సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభ్యవహారము
నకు భిన్నముగానుండును. భామహుడు ఈ యర్థములోనే దీనిని ప్రయోగించెను. కావ్యమునందును వ్యవహారమునందలి పదములే ప్రయోగింపబడుచున్నను, కావ్యమునందు అవి విశిష్ట పద్ధతిలో వాడబడుచున్నవి. దీనినే వక్రత యందురు.
వక్రోక్తి కావ్యజీవితము అని నుడివినవాడు కుంతకుడు. ఈతని గ్రంథము 'వక్రోక్తి జీవితము'. వక్రోక్తి యనగా 'వై దగ్ధ్య భంగీ భణితిః' అని ఇతడు నిర్వచించెను. వక్రోక్తి కవియొక్క వాడ్నైపుణ్యముచే నేర్పడునని ఈతని యభిప్రాయము. స్వభావోక్తిని అలంకారమనిన వారిని ఈతడు పరిహసించేను. వక్రోక్తి అరువిధము లని ఇతడు నిరూపించెను. అవి వర్ణవిన్యాస, పదపూర్వార్ధ, ప్రత్యయ, వాక్య, ప్రకరణ, ప్రబంధ గతములు,
ధ్వనికారుడు 'సంభాషణ వైచిత్రియే వక్రోక్తి'యని చెప్పి అది అలంకారమని నుడివెను. వామనుడు వక్రోక్తి 'సాదృశ్య లక్షణ' యని నిరూపించెను. రుద్రటుడు వక్రోక్తి శబ్దాలం కారమనిచెప్పి అది కాకు వక్రోక్తి, శ్లేష వక్రోక్తి అని రెండువిధములుగ నుండుననెను. భోజుని సరస్వతీ కంఠాభరణములో వాఙ్మయమంతయు వక్రోక్తి, రసోక్తి, స్వభావోక్తి యని మూడు విధములనియు, రసోక్తి సహృదయ హృదయాకర్షకమనియు చెప్పబడినది, వక్రో క్తిని గురించి ఈ విధముగా చెప్పుటవలన అది విలక్షణమైన కావ్యస్వరూపమును తెలుపుచున్నదని భావించవలెను. సాధారణ ప్రసంగములలో వాడబడు పదములను గైకోను కావ్యమునం దైనను వక్రోక్తి కొరకు పదములను ఏరుకొను పద్ధతి ఇతర సామాన్య సంభాషణలోకన్న వేరుగానుండును.
కైశిక్యాది వృత్తులు : ఇప్పుడు 'వృత్తి, ప్రవృత్తి' అను వాటినిగూర్చి చర్చించి వాటికి రీతులతో గల సంబంధ మును చర్చించుట చాల ఆవశ్యకము. 'భారతి, సాత్వతి, కైశికి, ఆరభటి అను నాలుగు వృత్తులను, వాటి అంగములను గూర్చి భరతుడు నాట్యశాస్త్రములో వివరించెను. అతడు వృత్తులు నాట్యమునకు తల్లులవంటివని చెప్పెను. కైశికివృత్తి శృంగార, హాస్యరసములలోను, సాత్వతి, వీర, రౌద్ర, అద్భుతములలోను అవశ్యముగా వాడవలె నని భరతుని మతము. రసార్ణవ సుధాకారుడు వృత్తులకు పైనియమములనే సూచించి, 'భారతీ' అను పదము 'భారీ' శబ్దమునుండియు, 'కైశికీ' అను పదము ' కేశ’ శబ్దమునుండియు ఉత్పన్నములయిన వని వాటికి పౌరాణిక వ్యుత్పత్తులను తెలిపెను. ఒక రసమునకు అనుగుణము అయిన శబ్దముల, అర్థముల ప్రయోగమును గూర్చి తెలిపి, ధ్వని కారుడు ఆవృత్తులే ఔచిత్యయుక్తములై వివిధములుగా తెలియనగు నని కూడా చెప్పెను. వృత్తియనగా వ్యవహారము అని యర్థము. రసానుగుణమై, ఔచిత్యవంతమయిన వ్యవహారముగల కైశిక్యాది వృత్తులు అర్థాశ్రయములనియు, ఉపనాగరికాదులు శబ్దాశ్రయము లనియు అభినవగుప్తుడు తెలిపెను. అతడు 'రసాదుల దృష్ట్యా వాడబడిన వృత్తులు నాట్యమునకు, కావ్యమునకు ఒక అపూర్వమయిన శోభను కలిగించును. ఆ రెంటికిని రసాదులు జీవితభూతములు. ఇతి వృత్తాదులు శరీర భూతములు' అని చెప్పెను. కనుక నాట్యమునకుగాని కావ్యమునకుగాని ఇతివృత్తము శరీరమని స్పష్టమగు చున్నది. కైశిక్యాదులు అర్ధవృత్తులని, ఉపనాగరికాదులు శబ్దవృత్తులనికూడ స్పష్టమైనది. భరతుడు కైశికీవృత్తిని స్త్రీలుమాత్రమే బాగుగా నటించగలరని అనెను. ఉద్భటుని మతములో వృత్తులు పరుష, ఉపనాగరిక, గ్రామ్య భేదముచే మూడు విధములు.
