Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నంభట్టు

వికీసోర్స్ నుండి

అన్నంభట్టు  :- అన్నంభట్టు ఆంధ్ర బ్రాహ్మణుడు. వేదశాస్త్ర పండితుడు. ఇతని తండ్రి తాత ముత్తాతలును మహావిద్వాంసులు. శాస్త్రగ్రంథములను నిర్మించినవారు. అన్నంభట్టు తండ్రి తిరుమలభట్టు. అతడు సర్వతోముఖ యాజి యను బిరుదము కలవాడు. సంధ్యావందన భాష్యమును వ్రాసెను. అతని తాత మల్లుభట్టు. 'అగ్నిహోత్రభట్టను బిరుదము కలవాడు. ఆలోకస్ఫూర్తి యను న్యాయగ్రంథమును, తత్త్వవివేచనమను వేదాంత గ్రంథమును మహాభాష్య టీక యను వ్యాకరణ గ్రంథమును 'ఆతడు రచించెను. అన్నంభట్టు ముత్తాత లోక నాథభట్టు. 'ద్వాదశాహ యజ్వ' యను బిరుదము కలవాడు. వీరందరికి మూలపురుషుడు రాఘవ సోమయాజి అని ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమున కలదు. మరియొక యాధారమును బట్టి అన్నంభట్టు కౌశికసగోత్రుడు. అతని మూలపురుషుడు అద్వైతాచార్యుడగు రాఘవ సోమయాజి, తండ్రి మేలిగిరి తిరుమలాచార్యుడు, అన్న సర్వదేవుడు అని తెలియుచున్నది. ఇందు అన్నంభట్టు యొక్క తాత ముత్తాతల పేళ్లు లేవు. పై రెండాధారములందును అన్నంభట్టు అన్నంభట్టు గానే పేర్కొనబడెను. రెండు తావులందును రాఘవసోమయాజియే మూలపురుషుడని కలదు. భేద మేమన ఒక చోట అన్నంభట్టు తండ్రి తిరుమల భట్టనియు, రెండవ తావున తిరుమల ॰చార్యుడనియు కలదు. ఈ ' ఆచార్య ' 'భట్ట ' శబ్దములు ఆనాడు నిస్తుల పాండిత్యముకలవారి కొసగ బడుచుండెను.అందుచేత తిరుమలభట్టు, తిరుమలాచార్యుడు ఇరువురు నొకరేయని నిశ్చయింపతగియున్నది.

విజయనగర రాజ్యస్థాపనానంతరము ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబము లనేకములు తుంగభద్రాదక్షిణ దేశమునకు వెడలెను. అట్టివాటిలో అన్నంభట్టు కుటుంబ మొకటి. అన్నంభట్టువంశమునందలి అత్యంత ప్రాచీన పురుషులు మొదట మామిళ్లపల్లి యను గృహనామముతోను, పిదప గరికపాటి లను గృహనామముతోను వ్యవహరింపబడుచు వచ్చిరి. అన్నంభట్టు వంశమునందలి ప్రాచీన పురుషులకు మామిళ్లపల్లి యను నింటి పేరు మామిళ్లపల్లి యను పేరుగల యొకానొక గ్రామమును బట్టి యేర్పడి యుండవచ్చును.

