సంపూర్ణ నీతిచంద్రిక/దమనకుడు సంజీవకునకు దుర్బోధ చేయుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దమనకుడు సంజీవకునకు దుర్బోధ చేయుట

దమనకుడు చింతాకులుని వలె నుండుట జూచి సంజీవకుడు "మిత్రమా! కుశలమేకద! నీవింత దైన్య మొందినవానివలె నుండుటకు గారణమేమి?' యని ప్రశ్నింపగా దమనకు డిట్లనెను.

"సేవకునకు గుశల మనునది యెట్లుగల్గును? సంపదలా పరాధీనములు. చిత్త మెల్లపుడు నశాంతమై యుండును. జీవితమందు విశ్వాసముగూడ నుండదు. సేవకునివిధ మిట్టిది.

ధనము సంపాదించి గర్వింపని వాడును, విషయాసక్తుడై యాపదలకు లొంగనివాడును, తరుణుల జూచి మనసు చలింపనివాడును, రాజున కెల్లకాలము బ్రియుడై యుండగలుగువాడును, మృత్యువునకు వశుడు గానివాడును, యాచకుడై గౌరవము గాంచువాడును, దుష్టుల పన్నాగములకు లొంగి కుశలముగా దప్పించుకొనగలుగువాడును లోకమున నుండు టరిది."

దమనకుని పలుకులు విని సంజీవకు "డిపు డేమి యాపద దటస్థించినది? తెలుపు" మనగా దమనకుడు మరల నిట్లనియెను.

"ఏమని చెప్పుదును? దురదృష్టవంతుడును. సముద్రమున మునిగిపోవుచు సర్ప మాధారముగా లభించి నపుడు దానిని గ్రహించుట యెట్లు? విడచుట యెట్లు? ఒకవంక రాజవిశ్వాసము, మఱియొకవంక బంధువినాశము. ఏమి చేయుదును?" ఇట్లు పలికి నిట్టూర్పువిడిచి యూరకుండగా సంజీవకుడు "మిత్రమా! ఏది యెట్లు జరిగినను వృత్తాంత మంతయు నున్నది యున్నట్లు వివరింపుము" అని పలుకగా దమనకుడు మిక్కిలి సమీపమునకు వచ్చి రహస్యముగా నిట్లనెను.

"రాజవిశ్వాసమువలన నీసంగతి యెంతమాత్రము జెప్పరానిది. అయినను నీవు నాయందలి నమ్మకముచేత నిచటికి వచ్చిన వాడవు. పరలోకవాంఛవలన నీకు హితము చెప్పుట నా విధి. వినుము. మన ప్రభువు నీపయి నెంతయో యలుక జెందియున్నాడు. నినుజంపి సేవకులకు సంతర్పణము జేయుదునని రహస్యముగా శపథము బూని యున్నాడు. ఈసంగతి విన్నప్పటినుండియు నేను పొందుచున్న పరితాపమునకు మేరలేదు."

దమనకుని మాటలు విని సంజీవకుడు "సఖుడా! విషాద మొందకుము. దైవవశమున నెప్పు డేది వచ్చునో దానికి సిద్ధపడి యుండవలయును. ఆపద వచ్చినపుడు సమయానుసారముగా వర్తించి వీలయినచో దప్పించుకొనవలయును" అని పలికి యించుకనే పూరకుండి తనలో " ఈ వ్యవహారము వలన దుర్జనుల చిత్తవృత్తి యెట్టిదో తెలియుచున్నది. ఈలోకమున స్త్రీలు దుర్జనులకే వశులగుదురు. రా జపాత్రులనే యాదరించును. లోభికే ధనము లభించును. మేఘుడు కొండల యందు వర్షించును. ఎంతహాని సంభవించినది? ఎన్ని విధముల యత్నించి కొలిచినను రాజనకు దృప్తికలుగ దనుమాట ముమ్మాటికిని నిజము. ఇది యుపాయము గానరాని యపాయము. ఏలయన నెవరైన గారణముండి కోపించినచో నా కారణము తొలగగానే యదియుబోవును. కారణము లేకుండ బగ బూనినవాని కోప మెవరు పోగొట్టగలరు? రాజునకు నే నేమి యపకార మొనరించితిని? రాజు లనగా నకారణము గనే హాని సేయువారా? ఒక్కొక్కరాజు తనకు మేలు చేసిన వారి యెడనే పగవహించును. కీడొనరించిన వారియం దమితమగు ప్రీతి జూపును. సేవాధర్మమిట్టిది. ఇందలిరహస్యము యోగులకైన నెఱుగ రానిది. మంచిగందపు జెట్టున ద్రాచు బాములు, జక్కని కమలములుగల చెఱువులందు మొసళ్లు, సుఖములయందు విఘ్నములు జేరియుండును.

