సాక్షి సంఘనిర్మాణము

వికీసోర్స్ నుండి

ప్రాపంచిక చర్యలు చిత్ర విచిత్రాతివిచిత్ర మహావిచిత్రములై యున్నవని మీరెరింగినయంశమే. ఇది మీరు క్రొత్తగఁ జూచినది కాదు. మేము క్రొత్తగఁ గనిపెట్టినది కాదు. కాని దిగువఁజెప్పబోవు కారణముచే మేమనవలసి వచ్చినది. మాయుద్యమ సాఫల్యమునకై మీరు వినవలసి వచ్చినది. సృష్టిలో మనుష్యులెందఱో మనుష్యప్రకృతు లన్నియైయున్నవి. ఏ రెండును సమములు గావు. సర్వశక్తిమంతుఁడును జ్ఞాన స్వరూపుఁడునగు భగవంతుడు తన బుద్ధిబలముచే నిన్ని వేఱువేఱు స్వభావములు సృష్టింపఁగ మనుజుడు తనకీయఁబడిన, యొక్కటైన ప్రకృతిని-మాఱగూడని యొక్కటైన ప్రకృతిని-సమయానుగుణముగ, సందర్భానుసారముగ, సన్నిహిత వ్యాపార సముచితముగ, స్వప్రయోజనప్రదమగునట్లుగఁ బదునాలుగు ప్రకృతుల క్రింద మార్చి, లేక మాఱునట్లితరులకగపఱచి, తన్ను సృజించుటయందు భగవంతుడు వెల్లడిచేసిన నైపుణ్యమును-దన్ను దన్ను గానివానిగా నితరులకు గనబఱచుటయందు వెల్లడి చేయుచున్న తన మాయాసృష్టి నైపుణ్యమునెదుట-సిగ్గుపడునట్లు-వెలవెలబోవునట్లు-తలవంచు కొనునట్లు-మొగము మాడ్చుకొనునట్లు సేయుచున్నాడు. తాను చేసిన యీ బొమ్మలు మాయా జగన్నాటక సూత్రధారుడయిన తనకంటె మహామాయావిశేషాన్వితములై చిత్రచిత్రముగ నేత్రాభినయములచే హస్తాభినయములచే నవనవ పాదాభినయముల నాట్యములచే నొంటి కాలిభరతములచే వింతవింతలుగ తెయితక్కలాడుచున్నవని లోన సంతోషించుచునే యున్నాడో లేక వేయఁగూడని వేషములు వేసినందులకుఁ, బూసికొనఁగూడనిపూతలు పూసికొనినందులకు, ధరియింపఁగూడని దుస్తులు ధరించినందులకు, వేయఁగూడని గంతులు వేసినందులకుఁ, బాడఁగూడనిపాటలు పాడినందులకు, నాటకాంతమునఁ బాత్రములను శిక్షింపఁదలచి యేయున్నాఁడో, యెట్టివాఁడో, యెక్కడ నున్నాఁడో, యేమి చేయుచున్నాఁడో, యేకాకి యగువానికీ విఱుగుతఱుగులేని జంజాట మెందులకో! యెవ్వఁడెఱుగని యీశ్వరుని గూర్చి యెట్లు చెప్పఁగలము? నవ్వు సంతోషమునకు, నేడ్పు దుఃఖమునకు సూచకములని వెఱ్ఱి భగవంతుఁడు స్థూలవిభాగ మేర్పఱచి యుండ బుద్ధి నిధులైన మన వారెట్టియెట్టి సూక్ష్మసూక్షతర సూక్ష్మతమ విభేదముల గల్పించి వెల్లుల్లిపొరను వేయివిధములుగా నెట్లు చీల్చినారో చూడుఁడు!


