తృతీయాశ్వాసము
| |
కాంతోజ్జ్వలకస్తూ
రీకాశ్మీరాదిసరసరేఖాదృతభృం
గాకారస్ఫురదలకధ
రాకన్యాఫాలఫలక! రఘుకులతిలకా!
| 1
|
| తే. |
అవధరింపుము భూతదయాగరిష్ఠుఁ
దగువసిష్ఠునిఁ గని గౌతమాత్మజాతుఁ
డవలికథ యేమి వివరింపుఁ డనిన స్వామి
తెలిపినక్రమంబు విను మని తెలుపఁదొడఁగె.
| 2
|
రామసుగ్రీవమైత్ర్యాచరణాదివృత్తాంతము
| ఉ. |
వాలి ప్రతాపకేళిఁ గడువాలి కరాళితనాన నానలో
మాలి విరాళి హేళిసుకుమారుని మోహపుటాలి నైంద్రనీ
లాలి మదాలివేణి జవరాలి గ్రహింప నశక్తుపోలికం
దాళె మరుత్సుతుం డతని దండన సేయక తల్లియాజ్ఞచేన్.
| 3
|
| సీ. |
అగ్రజాగ్రహసమగ్రావమానపయోధి మరుదాత్మభవధైర్యతరిఁ దరించి
కాంతావియోగసంక్రాంతచింతావహ్ని హరివటూక్తిసుధాలహరి హరించి
ఘనరాజ్యరాహిత్యగతదుఃఖతిమిరంబు తరణిశిష్యునిమిత్రతను గలంచి
నిజపరాజయమనోంబుజరుజాగజరాజిఁ గేసరిశిశుసంగకేళి నొడిచి
|
|
| తే. |
తనరెఁ గాక హనూమత్ప్రధానుఁ డఖిల, కార్యధౌరేయుఁడై మీఱఁగా రవిజుఁడు
లేనిచోఁ జానమాని బల్కాన నాని, ప్రాణమూని మనోగ్లాని బ్రతుకఁగలఁడె?
| 4
|
| శా. |
కార్యాకార్యవిధిం బ్రధానుఁ డయి శోకధ్వంసనాయుక్తి నా
చార్యుండై బహుచింతితార్థఘటనాసంపత్తిచే దేవుఁ డై
ధైర్యోత్పాదనశక్తిదాత యయి నిత్యంబున్ మరుత్సూతి త
త్సూర్యప్రోద్భవుఁ బ్రోచె; దీనజనసంతోషప్రదుల్ గా బుధుల్.
| 5
|
| తే. |
తనకు గురుఁడైన ద్వాదశాత్మకుకుమారుఁ, డనుచు మైత్రిని బహుమైత్రి నలరఁజేసె
నాంజనేయుండు ధర్మాత్ము లైనవారి, కాత్మగురుబంధురక్ష నాయంబ కాదె.
| 6
|
| ఉ. |
ఉగ్రమతంగశాపకఠినోక్తుల వాలికి ఋశ్యమూకశై
లాగ్రముఁ జేరరామిఁ గుహనాకృతిధారుల నుగ్రభానుభూ
నిగ్రహబుద్ధిఁ బంపఁ దన నెమ్మది సర్వ మెఱింగి వీరలో
కాగ్రణి వాయుసూతి తెగటార్చె ననేకుల దుర్వివేకులన్.
| 7
|
| ఉ. |
ప్రాజ్ఞుఁడు తద్జ్ఞుఁ డుత్తముఁడు పావనమూర్తి మరుత్సుతుండు స
ర్వజ్ఞుఁడు గానిచోఁ దపసివాలకముల్ విలునమ్ము లున్నవం
చజ్ఞత నమ్మకున్న పవనాత్మజు నమ్మఁగఁ బల్కి మమ్ము మా
ప్రజ్ఞ లెఱింగి సత్యమృదుభాషల సంధి ఘటింప నేర్చునే.
| 8
|
| సీ. |
విద్వజ్జనంబులో విద్వచ్ఛిరోమణి కవులలో నుత్తమకవివరుండు
గాయకశ్రేణిలో గాయకశ్రేష్ఠుండు బలియురలో మహాబలసమగ్రుఁ
డలతపోనిధులలో నతులతపశ్శాలి బహుయోగిపటలలోఁ బరమయోగి
ధీమద్గణంబులో ధీమత్కులస్వామి గుణులలో లోకైకగుణధురీణుఁ
|
|
| తే. |
డఖిలవైరాగ్యపరులలో నతివిరక్తుఁ, డధికవీరులలోన వీరాధివీరుఁ
డప్రమేయుఁ డజేయుఁ డీయాంజనేయుఁ, డితని నుతియింపఁగలఁడె? భోగేంద్రుఁడైన.
| 9
|
| సీ. |
ఘనవిరక్తుం డైన గానవిద్యారాశి విజితేంద్రియుండైన వీరవరుఁడు
పటుశాంతుఁ డగురిపుప్రళయకాలహరుండు విద్యాధికుండైన వినయపరుఁడు
నతమనస్స్థాయి యైన మరున్మనోవేగి బహుకార్యవిదుఁడైన బ్రహ్మచారి
సౌశీల్యనిధియైన శాఖామృగస్వామి యతిబలైశ్వర్యాఢ్యుఁడగు నిగర్వి
|
|
| తే. |
యఖిలలోకజ్ఞుఁ డాత్మశక్త్యజ్ఞుఁ డమిత, కామరూపధరుం డైనఁ గామదూరుఁ
డనఁగ మీఱుననంతకల్యాణగుణవి, హారగుణసంగతులు త్రిలోకాద్భుకములు.
| 10
|
| క. |
లోకంబుల గలవేలుపు, లేకైకగుణప్రసక్తి నెంతయు ఘనతల్
చేకొనిరఁట తత్సకలగు, ణాకరుఁ డనిలజుఁడు కీర్తు లందుట యరుదే?
| 11
|
| తే. |
సకలదైవప్రభావముల్ సద్గుణములు, పరమసుజ్ఞానవైరాగ్యభక్తికరుణ
లతులకాంతిప్రతాపంబు లైక్య మొంది, పవననందనరూపమై పరిణమించె.
| 12
|
| సీ. |
సత్కర్మగతిఁ జూపె సద్బ్రహ్మచారియై పూర్వాశ్రమాచారభూతిఁ జెంది
భక్తి గన్పించె మద్భక్తాగ్రగణ్యుఁడై స్వాతంత్ర్యలీలావశత్వ మొంది
జ్ఞానంబుఁ బ్రకటించె జ్ఞానప్రభాసియై ప్రారబ్ధమాత్రానుభవత కొదవి
విరతిభావముఁ దెల్పె విరతిసంపన్నుఁడై జన్మప్రభృతి నన్యసంగ ముడిగి
|
|
| తే. |
స్వామిభృత్యనయోద్యోగసౌమ్యవినయ, ధర్మదాక్షిణ్యకార్యసంధానధైర్య
శౌర్యచాతుర్యముల నాత్మసరణిఁ దెలిపె, నఖిలలోకోపకారి యక్షాసురారి.
| 13
|
| క. |
కాంతారహితుని నిజకుల, కాంతారహితుని నితాంతకాంతస్నేహా
భ్యంకరులఁ జేసె శ్రీహను, మంతునిఁ జింతింప శక్యమా యని పలుకన్.
| 14
|
| క. |
భామిని శ్రీరఘునాథ, స్వామినిఁ దిలకించి మైత్రిసమ్మతి మిమ్మున్
సామీరి మైత్రి సలుపుట, యామీఁదటికథలుఁ దెలుపుఁ డని వేఁడుటయున్.
| 15
|
| శా. |
జంభారాతి శుభప్రదానకలనా సంభూతసంభావనా
హంభావక్రమణా త్రివిక్రమపదాబ్జంగుష్ఠవేగావధూ
తాంభోజాతభవాండభాండ బహిరుధ్యత్క్షీరరాశిస్రవ
ద్గంభీరాంబు ఘళం ఘళార్భటు లెసంగన్ రాఘవుం డిట్లనున్.
| 16
|
| క. |
చెవులకుఁ జవులగు హనుమ, త్కవిచంద్రునిపుణ్యకథలు కడువేడుకతో
సవిశేషములుగ నీ కిఁక, వివరించెన నెఱిఁగినంత విను మని యెల్లన్.
| 17
|
| చ. |
రమణిరొ! పూర్వచంద్రకళ రాహువు మ్రింగినచో జగంబునం
దమము సమగ్ర మౌనటులు దైత్యుఁడు నిన్ గొనిపోవ నామనం
బమికవియోగబంధురమహాంధతమిస్రనిమగ్న మైనచో
నిమిషము నొక్కచో నిలువనిల్కడ గానక కానలోపలన్.
| 18
|
| సీ. |
నిండుపున్నమరేలఁ బండువెన్నెలవేఁడికార్చిచ్చువెచ్చలఁ గ్రాఁగి క్రాఁగి
చిలుకతేజీరౌతుచెఱకుసింగిణివింటినారిమ్రోఁతలఁ దాల్మి తాఱితాఱి
యలరుపుప్పొడికుమ్ము కెలనఁ జల్లుచుఁ గ్రమ్ముచలువతెమ్మెరదొమ్మి సొలసి సొలసి
చెవులకు ములుకులౌ చిగురుమేపరిపుల్గు జిల్గుపాటలసూటి చెదరి చెదరి
|
|
| తే. |
నెగడునిట్టూర్పుసెగలచే వొగిలి నొగిలి, యిరవు దొరయనివిరహాబ్ధి నీఁది యీఁది
పిదప దరి గన్నగతిఁ గనిపింపఁ బంప, దరి గని వసించి యున్నఁ దత్సమయమునను.
| 19
|
| సీ. |
రాకేందుకరనిభబ్రహ్మసూత్రంబుతో మెలిగొన్న మౌక్తికావళులవాఁడు
పసిఁడికెంజిగిపట్టుపంచెపై సరిగంచు మొనయుముప్పేటక్రొమ్ముంజివాఁడు
నవరత్నఖచితకుండలశుభప్రభలతోఁ దళు కెక్కుచెక్కుటద్దములవాఁడు
బాలార్కశోణాస్యలీలతో సరిపోల్పఁదగు కేలిమేలికెందమ్మివాఁడు
|
|
| తే. |
పసిమిగోఁచియు ముంగేల మిసిమికంకణంబు ధరియించి నిజదేహనవ్యకాంతి
బయలు బంగారు గావించు బ్రహ్మచారి, యొకఁడు మాచెంత! కరుదెంచుచున్నఁ జూచి.
| 20
|
| ఉ. |
సోదరు నంటి యంటి సుగుణోత్తమ! కంటివె యల్ల కొండపైఁ
బాదము లూఁది డిగ్గి మదబంధురసింధురలీల నొయ్యనే
|
|
| |
యీదెస సుప్రసన్నశుభదృష్టిని జూచుచు వచ్చుచున్నవాఁ
డాదరణీయుఁ డీవటుకులాగ్రణిఁ జూడఁగ వేడు కయ్యెడున్.
| 21
|
| ఉ. |
బంగరుపట్టుగోఁచి మనుపచ్చనిముంజియు నొంటిజందెమున్
ముంగయికంకణంబు జిగిమోహనహారము కుండలప్రభా
భంగకపోలముల్ తరుణభానుసమానముఖాంబుజంబు మీ
ఱంగ వటుక్రియన్ శివుఁడు రాఁడుగదా మనచింత దీర్పఁగన్.
| 22
|
| తే. |
శివుఁడె కావలెఁ గాకున్నఁ జిన్నివటుక, పాపనివితాన మనలోనితాప మార్ప
మను మని యకృత్యము సహింప మనవి దెల్ప, వచ్చు వాణీశ్వరుండు గావలయు నితఁడు.
| 23
|
| ఉ. |
ఉక్తివధూసతీశ్వరుల నొక్కఁడు గా కితఁ డున్న నీశుభ
వ్యక్తియు నీవిరక్తి విభవాద్యనురక్తియు నీమహత్కళా
వ్యక్తముఖాబ్జయుక్తి కలదా? యితనిం గని మాటలాడఁగాఁ
బ్రాక్తనజన్మ పుణ్యపరిపాకవశంబునఁ గాక కల్గునే?
| 24
|
| ఉ. |
మచ్చిక కెక్కునిక్కపికుమారునిచారుశరీరకాంతిచే
నిచ్చటిచెట్టు లన్నియును హేమపువన్నియఁ జెన్ను మీఱె నే
నెచ్చటఁ గాన నిట్టిఘను నీతనిఁ జూచినయంత నిచ్చలో
హెచ్చె ముదంబు విచ్చె వెత లేమి విశేషము గల్గ నున్నదో!
| 25
|
| ఉ. |
ఇంగిత మాత్మలో నెఱిఁగి యే ననువాక్యము లాలకించి మ
మ్ముం గదియంగ వచ్చి కయిమోడ్పు లలాటమునం దమర్చి సా
ష్టాంగ మొనర్చి మచ్చరిత మంతయు లక్ష్మణుచే నెఱింగి మా
యంగద వాయ రంగదమృతాక్షరసంగ మెసంగ ని ట్లనున్.
| 27
|
| క. |
రావించెద సుగ్రీవునిఁ, గావించెద మీకు బంటుగా ననిశంబున్
సేవించెద మీపదములె, భావించెద మిమ్ము స్వామిభావమున నృపా.
| 28
|
| ఉ. |
కేసరి కంజనారమణికిం బవమానవరప్రసన్నతం
జేసి జనించినాఁడ నృపశేఖర! నన్ హనుమంతుఁ డండ్రు ప
ద్మాసనుఁ జేరి నాకు గతి యౌపతిఁ దెల్పు మటన్న నిమ్మెయిన్
భాసిలుభూషలం గనినభవ్యుఁడె పొ మ్మనియెన్ ధ్రువంబుగన్.
| 29
|
| ఉ. |
ఆచతురాస్యుఁ డాడినటు లాత్మవిభూషణపాళి నాకు దృ
గ్గోచరమయ్యె హా! మతిలఘుస్థితిఁ బల్కితి సర్వలోకలో
|
|
| |
కాచరిత్రక్రియల్ తెలియునంతటివి కొకక్రోఁతి ముంజియుం
గోఁచియుఁ గంకణంబు గనుఁగొంట విచిత్రమె లోకనాయకా!
| 30
|
| ఉ. |
వ్యష్టిసమష్టిభావములయందు నిరంతరసాక్షి వై సదా
సృష్టివివర్ధనప్రళయశీతలమాయ విజృంభణక్రియం
జేష్ట లొనర్పఁ గన్గొనెడుచిన్మయమూర్తిని నీవు నేఁడు నా
దృష్టికి గోచరించుట అదృష్టము గాదె? విశిష్టవైభవా!
| 31
|
| సీ. |
హృదయాంధకారంబు లెడలె మీముఖచంద్రు దర్శించుమాత్ర సీతాకళత్ర!
బహుపాతకశ్రేణి వాసె నీ నామంబు వాకునఁ బలుక నిక్ష్వాకుతిలక!
పరమపావన మయ్యె భవదంఘ్రియుగళంబు కెలనమే నొలయ సాకేతనిలయ!
కామితార్థము లెల్ల ఘటియిల్లె మిముఁ గూర్చి కమనీయగతి డాయఁ గౌసలేయ!
|
|
| తే. |
మొగిడె భవపంకజాతము మోడ్పుఁగేలు, మీ కొసంగినయంత లోకైకకాంత!
నెగడ నిత్యోత్సవశ్రీలు నిన్నుఁ గొల్చి, దండ వాయనిప్రేమఁ గోదండరామ!
| 32
|
| ఆ. |
అనుచు మమ్ము గనుచు ననుచు మనంబున, మనుచు మనుచు వేఁడుకొనుచు నున్న
యతనిభక్తియుక్తి కత్యనురక్తికి, నాత్మ కందళింప ననుజుఁ జూచి.
| 33
|
| ఉ. |
ఈకపికుంజరుండు వచియించినమాటలు వింటివే? నవ
వ్యాకరణార్థదీపకము లంచితశబ్దనిగుంభనక్రియా
స్తోకము లన్యథా శ్రుతవిశుద్ధపదాస్పదము ల్మనశ్శ్రవ
శ్శోకహరంబు లిట్టిగుణసుందరు నెందులనైనఁ గంటిమే?
| 34
|
| సీ. |
అమృతంబురుచి మోవి యర్థగంభీరసంపద నాభిసరసి కోమలత మేను
తిన్నఁదనంబుపొందిక మందగమనంబు చాతుర్యములు విలాసక్రమంబు
నుతిసంగతిత్రపాగతి నవోఢారూఢి యరుదైనయపశబ్ద మసదుఁ గౌను
కనిపించుతేట చక్కనిముద్దులేనవ్వు కనదనర్గళితశృంగారఝరము
|
|
| తే. |
రక్తపదపల్లవచ్చాయ రమ్యరీతి, సరసభావంబు నవలీలజవ్వనంబు
గాఁ జెలంగుహనూమన్ముఖప్రసక్త, వాణి వలపింపదే యెంతవారి నైన?
| 35
|
| చ. |
అని కొనియాడుచున్నసమయంబున వాయుజుఁ డేగి భానుజుం
గని ఘనశోకవార్ధి కడగాననీకుఁ గపీంద్ర! రాఘవుం
డనుదరిదాపు గల్గె నిఁక నాపదలన్నియుఁ దీఱె వేగ ర
మ్మని యిట వచ్చి మీభటున కర్కికి దర్శన మియ్యరే యనన్.
| 36
|
| క. |
ప్రేమలు నరవానరులకు, నేమించి సఖిత్వ మొసఁగు నేర్పున నౌరా!
