సత్యశోధన/ఐదవభాగం/11. గిరిమిట్ ప్రథ

వికీసోర్స్ నుండి

11. గిరిమిట్ ప్రథ

కొత్తగా స్థాపించబడిన ఆశ్రమం లోపల బయట ఎదుర్కొంటూ పున్న తుఫానుల తీరును గురించి వ్రాయడం ఆపి గిర్‌మిట్ ప్రథను గురించి వ్రాస్తాను. అయిదు సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ కాలం మజూరీ తీసుకొని పని చేస్తానని అంగీకరించి పత్రం మీద సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికా వెళ్లిన వారిని గిరిమిటియాలని అంటారు. 1914లో అట్టి గిర్‌మిటియాలకు విధించబడ్డ మూడు పౌండ్ల పన్ను రద్దుచేయబడిందే కాని ఆ విధానం యింకా పూర్తిగా రద్దు కాలేదు. 1916లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యాగారు పెద్ద కౌన్సిలులో యీ విషయం ఎత్తారు. అందుకు సమాధానం యిస్తూ లార్డ్ హార్డింగ్ ప్రభువు వారి ప్రశ్నను అంగీకరించారు. సమయం వచ్చినప్పుడు దీన్ని ఆపుతామని ఆయన అన్నాడు. యీ విధానాన్ని భారతదేశం చాలా కాలం సాగనిచ్చిందని నా అభిప్రాయం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది కనుక తక్షణం యీ విధానం రద్దు చేయబడాలని నిర్ణయానికి వచ్చి చాలామంది నాయకుల్ని ప్రముఖుల్ని కలిశాను. ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా వున్నదని గ్రహించాను. యీ విషయంలో సత్యాగ్రహాన్ని ఉపయోగించవచ్చని భావించాను. కాని ఎలా ఎప్పుడు అను విషయమై నేను యింకా నిర్ణయానికి రాలేదు. “సమయం వచ్చినప్పుడు” అంటే ఏమిటో చెప్పడానికి వైస్రాయి ప్రయత్నించి “మరో వ్యవస్థ చేయుటకు ఎంత సమయం పడుతుందో అంతవరకు” అని అన్నాడు. ఫిబ్రవరి 1917లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యా గిర్మిట్ ప్రధను వెంటనే రద్దు చేయాలని బిల్లు కౌన్సిలులో ప్రవేశపెట్టగా వైస్రాయి అందుకు అంగీకరించలేదు. దానితో యీ సమస్యపై నేను దేశమందంతట ప్రచారం చేసేందుకై పర్యటన ప్రారంభించాను. పర్యటన ప్రారంభించే పూర్వం వైస్రాయిని కలవడం మంచిదని భావించాను. ఆయన వెంటనే తనను కలుసుకునేందుకు తేదీ నిర్ణయించాడు. అప్పుడు మి.మేఫీ (యిప్పుడు సర్‌జాన్ మేఫీ) వైస్రాయికి సెక్రటరీగా వున్నాడు. ఆయనతో నాకు మంచి సంబంధం ఏర్పడింది. లార్డ్ చేమ్స్‌ఫర్డుతో కూడా మాట్లాడాను. నిశ్చింతగా ఏమీ చెప్పకపోయినా తప్పక నిర్ణయం గైకొంటానని తాను సహకరిస్తానని చెప్పి అతడు ఆశ కల్పించాడు.

