Jump to content

సమీరకుమారవిజయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

చతుర్థాశ్వాసము



ధర! రుచిదూరితధా
రాధర! ధరణీసుతాదిరాజిసుధాధా
రాధర! పరమాదరధా
రాధర! ధైర్యాభిరామ! రఘుకులరామా!

1


తే.

అవధరింపుము భూతదయాగరిష్ఠుఁ
డగువసిష్ఠుం డనియె గౌతమాత్మజునకు
విను శతానంద! యక్కపివీరుఁ డవల
సంఘటించినకార్య మాశ్చర్యముగను.

2


ఉ.

రావణుఁ డాంజనేయునిపరాక్రమమున్ రఘురాముఘోరబా
ణావళియుం దలంచి భయ మంది నిజాన్వయవాశ మెంచి చిం
తావిలుఁ డై యందున కుపాయము గన్గొని నాగలోకలం
కావిభుమాయదారిఁ జెలికానిఁ దలంచిన వాఁడు వచ్చినన్.

3


క.

తత్కాలోచితవార్తల, సత్కార మొనర్చి రామజనపతి దన కా
పత్కారి యగుట రాత్రిచ, రోత్కర మీల్గుటయు నొడిని యుడుకుచుఁ బలికెన్.

4


క.

నాపయిని వానరబలం, బేపొందఁగ నిన్నువంటిహితశీలుఁడు మా
యోపాయజ్ఞుఁడు గలిగియుఁ, జూపెట్టుక యుండుటకునె సువ్రత యనుడున్.

5


క.

లంకేశుతో రసాతల, లంకేశుఁ డదెంతపని చలంబున నరులన్
గొంకక కొని చని నాపురి, కంకాళికి బలి యొనర్తుఁ గనుఁగొను మనుచున్.

6


ఉ.

అప్పుడె వచ్చి యచ్చెడు గహంక్రియతోఁ దనపూన్కి పత్నికిన్
చెప్పిన నప్పయోజముఖి జిహ్వ దడంబడఁ బ్రాణనాథ యీ
చొప్పున కొప్పి రాఁదగునె? చొప్పడునే పెఱవారిమాటలం
గప్పిననేర్పునం జని జగత్పతి రామునిమాయఁ గప్పఁగాన్.

7

శా.

సాధింపం దరమే రఘూత్తముని దత్సన్మంత్రి యై భృత్యుఁ డై
మేధాశాలి జగత్రయైకనుతగాంభీర్యుండు ఖండేందుభృ
ద్వేధోముఖ్యుబుధేంద్రదత్తవరవర్ధిష్ణుప్రభావుండు సం
బోధాంభోధిమహాబ్జమిత్రుఁడు మరుత్పుత్రుండు వర్ధిల్లఁగన్.

8


క.

ఆతఁడు వానరమాత్రుఁడె, యాతతశత్రుకులజైత్రుఁ డఘటనఘటనా
స్వాతంత్ర్యశుభచరిత్రుఁడు, నీతరమా? యతనిఁ దొడరి నిలువఁగఁ బోరన్.

9


సీ.

కపటంపుజడదారిగతిఁ బూని యతనిచేఁ గడతేఱఁడే? నిన్న కాలనేమి
ప్రతిఘటింపఁగ నున్నబలుతోఁక వడి నొచ్చి సురుఁగఁడే మాల్యవత్సురవిరోధి
కామరూపము లూని గమకించి రణకేళి స్థూలజంఘాదులు దూలిపోరె?
చేకొండ విడు మంచుఁ జిత్రసేనాదికుల్ బవరంబులోఁ బడ్డపాటు వినమె?


తే.

అక్షధూమ్రాక్షదేవాంతకాదిదుష్ట, దైత్యవిధ్వంసనోద్ధురౌధ్ధతి యెఱుఁగవె?
కనియు వినియును జి చ్చొడిఁ గట్ట నేల?, చుట్టములకీడు పైఁ బూని గిట్ట నేల?

10


శా.

అక్షధూమ్రాక్షవిరోధి బాల్యమున బాలార్కుండు జంభాసుహృ
త్సౌధాగ్రస్ఫుటహైమకుంభనిభ మించన్ బింబబుద్ధిన్ నభో
వీథిం బోయి దినేంద్రునిం బొదువఁగా వీక్షించి రాహుగ్రహం
బాధిం జెంది పయోజసంభవున కయ్యాశ్చర్యముం దెల్పినన్.

11


మ.

విని రోషించి కషాయితాక్షుఁ డయి భావిబ్రహ్మపై బ్రహ్మయున్
దనదివ్యాస్త్రముఁ బంపఁగా నదియు నుద్యత్కోటిమార్తాండలం
ఘనజంఘాలయుగాంతదీర్ఘతరనిర్ఘాతచ్ఛటాభీలని
స్వనభిద్యద్రుహిణాండభాండఘటనాసన్నస్వతంత్రేశ మై.

12


చ.

కఱకఱ మండుచుం బొదువఁ గన్గొని మారుతసూతి వాలమున్
బిఱబిఱ ద్రిప్పి కొట్టుటయు బెండయి తచ్చిరమున్ బెళాలునన్
విఱిగిన జంభవైరిముఖదివ్యులు బాలుర కిట్టిబెట్టిదం
బిరువుగ నెచ్చటం గలుగునే? యని కోయని యార్చి యుగ్రతన్.

13


క.

బవరంబున కరుదెంచినఁ, జవిరెం దంభోళికర్కశం బగుతోఁకన్
దివిజులు బెగడఁగ నంజన, జవమునఁ బఱతెంచి పలికె శక్రాదులతోన్.

14


క.

చిన్నశిశువు పసిపాపఁడు, కన్నులు దెఱవండు చక్కఁగా బవరము ము
న్నెన్నఁ డెఱుఁగం డని చన, కిన్నిసువుం బొదువఁ జేతు లెట్టాడెనొకో?

15


ఆ.

పాలపాపఁ డగుట బాలభానునిఁ జూచి, పం డటంచు వచ్చి పట్టికొనినఁ
బట్టి బట్టి యుగ్గు పెట్టి పోరార్పక, నిట్టు ఱట్టు సేయ నేల? యనిన.

16

మ.

పరమేష్ఠిప్రముఖామరేశు లనిలోఁ బద్మాక్షి! నీపుత్రుతోఁ
దరమే? పో రొనరింప మాదృశులకున్ ధాత్రాశుగస్తంభనో
ద్ధురదోస్తంభవిజృంభణోగ్రతకు సమర్థుం డౌట నీమేటికిన్
బరుఁడై మీఱెడువీరుఁ డెవ్వఁ డని సంభావించి రా సాటికిన్.

17


ఉ.

మాటలు వేయు నేల? హనుమంతు మహాబలవంతుని న్నిరా
ఘాటపటుప్రతాపశిఖి గ్రమ్మిన నీవెడమాయ లాయెడం
బాటి వహించునే? యుఱక పై నుఱుకం జను టేటిధాటి? యి
ప్పాటి క్షపాటకోటికి సపాటము గాటముగా ఘటిల్లదే?

18


క.

చిత్తేశ! నాప్రియోక్తులు, చిత్తములో హత్తికొనుము శ్రీమారుతిపై
బత్తి గనుము బహుసుఖసం, పత్తి మనుము నీ వటంచుఁ బడఁతుక దెలుపన్.

19


క.

అలదోషాచరుఁ డను ని, శ్చలదోర్బలశాలిఁ దొడరఁ జనిన నెటులు గాఁ
గలదొ యని వెఱవవల దో, జలదోపమవేణి! నాదుశౌర్య మెఱుఁగవే?

20


క.

అని పలికె నంత నిక్కడఁ, దనమగనికి సరమ యవ్విధము చారులచే
వినిపింప విని విభీషణుని, డనిలజుకడ కేఁగుదెంచి యపు డి ట్లనియెన్.

21


ఉ.

టక్కరు లుక్కివుల్ బలుతుటారులు క్రూరులు వేషధారులున్
రక్కసు లౌట నెక్కరణి రాయిడి సేయఁ దలంచి వత్తురో
యిక్కపికోటికిన్ నృపుల కీవుకదా! బహిరంగజీవ మిం
కొక్కటి పేర్మిఁ బ్రోవఁగు నిందఱ నేఁ డని విన్నవించినన్.

22


సీ.

ఆత్మీయచలనలీలాధూతకంజాతగర్భాండభాండోర్థ్వకర్పరంబు
నిజకర్బురప్రభానిర్భేదితక్ష్మాధ్రశాసనోదగ్రబాణాసనంబు
ప్రత్యర్థిరాక్షసప్రాణాహృతిక్రియాభీలకాలవ్యాళఖేలనంబు
పర్వతోత్పాటనోద్భటపాటవకఠోరతాటోపవిజితవజ్రాయుధంబు


తే.

నై చెలంగెడు లాంగూల మట్టె పెంచి, క్రింద మీఁదట నెల్ల నేకీభవించి
చుట్టు సేనకుఁ గోటగాఁ బెట్టి యొక్క, పట్టునను నెట్టుకొని గాడ్పుపట్టి యుండె.

23


తే.

వజ్రపంజరమున నున్నవానికంటె, నిర్భయస్థితిఁ గపికోటి నిదురఁ జెందె
శ్రాంతిఁ బొందిరి రామలక్ష్మణులు నపుడు, ప్రహరి దిరుగుచు రావణభ్రాత యుండె.

24


వ.

అయ్యవసరంబున.

25


ఉ.

గాటఁపుగావిబొట్టు మొలఁ గన్నపుఁగత్తియు నీలిదట్టిలో
మాఁటినసొక్కు బూదిముడి మాయలమందుకరాట మొంది దో

షాటుఁడు దొంగయంగున రయంబున వచ్చి కపీంద్రువాలపుం
గోటతెరం గెఱుంగుటకుఁ గూర్చినవేగులవారిఁ బంపినన్.

26


ఆ.

నేల త్రవ్వి త్రవ్వి నిలిచె సూచీముఖుం, డెగిరి యెగిరి ఘటకుఁ డెత్తువడియె
వెనుక ముందు గాఁగ వినికి చేసినవారి, వలనఁ గోటతెఱఁగు వాఁ డెఱింగి.

27


పంచచామరము.

విభీషణాకృతిన్ వనాటవీరుఁ జేరి మైత్రిపూ
ర్వభాష లాడి చొచ్చి పోయి రాము లక్ష్మణున్ నిల
ప్రభావలీలఁ గాంచునాత్మపట్టణంబుఁ జేరఁ బో
యి భద్రకాళిచెంత నుంచి యింట వేడ్క నున్నచోన్.

28


సీ.

అంత విభీషణుఁ డవ్విధం బెఱిఁగింపఁ బాతాళలంకేశుపట్టణంబు
మార్గంబు గని పోయి మత్స్యవల్లభనాముఁ దనకుమారు రణంబుతఱిఁ దరించి
నగరాంతికమున నున్నఁదదంతరంబున దుర్దండి యనుదానితోడువలన
దనుజుమర్మ మెఱింగి ద్వారపాలురఁ జంపి పురిఁ జొచ్చి పలుసేనఁ బొలియఁజేసి


తే.

తస్కరుని బుత్రమిత్రపౌత్రంబు గాఁగఁ, దత్క్షణంబునఁ దునిమి దుర్దండిసుతున
కప్పద మొసంగి యతఁడు త న్నభినుతింప, రాఘవులఁ దెచ్చెఁ గ్రమ్మఱి నాఘనుండు.

29


క.

ఇట్టియసహాయశౌర్యం, బిట్టినిగూఢప్రయత్నహితచాతుర్యం
బిట్టిఘనధైర్య మంజన, పట్టికె కా కెందుఁ గలదె! పరికింపంగన్.

30


క.

కపు లలరి రుర్వి నాలో, కపులఁ గని జగము లుత్సుకత్వ మెనసెఁదో
రపుమహిమ హనుమ నిర్జర, రిపుపాటచ్చరుని సంహరించుటవలనన్.

31


ఉ.

ఆప్తుఁడు దన్ను గూర్చి యిటు లాపదఁ జెందినఁ బఙ్క్తికంఠుఁడుం
ప్రాప్తవిచారుఁ డై మఱి యుపాయము గానక సంగరక్రియో
ద్దీప్తమనోగతిన్ రఘుపతిన్ దొడరన్ జనుదేర విక్రమా
వాప్తిని ఖడ్గరోమునిని వాయుకుమారుఁడు దాఁకె వీఁకతోన్.