యీమహి నఘటనఘటనా, సామర్థ్యము నీకె కలదు సామీరి హరీ!
| 37
|
| శా. |
ఈనిర్వ్యాజపరోపకారవిభవం బేనిత్యసత్యవ్రతం
బీనైపుణ్య మనన్యదృష్ట మని నే నెంచంగ లజ్జించుచున్
దా నెంతేఁ దగుభక్తిఁ దోడుకొని చెంతన్ ఋశ్యమూకాద్రిపై
భానుప్రోద్భవుఁ గానిపించె నితఁ డాపద్భేది సామాన్యుడే?
| 38
|
| శా. |
బంధుస్నేహధురీణుఁ డైనరవిజుం బాటించి వాలిన్ సురా
బంధుశ్రేష్ఠమదాపహారబలసంపచ్చాలిఁ దూలించి కి
ష్కింధాపట్టణపట్టబంధురునిఁగాఁ జేయింప నేఁ గంటిఁ ద
త్సంధానోచితవాగ్విధాననిధియౌ సామీరి చేకూరుటన్.
| 39
|
| చ. |
విను సుషేణముఖ్యకపివీరుల నిన్ వెదకన్ దినేంద్రనం
దనుఁ నొకకొందఱం బనిచి దక్షిణభూమికి నంగదాదులన్
బరువఁగ వారిలోఁ గలసి పావనియున్ జతగూడి పోవఁగా
ననిలజ! యిందు ర మ్మని ప్రియంబున డగ్గఱఁ బిల్చి పల్కితిన్.
| 40
|
| ఉ. |
నావిధ మంతయున్ జనకనందనతో వివరించి తొల్తఁ ద
జ్జీవన ముద్ధరించి మఱి సీతశుభస్థితి నాకుఁ దెల్పి మ
జ్జీవవిధాయి వై మరులఁ జేయుము తండ్రి! వివాహకార్యలీ
లావిధి నీదయన్ రఘుకులంబు పునర్జననంబుఁ జెందఁగన్.
| 41
|
| ఉ. |
అని మణిముద్రికామణి ప్రియత్వ మెసంగ నొసంగ భక్తిఁ గై
కొని శిరసా వహించి కనుఁగోనల నుంచి ప్రసాదమయ్య! నేఁ
జని త్రిజగంబులన్ వెదకి జానకిఁ గన్గొని కాని యూరకే
నినుఁ బొడఁగానరా నిదియె నిక్కము స్వామి! యటంచు మ్రొక్కుచున్.
| 42
|
| చ. |
బహుమతి మమ్ము వీడుకొని భానుజలక్ష్మణనంద్యమానుఁడై
సహచరవానరప్రవరసంఘముతోఁ జని పర్వతంబులన్
గహనములన్ మహానదుల గ్రామములన్ ఘనపట్టణంబులన్
బహునగరంలన్ నెమకి భామిని నిన్ గనలేకపోవఁగన్.
| 43
|
| స్రగ్ధర. |
రాణించెన్ వ్యాళరాజవ్రజరుచిరఫణారంగరంగన్మణిశ్రీ
శోణాభాయుక్తరంగశ్రుతకరకలనాసూచితానేకనాక
స్త్రైణస్తోకస్తనాగ్రస్థలఘుసృణఘృణిసంగగాంగప్రవాహ
శ్రేణీసంశ్లేషలీలాంచితతతగరిమన్ సింధురా జంతఁ జెంతన్.
| 44
|
| క. |
ఆకడలినీటి దాఁటఁగ, లే కడలి కపీంద్రు లలవు లెక్కించుకొనన్
జో కడలి జాంబవంతుం, డాకడ లివఁ జూపకున్న యనిలజుఁ బల్కెన్.
| 45
|
| సీ. |
ఘనసత్వసత్వరక్రమనిరూఢిఁ జెలంగి కవిసక్తజీవనఖ్యాతిఁ బొంగి
యవనిభృద్వరకుమారాశ్రయత్వముఁ గాంచి లలితప్రవాళలీలలు ధరించి
బహువాహినీగతిప్రాభవస్థితి మించి పరమగంభీరసంపద వహించి
బాడబస్ఫురణ రూపమునందు వెలయించి పుణ్యజనప్రాప్తిపొలుపు లెంచి
|
|
| తే. |
యనిలతనయ! సముద్రుండ వైననీకు
దుస్తరుఁడ నంచునో మ్రోయఁదొణఁగినాఁడు
ప్రతిఘటించునముద్రుండు భంగ మొంద
నిస్తరించి భవత్కీర్తి విస్తరింపు.
| 46
|
| మ. |
అన నుప్పొంగి మరుత్సుతుండు కపులారా! దుస్తరంబైన తో
యనిధిం దాఁటెద లంక మీటెదఁ దృణప్రాయంబుగా జానకిం
గసి వే వచ్చెదఁ గానకున్న జలధుల్ గాలింతు భూలోక మె
ల్లను దూలింతు నుడుప్రకాండ మిల వ్రాలన్ వంతు నాకాశమున్.
| 47
|
| శా. |
బాహాస్ఫాలన మాచరించి నిజరూపం బుద్ధతిం బెంచి కా
లాహీశానవిశాలవాలలత మస్తాగ్రంబు హత్తించి తే
జోహంకారత మించి వార్ధిపయిఁ జూ పానించి రార్క్ష్యానిలో
త్సాహశ్రీల రమించి రాము మదిలో ధ్యానించి హృష్టాత్ముఁ డై.
| 49
|
| లయగ్రాహి. |
అక్కడిసమీపగిరి యెక్కి శిఖరాగ్రధరఁ
ద్రొక్కి తదుగ్రశిలచక్కి కరముల్ రెం
డక్కరణి నూఁదికొని చక్కఁగ సురారెపురి
దిక్కు స్థిరదృష్టిఁ గని మిక్కుటపు వేడ్కన్
దక్కె మనభీతి యిఁకఁ జిక్కె దశకంధరుఁడు
స్రుక్కె దనుజాన్వయము నిక్కమని వేల్పుల్
దిక్కులఁ బ్రసూనముల స్రక్కు లొలయింప వడి
నెక్కొనఁగఁ బావని చివుక్కునను దాఁటెన్.
| 50
|
| మ. |
లవణద్వీపవతీశ్వరోత్తరణవేళాలోలవాలోల్లల
త్పవనప్రోద్ధతి భూపరాగము జగత్ప్రాణాత్మజుం గూడి పో
వ విలోకింపఁగ నొప్పెఁ గూఁతుఁ గనఁగా వాంఛించి భూదేవి వా
యువుపుత్రుం డట పోవ వెంటఁ జన నుద్యోగించెనో! నాదివిన్.
| 51
|
| మ. |
హృతబాలార్కుఁడు మెట్ట గ్రుంగి యెగయన్ హీనస్థితిం దేలి ప
ర్వతముల్ దూలముకన్నఁ జుల్కఁదనమున్ బ్రాపించి భగ్నంబు లై
క్షితిపై వ్రాలె ధృతిం ధరించి నెలవుం గేడించి బైనొందుని
ర్గతు లెందుం బడిపోవ కాత్మగతధైర్యం బూనఁగా నేర్తురే?
| 52
|
| ఉ. |
మాయవనీజఁ జూడఁ జనుమారుతికిన్ ఫలకోటిఁ దృప్తిగాఁ
జేయుద మీప్రయాణమున జేరువనే చని యంచు వెంబడిన్
బోయి దశాస్యునిం దలఁచి పోవ భయంపడి జాఱెనో యనన్
వాయుజుమై వెసన్ బెకలి వాయుగతిన్ జని కూలె సాలముల్.
| 53
|
| మ. |
హనుమద్వీరునిసింహగర్జనలచే నచ్చోటి కొండల్ ప్రతి
ధ్వను లిచ్చెన్ సురలార! మీకు భయముల్ వల్దింక నిశ్శంక భూ
తనయం జూడ దశాస్యుగర్వ మడఁపన్ దా నేఁగుచున్నాఁడు పా
వని యం చున్నతిఁ జాటుచున్నవొ! యనన్ వాగప్రమేయోద్దతిన్.
| 54
|
| ఉ. |
ఆలవణాబ్ధినీరు పవనాత్మజు మైవడిఁ బాయ సప్తపా
తాళములుం గనంబడియెఁ దద్దశకంఠుఁడు నాగబాలికా
జాలముతో స్వరత్నములు సర్వము గొంట రవచ్ఛలంబునన్
బోలఁగఁ దెల్పి లోఁ గలుగుపోడిమి వారిధి చూపెనో యనన్.
| 55
|
| మ. |
అఖిలాశ్చర్యకరప్రభావుఁ డతఁ డత్యాసక్తి లంకాపురో
న్ముఖుఁడై పోవ జగద్ధితార్థ మితఁ డెంతో దూర మి ట్లేఁగెడున్
సుఖయానంబు వహింపఁ జేయఁదగునంచున్ వార్ధి మైనాకుఁ డన్
శిఖరిం బంచిన నాతఁ డడ్డముగ రాఁ జింతించి చిత్తంబునన్.
| 56
|
| శా. |
అక్షీణోద్ధతి రామకార్యఘటనాహంకారినై పోవఁగా
రక్షోమాయఁ బ్రయాణవిఘ్నమునకై రాఁబోలు దీనిన్ ధృతిన్
శిక్షింపం దగు నంచుఁ గాంచనగిరిశ్రీ మించు మైమించుతో
నాక్షేపించి మరుత్కుమారుఁడు శిఖర్యధ్యక్షు దాఁకెన్ వెసన్.
| 57
|
| ఉ. |
మించులమించు బైటపడు మేటిగుఱాలవజీరుచేతి నూ
ఱంచులకత్తిపె ట్టెఱుఁగనట్టి మహాగిరిపట్టి యంతకున్
మించిన గాడ్పుచూలి బలుమే నొరయన్ ధృతి దూలి యంతలో
నించుక దేఱి క్రమ్మఱఁ గపీంద్రునిఁ జూచి మనుష్యుఁడై యనున్.
| 58
|
| మ. |
కపిలోకేశ్వర! సర్వలోకహితసత్కార్యార్థివై పోవునీ
కపకారం బొనరింప రా నుదధి నీయాత్రాశ్రమం బార్ప న
|
|
| |
న్నిపు డంపెన్ బహుకందమూలములచేఁ దృప్తుండ వై మార్గసం
గపరిశ్రాంతి దొఱంగి పొమ్మనుచుఁ బల్కన్ వాయుజుం డిట్లనున్.
| 59
|
| క. |
ఆకడ గని వచ్చెదనే, నాకుం దగ నేల? విడియ నడిసంద్రములో
నాకుం దగవే యని మై, నాకుం వగ నిల్పి పవననందనుఁ డవలన్.
| 60
|
| మ. |
స్వరధీశుల్ స్వపరాక్రమక్రమపరీక్షాబుద్ధిమైఁ బంప నం
బరవీథిం దనకంటె దీర్ఘ మగురూపం బూనఁగాఁ బూనఁగా
సురసాగర్భము సూక్ష్మరూపమున నచ్చోఁ జొచ్చి వేవ్రచ్చి కే
సరిపుత్రుం డుదరంబు వెల్వడియె నంచద్బాలభానుప్రభన్.
| 61
|
| క. |
ఆగ్రహమున ఛాయాగ్రహ, నిగ్రహ మొనరించి తోయనిధి దాటి సువే
లగ్రావాగ్రణ్యగ్ర ము, దగ్రజవారూఢి నెక్కి యనిలజుఁ డలరెన్.
| 62
|
| శా. |
ప్రత్యూహప్రచయం బడంచి ప్రకృతిప్రౌఢత్వ మోడించి సం
సృత్యంభోధిఁ దరించి గట్టు గని వాసిం జెందుయోగీంద్రునౌ
న్నత్యం బొంది తదంతికంబున ధరానాకంబొ! నా మీఱునా
దిత్యద్వేషిపురంబుడంబు హనుమద్దేవుండు వీక్షింపఁగన్.
| 63
|
సూర్యాస్తమయవర్ణనము
| చ. |
రిపుపరిభేదనంబు సవరించి ప్రతాపము మించఁగా ననం
తపదమునందుఁ ద్రిమ్మరి పదంపడి శక్తి బయల్పడంగ మో
హపుసతిఁ జేరు కాంతునిక్రియన్ నునుఁగెంపు నడంపుఁ గెంపుతో
నపరదిశాంగనం గదిసె నర్కుఁడు తీవ్రత మాని యయ్యెడన్.
| 64
|
| మ. |
చరమక్ష్మాధరగైరికప్రభల నాచ్ఛాదించి వైయచ్చరాం
బురుహాక్షీమణిహైమకంకణఘృణిస్ఫూర్తిన్ విడంబించి సా
గరరాట్తుంగకరంగవిద్రుమలతాకాంతిం బ్రదీపించె న
జ్జరఠార్కద్యుతి శోణమృత్కలన నాశాకుడ్యభాగంబులన్.
| 65
|
| చ. |
ఉదయధరాధరాగ్రమున నుండియు నస్తముఁ జెందఁ దాను ము
ప్పదిగడియల్ ప్రయాసపడుపద్ధతి నొక్కక్షణంబులోపలం
బదములు నిల్పినట్టిహనుమంతుఁడు చూడఁగ నెట్టు నిల్వఁబో
యెద ననుసిగ్గుచేబలె దినేంద్రుఁడు పశ్చిమవారి గ్రుంకినన్.
| 66
|
| చ. |
తడవుగ నెంతయేని వడి దవ్వుఁ జరించుటఁ జేసి మిత్రుఁ డ
బ్బడలిక దీర్పఁ జేరుటను బశ్చిమదిక్పతినిల్పువేడుకన్
|
|
| |
విడిది ఘటించి చుట్టు నొదవించిన చొక్కపుటింద్రగోపపుం
బెడఁగుసరాతిరీతిఁ గనిపించెను దద్దిశ సాంధ్యరాగముల్.
|
|
| సీ. |
సంచరద్యామినీచరవీరఘోరాంగముల మషిచ్ఛాయతో ముచ్చటాడి
సంకేతపదసమాశ్రయపాంసులానీలచేలకాంతులతోడఁ జెలిమి చేసి
వికసితేందీవరప్రకరచంచద్దళప్రత్యగ్రరుచులపై బారు దీఱి
గిరిగుహానిర్గచ్ఛదురుమత్తకరిఘటాచటులదేహశ్రీల సంస్పృశించి.
| 67
|
| తే. |
నయనయుగళసమున్మీలనంబువలన, బ్రాణితతి కప్రయోజనభావముగను
సూదిమొన కైన భేదింపఁ జో టొసగని, గాఢతిమిరంబు దిక్కుడుంగముల నిండె.
| 68
|
| తే. |
అభ్రఫలకంబు సకలశబ్దాదిదేవ, తావహం బవుటన్ సమయాఖ్యవిప్రుఁ
డర్చనావేళఁ జిలికింప నమరుచంద, నంపుఁజిదురుపలన నుడుల్ సొంపు మీఱె.
| 69
|
| చ. |
అలవిధిపేరియొజ్జలు వియత్ఫలకంబునఁ గాలబాలుకే
లలవడఁ జేయఁబూని వలయంబుగఁ జుట్టిన వానిలోపలం
బలుమఱు దిద్దఁగా మొదటిబా గఱి యంతయు నిండికొన్నసు
న్నలొ యివి నాఁగఁ దారలు గనంబడియెన్ బలుబంతు లేర్పడన్.
| 70
|
| చ. |
తనరుచి దిక్కుడుంగములఁ దార్కొనుచీఁకటిఁ ద్రోయఁబోక చం
దనదురురత్నకుండలయుగప్రభ లంబర మొందనీక య
ప్పెనుతిమిరంబు పెం పడర భీషణవేషము డాఁచి కొంచెమై
హనుమ యవిద్యవంక నసదైవములుండెడునాత్మ నాఁ దగెన్.
| 71
|
| క. |
నెలవునఁ బెన్నిధి దొరయం, దలఁచిన జనుఁ డితరజనులదందడి జడియన్
వలసినగతి నినుఁ గనుఁగొన, నలపురిసందడి యడంగ ననిలజుఁ డె౦చెన్.
| 72
|
| క. |
తఱి యెంచి పొంచి లంకా, పురియంతయుఁ గాంచి నిన్నుఁ బొడఁ గని పిదపన్
మెఱసినయనిలజుబల మీ, వెఱిఁగినదే యనుచు రాముఁ డింతికిఁ దెలిపెన్.
| 73
|
ఆంజనేయుని సీతాసందర్శనాదివృత్తాంతము
| క. |
అనిన నరుంధతి పెనిమిటిఁ, గని గౌతమసూతి పరమకరుణాకరపా
వని లంక వెదకి జానకిఁ, గనిచేసినబలిమిఁ దెలుపఁగాఁ దగు నన్నన్.
| 74
|
| తే. |
ఆవసిష్ఠుండు పలికె న ట్లాంజనేయుఁ, డసురపురి డాసి యసమసాహసవిలాస
భాసమానస్వభావుఁడై ప్రతిభటాళి, కలకలము వాయునందాఁకఁ గాచి యున్న.
| 75
|
| సీ. |
కోలాహలధ్వనుల్ కొంచెమై యటమీఁదఁ గోటవాకిటివారిగుఱుక లెచ్చెఁ
గటువార్త లెడలి యంతట దైత్యకాంతల కలువరింతలు వింత వెలువరించె
|
|
| |
సరసోక్తు లుడిగి విశ్రాంతిమై నట కూరు కొలయుదంపతులయూర్పులు సెలంగె
సకలేంద్రియోద్వృత్తి సడలి పిమ్మటఁ బౌరజనులరూపుల వివశత్వ మొందె
|
|
| తే. |
నట్టిసమయాన గజసమయాన నరయఁ, దత్తఱంబున నుత్తరద్వారమునను
జొచ్చి చనుచోట నెడ సొచ్చి వచ్చులంక, బింక మడఁగించి సామీరి పెంపు మీఱి.
