Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభినయదర్పణము

వికీసోర్స్ నుండి

అభినయదర్పణము  :- 'అభినయదర్పణము' నందికేశ్వర ప్రోక్తమైనది, అది నృత్యమునకు సంబంధించిన చిన్న గ్రంథము. నందికేశ్వరుడు 'శంభు రౌరీ తథ బ్రహ్మా, మాధవో నందికేశ్వరః ... ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తితాః' అని పేర్కొనబడిన భరతశాస్త్ర కర్తలతో, అయిదవవాడు. ఆతడు తననుగూర్చి సూటిగా చెప్పుకొనక ప్రకరణమును కల్పించుకొని, గ్రంథారంథమున,

‘కల్యాణాచలవాసాయ కరుణారస సింధవే
నమో ఽస్తు నంది కేశాయ, నాట్యశాస్త్రార్థ దాయినే.'

అని దేవేంద్రునిచే చెప్పించెను, అతడు శివభక్తుడు. సాత్విక స్వభావుడు. ఈశ్వరతత్వమును చక్కగా నెరిగిన వాడు, కావుననే,

'ఆంగీకం భువనం యస్య, వాచికం సర్వవాజ్ఞ్మయం
ఆహార్యం చంద్రతారాది, తం వందే నాత్వికం మమ

అని శివుని- కరశాస్త్రకర్తలలో ప్రథముడైన శివుని-తనకు వంద్యు డైన శివుని సర్వ 'శుఖ' ప్రదాతయగు దేవుని గ్రం థాగం ముని మంగళాచరణ రూపముగా స్తుతించి, తాను 'నట రాజగు శివుని ఎట్లు జగ ద్రూపునిగా నుపాసించెనో తెలుపుచు నాట్యాభిమానులందరును తను వలె నాట్యోవాసనచే శ్రీ శివదయాపాత్రులు కాగలరని సూచించినవాడయ్యెను. అందుచేత నాట్యము కేవలము వినోదాత్మకమగు కళమాత్రమేగాక, యోగులకు, జ్ఞానులకువలె, ఈశ్వరప్రాప్తికి ఉపాసనారూపమగు ఒక సాధనమనికూడ అతడు నిరూపించినవాడయ్యెను. ఈ గ్రంథారంభ శ్లోకము నాట్యోపాసకులకు ఇనుప పెట్టెకు తాళపు చెవి వంటిదని చెప్పిన చాలును.

గ్రంథారంభము కథారూపమైనది. పూర్వ మొక నర్తనశాలను నందికేశ్వరు డలంకరించి, తన కిచ్చుచు దానికి తనను అధిపతిని చేసినందులకు ఇంద్రుడు సంతోషమును వెలిబుచ్చెను. ఒకనాడు నందికేశ్వరుని వద్దకు వచ్చి, “స్వామీ! అసురనాట్యశాలయందు 'నట శేఖరు’డను నటుడు గొప్ప కీర్తిశాలియై ప్రకాశించుచున్నాడు. నేను నాట్యప్రదర్శనాదులచే అతనిని జయింపవలయునని యున్నది. మీరు రచించిన 'భరతార్ణవము' అను గ్రంథమును నాకు దయచేసితిరేని, దాని నధ్యయనముచేసి అనుభవమునకు తెచ్చుకొని, నట శేఖరుని జయింప దలచి తిని” అని ఇంద్రుడు ప్రార్థించెను. అందుకు నందికేశ్వరుడు,

'చతు స్సహస్రసంఖ్యాకై, ర్గంథైశ్చ పరిపూరితం
భరతార్ణవశాస్త్రంతు, సుమతే! శ్రుణు సాదరం.”

అని దయాళువై ధరతార్ణవమును బోధించుటకు పూనుకొనగా, ఇంద్రు డేలనో కొంచెము వెనుదీసి, 'విస్తరాత్ సంవిహాయ మే, సంక్షిప్య నాట్యశాస్త్రార్థం, క్రమపూర్వ ముదాహర' అని భరతార్ణవమును సంగ్రహించి చెప్పునట్లు ప్రార్థించెను. అప్పుడు నందికేశ్వరుడు, 'సంక్షిప్య భరతార్ణవం, దర్పణాఖ్య మిదం సూక్ష్మ మవధారయ' అని 'అభినయ దర్పణ'మును బోధించినట్లు. అవతారికవలన తెలియుచున్నది. పై విషయమునుబట్టి, 'అభినయ దర్పణము' నాల్గు వేల శ్లోకములుగల భరతార్ణవమునకు సంక్షిప్త గ్రంథమని యైనను చెప్పవచ్చును. లేదా భరతార్ణవమునందలి నాట్యశాస్త్రార్థములను సంగ్రహించి, 'అభినయదర్పణ' మను నామాంతరముగల మరియొక గ్రంథమును వెలయించెనని యైనను చెప్పవచ్చును. రెండవ విషయమే నిజము కావచ్చునని తోచుచున్నది. 'భరతసారము, భగవద్గీతా సారము' మొదలగు గ్రంథములవలె మొదటిదే నిజమైనచో ఇదియే 'భరతార్ణవసార మను పేరిట వెలసి యుండెడిది. అట్లుగాక ప్రత్యేకముగా నామాంతరము వహించుటవల్ల, ఇది నందికేశ్వరకృత మగు రెండవ గ్రంథమని చెప్పుటయే యుక్తము.

