సర్పపురమాహాత్మ్యము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీశారదామ్బాయై నమః

సర్పపురమాహాత్మ్యము

తృతీయాశ్వాసము



రుచిరగుణాభరణా
నారదమునివినుతచరణ నతజనశరణా
ఘోరాంహస్సంహరణా
భూరిజగద్భరణ సర్పపురవరశరణా.

1


వ.

అవధరింపుము శౌనకమహామునీంద్రున కగస్త్యుం డిట్లని చెప్పందొడంగె నట్లయ్యాగంతు
కాంగనారత్నంబు విప్రవాక్యప్రకారంబున నక్కాసారతీరంబు చేరి తజ్జలంబుల
నవగాహనంబు చేసి.

2

స్త్రీరూపమును విడిచి నారదుండు నిజపూర్వవృత్తముల నెన్నుట

క.

తటిదుపమానజటావలి, పటికపుజపమాల కరవిపంచియు ధవళో
త్కటతనువుఁ గలిగి మఱి యె, ప్పటినారదమునియ యగుచుఁ బటుగతి నిలిచెన్.

3


తే.

జలధిలోపల వెడలిన శశియుఁబోలె, నిలిచి యత్యద్భుతం బాత్మ నివ్వటిల్ల
స్త్రీత్వసంపత్సుతాదివిస్తీర్ణపూర్వ, వర్తనం బెల్ల స్వప్నకల్పముగఁ దలఁచె.

4


ఆ.

తలఁచి కొలను వెడలి తత్తటాంతికవన, భూమి నొక్కపుప్పభూరుహంబు
క్రిందఁ గూరుచుండి సందేహవివశిత, స్వాంతుఁ డగుచు మఱియు నాత్మలోన.

5


ఆ.

ఏమియద్భుతం బి దేమియాశ్చర్య మి, దేమివిస్మయం బి దేమిచిత్ర
మేమిచోద్య మిది యహామును పెన్నఁడు, వినని కనని దొడ్డవింత పుట్టె.

6


సీ.

కలఁ గంటిఁ గాఁబోలు గణుతించి చూచినఁ గల యనిద్రున కెట్లు గలుగనేర్చు
విశ్రాంతి కాఁబోలు వివరింప నది వస్తు, దర్శనంబునఁ గాని తవులుకొనదు

మోహంబు కాఁబోలు నూహింప దానిచే, నూరక తెలివి లేకుండవలయు
నైంద్రజాలక మేమొ యరసి చూడఁగ నట్టు, లైన నిందుఁ బ్రయోక్త గానిపింపఁ


తే.

డహహ గలయును భ్రమయు మోహంబు నైంద్ర, జాలకంబును గాదు నిశ్చయ మి దేమి
యద్భుతం బంచుఁ బలుమఱు నాత్మలోన, నెంచుచు నొకింతతడవు చింతించుచుండె.

7


వ.

అంత.

8


సీ.

అంగనామణిరూప మబ్బుటయును మనో, జాతార్తియు నికుండ జనవరునకుఁ
బ్రియపత్ని యగుటయు బిడ్డల నూర్వురఁ, గనుటయు వారు సంగ్రామభూమిఁ
బడుటయు క్షుద్బాధ బడలుటయును శవ, సోపానసరణియు సూరివరుని
వచనప్రకారంబు వరుసతో స్మరియించి, మదిలోనఁ జాలవిస్మయముఁ బొంది


తే.

యహహ యిది యెన్న విష్ణుమాయాప్రభావ, మంచు మానసమున నిశ్చయించి మున్ను
బ్రహ్మసభలోను నేను గర్వమునఁ బలికి, నట్టి ఫల మిప్పు డనుభవం బయ్యె నిజము.

9

నారదుండు విష్ణుప్రభావము నెంచి విష్ణువును ధ్యానించుట

వ.

అని విచారించుచుండె నని యగస్త్యుండు శౌనకున కెఱింగించిన నతం డతనికి గ్రమ్మఱ
నిట్లనియె.

10


తే.

ప్రవిమలాత్మక కుంభసంభవ సురర్షి, యట్లు వర్తించుచో నిజం బరయ నెంత
కాల మయ్యె నెఱింగింపు కౌతుకంబు, మఱి మఱియు హెచ్చుచున్నది మానసమున.

11


క.

అనిన నగస్త్యుఁడు పలికెన్, విను మొకత్రుటిమాత్ర మయ్యె వివరింపఁగ న
య్యనఘుఁడు మెలఁగినకాలము, మునివర విష్ణుప్రభావము గడిందిగదా.

12


వ.

అనిన శౌనకుం డంతట నారదుం డెట్లు మెలంగె నెఱిఁగింపు మనినఁ గలశభవుం
డిట్లనియె.

13


క.

 విను మునినాయక యిత్తెఱఁ, గున సురముని తెలివి దెచ్చుకొని యామోదం
బును ఘనశక్తియుఁ దనరఁగఁ, దనమది నఖిలేశు నిట్లు ధ్యానము చేసెన్.

14


క.

ఎవ్వనిచే సృష్టం బగు, నివ్విశ్వము ప్రోదిసేయు నెవ్వాఁడు జగం
బెవ్వనియం దడఁగు న్మఱి, యవ్విభునకు నేను బ్రణతు లర్థి నొనర్తున్.

15

తే.

అచ్చుగఁ జరాచరాత్మకంబైనయట్టి, యిజ్జగంబు సమస్తంబు నెవ్వఁ డయ్యె
నట్టిజగదీశునకుఁ బరమాత్మునకును, జిరకృపానిధి కే నమస్కృతు లొనర్తు.

16


తే..

సర్వభూతాంతరాత్ముని సర్వవిదుని, సర్వకారణభూతుని సర్వమయుని
సర్వదురితౌఘహరణుని సర్వహితుని, సర్వభువనైకనాయకు సంస్తుతింతు.

17


క.

కమలావిభు నారాయణుఁ, గమలభవేశానజనకుఁ గమలాక్షు నరిం
దము శంఖచక్రయుతకర, కమలున్ భజియింతు హృదయకమలమునందున్.

18


తే.

శేషపర్యంకశాయి యై క్షీరజలధి, యందు లక్ష్మీసమేతుఁ డై యలరువాని
నంతరిక్షంబుకైవడి నఖిలజగము, నిండుకొనియుండువాని నే నెఱిఁ దలంతు.

19


తే.

ఆదిమధ్యాంతరహితుఁ డై యలరువాని, నాదిమధ్యాంతకారణుండైనవాని
నఖిలకర్మచయాభోక్త యైనవాని, నఖిలమఖభోక్తయగువాని నభినుతింతు.

20


సీ.

ఏవిభుపదపద్మ మింద్రాదిసురశిరో, భృతపద్మరాగదీధితులఁ బెంచు
నేఘనునామంబు నిచ్చనైన వచింపఁ, గైవల్యనగరసౌఖ్యంబుఁ గూర్చు
నేదేవుమూర్తి యోగీంద్రమానసపద్మ, కర్ణికాంతరములఁ గలసి మెఱయు
నేప్రభుకరుణానిరీక్షణం బార్యుని, సకలకల్యాణభాజనముఁ జేయు


తే.