| 76
|
| క. |
సాలముల సాలసాలర, సాలముల నిరుద్ధసురఖచరబాలనిశా
పాలికలకేళికాగృహ, పాళికల లతాంగి వెదకి పావని యవలన్.
| 77
|
| చ. |
పరుల కదృశ్యుఁడై యసురభర్తవిలాసగృహంబు చూచి త
త్పరిసరభూమి రమ్యమణిభర్మవినిర్మితనర్మహర్మ్యముం
దొరసి తదూర్ధ్వమం దరసి తోయరుహాననఁ గాన లేక వా
నరపతి కొంత చింతిలి మనంబున ని ట్లని యెంచె వెండియున్.
| 78
|
| ఉ. |
ఏలిక దొడ్డవాఁడ వని యెల్లకపుల్ విన సన్నుతిం చినన్
వాలికతోఁక పెంచుకొని వచ్చితి నిక్కము చూచి వచ్చెదన్
బాలిక నంచు నాప్రతిన భంగము గా సతిఁ గాన నన్విష
జ్వాలికవంటివార్త యిఁక స్వామికి నే మని విన్నవింపుదున్.
| 79
|
| సీ. |
క్రిందుమీఁదై యొడ్డగిలఁ జుల్కఁగాఁ గేలఁ గబలింతునొ! యజాండకర్పరముల
ఫణి ఘోణి ముదికఛ్ఛపమువీఁపుఁ బ్రాపింప నడఁగఁ ద్రొక్కుదునొ! హేమాచలంబుఁ
బూలపోలిక వాలలీల జల్లున నేల రాలఁజేయుదునొ! తారావ్రజంబుఁ
దొండముల్ దునిఁగి వేదండముల్ గీఁపెట్ట నొక్కచో వైతునో! దిక్కు లెల్ల.
|
|
| తే. |
నింతచేసిన బ్రహ్మరుద్రేంద్రవహ్ని
ముఖ్యదివిజాధినాయకుల్ ముదిత యున్న
నెలవు చూపెద రని యెంచి యలుకఁ బెంచి
హర్మ్యశిఖరాగ్ర మెక్కి యయ్యగ్రభూమి.
| 80
|
| ఉ. |
అక్షయపుణ్యశాలి మరుదాత్మజుఁ డయ్యెడఁ గాంచె శింశుపా
వృక్షము స్వప్రసూనపరివేష్టితకాంత్యరుణీకృతక్షపా
ధ్యక్షము ప్రత్యహస్స్ఫురదుదగ్రలతాగ్రనిరుద్ధభానుచ
క్రాక్షము నంధకారసృజనార్హదళాకలితాంతరిక్షమున్.
| 81
|
| ఉ. |
ఆయవనీజ మిట్లు గని యచ్చట సీతఁ గనం దలంచి హ
ర్మ్యాయతనంబు డిగ్గి మరుదాహతతద్గతకేతుఘంటికల్
మ్రోయుటలొప్పె సీత యిదె ముందరిసాలము క్రిందఁ జూడు పో
వోయి కుమార! యంచు నెన రూని సమీరుఁడు తెల్పెనో యనన్.
| 82
|
| పంచచామరము. |
ఆపారదోఃప్రతాపశాలి యక్కపీశ్వరుండు శిం
శుపారసారుహాగ్ర మెక్కి సూక్ష్మకాయుఁడై తదీ
యపాదభూమి హైమవేదికాంతరస్థలంబునన్
క్షపాచరాంగనాగణంబుఁ గాంచి వారిలోపలన్.
| 83
|
| ఉ. |
ధారుణి మైపరాగమువిధంబున లోచనబాష్పవైఖరిన్
నీరము విప్రయోగశిఖినీటునఁ దేజము వేఁడియూరు పై
మారుతమున్ మనోరథసమగ్రత వ్యోమము గొల్వఁగా నగ
త్కారణలీలఁ దెల్పెడునొకానొకమానిని గానిపించినన్.
| 84
|
| ఉ. |
ఆమహనీయధామ “దురితాపహనామ! సమగ్రభోగసు
త్రామ! ద్విషద్విరామ! రఘురామ! పరామరిసింప వేమియున్
నామొఱ యేలొకో విన వనాథశరణ్య! నృపాగ్రగణ్య; నా
స్వామి;” యటంచుఁ బేర్కొనఁగ జానకి యౌ నని నిశ్చితాత్ముఁ డై.
| 85
|
| ఉ. |
పట్టణ మంతయున్ వెదకి భాగ్యవశంబునఁ జూడఁగంటి నే
నిట్టియెడన్ లతాంగి నని యిచ్చఁ గపీశ్వరుఁ డుబ్బి యంతలో
బిట్టడ లూని కాంత దురపిల్లఁగ “హా! రఘురాముమోహపుం
బట్టపుదేవి కిట్టివెత పాటిలెనే?” యని సాశ్రునేత్రుఁ డై.
| 86
|
| శా. |
భర్త న్నమఁగఁ బల్కినట్లు సతి చూపట్టన్ ముదం బెచ్చెఁ గాం
తార్తత్వంబున వెచ్చె నెమ్మది "సుఖస్యానంతరం దుఃఖ" మన్
వార్తార్థంబు మదర్థ మయ్యె మిథిలానాథాత్మజాతార్థమై
స్ఫూర్తిం జెందదొకో తదన్యపదసంబోధంబు శోధింపఁగన్.
| 87
|
| శా. |
శార్దూలీగణవేష్ట్యమానహరిణిం జంచత్కరిణ్యాళిస
మ్మర్దాంభోజినిఁబోలె రాక్షసవధూమధ్యంబునం గుందుచున్
దుర్దాంతవ్యథఁ జెందుచున్నసతి నే త్రోవన్ విచారింతు మ
న్నిర్దోషప్రియభాష లెప్పు డిఁక విన్కిం జేతు నంచున్నెడన్.
| 88
|
| శా. |
దోషాటాన్వయచక్రవర్తి మదనార్తుం డై ధరాపుత్రి దు
ర్భాషామార్గణపఙ్క్తి నొంప నతనిన్ భంజింప నుంకించి త
ద్రోషజ్వాలిక శేముషీజలముచేఁ దూలించి లేఖర్షభ
ద్వేషస్త్రీ త్రిజటాఖ్య చెప్పినకలన్ విభ్రాంతి నిద్రింపఁగన్.
| 89
|
| క. |
సమయము గని కారుణ్యర, సమయహృదయుఁ డగుట శాఖిశాఖలు డిగి భూ
రమణీజాతకు సీతకుఁ, బ్రమదమున నమస్కరించి పావని పల్కెన్.
| 90
|
| ఉ. |
రామునిబంట మారుతవరంబున నంజనగర్భశుక్తికన్
మామకజన్మ మంబ హనుమంతుఁ డనం దగువాఁడ స్వామి మీ
సేమ మెఱింగి ర మ్మనియెఁ జిత్తములో నను నమ్మరేని యా
రామునిముద్రికామణిఁ దిరంబుగఁ గన్గొనుఁ డంచు నిచ్చినన్.
| 91
|
| సీ. |
అంగుళీయక మంది కెంగేలఁ గొనినంత రమణిమైఁ బులకాంకురంబు లెనసె
రత్నముద్రిక సాదరమునఁ గన్గొనినంతఁ గలికి కానందాశ్రుకణము లురిలె
నూర్మికామణి చెక్కు లొరయించుకొనినంతఁ గాంతదేహం బంత కంపమొందె
నుంగరం బొకయింత యురముఁ జేర్చినయంత నింతి బాహ్యాభ్యంతరేచ్ఛ మఱచెఁ
|
|
| తే. |
జెలువుఁ డంటినఁ గనుగొన్నఁ జె క్కలమిన, నక్కుఁజేర్చిన నేసుఖం బావహిల్లు
నాసుఖము ముద్రికాయుక్తినైన వాయు, జునకుఁ బ్రత్యుపకృతి చేయ సుదతి మఱచె.
| 92
|
| చ. |
జనకజ యీగతిన్ విభునిసన్నిధిఁ జెందినభంగి నుంగరం
బున ముదమంది తన్ తెలిసి ముందర బ్రాంజలి యైనయంజనా
తనయునిఁ గాంచి నీదయఁ గదా! జగదాదరణీయరామభూ
జనవరభద్రముద్రిక ప్రసన్నతఁ జేకుఱె నాకుఁ బావనీ!
| 93
|
| చ. |
రమణుఁ డొసంగె నుంగరము రామ! కనుంగొను మన్నమాత్ర మే
ను మఱచి సొక్కి యొక్కటఁ గనుంగొనుచుండితిఁ గాని తత్ప్రమో
దమునకు నాదికారణ మితం డని ని న్గన నైతి నెచ్చటన్
బ్రమద లెఱుంగ నేర్తురె? కృపాళు రొనర్చినమేలు మారుతీ!
| 94
|
| శా. |
లోకుల్ ప్రాణమె ముఖ్యవస్తు వని యాలోకింతు రా ప్రాణమే
నాకు న్నిల్పితి నీకు దీవన వినా నాచేతఁ గా దొండు స
త్యాకల్పంబుగ వృద్ధిఁ బొందు మిఁక నీ వాకల్పపర్యంతమున్
గాకుత్స్థాన్వయరక్షణ(?)ఘృణాగణ్యప్రభావోదయా!
| 95
|
| క. |
నా విని పావని త్రిభువన, పావనిఁ గని బంటు నేల ప్రణుతింపంగాఁ?
బోవలయు మీశిరోమణి, దేవీ! దయసేయుఁ డన క్షితిజ యిట్లనియెన్.
| 96
|
| శా. |
ఆకారం బెఱిఁగించుప్రజ్ఞ జనులం ద ట్లౌట నీప్రజ్ఞ కే
కాకారం బయి యుండ దూయొడలు సత్యంబైననీరూపమున్
నాకుం జూపక రత్న మే నొసఁగనన్న న్నట్ల కానిమ్మటం
చాకారుణ్యపయోధి దివ్యతనులీలాశాపథారోధి యై.
| 97
|
| సీ. |
తెలిచాయబలుసామితలపూవుచెలిగుంపుచిఱుగజ్జె లడుగుఁదామరల వఱలఁ
బుడమి మోపరి పాఁపపడగగుంపులసొంపు విడిపింపుమైపెంపు వెఱపు నెఱప
|
|
| |
వినుమానికము చాలు గొనఁజాలుతనడాలు నలుదెస మిసమిసల్ గలయ వెలయఁ
దెఱగంటిదొరవింటి నెఱవంటి తెఱఁగంటి సరి గెంటినిడుతోఁక చదలఁ బొదల
|
|
| తే. |
మేలిజందెమ్ము కెమ్మోము కేలిమోడ్పుఁ, బసిఁడిముంజియుఁ గ్రొంబట్టుమిసిమి దేర
హనుమ మున్నీటిమొలనూలియన్నుచూలి, కన్నుఁగవ కచ్చెరువు గాఁగఁ గానిపించె.
| 98
|
| క. |
ఇప్పగిది గాడ్పుఁగొమరుని, గొప్పశరీరంబు చూచి కోమలి మదిలో
నప్పు డరు దింపు వెఱపును, ముప్పిరిగొనఁ గన్నుదోయిమోడ్పునఁ బలికెన్.
| 99
|
| మ. |
విపులాకారుఁడ వై జగత్త్రితయ మావేశించుసర్వాత్మునిన్
గపిసామాన్యునిఁ గాఁ దలంచితిని జక్కం జూడఁగా శక్యమే?
చపలాలోకల మైనమాదృశలకున్ జాలున్ భయం బయ్యెడున్
గృప నీయెప్పటిసూక్ష్మరూపమునఁ దండ్రీ! నిల్వవే వేఁడెదన్.
| 100
|
| క. |
ఆపాథోనిధిఁ గడిచిన, కైపున నాదుఃఖవార్ధి కడగాంచుటకై
నాపాలిభాగ్యమే నీ, రూపంబు వహించె నో మరుత్ప్రియతనయా!
| 101
|
| క. |
అని యనితరహితఫణితిన్, వినుతింపఁగ నేధమానవిధ మడఁచి మునుం
గనిపించినటుల నిలిచిన, యనిలజునకు మణి యొసంగి యవనిజ పలికెన్.
| 102
|
| క. |
వసుధేశుఁ బాసి పదినెల, లసువులఁ బట్టితి భరింప నతిభర మింకన్
మసలిన నసురేంద్రుఁడు నా, కసుర(?)నని హనుమ! యనుమా విభుతోన్.
| 103
|
| సీ. |
ననుఁ బ్రధానంబుగాఁ గొనుటచేఁ దన కీశ్వరత హెచ్చె ననెడు గారవపుమాట
నేను గల్గకయున్నఁ దా నేవిలాసంఁ బొరయఁబో ననెడి యబ్బురపుమాట
క్షణము నన్ బాసిన జగ మంత శూన్యమే యొండు గన్పడ దన్ననిండుమాట
నీగుణావళిఁ గూడునే యిట్టి దని నాఁడు సన్నుతింపఁగ నన్నచనువుమాట
|
|
| తే. |
ప్రేమ మున్నాడి మున్నాడి పెంపు సేయు, టెఱుఁగఁడే సర్వసాక్షి దా నిపు డుపేక్ష
యేల గావించెనని మీఱి యేను దూఱి, పలికినా నని వివరింపు భర్త కనిన.
| 104
|
| ఉ. |
తెమ్మెరచూలి మ్రొక్కి జగతీపతికిన్ భవదుక్తు లెల్ల ని
క్కముగ విన్నవించెద నిఁకన్ వెత చెందకు నీ ముదశ్రువ
ర్షమ్మున కాదిగర్జయగు రామధనుర్గుణఘోషణంబు మా
యమ్మ! నిజమ్ము నమ్ము మని యాయమ వీడ్కొని వేడ్క మీఱఁగన్.
| 105
|
| మ. |
సుమనోగంధవివర్ధనస్థితి ద్విజస్తోమధ్వనిప్రాప్తి దీ
ప్రమధుప్రస్ఫుటతం బ్రశాంతకలనాభంగిం బలాశిత్వముం
దమయందుం గనిపించె వీనిఁ దొలుతన్ దండింతు నన్నట్టు ల
త్యమితోద్వృత్తిఁ బెకల్చె వాయుజుఁ డశోకానోకహానీకమున్.
| 106
|
| స్రగ్ధర. |
కూల్చెన్ శాఖోపశాఖల్ కుసుమవిసరముల్ కుల్మటంబుల్ దళంబుల్
వ్రాల్చెన్ రాల్చెన్ ఫలంబుల్ వనచరఖచరస్వామి తద్రక్షకాళిన్
గెల్చెన్ గుండెల్ పగిల్చెన్ గిలకిలనగుచున్ గింకరశ్రేణిమేనుల్
వొల్చెన్ రక్తాంబుధారోద్ధురత మకరికాతోరణారూఢిఁ బొల్చెన్.
| 108
|
| తే. |
సకలబలహేతుభూతపంచకముకడిమి, జార్చి సప్తప్రధానాత్మజవ్యసనము
లడఁచి విజితాక్షుఁడై సుస్థిరాత్మయోగ, మతిశయిల సంతసిల్లె నయ్యతివిభుండు.
| 109
|
| మ. |
పితృశోకాపనయార్థి రావణి జగద్భీమస్వయంభూకరం
బతిగర్వంబున వైవఁ దచ్ఛరముఁ ద్రోయం బారియున్ ధాతృదే
వర నీక్షించియు రావణస్థితి గనన్ వాంఛించియున్ ధీరుఁడై
హుతభుఙ్మిత్రసుతుండు కట్టువడిన ట్లుండెన్ విలాసం బనన్.
| 110
|
| మ. |
అసమబ్రహ్మశరోగ్రతాప్రసవలీలాగాత్రుఁ డగ్గంధవా
హసుతుం డిగ్గతి నున్న ఘోరభవపాశాయాసవిధ్వంసన
వ్యసనుం డిప్పిరిత్రాళ్ల నిల్వఁ డనిపో కమ్మేఘనాదుండు పా
శసమావేశితుఁ జేసెఁ దామసమతుల్ సర్వంబుఁ జింతింతురే.
| 111
|
| మ. |
దివిషద్ద్రోహి మహోగ్రపాశములు సంధింపంగ బంధింపఁగా
వివశుండుంబలె నూరకుండె గుహనావిశ్రాంతలీలన్ గపి
ప్రవరుం డయ్యెడఁ గొంచుఁబోయి జనకాభ్యాశంబునం దుంచ దా
నవమూర్ధన్యుఁ డమర్షదంతురితదంతధ్వానుఁడై యిట్లనున్.
| 112
|
| శా. |
ఆశక్రాదులకున్ బ్రయాస మగులంకావాసమున్ జొచ్చి నన్
లేశంబుం గయికోక కేళివనపాళిం గూల్చి రక్షచ్ఛటా
నాశం బక్షహృతిన్ ఘటించిన మదోన్మత్తుండ వెవ్వాఁడ వో
శాఖామృగ! యెవ్వ రంపి రిట వారిం జెప్పరా నావుడున్.
| 113
|
| చ. |
ఉరవుగఁ జుట్ట చుట్టుకొనియున్న మహాఫణి నాఁగఁ జుట్టునుం
బరివృతవాలవల్లి దగఁ బాలసముద్రములీలఁ దత్సభాం
తరశశికాంతవేది జిగి దాల్ప నెదన్ ధృతిలక్ష్మి హెచ్చఁగా
హరి పలికెన్ బ్రవర్షసమయాబ్దబృహద్రవగర్భితార్భటిన్.