"ఉహు ఉ" అని పండ్లు గనఁబడని పెదవులు విడని మూతిగదలని మొగమున వికాసములేని నవ్వు-పై పెదవి మాత్రము కొంచెముగదల్చి పై రెండుపండ్లు మాత్రమే కనఁబఱచి ధ్వని యెంతమాత్రమును లేకుండ నవ్విన నవ్వు-అడుగుపెదవి పైపెదవి కొంచెము గదల్చి పై రెండుపండ్లడుగు రెండుపండ్లును గనఁబఱచి "హు హు హు" అని యిగిలింపు గలుగునట్లు నవ్విననవ్వు-పై పండ్లడుగుపండ్లతో గట్టిగఁ జచ్చువానికివలె దాకొల్పి పెదవులు మాత్రమే కదల్చి కిలకిలగ నవ్విననవ్వు-నోరు బాగుగఁ దెఱచి "హాహాహా" యని నవ్విన వెఱ్ఱి నవ్వు-మొగమేడ్చునట్లు చేసి "హే హే హే" లతోఁ గూడి నవ్విననవ్వు-ఇట్లనేక విధములుగ వీని బాహ్యచిహ్నము లుండును. వీనికి మొలకనవ్వు-మొద్దు నవ్వు-కిచకిచ నవ్వు-కిలకిల నవ్వు-ఇగిలింపు నవ్వు-సకిలింపు నవ్వు-అని వివిధ నామములు గలవు. వీనిలో నేనవ్వు కూడఁ బ్రీతి సూచకమైనది కాదు. ఒక నవ్వున కర్థము రోఁత. ఒక నవ్వు తిరస్కార సూచకము. కుండలోపలి యభిప్రాయము పై కగపడకుండ మూసినమూకుఁ డొకనవ్వు-ప్రత్యుత్తరము చెప్పనిష్టములేక వేసిన కప్పదాటొకనవ్వు-కోప మడఁచుకొనుటకై తెచ్చుకొన్న నవ్వొకటి. "ఓరి! చచ్చుముండకొడుకా!" యను నిరక్షరమైన తిట్టొకనవ్వు. ఇట్లే కోపమునకు రూప భేదములు, నామ భేదములు, నర్థ భేదములు, నభిప్రాయ భేదములు గలవు. ఇప్పటి నవనాగరకుఁడు తన శత్రువును జూచిన తోడనే-ఏమి యుత్సాహము! ఏమి శిరఃకంపములు! ఏమి కరసంచాలనములు! ఏమి తియ్యమాటలు! ఏమి కౌఁగిలింతలు! ఏమి పరకష్టాసహిష్ణుతాసూచక విలాపములు! ఓహో! లోపలి యగ్నికిఁ బైకెంత చల్లదనము! లోని విషముష్టికిఁ బైకెంత మాధుర్యము! లోని పిశాచమునకుఁ బైనెన్ని తులసిపూసలపేరులు! ఆహా! మనుష్యచర్యలెంత విరుద్ధముగ మాఱియున్నవి! ముద్దులో ముక్కూడఁబీకుట. కౌగిలింతలో గొంతుకోత, సాలగ్రామతీర్థములో సౌవీరపాషాణముగ నున్నవికదా? ప్రకృతి యెంత తలక్రిందయినట్లున్నది! అమృతమేదో, హాలాహలమేదో, పూలబంతియేదో, తుపాకిగుండేదో, నమస్కారమేదో, నెత్తిపెట్టేదో, మంచియేదో, చెడ్డయేదో, మిత్రుఁడెవడో, శత్రుఁడెవడో, స్వర్గమేదో, నరకమేదో, పరమేశ్వరుఁడెవడో, బ్రహ్మరాక్షసుఁడెవడో-భేదమంతయు నశించినది కదా!


తమకు బహుస్వల్పలాభమే కాని యితరుల కెంతమాత్రమును నష్టములేని సామాన్య జీవయాత్రా వ్యాపారములలో మాత్రమే మనుష్యులిట్లు సత్యానుభవాచ్ఛాదనము, మిథ్యానుభవసంధానము స్వప్రకృతి సంఛాదనము, పరప్రకృతి స్వీకారము సేయుచు రేమో యనఁగ నట్లుకాదు.


