Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంగ్లభాషాసాహిత్యములు

వికీసోర్స్ నుండి

ఆంగ్లభాషాసాహిత్యములు  :- 1. భాష : భాష మానవుని ఆంతరంగిక జీవితముతో సన్నిహిత సంబంధము కలది. మన భావములు, కోరికలు, అనుభవములు సమస్తమును శబ్దజాలము ద్వారా వెలిపుచ్చ కలుగుచున్నాము. ఈ శబ్ద సముదాయముచే ఏర్పడిన భాషమీద సంపూర్ణమయిన అధికారము కలిగియుండుట మానవుని మహాశక్తులలో ఒకటి. భాషమీద అధికారము సంపాదించినపుడు ఆ భాషను సద్వినియోగపరచి మానవుని జీవితమునందలి పరమపవిత్ర సత్యసుందర విధానముల వ్యాప్తి కొరకై దాని నుపయోగించు సద్భుద్దికూడ మానవునకు ఉండవలెను. భాషను సక్రమముగా నియమబద్ధముగా వాడుట నేర్చినపుడే భావమునందుగూడ స్పష్టత, సరళత,సార్థకత ఏర్పడగలవు. భావములను సుస్పష్టముగా విశదపరచుటకై ఉపయోగ పడుటయే భాషకు సార్థక్యము.

భాష సజీవమయిన వస్తువు. మానవుల జీవితము మనస్తత్వము మారుచు పెరుగుచుండుకొలది భాషకూడ మారు చుండును, పెరుగుచుండును. భాషకును, భావమునకును యిట్టి విడదీయరాని అన్యోన్య సంబంధము కలదు.

ఆంగ్లభాష ఆర్యభాషా కుటుంబమునకు చెందినది. ప్రథమమున వేరువేరు భాషలు ప్రచారమునం దుండెను.వెస్సెక్సు ప్రాంతీయభాష కొంత కాలమునకు ప్రాధాన్యము కాంచెను. డేన్సు అనువారు ఇంగ్లాండుపై దాడిచేసిన కారణముచే ఏర్పడినవారి సంపర్కముచేత నూతన శబ్దజాలము ఆంగ్లభాషలోనికి వచ్చిపడెను. నార్మనులు ఇంగ్లాండును జయించిన తరువాత ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యము తగ్గుటయు, నార్మను భాష ప్రచారములోనికి వచ్చుటయు తటస్థించెను. 1204 వ సంవత్సరములో ఇంగ్లాండుకును, నార్మండికిని సంబంధము తెగినతరువాత నార్మనుభాషకు ప్రాధాన్యముతగ్గి ఇంగ్లీషు మరల ప్రధానస్థాన మాక్రమించుకొనెను. 1349వ సంవత్సరమున అన్ని పాఠశాలలలోను నార్మనుభాష అంతరించి ఇంగ్లీషు వాడుకలోనికి వచ్చెను. 1362 లో న్యాయస్థానముల యందు నార్మనుభాష వాడరాదనియు ఇంగ్లీషు భాషనే వాడవలయు ననియు శాసన మేర్పడెను. 15 వ శతాబ్దమునందలి కడపటి దశలో అనేకము లయిన మార్పులు కలిగెను. కాక్సటన్ ఇంగ్లాండులో ముద్రణ విధానమును ప్రవేశ పెట్టెను. పాశ్చాత్యులు అమెరికా ఖండమును కనుగొనిరి. గుడ్ హోప్ అగ్రముద్వారా ఆసియాకు నూతన మార్గము కనుగొనబడెను. నేడు ప్రపంచమున విశేషముగా వాడుకలోనున్న ఆంగ్లభాష యొక్క స్వరూప నిర్ణయము 16 వ శతాబ్ద ప్రారంభముననే జరిగెను. లండను, ఆక్సఫర్డు, కేంబ్రిడ్జి అను తావులలో వాడబడుచు ఛాసరు, విక్లిఫ్ అను ఇరువురచే తమ గ్రంథములయందు వాడబడిన భాషయే ఆంగ్లేయుల రాజభాషగా ఏర్పడెను. ఆంగ్లేయుల జీవితములో ఈ సమయమున నూతన భావసంచలనము బయలుదేరెను. ఫ్లూటార్క్ అను కవి వ్రాసిన 'మహాపురుషుల జీవితములు' అను గ్రంథమునకు నార్తు అనునాతడు రచించిన అనువాదము, బైబిలు గ్రంథమునకు ప్రభుత్వము వారి ఆ మోదముతో రచింపబడిన అనువాదము, “సామాన్య ప్రార్థనాపుస్తకము" (Common Prayer Book) - ఇవన్నియు వెలసెను. నూతన భావమును ప్రకాశము చేయుటకు ఉపకరించునట్లుగా ఆంగ్ల భాషబహువిధముల సంస్కరింపబడెను. అచ్చుయంత్రముల రాకచే, భాషకు ఒక స్థిరరూపము చేకూరెను. ప్రాంతీయ భాషా (Dialects) ప్రచారముతగ్గి రాజభాషాప్రచారము వ్యాపించెను. లండను నగరప్రాంతమున విద్యాగంధము గల కుటుంబములలో నిత్యము వాడుకయందున్న భాషయే రాజభాషగా ఏర్పడెను.

