Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక

వికీసోర్స్ నుండి

అన్నమాచార్యులు- తాళ్లపాక  :- తెలుగు సాహిత్య చరిత్రములో తాళ్లపాక వారి కుటుంబము మిక్కిలి ప్రసిద్ధి చెందినది. తెలుగుదేశములో ముఖ్యముగా రాయలసీమయందు 'తాళ్ళపాకవారి కవిత్వము కొంత, నా పైత్యము కొంత' అను సామెత యొకటి ప్రచారములో నుండుటయే అందులకు ముఖ్య నిదర్శనము. సుమారు రెండు వందల సంవత్సరములకింకను పై బడిన కాలమున (క్రీ.శ. 15, 16 శతాబ్దులలో) ఈ కుటుంబమునకు చెందిన వారు అనేక గ్రంథములను రచించి గొప్ప కవులుగాను గాయకులుగాను ప్రసిద్ధిచెందిరి. వారిలో అన్నమయ్య ప్రథముడు. ఇతనికి తరువాత పెద్ద తిరుమలాచార్యుడు, చిన తిరుమలయ్య, చిన్నన్న, తిరువెంగళప్ప అను వారు ఈ కుటుంబమున ప్రసిద్ధి వహించిరి.

వీరు తొలుత నందవరీక నియోగి బ్రాహ్మణులు. ఋగ్వేదులు. ఆశ్వలాయన సూత్రులు. భారద్వాజస గోత్రులు. వీరిలో అన్నమయ్య తొలుత వైష్ణవమును స్వీకరింపగా అతని తరువాత ఆ వంశమువారు అందరును వైష్ణవులైరి.

అన్నమయ్య క్రీ. శ. 1424వ సంవత్సరమునకు సరియగు క్రోధి సంవత్సరమున వైశాఖమాసములో విశాఖా న క్ష త్ర ము నందు జన్మించెను. ఇతని తండ్రి నారాయణసూరి. తల్లి లక్కమాంబ. పొత్తపినాటిలోని "తాళ్లపాక " గ్రామము వారి నివాసస్థలము. ఈ 'తాళ్లపాక ' (మను గ్రామము నేడు కడప మండలములో రాజం పేట తాలూకాయందు ఉన్నది. అన్నమయ్యశ్రీవేంకటేశ్వరస్వామివారి నంద కాంశమున అవతరించెనని ప్రసిద్ధి.

ఇతడు బాల్యమునుండియును గొప్ప భక్తుడు. ఎల్లప్పుడు భగవంతునే స్మరించుచు, అతని స్తోత్రపారాయణములే చేయుచు, తక్కిన విషయములందు అంత శ్రద్ధాభక్తులు చూపకుండెడివాడు. ఇతని తల్లిదండ్రులును, వదినె అన్నలును ఏవైన పనులు చెప్పినయెడల ఇతడు పరాకున నవిచేయ మరచి వారిచే చీవాట్లు తినుచుండెడి

వాడు. ఇట్లుండగా అతనికి పదునారేండ్లు నిండినవి. పరమ భక్తాగ్రేసరుడై ఎల్లప్పుడును తన్ను స్మరించుచుండుట తప్ప వేరొక్క పనిని చేయనొల్లని ఆ బాలునికి శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై అద్భుత శక్తులను ప్రసాదించెను. అప్పటినుండి ఆతడు స్వామివారి యానతి చొప్పున సంకీర్తనములు రచించుటకు ప్రారంభించెనుఅతడాడినమాట అమృతకావ్యమును, పాడిన పాట పరమ గానమును కాజొచ్చినవి. ఇట్లు కొన్ని నాళ్లు సంకీర్తనములు చెప్పుచుండి అతడు శ్రీ వేంక టేశ్వర స్వామినిదర్శించుటకై తిరుపతికి ప్రయాణమాయెను. మార్గ మధ్యమున సంకీర్తన గానము చేయుచు అతడు కొన్ని దినములు ప్రయాణముచేసి తిరుపతి చేరుకొనేను. దిగువ తిరుపతిలో ఆతడు వేకువజామున బయలు దేరి కొండ మీదికి ఎక్కి పోవుచుండెను. కాని సంప్రదాయము తెలియక చెప్పులతోగూడ కొండనెక్కి పోవుచుండిన యా బాలుడు మిక్కిలి యలసిపోయి, మోకాళ్ళపర్వతము దగ్గర ఒక వెదురుపొద నీడలో మైమరచి నిద్రింపజొచ్చెను. అప్పుడు కలలో అలమేలు మంగమ్మ అతనికి దర్శనమిచ్చి, అతని యాకలిని పోగొట్టి, ఆ పర్వతము సాలగ్రామ మయమ గుట చే చెప్పులతో ఆ కొండ నెక్క రాదనియు, చెప్పులు విడిచిపోవలసినదనియు బోధించి అంతర్ధానముచెందెను. అతడు నిద్రనుండి మేల్కొని తనకు వచ్చిన కలకు మిక్కిలి ఆశ్చర్యపడి అప్పటి కప్పుడే ఆశువుగా అమ్మవారిపై ఒక్క శతకమును చెప్పెను.

