్తువులం ద్రికరణములు వర్ణించుట తా
    నస్తేయ మనుచుఁ జెప్పుదు
    రస్తమితాజ్ఞానతంత్రు లయినమునీంద్రుల్.”


తా. "ఎట్టికష్టకాలమందయినను పరులసొమ్ము నపహరింప మనసునఁ దలఁప'
అపహరింపుమని నోటఁ జెప్పక చేత ముట్టక యుండుటే ఆస్తేయము.

బ్రహ్మచర్యలక్షణము.


క. "కాంతల నందఱ నామర
   ణాంతకముగఁ బరిహరించు టది మే లొండే
   నెంతయు నిజ భార్యావ్రత
   సంతుష్టిని జెంద బ్రహ్మచర్యంబ యగున్.”

తా. "స్త్రీ సంపర్కంబు మరణించుదనుక లేకయైనను, ఋతుకాలములయందు
తనభార్యం గలసి తనివినొందుచున్ననయినను బ్రహ్మచర్యంబు.”

అపరిగ్రహలక్షణము.


ఆ. “దానపూర్వకంబుగా నెవ్వ రేమైన
    నొసఁగ సంగ్రహింప కునికి సత్కృ
    తముగ శిష్యు లొసఁగు ద్రవ్యంబుఁ గొనుట యౌ
    ననఘ! తదపరిగ్రహంబు వత్స."

తా. "ధనధాన్యాదులను దానపూర్వకంబున నెవ్వరిచ్చిననుపుచ్చుకొనక శిష్యు
లిచ్చిన పుచ్చుకొనుట అపరిగ్రహము.”

శౌచలక్షణము.


తే. "శౌచములు రెండు తెఱఁగులై చనుఁ బ్రసిద్ధి
    మృత్తికాజలములచేత మెఱయుబాహ్య
    మమలి నాభ్యంతరఫుశౌచ మనఁగ భావ
    శుద్ధి యని కద నచియింతు రిద్ధనుతులు.”

తా. "బాహ్యపరిశుద్ధియని అంతరపరిశుద్ధియని పరిశుద్ధి రెండువిధములు. నాని
లో మృత్తిక చేతను జలముచేతను చేయఁబడునది బాహ్యపరిశుద్ధి. కామక్రోధలోభ
మోహమదమత్సరదంభములు మొదలయిన దుర్గుణముల సంఘముతోడను, ఆణవకా
ర్మికమాయిక మాయే యతిరోధానములనెడు పంచమలములతోడను కూడక మనస్సు
నిర్మలమైయుండుటే అంతరపరిశుద్ధియని విజ్ఞానసంపన్నులగు పండితులు పలుకుదురు,”

త్రివిధతపోలక్షణము.


శ్లో."దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచ మార్జవం,
బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే



    క్షరవిరళముఁ గొని మదిసం
    స్మరియించుట మానసికము స్వాధ్యాయమగున్.

తే. అందువాచిక జపమున కధికతర ము
    పాంశుజపమ య్యుపాంశుజపమున కధిక
    తరము మానసజప మగు దాని కధిక
    తరములేదని తెలియు మో ధర్మనిరత.

తా. స్వాధ్యాయము వాచికమని ఉపాంశువని మానసికమని మూఁడువిధములు.
అందు అన్యునికీ వినఁబడునట్లు పఠించుట వాచికము; అన్యునికి వినఁబడకుండునట్లు
పఠించుట ఉపాంశువు; ప్రత్యక్షరమును విరళించి మనసునందే జపించుటమానసికము.

ఈశ్వరప్రణిధానలక్షణము.


సీ. కరణంబు లఖలోపకరణంబులును గాఁగఁ
          బ్రాణంబు లుపచారభటులుగాఁగ
    గంగాప్రముఖ నాడికలు జలంబులు గాఁగ
          షట్కమలములు పుష్పములు గాఁగ
    జఠరాగ్నిహోత్ర ముజ్జ్వలధూపముం గాఁగఁ
          బటుజీవకళలు దీపంబు గాఁగ
    నందితానందంబు నైవేద్యముం గాఁగ
          రవిశశిజ్యోతు లారతులుగాఁగ

తే. నంగ దేవాలయమున సహస్రకమల
    పీఠమున శాంతి జనకజోపేతుఁ డగుచుఁ
    జెలఁగుపరమాత్ము రాము నర్చించుచుండఁ
    దత్త్వవిదు లీశ్వర ప్రణిధాన మండ్రు.

తా. జ్ఞానేంద్రియములును కర్మేంద్రియములును అంతరింద్రియములును పూజా
పాత్రములుగాను, దశవిధప్రాణములు పనివాండ్రు గాను, గంగాయమునాసరస్వత్యాది
నామములు గల ఇడ పింగళ షుషుమ్న మొదలగు నాడులు అభిషేకాదిజలములుగాను,
ఆధారాదిషట్కమలములు పుష్పములుగాను, జఠరాగ్ని ధూపముగాను, చిత్కళలు
దీపములుగాను, బ్రహ్మానందము నైవేద్యము గాను, సూర్యచంద్రమండలజ్యోతు
లారతులుగాను, శరీరమనెడు దేవాలయమండలి సహస్రారకమలమనెడి సింహాసనమున
శాంతియను సీతతోఁగూడిన పరబ్రహ్మమను శ్రీ రాముని నెల్లప్పుడు పూజించుచుం
డుటయె యీశ్వరప్రణిధానమని బ్రహ్మవాదులయిన పెద్దలు పలుకుదురు.


యోగాసనముల లక్షణములు


1. వీరాసనము.


క. “ఒక తొడపై నొక పాదము, నొక పాదముమీఁదఁ దొడయునునిచిశరీరం
    బకుటిలగతి నిల్పినఁ ద, క్కక యది వీరాసనంబుకై వడి యయ్యెన్".

తా. "ఒకతొడమీఁద నొక పాదమును మఱియొక పాదముమీఁద దక్కిన
తొడయును చేర్చి శరీరమువంకర లేకుండనిల్పెనేని వీరాసనమగును."

2. స్వస్తికాసనము


క. “పిక్కలతొడలనడుములం
    దొక్కట బదతలము నిడి సమున్నతి నొడలిన్
    నిక్కించిన నీయాసన
    మక్కజముగ స్వస్తికాహ్వయం బగు జగతిన్.

తా. “జంఘోరువులనడుమ పాదములఁ జొనిపి శరీరము చక్కగ నిక్కించె
నేని స్వస్తికాసనమనుట.”

3. పద్మాసనము


శా."వామాంకంబున దక్షిణాంఘ్రి యును దద్వామేతరాంకంబునన్...
    వామాంఘ్రిన్ ఘటియించి పశ్చిమదిశావ్యాప్తంబులౌ చేతులన్
    సేమం బారఁగఁ గాళ్లయంగుళములం జేకొన్నపద్మాసనం
    బౌ ముక్కుంగొనఁజూపునుం జుబుకహృద్వ్యాసంగముంగల్గినన్"

తా. “ఎడమతొడమీఁద కుడిపాదమును కుడితొడపై ఎడమపాదమును నిలిపి
వెనుకప్రక్కగ కుడిచేత నెడమతొడమీఁదనున్న కుడికాలి పెద్దవ్రేలును ఎడమచేత
కుడితొడమీఁదనున్న ఎడమకాలిపెద్దవ్రేలును పట్టుకొని ఱొమ్మున గడ్డముంచి
భ్రూమధ్యమందు దృష్టి నిలిపెనేని పద్మాసనమగును.”

4. మతాంతరపద్మాసనము


సీ. “అది పద్మబంధంబె యగు నైన నుత్తాన
          చరణంబు లూరుసంస్థములు గాఁగ
     నూరుమధ్యంబున నుత్తానకరతల
          ద్వయమును రాజదంతములుమొదట
     హత్తియుండెడిరసనాగ్రంబుఁ దొంటిభా
          తినయున్న చుబుకంబు దృష్టి గలిగి


    మారుతంబల్లనఁ బూరించు చుండిన
         నది పద్మ మగు మతాంతరమునందు

తే. మఱియు నిది మత్స్యమతము పద్మమునఁ బూర్వ
    మట్ల యుండుచు సంస్ఫుటహస్తయుగ్మ
    మున గుదాకుంచనముఁ జలదనిలపూరి
    తము విసర్జనవిధియు ధ్యానమును వలయు.

తా. ఎడమతొడపయిన కుడిపాదమును, కుడితొడపై నెడమపాదమును, వెలి
కీలనుంచి హస్తములు రెండుతొడలపయి వెలికిలనుంచి నాసాగ్రమందులక్ష్యముంచి
దంతమూలమున నాలుక హత్తించి పక్షమందు గడ్డంబుంచి మెల్లమెల్లగ వాయువును
పూరించుచుండెనేని మతాంతరపద్మాసనమగును. మఱియు మునుపటివలె పద్మాసనమం
దుండి చుబుకంబు వక్షఁబున హత్తించి చిత్తంబునందు ధ్యానంబు చేయుచు ఆపాన
మును ఊర్ధ్వముగారేచించి కుండలీశక్తియుక్తముగనిలిపి ప్రాణవాయువును విడువఁగా
నధికజ్ఞానబోధకలుగును. దీనిచేత నాడీద్వారమందు గాలినిల్చును. మృతులగువారు
ముక్తులగుదురు. ఇదే బద్ధపద్మాసనము. ఇదేముక్తపద్మాసనము.

5. యోగాసనము.


క. యోగవటజానుయుగ సం
   యోగంబునఁ బదతలంబు లుర్వి నిలిపి లో
   నీగినకరముల నుండిన
   యోగాసన మండ్రు, దీనియోగవిధిజ్ఞుల్.

తా. హంసదండము మోకాళ్లక్రిందనుంచుకొని పాదముల నేలపయి నిలిపి
తొడలనడుమ, చేతులఁజొనిపి పిక్కఁబట్టుకొని ఆత్మావలోకనముఁ జేయుచుండెనేని
యోగశాస్త్రవేదులు దీనిని యోగాసనమందురు.

6. కూర్మాసనము


క. వీడఁబడినగుల్భంబులఁ
   గూడఁగ సంధించి పట్టి గుద మలవడఁగాఁ
   బీడించినఁ గూర్మాసన
   మీడితమతి నెఱుఁగుదురు యమీంద్రులు దీనిన్.

తా. ఆధారమునకు ఉభయ పార్శ్వములయందు రెండు కాళ్లమడిమలు హత్తించి
నిక్కిచక్కఁగా గూర్చుండెనేని కూర్మాసనము.


7. ఉత్తానకూర్మాసనము.


తే. కుక్కుటాసనబంధంబుఁ గూర్చినట్టి
    కరయుగంబుల మెల్లనఁ గనుదరంబు
    బంధనముఁ జేసి వెలికిలఁబడినకూర్మ
    మట్ల పడఁగ నుత్తానకూర్మాసనంబు.

తా. కుక్కటాసనస్థుఁడైయుండి రెండు చేతులతో కంఠముపట్టుకొని కూర్మము
వలె వెలికిలఁబడియుండెనేని యుత్తానకూర్మాసనము.

8. భద్రాసనము.


తే. అండములక్రిందినెలవులయందు నుభయ
    పార్శ్వములు రాయ రెండుగుల్బములఁ బెట్టి
    పార్ష్ణిపదములఁ గరములఁ బట్టి నిశ్చ
    లాత్ముఁడై యుండెనేని భద్రాసనంబు.
-
తా. అండములకు క్రిందిప్రక్కలయందు చీలమండనునిచి మడిమల రెంటిని
రెండు చేతులఁబట్టి కదలకుండిన భద్రాసనమగును. ఈయాసనస్థుఁడగువాఁడు సర్వవిష
యములను వ్యాధులను జయించును.

క. భాసురపద్మాసనసి, ద్ధాసనము గృహస్థవర్తనాతీతులకున్ (?).

తా. గృహస్థాశ్రమస్థులు పద్మాసనస్థులై యుండుట యుత్తమమైనను గృహ
స్థులకు పద్మాసనమును తక్కిన యాశ్రమస్థునకు సిద్ధాసనమును మేలనుట.

9. సిద్ధాసనము


శా. యోనిస్థానముఁ బార్ష్ణిభాగఘటనాయుక్తి న్నిబంధించుచున్
    దానన్మేఢ్రముమీఁద నోజ నొక పాదం బూస సిద్ధాసనం
    బౌనం దింద్రియనిగ్రహంబును సుదేవస్థాణు భావంబు యో
    గానందైకమనంబు భ్రూయుగళమధ్యాలోకముం గల్గినన్

తా. ఎడమకాలిమడమ మూలాధారమందు కుడికాలిమడమ లింగస్థానమం
దుంచి శిరో గ్రీవభుజంబులఁ జక్కగా నిక్కించి భ్రూమధ్యావలోకనముఁ జేయు
చుండిన సిద్దాసనమగును. దీనిచే నింద్రియనిగ్రహము శరీరపాటవము నిర్మలచిత్త
వృత్తిగలుగును.

10. మతాంతరసిద్ధాసనము


క. వెండియును సస్యగుల్బము, దండముపైఁ బెట్టి మీఁద దక్షిణ గుల్భం
   బుండఁగ నపక్రముగఁ గూ, ర్చుండిన సిద్ధాససనంబయౌఁబక్షమునన్


తా. లింగముమీఁద నెడమ మడమనుంచి దానిపై కుడిమడమనుంచి ముందు
వలె నాసాగ్రము వీక్షించుచుండిన నిది మతాంతరసిద్ధాసనమనుట. దీనిని వజ్రాసనమని
ముక్తాసనమని గుల్భాసనమని బహువిధములఁ జెప్పుదురు. ఇది సకలాసనములలో మేలై
నది. ముక్తిద్వారకవాటపాటనపటువైనది.

11. సింహాసనము.


శా. అండాధస్థ్సలి నూరుపార్శ్వముల సవ్యాసవ్యగుల్భ ద్వయం
    బొండొంటింగ్రమహీనభంగి నిడి దోర్ముగ్యాంగుళు ల్జానులం
    దుండ న్వే ప్రసరించి నిక్కి వివృతాస్యుండైనసింహాసనం
    బొండేమిం గనఁ బోక నాసికముఁ దా నోలిం పరీక్షింపఁగన్.

తా. అండముల క్రిందినెలవులయందు తొడలవెనుక భాగములు సోఁకునట్లుకుడి
యెడమమడమల మార్చియుంచి కుడియెడమ చేతుల వ్రేళ్ళను మోకాళ్ల మీఁద
సవ్యంబుగ వెడల్పుగనుంచి నిక్కికూర్చుండి నోరుదెఱిచికొని భ్రూమధ్యమందలి
చిద్బిందువును తిలకించుచున్న సింహాసనమనుట.

12. కుక్కుటాసనము


క. జలజాసనంబునం గర, ములు జానూరువులమధ్యమునఁ జొనిపి ధరన్
   నిలిపి గగనమున నంగం, బలవడ నిలువంగఁ గుక్కుటాసనమయ్యెన్.

తా. పద్మాసనముననుండి మోకాళ్లతొడలసందుల చేతులను దూర్చి హస్తములు
నేలనూని పైనెగసినట్లుండిన కుక్కుటాసనమగును.

13. గోముఖాసనము.


తా. వామదిశ పృష్ఠపార్శ్వము, ధానముగా దక్షగుల్బతలమును నట్ల
    వ్వామపుగుల్భమువలనిడ, గోముఖ మీయాసనంబు గోముఖభాతిన్.
 
తా. ఎడమకాలిమడమ కుడివీఁపు ప్రక్కను కుడికాలిమడమ నెడమవీఁపువైపు
గాను మోకాలిమీద మోకాలు గదియనుంచి యొడలు చక్కగ నిక్కించి
భ్రూమధ్యావలోకనము చేయుచుండెనేని గోముఖాసనంబగును.

14. ధనురాసనము.


క. మునుపాదాంగుష్ఠంబులు
   దన చేతులు చెవులు దాక ధనువుదివియు న
   య్యనువున నెడమఁగుడిఁదివియ
   ధనురాసనమండ్రుయోగతత్త్వవిధిజ్ఞుల్.


తా. పాదాంగుష్ఠముల రెంటిని రెండుచేతుల ధనురాకృతిగ వీఁపు వెనుక
చెవులకు సరిగాఁ యుండిన ధనురాసనమగును.

15. మయూరాసనము


మహాస్రగ్ధర. ధరణిన్హస్తస్థలంబుల్దగులనిలుపుచుందండముంబోలె దత్కూ
    ర్పరయుగ్మన్యస్తనాభీభవనతలయుగోద్భాసి యై యున్నతాస్య
    స్థిరుఁ డైయాకాశదేశస్థితి నిలిచినఁ దా శ్రీమయూరాసనంబౌ
    హరియించున్రోగదోషాయతనవిషసమూహంబుల న్రంహయుక్తిన్.