| 114
|
| శా. |
స్వామిద్రోహి! దశాస్య! యోరి! వినురా సాక్షాద్రమాధ్యక్షుఁ డా
రామక్ష్మాపతిబంట వాయుజుఁడఁ దద్రాకేందుబింబాననా
|
|
| |
క్షేమం బారయ వచ్చి యిచ్చట లతాంగిం జూచి యస్మద్భుజా
సామర్థ్యం బొకయింత నీకుఁ గనిపించం జేసితిన్ బోవుచున్.
| 115
|
| ఉ. |
నావినుతప్రతాపకలనం గలనం జలనంబు నొంద కిం
దేవడిబంటు నిల్చుఁ? దగదీపగ దీఱఁగ దీనతోషు సీ
తావిభుఁ జేరి మీఱవలదా? కలదా? యిల దాదృగర్థ మో
రావణ! నాదు బుద్ధి వినురా కనరాకనురా శుభస్థితుల్.
| 116
|
| క. |
కైలాసశైలచలనా, భీలభవద్భుజవిలాసభేదనలీలా
లోలగిరీశశరాసవి, భాళున కవనీజ కొసంగి బ్రతుకుమ టన్నన్.
| 117
|
| ఉ. |
ఆహనుమంతుమాటల దురాగ్రహుఁ డై దశకంఠుఁ డుద్ధతా
జ్యాహుతివర్ధమానదహనాకృతి దగ్గఱివారిఁ జూచి తా
ద్రోహ మొనర్చియున్ వెఱక త్రుళ్లెడునివ్వెడక్రోఁతి వీని మీ
రాహుతి సల్పుఁ డన్న విని యన్నకు మొక్కి విభీషణుం డనున్.
| 118
|
| చ. |
అలయక స్వామికార్యపరులై పఱతెంచినవార లెన్నిభం
గుల నయినన్ వెడంగుపలుకుల్ పచరింపుదు రవ్విధంబు దూ
తలకు స్వభావ మిం దలుగ ధర్మముగా దటులైనఁ జిత్తమం
దలుక శమింపదేని తగిన ట్లొకదండన కానతిం డనన్.
| 119
|
| క. |
ఈయడవిద్రిమ్మరిం గొని, పోయి వెసం దోఁక గాల్చి పోనిం డని దై
తేయాగ్రణి సెలవిచ్చిన, నాయనఁ గని దైత్యు లత్యుదాత్తస్ఫూర్తిన్.
| 120
|
| క. |
పట్టిరి పవనజు మోఁకులఁ, గట్టిరి తైలార్ద్రపటనికాయము తోఁకన్
జుట్టిరి బెట్టుగ మంటలు, వెట్టిరి రాక్షసులు లోకభీకరభంగిన్.
| 121
|
| శా. |
రక్షోవంశవినాశహేతుభృతిజాగ్రద్ధూమకేతుస్థితిన్
వీక్షింపన్ శిఖిభీమలూమలతతో వీరచ్ఛటాధ్యక్షుఁ డ
య్యక్షారాతి చరించుటల్ విని తనున్ బ్రార్థించుసీతాపయో
జాక్షిప్రార్థనఁ జల్ల నై యపుడు స్వాహాభర్త తోడౌటయున్.
| 122
|
| సీ. |
సుర లుపద్రష్ట లుద్ధురసింహనాదంబు శ్రుతిసూత్రనికరంబు దితిజకులము
పశుకోటి గృహదారుపటల మింధనరాశి కోవవహ్ని మహాప్రతాపవహ్ని
లాంగులవహ్ని గూడంగ వహ్నిత్రయప్రజ్జ్వలజ్వలికాపాళి లంకఁ
బూర్ణాహుతిగ రామభుమీశ్వరార్పణబుద్ధిమైఁ గావించి పొలఁతి గాంచి
|
|
| తే. |
సౌఖ్యవారిధి నవభృథస్నాత యగుచు, నాహవకళావిశారదుఁ డపుడ మరలి
కడలి లంఘించి యవ్వలికడ వసించు, వానరుల కున్ముఖతఁ జెంది వచ్చునపుడు.
| 123
|
| ఉ. |
అంబుధరధ్వనిన్ శిఖచయంబన మారుతిసింహగర్జ న
జ్జాంబవదాదు లుబ్బి సతిజాడ గనుంగొను టెంచి హర్షబా
ష్పాంబునదీవధూటికల నంబుధిడం బడఁగించి విక్రమా
డంబరు లర్కసూతివని డగ్గఱి దుండగముల్ ఘటింపఁగన్.
| 124
|
| క. |
దధిముఖుచే రవిసుతుఁ డ, వ్విధ మెఱిఁగియుఁ గినుక గనక వెసఁ బిలిపింపన్
గుధరచరుల్ చని సుగుణాం, బుధి రఘుపతిఁ గాంచి రనిలపుత్రుం డంతన్.
| 125
|
| సీ. |
అవికారలీలఁ గేల్గవ నిటలతటంబు గదియించి నృప! కంటిఁ గలువకంటిఁ
దరువుక్రింద వసించి స్థిరదృష్టి వహియించి యుపవాసములఁ జిక్కి యొఱపు దక్కి
నెఱకురుల్ జడగట్టి తెరలునూరుపు వట్టి భావంబు నినుఁ జేర్చి బాధ కోర్చి
నీనామమె జపంబుగా నుగ్రపుఁదపంబు గావించునటు లున్నగరితఁ గన్నఁ
|
|
| తే. |
గందకున్నె? మనం బశోకవనరాశి, డాసియును శోకవనరాశి గాసిఁ జెందు
చున్నయన్నాతి కీవు ప్రసన్నుఁడ విఁకఁ, గాక మదిగాఁక యేజోకఁ గడపఁగలదు?
| 126
|
| క. |
అని తెలిపి తా నుదధి దాఁ, టినగతి మొదలుకొని యట ఘటించినపని సూ
చన చేసి జీవమణి యి, చ్చినగతి సతిరకత్న మొసఁగ శ్రీరఘుపతియున్.
| 127
|
| మ. |
అది గన్నన్ మది నున్నతాప మెడఁబాయన్ జేయఁ గన్నట్టు లిం
పొదవం బావనిఁ జూచి యీయనితరోద్యోగప్రతాపక్రియా
సదుపాయస్థితు లెందును గలవె? యస్మద్వంశసంరక్షణం
బు దయం జేయనె నీశుభోదయము గాఁబోలుం గపిగ్రామణీ!
| 128
|
| మ. |
శ్వసనోదగ్రజవోగ్రధాటిఁ దటినీచక్రేశ్వరుం దాఁటిపో
వసమే? వాఁటినచో సుపర్వభయస్వైరప్రచారాఢ్యుఁ డా
యసురగ్రామణివీడు చూడఁ దరమే? య ట్లైన నీరితిశౌ
ర్యసముద్రేకతఁ జొచ్చి శత్రుహృతి సేయంగూడునే పావనీ!
| 129
|
| మ. |
పవనుండున్ గరుడుండు దుర్భరగతిన్ బారావరోల్లంఘన
ప్రవణప్రక్రము లింతె గానిపని దీర్పన్ లేరు వారుండనీ
యవలం బోయినరుద్రుఁ డైన మరలన్ ప్రాణాన రానోపునే?
జవముం దేజము మించ నీకిటు ఘటించం జెల్లెఁగా కెల్లెడన్.
| 130
|
| మ. |
కృతకృత్యుండవు నీప్రతాపజవకీర్తిస్ఫూర్తిఁ గీర్తింపఁగాఁ
జతురాస్యుండును నోపఁ డన్యజనతాసాధ్యక్రియల్ నీవు
చేసితిగానన్ బతి గాననైన నిదె సంశ్లేషింతుఁ బాటింపుమా
ప్రతికారంబుగ నంచుఁ గౌఁగిటను సంభావించె వాయ్వర్భకున్.
| 131
|
| ఉ. |
అందఱిలోన నిట్లు పవనాత్మజుఁ గూరిమి చేసి డాసి వా
ర్ధిం దరియించి రావణు వధించి మరుత్సుతుసూక్తి నుత్సవం
బొందినసీతఁ గైకొని యయోధ్యకు రాఘవుఁ డేఁగె నాశతా
నందుఁ డరుంధతీప్రభు ననంతమణిప్రభుఁ గాంచి యిట్లనున్.
| 132
|
| శా. |
ప్రాణేశుం బెడఁబాసి ప్రాణ మెడలింపం బూనుసీతాసతిన్
బ్రాణాపేక్ష భరింపఁచేసినజగత్ప్రాణాత్మజున్ సర్వగీ
ర్వాణప్రస్తుతశౌర్యు వెండియు వినన్ వాంఛించుచున్నాఁడఁ ద
ద్వాణీదేవతఁ దత్కథానుగతిఁ జెందం జేయవే నావుడున్.
| 133
|
| పంచచామరము. |
భగీరథోర్వరాధిరాట్తపఃప్రసన్నపన్నగ
స్రగూర్ధ్వమార్గనిర్గళత్తరంగిణీతరంగసం
ఘగర్భితార్భటిన్ వచఃప్రగల్భతావిభూతివా
సిగా దయాగరిష్ఠుఁ డవ్వసిష్ఠుఁ డప్పు డి ట్లనున్.
| 134
|
| మ. |
అనఘాగ్రేసర! బ్రహ్మకైన నుతిసేయన్ రానిసంజీవరా
యనిచారిత్రము లే నుతింపఁగలనా? యైనన్ విదేహాత్మజా
వనమే కా కతఁ డాత్మ రామహితభావం బూని పెక్కండ్రం బ్రో
చినయాశ్చర్యకరప్రభావములు సంక్షేపంగాబుగాఁ దెల్పెదన్.
| 135
|
| సీ. |
సౌహృదస్థితి విభీషణునియం దెఱిఁగించి పతిఁ జేర్చి స్థిరరాజ్యపదవిఁ గూర్చెఁ
బెద్దనిద్దురవోవుపెనుమూఁకల విశల్యకరణిఁ జెచ్చెర మేలుకన నొనర్చెఁ
గలనఁ గూలినరాముగారాబుతమ్మునిప్రాణముల్ క్రమ్మఱఁ బడయనేర్చెఁ
దనవాగమృతధార మొనయించి భరతేంద్రుగాఢశోకజ్వాల కడకుఁ జార్చెఁ
|
|
| తే. |
గదనమునఁ బెక్కుదనుజులమనము లార్చె, మఱియుఁ దఱచైనమహిమముల్ దొరసి పేర్చె
బవనతనయుండు శ్రీరామభద్రభద్ర, దయకు నిజరూపమునకు భేదంబు లేమి.
| 136
|
| క. |
హాయనకోటులు సను రా, మాయణకథ యనెడు హేమమాలికకు మహా
నాయకరత్నం బగురఘు, నాయకభటుమహిమవర్ణనల్ గావింపన్.
| 137
|
| సీ. |
వినుము శతానంద! మును రాముఁ డంజనాసుతునిచే జానకీస్థితి యెఱింగి
దశకంధరజిగీష దక్షిణాంబుధియోర వీరవానరులతో విడిసియున్న
నది విని దుర్జయుం డగునిర్జరారాతి దుర్జాతిమంత్రులఁ గర్జ నుడుగ
దుర్మంత్ర మెఱిఁగింపఁ దొడఁగిన ధర్మార్థకామమోక్షములకుఁ గాని తెరువు
|
|
| తే. |
పరవధూసంగమాపేక్ష పరవధూటి, మాత్ర మాసీత లోకైకమాత యామె
కెగ్గు గావించి చెడ నేల? యిమ్ము రామ, చంద్రునకు సీత నని విభీషణుఁడు దెలుప.
| 138
|
| చ. |
అవిరళకావ్యగౌరవసమర్థతఁ జెందుకవీంద్రుమాట లొం
డువిధిఁ దలంచుచుం దనకఠోరపదాహతిఁ జూపఁ బూనుదు
ష్కవివలెఁ దామసీచరశిఖామణి తమ్మునిబుద్ధిమాట లొం
డువిధిఁ దలంచుచుం దనకఠోరపదాహతిఁ జూపె నేపునన్.
| 139
|
| మ. |
ఘనకర్మానుగ మైనకాయమునకున్ గాలంబు పర్యాప్తిఁ జెం
దిన నంతఃకరణంబుతోఁ దగుగతిన్ దీపింపఁగాఁబోవుజీ
వునిఠేవన్ సహితుం డతండు జముఠావున్ జెందఁ గాలంబు డా
సిన పౌలస్త్యునివీడు వీడి పఱతెంచెన్ రామసేవార్ధి యై.
| 140
|
| ఉ. |
కాకులమూఁకలోఁ బెరిఁగి కమ్మనిక్రొవ్విరివేళ యైనచోఁ
గాకి కుహూకృతుల్ విని వగన్ బెగడించిన గుంపువాయుపుం
స్కోకిలముంబలెం దశముఖుం బెడఁబాసి విభీషణాసురుం
కడ రాఁ గనుంగొని దివేంద్రకుమారుఁడు సేనతో ననున్.
| 141
|
| క. |
కంటిరె! కపు లదె మింటన్, వెంటన్ హితు లంట వచ్చు వీనిన్ దివిష
త్కంటకుని గెంటుఁ డంటకుఁ, గంటకతరు లూనువారిఁ గని యతఁ డనియెన్.
| 142
|
| పంచచామరము. |
వలీముఖేందులార! మీకు బంధుఁడ మరుద్విష
త్కులీనుఁడన్ మలీమసాత్మకున్ దశాస్యుఁ బాసి ని
శ్చలప్రపత్తియుక్తి రామచంద్రుఁ జేరితిన్ మదా
విలత్వ మీరు సామిఁ జేరి విన్నవింపరే యనన్.
| 143
|
| క. |
అక్కపు లక్కజ మెక్కెడు, రక్కసునుడివడువు నొడువ రవిసుతుఁ డదిరా!
యెక్కడిపని? యని రాముని, చక్కికిఁ జని మ్రొక్కి పటువచనరచన ననున్.
| 144
|
| క. |
రావణునితమ్ముఁడఁట! బలు, కావరమున నున్నయన్నఁ గా దని మిమ్మున్
సేవింప వచ్చినాఁడఁట!, యీవింతలు వింటిరే నరేశ్వరతిలకా!
| 145
|
| శా. |
భాషం గూర్పరు బుద్ధి బుద్ధిపటిమం బాటింప రుగ్రక్రియల్
దోషం బన్న నొకింతయుం దలఁప రెందుం దూషితస్వాంతు లీ
దోషాటుల్ బహువేషధారులు మదాంధుల్ వీరిఁ జిత్తంబులో
నీషన్మాత్రము నమ్మి చేకొనఁగరా దిక్ష్వాకువంశోత్తమా!
| 146
|
| క. |
మార్తుఁ డని విన్నవించితి, వార్తల కెడ యేమి స్వామివారికి బుద్ధిన్
వర్తించినటు లొనర్చుటె, కర్తవ్యం బనిన జనకకన్యాధిపుఁడున్.
| 147
|
| ఉ. |
చెంగటిమంత్రులం గని వచించెఁ గపీశ్వరులార! యన్నతో
డం గలహించి వచ్చెనొ దిటంబుగ సంధి ఘటింప వచ్చెనో
యింగిత మేమియో తెలియకే మన కీతని వీడనాడుటల్
సంగతిగా దెఱుంగ నగుజాడ లెఱిం గెఱిఁగింపుఁ డీ రనన్.
| 148
|
| క. |
సుగ్రీవుఁ డనియె సీతిస, మగ్రత మన్నింప మమ్ము నడుగుటగా కా
ర్యాగ్రణి! మీ రెఱుఁగనికా, ర్యగ్రహణము లేమి యున్నవని పలికినచోన్.
| 149
|
| సీ. |
శత్రుం డతనిగూర్చి మైత్రి చింత ఘటింపరా దని పల్కెఁ దారాసుతుండు
తఱిగానితఱి వచ్చు టరయంగ సంశయావసారుఁ డని జాంబవంతుఁ డనియెఁ
దగువానిఁ బంపి చిత్త మెఱుంగకయె తొడిఁ బడఁగూడ గడుసని నొడివె శరభుఁ
డదియె నిక్కము వీనిహృదయమర్మ మెఱుంగ దొరయు మే లనుచు మైందుఁడు వచించె
|
|
| తే. |
నివ్విధంబునఁ దమతమయిచ్చ నెనసి, వచ్చు హెచ్చున వాక్రుచ్చువార్తలు విని
యార్తరక్షాపరాయణుం డాంజనేయుఁ, డన్నరేంద్రున కిటు లని విన్నవించె.
| 150
|
| తే. |
అవధరింపుము శరణాగతార్తిహరణ!, మీప్రధానులపలుకు లేమియు శుభంబు
లనుసరింపమిఁ గార్యబాహ్యములు దోష, హేతువులు గాఁ దలంచెద నెట్టు లనిన.
| 151
|
| మ. |
పరమర్మంబు లెఱుంగఁ గోరుకుమతుల్ ప్రాగ్రూపమే పూని వ
త్తురే? వేషాంతర మొందినం బలుకులు దుర్భావసద్భావముల్
పరిశీలింపఁగరాదె? లోఁ బ్రబలమా భావంబు నాకారవై
ఖరి మాటంగలఁడే? విధాతయు బలాత్కారంబునన్ రాఘవా!
| 152
|
| ఉ. |
రావణుతోడ న న్నపుడె రాక్షసుఁ జంపుట సొం పటంచు సు
గ్రీవుఁడు తెల్పె రావణునికిల్బిష మీతనిఁ జెంది యున్నదే?
