సత్యశోధన/ఐదవభాగం/35. పంజాబులో

వికీసోర్స్ నుండి

35. పంజాబులో

పంజాబులో జరిగిన ఘోరాలకన్నింటికీ అపరాధిని నేనేనని సర్ మైకేల్ ఓడయర్ నిర్ణయించారు. ఇక అక్కడ కొందరు నవయువకులు మార్షల్ లాకు కారణం నేనేనని, నేను అపరాధిని అనడానికి కూడా వెనుకాడలేదు. కోపంతో పెట్రేగిపోయిన ఆ నవయువకులు సహాయ నిరాకరణోద్యమాన్ని నేను మధ్యలో వాయిదావేసి యుండకపోతే జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ జరిగియుండేది కాదని, మిలటరీ చట్టం అమలులోకి వచ్చియుండేది కాదనే స్థితికి వెళ్లారు. గాంధీ గనుక పంజాబులో అడుగు పెడితే తుపాకీతో కాల్చి పారేస్తామని కూడా కొందరు బెదిరించారు. కాని నేను చేసిన పని సరియైనదేనని, తెలివిగల వాళ్లెవరూ అందుకు భిన్నంగా ఆలోచించరని నా నిశ్చితాభిప్రాయం. పంజాబు వెళ్లడానికి ఎంతో తొందరపడ్డాను. నేను పంజాబు చూడలేదు. చూడగలిగినంత వరకు పంజాబును చూడాలని అభిలాష కలిగింది. నన్నక్కడికి ఆహ్వానించిన డా. సత్యపాల్, డా. కిచలూ, పండిత రామభజదత్త చౌదరిగారలను చూడాలని ఆరాటం ఎక్కువైంది. వారు జైల్లో ఉన్నారు. అయితే వాళ్లను ప్రభుత్వం ఎక్కువ కాలం జైల్లో వుంచలేదని నాకు తెలుసు. బొంబాయి వెళ్లినప్పుడే అనేకమంది పంజాబు సోదరులు వచ్చి నన్ను కలియడం ప్రారంభించారు. వారిని ప్రోత్సహించాను. వారంతా సంతోషంతో తిరిగి వెళుతూ వుండేవారు. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో వున్నా నా పంజాబు యాత్ర వాయిదా పడుతూనే వుంది. వైస్రాయి ప్రతిసారి “అప్పుడే కాదు” అంటూ నన్ను పంజాబుకు వెళ్లనీయలేదు.

ఈలోపున హంటర్ కమిటీ వచ్చింది. ఆ కమిటీ వాళ్లు పంజాబులో మిలటరీ పాలన యందు జరిగిన అధికారుల చర్యలను పరిశీలించవలసి వున్నది. దీనబంధు ఆండ్రూసు అక్కడకు వెళ్లారు. వారి జాబుల్లో హృదయాన్ని కదిలించే వర్ణనలు నిండివున్నాయి. పత్రికల్లో వెలువడిన వివరాల కంటే అక్కడ జరిగిన ఘోరాలు అధికంగా వున్నాయని వారి జాబుల వల్ల తెలిసింది. మీరు త్వరగా పంజాబు రావాలని వారు వ్రాశారు. వెంటనే పంజాబు చేరమని మాలవ్యాగారి టెలిగ్రాములు వస్తున్నాయి. అందువల్ల నేను మళ్లీ వైస్రాయికి తంతి పంపాను. ఫలానా తేదీన మీరు వెళ్లవచ్చునని ఆయన సమాధానం పంపాడు. అయితే ఆ తేదీ యిప్పుడు సరిగా జ్ఞాపకం లేదు. కాని అది అక్టోబరు 17వతేదీ అయి వుంటుంది.