ఇట్టి ఆంగ్ల భాష కలితిలేని భాష కాదు. అనేక భాషల నుండి శబ్దజాలమును ఆంగ్లేయులు గ్రహించి తమభాషలో జీర్ణింపచేసికొనిరి. దేశముమీదికి దండెత్తివచ్చిన విజాతీయులవలనను, వాణిజ్యాది అవసరములనుబట్టి యితర దేశములకు ప్రయాణమొనర్చి తిరిగివచ్చిన ఆంగ్లేయులవలనను అన్యభాషామిశ్రమము ఏర్పడెను. అనవసరములైన ప్రత్యయములను విసర్జించి, భాషను సరళముగా చేసిరి. ఉచ్చారణ సులభసాధ్య మయ్యెను.అన్యభాషలనుండి వేరువేరు శబ్దములు గ్రహింపబడెను. సముద్రమునకు నౌకాయానమునకు సంబంధించిన శబ్దములు గ్రీకు, డచ్చి, డేనిషు భాషలమండియు ; ఆహారము,వంటపాత్రలు, దుస్తులు, గృహసంబంధమైన సామానులు మున్నగువానికి చెందిన శబ్దములు ఫ్రెంచి భాష నుండియు; దేవాదాయ, ధర్మాదాయ విషయములకు సంబంధించిన పదజాలము, శాసనవిషయములకు చెందిన శబ్దములు లేటిను (Latin) భాషనుండియు; వాణిజ్యమునకు వ్యాపారమునకు సంబంధించిన శబ్దములు 'స్పానిష్ భాష నుండియు; లలితకళలకు సంబంధించిన శబ్దజాలము “ఇటాలియన్" భాషనుండియు రాజ్యాంగవిధానమునకు చెందిన శబ్దములు 'గ్రీకు' భాషనుండియు; పౌర సత్వసంబంధమైన శబ్దములు 'రోమను' భాషనుండియు ఆంగ్ల భాషలోనికి స్వీకరింపబడెను. భాషాసాంకర్యము ఏర్పడును అను భయముచే మడికట్టుకొని కూర్చుండక, వివిధ భాషలనుండి శబ్ద సముదాయమును స్వీకరించి, భాషను పటిష్ఠత, వైశాల్యము కలదానినిగా చేసికొనిరి.

ఆంగ్లేయులలో నే ఎందరో కవులు గ్రంథకర్తలు నూతన శబ్దజాలము సృష్టించి భాషాసంపదను పెంపొందించిరి.అట్టివారిలో ప్రథముడు 'ఆచార్య జాన్సన్'. సంఘ మర్యాదలకు చెందిన పదములను చెష్టరుఫీల్డు, ఆధ్యాత్మికతకు చెందిన మాటలను షెల్లీ మహాకవి, రాజకీయనిర్మాణము, ప్రాతినిధ్యము, వలసరాజ్యవిధానము, రాజ్యతంత్రము-మున్నగువాటికి సంబంధించినపదములను బర్కు, మెకాలే అను మహా రాజ్యాంగ వేత్తలు, వేదాంతవిషయకములైన మాటలను 'కోల్రిడ్జి' అను మహాకవియు, తీవ్ర సాంఘిక విమర్శన కవసరమైన పదజాలమును 'కార్ల్తెలు' మహర్షియు, ఈశ్వర ప్రతిభా ప్రకాశములకు చెందిన మాటలను 'మిల్టను' కవిరాజును, విజ్ఞానశాస్త్రములకు సంబంధించిన శబ్దములు ఆయా విజ్ఞానవేత్తలును ఇంకను ఇండియా, మలయా, పర్షియా, చైనా, జపాను, ఈజిప్టు మున్నగు నాగరక దేశములయందు సంచారముచేసిన ఆంగ్లేయులును అనేక మార్గములచే భాషాసంపదను పెంపొందించిరి. “No one of the modern languages has acquired a greater force and strength than the English through the derangement and relinquishment of its ancient laws of sound. The unteachable profusion of its middle tones has conferred upon it an intrinsic power of expression such as no other human tongue has ever possessed. Its entire, thoroughly intellectual, and wonderfully successful foundation and perfected development issued from a marvellous union of the two noblest tongues of Europe, the Germanic and Roman; their mutual relation in the English language is well known since the former furnished chiefly the material basis, which the latter added the intellectual conceptions. The English language, by and through which the gratest and most eminent poet of modern times-as contrasted with ancient classical poetry was begotten and nourished, has a just claim to be called the language of the world, and it appears to be destined, like the English race, to a higher and broader sway in all the quarters of the earth, for in richness, in compact adjustment of parts, and in pure intelligence, none •of the living languages can be compared with it." అని సుప్రసిద్ధ భాషావేత్తయైన 'జాకబ్ గ్రిమ్' అనునతడు వాక్రుచ్చినాడు. “That exquisite amalgam and shining mosaic of Anglo-Saxon, Danish, Greek, Latin, Dutch and French words and idioms which makes our language-the speach of shakespeare the most composite, varied, eloquent, and in many ways the most beautiful form of human utterance” అని పియర్సాల్ స్మిత్తు ప్రవచించి యుండెను. భాష యొక్క ఆంతరంగిక నిర్మాణమునందు సంస్కరణములు చేయుటచేతను భాషలోనికి బాహ్యము నుండి నూతన శబ్దజాలమును చొప్పించి భాషా సంపదను వృద్ధిపొందించుటచేతను, ఆంగ్లభాష మానవకోటి యువయోగించు సమస్త భాషలలోను సంపన్నమయినదిగా, విశాలమయినదిగా,. ఉద్వేగముకలదిగా మానవ హృదయమునందలి అతిక్లిష్టమైనవృత్తులను కూడ వ్యక్తము చేయుశక్తి కలదిగా వృద్ధిపొందినది. ఇది యావత్పపంచమునందును వాడబడుచు, అన్ని విశ్వవిద్యాలయముల లోను అభ్యసింపబడుటయేగాక, ఐక్యరాజ్యసమితి యందలి వివిధ రాజకీయ సంప్రదింపులను ప్రకటించుటకు గూడ ఉపయోగింపబడుచున్నది. 1928 సం. మున ఆంగ్ల భాషకు సమగ్రమైన నిఘంటువును ఏర్పరచునుద్దేశముతో 50 సంవత్సరముల కృషిఫలితముగా 'ది ఆక్స్ ఫర్ద్ డిక్ ష్ణరి' అను మహా నిఘంటువును డా. మట్టే ప్రధానుడుగా గల సంపాదకీయవర్గమువారు ప్రకటించిరి. వెను వెంటనే యీ యేబది వత్సరములలో గలిగిన అర్థ విశేషములను, ప్రవేశించిన నూతన శబ్దములను నిర్వచించుటకు ఒక అనుబంధసంపుటము కూడ ప్రచురించిరను విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనినప్పుడు, భాషయన్నది ఎంత సజీవమో, ఎంత త్వరితగతితో మారుచు పెరుగు చుండు స్వభావము కలదో, మనము గ్రహింపగలము. ఈ విధముగా సర్వప్రపంచవ్యాప్తమై పటిష్ఠమయిన ఆంగ్లభాషలోనికి యావత్ప్రపంచభాషలలోని సాహిత్య సంపదను తర్జుమా చేసి రనిన ఆంగ్ల భాషాసాహిత్యముల యొక్క సమగ్రత మనకు సంపూర్ణముగా గ్రాహ్యమగును.