తరువాత ఆతడు కొండమీదికిపోయి అచట శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించెను. ఆ చుట్టుపట్టుల నుండిన గోగర్భము, ఆకాశగంగ, పాపవినాశము మొదలగు పుణ్యతీర్ధములను సేవించెను. అక్కడనే ఒక వైష్ణవాచార్యుని యొద్ద అతడు వైష్ణవదీక్షను స్వీకరించి ముద్రా ధారణాది సంస్కారములను పొందెను. ముద్రాభారణానంతరము ఆ కొండమీది వైష్ణవులు అతనిని తమ పంక్తిలో నిడుకొని భుజించిరి. ఇట్లు భగవత్సంకీర్తనము చేయుచు, గురువుకడ శుశ్రూష నలుపుచు అన్నమయ్య కొండమీద కొంతకాలము నివసించియుండెను. ఇట్లుండ అతని తల్లియగు లక్కమాంబ తన కుమారుని వెదకుకొనుచు దేశమంతయు, తిరిగి తిరిగి వచ్చి తుదకు తిరుమలపైనున్న' ఆతనిని చూచి ఇంటికి రమ్మని యాతని పెక్కు విధముల బతిమాలెను. కాని భగవద్భక్తి పరాయణుడయిన అన్నమయ్య తొలుత ఆమె వేడికోలునకు అంగీకరింపలేదు. అందుపై ఆతని గురువర్యుడగు నైష్ణవాచార్యుడు ఆతనికి కొన్ని దివ్యోపదేశములు చేసి తల్లి మాట విని ఇంటికి పొమ్మనగా ఆతడు ఎట్టకేలకు అందులకంగీకరించి తన తల్లి వెంట ఇంటికి ఏగెను. బహుకాలమునకు ఇల్లు అన్నమయ్యకు అతని తల్లిదండ్రులు వివాహ ప్రయత్నములు చేసిరి. కాని ఎల్లప్పుడును భగవంతునే చింతించుచు ఇతర ప్రపంచము తెలియని అన్నమయ్యకు పిల్లనిచ్చుటకు ఎవరును ముందుకు రాకపోయిరి. అప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామియే కలలో నగపడి అతనికి పిల్లనీయవలసినదని యుద్బోధింపగా ఇరువురు భ క్తులు తమ పిల్లలు నాతని కిత్తుమని వచ్చిరి. పెద్దల సమక్షమున యథావిధిగా వారి వివాహముహూర్తము జరిగినది. వారిలో మొదటియామె తిరుమలమ్మ. రెండవయామె అక్కలమ్మ. వారిలో తిరుమలమ్మ అనబడు తిమ్మక్కయే ఆ తరువాత'సుభద్రా కల్యాణ' మను పేర ఒక గేయకావ్యమును రచించినది. వివాహమయిన పిదప ఆతడు కొంతకాలము స్వగ్రామమగు తాళ్ళపాకయందును, తిరుమలయందును, అహోబిలమునందును నివసించెను. ఆ కాలములో ఆతడు తన యిష్టదైవమగు శ్రీ వేంక టేశ్వరస్వామిపై అనేక శృంగార కీర్తనములను రచించెను. అహోబిలములో ఆదివన్ శఠకోపయతీంద్రుని దగ్గర ఆతడు వేదాంతశాస్త్రమును సంప్రదాయానుసారముగా అధ్యయనము కావించెను. అతడక్కడ ఉండిన కాలములోనే అతడు వాల్మీకి రామాయణమును తెలుగులో సంకీర్తనాత్మకముగా రచించినట్లు తెలియుచున్నది.