రావణుతమ్ముఁ గైకొనియె రాముఁడు దీనశరణ్యుఁ డన్నచో
దేవర కింతకంటెను బ్రతిష్ఠ మఱిం గలదే? జగంబునన్.
| 153
|
| ఉ. |
ఆదశకంఠుసోదరుఁడ నౌదు భయార్తుఁడఁగల్ల నాయెడన్
లేదు దురుక్తి కాదు మరలింపక సామికి విన్నవింపరే
యాదృతి నింపరే యనఁగ నంగదుఁ డీతనిశత్రుఁ డంచు నా
హా! దయ లేక పల్కె శరణాగతభావము శత్రుభావమే?
| 154
|
| సీ. |
వార్ధి దాఁటినమీఁద వచ్చెనేనియు శత్రుదేశంబు గాన సందియముఁ జెంది
యభయ మియ్యరటంచు నటు గాక ముందర నరుగుదెంచుట సదేశాగతుండు
దమయన్నక్రోధంబు దైత్యవంశవినాశ మెదుటిజయంబు నూహించి సమర
మొదవకమును వచ్చు టుచితకాలజ్ఞుండు గావున దేశంబు గాల మరియ
|
|
| తే. |
కీతఁ డేతెంచె ననునీతి నీతి గాదు, కూహకము చేయ వచ్చినకుచ్చితుండు
దూత నంపిన హృదయరీతులు గొడువునె?, శరభమైందులనుడి కార్యసరణి గాదు.
| 155
|
| ఉ. |
సా దుపకారి గోల గుణశాలి యితం డితఁ డాడుమాటలన్
భేద మొకింతయేని కనిపింపద యన్నకు బుద్ధి చెప్పినన్
గా దని తన్ను టందరెఱుఁగన్ వివరించఁగ సంశయించఁగా
రా దది గాక యీదనుజరత్నముచిత్తము నే నెఱుంగుదున్.
| 156
|
| చ. |
చలమున రాక్షసక్షయము సల్పినయీసున న న్వధింపఁగాఁ
దలఁచినపఙ్క్తికంఠునకు ధర్మము నామదికిన్ హితంబుగా
బలికినపుణ్యుఁ డీతనిస్వభావము ధర్మమయం బటంచు నేఁ
దెలిసితి నాఁటనుండి జగధీవర! సందియ మొంద నేటికిన్?
| 157
|
| మ. |
కినుకన్ వాలి వధించి భానుజునిఁ గిష్కింధాపురిం బట్టభ
ద్రునిఁ గావించినరీతిఁ బఙ్క్తిముఖునిం దూలించి లంకాపురం
బనపాయస్థితి నిత్తు రంచు నభయం బర్థించి రాఁబోలులే
మనలో నీఘనుఁ డున్న దానవులమర్మంబుల్ ప్రకాశం బగున్.
| 158
|
| క. |
ఇరవుకొను తెరుపు దోఁచిన, వెరవునఁ దేవరకు విన్నవించితి ననినన్
దిరువడినుడిహరువిడి మది, బరువడి రఘువీరుఁ డనియె భానుజుతోడన్.
| 159
|
| క. |
మ్రొక్కిన చేతులు గోయుట, రక్కొనునే మమ్మువంటిరాజుల యిందున్
దక్కక యభయం బిచ్చితి, గ్రక్కునఁ దొడితెమ్ము పొమ్ము రాక్షసరాజున్.
| 160
|
| తే. |
అనిన సౌమిత్రి మైత్రి వాగాత్మమైత్రి
నెంత దెలిపిన వినఁడయ్యె నీశ్వరుండు
కార్యభాగంబు హృదయసంగతి యెఱింగి
విన్నవించిన వటుసూక్తి వినుటఁ జేసి.
| 161
|
| క. |
ఇనతనుజాంగదజాంబవ, దనుజోక్తులు వినక ప్రియము లాడె నితఁడు మున్
దన కనినమాట వినియెన్, హనుమపయిని స్వామిప్రేమ మతిశయముగదా!
| 162
|
| క. |
రామునినేమ మెఱుంగును, సామీరి సమీరసుతునిస్వాంత మెఱుంగున్
రాముం డితరేతరప్రియు, లామహితాత్మకులఁ బరుల కలనియె తెలియన్?
| 163
|
| మ. |
కుటిలవిఘాతి యైనతనుఁ గూర్చి హితం బతఁ డాడకుండెఁబో
కటువగునోటు తద్గుణము గ్రాహ్యము సేయుటగాక చేసె నా
కట నుపకార మంచు సమయంబునఁ దెల్పి తదీయకార్యసం
ఘటన మొనర్చె వాయుజుఁ డకారణబాంధవుఁ డెంచి చూడఁగన్.
| 164
|
| ఉ. |
ఇంచుక మాటమే లెఱిఁగి యెవ్వరు పల్కినపల్కులతోన్ నివా
రించి మహోపకార మొనరించె విభీషణుఁ గూర్చి పెద్దకై
యుంచినమంచిమాట పరమోద్దవసంపద నింపకుండునే?
మంచిధరిత్రి విత్తిన సమంచితబీజము రిత్తవోవునే?
| 165
|
| తే. |
ఈవిధంబునఁ బతిపల్కు నినకుమారుఁ
డచ్చెరువు గాంచి నుతియించి యపుడె పోయి
యావిభీషణుఁ దోడ్తేర నధికభక్తి
నతఁడు సాష్టాంగ మెరఁగి యి ట్లని నుతించె.
| 166
|
| క. |
కాకుత్స్థతిలక! హతనత, శోకా! వీరాధివీర! శుభదాకారా!
రాకేందువదన! కరుణా, లోకశ్రీరామ! సుకృతలోకవిహారా!
| 167
|
| క. |
నీవే దిక్కని వచ్చితి, దేవా! నీకంటె నన్యదేవత నెఱుఁగన్
సేవకుఁడఁ బ్రోవు మని నుతి, గావించిన రాముఁ డతనిఁ గౌఁగిట నుంచెన్.
| 168
|
| మ. |
ఇనపుత్రాదు లవగ్రహప్రకృతిఁ గీ డెంచంగ నాత్మీయమం
త్రనిరూఢిం దెరలించి రామఘనరారాజత్కృపాంచద్విలో
కనవృష్టిం బరితుష్టుఁ జేసి మఱి లంకారాజ్యపట్టాభిషే
చనసౌఖ్యం బొసఁగెన్ విభీషణునకున్ సామీరి సామాన్యుఁడే.
| 169
|
| సీ. |
శక్తిత్రయాంగపంచకషడ్గుణారూఢఫణితిమంత్రము దెల్పుపట్ల మంత్రి
పనిచిన నెటువంటిపనియైన వంచింప కెలమిఁ గావించుఠావులను భృత్యుఁ
డేల చింతిల నంచు జాలి గ్రమ్మినకూర్మిఁ బ్రకటించువేళల బాంధవుండు
మాటపొంది కెఱింగి మనసులోనె మెలంగి యింపొందుకఱుదుల నిష్టసఖుఁడు
|
|
| తే. |
ప్రస్తుతు లొనర్చుచోటుల బట్టుసుకవి
తోడువినయంబు గనునెడఁ దోడుసుతుఁడు
తాన యై రామవిభునిచిత్తంబు వడసె
గాడ్పుకొమరుండు పతి కేడుగడయుఁ గాఁడె?
| 170
|
| చ. |
బలమున నీతి బుద్ధి మృదుభావమునన్ సరసోక్తి నెల్లవి
ద్యల బహుకార్యనిర్వహణతాగతి సత్యవివేకకీర్తులన్
బలియుఁడు గాన మెప్పొసఁగె భర్తకు మారుతి యిట్టు లన్నిఁటన్
మెలకువ లేకయున్నఁ దరమే! నరనాథులకొల్వు సేయఁగన్.
| 171
|
| తే. |
విను శతానంద! రామభూవిభునికరుణ, యాంజనేయునితోడు లే కనువుపడని
జాడ నొడివిరి వల్మీకసంభవాదు, లగుటఁ బరిపాటిఁ దత్కథ లాలకింపు.
| 172
|
| తే. |
అని వసిష్ఠుండు మఱియు నిట్లనియె నట్లు
దానవునిఁ గూర్చికొని రఘూద్వహుఁ డతండు
దెలుప మూనాళ్లు వార్ణిఁ బ్రార్థించి పిదప
నలవు గుందించి మ్రొక్కిన నభయ మొసఁగె.
| 173
|
| క. |
వారిధి సేతువు గట్టఁగ, నేరుచు నలుఁ డనిన ధారుణీపతి నలునిన్
గూరిచి పంపిన వానర, వీరులు తరుగిరు లొసంగ వెసఁగట్టునెడన్.
| 174
|
| మ. |
మలయ ద్రోణ హిమాద్రి దుర్ధరకుభృ న్మంథాన వింధ్యాభిధా
చల సీలాచల హేమకూట నిషధ స్వర్ణాద్రి తారాదికా
చల శృంగంబు లసంఖ్యముల్ గొని వెసన్ సామీరి యేతెంచుఁ జే
తులఁ బార్శ్వంబుల వాలమం దురమునందున్ సందు లేకుండఁగన్.
| 175
|
| మ. |
బహుభూజవ్రజరాజితక్షితిధరబ్రాజిష్ణుసర్వాంగుఁడై
బహురాజీవభవాండభాండకలనాభాస్వద్విరాడ్వైఖరిన్
బహుశాఖామృగకోటిలో హనుమ చూపట్టెం గపుల్ భారముల్
బహువారంబులు దెచ్చు టొక్కపరి లీలన్ దెచ్చుటల్ సాటిగన్.
| 176
|
| మ. |
ప్రతిరోమంబున భూధరప్రతతులన్ బంధించి ఝంఝాసమీ
రతిరస్కారమహాత్వరన్ నలునిఁ జేరన్ వచ్చునే హెచ్చుప
ర్వతపుందొంతులు పువ్వుబంతులొకొ మార్పం గొప్పగా నంచు దే
వత లీక్షింతురు వాయుజుండు గిరులన్ వారాశిఁ గట్టింపఁగన్.
| 177
|
| వ. |
వెండియు నఖండగండోపలప్రకాండంబు లొంటి నంటి గెంటి నప్పుడు పొడము
చప్పుడు గొప్పయుఱుములచొప్పున గుప్పుగుప్పునం బడుపిడుగులవడిం బెడగడరు
రవళిం దవులనవులనవులగుహాకుమారశయాళుబిలేశయచయంబులు భయంపడి వెడలి
తడంబడు నెడలఁ గడలుకొను మినుకుమినుకుమనుగనగననిమణులఘృణులపెంపుశంప
లసొం పలరింప లలితఝరీపరంపర జలసంపాతసంపద నింప నిలింపపతివారువంబుల
తీరుల మెండుకొనుబలుకొండలతండంబులు తండోపతండంబులుగా దెచ్చుచు
నలున కిచ్చుచు నిదె తెచ్చెద నని వా క్రుచ్చుచుఁ దరువులబరువునఁ బొరలక పరు
వునఁ బఱతెంచుకపుల మెచ్చుచు నెదురు వచ్చుచుఁ గౌఁగిటఁ గ్రుచ్చుచు దిట్ట
తనంబునం బట్టి బలుగట్టు లట్టిట్టు వట్టి బిట్టెడలించుపట్టున బెట్టులికి చిత్తంబున
నెత్తినతత్తఱంబున నెత్తంబులపట్టున నెట్టినతమిం దమతమపతులతో నెత్తంబు
లాడువేడుకలు వీడి కొడెవయసువేల్పుసిబ్బెంపుగబ్బిగుబ్బెత లుబ్బు సెడి యబ్పుర
పడి నిబ్బరపువెఱనొగిలినవగల దిగులునం దగులు నూరుపుసెగలు బెళుకు గులు
|
|
| |
కుకందొగలు చిఱుచెమ్మటలు గ్రమ్మిన నెమ్మోములు చెదరినమరువెలిసాములు గుబులు
కొనుమైతావులు కులు కెడలినమోపులు గడగడ వడఁకుతొడలు కడుదడఁబడియెడు
నడలు చెక్కులం బడుసరులు జాఱినపయ్యెదలు దాఱినపేరెదలు కొలఁదిగడచిన
సద్దులు కొదదీఱనిసుద్దులును గలిగి యయ్యెడ నడుగు లిడఁగూడక భయగూఢ
వ్రీడ లై ప్రౌఢాంగనలు క్రీడల గాఢాలింగనంబునం బొరసినసరససుఖరసలహరి
రహిం గని యహిసురఖచరవరు లహితహాలాహలకోలాహలుం డగుతనుఁ గని
కొనియాడినం గనికరంబునం బయలుపడకుండుదురె పొండని కొండదిగునంత
వడి యూరక వసియించుచు వియచ్చరు లిచ్చుమచ్చికదీవన లాలించుచు
వారి నుపలాలించుచు గొప్పకొండ లుప్పరం బొరయ మీటుచు మీటి మీఁదికిం
దాఁటుచు దాఁటి వాటీనికరంబులో మాటుచు వింటి నంటినతెఱగంటిదొరలకుం
జాటుచు నుదగ్రభుజార్గళనిరర్గళబలోదగ్రపలాశనప్రాణానిలగ్రసనవ్యసనశ్వస
నోల్లసనజాగ్రుల్లూమాగ్రలోమగ్రంథితవసుంధరాధరవారంబులు బహువారంబు
లకు భారంబులుగా దూరంబు లరుగ నెఱుఁగనికపులయెదుర నిడి సనుచుఁ దరు
లు గిరులు గలదెసలు గనుచు నెట్టిగట్టు నైన సునాయాసంబునఁ గొనుచు బలు
త్రిప్పట నెప్పటి చొప్పు దప్పి దప్పి గ్రమ్మి పడిన యడవిద్రిమ్మరుల రమ్మని నిజభుజ
శిరఃకరకక్షవక్షస్కంధాద్యవయవసంధులు సంధించిన ధరాధరవితానంబులఁ గల
కొనలకానలఫలంబులుఁ జల్లనిదొనలజలంబులు నిరూపించి యక్కడి కెక్కించుకొన
నక్కపికోటు లక్కడక్కడఁ గ్రిక్కిఱిసినతరువుల కెక్కి మిక్కిలియగు తేనియలఁ
జొక్కి ఫలంబులు మెక్కి బడలికలు దక్కి పెక్కుభంగులం దనమక్కువఁ బేర్కొని
కడలిచక్కి నొక్కండునుం జిక్కక కొండలు డిగ్గనుఱికి యూరక చనక చన శంకిం
చిన వలసిన గరులు లంకించికొనుండని తాఁ దెచ్చినవి యొసంగుచు నాకడం బగలిం
చుఢాక నెసంగుచు బహుమహీభృన్నివహంబులు మస్తంబున దొంతులిడి హస్తం
బునం బట్టకయే విద్దెంబు చూపుకోపున భూపతుల మెప్పించుచు మునిదేవవిహార
యోగ్యవనపర్వతాదులఁ దప్పించుచుఁ దక్కినవి భారవహుల కొప్పించుచుఁ
బుడమినలుగడలు చలింప దెప్పరంబుగఁ గుప్పించుచుఁ గప్పుజిగి యొప్పు గప్పి
కొనుమలలశృంగంబులు హాటకకుధురకూటంబులు శ్వేతగిరిశిఖరంబులు దెచ్చుతఱి
నవ్వెలుంగులు మువ్వెలుంగులు కనుంగగు టెఱింగించుతెఱం గవధరించుదు వివిధ
నినోదంబులఁ జరించుచు బహుగోత్రోద్ధరణనిపుణుండై మహారాజుతేజంబున
భ్రాజితాగమశాఖాకరుండై ద్విజేంద్రుచందంబున రామాలింగితాంగుండై భుజంగు
రంగున నమందసంచరణాంచితుండై కుక్షింభరితెఱంగున దీర్ఘతరశృంగసంగతుండై
|
|
| |
భాగ్యవంతువంతున హరిబలసమన్వితుండై యాఖండలుమెండున నదీనపథావలోకి
యై యభిమానిపూనిక సమవిషమవృత్తప్రస్తరోద్ధరణచణుండై సుకవిహవణికఁ
గామప్రచారానుసారియై సోముగోమున నక్కపిచక్రవర్తి యెక్కడఁ జూచినం
దానయై కపిబలంబునకు బలంబుం బ్రాపునుం జూపుచు సకలసుకృతహేతు వగు
సేతువు నలునిచేతం గట్టించె నట్టియెడ.
| 178
|
| శా. |
అక్షద్వేషణుఁ డీవిధంబునఁ ద్రిలోకాశ్చర్యధుర్యక్రియా
చక్షుం డయ్యు హరిత్వముందనకు సార్థంబయ్యె నా రామచం
ద్రక్షోణీంద్రునిమేనఁ బూని సురగోత్రస్వామిపై వాసరా
ధ్యక్షుండుండుట గానుపింపఁ జనియెన్ దైత్యేంద్రు బల్ వీటిపై.
| 179
|
| శా. |
ఆమీఁదన్ నిజవంశజుల్ ధృతిధనప్రాప్తేచ్ఛ నీక్షింప సం
గ్రామక్ష్మాతలదుర్గ కుగ్రతరగర్జం గోయుధూమ్రాక్షర
క్షోమేషంబు నడంచి తద్రుధిర మచ్చోఁ గాల్వలై పాఱఁగా
రామోర్వీవరశేవధిం గనియె శౌర్యశ్రీ నతం డుబ్బుచున్.