'అభినయ దర్పణము' అంగికాభినయాత్మక మయిన గ్రంథము . ఈవిషయమునే కర్త 'ఆంగికం భువనం యస్య' అను ప్రథమశ్లోకముననే ఉదాహరించినట్లు తోచుచున్నది,

నాట్యశాస్త్రార్ధము 'నాట్యం నృత్తం నృత్య మితి, మునిభిః పరికీర్తితం' అని త్రివిధముగా విభాగించి చెప్పబడినది. 'నాట్యం తన్నాటకేష్వేవ యోజ్యం పూర్వ కథాయుతం', (అభి. ద. 10 శ్లో.) అని యుండుటచే నాట్యము నాటకములందే ఉపయుక్తమగును. ఇక నృత్త, నృత్యములు ఆనుషంగికముగా అందు ప్రవర్తించునన వచ్చును. నృత్తము కేవలము ఆంగికమై 'రసభావ విహీనంతు నృత్తమిత్యభిధీయతే' (11 శ్లో.) అని చెప్పబడినది. నృత్యము, ఆంగిక, సాత్త్వికాభినయాత్మకమై, 'రసభావ వ్యంజ కాదియుతం నృత్య మితీర్యతే' (11) అని కీర్తింపబడినది. అందుచే నిది, నృత్యగ్రంథ మనతగి యున్నది.

“ద్రష్టవ్యే నాట్యనృత్యే చ పర్వకాలే విశేషతః...
నృత్యం తత్ర మహేంద్రాణా, మభిషేకే మహోత్సవే...
తత్ర నృత్యం మహారాజ సభాయాం కల్పయేత్సదా"(17)

అను శ్లోక పాదములచే అభినయదర్పణము నృత్య గ్రంథమని ఏర్పడును.

ఆంధ్ర దేశమందు సుప్రసిద్ధివడసిన కూచిపూడి వారికేమి, నిన్న మొన్నటివరకు తెలుగు దేశమును నాట్యరసానంద ములో ముంచి తేల్చిన వేశ్యాజనమునకేమి, నృత్య విషయమున ఈ అభినయదర్పణము అధారగ్రంథమై యుండవచ్చునని,

'సభాకల్పతరు ర్హాతి, వేదశాఖోపశోభితః
శాస్త్రపుష్ప సమాకీర్ణొ, విద్వద్భ్రమర సంయుతః
'సత్యాచారసభా, గుణోజ్జ్వల సభా సద్ధర్మకీర్తిస్సభా...
'విద్వాంసః కవయో భట్టాః సభా సప్తాంగ లక్షణం.

(18, 19, 20. శ్లొ.)

అను శ్లోకములచే సులభముగా నూహింపవచ్చును.

అభినయ దర్పణమునందు సభానాయక-మంత్రి లక్షణములు పేర్కొనబడిన పిమ్మట, రంగలక్షణమును, పాత్రాపాత్ర లక్షణములును, నట కింకిణీ లక్షణములును నిరూపించబడినవి. అనంతరము 'మృదంగాదులు' పాత్రల బహిః ప్రాణములనియు, 'జవస్థిరత్వ రేఖాచ భ్రమరీ దృష్టి రశ్రమః మేధాశ్రద్ధావచో గీతి, స్వంతః ప్రాణా దశ స్మృతాః' (37) అని జవాదులు అంతః ప్రాణములనియు పేర్కొనబడినవి. నాట్యక్రమమును గూర్చి తెలుపుచు,

'తస్మాత్సర్వం సమాలోచ్య, పూర్వకై ర్యదుదాహృతం
దేవతాప్రార్థనాదీని కృత్వా, నాట్య ముపక్రమేత్ .

అని ప్రబోధించి, హస్తాద్యభినయమునకును రసమునకును గల్గు సంబంధమును నిర్దేశించుచు,

'యతో హస్త స్తతో దృష్టి, ర్యతో దృష్టి స్తతో మనః
యతో మన స్తతో భావో, యతో భావ స్తతో రసః (42)

అని చక్కగా పలికెను. తన గ్రంథమునకు—-

"అత్ర త్వభినయన్యైవ, ప్రాధాన్య మితి కథ్యతే (43)

అని అభినయ ప్రాధాన్యము నిరూపించి, '

"అభిపూర్వస్య ణీఞ ధాతో, రాఖ్యానార్ధన్య నిర్ణయః
యస్మా త్పదార్థాన్నయతి, తస్మా దభినయః స్మృతః 44

('అభి' యను నుపసర్గము పూర్వమందు గల 'నీ' ఇక్ అనెడు ధాతువునకు చెప్పుట యని యర్థము. పదార్థము, లను తెలుపునదిగాన నిది అభినయ మని చెప్పబడినది.)ఇట్టి అభినయము 'అంగికము, వాచికము, ఆహార్యము సాత్త్వికము అని చతుర్థాకరించి,

