Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబలపండితుడు

వికీసోర్స్ నుండి

అహోబలపండితుడు  :- అహోబల పండితు డాంధ్రశబ్దచింతామణికి సమగ్రముగను, విపులముగను సంస్కృతములో గొప్ప వ్యాఖ్యానమును రచించెను. దానికి "కవిశిరోభూషణ" మని అహోబలుడు పేరిడెను. కాని అది గ్రంథకర్త పేరుతో "అహో బలపండితీయ" మని వ్యవహరింపబడుచున్నది. సంస్కృతమున పాణిని విరచితమగు అష్టాధ్యాయికిని, పతంజలి విరచితమగు మహాభాష్యమునకును ఎట్టి సంబంధముకలదో యట్టి సంబంధమే ఆంధ్ర శబ్దచింతామణికిని, అహోబల పండితీయమునకును గలదని పలువురు పండితులు అభిప్రాయ పడుచున్నారు.

అహోబలపండితుడు ఇట్లు చెప్పుకొనేను. "వాతూల వంశే౽వత తారభూయ శ్రీ నన్న విద్వానహమేవ సో౽స్మి" వాతూలవంశమున నన్నయ పండితుడు మరలనవతరించెను. అతడే నేను అని ఉపోద్ఘాతమునందును, 'ప్రభంజన వంశాబ్ధి రాకాశశాం కేన” అని పరిచ్ఛేదాంత గద్యము లందును సూచించెను. అహోబలుడను పేరును, (వాతూల) ప్రభంజనాన్వయమను నింటిపేరును కల్పితములనియు, మొదటి పేరు నరసయ్య, ఓబళయ్య అనియు ('అకుటిలకీ ర్తి నిర్మలత నంచితు డౌబలపండితుండు' అను ఉపసంహారములోని పద్యభాగమువలన) ఔ బలపండితుడనియు, ఇంటి పేరు గాలి వారనియు కొందరు తలంచుచున్నారు. గాలి నరసయ్య అను పేరు పేలవముగా నుండుననియు ప్రౌఢతకై అట్లు వానిని సంస్కృతీకరించి యుపయోగించెననియు తలచుచున్నారు. పరిచ్ఛేదాంత గద్యమున "శ్రీమత్పొలూరి మాధవయజ్వ చంద్రసముజ్జ్వల త్కృపోక్షిత కటాక్షాసాదిత సాధు పాండిత్యాభరణ" అని చెప్పుకొనుటచే పోలూరి మాధవ సోమయాజి ఈతని విద్యా గురువనియు, "శ్రీమ త్సీతారామచంద్ర చరణారవింద మిళిందాంతఃకరణ" అనుటచే ఇతడు శ్రీరామభక్తుడనియు తెలియుచున్నది.

నియోగులయిన గాలివారును, పోలూరివారును గుంటూరి మండలమున నున్న వారట. అహోబలపతి మొదట మైదవోలులో నుండగా గుండ్లకమ్మ వరద వచ్చి ఇండ్లు పొలములు పాడుకాగా నాతడు నర్సారావు పేట జమీందారులయిన మల్రాజు వారి నాశ్రయించి అగ్రహారమును పొందినట్లు తెలియుచున్నది.

అహోబలుడు ఆత్మస్తుతిపరాయణుడుగా కనిపించును. అతడు తన్నిట్లు భూషించుకొనెను.

"యన్మూర్త్యా కవితామూల కంద వాగను శాసనౌ
జాగృతో౽హోబలపతీ రాజతే సవిలక్షణః"

కవితకు మూలకందమగు వాల్మీకియు, నన్నయభట్టును ఎవనిరూపముచే నొప్పుచున్నారో యట్టి విలక్షణుడగు నహోబలపతి ప్రకాశించుచున్నాడు.

కాలము : ఆంధ్రశబ్ద చింతామణి బాలసరస్వతి పండితునకు కీలక సంవత్సరమున దొరకెనని అప్పకవియు, అహో బల పండితుడును ఈవిధముగా వ్రాసియున్నారు.