మహిమ నెవ్వనిచారిత్ర మహరహంబు, బ్రహ్మహత్యాదిఘోరపాపము లడంచు
నయ్యనంతు రమాకాంతు నధికశాంతు, నిరుపమస్వాంతు భగవంతు నే భజింతు.

21


ఉ.

కిన్నరసిద్ధసాధ్యసురఖేచరయక్షభుజంగముఖ్యు ల
త్యున్నతభక్తిఁ దన్ గొలుచుచుండిన వారల కెల్ల నెన్నఁడున్
బన్నము లంటనీయక కృపామతి నెవ్వఁడు ప్రోదిసేయు న
ప్పన్నగరాజశాయిని బ్రపన్నగణాభయదాయిఁ గొల్చెదన్.

22


తే.

అనలుఁ డొక్క డయ్యు జగతిపై నన్నియెడల, స్థూలసూక్ష్మాకృతులఁ దనర్చుచు వెలుంగు
నట్లు దా సర్వభూతాంతరాత్ముఁ డగుచు, నలరు పరమాత్ము నెప్పుడు నాశ్రయింతు.

23


తే.

వటునితెఱఁగున బహురూపనామభేద, ముల మెలంగుచు నేమహాత్ముఁ డచరాచ
రం బగుప్రపంచ మెల్ల నిరంతరముగ, నిండుకొనియుండు నవ్విశ్వనిలయుఁ గొల్తు.

24

తే.

అజసహస్రాక్షముఖనిఖిలామరులును, మఱియు సనకాదికాశేషమౌనివరులు
మానసంబుల నెవ్వానిమాయఁ దవిలి, భ్రాంతి వహియింతు రమ్మహాప్రభు నుతింతు.

25


క.

నీరజగర్భాండోదరు, నారాయణు నఖిలమునిజనత్రాణకళా
పారీణు సకలజగదా, ధారు ననాధారు మదిని దలఁతున్ భక్తిన్.

26


తే.

నిఖిలకల్యాణగుణపయోనిధి కృపాబ్ధి, శంఖచక్రగదాధర సర్వఫలద
దేవదేవేశ పరమేశ దీనజనక, నిగమవేద్య ప్రసన్నుఁడ వగుము నాకు.

27


తే.

అజ్ఞుఁడ జడుండ ని న్నెట్టు లభినుతింప, నేర్తు నజ్ఞానమునఁ జేసి నేను విష్ణు
మాయఁ గడచితి నన్నట్టిమాటతప్పు, క్షమ యొనర్చి రయంబ నన్ గావు మభవ.

28


తే.

స్వామి భవదంఘ్రియుగసమాశ్రయణగౌర, వమున మూఢుఁడ నై నేన పల్కినట్టి
తప్పు సహియించి ప్రోవు మాధవ ముకుంద, పుండరీకాక్ష హరి సర్వభువనరక్ష.

29

నారదునకు విష్ణువు ప్రత్యక్ష మవుట

సీ.

సర్వలోకేశ్వర సర్వశరణ్య యా, శ్రితజనవత్సల శ్రీనివాస
పద్మాక్ష మద్భావపరిశోధక కృపాబ్ధి, నారాయణ ముకుంద వారణేంద్ర
వరద గోవింద భవత్కటాక్షామృతాం, చితజలంబుల నభిషిక్తుఁ జేసి
నన్ను రక్షింపు మనాధనాథ యటంచు, దృఢభక్తిమైఁ బ్రస్తుతించుటయును


తే.

నతనిభక్తికిఁ బ్రముదితస్వాంతుఁ డగుచు, భావనారాయణస్వామి పతగరాజ
వాహనుండును గరుణావి ర్ధనుండు, నగుచు నమ్మౌనిమ్రోలఁ బత్యక్ష మయ్యె.

30


వ.

అప్పు డచింత్యాద్భుతరూపలావణ్యయౌవనామృతసముద్రుండును, దరుణారుణాంశు
మండలమండితానర్ఘమణిగణకిరణసంఘాతదేదీప్యమానకిరీటాన్వితోత్తమాంగుండును,
బురందరనీలనికాశకేశపాశుండును, సుప్రకాశుండును, శుచిస్మితసుధాపరిపూర్ణ
పూర్ణిమాచంద్రబింబోపమానవదనుండును, జగత్సదనుండును, మకరకేతననూతన
ధనుర్లతానదృశసవిభ్రమభూయుగళుండును, గంబుకంఠుండును, బ్రభాతసమయ
సముద్దీప్తసహస్రకిరణతరుణమయూఖౌఘప్రభిన్నసితాంభోజలోచనుండును, గలుష
మోచనుండును, గించిదున్మీలితలాలితచాంపేయముకుళాభిరామసునాసుండును,
మహోల్లాసుండును, ధాళధళ్యప్రభాపూరహారిహీరశకలోపమానరదనసముదయుం
డును, సుహృదయుండును, వసంతావసరలసితనవకిసలాయాంభోజరాగసమాసమన్విత
శోణాధరుండును, శ్రీధరుండును, మకరకుండలమణిఘృణివిరాజమానశ్రీకారరేఖా

తులితకలితశబ్దగ్రహుండును, దుష్టనిగ్రహుండును, నవీనకందర్పదర్పణప్రతీకాశ
ధగద్ధగాయమానగండభాగుండును, మహాభాగుండును, గనకకేయూరసరోరుహ
మాలికారుచిరదిక్కరీంద్రశుండాలదండనదృగ్పీనవృత్తాజానుచతుర్బాహుండును,
బ్రసన్నచాతకాంబువాహుండును, నిరుపమమాణిక్యఖచితశుచితరకనకకంకణా
రుద్రముద్రికాకీర్ణనిర్ణి ద్రకోకనదచ్ఛవిచ్ఛటాభాసమానకరాంభోజుండును, దివ్యతేజుం
డును, శ్రీవత్సకౌస్తుభాస్తోకముక్తాహారవనమాలికాసహితమహోరఃప్రదేశుండును,
నిరీశుండును, యమునాతరంగరంగత్రిభంగుండును, నభంగుండును, సురుచిరరత్న
సంస్థాపిత కాంచనకౌశేయవసనావృతకటిస్థలుండును, నిస్తులుండును, సమున్నతకలభ
శరనిభోరుకాండుండును, మహాప్రభుండును, బ్రత్యగ్రముక్తాఫలవిమలనఖరాంకుర
ప్రకరుండును, సుకరుండును, హలకులిశజలచరశంఖచక్రముఖలాంఛనాభిశోభిత
సమదఝణత్కారనూపురాలంకృతచరణారవిందుండును, సదానందుండును, సజలజల
దాభిరామశ్యామలకోమలదివ్యమంగళగాత్రుండును, ధాత్రీకళత్రుండును, నరిదరగదా
ఖడ్గశార్ఙ్గోపేతుండును, బ్రహ్మాండభాండపిచండుండును, నఖండనచ్చిదానందవిగ్రహుం
డును, నాదిమధ్యాంతరహితుండును, నఖిలభువనజనకుండును, ననంతసహస్రార్బుదమా
ర్తాండతేజోవిరాజమానుండును, నభంగవీరపరాక్రముండును, నపవర్గలక్ష్మీప్రదుండును,
ననేకాద్భుతదివ్యలీలావతారుండును, నపారకృపారసపేశలుండును, నాశ్రితరక్షాధురీ
ణుండును, నార్తజనశరణ్యుండును, నాగమాంతవేద్యుండును, నభేద్యుండును, నజే
యుండును, నప్రమేయుండును, నక్షరుండును, నాత్మమయుండును, ననంతుండును,
నద్వయుండును, నభవుండును, నగునాయ్యాదినారాయణుం బొడగని సాష్టాంగదండ
ప్రణామంబు లాచరించి యమందానందకందళితహృదయారవిందుం డగుచుఁ
గరకమలంబులు మొగిడ్చి నారదుం డిట్లని వినుతింపఁదొడంగె.