మాన న్యాయ్య ధన ప్రాణాదివిషయములగు వ్యాపారములఁ గూడ నిట్టిమహేంద్రజాలవిద్యనే కనఁబఱచుచున్నారు! మనసును దిగంబరముగఁ జేయువాడు మందుఁడు. సత్యమసత్యమను నూఁతకోలలేక నడువ లేదని మనవారు నమ్మియున్నారు. పతిప్రక్కలో మాయ! భ్రాతలపాలిలో మాయ! న్యాయాధికారి కలములో మాయ! న్యాయవాది నాలుకకొనను మాయ! వణిజుని త్రాసులో మాయ! వసుధాకర్షకుని నాగేటిలో మాయ! ఎక్కడ జూచిన మాయ!! ప్రపంచమున నెవ్వరు సత్యవంతులు? యోగ్యులు లేరా? ఉన్నారు. కొలదిగ పరకపాటుగ, ఆఫ్రికాయెడారిలో ఫలవంతములగు ప్రదేశములవలె నున్నారు. ప్రతి వ్యాపారములోను మహానుభావులుత్తమోత్తములున్నారు. ఇట్టివారుండుటచేతనే యింక ప్రపంచ ముల్లోలకల్లోల మొందకయున్నది. ఒక్క రావణాసురుని వధించుటకుఁ బరమాత్మ యంతవాఁడు, రాముని యంతవాని యవతారమొంది పడరాని కష్టములఁ బడి తుదకుఁ గృతార్థుఁడయ్యెను! అందరు రావణాసురులయిన యెడల నతని యవతారపుటాట సాగునా? ఇంక-నట్టి దురవస్థ రాలేదు. పరమార్థ వంతులు కొందఱున్నారు. వారే లేకుండునెడల ద్వాదశార్కులుదయింప వలసినదే! పుష్కలావర్త మేఘములు తెగిపడి వర్షింపవలసినదే! బ్రహ్మ పునస్సృష్టికై తిరుగ నడుసు ద్రొక్కవలసినదే!


ఇక మనుష్యులొనర్చు నేరములు మొదలగువానిఁ గూర్చి కొంత విచారింతము. పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునేయున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునేయున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. పెరుగుచున్న నేరములు పెరుగుచునేయున్నవి. కట్టించుచున్న కారాగృహములు గట్టించుచునేయున్నారు. ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య యెదుగుచునేయున్నది. నరహత్య చేసిన వారిని జంపుటకు నానావిధ యంత్రములు కల్పించుచునేయున్నారు. హత్యలు వృద్ధియగుచునేయున్నవి. నేరము శిక్షనొందిన కొలది వృద్ధినొందుచున్నట్లున్నది. నేరమొనర్చుటవలన బీదల కన్నము దొరకుచున్నది!


అయినను బ్రత్యేక రాజకీయదండనము మాత్రమే నేరము నణగద్రొక్కఁజాలదు. దానికిఁదోడు సంఘశిక్ష యుండవలయును. సంఘశిక్షయనగ నేరగానితో నెవ్వరు జోక్యము కలుగఁజేసికొనకుండుట. అతనిని సంఘము నుండి యొకవిధముగ బహిష్కరించి యాతనిని సంఘాగ్రహపాత్రుని జేయుట. పది సంవత్సరముల కఠినశిక్ష కంటెఁ బదిమంది సంఘమువలన నేరగానిఁగూర్చి చేయఁబడిన యనాదరణము నేరము నాపుటలో బలవత్తరమైనది.