32


క.

నిస్తులనిజముష్టిహతి స, మస్తము స్తుతియింప దనుజుమస్తముఁ గెడపన్
భూస్తటిఁ బడె వాస్తోష్పతి, హస్తాసిధ్వస్తపర్వతాకృతి వాఁడున్.

33


మ.

అనిలోఁ బఙ్క్తిముఖాసురప్రహృతి సేయంజాలియున్ వాయునం
దనుఁ డిచ్చం దశకంఠకంఠదళనోద్ధండైకదోర్దండమం
డనకోదండవిముక్తచండతరకాండప్రాప్తకీర్తిప్రతా
పనిరూఢోన్నతి రామభద్రున కదభ్రస్ఫూర్తి వర్తిల్లఁగన్.

34

క.

పావనిముందర మశకము, రావణుఁ డన నెంత పట్టి రాచఁగ లేఁడే?
దేవునికీర్తి జగత్త్రయి, ఠావుకొనఁగ నూరకుండుటయ కాక యనిన్.

35


మ.

కనకక్ష్మాధరదేహదీప్తి దనరాకన్ మున్నుగాఁ దెల్ప ఘో
రనిశాటీకరిణీగణంబు హరిగర్జం దారఁ గారానివా
సనిరుద్ధామరకామినుల్ ప్రమదబాష్పస్ఫూర్తి శోకాగ్నిఁ బా
య నిలాకన్యక డాయ వచ్చి వినతుండై పల్కె సౌమ్యోక్తులన్.

36


క.

చిత్రచరిత్రుఁడు నీపతి, శత్రునిరుధిరమునఁ గాఁక సడలించెఁ జుమీ!
ధాత్రికి నేఁ దెలుపుట జన, యిత్రీ! నిజ మయ్యె నని కపీంద్రుడు దెల్పెన్.

37


ఉ.

నొచ్చిన నౌషధక్రియల నూల్కొనఁ జేయుట శత్రువాసముం
జొచ్చుట హెచ్చుటల్ సహజశూరతఁ జచ్చినగంధమాదనున్
దెచ్చుటగాదె! వింత జగతీస్థలి నా విని గౌతమాత్మజుం
డచ్చెరు వొంది తెల్పఁదగు నాకథ యన్న వసిష్ఠుఁ డిట్లనున్.

38


మత్తకోకిల.

రావణాసురవీరుఁ బోరను రాముఁ డీగతిఁ జంపినన్
దేవతల్ చనుదెంచి స్వామి నుతించి హలినవానరేం
ద్రావళిన్ బ్రతికించి పోవ ననంతరంబున జానకీ
దేవితోఁ బతి పుష్పకస్థితిఁ దేజరిల్లుచు వేడుకన్.

39


చ.

ఘనముఖు లైనవానరశిఖామణులన్ దనపుష్పకంబుపైఁ
గనుఁగొని గంధమాదనునిఁ గానక యెక్కడఁ బోయె నావుడున్
బెనఁగొనుభక్తి నప్పుడు విభీషణుఁ డాతఁడు కుంభకర్ణుతో
మొనసిన మైనలంతవడి మున్ననిలోఁ గడతేఱె నావుడున్.

40


ఉ.

వేదనఁ దత్తఱిల్లి రఘువీరుఁడు బల్కు మదీయకార్యలీ
లాదృతిఁ దోడు వచ్చి యకటా! తెగటాఱెనె గంధమాదనుం
డీదురవస్థఁ బాప ఘనుఁ డెవ్వఁడొ! యన జాంబవంతుఁ డే
లా! దురపిల్లఁ బావని గలాఁడు భవవ్వ్యధ మాన్ప నన్నచోన్.

41


ఉ.

భూపతి సంతసించి ప్రియపూర్వముగా హనుమంతుఁ జూచి మా
యాపద లెల్లఁ బాప మహిమాంబుధి నీవె కదయ్య! శత్రుచే
రూపఱిపోయె నాతఁ డొకరుండు సమస్తకపీంద్రకోటిలో
నాపనిఁ బూని వచ్చి తెగినం దగునయ్య? యుపేక్ష సేయఁగన్.

42

ఉ.

ఎక్కడ నున్న దేఁగల వహీనబలాఢ్యుఁడ వౌట నిక్కడం
జిక్కినకార్యముల్ దడవుసేయక సేయు మటంచు నక్కునన్
గ్రక్కున మక్కువం బొదివి క్రమ్మర మూర్ధపుఁజక్కి మూర్కొనన్
జొక్కపుబత్తి నిక్కి నృపసోమున కాయన మ్రొక్కి యి ట్లనున్.

43

హనుమంతుఁడు బ్రహ్మలోకమునుండి గంధమాదనుం దెచ్చుట

ఉ.

హెచ్చన నేల? శ్రీరఘుకులేశ్వర! యిప్పుడె మృత్యుగర్భమున్
వ్రచ్చెద దండపాణిభటవర్గముతోఁ బడఁబెట్టి యావలన్
జొచ్చెద నందుఁ జూడఁగల చోటులుఁ జూచి నిమేషమాత్రలో
దెచ్చెద గంధమాదనుని దేవర! చూడు మటంచు నుద్ధతిన్.

44


సీ.

పెళ పెళ పెళ నార్చుభీకరార్భటులచే దిక్పాళిగుండియల్ దిగ్గుమనఁగ
బిర బిర బిరఁ ద్రిప్పుపృథువాలవిస్ఫూర్తిఁ దూలంబు లై గిరుల్ తోన నెగయఁ
గహ కహ కహ నవ్వుకఠినాట్టహాసంబు సురలఁ గాంతాశ్లేషసుఖులఁ జేయ
బిస బిస బిసఁ బోవు పెనువీఁక నిలలేక పైమేఘములు పటాపంచలుగను


తే.

నుప్పరమునకు గుప్పించి యుబ్బి గబ్బి
నిబ్బరంబున సంయమనీపురంబు
ద్వారమునఁ బేర్చి యార్చినఁ దత్తఱిల్ల
జముఁడు పఱతెంచి పూజించి సంభ్రమమున.

45


క.

సద్భావ మెసఁగ నిట్లను, మద్భవనమునందు గంధమాదనకపి లేఁ
డద్భుతవిక్రమ! సరసిరు,హోద్భవుెస నిప్పు డాతఁ డున్నాఁ డనినన్.

46


ఉ.

మంచి దటంచు మ్రొక్కి పవమానకుమారుఁడు భూర్భువర్ముఖో
దంచితపుణ్యలోకములు దాఁటి క్రమంబున సత్యలోకముం
కాంచి తదీయవైభవము కన్నులపండువు సేయఁ బోయి య
క్కాంచనగర్భుఁ డున్నమణికాంచనకూటము సొచ్చి యచ్చటన్.

47


సీ.

ద్వాదశార్కకిరీటతటనీలరుచు లంఘ్రిపద్మంబులకు మధుపములు గాఁగ
నమరఫాలన్యస్తహస్తాంజలులు వాకిటికిఁ బద్మకోశమాలికలు గాఁగ
నటనలీలాప్సరఃకుటిలాలకాలోకనంబులు నీరాజనంబు గాఁగ
వర్ణనాయితయతీశ్వరభాష లాత్మచారిత్రవన్యలకుఁ గోరికలు గాఁగఁ


తే.

దనసుతుండు వీణె వినిపించువిధమున
కెద మయూరంబుగాఁ గూర్మి యిగురులొత్త

నాసరస్వతిఁ గూడి పద్మాసనమునఁ
గమలగర్భుండు పేరోలగమున నున్న.

48


తే.

అచ్చటిజనంబు దనమేనిపచ్చనిబిగి, కచ్చెరువుఁ జెంద నలువకు వచ్చి మ్రొక్క
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి నీవచ్చుటేమి, మచ్చిక వచింపు పవనకుమార! యనిన.

49


ఉ.

అక్కపిచంద్రుఁ డిట్లను మహాత్మ! సమస్తము నీ వెఱుంగవే?
యిక్కడ గంధమాదనకపీశ్వరుఁ డుండు టెఱింగి వచ్చితిన్
గ్రక్కునఁ బంపు మక్కపిశిఖామణిఁ జూడక పోవకున్నవాఁ
డక్కడ రాముఁ డన్న విని యాతని నిచ్చి విధాత యి ట్లనున్.

50


ఆ.

ఇతఁడు రామకార్యహితబుద్ధి ఘటకర్ణు, మేన నలఁగి తొంటిమేను మాని
యజరుఁ డమరుఁ డయ్యె నవని కంపఁగఁజెల్ల, దైన నీవు రాఁగ నంపవలసె.

51


క.

తను వుడిగినజనుఁ గ్రమ్మఱఁ, గొనితెచ్చెద ననుచుఁ బూనుకొని రా వశమే?
వినుతప్రభావతేజో, ఖని వగునీయందె చెల్లె గాక మహాత్మా!

52


మ.

అని సార్థంబుగ బ్రహ్మ సన్నుతులు సేయ న్నమ్రుఁ డై గంధమా
దనునిం గౌఁగిటఁ జేర్చి తోడుకొని రాఁ దత్తజ్జగద్వర్తనుల్
దనతేజోబలధైర్యశౌర్యమహిమల్ వాక్రుచ్చి వర్ణింపఁగాఁ
జనుదెంచెన్ రఘురాముచెంత కఖిలాశ్చర్యప్రభావోన్నతిన్.

53


సీ.

వచ్చితె మాతోడినెచ్చెలితన మీవు మఱచితో యని చెంతఁ దిరుగువారు
నీవు లేకుండిన నెందఱు లేనట్టు లుండె మా కని చేతు లూఁచువారు
ఎచట నేతెంచె నీ కిటువంటిదేహంబు మరలనం చంగంబు లరయువారు
నా పేరు దెల్పు మానాఁడు నే నే మంటి నని తొంటిచందంబు లడుగువారు


తే.

ఎచట మంటివి? మముఁ బాసి యిన్నిదినము, లెటులు నచ్చోటి కరుదెంచె నీమహాత్ముఁ
డనుచుఁ గపు లెల్ల గంధమాదనునిఁ జుట్టు, కొనిరి మృతజీవిఁ గ్రమ్మఱఁ గనుటఁ జేసి.

54


క.

అనిలజ! నీవె విధాతవు, విను మది గాకున్న మృతుని వెనుకొని మరలం
గొని తేవచ్చునె యితరుల, కని కపివిభు లెంచ స్వామి కనిలజుఁ డంతన్.

55


తే.

వినయమున మ్రొక్కి గంధమాదనవనాట, చంద్రుఁ బొడ గానిపింప నాశ్చర్య మంది
మెచ్చి కౌఁగిట గ్రుచ్చి భూమిపతి యవల, సేతుతటమున శివుఁ బ్రతిష్ఠించె ననిన.

56


ఉ.

గౌతమసూతి పల్కె ననమా! మును రాముఁడు శంభులింగము
న్సేతువుభూమి నేమిటికి నిల్పె నొకో! పవమాననందనుం
డాతఱి నేమియైన విహితాద్భుతకర్మము లాచరించెనో!
చేతన కింపు గుల్కఁగ వచింపు మనంగ వసిష్ఠుఁ డిట్లనున్.

57

ఉ.

ఎక్కడ నద్భుతక్రియ వహింపఁడు? రామకథాంబురాశిలో
నక్కపిచక్రవర్తి సకలాత్ముఁడు రాము శివప్రతిష్ఠ పెం
పెక్కుటకై ఘటించె విను మిక్కథ యక్కరణిన్ రఘూద్వహుం
డిక్కడ గంధమాదననగేంద్రముచెంతకు వచ్చునంతకున్.

58


తే.

దశరథాత్మజుదండ కాదండకావ, నాంతరంబున నున్నమహర్షివరులు
వచ్చి పూజించి శుభసూక్తివైభవంబు, భాసిలఁగ నిట్టు లభినుతి చేసి రపుడు.

59


సీ.

రవివంశసంజాత! సవనావనోపేత! ఘనశాతశరధూతదనుజజాత!
చలితయోషాశాప! దళికశంకరచాప! క్షితిసుతాంతర్దీప! శ్రుతికలాప!
భార్గవాహంకారభయదబాహాసార! సంప్రాప్తకాంతార! జయవిహార!
యినతనూభవపక్ష! యింద్రనందనశిక్ష! సింధుబంధనరక్ష! జితవిపక్ష!