31

విష్ణువును నారదుండు వినుతించుట

సీ.

సనకాదిమునిమనస్సరసిజభ్రమరాయ, వారణేన్ద్రవిపన్నివారణాయ
శతమఖప్రముఖనిర్జరగణప్రణుతాయ, ఘోరనంసారాబ్ధితారణాయ
నలినగర్భాణ్డమణ్డలబృహజ్జఠరాయ, క్రూరదైతేయవిదారణాయ
కమలావధూముఖకమలాబ్జమిత్రాయ, దరసుదర్శనశార్ఙ్గధారణాయ


తే.

ఘనతరాశేషభువనైకకారణాయ, సతతపాలితమునిసిద్ధచారణాయ
సర్పనగరానవరతప్రచారణాయ, భావనారాయణాయ తుభ్యం నమో౽స్తు.

32

దండకము.

శ్రీమత్పయోరాశికన్యాకుచద్వన్ద్వసంలిప్తకస్తూరికాగన్ధసారాఙ్కితస్ఫార
దోరన్తరాళాయ విద్వన్మనస్సారకాసారమాద్యన్మరాళాయ నీళాపరీరమ్భసమ్భోగ
కేళీవిహారా నిశాత్యన్నన్తుష్టచేతోరవిన్దాయ సంరక్షితామర్త్యబృన్దాయ కన్దర్పకో
టీస్ఫురదివ్యసౌన్దర్యరేఖాపరిభాజమానాయ నానాయతీన్ద్రాజిరాఞ్చన్నిధానాయ
కారుణ్యమేధాసనాథాయ వేధోమరుత్వద్దినాధీశకీనాశభేశానలాహీశముఖ్యామర
స్తోమమస్తస్థలన్యస్తసౌవర్ణకోటీరకోటీరతామ్భోజరాగప్రభాపూరనీరాజితాఞ్చత్పదే
ధోరితోగ్రాపదేశౌనకాగస్త్యవల్మీకజవ్యాసవాసిష్ఠకణ్వాత్రిగాధేయకౌణ్డిన్య
శాణ్డిల్యమాణ్డవ్యముఖ్యాఖిలర్షీన్ద్రసంస్తూయమానస్థిరోదారభాస్వచ్చరిత్రాయ మి
త్రేన్దునేత్రాయ మీనాద్యనన్తావతారాయ ధీరాయ ఘోరాఘసఙ్ఘాతశుష్కాటవీ
హవ్యవాహాయ మానప్రకృష్టోరునామ్నేసముద్యన్మహిమ్నెపదాఙ్గుష్ఠనిష్ఠ్యూత
గఙ్గాసరిన్నీరధారావళీక్షాళితాశేషదోషాయ నిత్యప్రతోషాయ దోషాచరాదభ్రకా
లాభ్రఝఞ్ఝాసమీరాయ వీరాదివీరాయ క్షీరార్ణవాక్రాన్తలీలావిహారాయ
పుణ్యప్రచారాయ జమ్బూనదన్ఫీతపీతామ్బ రాలఙ్కృతాఞ్చత్కటీరాయ శూరాయ
గమ్భీరనీరాన్తరాళోగ్రకుమ్భీరసంరుద్ధకుమ్భిసంరక్షణాదమ్భసంరమ్భసమ్భాసమా
నాయ సమ్మోదితాశేషదీనాయ నీరేజగర్భాణ్డభాణ్డచ్ఛటాపూరితోద్యత్పిచణ్డాయ
సఙ్గ్రామకేళీప్రచణ్డాయ సృష్టిస్థితిధ్వంసనప్రక్రియాహేతవే పక్షిరాట్కేతనే పద్మ
నాభాయ ప్రావృడ్ఘనాభాయ సద్భక్తసంరక్షణామోఘవిద్యాప్రపీణాయ వేదప్రమా
ణాయ సంసారదుర్వ్యాధి వైద్యాయ వేదాన్తవేద్యాయ నిర్వాణసామ్రాజ్యలక్ష్మీప్రదా
త్రే ప్ర్రజానాథపిత్రే నమో విష్ణవే భాగ్యవర్ధిష్ణవే కృష్ణరూపాయ విశ్వస్వరూపాయ
తుభ్యం నమ శ్శఙ్ఖచక్రాసికౌమోదకీశార్ఙ్గహస్తాయ లోకప్రశస్తాయ తుభ్యం నమ
స్సర్వకామార్థసంస్థాయినే సర్వభూతాన్తరస్థాయినే సర్పపూర్భావనారాయణ
స్వామినే సిన్ధుజాకామినే సర్వలోకైకకర్తే నమ స్సర్వహర్తే నమో వాసుదేవాయ
దేవాదిదేవాయ తుభ్యం నమస్తే నమస్తే నమః.

33


మ.

పురుహూతప్రముఖాఖిలామరశిరోభూషాగ్రరత్నచ్ఛటా
నిరవద్యానుపమప్రభోత్కరముహుర్నీరాజితాంఘ్రిద్వయున్
శరణం బొందెద నిన్ను నన్ను నెపుడున్ సంప్రీతి రక్షింపు సు
స్థిరకారుణ్యకటాక్ష సర్పనగరశ్రీభావనారాయణా.

34

క.

శతధృతిశతమఖముఖులున్, శ్రుతులుం గొనియాడలేనిచో నే నిన్నున్
నుతియింప నెంతవాఁడను, నతరక్షణదీక్ష సర్పనగరాధ్యక్షా.

35


క.

ఏ మనియెద నాభాగ్యము, నీముఖచంద్రోదయమున నెఱి నుప్పొంగెన్
నామానసార్ణవం బిపు, డోమహనీయ ప్రభావయోగిశరణ్యా.

36


వ.