అన్నమయ్య పొడుచుండిన సంకీర్తనములు కాలక్రమమున లోకములో ప్రఖ్యాతి వహించెను. సాళువగుండ నరసింహరాయడను ప్రభువొకడు కర్ణాకర్ణిగా ఆ ప్రఖ్యాతిని విని ఒకనాడు అతని దర్శనమును అపేక్షించి వచ్చెను. అతనిని ప్రార్థించి అతనిచే కొన్ని సంకీర్తనములు పాడించుకొని అతడు అందలి మాధుర్యమునకు ముగ్ధుడయ్యెను. ఆ ప్రభువా కాలమున టంగుటూరు అను గ్రామములో నివసించుచుండెడివాడు. అతడు అన్నమాచార్యుని వేడుకొని ఎట్లో యొప్పించి ఆతనిని తన వెంట టంగుటూరునకు పిలుచుకొనిపోయెను. అక్కడ అతనికి ప్రత్యేకముగా గుడిప్రక్క ఒక భవనమును కట్టించి యిచ్చి, అతనినందు నివసింపజేసెను. "శ్రీకృష్ణుని సహాయముతో అర్జునుడీ భూమండలము నెల్ల పరిపాలించినట్లు మీ సహాయముతో నేను ఈ భూమండలము నంతటిని ఏకచ్ఛత్రముగా పరిపాలించెదను" అని నరసింగరాయడు అన్నమయ్యతో చెప్పుకొనెను. వారిరువురును టంగుటూరిలో నే కొంత కాలము నివసించియుండిరి. ఇంతలో నరసింగరాయడు విజయనగర రాజ్యమును ఆక్రమించుకొని చక్రవర్తి యయ్యెను. నరసింగరాయడు పోయిన పిదప అన్నమయ్య టంగుటూరును వదలి తిరిగి తిరుమలకు వచ్చి భగవంతునిపై సంకీర్తనములు పాడుచుండెను.

ఇట్లుండగా ఒకప్పుడు నరసింగరాయడు తన స్నేహితుడైన అన్నమయ్యను తన రాజధానియగు పెనుగొండకు రావించుకొని చక్కని సంకీర్తనములు పాడి తనకు సంతోషమును కలుగ జేయుమని కోరగా అన్నమయ్య కొన్ని సంకీర్తనములు పాడి వినిపించెను. ఆ సంకీర్తనములను విని రాయడు అనంద పరవశుడై ఆతనిని అనేక విధముల సత్కరించెను. పచ్చల కడియాలు మొదలగు ఆభరణములను, చీని చీనాంబరములను ఒసగి రాయ డతనిని ఆదరించెను. ఇట్లు రాయనిచే అఖండ సత్కారములందుచు ఆతడు కొన్నాళ్ళందే ఉండగా, మరి యొక నాడు నరసింగరాయడు అతనిని పిలిపించి శ్రీ వేంక టేశ్వరస్వామివారిపై ఆతడు రచించిన శృంగార సంకీర్తనములు కొన్ని పాడి వినిపింపు మనికోరెను. అన్నమయ్య అతని యానతిమేరకు కొన్ని సంకీర్తనములు పాడి వినిపించెను. అంత రాయడు యుక్తాయుక్త వివేకమును గోలుపోయి వేంకటపతిమీది పదములవంటి పదములను తనమీదను చెప్పవలసినదని ఆతనిని కోరెను. అది విని అతడు నిర్విణ్ణుడే మిక్కిలి ధైర్యముతో "శ్రీ వేంకటేశ్వరస్వామిని నుతించు నాలుకతో నిన్ను నేను నుతింపజాలను" అని పలికి ఆతని కోరికను తిరస్కరించెను. రాయని కది కోపకారణ మయ్యెను. అత డాగ్రహ పరవశుడై కన్ను మిన్ను కానక అతనికి 'మూరురాయరగండ' మను పేరుగల సంకెల వేయించి ఆతనిని చెరసాలలో పెట్టించేను. అప్పు డన్నమయ్య 'ఆకలివేళల నలపైన వేళలను' ఇత్యాదిగా గల ఒక సంకీర్తనమునుపాడి శ్రీ వేంక టేశ్వరస్వామిని స్తుతించెను. వెంటనే అతని చేతులకు తగిల్చియుండిన సంకెలలూడి క్రిందపడెను. చెరసాల కావలి కాయుచున్న సేవకులవలన ఆ వృత్తాంతము విని నరసింగరాయడు మరింత ఆగ్రహపరవశుడై అతని కడకు వచ్చి తిరిగి అతని చేతులయందు తానే స్వయముగా సంకెలలు తగిలించి “ఇప్పుడు విడిపించుకొనుము, చూత" మనెను. అంత అన్నమయ్య తిరిగి అదే పాటను భక్తి పారవశ్యముతో పాడగా మునుపటివలెనే ఆతని చేతులకు తగిల్చియుండిన శృంఖలలూడి క్రిందపడెను. అతని మాహాత్మ్యమున కాశ్చర్యమంది నరసింగరాయ డాతని పాదములకు సాష్టాంగముగా నమస్కరించి ఆతని అనుగ్రహమును వేడెను. అన్నమయ్యయు ఆతని దయతో ననుగ్రహించెను.