తా. చేతుల నేలనూని మోచేతులనాభియిరుప్రక్కలనుంచి ముఖము పైకెత్తి
కాళ్లు చాఁచి నెమలితోఁకవలె పైకెత్తిన మయూరాసనమగును. దీనిచే నుదరగుల్మాది
రోగములును సర్వపాపములును వేగముగా నశించును. జఠరాగ్ని ప్రజ్వరిల్లి విషము
నయిన జీర్ణింపఁజేయును.

16. కపాలాసనము


సీ. ఊర్ధ సంస్థితనాభియును నధస్తాలువు
         నూర్ధ్వభానుఁడు నధోయుక్తిశశియు
    నూర్ధ్వపాదంబులు నొగి నధశ్శిరమును
         గలయది విపరీతకరణసంజ్ఞ
    గలకపాలాసనక్రమ మయ్యె గురువాక్య
         మున నది సిద్ధించు జనుల కెలమి
    నిత్యంబు సభ్యాసనిరతున కీకపా
         లాసనం బఖిలరోగాళిఁ జెఱచు

తే. జఠరవహ్ని వర్ధిలఁ జేయు జగతి నట్టి
    సాధకునకు నాహారంబు సంగ్రహింపఁ
    జను బహుళముగ నల్పభోజనముచేత
    ననిలవేగంబు విడిపించు నతనితనువు.

తా. ఈయాసనము ప్రతిదినము యామమాత్రమభ్యాసము చేయుచుండిన
    మూఁడు నెలలకు పిదప వలీపలితవిరహితాంగుండును మృత్యుంజయుండునగును.

    శ్లో. “నాభిస్థానేవసే దగ్నిః హృదః స్థానే దివాకరః,
        భ్రూమధ్యే వర్తతే చంద్రః చంద్రాగ్రే చ వసేన్మనః.”..


తా. తలక్రిందుగ నిలిచి భూమధ్యమునందలి చిద్బిందువును జూచుచుండె
నేని కపాలాసనమనుట.

17. ముక్తాసనము


క. పదగుల్భంబున గుదముం, గదియంగా నిల్పి యంకగతమై యుండం
   బద మొకటి సంఘటించిన, నది ముక్తాసనమవక్రమగుమే నమరన్.
 
తా. ఎడమకాలి మడమచే మూలాధారమును గప్పి కుడియడుగు నెడమతొడ
మీఁద నుంచిన అది ముక్తాసనమగును.

18. టిట్టిభాసనము


క. వెలకిలఁ జరణతలంబులు, దలమీదం జేర్చి ధరణితలమున నిలుపం
   గలిగెడు నట్లుగఁ గరములు, నలపశ్చిమమెత్తఁ డిట్టిభాసనమయ్యెన్.

తా. పాదములు వెలకిల నుండ శిరస్సుపైఁ గదియించి చేతులతోఁ బూనిక
గానిలిచి వెనుకటిభాగము పైకెత్తఁగా డిట్టిభాసనమగును.

19. పశ్చిమతానాసనము.


చ. పదములభూమిదండమురభాతిగఁ జూచి కరాంగుళంబులన్
    బదయుగళాగ్రము ల్బిగియఁ బట్టి లలాటము జానుయుగ్మముం
    బదిలముగా ఘటింప నిది పశ్చిమతానము దీన రోగము
    ల్గదియవు పశ్చిమంబునను గాలియగున్ జఠరాగ్ని కార్శ్యముల్.

తా. నేలమీఁద రెండుకాళ్లు చక్కగాఁజాచి రెండుకాళ్లబొటనవ్రేళ్లు రెండు
చేతులఁబట్టికొని మోకాళ్లమీఁద లలాటముంచెనేని పశ్చిమతానాసనము. ఇందున
వాయువు పశ్చిమమార్గముగా నడుచుటవలన జఠరాగ్ని ప్రజ్వరిల్లి కడుపుపల్చనై
రోగములు నశించును.

20. పూర్వతానాసనము.


తే. వరుస మీఁగాళ్లు నేల మోపంగ మడిచి
    మడమలును బిఱుదులు గూర్చి మస్తకంబు
    నడుముఁ గరకూర్పరంబుల నదిమి మోపి
    నడు మెగయ నున్నఁ బూర్వతానం బటండ్రు.

తా. కాలివ్రేళ్లుమడిచి భూమిమీఁదనిల్పి మడమలును పిఱందులును జేర్చి
శిరస్సును జేతులతోడను నడుమును మోచేతులతోడను అదిమిపట్టుకొని నడుమును
నిక్కించిన పూర్వతానాసనమగును.


21. అర్భకాసనము.


మ. పదశీలము స్ధిరాతలముపైఁ గడుడగ్గఱనిల్పి, లోతోడల్
    గదిసిన జంఘలు న్మరిలలాటము మోపినజానుయుగ్మమున్
    బ్రిదులక యుండుహస్తపరిపీడిత జానువుగల్గియుండెనే
    నిది యగు నర్భకాసన మహీనసుఖాస్పదమండ్రు సంయముల్.

తా. పిఱుఁదులు క్రింద మోపియైనను గొంతు గూర్చుండి మోకాళ్లను చేతు
చుట్టి పట్టుకొనిన అర్భకాసనడు. ఇది యత్యంత సుఖాస్పదము.

22. కామదహనాసనము.


చ. అవనితలంబుఁ బొందఁగఁ బదాంగుళమూలములోన నిల్పి జా
    నువులు నభస్థ్సలంబునన నూల్కొనఁ బార్ష్ణియుగంబుయోనియున్
    దవులఁగ యోగదండఘటనాస్థితి హస్తతలంబు లుండెనే
    నవిరళ మైనకామదహనాసన మండ్రిది యోగతత్పరుల్.

తా. మునివ్రేళ్ల నేలమీఁద నిల్పి మోకాళ్ళ క్రింద నూనక పిఱుఁదులు మడ
మలు నొరయునట్లుండి హంసదండములమీఁదఁ జేతుల నూని నిక్కి భ్రూమధ్యాలో
కనముచేయుచున్న యోగశాస్త్రవేదులు కామదహనాసనమని పల్కుదురు.

ప్రాణాయామలక్షణము.


తే. ప్రణవపంచాక్షరాష్టాక్షరాదికముల
    మాత్రగాఁ జేసి పూరకమాత్రలకును
    రెట్టికుంభకమున నిల్పి రేచకంబు
    నాడిశోధన మట్ల చేయంగవలయు.

తే. సోముదెస గాలిఁగొనుము సుషుమ్నఁ బట్టి
    సూర్యుదెస వీడి క్రమ్మర సూర్యువలని
    పింగళంబునఁ గొనిపట్టి పిదప నిగుడ
    విడువవలయు యథాశక్తి నుడుగ కెవుడు.

తా. ఓంకారము పంచాక్షరము అష్టాక్షరము మొదలగుమంత్రములలో ఒక్క
మంత్రమును ఒక్కమాత్రగాఁజేసి పూరకమందు నిర్ణయములగు మాత్రలకంటే రెట్టింపు
గాకుంభకమునందు నిలిపి రేచకమునందు పూరకమందలిమాత్రలలోసగము నిర్ణయించి
సుషుమ్నా నాడియందలి వింతలఁ జూడవలయును. మఱి యెడమముక్కున ప్రాణవా
యువునుపూరించి నుషుమ్నయందునిల్చి కుడిముక్కున విడిచి మరల కుడిముక్కున పూ


రించి సుషుమ్నయందునిల్పి యెడమముక్కునవిడుచుచు నీతీరున నెల్లప్పుడు యథా
శక్తిగ ప్రాణాయామము చేయుచుండవలయును. ఈ ప్రాణాయామముప్రాకృతమని
కుంభకమని త్రివిధము. అందు నేఁటిదినము సూర్యోదయము మొదలు రేపటి
సూర్యోదయమువఱకు మూలాధారకమలంబున గణపతికి ఆఱునూఱును, స్వాధిష్ఠానకమలమున
బ్రహ్మకు ఆఱువేలును, మణిపూరకకమలంబున విష్ణుదేవునకు అఱువేలును,
అనాహతకమలంబున రుద్రునకు ఆఱువేలును, విశుద్ధకమలంబున నీశ్వరునకు సహస్రంబును,
ఆగ్నేయకమలంబున సదాశివునకు సహస్రంబును, సహస్రారంబున గురువునకు సహస్రంబును,
అజపాగాయత్రీమంత్రజపమును సమర్పించుటే ప్రాకృతప్రాణాయామము.
రేచక పూరక కుంభక క్రమములచేత తొలుత అధస్సంచారముగలప్రాణవాయువు
నందు ఊర్ధ్వసంచారముగల యపానమును, వెనుక ఆపానమందు ప్రాణమును చేర్చుట
వైకృతప్రాణాయామము. మూలబంధ ఉడ్యాణబంధజాలంధరబంధములగావించి
రేచకపూరకములను నిలిపి ప్రాణాపానములను రెంటిని రేపగ లొక్కఫక్కిగ నిలుపుట
కుంభకప్రాణాయామము. రేచకమనఁగా ప్రాణవాయువును మూలాధారమునుండి
బ్రహరంధ్రపర్యంతము సుషుమ్నానాళద్వారముగ నుత్థాపనము చేయుట;
పూరకమనఁగా: బ్రహ్మరంధ్రపర్యంతము రేచించిన వాయువును మరల సుషుమ్నా
నాళద్వారముగ మూలాధారమునఁ జేర్చుట, కుంభకమనఁగా రేచించిన వాయువును బ్రహ్మరం
ధమందు మాత్రాసంఖ్యన నిలుపుట. ఇదే యూర్ధ్వకుంభకము. పూరించిన వాయువును
మాత్రాసంఖ్యగ మూలాధారము నిలుపుట అధోకుంభకము.

బంధత్రయవివరణము.


తే. గుహ్యమున వామపాదంబుఁ గూర్చి యితర
    'పాదమూలంబు నాభినిఁ బరఁగఁ జుబుక
    మురమునను జేర్ప నివి బంధవరము లండ్రు
    ఆర్యనుత వీనిఁ దెలియు మీ వాత్మయందు.

క. మడమను యోనిస్థానము, విడువక బంధించి యూర్ధ్వ వీథికపానున్
    పడి నాకుంచనమునఁ గొని, పడ నాకర్షింప మూలబంధం బయ్యెన్.

తే. కృత్రిమము లేక నాభికి గ్రిందు మీఁదు
    బలిమి మై బంధనము సేయ వలయు దీనిఁ
    బరమయోగీంద్రు లుడ్యాణబంధ మండ్రు
    బంధములలోననుత్తమం బండ్రుదీని.


తే. కంఠమాకుంచనము చేసి కడు దృఢముగ
    హృదయమునఁ జుబుకము నిల్ప నిదియ కాదె.
    భవ్యజాలంధరాభిఖ్య బంధ మూర్ధ్వ
    భాగమున నున్నయమృతనిబంధకంబు.

తా. అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ బీడించి ప్రాణంబు బిగియఁ
బట్టి అని శివయోగసారభాగవతాది గ్రంధములలో చెప్పఁబడియున్నది గనుక గుద
గుహ్యములయం దపానుని సంచారమగుటవలన నెడమమడమచేత గుదస్థానమును
బంధించుటయే మూలబంధము, కుడిమడమ చేత నాభిని బంధించుటే ఉడ్యాణబంధము.
గడ్డము ఱొమ్మునందుంచుటే జాలంధర బంధము. ఈబంధత్రయమందు సుస్థిరులై హఠ
యోగసిద్ధిగల యోగీంద్రులు వార్థక్యాది వ్యాధిమృత్యు భయములు లేక
మోక్షసామ్రాజ్యపట్టభద్రులయి యుందురు. సత్యము.

సమాధిలక్షణము


సమాధి సవికల్పక మని నిర్వికల్పక మని ద్వివిధము. ఆందు సవికల్పకము
దృశ్యానువిద్ధసవికల్పకమని శబ్దానువిద్ధసవికల్పకమని యిఱుతెఱంగులు కలిదియగును.
ఈ రెండును నిర్వికల్ప మొక్కటియును గూడి మూఁడువిధములయ్యెను. ఈ
మూఁడును బాహ్యాంతంభేదముల చేత బాహ్యదృశ్యానువిద్ధసవికల్పక సమాధియని
బాహ్యశబ్దానువిద్ధసవికల్పకల్పకసమాధి యని బాహ్యనిర్వికల్పకసమాధి యని అంతర
దృశ్యానువిద్ధసవికల్పకసమాధి యని అంతరశబ్దానువిద్ధసవికల్పకసమాధి యని అంతర
నిర్వికల్పకసమాధి యని ఆఱువిధములు.

ఆ. ఎదుటఁ గానుపించు నెల్లచిదాభాస
    కళలు తనకు వేఱు గా వటంచుఁ
    దెలియు తెలివి నెపుడుఁ దెలియుట బాహ్యదృ
    శ్యానువిద్ధ మనఁగ నలరు వత్స.

క. అంతర మగు ద్విదళంబున, వింతఁగ జూపట్టుకళల వీక్షించుచుఁ దా
    సంతస మందుచు నుండుట, యంతర్దృశ్యానువిద్ధ మనఁబడు సుమతీ.

తే. బాహ్యమునఁ బెక్కుగా వినఁబడెడిశబ్ద
    తతులఁ దెలిసెడు తెలివియె తానబంచుఁ
    దెలిసి యానందరసమునఁ దేలుచుంట
    బాహ్యశబ్దానువిధ్ధమై పరఁగు వత్స.

క. అంతర్హృదయనభంబున, సంతత మొగిమ్రోయు ప్రణవశబ్దంబుల నా
    ద్యంతమువినుతను దెలియుట, యంతర్దృశ్యానువిద్ధమనఁబడు బుత్రా.


ఆ. బాహ్యదృశ్యశబ్దపటలంబుఁ గనునాత్ముఁ
    గనుట బాహ్య నిర్వికల్పమాంత
    రస్థదృశ్యశబ్దరాశిఁ గన్గొనునాత్ముఁ
    గనుట లోనినిర్వికల్ప మనఘ.

మఱియొక విధమగు ప్రాణాయామము. కుడిముక్కు ఇడ, ఇదే సూర్య నాడి. ఎడమముక్కు పింగళ,యిదేచంద్ర నాడి. వీనియందు సంచరించు ప్రాణవాయువును బ్రహ్మ
బీజమైన ప్రణవమందలి అకార ఉకార మకారములకు మూఁటిని మూఁడుమాత్రలను
గాఁజేసికొని వానిలో అకారముచేత సూర్యనాడిని పండ్రెండు మాత్రల కాలమును,
మకారము చేతి చంద్ర నాడిని పడియాఱుమాత్రలకాలమును పూరించు ఉకారము చేత
రెండు నాడులును చేర్చి పదిమాత్రలకాలము సుషుమ్నయందు కుంభించి పిదప నడి
నాళంబుచేత క్రమంబుగా పూరించుట ప్రాణాయామము. ఇట్లు బాలకౌమారయౌవన
వృద్ధనిష్కలనెడు పేళ్ళుగల ప్రాతఃకాలము మధ్యాహ్న కాలము సాయంకాలను
అర్ధరాత్ర కాలము వీనియందు ప్రతిదినమును ప్రతివేళను ఇరువదిమార్లు తప్పక ప్రాణా
యామము చేయుచుండెనేని వాయువు స్థిరపడి వెనుక కేవలకుంభకమునకు మార్గమగును. ఈప్రాణాయామలక్షణము లనేక విధములుగ నుండును గావున గురుపదేశము
నఁ దెలిసికొనవలయును.

ప్రత్యాహారలక్షణము


వర్ణరూపధ్వనిరూపముఅయిన సకలశబ్దములను వినుట, మృదువు కఠినము ఉష్ణము
శీతము మొదలగు స్పర్శములను తెలిసికొనుట, పొట్టి పొడుగు లావు సన్నము నలుపు
తెలుపు ఎఱుపు ఆకుపచ్చమిశ్రములని పది విధములయిన రూపములఁ జూచుట, ఉప్పు
పులుసు కారము తీపు చేదు ఒగరు అనుషడ్రసములును ఎఱుఁగుట, సుగంధ దుర్గంధ
మిశ్రగంధములను మూరుకొనులు, సుశబ్దములను అపశబ్దములను పలుకుట, ఇచ్చుట
పుచ్చుకొనుట లోనగు పనులను జేయుట, నడుచుట ఎగురుట, పరుగెత్తుట, మొదలగుపను
లను గావించుట, మలవిసర్జనముచేయుట, సురతాదులచేత నానందించుట, సంశయిం
చుట, నిశ్చయించుట, చంచలించుట, ఆభిమానించుట అనుగుణముల నుండి శ్రోత్రము '
త్వక్కు చక్షువు జిహ్వ ఘ్రాణము వాక్కు. హస్తము పాదము వాయువు గుహ్యము
అనెడు పదునాలుగింద్రియములను త్రిప్పుట ప్రత్యాహారము.