"ఆలోకనుతుఁడు మొన్నటి కీలక సమయమున మతంగగిరికడ నొసగెన్".అప్పకవి

“జగ్రాహవ్యాకృతిం తస్మాత్కలి ర్బాల సరస్వతీ
ఎలకూచి కులాంభోధి శరద్రాకానిశాకరః.
సమస్తకవితా ధక్షొ వత్సరే కీలకాహ్వయే.”

అహోబలుడు. అప్పకవి మొన్నటి కీలక సంవత్సరమున బాల సరస్వతికి ఆంధ్రశబ్ద చింతామణి దొరికెనని చెప్పి యున్నాడు. అందుచే బాలసరస్వతికి గ్రంథము దొరికిన కీలక సంవత్సరము తరువాత మరల కీలక సంవత్సరము వచ్చులోపల 'అప్పకవీయము 'అహోబలపండితీయము '

రచింపబడెననుట స్పష్టము. మరియొక కీలక సంవత్సర మేని మొన్నటియని చెప్పుట అసంగతమగును. బాల సరస్వతికి గ్రంథము దొరకిన కీలక సంవత్సరము క్రీ. శ. 1608 అని మనము అప్పకవీయము యొక్క కాలమును బట్టి నిర్ణయింపవచ్చును. మరల కీలక సంవత్సరము క్రీ. శ. 1668 లో వచ్చును. కావున అహోబల పండితీయ మునకు చివరమితి క్రీ. శ. 1668 యై యున్నది. అహోబలపతి తన గ్రంథమునందు అప్పకవిని పేర్కొనుటయు, అప్పకవీయమునందలి పద్యముల సుదాహరించుటయు జూడ నప్పకవీయము వ్రాయబడిన తరువాత కవిశిరోభూషణము వ్రాయబడినదనుట స్పష్టము. అప్పకవీయము క్రీ. శ. 1656 సం॥లో వ్రాయుటకు నారంభింప బడినది. ఆ గ్రంథము పూర్తియగుటకును, దేశము నందు వ్యాప్తి నొందుటకును రెండు సంవత్సరములు పట్టిన వనుకొన్న యెడల క్రీ. శ. 1658-1668 మధ్యకాలమున 'అహో బలపండితీయము' వ్రాయబడెనని మనము నిశ్చయింపవచ్చును. 'అప్పకవియు, అహోబలపండితుడును సమకాలికులనియు, సమీప గ్రామములందుండు వారనియు పరస్పరేర్ష్యా ప్రేరితులనియు పూర్వము నుండి వదంతికలదు. అదియు నీ కాల నిర్ణయమునకు సహకారియే. అందుచే అహోబలపండితుడు క్రీ. శ. 17 వ శతాబ్దివాడని పెద్దలు నిశ్చయించిరి.

గ్రంథ కర్తృత్వము : ఎలకూచి బాల సరస్వతీ మహోపాధ్యాయుడు నన్నయభట్ట విరచితమును, 'శబ్దాను శాసనము' అను నవరనామముగలట్టి ఆంధ్రశబ్ద చింతామణికి ‘బాలసరస్వతీయ' మను నొక టీక వ్రాసి యుండెను. ఈ మహోపాధ్యాయుడు అప్పకవిని, అహోబలపండితునకును పూర్వుడు. ఆంధ్ర శబ్దచింతామణి నన్నయభట్ట విరచిత మేయని పలువురు ప్రామాణిక వైయాకరుణుల యాశయము. బాలసరస్వతి నన్నయభట్టారకున సకలకవితాప్రవర్తకుడు గాను, శబ్దశాసనముగాను, ఆంధ్రశబ్ద చింతామణిని శబ్దశాసనముగాను జెప్పియున్నాడు.