మహాత్మా భవదాలోకనప్రసారణదవానలంబున మదీయపూర్వజన్మసంభృతకిల్బి
షారణ్యంబు దగ్ధం బయ్యె భవదీయకృపాపూరప్రసారణంబున నఘానలతప్తంబులగు
నింద్రియంబులు ప్లావితంబు లయ్యె నింక మదజ్ఞానఘనధ్వాంతవిభాకరుండ వగునిన్ను
నెప్పుడు ధ్యానం బొనర్చెద నీయనంతకల్యాణగుణానీకం బనవరతంబుఁ గీర్తించెద
భవద్భక్తపదాంభోజదర్శనమనోరథుండ నై మూఁడులోకంబుల సంచరించె నని
ప్రార్థించుచున్న నారదునకు భగవంతుం డిట్లనియె.

37

నారదునకు విష్ణు వనుగ్రహంబుఁ జూపుట

సీ.

నీయభిప్రాయంబు నే నెఱుంగుదు వత్స, సకలభూతాంతరాత్మకుఁడ నైన
నా కెద్దియును గానరాకుండునది లేదు, నామాయఁ దరియింప నాకులకు మ
హర్షుల కైన శక్యంబుగా దిట్లు లో, కుల కిది దెలుపుట కొఱకుఁ బూని
యే నీ చేతఁ జేయించితి నింక నీ, వళుకక స్ధైర్యంబు గలిగియుండు


తే.

ధరణి నీపేర నీసరోవర మశేష, పాతకవ్రాతనాశకమై తనర్చు
నిజ్జలంబుల మునిఁగినసజ్జనుండు, పొసఁగ నఖిలశుభంబులఁ బొందుఁజుమ్మి.

38


తే.

అమితకలుషాకరం బగు నట్టిస్త్రీత్వ, మాగతం బయ్యె నిత్తటాకావగాహ
నమున నటు లైన నిది భవన్నామకమున, వఱలుఁబో నీవు మద్భక్తవరుఁడ వగుట.

39


తే.

ఇత్తటాకంబు మది స్మరియించుజనుల, కభిలకలుషాపహరణంబు యతికులేంద్ర
సంతసంబున మునిఁగెడు స్నాతజనుల కెల్ల నిది పుత్త్రసంపత్సమృద్ధిదంబు.

40


క.

విను మత్సంకల్పంబున, మునివల్లభ నీకు స్త్రీత్వము ఘటిల్లె నటుల్
జనులు మత్సంకల్పం, బునఁ గడుశుభసంతతులను బొందుదురుసుమీ.

41


తే.

మునికులోత్తంస యద్భుతంబుగను నీకు, నంగనాత్వవినిర్ముక్తి యయ్యెఁ గాన
నది ధరిత్రీస్థలిఁ బ్రసిద్ధ మగుచు నెపుడు, ముక్తికాసార మనుపేర మొనసియుండు.

42


క.

ఇచ్చెఱువున మునిఁగినజనుఁ, డచ్చెరువుగ దురితరహితుఁ డై శుభఫలముల్
గ్రొచ్చుకొని యనుభవించుచు, విచ్చలవిడిఁ బుత్త్రపౌత్త్రవృద్ధిఁ జెలంగున్.

43

క.

ఇది మొదలుగ నీసరసిన్, ముదమునఁ గ్రుంకు లిడుజనుఁడు ముక్తుండై మ
త్పదమునకు నరుగుఁ గొదుకక, తుది భవబంధములఁ బాసి ద్రుహిణతనూజా.

44


తే.

సిద్ధముగ ముక్తికాసారజీవనావ, గాహన జనాఘనిచయ మొక్కటను నూర్పు
లూర్చుచును రోదనంబు సేయుచును జాల, నద్భుతముగఁ బలాయితం బగుచు నుండు.

45


తే.

గణుతి యొనరింప మూఁడులోకములయందుఁ, బావనము లైనతీర్థంబు లేవి గలవ
వన్నియును నిందు వసియించు నహరహంబు, నమరమునిచంద్ర విను సంశయంబు లేదు.

46


తే.

అవని మానవుఁ డిచ్చ లే కైన నీస, రోవరోదక మించుక గ్రోలెనేని
యాక్షణంబున వెసఁ బలాయనము నందు, బ్రహ్మహత్యాదికము లైన పాతకములు.

47


తే.

ముక్తికాసార మనుపేరు మొనసి మనుజుఁ, డాత్మలోపల స్మరియించు నంతమాత్ర
మున నశేషాఘభవబంధములను బాయు, స్నానఫల మేమి చెప్పుదు సంయమీంద్ర.

48


తే.

గ్రహణవేళల విషువసంక్రాంతితిథుల, నయనములయందు మూలాన్వితాహములను
దవిలి స్నానం బొనర్చినధన్యుఁ డొందు, నశ్వమేధసహస్రసమ్యక్ఫలంబు.

49


తే.

పూషుఁడు మకరస్థుం డైనపుడును మాఘ, మాసములయందు నాదిత్యవాసరముల
హరిదినంబుల స్నాన మం దాచరించు, ఫలము వాక్రువ్వ నజనకు నలవి గాదు.

50


సీ.

ఇమ్ముక్తిసరసీతటమ్మున విమలోద, కములచేత నివాపకరణ మాచ
రించుటవలనఁ బితృశ్రేణులకు ముక్తి, కరతలస్థం బయి పరఁగు జహ్ను
తనయాదిపుణ్యతీర్థములనివాపాంజ, లులచేత నయ్యెడుఫలము జనుల
కిచ్చట సిద్ధించు నెన్నంగ గంగాది, పుణ్యతీర్థము లెన్ని భువిని గలుగు


తే.

నన్నియును నిందు వసియించు నహరహంబు, ఘనతరంబుగ నాదుసంకల్పమునను
బితరులకు నెవ్వఁ డిచ్చోటఁ బిండ మొసఁగు, నతఁడు తరియింపఁజేయు స్వపితృజనులను.

51


క.

వటవిటపిక్రింద గయలోఁ, బటుమతిఁ బిండంబు విష్ణుపదమున నిడుమేల్
ఘటియించు ముక్తిసరసీ, తటమునఁ బిండం బొసంగు ధన్యాత్ములకున్.

52


తే.

అఖిలయజ్ఞభోక్త నైననే నిచ్చట, నధివసించి జనుల కఖిలఫలము
లొసఁగుచుందు వినుము యోగికులోత్తమ, మహిమ విస్తరిల్ల నహరహంబు.

53

క.

నీమీఁదిప్రేమమున నిం, దోమునివర విలిచియుందు నుర్వి జనులచే
నేమమునఁ బూజగొనుచు మ, ఱే మిఁక దుర్లభము జనుల కిలఁ గల దరయన్.

54


క.

నారద యిమ్ముక్తిసర, స్తీరంబునఁ జేయుజప ముచితదానంబుం
బేరిమి నప్పుడె జనులకు, సారం బైనట్టిఫలము సమకూర్చుఁజుమీ.

55


సీ.

