Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబిలము

వికీసోర్స్ నుండి

అహోబిలము  :- శ్రీశైలము, అహోబిలము, సంగమేశ్వరము, మహానంది కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రములు. అహోబిలము తప్ప మిగిలినవన్నియు శివపరమైనవి. అహోబిలము వైష్ణవ క్షేత్రము. విశిష్టాద్వైత మతస్థుల కియ్యది పవిత్ర యాత్రాస్థలము మాత్రమేకాక, తదితర మతముల వారికిని ఆరాధ్య మయ్యెను.

అహోబిలము కర్నూలు మండలములోని శిరువెళ్ళ తాలూకాలో రుద్రవరమను గ్రామమునకు అయిదు మైళ్ల దూరమందు కలదు. నల్లమల కొండలలో మనోజ్ఞమైన ప్రకృతి దృశ్యముల మధ్య ఈ క్షేత్ర మొప్పుచుండును.

హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునిపై దురాగత మొనర్చు ఘట్టమునందు విష్ణువు నరసింహావతారమెత్తి తన భక్తుని కాపాడిన పవిత్రస్థలమిదియే అని పారంపర్యముగా వచ్చిన కథ గలదు. నరసింహస్వామి కంకితముగా నిర్మితమైనట్టి ముప్పది రెండు పుణ్యతీర్థములో ఇదియే ప్రముఖమయినది. ఇచ్చట నరసింహస్వామికి అంకితమయిన తొమ్మిది దేవాలయములు గలవు, ఆ దేవాలయము లన్నియు పదిమైళ్ళ చుట్టుపట్లనే కలవు. అందుచే ఈ ప్రదేశమునకు పంచ కోశ తీర్థమనియు పేరుగలదు.

ఈ క్షేత్ర ప్రాంతములోనున్న నవ నరసింహులకు ప్రహ్లాదవరద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి కరంగి నరసింహస్వామి (యోగానంద నరసింహస్వామి). ఉగ్రనరసింహస్వామి, గుహానరసింహస్వామి, క్రోధనర సింహస్వామి, మలోల నరసింహస్వామి, జ్వాలా నర సింహస్వామి, పవన నరసింహస్వామి అను పేర్లు ఉన్నవి. వీరిలో "మలోల నరసింహస్వామి శాంత స్వరూపుడు. లక్ష్మీ దేవితో సదా సరస సల్లాపములాడుచు నుండును. కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు బంగారు ఉత్సవ విగ్రహమును సమర్పించినాడు. అహోబిలం మఠము జియ్యరు తన మఠములో ఇష్ట దైవముగా పూజించుటకు దానిని తీసికొని వెళ్ళిపోయెను. ఇక్కడ ఒక విశేషమేమనగా స్వామివారు కూర్చుండియుండును. కుడికాలు క్రిందికి వేళ్ళాడుచుండును. దానికి పాదుక తొడిగియున్నది. అందుచేత మఠాధిపతి విగ్రహమును ఎక్కడికి తీసికొని వెడల దలచితే అక్కడికి వెళ్ళుటకు స్వామి సంసిద్ధులై యున్నారను ప్రతీతి వచ్చినది.

దట్టమైన వృక్షముల మధ్య నల్లమల కొండల నానుకొని ఉన్న దానిని దిగువ అహోబిలమనియు, 2800 అడుగుల యెత్తుగల పర్వతముపై నున్న దానిని ఎగువ అహోబిలమనియు అందురు. వేదాద్రి. గరుడాద్రి అను పేర్లతో ఆ రెండు పర్వతములు పిలువబడుచున్నవి. వాటి మధ్య భవనాశి, అను నెలయేరు ప్రవహించుచు. కుందు నదిలో పడును. పర్వత దక్షిణ ప్రాంతమందుగల ఉగ్ర నరసింహస్వామి దేవాలయపు మొదటిగుహ చెంత ఒక ఇనుప స్తంభ ముండుటచేత నరసింహస్వామి ఇచ్చటనే పుట్టెనని చెప్పుచుందురు.

