సంపూర్ణ నీతిచంద్రిక/సంజీవకుని వధ
సంజీవకుని వధ
దమనకు డిట్లు పలుకుచుండగనే పింగళకునకు దూరమున సంజీవకుడు వచ్చుచున్న జాడ తోచెను. అంతట బెల్లుబికి వచ్చుచున్న కోపము నడచుకొన జాలక నోరు దెఱచికొని చరణము లెత్తి మీదికి దుమికి సంజీవకు నొక్కమ్మడి జీల్చివేయుటకు సంసిద్ధుడై యుండెను.
సంజీవకుడును దూరమునుండియే పింగళకుని వైఖరింజూచి దమనకుడు చెప్పిన దంతయు 'అక్షరాల' నిజము కదా! యని యెంచి తనశక్తి కొలదియు విక్రమము జూప దలచి తలవంచి కొమ్ము లేటవాలుగా జేసి యతి వేగమున సింహము నొక్క క్రుమ్ము క్రుమ్మెను. పింగళకుడు నాదెబ్బకు నొచ్చుకొనియు సంజీవకుని బలమునకు మెచ్చుకొని, తనకు గలిగిన యవమానము భరింపలేక మండిపడి యావృషభముం జిత్రవధ గావించి కసిదీర్చుకొనెను.
పిమ్మట గొంతసేపటికి బ్రాణమిత్రుడగు సంజీవకుని జంపుట యక్రమమని తలపు గలిగి పింగళకుడు దు:ఖా కాంత్రుడై యిట్లు చింతించెను. "పాపము లన్నిటికి రాజే పాత్రు డగును. ఇతరులు రాజ్యసుఖ మనువింతురు. రాజ్యమున గొంతభాగముం గోలు పోయిన నెన్నడైనను మరల సంపాదింపవచ్చును. ఉత్తములగు సేవకులం గోలుపోయిన యెడల నట్టివారు తిరిగి లభించుట యసంభవము."
ఇట్లు విచారించుచున్న పింగళకుం జూచి దమనకుడు "స్వామీ! పగవానిం జంపి విచారించుట పాడిగాదు. సుతుడుగాని, సోదరుడుగాని, సఖుడుగాని, యపాయము గలిగింప దలచెనేని సంపదల నందగోరు రాజు వారిం జంపితీర వలయును. ధర్మార్థ కామముల తత్వమెఱింగిన వారెవరు నతిదయకు లోనుగారాదు. మితిమీఱిన యోరిమిగలవాడు చేత జిక్కిన ఫలమయిన ననుభవింప జాలడు. మిత్రుల యెడలను, శత్రుల యెడలను సమానముగా శాంతి బూనుట యోగులకు మాత్రమే తగును. ఆశాంతియే యపరాధులందు జూపుట రాజులకు దోసమగును. అహంకారము చేతను, రాజ్యమందలి యాశచేతను బ్రభుపదము నాక్రమింప దలచువానికి మరణదండన మొక్కటియే ప్రాయశ్చిత్తము.
జాలిగలరాజు, సర్వభక్షకుడగు బ్రాహ్మణుడు, వశము దప్పిన భార్యయు, దుష్టచిత్తు డగు మిత్రుడును బ్రమాదము గలిగించు నధికారియు, జేసినమేలు మఱచువాడును సర్వదా విడువందగుదురు. రాజనీతి వేశ్యాంగన వంటిది. ఒకపుడు సత్యముతోను మఱియొకపు డసత్యముతోను గూడినదై యుండును. ఒకపుడు గాఠిన్యము గలిగియుండి మరియొకపుడు ప్రియవచనములతో గూడినదైయుండును. ఒకపుడు క్రూరముగను నింకొకపుడు దయా యుక్తముగను నుండును. ఒకపుడు లోభముగలిగియుండి మఱియొకపుడు దానగుణముతో నొప్పు చుండును. ఒకపు డతివ్యయము గలదియు, మఱొకపుడు విస్తారమయిన ధనము, రత్నములు సంపాదించునదియునై యుండును." అని బోధించి యోదార్పగా బింగళకుడు సరిపెట్టుకొని యూరడిలి యుండెను. దమనకుడును సంతసిల్లి 'సకలజనులకు శుభమును, రాజునకు జయమును వర్ధిల్లునుగాక యని పలికి తిరిగి రాజాదరము నొంది సుఖముగా నుండెను."
అని వినిపించి విష్ణుశర్మ రాజపుత్రులతో నిటులనెను. "మీ రిపుడు మిత్రభేదము సాంతముగా వినియుంటిరి. మీరును శత్రునిలయములం దిటులే మిత్త్రభేదము గల్పించి విజయముం గాంచి వర్ధిల్లు" డని పలికెను.
-------
సరస్వతీ పవర్ ప్రెస్
రాజమహేంద్రవరము