విను మింక మాటలు వేయు నేల మునీంద్ర, గురుతల్పగసురాపగోఘ్నమాతృ
హులుఁ బరదారరతులు భ్రూణహులును బ్ర, హ్మఘ్నులుఁ గనకాపహరణు లాది
గలమహాపాతకు లెలమి నీసరసీద్వ, యంబున స్నానంబు లాడిరేని
యప్పుడే వారు ఘోరాఘనిర్ముక్తులై, సురుచిరైశ్వర్యంబు సుతసమృద్ధి


తే.

యాయురారోగ్యసంపద యతిశయిల్ల, నంత్యమున విష్ణులోకసౌఖ్యానుభవని
రంతరామోదమేదురస్వాంతు లగుచు, నలరుచుందురుసుమ్ము తథ్యంబు గాఁగ.

56


వ.

అని యిట్లు భగవంతుం డానతిచ్చిన నారదుం డమ్మహానుభావున కిట్లని విన్నవించె.

57


తే.

అభవ మద్భావమాలిన్య
మపహరించు, కొఱకు నీ విలఁ బ్రఖ్యాతి మెఱయ నిందు
భావనారాయణస్వామి వై వసించి, యున్నవాఁడవుగద భువనోపకృతిగ.

58


తే.

రమ్యపాదపనివహవిరాజితంబు, పావనం బైనయీసరోవరతటమున
రూఢి మీఱంగ నర్చాస్య రూపమునను, వనజలోచన నీ వుండవలయుఁజుమ్మి.

59


వ.

అయిన నిన్నుఁ బ్రతిస్థాపితుం జేసెదనని యుత్సహించెద దానంజేసి నాకు నిద్దోపంబు
పరిహరం బగు భవత్కటాక్షవిక్షేపంబునఁ బ్రసిద్ధుండ నగుదుఁగదా యని విన్నవించిన
జనార్దనుండు వెండియు నతని కిట్లనియె.

60


తే.

మున్న చెప్పితిఁ బన్నగముఖ్యుఁ డైన, యయ్యనంతుని కిమ్మాట నెయ్య మలర
నట్లు గావున నిచ్చోట నధివసింతు, నట్లె కావింపు మిఁక మునీంద్రాగ్రగణ్య.

61


వ.

అని యాశ్రితాధీనవర్తనుం డగుగరుడధ్వజుం డానతిచ్చిన లోకానందకరం బైనవాక్యం
బఖిలంబు నాకర్ణించి పరితుష్టుఁ డగుచు నమ్మునిశ్రేష్ఠుండు ప్రతిష్ఠావిధానంబుఁ బ్రయ
త్నంబు సేసె నని శౌనకున కగస్త్యుం డెఱింగించినఁ గ్రమ్మఱ నతం డతని కిట్లనియె.

62

నారదుఁడు భావనారాయణునిఁ బ్రతిష్ఠ సేయుట

క.

ఆరయ నఖిలజ్ఞుం డగు, నారదమునివరుఁడు భావనారాయణు ల
క్ష్మీరమణీరమఃణునిఁ దా, నేరేతిఁ బ్రతిష్ఠ సేసె నెఱిఁగింపఁగదే.

63

వ.

విస్మయానందకారణం బగుప్రతిష్ఠావైభవంబు నాకుం దెలుపు మనినఁ గలశోద్భవుం
డిట్లనియె.

64


క.

శంభుఁడు జంభవిరోధియు, నంభోజభవుండు శశియు నర్కుఁడు దివిజుల్
రంభాదులు మునులున్ సం, రంభంబున వచ్చి రపుడు రహి నచ్చటికిన్.

65


వ.

అప్పు డజజుండు నభోమాసంబున శుక్లపక్షంబున గురువాసరంబున సింహలగ్నంబునఁ
గనత్కనకప్రాకారసంవృతంబును రత్నగోపురవిరాజితంబును జిరత్నరత్నఖచితవిత
ర్దికాసోపానమండపకుట్టిమద్వారబంధబంధురంబును మణిస్తంభసహస్రభాసితంబును
విశ్వకర్మనిర్మితంబు నగుమహనీయప్రాసాదాంతరంబున సముత్తుంగభద్రసింహాసనం
బున శ్రీమద్భావనారాయణదేవు లక్ష్మీసమేతు విధ్యుక్తహకారంబున సంస్థాపితుం జేసె
నయ్యవనరంబున.

66


సీ.

దేవదుందుభిమహారావంబు లెసఁగె గం, ధర్వకిన్నరులు గీతములు వాడి
రప్సరోభామిను లదనొప్ప నాడిరి, జలదముల్ పుష్పవర్షంబు గురిసె
మునులు సామామ్నాయముల వినుతించిరి, మునుకొని శుభతూర్యములు సెలంగె
ననిమిషుల్ జయజయధ్వనులతోఁ గీర్తించి, రనుకూలగంధవాహములు వీచె


తే.

నంత బ్రహపురందరాద్యమరవరులు, నారదాదిమహామునినాయకులును
భావనారాయణస్వామి దేవదేవుఁ, బ్రీతిఁ బొగడిరి మంగళగీతములను.

67


వ.

వెండియు నద్దేవు నిట్లని వినుతించిరి.

68

దివిజమునిముఖ్యులు స్వామిని నుతించుట

తే.

దేవదేవ జనార్దన దివిజవినుత, యఖిలలోకైకకారణ యప్రమేయ
భూతభవ్యభవన్నాథ భువనవంద్య, వేదవేద్య రమాధీశ విశ్వనిలయ.

69


సీ.

దివి మస్తకము చంద్రదినకరుల్ కన్నులు, వహ్ని ముఖంబు దేవతలు భుజము
లవని యంఘ్రులు విహాయసము పొక్కిలి దిశల్, శ్రవణంబు లామ్నాయసమితి వాక్కు
లనిలుఁడు ప్రాణంబు యముఁడు మానసము నా, కంబు కంధరమును గచభరంబు
భారతి నాలుక పాథోనిధులు కుక్షి, క్రతుభుక్చికిత్సకుల్ కటితలంబు

తే.

గాఁగ విశ్వస్వరూపి వై కరము మెఱయు, చుండు నీమేన నలినగర్భాండభాండ
మండలు లుదుంబరఫలోపమానము లయి, వెలయుచుండుఁగదా జగద్వినుతచరిత.

70


వ.

అనంతబ్రహ్మాండసంఘాతంబు లెవ్వనినిశ్వాసోచ్ఛ్వాసద్వయంబున విడువం బడుచు
నాహరింపంబడుచుండు నెవ్వనినిమేషోన్మేషంబుల నఖిలలోకసముదయం బడఁగుచుం
బొడముచుండు నట్టియఖిలలోకశరణ్యుండ వగునట్టినీకు నమస్కారంబు.

71


తే.

అమరవరులకు నైన మహర్షిజనుల, కైన నీమాయఁ గడవ శక్యంబు గాదు
హీనమతు లగువారి కిం కేమి చెప్ప, భక్తవత్సల జగదీశ పరమపురుష.

72


తే.

మౌనిజనవంద్య మమ్ము నీమాయవలన, దాఁటఁగాఁ జేయు మేతదర్థంబు నిన్ను
శరణుఁ గంటిమి నీపాదజలజయుగము, కన్న మా కన్యసాధనం బెన్నఁ గలదె.