పెద్ద అహోబిలము (దిగువ) రాతిలో ఏర్పడినది. దానికి చెంత పెండ్లికూతురుగనున్న చెంచేత కలదు. ఆమె కారణముగ అడవిలోనుండు చెంచులందరు నరసింహస్వామికి ముఖ్య భక్తులు. వారికి నేటికిని ఫాల్గున మాసములో జరుగు తిరునాళ్ళయందు కొన్ని ప్రత్యేక సౌకర్యములు కలవు. ఆ చెంచెతను చూచి లక్ష్మి తన భర్త యొక్క విశ్వాస ఘాతుకత్వమునకు చింతించి పర్వత మెక్కి 'మొనకొండ' అనుచోట నివాస మేర్పరచు కొనెను. అక్కడ ఒక వైపు భయంకరమయిన పెద్దలోయ కలదు. దానిచెంత గల ఇనుప స్తంభము చుట్టు సంతానము లేని ఆడువారు ప్రదక్షిణ మొనర్చిన సంతాన భాగ్యము నొందుదురని ప్రతీతి.

ఈ దేవాలయము 14 వ శతాబ్దియందు ప్రతాపరుద్రుని చేత నిర్మింపబడినదని చెప్పుచున్నారు. ఇంతవరకు అందుకు కావలసిన సాక్ష్యము లభింపలేదు. అది శఠకోప జియ్యంగారు మొదటి ఆచార్యుడుగా నున్నందున అతని వారసులే ఇప్పటికిని అహోబిల మఠాధిపతులుగ నున్నారు. ఇప్పుడు వారు పూజాది కార్యక్రమములను దేవస్థానమునందు నడిపించుచున్నను, మద్రాసు రాష్ట్రమందలి తిరువళ్ళూరు లోనే వారి నివాసము. విజయనగరరాజులు దేవాలయమునకు కొన్ని గ్రామములు, భూములు ఇనాములుగా ఇచ్చిరి. అందులో శిరువెళ్ళ, కోవెలకుంట్ల, బద్వేలు (కడపజిల్లాకు చెందినది) తాలూకాలలో 40 ఎకరముల భూమియు, అనంతపురంజిల్లా తాటి పత్రి తాలూకాలోని గుండాల హోబుల అగ్రహారము అను ఇనాము గ్రామములును మాత్రమే ఇచ్చట కలవు. ఒకప్పుడు దేవాలయము చాల వైభవ మనుభవించు చుండెను. ఇందు కాకతీయ, విజయనగరపు రాజుల కాలమునాటి శిల్ప సంపద దృగ్గోచరమగును. 16వ శతాబ్దమందు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్ షా చేతులలో ఈ దేవాలయము పడినప్పుడు విలువగల ఆభరణాదులు అపహరింపబడెను. 18వ శతాబ్దములో కర్నూలు నవాబ్ అగు మున్వార్ ఖాన్ యొక్క స్వాధీనములోనికి వచ్చినప్పుడు యాత్రికుల పై పన్ను కూడ విధింపబడి యుండెనట!

కంచిలో శ్రీనివాసాచార్యుడను నాతడు చదువుకొను చున్నపుడు నరసింహస్వామి కలలో కనబడి అహోబిలమునకు వెళ్ళి సన్యాసాశ్రమము స్వీకరింపుమ నెనట ! ఆ దేవాలయపు ధర్మకర్తయైన ముకుంద రాయలకు కూడ అదేసమయమున కలలో కనబడి కంచినుండి ఒక భక్తుడు రానున్నాడు. స్వీకరింపుమనెనట. శ్రీనివాసాచార్యులు, ముకుందరావు మాట్లాడుకొనుచుండగ నరసింహస్వామి సన్యాసిరూపమున వచ్చి, శ్రీనివాసాచార్యునికి సన్యాసాశ్రమమిచ్చి “శఠకోపయతి" అని నామకరణము చేయుటవలననే వారి పరంపరకు ఆ పేరు కల్గెనని అందురు.