బాలసరస్వతికి దరువాతివాడగు అప్పకవి ఆంధ్ర శబ్ద చింతామణిలోని సంజ్ఞాసంధి పరిచ్ఛేదములకు మాత్రమే తెలుగు గద్య పద్యములలో వివరణమును వ్రాసెను. అహోబలుడు బాలసరస్వతి స్వీకరించిన ఆంధ్రశబ్ద చింతా మణి ప్రతిని తన వ్యాఖ్యానమునకు మాతృకగా నంగీకరించెను. అప్పకవి చేపట్టిన మాతృకయందలి పాఠ బేధములను గూడ అథర్వణోక్తి ప్రకారము సంగ్రహించెను.

1.

పాఠభేదాస్తు బహవో దృశ్యంతే పుస్తకద్వయే,
మయాప్రాయ స్సరస్వత్యాః పుస్తకం పరిగృహ్యతే.

2.

అప్పార్య పుస్తకారూఢ పాఠ భేదా ద్యదుస్థితం,
మయా సంగృహ్య తేరూపం తదప్యాథర్వణో క్తితః

. ——కవి శిరోభూషణ గ్రంథాది పీఠిక

ఆంధ్రశబ్ద చింతామణి బాలసరస్వతీ పండితునకు లభించిన విధమును గూర్చి యొక అద్భుతకథ చెప్పబడు చున్నది. నన్నయభట్టు దీనిని రచించెననియు రాజరాజ నరేంద్రుని కుమారుడయిన సారంగధరుడు బాల్యమున దాని నభ్యసించి, కాలుచేతులు నరకబడి సిద్ధులలో కలిసి కాలాంతరమున బాలసరస్వతికి ప్రత్యక్షమై చింతామణి గ్రంథమును వ్యాఖ్యానింపుమని అతని కొసగినట్లు కథ కల్పింపబడినది. అప్పకవియు, అహోబలపండితుడును ఈ కథనే తమ గ్రంథ పీఠికలయందు అనూదించిరి. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట కృతము కాదను వాదము విమర్శక లోకమున కలదు. దీనిని మొదట లేవనెత్తినవారు కం. వీరేశలింగము పంతులుగారు. శ్రీ వద్దుల చిన సీతారామస్వామి శాస్త్రిగారు తమ బాలసరాస్వతీయ - అథర్వణకారి కావళీ పీఠికల యందును చింతామణి' విషయపరిశోధక గ్రంథమునందును పెక్కు హేతువులచే చింతామణి నన్నయ కర్తృకమే యని స్థాపించియున్నారు. అథర్వణకారికావళి అథర్వణ కర్తృకమే అనియు, అది ఆంధ్రశబ్ద చింతామణికి శేష గ్రంథమే అనియు చింతామణియందలి సూత్రములు సామాన్య సూత్రము లనియు, కారికావళి సూత్రములు విశేష సూత్రము లనియు వారిమతము.

అహోబలపండితుడు బాలసరస్వతీయ, అప్పకవీయములనేగాక అథర్వణ కారికావళిని గూడ ఆధారముగాగొని యాంధ్రశబ్ద చింతామణికి అహోబల పండితీయమను సంస్కృత భాషామయమును, విపులమును,క్షొదక్షమమునగు వ్యాఖ్యానమును రచించి యాంధ్రభాషకు మహోపకార మొనర్చెను.

తత్ర పంచ పరిచ్ఛేదా
శృబ్దశా స్త్రే నియంత్రితాః॥
ఆర్యాఖ్య పద్యైస్త త్సంఖ్యా
సమ్మితా స్యాద్గ జైర్గ జై ః ॥

