Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్బెరూని

వికీసోర్స్ నుండి

అల్బెరూని  :- అబుర్ రైహాన్ మహమ్మద్ ఇబిన్ అహమ్మదు అల్బెరూని 973 సెప్టెంబరులో సోవియట్ రిపబ్లిక్ లో ఉన్న టర్కమనిస్తాన్ లో ప్రస్తుతము భివా అని పిలువబడు ఖ్వారిజిమ్ యొక్క పరిసర ప్రాంతములలో జన్మించెను. ఇతడు ప్రస్తుతపు ఆఫ్ గన్ స్థాన్ లోని “గజినీ" పట్టణములో 75 సంవత్సరముల వయస్సులో చనిపోయెను. ఇతని పితృసంబంధమైన గృహము బెరూన్ అను చోటి పరిసర ప్రాంతములలో ఉండుటవలన ఈయనకు అల్ బెరూని అని పేరు వచ్చినది. పురాతనకాలములో మధ్య యుగమునందు ఖ్వారిజిమ్ శాస్త్రములలో, కళలలో, ప్రసిద్ధికెక్కిన పండితులకు జన్మస్థలమైయుండెను. అటువంటి వారిలో బీజగణిత శాస్త్రమును కనుగొన్న ఆల్ ఖ్వారిజిమి అను గణితశాస్త్రజ్ఞు డొకడు. గజినీలోని యామినీ వంశీయుల ఆస్థానములో ఇతని పేరు ఎక్కువగా వినబడుచుండును. సుల్తాన్ మహమ్మదు గజినవి ఆవంశీయులలో ప్రముఖుడై, బాగ్దాదులోని అబ్బాసిద్ కాలిఫ్ వలన "యామినుద్దౌలా" అను బిరుదమును వడయుట వలన అ వంశమునకు యామినీవంశమని పేరు వచ్చినది.

క్రీ.శ. 1000, 1028 సంవత్సరముల నడుమ మహమ్మదు భారతదేశముపై పెక్కుసారులు దాడి చేసెను. తూర్పువైపున తన సామ్రాజ్యమును విస్తరింప జేయుటతో తృప్తిపడని అతనికి పడమటి వైపున కూడ తన రాజ్యమును వ్యాపింప జేయవలెనను ఆశ కలిగెను. 1017 వ సంవత్సరములో అతడు ఖవా పై దాడిచేసి నపుడు అల్బెరూని, అచ్చటి పరిపాలకునకు ముఖ్య సలహా దారుగా ఉండెను. అందువలన అతడు సహజముగా సుల్తాన్ గజినవీ యొక్క తంత్రములకు ఎదురు ఎత్తులు వేయదొడగెను. మహమ్మదు ఆడంబర సహితుడును, నిరంకుశుడును కాడు. అతడు శాస్త్రములను, కళలను ఎక్కువగా పోషించుచుండెను. దూర దేశములనుండి విఖ్యాత పురుషులను యుద్ధ ఖైదీలుగా తన వెంట తీసికొని వచ్చి, తన సామ్రాజ్యమును జ్ఞానసంపన్నముగా చేయవలెనని అతనికి ఉద్దేశము ఉండెను. మహమ్మదు మధ్య ఆసియా రాజ్యమగు ఖ్వారిజిమును జయించి ఖ్వారిజిమ్ నుండి గజినీకి తెచ్చినట్టి ఖైదీలలో అల్బెరూని ఒకడు. స్వస్థలమును విడుచునప్పటికి అల్బెరూని వయస్సు 40 సంవత్సరములు. అతడు తన జీవితములో శేషించిన భాగమును గజినవీ లోనే గడపెను,

గజినవీలో ఎక్కువమంది భారతీయులు అల్బెరూనికి కనిపించిరనుటకు సందేహములేదు. అప్పటికే పంజాబును మహమ్మదు తన సామ్రాజ్యములో చేర్చుకొనేను. 1017 వ. సంవత్సరములో పశ్చిమమున, మహమ్మదు అమూరు దర్యావరకును, తూర్పున పురాతన భారతీయ విజ్ఞానమునకు కేంద్రమైన 'కనూజ్' (కన్యాకుబ్జము) వరకును ఆక్రమించెను. అల్బెరూనియెడ మహమూదు నకు ఒక విధమైన వైరభావము ఉండెను. అందుచేత అతడు బ్రతికి ఉన్న రోజులలో అల్బెరూనికి తగిన ఆస్థాన గౌరవము లభ్యము కాలేదు. కాని అతని పరిపాలన కాలములోనే, అల్బెరూనికి పురాతన భారతీయ సాహిత్యమునందు 'పండితులైనవారిని కలిసికొనుటకు అవకా శము దొరికినది. ఇతరులకు తమ విజ్ఞానమును అందజేయు సత్స్వభావముగల హైందవపండితుల సహాయముతో, తన పూర్వ శత్రువైన అల్బెరూనికి, భారతీయ విద్యాభ్యాస మొనర్చుకొను నవకాశ మొసగిన సుల్తాను యొక్క సహనప్రవర్తనము, విశాలహృదయము ప్రశంసా పాత్రములు.