తే.

పాలితవిభీషణైశ్వర్య! పరమధైర్య!, రక్షితాయోధ్య! సేవకారంభసాధ్య!
శరణు వొందినమము నేఁడు కరుణఁ జూడు, రవిసహస్రమహస్సాంద్ర! రామచంద్ర!

60


క.

అని కుంభసంభవాదులు, వినుతించిన సంతసించి విభుఁ డతిభక్తిన్
మునులకు బ్రాంజలి యై వం, దన మొనరిచి ప్రావృడంబుదధ్వని ననియెన్.

61


సీ.

అఖిలజీవులకు సంప్రాప్యుఁడ నైననే నతివిశుద్ధాత్ముండ నౌట కేమి
యరుదు మద్దృష్టిగోచర మైనజంతు వెప్పటికిని కైవల్యభాజన మగు
నైన సుస్వాంతవిజ్ఞానసంతుష్టుల శిష్టుల సర్వభూతేష్టతముల
నిరహంక్రియుల శాంతినిధుల జితేంద్రియు లగువార నెఱిఁగి సాష్టాంగ మెరఁగి


తే.

సేవ గావింతు బ్రహ్మణ్యదేవుఁ డనఁగ, నేను వేఁడెదఁ పౌలస్త్యుఁ డైనదైత్య
పతి వధింపంగ నైనదుష్కృతి దొలంగ, నిష్కృతి వచింపుఁ డిపుడు మౌనివరులార!

62

రాముఁడు బ్రహ్మహత్యానిష్కృతికై శివప్రతిష్ఠ సేయుట

మ.

అనినన్ మౌనులు సంతసించి పరమాత్మా! నీకు దోషంబు గ
ల్గునె? లోకంబు ననుగ్రహించుటకు నాలోచించి తట్లైన శం
భుని నిచ్చోటఁ బ్రతిష్ఠ సేయు దురితంబుల్ వాయు లింగప్రతి
ష్ఠ నుతింపన్ బరమేష్టి నేరఁ డన నస్మాదృగ్జనుల్ నేర్తురే?

63


తే.

కాశికాలింగదర్శనాగతఫలమున, కరయ శతకోటిగుణితమహాఫలంబు
గలుగు జనులకు నీపేర గంధమాద, నమున నేపారు శివదర్శనంబు సేయ.

64


క.

డం బడరంగం బవనంబు జ, వంబడచు జవంబునన్ భవం బడఁప సదా
లంబ విలంబము సేయక, సాంబుఁ బ్రతిష్ఠింపు మని మహర్షులు పల్కన్.

65


వ.

సంతోషతరంగితాంతరంగంబుతో హరిత్తురంగకులతరంగిణీరమణకురంగలాంఛనుం

డు లింగప్రతిష్ఠాపనంబున కభంగురమాంగల్యముహూర్తంబు ప్రసంగించి మునిపుం
గవులవలన ముహూర్తద్వయమాత్రంబుగా నెఱింగి కుఱంగటం జెలఁగుసమీర
కుమారుం గనుంగొని.

66


క.

కలధౌతధరాధరమునఁ, గలిగినలింగంబు నాల్గుగడియలలోఁ దే
వలయు నట పోయి తెమ్మీ! వలయుదువే యెట్టిపనుల కనిలకుమారా.

67


మ.

అనినన్ సామి! హసా దటం చతఁడు బాహాస్ఫాలి యై గంధమా
దన మిట్టట్టయి యూగఁగా నెగిరె గంధర్వాప్సరస్సిద్ధసా
ధ్యనిశాటోరగకిన్నరప్రముఖు లాహా యీవిజృంభంబుతో
నను కైలాసమె తెచ్చునో యని జవౌన్నత్యంబు వర్ణింపఁగాన్.

68


తే.

ఎగిరి కైలాసగిరిఁ జేరి తెగువ మీఱి, యల్లసామీరి శివలింగ మందు వెదకి
వెదకి కానక కానకవిభఁ దనర్చు, నచట కానక వెఱఁగంది యందు నిలిచి.

69


మ.

చరణాంగుష్ఠముచేత నూఁతగొని పక్షద్వంద్వమున్ విచ్చి భా
స్కరు దృష్టించుచు నూర్ధ్వబాహుఁ డయి నిశ్వాసంబు బంధించి బం
ధురవిశ్వాసముతోఁ దపంబు సలుపన్ దోడ్తోన ప్రత్యక్ష మై
హరుఁ డిష్టార్థము వేఁడు మన్న వినతుం డై పల్కె సద్భక్తితోన్.

70

కందద్వయగర్భితసరసిజవృత్తము.

ఏనా నిన్నున్ ధ్యానమహీనాదృతి గొని కనుఁగొన నెద నహహ మహా
మౌనీశానుల్ భానుసమానుల్ మది నిడ నెఱుంగక మనికితపడఁగా
నీనామంబే లోనిడి నే నంతటిమిఁ గొలువఁగ నెనరున దనరన్
సానందోక్తుల్ మానక యౌ నంచని మనుపఁగఁ దగు నసదృశనయనా!

71

కందద్వయగర్భితభాస్కరవిలసితవృత్తము.

తాపము గెడపఁగ నోపిన చూపున్ దాపసమనసుల సొబగగురూపున్
పాపపుదనుజుల మాపినయేపున్ బంకజవదనకు హితవగుతూపున్
గోపురవిలసన మాఁపిన మూపున్ ఘోరహలహలము మొనసినయేపున్
గోపతిగమనము చూపినకోపున్ గూడి తనరునినుఁ గొలిచెన నభవా!

72

స్రగ్విణీభుజంగప్రయాతగర్భితవృత్తము.

శ్రీకపర్దీ! మునిశ్రేయ! కామాపహా, రీ! కృపావార్థి! నీరేజహృచ్ఛేకరా
ఢ్యా! కపాలస్ఫురద్ధస్త! గందేభదా, రీ! కపోలోజ్జ్వలశ్రీ! జగజ్జీవనా!

73


తే.

వేళ తప్పక రమ్మని విభుఁడు పల్కె, నిష్ట మొనఁగూర్పవే యన్న నీశుఁ డలరి
యతని కప్పుడు లింగద్వయం బొసంగి, తక్షణంబునఁ జూడ నంతర్ధిఁ జెందె.

74

ఉత్సాహ.

అంత నిందు మౌనిచంద్రు లాంజనేయుఁ డేమొ య
త్యంతతామసంబు చేసె నయ్యె వేళ నిర్మల
స్వాంత సీత చేసినట్టి సైకతంపులింగ మీ
వింతలోఁ బ్రతిష్ఠ సేయును మేల వేళ పోవఁగాన్.

75


సీ.

అనిన మంచిది యంచు నజ్జానకీనేత సీతతో మంగళస్నాత యగుచు
జ్యేష్ఠమాసంబున సితపక్షమున దశమిని జంద్రసుతవారమునను హస్త
తారను గరకరణారూఢ మగువ్యతీపాతయోగంబున భాస్కరుండు
వృషభంబునను గన్య నిందుఁ డుండెడుమహాపుణ్యయోగమునను గంధ


తే.

మాదనాచలమున సేతుమధ్యమునను, జేసె లింగప్రతిష్ఠ ప్రసిద్ధి గాఁగ
నఖిలలోకప్రతిష్ఠాత కట్టివేళ, నభవులింగప్రతిష్ఠ యర్హంబ కాదె.

76


సీ.

ఆవాహన మొనర్చి యర్ఘ్యపాద్యము లిచ్చి భక్తితోఁ బూరుషసూక్తి నమక
చమకాదివేదమంత్రములతోఁ బంచామృతస్నాన మొనరించి పవననంద
నానీతగంగాదికానేకతటినీజలంబుల నభిషేచనంబు చేసి
వసనవిభూషాదు లొసఁగి శైవసహస్రనామంబులను బూజనంబు సలిపి


తే.

ధూపదీపంబు లైనఁ దోడ్తోడ షడ్ర, సాన్ననైవేద్య మర్పించి యంత వీటి
కార్పణంబుఁ బ్రదక్షిణ మాచరించి, సన్నుతి ఘటించి శ్రీరామచంద్రుఁ డపుడు.

77

నాగబంధము

చ.

జయ జయ సామగేయ! హర! సారసగర్భశిరోహరా! పురం
జయవిమలాభిధేయ! మృగసంగతహస్త! మఖాతిభంగదా!
భయదహనాగణేయ! భవభావజగర్వభిదా! యమోహ! య
వ్యయమతిదా! శివా! యసురవారకపుణ్యద! రామలింగమా!

78

కందగర్భితమణిగణనికరము.

తొగదొరజిగినిగి దొరసినసిగయున్, సెగగను కనుఁగొనఁ జెనకినపగయున్
మగువ సగము గలమయినిగనిగయున్, నెగడిననిను మతి నిలిపెద నభవా!

79

అనులోమవిలోమకందము.

ధీర హిమభామహి రధీ, తారరనా మదహరాహచమవారరతా
మారవరవీరపరమా, సారసదాయక దరాద యదాసరసా.

80

పంచచామరము.

ధరాధరాధిరాజభూసుధాధరాధరాధరా!
ధరాధరాతిదూరసారదాచ్ఛకీర్తిసుందరా!
పురందరావరాగదారణాపురందరా!
సురాసురస్థిరాసురార్చ్యశుద్దమూర్తిభాసురా!

81


తే.

అని నుతించినఁ బ్రత్యక్షమై శివుండు
మీరు నిల్పినలింగ మీ మీఁద సకల
పూజ్యమును దోషహరమును బుణ్యఫలవి
దాయి యగు నిక్క మని యేఁగెఁ దత్క్షణంబ.

82


తే.

శ్రీరఘుస్వామి గంగాభిషేకమునకుఁ
దగినశుద్దోదకములకై తత్సమీప
ధరణిఁ దనవింటికోపునఁ ద్రవ్వి నూయి
సేయ నది కోటితీర్థప్రసిద్ధిఁ గాంచె.

83


ఆ.

వినినయంత సుకృతవిభవరీతు లమర్చుఁ
గనినయంతఁ బ్రకృతికడకుఁ జార్చు
శుభము లొసఁగ నేర్చు నభిమతం బొనఁగూర్చు
కోటిసరము కలుషకోటిహరము.

84


తరల.

సురమునీంద్రులు సిద్ధసాధ్యులు శోభనక్రియ జానకీ
వరునిలింగము పూజ సల్పిరి వానరుల్ పరమానురా
గరసవారిధి నోలలాడిరి కంజగర్భదిగీశ్వరుల్
పరమభక్తి నుతించి రన్నను బల్కె శ్రోత వసిష్ఠుతోన్.

85


క.

కాలము దప్పక రమ్మని, లాలించి మరుత్సుతుని నిలాపతి పనుపన్
కైలాసంబునకుం జని, యాలస్యము చేసెఁ దెలుపుఁ డతనికత యనన్.

86


చ.

మునిపతి గౌతమాత్మజునిమోము గనుంగొని పల్కె నీగతిన్
దినకరవంశుఁ డీశ్వరుఁ బ్రతిష్ఠ యొనర్చినమీఁద వాయునం
దనుఁడు నమందబుద్ధి శివదత్తమహత్తరలింగయుగ్మముం
గొని ఘనవేగి యై గిరులు ఘూర్జిల వచ్చుచుఁ ద్రోవలోపలన్.

87


ఉ.

ఉగ్రమయూఖవంశుఁడు ముహూర్తము దప్పక లింగమూర్తిఁ బ్ర
త్యగ్రవినీతి నిల్పఁడుగదా! జగదాదరణీయకీర్తి మ

జ్జాగ్రదుదారబుద్ధిఁ గనఁజాలక యింతటిలోన నన్యలిం
గగ్రహణంబు సేయునె విచారము చెల్ల దటంచు ముంగలన్.

88


సీ.

జడి వట్టి కురియునిర్జరులపూవులసోనతావిఁ జెందెడుమిళిందములమ్రోఁత
బెళుకుఁజూపులు మించు తళుకు మించ నటించు తెఱగంటిచెలులయందియలమ్రోఁత
జయ రాజశేఖర! లయ ధరాత్మభ వేశ! యందు వేల్పులు సన్నుతించు మ్రోఁత
తంత్రులు సారించి తపసి వీణియ మీటఁ బరగుగీతీపరంపరలమ్రోఁత


తే.