బాలసరస్వతి పరిగ్రహించిన ఆంధ్రశబ్ద చింతామణి యందు ఆర్యావృత్తములుగల అయిదు పరిచ్ఛేదములు కలవు. అవి సంజ్ఞా, సంధి. అజంత, హలంత, క్రియా పరిచ్ఛేదములు. ఈ అయిదు పరిచ్ఛేదములందును 88 ఆర్యా వృత్తములు కలవని అహోబలపండితుడు నుడివెను. కాని "ఆద్యం ప్రకృతిః ప్రకృతి శ్చాద్యే" అను శ్లోక వివరణ సందర్భమున మరియొక శ్లోకమును ఇతడు ఉదాహరించి యున్నాడు. "శాస్త్రమ పౌరుష మాద్యం" అను శ్లోకము బాల సరస్వతి స్వహస్త లిఖితమయిన ప్రతియందు తనకు లభించెనని అహోబలుడు సూచించెను. ఇట్లు ఆంధ్రశబ్దచింతామణియందలి శ్లోకములు 89 అగుచున్నవి. ఈ విశేష శ్లోకమును బాలసరస్వతి కాని అప్పకవిగాని వివరించి యుండలేదు. అప్పకవి గ్రహించిన ప్రతియందు 82 ఆర్యావృత్తములే కనిపించుచున్నవి. ఈ యంశము క్రింది శ్లోకమువలన తెలియనగుచున్నది.

మతంగ శైల విప్రేంద్రా దన్యం వ్యాకృతి పుస్తకం |
కాకునూ ర్యప్పకవినా గృహీతం తత్ర షడ్గతాః॥

మతంగపర్వతమందున్న బ్రాహ్మణునివలన చింతామణియొక్క మరియొకప్రతిని అప్పకవి సంగ్రహించెను. దానియం దారు శ్లోకములు పోయినవి, (అహోబలపండితీయ పీఠిక)

ఇల నెనుబడి రెం డార్యలు
గలుగు పరిచ్ఛేద పంచకంబునఁ దగు....

(అప్పకవీయము 1 వ అ. 54. వ. వ.) కవిశిరోభూషణము అను వ్యాఖ్యానము మూలముననే యథర్వణ కారికావళి అను వ్యాకృతియు లోకమునకు తెలియవచ్చెను. దీనికి 'వికృతి వివేకము' నామాంతరము. ఆంధ్రశబ్దచింతామణి సాధారణముగా తత్సమశబ్ద నిరూపణ వరమయినది. అట్టి తత్సమ శబ్దరూప సాధన విషయముననుగూడ కొంత పూరింపవలసి యుండుటచే,తచ్ఛేషభూతమగు ఆంధ్ర వ్యాకరణ విషయ జాలమును విపులముగా అథర్వణాచార్వుడు వివరించి ఆంధ్రభాషకు సమగ్రమగు వ్యాకరణము లేని కొరతను చాలవరకు తీర్చెను, వేయేల! వికృతి వివేకము (అథర్వణ కారికా వళి) లోని విషయబాహుళ్యము నేటి బాల వ్యాకరణ త్రిలింగ లక్షణ శేషాదులలో గూడ లేదనుటకు సందేహము లేదు.

అహోబలుడు తన వ్యాఖ్యానమున అథర్వణ కారికలను పేర పెక్కు శ్లోకముల నుదాహరించి యున్నాడు. పతంజలి మహాభాష్యమున వ్యాకరణ సంబంధమయిన కొన్ని శ్లోకములు ఉదాహరింపబడినవి. వాటికి సమానముగా నిందు అథర్వణ కారికలు చేర్చబడినవి.

యస్సారో 2థర్వణగ్రంధే సోప్యతైన విధీయతే |
తేన తత్ఫక్కి కాలోకలోలతా త్యజ్యతాం బుధై ః ॥

'అధర్వణాచార్యుని గ్రంథమునందలి సారమంతయు నిందు జేర్చితిని. కావున పండితులు దానిని చూడవలయునను కోరిక వీడవలయును' అని అతడు వ్రాసెను (కవి శిరో.పీ.). అథర్వణకారి కావళిముద్రిత ప్రతి ద్వితింత్రిణీ (రెండుచింతల) సీతారామకవి వ్యాఖ్యగలదై ప్రస్తుతము లభించుచున్నది. ఈ కారికలను అథర్వణుడు రచింపనే లేదనియు స్వపక్షమండనార్థమై అహోబలుడే వ్రాసి తన వ్వాఖ్యానమున జొప్పించెననియు విమర్శకులు తలచు చున్నారు. ఆంధ్రవ్యాకరణ విషయమున నన్నయ ప్రథమాచార్యుడనియు, అథర్వణుడు ద్వితీయాచార్యుడనియు పండితవ్యవహారము కలదు .

