Jump to content

సీతారామాంజనేయసంవాదము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీ హయగ్రీవాయ నమః

శ్రీ సీతారామాంజనేయసంవాదము

టీకాతాత్పర్యవిశేషార్థసహితము

పీఠిక

———♦§♦§♦ ఇష్టదేవతాస్తోత్రము ♦§♦§♦———

అవతారిక. పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి యను గ్రంథకర్త
శిష్టుల యాచారము ననుసరించి మంగళము నాచరించుచు గ్రంథార్థమును గూడ
సూచించుచున్నాఁడు.

శా. శ్రీమద్దివ్యనిజాంఘ్రిపద్మములు సంసేవించుచున్ భక్తిచే
     ధీమంతుం డగునాంజనేయుని నసద్దేహేంద్రియాతీతచి
     ద్భూమానందుఁడ వీవ నే నని కృప న్బోధించు శ్రీజానకీ
     రామబ్రహ్మము నంతరంగమున నారాధింతు నశ్రాంతమున్. 1

వ్యాఖ్యాతృకృతస్తుతి



శా. శ్రీలోకేశుఁ డెవండు సర్వమున దాఁ జెల్వొందియున్ సర్వమున్
    నాలోకించుట నన్యుఁ డయ్యును సమస్తాధారతన్ సర్వమై
    లీలన్ వెల్గు విచారదృష్టి నరయన్ లే దన్య మెవ్వానికిన్
    జాలం గొల్చెద నయ్యనాదినిధను న్సచ్చిత్ప్రమోదాత్మునిన్.

ఉ. సుందరమాంబకున్ ప్రథితసువ్రతకున్ పరదేశమంత్రికిన్
    నందనుఁడన్ రమేశకరుణాపరిలబ్ధకవిత్వశక్తిని
    స్పందుఁడ రామదాసబుధపౌత్రుఁడ వెన్నెలకంటివంశ్యుఁడన్
    సుందరరామనామకుఁడ నూరిజనైకవిధేయచిత్తుఁడన్.

తే. శంకరాచార్యు పదముల సాగి మ్రొక్కి
    యస్మదీయగురుశ్రేణి నభినుతించి

    యెసఁగఁ వివరింతు, శ్రీరామహృదయ మేను
    ఘనులకరుణచే విన్నంత గనినయంత.

చ. అనిశము పాముఁ జేరి విషమై చెడుపాలునుబోలె సద్గుణం
    బును గుణహీనుఁ జేరి చెడుఁ బొల్పుగఁ దోయపుబిందు వై నశు
    క్తినిఁ బడి ముత్య మైనగతిిఁ గిల్బిషహీనునిఁ జేరి దోషమై
    నను మహనీయమై తగుఁ గనన్ జగతీస్థలి నిట్టితత్త్వమున్.

క. కని నిశ్చయించి సాహస, మును బూనితి నప్రబుద్ధముగ్ధాత్ముఁడ న
   య్యును నిది యార్యుల యాదృతిఁ, గని వర్ధిలు నాపయోధిగగనార్కముగాన్.

టీక. శ్రీమ, ..ములు, శ్రీమత్ = శోభాయుక్తములైన, దివ్య= శ్రేష్ఠము లైన (లేక , లోకాతీతము లైన), నిజ= తన, అంఘ్రిపద్మములు = పాదకమలములను (ఇచ్చట ద్వితీయార్థమునందు ప్రథమ.), భక్తిచేన్ = అపరోక్షజ్ఞానమునకు సాధనముగు అనన్య భక్తిచే (బాహ్యభక్తి , అనన్యభక్తి, ఏకాంతభక్తి అని భక్తి మూఁడు విధములు. అందు బాహ్యభక్తి పరోక్షజ్ఞానమును అనఁగా: తనకంటె నధికుఁడగుపరమేశ్వరుఁడు ఒకడున్నాఁ డనుజ్ఞానమును) కలిగించును. అనన్యభ క్తి ఆపరోక్షజ్ఞానమును (అనఁగా: తనకును ఈశ్వరునకును భేదము లేదనుజ్ఞానమును) కలుగఁజేయును, ఏకాంతభక్తి పర మానందానుభవమును గలిగించును.), సంసేవించుచున్ , ధీమంతుండు=వివేకముగల వాఁడు (పరబ్రహ్మము నిత్యమనియు ప్రపంచ మనిత్యమనియు జ్ఞానము గలవాఁడు.), అగునాంజనేయునిన్ = ఐనహనుమంతుని, ఆస... .డవు-ఆసత్ = లేని (అసత్యము లైన), దేహ =(స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము అను) దేహములును, ఇంద్రియ = ఇంద్రియములను, అతీత = అతిక్రమించిన (దేహేంద్రియములకంటే వేఱై న), సత్ = సత్యస్వరూపుఁడవును, చిత్ = జ్ఞానస్వరూపుఁడవును, భూమానందుఁడవు= పరమానందస్వరూపుఁడవును అగు, ఈవ=నీవే, నేను (జీవుఁడే బ్రహ్మమనుట.), అని, కృపన్ = పరమానుగ్రహముచే, బోధించు= తెలిసికొనునట్లు చేయు, శ్రీ... బ్రహ్మ మున్- శ్రీ - 1 -అష్టైశ్వర్యయుక్తమగు, జానకీరామబ్రహ్మమున్ = సీతాసహితరామబ్రహ్మ మును (ఇచ్చట సీతను మాయఁగామ, రాముని పరబ్రహ్మముఁగాను చెప్పియున్నాఁ డు.), అంతరంగమునన్ = మనసునందు , ఆశ్రాంతమున్ = సర్వకాలములయందును, ఆరాధింతున్ = సేవింతును (ధ్యానింతు ననుట).

తాత్పర్యము. అనన్యభక్తిచేఁ దనపాదముల నెప్పుడును సేవించుచుఁ దత్ప్ర భావమువలన దృఢమగు వివేకవైరాగ్యములు గలిగి యుత్తమాధికారియై యున్న హను మంతునకు "తత్త్వమసి" = "ఆబ్రహ్మమే నీవు” అను మహావాక్యము యొక్క యర్థ మును గరుణవెలయ నుపదేశించు నాసీతారామబ్రహ్మమును సర్వకాలములయందును ధ్యానించెదను.

అవ. ఇట్లు తన యిష్టదైవ మగు శ్రీరాముని పరబ్రహ్మరూపునిగా వర్ణించి యీ పద్యమున సీతాదేవిని మూలప్రకృతిరూపముతో నభివర్ణించుచున్నాఁడు.—

సీ. తనరజోగుణముచేఁ దనరంగనే దేవి,గల్పించునఖిలలోకముల నెల్లఁ,
    దనసత్త్వగుణముచే నొనరంగ నేకొమ్మ, పోషించు నీసర్వభూతములను,
    దనతమోగుణముచేఁ దగ నేవధూమణి, జగములనెల్ల సంక్షయముఁ జేయు
    దా శుద్ధసత్త్వప్రధానయై యేరామ, రామాంకమున నజస్రము వసించు

తే. నట్టిభువనైకమాత దయాసమేత, సద్గుణవ్రాత నిర్మలస్వాంతపూత
    భక్తజనమానసోద్యానపారిజాత, సీత కరుణించి నన్ను రక్షించుఁగాత.

టీక. ఏదేవి=మూల ప్రకృతియగు నే సీతాదేవి, తనరజోగుణముచేన్ = తనకుఁ గలరజోగుణము చేత, తనరఁగన్ = ఒప్పునట్లుగా, అఖిలలోకములనెల్లన్ = నానావిధ ము లగుభేదములుగల యీ బ్రహ్మాండముల నెల్లను, కల్పించున్ = సృష్టించునో (ఇచ్చట కల్పించు ననుటచే వాస్తవముగ నీ ప్రపంచము బ్రహ్మమునకంటె వేఱు కాకున్నను వేఱుగానున్నట్లు తోఁపఁజేయుచున్నది యని భావము. ), ఏకొమ్మ= ఏ స్త్రీ, తమసత్త్వ గుణముచే=తనకుఁగల సత్త్వగుణము చేత (శుద్ధసత్త్వమనియు, మలినసత్త్వమనియు సత్త్వగుణము రెండు విధములు, అందు రజస్తమోగుణములతోఁ గొంచె మైనను సం బంధపడనిది శుద్ధసత్త్వము; అట్లు కానిది మలినసత్త్వము. ప్రకృతమున అమలినసత్త్వ మును గూర్చియే చెప్పఁబడియున్నది యని తెలిసికొనవలయును.), తనరంగన్ = ఈ సర్వభూతములను, పోషించున్ , ఏవధూమణి= ఏ నారీరత్నము, తనతమోగుణముచేన్ = తనకుఁగల తమోగుణము చేత, తగన్ =ఒప్పునట్లుగా, జగములనెల్లన్ = లోకములనం తయు, సంక్షయముచేయున్ = నశింపఁజేయునో, ఏరామ = ఏయువతి, తాన్ = తాను, శుద్ధసత్త్వ ప్రధాన + ఐ = శుద్ధసత్త్వమే ప్రధానము గాఁ గలదియై (శుద్ధ సత్త్వస్వ రూపిణి యై యనుట.), రామాంకమునన్ = పర బ్రహ్మస్వరూపుఁడగు శ్రీరామునితొడ పై, ఆజస్రమున్ = సర్వకాలములయందును, వసించున్ = నివసించునో (మాయాశక్తి పరబ్రహ్మమునకు నిత్యానపాయిని; అనఁగా : అగ్నియందున్నయుష్ణశ క్తియునుం బోలె నెప్పుడును పరబ్రహ్మమును విడువకుండునది యని భావము.), అట్టిభువనైకమాత=ఆ లోకజననియు , దయాసమేత = దయగలదియు, సద్గుణవ్రాత = శ్రేష్ఠము లగుగుణసమూ హములు గలదియు, నిర్మలస్వాంత = పవిత్ర మగుహృదయము గలదియు, పూత=నిర్వి కారస్వరూపము గలదియు ( బ్రహ్మము మాయయు నొక్కటియే కావున నిట్లు చెప్పం బడెను.), భక్త... పారిజాత — భక్తజన = భక్తజనులయొక్క మానస = మనస్సులనియెడు, ఉద్యాన = ఉద్యానవనము నందు, పారిజాత = పారిజాతవృక్షమువంటిదియు (తనను ధ్యానించిన వారు కోరినకోర్కుల నొసంగునది యనుట.), అగు, సీత, నన్నున్ , కరు ణించి = దయఁజూచి, రక్షించున్ కాతన్ = రక్షించునుగాక (ఆపదలనుండి తొలఁగించును గాక).

తా. గుణసామ్యము (సత్త్వరజస్తమోగుణములు ఎక్కువతక్కువలు లేక సమానములుగా నుండుట.) స్వరూపముగాఁ గలది యగుటచేఁ దనరజస్సత్త్వమో గుణములమూలమున సృష్టిస్థితిసంహారములను జేయుచు శుద్ధసత్త్వస్వరూపముతో బరబ్రహ్మమునందు భేదముగా నిలచి యుండు నాలోకజనని మూలప్రకృతి (మూల ప్రకృతి యగు సీతాదేవి ) కోరినకోర్కుల నొసంగి నన్ను రక్షించుఁ గాక (ఓంకా రమునందు ఆకార ఉకార మకారము లను మూడువర్ణములు కలవు. ఇవి మూఁడును క్రమముగ సత్త్వరజస్తమోగుణము లనియు, మకారము పై నున్న యర్ధమాత్ర గుణ సామ్యస్థితి యనియు, ఇవియన్నియుఁ గలిసి యేర్పడిన "ఓమ్" అనుఅక్షరముప్రకృతి యనియు, ఆయక్షరముయొక్కయర్థము పరబ్రహ్మమనియు ఉపాసింపవలయునని చెప్పఁబడి యున్నది. దీనిచేఁ బ్రకృతికిని బ్రహ్మమునకును గలసంబంధమును బాఠకు లూహింతురు గాక).

అవ. ఇట్లు ప్రకృతిపురుషుల వినుతించి, బ్రహ్మ విష్ణు రుద్రు లనుపేళ్ళతో సత్త్వరజస్తమోగుణములు ఉపాధులు (ఆవరణములు) గాఁ గలిగి విలసిల్లుపరమాత్మ ప్రతిబింబముల వినుతించుచున్నాఁడు.—

సీ. తతశుద్ధసత్త్వప్రధానవిగ్రహుల ని, మ్ముల రజస్సత్త్వతమోగుణకుల
     స్వసుధర్మశృంగారవైరాగ్యవేషుల, విశ్వోద్భవస్థితివిలయకరులఁ
     దప్తకాంచననీరధరచంద్రవర్ణుల, శుభకమండలుచక్రశూలధరుల
     ఘనసత్యవైకుంఠకైలాసవాసుల, వరహంసఖగవృషవాహనులను

తే. షడ్గుణైశ్వర్యయుతుల భాషావధూప్ర, సన్నమంగళదేవతాసర్వమంగ
     ళాధిపతుల సాక్షాత్పరమాత్మమయుల, బ్రహవిష్ణుమహేశులఁ బ్రస్తుతింతు.

టీక. తత... విగ్రహులన్ — తత = వ్యాపించిన, లేక, ప్రసిద్ధ యైన, శుద్ధసత్త్వ ప్రధాన = శుద్ధసత్త్వరూప యగుమాయయే, లేక, ఆ గుణములును లయము నొందు స్థానమైన చిత్ప్రకృతియే, విగ్రహులన్ = శరీరములుగాఁ గలిగినట్టియు (మాయామయము లగుశరీరములు గలవారు, లేక , సర్వమునకు నధిష్టాన మైనప్రకృతితో నభిన్ను లై యుండువారు అని భావము.), రజస్సత్త్వతమోగుణకులన్ = రజోగుణము సత్త్వగుణము తమోగుణము (ఈగుణములకు కార్యము లగుఘోరవృత్తి, శాంతవృత్తి, మూఢవృత్తి) కలిగినట్టియు (ఆవృత్తులవలన క్రమముగా సృష్టిస్థితిసంహారములు జరుగు నని భావము.), స్వ... వేషులన్ — స్వ= స్వకీయ వైన, సుధర్మ = శ్రేష్ఠ మగుధర్మము (వర్ణధర్మములు, ఆశ్రమధర్మములు మొదలగునవి.), శృంగార = వస్త్రభూషణాద్యలంకారములు, లేక, శృంగారరసము, వైరాగ్య = విరక్తి, ఇవియే, వేషులన్ = వేషములుగాఁ గలిగినట్టియు (బ్రహ్మ ధర్మపరుఁడనియు, విష్ణువు శృంగారపరుఁడనియు, ఈశ్వరుఁడు వైరాగ్యపరుఁ డనియు భావము. ), విశ్వ. . .కరులన్ - విశ్వ= ప్రపంచముయొక్క, ఉద్భవ = సృష్టిని, స్థితి = రక్షణము, విలయకరులన్ = ప్రళయమును ఆచరించునట్టియు, తప్త. . .వర్ణులన్ - తప్త = పుటము వేయఁబడిన, కాంచన= సువర్ణముయొక్కయు (కాంతి యొక్క యాధి క్యమును జెప్పుటకై ఇచ్చట "తప్త” అనువిశేషణము వేయఁబడినది. }, నీరధర= మేఘ ముయొక్కయు (నీటితోఁ గూడియున్న మేఘము మిగుల గాంతి గలదై యుండును గావున నిట “నీర” పదము ప్రయోగింపఁబడినది.), చంద్ర = చంద్రునియొక్కయు, వర్ణులన్ = వర్ణమువంటి వర్ణముగలిగినట్టియు (ఇవి క్రమముగా రజస్తమస్సత్త్వగుణముల వర్ణములు కావున త్రిమూర్తులకును ఇవి బాహ్యోపాధులని తెలిసికొనవలయును. బ్రహ్మ కు లోపలను వెలుపలను గూడ రజోగుణమే; విష్ణువునకు లోపల సత్త్వము, వెలుపల తమస్సు; రుద్రునకు లోపలఁ దమస్సు, వెలుపల సత్త్వము ఆవరణము లని యెఱుంగు నది.), శుభకమండలుచక్రశూలధరులన్ = శుభకరము లగు కమండలువు చక్రము శూలము ధరించినట్టియు, ఘనసత్య వైకుంఠకైలాసవాసులన్ = శ్రేష్టము లగు సత్యలోక వైకుంఠ కైలాసములయందు నివసించువారును, పరహంసఖగవృషవాహనులను = శ్రేష్ఠ ములగు హంస గరుడ నందికేశ్వరులు వాహనములుగాఁ గలిగినట్టియు, షడ్గుణైశ్వర్య యుతులన్ = షడ్గుణములసమృద్ధి గలిగినట్టియు (అధికమగుప్రభావము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునివి షడ్గుణములు .), భాషా ...పతులన్ - భాషావధూ - సరస్వతీదేవికిని, ప్రసన్నమంగళదేవతా = ప్రసన్నురాలగు, లేక, దయయే స్వభావముగాఁగల లక్ష్మీదేవికిని, సర్వమంగళా = పార్వతీదేవికిని, అధిపతులన్ = ప్రభువు లయినట్టియు (గుణత్రయశక్తులను స్వాధీనము గాఁ జేసికొని యుండువా రనుట.), సాక్షాత్ ...మయులన్ - సాక్షాత్ = ప్రత్యక్ష మైన, పరమాత్మమయులన్ = నిర్వికారపరబ్రహ్మమే స్వరూపముగాఁ గలిగినట్టియు ("పరమాత్మ విభాగస్థాః' అను శాస్త్రమును అనుసరించి యీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరమాత్మరూపులే, సృష్ట్యాదియందు గుణములు మూఁడును విజృంభింప నారంభించినపుడు వానిలో ప్రతిబింబించి సర్వవ్యాపకమగు నాపరబ్రహ్మము మూఁడువిధములుగాఁ జెప్పఁబడుచు న్నది అని తెలిసికొనవలయును.), బ్రహ్మవిష్ణుమహేశులన్ , ఇమ్ములన్ = అధికముగా, ప్రస్తుతింతున్ = స్తోత్రము చేయుచున్నాను.

తా. సత్త్వరజస్తమోగుణములు లయము నొందుటకు (ఉత్పత్తి స్థితిలయములు జెందుటకు అని కూడ గ్రహింపవలయును. వస్తువైనను తా నుత్పత్తిఁ జెందిన స్థలము నందె, అనఁగా ఉపాదానకారణమునందె, లయమునొందును గదా!), స్థానమగు చిత్ప్రకృతియే, లేక, మాయయే, దేహములుగాఁ గలిగి రజస్సత్త్వతమోగుణవృత్తుల నాశ్రయించుచు వర్ణాశ్రమధర్మములు, శృంగారము, వైరాగ్యము అనునవియే వేషములుగాఁ గలిగి నామరూపాత్మక మగుసకలప్రపంచమును (ఈ ప్రపంచమునందు పేర్లును రూపములును దప్పఁ బరబ్రహ్మమునకంటె నన్యమగుపదార్థ మేదియును లేదు. ) బుట్టించుచు రక్షించుచు సంహరించుచు, ఎఱుపు నలుపు తెలుపు అనుశరీరచ్ఛాయ గలిగి, కమండలు చక్ర శూలముల ధరించుచు, సత్యలోక వైకుంఠ కైలాసములయందు విలసిల్లువారును, హంసగరుడవృషభవాహనులును, ప్రభావము ధైర్యము మొదలగు సద్గుణములచే నొప్పువారును, సరస్వతీ లక్ష్మీ పార్వతీ నాయకులును, బరబ్రహ్మరూపులును అగు బ్రహ్మవిష్ణుమహేశ్వరుల వినుతించెదను.