2. సాహిత్యము  : ఏభాషయందైనను ప్రాథమికదశ యందలి సాహిత్యము అక్షరరూపమున లిఖితముగాక మానవుల స్మృతివీధులందే నివసించియుండును, ఆంగ్ల భాషయందుగూడ ఆస్థితియే కాననగును. ఈ భాషయందు అత్యంత పురాతనమైన ప్రథమకావ్యము 'బియోవుల్ఫ్' అను పద్యకావ్యము. ఏ ఆరవశతాబ్దమునందో కథ ప్రారంభమై యున్నను అది ఏడవ శతాబ్దమునందు లిఖిత గ్రంథముగా రూపొందినది. 670 ప్రాంతమున 'కాడ్ మన్' అనునతడు బైబిలు కథను పద్య కావ్యముగా రచించెను. 700 ప్రాంతమున 'బీడ్' అను వృద్ధపండితుడు 'ఎక్లీషియాస్టికల్ హిస్టరి' అను గ్రంథమును, ప్రవక్త యైన జాను (St. John) వ్రాసిన సువార్తకు అనువాదమును రచించెను. కాని "ఆల్ ఫ్రెడ్ మహారాజు" తాను స్వయముగా గ్రంథములను రచించియు, ఇతరులను రచింప ప్రోత్సహించియు, సాహిత్యసేవ అపారముగా చేసెను. 9 వ శతాబ్ది మధ్యమున ప్రారంభమై 12 వ శతాబ్ది మధ్యవరకును వ్రాయబడుచు వచ్చిన సాక్ట్లను చరిత్ర యందుగూడ కొంత ఆల్ ఫ్రెడ్ వ్రాసియుండెను . మొత్తము మీద 14 వ శతాబ్దము వరకును. అనువాద వాఙ్మయమే ఎక్కువగా ఏర్పడినట్లు కానవచ్చుచున్నది.

14 వ. శతాబ్దమునందు సాగ్జను, నార్మను భాషలు రెండును మిళితముచేసి ఆంగ్లభాషగా రూపొందించిరి. 'సర్ జాక్ మాండెవల్' అనునతడు తన యాత్రలను గురించి యొక చరిత్రను రచించెను, ఇది ప్రథమవచన గ్రంధమై యున్నది. ధర్మసంస్కర్తయైన 'విక్లిపు' కొంత గద్యరచన సాగించెను.