మంచిగందపు జెట్టున మొదట సర్పములు చుట్టుకొని యుండును. కుసుమములయందు దుమ్మెదలు క్రమ్ముకొని యుండును, శాఖములపై నెలుగుబంటులు నివసించును, శాఖాగ్రములపై గోతు లల్లరిచేయుచుండును. దానియందు దుష్టు లాశ్రయింపని భాగము గొంచెమైననులేదు. ఈ ప్రభువు మాటలు తియ్యగా బలుకును. హృదయమున విషము ధరించియుండును. చేష్టలన్నియు బ్రేమమయముగ గానబడును. ఈత డీవిద్య యెచ్చట నేర్చినాడో కదా!

సముద్రము దాటుటకు నావయు, జీకటి దొలగించుటకు దీపము, గాలి లేనపుడు విసనకఱ్ఱయు, నేనుగుల మద మణంచుట కంకుశము ననెడి యుపాయములు దేవుడు కల్పించియున్నాడు. కాని దుష్టుని మనసు మార్చుట కే యుపాయములు జూపజాలక భగ్నమనోరథు డయినాడు." అని తలపోసి మరల నిట్టూర్పుపుచ్చి యిట్లు చింతించెను.

"కేవలము సస్యము దిని జీవించు నన్ను మృగరా జేల చంపవలయును? విత్తము, బలము, సమముగా గలవారితో గలహించుటకు గారణముండును గాని నావంటివానిపై గోప మేల కలుగవలయును. ఎవడు నాపై రాజున కలుకపుట్టించెనో తెలియదు.

స్ఫటికముతో జేయబడిన వలయము విఱిగినచో మరల నదుక రాని యట్లు రాజునకు విముఖత గలిగినపు డాతని మనసు మరలుప శక్యముగాదు.

పిడుగు, రాజ తేజము మిక్కిలి భయంకరములు. అందు మొదటిది యొక్కచోటనే పడును. రెండవది యన్ని ప్రదేశము లందు బడును.

ఇక నాతని యాజ్ఞ కెదురు చూచుట మంచిదిగాదు. మరణించిన స్వర్గము గలుగును. శత్రుని జంపిన సుఖము గలుగును. శూరున కీ రెండే మంచిదారులు. యుద్ధము చేయకున్నను మరణము తప్పనిసరియై, యుద్ధము చేయునెడ బ్రదుకుటకు గొంచెమైన వీలున్నపు డది యుద్ధముచేసి తీరవలసిన సమయమని బుద్ధిమంతులు తలచెదరు. కావున యుద్ధమొనరించి చచ్చుటయే మేలు." సంజీవకు డీవిధమున నాలోచించి దమనకునితో నిట్లనెను.

"మిత్రమా! ఆతడు నన్నేవిధమున జంప దలచెనని నీయభిప్రాయము?"

దానికి దమనకుడు "పింగళకుడు చెవులు నిగిడించి నోరు దెఱచికొని, చరణములెత్తి నీమీది కుఱుకుటకు సిద్ధ పడినపుడు కొలది గడియలలో నీవే తెలిసికొనగలవు.కాని యీ విషయ మంతయు గుప్తముగా నుంచుము. రహస్య మేమాత్రము వెల్లడియైనను నీతోబాటు నాకును జీవితము నేటితో సరి." యని సమాధాన మిచ్చెను. కొంతసే పిట్లు తగని వగలు నటించి సంజీవకుని బింగళకుని మీద యుద్ధమునకు బురికొల్పి యాతని వీడుకొని కరటకుని కడకు బోయెను. ఆత "డేమి జరిగినది" యని యడుగగా దమనకు డిట్లు చెప్పెను.

"సందియమేల? దుష్టులకు జుట్టుములును, యాచించినచో గోపింపనివాడును, విత్తముతో సంతుష్టినొందువాడును నెందైన నుందురా?"

ఈ విధముగా బలికి తిన్నగా దమనకుడు పింగళకుని కడకేగి వందన మాచరించి యెంతో దిగులు చెందిన వానివలె గూరుచుండెను. పింగళకుడు "దమనకా! సంజీవకుని వైఖరి యేమైన మరల దెలియవచ్చినదా?" యని ప్రశ్నింపగా "బ్రభూ! చెప్పుటకు నోట మాట రాకున్నయది. ఆత డెంతదుష్టు డయినను నేమైనను మంచి యూహ కలుగు నేమో యని యాసించి యాతనిజాడ గనిపెట్టి యుంటిని. ఆతడు తనపాపపు జింత విడువలేదు సరికదా! యిక నెంత మాత్రము నాలసింపక ప్రభువువారి కాపదగలిగింప నుద్యుక్తుడై యున్నాడు. కొలది నిముసములలోనే ప్రభువు వారి మీది కాతడు రాగలడని యాతని వైఖరింబట్టి నాకు దోచినది. కావున బ్రభువువా రేమఱక యుండుదురు గాక యని నా మనవి.