అవ. ఇట్లు బ్రహ్మవిష్ణుమహేశ్వకుల నుతించి, వారలయధీనతలోనుండి వారికి సృష్ట్యాదికార్యములు చేయఁ గల సామర్థ్యముల నిచ్చు త్రిగుణశక్తులఁ బ్రార్థించుచున్నాడు.-

శా. బ్రహ్మాండంబు సృజింపఁ బెంప సమయింపం జాలుసామర్థ్యముల్
    బ్రహోపేంద్రనగేంద్రచాపులకు సంపాదించుచు న్వారికిన్
    బ్రహ్మాత్మైక్యవివేక మిచ్చుచును సంభావించుచుం బ్రోచునా
    బ్రాహ్మీమంగళదేవతాగిరిజలం బ్రార్థింతు నశ్రాంతమున్.

టీ. బ్రహ్మాండంబున్ = ప్రపంచమును, సృజింపన్ = సృష్టిఁజేయుటకును, పెంపన్ = వృద్ధిఁ జెందించుటకును, సమయింపన్ = నశింపఁజేయుటకును, చాలు...ముల్ - చాలు = తగిన, సామర్థ్యముల్ = శక్తులను, బ్రహ్మ...చాపులకున్ - బ్రహ్మ = చతుర్ముఖునకును, ఉపేంద్ర = విష్ణువునకును, నగేంద్రచాపులకున్ = శివునకును (త్రిపురసంహారమున రుద్రుఁడు మేరుపర్వతమను ధనుస్సుగా ధరించెనని పురాణగాథ కలదు, దానింబట్టి, నగేంద్రచాపుఁడు = పర్వతము ధనుస్సు గాఁగలవాఁడు, అనుపదము ప్రయోగింపఁబడెను. ), సంపాదించుచున్ = కలుగఁజేయుచు( ఈ త్రిమూర్తులు నిర్వికారులే కావున వీరలకు సృష్ట్యాదికార్యములు చేయు సామర్థ్యము స్వయముగా లేదు. వీరిసాన్నిధ్యమువలన త్రిగుణశక్తులే యీ కార్యములను చేయును. అవి శక్తియుక్తులగు నీ త్రిమూర్తులయం దారోపింపఁబడును అని తెలిసికొనవలయును.), వారికిన్ = ఆత్రిమూర్తులకు, బ్రహ్మాత్మైక్యవివేకమున్ = నిర్గుణపరబ్రహ్మజ్ఞానమును (తామును ఒక్కటియే అను జ్ఞానమును), ఇచ్చుచును సంభావించుచున్ = ఇచ్చి గౌరవించుచు (ఆవిద్య జీవులకు స్వాధీనము కాక వారిని లోఁబఱుచుకొని వారికి బంధములు గలిగించును. ఈగుణశక్తు లట్లుగాక బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు లోఁబడి వారలకు బంధమును గలిగింపకున్నవి యనియు, ఆట్లగుటచే వారలకు బ్రహ్మాత్మైక్యజ్ఞానము దృఢముగా నున్నదనియు భావము.), ప్రోచునాబ్రాహ్మీమంగళదేవతాగిరిజలన్ = రక్షించునట్టియా సరస్వతీలక్ష్మీపార్వ తులను (ఇచ్చట రక్షించుట యనఁగా బంధము గలుగఁజేయకుండుటయే అని తెలిసికొనవలయును.), అశ్రాంతమున్ = ఎల్లపుడును, ప్రార్థింతున్.

తా. చతుర్ముఖునకు సృష్టిఁచేయుటయందును, విష్ణువునకు రక్షించుటయందును, రుద్రునకు సంహరించుటయందును సామర్థ్యమునుగలుగఁజేయుచు, తమవికారములచే బంధమును గలిగింపక వారికి “అహంబ్రహ్మాస్మి" = "నే నే బ్రహ్మమును ” అనుజ్ఞానమును దృఢముచేయుచు నుండు త్రిగుణశక్తులగు వాణీలక్ష్మీపార్వతుల ధ్యానించెదను.

అవ. గణేశుని బరబ్రహ్మరూపునిగా స్తోత్రముఁ జేయుచున్నాఁడు. —

క. వరవిశ్వోద్గతి హేతువు, పరముఁడు పురుషుండు ప్రకృతి బ్రహ్మము పరమే
   శ్వరుఁ డంచుఁ దజ్జ్ఞు లెవ్వఁని బరికింపుదు రగ్గణాధిపతి నర్చింతున్ . 5

టీ. ఎవ్వనిన్ - ఏమహాత్ముని, వరవిశ్వోద్గతిహేతువు = ప్రపంచోత్పత్తికిఁ గారణభూతుఁడు (ఉత్పత్తిస్థితిలయములకుఁ గారణమనుట.), పరముఁడు= ప్రకృతికిని పురుషునకును అధికుఁడగువాఁడు, పురుషుఁడు = జీవస్వరూపుఁడు, ప్రకృతి = ఉపాదానకారణభూతుఁడు ("వరవిశ్వోద్గతి” అనుటచే నిమిత్తకారణభూతుఁడనుటను గూర్చి చెప్పఁబడెనని తెలియునది, లేక , మాయారూపుఁడును; పరబ్రహ్మమునకు, మాయకును భేదము లేదు గావున నిట్లు చెప్పబడెను.), బ్రహ్మము = చతుర్ముఖుఁడు, పరమేశ్వరుఁడు = రుద్రుఁడు, అందున్ = అని, తజ్ జ్ఞు లు = తత్త్వవేత్తలు, పరికింపుదురు = విచారింతురో , లేక, ధ్యానింతురో (చిత్తశుద్ధి కొఱకై యాయా రూపములతో ధ్యానింతురో యనుట. ), గణాధిపతిన్ = ఆ విఘ్నేశ్వరుని, అర్చింతున్ =పూజించెదను.

తా. ఈ ప్రపంచమునకు నిమిత్తకారణముగాను, ఉపాదానకారణముగాను ఉన్న ప్రకృతిపురుషాతీతమగు పరబ్రహ్మమనియు, జీవరూపుఁడనియు, బ్రహ్మరుద్రాదిస్వరూపముతో నున్నాఁడనియు తత్త్వజ్ఞానము గలవారిచే సర్వకాలములయందును ధ్యానింపఁబడుచున్న (లేక, అధికారభేదములచే ననేక విధములుగా సేవింపఁబడుచున్న) యాగణేశ్వరుని పూజించుచున్నాను.

అవ. ఇట్లు ప్రార్థించి, దేవతల నుపాసించునట్లు తత్త్వవేత్తనుగూడ నుపాసించుట చిత్తశుద్ధికరమని తెలియజేయుచు, రామప్రసాదము వలన పరమార్ధము నెఱింగిన హనుమంతుని ధ్యానించుచున్నాఁడు.—

మ. తనరం గాయముచేత రామచరణద్వంద్వైకదాస్యంబు హె
    చ్ఛినభక్తిం దగువాక్కుచే ననిశమున్ శ్రీరామనామప్రకీ
    ర్తనముం జిత్తముచేత రామపరతత్త్వధ్యానముం జేయుశ్రీ
    హనుమంతున్ సముపాశ్రయింతు మదభీష్టార్థంబు సిద్ధింపఁగన్.6

టీ. తనరన్ = ఒప్పునట్లుగా, కాయముచేతన్ = శరీరముచే, రామ.... దాస్యంబున్ - రామ= శ్రీరామునియొక్క, చరణద్వంద్వ = పాదయుగ్మముయొక్క, దాస్యంబున్ = సేవను, తగువాక్కుచేన్ = యుక్తమైన (వేదాధ్యయనము, సత్యభాషణము మొదలగు వాఙ్మయతపస్సుతో కూడిన దగుటచే నిర్మలమైన) వాక్కుచేత, అనిశమున్ = ఎల్లప్పుడును, శ్రీరామ... కీర్తనమున్ - శ్రీరామ = శ్రీరామునియొక్క నామ= నామధేయముయొక్క, ప్రకీర్తనమున్ = జపమును, చిత్తముచేన్ = మనస్సు

చేత, తదీయ... ధ్యానమున్ - తదీయ = ఆ శ్రీరామునిసంబంధ మైన, పరతత్త్వ= యథార్థస్వరూపముయొక్క (బ్రహ్మస్వరూపముయొక్క), ధ్యానమున్ = ధ్యానించుటను, హెచ్చినభక్తితో, చేయునాహనుమంతున్, మదభీష్టార్థంంబు— మత్ = నాచేత, అభీష్ట = కోరఁబడిన, అర్థంబు = విషయము, సిద్ధింపఁగన్ = సిద్ధించునట్లుగా (ఈ గ్రంథము నిర్విఘ్నముగా బరిసమాప్తి యగుటకై యనుట.), సముపాశ్రయింతున్ = ఆశ్రయించెదను.

తా. మిగుల భ క్తిగలవాఁడై తనశరీరముచే శ్రీరామపాదసేవయు వాక్కుచేఁ దన్నామస్మరణంబును మనస్సుచేఁ బరమార్థస్వరూపధ్యానంబును గావించుచుఁ ద్రికరణశుద్ధిగా నా శ్రీరాముని సేవించుచున్న యాహనుమంతుని భక్తాగ్రేసరుని నాశ్రయించెదను. అవ్విభుఁడు నా కభిమతార్థముల సమకూర్చును గాక !

అవ . “యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ” = "ఎవనికి దేవునియందు అధికముగ భక్తియుండునో గురువునందుఁగూడ నట్లేయుండునో వానికిని" అనున్యాయము ననుసరించి కవి గురువుల వినుతించుచున్నాడు.-

క. ఆరయ మద్బాల్యంబున, గారవమునఁ జిత్తశుద్ధికరముగ నాకుం,
   దారకయోగముఁ దెలిపిన, నారాయణగురువులను మనంబునఁ గొలుతున్.

టీ. ఆరయన్ = విచారింపఁగా (లేక , పరతత్త్వస్వరూపమును విచారించుటకు, విచారించుశక్తి గలుగుటకు), మద్బాల్యంబునన్...మత్ = నాయొక్క, బాల్యంబునన్ = బాల్యమునందు ('చెప్పిన విషయములను గ్రహించి వానిని మనస్సునందు నిలుపుకొనఁగలవాఁడు బాలుఁడు' అనువాక్యము ననుసరించి యిచ్చట బాల్యశబ్దమునకు అర్థము చెప్పవలయును. లేకున్న బాలుఁడు వేదాంతశాస్త్రోపదేశమునకుఁ దగియుండఁడుగదా!), గారవమునన్ = ప్రేమతో, చిత్తశుద్ధికరముగన్ = మనసును పరిశుద్ధము చేయునట్లుగా, నాకున్, తారకయోగమున్ = అక్షి పురుషు నుపాసించువిధమును (యోగస్వరూపము ఈ ప్రథమాశ్వాసమునందు వివరింపఁబడును.), తెల్పిన నారాయణగురువులను = ఉపదేశించిననారాయణుఁ డనుగురువును, మనంబునన్ = మనస్సునందు, తలఁతున్ = స్మరించెదను.

తా. నేను బ్రహ్మవిద్యార్థి నై యున్నకాలమున నన్ననుగ్రహించి మనసును బరిశుద్ధము చేయఁజాలుతారకయోగము నుపదేశించి పరమార్థతత్త్వమును దెలిసీకొనుటయందు శక్తిని గలిగించిన నారాయణగురువును మదిలోఁ దలంచెదను.

అవ. మఱియొకగురువునకు వందన మాచరించుచున్నాఁడు. —

సీ. ఘనపాపమును మాపఁ దనుతాపమును బాపఁ
          దనరూపమును జూపఁ దనరువాని
    దనుకాయమును ద్రోయఁ బెనుమాయ నొగి మాయ
          ముగఁ జేయ గుఱి డాయఁ దగినవాని
    మును కారణశరీరమును జీఱ నవికార
          వరకారణముఁ జేరఁ బరఁగువానిఁ
    దనయందు జగమందుఁ దాఁ బొందుగా నొందు
          చెలు వొందువిందుగాఁ దెలియువాని
తే. నిగమనిగదితసుగుణము లగణితముగ
    మిగుల నిగుడఁగ సగుణుఁ డై యగుణుఁ డగుచుఁ
    బగలు రే యన కొకరీతి నెగడువాని
   శ్రీమహాదేవగురుని భజింతు నెపుడు. 8

టీక. ఘనపాపమునున్ = అధికమైన పాపమును (బ్రహ్మజ్ఞానమునకుఁ బ్రతిబంధకములై యుండువానిని), పాపన్ = పోఁగొట్టుటకును, తనుతాపమున్ = శరీరమునందలి సంతాపములను (ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, అధిదైవికము అనుతాపత్రయమును; వాత పైత్త్యాదులవలనఁ దనకుఁ గలుగువ్యాధులు ఆధ్యాత్మికతాపము; ఇతర జంతువులవలనఁ గలుగు బాధ యాధిభౌతికతాపము; ఎండ వాన గాలి మొదలగు వానివలనఁ గలుగుతాపసు ఆధిదైవికతాపము; అని యెఱుంగునది. ), మాపన్ = నశింపఁజేయుటకును, తనరూపమును = తనయథార్థస్వరూపమును (బ్రహ్మస్వరూపమును), చూపన్ = కనఁబఱచుటకును (అపరోక్షబ్రహ్మసాక్షాత్కారమును గలిగించుటకు), తనరువానిన్ = శక్తి గలవానిని, తనుకాయమునున్ = సూక్ష్మశరీరమును, త్రోయన్ = నశింపఁజేయుటకుఁగా (హృదయగ్రంథిని ఛేదించుటకు, అనగా: తనకంటే బ్రహ్మము వేఱను భ్రాంతిని తొలగించుకొనుటకు), పెనుమాయన్ = గొప్పది యగునట్టి (సకలలోకములను దనకు వశములను గావించుకొని త్రిప్పునట్టి సామర్థ్యము గల) మాయను, ఒగిన్ = సంపూర్ణముగ, మాయముగన్ = కనుపడనిదానినిగా, చేయన్ = చేయుటకును, గుఱిడాయతగినవానిన్ = లక్ష్యము గా నాశ్రయింప నర్హుం డైనవానిని (ఈయన నాశ్రయించిన హృదయగ్రంథియు, అవిద్యయు నశించుట కేసంశయ ముకు లేదనుట.), మును = మొట్టమొదట, కారణశరీరమును = అవిద్యాస్వరూపమైన కారణశరీరమును, జీఱన్ =నశింపఁజేయఁగాను, అవికారపరకారణమున్ = నిర్వికార మగు నుత్తమమైన పరబ్రహ్మమును, చేరన్ = పొందుటకును, పరఁగువానిన్ = తగినవాని (లేక, సమర్థుఁడగువానిని}, పరబ్రహ్మమును అపరోక్షానుభవపూర్వకముగఁ దెలిసికొనినవానిని, తనయందున్ = తనలో, జగము=ప్రపంచము (కలదు), అందు = ఆ ప్రపంచమునందు , తాన్ = తాను, పొందుగా నొందుచెలువున్ = బాగుగా చెందునట్టిసమృద్ధిని (తానా ప్రపంచమునం దుండుటను), ఒందువిందుగాన్ = ఒందుచున్న సంతోషముతో, తెలియువానిన్ = తెలిసికొనువానిని (తనయందు ప్రపంచ మున్నదనియు, తానా ప్రపంచమం దున్నాఁడనియు బాగుగఁ దెలిసికొనియున్నవానిని), నిగమ.. ములు - నిగమ= వేదములందు, నిగదిత= చెప్పఁబడిన, సుగుణములు, అగణితముగన్ - లెక్కకు మిక్కిలియై, మిగులన్ = అధికముగ, నిగుడఁగన్ = నిలచియుండుటచేత, సగుణుఁడై=గుణవంతుడై, అగుణుఁడు=నిర్గుణుఁడు, అగుచున్ (పరబ్రహ్మరూపముతో వర్ణింపబడుచుండుటచే నిట్లు చెప్పఁబడినది.), పగలు రేయనకన్ = పగలు రాత్రి అని భేదము లేక (కాలపరిచ్ఛేదమునఁగా ఈకాలమునఁ గలఁడు, మఱియొకకాలమున లేఁడు అను భేదము లేక), ఏకరీతిన్ = ఒకటేవిధముగా, నెగడువానిన్ = విహరించువానిని, శ్రీమహాదేశగురునిన్ = శోభాయుక్తుడగు మహాదేవుఁ డనుగురువర్యుని, ఎప్పుడున్ భజింతున్ = సేవించెదను.

తా. బ్రహ్మజ్ఞానమునకు విఘ్నములై యుండు నానావిధము లగుపాపములను నశింపజేయుచు అధ్యాత్మికాదితాపములను బోఁగొట్టి తనసత్యస్వరూపమును ప్రత్యక్షముగ చూపఁగలసామర్థ్యము గలవాడును, సూక్ష్మశరీరమును ధ్వంసము చేసి అవిద్యను తొలగించి కృతార్థులుగాఁ దలంచువారలకు శరణ్యుఁడును, కారణశరీరమును ధ్వంసము కావించి నిర్వికారపరబ్రహ్మముతో నైక్యముఁ జెంది యుండువాఁడును “మయ్యేన సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయ మస్మ్యహమ్" "ప్రపంచము నాయందే జనించినది. నాయందే నిలిచియున్నది. నాయందే లయమగును. సర్వ కారణభూతుఁడగు పర బ్రహ్మము నేనే” అనువిషయమును జక్కఁగ నెఱింగి యున్నవాఁడును, నిర్గుణస్వరూపుఁ డయ్యును శాస్తోక్తము లగుసకలసద్గుణములును గలవాఁ డగుటచే సగుణుఁడై కూడనుండువాఁడును, కాలపరిచ్ఛేదము లేక నొకరీతిగ నుండువాఁడు నగు నామహాదేవగురువును సేవించెదను (ఈకవికి నారాయణుఁడు అనియు మహాదేవుఁడనియు నిరువురు గురువులు. అందు నారాయణుఁడు పద్యమున వర్ణింపఁబడి యున్నాడు. ఈ పద్యమున మహాదేవగురువు విజ్ఞానవంతుఁడుగఁ గొన్ని చోట్లను గేవల పరబ్రహ్మరూపుడుగ మఱికొన్నిచోట్లను వర్ణింపబడియున్నాఁడని తెలిసికొనవలయును.)

***సంస్కృతకవిస్తోత్రము***:

అవ. ఈ క్రింద నాలుగు పద్యములచేఁ గవి ప్రశంస చేయుచున్నాఁడు._____(ఇది యాంధ్రకవులయాచారము).