నవయుగ సాహిత్యమునందు మొదటి గొప్పకవి 'ఛాసరు'. అతడు పండితుడుగా, సిపాయిగా, రాజ్యాంగ వేత్తగా, రాయబారిగా యూరపునందు అనేక ప్రాంతము లందు ముఖ్యముగా ఇటలీ దేశమునందు విశేష సంచారము సలిపి అధికమైన లోకజ్ఞానమును సంపాదించెను. అతడు వ్రాసిన 'కాంటర్బరీ కథలు' అనేక కారణములచే సుప్రసిద్ధ గ్రంథముగా పరిగణింపబడుచున్నది. అనాటి ఆంగ్లేయుల జీవితము, వారి ఆచారములు, అభిప్రాయములు, విశ్వాసములు, వారి వేషభాషలు అన్నియు అద్దమునందు వలె ఇందు మనకు స్పష్టముగా గోచరమగుచుండును. ఆంగ్లపద్య వాఙ్మయమునకు పదిమాత్రల పంక్తిని పునాదిగా వేసినది ఈతడే. 15 వ శతాబ్దపు చివరిభాగమున మొదటి అచ్చుయంత్రమును స్థాపించి 'కాక్సటన్' అచ్చువేసి ప్రకటించిన 64 గ్రంథములలో మాలరీ వ్రాసిన 'మార్ట్ డీ ఆర్థర్' అను గ్రంథమును, ఛాసర్ వ్రాసిన 'కాంటర్బరీ కథలును' కలవు. 16 వ శతాబ్దమునందు వైయట్, సట్టే అను నిద్దరు సుప్రసిద్ధకవులు అగ్రగాములైరి. వైయట్ అనునతడు ఫ్రెంచి, ఇటాలియన్ భాషల యందలి వాఙ్మయమును చదివి అందలి కవితాసంప్రదాయములను ఆంగ్లమునందు ప్రవేశ పెట్టెను. సణే అనునతడు ' బ్లాంక్ వర్స్' అనెడి, పంక్తికి పదిమాత్రలుగల సుప్రసిద్ధ ఛందస్సునకు సృష్టికర్త. రాజ్యాంగవే త్తఅయిన సర్ థామస్ మూరు 'యుటోపియా' అను గ్రంథమును రచించెను. 'విలియమ్ టిండేలు' అను నాతడు బైబిలును ఆంగ్లములోనికి అనువదించెను. The Poets' Poet అని ప్రఖ్యాతిగాంచిన ఎడ్మండ్ స్పెన్సరు 'ది ఫేరీక్విన్' అను కథారూపకమును రచించెను. ఛాసర్ రచించిన కాంటర్బరీ కథలకు గద్య ప్రపంచముననున్న ప్రముఖస్థానమే కావ్య ప్రపంచమున థేరీక్వీనునకు కలదు. ఇందలి శైలి శోభాయమానమై కడు శ్రావ్యమైనదిగా నున్నది. ఎలిజబెత్తు మహారాణి కాలమునందు ఆంగ్లేయులుపొందిన ప్రతిభా గౌరవ ములు ఈ గ్రంథమునందు ప్రతిబింబితములు. ఇది 20 సంవత్సరముల కృషిఫలితము. బెంజాన్సను, మార్లో యీ కాలపువారు. ‘Every man in his humour', 'Volpone' అను రెండు గొప్ప నాటకములను బెన్ జాన్సను రచించెను. Tamborlaine the Great, Dr. Jaustus, The Jew of Malta అను మూడు విషాదాంత నాటకములను 'మార్లో’ రచించెను. ఈతనికి భగవంతుడు చిరాయువు ప్రసాదించి యుండిన యెడల ఎంత గొప్ప నాటకములను వ్రాయగలిగి యుండెడివాడో ! 'The Laws of Ecclesiastical Polity' అను గ్రంథమును వ్రాసిన Hooker అను కవియు, Arcadia, Apology for Poetry అను రెండు మహా వ్యాసములు రచించిన Sir Philip Sydney యును ఈ యుగమునందలి గద్యరచయితలలో ప్రముఖులు. 'సిడ్నీ' యొక్క శైలి మిక్కిలి ప్రసిద్ధి కాంచెను.

ఈ యుగమునాటి విద్వత్కవులలో సర్వవిధముల శిరోభూషణమువలె ప్రకాశించువాడు 'షేక్స్పియరు' మహాకవి. ఆతని ప్రతిభ వర్ణనాతీతము, అగ్రాహ్యము. ఆమహాపురుషునకుగల ప్రకృతి పరిచయము, మానవ హృదయ పరిజ్ఞానము అసామాన్యములు. భాష మీద అతనికిగల అధికారమును, ప్రేమతత్త్వ సంబంధమైన ఆంతరంగిక దృష్టియు అపారములు.భావసంచలనములను గూర్చి ఆతడు గడించిన జ్ఞానము నిజముగా అద్వితీయము. స్త్రీ పురుషుల హృదయములు ఏయే పరిస్థితులయందు ఎట్టెట్టి పరిణామములు చెందుచుండునో - వానిని గ్రహించుటయందును, చిత్రించుట యందును, ఇతడు అపూర్వ ప్రతిభ గలవాడు. సుఖాంతములును, విషాదాంతములును, చారిత్రకములు నయిన రసవత్తర నాటకము లనేకములు అత్యంత సామర్థ్యముతో నవరసభరితముగా రచించిన ప్రతిభాశాలి ఇతడు. నాటికిని నేటికిని ఇంగ్లాండుకు ఉత్తమ పుత్రుడై, ఆంగ్లభాషకు వాఙ్మయమునకు తలమానికమై, ఆంగ్ల భాషావేత్తల హృదయములను బంధించు ఏకసూత్రమై, అక్షిణ ప్రతిభతో అలరారుచున్నవాడు షేక్స్పియరు మహాకవి.