రాజకీయదండనము గల యీ నేరములకే సంఘదూషణము నేరము నడఁగించుటకుఁ గావలసివచ్చినప్పుడు రాజకీయదండనము లేని మొదటఁజెప్పిన నేరములకు-మనుజుల మాయాప్రచారములకు-సంఘదూషణ మావశ్యకమై యుండదా? ముఖ్యముగ నుండును. ఉండక తప్పదు. ఇట్టి నేరముల గూర్చియే మేమిక వ్రాయుచుందుము. నేరముల వెల్లడింతుము. వాని స్వభావముల విశదపరతుము. వానివలన సంఘముకు గల్గు హానిని స్పష్టపఱతుము. వానియందు జనుల కసహ్యము గల్గునట్లు సేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము . కాని యట్టినేరములకు లోనయిన వారిని నిందింపము. వారినిఁ దలపెట్టనైన దలపెట్టము. మాకు వారితో లేశమును బనిలేదు. ఇంతియేగాక మత విషయములను గూర్చియు, నారోగ్య విషయములను గూర్చియుఁ, గవితాద్యభిరుచిప్రధానశాస్త్రములను గూర్చియు, సంఘదురాచారముల గూర్చియు, విద్యాభివృద్ధి సాధనముల గూర్చియు, జరిత్రాద్యంశములఁ గూర్చియు, రాజభక్త్యాదులఁ గూర్చియు, నావశకములని మాకు దోచిన యింకగొన్ని యితరాంశములను గూర్చియు వ్రాయుచుందుము.


నేను, మరి నలుగురుఁ గలసి యొక చిన్న సంఘముగఁ జేరినాము. మీ రైదుగురుఁ జేరి, యిట్టి మహా కార్యము సేయగలరా? యని మీరడుగుదురేమో? ఉడుతలుదధినిఁ బూడ్చినట్లు చేసెదము. తరువాత మాతో నెన్నికోతులు చేరునో, యెన్ని కొండమ్రుచ్చులు, వెలుగుబంట్లు కూడునో! ప్రయత్నమే మనుజునియధీనము. ఫలము దైవాధీనము కాదా?


మేము ప్రతిరాత్రియు నొకచోఁ జేరుదుము. ఇప్పటి వరకు మాకు సొంత భవనము లేకుండుటచే నద్దెయింటిలోఁ జేరుదుము. మేమీ దిగువ నుదాహరించిన నిబంధనలను జేసికొంటిమి.


1. సభ చేరగానే మన చక్రవర్తిగారికిఁ జక్రవర్తినిగారికిఁ, వారి కుటుంబమునకు దీర్ఘాయురారోగ్యైశ్వర్యముల నిమ్మనియుఁ, బ్రజలకు వారియెడల నిరంతర రాజభక్తిని బ్రసాదింపవలయుననియు, మా సంఘము చిరకాలము జనోపయోగప్రదముగ నుండునట్లు కటాక్షింపుమనియు దైవమును బ్రార్థింపవలయును.


2. రాజకీయ విషయములను గూర్చి యెన్నడును ముచ్చటింపఁగూడదు, వ్రాయగూడదు.


3. తప్పులనేగాని మనుష్యుల నిందింపదగదు. తప్పులను విశదీకరించుటయందుఁ బాత్రము లావశ్యకములగునెడల కల్పితములై యుండవలయును.


4. సభ జరుగుతున్నంత సేపు మత్తుద్రవ్యములను ముక్కునుండిగాని నోటినుండిగాని లోనికి జప్పుడగునటుల పోనీయగూడదు.


5. వాదములలోఁ దిట్టుకొనఁగూడదు. చేయిచేయి కలుపుకొనగూడదు. కలుపుకొనుట యనివార్యమైనప్పుడు న్యాయసభల కెక్కఁగూడదు.


మా సంఘములోని సభ్యులెవరోఁ, వారి స్వభావములెట్టివో మీకు దెలిసికొనఁగుతూహలముండునెడల నీ దిగువఁ జదువుకొనుడు.