ధ్యానలక్షణము


క. మానసకమలము నందున, శ్రీ నారాయణునిమూర్తిఁజింతించుచు లో
   ధ్యానముసేయుట సగుణ, ధ్యానం బనియండ్రు సుజను లమలవివేకా


సీ. కమలాసనస్థుఁడై కాయంబు నిక్కించి
         కరము లూరులఁ జేర్చి కనులు మూసి
   దేహేంద్రియ ప్రాణధీమ నాదిక మెల్ల
         దృశ్య మే గాను దద్దృక్కు నేను
   దృశ్యమేఁ గాను దద్దృక్కు నేననువృత్తి
         దృశ్యంబ కానఁ దదృక్కు నేన
   యని విజాతి ప్రత్యయనివృత్తిగా సజా
         తిప్రత్యయ ప్రవృత్తిక్రమమున

తే. నాత్మ దానై నయందాఁక నయ్య జేష
    దృశ్యదృగ్వృత్తులను నిషేధించుకోనుచు
    ననిశ మాత్మావలోకన మందుచుంట
    నిర్గుణధ్యాన మనఁ జెల్లు నిర్మలాత్మ.

తా. ధ్యానము సగణధ్యానము నిర్గుణధ్యానము అని రెండు విధములు. అందు హృదయపద్మమందు తటస్థలక్షణస్వరూపుఁడయిన విరాట్పురుషుని నిలిపి మనస్సు చేత సమస్తవస్తువులను గల్పించి షోడశోపచారములను చేసి ధ్యానించుటయే సగుణ ధ్యానము. పద్మాసనంబుననుండి శరీరంబు నిక్కించి హస్తంబులను తొడల పై నుంచి నేత్రములు మూసి స్థూలసూక్ష్మ కారణశరీరములును పదునాలు గింద్రియంబులును దశ విధప్రాణంబులనుదృశ్యములు అదేహేంద్రియప్రాణంబులు నేఁ గాను. వీనిని వీక్షించు సాక్షిని, సాక్షినినేననెడు వృత్తియును దృశ్యమే గనుక ఆవృత్తిని జూచుసాక్షిని అని మాయాకల్పితములై విజాతీయములగు యుష్మత్ప్రతీతిప్రత్యయగోచరాదులనెడు బహిర్దృ శ్యములను, సజాతీయములగు అస్మత్ప్రతీతి ప్రత్యేయగోచరాదులనెడి యంతర్దృశ్య ములను, ఆదృశ్యములకు సాక్షిననెడు వృత్తిని నిషేధించుచు సత్యజ్ఞానానందనిర్మలా ఖండస్వరూపమై సర్వదృక్కగు పరబ్రహ్మము తాననెడు ధార్ఢ్యముగలుగుదాఁక ఎల్లప్పుడు నిర్వికల్పబ్రహ్మనిష్ఠ గలిగియుండుటే నిర్గుణ ధ్యానము.

ధారణాలక్షణము.

మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞేయము సహస్రారము అనెడు కమలములయందు వానికి నధిదేవతలైన గణపతి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ గురుచరణములను అక్కడక్కడ ధ్యానించునపుడు మనస్సును నిలుపుటే ధారణాయోగము. ప్రత్యగాత్మ నైన నేనే పరమాత్మను. ఆపరమాత్మయే ప్రత్యగాత్మ అని నిష్ఠ చేయుచుండుటే సమాధి అని ఈవిధముగ అభ్యాసయోగము ఎనిమిదంగములు కలిగియుండును. అది చిత్తపరిపాకము లేనివారికి తగినది.

మిక్కిలి కష్టతరమైనది. ఈఅభ్యాసయోగమును వాడుక చేసినవారికి ఆణిమాద్యష్ట

విధైశ్వర్యముల నిచ్చును. బ్రహఙ్ఞానమును వృద్ధిఁబొందించును. చిత్తపరిపాకము గలవారికి జీవేశ్వరైక్య జ్ఞానము నిచ్చును. ఆతిసులభమైన జ్ఞానయోగమే రాజయోగ మని చెప్పఁబడును. ఈయభ్యాసయోగ జ్ఞానయోగసిద్ధికి శ్రీ రాముని పాదారవిందము లయందు భక్తిగలిగియుండుటే కారణము అని తాత్పర్యము. ఈతాత్పర్యమం దుదాహరింపఁబడిన పద్యములు శుకచరిత్రము శివయోగసారములయందలివని యెఱుఁగ వలయును.

అష్టైశ్వర్యములవివరణము.


సీ. అణుజంతువులయందు నణువై చరించుట
          యణమాహ్వయైశ్వర్య మలఘుచరిత
   యబ్జజాండాదిమహన్మహుం డై యుంట
          మహిమాఖ్యభూతి నిర్మలవిచార
   బ్రహ్మాండమునకంటె భార మై యుండుట
          గరిమాఖ్య సంపత్తి కలుషదూర
   యమరాద్రిసదృశుఁడై యతిసూక్ష్మగతి నుంట
          లఘిమావిభూతి సల్లలితహృదయ

తే. వాంఛితార్థావలంబనావాప్తి ప్రాప్తి
    గగనగమనాది సిద్ధిప్రాకామ్యమర్క
    శశిముఖ నియామకత్వ మీశత్వ మఖిల
    జీవవశ్యప్రవృత్తి వశిత్వ మనఘ.

తా. అణుప్రమాణము లైన ప్రాణులయందు పరమాణుప్రమాణుఁడై యుండుట అణిమ, బ్రహ్మ విష్ణు రుద్ర, మహేశ్వర సదాశివ విరాట్పురుషాండములకంటె పెద్దవాడై యుండుట మహిమ. బ్రహోద్యండములకంటె భారమై యుండుట గరిమ. మేరువంతటి బరువు గలిగి యుండి దూది లేశమువలె తేలికయై యుండుట లఘిమ. ఇష్టపదార్థములను లభింపఁజేసికొనుట ప్రాప్తి. గగనగమనాదిసిద్ధి ప్రకామ్యము. సూర్యచంద్రమహేంద్ర ఉపేంద్ర, అగ్ని ప్రముఖ దేవతలను పనులలో నియమించుట యీశత్వము. సకలజంతువులను వశముచేసికొనుట వశిత్వము.

శా. ప్రత్యక్షాపగమంబుఁ బావనము నభ్యాసంబు గావింపఁగా
    నత్యంతోరుసుఖంబు ధర్మ మతిగుహ్యం బుత్తమం బాద్యమున్
    సత్యం బాగమసిద్ధ మాదిమునిరాట్సంస్తుత్యము స్వేద్యమున్
    నిత్యానందము రాజయోగము మహానిర్వాణమార్గం బగున్. 86

టీ. ప్రత్యక్షాపగమంబు- ప్రత్యక్ష ప్రత్యక్షముగాఁ గానవచ్చు ప్రపంచమును, (అనఁగాః ప్రపంచ భ్రాంతిని,) ఆపగమంబు = నశింపఁజేయునదియు, పావనమును - పరిశుద్ధమైనదియునగు, అభ్యాసంబుఁ గావింపఁగాన్ = ఆభ్యాసము నాచరించినట్లైన, అత్యం . . . ఖంబు_అత్యంత=నశిఁపని, ఉరు = అధిక మైన, సుఖంబు = చిత్తశాంతిని గలిగించునదియు,ధర్మము=పుణ్యరూపమైనదియు, అతిగుహ్యంబు మిగులరహస్యమైనదియు, ఉత్తమంబు = శ్రేష్ఠమైనదియు, అద్యమును = అనాదిసిద్ధమైనదియు, సత్యంబు =శాశ్వతమైనదియు, ఆగమసిద్ధము-ఆగమ = కామికము మొదలగు నిరువదియెనిమిది యాగమంబులందును, సిద్ధము= సిద్ధ మైనదియు, ఆదిమునిరాట్ససంస్తుత్యమును, ఆదిముని = పురాతనులగు సనకాదిమహామునులకు, రాట్-ఫ్రభువులైన (లేక, గురువుకైన) దక్షిణామూర్తి మొదలగువారలచే, సంస్తుత్యమును - స్తోత్రము చేయఁదగినదియు, వేద్యమును = మోక్షేఛ్ఛగలహరిచే నవశ్యము తెలియఁబడతగినదియు, నిత్యానందము నిత్య = ఎడతెగని, ఆనందము = బ్రహ్మరూపమగు పరమానందము నొసంగునదియు, ఐన రాజయోగము =

యోగములలో నుత్తమమగు జ్ఞానయోగము అయిన, మహానిర్వాణమార్గంబు = ప్రసిద్ధమగు మోక్షమార్గమై, అగున్ = సిద్ధించును (ఈరాజుయోగమే మోక్షమునకు చక్కని త్రోవ )

తా. ఈజ్ఞానయోగమునకే రాజయోగ మని పేరు. ఇది మిగులఁ బరిశుద్ధమైనది. మోక్షేచ్ఛ గలవారిచే నవశ్యముఁ దెలియఁ దగినది. అనాదిసిద్ధమై దక్షిణామూర్తి, హయగ్రీవుఁడు మొదలగు జగద్గురువుల చే స్తోత్ర పూర్వకముగా నాదరింపబడుచుండినది, వేదములలోను ఆగమములలోను ప్రసిద్ధ మై "ఇదియే సర్వయోగములలో శ్రేష్ఠతమమైనది సత్వమైనది ఆనందస్వరూపమైనది” అని కొనియాడఁ బడుచుండునది. రహస్యములలో నెల్ల రహస్యతమమైనది. దీని నభ్యాసము చేయఁగా ఆవిద్యా ప్రభావమువలనఁ దనకంటె వేఱుఁగా గానవచ్చు నీ ప్రపంచము నశించును. (తనకంటే నన్యము గాఁ గానరాదు). నిరతిశయ మగు బ్రహ్మానందము (తానే బ్రహ్మమని తెలిసికొనుట వలనఁ గలుగు నానందము.) కలుగును. ఈరాజయోగమే మోక్షమునకు మార్గమని తెలిసికొనుము.

ఆ. రాజగుహ్య మైన రాజయోగంబును
   శ్రద్ధధాను లగుచు జనము లెల్ల
   సంశ్రయింప లేక సంసారవనధిలో
   మునుఁగుచుండుదురు విమూఢు లగుచు.87

టీక . జనము లెల్లకొ=మనుష్యులందఱును, శ్రద్దధానులగుచు = శ్రద్ధగలవారలై, రాజగుహ్యమైన = రహస్యములలో నెల్ల రహస్యమగు, రాజయోగంబున్ = ఈజ్ఞాన

యోగమును, సంశ్రయింపలేక = ఆశ్రయింపక, విమూఢులగుచున్ = అజ్ఞానులై, సంసా రవనధిలోన్ = సంసారసముద్రమున మునుఁగుచుండుగురు.

తా. ఇట్లు పరమరహస్య మగునీరాజయోగమును సద్గురువులయను గ్రహము వలన నెఱిఁగి శ్రద్ధావంతులై యభ్యాసము చేసి కడతేర నిచ్ఛయింపక సంసారసముద్ర మున మునుఁగుచుఁ దేలుచు బాధ నొందుచున్నారు. ఈయోగ మెంతసులభ మైనను వారు దాని నాశ్రయింప లేకున్నారు. వారియఙ్ఞానమున కేమందుము ?.

క. ఈరాజయోగమార్గం, బీరేడు జగంబులందు నెవ్వ రెఱుఁగ రా
   త్మారామలసదపాంగా, పారకృపాయుక్తులైనభక్తులు దక్కన్. 88

టీ. ఈరాజయోగమార్గంబు = ఈ జ్ఞానయోగపద్ధతిని, ఈరేడు జగంబులందున్ = పదునాలుగు లోకంబులందును, ఆత్మా... క్తులు - ఆత్మారామ = సర్వాంతర్యామి యగు శ్రీరామునియొక్క, లసత్ = -ప్రకాశించుచున్న, అపాంగ = కడగంటి చూపు లయొక్క , (ఆపాంగశబ్దమునకు నేత్రాంతమనియే యర్ధమైనను లక్షణావృత్తిచే కడ గంటిచూపనియర్థము చెప్పఁబడెను.) కృపాయుక్తులు = దయతో గూడిన, ఐనభక్తులు, తక్కన్ = తప్ప, ఎవ్వరెఱుఁగరు = ఎవ్వరును తెలిసికొనలేకు,

తా. ఈరాజయోగ మెంతరహస్యమైన దైనను అంతర్యామిస్వరూపుఁ డగు నీరామునియందు భక్తి కలిగి యీతనిదయారసమునకుఁ బాత్రులై యుండువారలకుఁ గరతలామలకంబుగఁ దెలియును. ఇతరు లెవ్వరు నట్లు ఎఱుఁగలేరు. కావున ఈయో గము సిద్ధించుటకు భక్తి ప్రధానము.

అవ. ఇట్లు రాజయోగమును సామాన్యముగాఁ బ్రశంసించి విశేషముగ వివ రించుటకై మొట్టమొదట దానిని విభాగించు చున్నాఁడు -

తే. రాజయోగంబు ముక్తికి రాజపథము
    రాజగుహ్యంబు పరమంబు రాజవిద్య
    యదియు మూఁడువిధంబుల నలరుచుండు
    సాంఖ్య తారక సుమనస్కము లనంగ. 89

టీక. రాజయోగంబు = ఈజ్ఞానయోగము, ముక్తికిన్ = మోక్షమునకు, రాజప ధము = రాజమార్గమువంటిది, రాజగుహ్యంబు = మిగులరహస్యమైనది, పరమంబు = శ్రేష్ఠ మైనది, రాజవిద్య = సకలవిద్యలలో నుత్తమమైనది, అదియున్ = ఆరాజయోగముకూడ, సాంఖ్య. . . ములు - సాంఖ్య = సాంఖ్యయోగము, తారక = తారకయోగము, సత్ = శ్రేష్ఠ మైన, అమనస్కములు = అమనస్కయోగము, అనఁగన్ = అన, మూఁడువిధంబులన్ = మూఁడుభేదములుగలదియై, అలరుచుండున్ = ఒప్పుచుండును. తా. ఈరాజయోగమే మోక్షమునకు రాజమార్గము. ఆది రహస్యము, సర్వో త్తమము, విద్యలలో నెల్ల శ్రేష్ఠతమమైనది. సాంఖ్యము, తారకము, అమనస్కము అను భేదములు కలిగి యారాజయోగము మూఁడు విధములై యెప్పుచున్నది.

అవ. ఈ పైఁజెప్పిన మూడింటిని అభ్యసించుటవలనఁ గలుఁగు ప్రయోజనముల వివరించుచు, సహేతుకముగా తారకయోగమును వివరింప నుపక్రమించుచున్నాఁడు——

తే. తారకంబు మనశ్శుద్ధికారకంబు
    సాంఖ్య మాత్మస్వరూపవిచారకంబు
    అనుభవజ్ఞాన మమనస్క మట్లు గాన
    నాద్య మెఱిఁగింతు మొదల నీ వవధరింపు.90

టీకేస్. తారకంబు = తారకయోగమనునది, మన...కంబు - మనః = మనస్సు యొక్క, శుద్ధి = శుధ్ధిని, కారకంబు = చేయునది, సాంఖ్యము = సాంఖ్యయోగము, ఆత్మ స్వరూపవిచారకంబు - ఆత్మస్వరూప = జీవస్వరూపమును (లేక బ్రహ్మస్వరూపమును), విచారకంబు = విచారించునట్టిది, అమనస్కము = అమనస్కయోగము, అనుభవజ్ఞానము = అపరోక్షానుభవజ్ఞానమును కలిగించునది, అట్లుగావునన్ = అట్లగుటచేత, మొదలన్ = మొట్టమొదట, ఆద్యము - మొట్టమొదటిదైన తారక యోగమును, ఎఱిఁగింతున్ = తెల్పెదను, నీవు, అవధరింపుము = వినుము.

తా. పైన వర్ణింపఁబడిన మూఁడింటిలోఁ దారకయోగమువలనఁ జి త్తశుద్ధి కలు గును, సాంఖ్యయోగమువలన నాత్మతత్త్వము తేటపడును. అమనస్కయోగమువలన నపరోక్షానుభవము కలుగును. అన్నిటికంటే మొదటఁ జిత్తశుద్ధి కావలయును గావున దానికి సాధన మగుతారకయోగమును మొట్టమొదట వివరించుచున్నాను.

అవ. తారకయోగ మునం దభిరుచిఁ గలిగించుటకై యర్థవాదము నుపక్రమించు నున్నాఁడు.