17 వ శతాబ్ది పూర్వార్ధమునందు ప్రధానమైన గద్య రచయితలు రాలే, బేకను అనువారలు. రాలే మహా తేజశ్శాలి. ఎలిజబెత్తు కాలమునాటి సర్వతోముఖ వికాసమును స్వాయత్త మొనర్చుకొనిన ప్రతిభాశాలి ఇతడు. బేకను అధిక మేధావంతుడు. భావగర్భితములై సూత్రప్రాయములైన వాక్యములుగల గద్యశైలిని వ్రాయుదిట్ట. ఆతడు రచించిన 'Advancement of Learning' అను గ్రంథమును, ' వ్యాసావళి'యు ఉద్గ్రంథములు. ఈ శశాబ్దపు టుత్తరార్ధమునం దుండిన పద్య గద్య రచయిత లందరిలోను మహోన్నత పర్వత శిఖరమువలె కన్పట్టు వాడు 'మిల్టను' మహాకవి. ఆతడు రచించిన Paradise Lost, Paradise Regained, Samson Agonistes అను మూడు గ్రంథములు ఆంగ్లభాష యున్నంత కాలమును మనగల గ్రంథరాజములు. అతడు ఆంగ్ల పద్య కావ్య ప్రపంచమునందు అత్యంత గంభీరమైన శైలియు, ప్రమాణమైన ఛందస్సును కల్గిన మహాకవి. హాస్యరస ప్రధానమైన హ్యూడి బ్రాసు అను కావ్యమును రచించినవాడు బట్లరు, అధిక్షేప వాఙ్మయమును వ్రాయుటయందు అగ్రస్థానము నాక్రమించి, గద్య పద్య కావ్యములందు అసమానమైన ప్రతిభను ప్రదర్శించినవాడు డ్రైడేను. ఆంగ్ల గద్య రచనయందు ఇతడొక నవశకమును ప్రారంభించెను. ‘Heroic Couplet' అను ఒక క్రొత్త ఛందస్సునకు ప్రఖ్యాత స్థానమును సంక్రమింపజేసినవా డిప్రోడ, గద్య రచనయందు అప్రతిమానమైన ప్రతిభగలవాడు Jeremy Taylor, Essay on Human Understanding మహా వ్యాసమును రచించిన తత్త్వవేత్త 'లాకు' ఈ యిరువురుగూడ ప్రముఖ రచయితలలోనివారే. ఈ యుగమునందలి అసమాన ప్రతిభావంతులలో ముఖ్యమైనవాడు 'జాన్ బనియను'. ఇతడు సామాన్య సంసారి. బీదవాడు. బైబిలు గ్రంథమును జీర్ణించుకొనుటచే పాండిత్యమును పొందినవాడు. కారాగారమునందున్న కాలమున 'ది పిల్ గ్రింప్ ప్రోగ్రెస్' అను అద్భుత ద్వ్యర్థికావ్యమును రచియించి ఆ మహా గ్రంథమునందు, సుఖదుఃఖములతో కూడిన మానవ జీవితయాత్రను అత్యంత సౌందర్యవంతముగను, భావగర్భితముగను చిత్రించినాడీ కవివర్యుడు.

18 వ శతాబ్ది పూర్వభాగము గద్యరచనా ప్రధానమయిన యుగము. ' రాబిన్ సన్ క్రూసో' అను సుప్రసిద్ధ బాలసాహిత్య గ్రంథముతోపాటు అనేక ప్రౌఢ గ్రంథముల రచించిన డీఫో, నేటి వార్తాపత్రికలకు పితామహుడు. కాని యీ యుగము నందలి ప్రధాన గద్యరచయిత 'స్విఫ్ట్లు'. మత వైషమ్యములను గూర్చిన ప్రహసనమగు ‘A Tale of a Tub' ను, మానవ ప్రకృతిని దెలుపు గల్లి వర్స్ ట్రావెల్స్ రచించి, గద్యరచనయందు అసమాను డనిపించుకొనిన వాడీ కవి, సులభమై, సుందరమై, హాయిని గూర్చునది అయిన గద్యరచనయందు ఆరితేరినవాడు 'ఎడిసను', ఆతని 'స్పెక్టేటరు' (Spectator) వ్యాసములు, అందు అతడు సృష్టించిన 'సర్ రోజర్ డీకావర్లీ 'అను పాత్ర చిర కాలముండునది అనుటలో అతిశయోక్తి లేదు. కావ్య ప్రపంచములో ఈ యుగమున పేరెన్నిక గన్న కవి పోపు. ఈతని కవితా శిల్ప చాతుర్యము ప్రశంస్యము. సుప్రసిద్ధ గ్రీకు మహాకవియైన హోమరు వ్రాసిన ఇలియడ్ అను మహాకావ్యమును ఆంగ్ల పద్య కావ్యముగా అనువదించినవాడును, క్షుద్ర రచయిత లయిన సమకాలికులను ‘డన్సియడ్' (Dunciad) అను ప్రహసనము నందు తీవ్రముగా హేళన పూర్వకముగా విమర్శించిన వాడును ఇక్కవి చంద్రుడు. గంగాప్రవాహమువలె ప్రవహించు శైలి, స్థాలిత్య రహితమయిన ఛందస్సు ఈతని రచనా విశేషములు. సూత్రప్రాయముగ నుండి విశ్వజనీనము లయిన వ్యావహారిక సత్యములను నిరూపించు వాక్యములను అత్యంత శిల్పచాతుర్యముతో నిర్మించిన మహా శిల్పి ఈ కవి వరేణ్యుడు.