73


క.

శరణాగతజనభయసం, హరణాయ సమన్తమునిజనార్చితశుభకృ
చ్చరణాయ నిత్యనిర్మల, కరుణాయ సుధీనుతప్రకరణాయ నమః.

74


వ.

అని యిట్లు బహుప్రకారంబుల నద్దేవదేవుం బ్రణుతించి మఱియు శ్రీమహాలక్ష్మి నిట్లని
వినుతించిరి.

75

దివిజమునిముఖ్యులు లక్ష్మిని నుతించుట

క.

కమలా బుధజననుతపద, కమలా కరధృతనవీనకమలా విలస
త్కమలావాసిని మము నీ, విమలకృపాలోకనమున వీక్షింపఁగదే.

76


తే.

మణిమయస్వర్ణపూర్ణకుంభములు పూని, తవిలి యిరుగడఁ గరికులేంద్రములు గొల్వఁ
జామరంబులు పూని నిర్జరవఘాటు, లెలమి భజియింప నలరు నిన్ గొలుతు మంబ.

77


ఉ.

నీకరుణావిలోకనము నిల్పినచోఁ గులహీనుఁడున్ హయా
నేకపహేమచామరమణీరమణీయవిభూషణాదికా
స్తోకవిభూతిఁ జెంది పరిశుద్ధకులుం డన మించు లేనిచో
నాకనివాసుఁడున్ వెతల నందుఁ గదమ్మ జగత్కుటుంబినీ.

78


చ.

ఉవిద లనంగుఁ డంచు విబుధోత్తము లర్కతనూజుఁ డంచు శా
త్రవులు కిరీటి యంచు వనుధాజనులెల్లఁ బ్రభుం డటంచు బాం
థవులు సముద్రుఁ డంచు వితతంబుగ నెన్నుదు రెట్టిదుర్జన
ప్రవరుని నైన నీకరుణ పర్వినవాని సరోజగేహినీ.

79

మ.

పురజిద్దానవజిత్సుధాశనవరాంభోధీశయక్షాధిపా
శరరాడ్వహ్నిసరేతరాజమరుదీశానాదికం బైనయీ
సురబృందంబు భవత్కృపాగరిమ నక్షుద్రప్రభావంబుతో
నిరవొందుంగద కేశపాశజితమత్తేందిందిరా యిందిరా.

80


క.

ఓజనని నీవు గలచో, నేజాతివిహీను నైన నిలఁ గొలుతురుగా
రాజులుఁ గవిరాజులు బుధ, రాజులు గమికట్టి కడలిరాయనిపట్టీ.

81


చ.

మతి మఱ పూను నుస్సురను మందతఁ జెందుఁ గృశించు మాటికిన్
వెత పడు నీచవర్తనుల వేఁడఁగఁ జూచు విధిన్ నళించు లో
ధృతి చెడి క్రుంగుఁ జెంగగొను నెట్టిమహోన్నతుఁ డైన నీ జగ
ద్ధితకరుణారసప్లుతనిరీక్షణ మబ్బనివేళ శ్రీసతీ.

82


చ.

అతితరవేదశాస్త్రనిగమాంతపురాణకథావిధానవి
శ్రుతుని దరిద్రుఁ జేయుదువు చూడ నికృష్టుఁ బ్రకృష్టభాగ్యసం
యుతునిఁగఁ జేయుచుండుదు వహెూ పరికింప జగంబులందు న
ద్భుతముగదమ్మ నీమహిమ తోయజనాభవిలాసినీమణీ.

83


సీ.

కదసి ని న్నిల్లాలిఁ గాఁ జేసికొనిగదా, హరి పురుషోత్తముం డనఁగఁ బరఁగెఁ
దివిరి నీతోడ నుద్భవము నొందుటఁ గదా, శశికి రాజత్వంబు సంభవించెఁ
గోరి ని న్గారాపుఁగూఁతుఁ గాంచుటఁగదా, వనరాశి రత్నాధివాస మయ్యెఁ
దర్కింపఁ నీకు నందనుఁ డౌటచేఁగదా, మారుండు మోహనాకారుఁ డయ్యె


తే.

నహహ భవదీయదివ్యమాహాత్మ్య మెన్న, నలవి గాదు గదమ్మ శేషాహి కైనఁ
గలితశుభగాత్రి పరిచితకాళరాత్రి, సకలలోకైకజనయిత్రి జలధిపుత్త్రి.

84


వ.

అని వినుతించుదివిజమహర్షివరులం గనుంగొని యానందోత్ఫుల్లమానసుం డగుచుఁ
బితామహుం డిట్లనియె.

85

బ్రహ్మ దేవాదులకు హితంబు బోధించుట

సురలార పరమసంయమి, వరులార సమస్తభువనవంద్యుం డగునీ
హరి నీక్షింపుఁడు మీకుం, జిరతరశుభఫలము లిపుడె చేతికి వచ్చున్.

86


క.

కనుఁగొనుఁ డిద్దేవుని లో, చనములు గలఫలము పూజ సలుపుఁడు కరముల్
దనరుటకు ఫలము జిహ్విక, యొనరుటకు ఫలంబు పొగడుఁ డురగశయానున్.

87

తే.

శ్రుతులు గలఫల మిమ్మహోన్నతునికథలు, వినుఁడు చరణద్వయంబు గల్గినఫలంబు
పాయక ప్రదక్షిణంబులు సేయుఁ డుత్త, మాంగము గలందులకు మ్రొక్కుఁ డచ్యుతునకు.

88


తే.

వినుఁడు సురలార మునులార వీను లలర, భావనారాయణునకు సద్భక్తితోడ
ధరణిఁ జాఁగిలి మ్రొక్కిన ధన్యతముఁడు, నిఖిలలోకైకపూజ్యుఁ డై నివ్వటిల్లు.

89


క.

ముద మొదవఁగ నీస్వామికిఁ, గదసి ప్రదక్షిణము భక్తిఁ గావించుమహా
సదమలతరమానసులకుఁ, బదపదమున నశ్వమేధఫలము లభించున్.

90


తే.

భృగుదినంబున నీజగద్విభుని నెవ్వఁ, డవిరళంబుగ నభిషేక మాచరించు
వాఁడు నిస్తులశాశ్వతైశ్వర్యధుర్యుఁ, డగుచు ధాత్రీతలంబున నతిశయిల్లు.

91


తే.

అవని నెవ్వండు భావనారాయణునకుఁ, గుసుమమాలిక లర్పించుఁ గోర్కి మీఱ
నతఁ డదభ్రసుఖావహం బైనయట్టి, దివ్యదేహంబు దాల్చి నర్తించు దివిని.

92


తే.

భావనారాయణాహ్వయస్వామిమ్రోలఁ, గడఁగి మంగళదీప మేఘనుఁడు నిలుపు
నతనిఘోరాఘనిచయంబు లళికి యుఱకుఁ, గమలమిత్రోదయమునఁ జీఁకటులువోలె.