మద్దెలలమ్రోఁత ఋషపాఠ్యమానవేద
మంత్రముల మ్రోఁత లొక్కటై మట్టుమీఱి
తనకు శ్రీరామలింగసంస్థాపనోత్స
వంబు సూచింప నొకయింతడంబు మాని.

89


చ.

ధరణికి డిగ్గి రామువసుధాపతికిన్ నతి చేసి జానకీ
తరుణికి మ్రొక్కి లక్ష్మణుపదంబుల కాసతుఁ డై సమస్తవా
నరుల యథోచితస్థితి మనఃప్రమదాంబుధి ముంచి సైకత
స్థిరశివలింగపూజనము సేయురఘూద్వహుఁ గాంచి ఖిన్నుఁ డై.

90


క.

కంపింపఁ బెదవితో నెద, కెంపుజిగివన్ను కన్నుఁగ్రేవల నీటం
జెంపలు దడియఁగ శోకప, రంపర నప్పవనసుతుఁడు రామునిఁ బల్కెనన్.

91


క.

కనవలవదు ననుఁ బోలిన, తనుజాతుని నెప్పఁటికిని దల్లి! నిజం బో
జననాథ! వృథాస్థూలము, తను వుండిన నేమి లేక తలఁగిన నేమీ?

92


ఉ.

అందఱముందఱ ననుఁ బ్రియంబునఁ బిల్చి “సమీరపుత్ర! నీ
కెందు నసాధ్యముల్ గలుగ విప్పుడె తప్పక వెండికొండ నెం
చం దగులింగముం గొని వెసం జనుదె" మ్మని తెచ్చునంతలో
దందడి చేసి వాసి సికతామయలింగము నిల్పఁ జెల్లునే?

93


క.

నే నెంత నాదుబల మనఁ, గా నెంత యనంతశక్తిచిత్తుఁడ వగునీ
కేనా? యుద్యోగంబులు, పూని ఘటింపం దయాప్రపూరితహృదయా!

94


క.

పరితాపానలకీలల, భరియించి వసించుకంటెఁ బ్రాణంబులు వే
గిర మేఁ బెడఁబాసి మఱి నీ, చరణంబులు గనుట మిగులసౌఖ్యం బనుచున్.

95


భుజంగప్రయాతము.

వగం బుట్టుబాష్పాంబువర్షంబుతోడన్
దెగం బిట్టు చింతించుతీవ్రంబు గూడన్

సెగం బెట్టునిట్టూర్పుచే మోము వాడన్
దగం దొట్టునజ్జెట్టి దర్శించి క్రీడన్.

96


క.

కరుణ జిగి చూపుచూపులు, చిఱునగవు ప్రసన్న ముఖము చిన్నిపలుకులున్
మరులుకొనఁజేయుసోయగ, మరుదుగ నను రామదేవుఁ డనిలజుతోడన్.

97


ఉ.

ఇంతవిచార మయ్యెఁ గద! యేనును నీ వనుభేదయుక్తి నీ
స్వాంతమునందు వర్తిలుట నన్యుఁడు నే ననుచింత యెంతప
ర్యంతము జంతుసంతతిహృదంతమునందు వసించు నంతప
ర్యంతము జన్మమృత్యువుల కంతము లేదు సమీరనందనా!

98


ఉ.

ఊరక శోకమందెద వయో! వినయోన్నత! సన్నుతుల్ తిర
స్కారము లాత్మరీతిఁ గన సర్వము దేహగతంబు లెవ్వియుం
జేరక చిత్స్వరూపగతిఁ బెల్వగునీకు శరీరమం దహం
కారము దూర మైన నధికారము గల్గెడుఁ దత్త్వసిద్ధికిన్.

99


క.

నిత్యానిత్యవివేకము, ప్రత్యేకము దేహ మనెడుభావము నంత
స్థిత్యచలత్వము గల్గిన, సత్యాశయుఁ డొందు ముక్తిసంపద ననఘా!

100


చ.

జననము నొందుజంతువులు సంజననం బయి యున్నజంతువుల్
తనువులు వీడుజంతువు లుదారగుణాకర! లెక్క లేవు సం
జననము నొందునప్పుడయ చచ్చుట తప్పదు చచ్చినప్పుడే
జననము దప్ప దేటికి విచారము? నిత్యమె దేహ మేరికిన్?

101


చ.

కలిగినయట్టె యున్నవి జగంబులు స్త్రీధనజాతసౌఖ్యముల్
తలఁగనియట్టె యున్నవి సతం బయి దేహము కాలసంగతిన్
నలఁగనియట్టె యున్నది జనంబు మనంబున కింత మాయ వె
గ్గల మని యుగ్గడింపఁ గలకారుణికుండు గురుండు గల్గమిన్.

102


చ.

చనియెడువేళ భోజనము సల్పెడువేళ శయించువేళ లే
చినయెడఁ గామినీరతి వసించినవేళఁ గృతాంతుఁ డీజగ
జ్జనముల వెంబడిన్ విడువఁజాలక ద్రిమ్మరుచున్కి నిచ్చలోఁ
గనుఁగొనలేక లోప లధికస్పృహ మాన రదేమొ! మేనిపై.

103


క.

ఈదేహమునకు నీకును, లే దనుబంధ మన దేహలీలావిభవా
పాదిత మగునొకవస్తువు, నీది యగునె? యేల భ్రమ? మనీషివరేణ్యా!

104


తే.

కర్మవశమున సుఖము దుఃఖము జనించు, నదియె బీజంబు వివిధదేహాంకురముల
కంగసంగతి హెచ్చుగుం దగుటఁ దొలుత, దేహి దేహవిభేదంబు దెలియవలయు.

105

క.

పరవస్తువు నావస్తువు, నరి మిత్రుం డనెడువికృతి యంతయు నంతః
కరణవశంబునఁగా యని, పరికించితివేని భేదభావము పాయున్.

106


క.

ఏనును నాయది యనునభి, మానంబునఁగాదె జననమరణము లగుటన్!
మానసమున దేహాద్యభి, మానము లేకున్నచోఁ బ్రమాదము గలదే?

107


క.

తను వభిమానించినయది, మన మగుటన్ బుద్ధివలన మఱి దోఁచిన వె
ల్లను మిథ్యగా నెఱింగిన, ననఘా! దేహాభిమాన మంత నడంగున్.

108


క.

ఒడ లన్య మస్థిరం బని, జడమతి తెలిసికొని దీన సౌఖ్యము దుఃఖం
బెడ చేసి శత్రువుంబలె, విడువుమిఁకం దదభిమానవిభవము వత్సా!

109


తే.

నిజము చెప్పెద విను నీకు నిఖిలజగము, ప్రకృతివశమునఁ గలిగినభాతిఁ దోఁచుఁ
గలిగినది కాదు జ్ఞానియె కాని దాని, కల్పితం బని యితరుండు గానలేఁడు.

110


సీ.

ప్రత్యక్ష మైనప్రపంచ మేలాగున సత్యంబు గా దని సంశయించి
కలిగినవిశ్వంబె కాదన్నఁ గనరానియాత్మ నిశ్చయ మెట్టు? లని తలంచి
కర్మాతిశయమునఁ గాదె? బ్రహ్మాదులు ఘనులౌట లని కర్మగతి నుతించి
పరమాత్మకును జీవభావంబునకు భేద మై యుండు నైక్య మె ట్లని చలించి


తే.

విపులవిపరీతసంశయావేశు లగుచు, నజ్ఞులై స్త్రీధనాసక్తి నన్య మెఱుఁగఁ
జాలక కుయుక్తి గురుభక్తి సలుపలేక, జడులు సంసారమునఁ జిక్కి చెడుదు రనఘ!

111


క.

అంతఃకరణ నశించిన, జంతువులకుఁ జావుపుట్టు సంగత మైన
ట్లెంతయును దోఁచుఁ జూచిన, భ్రాంతియ కా కందు లేవు భవమరణంబుల్.

112


తే.

పవననందన! సకలప్రపంచమునకు, నశ్వరత్వంబు సిద్ధంబు శాశ్వతంబు
బ్రహ్మ మిందున సంశయపడఁగ నేల? మనన మొనరించి తెలియు నీమానసమున.

113


ఆ.

పంచభూతములకుఁ బదియింద్రియములకు, విషయములకుఁ జిత్తవృత్తులకును
దెలియఁబడక తానే తెలివియై యన్నింటిఁ, దెలియుచున్న తెలివిఁ దెలిసికొనుము.

114


క.

జ్ఞాతృజ్ఞానజ్ఞేయము, లేతాదృశబుద్ధి నిడక నేకాకృతి నీ
చైతన్యంబునఁ గనఁబడు, చైతన్యమె చూడు కలుగు సౌఖ్యము లెల్లన్.

115


తే.

తనువు కడఁ ద్రోసి మరి నొండుతలఁపుఁ బాసి
కన్నుఁగవచూపు చంద్రభాస్కరులమండ
లాగ్రముల నుంచి లింగత్రయప్రముక్త
సచ్చిదానందరూపంబు సరగఁ గనుము.

116


ఉ.

తత్త్వము లైదు వాటిలఁగదాఁ దను వయ్యెఁ దదీయమోహసం
గత్వమునంగదా భవము గల్గె నటంచు వివేకి వై రజ

స్సత్వతమోగుణేతరవిశాలమతిం దిలకించి చూడు మా
తత్త్వ మసీతివాక్యభరితస్సురితార్థము వాయునందనా!

117


క.

ప్రీతిని హృదయాకాశము, భూతాకాశంబుఁ గలయ బొందించినచో
నాతఱి గతలక్ష్యం బగు, చైతన్యాకాశ మొదవు సౌజన్యనిధీ!

118


క.

పొడవుగఁ బెరుఁగుట లెల్లను, బడుటకొఱకె కూడు టెల్లఁ బాయుటకొఱకే
పుడమిం బొడముట లెల్లను, గడపట లయమందుకొఱకెగా! కపిముఖ్యా!

119


తే.

కాన నీలోన దేహాభిమాన ముడిగి, యద్వయజ్ఞాననిష్ఠ నహర్నిశంబు
నాత్మ చింతయె ఘటియింపు మందువలన, మొనయనేరవు భవరోగములు కపీంద్ర!

120


క.

మత్కృతము త్వత్కృకం బగుఁ, ద్వత్కృత మగు మత్కృతంబు ద్వైతము వలదో
సత్కృతి లింగస్థాపన, సత్కృతి నీ వాచరించుసత్కృతి గాదే?

121


ఉ.

లగ్నము చారు వౌట జటిలప్రవరుల్ వివరింప భూసుతో
ద్విగ్నమృగాక్షి చేసి యొదవించినసైకతలింగమున్ గ్రియా
మగ్నత నిల్పి పూజన లమర్చితి మిచ్చట నింతమాత్రకై
భుగ్నతఁ జెంద నేల కపిపుంగవ! నాపలు కాదరింపుమా.

122


ఉ.

ధీరవరేణ్య! నీ విపుడు దెచ్చినలింగము నేఁడె నిల్పు నీ
పేర జగంబులన్ వెలయఁ బెంపుగ నెల్లజనంబు లింక నీ
పేరిటిలింగమున్ మొదటఁ బేర్కొని పూజ లొనర్చి యంత
నాపేరిటిలింగముం గని యభీష్టగతిన్ భజియింతు రెప్పుడున్.

123


ఉ.

ఈవును బ్రహ్మరాక్షసుల నెందఱనేని వధించి తాజిలోఁ
గావున నీదుపేరఁ గుతుకంబున శంభుఁ బ్రతిష్ఠ చేసినన్
బోవు నఘంబు లెల్ల దయఁ బూని మహేశుఁ డొసంగినట్టి నీ
దేవుని వామదేవుని ధృతిం దిలకించినవారె యుత్తముల్.

124


వ.

అని మఱియు ని ట్లనియె.

125


మ.

సికతాలింగము చేసి లింగముఁ బ్రతిష్ఠింపం దలంతేని దు
శ్శక మాకార్య మదెట్టు లన్నఁ దిలకించన్ సప్తపాతాళభూ
మికలం బాదుకొనెన్ మహేశుఁ డిఁకఁ బేర్మిన్ దియ్యనే శౌర్యరా
శి కశక్యం బటు గాక దీసినఁ బ్రతిష్ఠింతున్ భవల్లింగమున్.