శా. లోకాలోకపరీతభూచరమహాలోకోపకారంబుగా
    శ్రీకల్యాణకరోరుకావ్యచయముల్ సిద్ధంబుఁ గావించి సు
    శ్లోకుల్ పుణ్యమతుల్ జగద్గురువులై శోభిల్లుచున్నట్టి వా
    ల్మీకివ్యాసమయూరబాణకవికాళీదాసులం గొల్చెదన్. 9

టీక. లోకా...ఉప కారంబుగాన్ - లోకాలోక = చక్రవాళపర్వతమువఱకు (ఇది 'సప్తసముద్రములకు ఆవల నున్న పర్వతపంక్తి' అని పౌరాణికులు చెప్పుదురు. ఈలోకాలోకపర్వతముల కావల భూమి లేదు.), పరీత = వ్యాపించిన, భూ = భూమియందు, చర = సంచరించుచున్న, మహత్ = అధికమైన ( లెక్కకు మిక్కిలి యగు), లోక = జనులకు, ఉపకారంబుగాన్ = ఉపకార మగునట్లుగా, శ్రీ...చయముల్ -శ్రీ = శోభాయుక్తము లైనవియు ( ప్రసిద్ధిఁ జెందిన), కల్యాణకర = శుభమును కలిగించునవియు (జ్ఞానము నొసంగునని యనుట.); ఉరు = విశాలములయినవియునగు, కావ్య = రామాయణము మొదలగు కావ్యముల యొక్క , చయముల్ = సమూహములను, సిద్ధంబుఁ గావించి = నిర్మించి, సుశ్లోకుల్ = చక్కనికీర్తి గలవారును ('పద్యే యశసీ చ శ్లోకః - శ్లోకమనఁగాఁ 'బద్యము, కీర్తి' అని అమరము.), పుణ్యమతుల్ = నిర్మలమైన హృదయములు గలవారును, జగద్గురువులు - త్రిభువనములకును గురువులును, ఐ = అగుచు; శోభిల్లుచున్నట్టి, వాల్మీకి వ్యాస మయూర బాణకవి కాళీదాసులన్ = వాల్మీకి వ్యాసుఁడు మయూరుఁడు బాణుఁడు కాళిదాసుఁడు మొదలగు సంస్కృతకవులను, కొల్చెదన్ = సేవించెదను (కొనియాడెద ననుట).

తా. సకలజనులకును బరిపూర్ణజ్ఞానము నొసంగుచుఁ బరలోక సౌఖ్యములను గూడఁ గలిగించుచు మిగులఁ బ్రసిద్ధిఁ జెందియున్న విశాలములగు కావ్యముల నిర్మించి సప్తసముద్రముద్రిత మగునీభూమండలమునం దున్నవారల కందఱకు మహోపకారమును గావించి లోకగురువు లై పరిశుద్ధము లగుచిత్తములతో రాజిల్లుచుఁ దమకీర్తిచే లోకముల నెల్లఁ బావనముఁ జేయుచున్న వాల్మీకి వ్యాస మయూర బాణ కాళిదాసాదుల నభినుతించెదను.

***సు క వి వ ర్ణ న ము***

తే. మహితగురులఘువర్ణధర్మములు నియమ
    ములుఁ గలితకర్తృకర్మక్రియలను దెలిసి

     నామరూపావ్యయవిలక్షణంబు లాత్మ
     నెఱిఁగినకవీశ్వరుండె కవీశ్వరుండు 10

టీక. మహిత. . ,ములు - మహిత = ఒప్పుచున్న (లేక, గౌరవార్హము లైన), గురు= గురువులను, లఘు = లఘువులైనట్టియు, వర్ణ - అక్షరముల యొక్క (“దీర్ఘస్సంయుక్తాద్యః పూర్ణానుస్వారపూర్వవర్ణశ్చ" దీర్ఘమును, విసర్గలున్న యక్షరమును, సంయుక్తాక్షరమునకును, బూర్ణానుస్వారమునకును ముందున్నయక్షరమును గురువు లనఁబడును. మిగిలినవి లఘువులు. ), ధర్మములు = స్థితులును, నియమములు = యతిప్రాసనియమములును, కలిత... క్రియలను - కలిత = ఒప్పుచున్న, కర్తృ = కర్తలను, కర్మ = కర్మలను, క్రియలను = ధాతువులను, తెలిసి= తెలిసికొని, నామ...లక్షణంబులు - నామ = ప్రాతిపదికములయొక్కయు (ప్రాతిపదిక మనఁగా విభక్తిప్రత్యయములు గాని, వానికి సంబంధించిన వికారములుగాని కలుగక ముందున్న శబ్దరూపము; రామ, కృష్ణ, మొ.),రూప = విభక్తిరూపములయొక్కయు, అవ్యయ = అవ్యయములయొక్కయు, విలక్షణములన్ = చక్కనిలక్షణములను, (అనఁగా స్వరూపములను), ఆత్మన్ = తనలో, ఎఱిఁగిన కవీశ్వరుండె= తెలిసికొనిన కవీశ్వరుఁడె, కవీశ్వరుండు=కవి యనుటకుఁ దగినవాఁడు

ఈ పద్యమునందు బ్రహ్మవేత్తృపరముగ మఱియొకయర్థము కూడ స్ఫురించు చున్నది:-

టీక, గురు.. ధర్మములు - గురు = ఉత్తమములును, లఘు = అధమము లైన, వర్ణ = జాతులయొక్క, ధర్మములు = ఆచారనియమములను, నియమములు = యోగాంగము లగుశౌచము, తపస్సు మొదలగువానిని (నియమము లనుటచే యోగము సమగ్రమముగ అని అర్థము. కేవలము నియమములనిమాత్రమె తెలిసికొనినందున నంతప్రయోజనము లేదుగదా.), కలిత కర్తృ కర్మ క్రియలను - కలిత = ఒప్పుచున్నట్టి (అనఁగా : ప్రసిద్ధములైన), కర్తృ= చేయువాఁడు, కర్మ= చేయఁబడునది, క్రియ= చేయుట అను వానిని (వీనియథార్థస్వరూపము ననుట. ఇచ్చట ' క్రియ' అనఁగా ఫల మని కొందఱు. అది విచారింపవలసియున్నది.), తెలిసి, నామరూపా ...ముల - నామరూప = నామరూపములయొక్కయు (అనఁగా : నామరూపాత్మక మగు నీ ప్రపంచముయొక్కయు) అవ్యయ = ఈనామరూపములవలన వికారముఁ జెందని పరబ్రహ్మముయొక్కయు, విలక్షణముల్ = చక్కనిలక్షణములను, ఆత్మన్ = తనలో, ఎఱిఁగిన కవీశ్వరుండు= తెలిసినపండితోత్తముఁడె (ప్రపంచము మిథ్య యగుటచేత అది సర్వకాలములయందును గనఁబడుచునే యుండును గావునను, పరబ్రహ్మము తనకంటే వేఱైనవాఁడు గావున నచ్చటఁ జేయవలసినకార్య మేదియును లేకపోవుటచేతను, ఈ ప్రపంచబ్రహ్మములలక్షణములఁ జక్కఁగ నెఱుఁగుటయె పురుషార్థమని భావము.), కవీశ్వరుండు = పండితశ్రేష్ఠుఁడు (బ్రహ్మజ్ఞాని యనఁదగినవాఁ డనుట).

తా. గురువులు, లఘువులు, యతిప్రాసములు, కర్తృ కర్మ క్రియలు, ప్రాతిపదికములు, విభక్తిరూపములు, అవ్యయములు మొదలగు వానిధర్మముల బాగుగ నెఱిఁగి చక్కఁగ బ్రయోగింప గలకవియే కవి. (బ్రహ్మవేత్తృపరమునందు) మాయాకల్పిత మగు ప్రపంచముయొక్కయు నిర్వికారుఁడగు పరమాత్మ యొక్కయు, లక్షణముల బాగుగ నెఱింగి భ్రాంతిరహితుఁడై, చేయువాఁడు, చేయుట, చేయఁబడునది అను త్రిపుటి యొక్క యథార్థతత్త్వమును (అనఁగా; ఈ త్రిపుటి పరబ్రహ్మమునకంటె వేఱుకా దనువిషయమును, లేక, దీనివలనఁ గలుగు ఫలము లనిత్యములు గావున ఈకర్తృత్వాదులను బరిత్యజింపవలయు ననుటను) బాగుగ నెఱింగి చిత్తము స్థిరమగుటకై (లేక, పరమానందానుభవ మెప్పుడు జరుగుచుండుటకై) ధ్యానయోగము నాచరించుచు "నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన" - జ్ఞాని కర్మను జేసినను జేయకున్నను సమానమే” అను గీతావాక్యము ననుసరించి తన కెట్లున్నను బాధ లేదు గాన లోకసంగ్రహముకొఱకై (అనఁగా: లోకులను జక్కని మార్గమునందు నడిపించునిమిత్తముగ) తనకులమున కుచిత మగు ధర్మముల బాగుగ తెలిసి యాచరించుచు నుండుబ్రహ్మజ్ఞానియె బ్రహ్మజ్ఞాని. ఇతరులు లోకవంచకులు.

వ. అట్లు గావునన్. 11

టీక. అట్లుగావునన్ = పై పద్యమునందు చెప్పఁబడినవాఁడేకవీశ్వరుఁడుగావున.

——♦♦ ఆంధ్రకవినుతి ♦♦——

ఉ. నన్నయభట్టు నాంధ్రకవినాథునిఁ దిక్కనసోమయాజినిం
    బన్నుగ సోమసత్కవిని భాస్కరబమ్మెరపోతరాజులన్
    మున్ను ప్రసిద్ధి గాంచుకవిముఖ్యుల నందఱ నెమ్మనంబులో
    నెన్ని నమస్కరించెద నభీష్టఫలాప్తి దనర్చునట్లుగాన్.12

టీక. ఆంధ్రకవినాథునిన్ = ఆంధ్రకవులలో నుత్తముఁడగు, నన్నయభట్టున్, తిక్కనసోమయాజిని, పన్నుగన్ = ఒప్పునట్లుగా, సోమసత్కవిని = చక్కనికవి యగు నాచన సోమన యనువానిని, భాస్కరబమ్మెరపోతరాజులన్ = హుళక్కిభాస్కరుని (భాస్కరరామాయణకవి), బమ్మెరపోతరాజును, మున్ను = పూర్వమున, ప్రసిద్ధిగాంచు కవిముఖ్యులన్ = ప్రసిద్ధిఁచెందినకవిశ్రేష్ఠులను, అందఱన్ = అందఱిని (పైఁజెప్పిన వారిఁ గాక తక్కినవారలఁ గూడ నందఱిని), నెమ్మనంబులో = మనసులో, ఎన్ని = పొగడి, అభీష్టఫలాప్తి = కోరినఫల (గ్రంథనిర్మాణసామర్థ్యము) లాభము, తనర్చునట్లుగాన్ = కలుగునట్లుగా, నమస్కరించెదన్.

తా. ఆంధ్రకవులలో ముఖ్యుఁ డగు నన్నయభట్టును, తిక్కనసోమయాజిని, ఉత్తమకవి యగు నాచనసోముని, హుళక్కి భాస్కరుని, బమ్మెరపోతరాజును, మఱియుఁ బూర్వకాలమునందుఁ బ్రసిద్ధి గాంచినకవిశేఖరుల నందఱను వినుతించి నమస్కరించెదను. వారి యనుగ్రహముకలన నాకీ గ్రంథరచనయందుఁ దగిన సామర్థ్యము కలుగును గాక!

◀◀◀కుకవినిందనము▶▶▶

క. శుద్ధపదయుక్తిఁ దొఱఁగి య, బద్ధమును నిబద్దిగా నిబద్ది నొగి మహా
   బద్ధముగాఁ గనుకుకవుల, నౌద్ధత్యము మానుకొఱకు నభినందింతున్.

టీ. శుద్ధపదయుక్తిన్ = చక్కనిపదములను బ్రయోగించుటను, తొఱఁగి = విడిచి, అబధ్ధమున్ = వ్యాకరణనిబంధము లేనియపశబ్దమును, నిబద్దిగాన్ = పరిశుద్ధమైనదానినిగా, నిబద్దిన్ = పరిశుద్ధమైనదానిని, ఒగిన్ = నరుసగా, మహాబద్ధముగాన్ = మిగుల సపరిశుద్ధముగాను, కుకవులన్ = (భ్రమించు) కుకవులను (భాషాజ్ఞానము లేనికవులను), ఔద్ధత్యమున్ = గర్వమును (పరులకావ్యములను దిరస్కరించుటను), మానుకొఱకు = విడుచుటకై, అభినందింతున్ = కొనియాడెదను.

తా. సుశబ్దములఁ బ్రయోగించుట మాని యపశబ్దముల సుశబ్దములఁగను, సుశబ్దముల నపశబ్దములఁగను భ్రమించుచుఁ బరు లొనరించినగ్రంథములఁ దిరస్కరించుటయే పనిగా సంచరించుచుండు కుకవులఁ గొనియాడెదను. వారు నాగ్రంథమువైపునకు రాకుండెదరు గాక!

అవివేకిపరమైన యర్థము -

టీక. శుద్దపదయుక్తిన్ = పరిశుద్ధమగు మోక్షమును జెందటను (మోక్ష మనఁగా: తనరూపమును దా తెలిసికొనుట వలన కలుగుభ్రాంతినివృత్తి కావున మోక్షము సర్వకాలములయందును తనకు సిద్ధించియే యున్నది. ఇట్లున్నను, ఆమోక్షమును జెందుటకు ప్రయత్నింపక అజ్ఞానులు చెడుచున్నారని యభిప్రాయము .), తొఱఁగి, అబద్ధమున్ = అసత్యమగు దానిని (ప్రపంచమును), నిబద్దిగాన్ = సత్యము గాను, నిబద్ధిన్ = సత్యమును (పరబ్రహ్మమును), ఒగిన్ ,మహాబద్ధముగాన్ = మిగుల నసత్యమైనదానినిగాను, కను కుకవులన్ = (తమభ్రాంతివలన) చూచుచున్న (లేక, భావింపుచున్న) దుష్పండితులను (యథార్ధజ్ఞానము లేకున్నను, పండితులమని యభిమానించుకొనుచుండు నజ్ఞానులను), ఔద్ధత్యమున్ = కుతర్కవిజృంభణములను, మానుకొఱకున్ అభినందింతున్.

తా. నిర్మలమై స్వభావసిద్ధమై యున్న మోక్షమువైపునకు పోక యసత్యమగు ప్రపంచమునే సత్యముగాను, పరబ్రహ్మము నసత్యముగాను తలంచుచు నీ విషయసుఖ ములే సత్యము లనియు, నింతకంటె నికరము లగు సౌఖ్యములు లేవనియు భ్రాంతిఁ జెంది పరమానందరూప మగుమోక్షమును గూడ ధిక్కరించుచుఁ దమ కేమియు దెలియకున్నను సర్వమును దెలిసితిమని విఱ్ఱవీగుచుఁ గుతర్కముల నాచరించుచుండు నవివేకులకు నమస్కారము. వా రీదెసకు రాకుండుదురు గాక!

అవ . ఈకవి యిష్టదేవతాప్రార్ధనము ముగించువాఁడై యీ క్రిందిపద్యమున సకలభూతములకును నమస్కారము నాచరించుచున్నాడు.—

మ. గరిమన్ స్వర్ణ మనేకభూషణములై కన్పట్టుచందంబునం
    బరమాత్ముం డఖిలప్రపంచమయుఁ డై భాసిల్లు న ట్లౌటచే
    సురసిద్ధోరగయక్షకిన్నరనరస్తోమాదిశశ్వచ్చరా
    చరరూపోజ్జ్వలసర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్.14

టీక . గరిమన్ = గౌరవము చేత, స్వర్ణము=బంగారు (ఒక్కటియైనను), అనేకభూషణములు ఐ = నానావిధములగు (నామములును రూపములును గల) భూషణములుగా నేర్పడి, కన్పట్టుచందంబునన్ = కనఁబడునట్లు, పరమాత్ముండు= నిర్గుణ నిర్వికార పరబ్రహ్మము, అఖిల ప్రపంచమయుఁడు ఐ = అనేకవిధము లగు భేదములగల యీ ప్రపంచమంతయును దానే యై, భాసిల్లున్ = ప్రకాశించుచున్నాడు. అట్లు ఔటచేన్ = కాఁబట్టి, సుర... భూతములకున్ - సుర , సిద్ధ, ఉరగ = నాగకుమారులు, యక్ష, కిన్నర, నర (వీరియొక్క), స్తోమ = సమూహములే, ఆది=మొదలుగాఁ గల, శశ్వత్ = పలుమఱు తిరుగు (జన్మపరంపరల నొందు), చర = జంగమములును (సంచరింపఁగలిగినవి), అచర = స్థావరములును (కదలనేరనివి ) అగు, రూప = మనుష్యులు మృగములు పక్షులు కొండలు వృక్షములు మొదలగురూపములతో, ఉజ్జ్వల= ప్రకాశించుచున్న, సర్వ = సమస్తములైన, భూతములకున్ = జంతుజాలమునకు, సద్భక్తితోన్ = మిగులభక్తితో, మ్రొక్కెదన్ = నమస్కరింతును.

తా. సువర్ణ మొక్కటి యయ్యును అనేకభేదములు గల భూషణములై యున్నట్లు పరబ్రహ్మ మొక్కఁ డయ్యును, నానాభేదములు గల ప్రపంచమై తోఁచు చున్నాఁడు. కావున నీప్రపంచములో నెద్దియు నాబ్రహ్మమునకంటె నితరము కాదు. కాఁబట్టి దేవసిద్ధనాగయక్షకిన్నరమనుప్యసమూహములకును, మఱియు ననేకవిధము లై జంగమస్థావరరూపములగు సకలభూతసంఘంబులకును నమస్కారము చేసెదను. (ఈభూతములు బహరూపము లగుటచే సత్యములయ్యును గల్పితమగు కర్మసంబంధముచే పలుమాఱు జన్మించుచు, మృతినొందుచు, ఒక దేహమును బరిత్యజించుచు, మఱియొక దేహమును గైకొనుచు తిరుగుచుండును. కావున భూతభవిష్యద్వర్తమానకాలములయందలి సకలప్రపంచమునకును నేను మిగుల భక్తితో వందనముల నాచరించెద ననుట.)

అవ. తా నీ ప్రబంధము నొనర్చుటకుఁ గల కారణము నీ క్రింద వివరించుచున్నాడు.-

వ. అని యిష్టదేవతాప్రార్థనంబును సద్గురుకీర్తనంబును సంస్కృతాంధ్ర
   సత్కవిస్తోత్రంబును గావించి యేను ముముక్షుజనహితంబును
   సంసారసాగరోత్తారకంబును దారకసాంఖ్యామనస్కాత్మకంబును జీవ
   బ్రహ్మైక్యసాక్షాత్కారసాధారణకారణంబు నైనరాజయోగం బంత
   యు నొక్కప్రబంధంబు గా రచియింప నిశ్చయించి పరమైకాం
   తంబు శ్రీగురుమంత్రదేవతాతత్త్వానుసంధానంబు సేయుచున్న
   సమయంబున. 15

టీ. అని=ఇట్లు, ఇష్టదేవతాప్రార్ధనంబును = ఇష్టదేవతేలను వేఁడుటయును, సద్గురుకీర్తనంబును =సద్గురువులను నుతించుటయు, సంస్కృతాంధ్రసత్కవిస్తోత్రంబును = సంస్కృతకవుల నాంధ్రకవుల నుతించుటయును, కావించి = చేసి, ఏను = నేను, ముముక్షు... హితంబును - ముముక్షు = మోక్షమునుగోరు, జన = మనుష్యులకు, హితంబును = మేలుసేయునదియును , సంసార...బును సంసార=సంసారమనియెడు, సాగర=సముద్రమునుండి, ఉత్తారకంబును = తరింపజేయునదియు , తారక... బును... తారక = తారకయోగము, సాంఖ్య = సాంఖ్యయోగము, అమనస్క = అమనస్కయోగము, ఆత్మకంబును = స్వరూపముగాఁ గలదియును, జీవ .... కారణంబును ..జీవ = జీవునకును,బ్రహ్మ = పరబ్రహ్మమునకునుగల, ఐక్య= అభేదమును, సాక్షాత్కార = ప్రత్యక్షముగాఁ దెలిసికొనుటయందు, సాధారణ = సుఖమైన, కారణంబును = సాధనంబును, ఐన, రాజయోగంబున్ అంతయున్ = రాజయోగమును సంపూర్ణముగా, ఒక్క ప్రబంధంబుగా = ఒక్క కావ్యముగా, రచియింపన్ = చేయుటకు, నిశ్చయించి, పరమై .. బునన్ - పరమ = శ్రేష్ఠమైన, ఏకాంతంబునవ్ = విజనస్థలమునందు, శ్రీ...అనుసంధానంబున్ - శ్రీ=శోభాయుక్తుఁడైన, గురు = గురువగుమహాదేవాచార్యుఁడె స్వరూపముగాఁగల, మంత్రదేవతా = తారకమంత్రాధిదేవత (యగు శ్రీరామమూర్తి) యొక్క, తత్త్వ = పరమార్థపరబ్రహ్మస్వరూపముయొక్క, అనుసంధానంబున్ = ధ్యానమును, చేయుచున్, ఉన్న సమయంబునన్.