'అత్రా ౽౽౦గికో ౽౦గప్రత్యంగోపాంగ భేదాత్త్రిథా మతః' అని మరల ఆంగికాభినయము అంగ-ప్రత్యంగ - ఉపాంగ భేదములచే ముత్తెరగుల చెప్పబడినది. తన గ్రంథమున నంది కేశ్వరుడు,

'నృత్య మాత్రోపయోగ్యాని,
కథ్యంతే లక్షణైః క్రమాత్'

అని, చెప్పదగిన విషయము నృత్యమాత్రోపయోగిగా నుండునని తెలియబరచి, ఆ విషయమునుగూడ,

'ప్రథమంతు శిరోభేదః దృష్టిభేద స్తతఃపరం
గ్రీవాహస్తౌ తతః పశ్చాత్క్రమేణైవం ప్రదర్శ్యతే.'

అని శిరోభేదములు, దృష్టి భేదములు, గ్రీవాభేదములు హస్తభేదములు అని నాల్గు విధములుగా విభజించి చెప్పెను. దేవేంద్రుడు అసురనటుడగు నటశేఖరుని నాట్యమునందు తానతిశయించుటకై ఉపదేశము కోరినవాడు గనుక, ఆతని యుద్దేశము నెరవేరుట కెట్టి అభినయ విజ్ఞానము అవసరమో, అంతవరకే సర్వజ్ఞుడగు నంది కేళ్వరుడు సంగ్రహించి ఉపదేశించె ననుకొన్నచో, ఈ గ్రంథముయొక్క వైశిష్ట్యము కొంత తేటపడగలదు.

సాధారణముగా సమస్త నాట్యశాస్త్ర గ్రంథముల యందును శిరో-దృష్టి-గ్రీవా. హస్తాభినయ భేదములు, తద్వినియోగ పూర్వకముగా నిరూపింపబడుచున్నట్లే, ఇందుగూడ అవి యన్నియు సంగ్రహింపబడినవి. తొమ్మిది శిరోభేదములు, ఎనిమిది దృష్టిభేదములు, నాల్గు గ్రీవా భేదములు, ఇరువది యెనిమిది అసంయుత హస్తభేదములు, ఇరువదినాల్గు సంయుత హస్తభేదములు చెప్పబడినవి. కడమ నాట్యశాస్త్రముల మాట యెట్లున్నను, భరతనాట్య శాస్త్రముతో పోల్చి చూడగా, అందు పదు మూడు శిరోభేదములు, ముప్పదియారు దృష్టిభేదములు, తొమ్మిది గ్రీవాభేదములు, అరువదినాల్గు హస్తభేదములు కానవచ్చుచున్నవి. అభినయ దర్పణము శిరోభేదముల, సంఖ్యా-లక్షణ. వినియోగములయందు భరత నాట్య శాస్త్రము కంటే భిన్నముగా నున్నది. మరియు నాట్య శాస్త్రీయాభినయ మంతము రసవినియోగము పొందునట్లు నిరూపింపబడినది; అభినయదర్పణము నందలి విషయమో, భావ పర్యవసాయిగా గోచరించుచున్నది. ఒక విషయమున మాత్రము అభినయదర్పణము తన ప్రత్యేకతను నెలకొల్పుకొను చున్నది. సంయుతా ౽సంయుత హస్తభేదములను మొత్తముగా నందు ఏబది రెండుగా గోచరించినను, కొన్ని విశేషాంశముల ప్రదర్శనము నిమిత్తము, నందికేశ్వరుడు మరికొన్ని - అనగా 145 అసంయుత హస్తభేదములను - క్రొత్తవాటిని- చేర్చి - వివరించి యున్నాడు. వాటిలో దంపతీమాత్రాది

బాంధవ్య హస్తములు 11, బ్రహ్మాదిదేవతా హస్తములు 18, నవగ్రహ హస్తములు 9, దశావతార హస్తములు 11, బ్రాహ్మణాది హస్తములు 4, సప్తసముద్ర హస్తములు 7, గంగాది నదీహస్తములు 14, ఊర్ధ్వధొలోక హస్తములు 2, అశ్వత్థాది వృక్ష హస్తములు 23, సింహాది మృగహస్తములు 22, పారావతాది హస్తములు 21, భేకాది బలజంతు హస్తములు 5, వెరసి 145 అసంయుత హస్తభేదములు కలవు. సాధారణ హస్త భేదములును ఈ విశేషహస్తభేదములును కలిసి, 197 అయి, అభినయ దర్పణము నాట్యారాధకులకు ముఖ్యముగా హస్తాభినయ విషయమున కల్పవృక్షముగా నున్నది.

భరతార్ణవమునకు సంగ్రహరూపమైన అభినయదర్పణమే ఇట్టిది కాగా, మూలగ్రంథమనదగు దానియందే యే విషయము లెంతెంత విపులముగా నిరూపింపబడినవో ఊహించుట దుష్కరము కాదు.

బి. వేం. శే.

[[వర్గం:]]