శైలి :- అహోబలపండితుని కవిశిరోభూషణపు శైలి మృదుమధురమై సరళమై ప్రసాదగుణ భూయిష్ఠమై సంస్కృత కావ్య వ్యాఖ్యాతలును, లక్షణగ్రంథ వాఖ్యాతలు నగు మల్లి నాథ, సోమపీథ్యాదుల శైలికన్న రసవత్తరముగా నుండును. ఇది అహోబలుని సంస్కృతాంధ్ర పాండిత్యమును దెలుపు వ్యాకరణ సంబంధమైన యుధ్రంథము. లక్షణములు సంస్కృతమునందును, లక్ష్యములు తెలుగునందును చెప్పబడుటచే నిధి చదువుటకొక వింత గ్రంథముగా నుండును. ప్రాకృత వ్యాకరణ లక్ష్యలక్షణము లిట్లెయుండుటచే అవి చూచినవారికి నిది విపరీతముగా గన్పట్టదు.

"విశ్వశ్రేయః కావ్యం, తదదోషౌ పరికృతౌచ వాగర్ధౌ, సాహగ్యారస వృత్తిః సాధ్యోహిరసో యథా యథం కవిభిః" - ఇత్యాది సూత్ర వ్యాఖ్యా సందర్భమున తనకుగల సర్వశాస్త్ర దర్శనములందలి కూలంకషములైన పాండిత్య ప్రతిభా విశేషాదులు ద్యోతక మగునట్లుగా అహోబలుడు వ్రాసియున్నాడు. ఈ సందర్భముననే "వ్యాకరణస్యాపి బ్రహ్మపరత్వమేవ తథాహి పస్పశాహ్ని కే భగవత్పతంజలినా చత్వారి శృంగేతి మంత్రస్యార్దొ వివృతః." పస్పశాహ్నికమందు(వ్యాకరణ భాష్యభాగము.) 'చత్వారి శృంగేత్యాది' మంత్రమునకు వ్యాకణ పరముగా నర్థమును వివరించెను. పతంజలి మహర్షి సంస్కృత వ్యాకరణావశ్యకతను మహా భాష్యమునందు చర్చించినట్లే అహోబలుడును ఆంధ్రవ్యాకరణా వశ్యకతను గూర్చి ఇందు చర్చించెను. సంస్కృత భాషయందు మాత్రమే కావ్యములను రచింపవలెను. తదితర భాషలన్నియు అపభ్రంశములు. వాటి నుచ్చరించుట పాపము. దేశ భాషలలోని పురాణాదులను విన్నందున పాపక్షయము లేదు. అను నీ మున్నగు పూర్వపక్షములఖండించి యేదేశమువారి కాభాష సంస్కృతమువలెనే పవిత్రమనియు, స్త్రీ శూద్రులకు జ్ఞానాధికారము గలదనియు 'నా నృషిః కురుతే కావ్యం' ఋషి కానివాడు కావ్యమును రచింపలేడనియు, నన్నయభట్టును ఋషిగా నెంచవలెననియు, ఆతని వ్యాకరణము ప్రమాణమే యనియు, వివరించి యున్నాడు.