93


తే.

గుడపయోఘృతమిశ్ర మై గుబులుకొను హ, విష్య మెవ్వాఁడు స్వామి కర్పించు భక్తి
వితతముగ నాతఁడు పునరావృత్తిరహిత, శాశ్వతబ్రహ్మలోకైకసౌఖ్య మొందు.

94


క.

ఇద్ధరణీధరుప్రసాదము, శుద్ధాత్ముం డగుచు ముదము సొం పెనలారన్
సిద్ధార్థమాత్ర మెవ్వఁడు, సిద్ధంబుగ మెసఁగు నతఁడు సిద్ధార్థుఁ డగున్.

95


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

96


సీ.

భావనారాయణదేవుని సేవింపఁ, దప్పక యేఁటేఁటఁ దవిలి యేను
సంతసంబున ధనుస్సంక్రమణంబుల, వాణీయుతుండనై వచ్చుచుందు

మీరును దప్పక దారనమేతు లై, వాలెంబు నిచటికి వచ్చుచుండి
యిద్దేవు దర్శించి యెలమి బ్రదక్షిణ, నతినుతిపూజాభిరతుల నలరఁ


తే.

జేయుచుండుఁడు పూజ్యతఁ జెంది కడుఁ గృ, తార్థు లయ్యెద రెవ్వఁ డీహరికి ధన్వ
మాసమున నించుక హవిస్సమర్పణంబు, చేసెనేని యతం డొందు సిద్ధపదము.

97


తే.

ఒనర నుత్తరఫల్గునీయుక్త మైన, హరిదినంబున వృషభంబునందు నినుఁడు
మలయునప్పుడు వైశాఖమాసమునను, రండు మీ రిందు మరలఁ బెంబండువుగను.

98


సీ.

వచ్చి మీ రందఱు వైశాఖమునఁ దార, సిలి యర్ఘ్యపాద్యాభిషేచనములఁ
జందనాగరుఘనసారకాశ్మీరక, ద్రవధూపదీపనీరాజనముల
మందారకేతకీమల్లికాచంపక, నవతులసీదళనివహములను
బనసరసాలరంభానారికేళఖ, ర్జూరకాదికఫలస్తోమములను


తే.

భక్తి దైవాఱఁ బానీయభక్ష్యభోజ్య, లేహ్యచోస్యాదికముల నాళీకనేత్రు
భావనారాయణుని మహాప్రభునిఁ దృప్తుఁ, జేసి తత్కృప వడయుఁ డీప్సితము లొదవు.

99


తే.

భావనారాయణార్పితపావనప్ర, సాదములు గొని చనుఁడు మీస్థానములకు
నివ్విభుననుజ్ఞు వడసి యేఁటేఁట నిట్లు, వచ్చుచుండుఁడు నియమంబు వాటిలంగ.

100


తే.

భావనారాయణుని మహాప్రభుని నీశు, భాసురం బగువైశాఖమాసమునను
గనుచుఁ బొగడుచు నుతుల నర్చనల నిడుచు, జనుఁ డభీష్టఫలంబులు నెనయుఁజుండి.

101


వ.

అని తెలుపుచున్న యప్పద్మసంభవునకు దివిజమహర్షిపుంగవు లిట్లని విన్నవించిరి.

102


సీ.

అఖిలాండనాయక యజ్ఞగర్భ సమస్త, నిర్జరనాథ వాణీసహాయ
భావనారాయణదేవుని సేవించి, సంతుష్టుఁ జేయ మే మెంతవార
మీవె సమర్ధుఁడ వీక్షణధ్యానస, న్నుతీసపర్యానమస్కృతులయందు
నైన నీయాజ్ఞ గాదనక ప్రత్యబ్దంబు, వాలెంబు నిచటికి వచ్చి దేవ


తే.

దేవు బ్రహ్మాండనాయకు దివిజవంద్యు, నిందిరాధీశు సనకసనందనాది
పరమమునిగేయు బుధజనభాగధేయుఁ, గరము భజియించెదము భక్తవరద యనఘ.

103


వ.

మఱియు నుత్ఫుల్లగండస్థలయుగళుండును బుండరీకదళాయతేక్షణుండును దరస్మిత
చంద్రికావికాసాపసారితకలుషాంధకారుండును శంఖచక్రగదాభయప్రదర్శకభుజో

జ్జ్వలుండును దనుమధ్యుండును శ్రీవత్సకౌస్తుభాంభోధితనయావానతనుమధ్యుండును జగ
జ్జనధరుండును బీతకౌశేరేయవాసుండును శారదాంభోజనీకాశపదద్వయరాజితుండును
సర్వప్రభుండును నగుశ్రీమద్భావనారాయణమహాప్రభుసేవార్థంబు కళత్రబాంధవో
పేతుల మై ధనుర్మాసవైశాఖమాసంబులు నీవెంబడి వచ్చుచుండెద మని విన్నవించు
చున్నసమయంబున శంభుండు భావనారాయణస్వామి నిట్లని వినుతించె.

104

శంభుఁడు భావనారాయణస్వామిని నుతించుట

తే.

మహియు సలిలంబుఁ దేజంబు మారుతాభ్ర, ములు మనోబుద్ధ్యహంకారములును భిన్న
సరణు లయ్యు నభిన్నతఁ బరఁగి యేమ, హామహునిరూప మయ్యె నయ్యనఘుఁ గొలుతు.

105


వ.

మఱియు నాబ్రహ్మస్తంబపర్యంతంబు స్థావరజంగమాత్మకం బగుజగం బెవ్వనిలీలాపరి
కరం బట్టినీకు నమస్కారంబు నేనును జతుర్ముఖసోమసూర్యపురందరాదిసమస్తదేవత
లు నెవ్వనితనుభూతంబుల మైతి మట్టినీకు నమస్కారం బీశ్వరత్వాభిమానుల మగు
మముబోంట్లఁ బ్రతిబోధించుటకై నారదునకు స్త్రీత్వంబును బురుషసంసర్గంబును బుత్త్ర
శతోదయంబును దత్పంచత్వంబున నత్యంతదుఃఖంబును గల్పించి క్షణమాత్రంబున
గ్రమ్మఱ మహర్షిం జేసి పరతంత్రుండ వై పరఁగుచున్న నీమహత్త్వంబు తెలియ నెవ్వం
డర్హుండు నీవు నా కిట్టినిశ్చలబుద్ధి యొసంగు మని ప్రార్థించుచున్నసమయంబున
నారదుండు హరి కిట్లనియె.

106

నారదుండు హరిని వేఁడుకొనుట

తే.

భావనారాయణ కృపాబ్ధి దేవదేవ, నిఖిలలోకశరణ్య నే నిన్ను శరణు
నందుదు ననారతంబు నాయందుఁ గలుగు, వత్సలత నిందు నీ వుండవలయుఁజుమ్మి.

107


సీ.