నేను వెంటనే లాహోరుకు బయలుదేరాను. అక్కడి దృశ్యం ఎన్నటికీ మరచిపోలేను. స్టేషను దగ్గర జనం విపరీతంగా వున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి విడిపోయి ఎక్కడో నివసిస్తున్న తమ కుటుంబీకుడు వస్తున్నట్లు వారి ప్రవర్తనా తీరు ప్రకటిస్తున్నది. అక్కడి జనం హర్షానందంతో ఉన్మత్తులైపోతున్నారు. పండిత రామభజదత్త చౌదరిగారింట్లో నాకు మకాం ఏర్పాటు చేశారు. నేను మొదటినుండి ఎరిగిన సరళాదేవి చౌదరాణి మీద నా ఆతిధ్యపు భారం పడింది. భారమని ఎందుకు అంటున్నానంటే ఆనాటికి కూడా నేను ఏ ఇంటి యజమాని దగ్గర బసచేస్తానో ఆ ఇల్లు ధర్మసత్రంగా మారిపోతూవుంది. పంజాబులో చాలామంది నాయకుల్ని జైళ్లలో నిర్భదించి వుంచారు. అందువలన వాళ్ల చోటును మాలవ్యాగారు, మోతీలాల్ గారు, స్వామీ శ్రద్ధానందగారు అధిష్టించారు. మాలవ్యాగారితోను, శ్రద్ధానందగారితోను నాకు అదివరకే పరిచయం వున్నది. కాని మోతీలాలు గారితో దగ్గరి పరిచయం లాహోరులోనే నాకు కలిగింది. ఈ నాయకులతో బాటు జైళ్లలో పెట్టబడని పలువురు స్థానిక నాయకులు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆత్మీయంగా చూచారు. మేమంతా ఏకగ్రీవంగా హంటర్ కమిటీ ఎదుట సాక్ష్యాలుగాని, వాఙ్మూలాలు గాని యివ్వకూడదని నిర్ణయానికి వచ్చాం. అందుకు గల కారణాలు అప్పుడే సవివరంగా ప్రకటించాం. వాటినన్నిటిని యిక్కడ తిరిగి ఏకరువు పెట్టను. కాని మేము చెప్పిన కారణాలు బలవరత్తరమైనవని ఆ కమిటీని బహిష్కరించడం సబబైన పనేనని యీ నాటికి నా నిశ్చితాభిప్రాయం. అయితే హంటర్ కమిటీని బహిష్కరించి వూరుకోకూడదని, ప్రజల పక్షాన అనగా కాంగ్రెస్ పక్షాన ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయం చేశాం. పండిత మాలవ్యాగారు నన్ను, పండిత మోతిలాల్ నెహ్రూ, కీ.శే చిత్తరంజన్ దాస్, అబ్బాస్ తయాబ్జీ, జయకర్‌గారలను ఒక కమిటీగా నియమించారు. మేము పరిశీలన కోసం విడివిడిగా పర్యటన ప్రారంభించాం. యీ కమిటీ భారం ఎక్కువగా నా మీద పడింది. అత్యధిక గ్రామాలను దర్శించే పని నాకు అప్పగించడంవల్ల పంజాబు నందలి గ్రామాల్ని స్వయంగా చూచే అవకాశం నాకు కలిగింది. యీ పర్యటన సందర్భంలో పంజాబు నందలి మహిళలతో నేను బాగా కలిసిపోయాను. యుగయుగాల నుండి వారిని నేను ఎరిగి వున్నంతగా సామీప్యం ఏర్పడింది. వెళ్లిన ప్రతిచోట స్త్రీలు అత్యధికంగా వచ్చి తాము వడకిన నూలు చిలపలు తెచ్చి, నా ఎదుట పోగులు పోయసాగారు. ఈ యాత్రా సందర్భంలో పంజాబు ఖద్దరుకు గొప్ప కేంద్రం కాగలుగుతుందనే విశ్వాసం నాకు కలిగింది. అక్కడ జరిగిన ఘోరాలు అపరిమితం. లోతుకు వెళ్లిన కొద్దీ అధికారుల అరాచకత్వం, దుర్మార్గం, నియంతృత్వం విని, చూచి నివ్వెరబోయాను. ప్రభుత్వ సైన్యంలో ఎక్కువగా వున్నది పంజాబీలే. అట్టివారి మీద యిన్ని ఘోరాలు ఎలా చేయగలిగారు, వాళ్లు ఎలా సహించారా అని యోచించి విస్తుపోయాను.

మా కమిటీ రిపోర్టు తయారుచేసే బాధ్యత నా మీద పడింది. పంజాబ్‌లో జరిగిన దురంతాలను గురించి తెలుసుకోదలచిన వారు మా రిపోర్టు చదవమని కోరుతున్నాను. మా ఆ రిపోర్టులో ఎక్కడా అతిశయోక్తులు చోటు చేసుకోలేదని చెప్పగలను. ప్రకటించిన దురంతాలకు సాక్ష్యాలు అక్కడే యివ్వబడ్డాయి. సందేహించవలసిన మాట ఒక్కటి కూడా రిపోర్టులో లేదని స్పష్టంగా చెప్పగలను. సత్యాన్ని మాత్రమే ఎదురుగా పెట్టుకొని తయారుచేయపబడ్డ మా రిపోర్టునందు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎంతటి ఘోరాలకైనా తెగించగలరని నిరూపించాము. మా రిపోర్టులో పేర్కొనబడిన ఒక్క మాట కూడా అసత్యమని ఎవ్వరూ అనలేకపోయారు.