126


చ.

అనవుడు నెమ్మొగంబుఁ దెలియం జిఱునవ్వున గంధవాహనం
దనుఁడు రఘూద్వహాంఘ్రులకు దండము వెట్టి యి దెంతకార్యమో

దినకరతేజ! దేవరప్రతిష్ఠ గదా యని కొంకినాఁడఁ గా
కనిమిషశైల మైన ద్రుహిణాండము దాఁటఁగ మీట నేరనే?

127


సీ.

అని విజృంభించెఁ బావని నా శతానందుఁ డావసిష్ఠునిఁ జూచి యచ్చెరుపడి
పరతత్త్వమార్గంబు పతి దెల్ప వినియును దత్ప్రతిష్ఠితశివోత్పాటనంబు
పరుల కసాధ్యమం చెఱిఁగియు స్వామిభృత్యన్యాయసరణి దా నధికుఁ డయ్యుఁ
దన కసాధ్యం బైన దాశరథీశ్వరోత్పాటనోద్దతి కేల పాలుపడియె?


ఆ.

నెఱుఁగ కిట్టిచెయ్ద మెనసెనో యెఱిఁగియుఁ జేయవలసి చేసెనో యథార్థ
వచనరచనఁ ెలుపవలయు నావుడు లెస్స, యడిగి తని వసిష్ఠుఁ డతని కనియె.

128


సీ.

శ్రీరామలింగంబు సికతామయంబుగాఁ జింతించులోకులభ్రాంతిఁ బాపఁ
బదరి సాంబద్రోహ మొదవించి ఘనుఁ డైన నెఱి దూలుననుమాట నిర్వహింప
నతలాదిలోకముల్ వ్యాపించె శివుఁ డన్న రామువాక్యము నిదర్శనము సేయ
నణురేణు వైన రామావనీశుఁడు నిల్ప నొరుల కసాధ్యమౌ టెఱుకపఱపఁ


ఆ.

దలఁచి రామనాథదైవతోత్పాటనో, ద్దతి వహించెఁ గాక ధర్మవేది
పరమపుణ్యుఁ డతఁడు ప్రత్యక్షపరమేశుఁ, డజ్ఞుఁడే చెలంగు నవల వినుము.

129


వ.

ఇవ్విధంబున దశకంధరపరిపంథివచస్సంధిబుద్ధి ననుసరింపక గంధవాహనందనుండు
పుండరీకంబునకు శుండాదండంబు నిగిడించుమదవేదండప్రకాండంబు మెండున
నాఖండలాదిదివిషన్మండలభండనసముద్దండదండధరాఖండప్రతాపప్రచండదైతేయ
మండలేశ్వరమదాంధకారమార్తాండకరప్రకాండభీకరతరకరప్రకాండంబు సారించి
నిజాటోపవిలోకనజాయమానభయవేపమానగౌరీమానవతీహఠాత్కల్పితదృఢా
లింగం బగురామనాథలింగంబు ననాయాసంబునం దెమల్చి యగలకున్న దిగులుపడక
కలకల నగుచుఁ గిలకిలార్భటి సముద్ఘటించి మోఁకారించి వాలం బెగవట్టి కరద్వయం
బునం బట్టి దిట్టతనంబున నిట్టట్టుగా నూఁగియుఁ జట్టుకన్న గట్టియై నెట్టుకొన్నయట్టి
లింగంబునెడ నుట్టిపడుకట్టల్క నహంకారంబున హుంకరించుచుఁ దటతట కటతక
టంబు లదరఁ జటులతరలోచనంబులఁ జిటచిట నిప్పుకలు చెదర గిటగిట పండ్లు గీటుచు
బటపట బ్రహ్మాండభాండంబు పగుల నట్టహాసంబు చేసి యిట్టియీశ్వరాపరాధం
బున నేమి పుట్టునో యని పుడమిపట్టి బిట్టడల నింతయహంకృతి దగునే యని
లక్ష్మణుండు నొడువ నీబలవంతున కింత యసాధ్యం బగుట వింత యని రుమాకాం
తుండు చలింప రామప్రయుక్తతృణంబు ద్రుహిణాస్త్రం బగు టెఱింగియుఁ
దత్ప్రతిష్ఠితలింగంబు భంగంబు నొందింపఁ దలంచుట వివేకంబు గాదని విభీ
షణుం డాడ నాడాడ నంగద కుముద నల నీల పనస జాంబవదాదివనచరనాయ

కులు దమకుఁ దోఁచినతెఱంగునఁ బలుభంగులం బలుక రఘుకులాధ్యక్షునికటాక్షం
బున జగత్ప్రాణసూనుని ప్రాణంబులకు హాని లేకుండెడు మని మహర్షు లాశీర్వ
దింప నభోభాగంబున బారులు దీఱి నగవిదారిప్రముఖబర్హిర్ముఖగరుడగంధర్వ
కిన్నరకింపురుషయక్షరాక్షససిద్ధసాధ్యాదివియచ్చరులు మచ్చెకంటులతో నిచ్చ
నచ్చెరుపడి చూడ సప్తమారుతంబులు నిజానుకూలంబుగా వాలంబున బలంబు
గూర్ప సాటి యేర్పఱుపరానియున్నిద్రరౌద్రంబునఁ బ్రళయకాలరుద్రుని కకాల
రుద్రుం డై దిక్కూలముద్రుజసముల్లోలకల్లోలంబు లై సప్తసాగరంబులు గలంగ
నభంగభయభంగురంబు లై సప్తద్వీపజనంబు లడలంగ సప్తాశ్వప్రముఖగ్రహ
నివహంబులు త్రోవలు దొలంగ సప్తకులపర్వతంబులతో ధరాతల ముఱ్ఱూఁత
లూఁగ మహాభూతంబు లాక్రోశింప దిక్కరులు ఘీంకరింప భూమిభరంబు భరింప
లేక వ్యాకులపడుకాకోదరలోకనాయకునిఁ బట్ట నట్టిట్టగుణరఠకమఠపరివృఢు నాను
టకై ముట్టె బిగఁబట్టి యాదిమకిటిపట్టభద్రుండు గట్టిగాఁ బీఁటపెట్ట నెట్టియుత్పా
తంబు పుట్టె నని పట్టుపుట్టంపుఁబట్టంపువేల్పుపట్టికి బెట్టిదపుఁజింత దొట్టికొనఁ
బాశాంకుశత్రిశూలడమరుఢక్కాటంకఖట్వాంగాదిసాధనంబులు గైకొని
తత్తఱించుకుమారప్రముఖప్రమథులు వారణానననివారణోక్తులు సైరించి కాచి
యుండ నానతాంగంబున సమంబులుగఁ గరచరణంబు లిలాతలంబునం బెట్టి సింధు
బంధనసమయసముత్పాటితమంధరధరాధరబంధురరేఖాధురంధరవసుంధరాధరజాలం
బగువాలంబున లింగమూల మామూలంబుగాఁ జుట్టి పట్టి చలపట్టి కరువలిపట్టి
యప్ప ట్టించుకయుఁ దర్పించి యుప్పరంబునం బెట్టెదనని చట్టుపలుగనుపట్టి మిట్టి
పడుగట్టుఱేనిగుట్టు మట్టుపెట్టి గట్టితనంబున బిట్టెగసి లింగంబు వీఁక తనతోఁక
వెంట నంటిరాక నిరాకరించుటం జేసి యాకసంబున సేకరింపలేక సకలలోకపాలక
హాహాకారంబులతో నవరంధ్రంబుల బుడబుడ నెత్తురులు వడియ వడి యడఁగి
యక్కడికి రెండుగడియలయెడ వొడ లెఱుఁగక పరవశుం డై పుడమిం బడియె
నప్పుడు.

130


క.

పవమానతనూజన్ముని, నవరంధ్రములందుఁ దొరఁగునవరక్తముచే
నవలోకసురవధూదృ, క్కువలయవలయ మన రక్తకుండము వెలసెన్.

131


సీ.

గమనవేగంబున ఘనజటాబంధంబు గళితమై యంసభాగమున గునియఁ
గేలఁ గుచ్చెలకొంగు గీలించి దగ మించ నసురుసురై సీత యరుగుదేర
భుజముల వెడజాఱుభుజపత్రవల్కలాంచలము చేఁ బూని లక్ష్మణుఁడు నడవఁ
గైదండ యొసఁగుటకై దండసాఁచినశయముతోడనె విభీషణుఁడు రాఁగ

తే.

నేరిపైఁ జింత లేక హాహారవంబు, తోడఁ గన్నీటిమున్నీటఁ ద్రోవ దడియఁ
దడయ కప్పుడు దశరథాత్మజుఁడు వచ్చెఁ, బవనతనయుండు మూర్ఛిల్లి పడినయెడకు.

132


ఉ.

అప్పుడు ధూళిధూసరితుఁ డై కనుదమ్ములు మోడ్చి మక్షికల్
గప్పుగొనంగ నెత్తురులు గ్రక్కెడునక్కపిముఖ్యుఁ జేరి మా
యప్ప! యిదేమిరా? యని ధరాత్మజ కన్నుల బాష్పపూరముల్
చిప్పిలఁ గేలుదమ్మిఁ దుడిచెన్ దనుసక్తధరాపరాగమున్.

133


తే.

అచట వసియించి తొడమీఁద ననిలసుతుని, శిరము గీలించి నెత్తుటిచేతఁ దడిసి
పుల్లసిలుమోము గనుఁగొని తల్లడించి, ప్రేమ సీతాధిపతి విలపింపఁదొడఁగె.

134


ఉ.

దాయలశూలముద్గరగదాపరశుక్షురికాదిహేతులం
గాయము గీయముం గననికాయ మపాయముఁ జెంది కందెనే
మోయి? మదీయసూక్తి వినవోయి! యి దేటికి మాటలాడ వా
హా! యసహాయశూరవిజయైకవిహార! సమీరనందనా!

135


క.

మాతయుఁ దాతయు మీ రని చేతులు మొగిడించి సేవ సేయుదువుగదా!
నాతండ్రి! మున్ను నాకును, సీతకు నిపు డేల? భక్తి సేయవు చెపుమా!

136


ఆ.

కన్నతల్లిఁ దండ్రి నున్నసోదరులను, జిన్ననాఁటనుండి చెలిమి నిండి
మన్నవారి నెల్ల మఱచియుంటిఁగదోయి, గాడ్పుపట్టి నీవు కలుగఁబట్టి.

137


ఉ.

క్షోణికుమారికామణి నశోకవనిం గని సంతసించి త
త్ప్రాణము నిర్వహించి వనపాలకులన్ వివళించి రావణా
రీణచమూవరేణ్యుల హరించి చరించుట లెంచ కక్కటా!
స్థాణువుచంన మొంది వివశత్వముఁ జెందుదురయ్య? పావనీ!

138


ఉ.

హాటకగర్భుబాణము నిశాటకుమారుఁడు నాట నేయఁ బో
రాటము వాయఁ బట్టువడి యట్టిటు మిట్టిపడంగ రావణున్
నోటికి వచ్చి నట్టని యనూనభుజాగతి నీటుమేటికిన్
బాటిలె నేటికిన్ వివశభావము దైవమ! యేమి సేయుదున్?

139


క.

సేమంబున నీ వున్నను మామూర్ఛ లడంచి ప్రాణి మరలింతు వయో
నే మెందఱ మున్నను నీను, నేమంబున మూర్ఛ దెలుపనేరమ తండ్రీ!

140


తే.

అకట! కనుసన్న చేసినయంతమాత్ర, నాత్రమున నేఁగి సంజీవనౌషధంబుఁ
దెచ్చి యిచ్చిన నినువంటిధీరమణికి, జీవ మెడఁబాయనాయె సంజీవరాయ!

141


ఆ.

జగతి యేల నేల సౌమిత్రి యేల సీ, తాలతాంగి యేల తక్కియున్న
వార లేల నిన్నువంటిగుణాఢ్యుండు, లేకయున్న నాకు నోకుమార!

142

క.

అని పలురీతుల మారుత, తనుజుని వదనాంబుజంబు దర్శించుచు రా
మనృపాలకచూడామణి, కనుఁగవపెన్నీట నతనికాయము దడిపెన్.

143


ఆ.