అల్బెరూని అన్ని విద్యాశాఖలందును ప్రావీణ్యము గడించెను. అతడు వ్రాసిన గ్రంథములు ఇంచుమించు 150 వరకు కలవని అంచనా వేయబడినది. కాని దురదృష్టవశమున సుమారు 27 గ్రంథములే మనకు లభ్యము అయినవి. అతడు కాలనిర్ణయశాస్త్రము, సంస్కృతిచరిత్ర, భౌతిక భూగోళము, తులనాత్మక మతచరిత్ర, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఖనిజ శాస్త్రము, జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, త్రికోణమితి శాస్త్రము, ఖగోళ శాస్త్రము, తదితర అనుబంధ శాస్త్ర గ్రంథములను వ్రాసెను. ఇతడు బహుభాషాకోవిదుడుగా ప్రఖ్యాతి కెక్కెను. ఇతని రచనలన్నియు శుద్ధమైన అరబిక్ భాషలో నున్నవి. ఐనను ఇతని మాతృభాష ఖ్వారిజ్మీ అనబడు పురాతన టర్కీ భాష. అరబిక్, సంస్కృతము లందేకాక హిబ్రు, సిరియాక్, పహ్లవి, సాగ్ధియన్ భాషలలో కూడ ఇతడు అగాధ మైన విజ్ఞానమును సంపాదించెను. ఇతని వద్ద అత్యుత్తమమైన సంస్కృత గ్రంథాలయ ముండెను. అందలి గ్రంథముల నన్నిటిని ఇతడు మిక్కిలి కష్టపడి చదివెను. “నాకుగాని, అర్థము చేసికొని నాకు బోధింపగల హైందవ పండితులకుగాని పనికివచ్చు సంస్కృత గ్రంథములు, ఎంత దూర ప్రదేశమునందున్నవని నాకు తెలిసినను వాటిని సేకరించుటలో ఎట్టి శ్రమయైనను, ఎంత ధనము వ్యయమైనను నేను లెక్కజేయను,” అని అల్బెరూని అనుచుండెడివాడు. పంజాబు పరిసరములు దాటి, పురాతన భారతీయ విజ్ఞానమునకు కేంద్రమైన కాశీపట్టణము వరకైన, ఇతడు వెళ్ళియున్నటుల తెలియకపోవుటచే, సంస్కృత భాషయందును, భారతీయ పురాతన గ్రంథములయందును ఇతనికిగల జ్ఞానము కొంత విచిత్రముగా కనబడును,

ఇతడు వ్రాసిన గ్రంథముల తారతమ్యమును వివక్షించుట మిగుల కష్టము. కాని భారత దేశమునకు సంబంధించి నంతవరకు, ఇతడు వ్రాసిన 'అసరుల్ బఖియా' అను (పురాతన దేశముల కాలనిర్ణయము) గొప్ప గ్రంథము, "కితాబుల్ - హింద్" లేక "ఇండికా' అను సుప్రసిద్ధ గ్రంథము - ఈ రెండును పురాతన భారతీయ విజ్ఞానమునందు అభిరుచి కలవారికి మిక్కిలి ముఖ్యము లైన గ్రంథము లని చెప్పవచ్చును. "కితాబుల్ - హింద్" అను గ్రంథమును వ్రాయుటకు ముందే, సంస్కృతము నుండి అనేక గ్రంధములను అరబిక్ భాషలోనికి ఇతడు అనువదించెను. వీటిలో కపిలుని సాంఖ్యము, పతంజలిగ్రంధము ముఖ్యమైనవి. వేదములనుండి, ఉపనిషత్తుల నుండి, భగవద్గీతలనుండి ఇతడు విశేషముగా ఉదాహరించెను.