| 180
|
| ఉ. |
శోణితపంకిలక్షితి కుసుంభరసార్ద్రవితర్దిగా నిజా
క్షీణమహోగ్నిసాక్షి బుధశేఖరు లుత్సవ మొంద నభ్రకం
ఖాణముఖప్రకంపను నకంపను నాతఁడు మిత్తితోడఁ గ
ల్యాణ మొనర్చె వానిబలప్రాణము లుంకువయై ప్రవర్తిలన్.
| 181
|
| చ. |
పిదప రఘూద్వహాస్త్రముల భేదిలి నిల్చుట కప్పరేతరా
ట్సదనము విస్మృతిం దెలియఁ జయ్యనఃఁ బొమ్మని పఙ్క్తికంఠు బి
ట్టదలిచి రొమ్ము ముష్టిహతి నట్టె పగిల్చిన వజ్రదంతికొ
మ్మదటున నూడి నేలఁబడె నాసరణిన్ ధృతిలక్ష్మి వెల్వడన్.
| 182
|
| మ. |
రణరంగావశు రాముతమ్ము రజతగ్రావప్రకంపక్రియో
ల్బణదోశ్శక్తిఁ దెమల్పఁజాలమిఁ బ్రతాపశ్రీరహిన్ దానవా
గ్రణివక్త్రమ్ముల రక్తధార వెడలంగాఁ గ్రుమ్మి కొంపోయె నా
ఫణిరాజాంశజుస్వామిచెంతకు మరుద్బాలత్వమున్ జెందియున్.
| 183
|
| మ. |
దనుజాధీశ్వరువీక్షణాళులకుఁ జెందన్ దుశ్శకంబైన కాం
చనసూనచ్ఛవి మించుచంచలత గాంచంబోనిక్రొమ్మించుపైఁ
గనిపించెన్ ఘనమంచు నెంచఁగను సంగ్రామంబునన్ రామచం
ద్రునిఁ దాల్చెన్ విమతార్తిఁ దెల్పు ప్రతిభానుశ్రీ నతం డొప్పఁగన్.
| 184
|
| మ. |
వివిధప్రాణినికాయకంఠకుహరావిర్భూతరక్తారుణ
చ్ఛవిలీలం బెనుమంట లద్రిచరహృత్సంప్రాప్తవైర్యాటవిన్
దవులన్ దైత్యవరానుజాతకరముక్తంబై రుమాకాంతుపైఁ
గవియన్ శూలము మట్టుపెట్టె నగదంకారత్వమం దేర్పడన్.
| 185
|
| మ. |
నలనీలాదిబలీముఖాస్యబిససూనంబుల్ శరోదారధా
రల దాఱన్ ఘనలీల గాఢతమ మూరం జేయ గ్రీష్మార్కని
స్తులతేజస్స్థితి మించి కాలుకడ కచ్చోఁ బంపె దేవాంతకున్
విలసద్దేవముదశ్రువర్షముల ప్రావృడ్వేళ రా గ్రమ్మఱన్.
| 186
|
| మ. |
దశకంఠాపయశంబు గన్పడుగతిన్ దైత్యాంగనాత్మవ్య
ధావశతాలోకనకజ్జలంబు లమరీవక్షోజకస్తూరికా
విశదచ్చాయ నెసంగ ఘట్టితరథోద్వేలార్భటుల్ బెట్టుగాఁ
ద్రిశిరుం జంపె జముండు తల్పుగడియల్ దియ్యం దదాకర్ణనన్.
| 187
|
| చ. |
ఖచరతఁ జెందియుం దశముఖప్రియసూతి యనీతిమై పలా
శిచరులు నాశుగాశనులఁ జిక్కులఁ బెట్టి మదాత్మజార్థ మై
యిచట వసించి రిట్టియడ రిందఱ కడ్డము చెందు టర్హమం
చచట వసించె నాఁదనువులందు పరాగము గ్రమ్మ వ్రాలినన్.
| 188
|
| ఉ. |
బంధువు లీగతిం బడినపాటు గనుంగొని ప్రేమ నవ్విప
ద్బాంధవుఁ డచ్చభల్లపతిపంపున నప్పుడె హృజ్జనంబునన్
సింధువు లెల్లఁ దాఁటి గిరిఁ జేరి ధృతిన్ సరిఁబోలవచ్చు గ
ర్వాంధత మాన్చి తెచ్చి కృపనందులమందులు లేపె నందఱన్.
| 189
|
| మ. |
బవరం బుత్సవ మస్త్రముల్ తృణము లాపన్నాసురక్షాతిలో
లవిహారంబు స్వభావ మంబుధులు కాల్వల్ దుర్ధరోదగ్రశై
లవరోత్పాటనపాటవంబు లవలీలన్ మానసోద్యన్మరు
జ్జవసంచారమ లంతియానము గణించన్ శక్యమే మారుతిన్.
| 190
|
| చ. |
నగచరసాలజాలము కనత్పరిఘాయుధహస్తవృత్తి ను
గ్గుగ సమరాటవిం దగునికుంభమదేభము నొంచి పంచవ
క్త్రగరిమ చూపియుం బిదప దైత్యచమూకదళీవనంబులోఁ
దగిలినవేళ యూథపవిధంబు యథార్థము చేసె నెంతయున్.
| 191
|
| చ. |
ఘనగతి నిల్చి పోరుదశకంఠుకుమారుఁడు క్రిందఁ క్రిందఁబా
యనిభుజగాంశ మొంద నతఁ డంబర మందఁగఁ జేసె నెంతవాఁ
|
|
| |
డని సుర లెంచ నూర్ధ్వముగ నప్పరుఁ డేయుశరాళి హుంకృతిన్
జన జయ మిచ్చె రామనృపచంద్రునికమ్మనిఁ బూని పోరునన్.
| 192
|
| ఉ. |
సూనునిపా టెఱింగి సురసూచన శేఖరుఁ డల్క శక్తి రా
మానుజు మూర్ఛ ముంచ నృపుడాఁ డార్తిఁ గనుంగొని వానరాళికిన్
బ్రాణములిచ్చిన ట్లతిరయంబునఁ దమ్మునిప్రాణ మిచ్చి నా
ప్రాణము నిల్పమే ఘనకృపావని! పావని! యంచుఁ బల్కినన్.
| 193
|
| సీ. |
శివునిచేఁ దలకుఁ బాసియు మానిపోనిపద్మోద్భవుం డిఁక నాయు వొల్లడేని
యస్తమించియు నట్టె యడఁగనిరవి పునస్సంచార మెనయఁ గాంక్షించఁడేని
బడబాగ్నిచేఁ గ్రోలఁబడియు నింకనివార్ధి గాంభీర్యము వహింపఁ గడఁగదేని
ధనువయ్యు వంక చెందని కుందనపుగట్టు భూభారము భరింపఁ బూనదేని
|
|
| తే. |
మనసుమిత్రాత్మజుఁడు మూర్ఛ మునిఁగి మరల, లేవకుండెడు నింతేల సేవకునకుఁ
గలబలోద్వృత్తి మీ రెఱుంగరె యటంచుఁ, బతికి నతి చేసి ద్రోణాద్రి కతఁడు గదలె.
| 194
|
| క. |
దేహద్యుతు లెల్లెడలఁ ద, మోహృతి ఘటియింప వేల్పుమూఁకలు పరమో
త్సాహము గన విపినాచల, వాహిన్యంబుధులు గనుచు వడిఁ జనువేళన్.
| 195
|
| మ. |
అమరుల్ దైవవనప్రసూనసురభివ్యాసంగభృంగాంగనా
వళి నెత్తావులఁ బిల్వఁబక్వఫలదీవ్యత్కాంతి బాలార్కుతోఁ
దులదూఁగన్ శుకశారికాదివిహగస్తోమధ్వనిన్ బైలు మా
ర్వలుకన్ గృత్రిమతాపసాశ్రమము తత్ప్రాంతంబునం దోఁచినన్.
| 196
|
| క. |
మున్నడుతు నెన్నఁడున్ గన, నిన్నడుతెరువున వనం బిదెక్కడితెరువో
యిన్నేల సటలు? లేఁడే, యిన్నేల జటీందుఁ డడిగి యేఁగెద ననుచున్.
| 197
|
| ఉ. |
అల్లన డిగ్గి యగ్గిరిచరాగ్రణిమొగ్గల నగ్గలించుబల్
మల్లెలవల్లులం బెరయుమావులతావులతావు లెల్లెడన్
జల్లుచుఁ జల్లగాడ్పొలయుచక్కి వసించి సమాధినిష్ఠమై
నుల్లము నిల్చికొన్నమునియుంబలె నున్నయొకండు గన్పడన్.
| 198
|
| ఉ. |
నిక్కము మౌనిగా వగచి నెక్కొనుదాహము దక్క మంచినీ
రిక్కడఁ గల్గదే? యన వహించిన కైతవనిష్ఠ దెచ్చుకో
ల్మక్కువఁ బెక్కువాక్కుల విలంబము చేసి పొసంగకున్నచో
నక్కుటిలుం డొకానొకజలాశయ మక్కడిచక్కిఁ జూపినన్.
| 199
|
మకరీశాపవిమోచనము
| మ. |
అమరీరత్నము శాపయుక్తి మకరిత్వావాప్తిఁ జెందం దదం
గములక్కామిని పూని యొండుకడ కేఁగన్ లేక తత్పూర్వవే
షముఁ బ్రాపించఁ దలంచి వచ్చినదొ! నాఁ జక్రాంగచక్రాళినీ
కుముదాబ్జాదులఁ బొంకమై తగుకొలంకుం గాంచి తోయస్పృహన్.
| 200
|
| మ. |
పదశోణాంబుజదీప్తిహీరమణి సౌపానాళిఁ బ్రాఁగెంపుసం
పదనింపన్ నునునాఁచుఁ బాసి చనఁ బైఁపై ద్రోచి నాడీప్రభే
దదశన్ లోనమృతంబు గాంచుయతిచందం బొప్ప నెత్తావిఁ జొ
క్క దృగబ్జంబులు తత్సరోబ్జములమాడ్కిం బూన నీరాసఁగన్.
| 201
|
| ఉ. |
ఆనినదంబు మోక్షవివశాత్ముఁడు దక్షిణకర్ణదీర్ఘఘం
టానినదంబురీతి విని నానెగు లింక హరింపవే దయా
ధీన యటంచు జక్కవలదీనరవంబునఁ దెల్పి మ్రొక్కఁగా
బూనెనొ! నాఁగ నక్రి కవిపుంగవుపాదము పట్టెఁ బట్టినన్.
| 202
|
| శా. |
ఏభాగ్యంబు ద్విజత్వ మొంది పరహింసేచ్ఛాచరత్సత్వలీ
లాభివ్యాప్తి వహించు టంచు గడద్రోయం బోలు నాదంతరే
ఖాభంగం బొనరించి తద్రహితభాగం బొంద వేలా? రస
జ్ఞాభిఖ్యం దగునీకు నన్ కరణి జిహ్వానాడియున్ ద్రెంచినన్.
| 203
|
| చ. |
అడఁగఁగ మ్రింగఁబూన నసదైదవకీల లతాగృహంబులో
నడరెడులీలఁ దజ్జఠర మట్టె సొరన్ దన కెల్లఁ దక్కఁబో
యెడుకడి గాదు నా కనఁగ నెమ్ములు ప్రేవులతం డగల్ప బె
గ్గడిలి భరింపరానివెత గ్రమినతోన విషంబు ద్రావినన్.
| 204
|
| ఉ. |
తొట్టిననీటి కడ్డముగ ద్రొబ్బినప్రేవులముద్దమట్టిచేఁ
బెట్టినపొట్టివేలుపుగఁ బెన్గడుపున్ ఖురళిన్ క్షుధాఖ్యకున్
బట్టగుజెట్టిగొట్టి మయిఁ బాటిలునెత్తురుచెమ్మమట్టితో
నట్టె కడిందిజెట్టివలె నాతఁడు వేల్వడ నక్రి యంతలోన్.
| 205
|
| సీ. |
సరిప్రొద్దుకడ నెట్లు మెఱుఁగెక్కెఁ బరిపూర్ణచంద్రబింబముతోడ సారసములు
ఘన మెందుఁ గన మెట్లు గనుపట్టె శిఖిపింఛకలనతో మీఱుక్రొక్కారుమెఱుఁగు?
పండువెన్నెల గాయుపట్ల నెట్లు స్రవింప కందమై చందురా లతిశయించె?
నరుణకాంతివిలాస మలవొందు నెలవందు నడఁగ కెట్లు రహించె నుడుగణంబు?
|
|
| తే. |
లని మహాద్భుతగతి మించ నర్హమైన, మొగము కన్నులు కొప్పు మై నగవు చెక్కు
లడుగులు నఖంబు లఖిలమోహనత నినుప, నమ్మకరి యప్పు డొకముద్దుగుమ్మ యయ్యె.
| 206
|
| చ. |
అమితదినంబు లాసరసియందె వసించుటఁ జేసి తద్విలా
సములె ఘటిల్లెనో యనఁగ జక్కవచన్నులు కల్వకన్నులున్
భ్రమరశిరోరుహంబులు తరంగవళుల్ బిసబాహు లొప్పఁగాఁ
గొమిరె చెలంగె రాహుముఖగోళము వాసినచంద్రరేఖ నాన్.
| 207
|
| సీ. |
అరజాఱుపయ్యంటచెరఁగు వెన్కకుఁ దీసి బిగియ ముంగటిమీఁద బెరయఁ జెక్కి
కరకంకణశ్రేణి కదియ ముత్తెపుఁగుట్టుఱవిక కైముంజేతికవల ద్రొబ్బి
యలిక మంటెడుముంగురులకెంపుబుగడలు చెవిచాయకడకొనఁ దవుల దువ్వి
మొదటిరూపము గన్నమురివంపుచెలువంపుగరువతనంబు మౌగ్ధ్యమున మాటి
|
|
| తే. |
యడుగులట మెట్టకెందమ్ము లడరఁజేయ, నొయ్యనొయ్యన వచ్చి యాయ్యపాద
ములు నిరీక్షోత్పలములఁబూజలు ఘటించి, కరములు మొగిడ్చి వినయోక్తిఁ గలికి వలికె.
| 208
|
| మ. |
జయ సంసారమహాంధకారతరణీ! సౌవర్ణభూభృద్ఘృణీ!
జయ నానాగమతత్త్వభవ్యసరణీ! సద్భక్తచింతామణీ!
జయ దుష్టాసురజీవమారుతఫణీ! చంచత్ప్రతాపారణీ!
జయ సాధూత్తమచిత్తవారణసృణీ! శాఖామృగగ్రామణీ!
| 209
|
కందగర్భితశార్దూలవిక్రీడితము
| |
నీ కే మ్రొక్కెదఁ బ్రోవు మున్నతకృపానిర్మాణదివ్యత్కటా
క్షా! కాకుత్స్థకులాగ్రగణ్యకరుణాకల్పా! యనల్పవ్రతా!
పాకారిప్రముఖస్తుతప్రతిభ! దుర్భావాక్షశిక్షైకద
క్షా! కోకాప్తరుచిప్రకార! గుణనిస్తారా! సమీరాత్మజా!
| 210
|
| ఉ. |
ఎవ్వఁడు వార్ధితోడఁ దరియించె భవాంబుధి రామముద్రతో
నెవ్వఁడు యోగముద్ర ధరియించె నిశాచరరాట్పురంబుతో
నెవ్వడు కొంచెపుంబురి దహించి రహించె యశోవిభూతిచే
నవ్విబుధాగ్రగణ్యు నిను నార్తశరణ్యు భజింతు పావనీ!
| 211
|
| చ. |
జడగతికొగ్గి పంకమున సగ్గి దరాతిశయస్థితిన్ బ్రియం
పడి వడిసుళ్లఁ బె ల్లడరి భంగము వాయక యింతకాల మేఁ
బడినయవస్థ నీకరుణఁ బాసి నిమేషములో నిజాకృతిం
బడసితి నీవిచిత్రమహిమం బిఁక నే మని నే నుతించెదన్.
| 212
|
| మ. |
అమృతోత్పాదికి నీరు చూపునటు లయ్యా! నీకు నే నొక్కకార్యము సూచించెదఁ గాలనేమి కుహనాధ్యానస్థుఁ డై దుష్టస
త్వముతోఁ దానును బోనియీసరసిఁ జెందం జేసి మి మ్మిట్టిక
ష్టమతిం గెల్చి ప్రయాణమందుఁ డన నక్షద్వేషణుం డి ట్లనున్.
| 213
|
| క. |
కరివైరిమధ్య! నీవు మ, కరివైఖరి మొదటఁ బొలిచి క్రమ్మఱ బింబా
ధర వై గనిపించుట క, చ్చెరువయ్యెడు నొడుపు మనినఁ జెలి యి ట్లనియెన్.
| 214
|
ధాన్యమాలి తనశాపవృత్తాంతమును హనుమంతునకుఁ జెప్పుట
| మ. |
కరుణాసాగర! నాయుదంత మరయంగా వింత రంభోర్వశీ
హరిణీముఖ్యసురాంగనల్ చెలులుగా యజ్వల్ మహాఘోరసం
గరముక్తాంగులు మేటికాముకులు గా గానాదివిద్యాసము
త్కరసంచాలిని ధాన్యమాలిని యనంగా మించుదివ్యాంగనన్.
| 215
|
| క. |
కైలాసంబునఁ గంఠే, కాలుం డొకనాఁడు ప్రమథగణములతోఁ బే
రోలగి మున్నెడ నేనా, మేళముతో నేఁగి మ్రొక్కి మృడునియనుజ్ఞన్.