అంత మూర్ఛ దేఱి యక్షరక్షోవైరి, చింత జాఱి రాజసింహుఁ జేరి
కొంత తన్ను దూఱికొని బత్తిఁ దగుదారి, వింతసూక్తి మీఱి వినుతి జేసె.

144

నిరోష్ఠ్యదండకము.

శ్రీరాజితాకార! సాకారసాకేతరాచారసాకేతరాజన్యసన్యస్తనానాక్రియా! ధన్య
సంకీర్తనాసక్తనక్తంచరాదైన్యజన్యాచలాగణ్య! ధైర్యాశ్రయావాస! నిశ్రేయ
సాధార! సాధారణాన్యత్రయీకేళికాశాలినాళీకరాట్సంతతిక్షీరనీరాకరాధీశరా
కానిశాకాంతశాస్త్రైకరాద్ధాంతగాధేయయాగాంతరాయక్రియాకారణాదిత్య
రాజారినిర్దారణా! చారణశ్రీహృతాంచజ్జటాధారినారీశిలాకార! శ్రీకంఠకాండా
సనాహీంద్రనాగాంతకాశాంతకాంతాంతరంగాధరాకన్యకారీణకల్యాణకల్యా
సకల్యాణ! కల్యాణధాత్రీధరస్థైర్య! రక్షశ్ఛటాహస్తిహర్యక్ష! క్షత్రక్షయాక్షయ్య
శక్తిస్థిరజ్యాజిరేశానసంఘర్షణాశాలితాశ్రాంతసత్కీర్తిసంఛన్నదిగ్దేశకర్ణాంత
దృగ్దీర్ఘతానందితానందనాత్యచ్ఛనీరేజతేజఃకళానిర్జితానంగరత్నాంగదా! రంగదా
కాశగంగాతరంగచ్ఛటాసంగజంఘాలనిర్హ్రాదఖేదా! నతాస్యైకదృశ్యద్ధశస్యంద
నాజ్ఞాదృతారణ్య! తారాకళత్రాననశ్రీచకాసత్కళత్రాశ్రితాశ్లేషణానంద! నానా
జటీశాగ్రణీజాగ్రదర్చాలసచ్చిత్త! సత్యాశయాయత్తపారంగ! దైతేయశిక్షాకళా
దక్ష! సత్క్షాంత! సాక్షాచ్చిదాకాశసంకాశహేతీ! కిరాతీకృతానేకసత్కార!
సత్కారణైరాదృతాదిత్యసంజాత! శాతాస్త్రసంధాత! లేఖాధిరాణ్ణందనాకంధి
సంత్రాససన్నాహఛిన్నాదితేయారి! యేరీతి నీరీతి నీరేజజాతాదిధీరాగ్రణీజాతికిం
జింత సేయంగఁ జిచ్ఛక్తి రంజిల్లెడిన్ జెల్లరే హల్లకాస్త్రారిదారిన్ గ్రసింపన్
హృషీకేశతాసక్తి రక్షింపఁ గంజాసనాఖ్యం జగజ్జాతసృష్టిన్ ఘటింపన్ నటింపన్
ద్రిలోకాధినాథాకృతన్ జెంది నీశక్తి నిత్యస్థితిం గాంచఁగారాని హేలాగతిన్
రాజలీలన్ రజఃకేళి లాలింపఁగా నెంతయాసక్తి యయ్యారె యయ్యాసతీసంగతిన్
రాగలీలాదృతిన్ గన్నచందాన నందంద క్రీడింప డెందాన నీక్రీడ ధ్యానించి యజ్ఞా
ళిరాజన్యతాజ్ఞాతృచాంచల్యసంగాంతరంగస్థితిన్ జిక్కి తర్కించి హీనక్రియం గాంచి
కించిజ్ఞధీలీల నీహేల శ్రీలాకుటీసక్తిగా నిర్జరాధ్యక్షరక్షావనారక్తిగా నెంచి యిష్టార్థ
సిద్ధిం గనం జాలె నజ్ఞానరింఛోళినీహాళికంజాతజాతాండకాండక్రియాశాలిగాఁ
గాంచి నీచిత్కళాకారరేఖాగతిన్ జ్ఞానదృష్టి న్నిరీక్షించి చిత్తేంద్రియాదిక్రియా

సాక్షిచైతన్యరేఖన్ నిరాఘాటతన్ జేసి రాజిల్లె శ్రీజానకీకాంత నీచెంత నత్యంత
కాంతాకృతిన్ నిల్పి కల్గింపఁగాఁ గంటి నేతాదృగంగాఖ్యలీశాతదన్యస్థితిన్ గన్న
నీచేతనే ఖ్యాతి రాజిల్లెడిన్ జండరాత్రించరచ్ఛేదనక్రీడఁ గ్రీడింపఁ దండ్రీ!
జగత్కారణక్రీడ లిచ్ఛాగతిం జెంది యాద్యంతహీనాకృతిన్ గన్నజెజే గలాఁడే
యిలాకన్యకాచిత్తకాసారసంచార! చంచద్దయాదృష్టి దృష్టించి నాజాతిచేష్టాని
కృష్టేహ దృష్టింప కిష్టాదృతిం జేర్చి రక్షింపఁగా నీకె కా కేరికిం జేరికే? హారి
కల్యాణసంాయకా! దైత్యహృత్సాయకా! జానకీనాయకా!

145


మ.

అని వినుతించి రామవసుధాధిపుచెంత వసించి మూర్ఛిలం
గను గనుదోయిబాష్పములె కౌతుకబాష్పము లైనమాతకున్
జనకకుమారికామణికిఁ జాఁగిలి మ్రొక్కి కరద్వయంబు చ
క్క సుదుటఁ జేర్చి యి ట్లనియె గౌరవచారువచోవిజృంభణన్.

146

మత్తేభకందగర్భితసీసము.

విగతకామాత్ములు విశ్వమాతవుగదా కల్యాణియం చెన్నఁగాఁ దనర్చి
విహితతత్త్వస్థితి విద్యలై త్రిగుణతాహేలాకృతిం జెంది యీక్రమమున
సతతసౌశీల్యవిశాలకల్ వెలయఁగా దర్శించి ధన్యుల్ సదా ముదమున
నిశితబుద్ధ్యున్నతి నిన్నె కొల్తురు గదా సీతా జగత్కారిణీ! తిరముగ


ఆ.

ననుచు వివిధగతుల ననిలతనయుఁడు పొ, గడిన వినుచును దగుకరుణ ననెను
జనకనృపతితిలకతనయ ఘనతరల, సదమృతరససుఖదవిదితగతిని.

147


మ.

సకలసజ్ఞానకళాకలాపుఁ డినవంశస్వామి లోకావనో
సికతామాత్రునిగాఁ దలంపఁదగునే నే డాదిగా నిట్టిగా
త్సుకుఁడై శాశ్వకభ క్తియుక్తి శివు నీచోటక్ బ్రతిష్ఠించిన జ్
యకముల్ సేయకుమన్న! స్వామిహితకార్యాసన్నతం పుత్రకా!

148


తే.

తప్పు చేసినిఁ బతి కని తల్లడిలకు, నీమనశ్శుద్ధి యెఱుఁగు శ్రీరామవిభుఁడు
పాపఁ డాటల కెనసినపనులు చూడఁ, దండ్రి కానందములు గాక తప్పు లగునె?

149


క.

స్వామి నిజమర్మ మంతయు, నీమీఁదియనుగ్రహమున నీ కెఱిఁగించెన్
బ్రేమమున దాఁర కిప్పుడె, నామర్మము దెలిపెదను సనాతనఫణితిన్.

150


క.

రామస్వామిపరాత్పరుఁ, డేమూలప్రకృతిఁ గార్యహేతుత్వములన్
మే మిరువుర మై చెలఁగుదు, మామీఁదటియొకరహస్య మధిపుఁడె యెఱుఁగున్.

151


శా.

తత్సాన్నిధ్యవిశేష మేఁ గని మహత్తత్త్వాదితత్త్వైకసం
సత్సామగ్రి వహించి తద్విషయరూపవ్యాపకం బైనయే

తత్సర్వంబు సృజింతుఁ బెంతు నడఁతున్ ద్రైగుణ్యవిస్ఫూర్తిచే
వత్సా! మన్మహిమంబె సుమ్ము మతిదృగ్వ్యాపారదృశ్యాకృతుల్.

152


మ.

త్రిపుటీశూన్యున కీజగజ్జననశక్తిస్ఫూర్తి వర్తిల్లఁగాఁ
గపిలోకేశ్వర! సత్వసంకలితసంకల్పాకృతిన్ మించి భే
దపుభావంబు వహించి యుండియు నభేదవ్యాప్తి వర్తింతు నీ
యపురూపంపురహస్య మీ వెఱిఁగి నిత్యానందముం బొందుమా.

153


తే.

తావకీనాంగకీలాలధార జాఱ, వఱలుకుండంబు నీపేర వన్నె మీఱ
ఘోరదురితాపహారప్రకార మగుచు, నిది మొదలుగాఁ బ్రసిద్ధి వహింపఁగలదు.

154


సీ.

పొడగన్న నడ రెన్నఁ డిడకున్నఁ గడచన్నయెడ మన్ననల నిల్పు నీతటాక
మరుదెంచు బిరుదెంచునరుముంచు తెరవొంచి పెరిగించు గురుఁ జేర్చు నీతటాక
మనువారఁ దనుఁ జేర నైన రూరఁ దనివారు నినపారరుచి సేయు నీతటాక
మును మానమున మాన కనుతానమున పాన నెనలేని సిరు లీను నీతటాక


తే.

మిది జగజ్జనజీవనం బిది సుధైక, జీవనం బిది లోకైకపావనంబు
ఇది తపోధనపరితోష మిది విశేష, మీసరంబు సరంబులమీసరంబు.

155


తే.

జనులయెమ్ములు నీసరోజలములందు, నెంతకాలం వసియించు నంతకాల
మంతకాలయ మొందక చింత మాలి, దివ్యగతి నుందు రమరసదృక్షు లగుచు.

156


తే.

హేళిలీల తమఃపాళి హాళి మాలి, వ్రాలులీల సదాలోకలోలలోక
జాలభవహాలహలహారి! శూలపాణి, త్వత్సరోమణి మునుఁగ దుర్దశ లడంగు.

157


సీ.

భవజటాజూటసంభవ యైనగౌతమీనదిలోనఁ దాన మొనర్చుసుకృతి
కశ్వమేధసహస్రశాశ్వతఫల మబ్బు నబ్బుర ముబ్బింప నంతకంటె
శతగుణాధికపుణ్యసంపద నింపుగంగాపతంగకుమారికాతరంగ
సంగతి గలసరస్వతిలో మునింగిన నానదీస్నానోపమానఫలము


తే.

చేరుఁ దావకకుండాభిషేకమహిమ, నహి మహేశ్వరునంతవాఁ డైన దీని
నెఱిఁగి యిదమిత్థ మని నుతియింపఁగలఁడె, నిజము చెప్పెద విను మింక నిష్కళంక!

158


క.

హనుమత్కుండంబున నే, జనుఁడేని తిలోదకము లొసఁగు ముదమున నా
తనిపితరులు ఘృతకుల్యం, దనరుదు రని సపతియై జనకసుత పలుకన్.

159


క.

సీతారాములపలుకుల, చేతఁ గలఁకదేఱి యచట శివలింగము సం
ప్రీతిమెయి నిలిపె మారుతి, భూతలజను లెల్ల మొదటఁ బూజ లొసంగన్.

160


వ.

ఇత్తెఱంగుస లోకోత్తరుం డైనమరుత్తనయుండు సీతామత్తకాశినీచిత్తేశచిత్తహర
లింగంబునకు నుత్తరంబున నిజాయత్తలింగంబు నభంగనిష్ఠం బ్రతిష్ఠించెనట

న్నతనిలాంగూలవేష్టనంబున రామలింగంబు వళిత్రయకలితాంగం బై యిప్పటికి
జగజ్జనదర్శనంబులకు నిదర్శనం బయ్యె నని రామలింగప్రతిస్థాపనకథనంబు దురధి
గమజనురంబుధినిర్మథనం బని వసిష్ఠమునిపురుహూతుండు గౌతమసూతి కి ట్లనియె.

161


ఉ.