ఉ. తారక ముద్భవాంబునిధి తారక మంబుజ సంభవాదిబృం
    దారకసన్నుతం బఘనిదారక మంచితరాగరోషసం
    హారకముం బ్రధానపరిహారక మాత్మసుఖానుభూతివి
    స్తారక మాగమాంతనుపచారకమై తనరారు మారుతీ. 91

టీక. మారుతీ = ఆంజనేయా: తారకము = తారకయోగము, ఉద్భ... మును - ఉద్భవము = జన్మమనియెడు, (లేక, సంసార మనియెడు,) అంబునిధి = సముద్రమును, తారము = తరింపఁజేయునది, అంబు ...బును - అంబుజసంభవాది = బ్రహ్మ మొదలగు, బృందారక = దేవతలచేత, సన్నుతంబు = స్తోత్రము చేయఁబడునది. అఘ... మును - అఘ = పాప

మును, విదారకమును = ధ్వంపము చేయునది, అంచిత... మును - అంచిత = ఒప్పుచున్న, రాగ= కామమును, రోష = ద్వేషమును, సంహారకమును = పోఁగొట్టునది, ప్రధా ....మును- ప్రధాన = మాయను, పరిహారకమును = ధ్వంసముచేయునదియు, ఆత్మ...మును - ఆత్మసుఖ = బ్రహ్మానందముయొక్క, అనుభూతి = అనుభపమును, విస్తారకమును = విస్తరింపఁజేయునది, ఆగ...కమై - ఆగమ = వేదముల యొక్క-, అంతః = కడపటి భాగమగు జ్ఞానకాండమును, (లేక, అచ్చట చెప్పఁబడు బ్రహ్మమును) సువిచారకమై = బాగుగ విచారించునదియై; తనరారున్ = ఒప్పుచుండును.

తా. ఓఆంజనేయా! ఈతారకయోగము సంసారసముద్రమును తరింపఁజేయునది. సకలపాపములను ధ్వంసముఁ జేయునది. బ్రహ్మ విష్ణువు మొదలగు సకలదేవతలచేతను గొనియాడఁ బడునది. అజ్ఞానము హరించి రాగద్వేషముల నడంచి యాత్మజ్ఞానమును విస్తరింపఁ జేయునది. ఆతిసూక్ష్యమగువేదాంతార్థమును కరతలామలకముఁ జేయునది.


తే. తారకయోగము దెలియఁగ, నేరక వేదాంతవాక్యనికురుంబముచే
    నూరక వాదించుచుఁ జెడు, వారికి మోక్షంబు గలదె వాయుకుమారా!8


టీ. వాయుకుమారా = ఆంజనేయా! తారకయోగమున్ = తారకయోగము, తెలియఁగనేరక = తెలిసికొనలేక, వేదాం... ముచేన్ -వేదాంతవాక్య = వేదాంతవాక్యములయొక్క, నికురుంబముచేన్ = సమూహముచేత, ఊరక = నిరర్థకముగా, వాదించుచున్ = వాదముచేయుచు, చెడువారికిన్ = చెడిపోవుచున్నవారికి, మోక్షంబు గలదె = ముక్తి యున్నదా?

తా. ఓవాయుపుత్త్రా! ఇట్లు తారకయోగము మహోపకారముఁ జేయునదియై యుండ దీనిని తెలిసికొని యధ్యసింపలేక ఊరక కొన్నివేదాంతవాక్యముల నేర్చుకొని వాదములఁ జేయుచుండిన మోక్షము దొరకునా ?


తే. రాజయోగంబుఁ బూని నిరంతరంబు
    పట్టుగా నభ్యసింపంగఁ బ్రాలుమాలి
    కొన్ని వేదాంతయుక్తులు గూడఁ బెట్టి
    పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదె?9


టీక, రాజయోగంబు = రాజయోగమును పూని = ఆవలంబించి నిరంతరంబు = ఎల్లప్పుడును, పట్టుగాన్ = ఉత్సాహముతో, అభ్యసింపంగన్ = అలవాటుచేయుటకు ప్రాలుమాలి. కొన్ని వేదాంతయుక్తులు, కూడఁబెట్టి, పలుకనేర్చినన్ = నిరర్థకముగా వాముసేయుటకు, తెలిసినంతమాత్రముననే, బ్రహ్మానుభవము కలదె!

తా. అపరోక్షబ్రహ్మానుభవము (నేనే పరబ్రహ్మ మని యనుభఃపూర్వకముగఁ దెలిసికొనుట.) మోక్షమని చెప్పఁబడును. పూనికతో నీరాజయోగమును అభ్యాసముఁ జేయుటకు ప్రాలుమాలి వేదాంతయుక్తులను మాత్రము కొన్నిటిని గూర్చికొని మాటలాడ నేర్చిన వారికందఱకును బ్రహ్మానుభవము (మోక్షము) కలుఁగునా? ఓపికతో ప్రయత్నించి కార్యమును నిర్వహించినయెడల ఫలము కలుగును గాని మాటలతోఁ గలుగునా? కావున నీతారకయోగమును అవశ్యముగా నభ్యసింపవలయును.

    సీ. దారుణగాఢాంధకారం బడంగునే, వసుధపైఁ గృతదీపవార్తవలన
        నాఁకొన్న మనుజునియాఁకలి దీఱునే, ఘనసరసాన్నవర్ణనమువలన
        నెఱిపేదవానిపేదఱికంబు వోవునే, ద్రవ్యప్రభావకీర్తనమువలన
        రోగపీడితుని బల్ రోగంబు దీఱునే, కలితౌషధప్రసంగంబువలన

    తే. జండిపడి బుద్ధిలో వెలి నిండి మిగుల
       దట్ట మైనట్టియజ్ఞానతమము దెగునె
       తర్కితవిచిత్రశబ్దబోధంబువలన
       ఫలితయోగానుభవదృష్టివలనఁ గాక. 94

టీక. వసుధపైన్ = భూమిమీఁద, కృత.....లనన్ - కృతి = చేయఁబడిన, దీప = దీపములనుగూర్చిన, వార్తలవలనన్ = ప్రసంగమువలన (అనఁగా దీపవృత్తాంతమును చెప్పఁగానే.) దారు...లు - దారుణ = భయంకరమైన, గాఢ = దట్టమైన, అంధకారంబు = చీఁకటి, అడంగునే = పోవునా? ఘను.....లనన్ - ఘన = శ్రేష్ఠమగు, సరస = రుచిగల, అన్న = అన్నమును, వర్ణనమువలనన్ = వర్ణించుటవలన, ఆకొ... కలి - ఆకొన్న = ఆఁకలికొనిన, మనుజుని = మనుష్యుని యొక్క, ఆఁకలి, తీఱునె = పోవునా? ద్రవ్య... లనన్ - ద్రవ్యము = ధనముయొక్క, ప్రభావ=సామర్థ్యమును, కీర్తనమువ లనన్ = చెప్పుటవలన, నెఱి... కంబు - నెఱిపేదవాని = మిక్కిలి బీదయైనవాని, పేదఱికంబు = బీదతనము, పోవునే = పోవునా, కలి...లనన్ - కలిత = ఒప్పుచున్న, ఔషధ = ఔషధములయొక్క, ప్రసంగంబువలనన్ = వృత్తాంతమువలన ( అనఁగా : ఔషధములను గూర్చి మాట్లాడుటచేత) రోగ .. బు - రోగపీడితుని = రోగముచే బాధపడుచున్నవానియొక్క, బలోగ్రంబు = అధిక మైనరోగము, తీఱునే = పోవునా, జండిపడి = మొండియై, బుద్ధి = బుద్ధియందు, లోన్ = లోపలను, వెలిన్ = వెలుపలను, నిండి = మిగులదట్టమై, ఐనట్టి యజ్ఞానతమము = ఐన యజ్ఞాన మనియెడుచీఁకటి, ఫలి... గాక - ఫలిత = ఒప్పుచున్న, యోగ = రాజయోగము యొక్క, అనుభవముయొక్క (లేక, అనుభవ = అనుభవమువలనఁగలిగినదృష్టివలనఁ గాక జ్ఞానమువలనఁదప్ప), తర్కి.. లనన్ - తర్కిత = విచారింపఁబడిన (లేక, వాదింపఁబడిన ), విచిత్ర = నానావిధములగు, శబ్ద = శబ్దములయొక్క, బోధంబువలనన్ = జ్ఞానము వలన (అనఁగా: వేదాంతవాక్యములను విచారించుటవలన), తెగునె = నశించునా! (నశిం పదనుట.)

తా. ఏఫలమైనను కార్యమును నిర్వహించినప్పుడే సిద్ధించును గాని మాటలవలన సిద్ధింపదు. దీపమును వెలిగింపక, “ఈదీపము లిట్టివి ఆదీపమ్ములట్టివి. వాని ప్రకాశము మిగుల నధికమైనది." అని యూరక మాటలు చెప్పుచుండిన చీఁకటి నశించునా? భోజనముఁబెట్టక "ఆ కూరలు మిగుల రుచి గలవి, ఈపిండివంటలు మిగుల మనోహర ములైనవి” అని యాహారపదార్థములను గూర్చి ప్రశంపఁ జేయుచుండిన నాఁకలి తీఱునా? ధనము నొసంగినచో పేదఱికము బోవును గాని అట్లుగాక “ధనమున్న యెడల నెన్నియో మహాకార్యముల సాధింపవచ్చును.” అని ధనముయొక్క మాహా త్మ్యముఁ గొనియాడినమాత్రమున దరిద్రులు ధనవంతులగుదురా? ఔషధములను గూర్చియు వానిశక్తులనుగూర్చియఁ బ్రశంసించిన రోగములు కుదురునా? ఏవియును మాటలవలనఁ గానేరవు. శ్రమ కోర్చి కార్యముల సాధింపపలయును. అనాదినుండియు బుద్ధియందు వ్యాపించి స్థిరమై యే యుపాయముచేతఁ గూడ నశింపని యీయజ్ఞానాం ధకారము గూడ పైఁజెప్పిన మాటలతోఁ దీఱునది కాదు. చిత్ర చిత్రము లగువాద ములతోఁ దీఱునదికాదు. శ్రమ కోర్వవలయును. తారకయోగము నభ్యసింపవల యును. మనసును శబ్దాదివిషయములనుండి మరల్ప వలయును. అపరోక్ష బ్రహ్మజ్ఞాన మును జెందవలయును.

యోగాభ్యాసఫలనిరూపణము

   క. యోగాభ్యాసమువలన స, దాగతిచిత్తేంద్రియములదర్పము లడఁగున్
      రాగద్వేషాదులు చను, బాగుగ నాత్మకు సుఖానుభవముం గలుగున్.

టీ. యోగాభ్యాసమువలనన్ = ఈ రాజయోగము నభ్యసించుటవలన, సదా... ములు - సదాగతి = ప్రాణవాయువు, చిత్త = మనస్సు, ఇంద్రియముల = జ్ఞానేంద్రియకర్మేం ద్రియములయొక్క, దర్పములు = గర్వములు (అనఁగా: విక్షేపమును కలిగించునట్టి స్వభావములు), అడంగున్ = నశించును, రాగ ద్వేషాదులు = కామము క్రోధము మొదలగునవి, చనున్ = పోవును. బాగుగన్ = చక్కఁగా, ఆత్మకున్ = తనకు (లేక జీవునకు), సుఖానుభపమున్ = బ్రహ్మానందానుభవము, కలుగున్

తా. ఈ తారకయోగము నభ్యసించినయెడల మొట్టమొదట ప్రాణవాయువు స్వాధీనమగును. వాయువునకును మనసునకును సంబంధముండుటచేత వాయుజయము తోగూడ మనోజయము కలుగును. ఇంద్రియముల నన్నిటికి మనసే ప్రభువు కావున వెంటనే యింద్రియజయముకూడఁ జేకూరును. ఇట్లన్నియుఁ జయింపఁబడెనేని సంసారమునకు ముఖ్యకారణము లగు కామక్రోధములు నశించి జీవునకు బ్రహ్మానందసుఖ ముకలుగును.

అవ. ఇట్లు తారకయోగమును బ్రశంసించి దానివలనఁ గలుగుఫలమును విస్త రించి చెప్పుచు దానిని వివరింప నుపక్రమించుచున్నాఁడు.

వ. అట్లు గావున యోగాభ్యాసంబు ముముక్షువున కవశ్యకర్తవ్యం బట్ల గుట తత్ప్రకారం బెఱింగించెద సావధానచిత్తుండ వై వినుము. 96

టీ. అట్లు గావునన్ = యోగాభ్యాసము మిగుల నుపయోగకారియగుటచేత, యోగాభ్యాసంబు = రాజయోగాభ్యాసము, ముముక్షువునకున్ = మోక్షేచ్ఛగలవానికి (డు), అవశ్యకర్తవ్యంబు = ముఖ్యముగ చేయవలసినది, అట్లగుటన్ , తత్ప్రకారంబు = ఆరాజయోగాభ్యాసవిధమును (లేక, తారకయోగాభ్యాసవిధమును), ఎఱింగించెదన్ = చెప్పెదను. సావధాన చిత్తుండవై - శ్రద్ధగలవాఁడవై (లేక, ఏకాగ్రచిత్తుఁడవై), వినుము.

తా. ఇట్లు అభివృద్ధికి మిగుల నాధార మగుటచే మోక్షేచ్ఛ గలవారందఱు నీ తారకయోగము నభ్యసించి తీరవలయును. కావున దీనిస్వరూపమును వివరించెద వినుము.

యోగాభ్యాసులకు ముఖ్యము లగునాహారాదినియమములు

అవ. ఈ క్రింది రెండు పద్యములచే యోగాభ్యాసమునకుఁ దగినయధికారుల నిరూపించుచున్నాఁడు.—

చ. వనరుచు నేమియుం దిననివానికి మిక్కిలి వెక్కసంబుగాఁ
    దిని యెగఁబోయువానికిని దీఱనినిద్దుర యెల్లప్రొద్దుఁ బై
    కొనఁ బడియుండువానికిని గొంకక రేపగ లొక్కరీతి మే
    ల్కొని వసియించువానికి నగోచరము ల్వరయోగలక్ష్యముల్. 97

టీ. వర... ములు - వర = శ్రేష్ఠములగు, యోగ = తారకయోగముయొక్క, లక్ష్య ములు = గురులు, నవరుచున్ = కృచ్ఛ్రచాంద్రాయణాదులచే శరీరమును శోషింపఁ జేయుచు, ఏమియుం దిననివానికిన్ = కొంచెమైనను ఆహారమును తీసికొనని వానికి, మిక్కిలి వెక్కసంబుగాన్ = అధికముగా, తిని, ఎగఁబోయువానికిన్ = నిట్టూర్పులు నిగుడ్చువానికిని, తీఱనినిద్దుర = ఎప్పటికిని ముగియని నిదుర, ఎల్లప్రొద్దున్ = అన్ని కాల ములయందును, పైకొనన్ = క్రమ్ముచుండఁగా, పడియుండువానికిన్ = శయనించియుండు వానికిని, కొంకక = సంశయింపక (లేక, అలయక). రేపగ లొక్కరీతిన్ = రాత్రిం బగ లొక్కటే విధముగా, మేల్కొని వసియించువానికిన్ = నిదురింపకయే యుండు వానికిని, అగోచరములు=గోచరములు కానేరవు (ఇట్టివా రాయోగమును సాధింపలే రనుట)·

తా. మితిలేక భోజనము సేయువాఁడును, బొత్తిగ భోజనము సేయక నుపవాసములు చేయువాఁడును, ఎప్పుడు నిదురించుస్వభావముకలవాఁడును, బొత్తిగ నిదురయే లేనివాఁడును ఈయోగము నభ్యసింపనేరరు.

క. యుక్తాహారవిహారుఁడు,
   యుక్తస్వప్నావబోధుఁ డురుకర్మములన్
   యుక్తవిచేష్టుం డగుఘన,
   యుక్తున కగుఁ బరమరాజయోగము సుఖమై.

టీక, యుక్తా.. రుడు యుక్త = మితమును, ఆహార = ఆహారము, విహారుఁడు = సంచారము గలవాఁడును, యుక్త... ధుఁడు-యుక్త = మితమగు, స్వప్న = నిదురయు, అవబోధుఁడు = జాగ్రతయుఁ గలవాఁడును,ఉరు... లన్ -ఉరు = అధికములగు, కర్మ ములన్ = పనులయందు, యుక్తవిచేష్టుడు = మితమగువృత్తిగలవాఁడు (అనఁగా తన పనులనుజేయుటలో మితముగ శ్రమపడువాఁడు), అగుఘనయుక్తునకున్ = అయిన యోగనిష్ఠునకు, పర... గము - పరమ = శ్రేష్ఠనుగు, రాజయోగము. ఈ తారకయోగము (లేక, తారక సాంఖ్యా మనస్కరూపమగు రాజయోగము), సుఖమై=ఆనందరూపమై, అగున్ =సిద్ధించును.

తా. మఱియేమనిన, యోగాభ్యాసము సేయువానికి, ఆహారము, నిదురయు, విహారంబును పరిమితములై యుండవలయాను. అంత యధికములుగాఁ గాని మిగుల స్వల్పములు గాని యుండరాదు. వాఁ డేపనిని జేసినను తగినంత శ్రమను తీసికొనవల యును; గాని అధికముగ నాయాసపడఁగూడదు. ఇట్లని విషయములయందును మితి గలిగి యుండు పురుషునకు యోగము సులభముగ సిద్ధించును.