తా. ఇట్లు ఇష్టదేవతలఁ బ్రార్థించి సద్గురువులఁ గొనియాడి సంస్కృతాంధ్రకవులకు నమస్కరించి సంసార మనుసముద్రమును దరింపఁజేయుటకును, జీవునకును బ్రహ్మమునకును భేదము లేదనువిషయము ప్రత్యక్షముగఁ దెలియఁజేయుటకును, సుఖమగు సాధనమై, మోక్షాపేక్ష గలవారలకు మిగుల మేలుచేయు రాజయోగమును దారకసాంఖ్యామనస్కము లను మూఁడుభేదములు గలదానిని సమగ్రముగాఁ గావ్యముచేఁ వర్ణింపఁబూని నే నేకాంతస్థలమునందుండి మహాదేవగురురూపుఁ డగు శ్రీరాముని పరమార్థరూపమును (నాకును బ్రహ్మమునకును భేదములేదు; అను విషయమును) ధ్యానించుచుండఁగా (పైపద్యముతో నన్వయించుకొనవలయును).

సీ. కమనీయవరదివ్యకాంచనచేలంబుఁ, గాషాయవస్త్రంబుగా ధరించి
    చాపబాణంబులు చంచత్కమండలు, దండము ల్గాఁగ హస్తములఁ బూని
    రమణీయరత్నహారంబు రుద్రాక్షమా, లికగా గళంబున లీలఁ దాల్చి
    సీతావధూటిని శ్రీరాజయోగాహ్వ, యాధ్యాత్మవిద్యగా నవధరించి

తే. ప్రేమ మీఱంగ శ్రీరామ రామ రామ
    యనుచుఁ దనపేరు నుడువుచు నద్భుతముగ
    శ్రీమహాదేవగురుఁ డైనరామవిభుఁడు
    గరుణతోడుత నెదుర సాక్షాత్కరించె.16

టీ. కమనీయ. .. చేలంబు - కమనీయ = రమ్యమైన, వర= శ్రేష్ఠమైన, దివ్య = దేవలోకసంబంధమైన, కాంచనచేలంబు = సువర్ణవస్త్రమును, కాషాయవస్త్రంబుగాన్ = కాషాయవస్త్ర మగునట్లుగా (కాషాయవస్త్రమువలె) ధరించి, చాపబాణంబులు = ధనుస్సు బాణంబులును, చంచత్ .. దండముల్ - చంచత్ = ప్రకాశించుచున్న, కమండలు - కమండలములు, దండముల్ = దండము, ఇని, కాఁగన్ = అగునట్లుగా, హస్తములన్ = చేతులయందు, పూని = ధరించి, రమణీయరత్నహారంబున్ - మనోహర మగురత్నాలహారము, రుద్రాక్షమాలికగాన్ , గళంబునన్ = కంఠమునందు, లీలన్ = విలాసముగా, తాల్చి = ధరించి, సీతావధూటిన్ = సీతాదేవిని, శ్రీ...విద్యగాన్ - శ్రీ = ఒప్పుచున్న, రాజయోగ = రాజయోగ మనియెడు, ఆఖ్య = పేరుగల, ఆధ్యాత్మవిద్యగాన్ = ఆత్మవిద్యగా, అవధరించి = స్వీకరించి (పార్శ్వమునం దుంచుకొని) ప్రేమ మీరంగన్ = ప్రీతి యధికమగుచుండఁగా (నన్ననుగ్రహించి,} శ్రీరామరామ, అనుచున్ , తనదుపేరున్ = తనదివ్యనామమును, నుడువుచున్ = చెప్పుచు, అద్భుతముగన్ =ఆశ్చర్యము గలుగునట్లుగా, శ్రీమహాదేవగురుఁడు అయిన= శ్రీమహాదేవగురుస్వరూపుఁడైన, రామవిభుఁడు = శ్రీరామమూర్తి, కరుణతోడుతన్ = దయతో, ఎదురన్, సాక్షాత్కరించెన్ = ప్రత్యక్షమయ్యెను.

తా. మనోహర మగుపీతాంబరము కాషాయవస్త్రముగ, ధనుర్బాణంబులు కమండలు దండములుగ, రత్నహారంబులు రుద్రాక్షమాలికలుగ, సీతామహాదేవి రూపమునుదాల్చినవేదాంతవిద్ గా,తన నామధేయము నెఱిఁగించుట తారకజపముగ, నా శ్రీరామమూర్తి మహాదేవగురుస్వరూపముతో న పైఁ గరుణ వెలయఁ బ్రత్యక్ష మయ్యెను.

(ఇచ్చట శ్రీరామమూర్తికిని, మహాదేవాచార్యునకును అభేదము చెప్పఁబడియున్నది. శ్రీరామునకుఁ గల పీతాంబరము మొదలగునవి అన్నియు మహాదేవి యతీంద్రునకుఁ గల కాషాయవస్త్రము మొదలగునవిగా వర్ణింపబడియున్నవి. కావున ప్రత్యక్షమైనవాఁడు రామమూర్తియే యనియు, ఆయనను గురుస్వరూపునిగా నీకవి భావించెననియు పాఠకులు తెలిసికొందురు గాత.)

వ. ఇట్లు శిష్యవాత్సల్యంబున సాక్షాత్కరించి మదీయదీర్ఘదండనమస్కారంబులు చతుర్విధపురుషార్థప్రదచతురక్షరసమన్వితనారాయణస్మరణ పూర్వకంబుగా నంగీకరించి కలకల నవ్వుచు శరీరత్రయవిలక్షణావస్థాత్రయసాక్షిపంచకోశవ్యతిరిక్త సచ్చిదానందస్వరూప ప్రత్యగాత్ముండ వైననీవ సత్యజ్ఞానానందస్వరూపపరమాత్ముండ నైన నేను; సత్యజ్ఞానానంద స్వరూపపరమాత్ముండ నైన నేన సచ్చిదానందస్వరూప ప్రత్యగాతుండ వైననీ వని సర్వోపనిషత్సారభూతార్థం బైనపరమతత్త్వరహస్యార్థం బుపదేశించి యీయభేదవిజ్ఞానదృష్టిచేత నిరంతరంబు న న్నవలోకించుచు జీవన్ముక్తిసుఖం బనుభవింపుము. ప్రారబ్ధభోగావసానసమయంబున ఘటాకాశంబు మహాకాశంబునం గలసినవిధంబున నాయందు విదేహకైవల్యంబు నొందెదు సందేహంబు లేదని యాజ్ఞాపించి యిప్పు డీవు బ్రహ్మాండపురాణంబునం దధ్యాత్మరామాయణం బుమామహేశ్వరసంవాదరూపం బై యొప్పు నందు శ్రీరామహృదయం బనునితిహాసంబు సీతారామాంజనేయసంవాదంబునఁ బ్రవరిల్లు నది సంక్షేపరూపంబు గావున నయ్యర్థంబు విస్తరించి యొక్కప్రబంధంబుగా రచియించి నాపేర నంకితంబు సేయుము సర్వపాపవినిర్ముక్తుండవై కృతార్థుండ వయ్యెద వని యానతిచ్చి తిరోహితుండయ్యె నంతట మేల్కని పరమానందభరితాంతఃకరణుండనై ,

టీక . ఇట్లు= ఈ ప్రకారముగ, శిష్యవాత్సల్యంబున్ = శిష్యునియందలి ప్రీతిచేత, (గురుజనులయందున్న ప్రేమకు భక్తి అనియు, స్త్రీలయందున్న ప్రీతి కనురాగ మనియు, సోదరీసోదరపుత్రశిష్యాదులయందుగల ప్రీతికి వాత్సల్య మనియు పేరు.) సాక్షాత్కరించి= ప్రత్యక్షమై, మదీయదీర్ఘదండనమస్కారంబులు = నాసాష్టాంగనమస్కారములను, చతు...గాన్ - చతుర్విధ - నాలుగువిధములైన, పురుషార్థ = ధర్మార్థకామమోక్షము లనుపురుషార్థముల (పురుషార్థము లనఁగా : పురుషునిచే నవశ్యము సాధింపబడవలయునవి. వీనిలో దేనినైనను సాధింపకుండిన జన్మము నిరర్థకము; అందు ధర్మమోక్షములు ప్రధానములు; అర్థకామము లప్రధానములు అనఁగా ; అర్థకామముల విడిచియైనను ధర్మమోక్షముల నార్జింపవలయును. ధర్మమోక్షములకు

విరుద్ధకామములు పనికిరావనుట.) ప్రద= ఇచ్చునట్టి, చతురక్షర = నాలుగు అక్షరములతో, సమన్విత = కూడిన, నారాయణ= నారాయణ అనెడు పేరు యొక్క , (ఈనారాయణపదమునందలి నాలుగు అక్షరములును, క్రమముగ నాలుగుపురుషార్థములను గలుగఁజేయు నని భావము.) స్మరణపూర్వకంబుగాన్ = స్మరించుటయే (లేక, ఉచ్చరించుటయే) మొదలగునట్లుగా ఉచ్చరించుచు, ఆంగీకరించి, కలకలనవ్వుచువ్ , శరీర...ఆత్ముఁడవు-శరీరత్రయ = స్థూలసూక్ష్మకారణము లనుమూఁడు శరీరములకును, విలక్షణ = లేనట్టియు, అవస్థాత్రయ = జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనియెడు మూఁడు అవస్థలకును, సాక్షి= చూచునట్టి, పంచకోశ = అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అను నైదుకోశములకంటెను, (కోశ మనఁగా; ఆవరించునది. పరమాత్మస్వరూపము తెలియకుండునట్లు ఆవరించుచున్నవి గావున ఈ అన్నమయాదులకుఁగూడఁ గోళములని పేరు గలిగెను.) వ్యతిరిక్త = వేఱైనట్టియు, సత్ =సత్తామాత్రస్వరూపుఁడై నట్టియు, (సత్త అనఁగా: ఉనికి. ఇదియె పరబ్రహ్మమునకును జీవునకును స్వరూపము.) చిత్ = చైతన్యము, ఆనంద = ఆనందము, స్వరూప = స్వరూపముగాగల, ప్రత్యగాత్ముండవు అయిన జీవుఁడవైన, (సర్వదేశములయందును, సర్వకాలములయందును, సర్వవస్తువులయందును ఉండుట అనునొక స్వరూపముతో నిలిచియుండుట.) చైతన్యము = (జ్ఞానము), ఆనందము (ఇదియె జీవునియాకారము.) నీవ = నీవే, సత్యజ్ఞానానందస్వరూప పరమాత్ముండను = సచ్చిదానంద స్వరూపము గాఁగల పరబ్రహ్మస్వరూపుఁడను, అయిన, "నేనం నేనే, సచ్చిదానంద స్వరూపప్రత్యగాత్ముండవు, అయిన, నీవు, అని, సర్వ... అర్థంబు-సర్వ = సారాంశ మగు ఉపనిషత్సారభూత = (ఉపనిషత్తులయొక్క పరమాభిప్రాయము.) అర్థంబుఅయిన = విషయమైన, పరమతత్త్వరహస్యార్థంబున్ = పరతత్త్వమనియెడు రహస్యవిషయమును, ఉపదేశించి, ఈ...దృష్టిచేన్ - ఈ = పైన వివరింపఁబడిన, అభేదవిజ్ఞానదృష్టిచేన్ = జీవబ్రహ్మైక్యము నెఱుంగుట యనెడు దృష్టి చేత, నిరంతరంబున్ = సర్వకాలములయందును, నన్నున్ = పరబ్రహస్వరూపుఁ డగు నన్ను, అవలోకించుచున్ = చూచుచు (నేను పరబ్రహ్మమును ఒక్కటియే యని నిదిధ్యాసనము చేయుచు), జీవన్ముక్తిసుఖంబున్ = బ్రతికియుండియే మోక్షమును జెందుట (భ్రాంతిని విడుచుట) వలనఁ గలుగునానందమును, ('నేనుమనుష్యుఁడను బ్రాహ్మణుండను' అను మొదలగు నభిమానము లున్నంతకాలము బహువిధము లగుదుఃఖములు కలుగును.'నాకీప్రపంచమునందలి వికారము లంటవు.నాకును పరబ్రహ్మమునకును భేదము లేదు' అనుజ్ఞానము దృఢముగఁ గలిగెనేని యీ దుఃఖములు వానిని బాధింపవు. ఇదియే జీవన్ముక్తి) అనుభవింపుము, ప్రా... సమయంబున - ప్రారబ్ధ = ప్రస్తుతశరీరమునందు సుఖదుఃఖఫలముల నొసంగుట కారంభించిన కర్మముయొక్క, భోగ = అనుభవముయొక్క అవసానంబున = అంతమునందు (మరణ సమయమునందు ప్రారబ్ధకర్మ మనుభవించిననే యీశరీరము తొలఁగిపోవును. ఇదియే మరణము.) ఘటాకాశంబు = కుండలోని యాకాశము, మహాకాశంబునన్ = సర్వవ్యాపక మగునాకాశమందు, కలసినవిధంబునన్ = అప్రయత్నముగనే ఐక్యమును జెందినట్లు, (ప్రతిస్థలమునందును ఆకాశము గలదు గదా! కుండలోపల నున్న యాకాశము, లేక, కుండలోపల జలములోఁ బ్రతిబింబించిన యాకాశము ఆకుండ పగిలిపోవఁగానే మహాకాశములో నప్రయత్నముగఁ గలసిపోవుట ప్రత్యక్షము.) నాయందున్ = పరబ్రహ్మస్వరూపుఁడ నగునాలోన, విదేహకైవల్యంబున్ = దేహోపాధి లేకపోవుటచేతఁ బరిపూర్ణ మగునైక్యమును (మోక్షమును) ఒందెదు=పొందఁగలవు. సందేహంబు లేదు, అని, ఆజ్ఞాపించి, ఇప్పుడు, ఈవు = నీవు, బ్రహ్మాండపురాణంబునందున్, అధ్యాత్మ రామాయణంబు, ఉమామహేశ్వర సంవాదరూపంబై = పార్వతీపరమేశ్వరుల ప్రశ్నోత్తరరూపంబుగ, ఒప్పున్ = కలదు, అందున్ = ఆ అధ్యాత్మ రామాయణంబునందు, శ్రీరామహృదయంబు, అను, ఇతిహాసంబు = కథ, సీతారామాంజనేయసంవాదంబున్ = సీతారామహనుమంతులసంవాదముతో, ప్రవర్తిల్లున్ = ఉన్నది. (సీతారామాంజనేయులసంవాదమే ఆ శ్రీరామహృదయమునందలివృత్తాంతము అనుట.) అది = ఆకథ, సంక్షేపరూపంబు = మిగులసంగ్రహంబుగా నున్నది, కావునన్, అయ్యర్థంబు = ఆకథయందలివిషయంబును, విస్తరించి, ఒక్క ప్రబంధంబుగాన్ = ఒక కావ్యముగా, రచియించి = చేసి, నాపేరన్ = నా పేరుతో, అంకితంబుసేయుము = నాకు కృతి యిమ్ము, సర్వపాపవినిర్ముక్తుండవు ఐ = పాపరహితుఁడవై , కృతార్థుండవు అయ్యెదవు, అని, ఆనతిచ్చి = ఆజ్ఞాపించి, తిరోహితుండు= అంతర్థానముఁ జెందినవాఁడు, అయ్యెన్ , అంతటన్ = తర్వాత, మేల్కని = ధ్యానమునుజాలించి, పరమ .... నై - పరమ= అధికమగు, ఆనంద = సంతోషముతో, భరిత= నిండిన, అంతఃకరణుండను ఐ = మనస్సుకలవాడ నై, (ఉత్తరపద్యముతో నన్వయము.)

తా. ఇట్లా మహాదేవగురురూపుఁ డగు శ్రీరామమూర్తి శిష్యునియందలి ప్రేమాతిశయముచేఁ బ్రత్యక్షమై, ధర్మార్థకామమోక్షముల నొసంగఁజాలునక్షరములు గల నారాయణనామము నుచ్చరించుచు నే నొనర్చు సాష్టాంగనమస్కారముల నంగీకరించి పకపక నవ్వుచు, 'నాకంటె నీవు గాని నీకంటె నేను గాని వేఱుకాము. నీవు స్థూలసూక్ష్మకారణశరీరములకంటె వేరై జాగ్రదాదు లగునవస్థల జూచుచుఁ బంచకోశముల నతిక్రమించి సచ్చిదానందస్వరూపుఁడవై యున్నావు. నేనును అట్లె యున్నాను. కావున మన కిరువురకును భేద మించు కైనను లేదు. ఈఅభేదదృష్టిని మనసునందు స్థిరముగ నిలిపికొని జీవన్ముక్తి ననుభవింపుము. ప్రారబ్ధానుభవము ముగిసినపిదప ఘటాకాశము మహాకాశమునం దైక్యముఁ జెందునట్లు నాయం దైక్యము నొందెదవు, అని సర్వోపనిషత్సార మగువిషయము నుపదేశించి, మరల "ప్రస్తుతము నీవు చేయవలసిన కార్య మొకటి కలదు, బ్రహ్మాండపురాణంబునం బార్వతీపరమేశ్వరసంవాదరూపముగ నధ్యాత్మరామాయణము కలదు. దానియందు సీతారామాంజనేయసంవాదరూప' మగు శ్రీరామహృదయ మను నితిహాసము మిగుల సంక్షేపముగ నున్నది. దాని విస్తరించి యొకకావ్య మొనరించి నాకుం గృతి యిమ్ము దీనిచే సకలపాపరహితుఁడ వై, కృతకృత్యుఁడ వగుదువు." ఆని యాజ్ఞాపించి యంతర్థానమును జెందెను. తర్వాత నేనును సమాధిని విడిచి యాచార్యుని పరమానుగ్రహమువలన నుల్లాసముఁ జెందుమనస్సుతో.