ఈ యుగమునందలి గద్యపద్య కావ్యము లన్నియు నాగరక ప్రపంచమునకును రాజకీయ వాతావరణమునకును సంబంధించినవే. వాటియందు ప్రకృతి పరిచయము ఎచ్చటను మందునకయిన కానరాదు. The Elegy in a Country Churchyard' అను అద్వితీయఖండ కావ్యమును రచించిన 'గ్రే' అనునతడు 'Ode to the Evening” ను రచించిన 'కాలిన్సు' - ఈ యిరువురు కవులును ఆంగ్ల కావ్య ప్రపంచమునందు ప్రకృతి రహస్యములకు భాష్యములు కల్పించినవారలు. 18 వ శతాబ్దియొక్క ఉత్తరార్ధమునందలి ప్రధాన గద్యరచయితలు గోల్డుస్మిత్తు, జాన్సను, బర్కు, గిబ్బను, కౌపరు, బర్ న్సు, బ్లేకు, క్రాబు అను వారు. నీతివిషయకమైన అనేక సూత్రములను ప్రవచించి లలితమైన అమృత శైలి ప్రదర్శించినవాడు గోల్డుస్మిత్తు. ఇతడు The Deserted Village అను పద్యకావ్యమును, She Stoops to Conquer అను నాటకమును హాస్యరస భరితముగా రచించెను ఇతని 'ది వికార్ ఆఫ్ షేక్ ఫీల్డు' అను కావ్యము ఆంగ్లభాషయందలి ప్రధాన నవలగా శాశ్వత కీర్తిని కాంచెను. బహు విషయక విజ్ఞానభరితమై సమయ స్ఫూర్తిగల సంభాషణయం దారి తేరి, అమరకోశమును బోలిన మహానిఘంటువునకు నిర్మాతయై, సాహిత్య సమ్రాట్టు అనిపించుకొన్న ప్రతిభాశాలి జాన్సను, మహా రాజ్యాంగ వేత్తయు, మహామేధావియు నగు బర్కు, సాహిత్య సౌరభోపేతములైన మహోపన్యాసముల మూలమున 'ది ఫ్రెంచ్ రెవల్యూషన్' దిఅమెరికన్ రివల్యూషన్' అను రెండు రాజకీయ విప్లవముల విషయమున ఆంగ్లేయు లవలంబించిన విధానమును విమర్శించెను. ఆ యుపన్యాసములు రాజకీయవేత్తలచే ఈనాటికిని వేద గ్రంథములుగా పరిగణింప బడుచున్నవి. The Decline and Fall of the Roman Empire అను చారిత్రక గ్రంథరాజమును గంభీరమైన శైలితో రచించిన 'గిబ్బను' మహాశయుడు సుప్రసిద్ధుడు. The Task అను కావ్యమును రచించిన మధురకవి కౌపరు, బీదసాదల జీవితమును చక్కగా చిత్రించిన క్రాబు, రసభరితములైన గీతములను స్కాట్లండు ప్రాంతీయ భాషయందు రచించి సుప్రసిద్ధుడయిన ‘బరస్సు', అమాయిక శిశుస్వభావముతో కూడిన భక్తి గీతములను రచించిన బ్లేకు మున్నగువారి కవితలందు రాగల నూతన సాహిత్య విప్లవ చిహ్నములు స్పష్టముగా కనుపించుచుండును.