అన్నంభట్టుపూర్వులు నివసించిన మామిళ్లపల్లి యను గ్రామ మెద్ది యని విచారింపతగినది. గుంటూరు మండలస్థమైన తెనాలి తాలూకా యందు మామిళ్లపల్లి యను గ్రామమొకటి కలదు. ఇందు నేటికిని మామిళ్లపల్లి యను నింటి పేరుకల పెక్కు బ్రాహ్మణ కుటుంబములు కలవు. ఈ బ్రాహ్మణులు వెలనాటి శాఖకు చెందినవారు. తెలంగాణమున మహబూబునగరం జిల్లా యందలి అచ్చం పేట తాలూకాలో మరియొక మామిళ్లపల్లి కలదు. నేడిందు మామిళ్లపల్లియను నింటి పేరు కల బ్రాహ్మణులు లేరు. ఐనను అన్నంభట్టు తెలగాణ్య శాఖకు చెందిన బ్రాహ్మణుడయియుండుట చే ఆతని వంశమునందలి ప్రాచీనులీ తెలంగాణము నందలి మామిళ్లపల్లి యందే నివసించి ఉండిరనియు, మామిళ్లపల్లి యందుండుటచే మామిళ్లపల్లి వారనియు తెలంగాణమునం దుండుటచే తెలగాణ్యులని ప్రసిద్ధినొంది యుండిరనియు ఊహింపవచ్చును. నేడు వారచ్చట లేకుండుటకు కారణము వారందరును అన్నంభట్టు తలిదండ్రుల కాలమున స్థలాంతరములకు వలస పోయి యుండుటయే కావచ్చును. ఇట్లు తెలంగాణము నందలి మామిళ్ల పల్లి నుండి వలసపోయిన మామిళ్లపల్లి వారిలో కొందరు కడపజిల్లాలోని ప్రొద్దుటూరునందు స్థిరపడిపోగా అన్నంభట్టు వంశమునందలి పెద్దలు ఉత్తర ఆర్కాటునందలి చిత్తూరునకు సామీప్యమున నున్న గ్రామమువ నివాసమేర్పరచుకొనిరి. అక్కాలమున తెనుగునాడు ఉత్తర ఆర్కాటు మండలము వరకు వ్యాపించియుండెను.

అన్నంభట్టు బాల్యమున విద్యాశూన్యుడయి యుండెననియు, తండ్రి యాతనిని ప్రహరించెననియు, అప్పుడాతడు స్వగ్రామ త్యాగమొనర్చి తొలుత కొండవీటి పాఠశాల యందు ప్రవేశించి యచట వేదశాస్త్రముల నభ్య సించి, పిదప కాశికేగి, అక్కడ వ్యాకరణ శాస్త్రమును శేషవీరేశ్వర పండితుని యొద్ద అభ్యసించి సమస్త విద్యాపారగు డయ్యెననియు నొక ఐతిహ్యముకలదు. కాశీయం దితడు పొందిన యఖండి గౌరవము 'కాళీగమన మాత్రేణ నాన్నంభట్టాయ తేద్విజః' అనుసూక్తి వలన తేట పడుచున్నది.

అన్నంభట్టు కాశినుండి స్వగ్రామమునకు చేరి తర్క మీమాంసాద్య నేక శాస్త్రగ్రంథములను రచించెను. ఇతడొక పాఠశాలను కొండవీటిలో నేర్పరచి విద్యార్ధులకు తర్కశాస్త్రమును బోధించుచుండెను. తర్కశాస్త్రము నభ్యసించువారు క్రమముగా తర్క సంగ్రహము, దీపిక, ముక్తావళి, గాదాధరీయము మున్నగు గ్రంథములను చదువవలె నను పరిపాటి అన్నంభట్టే యేర్పరచెననియు, అప్పటినుండియే ఆ పద్ధతి ఆచరణములోనికి వచ్చెననియు పలువురు విద్వాంసుల విశ్వాసము. ఇట్లు సుప్రసిద్ధి నొందియున్న అన్నంభట్టునకు విజయనగర సామ్రాజ్యాధిపతులలో నొకడగు శ్రీ సదాశివరాయల కాలమున అళియ రామరాజుచే గరికపాడను గ్రామము దానముగా నొసగబడినట్లు శాసనములవలన తెలియుచున్నది. కావున నీతడు క్రీ. శ. 18 వ శతాబ్ది మధ్యముననుండెనని నిశ్చయింపనగును. గరిక పాడు దానముగ లభించినది మొదలు అన్నంభట్టును తద్వంశ్యులును పారంపర్యముగ ఆ గ్రామమందే స్థిరనివాసమేర్పరచుకొని, గ్రామమునుబట్టి గరికపాటి వారను గృహనామముచే ప్రసిద్ధినొందిరి. నేడు గరికపాటియందును తదితర స్థలములందును కల గరికపాటివారు తెలగాణ్యులును కౌశికసగోత్రులు నై యున్నారు.