——♦♦♦♦§కృతికర్తృభాగ్యప్రశంస.§♦♦♦♦——

శా. శ్రీవిశ్వేశ్వరపార్వతీప్రియదమున్ శ్రీజానకీ రామవా
    క్యావిర్భూతము మారుతాత్మజసుబోధ్యం బై తగన్ శ్రీమహా
    దేవాచార్యవరాంకితంబుగను ధాత్రి న్రాజయోగంబు సం
    భావింపన్ రచియింపఁ గల్గె నిఁక నాభాగ్యంబు సామాన్యమే? 17

టీ. శ్రీ ...దమున్ - శ్రీ = సంపద్యుక్తులైన, విశ్వేశ్వర = ఈశ్వరునకును, పార్వతీ = పార్వతీదేవికిని, ప్రియదమున్ = సంతోషము గలిగించునట్టియు, శ్రీ...భూతము - శ్రీజానకీ = సీతాదేవియొక్కయు, రామ= శ్రీరామునియొక్కయు, వాక్య = వాక్యములనుండి, ఆవిర్భూతము = పుట్టినట్టియు, మారుతాత్మజసుబోధ్యంబు = ఆంజనేయునకు బాగుగఁ దెలుపఁ దగినది. (ఆంజనేయున కుపదేశించినది) ఐ = అయిన, రాజయోగంబున్ = తారకసాంఖ్యామనస్కరూప మగురాజయోగమును, తగన్ = ఒప్పు నట్లుగా, శ్రీ...గను - శ్రీమహాదేవాచార్యవర = మహాదేవయతి యను నాచార్యశ్రేష్ఠునకు, అంకితంబుగను= సమర్పితంబుగ, ధాత్రిన్ = భూమియందు, సంభావింపన్ = సర్వజనులును గౌరవించునట్లుగా, రచియింపన్ కల్గెన్ = చేయుటకుఁ దటస్థమయ్యెను. (కావ్యముగా రచించుట తటస్థ మయ్యె ననుట.) ఇకన్ = ఇప్పుడు, ( లేక, ఇట్లగుటచేత,) నా భాగ్యంబు = నాయదృష్టము, సామాన్యమే = స్వల్పమైనదా?

తా. పార్వతీపరమేశ్వరులకు సంతోషకరమై, మహానుభావుఁ డగు హనుమంతునకు సీతారాములు చేసినయుపదేశమే స్వరూపముగాఁ గలిగిన యీ రాజయోగమును, ఒక ప్రబంధముగా రచియింప సమకూరెను. ఆందును సదాచార్యులలో నుత్తమోత్తముఁ డగుమహాదేవాచార్యుఁడు కృతిపతి యయ్యెను. ఇక నాభాగ్యము నకు మితి గలదా?

క. దివ్యము భవ్యం బగుమ, త్కావ్యము సంతతము మోక్షకాలముచే శ్రో
   తవ్యము వక్తవ్యము మం, తవ్యము భావ్యమును గీర్తితవ్యము గాదే?

టీక. దివ్యము = శ్రేష్ఠమయినదియు, భవ్యంబు = క్షేమకర మైనదియు, అగు మత్కావ్యము = అయిన నా కావ్యము, సంతతమున్ = ఎల్లప్పుడును, మోక్షకాలముచేన్ = మోక్షేచ్ఛగలవారిచే, శ్రోతవ్యము = వినఁదగినదియు, వక్తవ్యము = పఠింపఁదగినదియు, మంతవ్యము = మననము, (లేక విచారణము చేయఁదగినదియు), భావ్యమును = అన్నిఁటిలో నుత్తమమని, తలఁపఁదగినదియు, కీర్తితవ్యము = కొనియాడఁదగినదియు, కాదే = కాకుండునా? (అగుననుట. )

తా. పైపద్యమునందు వర్ణింపఁబడిన విధముగ నుపదేశ మొనర్చినవారు, దాని గ్రహించినవారును, ఆచరిత్రమును మిగుల నాదరముతో గ్రహించినవారును, గృతిపతియును, ఉత్తమోత్తములై యుండుటచే నేను రచింపఁబోవు కావ్యము పరమపవిత్ర మైనదియు లోకులకు క్షేమము కలిగింపఁజాలినదియుఁ గాఁగలదు. మోక్షేచ్ఛ గల ప్రతిమనుజుఁడును సదా దీని నాకర్ణించుచుఁ బఠించుచు దీని యర్థమును మననము సేయుచు దీనికంటె నుత్తమమైనది మఱియొకటి లే దని ప్రశంసింపఁగలరు. దీనికి సంశయములేదు.

వ. అని విచారించి సంతోషభరితచిత్తుండ నై మదీయాచార్యపరంపరావతారంబు నభివర్ణించెద.

టీక. అని = పైనఁజెప్పినవిధముగ, విచారించి, సంతోషభరితచిత్తుండను ఐ = సంతోషముచేఁ బూర్ణ మగుమనస్సు గలవాఁడ నై, మదీయ...అవతారంబున్ - మదీయ= నాసంబంధముగల, ఆచార్య = గురువులయొక్క, పరంపరా = వరుసయొక్క, అవతారంబున్ = క్రమమును, అభివర్ణించితిన్ = వర్ణించితిని. (గ్రంథారంభమునకు ఉపక్రమించితి నని భావము.)

తా. పైన వర్ణించిన విధముగా నామహాభాగ్యమును గూర్చియుఁ గావ్యముయొక్క మహాత్మ్యమును గూర్చియు విచారించి మిగుల సంతోషముతోఁ దత్ క్షణమే కావ్యము నుపక్రమించి దానిమొదట నలంకారంబుగ నాగురుపరంపరను వర్ణింప నారంభించినాఁడను.

——♦♦♦♦§గురుపరంపరాభివర్ణనము§♦♦♦♦——

అవ. వంశము రెండు విధములు :- విద్యావంశము, జన్మచేఁగలుగువంశము. అందు శరీరమును మాత్ర మొసంగఁగలజన్మవంశముకంటె సర్వవ్యవహారసాధన మగుజ్ఞాన మొసంగిన విద్యావంశ ముత్తమ మను నభిప్రాయమును సూచించుచు కవి మొట్టమొదట గురుపరంపర నభివర్ణించుచున్నాఁడు:-

శా. సత్తామాత్రుఁడు నిర్విశేషుఁడు తనూసర్వేంద్రియప్రాణహృ
    చ్చిత్తాహంకృతిధిప్రకాశకుఁడు సచ్చిత్తోషకాయుండు వి

   ద్వత్తాపాంధతమఃప్రదీపమయుఁ డాత్మస్వామి భాసిల్లె శ్రీ
   దత్తాత్రేయగురుం డనంగ జగదంతర్యామి యై మున్నిలన్. 20

టీక . సత్తామాత్రుఁడు=సత్తయె, (ఉనికియె, లేక దేశకాలవస్తువులవలనఁ గలుగు మార్పులు లేక పోవుటయే) , స్వరూపముగాఁ గలవాడును, నిర్విశేషుఁడు = భేదములు, విచారములు, ధర్మములు లేక నేకస్వరూపుఁడై యుండువాఁడును, తను. . . . ప్రకాశకుఁడు - తను = స్థూలసూక్ష్మకారణశరీరములను, సర్వేంద్రియ = సమస్తములగు నింద్రియములను, ప్రాణ = ప్రాణములను, హృత్ = మనస్సును, (సంకల్పముఁజేయు నంతఃకరణము) చిత్త, (సందేహించునట్టి యంతఃకరణము) అహంకృతి = అహంకారమును, (ఇది. “ఈపని నెట్లైనను జేయుదును” అని యుక్తాయుక్తవిచారణము కూడఁ జేయక త్వరపడు నంతఃకరణము,) ధీ=జబుద్ధిని (ఇది యుక్తాయుక్తవిచారపూర్వకముగఁ గార్యములను నిశ్చయించు నంతఃకరణము. అంతఃకరణ మొక్కటియే యైనను, అయావృత్తులచే, అనఁగా ఆయావృత్తులు గలిగినసమయములయందు ఆయాపేర్ల చే వ్యవహరింపఁబడుచున్నది. అని తెలిసికొనవలయు) ప్రకాశకుడు = ప్రకాశింపఁజేయువాఁడును, సత్... కాయుండు - సత్ = సత్యమును, చిత్ = జ్ఞానము, తోష= ఆనందమును, కాయుండు = స్వరూపముగాఁ గలవాఁడును, విద్వత్ ...మయుఁడు- విద్వత్ = జ్ఞానులయొక్క, తాప = తాపత్రయ మనియెడు, అంధతమః = గాఢాంధకారమునకు, ప్రదీపమయుఁడు = దీపముతో సమానుఁడు" (పోఁగొట్టువాఁడు) అగు...ఆత్మస్వామి= పరబ్రహ్మరూపుఁడు, శ్రీదత్తాత్రేయగురుండు అనంగన్ = శ్రీదత్తాత్రేయాచార్యుఁ డనుపేర, జగదంతర్యామి యై = సర్వాజగత్తులను నియమించువాఁడై, ఇలన్ = ఈభూమియందు, మున్ను = పూర్వకాలముస, భాసిల్లెన్ = ప్రకాశించెను. (కలఁ డనుట).

తా. దేశకాలవస్తువులచేఁ గల్గు భేదములు లేక (సర్వదేశములయందును, సర్వకాలములయందును సర్వవస్తువులయంచును ఒక్క రూపముగ నుండుచు) మనోబుద్ధిచిత్తాహంకారములకు సాక్షియై సచ్చిదానందరూపుఁ డై యాశ్రితు లగువారి తాపత్రయముల నడంచుచు, నొక్క కూటస్థపరబ్రహ్మము (భ్రాంతి లేని జీవుఁడు) సకలజగంబుల నియమించుచు, దత్తాత్రేయాచార్యుం డనుపేర భూమి పై వెలుఁగొందు చుండెను.

క. ఆదత్తాత్రేయగురు, శ్రీదివ్యపదారవిందసేవాది శ్రీ
   మోదుఁడు ప్రత్యక్షప్ర, హ్లాదుం డన శ్రీజనార్దనాహ్వయుఁ డొప్పున్.

టీక. ఆదత్తా...దుఁడు-ఆ దత్తాత్రేయగురు = దత్తాత్రేయాచార్యునియొక్క శ్రీ = మంగళకరము లైనట్టియు, దివ్య= ఉత్తమోత్తమము లైనట్టియు, పదారవింద = పాదకమలములయొక్క. సేవాది = సేవ మొదలగునవియే, ( లేక, సేవ మొదలగువానివలనఁ గలిగిన,) శ్రీమోదుఁడు=సంపదచే సంతోషించువాఁడు, (లేక , సంపదయే సంతోషముగాఁ గలవాడు,) అగు, శ్రీజనార్దనాహ్వయుఁడు = జనార్దనుఁడను యోగి, ప్రత్యక్షప్రహ్లాదుండు అనగా ప్రత్యక్షముగాఁ గానవచ్చుచున్న ప్రహ్లాదుఁడో యనునట్లు, ఒప్పున్ = ప్రకాశించుచుండెను.

తా. అదత్తాత్రేయగురువునకు శిష్యుఁడై యమ్మహానుభావునిపాదసేవయే తనకు మహోన్నతపదవిగ నానందించుచుఁ బ్రత్యక్షముగాఁ గానవచ్చుప్రహ్లాదుఁడో యన జనార్దనయోగి జగత్ప్రసిద్ధుఁ డై యుండెను.

మ. తన సౌశీల్యము శాస్త్రచింతనము నాత్మజ్ఞానముం జూచి హె
     చ్చినకూర్మి న్నిజదివ్యరూపములతో శ్రీభారతీమోక్షకా
     మిను లేతెంచి యహర్నిశంబు దను నెమ్మిం గొల్వఁగా శ్రీ జనా
     ర్దనయోగీశ్వరుఁ డొప్పె నెల్లెడ నవిద్యాధ్వాంతమార్తాండుఁడై.

టీక. తనసౌశీల్యము = తన సత్ప్రవర్తనము, శాస్త్రచింతనమున్ = శాస్త్రవిచారము, ఆత్మజ్ఞానమున్ - ఆత్మజ్ఞానమును, చూచి, హెచ్చినకూర్మిన్ = అధికమైనప్రేమచేత, నిజదివ్యరూపములతోన్ -తమ లోకోత్తరము లగు నాకారములతో, శ్రీభారతీమోక్షకామినులు = లక్ష్మీ-సరస్వతీ-పార్వతులు, (సదాచారమును జూచి లక్ష్మియు, శాస్త్రజ్ఞానమును జూచి సరస్వతియు, బ్రహ్మజ్ఞానమును చూచి పార్వతియు చెంత చేరి రనియు, ఈజనార్ధన యోగి విష్ణ బ్రహ్మమహేశ్వరరూపుఁ డనియు భావము. ) ఏతెంచి = వచ్చి, అహర్నిశంబున్ = రేయుంబవలు తనున్ = తనను, నెమ్మిన్ = ప్రేమతో, కొల్వఁగాన్ = సేవించుచుండఁగా, శ్రీజనార్దనయోగీశ్వరుఁడు, ఎల్లెడన్ = అంతటను, అవిద్యాధ్వాంతమార్తాండుడై = అవిద్య యనెడి, ( లేక, అజ్ఞానమనెడి ) చీఁకటికి సూర్యునివంటివాఁడై, ( జీవులకు అవిద్య యనునది ఆవరణము కావున దానినిఁ దొలఁగించి వారిని ముక్తులను జేయుచు అనుట.) ఒప్పెన్ = ప్రకాశించెను.

తా. ఆజనార్ధనయోగీశ్వరునిధర్మప్రవర్తనమును జూచి లక్ష్మియు, విద్యాసమృద్దిని జూచి సరస్వతియు, బ్రహ్మజ్ఞానమును జూచి పార్వతియు నాయన నాశ్రయించి స్త్రీస్వరూపములతో మిగుల ననురాగవతు లై సేవించుచుండిరి. ఇ ట్లపరిమిత మగుప్రభావముతోఁ గూడి త్రిమూర్తులస్వరూపము గలవాఁడై యాశ్రితులయజ్ఞానమును ధ్వంసము గావించి, మోక్షము నొసంగుచు నాఘనుఁడు ప్రకాశించుచుండెను.

తే. ఆజనార్దనగురున కత్యద్భుతముగ, శ్రీమదేకోగురుస్వామి శిష్యుఁ డయ్యె
    మును వసిష్ఠమహామునీంద్రునకు నర్థి, దాశరథి భక్తుఁడైనచందంబు దనర.

టీక. ఆజనార్దనగురునకున్ , అత్యద్భుతముగన్ = మిగుల నాశ్చర్యముగ, శ్రీమదేకోగురుస్వామి= బ్రహ్మజ్ఞానము గలయేకోగురుస్వామి యనువాడు, మును = పూర్వకాలమున, వసిష్టమహామునీంద్రునకున్ = వసిష్ఠమహర్షికి, అర్థిన్ = ఆదరముతో, దాశరథి = శ్రీరాముఁడు, శిష్యుఁ డైనచందంబు = శిష్యుఁ డైన విధము, తనరన్ = ఒప్పునట్లుగా, శిష్యుఁడు, అయ్యెన్.

తా. ము న్నారామభద్రుఁడు వసిష్ఠమహామునికి శిష్యుఁడైనట్లు బ్రహ్మవేత్తలలో నగ్రేసరుం డగు నేకోగురుస్వామి యాజనార్ధనయోగీంద్రునకు శిష్యు డయ్యెను.

సీ. తనదువైరాగ్యంబు గనుగొని సిగ్గుచే, సనకాదిమును లజువెనుక నొదుగఁ
    దనదుసద్భక్తిచే దగఁ గట్టువడి యింట, శ్రీకృష్ణుఁ డాత్మీయసేవఁ జేయఁ
    దనదువిజ్ఞానతీర్థమునందుఁ గ్రుంకుచు,గంగాదినదు లెల్ల గంతు లిడఁగఁ
    దనదుపూర్ణాత్మసంతతసమాధినిజూచి, ప్రహ్లాదుఁడాశ్చర్యపరత నొంద

తే. స్వకృతగీతాదిశాస్త్రభాష్యంబు లెల్ల
   వేదతుల్యంబు లై ధాత్రి వెలయుచుండ
   వామదేవశుకార్జునవ్యాసభీష్మ
   సదృశుఁ డేకోజనార్దనస్వామి వెలసె. 24

టీక. తనదువైరాగ్యంబున్ = తనకుఁగల వైరాగ్యాతిశయమును, కనుఁగొని= చూచి, సిగ్గుచే = తమకట్టివైరాగ్యము లేదను నవమానముచే, సనకాదిమునులు = బ్రహ్మయొక్క మానసపుత్రులగు (సంకల్పముచేతనే జనించినవార లగు) సనకసనందనాదిఋషులు, అజువెనుకన్ - బ్రహ్మదేవునివెనుక భాగమున, డాఁగన్ = దాఁగుచుండఁగా, (ఇచ్చట బ్రహ్మమానసపుత్రులగువారు బ్రహ్మకు సమీపమునం దుఁడు టస్వభావమే యైనను, ఏకోగురుస్వామి యొక్క వైరాగ్యమును జూచి, సిగ్గుజెందుటచేఁ గలిగినదిగా నుత్ప్రేక్ష చేయబడెను.) తనదుసద్భక్తిచేన్ = తనయొక్క అత్యుత్తమమైనభక్తిచేత, తగన్ = ఒప్పునట్లుగా, కట్టువడి, ఇంటన్ = తనగృహమునందు, నిలిచి, శ్రీకృష్ణుడు, ఆత్మీయసేవన్ = తనయొక్కసేవ , చేయన్ = చేయుచుండఁగా, తనదు విజ్ఞానతీర్థమునందున్ = తనయొక్క బ్రహ్మజ్ఞాన మనియెడుతీర్థమందు, క్రుంకుచున్ = స్నానముచేయుచు, గంగాదినదు లెల్లన్ = గంగమొదలగు లోకపావనము లైన నదులన్నియు, గంతులిడఁగన్ = విఱ్ఱవీగుచుండఁగా, (గంగాదినదులు లోకమును పావనము చేయుట స్వాభావికమే యైనను అది యేకోగురుస్వామియొక్క జ్ఞానతీర్థమునందు మునుంగుటవలనఁ గలిగినదిగా నిచట నుత్ప్రేక్షింపఁబడెను.) తన... సమాధిని - తనదు = తనయొక్క, పూర్ణ = సర్వవ్యాపకుఁడైన, ఆత్మ = పరబ్రహ్మమునకు సంబంధించిన, సంతత = అధికమగు, (లేక, సర్వకాలసర్వావస్థలయందు నొక్కటెరీతిగానున్న) సమాధిని = ధ్యానమును, చూచి, (పరమాత్మ సర్వవ్యాపకుఁడు గావున ఆయన నెఱింగినయోగి. ఏయేవిషయముల సంకల్పించినను సర్వము సమాధి నాచరించినట్లే యగునని తెలిసికొనవలయును) ప్రహ్లాదుఁడు, ఆశ్చర్యపరతన్ = మిగులనాశ్చర్యము గలిగియుండుటను, ఒందన్ = పొందుచుండఁగా, స్వకృతగీతాదిశాస్త్రభాష్యంబులు ఎల్లన్ = తనచే రచియింపఁబడిన భగవద్గీతాభాష్యము మొదలగునవి యన్నియు, (ఏకోగురుస్వామిచే రచియింపబడిన వ్యాఖ్యానము లేవియును గానరావు. కావునఁ బ్రకృతమున నీకవి శంకరభగవత్పాదులకును ఏకోగురుస్వామికిని అభేదము చెప్పినాఁడని తోచుచున్నది.) ధాత్రిన్ = భూమియందు, వేదతుల్యంబులు ఐ = వేదములతో సమానములై, వెలయుచున్ = ప్రకాశించుచు, (లేక, ప్రసిద్ధిఁ జెందుచు,) ఉండన్ = ఉండగా, వామదేవ-శుక-అర్జున-వ్యాస-భీష్మ-సదృశుఁడు = వామదేవాదులతో సమానుఁడు అగు, ఏకోజనార్ధనస్వామి = జనార్దనయోగీంద్రుని శిష్యుఁడగు ఏకోగురుస్వామి, (కుమారునిపేరుతోఁగూడ తండ్రి పేరును, శిష్యునిపేరుతోఁ గూడ గురువుపేరును కలిసి చెప్పుట కొన్నిదేశములలో నాచారము. ఆంధ్రకావ్యములలోఁ బలుచోట్ల నిట్టి ప్రయోగములను జూడవచ్చును.) వెలసెన్ = ప్రసిద్ధుఁడై యుండెను.