19 వ శతాబ్దము ఆరంభము కాకమునుపే దాని లక్షణములు తత్పూర్వార్ధ శతాబ్దమునందే కన్పడెను. 1789వ సంవత్సరమున ఫ్రాన్సు దేశమందు ఏర్పడిన మహావిప్లవముచే యూరపు రాజ్యములయందలి సమస్త జీవిత వ్యాపారములయందును నూతన శకము ఆరంభించెను. అపూర్వశక్తులు ప్రజా సామాన్యమునందు కన్పట్ట సాగెను. మేధావంతులును, ఉదార స్వభావులును అగుమహాపురుషు లెందరో దేశ దేశములందు బయలుదేరిరి. ఎలిజబెత్తురాణి యుగమునాడు కన్పించిన ధీశక్తి, మనోవేగము, హృదయావేశము తిరిగి చూపట్ట నారంభించెను. నూతనోత్సాహముతో కూడిన భావకవు లెందరో బయలు దేరిరి. వర్డ్స్ వర్తు, కోల్రిడ్జి అను ఇద్దరు కవులును కలిసి 'Lyrical Ballads' అను పద్యకావ్య సంపుటము ప్రకటించిరి. అది కావ్యప్రపంచమున నూతన శక ప్రారంభమునకు శంఖారావమువంటి దయ్యెను. సామాన్య వస్తువులను, జీవితమును ఆవరించు సౌందర్యము శోభను, వెల్లడిచేయుట వర్డ్స్ వర్తు కవివర్యుని ఆశయము. అసామాన్య వస్తువులను, విషయములను వర్ణించునపుడు వాటిని విశ్వసనీయముగా చిత్రించుట కోల్రిడ్జి కవి ఆశయము. ఈ కావ్యసంపుటి యొక్క ఉద్దేశమును వర్డ్సువర్తే ఇట్లు నిరూపించెను. "దుఃఖాక్రాంతులైన వారిని ఉపశమింపజేయుట, సంతోషాంతరంగులను మరింత సంతోష పరచుట, ఆలోచనాశీలురై ధర్మకాంక్షను అభివృద్ధి చేసికొనునట్లు యువకులను పురిగొల్పుట." సాంఘిక సమస్యలనుగూర్చి ఆలోచించుట, ప్రకృతివైపునకు దృష్టిని మరల్చి, మానవ హృదయము యొక్క ఆంతరంగికము లయిన అనుభవములను గూర్చి తెల్పుట అనునవి కావ్యాదర్శములు. తన కావ్యములు భయోత్పాదకములయిన విషయములను చిత్రించుట కొరకుకాక ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించుట కొరకే ఉపయోగించునని ఆతడు నిర్భయముగా చెప్పెను, "The Excursion; The Prelude, అను బృహద్గ్రంథములును, The immortality Ode, The Ode to Deity అను చిన్న కావ్యములును, మరికొన్ని సానెట్సును అతని రచనలలో శ్రేష్ఠములైనవి. కోల్రిడ్జి మహాకవి Biographia Literaria అను విమర్శనాత్మక గ్రంథమును, The Ancient Mariner, Christabel, Kublakhan అను ఉన్నతశ్రేణికి చెందిన కావ్యములను రచించెను. స్వాతంత్య్ర ప్రియుడయిన బైరను, చారిత్రక నవలలు అనేకములు వ్రాసి భూతకాలమును, వర్తమానమునందు పునస్సృష్టి కావించిన స్కాటు మహాశయుడు ఈ యుగమునందలివారే. షెల్లీ ఒక అద్వితీయ మహాకవి: నిరంకుశపరిపాలనము మానవులను పీడించు మహావ్యాధులలో నొకటియనియు, ప్రేమ యనునది పరమ పవిత్రమయిన వస్తువనియు, అది జీవితము ఉద్దరింపగల మహాశక్తియనియు ఇతడు బోధించెను. పక్షి పాడినట్లు అప్రయత్నముగా అనర్గళ ధారతో పాడగల సహజ కవిత్వ మితనిది. ఇతడు గ్రీకుపద్ధతి ననుసరించి 'Prometheus Unbound' అను మహానాటకమును రచించెను. కీట్సు మరణించెనని వినగానే ఇతడు Adonais అను నొక కావ్యమును The Cloud, Ode to the sky lark, Ode to the west wind మున్నగు అమూల్యములైన చిన్న కావ్యములనుగూడ రచించెను. కీట్సు అసామాన్య ప్రతిభాశాలి. సౌందర్యోపాసకుడు. అతడు అకాల మృత్యువు వాతను బడుట శోచనీయము. పంచకావ్యములు అనదగు ఆతని Odes ఆంగ్ల సాహిత్య చరిత్రయందు అపూర్వ శోభతో వెలుగొందుచున్నవి.

చారిత్రక నవలాకారుడయిన స్కాట్ అనునాతడును, అనన్యసామాన్య వ్యాసరచయితయగు లాంబు (Lamb)ను, సాంఘిక సాంసారిక విషయములను చిత్రించు నవలలను రచించిన జేన్ ఆన్లైన్, సొగసైన శైలిలో 'The Confessions of an English Opium Eater, అను ప్రసిద్ధ గ్రంథమును రచించిన 'డిక్వెన్ సి'యు గద్య రచనయందు పేర్కొనదగిన ప్రముఖులు, కార్లైల్ మహర్షి మరియొక అద్వితీయ రచయిత. ఇతడు వ్రాసిన ప్రముఖ గ్రంథము Sartor Resartus అనునది. ఇతని చారిత్రక శైలి అనన్య సామాన్యము. ఇతడు అనేక నూతన పదములను సృష్టించిన భాషానియంత. సజీవమైన చారిత్రక శైలితో నొప్పి విమర్శ కాగ్రణియైన మెకాలే (Macaulay) మహాశయుడు, సర్వతోముఖ సంస్కర్తయైన శ్రీ రాజా రామ మోహన రాయలు, మన దేశమునందు ఆంగ్లేయ విద్యావిధానమును ప్రవేశ పెట్టుటకు కారకులైనవారు.

19 వ శతాబ్దపు టు త్తరభాగమున పేర్కొనదగిన ఆరుగురు గొప్పకవులుకలరు. వీరిలో అమెరికా కవులలో అగ్రగణ్యుడైన లాంగ్ ఫెలో అనునతడు హయవాతా, ఇవాంజ్ లైన్ అను కావ్యములను రచించెను. ఆంగ్లేయ ఆస్థానకవియైన టెన్నిసను వాస్తముగా ఒక మహాకవి. అతని ఉద్గ్రంథములలో ప్రధానమైనవి 'In Memorium' అను స్మృతి కావ్యమును, 'Idylls of the king' అను కావ్యమునై యున్నవి. ఆతని కవిత్వమునందు గొప్ప శిల్పచాతుర్యము కాననగును. 'మిసెస్ బ్రౌనింగ్ ' అను నా ఆంగ్లేయ కవయిత్రులలో అగ్రస్థాన మధిగ మించెను. ‘Auroraleign' అను పెద్ద కావ్యము, The cry of the children అను చిన్న కావ్యము, Sonnets ఆమె కృతులలో సుప్రసిద్ధములు. ఆమె భర్త అయిన రాబర్టు బ్రౌనింగు టెనిసనుతోపాటు ఈ శతాబ్దమునందు కవితా సదనమున అగ్రస్థానము నలంకరించెను. ఇతడు అసామాన్య మేధా వంతుడు. సంక్షిప్తమై భావగర్భితమైన శైలి కలవాడు. The Ring and the Book' అను అపరాధ పరిశోధక కావ్యము ఆతని యుద్గ్రంథము. అందు పండ్రెండు పర్వములుకలవు. రక్బీ షాపెల్ Rugby Chapel, సోహరాబ్ అండ్ రుస్తుమ్ అను కావ్యములను రచించిన మాచ్యూఆర్నాల్డును, The Earthly Paradise ను రచించిన విలియం మారిస్సు అనునతడును ఈయుగము నందలి ప్రముఖ కవులలో పేర్కొనదగిన వారు.