"కితాబులు - హింద్" అను గ్రంథమును సంకలన మొనర్చుటకు అల్బెరూనిని ప్రేరణము చేసిన కారణమును గూర్చిన వృత్తాంతము నాతడిట్లు చెప్పెను. ఒకప్పుడు 'టిప్లిస్' (Tiflis) లోని ఆబుసాహిల్ను అల్బెరూని సంద ర్శించెను. ఆ తరుణమున దర్శనములనుగూర్చియు, మతముల చరిత్రను గురించియు చర్చలు జరిగెను. మహమ్మ దీయులు అతని అభిప్రాయములతో నేకీభవింపరైరి. అపుడతడు వారితో ఇట్లనెను. “ఇతర దేశీయుల సిద్ధాంతములను గూర్చియు, మతవిశ్వాసములను గూర్చియు మీకు తెలిసినది మిక్కిలి తక్కువగా నున్నది. అందుచే మీరు ఆ సిద్ధాంత ములను తప్పుగా తెలియచెప్పుటకు చాలా అవకాశమున్నది. వివరములు చాల తక్కువ దొరకుచుండుట వలన, పరిశోధనముకూడ మిక్కిలి కష్టము". అతడిట్లు చెప్పినను అక్కడ నున్నవారు, హిందువుల వేదాంత సాహిత్యములను గురించి విమర్శింపదొడగిరి. అల్బెరూని చాల బాధపడి, “మీకు హిందువులను గురించి పూర్తి విషయములు తెలియవు. హిందువుల విశ్వానములను, ప్రవర్తనమును గురించి యథార్థముగా తెలిసికొన దలచినచో, వారి మూలగ్రంథములను పరిశీలించుట అవసరము” అని ఉద్ఘొషించెను. తరువాత జరిగిన సభలో కూడ ఇదే విషయము ప్రస్తావనకు రాగా అల్బెరూనిని, ఆబుసహిల్, హిందువులనుగురించి "నీకేమి తెలియునని అడిగెనట! ఆ ప్రశ్నయే “కితాబుల్ - హింద్" అను గ్రంథ రచనము నకు మూల మయ్యెను.

పైన చెప్పిన విధముగ హిందూదేశమును గురించి ఈ గొప్పదగు గ్రంథము యొక్క సంకలనమునకు పూర్వమే, అల్బెరూనికి హిందువుల విద్యలయందు ఎక్కువ ఆసక్తి ఉండెడిది. భారత దేశములో అడుగిడుటకు పూర్వమే జర్జన్ వద్ద ఇతడు తన మొదటి గ్రంథాలలో నెంచదగిన “తూర్పు దేశముల కాలనిర్ణయము" అను గ్రంథమును సంకలిత మొనర్చెను. హిందువులు కాలమును నిర్ణయించు రీతి, వారి అధికమాసగణనా రీతులు, చంద్రుని స్థానములు, జ్యోతిషము మొదలగు వాటిని గురించి, ఈ గ్రంథమునందు సమృద్ధిగా విజ్ఞానము లభించును. మొత్తము మీద పురాతన కాలమునందలి అన్ని దేశములవారును, కాలనిర్ణయము చేయుటలో అవలంబించిన అన్ని పద్ధతుల గురించియు సమాచారము ఈ గ్రంథమునందు కలదనుట నిక్కము. ఐనను ఇతడు సేకరించి, అచ్చటచ్చట ఇతర దేశీయ సంస్కృతులతో పోల్చుచు. భారతదేశమునుగూర్చి వ్రాసిన నూతన విశేషము లన్నియు ఈ గ్రంథనామము సూచించు నట్లు, ఇందు కలవు. ప్రాచీనమయిన భారతీయ వేదాంతమునుగురించి ఇతడు చేసిన వర్ణనలు అసమానములు. సంస్కృత సాహిత్యము, నాటి భారతీయులు ఆచార సంప్రదాయముయొక్క భౌతిక స్వరూపము, మొదలగు విషయములను గురించి ఇతడు రచించిన అధ్యాయములు అపూర్వములు. ఇతని వాదములు, ప్రతిపాదనలు, విషయ ప్రధానములు. తాను వర్ణింప దలచిన ప్రజల యొక్క మానసిక ప్రవృత్తులను అనేకోదాహరణములతో ఇతడు విశదీకరించును. సంకోచము, పక్షపాతము లేకుండ, హిందువుల సంస్కృతి ఇతడు చిత్రించెను. సాధారణముగా గ్రంథమునందు ప్రతి అధ్యాయములో మూడుభాగములు కలవు. మొదటి భాగము అధ్యాయము నందలి ముఖ్యాశయమును ప్రతిపాదించును. రెండవభాగమున (అధ్యాయమున గల) విషయము పై గల సిద్దాంతములు, ఆ విషయమునందలి వివిధాంశములపై ప్రాచీన హిందూగ్రంథములనుండి ఉద్ధృతములైన వాక్యములు ఉండును. మూడవభాగమునందు, భారతీయ సిద్ధాంతములను, గ్రీకులు, పారశీకులు మొదలగు ఇతర ప్రాచీన దేశీయుల సిద్ధాంతములతో పోల్చి ఇతడు పరిశీలించును. ఇతని గ్రంథములందు విషయసంపత్తి కలదు. భాషయందు అసమగ్రత, పునరుక్తులు ఉండవు. విషయ ప్రతిపాదనము నిపుణముగా నుండును. పైనచెప్పిన విధముగ "కితాబుల్-హింద్ " ఒక్కటే ఇతడు భారతదేశమును గురించి వ్రాసిన గ్రంథము కాదు. ఇతడీ దేశమును గురించి వ్రాసిన గ్రంథములు ఇరువదివరకు కలవు. వీటిలో కొన్ని సంస్కృతానువాదములు. మరికొన్ని గ్రంథములు ఆద్యములయిన సంకలనములు, వాటికి ఉత్తమమును, విశ్వాస్యమునయిన ఉపాదేయసామగ్రి (data) ఆధారము.