అన్నంభట్టు పుంభావసరస్వతి యనుట అతిశయోక్తి కానేరదు. అన్నంభట్టు తర్క మీమాంసా వేదాంత వ్యాకరణ శాస్త్రములందు నిష్ణాతుడయి పెక్కు శాస్త్ర గ్రంథముల రచియించెను. ఇతడు తర్కశాస్త్రమున -తర్క సంగ్రహము, తర్క సంగ్రహ దీపిక, తర్క భాషా తత్త్వబోధిని, ఆలోక సిద్ధాంజనము, (ఇది జయదేవుని ఆ లోకమను తత్త్వచింతామణికి వ్యాఖ్య) సుబుద్ధి మనోహరము (ఇది రఘునాథ శిరోమణి కృతమైన దీధితికి వ్యాఖ్య) అను గ్రంథములను వ్రాసెను. 12వ శతాబ్ది వరకు సూత్రగ్రంథములను, పిదప గంగేశోపాధ్యాయ కృతమైన తత్త్వచింతామణిని ఆధారముగ చేసికొని న్యాయ శాస్త్రము వికాసమునొందెను. ఇట్టి భేదమును బట్టియే మొదటిదానికి ప్రాచీన న్యాయమనియు రెండవ దానికి నవీన న్యాయమనియు వ్యవహార మేర్పడెను. తర్క సంగ్రహమున ద్రవ్యాదిసప్తపదార్థముల స్వరూపము సంగ్రహముగ వివరింపబడినది. తర్క సంగ్రహ దీపిక అనునది తర్క సంగ్రహమునకు అన్నంభట్టుచే వ్రాయబడిన టీకా గ్రంథము. తర్క సంగ్రహ నిర్మితి యందలి వైశిష్ట్య మెద్దియన ప్రాచీనులు ప్రమాణ నిరూపణానంతరము పదార్థ నిరూపణ మొనర్చిరి. ఆరంభమున నున్న ప్రమాణనిరూపణము మిక్కిలి కఠినమైనదై సుబోధ మగుటలేదు. అందుచేత శాస్త్రోద్దేశము ప్రచారమునకు వచ్చుట కష్టమయ్యెను. అన్నంభట్టు ముందుగనే శాస్త్రమందలి ప్రమేయముల నిరూపించి ఆ ప్రమేయ నిరూపణమునకు ప్రమాణములను సాధనములుగా గ్రహించెను. అందువలన శాస్త్రోద్దేశము సుబోధ మగుచున్నది. ప్రాచీనులు ప్రాచీన గ్రంథములయం దొక్కొక్క భాగమునకు మాత్రమే ప్రాధాన్య మొసగి దానినే విపులముగ చర్చించిరి. అన్నంభట్టు శాస్త్రప్రమేయ సామగ్రి నెల్ల సమగ్రముగాను క్లుప్తము గాను వివరించెను. తర్క సంగ్రహమందు అన్నంభట్టు క్రమమును మార్చుటచేతను, విషయమును సమగ్రముగా గ్రహించుటచేతను, సుబోధ మొనర్చుటచేతను, ఇది ఆ సేతు హిమాచలము సంతత పఠన పాఠనములందు విశేషోపయోగమును కాంచుచుండుటచేతను దీనికి నవీన న్యాయమున ప్రధానస్థానము లభించియున్నది.

మీమాంసా శాస్త్రమున ఇతడు రాణకోజ్జీవిని (ఇది భట్ట సోమనాథుని రాణకమునకు టీక. దీనికి సుబోధిని, సుధాహరము అనునవి నామాంతరములు) తంత్రవార్తిక టీక అను రెండు గ్రంథములను రచించెను. వేదాంత శాస్త్రమున - మితాక్షర (ఇది బ్రహ్మసూత్రములపై వ్రాయబడిన వృత్తి), తత్త్వ వివేచనము - అను రెండు గ్రంథములను రచియించెను. వ్యాకరణ శాస్త్రమునందు వ్యాకరణ మితాక్షర (ఇది పాణిని అష్టాధ్యాయి పై అత్యంత సులభమైన వ్యాఖ్య) భాష్య ప్రదీపోద్ద్యోతనము (ఇది క్లెయటుని ప్రదీపముపై వ్యాఖ్య) అను గ్రంథ ద్వయమును వ్రాసెను. వేదముపై నితడు స్వరలక్షణమను గ్రంథమును రచించెను. ఇట్లన్నంభట్టు హాటక లేఖిని బహుముఖముల బహురంగముల నర్తించెను.

గ.ల.కాం