తా. తనవైరాగ్యమును జూచి సిగ్గుపడి సనకసనందనాదులు సత్యలోకమును విడిచివచ్చుటకు సందేహించుచుండ తనభ క్తిచేఁ గట్టుబడి భక్తపరాధీనుఁడగు శ్రీకృష్ణుఁడు తనగృహమునందే వసియించి సర్వవిధముల తోడ్పడుచుండఁ ద్రిభువనపావనములని ప్రఖ్యాతిఁ జెందియున్న గంగాదిపుణ్యనదు లన్నియుఁ దన బ్రహ్మజ్ఞానతీర్థమున నోలలాడి మిగులఁ బ్రభావమును సంపాదించుకొనుచుండఁ దారచించిన గీతాభాష్యాదులు వేదములట్లు పరమప్రమాణములై తనరారుచుండ నజ్జనార్ధనయోగీంద్రశిష్యుఁ డగు ఏకోగురుస్వామి వామదేవుఁడు, శుకుఁడు, అర్జునుఁడు, వ్యాసుడు, భీష్ముడు మొదలగువారితో సమానుఁడై ప్రసిద్ధి గాంచెను. (అమ్మహాత్ముని పరబ్రహ్మనిష్ఠను జూచి ప్రహ్లాదుడు సైతము ఆశ్చర్యపడుచుండెననుట.)

క. ధరలో నారాయణునకు, నరుగతి నేకోజనార్దనస్వామికి శ్రీ
    నరహరి మహేశ గురుఁ డ, చ్చెరువుగ సద్భక్తి మెఱయ శిష్యుం డయ్యెన్.

టీక . ధరలోన్ = భూమిపై, నారాయణునకున్ = శ్రీకృష్ణునకు, నరుగతిన్ = అర్జునుని యట్లు, ఏకోజనార్దనస్వామికిన్ = జనార్ధనయోగీంద్రుని శిష్యుఁడగు ఏకోగురుస్వామికి, నరహరిమహేశగురుఁడు = నరహరి మహేశ్వరుఁడను మహాత్ముడు, (ఇచ్చట మహేశ్వరుఁ డనునది నరహరి యనునాతని తండ్రిపేరుగా నుండునని యూహింపవలసియన్నది. అట్లు గాకున్నను యతులకు శివవాచకములను విష్ణువాచ

కములుకు అగుపదములును ఉపపదములుగ చేర్చుట కలదు. ఉదా:-శివనారాయణతీర్థుఁడు ; మొదలగునవి.) అచ్చరువుగన్ = ఆశ్చర్యము కలిగించునట్లుగ, సద్భక్తి మెఱయన్ = మిగుల భక్తితో, శిష్యుండు అయ్యెన్ , (భక్తితో నాయేకోగురుస్వామి నాశ్రయించె ననుట.)

తా. శ్రీకృష్ణునికి అర్జునుఁడు శిష్యుఁడైనట్లు ఆయేకోగురుస్వామికి నరహరి మహేశ్వరుఁ డనుమహాత్ముఁడు మిగుల భక్తియుక్తుఁడై శిష్యుఁడయ్యెను. (ఈ గురుశిష్యులు లోకమున కాశ్చర్యము గలిగించుచుండిరనుట.)

చ. అతఁడు సమస్తభూతబహిరంతరనావృతబోధమూర్తి యై
    వితతసమాధి నుండునెడ వేల్పులు సూచి యితం డయారె యా
    శతధృతియో రమావరుఁడొ శంకరుఁడో శుకుఁడో యటంచు
    నద్భుతమును బొందుచుండ బరిపూర్ణత నొప్పె ధరాతలంబునన్.

టీక . అతఁడు =ఆనరహరిగురువు, సమస్త...మూర్తి - సమస్తభూత = ఆకాశాది పంచభూతములయొక్కయు, లేక, పంచభూతవికారము లగు సకలప్రాణులయొక్కయు, బహిరంతః = లోపల వెలుపల, అనావృత = ఆవరింపఁబడని (అజ్ఞానావరణము లేని) బోధ = అపరోక్షజ్ఞానమే, (బ్రహ్మమే తానని యెఱుంగుటయె) మూర్తి ఐ = స్వరూపముగాఁ గలవాఁడై (స్వప్రకాశస్వరూపుఁడై యనుట.) వితతసమాధిన్ = ఎక్కువైనదానమునందు, ధ్యాననిష్ఠుఁడై యనుట. ) ఉండునెడన్ = ఉన్నప్పుడు, వేల్పులు= దేవతలు, చూచి, ఇతండు = ఈయోగి, అయారే = ఆహా, ఆశతధృతియో = ఆ బ్రహ్మయో, రమావఁరుడో = ఆవిష్ణువో, శంకరుఁడో = రుద్రుడో, శుకుఁడో = శుకమహర్షియో, (అగును గాని సామాన్యుడు కాడు; అని అధ్యాహారము.) అటంచున్ = అనుచు, అద్భుతమునున్ = ఆశ్చర్యమును, పొందుచున్, ఉండన్ = ఉండగా, పరిపూర్ణతన్ =సంపూర్ణుఁడై, (సర్వగుణములచేత సంపూర్ణుఁడై, లేక, పరబ్రహ్మరూపుఁడై యనుట.) ధరాతలంబునన్ = భూమియందు, ఒప్పెన్ = ప్రసిద్ధి గాంచెను.

తా. సర్వప్రపంచమునకును లోపల వెలుపల నిండియున్నట్టియు, అజ్ఞానావరణము లేనట్టియు, స్వప్రకాశస్వరూపము గలిగి నిర్వికల్పసమాధియందు (ధ్యానించువాఁడు; ధ్యానము, ధ్యానింపఁదగినది అను భేదములు లేనిసమాధియందు) ఉండు నప్పుడు నరహరియోగిని జూచి దేవత లందఱు, 'ఆహా ! యీతఁడు బ్రహ్మయో, విష్ణువో, రుద్రుఁడో, శుకమహర్షియో కాని సామాన్యుఁడు కాఁడు' అని యాశ్చర్యపడుచుందురు. ఇట్లు సర్వభూతములకు నాశ్చర్యకరము లగు సద్గుణసమృద్ధితో ప్రత్యక్షపరబ్రహ్మమో యన నాతఁడు భూమియందుఁ బ్రసిద్ధిఁ జెందియుండెను.

క. ఆనరహరిసద్గురునకు, శ్రీనాగోరామగురుఁడు శిష్యుం డై వి
    జ్ఞానంబునఁ బ్రత్యక్ష, శ్రీనారాయణుఁ డనం బ్రసిద్ధి వహించెన్. 27

టీక. ఆనరహరి సద్గురునకున్ = నరహరియను గురువునకు, శ్రీ నాగోరామగురుఁడు= బ్రహ్మజ్ఞానవంతుఁడగు నాగోరాముఁ డనువాఁడు, శిష్యుండు ఐ, విజ్ఞానంబునన్ = పరబ్రహ్మమే తానని తెలిసికొనుటయందు, శ్రీ నారాయణుఁడు = లోకోత్తమ మగునారాయణమహర్షి, (ధర్మము నశించినప్పుడు దానినుద్ధరించుటకు నారాయణమహర్షి యను పేర నవతరించిన విష్ణువు) అనన్ = అనఁగా, ప్రసిద్ధిన్ = విఖ్యాతిని, వహించెన్ =పొందెను.

తా. నాగోరామగురువనువాఁడు ఆనరహరిగురునకు శిష్యుడై బ్రహ్మజ్ఞానప్రభావముచే నారాయణమహర్షి యొక్క యపరావతారమో యన ప్రసిద్ధిఁజెందెను.

శా. రాజమూర్తులతోడఁ బెంపెసఁగువైరాగ్యోపరత్యాళు లు
    త్తేజం బొప్ప సహాయు లై మెఱయ నద్దివ్యప్రబోధస్ఫుర
    ద్రాజాస్య న్వరియించి మోక్షసుఖసామ్రాజ్యంబుతో నొప్పె నా
    గోజీరామగురుండు పండితులు కోర్కు ల్దీర సేవింపఁగన్. 28

టీక. రాజన్మూర్తులతోడన్ = ప్రకాశించుచున్నయాకారములతో, (మనుష్యరూపమును దాల్చియనుట.) పెంపు ఎసఁగు = వృద్ధిపొందుచున్న, వై .. . ఆళులు - వైరాగ్య = ఇహపరలోకములయందు ఇచ్ఛలేకపోవుట (చిత్తవిశ్రాంతి) అనెడు, ఆళులు = చెలులు, ఉత్తేజంబు = అధికమగు తేజస్సు, ఒప్పన్ = ప్రకాశింపఁగా, (సకలలోకములయందును ప్రసిద్ధి కలుగునట్లు) సహాయులు ఐ = సహాయభూతురాండ్రై, మెఱయన్ = ప్రకాశింపఁగా, (వైరాగ్యము, ఉపరతి యనియెడు చెలికత్తెలతోఁ గూడిన,అనుట) అద్ది .. స్యన్ — అద్దివ్య = ఆ యుత్తమమైన, ప్రబోధ = బ్రహ్మజ్ఞాన మనియెడు, స్ఫురత్ = ప్రకాశించుచున్న (సౌందర్యముగల), రాజస్యన్ = స్త్రీని, వరియించి = వివాహమాడి, నాగోరామగురుండు = నాగోరామగురువు, పండితులు = విద్వాంసులు, (లేక, బ్రహ్మజ్ఞానులు,) కోర్కుల్ దీరన్ = కోరినకోర్కులు సిద్ధించుటకై , సేవింపఁగన్ = సేవించుచుండగా, మోక్ష...తోన్ - మోక్షసుఖ= బ్రహ్మానంద మనియెడు, సామ్రాజ్యంబుతోన్ = చక్రవర్తిత్వముతో, (పరమానందమే రాజ్యమనుట.) ఒప్పెన్ = ప్రకాశించుచుండెను.

తా. ఆ నాగోరామగురువు వైరాగ్యోపరతులు చెలికత్తియలుగాఁ గలిగి, జగత్ప్రసిద్ధిఁచెందియున్న బ్రహ్మజ్ఞానమను నుత్తమకాంతను వివాహమై, మోక్షసుఖ మనియెడు సామ్రాజ్యమునకు ప్రభువై బ్రహ్మవేత్త లగువారలకోర్కుల నెఱవే ర్చుచు తత్త్వార్థమును బలుమాఱు వివరించి, సంశయముల నెల్లఁ దొలఁగించి జ్ఞానమును దృఢము చేయుచు సుప్రసిద్ధుఁడై యుండెను.

క. ఆనాగోరామునకున్ శ్రీనారాయణున కజునిచెలువున భక్తుం
   డై నెగడె నెల్లదిక్కులఁ, గోనేరుగురుండు తత్త్వకోవిదుఁ డగుచున్.29

టీక . ఆనాగోరామునకున్ = ఆనాగోరామగురువునకు, శ్రీనారాయణునకున్ = శ్రీవిష్ణునకు, అజునిచెలువునన్ = బ్రహ్మవలె ("నారాయణం పద్మభవం వసిష్ఠం" అని వేదాంతవిద్యాసంప్రదాయమునకు మొదటి గురువు విష్ణువు; ఆయనకు శిష్యుఁడు బ్రహ్మదేవుఁడు; ఆయనకు వసిష్ఠుఁడు అని చెప్పఁబడియున్నది. దాని ననుసరించి ఇచ్చట నీయుపమానము ప్రయోగింపఁబడిన దని తెలిసికొనునది. ) కోనేరుగురుండు = కోనేరుఁ డనుగురువు భక్తుండు ఐ. (శిష్యుఁడై యనుట.) తత్త్వకోవిదుఁడు అగుచున్ = తత్త్వజ్ఞానముకలవాఁడై, ఎల్లదిక్కులన్ = అన్నిదిక్కులయందును, నెగడెన్ = ప్రసిద్ధి వొందెను.

తా. శ్రీమన్నారాయణమూర్తికి బ్రహ్మదేవుఁడు శిష్యుఁ డైనట్లు అనాగోజీరామగురువునకుఁ గోనేరుగురువు శిష్యుఁ డయ్యెను. బ్రహ్మవేత్తలలో నుత్తముఁడై త్రిలోకములయందుఁ బ్రసిద్ధిఁ గాంచెను.

శా. ఆకాశీతలసేతుమధ్యకలితజ్యాధీశ్వరోద్యచ్ఛిర
    శ్శ్రీకోటీరమణిప్రభార్చితనిజాంఘ్రిద్వంద్వపంకేరుహుం
    డాకాశాదిసమస్తతత్త్వసముదాయాతీతవిశ్వేశుఁ డై
    శ్రీకోనేరుగురుండు మోక్షవరలక్ష్మీకాంతుఁడై రంజిలెెన్.30

టీక. ఆ....పంకేరుహుండు- ఆకాశీతలసేతుమధ్య = కాశీక్షేత్రము మొదలు సేతువువఱకుఁ గల మధ్యదేశమునం దంతటను, కలిత = ప్రకాశించుచున్న , జ్యా అధీశ్వర = ప్రభువులయొక్క , ఉద్యత్ = ప్రకాశించుచున్న, శిరః = శిరస్సులయందలి, శ్రీకోటీర = కాంతిగల కిరీటములయందలి, మణి = రత్నములయొక్క , ప్రభా= కాంతులచేత, అర్చిత = పూజింపఁబడిన, (అలంకరింపఁబడినది. అనుట.) నిజ = స్వకీయ మైన, అంఘ్రిద్వంద్వపంకేరుహుండు = కమలములవంటి పాదములు గలవాఁడును, (సకలప్రభువుల చేతను నమస్కరింపఁబడువాడు,) ఆకాశ...విశ్వేశుఁడు - ఆకాశాది = ఆకాశము మొదలగు, సమస్త = సకలములైన, భూతసముదాయ = పంచభూతములయొక్కయు వానివలనఁ బుట్టిన సకలప్రాణులయొక్కయు సమూహమును, అతీత = అతిక్రమించినవాడును, విశ్వేశుఁడు = ప్రపంచమును నియమించువాఁడును ఐ, మోక్ష...కాంతుఁడు - మోక్ష = మోక్షమనియెడు, పద = స్థానమనెడి, లక్ష్మీ = లక్ష్మి, (మోక్షలక్ష్మికి), కాంతుఁడు = ప్రియుఁడు - భర్త ఐ, ఆకోనేరుగురుండు = ఆకోనేరుఁ డను గురువు, రంజిలెన్ = ప్రకాశించుచుండెను.

ఆ. ఆకోనేరుగురువు కాశీరామేశ్వరమధ్యదేశమునం దున్నసకలప్రభువులచేతను సాష్టాంగముగా నమస్కరింపఁబడుచు ఆకాశాదిసమస్తప్రపంచమునకును అతీతుఁడై శుక్లపరబ్రహ్మరూపుఁడై సర్వదా మోక్షసుఖము ననుభవించుచుఁ దేజరిల్లుచుండెను.

పరబ్రహ్మము షడధ్వాతీతుఁ డయినను తత్త్వాధ్వాతీతుఁడనిమాత్రము ఈపద్యమునఁ జెప్పుటకు హేతువేమన : తత్త్వాధ్వము కడపటి యైదధ్వములయుత్పత్తికిని గారణమగుటచే నిట్లు చెప్పబడెను.

షడధ్వములవివరణము.

మంత్రాధ్వము పదాధ్వము వర్ణాధ్వము తత్వాధ్వము భువనాధ్వము కళాధ్వము అని అధ్వములు అఱువిధములు, అందు—

1. మంత్రాధ్వము: సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, హృదయము, శిరస్సు, శిఖ, కవచము. నేత్రము, అస్త్రము, అని పదునొకండు విధములు.

2. పదాధ్వము: మహాదేవ సద్భావేశ్వర మహాతేజ యోగాధిపతి ముంచముంచ ప్రథమప్రథమ సర్వసర్వ భవభవ భవోద్భవ సర్వభూత సుఖప్రద సర్వసాన్నిధ్యకఠబ్రహ్మ విష్ణురుద్రపర అనార్చితానార్చిత అస్తుతాస్తుత పూర్వస్థితి సాక్షి సాక్షి తురుతురు పతంగ పతంగ పింగ పింగ జ్ఞాన జ్ఞాన శబ్ద శబ్ద సూక్ష్మసూక్ష్మ శివ సర్వసర్వ ఓం నమశ్శివ ఓం నమోనమ నమశ్శివ ఓం నమరూపి అరూపి ప్రథమ ప్రధమ తేజస్తేజ జ్యోతిర్యోతి అరూప జనగ్ని అధూమ అభస్మ అనాది నా బానా ధూధూధూ ఓంభూః ఓం భువః ఓగ్ంసువః అనిధన నిధన నిధనోద్భవ శివసర్వ పరాపరాత్మ భువనేశ్వర ధ్యానహార ఓంనమశ్శివ సర్వప్రభు శివ ఈశానమూర్ధ్ని తత్పురుషవక్త్ర అఘోరహృదయ వామదేవగుహ్య సద్యోజాతపాద ఓంనమః గుహ్యాతిగుహ్య గోప్త అనిధన సర్వయోగాధీకృత సర్వవిద్యాధిప జ్యోతిరూప పరమేశ్వర పరమేశ్వర అచేతనాచేతనా వ్యోమ్నిన్ వ్యోమ్నిన్ వ్యోమ్నివ్యాపిన్ వ్యాపినివ్యోమవ్యాపిని వ్యోమరూప సర్వవ్యాపిని శివానంత ఆనాధ అనాశ్రితధ్రువ శాశ్వతయోగ పీఠసంస్థిత నిత్యయోగి ధ్యానహార ఆద్యోంకారములని ఎనుబదియొకటి.

3. వర్ణాధ్వము: అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం ఌం ౡం ఏం ఐం ఓం ఔం అం అః; కం ఖం గం ఘం ఙం చం ఛఁ జం ఝం ఞం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం అని ఏబదియొకవిధము.