అతడు పెనుగొండనుండి తిరుమలకు వచ్చెను. అచ్చట స్వామివారి సన్నిధిని సంకీర్తన గానముచేయుచు కాలము గడుపుచుండెను. ఆ కాలమున నత డెన్నో మహిమలు చూపెను. అప్పటి ఒక ముచ్చట వింతగానుండును. అదే మనగా : అన్నమయ్య మహిమవిని ఒకప్పు డొక పేద యువకుడు ఆతని దగ్గరకువచ్చి "అయ్యా ! నేను బ్రహ్మచారిని. నేను పెండ్లి చేసికొన దలచుచున్నాడను. కాని నాకడ ధనములేదు. కనుక నాయందు దయతలచి నాకు కాసువీసము కలుగునటుల అనుగ్రహింపుడు" అని వేడు కొనెను. అతడు 'అట్లే' యని దీవించి పంపెను. పిదప ఆతడెందరి కడకుబోయి వివాహార్థమై యాచించినను వారాతనికి 'కాసువీనము'నే కానీ ఒక్కరును ఒక్క 'రూకనైన నీయరైరి. ఇట్టి అనుభవమునకు అన్నమయ్య మహిమయే కారణమని గ్రహించి తిరిగి ఆతనికడకు వచ్చి “అయ్యా ! నా పెండ్లికి కావలసినంత ధనము వచ్చు నట్లనుగ్రహింపుము" అని వేడుకొనగా నాతడు ఆతని పై దయబూని 'అట్లే' అని పలికెను. అతనికడ దీవనబొంది ఆతడు వీథిలోనికి రాగానే ఒక రాజాతనిని పిలిచి, అతడడిగిన ధనమును ఒసగి సత్కరించెను. అది విని జనులు మిక్కిలి యాశ్చర్యమందిరి. ఇట్టి మహిమల నెన్నిటినో అన్నమయ్య ప్రదర్శించి చూపుచు తాను దివ్యధామ మందుదాక అందే నివసించియుండెను. అతడు వృద్ధుడై యుండగా కర్ణాట భాషలో వేలకొలది సంకీర్తనములను రచించి గొప్ప ప్రఖ్యాతినొందెను. శ్రీ పురందరదాస స్వాములవారు అన్నమాచార్యుల సంకీ ర్తనరచనా ప్రసిద్ధినివిని, ఆతనిని దర్శించుటకై తిరుమలకు వచ్చెను. అచ్చట నాతని ప్రార్థించి సంకీర్తనములు పాడించుకొవి విని ఆనందించి యాతడు “నీవు శ్రీ వేంకటేశ్వరుని యవతారమవే" అని సన్నుతింపగా అన్నమాచార్యుడు పురందర దాసుల వారి సంకీర్తనములను పొడించుకొని విని 'నీవు శ్రీ పాండురంగ విఠలుని అవతారమ‘వని సన్నుతించెనట !