| 216
|
| సీ. |
కామసింహము గెల్వఁగల బిరు దనఁగ సింగపుతలాటపుసీలికాసె యెసఁగ
నడ లభ్యసింపఁ జేరెడునంచకవఁ బోలి యిరువంక ధవళచామరము లొలయ
నలికరేఖకుఁ బోల కళుకుక్రొన్నెలలీల నెలవంకబావిలీ చలనమంద
నంగముల్ లోకమోహనము లంచు గణించుగరిమ శబ్దకళాసికలు చెలంగ
|
|
| తే. |
హొయలు కప్రముసిరములయొఱపుతిరుపు
లాగు మైసరిబెళుకుపల్లటియుఁ గులుక
జక్కిణి నటించి నను మెచ్చి శంభుఁ డిచ్చె
మానికవిమాన మొక్కటి వానరేంద్ర!
| 217
|
| ఆ. |
ఆవిమాన మెక్కి జీవి మానక మేని
తావు లన్నిదిశల నావరింప
సుచితగతుల మెలఁగు చొక్కనాఁ డీజలా
శయమునందుఁ గేళి సలుపువేళ.
| 218
|
| క. |
రెండునయనములు మొగిచి ప్ర, చండతపోనిష్ఠ నుండుశాండిల్యమునీం
ద్రుండు జలరవము దనచెవి, నిండినఁ గను దెఱచి చూచి నివ్వెఱ దవులన్.
| 219
|
| సీ. |
చరణముల్ గన రక్తి సంధిల్లెఁ బ్రపదంబు లింతగాంచినఁ గ్రియ లెల్ల ముణిఁగె
జంఘ లన్వేషింప శరధినిమ్నత మానె మిహి తొడల్ చూడ లో మెత్తవడియెఁ
|
|
| |
బిఱుఁదు గన్గొన్న నిబ్బరపుటబ్బుర మబ్బెఁ గౌను చూచినఁ దాల్మి లేనిదయ్యె
నాభి వీక్షింప డెందపుఁదమ్మి సుడివడె నా రరసిన హరిధ్యాన ముడిఁగె
|
|
| తే. |
వలిచనుంగవ దృష్టింప బలిసె మేలు
మొగము దర్శింపఁ గళ రేఁగె సొగసుకప్పుఁ
గొప్పుఁ దిలకింప బలుతమి గప్పుకొనియె
జటిలచక్రేశ్వరునకు నాశ్చర్యముగను.
| 220
|
| ఉ. |
చూచినచూపు ద్రిప్పుకొనుచొ ప్పతఁ డప్పుడు గానకున్నచో
నాచిగురాకుబాకుతురకాయన కో యని యార్చి జాజినే
రాచెయిఁ బూచి వైచె మునిచంద్రుని చిత్తము వ్రయ్య నంతలో
రాచిలుకల్ రొతల్ గులుకురాయిడితెమ్మెరదొమ్మి గ్రమ్మినన్.
| 221
|
| తే. |
జపతపంబులు చాలించి శాంతి డించి
తమకమున లేచి యడుగులు తడఁబడంగ
వడి నిగుడ మేను పులకింప వచ్చి నిలిచి
పలికెఁ బలుకుల నునుఁదొట్రుపాటు గదుర.
| 222
|
| మ. |
అడుగుల్ కెంజిగికుంకుమంబు ధర కియ్యన్ మేను బై లెల్లఁ బు
త్తడిసేయన్ నునుచూపు లెల్లెడల నిద్దాకల్వపూమేలుక
ట్లడరింపన్ నడయాడుమించువలె నొయ్యారంపులేఁబ్రాయపుం
బడుచా! మించఁ జరించఁ గాంచి భరియింపంజాల మన్నింపవే!
| 223
|
| ఉ. |
నీముఖపూర్ణచంద్రకళ నిండిన మోహతమంబు
గ్రమ్మె నీ
మైమెఱుఁ గావరింప నియమంపుమయూరము చిక్కె నీవళి
స్తోమతరంగముల్ వెలయఁ దోరపుఁ గాఁక జనించె నీదృగ
బ్జామితలీలచే ధృతిమదాళి చలించె నిదేమె? కోమలీ!
| 224
|
| చ. |
ఎలనగ వంకురింప మొగ మెత్తి కనుంగొనరాదొ మేనఁ గ్రొం
బులక లెసంగఁ బై నొరఁగి పొంకపుఁజన్మొన లుచ్చిపాఱఁ గౌఁ
గిలి దయసేయరాదొ విడికెంపులకెంపు నడంపుమోవితే
నెల వడ దేర్పరాదొ దమి నిల్పఁగరాదొ వధూటి! నాయెడన్.
| 225
|
| క. |
ఇప్పు డొకమాట చెప్పవె, తప్పక యోయొప్పులాఁడి తప్పునొడువులన్
నొప్పించెదొ నీమది రతి, కొప్పించెదొ నన్ను మరున కొప్పించెదవో.
| 226
|
| క. |
అని తనఘనవర్తనమున, కనుచిత మగుపలుకునమ్మునిమూర్ధ
న్యునిఁ గనుఁగొని వినయము నయ, మెనయ నిజం బావహిల్ల నే నిటులంటిన్.
| 227
|
| తే. |
అమ్మ నేఁ జెల్ల మునినాగ మిమ్మువంటి
పెదలకు నింతవలవంత పెరిమ యగునె?
యల్పసుఖ మింతె యింత లేదనక యింత
పాలుమాలినఁ దప మెల్లఁ దూలిపోదె?
| 228
|
| శా. |
అంతర్నాదసుఖంబుకంటె ఘనమే? యయ్యో! రణత్కంకణా
క్రాంతక్వాణధురీణనూపురమణీకాంచీరవప్రస్ఫుర
త్కాంతాకంతురణోజ్వలన్మణిత మాకర్ణింప నేలయ్య? వి
భ్రాంతిం జెందెద రింతమాత్రకె మునీంద్రా! యన్న నాతం డనున్.
| 229
|
| సీ. |
సుదతి! నీనెమ్మోము చూచినంతనె కల్గె ద్విజరాజదర్శనోద్వేలఫలము
కలికి! నీచిఱునవ్వు గనినయంత ఘటిల్లెఁ జంద్రికావిభవవీక్షాఫలంబు
వనిత! నీమోవి గాంచినయంత జేకూరె నరుణబింబాలోకనాతిఫలము
చెలువ! నీకంఠ మీక్షించినంతఁ బొసంగెఁ బరమశంఖనిరీక్షఁ బ్రబలుఫలము
|
|
| తే. |
అతివ! నీయారు దర్శించినంత దొరకె నీలవర్ణవిలోకనిర్నిద్రఫలము
తరుణి! మఱియింతకంటెను దపము చేసి, యేను బ్రాపింపఁగలఫలం బేమి చెపుమ?
| 230
|
| క. |
వాతెఱ ఫలంబు చెక్కులు, నాతిరొ! లవలీదళములు నాభి సర మురో
జాతములు గిరులు నై తగ, నేతెఱఁగునఁ దపసి వదలు నిన్నియుఁ గనియున్.
| 231
|
| ఉ. |
అట్టిటు మాటలాడి విరహాంబుధి ముంచక నన్ను నీదుచ
న్గట్టులఁ జేర్చుకొమ్మనుచు గ్రక్కునఁ బైఁబడి రా జటీంద్ర! హా!
ముట్టకు మే రజస్వలను మూఁడుదినంబులదాఁకఁ దాళుకొ
మ్మెట్టులనైన మీఁద ఘటియించెద నీపదసేవ నావుడున్.
| 232
|
| క. |
మొగ మింతై వగవింతై, తగవు దలఁచి నిలిచి యెటులు దమి నిలుపుదునే?
మగువా! మూడుదినంబులు, దగవా? ఖగవాహసుతునిధాటికిఁ ద్రోయన్.
| 233
|
| చ. |
అలరుకటారిమన్నెదొరయాయుధశాల సమీర మల్లసం
కులఖురళీస్థలంబు మదకోకిలషట్పదరాజకీరమం
డలి బెడిదంపుమ్రోఁతలకొటారు వనం బెటులొంటి నిల్వఁగాఁ
గలఁ డొకబ్రాహ్మణుం డనక కామిని! యేమని పాసిపోయేదే?
| 234
|
| ఉ. |
నీరహిఁ బల్కుచిల్కలకు నీనునుఁగొ ప్పన నొప్పుతేటికిన్
నీరుచిరాంగవాసనల నెక్కొనుగాలికిఁ గొంతయోర్చెద
న్వేరెవరాకుగాక తరుణీ దివసత్రయి సన్నఁ దానమై
మేర దలంచి రాఁ దగుసుమీ యని యమ్ముని యెట్టకేలకున్.
| 235
|
| తే. |
ఒప్పుకొని వల్మఱును జెప్పి యొకవిధమున, నవలి కేఁగిన నతనిమోహంపుఁగోర్కి
కియ్యకొని వచ్చుదాననై యేను గంధ, మాదనాద్రికిఁ జనియున్న మౌని యచట.
| 236
|
| మ. |
మరుక్రూరాస్త్రభయాప్తిఁ గుంజము సొరన్ మత్తాళి మల్లాతిదు
స్తరహల్లోహలశబ్దమం దడర సంతాపించి చూతంబు డా
య రటత్కోకిలపఙ్క్తు లాడ వెత సేయన్ నిల్వశంకించి వెం
బఱవిత్తై నలువంకలన్ ముని స్మరాపస్మారలోలాత్ముఁ డై.
| 237
|
| మ. |
అడలన్ షట్పదఝంకృతుల్ దొరయునో యన్ భీతి నంకర్నద
శ్రమణం బొల్లఁడు వెన్నెలల్ వెలయు నన్ శంకన్ స్వనాసాగ్రదృ
ష్టి విరాజిల్లఁడు చంద్రు పే రెసఁగు నన్ చింతాస్థితిన్ రాజయో
గవిధం బూనఁడు గాడ్పుఁ బట్టఁడు మదాకారంబె చింతించుచున్.
| 238
|
| ఉ. |
చందనగ్రంధవాహశిశుసంచలదంచితచూతపల్లవా
ప్తిం దగుకోకిలంబురొద బి ట్టడరన్ దనుఁ బిల్చెనో యటం
చందుల కేఁగి చూచి మరుఁ డంది వెసన్ జళిపించువాలురీ
తిం దిలకించి హా గుణవతీ! యిఁక నెప్పుడు పిల్తువే యనున్.
| 239
|
| ఉ. |
కొ ప్పొకచేతఁ బట్టి తళుకున్ నునుఁజెక్కిలి నొక్కి తేనియల్
చిప్పిలు మోవి వంటఁ దగిలించుక సీత్కృతి నింపఁ గెంపులం
గప్పి కవుంగిలించుకొనుగాఢత మున్నుగ నీవి వీడగా
ముష్పిరిగొన్నమోహమున ముద్దియఁ గూడి సుఖించు టెన్నఁడో.
| 240
|
| క. |
అని పలికినదే పలుకుచుఁ, జనినయెడకె చనుచుఁ గనినచెక్కియె గనుచున్
దినములు మూఁ డెటువలెఁ జను, ననువనటన్ మౌని దలఁక నమ్మొదటినిశన్.
| 241
|
చంద్రోదయవర్ణనము
| సీ. |
నిశ చకోరద్విజనికరంబునకు నిడ్డ కెంపుటక్షతలపొన్గిన్నె యనఁగ
సమయబాలుఁడు వైవ నమరు క్రొంబచ్చెనఁ గడుహెచ్చుగొడుగుబొంగర మనంగ
గగనవాణీవధూకంఠభాగంబునఁ బొలుపుమీఱిన తాలిబొ ట్టనంగ
హరశిరోరుహసంగ యగుగంగలో నొప్పుకమనీయనవ్యకోకనద మనఁగ
|
|
| తే. |
జంద్రుఁ డుదయించ వెన్నెలల్ జగతి మించ, నప్పు డప్పర్వతంబుపై నలరుతావి
బుగులుకొనునొక్కపచ్చరాజగతి నుండి, ఠాయిగా నేను గానంబు సేయువేళ.
| 242
|
| ఉ. |
అచ్చటి కేఁగుదెంచినదశాననుఁ డంతయు నాలకించి యే
యచ్చరమచ్ఛెకంటియొ గదా! యని మెచ్చి మదగ్రభూమికిన్
|
|
| |
వచ్చి జగత్త్రయిన్ గెలిచి వచ్చిననన్ విరివిల్తుఁ డమ్ములన్
గ్రుచ్చి జయించె నింకఁ గయికొ మ్మని నెట్టనఁ జెట్ట వట్టినన్.
| 243
|
| తే. |
దీనమానస నై పరాధీన నగుట, యును రజస్వల ననియు నాతనికిఁ దెలుప
వేశ్య కెక్కడిపరతంత్రవృత్తి? యదియుఁ, గాక పుష్పిణి వగుట సౌఖ్యంబె యనుచు.
| 244
|
| చ. |
బలిమి భుజామృణాళములు పట్టి పయంట దెమల్చి గబ్బిగు
బ్బ లలమి మోవికెంజిగురు పల్మొన లంటఁగ నజ్జునజ్జుగాఁ
బలుమఱు నొక్కి పేరురముపై మృదులాంగముఁ జేర్చి మోహ మ
గ్గలమయి యున్కి నింగితము గాంచక మించి రమించి నొంచినన్.
| 245
|
| తే. |
అంతలోపల నతికాయుఁ డనుకుమారుఁ
డుదయ మొందిన సుతుఁ గొంచు ముదముఁ జెంది
యతఁడు సనియెఁ ద్రిరాత్రంబు లైనఁ దాన
మేను గావించి మునిఁ జేర నేఁగుదేర.
| 246
|
| ఉ. |
వాఁడినమేను నజ్జయినవాతెఱయున్ గడువిన్నఁబాటుతోఁ
గూడిన నెమ్మొగమ్ము దడరు న్నడ లంతకు మున్న తెల్పనా
జాడ యెఱింగి నెమ్మది పొసంగక రాగము కన్నులందుఁ దో
డ్తోడ నెసంగ నజ్జటిలధూర్జటి పల్కె రదాళి గీటుచున్.
| 247
|
| ఉ. |
ఏను వరించియున్నతమి యించుక గాంచక కొంచ కెంచ కె
వ్వానికి జవ్వనం బొసఁగి వచ్చితివే? మటుమాయలాఁడి! యే
హీనుఁడు నన్నుఁ గైకొన్న యింత యకృత్యము చేసె నయ్యయో!
యేనియమంబు వేశ్యకన నేటికిఁ జేసితిఁ? గాంక్ష నీయెడన్.
| 248
|
| ఉ. |
చిత్తము వంచుటో హరి భజించుటొ బంధము లూడ్వ ధైర్యపుం
గత్తి భరించుటో నియతి గైకొని మించుటొ యాత్మఁ గాంచుటో
చిత్తజరోగముల్ పెనుచు నీ కసుమాలపుఁదోలుబొమ్మతో
హత్తుట లేమి? పొమ్మన కహమ్ములు మూఁడు వితా క్రమించితిన్.
| 249
|
| తే. |
ఒకనితో మాటలాడి వేఱొకనిఁ గూడి
యొకనిమనసున నెంచి యొండొకని నొంచి
యెవ్వనికి మర్మ మీని మీ కెల్ల మొదలఁ
బుట్టఁగాఁ బుట్టినవి గావె యిట్టివగలు.
| 250
|
| ఉ. |
కాయము చూత మన్న నతికష్టము నెమ్మది యన్న వక్రభా
వాయతనంబు మోహగుణ మన్నను జంచలచంచలాలతా
|
|
| |
ప్రాయము గ్రామ్యధర్మసుఖ మన్నను స్వల్ప మనేకదోషనిం
దాయుత మింతె కాక కలదా? సుఖ మింతులయం దొకింతయున్.
| 251
|
| శా. |
శీలక్ష్మాధరవజ్రిధారలు దయాసింధూజ్జ్వలద్భాడబ
జ్వాలల్ లోభమృషాభిమానమదహింసాజన్మభూముల్ వృథా
కాలక్షేపవిధాదికారణలు జాగ్రత్కీర్తిబాలానిల
వ్యాళస్త్రీలు వివేకపాకసుకృతవ్యాపారసారంగశా
ర్దూలల్ కొమ్మలు వీరి నమ్ముదురె సాధుశ్రేష్ఠు లెప్పట్టునన్.
| 252
|
| ఉ. |
కామిని! నిన్ను సాధనముగాఁ గొని కాముకకోటి గెల్చున
క్కామునిటెక్కెపుందెఱఁగుఁ గాంచి విచారము డించి నక్రి వై
యీమెయిఁ బాసి యుండు మిల నేను వరించిన నిన్ను బల్మిమైఁ
గామశరార్తిఁ గైకొనినకష్టుఁడు కామినివంక నే చెడున్.
| 253
|
| ఉ. |
తప్పదు పొమ్మటన్నఁ బరితాపము శాపముఁ గ్రమ్మఁ గన్నులన్
జిప్పిలుశోకబాష్పములచే జడదారికిఁ బాద్య మిచ్చి యీ
తప్పు ఘటిల్లె నక్కుటిలదైత్యబలాత్కృతివంక నింక నా
యెప్పటిరూప మెప్పుడు వహింపఁగలానొ వచింపరే యనన్.
| 254
|
| ఉ. |
ఆమునిరాజు క్రమ్మఱ దయార్ద్రమతిన్ ననుఁ జూచి "సిద్ధసా
ధ్యామరయక్షకిన్నరముఖార్తితమోడహృతిక్రియామహో
ధాముఁడు వాయునందనుఁడు దాశరథిప్రియుఁ డిందు వచ్చి నీ
బాము హరించి పోవు" నని పల్కి చనెన్ వినవే గుణాంబుధీ!