వాయుజుపై ధరాత్మజకు స్వామికిఁ గల్గినప్రేమ తత్కృపా
శ్రీ యిరువొందుటల్ తెలియఁజెప్పినయీకథ విన్నమేటి దీ
ర్ఘాయురుపేతుం డై బహుధనాన్వితుఁడై చెలువొంది యంతటన్
శ్రేయముఁ జెందు నా విని వసిష్ఠతపస్వికి శ్రోత యి ట్లనున్.

162


ఉ.

హృత్పరితాప మార్చి కృప నీగతి మారుతిఁ బ్రోచి రామభూ
భృత్పరమేశుఁ డెందు వసియించె? విశేషము లెవ్వి? శ్రీహనూ
మత్పరసత్కథామృతము మాటికిఁ గ్రోలెదఁ దెల్పవే యనన్
దత్పరతం దథావిధకథావిదుఁ డమ్మునివర్యుఁ డి ట్లనున్.

163


ఉ.

రాజకులైకభూషణుఁడు రాముఁడు పుష్పక మెక్కి జానకీ
రాజముఖీసమేతుఁ డయి రమ్యమతిన్ నిజరాజధానికిన్
దేజ యెలర్పఁ బోవుచును దివ్యులపువ్వులసోనతో భర
ద్వాజులయాశ్రమం బరసి వాయుకుమారునిఁ జూచి యి ట్లనున్.

164


చ.

పరహృదయజ్ఞతాగరిమఁ బ్రౌఢవచోరచనాచమత్క్రియన్
సరసుఁడ వౌట మాభరతుసన్నిధి కేఁగి మదాగమంబు మ
చ్చరితముఁ తెల్పి రమ్మనుచు స్వామి ప్రియంబునఁ బంపె మారుతిం
దిరువడికంటె నాప్తుఁ డవనీపతి కెవ్వఁడు భక్తిశక్తులన్.

165


ఉ.

పంచిన మంచి దం చంగి పావని మానపరీతి నాతనిం
గాంచి తదంచితార్చనలు గైకొని రామకథామృతంబు వ
ర్షించె హరించే శోకశిఖిజీవన మిచ్చి తటంచు నెంచి హ
ర్షించె ఘనప్రభావులకుఁ జిత్రమె యుల్లము చల్లసేయుటల్.

166


తే.

హనుమరాక వహిల్లనయాక్షణంబ
దరహసనచంద్రికలు గాయఁ దమము వాయఁ
డఱుచుగా హర్షబాష్పామృతంబు గురియఁ
బటుకళానిధి చెలువొందె భరతుఁ డపుడు.

167


మ.

ఘనసేనావళి మేనఁ బూసికొని శాకద్వీపమర్ధక్షణం
బునఁ బ్రాపించినసత్వరంబు దనరం బోనిచ్చి రామాభిషే

కనిమిత్తం బయి యుత్తరాంబునిధి రంగన్నీరపూరంబు కాం
చనకుంభంబునఁ దెచ్చు టేమిటికి నాశ్చర్యంబుగా నెన్నఁగన్.

168


ఉ.

మారుతిఁ గూర్చి స్వామి బహుమానము మిక్కిలి చేసి యున్నచో
నారఘురామునానతి మహామణిహారము పూని దీనమం
దార! కుమార! రమ్మనుచుఁ దానె యురంబున వైచి చూదె న
య్యారె! ధరాకుమారి కనిలాత్మజుపైఁ గల కూర్మి యెట్టిదో!

169


ఉత్సాహ.

ధారుణీకుమారికాప్రదత్తరత్నహార మ
క్షారి వక్షమందుఁ బూని యభ్రశుభ్రవాఃకణో
దారతారకానళీవృతస్ఫురత్సురాచలా
కారుఁ డై చెలంగె నన్న గౌతమాత్మజుం డనున్.

170


ఉ.

అప్పుడు రామచంద్రుఁడు శతాననరాక్షసశిక్షఁ బూనుటల్
డెప్పర మైన మారుతికడిందిబలంబునఁ బూనె నంటిరే
యప్పని యెట్లు పూనెఁ బవనాత్మజుఁ డంత సవిస్తరంబుగాఁ
జెప్పఁగదే యనన్ ముని వచించు సమంచితవాక్చమత్క్రియన్.

171


ఉ.

ఆహవభూమి రామవినుతాత్మశరోదితశోణితోద్భవో
త్సాహబృహచ్ఛతాననశతంబు హతంబుగ నేల మట్టుచున్
వాహన మై ద్విషజ్జయ మవారణ నిచ్చిన మెచ్చి మచ్చికన్
శ్రీహనుమంతుఁ గన్గొనెడు సీత జగత్త్రయమాతఁ గొల్చెదన్.

172


చ.

క్షితిసుత మున్ను రాఘవునిచే హనుమత్కపి యేకపాదరు
ద్రతయుఁ దదంశ మూని యవతారముఁ జెందుట లాలకించె నం
చతని రఘూద్వహుండు గొనియాడిన దెల్లను దేటగా వచిం
చితిఁ గద యంతమీఁదటివిశేష మశేషము విన్ము తెల్పెదన్.

173


శా.

కాకుత్స్థాగ్రణి యట్టు లాత్మకథ వక్కాణింప భూపుత్రి య
త్యాకాంక్షన్ వినఁగాఁ బ్రపత్తి మెయి సాష్టాంగంబు సేవించినన్
మీకారుణ్యమునం జెలంగుభటునిన్ మీ రింత వర్ణింతురే?
యోకారుణ్యచరిత్ర! శత్రుహృతి కుద్యోగింపరే నావుడున్.

174


సీ.

పురరక్ష కనురూపబుద్ధిసంపన్ను మహామాత్యు నియమింప నవధరించి
యుఱవైన ప్రజ నేఱుపఱచి తోతెండని సేనాధిపతులకు సెల వొసంగి

కౌసల్య మొదలుగాఁ గలతల్లులకు మ్రొక్కి వారిచ్చుదీవనల్ వరుస నంది
తమయత్తలకు మ్రొక్కి తాను రాఁ బయన మౌక్షితిసుతరాక కంగీకరించి


తే.

మణిమకుట మూని హైమవర్మంబు దొడిగి
హారకేయూరకరకంకణాదిబిరుద
భూషణాలంకృతాంగుఁ డై భూమివిభుఁడు
వేగమున యుద్ధసన్నద్ధవేషుఁ డయ్యె.

175


సీ.

తనవామహస్తంబు దక్షిణమృదుపాణి వహియించి సీత పార్శ్వమున నడవ
నాబద్ధతూణీరుఁ డై వెన్క సౌమిత్రి శరచాపములఁ బూని యరుగుదేరఁ
దొడి పూసి కట్టి యప్పుడు వచ్చుప్రజ జూపి భరతశత్రుఘ్ను లెచ్చరిక సేయ
నుభయభాగంబుల నొడ్డోలగంబుగా సబలు లర్కజవిభీషణులు గొలువ


తే.

గజరథతురంగమపదాతికలితమనుజ, దనుజవనచరసైనికోత్కరముతోడ
హనుమ వలపలిమూఁపుపై హస్త మూని, యినకులస్వామి నగరోపవనముఁ జేరి.

176


తే.

భరతభానుజపౌలస్త్యపతులఁ జూచి, మనబలము లెల్ల వచ్చెనే యనిన స్వామి
యన్నియును గూడె నని వారు విన్నవింప, హనుమకడఁ జూడ నతఁడు సాష్టాంగ మెరఁగి.

177


క.

చుక్కలు మొలపూసలుగా, దిక్కుల కవకాశ మిడని దివ్యాంగముతో
నెక్కడఁ జూచినఁ దా నై, యక్కపిశేఖరుఁ డజాండ మంతయు నిండెన్.

178


సీ.

ఒక్కజంగకుఁ జాల వుల్లోలకల్లోలసంప్లుతాంబరసప్తసాగరంబు
లొక్కచక్కికిఁ జాల వుగ్రభానుహిమాంశుకుండలోద్యద్గ్రహమండలంబు
లొక్కఘట్టన కోర్వ రుర్వరాఖర్వదూర్వహవరాహివరాహరాజముఖ్యు
లొక్కయుద్ధతి కాన దూర్ధ్వలోకానీకగర్భితబ్రహ్మాండకర్పరంబు


తే.

శక్రవిద్వేషివిభవంబు నాక్రమింప, విక్రమించుత్రివిక్రమోపక్రమమున
నధికుఁ డమేటి కమలగర్భాండపేటి, నిండి నిజమూర్తి విస్ఫూర్తి నిలిచె నపుడు.

179


సీ.

మయి గదల్పఁడు గాక పయిచూర్ణ మై రాలు క్షణములో నూర్ధ్వలోకంబులెల్లఁ
జక్క నిక్కఁడుగాక వ్రక్కలై పడిపోవు గడి దక్కి యట మీఁదికర్పరంబు
పదము మెట్టఁడుగాక భగ్గున నడుగంటుఁ బైమోపుతోఁ గచ్ఛపప్రభుండు
బిగువు చూపఁడుగాక పెటిలి బీఁటలు వాఱుఁ జక్రవాళముతో దిశావలయము


తే.

అఖిలదుస్సహరాక్షసాధ్యక్షశిక్ష, కెనయుతను వావహించుట యింతె కాక
యట్టివిగ్రహమున నాగ్రహమును బూని, నిగ్రహించిన లోకముల్ నీఱు గావె?

180


తే.

మారుతి సమస్తలోకోపకారి గనుక, నొక్కదిక్కున ఘనమూర్తి నొందియున్న
నవని యెక్కడఁ గ్రుంగునో యతిభరమున, ననుచుఁ గకుబంతముల నెల్ల నావరించె.

181

మ.

తననిర్ఘాతకఠోరవాలము బృహత్కాయంబు రక్తాననం
బును బద్ధాంజలియున్ రఘూధ్వహపదాంభోజాతవిన్యస్తస
ద్వినయాలోకము దుర్నిరీక్ష్యతనుకాంతిస్ఫూర్తి వర్తిల్లఁగా
హనుమద్వానరవీరుఁ జక్క గనలే రవ్వేళ బ్రహ్మాదులున్.

182


సీ.

ఆపదుద్ధారకం బనుమనూత్తమముచే సద్భక్తుఁ డై విభీషణుఁడు పొగడె
మంత్రి గాఁదలఁచుదుర్మదుఁ డనన్ క్షమియింపు మని హస్తములు మోడ్చె నర్కసుతుఁడు
మాత్రివిక్రమమూర్తి మారటమూర్తియే యౌ నని ఋక్షేశుఁ డభినుతించె
నింతవాఁ డై గర్వ మింతయుఁ గనఁ డంచుఁ గాకుత్స్థపతి శిరఃకంప మూనె


తే.

ధరణిసుత కన్నుఁగవ మోడ్చె భరతుఁ డెంచె
నలరె సౌమిత్రి శత్రుఘ్నుఁ డరుదు సెందెఁ
గొదవవారల నేమి చెప్పుదు కపీంద్రుఁ
జక్కఁ గను విచ్చి చూడ నశక్తు లైరి.

183


సీ.

ఆవేళ హనుమంతుఁ డాకాశ మంటిన తనదీర్ఘదేహంబు ధరకు వంచి
పతి కెక్క నజ్జుగా నతి సేయునటు లున్నఁ దన్మహాకంధరాంతరమునందు
ధరణిజ నెక్కించి తానును మున్నెక్కి మెట్టి రాఁ దలఁకుతోఁబుట్టువులను
నరసైనికుల వనేచరసైనికుల నిశాచరసైనికులఁ జూచి శంక యేల?


తే.

హనుమ నారోహణము సేయుఁ డనిన వారు, నేల యీలినచందాన నిండియున్న
తమతమబలంబుతో గూడి తరుచరేంద్రు, వీఁపుపై నెక్కి వినుతి గావించి రపుడు.

184


సీ.

ఎవ్వాని బలుసేన లెత్తిరాఁగలవన్నఁ బల్లటిల్లుదు రిలాభారవహులు
లెక్క సేయఁగరాని దిక్కున నేరాజుమూఁక పేరు గణించు లోకవితతి
యేరాజువాహిను లెదురొడ్డి లవణాబ్ది బెట్టిదం బడఁగించి కట్ట గట్టె
నేరాజుబలకోటి నీక్షించి జేజేలు చుక్క లెన్నికయైన సులభమండ్రు


తే.

సాగరము వెల్లివిరిసినచంద మొందు, నేమహారాజుదళ మట్టిరాముసేన
యఖిలమును గూడి వీఁపుపై నధివసించె, ననిన సామీరిమహిమ యే మనఁగవచ్చు?