ఇట్లు భక్తి మయముగా డెబ్బది తొంబదేండ్ల నిండు జీవితమును గడిపి అన్నమయ్య క్రీ.శ.1503వ సంవత్సరమునకు సరియగు దుందుభి సంవత్సరమున ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు దివ్యధామము నలంకరించెను.

మహాభక్తుడును, గాయకుడును, కవీశ్వరుడును అయిన అన్నమయ్య యోగవైరాగ్యశృంగార మార్గములలో ముప్పది రెండువేల సంకీర్తనములను రచించెనని ఆతని మనుమడుగు చిన్నన్న రచించిన 'అన్నమాచార్య చరిత్రము'లో కలదు. పదునారవ సంవత్సరమున శ్రీ వేంకటేశ్వరస్వామివారు తనకు ప్రత్యక్షమయినపుడు ప్రారంభించి, డెబ్బది తొమ్మిదవయేట తాను దివ్యధామము నందుదాక దినమున కొక సంకీర్తనము చొప్పున సంకీర్తవములు రచించినట్లు ఈతడు రచించిన శృంగార సంకీర్తనముల యొక్కయు, ఆధ్యాత్మ సంకీర్తనముల యొక్షయు తొలి రాగి రేకునందు కలదు. అట్లు లెక్కించి చూడగా నించుమించుగా నిర్వదిమూడు వేల సంకీర్తనములు మాత్రమే లెక్కకు వచ్చును. దినమునకు ఒక్కటియైనను తక్కువకాకుండుపద్ధతిని అతడు సంకీ ర్తనములను రచించు చుండెనని చెప్పుకొనినచో అతడు ముప్పది రెండు వేల సంకీర్తనములను రచించెననుట సంగతమగుచున్నది. శృంగారాత్మకములుగా ఆతడు రచించిన పదములకు 'శృంగార సంకీర్తనము' లనియు, వైరాగ్య పరములుగా ఆతడు రచించిన వాటికి 'ఆధ్యాత్మ సంకీర్తనము'లనియు పేర్లు. ఈతడును ఈతని వంశీయులును రచించిన ఇట్టి సంకీర్తనములు ఈతని కుమారుడగు పెదతిరుమలా చార్యుని కాలమున రాగి రేకులపై చెక్కింపబడి, ఆవియెల్ల తిరుమల పై శ్రీ స్వామి వారి సన్నిధిలో శ్రీ భాష్య కారుల సన్నిధిని ప్రక్కగా నొక అరలో భద్రపరచబడినవి. దానికి 'తాళ్ళపాక' అరయని పేరు.ఆఅర కిరుప్రక్కలను అన్నమా చార్యులయు, తిరుమలాచార్యులయు విగ్రహములు శిలలపై చెక్కింపబడి యున్నవి. తెలుగు కవులు భౌతిక స్వరూపములను తెలుపు నిట్టి శిల్పములలో ఇవియే మొట్టమొదటివి. తరువాత రాగిరేకులపై చెక్కిన అట్టి విగ్రహములే అరలోపలను కానవచ్చినవి, వీటిని పట్టి అన్నమాచార్యులయు, పెదతిరుమలాచార్యులయు భౌతిక స్వరూపములు తెలియ వీలగుచున్నది.