మహమ్మదు కొడుకయిన సుల్తాన్ మసూద్ పోషణలో 1030 వ సం. న అల్బెరూని రచించిన “కానూన్ మాస్ ఉది" అను ప్రఖ్యాత గ్రంథమే ఇతడు వ్రాసిన వాటిలో నెల్ల ఉద్గ్రంథమని చెప్పవచ్చును. తండ్రివలెనే ఇతడు విద్యాపోషకుడు. ఈ ఉద్గ్రంథమును అల్బెరూని మసూద్ నకు అంకితము చేసెను. ప్రకృతి శాస్త్రములకు సంబంధించిన పుస్తకము లెన్నియో అప్పటికే అతడు ప్రచురించియుండెను. ఈ విశాలమయిన ఉప భూఖండమంతయును ఒకప్పుడు నీటియందుండెనని కూడ అతడు ఊహించెను. గ్రీకుల యొక్కయు, భారతీయుల యొక్కయు ఖగోళశాస్త్రములందు అనంతములైన పరిశోధనములు కూడ ఇతడు జరిపెను. మసూద్, "గజినవీ సింహాసనమును అధిష్ఠింపగా, తన ఖగోళశాస్త్ర విజ్ఞానమును సమీకరించి క్రొత్త సిద్ధాంతములు చేయుటకు అనువయిన కాలము ఆసన్నమయ్యెనని అల్బెరూని భావించెను. మొత్తము పుస్తకములో నాలుగు సంపుటము లున్నవి. ఇందు ఖగోళ- వైజ్ఞానిక శాస్త్రములకు సంబంధించిన గూఢ వివరములు కలవు. ఇది అముద్రితముగా నుండుట, కొంతవరకు మాత్రమే అనువదింపబడుట, దురదృష్టము. ఇప్పుడయినను ఇది ముద్రింపబడినచో చాల సముచితముగా నుండును. మొత్తముమీద ఈ “కానూన్” అను గ్రంథము, త్రికోణ మితిశాస్త్రము, భౌతిక భూగోళ శాస్త్రము, ఖగోళశాస్త్రము మొదలగు శాస్త్రములందలి విషయములను ప్రతిపాదించునదై, అల్బెరూని కాలము నాటి వివిధ విషయములను గురించిన విజ్ఞానమునకు అధిక్యమును చేకూర్చుచున్నది. తన ఈ గొప్ప గ్రంథారంభమున ఇతడు ఈ విధముగ వ్రాసెను. శాస్త్ర విషయమున నయినను ప్రతివ్యక్తియు నెరవేర్పవలసిన కర్తవ్యమును నేనును నెరవేర్చితిని, పూర్వులు అందిచ్చిన ఆద్య మయిన విజ్ఞానమును కృతజ్ఞతతో స్వీకరించితిని, నాకు తోచిన తప్పులను నిర్భయముగా దిద్దితిని. నన్ను అనుసరించు ఉత్తర కాలికుల ఉపయోగము కొరకు నా పరిశోధనా ఫలితమును వ్రాత రూపమున రక్షించి యుంచితిని.