పుణ్యమానసు లైన పురుషులచేత నా, రాధ్యమానుండ వై రహిని వా రొ
సంగుతత్తత్కాలసముచితారాధనం, బులఁ దృప్తిఁ బొందుచు నలర వారి
కీప్సితార్థఫలంబు లిడుచు శ్రీదేవియు, భూదేవి నీళయు భుజగవిభుడుఁ
బతగేంద్ర సేనేశ పరివారములుఁ గొల్వ, వైకుంఠమున నుండు వల నెనంగఁ


తే.

జిరతరంబుగ నిమ్మహాక్షేత్రమున వ, సించి యాశ్రితజనుల రక్షించుచుండు
సర్సపురవాస భువనరక్షణవిలాస, భావనారాయణ మహానుభావ దేవ.

108


క.

మంగళము నీకు శ్రితజన, మంగళదాయక మునీంద్రమానసవిలస
ద్భృంగాయమానవిగ్రహ, మంగళ మఖిలాండకోటి మహితపిచండా.

109

సీ.

మఙ్గళ మస్తు రమాముఖాబ్జపతఙ్గ, మఙ్గళ మస్తు భుజఙ్గశయన
మఙ్గళ మస్తు సామజరాజపరిపాల, మఙ్గళ మస్తు విహఙ్గగమన
మఙ్గళ మస్తు మన్మథసున్దరాకార, మఙ్గళ మస్తు కల్మషవిభఙ్గ
మఙ్గళ మస్తు కోమలదివ్యవిగ్రహ, మఙ్గళ మస్తు రథాఙ్గహస్త


తే.

మఙ్గళం తే కమలజాణ్డమహితజఠర, సర్పపురవాస భక్తరక్షణవిలాస
భావనారాయణప్రభువర సమస్త, మఙ్గళాని భవన్తు తే మదనజనక.

110


ఉ.

మంగళ మిందిరావిమలమానసనవ్యసరోరుహాళికిన్
మంగ మాశ్రితావనసమగ్రకళావిలసద్గుణాళికిన్
మంగళ ముగ్రదానవతమస్సమవాయకరాళహేళికిన్
మంగళ మండజప్రవరమంజులపాలికి దేవమౌళికిన్.

111


వ.

అని యనేకప్రకారంబులఁ బ్రార్థించుచున్న నారదమునీంద్రునకు భగవంతుండు మేఘ
గంభీరవాక్యంబుల నిట్లనియె.

112

భగవంతుండు నారదునియెడఁ బ్రీతుఁ డగుట

సీ.

నారద యిందు రమారమణీభూవ, ధూనీళలను వేడ్కతోడఁ గూడి
మానితచ్ఛత్రచామరపాణు లగుదివ్య, సూరిజనుల్ గొల్వ సుభగలీల
నాశ్రితావళి కీప్సితార్థము లొసఁగుచు, నురువైభవంబున నుండువాఁడ
భువి మదీయక్షేత్రములు నూటయెన్మిది, గల వందు సర్పనగరమహాప్ర


తే.

భావ మెంతయు నధిక మై పరఁగు దీని, యైదుకోసుల నుండుచరాచరములు
మత్స్వరూపంబులు నిజంబు మది నెఱుంగు, వినుతగుణగణ్య నారదమునివరేణ్య.

113


ఆ.

మూఁడుదినము లిందు ముద మొప్ప నెవ్వాఁడు, నిలిచియుండు భక్తి నివ్వటిల్ల
నజ్జనుండు శతసహస్రాశ్వమేధఫ, లంబుఁ జెందు నిశ్చయంబు గాఁగ.

114


క.

జనుఁ డీక్షేత్రము దర్శిం, చినఁ బుణ్యం బొదవుఁ బ్రణతిఁ జేసినఘనపు
ణ్యున కపవర్గము కరతల, మునకున్ వచ్చును నిజంబు మునివరతిలకా.

115


క.

నరుఁ డంత్యమునందుఁ గళే, బర మిచ్చట విడిచెనేని భవముక్తుం డై
పరమపదప్ర్రాప్తుం డగు, సరియొదవనిఠీవి నార్యజనులు నుతింపన్.

116

గ్రంథఫలాదిస్తుతి

వ.

అని యిట్లు భగవంతుండు నారదునకుం జెప్పి దివిజర్షివరులకు యథాస్థానంబులకుం బోవ
నాజ్ఞ యొసంగిన నంత బ్రహ్మాదిదేవతలును నారదాదిమహర్షులును భావనారాయణ

స్వామికి నమస్కారంబు లొసంగి చనిరి ముక్తికాసారనీరంబుల మునింగి
భావనారాయణదేవుని దర్శించిననరుండు శుభసంతతులఁ బొంది పునర్జన్మరహితుం
డగు నీక్షేత్రమాహాత్మ్యంబు వినిన వినిపించినఁ బఠించిన లిఖించిన నజ్జనుండు
విష్ణులోకప్రాప్తుం డగు నని కుంభసంభవుండు శౌనకునకుఁ జెప్పిన విని వసిష్ఠుం
డంబరీషున కెఱింగించిన నతం డత్యంతసంతుష్టాంతరంగుం డయ్యె.

117


సీ.

వల నొప్ప బ్రహ్మకైవర్తపురాణోక్త, మై సర్సనగరమాహాత్మ్య మలరు
నది యేను శాలివాహనశకాబ్దంబులు, పాటింప వేయునార్నూటడెబ్బ
దా ఱగుభావమహావత్సరంబున, భావనారాయణ దేవదేవు
నానతివలన ని ట్లాంధ్రం బొనర్చి యా, స్వామికి దేవతాచక్రవర్తి


తే.

కర్పణం బొనరించితి నధికభక్తి, నిమ్మహాపుణ్యచారిత్ర మిద్ధరిత్రి
నాసుధాకరతారార్క మగుచు సజ్జ, నోత్తములయిండ్ల నేప్రొద్దు నుండుఁగాత.

118


చ.

పరమకృపాలవాల నిజభక్తజనావనశీల యోగిహృ
త్సరససరోమరాళ దివిషన్మునిసంస్తుతిలోల దీనమం
దిరమురసాల సంప్రథితనిర్మలకీర్తివిశాల యక్షకి
న్నరనరసాధ్య ముఖ్యసుమనస్సముదాయనితాంతపాలనా.

119


క.

అక్షుద్రభుజపరాక్రమ, శిక్షితదైతేయ నిఖిలశిష్టవిధేయా
చక్షుఃకర్లకదంబా, ధ్యక్షాంగశయాన బుధవితాననిధానా.

120


తరలము.

దర సుదర్శనశార్ఙ్గనందకధారణా శుభకారణా
హరిహయప్రముఖాఖిలత్రిదశావనా మునిపావనా
సురవిరోధివరూథినీపరిశోషణా నతపోషణా
వరశకుంతకులాధినాయకవాహనా నవమోహనా.

121

గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితా
సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి
గంగనామాత్యపుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిసార్వభౌమప్రణితం బైనసర్పపురక్షేత్రమాహాత్మ్యం
బనుపుణ్యచరిత్రంబునందు సర్వంబును
దృతీయాశ్వాసము.