నేను బొంబాయి నుండి నా పర్యటన ప్రారంభించాను. బొంబాయిలో సభ ఏర్పాటుచేసే బాధ్యత బిష్టర్ జహంగీర్ పేటీట్ వహించారు. ఇంపీరియల్ సిటిజన్‌షిప్ అసోసియేషస్ ఆధ్వర్యాన సభ జరిగింది. అందు ప్రవేశ పెట్టవలసిన తీర్మానం తయారుచేసేందుకు ఒక కమిటీ ఏర్పడింది. అందు డా. రీడ్ సర్ లల్లూభాయి శ్యామల్ దాస్, మి. నటరాజన్ మొదలగువారు వున్నారు. మి. పేటిట్ అందు ప్రముఖులు. వెంటనే గిర్‌మిట్ ప్రథను రద్దుచేయమని ప్రభుత్వాన్ని తీర్మానంలో కోరారు. ఎప్పుడు రద్దుచేయాలి అన్నదే ముఖ్యమైన సమస్య. (1) రద్దు బహు త్వరగా జరగాలి. (2) జులై 31వ తేదీనాటికి రద్దు జరగాలి (3) వెంటనే రద్దు జరగాలి అని మూడు సూచనలు వచ్చాయి. జూలై 31వ తేదీనాటికీ రద్దు కావాలన్న సూచన నేను చేశాను. నేను తేదీ నిర్ణయించబడాలని కోరాను. అలా తీర్మానిస్తే ఆ తేదీనాటికి రద్దు చేయకపోతే ఏం చేయాలో నిర్ణయించవచ్చునని నా ఉద్దేశ్యం. కాని లల్లూభాయి తక్షణం రద్దుచేయాలని అభిప్రాయపడ్డారు. తక్షణం అంటే జనానికి అర్థం కాదని ప్రజల ద్వారా పని చేయించాలంటే నిశ్చితంగా తేదీవాళ్ల ముందు వుంచడం అవసరమని తక్షణం అంటే ప్రతివారు తమ యిష్టప్రకారం అంచనా వేస్తారని అందువల్ల జూలై 31వ తేదీ వరకు గడువు యిద్దామని నచ్చచెప్పాను. నా తర్కం రీడ్‌కు నచ్చింది. లల్లూభాయికి కూడా నా తర్కం నచ్చింది. జూలై 31వ తేదీ వరకు గడువు యిస్తూ బహిరంగసభలో తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరించబడింది. శ్రీజయజీ పేటిట్ గారి కృషివల్ల బొంబాయి నుండి కొందరు మహిళలు వెళ్లి వైస్రాయిని కలుసుకున్నారు. వారిలో లేడీ తాతా, కీ.శే దిల్‌ఫాద్ బేగం మొదలగు మహిళలు వున్నారు. యింకా ఎవరెవరు వున్నారో నాకు గుర్తులేదు. కాని యీ రాయబారం వల్ల సత్ఫలితం కలిగింది. వైస్రాయి ఉత్సాహవర్ధకమైన సమాధానం యిచ్చాడు. నేను కరాచీ, కలకత్తా మొదలగు స్థలాలకు కూడా వెళ్లి వచ్చాను. అన్ని చోట్ల సభలు జరిగాయి. ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పర్యటనకు పూనుకొనే ముందు సభల్లో యింత అధిక సంఖ్యలో జనం పాల్గొంటారని నేను ఊహించలేదు.

అప్పుడు నేనొక్కడినే ప్రయాణం చేస్తూ వుండేవాణ్ణి. అందువల్ల ఊహించని అనుభవాలు కలుగుతూ వుండేవి. గూఢచారులు నావెంట వుండేవారు. వారితో జగడానికి అవకాశం లేదు. నేను ఏమీ దాచేవాణ్ణి కాదు. అందువల్ల వాళ్లు నన్ను బాధించేవారు కాదు. నేను వారిని బాధించేవాణ్ణి కాను. అదృష్టవశాత్తు అప్పటికి నాకు యింకా మహాత్మ అను బిరుదు లభించలేదు. నన్ను గుర్తించిన చోట మాత్రం జనం యీ బిరుదును ఉపయోగించి నినాదాలు చేస్తూ వుండేవారు. ఒక సారి రైల్లో వెళుతున్నప్పుడు గూఢచారులు నా దగ్గరకి వచ్చి టిక్కెట్టు అడిగి తీసికొని నెంబరు నోట్ చేసుకోసాగారు. వారడిగిన ప్రశ్నలకు నేను వెంటనే సమాధానం యిచ్చాను. నేనేదో అమాయకుడైన సాధువునని తోటి ప్రయాణీకులు భావించారు. రెండు మూడు స్టేషన్ల వరకు వరుసగా గూఢచారి పోలీసులు రావడం, నన్నేవేవో ప్రశ్నలు అడగడం చూచి తోటి ప్రయాణీకులకు కోపం వచ్చి వాళ్లను బెదిరించి “ఎందుకయ్యా అమాయకుడైన యీ సాధుపుంగవుణ్ణి బాధపెతడారు వెళ్లండి” అని అరవడం ప్రారంభించారు, “ఇదుగో! యిక టిక్కెట్టు చూపించకండి చూద్దాం ఏం చేస్తారో!” అని నాతో అన్నారు.