యోగమఠలక్షణము

అవ. యోగము నాచరించునప్పు డుండవలయునియమముల నీ క్రింది రెండు పద్య ములచేఁ జెప్పుచున్నాఁడు.—


సీ. వితతమై విజనమై విమలమై సుఖమై పొ
            సంగు వివిక్తదేశమ్మునందు
    సమభూమియందు నిశ్చలముగా మిఱ్ఱుప
            ల్లములు గాకుండఁ బేలవము గాఁగ
    వరుసఁ గుశాజినవస్త్రంబు లనువుగా,
            బఱచి యొప్పుగ వానిపైఁ దిరముగ
    బూని పద్మాసనాసీనుఁడై యామీఁదఁ
            గాయమధ్యమమును గళము శిరముఁ

తే. జక్కఁగా నిక్కి దృక్కులు ముక్కు చక్కిఁ
    జిక్కఁ దక్కించి తక్కినదిక్కుఁ గనక
    మిక్కిలి దశేంద్రియంబుల స్రుక్కఁ జేసి
    ఫలితముగ యోగ మభ్యసింపంగ వలయు. {float right|99 }}

టీక. వితతమై=విశాలమై, విజనమై = సందడిలేనిదై, విమలమై పరిశుద్ధమై, సుఖమై...ఈఁగలు దోమలు మొదలగు వాని బాధలేక సౌఖ్యము గలుగునట్లు చేయున దియై, పొసఁగు=ఉన్న, వివిక్త = ఏకాంతమగు, దేశమ్మునందున్ = స్థలమునందు, సమ భూమియందు, నిశ్చలముగాన్ = స్థిరముగా, మిఱ్ఱుపల్లములు గాకుండన్ = ఒక పార్శ్వ మున ఎత్తుగను మఱియొక పార్శ్వమున తగ్గుగ నుండకుండునట్లును, పేలవము గాఁగన్ = మృదువుగానుండునట్లును, వరుసన్ = క్రమముగా, కుశా ... బులు- కుశ = దర్భాసనము, అజిన = కృష్ణాజినము, వస్త్రంబులు = వస్త్రము (వీనిని,) అనువుగాన్ = చక్కఁగా, ఫఱచి, ఒప్పుగన్, వానిపైన్ = ఆ దర్భాసనాదులమీఁద, తిరముగన్ = స్థిరముగా, పూని = యత్నముతో, పద్మా. . . నుఁడై - పద్మాసనా = పద్మాసనమునందు, అసీనుఁడై= కూర్చుండి, ఆమీఁదన్ = తరువాత, కాయమధ్యమము - నడుమును, గళమున్ = కంఠమును, శిరమున్ = తలను, చక్కగా నిక్కి = వక్రత లేకుండ నిక్కి, దృక్కులు= చూపులను, ముక్కుచక్కిన్ = ముక్కు వైపునకు, చిక్కన్ = ప్రసరించునట్లు, తక్కించి = కూర్చి, తక్కినదిక్కుఁ గనక = రెండవవైపునుజూడక, దశేంద్రియంబులున్ = జ్ఞానకర్మేంద్రియములఁ బదింటిని, మిక్కిలి, స్రుక్కఁజేసి = ఆడించి (అనఁగా వానివిషయ ములనుగూర్చి పోనీక నిలిపి), ఫలితముగన్ = సిద్ధి యగునటుల, యోగము = రాజయోగ మును, అభ్యసింపంగవలయున్ = అభ్యాసము చేయవలయును.

తా. విశాలముగాను, నిర్మలముగాను, జలశూన్యముగాను, ఈగలు, దోమలు మొదలగువాని బాధ లేనిదిగాను బ్రకాశించుచుండు రహస్యస్థలము నొకదానిని యోగాభ్యాసస్థలముగా నేర్పఱుచుకొనవలయును. ఆప్రదేశము సమభూమియై యుం డవలయును. అందుఁ గ్రమముగ దర్భాసనకృష్ణాజినవస్త్రముల నొకదానిపై నొక దానిఁ బఱచి యాయాసనమును సమముగ నమరింపవలయును. దానిపైఁ గూర్చుండి యోగాభ్యాసమున కారంభించునప్పుడు నడుము, మెడ, శిరస్సు అను వానిని జక్కగ నిలిపి తనదృష్టులను నాసాగ్రమునందుఁ జేర్చి రెండవవైపునకుఁ జలింపనీక నిలుప వలయును.


మ. యతధీచిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుఁ డై మౌని యై
    హతకామాదివికారుఁ డై గతభయుం డై బ్రహ్మచారివ్రత
    

   స్థితుఁ డై శాంతమనస్కుడై స్వగురుమూర్తి ప్రోక్తలక్ష్యార్థసం
   గతి యామద్వయ మభ్యసింపఁ దగు యోగం బంచితోద్యోగుఁడై. 100
   

టీ. యత .. రుఁడై - యతే = నియమింపఁబడిన, ధీ = బుద్ధి, చిత్త = మనస్సు, మరుత్ = ప్రాణము, దశేంద్రియ = జ్ఞానేంద్రియకర్మేంద్రియములు, తను శరీరము, (వీనియొక్క,) వ్యాపారుఁడై వృత్తులుగలవాఁడై, మౌనియై = మౌనముగలవాఁడై, హత...రుఁడై-హత = పోఁగొట్టబడిన, కామ = కామము, ఆది= మొదలగు, వికా రుఁడై = వికారములుగలవాఁడై (కామక్రోధాదులను జయించి అనుట. ) గతభయుండై = ఆధ్యాత్మికము మొదలగు తాపములవలనఁ గలుగు భయములేనివాఁడై, బ్రహ్మచారి వ్రత స్థితుఁడై = బ్రహ్మచర్యవ్రతమును బూనినవాఁడై, శాంతమనస్కుడై = చిత్తశాంతిగల వాఁడై, స్వగు...గతిన్ , స్వగురుమూర్తి = తనకు గురువగుమహాత్మునిచే, ప్రోక్తం = ఉప దేశింపఁబడిన, లక్ష్య=గుఱియొక్క, అర్థ = విషయముతో (అనఁగా తన గురువు తన్ను ధ్యానింపుమని చెప్పిన విషయముతో) సంగతి = సంబంధము గలుగునట్లుగా, యోగం బు = ఆతారకయోగమును, అంచి ... గుఁడై అంచిత = ఒప్పుచున్న, ఉద్యోగుఁడై = ప్రయ త్నముఁగలవాఁడై యామద్వయము = రెండుజాముల కాలము, ఆభ్యసింపఁదగున్.

తా. ఇట్లు మిగులనియమము గలిగి బుద్ధి, (నిశ్చయించు నంతఃకరణము), చిత్త ము (సంశయించు నంతఃకరణము), ప్రాణవాయువు, దశేంద్రియములు అనువానివృ త్తుల నడంచి దానిమూలమున శరీరచాంచల్యమును నిలిపి మౌనవ్రతమునుబూని కామ క్రోధాదివికారములఁ దొలఁగించి చిత్తశాంతి గల్గి నిర్భయుఁడై బ్రహ్మచర్యమును బూని తనకు గురు వుపదేశించిన లక్ష్యము పైఁ జిత్తమును నిలిపి రెండు జాముల కాలము పూనికతో యోగాభ్యాసము నాచరింపవలయును.

  క. మారుతి యీనియంబులు
     తారకసాంఖ్యామనస్కతత్పరులకు సా
     ధారణము లగుచు వెలయుం
     దారకయోగుల కతిప్రధానము లందున్. 101
 

టీక. మారుతి = ఆంజనేయా' ఈనియమంబులు= పైఁ జెప్పఁబడిన అధికారిదేశము మొదలగునియమములు, తారకసాంఖ్యామనస్కతత్పరులకున్ = తారక, సాంఖ్య, ఆమ నస్కము అనుమూడు విధములగు రాజయోగము నాచరించువారలకుఁ గూడ, సాధా రణములగుచున్ = సమానములై, వెలయున్ = ఒప్పుచున్నవి. (తారక, సాంఖ్యామనస్క ములలో దేని నాచరించినను పైనియమముల నసలంబింపవలసినదే యనుట.) అందులో ఆమూఁడువిధము లగుయోగములు నాచరించువారలలో, తారకయోగులకున్ = తారక యోగము నాచరించువారలకు, అతిప్రధానములు = మిగుల నావశ్యకములు (వా రీనియ మముల తప్పక నవలంబింపవలయు ననుట.)

తా. ఓ ఆంజనేయా! పైనఁ జెప్పియున్న ఆహారదేశకాలాదినియమములు తారక యోగము నభ్యసించువారలకుఁ గాని, సాంఖ్యయోగము నభ్యసించువారలకుఁ గాని, అమనస్కయోగము నభ్యసించువారలకుఁ గాని యావశ్యకములే. ఇతరుల విషయ మెట్లు న్నను తారకయోగము నభ్యసించువారుమాత్రము వీని నవశ్యమాదరింపలయును.

పంచముద్రాలక్షణము.

అవ. ఇట్లు నియమనిభాగమును జెప్పి తారకయోగమును వర్ణించువాఁడై మొట్ట మొదట నాదబిందుకళాసాక్షాత్కారమునకు ననుకూలము లగుటచేత యోగాంగముఖ ములో ప్రధానములని చెప్పఁదగినముద్రల నుద్దేశపూర్వకముగా వివరించుచున్నాఁడు.—

క. వరుసన్ ఖేచరి యన భూ,
   చరియన మధ్యమ యనంగ షణ్ముఖి యనఁగా
   వరశాంభవి యనఁ గల వీ,
   ధరలోపల ముద్ర లైదు తారకమునకున్. 102
  

టీక. ఈధరలోపలన్ = ఈభూమియందు, తారకమునకున్ = తారకయోగమునకు, వరుసన్ = క్రమముగా, ఖేచరియనన్ = ఖేచరియనియు, భూచరియనన్ = భూచరి యనియు, మధ్యమ యనఁగన్ = మధ్యమ యనియు, షణ్ముఖి యనఁగాన్ = షణ్ముఖి యని యు, వరశాంభవి యనన్ - వర = శ్రేష్ఠమగు, శాంభవి యనన్ = శాంభవి యనియు, ముద్రలైదు = అయిదు ముద్రలు (కలవు.) (ఖేచరి మొదలగు నైదింటికిని ముద్రలని పేరు. వీనిలక్షణములు క్రమక్రమముగఁ జెప్పఁబడును.)

తా: తారకయోగ మనఁగా, నాదము బిందువు కళ అను వానిని ప్రత్యక్షముగ ననుభవించి పిదప వానికి లయస్థానమగు పరబ్రహ్మమునం దైక్య మగుటయే. ఈనాద బిందుకళలు సాధారణములైనయింద్రియవ్యాపారమునకు గోచరము లగునవి కావు; కావున వాని ననుభవించుటకై యనుకూలము లగునట్లు యింద్రియమనస్సుల నంతరు ఖములఁజేయుటకు ముద్రయని పేరు ఈముద్ర లైదువిధములు. 1 ఖేచరి, 2. భూచరి, 3 మధ్యమ, 4 షణ్ముఖి, 5 శాంభవి యనునవి.

ఆ. సద్గురూపదేశసరణిచే నీయైదు
    ముద్రలను విశేషముగ నెఱింగి
    యభ్యసింపవలయు నటమీఁదఁ దారకం
    బొందుఁ బ్రణవనాదబిందుకళల. 103
 

టీ, సద్....చేన్ - సత్ = శ్రేష్ఠుఁడగు, గురు = గురువుయొక్క, ఉపదేశసరణిచేన్ = ఉపదేశమార్గముచేత (గురు వుపదేశించినట్లు), ఈయైదుముద్రలన్ = పైఁ జెప్పఁబడిన యయిదుముద్రలను, విశేషముగన్ = చక్కఁగా, ఎఱింగి తెలిసికొని, అభ్యసింపవలయున్ = అభ్యాసము చేయవలయును. అటమీఁదన్ = ఇట్లభ్యాసము చేసిన పిదప, ప్ర ణ...ళలన్ -ప్రణవ = ఓంకారరూపములైన, నాద = దశవిధనాదములయొక్కయు, బిందు = జ్ఞాతసర్వమును తెలిసికొనుచుండు నంతర్యామి), మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము (ఈనాలిగింటికిని అంతఃకరణ మనిపేరు.) వీనియొక్కయు, కళలన్ = సమష్టిజీవుఁడు (సర్వప్రపంచము నభిమానించుచు నవిద్యచే నావరింపఁబడియుండు చైతన్యము.) వ్యష్టిజీవుఁడు (తానున్న యొక్క శరీరమును మాత్రమే యభిమానించుచుండు జీవుఁడు.) వీరి యథార్థస్వరూపములయొక్కయు మూలమున (అనగా ఈనాదబిందుకళలను పరిశోధించుటచేత) తారకంబు = ఓంకారమున కర్ణ మగు శుద్ధపరబ్రహ్మము (లేక, పరబ్రహ్మమును.) పొందున్ = చెందును. (సాధకుఁడే బ్రహ్మమగును, లేక, బ్రహ్మసాక్షాత్కారము గలుగును అనుట.)

తా. గురూపదేశముచే నీ యైదుముద్రలయొక్క స్వరూపమును బాగుగఁ దెలిసి కొని యభ్యసింపవలయును. యోగమున కివియే ముఖ్యాంగములు. ఇట్లు అభ్యాసము చేసినయెడల మొట్టమొదట నాదబిందుకళలు గోచరములగును. వానిని విమర్శింపఁగా విమర్శింపఁగా పరబ్రహ్మము శేషించును. తనకును బ్రహ్మమునకును భేదము లేదను విష యము స్పష్టమగును. శ్రద్ధాయుక్తుఁడై యీ ముద్రలలో నొక్కదాని నభ్యసించినను ఈఫలము కలుగుటలో సంశయము లేదు.

వ. అది యెట్లంటేని. 104

టీక. అదియెట్లంటేని= ఆ బ్రహ్మప్రాప్తి యెట్లు కలుగు ననఁగా.

ఆ. కనులు మూసియైనఁ గనువిచ్చి యైన భ్రూ
     మధ్యమమునఁ జూపు మలఁచి నిలిపి
     యూర్ధ్వముఖము గాఁగ నొనరఁ జూచిన నది
     ఖేచరి యనుముద్ర కీశవర్య.105

టీ. కీశవర్య= వానర శ్రేష్టుఁడ వగునోయాంజనేయా! కనులు మూసి యైనన్, కను విచ్చియైనన్ = బాగుగ కనులఁ దెఱచి కాని, భ్రూమధ్యమమునన్ = కనుబొమల నడిమి భాగమునందు, చూపున్ = దృష్టిని, మలఁచి = మరలించి (సామాన్యముగ నన్ని వైపులకును ప్రసరించుదృష్టినిభ్రూ మధ్య వైపునకుఁ ద్రిప్పి), నిలిపి = స్థిరముఁజేసి, ఊర్ధ్వ ముఖముగన్ =పైఁగా, ఒనరన్ = లెస్సగా, చూచినన్ = చూచినట్టయిన, అది = ఆ చూపు, ఖేచరియను ముద్ర = ఖేచరి ముద్ర (అగున్ ).

తా. కనులను సంపూర్ణముగా మూసికొని కాని బాగుగఁ దెఱచికొని కాని బొమల నడిమిభాగమున దృష్టి నిలిపి పైభాగమునకుఁ జూచుట ఖేచరీముద్ర యని చెప్పఁ బడును. దృష్టి భ్రూమధ్యమునకుఁ బ్రసరించుటయే కష్టము. కనులు తెఱచియున్నప్పు డొకవేళ ప్రసరించినను ప్రసరింపవచ్చునుగానీ, మూసియున్నప్పు డెట్లు ప్రవరించును? అని సంశయించెదవేమో! బాహ్యదృష్టి విషయమున నిట్టిసంశయము కలుగవచ్చును కాని యంతర్దృష్టి విషయమునఁ గాచు. కనులు మూసి భ్రూమధ్యము జూచుట యనఁగా చూచుచున్నామని సంకల్పించుటయే కాని మఱి యేమియు కాదని తెలిసి కొనవలయును.

  క. లోచనములు గదలింపక,
     యాచార్యోక్తస్వనాసికాగ్రం బెపుడున్
     గోచరముగఁ జూచిన నది,
     భూచరి యనుముద్ర యగును బోధశరణ్యా. 106

టీక. బోధశరణ్యా–బోధ = జ్ఞానమే, శరణ్యా= రక్షకముగాఁ గలయోయాంజ నేయా! (బ్రహ్మజ్ఞానమును గోరుచున్న హనుమంతుఁడా) లోచనములు = కన్నులను, కద లింపక = చలింపఁజేయక (రెప్ప లార్పక దృష్టినిఁ జెదరనీక), ఆచా... గ్రంబున్ - ఆచార్యోక్త = గురువుచే నుపదేశింపఁబడిన, స్వనాసికాగ్రంబుతో = తనముక్కు కొనను, ఎపుడున్ = యోగాభ్యాసము చేయనంత కాలము, గోచరముగన్ = కనఁబడునట్లుగా, చూచినన్ = చూచినట్లయిన, అది = ఆ చూపు, భూచరియను ముద్ర = భూచరియనెడుము ద్ర (అగున్.)