నాట్యశాస్త్రములో భరతుడు అవంతి, దాక్షిణాత్య, పాంచాలి, ఓడ్ర, మాగధి, అను ప్రవృత్తులను చెప్పి, ప్రవృత్తియనగా నానా దేశ వేష భాషా- ఆచారవా ర్తలను ప్రఖ్యావన చేయునది అని తెలిపెను. దాక్షిణాత్య ప్రవృత్తిలో అనేక నాట్యములు, గానము, సంగీతము కలవనియు ఆతడు వచించెను. కావ్య మీమాంసలో వేష విన్యాసక్రమము ప్రవృత్తి యనియు, విలాస విన్యాసక్రమము వృత్తి యనియు, వచన విన్యాసక్రమము రీతి యనియు ఈ మూడింటికిని గల విశేషమును అతి స్పష్టముగా తెలిపెను. సాగరనంది వైదర్భి, గౌడి, పాంచాలి, అను రీతులకు భారతీ వృత్తియు, పాంచాలికి సాత్వతియు, వైదర్భికి, కైశికి, గౌడికి ఆరభటియు, క్రమముగా అంగము లని చెప్పెను.
కావ్యదోషములు : అలంకారశాస్త్ర గ్రంథములన్నిటిలోను, దోషములను గూర్చి చర్చ జరిగినది. కుకవి యగుటకంటె అకవిగానుండుటయే మేలనియు, కుకవి యగుట మరణప్రాయమే యనియు భామహుడు వచించెను. భరతుడు పదిదోషములను పేర్కొనెను. అవి -'అర్థహీన, ఏకార్థ, గూఢార్థ, అర్థాంతర, విసంధి, శబ్ద చ్యుతి (శబ్దహీన), విషమ, భిన్నార్థ, అభిష్టుతార్థ, న్యాయాద పేత' అనునవి. దండి పదిదోషములను, భామహుడు పదునొకండు దోషములను చెప్పిరి. దోషములు సాధారణముగా పదగతములు, వాక్యగతములు, పదార్థ గతములు, వాక్యార్థగతములు, ఛందోవ్యాకరణగతములు, రసగతములు, దేశ కాలగతములు అయి యుండును. అర్థదోషముల భేదములను మమ్మటుడు, తరువాతి గ్రంథకర్తలు వామన మతానుసారముగా నంగీకరించిరి. మమ్మటుడు కావ్యప్రకాశములో, అలంకార దోషములనుకూడ చెప్పి అన్ని దోషములను అరికట్ట జాలము గనుక ఘోరములయిన దోషములను నిరోధింపవలె ననియు, అన్నింటిలోను ఘోరాతిఘోరములయిన రసదోషములను కవి ప్రయత్నాతిశయముచే దొరలకుండ చేయవలె ననియు. విశదీకరించెను. కావ్యమును నిర్దోపముగా కూర్చుట అసంభవమని విశ్వనాథు డనెను. 'దోషదృష్టి పరముగా మనస్సును అతిగా ప్రవర్తింప చేయకూడదు. దోషైక దృక్కులకు దోషము లేని చోటకూడ దోషము కనిపించును' అని కుమారిలుడు తేటపరచెను.
క.ల.శా
అలంపురము :- అలంపురము తుంగభద్రాతీరమున ఉన్న ప్రాచీన పట్టణము. ఇది రాయచూరు జిల్లాలోని ఒక తాలూకా కేంద్రము. ఇందలి జనసంఖ్య 7000. ఇప్పుడీ గ్రామ మంతయు శిథిలావశేషములతో నిండి యున్నది. విశాలమైనకోట, పురాణ ప్రసిద్ధములైన నవబ్రహ్మాలయములు, మనోహర శిల్పఖండములు, అనేక శిలాశాసనములు మనకిప్పటికినీ కనబడుచు నాటి వైభవమును స్మరణకు తెచ్చుచున్నది.
చరిత్ర : ఈ ప్రాంతము చాల ప్రాచీనమైనది. ఇచటికి సమీపమున ఉన్న గొందిమళ్ళ, చాగటూరు శివారులలో కెయిరనులు (cairns) అనబడు ప్రాగైతిహాసిక యుగపు సమాధులు విశేషముగా నున్నవి. అవి శిలాయుగమునకు చెందినవి. వాటిని త్రవ్వించి పరిశోధనలు జరిపినచో క్రొత్తవి శేషములు బయటికివచ్చును.