అన్నమయ్య తన ఇష్టదైవమగు శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఇట్లు శృంగారాధ్యాత్మ సంకీర్తనములను రచించుట మాత్రమే కాక, సంస్కృతమునను, తెనుగునను ఇంకను అనేక రచనలు చేసినట్లు తెలియుచున్నది. సంస్కృతములో అతడు వేంకటాచలమాహాత్మ్యము, సంకీర్తనలక్షణము అను రెండు గ్రంథములను రచించినట్లు ఊహింపబడుచున్నది. చిన్నన్న రచించిన అన్నమాచార్య చరిత్రములో ఆతడు సంస్కృతభాషయందు వేంకటాచల మాహాత్మ్యమును రచించినట్లు చెప్పబడినది. వరాహపురాణాదులలోనిదిగా సంఘటితమయి నేడు నాగరాంధ్రాక్షరములతో ముద్రితమై వ్యాప్తిగాంచియున్న వేంకటాచల మాహాత్మ్యము తాళ్ళపాక అన్నమయ్య రచించినదే అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు అభిప్రాయపడు చున్నారు. అంతకుపూర్వమే ఆ "స్థల మాహాత్మ్య" మొకటి కలదని నిరూపింపబడునంత దాక అది యన్నమాచార్య రచితమనియే తలంచుట అసంగతము కాజాలదు.

అతడు సంస్కృతములో రచించిన మరొక గ్రంథము 'సంకీ ర్తన లక్షణము'. అన్నమాచార్యుని మనుమడగు చిన తిరుమలయ్య తన 'సంకీర్తన లక్షణము' అను గ్రంథము (తెలుగు) న, అన్నమాచార్యుడు సంస్కృతమున, సంకీర్తన లక్షణమను ఒక గ్రంథమును రచించెననియు, తన తండ్రియగు పెద తిరుమలాచార్యుడు వ్యాఖ్యానించెననియు, ఆ రెండు గ్రంథములను అనుసరించి తాను తెలుగున 'సంకీర్తన లక్షణము'ను వెలయింతుననియు చెప్పియున్నాడు. దానిని బట్టి అన్నమాచార్యుడు సంస్కృతమున 'సంకీర్తన లక్షణము'ను రచించినట్లు తెలియుచున్నది. కాని ఆ గ్రంథ మిప్పుడు లభించుట లేదు.

అన్నమయ్య రచించిన తెలుగు గ్రంథములలో ఆతని ద్విపద రామాయణము తొలుత పేర్కొనదగియున్నది. అతని జీవిత చరిత్రములో ఆతడు, వాల్మీకి రామాయణమును సంకీర్తనాత్మకముగా తెలుగున రచించినట్లు పేర్కొనబడి యున్నది. ఇది దానికంటే భిన్నమయినది. ఆతని ఈ ద్విపద రామాయణము నేడు లభ్యమగుట లేదు.

అతని మరొక గ్రంథము "శృంగార మంజరి". ఇది మంజరీచ్ఛందోమయమయిన శృంగారగ్రంథము. శృంగార మంజరిని రచించి అతడు దానిని తిరువేంగళనాథ దేవునికి విన్నపము చేయగా ఆతడు ఆతనిని అనుగ్రహించెనట !

అన్నమాచార్యుడు ఇవికాక పండ్రెండు శతకములను, వివిధ భాషలలోను ఇంకను ఎన్నో ప్రబంధములను రచించెనట! కాని వాటిలో నేడు 'వేంకటేశ్వరశతకము' మాత్రము ఉపలభ్యమగుచున్నది. ఇది అన్నమయ్య తిరుపతికొండ నెక్కుచు నిదురలో తనకు ప్రత్యక్షమయిన అలమేలుమంగమ్మను గూర్చి ఆశువుగా చెప్పిన శతకము. 'వేంకటేశ్వరా' యను మకుట మున్నను ఇందు ప్రతి పద్యమునను అలమేలుమంగా ప్రస్తుతియే కలదు. ఇది ముద్రితము. ఇందలి పద్యములు కొన్ని ప్రబంధ రత్నావళియను సంకలన గ్రంథమున ఉదాహరింపబడినవి. తక్కిన పదునొకండు శతకములును ఏయే వేల్పులమీద రచింపబడెనో, వారి పేళ్ళేవో ఎరుగరావు.

>poem>'జో అచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద </poem>

అని తెలుగుదేశములో బహుళ ప్రచారము నందియున్న జోలపాట అన్నమయ్య రచించినదే. ఈ జోలపాటలో తుది చరణమునందు ఇట్లు కలదు.