“వాళ్లు చూస్తే నష్టం ఏముంది? వాళ్లు తమ కర్తవ్యాన్ని పాలిస్తున్నారు. నాకేమీ బాధ కలగడం లేదు” అని చెప్పాను. యాత్రీకులకు నా యెడ సానుభూతి పెరిగి పాపం, నిరపరాధుల్ని యింతగా బాధిస్తారేమిటి? అని తమలో తాము అనుకున్నారు. గూఢచారులగు పోలీసుల వల్ల నాకేమీ బాధ కలుగలేదు, కాని లాహోరు ఢిల్లీల మధ్య రైల్లో ప్రయాణించినప్పుడు జనం గుంపులు గుంపులుగా విరుచుకుపడ్డప్పుడు నాకు చాలా యిబ్బంది కలిగింది. కరాచీ నుండి కలకత్తాకు లాహోరు మీదుగా వెళ్లాలి. లాహోరులో రైలు మారాలి. అక్కడి రైల్లో నా పప్పులేమీ ఉడకలేదు. యాత్రీకులు బలవంతంగా లోపలికి దూరుతున్నాడు. నేను నిశ్చిత సమయానికి కలకత్తా చేరాలి. ఆ ట్రైను అందకపోతే కలకత్తా సమయానికి చేరలేను. చోటు దొరుకుతుందనే ఆశ పోయింది. నన్ను తమ పెట్టెలో ఎవ్వరూ ఎక్కనీయలేదు. ఒక్క కూలీ నన్ను చూచి 12 అణాలు యిస్తే చోటు చూపిస్తానని అన్నాడు. చోటు చూపించు, 12 అణాలు తప్పక యిస్తాను అని అన్నాను. పాపం ఆ కూలీ ప్రయాణీకుల్ని బ్రతిమిలాడినా ఒక్కరు కూడా వినిపించుకోలేదు. బండి కదలబోతుండగా కొందరు యాత్రికులు లోపల చోటు లేదు కాని, జొరబడేలా చేయగలిగితే ఎక్కించు అని అన్నారు. కూలీ ఏమండీ ఎక్కుతారా అని అడిగాడు. ఆ అన్నాను. వెంటనే కూలీ నన్ను ఎత్తి కిటికీలో నుండి లోనికి వేశాడు. నేను లోపల పడ్డాను. కూలీ 12 అణాలు సంపాదించాడు. ఆ రాత్రి అతి కష్టంగా గడిచింది. మిగతా యాత్రికులు ఏదో విధంగా చోటు చేసుకొని కూర్చున్నారు. నేను పై బెంచి గొలుసు పట్టుకొని రెండు గంటలపాటు నిలబడే వున్నాను. ఈలోపున కూర్చోవేమయ్యా అని కొందరు గద్దించి అడగసాగారు. చోటు వుంటే కదా కూర్చోవడానికి అని నేను అన్నాను. వాళ్లకు నేను నుంచోవడం కూడా యిష్టం లేదు. పైగా వాళ్లు బెంచీల మీద హాయిగా పడుకున్నారు. తప్పుకోమని నన్ను మాటిమాటికి సతాయిస్తూ వున్నారు. వారు బాధించినప్పుడు నేను ప్రశాంతంగా వుండేసరికి నీ పేరేమిటి అని నన్ను అడిగారు. నేను పేరు చెప్పవలసి వచ్చింది. పేరు వినగానే వాళ్లు సిగ్గుపడ్డారు. క్షమించమని అని తమ ప్రక్కన చోటు యిచ్చి కూర్చోబెట్టారు. కష్టే ఫలే అను సూక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పటికి అలసిపోయాను. తల తిరుగుతూ వుంది. కూర్చోవలసిన అవసరం కలిగినప్పుడు దేవుడు వెంటనే చోటు చూపించాడన్నమాట.

ఈ విధంగా నానాయాతన పడి సమయానికి కలకత్తా చేరాను. అక్కడ కౌసిన్ బజారు మహారాజా తన దగ్గర వుండమని ఆహ్వానించాడు. ఆయనే కలకత్తా సభకు అధ్యక్షుడు. కరాచీ వలెనే కలకత్తాలో కూడా జనం ఉత్సాహంతో సభలో పాల్గొన్నారు. కొద్దిమంది ఆంగ్లేయులు కూడా సభలో పాల్గొన్నారు. జూలై 31వ తేదీ లోపునే గిర్‌మిట్ ప్రథను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. 1895లో మొట్టమొదటి దరఖాస్తు ఈ విధానాన్ని రద్దు చేయమని వ్రాసి పంపాను. అప్పుడు ఏదో రోజున ఈ అర్ధ బానిసత్వం తొలగిపోతుందని నమ్మాను. అయితే దీని వెనుక పరిశుద్ధమైన సత్యాగ్రహ ప్రవృత్తి పనిచేసిందని చెప్పక తప్పదు.

దీన్ని గురిచిన పూర్తి వివరం. అందు పాల్గొన్న వారి పేర్లు తెలుసుకోవాలను కొన్నవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను నా గ్రంథం చదువవచ్చు.