అలంపురమను పేరెట్లువచ్చెనో ఇందలి కోటను దేవాలయములను ఎవరు ఎప్పుడు నిర్మించిరో తెలుపగల ఆధారములు లభింపలేదు. పురములోని దేవద్రోణి తీర్థమున కోటగోడకు వేయబడిన విజయాదిత్య సత్యాశ్రయుని శాసనమునుబట్టి కోట 7 వ శతాబ్దము తరువాత కట్టబడెననియు, స్వర్గ బ్రహ్మాలయ ద్వారపాలకుని మీదగల వినయాదిత్య సత్యాశ్రయుని లేఖనమునుబట్టి ఆలయములు 7 వ శతాబ్దమునకు ముందు నిర్మింపబడి యుండెననియు గట్టిగా చెప్పవచ్చును.
స్థలపురాణములో, హేమలాపురమనియు, శాసనములలో హతంపుర మనియు నిది పేర్కొనబడినది. 11 వ శతాబ్దపు శాసనములలో అలంపురము పేరు కానవచ్చును. నిఖిలభారత ఆయుర్వేద విద్యాపీఠము (లాహోరు) వారు ప్రకటించిన "ఆనందకందం" అను వైద్యగ్రంథమున అలంపురము ప్రస్తావింపబడినది. ఆ గ్రంథకాల నిర్ణయమున అభిప్రాయ భేదములు కలవు. భారత ప్రభుత్వ-ఆర్ష శాఖవారి 1937 వ వార్షిక నివేదికలోని గురిజాల ప్రాకృత శాసనమందు 'హలంపురస్వామి' ఒకడు అచటి బౌద్ధ స్తూపమునకు దానముచేసిన విషయము కలదు. ఆ హలంపురము ఈ అలంపురమేయైనచో 3 - 4 శతాబ్దములనాటికే అలంపురము ప్రసిద్ధినంది యుండవలెను.
పరిసరములలోనున్న తక్కపిల, ఉండవెల్లి, శాతన కోట గ్రామనామము లీప్రాంతము యొక్క ప్రాచీనతను అస్పష్టముగ తెలుపుచున్నవి. అలంపురపు శిలాలేఖనములను బట్టి, వాస్తు శిల్పములనుబట్టి ఆలయములు 6-7 శతాబ్దములలో బాదామీ చాళుక్యుల కాలమున నిర్మింపబడి యుండునని ఊహింపవచ్చును.
ఈ ప్రాంతములు వరుసగా బాదామీ చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణీ చాళుక్య, కాలచుర్య, కాకతీయ,విజయనగర రాజులచే పాలింపబడినవని శాసనములు చెప్పుచున్నవి. తరువాత కుతుబుషాహీ, మొగలు పాదుషాలకు లోబడి బిజ్జులవారు కొంతకాలము పాలించినారు. ఆంధ్రానర్ఘరాఘవ కావ్యకర్తయగు బిజ్జుల చినతిమ్మ భూపాలుడు అబుల్ హసన్ కుతుబ్ షా సామంతుడై అలం
గణపతి - అలంపురము పురమును ఏలినాడు పిదప 19 వ. శతాబ్దమునషాయారుల్ ముల్కు అను జాగీరుదారు కొన్నాళ్ళు ఏలినాడని పార్సీ లేఖనములు తెలుపు చున్నవి.
శాసనములు : అలంపురము ఆలయములలో పెక్కు శాసనము లున్నవి. అవి దక్షిణాపథ చరిత్రకు ముఖ్యముగా పశ్చిమాంధ్ర చరిత్రకు మిగుల ప్రధానమైనవి. ఇంతవరకు లభించిన శాసనములలో వినయాదిత్యుని లేఖనలే ప్రాచీనమైనవి.
ఇచటబాదామీ చాళుక్యులు వినయాదిత్య, విజయాదిత్య, సత్యాశ్రయులు, రాష్ట్రకూట ప్రభూతవర్ష, ధారావర్ష మహారాజులు, కల్యాణీ చాళుక్యులగు త్రైలోక్యమల్ల, జగదేకమల్ల, భువనైక మల్ల, త్రిభువనమల్లుల కాలమున వారి పట్టమహిషులు, ప్రధానులు, సామంత మండలేశ్వరులైన తెలుగుచోడ, వైదుంబరాజులు, కలచురి భుజబల మల్లుని కాలమునందలి అయ్యావొళై మార్వర్ స్వాములు కాకతీయ ప్రతాపరుద్రదేవునికాలపు వీరబలంజ్యసమయ ధర్మ ప్రతిపాలకులు,అం తెంబరగండ పెర్మాడి రాయని ప్రధాని అయితరాజు, అంతెం బరగండ రాయి దేవమహారాజు, విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు మొదలయినవారు వేయించిన శిలాశాసనము లనేకము లున్నవి, వీటి వలన వాటి విద్యాపీఠములు, వ్యాపార శుల్కములు, అర్చావిశేషములు, రాజవంశ ప్రశస్తులు, మొదలయిన అపూర్వ చారిత్రకాంశములు తెలియవచ్చు చున్నవి. ఇచటి వీరగల్లుల పై విగ్రహములపై గూడ లేఖనములుండి చారిత్ర కాంశములను వెల్లడించుచున్నవి.
దేవాలయ శిల్పము - ఆలంపురము