'అంగుగా దాళ్ళపాకాన్నయ్య చాల
శృంగార రచనగా జెప్పె నీ జోల"

శ్రీ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ సమయములందు డోలోత్సవ సందర్భమున అన్నమయ్య తాను రచించిన ఈ జోలపాటను పాడగా స్వామి దర్శనార్థమై వచ్చిన భక్త కోటికి ఆ పాట జిహ్వాగ్రగతమై లోకమున వ్యాపించి యుండును.

గండవరపు బాలగోపాల నామాంకితముగా నున్న 'లాలిపాట' కూడ అన్నమయ్య రచించినదే అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు అభిప్రాయపడినారు. ఆ పాటలో ఎచ్చటను అన్నమయ్య పేరు లేకపోయినను గండవరము తాళ్ళపాక వారికి చెల్లుచు వచ్చిన గ్రామ మగుటచే, అన్నమయ్య తమ ఊరి స్వామిమీద ఈ 'లాలి పాటను'— 'జోలపాట ను రచించినట్లే, — రచించి యుండునని వారి యూహ.

ఇట్లు అన్నమయ్య సంకీర్తనములే కాక ఇతర సారస్వత ప్రక్రియలనుగూడ రచించెను.

అన్నమయ్యకు పూర్వము తెలుగులో పరాశ్రయ రచనములకే వ్యా ప్తియుండినది. ఆత్మాశ్రయ రచనమును తొలిసారిగా తెలుగులోనికి తెచ్చినకీర్తి అన్నమయ్యదే అనవలసి యున్నది, ఇతర వ్యక్తుల కంటెను, వారి అనుభవముల కంటెను అతడు తన పదరచనములలో తన అంతరంగ బహిరంగానుభవములనే ముఖ్యముగా వెలువరించినాడు. ఇట్టి 'విషయి ప్రధానమయిన రచనమునకు వర్చస్సు నిచ్చునది 'ఆర్జవము" అనుగుణము. ఆర్జవమనగా తాననుభవించిన భావములనే వెలువరించు అకృత్రిమ స్వభావము. ఇతరుల మెప్పులకో, సంప్రదాయ సంరక్షణమునకో ఆశపడి తన మనస్సున నిజముగా లేని భావములను ఆరోపించుకొని అతడు రచనా వ్యాపారమును సాగింపలేదు. ఋజుత్వమే జీవధర్మముగా బ్రతికినవాడు అన్నమయ్య. ఆ అర్జవగుణమే అతనికి వ్యవహారములోను కవితలోను భావములకు తీవ్రతతోపాటు భాషకు పదనైన తీర్పునుకూడ ఈయగలిగినది. అన్నమయ్య సంస్కార సిద్దమై సహజమయిన కవితాశిల్పమును ఎన్నడును పదను చెడని భావనాశక్తిని కలవాడు. తన ఇష్టదైవమైన వేంకటేశ్వరమూర్తి నే ఆధి భౌతికమును ఆధ్యాత్మికమున సర్వ ప్రపంచములోను అంతర్యామిగను, బహీర్యామిగను భావించి, పూజించి, ప్రేమించి, కలహించి, ప్రాధేయపడి, ప్రార్థించి, పొగడి, తెగడి, అనుభవించి, ఏకీభవించి జీవితములోని అంతరంగ బహిరంగ పరమాణువులన్నిటను అతని బ్రతుకే బ్రతికినాడు. ఆ యనుభవములను మానసికముగాను, కాయికముగాను మాత్రమే కాక వాచికముగా కూడ అనుభవించినాడు. ఆ వాచి కానుభవాలే ఆయన 'పదకవితలు'.