| 255
|
| ఉ. |
ఒక్కొకచోఁగదా మకరికోజ్జ్వలతల్ వహియింతు రెక్కడన్
జక్కెరబొమ్మలా గతి పొసంగక తాపసశాపసంగతిన్
గ్రక్కునఁ గోమలాంగ మఱి కర్కశదేహము గల్గె నంతలో
నెక్కడఁ బోయెనో గుణము లే నెఱుఁగన్ మకరిత్వ మొందితిన్.
| 256
|
| శా. |
శాండిల్యుండు గణించినట్ల తెలిసెన్ స్వామీ! భవద్విక్రమా
ఖండప్రాభవ మాఁడుదానఁ బొగడంగా నేర నేఁబోయెదం
దండం బాశ్రితరక్షణప్రవణ! మీదాసిం దయాదృష్టిఁ జూ
డుండీ యంచు విమాన మెక్కుకొని వీడ్కొన్నం గపిస్వామియున్.
| 257
|
| మ. |
తనలోఁ జేరి త్రిలోకభీకరమహాదర్పయినం బేర్చున
క్రిని జక్కాడినఁ దత్సరఃకమలభృంగీనాదసంపత్తి దీ
|
|
| |
వన గావించి ప్రఫుల్లకైరవరజోవ్యాసక్తహేవాకమో
హనమందానిలయుక్తి గందవొడిమై కర్పింప మోదించుచున్.
| 258
|
| తే. |
కపటమునివేషమున నున్నకాలనేమి, నపుడె వైవస్వతునివీటి కతిథిఁ జేసి
కహకహార్భటి నభ్రమార్గమున కెగసి, యతిజవంబున ద్రోణపర్వతముఁ జేరి.
| 259
|
| మ. |
రతనంపుంజిగినించుకూటములు మీఱం జండవేదండవి
శ్రుతగంధర్వసమృద్ధి వర్ధిలఁ దృణజ్యోతిర్లతాదీపికా
తతి నల్వంకలఁ దోఁప సాను లిరవొందన్ గహ్వరన్ బొప్పఁగా
క్షితిభృత్సంజ్ఞ నిజంబు సేయుశిఖరిన్ గీర్తించె సౌమ్యస్థితిన్.
| 260
|
| ఉ. |
ఓనగచక్రవర్తి! సుగుణోర్జితకీర్తి! జగద్ధితంబు రా
మానుజుప్రాణరక్షకుఁ ద్వదౌషధముల్ గనిపింపు మన్న స
న్మాన మెఱుంగ కగ్గిరి ప్రమత్తతఁ జెందెఁ గఠోరగహ్వరం
బూనెడుగట్టువాయులు మృదూక్తిస్వభావము పూన నేర్తురే.
| 261
|
| వ. |
ఇత్తెఱంగున మొఱకుందనంబున సరకుగొనని కఱకుమలం జుఱుకుచుఱుకునం
గనుంగొని.
| 262
|
| చ. |
అడరి ధరాధురంధరుల నందఱఁ దాల్చు మహాఫణీంద్రుఁడే
పుడమి సుమిత్రపట్టి యయి పుట్టి సురద్విషదగ్రగణ్యుచేఁ
బడి యటు లున్నవాఁ డతఁడు ప్రాణము లొందఁగ మందు లిమ్మటం
చడిగిన మేల్ దలంచికొనవైతి కృతఘ్నత భూధరాధమా!
| 263
|
| సీ. |
పలుధాతురాగదంభమున నెప్పుడుఁ గిన్కచే బలె మో మెఱ్ఱ చేసికొనుట
పలుకూటములఁ గూడి పరవంశదహనసంపత్తి నొక్కకచోటఁ బ్రబ్బికొనుట
బహుగనుల్ గొనియు దుర్భరతచే ద్విరసనప్రాప్తి నెత్తములసొం పందుకొనుట
పాదంబు సాను లెప్పటికిఁ జెందిన శృంగమిషమున మిన్నంది మెండుకొనుట
|
|
| తే. |
నీకు నైజంబు లివి యెల్ల నేఁ డడంతు, చూడు న న్నని పవమానసూనుఁ డడరి
చండదోర్దండలీల నక్కొండదండ, దండధరుఁ జెండుచండీశుదండి నిండి.
| 264
|
| స్రగ్ధర. |
పంచాస్యధ్వానశంకన్ బ్రమదకరిఘటల్ పర్వు లెత్తం దటోర్విం
జంచద్విద్యాధరస్త్రీజనము పతులు మెచ్చన్ హఠాశ్లేషముల్ గ
ల్పించన్ దన్ బ్రోచువారిన్ బెదరి కుధరమే! పిల్చెనో నా గుహల్ ఘో
షించన్ గర్జించి తమ్మిం జెనయుకరిగతిన్ శ్రీహనూమంతుఁ డంతన్.
| 265
|
| చ. |
పదహతిఁ జుట్లపాదములు భగ్నము లై చన మందరంబుచు
ట్టొదవినసర్పరాజుతెఱఁ గొప్పఁగ వాలము గట్టుచుట్టుఁ జు
ట్టి దిటవువాపుటన్ గిరి కడిందివెతం గనుబాష్పవైఖరిన్
బొదలి ఝురంబు లెల్లెడలఁ బోవఁ బెకల్చి వహించి పోవఁగన్.
| 266
|
| శా. |
గంధర్వుల్ పదుమూఁడుకోటులు మహోగ్రక్రోధరక్తాస్యు లై
సింధూదగ్రగభీరఘోషముల నాక్షేపించి యిక్కొండ గ
ర్వాంధత్వమునఁ గొంచు నెం దరిగెదం చగ్గంధవాహాత్మజుం
గంధేభంబు నెదుర్చుదోమగమిజోకన్ వీఁకమైఁ దాఁకినన్.
| 267
|
| మ. |
పదివేలర్కులరూపుఁ జూపెడు ప్రతాపస్ఫూర్తి వర్తిల్లఁ ద
న్మదజంబాల మడంచుఘోరకరచండవ్యాప్తి శస్త్రాదిగా
ఢదశోద్భూతతమిస్రముల్ విరియఁ గ్రీడన్ వాల మల్లార్చి పె
ల్లదరం గొంతులఁ జుట్టి మింటి కెగవేయన్ వారు భీతాత్ము లై.
| 268
|
| చ. |
తునిసినకాలుచేతులును దోరపునెత్తుటఁ దోఁగుమేరులున్
ఘనపడతాడనంబుల వకావక లైన యురంబు లూని యో
వనచరనాథ! నన్ దొడర వచ్చిన నేరము గాచి కొండఁ గై
కొని చను మింక దీనులము కోపము నిల్పకు మంచు మ్రొక్కినన్.
| 269
|
| ఉ. |
ఆదరదృష్టి వారిఁ గని యక్కపిరాజు భుజాగ్రపీఠిపైఁ
బాదుగ నిల్పుకొన్నగిరి భాసురసానుతటీచిరత్నర
త్నోదితకాంతు లంధతిమిరోద్ధతి మాన్చి పదంబు సూప రా
నాదట మాల్యవంతుఁడు దశాననుపంపున శౌర్యవంతుఁ డై.
| 270
|
| క. |
మేటినిశాటులు దశశత, కోటులు గొలువంగఁ బరశుకుంతక్షురికా
ఝాటము మీటుగ నక్కపి, జూటునఁ గని ధాటి కెదిరి శూరతఁ బలికెన్.
| 271
|
| శా. |
ఓరీ వానర! సత్వరంబు గల దం చూహించియో యిట్లు ప
ల్మారున్ మందులగట్టుఁ దెచ్చె దిఁకి నేలా పేర్మి నాముందరన్
బోరా దీశ్వరకేశవాదులకు నంభోరాశి నీశైలముం
బాఱన్ వైచినఁ బోవనిచ్చెదను నిన్ బ్రాణంబుతో నావుడున్.
| 272
|
| శా. |
ఆరామక్షితినాథుబంటు నిడుతోఁ కల్లార్చి యేమంటివో
రీ రాత్రించర! గట్టుమా ఱిపుడు వార్థిం దావకీయాంగ మే
పాఱన్ వైచెద బంటవై నిలువు నీపాలింటికాలుండ నే
నే రా యంచుఁ బ్రదీప్తపావకశిఖల్ నేత్రంబులం జూపినన్.
| 273
|
| ఉ. |
బింకపు మాటలాడి వెఱపించి వనాటుఁడు పాఱఁజూచె రం
డింక నిశాటులార! చననియ్యక పట్టుడు గట్టుఁ డంచు ని
శ్శంకత మాల్యవంతుఁ డనఁ జక్రశరాసనముఖ్యసాధనా
లంకృతహస్తు లై కపిలలాముని దాఁకి సురారు లీసునన్.
| 274
|
| శా. |
దేహచ్ఛాయలఁ జీఁకటుల్ బలియ నుద్రేకించి శస్త్రాస్త్రసం
దోహంబుల్ నిబిడంబుగాఁ గురిసి రోధోభేదిధిక్కారగ
ర్జాహుంకారము లంకురింపఁ గన లెచ్చన్ దీర్ఘవాలంబుచే
నాహేతిప్రముఖాయుధచ్ఛటలు మాయం జేసి యమ్మేటియున్.
| 275
|
| సీ. |
విమతభుజాభుజంగమగర్వతమ మార్చుతఱిఁ బతంగవరప్రతాప మంది
యహితోత్తమాంగశృంగాదికముల గెల్పువేళ ధృతాశనిలీలఁ జెలంగి
పరనైకనాళీకబహుళహేతు లడంచునెడ ఘనప్రబలత్వ మెఱుకపఱిచి
విద్విషత్పురసముద్వేలలీలలు మాన్చుచోట నుగ్రసమగ్రధాటి నాటి
|
|
| తే. |
మూఁక నెల్లను నిశ్శేషముగ వధించి, దండి చూపిన మాల్యవంతుండు గినిసి
కార్ముకమునారి సారించి ఖరశరములు, ఘనము నిర్ఘాతతతి నీనుకరణిఁ గురియ.
| 276
|
| ఉ. |
అన్నియు వాలహస్తచటులానిలశక్తి శరాఖ్య నిక్క మొం
ద న్నడుమన్ దళించియు రణంబునఁ దార్క్ష్యుఁడు పాపతున్కఁ దాఁ
దన్నెడుచెన్నునన్ దనువుఁ దన్నిన మందులగట్టు కొన్న ని
ద్వన్నతు గిట్టి బెట్టుగద వైవ నురస్స్థలి దాఁక నుగ్గుగాన్.
| 277
|
| శా. |
చేశూలంబు దళించి వైచిన హుతాశజ్వాలికాభీల మై
రాశూరాగ్రణికేలఁ దట్టి దిగజాఱన్ ఖడ్గ మంకించి యా
కాశం బంటినమంట నొంటిముదిరాకాసిన్ సునాసీరము
ఖ్యాశాధీశులు మెచ్చఁ బార్ష్ణిహతి డయ్యం జేసెఁ గయ్యంబునన్.
| 278
|
| శా. |
ఆలో మూర్ఛిలి తేఱి వైరిపయిరా నక్షారి తత్కంఠమున్
వాలాగ్రంబునఁ జుట్టి వార్ధి బడవైవం గూలి దుష్కీర్తిజం
బాలంబుంబలెఁ బంక మంగ మెనయన్ భంగంబునం దూలి పా
తాళద్వారముఁ బట్టి యట్టె సనియెన్ దర్శించుదివ్యుల్ నగన్.
| 279
|
| శా. |
జేజేరాజులు పూలవానలు ప్రవర్షింపన్ మహోత్కర్షహ
ర్షాజేయుండయి యేఁగుదెంచి నిజబాహాగ్రాచలాధిత్యకా
భూజాతౌషధయుక్తి లక్ష్మణున సుస్ఫూర్తుల్ గనంజేసె న
య్యాజేయుం డనుజప్రదాయి యని డాయం బిల్చి నెయ్యంబునన్.
| 280
|
| మ. |
రవివంశం బనుపైరు మత్సహజమూర్ఛాకుత్సితావగ్రహా
ప్తి వికాసం బఱివోవ నీవు ఘనరీతిన్ భీతిఁ బోకార్పఁ బూ
ర్వవిధిన్ వృద్ధి వహించె నింకఁ బ్రతికారం బేది? నాచిత్తమే
భవదాయత్త మటంచుఁ గౌఁగిటను సంభావించి దీవించినన్.
| 281
|
| ఉ. |
అద్రిచరాధినాథులముదశ్రుజలంబులతో సుధాశిక
ల్పద్రుమపుష్పవర్షము లపారములై కురియన్ నిశాచరా
చ్ఛిద్రభుజాప్రతాపశిఖ శీతతఁ జెందఁ దదీయకీర్తిదీ
వృద్రుచిహంస మేఁగె దివియం దమరీశిఖనృత్యముం దగెన్.
| 282
|
| సీ. |
పడియున్నసౌమిత్రిప్రాణంబు క్రమ్మఱఁ బూన్ప మందులు దేరఁబూనుమైత్రి
పూని వార్ధిద్వీపభూము లన్నియు దాఁటి క్షణములో గిరిఁ జేరఁ జనెడుజవము
చని మందు లొనఁగూర్పు మని వేఁడినను గొండ యీకున్నఁ బెకలించి యెత్తుకడిమి
యెత్తి తద్రక్షకు లెంద ఱడ్డము సొచ్చి దురము చేసిన వారిఁ దునుముతెగువ
|
|
| తే. |
తునిమి తెరువున నేవిఘ్నమును బొరయక, వచ్చి బ్రతికించి యచ్చటివారిలోన
నొక్కరుం డయి గమకింప కున్నమహిమ, హనుమయెడఁ గాక యితరులయందు గలదె?
| 283
|
| మ. |
సమరాభీలుఁ డతండు శైలము యథాస్థానంబునం దుంచఁగాఁ
గమియింపం దశకంఠుఁ డంపఁ బటుసంగ్రామస్పృహన్ స్థూలజం
ఘమహాదంష్ట్రమహోదరాద్యసురసంఘాతంబు మార్కొన్నచో
నమితాహంకృతి నవ్వి రాత్రిచరులారా! నిల్వుఁడం చుద్ధతిన్.
| 284
|
| చ. |
శిరములు ద్రెంచి కంఠములు చించి కరంబులు ద్రుంచి శస్త్రముల్
శరములు నొంచి మించి నిమిషంబున సేన నడంచి యమ్మహో
దరముఖసైనికాగ్రణుల దక్షిణదిక్పతిఁ జూడఁ బంచి త
ద్గిరి నలచోట డించి చనుదెంచి రఘూద్వహుఁ గాంచి రంజిలన్.
| 285
|
| సీ. |
వానరావళి కెల్ల వజ్రంపుఁగోటయై వలనొందె నెవ్వానివాలవల్లి
పరగు నెవ్వనిపెంపు పాతాళలంకేశముషితరాఘవబంధమోక్ష మగుచు
నెల్లవేల్పులకీర్తు లీక్షింప నెవ్వానిసామర్థ్యమున శతాంశంబుఁ బోల
వెవ్వానికనుదోయి కిసుమంత మశక మై కనిపించుఁ గఱకురక్కసికులంబు
|
|
| తే. |
లట్టిజగజెట్టి గాడుపుపట్టి గట్టి
దిట్టతన మిట్టి దని మాటఁ బట్టుకొలువ
నెట్టివారికి బెట్టు నే నెట్టు లనఁగ
నెట్టుకొనువేడ్క విని శ్రోత యిట్టు లనియె.
| 286
|
| క. |
పాతాళలంకరాక్షసు, చేతం బట్టువడి రెట్లు శ్రీరఘువర్యుల్
వాతూలసూతి యిరువుర, నేతెఱఁగున దెచ్చెఁ దెలుపవే యని యడుగన్.
| 287
|
| మ. |
శరసంధారణ! ధారణప్రియమనస్సద్వాస! సద్వాసనా
సిరమాహృద్యశ! హృద్యశర్వనుతశ్రీసార! శ్రీసారసే
శ్వరతావాహన! వాహనప్రముఖతీవ్రత్యాగ! వ్రత్యాగమో
త్కరబృందారక! దారకత్వకృతయోధన్యాయ ధన్యాయనా!
| 288
|
| క. |
సారంగహరణ మునిజన, సారంగఘనాంగ! జనకజాహృన్నలినీ
సారంగ! దశముఖాసుర, సారంగవిభంగకార్యశౌర్యమృగేంద్రా!
| 289
|
| కవిరాజవిరాజితము. |
ప్రణుతసనందన! బంధురనందనపాలకనందననేత్రభిదా
చణ! శరపన్నగ! సాధువిపన్నగశక్ర! ప్రపన్నగణప్రమనా!
గణుతివికస్వర! కంధ్యధికస్వర! కంటకకస్వరధీశమనో
వ్రణపరిహార! కరప్రవిహారకరాజితహార! కళాచతురా!
| 290
|
| గద్య. |
ఇది శ్రీమదంజనాతనయదయారసలసత్కటాక్షవీక్షామహత్వసంప్రాప్తకవిత్వవిద్యా
వధాన సగుణనిర్గుణధ్యానవాసనాభిధానమానసబిసపుష్ప పుష్పగిర్యప్పనార్య
కుమార సమాశ్రితబుధాచార గురుజనవిధేయ తిమ్మననామధేయప్రణీతంబైన సమీర
కుమారవిజయం బనుమహాప్రబంధంబునందు గుణవర్ణనంబును రామసుగ్రీవసంధానం
బును సముద్రలంఘనంబును సీతాసందర్శనంబును రావణసంభాషణంబును రఘువీర
దర్శనంబును రామచంద్రునకు విభీషణుం గానుపించుటయు సేతుబంధనంబును
ధూమ్రాక్షాదిరాక్షసశిక్షయు మకరిశాపమోక్షణంబును లక్ష్మణప్రాణదానంబును
నన్నది తృతీయాశ్వాసము.
|
|