తా. ఓవివేకవంతుఁడా! కనులు కదలనిక ముక్కు కొనపై దృష్టిని నిలిపి చూచు నట్టిముద్రకు భూచరిముద్ర యని పేరు.

  ఆ. కనులు సగము మూసి ఘననాసికామధ్య
      మయందుఁ జూపుఁ జెదరనీక
      నిలిపి మీఁద మున్న నిటలంబు గాంచిన
      మధ్యలక్ష్య మగుఁ గుమారతిలక! 107

టీక. కుమారతిలక = పుత్ర రత్నమా! (సీతాదేవిచే హనుమంతుఁడు పుత్రుని వలెఁ బ్రేమించఁబడుచుండుఁ గావున నిట్లు సంబోధింపఁబడియెను) కనులు సగముమూసి = కన్నులను సగభాగము మూసి సగము తెఱచి, ఘన... దున్ - ఘన = గొప్పదియగు, నాసికా = ముక్కు యొక్క, మధ్యసీమయందున్ = నడుమ , చూపున్ = దృష్టిని, చెదర నీక = నిలిపి, మీఁదనున్న = పైభాగమునందున్న, నిటలంబున్ = భ్రూమధ్యమును, కాం చినన్ = చూచినట్లయిన, మధ్యలక్ష్యమగున్ = మధ్యమాముద్ర యగును.

తా. ఓ పుత్రరత్నమా! ఆ కనులకు సగము మూసి సగము తెఱచి ముక్కుయొక్క నడిమిభాగమునందు దృష్టిని నిలుపవలయును. అచ్చటనుండి పైభాగముననున్న

భ్రూమధ్యమును గాంచవలయును. ఇట్లు చూచుటకు మధ్యమాముద్ర యని పేరు.


   తే. కర్ణలోచననాసాయుగంబు మూసి
      మలఁచి భ్రూమధ్యమమునఁ జూపులను మనము
      నిలిపి వరనాదబిందుచిత్కళలఁ గనుట
      షణ్ముఖీముద్ర యండ్రు సజ్జనులు వత్స! 108
 

టీక. వత్స = కుమారా సజ్జనులు = సత్పురుషులు, కర్ణ.. .. గంబున్ - కర్ణ = చెవుల యొక్కయు , లోచన = నేత్రములయొక్కయు, నాసా = ముక్కులయొక్కయు, యుగం బున్ = జత లను, మూసి , మలఁచి = త్రిప్పి, భ్రూమధ్యమునన్ = కనుబొమలనడుమ, చూపులను = దృష్టులను, మనము = మనస్సును, నిలిపి, వరనాదబిందుచిత్కళలన్ = శ్రేష్ఠములగు నాదబిందుకళల, కనుట = చూచుట, షణ్ముఖీముద్ర యండ్రు= షణ్ముఖీ ముద్ర యని చెప్పుదురు.

తా. పుత్రకా! చెవులను గన్నులను ముక్కులను మూసి దృష్టిని మనసుతోఁ గూడ భ్రూమధ్యమునందు స్థిరముగ నిలిపి నాదబిందుకళల ననుభవించుటకు షణ్ముఖీ ముద్రయని పేరు. ఈముద్రయందే కాదు. అన్ని ముద్రలయందును గూడ దృష్టి యేయేస్థలమునం దుండునో మనసుకూడ నాయాస్థలమునందే యుండవలయు ననుట నియమము.


   క. అంతర్లక్ష్యము బహిర,
      త్యంత వినిశ్చలసుదృష్టి యపగతపవన
      స్వాంతవికారము గలయది,
      వింత యగుచు నొప్పు శాంభవీముద్ర యనన్. 109

టీక. అంతర్లక్ష్యము-అంతః = లోపల, లక్ష్యము = గుఱియు (అనగా: కనులు సంపూర్ణముగ మూసి మనసును, చూపును, నాదబిందుకళలయం దుంచుట, మనసుభా వించు చున్న లక్ష్యమునందే చూపుకూడ నున్నట్లు తలంచుట, అనఁగా తానాలక్ష్యమును చూచుచున్నట్లు తలంచుట.) బహి... దృష్టి- బహిః = వెలుపల, అత్యంత = మిగుల, విని శ్చల = చలింపని , సుదృష్టి = చక్కనిరూపును(బాహ్యమునం దున్న పదార్థములలో నేది యో యొకదానిని రెప్పవేయక చూరుచు మనసును కూడ నచ్చటనే నిలుపుట. (ఇది వెలిచూ పనఁబడును. ఇంతకుముందు వివరింపఁబడి యున్నది లోచూపు] అప.. రము... అపగత= నశించిన, పవన = ప్రాణవాయువుయొక్కయు, స్వాంత = మనస్సుయొక్కయు, వికారము = వికారములను (నిశ్చలమగు ప్రాణవాయువు నిశ్చల మగుమనస్సు,) కలయది

= కలిగి యుండునది (లో చూపుగాని వెలి చూపు గాని స్వరూపముగాఁ గలిగి వాయు

వికారములను వానితోఁ గూడ చిత్తవికారములను ధ్వంసము చేయునది.) వింతయగు చున్ = ఆశ్ఛర్యకరమైనదగుచు, శాంభవీముద్రయనన్ = శాంభవీముద్ర యను పేర, ఒప్పున్ = ప్రకాశించును.


తా. ఒకపదార్థమునందు దృష్టినిలుపుట యనునియమము లేక కేవలము వెలుపలికి గాని లోపలికిఁ గాని చూచుచు (వెలుపలికి చూచుట యనఁగా కనులు తెఱచి చూ చుట, లోపలికి చూచుట యనఁగా కనులు మూసి చూచుట. మూసి చూచుట యనుట కర్థము నిదివఱకే వివరించియున్నాము.) మనసును స్థిరము చేసి ప్రాణాయామాభ్యా సమువలన వాయువును బంధించి నాదబిందుకళల ననుభవింపవలయును. ఇట్టిచూపులకు శాంభవీముద్ర యని పేరు, వాయునిరోధము కూడ నీశాంభవీముద్రయందు మాత్రమే కాక నన్నిముద్రలయందు నావశ్యకమే యని తెలిసికొనవలయును.

సూర్యచంద్రమండలకళానిర్ణయము

అవ. ఇట్లు పంచముద్రలయొక్క స్వరూపమును వివరించి యిదివఱకు సంక్షేపముగాఁ జెప్పఁబడియున్న ముద్రాభ్యాసఫలమును వివరించుచున్నాఁడు.—

  మ.అమరేంద్రార్చితపూర్వవర్ణితనితాంతాంతర్బహిర్మధ్యల
     క్ష్యము లుద్యద్వరమండలత్రయకళాసందర్శనాభ్యాసయో
     గము లీ రెండును నాదబిందురుచిసాక్షాత్కారసద్ధేతుభూ
     తములై యొప్పు నిరంతరం బలఘుతన్ ధ్యానంబు గావించినన్. 110
     

టీక. అమరేంద్రార్చితే... లక్ష్యములు - దేవేంద్రునిచేఁ బూజింపఁబడునట్టియు, పూర్వ= ఇంతకుముందు, వర్ణిత = వర్ణింపబడిన, నితాంత = అధికములైన, అంతః = లో చూపు, బహిః = వెలి చూపు, మధ్యలక్ష్యములు = నడిమిచూపు, ఈయవియు (ఆంత ర్బహిర్మధ్యలక్ష్యరూపము లైన పంచముద్రలును.) ఉద్య... ములు ఉద్యత్ = ప్రకా శించుచున్న, వర = శ్రేష్ఠములైన, మండలత్రయ = సూర్యచంద్రాగ్నిమండలములయొక్క, కళ = చిత్కళలను, (ఈచిత్కళలు 38 . శ్లో. "ధూమ్రార్చి రుష్ణా జ్వాలినీ విస్ఫులిం గినీ, సుశ్రీస్వరూపా కపిలా హవ్యకవ్యపహా దశ" ఇవి పదియు నగ్నికళలు. “శ్లో. తపినీ తాపిని ధూమ్రా మరీచి ర్జ్వాలిని రుచిః, సుషుమ్నా భోగదా విశ్వా బోధినీ ధారుణీ క్షమా” ఇవి 12 ను సూర్యకళలు, శ్లో. “అమృతా మానదా పూషా తుష్టిః పుష్టీ రతి ర్ధృతిః, శశీనీ చంద్రికా కాంతి ర్జ్యోత్స్నా శ్రీః ప్రీతి రంగదా, పూర్ణా పూర్ణామృతా కామదాయిన్యః స్స్వరజాః కలాః” ఈ 16 చంద్రకళలు. వీని లక్షణములను త్రిపురార్ణవాది గ్రంథములలో చూచుకొనవలయును.) సందర్భన = చూచుటకు కారణములైన, అభ్యాసయోగములు = ఇంతకుముందు వివరింపఁబడియున్న యమనియమాదులును, ఈ రెండును = ముద్రలు యమనియమాదులు నను నీ రెంటిని, నిరంతరంబు = సర్వకాలము, అలఘుతన్ = అధికముగా, ధ్యానంబు గావించినన్ = ధ్యానించినట్లయిన (అనఁగా అభ్యసించిన), నాద .....ములై - నాద = దశవిధనాదముల యొక్కయు, బిందు = అంతఃకరణము యొక్కయు, రుచి = అంతఃకరణమునుండి ప్రతిఫలించి యున్నయాత్మచైతన్యముయొక్కయు, సాక్షాత్కార = చూపునకు (వానిని బ్రత్యక్షముఁ జేసికొనుటకు), సత్ = చక్కని, హేతుభూతములై = కారణము లై, ఒప్పున్, ప్రకాశించును.

తా. దేవతలచేతఁ గూడ వినుతింపఁ దగిన యోయాంజనేయా, పైవివరింపఁబడిన ముద్రలలో ఖేచరి, శాంభవి, షణ్ముఖి అనునవి అంతర్లక్ష్యము (లోపలిచూపు) కలవి. భూచరియును శాంభవియును బహిర్లక్ష్యములు (వెలుపలిచూపు కలవి.) మధ్యమ మధ్య లక్ష్యము. (మధ్యలక్ష్య మనఁగా: సంపూర్ణ మగువెలిచూపు గాక సంపూర్ణ మగు లోచూపు గాక నుండుమధ్యస్థమైన చూపు కలది.) ఇంతకుఁ బూర్వమే నివరింపఁబడి యున్న యమనియమాదులు మనసును పరిశుద్ధము చేయఁగలిగినవి. మనసు పరిశుద్ధ మైననే కాని స్థిరమై సూర్యచంద్ర అగ్నిమండలములయందలి ముప్పదియెనిమిదిచిత్క ళలను జూడనేరదు. కావున మనశ్శుద్ధికై ప్రయత్నించు తారకయోగికి సూక్ష్మపదార్థ ములఁ జూచుటకై ముద్ర లెట్లావశ్యకములో అట్లే సూక్ష్మపదార్థములఁ జూచు నప్పుడు మనస్సును నిశ్చలముగఁ జేయుటకై యమనియమాదిరూప మగునభ్యాసయో గము కూడ ముఖ్యమే. ఈ రెంటిని శ్రద్ధాయుక్తుఁడై యలవాటు చేసినయెడల శీఘ్ర కాలమున నాదబిందుకళాసాక్షాత్కారము కలుగును.

  ఆ. నాదబిందుకళల నయ మొప్పఁ జూచుచు
      ఇంద్రియములు మనము నివుఱఁ జేసి
      సత్కవీశ్వరుండు స్వప్రకాశాత్మ చి
      త్సుఖముఁ గాంచుఁ బరమసులభముగను. 111

టీ. సత్క...రుండు- సత్ = శ్రేష్ఠుఁడైన, కవీశ్వరుండు = విద్వాంసుఁడు (జ్ఞాని), ఇంద్రియములన్ = దశేంద్రియములను, మనమున్ = మనస్సును, ఇవుఱఁ జేసి = నిశ్చల ములుగఁ జేసి, నాదబిందుకళలన్ = నాదబిందుకళలను, నయమొప్పన్ = బాగుగ, చూ చుచున్ , స్వప్ర....మున్ - స్వప్రకాశ = స్వయంప్రకాశుఁడైన, ఆత్మ = జీవుని యొక్క, చిత్సుఖమున్ = బ్రహ్మానందమును ( జీవబ్రహ్మము లొక్కటియే యని తెలుసు కొనుటవలనఁ గలుగు నానందము.) పరమసులభముగన్ = మిగుల సులభముగా, కాం చున్ = చూచును.

తా. ఇట్లు నాదబిందుకళాసాక్షాత్కారము కలుఁగఁగానే మనసు అచ్చటి చిత్రములఁ జూచుచు, చూచుచు నితరవ్యాపారములు మాని యందే లీనమైపోవును. సాధకుఁడగుజీవుఁడు వాస్తవముగ పరబ్రహ్మమునకంటె వేఱు కాకపోవుటచేతను అజ్ఞా నముచే నావరింపఁబడియున్న మనస్సొక్కటియే భేదభ్రాంతికిఁ గారణ మగుటచేతను

(ఆయోగి) అప్రయత్నముగనే పరబ్రహ్మమునందు లీనుఁ డగును.


    చ. లలితనినాదబిందుకళలన్ గుఱిఁ జేసిన మానసేంద్రియం
        బులు వెలిలోపలం దిరుగఁబోవక వానిని జూచుచుండ ని
        శ్చల మగు దేహ మయ్యెడ విచారముచేఁ బరమాత్మతత్త్వమున్
        సులభముగా నెఱుంగఁబడు సుమ్మిది చక్కనిత్రోవ యారయన్.112
 

టీ. లలిత . . . ళన్ - లలిత = ఒప్పుచున్న, నినాద = దశవిధప్రణవనాదములను, బిందు = అంతఃకరణమును, కళలన్ = చిత్కళలను, గుఱిఁజేసినన్ = లక్ష్యములుగాఁ జేసినచో (ముద్ర లసహాయమున ఆ నాదబిందుకళలనే చూచుచుండినచో), మాన... బులు - మానస = మనస్సు, ఇంద్రియంబులు = దశేంద్రియములు, వెలిలోపలన్ =వెలు పలికిఁగాని లోపలికిఁగాని, తిరుగఁబోవక = సంచారముచేయఁబోక (బ్రాహ్యము లగు శబ్దాదులను గాని, అంతరములగు ప్రాణాదులను గాని చూడక), వానిని = ఆనాదబిందు కళలనే, చూచుచుండన్ = చూచుచునుండఁగా, అయ్యెడన్ = ఆసమయమున, దేహము, నిశ్చలమగున్ = చలింపనేరదు. విచారముచేన్ = బాగుగ విచారించి, పరమాత్మతత్త్వ మున్ = పరమాత్మయొక్క యథార్థస్వరూపము, సులభముగాన్ , ఎఱుఁగఁబడుసుమ్ము = తెలిసికొనఁబడును సుమా, ఆరయన్ = విచారింపఁగా, ఇది = ఈ వర్ణింపఁబడినది, చక్కనిత్రోవ = మంచిమార్గము.

తా. నాదబిందుకళలను గుఱిఁజేసి చూచినయెడల మనసు గాని యింద్రియ ములుగాని లోపలకు వెలుపలను సంచరింపక నానాదబిందుకళలనే చూచుచు నిలిచి యుండును. అప్పుడు శరీర మించుకయైనను చలింపదు. బాహ్యము లగుశీతోష్ణాదుల వలనఁ గలుగు దుఃఖములు గాని అంతరము లగుమనోవ్యాధులు మొదలగు వానివలనఁ గలుగు దుఃఖములు గాని ఆయోగిని బాధింపనేరవు. కావున మనస్సు నీవిధముగా నిశ్చలము చేసి శాస్త్రసహాయము చేతను గురూపదేశముచేతను స్వబుద్ధిచేతను పరమాత్మ స్వరూపమును గూర్చి విచారించినయెడల నది స్పష్టమగును. జీవబ్రహ్మము లొక్కటియే యనువిషయము అనుభవపూర్వకముగ గోచర మగును. ముక్తి కలుగును. కావున నీరాజ యోగమునకంటే చక్కనిముక్తిమార్గము మరేమియును లేదు.