185


క.

హనుమచ్చరమాంగాగ్రం, బున సీతాయుక్తి రామభూవరుఁ డలరెన్
కనకధరాధరశిఖరం, బున నిలిచిన మెఱుఁగుతోడిమొగులుతెఱఁగునన్.

186


ఉ.

సందడి సెంది వందురక సందుల గొందులఁ జిక్కి తొక్కుడుల్
పెంపక వెక్కసం బడరి చిందఱవందఱ గాక మూఁక లా
నందము నొందుచున్న రఘునాథునియాజ్ఞ శిరంబునన్ మరు
న్నందనుఁ డావహించి గగనంబున కుద్ధతి నుద్గమించినన్.

187

తే.

వనచరేంద్రునిలాంగులవల్లి యనెడు, కాఁడతుదఁ గూడి లోనఁ జుక్కలబెడంగు
దొరసి మెఱసినయూర్ధ్వకర్పరము వొలిచెఁ, బుడమిఱేనికి ముత్యాలగొడుగులీల.

188


శా.

ద్యావాభూఃపరిపూర్ణభృత్యచరమాంగాగ్రస్థలాధ్యాసి యై
భూవర్యాగ్రణి మింటిత్రోవఁ జనుచున్ బుణ్యాశ్రమోర్వీరుహా
గ్రావారణ్యసరిత్సరోవరనదగ్రామావళుల్ చూపి సీ
తావామాక్షికిఁ జెల్పె ని ట్లనుచుఁ దత్తద్వర్ణనోదీర్ణతన్.

189


చ.

అరిహరణార్థియై చన నిజాయతవార్లహగీఘుమంఘుమ
స్వరమున గెల్పుదీవన లొసంగుచుఁ దుంపరముత్తియంబు లు
త్తరళతరంగహస్తములఁ దాల్చి లయార్థము సేస వెట్టెడిన్
గరువలిపట్టికిం గగనగంగ గనుంగొను మంగనామణీ!

190


ఉ.

గిబ్బవయాళికానిజడకెంజిగి యంటెనొ వేల్పుసిబ్బెపుం
గుబ్బెత లుబ్బియాడుతఱి గుబ్బిల జొబ్బిలుకుంకుమప్రభల్
ప్రబ్బెనొ మంచుగుబ్బలిఁ దొఱంగుట జేగురు రేఁగెనో యనన్
గబ్బి వహించె నెఱ్ఱనయి గంగ మరుత్సుతుకాంతి పర్వినన్.

191


మ.

సరసభ్రాజదనంతపాదకటకున్ సంఛాదితాశాంబరున్
సురసంసేవ్యు శిరస్సముజ్జ్వలసురస్రోతస్వినీచంద్రు బం
ధురశుభ్రచ్ఛవిమూర్తిఁ బల్లవధనుర్దుస్సాధ్యయోగీంద్రు భా
సురసారంగసముత్కరున్ హిమగిరీశుం జూడు మబ్జాననా!

192


లయగ్రాహి.

రంగుగల పచ్చలమెఱుంగుఁ గని పచ్చికబెడం గనుచు వచ్చినకురంగములగుంపుల్
చెంగటనే భగ్గునఁ బతంగమణు లంటినమిడుంగుఱులు గెంటి తమయంగములఁ బాఱన్
చంగునను దాఁటి యుఱుకం గెలన నవ్వెడిసురాంగనలనవ్వులఁ గరంగునెలరాలం
గాంగలహరింబలెఁ దొరంగుచఱులం గెలయు బంగరపుగ ట్టదె కుఱంగట లతాంగీ!

193


తే.

కౌంజరేయాంగరుచివల్లికలు కడాని, గట్టు ముంచినఁ గని తెఱగంటిచెలులు
మింటఁ జనుదెంచె రెండవమేరు వనుచు, నుఱక భయవిస్మయము లొందియున్నవారు.

194


సీ.

డిండీరఖండప్రకాండధావళ్య మాననము వెల్వెలఁ జేసికొనుట గాఁగఁ
దోడ్తోఁ బొడమునీటితుంపరల్ నెఱ మేనఁ దవులు స్వేదాంబుబిందువులు గాఁగ
వినువాఁక మొనదాఁక నెనయ నుబ్బుట పత్నిఁ గూడి యోజింప నేఁగుటలు గాఁగ
సర్వదిక్కూలంకషధ్వాన మిది మానుఁ డని బిట్టు మొఱపెట్టుకొనుట గాఁగఁ

తే.

దివిరి మును దక్షిణాబ్ధి బంధించినటుల, వచ్చెనో తన్నుఁ గట్టి౦ప వాయుజుఁ డని
వెఱవు మది గ్రమ్మి ముత్యంపువిరులఁ బూజ, లొసఁగుచున్నట్టు లున్న దీయుత్తరాబ్ది.

195


తే.

సహజగుంభితశబ్దముల్ శ్రావ్యములుగ, సహజగాంభీర్యమాధుర్యసహిత మగుచుఁ
గవుల నోరూరఁజేయుసత్కావ్యరీతి, యిక్షురసవార్ధి చెలువొందె నింతి కనుము.

196


ఉ.

ఊరక మ్రోయుచుం దెసల కుద్దతిఁ దుంగతరంగహస్తముల్
బారలు చాఁపుచున్ నురుఁగుఁ బైపయిఁ జూపుచు దుంపరల్ పడం
బాఱుచు బొంగుచున్ బయలు ప్రాఁకుచు గట్టులు దాఁకుచున్ సురా
నీరధి మించెఁ జూడు తరుణీ! జడభావము మాన దెయ్యెడన్.

197


మ.

జలకాంతాకబరీభరోజ్జ్వలమిళచ్ఛైవాలనీలప్రభా
వలయోత్తుంగతరంగసంఘవిచలద్వైమానికానీక మై
జలభద్రేభవిహారముద్రితసమంచచ్చంద్రికావర్త మై
చెలువొందెన్ ఘృతవారిరాశి యెదుటన్ సీతాసితాబ్జేక్షణా.

198


శా.

ఆకర్ణాంతవిశాలలోచనశతాస్యాదిత్యవిద్విడ్భుజా
వ్యాకౢప్తామితపాలనాన్వితము మాయాపట్టణం బున్నత
ప్రాకారోపరిశృంగలగ్నరవిచక్రక్షేమసాక్షాత్కృతే
చ్ఛాకల్పారుణదోఃప్రయాస మదిగో శాకాంతరీపంబునన్.

199


ఉ.

దానవలోకనాథునిప్రతాపశిఖల్ వడిఁ గ్రమ్మి నిల్చిన
ట్టీనగరంబుచుట్టుఁ దగుహేమపుఁగోట త్రినేత్రుఁ డైనచో
మానిని చక్కఁ జూడ నసమర్థుఁ డనన్ బెఱవారు శక్తులే?
వీనిఁ దృణీకరించి కపివీరుఁడు మారుతి వచ్చెఁగా కిటన్.

200


మ.

అతిలోకం బగుదైత్యవానరనరేంద్రానీకమున్ వీపుపై
భృతి గావించి నభోగతిం ద్రిజగదాభీలప్రయాణోద్ధతిన్
జతురంభోధులు దాఁటి శత్రుపురిఁ జేర్చ న్నేర్చు నెవ్వాఁడు? మా
రుతపుత్రుం డవలీల నింతపని కారోహించెగా కియ్యెడన్.

201


ఉ.

నాలుగువారిరాసులు క్షణంబున దీవులతోఁ దరింపఁగాఁ
జాలినయప్రమేయజవశాలికి మున్ లవణాబ్ది దాఁటుటల్
చాలబ్రయత్నమే? భువనజాలము లన్నియు నొక్కజంగకుం
జాలునె? కామరూపత పొసంగిన నిక్కపిచక్రవర్తికిన్.

202


మ.

మన లంకాపురిమీఁదఁ బోవుతఱిఁ నిమ్మూర్తిన్ విజృంభించి ని
ల్చినఁ దద్రావణకుంభకర్ణు లెదురే చింతింప మత్కీర్తిభూ

జను లెంచన్ లవణాబ్ధిబంధనముఖోత్సాహైకసాహాయ్యుఁ డై
తనరెన్ నా కితఁ డాప్తుఁ డై తగ నసాధ్యం బెద్ది లోకంబులన్.

203


క.

ఈకడ వింతలు మనము వి, లోకింప జవైకగతిని లోభము వొరసెం
గాక మనోజవగమనముఁ గైకొన నిద్దీవి నిమిషగతి కున్నదియే?

204


ఉ.

బాలమరుచ్చలత్కిసలపాణి చలింపఁ బికాళి రాజకీ
రాళి మృదూక్తిఁ బావని నిజావనిఁ బాదము లూఁదఁ బిల్చుఁ ద
త్కేళివనాంలలక్ష్మిఁ దిలకించితె? చంచలనేత్ర! యచ్చటం
బాళెము డించి రక్కసులఁ బంపుద మర్కజువీడు చూడఁగన్.

205


మ.

అని రామక్షితిపాలమౌళి సుమనోహారిత్వరంభాదిరం
జన మై సంశ్రితదేవవల్లభరమాసంభావితం బైననం
దనముంబోనిద్విషత్పురోపవనమున్ దర్శించి వాతాత్మజుం
గని సేనాతతి నీడ డించు మని పల్కన్ భూమికిం డిగ్గుచోన్.

206


ఉ.

అబ్బురమయ్యె నద్దిర యజాండము నిండినదండిమేనితో
గొబ్బున వచ్చుచున్న దొకకోఁతి యటం చురుదండపాణు లై
ప్రబ్బినకిన్కఁ బూను వనపాలురు మ్రగ్గగ డిగ్గె నేలకున్
డెబ్బదిరెండువెల్వలును డిగ్గెను డిగ్గిరి సైనికాగ్రణుల్.

207


క.

ఆరామనృపతి సతితో, నారామ మలంకరించి యర్కజముఖులం
జీరి సురారిమహాపురి, పై రణమున కరుగుఁ డనుచుఁ బనిచె ననుటయున్.

208


క.

విని గౌతమసుతుఁ డిటువలెఁ, బనిచిన పతియాజ్ఞ బూని భానుజముఖ్యుల్
చని సురవైరులతో నని, మొనసినపని దెలుపుఁ డనుచు ముని నడుగుటయున్.

209

ఆశ్వాసాంతము

చ.

అసురహరా! హరాజమహితాక్ష! హితాత్మవిచార! చారణా
ప్రసరదయా! దయారసనిరంజన! రంజనభావ! భావనా
భ్యసనపరా! పరాశరముఖాదర! ఖాదరధీర! ధీరతా
హసితధరా! ధరావనసమాహిత! మాహితబోధ! బోధకా!

210


క.

శరణాగతభరణాభ్యా, శరణాహతదూషణాదిశాత్రవ! కరుణా
శరణా! పరిహృతశరధీ!, శరణాకరణాదిదూరసంవిద్ధరణా!

211


స్రగ్విణి.

అబ్జపత్రేక్షణా! యార్తసంరక్షణా! యజ్ఞరేఖాననా! యాశ్రయత్కాననా!
యబ్జకీర్త్యాదరా! యార్యవర్యాదరా! యబ్జసింధూర్భిదా! యచ్ఛమద్ధ్యాస్పదా!

212

గద్య.

ఇది శ్రీమదంజనాతనయదయారసలసత్కటాక్షవీక్షామహత్వసంప్రాప్తకవిత్వ
విద్యావధాన సగుణనిర్గుణధ్యానవాసనాభిధానమానసబిసపుష్ప పుష్పగిర్యప్పనార్య
కుమార సమాశ్రితబుధాచార గురుజనవిధేయ తిమ్మననామధేయప్రణీతంబైన సమీర
కుమారవిజయం బనుమహాప్రబంధంబునందు మైరావణవధయును సత్యలోకగతుం
డైన గంధమాదను మరలఁ దెచ్చుటయు లింగప్రతిష్టాపనకథయును దత్త్వోపదేశం
బు సేయుటయు హనుమత్తీర్థమాహాత్మ్యవర్ణనంబును హనుమద్విశ్వరూపంబును
మాయాపురప్రయాణంబును దత్పురోపవనప్రవేశంబును నన్నది చతుర్థాశ్వాసము.

—————