మాలో మొదటివాఁడు కాలాచార్యుడు. ఇతడు శ్రీవైష్ణవుఁడు. సపాదుఁడయ్యు నిష్పాదుఁడు. ఈతని తల పెద్దది. గుండ్రని కన్నులుండుటచే, ముక్కు కొంచెము వెనుకాడుటచే, మొగము గుండ్రముగ నుండుటచే నీతడు నరులలో 'Bull Dog' జాతిలోనివాఁడు ఈతఁడు మాటలాడిన మొరిగినట్లుండును. ఈతడు పొట్టివాఁడు. లంబోదరుఁడు. తారుకంటె నల్లనివాఁడు. ప్రాణమందలి తీపిచే నేకాంతయు నీతని వలచుటకు సాహసింపకపోవుటచేతఁ గాబోలు బ్రహ్మచారిగ నున్నాఁడు. సత్ప్రవర్తనము కలవాఁడు. ఈతఁడు వేదవేదాంగములను, ద్రిమత శ్రీభాష్యములను, గీతా భాష్యములను జదివినాఁడు. మతసంప్రదాయములన్నియు బాగుగ నెరుగును. కుండలముల ధరింపవలయునను కుతూహలము గలవాఁడు. అఖండ ధారణాశక్తి కలవాఁడు. వాక్చాకచక్యము లేనివాఁడు. ధారాళమయిన యంతఃకరణము కలవాఁడు. పొడుము పొత్తిలోఁ జేర్చి రొండిలోఁబెట్టిన యెడల నలవాటగునేమోయను భయము గలవాఁడు. తనకు దెలిసిన యేయంశమును గూర్చియైన బట్టుదలగ వాదించువాఁడు. కోపరహితుడు. ఈతఁడు ప్రవేశపురుసుమీయలేని హేతువున వెట్టిసభ్యుడుగఁ జేరినవాఁడు.


రెండవవాఁడు జంఘాలశాస్త్రి. ఈతఁడారడుగుల యెత్తుగలవాఁడు. విశాలమైన నుదురు, దీర్ఘనేత్రములు, లొడితెడు ముక్కును గలవాడు. కాలినడకనే యాసేతుహిమాచలపర్యంత దేశమంతయు దిరిగినవాడు. అనేక సంస్థానముల జూచినవాడు. జమీందారుల యాచించి వారీయకుండునెడలఁ జెడమడ తిట్టినవాఁడు. ఏ సంస్థాన పూర్వ చరిత్రయేమో, యే ప్రభువునకేయే లోపములున్నవో యెరిగినవాడు. దేవస్థానములన్నిటిని సేవింవి వానివాని పుర్వోత్తరములన్నియు దెలిసినవాఁడు. వినువాఁడుండు వెడల గథలజెప్పుటలో విసుగువిరామములేవివాఁడు. వాచాలుఁడు. వాదములలో గఱ్ఱజారిపోయినఁ గలియఁబడఁగలిగినవాఁడు. గార్దభగాత్రము కలవాఁడే కాని గాన కళానుభవ మెక్కువ గలవాఁడు, అనేక జాతీయముల జెప్పఁగలవాడు. అర్థ మెవ్వడైనఁ జెప్పినయెడల నెట్టిపద్యములోఁగాని, యెట్టిశ్లోకములో గాని యౌచిత్య విషయమునఁ దప్పుబట్టగలవాఁడు. చీపురుకట్టయే యాయుధముగఁ గలవాఁడై హ్రీం హ్రాంకార సహితుఁడై యనేక కాంతల గడగడ లాడించినవాఁడు. అన్ని యంశముల నింతయో యంతయో తెలిసినవాఁడు. ఈతనితలలో, విప్రవినోదిగాని సంచిలోవలె నొక సాలగ్రామము, నొక యుల్లిపాయ, యొకచిలుకబుఱ్ఱ, యొకతేలు, నొకరాధాకృష్ణుని విగ్రహము, నొకబొమ్మజెముడుమట్ట, యొకపుస్తకము, నొకపొగకుచుట్ట మొదలగునవి చేర్చినవాఁడు. ఈతడు ప్రవేశరుసుమిచ్చినాఁడు.