అవ. అట్లు ఫలములతోఁగూడ యోగాభ్యాసప్రకారమును నిరూపించి దాని యం దభిరుచి కలిగించుటకై యర్థవాదము నుపక్రమించుచున్నాఁడు —


   ఆ. నాదబిందుకళల నాచరింపని యోగి
       యింద్రియములు మనము నిట్టునట్టుఁ
      బరువు లిడఁగ వానిఁ బట్టఁజాలక కుందు
       నిట్టివాఁడు పరము నెట్టు గాంచు? 113

టీక. నాదబిందుకళలన్ = నాదబిందుకళలను, ఆదరించనియోగి = అంగీకరింప కుండుయోగి (అనఁగా: వాని నాభ్యాసము చేయనివాఁడు), ఇంద్రియములు, మనమున్ , ఇట్టు నట్టు పరువు లిడఁగన్ = ఇటునటు పరుగులెత్తుచుండ, వానిన్ = ఆఇంద్రియమన స్సులను, పట్టఁజాలక = నిలిపికొననేరక, కుందున్ = ఆయాసపడుచుండును. ఇట్టివాఁడు, పరమున్ = పరబ్రహ్మమును, ఎట్టు గాంచున్ = ఎట్లు చూడఁగలఁడు.

తా. ఇట్లు మహోపకారములగు నాదబిందుకళల నాశ్రయింపకుండినవాఁడు ఇంద్రియములను మనసును నిగ్రహింపఁజాలఁడు. అవి బాహ్యములైన శబ్దాదివిష యములఁ గూర్చి పరుగులిడుచుండఁ బట్టుకొననేరఁడు. ఇట్లు చిత్తశాంతియే లేని వాఁడు అతిసూక్ష్మమగు పరమాత్మతత్వమును గూర్చి విచారించుటయు దానిని గ్రహిం చుటయు అనుభవించుటయు నెట్లు సంభవించును? ఎట్లు చూచినను వాఁడు నిరర్ధ కుడు కావలసినదియే.

సీ. గాలంబు లేనిచో జాలకాగ్రణిచేతఁ
              బాఠీనజాలముల్ పట్టుపడునె?
       సరియురి లేనిచో శకునాంతకుని చేతఁ
              జొక్కంపుఁబక్షులు చిక్కువడునె?
       యోగంబు లేనిచో నొగి మావటీనిచే
              గజరాజములు నరికట్టువడునె?
       తగుకోల లేనిచో మృగయావినోదిచే
              ఘోరమృగంబులు కొట్టువడునె?
              
    తే. రాజితానందతారకరాజయోగ
        పావనసమాధి లేనిచోఁ బరమశుష్క
        తర్కవేదాంతవాదతత్పరులచేత
        నింద్రియమనంబులు వినిగ్రహింపబడునె? 114

టీ. జాల . . . చేతన్ -జాలక = వలవేయువారిలో, అగ్రణిచేతన్ = శ్రేష్ఠుఁడగు వానిచేత (వలవేయటలోఁ బురుషున కొంత నేర్పున్నను అనుట), గాలంబులేనిచోన్ = గాలము లేకపోయినయెడల, పాఠీవజాలములు = మత్స్యసమూహములు, పట్టు వడునె = చిక్కునా?, సరియురి లేనిచోన్ = తగిన ఉచ్చులేనియెడల, చొక్కంపుపక్షు లు = అందమైనపక్షులు, శకునాంతకునిచేతన్ = పక్షుల వేఁటాడువానిచే, చిక్కువడునె = పట్టుఁకొనఁబడునా!, మావటీనిచేన్ = మావటివానిచేత, ఓదంబు = అంకుశము, లేనిచోన్ = లేకుండినయెడల, ఒగిన్ = బాగుగ, గజరాజములు = ఏనుఁగులు, అరికట్టు వడునె = నిర్బంధింపఁబడునా? మృగయావినోదిచేన్ = వేఁటయం దాసక్తి గలవానిచే </poem> తగుకోలలేనిచోన్ = తగిన బాణము లేకుండినయెడల, ఘోరమృగంబులు = భయంకరము లగుమృగములు, కొట్టువడునె = సంహరింపఁబడునా? రాజి...సమాధి - రాజిత = ప్రకాశించుచున్న, ఆనంద = ఆనందరూపమైన, తారక = తారక మను పేరుగల, రాజ = శ్రేష్ఠమైన, యోగ = యోగము యొక్క; పాపన = పరిశుద్ధమైన, సమాధి = నిష్ఠ, లేని చోన్ = లేకపోయినయెడల, పర.. చేతన్ - పరమ = మిగుల, శుష్క = నిరర్థకము లైన (లేక, నిస్సారములైన), తర్క = తర్కశాస్త్రసంబంధ మైనట్టియు, వేదాంత శాస్త్ర = వేదాంతశాస్త్ర సంబంధమైనట్టియు, వాద = వాదములయందే, తత్పరుల చేతన్ = ఆసక్తిగలవారిచేత, ఇంద్రియమనంబులు, విని గ్రహింపఁబడునె = లోఁబఱుచు కొనఁబడునా ?

తా. ఇంద్రియములను మనసును నిగ్రహించుటకు నీరాజయోగము తప్ప వేఱొక యుపాయమే లేదు. ఎన్ని వేదాంతయుక్తులను సంపాదించిన నెన్నివాద ములఁ జేసినను ప్రయోజనము లేదు. తారకయోగమునే యాశ్రయించి తీరవలయును. అనాదినుండియు బహువిధములగు వాసనలచే నాక్రమింపఁబడియున్న చిత్తము మాట లతో స్వాధీనమగునా? చేపలఁ బట్టఁబోయినవాఁడు చక్కని గాలమును సంపాదించి జలమున వైవకున్న నామత్స్యములు చిక్కునా? దృఢమైనయురిని సంపాదింపక బోయ వాఁడు పక్షులఁ జక్కించుకొనఁగలుఁగునా? మావటివానియొద్ద వాఁడియగునంకుశము లేనియెడల మదగజంబులు మాటలచే స్వాధీనము లగునా? కానేరవు గదా. ఇట్లే యింద్రియములును మనసును గూడ నాదబిందుకళల నాశ్రయింపనివానికి స్వాధీన ములు కానేరవు.

   క. జన మంజనంబుఁ గైకొని
      ఘన మగుధనమును నెఱుంగుకైవడిని నిరం
      జనతారకయోగముఁ జే
      కొని పరతత్వమును దెలియ గుఱిపడునంతన్. 115

టీక - జనము = మనుష్యులు, అంజనంబున్ = కాటుకను, కైకొని = తీసికొని, ఘన మగు = అధికమగు, ధనము = ద్రవ్యమును, ఎఱుఁగుకైవడిన్ = తెలిసికొనునట్లు, నిరంజ నతా ... మున్ - నిరంజన = రెండవదానితోఁ బనిలేక స్వయముగనే బ్రహ్మసాక్షాత్కా రమును గలిగింపఁజాలు, తారకయోగమున్ = తారకయోగమును (లేక, జ్ఞానయోగము ను), చేకొని = స్వీకరించి, అంతన్ = పిమ్మట, పరతత్వము = పరబ్రహ్మముయొక్క యదార్థస్వరూపమును, తెలియన్ = తెలిసికొనుటకు, గుఱిపడున్ = ఇంద్రియమనంబు లు నిశ్చలము లగును. (జ్ఞానయోగప్రభావమువలన నింద్రియములును మనస్సును గుదిరి, పురుషునకు బ్రహ్మము నెఱుంగఁగల సామర్థ్యము గలుగఁజేయునని భావము. మోక్ష మునకు జ్ఞానమే ప్రధానసాధనము, శ్లో. "బోధోఽన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షై కసాధనం, పాకస్య వహ్ని సద్జ్ఞానం వినా మోక్షో న సిధ్యతి.” “కర్మ మొదలగు నితరసాధనములు జ్ఞానమును కలిగించునే కాని మోక్షము నియ్యవు. మోక్షమునకుఁ ప్రత్యక్షసాధనము జ్ఞానమే. వీని కన్నిటికంటే నగ్నియే ప్రధాన మైనట్లు మోక్షము న కీజ్ఞానమే ప్రధానము" ఆని యాత్మబోధ.)

తా. లోకమున భూమిలో నిక్షేపింపఁబడినధనమును తెలిసికొనఁగోరువారు దానికి సాధన మగుధనాంజనమును సంపాదించునట్లు పరమాత్ముని యథార్థస్వరూప మను ఎఱుంగఁగోరువారు తారకయోగాభ్యాసమును దప్పక చేయవలయును. అట్లు చేసినయెడలఁ బరమాత్తుని యథార్థరూపమును (అనఁగా: నాయనకును తనకును భేదము లే దనువిషయమును) సులభముగఁ దెలిసికొనవచ్చును.


   తే. పలలమును జూపి డేగను బట్టురీతి
       నమృతసమనాదబిందుకళానుభూతి
       సుఖము నొందించి మఱిగించి చొక్కఁజేసి
       యింద్రియమనంబుల వినిగ్రహింపవచ్చు.116

టీక . పలలమున్ = మాంసమును, చూపి, డేగను, పట్టురీతిన్ = పట్టుకొనునట్లు, అమృ. . .ఖమున్ - ఆమృతసమ = అమృతముతో సమాన మగు, నాదబిందుకళ = నాద బిందుకళలయొక్క, అనుభూతి = అనుభవ మనియెడు, సుఖము = సుఖమును, ఒందించి = పొందించి, మఱిగించి = ఆసుఖమునం దాసక్తి కలిగించి, చొక్కఁజేసి = పరవశము లగునట్లు చేసి, ఇంద్రియమనంబులన్ , వినిగ్రహింపవచ్చు = జయింపవచ్చును.

తా. మాంసమును జూపి దానిపై నాసచే వచ్చిన డేగను ఎంత సులభముగాఁ బట్టు కొనవచ్చునో ఈనాదబిందుకళలు జూపి కూడ యింద్రియములను మనసును అంతసుల భముగా నిగ్రహింపవచ్చును. ఈ నాదబిందుకళలు అమృతసమానములు. అమృతమును బానముఁ జేయువాని కెంతకాలమునకైన నెట్లు తృప్తి కలుగదో అట్లే నాదముల విను నప్పుడుకాని బిందుకళలను చూచునప్పుడుకాని మనసునకుఁ దృప్తి జనింపదు. కావున, నామనసునకు వానినిఁ జూపి యందు రుచిని కలిగించినయెడల నది (మనస్సు) యచ్చట నుండి చలింపక తన్మయ మగును. కొంతకాలమునకు శూన్యమైకూడ పోవును. ఆమన సుతోకూడ యింద్రియములును తన్మయత్వమును చెంది శూన్యములగును. ఇంతకంటే చక్కనిమనోనిగ్రహోపాయ మేదికలదు.


    ఆ. వేద మట్లు గాప నాదబిందుకళాను
        భవముఁ దెలిపె మొదలఁ బండితులకు
        


     దత్ప్రకార మెల్లఁ దగ నెఱిఁగించెద
     విస్తరించి తెలియ వినుము వత్స!117

టీక. వత్స=బాలుఁడా! వేదము, మొదలన్ = మొట్టమొదట, పండితులకున్ = జ్ఞానులగువారికి (లేక, మోక్షేచ్ఛ గలవారికి), నాదబిందుకళానుభవమున్ = నాదబిందు కళలయొక్క యనుభవము, తెలిపెన్ = చెప్పెను, కానన్ = అట్లగుటచేత, అట్లు = వేదో క్తప్రకారముగా, తత్ప్రకారమెల్లన్ = ఆనాదబిందుకళలవిధము నంతయును, తగన్ = ఒప్పునట్లుగా, విస్తరించి = వివరించి, ఎఱిఁగించెదన్ = తెలియఁజేసెదను. తెలియవినుము = చక్కఁగ విని గ్రహింపుము.

తా. ఈ కారణమువలన మోక్షేచ్ఛగలవారు మొట్టమొదట నాదబిందుకళల నభ్యసింపవలయు నని వేదము చెప్పుచున్నది. కావున యానాదబిందుకళల నీ క్రింద వివరించెదను వినుము.


తే. సద్గురుప్రోక్తముద్రచే శ్రవణయుగము
    మూసి యాలింపఁ బ్రణవంబు మ్రోయు మొదలఁ
    జిణి యనుచు నంతటను జిణిచిణి యటంచు
    మించి రెండవమాఱు ఘోషించు ననఘ! 118
 

టీక. అనఘ = పాపరహితుండవగు నోయాంజనేయా! సద్గురువుప్రోక్తముద్ర చేన్ = గురు వుపదేశించినముద్ర నాశ్రయించి, శ్రవణయుగమున్ = రెండు చెవులను, మూసి, ఆలింపన్ = వినఁగా, మొదలన్ = మొట్టమొదట, ప్రణవంబు= ఓంకారము, చిణి యనుచున్ = చిణి యనుచు, మ్రోయున్ = ధ్వనించును. అంతటన్ = పిదప, మించి = అధికముగ, రెండవమాఱు, చిణిచిణి యటంచున్ = చిణిచిణి యనుచు (చిరిగజ్జెల మ్రోతవలె), ఘోషించున్ = ధ్వనించును.

తా. గురు వుపదేశించినమార్గము ననుసరించి చెవులు మూసి వినినచో నోంకార నాదము ‘చిణి' యని యొకమాఱును 'చిణి, చిణి' యని చిరుగజ్జల మ్రోఁతవలె మఱి యొకమాఱును మ్రోగును. శరీరమునందు ప్రాణవాయువుల సంచారమువలనఁ బుట్టు ధ్వనియే నాదమనియు, నిది యోంకారరూపమున నుండుటచే నోంకారనాదమని చెప్పఁ బడుననియు అదియే పది విధములుగా వినవచ్చు ననియు తెలిసికోవలయును.

అవ. ఇట్లు నాదబిందుకళల ప్రభావమును జెప్పి వానిస్వరూపములు నిరూపించు వాఁడై మొట్టమొదట దశవిధనాదముల వర్ణించుచున్నాఁడు.—

శా. కంటి న్నెమ్మదిఁ గంటి సద్గురుని నింకన్ మేనిలోఁ బువ్వు లా
   ఱింటన్ బూజ లొనర్తు నంచుఁ గర మర్థిన్ దేహి దా మున్నుగా


      ఘంటానాదముఁ జేసెనో యనఁగ నోంకారంబు హృద్వీథియున్
      మింటన్ మ్రోయుఁ దదారవంబుగతి యామీఁదన్ విజృంభించుచున్. 119
 

టీక. దేహి = జీవుఁడు, సద్గురునిన్ = సద్గురుస్వరూపుఁ డగుపరబ్రహ్మమును, కం టిన్ = చూచితిని, నెమ్మదిగంటిన్ = చిత్తశాంతినిఁ బొందితిని. ఇంకన్ = ఇంక, మేనిలో పువ్వులాఱింటన్ = శరీరము నందున్న యాఱుకమలములచే (ఆధారకమలము, స్వాధిష్ఠాన కమలము, మణిపూరకకమలము, అనాహతకమలము, విశుద్దకమలము, ఆజ్ఞాకమలము యీ ఆఱును షడాధారకమలము లనియు షడాధారచక్రము లనియుఁ జెప్పఁ బడుచున్నవి.) పూజ లొనర్తున్ = పూజను జేసెదను, అంచున్ = అని, కరము = మిక్కిలి, ఆర్థిన్ = ప్రీతితో, తాన్ = తాను, మున్నుగా = పూజనారంభించుటకు ముందు, ఘంటానాదముఁ జేసెనో యనఁగన్ = ఘంటానాదము నొనరించెనో యనునట్లు, హృద్వీథి యన్మింటన్ = హృదయ మనియెడు నాకాశమున, ఓంకారంబు = ఓంకారము, తదారవంబుగతిన్ = ఆఘంటానాదమువలె, ఆమీఁదన్ = చిఱుగజ్జెలధ్వని వినఁబడిన పిదప, విజృంభించుచున్ = అభివృద్ధి యగుచు, మ్రోయున్ = మ్రోగును.

తా. “నాకు సద్గురురూపుఁ డగు పరమాత్మునిదర్శనమైనది. ఇఁక నమ్మహాత్మునకు శరీరమునం దున్న యాఱుకమలములతోను బూజఁజేయవలయును.” అని తలంచుచు జీవుఁడు మొట్టమొదట “ఆగమార్ధం తు దేవానాం గమనార్థంతు రక్షసాం, కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం” అని ఘంటను వాయించెనో యనునట్లు హృదయాకాశమునం దోంకారధ్వని మూఁడవమాఱు మ్రోయును.