4. తత్వాధ్వము:- పృథివి ప్రకృతి బుద్ధి అహంకారమన శ్శోత్రత్వక్ చక్షుర్జిహ్వాఘ్రాణ వాక్ పాణి పాద పాయు గుహ్య శబ్ద స్పర్శ రూప రసగంధ ఆకాశ వాయువహ్ని జల మాయ కాల నియతి కాలా విద్యా రాగ పురుష, సదాశివ ఈశ్వర శుద్ధవిద్య శివశక్తు లనుతత్త్వములు ముప్పదియాఱు. లేక, భూతపంచక జ్ఞానేంద్రియపంచక కర్మేంద్రియపంచక ప్రాణపంచకశబ్దాది పంచకములును నాదిచతుష్టయమును శరీరత్రయమును అవస్థాత్రయమును అజ్ఞానమును, ఇవియే ముప్పదియాఱు తత్త్వములు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణశబ్దాది విషయపంచకములు మానసాది చతుష్టయమును గూడి యిరువదినాలుగుతత్త్వములు. పైఁ జెప్పిన ముప్పదియాఱుతత్త్వములును షడ్భావవికార షట్కౌౌశికషడూర్మి అరిషడ్వర్గములును, జీవత్రయ గుణత్రయ కర్మత్రయములును, వచనాదానగమనవిసర్గానందములును, సంకల్పాధ్యవసాయాభిమానావధారంబులు, వైచిత్య్రాదిచతుష్టయమును, దిగ్వాగార్కాది చతుర్దశేంద్రియాధిష్ఠానాదిదేవతలును, అనునవి యన్నియుఁ గూడి తొంబదియాఱు తత్త్వములు.

5. భువనాధ్వము:- భద్రకాళివీరభద్ర త్రిలోచననభ లిప్సువివాహసంవాహ త్రిదశేశ్వరత్య్రక్ష విభుశంభుదంష్ట్రవజ్రఫణీంద్ర, ఉదుంబరగ్రసన మారుతాసనక్రోధన అనంత వృషధర వృషబలిప్రియ భూతపాల జ్యేష్ఠ శర్వసురేశ్వర వేదపారగజ్ఞానభూసర్వజ్ఞ ఈశానవిద్యాధిప ప్రకామదప్రసాద శ్రీధర రత్నధర లక్ష్మీధర జటాధర సౌమ్యధర ధన్యరూప విధీశ మేఘవాహన కపర్దిపంచశిఖ పంచాంతకక్షయాంతక తీక్ష్ణ సూక్ష్మవాయువేగ లఘు శీఘ్రసునాదమేఘనాదజలాంతక దీర్ఘబాహు జయభద్ర, శ్వేత మహాబల పాశహస్త ఆతిబలబల దంష్ట్రలోహిత ధూమ్ర విరూపాక్ష ఊర్ధ్వకేక భయాంతకక్రూరదంష్ట్రదంష్ట్రి మారణ నిరృతి ధర్మపతి అధర్మపతి వియోక్తసంయోక్తకర్త విధాతధాతహర మృత్యు ధర్మ అక్షయాంతక భస్మాంతక వజ్రబాహుదహనజ్వలనహరఘాతుక పింగళహుతాశన అగ్నిరుద్ర త్రిదశాధిప పినాకిశాన్త అవ్యయ విభూతి వివర్ధన వజ్రదేహబుధఅజక పాలీశ రుద్ర విష్ణు బ్రహ్మ హాటకేశ్వర కూశ్మాండ కాలాగ్నిరుద్ర శ్రీకర్ణఔమకౌమారవైష్ణవ బ్రాహ్మ్య భైరవకృత అకృతస్థలేశ్వర సుబ్రాహ్మ్య పాజేశసౌమ్య ఇంద్రగాంధర్వ యక్షరాక్ష సపైశాచ సుస్థలేశ్వర శంఖకర్ణకాలాంజన మండలేశ్వర మహాండ ద్విరండ సకలాండస్థాణు స్వర్ణాక్ష భద్రకర్ణగోకర్ణ మహాలయ అవిముక్త రుద్రకోటివస్త్రాపద భీమేశ్వర మహేంద్ర అట్టహాస విమలేశ్వర నఖిల నాఖిల కురుక్షేత్ర గయాక్ష మహాభైరవకేదార శ్రీశైల మహాకాశ మధ్యమేశ్వర అమ్రాదికేశ్వర జలేశ్వర హరిశ్చంద్ర ఆకులేశ్వర డుండిముండి భారభూతి ఔషధిపుష్కరనైమిశ , అమరేశ్వర అంగుష్టమాత్రార్క ఈశాన ఏకేక్షణ ఏకపింగళ ఉద్భవ అభవ వామదేవ మహాద్యుతి శిఖేద ఏకవీర క్రోధ చండ శూర పంచాంతక సంవర్తజ్యోతిష మహాక్రోధ మహా చండ ఏకశివ అనంత అజ ఉమాపతి ప్రచండ ఏకపాద ఈశాన భవ ఉగ్ర భీమ అనంతసూక్ష్మ శివోత్తమ ఏకనేత్రి ఏకరుద్ర త్రిమూర్తి శ్రీకంఠ శిఖండి వామజేష్ఠరాద్రి కాళ కలవికర్ణ బలవికర్ణ బలప్రమధన సర్వభూతదమన మనోన్మని అనాశ్రిత అనాధున అనంత వ్యోమరూపవ్యాపిని ఊర్ధ్వగామిని రోచిద మోచిక దీపిక ఇందిర శాంత్యతీతశాంతి విద్యాప్రతిష్ఠనివృత్తి అని భువనములు ఇన్నూటయిరువదినాలుగు.

కళాధ్వము:- నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీతమని కళలు ఐదు. ఈ పంచకళలలో మంత్ర పద వర్ణ తత్త్వభువనములును, ఈతత్త్వములలో భువనములు చేరియున్నవి. వీనివిశేషవివరణము కైవల్యనవనీత ప్రధమప్రకరణమున అఱువదియొకపద్యమునం జూడవలెను.

మఱియు సర్వసమయమంత్రములును సప్తకోటిభేదములు కలవై ఉండఁగా, మంత్రాధ్వమందు పదునొకండు మంత్రములు మాత్రము చెప్పుటకు హేతువేమనిన: పరమశివుని పంచముఖములయందే సకలాగమమంత్రములును పుట్టుటచేత సద్యోజాతాదిపంచమంత్రములును ఆమంత్రములకు ముఖ్యములయిన షడంగదేవతామంత్రములును చేరి పదునొకండుమంత్రములని చెప్పఁబడెను.

మఱియు — శ్లో. 'మకారం మననందైవ త్రకారంత్రాణముచ్యతే, మననత్రాణ మిత్యాహు ర్మంత్ర మిత్యభిధీయతే.' అనున్యాయముచేత పరబ్రహ్మము మననమునకును రక్షణమునకును విలక్షణమగుటవలన మంత్రాధ్వాతీతమును సర్వదేశవ్యాపకత్వము గలుగుటవలన పదాధ్వాతీతమును అవర్ణమగుటవలన వర్ణాధ్వాతీతమును సర్వతత్త్వవిలక్షణమగుటవలన తత్వాధ్వాతీతమును సర్వస్వామి యగుటవలన భువనాధ్వాతీతమును నిష్కళ మగుటవలన కళాధ్వాతీతమును అగును.

శా. ఆకోనేరుగురూత్తముం గొలిచి దివ్యాధ్యాత్మయోగంబు దా
    శ్రీకల్యాణగుణప్రసిద్ధుఁ డగుచున్ శ్రీమన్మహాదేవలో
    కై కాచార్యుఁడు సంగ్రహించె నతిసౌఖ్యం బొప్ప సాందీపనిన్
    శ్రీకృష్ణుండు భజించి విద్య నొనరం జేకొన్న చందంబునన్. 31

టీక. శ్రీకృష్ణుండు, సాందీపనిన్ = సాందీపనియను గురువును, భజించి = సేవించి, విద్యలు = అఱువదినాలుగువిద్యలను, ఒనరన్ = ఒప్పునట్లుగా, చేకొన్నచందంబునన్ = గ్రహించిన విధమున, శ్రీమన్మహాదేవలోకైకాచార్యుడు = బ్రహ్మవేత్త యగుమహాదేవుఁ డను లోకగురువు, ఆకోనేరుగురూత్తమున్ = ఆకోనేరుగురుశ్రేష్ఠుని, కొలిచి = సేవించి, తాన్ = తాను, శ్రీ... ప్రసిద్ధుఁడు- శ్రీ = మోక్షసమృద్ధి గల, కళ్యాణగుణ = శాంతి, ఇంద్రియనిగ్రహము మొదలగు సద్గుణములతో, ప్రసి స్థుఁడు అగుచున్ = ప్రసిద్ధిఁచెందుచు, అతిసౌఖ్యంబు = అధికమగునానందము, (లేక; మోక్షసుఖము,) ఒప్పన్ = కలుగునట్లుగా, దివ్యాధ్యాత్మయోగంబున్ = ఉత్తమ మగుజీవబ్రహ్మైక్యమును, (లేక దానికి సాధనఁమగు రాజయోగమును,) సంగ్రహించెన్ = తెలిసికొనెను.

తా. శ్రీకృష్ణమూర్తి సాందీపని సేవించి అఱువదినాలుగు విద్యలను గ్రహించినట్లు బ్రహ్మవేత్తయగు మహాదేవుండను గురువరుండు మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము మొదలగు సమస్తసద్గుణములకు నిధియైన యాకోనేరుగురువు నాశ్రయించి జీవబ్రహ్మైక్యమును దెలిసికొనుటకు ముఖ్యసాధన (సుఖసాధన) మగురాజయోగమును గ్రహించి బ్రహ్మానందమును గైకొనియెను.

చతుష్షష్టికలావివరణము.

అఱువదినాలుగు విద్యలు:- శ్లో. ఇతిహాసాగమౌ చైవ కావ్యాలంకారనాటకమ్, గాయకత్వం కవిత్వం చ కామశాస్త్రం దురోదరం దేశభాషాలిపిజ్ఞానం లిపికర్మచవాచకం, సర్వాణి చావధానాని స్వరశాస్త్రం చ శాకునం, సాముద్రికం రత్నశాస్త్రం రథాశ్వగజకౌశలం, మల్లశాస్త్రం సూదకర్మ భూరుహాణాం చ దోహదం, గంధనాదో ధాతునాదః ఖనివాదో రసస్యచ, జాలవాదోగ్నిసం స్తంభో ఖడ్గస్తంభో జలస్య చ వాచస్తంభో (?) వశ్యాకర్షణమోహనం, విద్వేషణోచ్చాటనం చ మారణం కాలవంచనం, పరకాయప్రవేశశ్చ పాదుకాసిద్ధి రేవ చ, వాక్సిద్ధి ర్ఘుటికా సిద్ధిరైంద్రజాలిక మేవచ, అంజనం పరదృష్టే స్తు వంచనం స్వరవంచనం, మణిమంత్రౌషధీనాం సిద్ధయ శ్చోరకర్మ చ, చిత్రలోహాశ్మమృద్దారువేణు చర్మాంబర క్రియాః, అదృశ్యకరణం దండకరణం మృగయానిధిః, వాణిజ్యం పాశుపాల్యం చ కృషి రాననకర్మచ, లాదకుక్కుటమేషాదియుద్ధకారకకౌశలం, చతుష్షష్టికలా స్త్వేతాః కలావిద్భిః ప్రకీర్తితాః.

చతుర్దశవిద్యలు

పదునాలుగువిద్యలు:- శ్లో. 'అంగాని వేదా శ్చత్వారో మీమాంసాన్యా యవిస్తరః, పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హ్యేతా శ్చతుర్దశ.'

అష్టాదశవిద్యలు

పదునెనిమిది విద్యలు:-శ్లో. ఆయుర్వేదో ధనుర్వేదో నీతిశాస్త్రార్థశాస్త్రయోః, వేదాం గాని చ వేదాని మీమాంసా న్యాయవిస్తరః ధర్మశాస్త్ర పురాణం చ విద్యా హ్యష్టాదశా యితి.

సీ. అఖిలభూతంబుల నాడించుమాయను
             సొంపుగా నెవ్వఁ డాడింపుచుండు

    గురుజనంబుల కెల్ల గురువులై తగుహరి
          హరుల కెవ్వఁడు గురు వగుచు నుండు
    వివిధలోకంబుల వెలిగించి వెలుఁగుల
          మించి యెవ్వఁడు వెలిగించు చుండుఁ
    బ్రభువుల కెల్ల సత్ప్రభువైన బ్రహ్మకుఁ
          బ్రభుఁడౌచు నెవ్వఁడు పరఁగుచుండు
తే. సగుణనిర్గుణరూపుఁడై నెగడుచుండు
    నమ్మహాదేవగురువరు నభినుతింప
    సకలనిగమాగమాంతశాస్త్రంబు లోప
    వనఁగ మముఁబోంట్లకు నుతింప నలవి యగునె?

టీక . ఎవ్వఁడు = ఏమహానుభావుఁడు, అఖిలభూతంబులన్ = సమస్తజీవులను, ఆడించుమాయనున్ = శరీరాదులయందు ఆత్మ యనుబుద్ధిని గలిగించి భ్రమింపఁజేయునట్టిమాయను, సొంపుగాన్ = అందముగ, ఆడించుచున్ ఉండున్ = నటింపఁజేయుచుండునో, (సర్వ కార్యములయందు ప్రవర్తింపఁ జేయుచుండునో,) ఎవ్వఁడు, గురుజనంబుల కెల్లన్ = గురువులగువారలకందఱకును, గురువులు ఐ = ఆచార్యులై (లేక జనకులై) తగుహరిహరులకున్ = ఒప్పునట్టివిష్ణురుద్రులకు, గురువు అగుచుఁన్ = ఆచార్యుఁడై, (లేక, జనకుఁడై) ఉండున్ = ఉండునో, ఎవ్వఁడు, వివిధలోకంబులన్ = సకలవిధము లగుప్రపంచములను, వెలిగించువెలుఁగులన్ = ప్రకాశింపఁజేయు సూర్యచంద్రాగ్నులను, మించి = అతిశయించి, (సూర్యాదులకంటె నధిక మగు ప్రకాశముగలవాఁడై యనుట.) వెలిగించుచున్ ఉండున్ = ప్రకాశింపఁజేయుచుండునో; (పరబ్ర హ్మము యొక్క ప్రకాశమువలననే చంద్రుడు సూర్యుఁడు అగ్ని మొదలగు తేజస్సులు ప్రకాశించుచున్నవి యని భావము) ఎవ్వఁడు= ఏమహానుభావుఁడు, ప్రభువులకున్ ఎల్లన్ = ఇంద్రుఁడు మొదలగు లోకపాలకులకందఱికిం గూడ, సత్ , ప్రభువు = అధిపతి, అయినబ్రహ్మకున్ = అగునట్టిహిరణ్యగర్భునకు, ప్రభుఁడుఅగుచున్ = నియామకుఁడై, (ఆధికారియై) పరఁగుచున్ ఉండున్ = ప్రకాశించుచుండునో (ఇట్లు చెప్పుటచే, బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు ఈశ్వరుఁడు సదాశివుఁడు అనునట్టి పంచభూతసృష్టికర్త లందఱకును నియామకుడు అనినట్లయ్యెనని తెలిసికొనునది.) ఎవ్వఁడు, సగుణ...డై-సగుణ = శాంతి మొదలగు సద్గుణములతోఁ గూడి (ఉపాసనచేయుటకుఁ దగినదియై, చిత్తశుద్ధిని గలిగింప సాధనమైనట్టియు) నిర్గుణ = గుణము లేవియును లేనిదై, (నిర్వికల్పముగ ధ్యానించుటకుఁ దగినదియై యుండునట్టియు, రూపుఁడు ఐ= రూపములు గలవాఁడై, నెగడుచుండున్ , ప్రకాశించుచుండునో, అమ్మహాదేవ గురువరున్ = అట్టి

మహాదేవాచార్యుని, అభినుతింప = స్తోత్రము చేయుటకు, సకల..బులు - సకల = సమస్తములైన, నిగమ = వేదముల యొక్కయు, ఆగమ- కామికము మొదలగు నిరువదియెనిమిది యాగమములయొక్కయు, అంత = తుదలు, (వేదములకు అంతములగు నుపనిషత్తులును, ఆగమములకంతము లగుచరా, క్రియా, యోగ, జ్ఞాన, పాదము లను నాల్గింటియందుఁ జెప్పఁబడు షడధ్వములతోఁ గూడిన కర్మసాదాఖ్య కర్తృసాదాఖ్య అమూర్తిసాదాఖ్య మూర్తిసాదాఖ్య శివసాధాఖ్య మహాసాదాఖ్యములును), శాస్త్రంబులు = బ్రహ్మసూత్రములు మొదలగు వేదాంతశాస్త్రములును, ఓపవు = సమర్థములు కావు (ఈ పద్యమున మహాదేవాచార్యునకును పరబ్రహ్మమునకును అభేదమునుజెప్పెను.) అనినన్ = అని చెప్పఁగా, మముబోంట్లకున్ = మాయట్టి యల్పజ్ఞులకు, నుతింపన్ = స్తోత్రము చేయుటకు, అలవి అగునెె = శక్యమగునా?

తా. ఆమహాదేవాచార్యుఁడు సకలజీవులను సంసారభ్రాంతిలోఁ జిక్కించి త్రిప్పునట్టి మాయను దన చేఁ జిక్కించుకొని త్రిప్పుచున్నాడు. గురువు లని చెప్పదగువారల కందఱకు నాచార్యులై సకలజగత్తులకును గారణభూతులై యుండు హరిహరులకుఁ గూడ జ్ఞానోపదేశకుఁడై కారణభూతుఁడై యున్నాడు. నానావిధము లగు ప్రపంచములనుగూడ నపరిమితమగుశక్తితోఁ బ్రకాశింపఁజేయు సూర్యాదులకు కూడఁ గాంతి నొసంగుచున్నాఁడు. ఇంద్రుఁడు యముఁడు మొదలగు సమస్తలోకపాలకులకునుగూడ నాజ్ఞాపించుచు వారల కధిపతి యై యున్న చతుర్ముఖునకుఁ గూడ బ్రభువై యున్నాడు. ఆయాచార్యుని రూపము సగుణమై ఉపాసకుల ననుగ్రహించుచుండును. నిర్గుణమై నిర్వికల్పముగ ధ్యానింపఁబడుచు, నపరోక్షజ్ఞానమునకు విషయమై మోక్షమునుగోరువారి దయఁ జూచుచుండును. ఇట్టి మహాప్రభావసంపన్నుఁ డగు నాగురుశ్రేష్ఠుని వేదాంతములో నుపనిషత్తులు గాని ఆగమాంతము లగు షడధ్వసహితము లైన కర్మసాదాఖ్యము మొదలగునవిగాని బ్రహ్మసూత్రము మొదలగు శాస్త్రములు గాని వర్ణింపనేరవు. ఇట్లుండ నమ్మహాత్ముని వర్ణింపనే నెంతవాఁడను?

అవ. ఇట్లు విద్యావంశమును వర్ణించి మిగుల సంక్షేపముగ జన్మవంశమును వర్ణించుచున్నాఁడు.—

తే. అమ్మహాదేవగురుచరణారవింద
    పరపరాంగాంశభజనతత్పరుఁడఁబరశు
    రామపంతులకులజాత రామమంత్రి
    మౌళితిమ్మాంబికాప్రియాత్మజుఁడ నేను.33

టీక. ఆ... రుఁడన్ ; అమ్మహాదేవగురు = కోనేరుగురునకు శిష్యుఁడైన యమ్మహాదేవాచార్యునియొక్క, చరణారవింద = పాదపద్మముయొక్క, వర = శ్రేష్ఠమైన, పరాగ= రేణువు యొక్క, అంశ = అల్పభాగమును, (స్వల్ప మగుపాదధూళిని) భజన = సేవించుటయందు, తత్సరుఁడన్ = ఆసక్తి గలవాఁడను. (ఆమహాదేవాచార్యుని శిష్యుఁడను అనుట.) పరశు....జుఁడన్ = పరశురామపంతుల కులమందుఁ బుట్టిన (ఈకవియింటి పేరు పరశురామపంతులవారు) రామమంత్రిమౌళి = మంత్రులలో నుత్తముఁడగు రామయ్య అనువానికిని, తిమ్మాంబికా = తిమ్మాంబ యనునామెకును, ప్రియాత్మజుఁడన్ = ప్రియపుత్త్రుఁడను, (ఈకవి పేరు లింగమూర్తి, గురుమూర్తి) అయిన నేను,

తా. కోనేరుగురుశిష్యుఁ డగునామహాదేవాచార్యునకు శిష్యుఁడనై పరశురామపంతుల రామయ్యకును దిమ్మాంబికకును పుత్త్రుఁడ నై యున్న నేను. (ఈ పద్యము షష్ఠ్యంతములతోను వాని కావలనుండు వచనములోను జేర్చి యేకవాక్యముగా నన్వయించుకొనవలయును.)