వ్యాఖ్యాన విశేషములు :- అప్పకవి “నిత్యమను త్తమ పురుష క్రియాస్వితః" అను సూత్రమును వివరించుచు ఇట్లు చెప్పెను. భూత కాలక్రియలగు ప్రథమపురుష బహువచనము, మధ్యమపురుష ఏక వచన బహువచనములు, ఉత్తమ పురుష బహువచనము, ఇకార మంతమందు గల వాటికి అచ్చు పరమగునపుడు సంధి నిత్యమని ఈ యుదాహరణముల నిచ్చెను - దీవించిరట; దివిజు నేలితివట; మీరు కట్టితిరట; వింటి మీవార్త. ప్రథమోత్తమ పురుషైక వచనములు, భూతకాలమునందలివి, ద్రుతాంతములగునని ఈ యుదాహరణముల నిచ్చెను భరియించె నుపేంద్రుడు; ఏను బ్రతికితి ననగన్. విరచించెను శ్రీనాథుఁడు ధరణిని శృంగార నైషధంబునఁ గూర్చుం డిరి యొండొరునని కానక పరపురుష క్రియలఁ బ్రకృతిభావము గలదే? (అప్ప. 5వ. ఆ. 64 వ ప.)

"బలభిద్వహ్ని పరేత రాజవరుణుల్
     బర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుంగదిసి.”

(శృంగార నైషధము.)

ఈ సూత్ర సందర్భమును పురస్కరించుకొని శ్రీనాథుడు అపప్రయోగము చేసెనని అప్పకవి విమర్శించెను. భూతకాలిక ప్రథమ పురుష బహువచనమునకు సంధి నిత్యము కాదగియుండగా ప్రకృతిభావము చేసెనని యాతడాక్షేపించెను.

అహోబలపండితుడు తన వ్యాఖ్యానమునందు అప్పకవి శ్రీనాథునిపై చేసిన యాక్షేపణను పరామర్శించి, శ్రీనాథుని ప్రయోగము లాక్షణిక సమ్మతమేయని సమర్థించెను. ఎట్లన “ప్రధమే చోత్తమేచైవ క్రియేతొవా భవేత్ చ్యుతిః | నిత్య మన్యస్య వికృతౌ క్త్వార్థేతో నభ వేత్సదా," అను నాథర్వణకారికను అహోబలు దీసందర్భమున పేర్కొనెను. ప్రథమ పురుష యందును, ఉత్తమ పురుషయందును క్రియా సంబంధియగు ఇకారము వికల్పముగా జారిపోవును. మధ్యమపురుష 'ఇ' కారమునకు సంధి నిత్యముగా నగును. క్త్వార్థేకారమున కెల్లపుడు సంధిలేదు. దీనిప్రకారము శ్రీనాథుని ప్రయోగము ప్రామాణికమే యనెను. ద్రుతాంతమైన భూత కాలిక ఉత్తమ పురుషైక వచనక్రియకు సంధి వైకల్పికమని అహోబల పండితుడు వివరించెను, దీనిని "ప్రాయస్తు స్యాత్కి మాది కస్యేతః" అను సూత్రమునకు విషయముగా చేసెను. నేవించితి నచ్యుతు; సేవించి తచ్యుతు; అని యుదాహరణములు. అథర్వణుడును, కవి మండనకారుడును దీనిని అనుమతించిరి. కొందరమతమున దృతాంతమైన 'తి' ప్రత్యయమునకు సంధి చెల్లదు. కొలిచితిని+అబ్ధిజను, కొలిచితినబ్ధిజను, కొలిచితిని నబ్ధిజను అని రూపము లేర్పడవలెను. “నస్యాత్ త ద్ధ ర్మోత :" అను సూత్రవివరణ సందర్భమున అహోబలుడును, అప్పకవియు భిన్నమార్గముల త్రొక్కినారు. అహోబలుని వివరణము "సంధిరితి సర్వత్రానువర్తతే. తధ్ధర్మోకార స్స్యాచి సంధిర్నస్యాత్. తధర్మపదేన తద్ధర్మక్రియా, తజ్జన్య విశేషణంచ గృహ్యేతే. వెలయునతని కీర్తి సకల దిగ్వలయమునను, రక్షణమొనర్చు నంబుజా తాక్షు గొలుతు నిత్యా ద్యుదాహరణం" (సంధియను శబ్దము అంతట ననువర్తించుచున్నది. తద్ధర్మో కారమున కచ్చు పరమగుచుండగా సంధిలేదు. తధర్మ పదముచేత తద్ధర్మ క్రియయును, తజ్జన్య విశేషమును గ్రహింపబడుచున్నవి. వీటి రెంటికి నుదాహరణములు వెలయు నిత్యాదులు.) అహోబలపతి ఇట్లు వ్యాఖ్యానించుటకు మూలము అథర్వణుడు. వికృతి వివేకమునం దిట్లున్నది. "ప్రథమశ్చొత్త మశ్చైవ తాను తద్ధర్మ సౌంజ్ఞికే । భూతాద్య విషయౌ తత్రచైక త్వార్థాభి ఛాయకౌ ఉదంతేచ సదానాం తౌన సంధి స్తత్ర కల్ప్యతే". అనగా పూర్వోక్త క్రియలయందు భూతాద్య విషయకములై నాంతములు, ఉదంతములు నైన ప్రధమోత్తమ పురుషైక వచనములు తద్ధర్మ సంక్షితము లగును. వాటికి సంధి రాదు. ద్రుతాంతము లైన వీటికి సంధి రాకుండగా, కళలగు నితర తద్దర్మ క్రియారూపములకు సంధి కలుగవచ్చును. ఉదా : వారు ఘటింతురనుచు; ఘటింతు మెంత పనియైన, ఘటింతు వనిళము. అప్పకవి ఈ సూత్రమును మరియొక విధమున నన్వయించెను. ఆతడు "నః స్యాత్" అను పాఠమును కల్పించుకొని