   స్రగ్ధర. కామక్రోధాద్యసద్రాక్షసగణవిజయాకాంక్షి యై ప్రత్యగాత్మ,
         శ్రీమన్నారాయణుం డంచితవిమలమహాచిత్తశంఖంబు నిండన్
         సేమం బారంగఁ బూరించినగతి మొరయుం జిత్కళాదర్శకం బై
         భూమానందప్రదంబై స్ఫుటనిగమశిరోభూషణోంకార మంతన్ 120

టీక. అంతన్ = ప్రత్య...ణుండు - ప్రత్యగాత్మ = జీవుఁడను, శ్రీమన్నారాయ ణుఁడు, కామ . క్షియై - కామక్రోధాది = కామము క్రోధము మొదలగు, అసత్ = దు ష్టులైన, రాక్షసగణ = రాక్షససమూహముయొక్క, విజయ = జయమును (రాక్షసులు జయించుటకు), అకాంక్షియై = కోరుచున్నవాఁడై, అంచి.. లున్ - అంచిత = ఒప్పుచు న్న, విమల = పరిశుద్ధమైన, మహా = గొప్పదైన, చిత్త = మనస్సు అనియెడు, శంఖంబున్ = శంఖమును, నిండన్ = నిండునట్లుగా, సేమంబారంగన్ = క్షేమ మభివృద్ధి యగునట్లు, పూరించినగతిన్ = ఊఁదెనో యనునట్లు, చిత్కళాదర్శకంబై - చిత్కళా = చిత్కళ లను, దర్శకంబై = చూపునదియై, భూమానందప్రదంబై = బ్రహ్మానందము నొసంగునది యై, స్ఫుట.....రము స్ఫుట = ప్రసిద్ధమైనట్టియు, నిగమశిరః = వేదాంతములకు,

భూషణ,అలంకారభూత మైనట్టియు, ఓంకారము, అంతన్ = పిదప, మొఱయున్ = ధ్వనించును.

తా. జీవుఁ డనునారాయణమూర్తి కామక్రోధాదులను రాక్షసుల సంహరింప నెంచి వారితో యుద్ధము చేయువాఁడై మొట్టమొదట మనస్సనియెడుశంఖమునుఁ బూరించెనో యనునట్లు నాల్గవమా ఱాయోంకారము శంఖనాదమువలె మ్రోయును. ఆనాదమును వినునప్పుడు చిత్కళలు కానఁబడును. మనసునకు పరమానందము కలు గును. వేదములయందేమి యాగమములయందేమి యీ నాదము (దశవిధనాదములు) మిగులఁ బ్రశంసింపఁబడియున్నవి.

  మ. నలువొప్పం దగుబ్రహ్మదండి నొకవీణాదండముం జేసి ష
      డ్జలజాతంబుల మెట్లుగా నిలిపి పంచప్రాణముల్ తంత్రు లై
      యలరంగాఁ గొని ముక్తికామిని సహస్రారంబునం దుండి ని
      చ్చలు వాయించె ననంగ నొప్పుఁ బ్రణవస్వానంబు దా నంతటన్.121


టీ. అంతటన్ = తర్వాత, ముక్తికామిని = మోక్షమనియెడు స్త్రీ, నలువొప్పన్ = సొంపుమీఱఁగా, తగు...డిన్ - తగు = యుక్తమైన, బ్రహ్మదండిన్ = బ్రహ్మదండి యను పేరుచే వ్యవహరింపఁబడు వెన్నెముకను, ఒకవీణాదండమున్ = ఒక వీణగా, చేసి, షడ్జలజాతంబులన్ = షడాధారకమలములను, మెట్లుగా నిలిపి = మెట్లనుగా పొందుపఱచి, పంచప్రాణములు = ప్రాణవాయువు లైదును, తంత్రులై = తీఁగలై, అలరంగాన్ = ఒప్పు చుండఁగా, కొని = గ్రహించి, సహస్రారంబునం దుండి = సహస్రారచక్రమునఁ దాను గూర్చుండి (ఈచక్రము శిరమునందు కలదని శాస్త్రము), నిచ్చలు= మిక్కిలి, వాయిం చె ననఁగన్, తాన్ = తాను, ప్రణవస్వానంబు = ఓంకారధ్వని, ఒప్పున్ = ప్రకాశించును.

తా. వీపునందు పొడుగై వ్యాపించియున్న యెముకకు బ్రహ్మదండియని యోగ శాస్త్రమునందుఁ బేరు. ఇడా, పింగళ, సుషుమ్న మొదలగు నాడులును మూలాధార ము మొదలగు షడాధారచక్రములును (ఈనాడులను గూర్చియు చక్రములను గూర్చి యు గ్రంథముననే వివరింపఁబడును.) యీ బ్రహ్మదండి నాశ్రయించియున్నవని చె ప్పుదురు. మోక్ష మనియెడు స్త్రీ సహస్రారకమలమునందుఁ గూర్చుండి యీబ్రహ్మ దండిని వీణ గాను దాని నాశ్రయించియున్న షడాధారకమలములను మెట్లను గాను ఇడాపింగళాదినాడుల తంత్రులగాను చేసి వాయించేనేమో యన నా ప్రణవనాదము వీణావాదరూపమై యైదవమాఱు మ్రోయును.

   తోటకవృత్తము.
   అమృతాంగన బోధమయాత్ముని శు, ద్ధమనఃపవనంబులు తాళముగా
   నమరం గొని పాడుచు నాడినయ, ట్లమలప్రణవారవ మంతఁ దగున్. 122
   

టీక. అంతన్ = అటుపిమ్మట, అమృతాంగన = ముక్తికాంత, బోధ..-బులు- బోధమయ = జ్ఞానరూపుఁడైన, ఆత్ముని = జీవునియొక్క, శుద్ధ = నిర్మలమగు, మనః పవనంబు లు = మనస్సును, ప్రాణవాయువులను, తాళముగాన్, అమరంగొని = బాగుగ గ్రహిం చి, పాడుచున్, ఆడినయట్లు = ఆడుచున్నదోయనునట్లు, అమలప్రణవారవము అమల = నిర్మలమైన, ప్రణవ = ఓంకారముయొక్క, ఆరవము = ధ్వని, తగున్ = ఒప్పును (తాళ నాదమువలె వినవచ్చు ననుట).

తా. మఱియు ఆఱవమాఱు ఆ ప్రణవనాదము తాళనాదమువలె వినవచ్చును. అప్పుడు, జ్ఞానరూపుఁడగుజీవుని పరిశుద్ధమైన మనస్సును ప్రాణవాయువును తాళములను గాఁ గైకొనిఁ బాడుచు ముక్తికాంత పరమానందముతో బాడుచున్న దేమో యని తలంప వీ లగుచుండును.

  సీ. సలలితేంద్రియగోపికలు వరప్రీతిచే
              జనుదెంచి తనుఁ బొంది సంతసింప
      బ్రహ్మదండీలతావిభాస్వదాధారాది
              కపికావళి మహావికాస మొందఁ
      బ్రస్ఫుటీకృతపటుస్ఫుటగుండలీంద్రుఁ డ
              త్యానందకరముగా నాడుచుండఁ
      బొందుగా భూమధ్యబృందావనమ్మునఁ
              బ్రత్యక్షబోధగోపాలమూర్తి
              
  తే. విమలమానసపవనహస్తములచేతఁ
      దనసుషుమ్నామురళి లీలఁ దాల్చి మధుర...
      గాన మొనరించె ననఁగ నోంకార మలఘు...
      వేణునాదస్వరూపమై వెలయు నంత 122
 

టీక. అంతన్ = పిమ్మట, ప్రత్య.. మూర్తి - ప్రత్యక్ష = తనకంటె వేఱుకాని, బోధ = జ్ఞానస్వరూప మగుపరబ్రహ్మ మనియెడు, గోపాలమూర్తి = శ్రీకృష్ణుఁడు, భ్రూమ ...మునన్ - భ్రూమధ్య = బొమలనడిమిభాగ మనియెడు, బృందావనమునన్ = బృందా వనమునందు, సల... గోపీకలు - సలలిత = మిగులమనోహరములై, ఇంద్రియ = ఇంద్రియ ములను, గోపికలు = గోపికాస్త్రీలు, వరప్రీతిచేన్ = ప్రియుఁ డనుననురాగముచేత (లేక, పరబ్రహ్మమను భక్తిచేత వకారపకారములకు భేదము లేదు కావున వరప్రీతి యను చోట పరప్రీతి అని కూడ నన్వయింపవచ్చును. ఇచ్చట ఇంద్రియములు నాయకుఁడుగఁ పరబ్రహ్మ మరియు గోపికలకు శ్రీకృష్ణమూర్తి యనియు తెలియునది.) చనుదెంచి = వచ్చి, (తనసమీపమునకు వచ్చి యనుట.) తనున్ = తనను, పొంది = ఆశ్రయించి, సంత సింపన్ = సంతోషించునట్లుగాను, బ్రహ్మ...వళీ. బ్రహ్మదండి = బ్రహ్మదండి యని చెప్పఁ బడు వెన్నెముక యనియెడు, లతా = తీగెయందు (లేక, వృక్షశాఖయందు విభాస్వత్ = ప్రకాశించుచున్న, ఆధారాధిక = మూలాధారము మొదలగు పట్చక్రము లనియెడు, పికావళీ = కోకిలగుంపు, మహావికాస మొందన్ = మిగుల సంతోషించుచుండఁగా, కుండ లీంద్రుఁడు = కుండలియనుశక్తికి ఆధారభూతుఁడుగనున్న సర్పరాజు, ప్రస్ఫు... టన్ - ప్రస్ఫుటీకృత = విచ్చఁబడిన, పటు = స్పష్టమైన, స్ఫుటన్ = పడగతో, అత్యానందకర ముగాన్ = మిగుల నానందము కలుగునట్లుగా, ఆడుచుండన్, విమ... చేతన్ - విమల = నిర్మలమగు, మానస = మనస్సు, పవన = ప్రాణవాయువును, హస్తములచేతన్ = చేతులతో, పొందుగాన్ = చక్కఁగా, తన... ళిన్ - తన = తనయొక్క, సుషుమ్నా = సుషుమ్నానా డియనెడు, మురళిన్ = వేణువును, లీలన్ = విలాసముగా, తాల్చి= ధరించి, మధు... మున్- మధుర = మనోహరమగు, గానమున్ = గానమును, ఒనరించె ననఁగన్ = చేసెనో య నునట్లు, ఓంకారము, ఆల... మై - అలఘు = అధికమగు, వేణునాదస్వరూపమై = వేణు నాదమే యాకారముగాఁ గలధై , వెలయున్ = ప్రకాశించును.

తా. ఇంద్రియము లనియెడు గోపికలకు తన (జ్ఞానస్వరూపుఁ డైనకృష్ణుని యొక్క) సాన్నిధ్యముచే పరమానందమును గల్గించుచు బ్రహ్మదండి యనెడువృక్ష శాఖ నాశ్రయించి యున్న మూలాధారము మొదలగు షట్చక్రములనెడుకోయిలలు సంతసముతో మారుపల్కునట్లు చేయుచు (మూలాధారచక్రమునందు అధఃకుండలియు శిరసునం దూర్ధ్వకుండలియుఁ గలదని యోగులు చెప్పుదురు. వీనినిగూర్చికూడ ముందు ముందు వివరింపఁబడును. ఇచ్చటమాత్రము కుండలిశబ్దమునకు సర్పమని యర్థము కావు నను యోగులుకూడ నీకుండలులు సర్పస్వరూపములే యని చెప్పియుండుటచేతను కుండలీంద్రుఁడు సర్పరాజు అని కవి చెప్పియున్నాఁడు.) ఊర్ధ్వకుండలి యధఃకుండ లియు ననునాగేంద్రునకు స్వయముగనే పడగ విప్పి యాడునంత ప్రమోదమును జనింపఁ జేయుచు జ్ఞానరూపుఁడైన (అనఁగా పరబ్రహ్మమును) శ్రీకృష్ణుఁడు భ్రూమధ్యభాగ మనెడు బృందావనమునఁ జేరి ప్రాణము మనసు అనెడు రెండుచేతులతో సుషుమ్నానాడి యను వేణువును బట్టికొని గానము చేసెనో యనునట్లు ప్రణవనాదము పిదప వేణునాద రూపముతోఁ బ్రకాశించును.

  సుగంధివృత్తము.
  క్రూరరాగరోష వైరికోటి నెల్లఁ ద్రుంపఁగాఁ
  గోరి యాత్మరాముఁ డుండ ఘోరసంగరార్థ మై
  భూరిభేరికారవంబుఁ బోరుకొల్పినట్టు లోం
  కారనాద మొప్పు వింతగాఁ గుమార! యంతటన్.

టీక. కుమార = పుత్రా అంతన్ =తదనంతరము, ఆత్మారాముఁడు = అంతర్యామి యగు జీవుఁడు (లేక, పరబ్రహ్మము,) క్రూర ... నెల్లన్ -క్రూర భయంకరులగు, రాగ= కామము, రోష = కోపము మొదలగు, వైరి = శత్రువులయొక్క, కోటినెల్లన్ = సమూ హమునంతయును, త్రుంపఁగాగోరి = సంహరింపఁదలంచి, ఘోర...ర్థమై -ఘోర= భయం కరమగు, సంగరార్థమై = యుద్ధముకొఱకై, ఉండన్ = తగినసన్నాహముతో మండఁగా, భూరిభేరికారవంబున్ -భూరి = అధికమగు, భేరికా = భేరియొక్క, ఆరవంబున్ = ధ్వనిని, బోరుకొల్పినట్టులు = కలిగించినట్లు, వింతగాన్ = విచిత్రముగా, ఓంకారనాదము = ఓం కారధ్వని, ఒప్పున్ = భేరీనాదసమానమై ప్రకాశించును - తా. ఓపుత్రా ! పిమ్మట కామము రాగము (తన కున్న వానిని దానే యనుభ వింపవలయు ననునిచ్చ) ద్వేషము మొదలగు శత్రువుల సంహరింపఁ బ్రయత్నించుచు యథార్థమై అంతర్యామిరూపుఁ డగుజీవుఁడు మొట్టమొదట బ్రస్థానభేరి (రాజులు- యుద్ధమునకుఁ బోవునప్పుడు మ్రోయింపఁబడు భేరి) గంభీరముగ మ్రోయించునో యనునట్లు ఎనిమిదవమాఱు ప్రణవనాదము భేరీధ్వనిరూపముతో విజృంభించును.

  మ. అమరేంద్రాదులు గెల్చుసొంపలరుమాయాకాంత నాడింపఁగా
      నమలాత్మం డగునల్లమాప్రభువరుం డాత్మీయవిద్యామృదం
      గము వాయించె ననంగ నొప్పులలితోంకారస్వనం బంత హృ
      ద్య మచింత్యం బతులం బవాచ్య మయి నిత్యానందమై మారుతీ!.

టీక. మారుతీ = ఓఆంజనేయా! అంతన్ = పిమ్మట, అమలాత్ముఁడగు = నిర్మలహృద యుఁడగు, అల్లమాప్రభువరుండు = అల్లమాప్రభురాయుఁడనఁబడు నీశ్వరుఁడు (ఈతనినిగూర్చి ప్రభులింగలీలయందుఁ జెప్పఁబడి యున్నది. లేక, లక్ష్మీదేవికి నాయ కుఁడగు నాపురుషోత్తముఁడు, ఇచ్చట అల్ల, మా ప్రభువరుఁడు అని పదచ్ఛేదము.) అమరేంద్రుఁడు మొదలగుసమస్తదేవతలను, గెల్చు... కాంతన్ - గెల్చు= గెలువఁగలి గిన, సొంపు = సామర్థ్యముచే, అలర ు= ప్రకాశించునట్టి, మాయాకాంత యనెడుస్త్రీని, ఆడింపఁగాన్ = నృత్యము చేయించుటకై, అత్మీ....గమున్ - ఆత్మీ య = తనదగు , విద్యా = జ్ఞానమనెడు , మృదంగమున్ = మద్దెలను, వాయించెననగన్ = మ్రోయించెనోయనునట్లు, హృద్యము = మనోహరమై, అచింత్యంబు = తలంపనశక్యమై, అతులంబు = ఉపమానములేనిదై, లలి... నంబు - లలిత - సుందరమైన, ఓంకారస్వ నంబు = ఓంకారధ్వని, ఆవాచ్యమై = ఇదియిట్టిదని చెప్పుటకు నశక్యమైనదై , నిత్యా నందమై - నిత్య = శాశ్వతమగు, ఆనందమై = ఆనందమేరూపముగాగలదై , ఒప్పున్ = మృదంగనాదస్వరూపముతో ప్రకాశించును. పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/172 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/173 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/174 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/175 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/176 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/177 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/178 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/179 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/180 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/181 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/182 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/183 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/184 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/185 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/186 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/187 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/188 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/189 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/190 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/191 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/192 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/193 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/194 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/195 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/196 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/197 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/198 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/199 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/200 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/201 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/202 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/203 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/204 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/205 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/206 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/207 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/208 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/209 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/210 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/211 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/212 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/213 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/214 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/215 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/216 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/217 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/218 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/219 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/220 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/221 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/222 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/223 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/224 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/225 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/226 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/227 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/228 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/229 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/230 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/231 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/232 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/233 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/234 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/235 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/236 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/237 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/238 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/239 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/240 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/241 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/242 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/243 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/244 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/245 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/246 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/247 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/248 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/249 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/250 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/251 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/252 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/253 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/254 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/255 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/256