క. శ్రీరామనామమంత్రా, కారునకు ససంగ నిర్వికారునకు మహా
    కారునకు నిర్జితాహం, కారున కజ్ఞానభూమికాదూరునకున్. 34

టీక. శ్రీరా... నకున్ - శ్రీరామ = రాముని యొక్క, నామ = పేరు గలిగినట్టియు, మంత్ర = తారకమంత్రమే, ఆకారునకున్ = స్వరూపముగాఁ గలిగినట్టియు, (రామ దేవతా స్వరూపుఁడైనట్టియు, తారకమంత్రరూపుఁ డైనట్టియు) అ... నకున్ అసంగ = ప్రపంచ వికారములతో సంబంధము లేనట్టియు, నిర్వికారునకున్ = షడ్వికారములు లేనట్టియు, (అస్తి = కలఁడు, జాయతే = పుట్టుచున్నాఁడు, వర్ధతే = వృద్ధిఁ జెందుచున్నాఁడు, విపరిణమతే = మార్పునొందుచున్నాఁడు, అపక్షీయతే = క్షీణించుచున్నాడు. నశ్యతి = నాశనమును జెందుచున్నాఁడు అని చెప్పుటకు వీలైనస్థితులు ఆఱును వికారము లనఁబడును.) మహాకారునకున్ = సర్వవ్యాపక మైన (లేక విరాట్పురుషరూపమైన) ఆకారము గలిగినట్టియు, (ఇచ్చట మహోంకారునకు అని పాఠాంతరము గలదు. అప్పుడు " పూజనీయమైన ఓంకారమే స్వరూపముగాఁ గలవాఁడు " అని యర్థము). ని... నకున్ - నిర్జిత = జయింపఁబడిన, అహంకారునకున్ = అహంకారము గలిగినట్టియు, అ ...నకున్ - అజ్ఞానభూమికా = ఏడువిధము లగు అజ్ఞానభూమికలకు, దూరునకున్ = దూరమైనట్టియు (అజ్ఞాన భూమికలు లేనట్టియు.)

తా. శ్రీరామస్వరూపుఁడును, తారకమంత్రమే యాకారముగఁ గలవాడును, ప్రపంచముతోఁ గాని, యందలివికారముతోఁ గాని సంబంధము లేనివాఁడును, గర్భస్థుఁడగుట పుట్టుట వృద్ధిఁజెందుట మార్పునొందుట (లేక, ముసలితనము నొందుట) క్షీణించుట చచ్చుట యనియెడు నాఱువికారములు లేనివాఁడును, విరాట్పురుషరూపుఁడును, అహంకారమును జయించినవాఁడును, అజ్ఞానభూమికలయందుఁ జిక్కుఁబడనివాఁడును.

అజ్ఞానభూమికావివరణము

బీజజాగ్రము, జాగ్రము, మహాజాగ్రము, జాగ్రత్స్వప్నము, స్వప్నము, స్వప్నజాగ్రము, సుషుప్తి అని అజ్ఞానభూమిక లేడు. 1 అందు నామరూపరహితాఖండపరిపూర్ణసచ్చిదానందపరబ్రహ్మమందు జగత్సృష్టికి కారణముగఁ గలిగిన తెలివియే బీజాజాగ్రము; 2 అవిభక్తమగు నాతెలివికి ముందు లేని భేదము సూక్ష్మముగఁగలిగి ప్రపంచాభిముఖమగు టజాగ్రము; ఆలోకవాసన ప్రబలుట మహాజాగ్రము; 4 జాగ్రద్దశయందు చూడనివి సంకల్పించి, నిష్ప్రయోజకముగ మనోరాజ్యమేలుట జాగ్రత్స్వప్నము; 5 ఆజాగ్రమందు కల్పితస్వరూపములఁ జూచుట స్వప్నము; 6 మఱచినదానిఁ దలఁచుట స్వప్నజాగ్రము; 7 ఆత్మప్రతిబింబముగాఁ దోఁచుచున్న జగద్విషయము సుఖమని దాన మునుఁగుట సుషుప్తి.

క. ధీరునకు భ క్తజలమం, దారునకు నిరంతరాత్యుదారునకు నిరా
   ధారునకు నిఖలజగదా, ధారునకు ననాద్యఖండితశరీరునకున్. 35

టీక. ధీరునకున్ = ఆత్మానాత్మజ్ఞానముగలిగినట్టియు, భక్తి . . .నకున్ - భక్తజన = భక్తులగువారికి, (శిష్యు లగువారికి.) మందారునకున్ = కల్పవృక్షముషఁవంటివాఁ డగునట్టియు, (తత్వార్థమును జక్కఁగ నుపదేశించి బ్రహ్మానందానుభవము నొసఁగునట్టియు అనుట.) నిరం... నకున్ - నిరంతర = ఎప్పుడును, అత్యుదారునకున్ = మిగుల దానము చేయునట్టియు, (మహాత్యాగి యైనట్టియు) నిరాధారునకున్ = వేఱొకపదార్థము తన కాధారముగ లేనట్టియు, సకలజగదాధారునకున్ = సమస్తప్రపంచమునకు ఆధారభూతుఁ డైనట్టియు, అనా....నకున్ - అనాది = పుట్టుక లేనట్టియు, అఖండిత= నాశనము లేనట్టియు, శరీరునకున్ = శరీరముగలవాఁడును.

తా. స్వయముగ సంపూర్ణమగు పరబ్రహ్మజ్ణానము గలిగి కల్పవృక్షమువలె నాశ్రితు లగుశిష్యులఁ గృతార్థులఁ జేయుచు, మహాత్యాగియై యుండువాఁడును, తాను మఱియొకయాధారము నపేక్షింపక స్వతంత్రుఁ డై నిలిచి తనయందు సకలప్రపంచమును స్థిరముగ నిలుపుకొని యుండువాఁడును, ఉత్పత్తవినాశములు లేనివాఁడును.

మహాత్యాగిలక్షణము.

క . జనియును మృతియును ధర్మం, బు నధర్మము సౌఖ్యదుఃఖములు లేవని నె
    మ్మనమునఁ దలంచు నెవ్వం, డనఘమతీ యతఁడపో మహాత్యాగి ధరన్.

క. వ్యాపకునకుఁ ద్రిశరీరా, లేపకునకు నిర్జితావలేపకునకు ధీ
    దీపకునకు సచ్చిత్సుఖ, రూపకున కనంతవిశ్వరూపాత్మునకున్.36

టీక . వ్యాపకునకు = సర్వమును వ్యాపించియున్న వాఁడును, త్రి .... నకున్ - త్రిశరీర = స్థూలసూక్ష్మ కారణశరీరములను (లేక, శరీరములయందు,} అలేపకునకున్ = సంబంధము లేనివాఁడును, నిర్జిత అవలేపకునకున్ = జయింపఁబడిన గర్వము గలవాఁడును, (ఇచ్చట గర్వమని చెప్పుటచే, సర్వవిధము లగుదుర్గుణములును గూర్చియుఁ జెప్పునట్లె యని యూహించునది.) ధీ దీపకునకున్ = తనజ్ఞానశక్తిచే బుద్ధిని ప్రకాశింపఁ జేయువాఁడును, సత్ చిత్ సుఖరూపకునకు = సచ్చిదానంద స్వరూపుఁడును, ఆ...నకున్ - అనంత = తుదిలేని, విశ్వ = ప్రపంచమే, రూప = స్వరూపముగాఁగలపరబ్రహ్మమే, ఆత్మునకున్ = శరీరముగాఁగలవాఁడును, (పరబ్రహ్మరూపుఁడును అనుట.)

తా. సకలలోకములను వ్యాపించి, స్థూలసూక్ష్మకారణశరీరములతో (వాని వికారములతో) సంబంధపడక గర్వము మొదలగు సకలదుర్గుణములను జయించి యుండువాఁడును, తనజ్ఞానశక్తిచే బుద్ధిని బ్రకాశింపఁజేయువాఁడును, సచ్చిదానందస్వరూపుడును, సకలప్రపంచమయుఁడును అయినపరబ్రహ్మమే తానై యుండువాఁడును.

క. శ్రీమద్దత్తాత్రేయమ, హామునిసదృశునకు శ్రీమహాదేవగురు
   స్వామికిఁ దతసర్వాంత, ర్యామికి విజ్ఞానభూమి కారామునకున్. 37

టీక. శ్రీ మ...నకున్ - శ్రీమత్ = సంపద్యుక్తుఁడైన, దత్తాత్రేయ మహాముని = దత్తాత్రేయుఁడను యోగీశ్వరుతోడ, (వైదికసంప్రదాయము నశించినకాలమున దానిని మరల నుద్ధరించుటకై యత్రి మహామునికి దత్తాత్రేయుఁ డనుపేర విష్ణువు జన్మించెనని యొకగాథ కలదు) సదృశునకున్ = సమానుఁ డైనవాఁడును, తత... కిన్ - తత = విస్తారమైన, సర్వ= సమస్తమునకును, (నానావిధము లగు సకలప్రపంచమునకును అనుట.) అంతర్యామికిన్ = లోపల నుండి నియమించినవాడును, (అనఁగా : ప్రతిభూతములను వాని వాని కార్యములయందుఁ బ్రవర్తింపఁజేయువాఁడును,) వి. . .కున్ - విజ్ఞానభూమి కా = ఏడుజ్ఞానభూమికలే, ఆరామునకున్ = విహారస్థానములుగా గలవాఁడును, (జ్ఞాననిష్ఠుఁడు ననుట) అగు, శ్రీమ... కిన్ - శ్రీ = శోభాయుక్తుఁడైన, (లేక బ్రహ్మజ్ఞానవంతుఁ డైన,) మహాదేవగురుస్వామికిన్ - ఆచార్యస్వామి యగుమహాదేవునకు.

తా. అత్రిమహాముని దత్తాత్రేయరూపముతో నవతరించిన శ్రీమన్నారాయణునితో సమానుఁడును, సకలలోకములకు నంతర్యామిస్వరూపుఁడును, జీవబ్రహ్మైక్యసమాధినిష్ఠుఁడును ఆచార్యులలో నుత్తముఁడు నగు మహాదేవాచార్యునకు.

జ్ఞానభూమికావివరణము.

శుభేచ్ఛ, నివారణ, తనుమానస, సత్త్వాపత్తి, సంసక్తినామిక, పదార్థభావని, తుర్యగ అని జ్ఞానభూమికలేడు. అందు శుభేచ్ఛయనఁగా; బహుజన్మార్జిత సుకృత పరిపాకమువలన కాకతాళీయన్యాయముగ దైవికముచేత జ్ఞానముగలవాఁడై, “ఆయ్యో నేనేల మూఢుఁడ నయితిని? ఈయపార సంసారసాగరమెట్లుదాఁటఁగల' నని పరితపించి సజ్జనుల చేరువఁ జేరి వారి యపారకరుణాపూరసేవనంబున దురాపంబు లగుతాపంబులు తీఱి పిమ్మట వారల యుపదేశబలంబున సత్కర్మాచరణమును వేదాంత శాస్త్రపరిజ్ఞానమును ఇహపరలోకభోగ విరక్తియుఁగలిగి మోక్షము నపేక్షించుట. విచారణయనఁగా : అద్వైతశాస్త్రపరిజ్ఞానంబును సత్సంగమంబును వైరాగ్యంబును గలిగి బ్రహ్మమెయ్యది యని విచారించుట. తనుమానసయనఁగా; ఈరెండు భూమి కలసాధన పూర్ణముగఁ గలిగి దారుణము లగు విషయేంద్రియముల త్రిప్పులోఁ దగు లక; మనసును క్షీణింపఁజేయుట. దీనికి అసంగమమని మఱియొకపేరు గలదు, ఆయసంగమము సామాన్యమని విశేషమని ద్వివిధము. మఱియు నది సామాన్యవిశేష భేదములచేత నాల్గు విధములు. అందు సామాన్యాసంగమమనఁగా; శబ్దాదివిషయముల యందు నేను కర్తను భోక్తను గురువును శిష్యుఁడను బాధ్యుఁడను బాధకుఁడను గాను. సుఖదుఃఖము లీశ్వరాధీనములు, యోగవియోగభోగరాగాదులు కాలవశములని యెంచి దేనియం దాశలేకయుండుట. సామాన్యసామాన్యాసంగమమనఁగా, సంచితకర్మముల చేత లభ్యములైన సుఖదుఃఖములయందు ప్రియాప్రియములు లేక, వానినంటకముందు విచారించిన వేదాంత మహావాక్యార్థనిశ్చయమందుఁజేరుట. విశేషాసంగమమనఁగా సత్సహవాసమువలనను, అపరోక్షజ్ఞానమువలనను, పురుషప్రయత్నమువలనను, జ్ఞాన శాస్త్రములసంగతాభ్యాసమువలనను, పరమవస్తువు కరతలామలకమై కనఁబడుచుండఁ గా, సంసారసాగరోత్తారకమై, పరతత్త్వస్థితిఁజెంది, సకలమునీశ్వరాధీనమనుటను, కర్మమే సుఖదుఃఖములకుఁ గారణమగుటను మాని మౌనియై పరమశాంతిగలిగియుండు విశేషవిశేషాసంగమమనఁగా, బాహ్యాభ్యంతరములను ఊర్ధ్యాధఃప్రదేశములను దిక్కులను ఆకాశమును స్థావరజంగమజంతువులను చీకటి వెలుతురులను చిజ్జడములను సకలవస్తువులను అవస్థానుభవములను వేఱుగాఁ జూడక అఖండాకారముగఁ జూచుచు చిత్తవిశ్రాంతి గలిగి నిస్సంకల్పుఁడై ముందుదర్శించిన యాత్మ యందు మనస్సుకరుగుట. ఈమూఁడు భూమికలలో దేనినైన నభ్యాసముచేయుతఱిని మృతులైనయోగులు దేవ విమానములయందు దేవతాస్త్రీలతో కూడి స్వర్గవైకుంఠ కైలాసాది పుణ్యలోకముల యందు సకలదివ్యభోగములు చిరకాల మనుభవించినవెనుక, శ్లో. "శుచీనాం శ్రీ మతాం గేహే యోగభ్రష్టో హి జాయతే, అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం.” అను గీతావచనప్రకారముగ భూలోకంబున శ్రీమంతులయింటఁ బుట్టి పూర్వము తాను విడిచిన నెలవునఁ జేరి క్రమముగా నావల్లభూమిక నెక్కును, మూఁడు భూమికలవఱకు జన్మము గలదు. తక్కిన భూమికలయందు జన్మము లేదు. సత్త్వాపత్తియనఁ గా, ఈ మూఁడుభూమికల నభ్యసించి యింద్రియార్థములయం దాశ మాని శుద్ధాంతరంగుఁడయి యితర సంకల్పములు లేక బ్రహ్మనిష్ఠ గలిగి యుండుట. సంసక్తినామికయనఁగాఈ నాల్గు భూమికలయభ్యాసమువలన విషయసంగమగుణత్రయ సంగమంబులు లేక బ్రహ్మనిష్ఠయందు పట్టుదప్పక యుండుట, పదార్థభావన యనఁగా, ఈయైదుభూమికల యభ్యాసవిశేషముచేత అంతరబహిర్మధ్యదృశ్యములు లేక స్వాత్మారాముఁడయి బ్రహ్మము నేననుట. తుర్యగ యనఁగా; ఈయాఱుభూమికల మార్గముల నెఱిఁగి యేమిట భేదములేమిఁ దెలిసి పరబ్రహ్మమాత్రముగా నుండుట. దీనిలోమొదటి మూఁడుభూమికలు జగద్వ్యాపారము గలవి గనుక జాగ్రదవస్థయగును. నాల్గవభూమికయందు నామరూపములుగల జగత్ తుస్వప్నమువలె తోఁచును గాన అది స్వప్నావస్థయగును. ఇట్టి యనుభవము గలవాడే బ్రహ్మవిదుఁడు. ఐదవభూమిక నిర్వి కల్పమై సుషుప్తివలె సుఖముగా జగము తోఁచుటవలన అది సుషుప్త్యవస్థయగును. అట్టి యనుభవముగల యోగమే బ్రహ్మావిద్వరుఁడు . ఆఱవభూమిక సర్వవాసనాక్షయ మైనది గనుక గగనమున మునిఁగిన ఘటమువలె బాహ్యాభ్యంతరములులేనిదై సముద్ర మున మునిఁగినకుండవలె లోపల వెలుపల, పరిపూర్ణమై జగము, పరమాత్మ ప్రకాశ ముగాఁ దోఁచుటవలన, అదియే తురీయావస్థ, ఇట్టి అనుభవము గలవాఁడే బ్రహ్మ విద్వరీయుఁడు. ఇదియే జీవన్ముక్తి, సప్తమభూమిక అవాఙ్మానసగోచరము, దానిని బ్రహ్మ విష్ణు రుద్ర జీవ శూన్య కాల ప్రధానాదినామములచే పెక్కండ్రు, పెక్కు గతులఁ బేర్కొందురు. అది నామరూపములు లేనిదైనను కల్పితనామరూపములచేఁ జెప్పఁబడును. ఇట్టి యనుభవముగల యోగియే బ్రహవిద్వరిష్ఠుఁడు; అదియే విదేహ ముక్తి.

వ. సమర్పితంబుగా నొనర్పం బూనిన శ్రీసీతారామాంజనేయసంవాదం
    బను వేదాంతగ్రంథమునకుఁ గథాప్రారంభం బెట్టి దనిన.38

టీక. సమర్పితంబుగాన్ = సమర్పణము చేసి (కృతియిచ్చి), నాయొనర్పం బూనిన = నేను రచించుటకుఁ బూనుకొన్న, శ్రీసీతారామాంజనేయసంవాదం బను వేదాంతగ్రంథంబునకున్ = శోభాయుక్త మగుసీతారామాంజనేయసంవాద మను పేరు గలయద్వైతగ్రంథమునకు, కథాప్రారంభంబు = కథ యొక్క యారంభము, (లేక, క్రమము = గ్రంథమునందలి విషయములు విచారించుట,) ఎట్టిది అనినన్ = ఏవిధమైన దనఁగా.

తా. ఇట్లు గురుపరంపర నభివర్ణించి, పరశురామపంతుల రామయామాత్య పుత్త్రుడగు నేను (లింగమూర్తి గురుమూ ర్తియనువాఁడను) నాగురువగుమహాదేవాచార్యు నకుఁ గృతి యిచ్చి సీతారామాంజనేయసంవాద మను పేరు గల యొక యద్వైత గ్రంథమును రచియింప నుపక్రమించితిని. దానియందలి విషయముల నీ క్రిందఁ క్రమక్రమముగా వివరించెదను.