క్షితిని బై పదములకు విశేషణంబు
లగు క్రియాపదంబుల తుదినమరు శృంగ
మునకు వచ్చు నాగమమయి పొల్ల ద్రుతము
ప్రాణపరమైన కర్మధారయమునందు.

ఉత్తర పదమునకు విశేషమైన తద్ధర్మరూపము తుది 'ఉ' కారమున కచ్చుపరమగునప్పుడు కర్మధారయమున పొల్ల 'న' కారము ఆగమముగా వచ్చును.

ఈతడీ విధముగా వ్యాఖ్యానించుటచేతనే తరువాతి లాక్షణికులందరు తద్ధర్మార్థక విశేషణో కారమునకు అచ్చుపరమగు నప్పుడు నకారాగమము వచ్చునని సూత్రించుచు వచ్చిరి. ఈ సూత్రమునకు పూర్వాపర సూత్రములీ సూత్రము సంధినిషేధ వరముగా చాటుచుండ, నకారాగమ విధాన పరముగా అప్పకవి వ్యాఖ్యానించెను.' భావార్థక 'ట' వర్ణ విధాయకసూత్ర వివరణ సందర్భమున అహోబలుడు మహాకవుల ప్రయోగములను పరామర్శించి తప్పు పట్టుటకు సాహసించెను. "భావే టవర్ణకోంతే సర్వేషాం క్రియాపదానాం స్యాత్" అని ఆంధ్రశబ్దచింతామణి సూత్రించినది. అన్ని క్రియా పదములకును భావార్థమున 'ట' వర్ణమగును. అతడు ఘటించుట, వచ్చుట మొదలగునవి ఉదాహరణములు. అథర్వణుడు దీనిపై కొన్ని విశేషములను సూచించెను. “పూర్వస్య నవి కారో నో స్తస్మిన్ లోపశ్చకస్యచిత్ "భావార్థక 'ట' వర్ణమునకు పూర్వమునందున్న 'ను' వర్ణము నకు లోపము రాదని దీని భావము. అనుట, వినుట వంటి రూపములే భావార్థమున సాధువులనియు, అంట, వింట, కంట, వంటి రూపము అసాధువు లనియు అహోబలుని నిర్ణయము. ఈ ప్రకారము శ్రీనాథుని ప్రయోగము ప్రామాదికమని యీతడు ఖండించెను. "ఏ తేన మధుకైట భారాతి మఱఁది రమ్మని పిల్చి పనిఁ గొంట నీకుఁ బ్రాభవము కాదె"— ఇత్యాది వచన స్య ప్రామాది కత్వమే వేత్యవధేయం. ఆంధ్రభాషాభూషణే “వినుటకు వింటయగు" నిత్యాది వచనేన వింటే త్యాదీనాం సాధుత్వ ముక్తం. తదనేన పరాస్తం - "ఘటించుట కొరకున్, వచ్చుట కొరకున్" ఇత్యాద్యాకారేణ సర్వత్ర 'ట' వర్ణకాదేవ విభ క్తయః. ఏవం స్థితే “సుతులఁ గనియెడు కొరకు నీవు ఘటించుకంటే ఇత్యాదీనాం భాస్కర తిక్కయ జ్వాదీనాం వచనానాం కిం మూలమితి వయం నవిద్మః" ఘటించుట కొరకు