మొదటి శఠకోపయతి జీవిత కాలము క్రీ. శ. 1378 నుండి 1458 వరకు అని నిర్ణయము చేయబడినది. ఆతర్వాత అహోబిలములో గల శాసనములలో నొకదాని వలన క్రీ. శ. 1555 లో సదాశివరాయలు షష్ఠపరాంకుశ శఠకోపయతికి భాష్యాపురమను గ్రామమును దానముగా ఇచ్చినట్లు తెలియవచ్చుచున్నది. తరువాత క్రీ.శ. 1578-79 సంవత్సరముల మధ్య గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా విజయనగరముపై దండెత్తివచ్చి పెనుగొండవరకును దాడిసల్పెను. అప్పుడు అహోబిలము అతని స్వాధీనమగుటచేత అయిదారు సంవత్సరములు మహమ్మదీయుల వశములో నుండిపోయెను, విజయనగర చక్రవర్తి రెండవ వేంకటపతిరాయలు క్రీ. శ. 1584- 85 సంవత్సరములో మరల అహోబిలమును స్వాధీనము చేసికొన్నట్లు అచటగల శాసనము ధ్రువపరచుచున్నది. చంద్రగిరిలో సాళువ వంశీయుల కాలమునుండి శ్రీకృష్ణ దేవరాయలవరకు ఈ క్షేత్ర మన్ని విధముల ప్రాశస్త్యమును గలిగి ఉండెనని చెప్పవచ్చును.

ఇనుప స్తంభము విడెము కొమ్మరాజు అను వానిచేత 14 వ శతాబ్దియందే నిర్మింపబడినదని చెప్పుదురు. దేవాలయ మందు 15, 16 శతాబ్దులకు చెందిన అనేక దాన శాసనములు కొండవీటి రెడ్డిరాజుల నాటివి విజయనగర రాజులనాటివి కలవు. వానివలన కొంతవరకు చరిత్రను తెలిసికొనగలుగుచున్నాము. అహోబిలము మత కార్యకలాపాలకు ప్రధానకేంద్రముగా నుండుటచేత ఆంధ్రదేశమునందలి రాజకీయ, సాంఘిక, సారస్వత జీవితములలో దాని కొక ప్రత్యేకస్థానము లభించినది. ఆ దేవునకును, ప్రాంతమునకును సంబంధించియున్న జానపద గేయము లనేకములు నేటికిని విరివిగా జనబాహుళ్యమందు ప్రచారములో గలవు. అందులో కొన్ని చెంచెత యొక్కయు, నరసింహస్వామి యొక్కయు ముగ్ధ ప్రణయమును వర్ణించు కళాఖండములు మనోజ్ఞములు. పద కవితారచనలో సుప్రసిద్ధుడైన తాళ్ళపాక అన్నమాచార్యుడు తన అమేయమైన సంగీత ప్రభావమున శ్రీవేంకటేశ్వర స్వామిపై కీర్తనలు రచించి, తెలుగుభాషకు అమరత్వమును చేకూర్చిన మహానుభావుడు.ఈతడు అహోబిల మఠాధిపతి యొక్క ప్రోత్సాహమును తొలు దొల్త నందుకొన్నాడట!

విశిష్టాద్వైత మత ప్రచార కేంద్రముగ నుండి ప్రకృతి సౌందర్య విశేష శోభితమై, చారిత్రక సంపత్తి గలిగి, ఆంధ్ర జానపద జీవితములో నంతర్భాగమై ఉత్తమ వాఙ్మయ వికాసమునకు తోడ్పడిన అహోబిల క్షేత్రము ఆంధ్రజాతికి గర్వకారణము. ఈ మధ్య ఉదారులయిన భక్తుల సహాయమువలన మంటపములు, గోపురములు ప్రాకారములు వెలసినవి. సులభ ప్రయాణ సౌకర్యములు చేకూరుచున్నవి. ప్రభుత్వ 'హిందూధర్మాదాయశాఖకు చెందిన శాసనముక్రింద ఆ దేవాలయ పరిపాలనము ఒక ధర్మకర్తృత్వ సంఘముచేత నిర్వహింప బడుచున్నది. ఫాల్గున మాసములో జరుగు తిరునాళ్ళకు వచ్చు యాత్రికులకు అన్ని విధము లయిన సౌకర్యములు గలిగింప బడుటయేగాక నరసింహస్వామి ఉత్సవము ఒక్క మాసము పాటు చుట్టుపట్టు గ్రామములలో అతి వైభవముగా జరుపబడుచుండును.

దం. వే. ను.

[[వర్గం:]]