ఒకప్పుడు అంగీకరింబడిన సిద్ధాంతమునకు వ్యతిరేకముగా భూమి గుండ్రముగా నున్నదని ఊహింపబడినది. మహమ్మదు యొక్క ఆస్థానమందున్న మహమ్మదీయ ఖగోళ శాస్త్రజ్ఞులు మధ్యాహ్న రేఖ యొక్క వృత్తాంశమును (arc of the meridian) కొలుచుటకు ప్రయత్నించిరి. కాని క్లిష్టమైన త్రికోణమితి శాస్త్ర పద్ధతితో పూర్వమునందలి తప్పులను సరిదిద్ది భూమి యొక్క వ్యాసార్థమును, వ్యాసమును, పరిథిని కొలిచి, దిఙ్మండలము యొక్క లోతును ఆధారము చేసికొని ఖగోళము యొక్క పూర్తి విస్తీర్ణమును, ఘనఫలమును (Volume) నిర్ణయించు గౌరవము అల్బెరూనికే దక్కెను. పంజాబులో ఉన్న నందానా అను శిఖరము యొక్క ఉచ్చ్రితిని (Altitude) ఆధారము చేసికొని ఈ గణనలు (Calculations) నిర్ణయింపబడినవి. అల్బెరూని నిర్ణయించిన భూమి వ్యాసార్థము నేటి గణనలకంటె డెబ్బదిమైళ్ళచే తక్కునగుచున్న దనుట స్పష్టము. నేటి ఖగోళ శాస్త్రజ్ఞులకు లభ్యమగు కొలతపరికరముల సాయములేకుండ అల్బెరూని ఈ నిర్ణయము చేయగలుగుట ఆశ్చర్యకరము.

“కానూన్ మసూద్" అను గ్రంథమునందలి మూడవ భాగమునందు త్రికోణమితి శాస్త్రమునకు సంబంధించిన ఆకృతులు, త్రిజ్య, (Sine) జ్య, (cosine) స్పర్శరేఖ మొదలగునవి ప్రతిపాదింపబడినవి. ఇతడు భారతదేశములో ఉద్భవించిన కొన్ని సిద్ధాంతముల నాధారముగా గొనియున్నట్లు కనిపించును. ఐనను యథాక్రమమయిన ఆధునిక రూపమును వాటి కొసగినవా డితడే. వర్తుల స్తంభాకారము కలిగిన (astrolaba) అను దూరనిర్ణయ సాధనమును ఇతడే కనిపెట్టెను. ఈ పరికరము యొక్క సహాయముతో నక్షత్రాదులను (Heavenly bodies) పరిశీలింపగలుగుట యేగాక, దూరమునందలి వస్తువుల యొక్క ఎత్తును, దూరమునుకూడ అల్బెరూని నిర్ణయింపగల్గెను. ఘనమూలము, నిష్పత్తి (ratio), అనుపాతము (Proportion), సంధ్యాకాలము, గ్రహణములు తెలిసికొను పద్ధతి కూడ అల్బెరూని కనిపెట్టెను. తోకచుక్కలు ఉత్పాతములు మున్నగు అనేక విషయముల జ్ఞానమునందు ఇతడు నిష్ణాతుడు. వీటిలో ఒక్కొక్క విషయమే పరిశోధకుని యావజ్జీవమును హరింపదగి యున్నది.

అల్బెరూని అన్ని కాలములకు చెందిన అత్యుత్తమ శాస్త్రజ్ఞులలో నొకడుగా నిస్సందేహముగా పరిగణింపబడదగిన వాడు. మరియు భారతీయ విజ్ఞానమునందత డొనర్చిన పరిశోధనములు, ప్రదర్శించిన విపుల దూరదృష్టి, పరాభిప్రాయ సహిష్ణుత, మున్నగువాటిచే భారతదేశమునకును, నాటి ముస్లిము రాజ్యములకును మధ్య అతడు దృఢమైన సంబంధానుబంధములను కల్పించినవాడు నై యున్నాడు.

హెచ్. కె. షె.

[[వర్గం:]]