మూఁడవవాఁడు వాణీదాసుఁడు. ఇతడు కవి. ఎడమచేయి వాటము గలవాఁడు. అడ్డతలవాఁడు సంతపశువువలె నెఱ్ఱబట్టఁజూచి బెదరువాఁడు. అంటురోగము కలవానివలె నెవ్వరిదరిఁజేరఁడు. గ్రుడ్లగూబవలెఁ జీఁకటి నపేక్షించును. ఎక్కడఁగూర్చుండిననక్కడనే పొమ్మనువఱకు బరధ్యానముగఁ గూర్చుందియుండును; మిగుల సోమరి. పొట్టివాఁడు. అపాదశిరఃపర్యంతమసూయ గలవాడు. ఆదికవియైన నన్నయభట్టు మొదలుకొని యాధునిక కవియగు నన్నాసాహేబువఱకందఱను దూషించును. శ్లేషకవిత్వమందు రసమెక్కువ కలదని నమ్మకము కలవాఁడు. అన్ని విధముల కవిత్వములు చెప్పఁగలవాడు. ఇతఁడు నువ్వుగింజమీఁద నూఱు పద్యములు చెప్పినాఁడు. మూఁడు సంవత్సరములనుండి కంకణబంధమొకటి వ్రాయుచున్నాఁడు. పెదవులు నల్లగ నుండుటచే నీతడు చుట్టగాల్చు నలవాటు కలవాఁడైయుండును. ఈఁతడు శూద్రుడు. ఈతడాధునిక పద్ధతిననుసరించి కవిత్వముఁజెప్పుటకుఁ బ్రయత్నించుచునున్నాఁడు.


నాల్గవవాఁడు కోమటి. ఈతఁడు వాణిజ్య రహస్యములెరిగినవాఁడు. కొంతకాలము క్రిందట వర్తకము బాహుళ్యముగఁ జేసినవాఁడు. విశేషధన మార్జించినవాఁడు. ఇతఁడు మహైశ్వర్య దినములలో నున్నప్పుడు బయలుదేఱిన తామరతప్ప నిప్పుడీతనికి వెనుకటి ధనమేమియు మిగులలేదు. డోకడావలీలగఁ గట్టగలవాఁడు. ఈతఁడెక్కడకుఁబోయినను మూఁడు చేతులతోఁబోవును. (తనకై రెండు చేతులు, తామరకై యిత్తడిచేయి). ఈతఁడటికయంత తల గలవాఁడు. ఈతనిపేరు బొఱ్ఱయ్య; ఈతఁడు మాయింటి గుమ్మమునఁబట్టడు. తెలిసిన యంశములు వ్రాఁత రూపకముగ మాకుఁ దెలియపఱచుచుండును. ఈతఁడు ప్రవేశరుసుము నిచ్చెను.


నేనయిదవవాఁడను. నేనెవఁడనో నాకుఁ గొంత తెలియునుగాని నేనెవఁడనో మీకు స్పష్టీకరించుటకుఁ దగిన యాత్మజ్ఞానము కలవాడఁనుగాను. నా సంగతి మీరు ముందు నా వ్రాతలఁబట్టియే కనిపెట్టఁగలరు. నే నారామ ద్రావిడుఁడను. నా పేరు సాక్షి. మేము ప్రచురించు పత్రికకు నా పేరేయుంచితిని. వారమునకొకటి రెండు దళములఁ బంపెదము. మీరు మీ పత్రికలో వానినచ్చువేయింపఁగోరెదము. ఎల్లకాలము మీకీశ్రమ మిచ్చువారము కాదు. మా జంఘాలశాస్త్రి యెక్కడనుండియో యెటులో యొక ముద్రాయంత్రమును, దాని పరికరములను నొడివేసి లాగుకొని వచ్చెదనని కోఁతలు గోయుచున్నాఁడు. అంతవఱకు మీపత్రికకుఁ బంపుదుము. మీకు మావలని ప్రతిఫల మేమియును లేదు. సరేకదా, మీ పత్రికావ్యాపారము తిన్నగ నుండకుండునెడల మిమ్ములనుగూడ మా పత్రికలో నధిక్షేపించుచుందుము. పరీధావి సంవత్సర మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి గురువారమునాఁడు లింగోద్భవ కాలమున నీ సభ పుట్టినది.


మాది సత్యపురము. మా సాక్షి స్థానము తపాలకచేరికెదురుగ.


ఇట్లు విన్నవించు
సభ్యులందఱి బదులు
సాక్షి.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.