ఇట్టి పదకవితలను ఈతడు వేలకొలదిగా సంకీర్తనాత్మకముగా వ్రాయుటకు వైష్ణవ సంప్రదాయమునకు చెందిన ఆళ్వారుల ద్రవిడ ప్రబంధములు కొంతవరకీతనికి ఉద్బోధకములై యుండవచ్చును. తెలుగునకు సంబంధించినంతవరకు అన్నమయ్యయే ఇట్టి పద రచనకు ఆద్యుడు. అందుచేతనే ఆతనికి గల 'పదకవితా పితామహుడు' అను బిరుదము సార్థకమనదగి యున్నది. కృష్ణమాచార్యుని 'సింహగిరి నరహరి వచనములు' ఇంత కంటె పూర్వమే తెలుగున వెలసియున్నను అవి గేయ రచనములేయయ్యు అంగాంగిభావ విభాగము లేక అఖండ గద్యధారగా గేయగంధులుగా మాత్రమే ఉన్నవి. అవికూడ మనకు నేడు లభ్యములగుట లేదు. పదునైదవ శతాబ్దమునకు కొంచెము ముందుగా కన్నడ భాషలో ముఖ్యముగా వైష్ణవదాసుల రచనములలో పదకవిత ఒక అచ్చుకట్టయిన స్వరూపమును సంపాదించుకొని నిలిచినది. ప్రాచీన సంగీత గ్రంథములలో ప్రబంధములనబడు గేయరచనలు మనదేశములో అసంఖ్యాకములుగా నుండెడివనియు, రాగము, తాళము, శబ్దము, అర్థము, సందర్భము మొదలయిన వాటినిబట్టి ఆ రచనలలో పెక్కు విభాగములు ఏర్పడియుండిన వనియు తెలియుచున్నది. ఆ చాదస్తములను అన్నిటిని వదలిపెట్టి సుప్రసిద్ధములయిన దేశిరాగములలో, సుగ్రహము అయిన లయ తాళములలో నిబంధించి సులభీక రింపబడిన రచనములే పదములు, కన్నడభాషలో ఇట్టి రూపముతో వెలసిన పదరచనమును తొలిసారిగా తెలుగు లోనికి దించినవాడు అన్నమయ్య. పదమునకు రెండే అంగములు. అవి పల్లవి, చరణము అనునవి ముఖ్యమై కేంద్ర భూతమయిన అర్థము పల్లవిలో నుండును. దాని విస్తరణమే. - వివరణమే చరణములో నిబంధింపబడును. పల్లవిలోని భావ మొక వాక్యములో ముగియకున్న యెడల రెండవ వాక్యమును అనుపల్లవిగా చేర్చి రచించుట కలదు. ఇట్లు పదరచనముల కొక అచ్చుకట్టు స్వరూపమును కల్పించి, తరువాతి పధకర్తలకు అన్నమయ్య ఒక చక్కని పథమును తీర్చి దిద్దినాడు.

రాయలసీమలో వ్యవహారముననున్న ఎన్నో రుచిగల పలుకుబళ్ళు అన్నమయ్య పదములలోనికి ఎక్కినవి. అతని పదముల నుండి ఆ పలుకుబళ్ళు రాయలనాటి కవీశ్వరుల రచనములలోనికిని ఎక్కినవి. వ్యావహారిక భాషను విశృంఖలముగా వాడి అన్నమయ్య తనకుగల స్వాతంత్య్ర రసికతను వెల్లడించినాడు. ఆపదముల ప్రయోగముతో రచనము సహజముగా, సజీవముగా నుండి భావతీవ్రతను చక్కగా వ్యక్తము చేయజాలినది. ఆధి భౌతికానుభవములలో అన్నమాచార్యులు ఎక్కువగా భావించినది శృంగారము. ఆ శృంగారమును గూడ ఆధ్యాత్మికపు మట్టమునకు ఎక్కించిన మహాపురుషు డాయన. ఆ పదములను వాడుకొని ఆనందింప గలవారు అదృష్టవంతులు. అట్లు పాడలేనివారును పద్యములుగా చదువుకొని ఆనందింప గలిగినంత స్వతంత్ర మయిన అర్ధభావ రచనల యందచందములతో నిండిన నిధు లాయన పదములు. సంగీత సాహిత్యనిధియగు అన్నమయ్యలోని సాహిత్యాంశము క్షేత్రయ్యగాను, సంగీతాంశము త్యాగయ్యగాను అవతరించెనని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి అభిప్రాయము. వారి అభిప్రాయములో అతిశయోక్తి ఆవంతయు లేదు.

తి. కో. రా.