ఇత్యాదిగా 'ట' వర్ణకము మీదనే విభక్తి రావలసియుండగా, భాస్కర తిక్కయ జ్వలు 'కనియెడుకొరకు, ఘటించుకంటే' మొదలగు రీతిని ప్రయోగించుటకు మూల మేమియు మే మెరుగ లేకున్నారము. ఇట్లహోబలపతి తిక్కనాదులకుగూడ తప్పులు వట్టెను. శాస్త్రమునకును మహాకవి ప్రయోగములకు వైరుద్ధ్యము కలిగినపుడు శాస్త్రమే బలీయమని అహోబలుడు విశ్వసించెను. ఈ సందర్భమున అథర్వణ కారిక యొకటి ఇట్లున్నది. "శాస్త్ర ప్రయోగ వచసో శ్శాస్త్రం బలవదుచ్యతే | అనిష్పన్నే పదే తేన ప్రయోగా శ్రయణం బలం"—దీని నాధారముగా గొని అహొబలుడు మహాకవి ప్రయోగములకూడ సరిదిద్దుటకు వెనుదీయలేదు. వసుచరిత్రయందలి "అప్పుపాలయిన శుభ్రాబ్జంబు రుచి యెంత; కనకూర్మి ఱేని అప్పుననే ముంచె" అను ప్రయోగములను అహోబలుడు విమర్శించెను. నిత్య బహువచనమయిన అ ప్ఛబ్ధమును అప్పు అని ఏకవచనముగ ప్రయోగించుట దోషమని పై పద్య పాఠమును అతడు ఇట్లు సవరించెను. “అప్పుల పాలయిన య బ్జంము రుచియెంత; అలకూర్మి ఱేని అప్పులనే ముంచె." తుదకు అహోబలుడు నన్నయ మహాకవి ప్రయోగములనుకూడ సవరింపబూనెను. ఎట్లన “తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు" ఇత్యత్ర బు వర్ణ కానంతరం నకార శ్శ్రూ యతే తత్ర కాగ తిరితిచేత్ - "తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు"—— ఇత్యేవ పాఠ స్సాధుః. అహోబలుడు దిద్దిన పాఠము ఏ భారతియందును కాన్పించదు. “ప్రయోగ మూలం వ్యాకరణం"; "ప్రయోగ శరణా వైయాకరణాః" అను నుత్తమ పద్ధతిని ఇతడు పాలించిన వాడు కాడు. శాస్త్రమునకు ప్రాధాన్యమును ప్రయోగమునకు గౌణత్వమును ఇచ్చుటచే అహోబలుడు విమర్శనమునకు గురియగుచున్నాడు.

మొత్తమునకు అహోబల పండితుని కవిశిరోభూషణ వ్యాఖ్య ఆంధ్రశబ్దచింతామణి — అథర్వణ కారికావళులకు సమగ్రమును, విమర్శాత్మకమునగు వ్యాఖ్యానమై మహాభాష్యమువంటి యుద్గ్రంథమునై, తరువాతి యాంధ్రలాక్షణికులకు సర్వతోముఖముగా మార్గదర్శి యయ్యెననుట సత్యము.

కె. లిం. శా.

[[వర్గం:]]