గద్య రచనయందు మహామహులగువారు గూడ ఈ యుగమునందు ఉద్భవించిరి. Vanity Fair, The New Comes, Henry Edmond అను గొప్పనవలలు రచించిన థాకరీ కవియు, The Pickwick Papers, David Copperfield మొదలగు గ్రంథములను రచించిన డికెన్సు, Adam Bede, The Mill on the Floss అను నవలలను రచించి జార్జి ఇలియట్ (George Eliot) అను పురుషనామ ధారిణియైన మేరియన్ ఇవాన్సు (Marian Evans), The Ordeal of Richard Feveril, Evan Harrington అను వాటిని రచించిన మెరెడిత్తు, అత్యద్భుత నవలారాజమగు Tess ను రచించిన థామస్ హార్డీ వీరు ఈ గద్యకాలము నాటి ప్రధాన నవలాకారులు. మరియు అధిక సుందరమైన శైలిని నిర్మించిన వాల్టర్ పీటరు, సౌందర్య తత్త్వమును పరిశోధించి దాని లక్షణమును 'The seven lamps of Architecture', 'The Stones of Venice', అను గ్రంథములలో నిరూపించిన రస్కిను, On Liberty అను వ్యాసరాజమును వ్రాసిన 'జాన్ స్టూవర్టు మిల్లు', అను వారిని పేర్కొనుటతో, ఈ శతాబ్ది సింహావలోకనము ముగింపవచ్చును. 20 వ శతాబ్దమునందలి రచయితలలో పెక్కు మంది జీవులై యున్నవారే. కొంద రిటీవల కాలము చేసి యుందురు. Wells, Bennet, Galsworthy, Conrad అను నవలా రచయితలు Kipling, Yeats, Iliot వంటి మహాకవులు, Oscarwilde, Bernard Shaw, Galsworthy Priestley, Drink Walter, Synge, Yeats మున్నగు నాటక కర్తలు, Chesterton, Joyce, Belloc Max, Beerbhohm, Churchill, Lytton Strachey వంటి గద్య రచనా చతురులు, అసంఖ్యాకులు కలరు.

ఆంగ్ల సాహిత్యస్రవంతి జీవనదియై యింకను విరివిగా ప్రవహించుచున్నది. క్రొత్తపోకడలు కన్పట్టుచున్నవి. ప్రకృతి శాస్త్రముల ప్రభావముచే క్రొత్త వాఙ్మయము అనంతముగా బయలు దేరుచున్నది. అమెరికా, ఇండియా మొదలగు దేశములందు అనేక గొప్పరచయితలు గలరు. ఇమర్సన్ (Emerson) వంటి వ్యాసకర్త, సింక్లర్ (Sinclair) వంటి నవలారచయిత, రవీంద్రనాథ్ వంటి బహుముఖసాహిత్యనిర్మాత, సరోజినీనాయుడు, హరీంద్రనాథ ఛటోపాధ్యాయుడు మున్నగు మహాకవులు ఏ వాఙ్మయమునకైనను శోభను కూర్చువారే. Whittier, Lowell వంటి అమెరికళా కవులుకూడ సుప్రసిద్ధులుగా పేర్కొన తగినవారు. ఆధునికులైన కవులు నిచ్చట పేర్కొనుట లేదు.

ఇట్లు నిత్యనూతన శోభతో విలసిల్లుచు, శాఖోపశాఖలచే యావత్ప్రపంచమును ఆవరించుచు, సమస్తేతర వాఙ్మయము లందలి ఉత్తమ సాహిత్యమును తనలోనికి నిమిడ్చుకొనుటచే నిరంతరాభివృద్ధి నొందుచున్న ఆంగ్ల సారస్వత రసాస్వాదనమే భారత జాతీయాభ్యుదయమునకు దారితీసిన ప్రబల కారణములలో ప్రధానమైనది. దైవికముగా మనకు లభించిన అందలి పొండిత్య ప్రభావమును బుద్ధిపూర్వకముగా విడనాడుకొనుట భారత జాతీయాభివృద్ధికి అంతరాయము కాగలదనుట నిగ్వివాదాంశము. వివిధ భారతజాతీయ భాషలందలి సర్వతోముఖ వికాసమునకును ఆంగ్లసాహిత్య ప్రచారమే కారణమనుట చారిత్రక సత్యము.

పె. రా.

[[వర్గం:]]