Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అతి భౌతిక శాస్త్రము

వికీసోర్స్ నుండి

అతి భౌతిక శాస్త్రము  :- మోటా ఫిజిక్సు అను శబ్దము తొలుత అరిస్టాటిల్ చేత ఉపయోగింపబడెను. మెటా అనగా పరము, ఫిజిక్సు అనగా భౌతిక శాస్త్రము, భౌతికత త్త్వమునకు పరమైన తత్త్వము యొక్క శాస్త్రము మెటా ఫిజిక్సు. దీని ముఖ్యోద్దేశము సత్త యొక్క స్వరూపమును నిరూపించుట. అందుచేత దీనిని పార భౌతిక శాస్త్రమని, సత్తాశాస్త్రమని, తత్త్వశాస్త్రమని కూడా పిలువవచ్చును. "తత్" అనగా, "అది" అనగా సత్తయే. అందుచేత సత్తకు, తత్త్వమునకు అర్థము ఒక్కటిగానే గ్రహింపవచ్చును. అరిస్టాటిలు అర్థము ఏమయినను ప్రస్తుతము ఈ శాస్త్రమును ప్రమాణశాస్త్రము నుండి, తర్కశాస్త్రమునుండి విడదీయుట కలదు. సత్తాశాస్త్రము సత్తా స్వరూపమును, ప్రమాణశాస్త్రము సత్య స్వరూపమును, తర్కశాస్త్రము అనుమాన పద్ధతిని నిరూపణము చేయును.

సత్యము (truth) అనునది జ్ఞానమునకు చెందినది. "కలము నల్లగా ఉన్నది" అను వాక్యమునందు " ఉండుట ” కలమునకు చెందినది. కలము నిజముగా ఉన్నచో ఈ వాక్యము సత్యము; ఎఱ్ఱగా ఉన్నచో అసత్యము. అందుచేత సత్యాసత్యములు వాక్యమునకు చెందును. ఒకప్పుడు మనము వాక్యమును ఉచ్చరించక పోవచ్చును. అయినను, "కలము నల్లగా ఉన్నది" అను ప్రత్యక్షజ్ఞానమందు కూడ సత్యాసత్యములు ఉన్నవి. ఉదాహరణము రజ్జుసర్పజ్ఞానము. రజ్జువును చూచి సర్పమని అనుకొనవచ్చును. సత్యమునకు ప్రమ అని, అసత్యమునకు భ్రమ అని పర్యాయములు.

ఇప్పుడు సత్తాశాస్త్రము అను పదము అన్ని శాస్త్రముల సంపుటికి ఉపయోగించు వాడుక కలదు. ద్రవ్య స్వరూపము, కార్యకారణ స్వరూపము, ధర్మస్వరూపము, జీవ స్వరూపము, ఆత్మస్వరూపము, ప్రపంచ స్వరూపము, టూకీగా సర్వ సత్తాస్వరూపము నిర్ణయించు శాస్త్రము సత్తాశాస్త్రము.

వస్తుసత్త జ్ఞానవేద్యమయినప్పుడే గుర్తించబడును గనుక, సత్తాశాస్త్రమునకు, సత్యతాశాస్త్రమునకు సంబంధము గలదు. సత్త సత్యమయినప్పుడే సత్త యగును. లేనిచో అసత్తయే. అందుచేత సత్తాశాస్త్రము చదివి నప్పుడు సత్యతాశాస్త్రము కూడ చదువవలసి యున్నది. పరసత్త అనేది ఒకటి ఉన్నదా? ఉన్నచో దానిని ఎట్లు తెలిసికొనుట? అను ప్రశ్నలు సత్యతాశాస్త్రము యొక్క విషయములు.

మొట్టమొదట యూరోపు దేశమున ప్లేటో వస్తుసత్త బుద్ధి (reason) గోచరముగాని, ఇంద్రియ (sense) గోచరము కాదని అనెను. అరిస్టాటిలు బుద్ధి గోచర

మయినను ప్రత్యక్షకృత విషయమందే అది ఉండునని చెప్పెను. తర్వాత మధ్యయుగము లందలి దార్శనికులు ప్రపంచ సత్త ఈశ్వరస త్తనుండి వేదితవ్యమని నుడివిరి. కాని నవీన యుగమున ప్రకృతి సత్తాస్వరూప గ్రహణము ద్వారా ఈశ్వర సత్తాస్వరూపమును గ్రహింపవలెనని దార్శనికుల అభిప్రాయము.

పదునారవ శతాబ్దమున డెకార్డు ప్రతి ప్రత్యక్షము సంశయాస్పదమని ప్రారంభించెను. నేను చూచుచున్న వస్తువు లన్నియు స్వప్న తుల్యములు ఎందుకు కాకూడదు ? ఎవడైనా ఒక మాయావి యీ దృశ్యములను సృష్టించు చున్నాడేమో ? నేను చదువుచున్న పుస్తకము నిజమైన పుస్తకము ఎందుకు కావలెను ? అది నిజమైదని నిర్ధారణ చేయుట ఎట్లు ? కనుక ప్రతి జ్ఞానము సంశయ విషయము అయినచో సత్తారూపమును నిర్ణయించుట ఎట్లు ? 'నేను సంశయించుచున్నాను” అనుచోట సంశయకర్త నిజము కావలెను. సంశయ విషయము నిజము కాకపోవచ్చును. అందుచేత సత్తాశాస్త్రము " నేను ” నుండి ప్రారంభము కావలెను. అయితే "నేను” అనునది ఉత్పన్న వస్తువు : కార్యముగాని, నిత్యము కాదు, ప్రతి కార్యమునకు కారణ ముండవలెను. ప్రతి మానవునకు మాతాపితరులు కారణ భూతులు; వారికి వారి మాతాపితరులు. ఇట్లు అనంతముగా కార్యకారణ నిరూపణము సాగును. ఇది సొంతము కావలెనన్నచో అందరికి ఈశ్వరుడే కారణభూతుడని చెప్పవలెను. ఈశ్వరుడు పరంపరగా ఆ జ్ఞానమునకు కూడ కారణ భూతుడు. ఆయన నిష్కపటి, వాత్సల్య స్వరూపుడు. అందుచేత మానవులకు మాయాదృశ్యములు చూపించి మాయ చేయడు. తత్కారణముగా మానవుల జ్ఞానములు యథార్థములు. మనము మనస్సును రాగాది దోషముల నుండి శుద్ధము చేసినచో యథార్థమునే సర్వదాతెలిసికొందుము.

డెకార్డు సర్వసత్త ద్రవ్యస్వరూపమని భావించెను. ఈ ద్రవ్యము రెండు విధములు, జడము, మానసము. జడ ద్రవ్యస్వరూపము విస్తృతత్వము, మానసద్రవ్వస్వరూపము జ్ఞానము. ఈ రెంటికి సామాన్య గుణము ఏదియు లేదు. జడము చలనహీనము. మానసము చలనసహితము.

డెకార్డు సిద్ధాంతము స్పినోజాకు నచ్చలేదు. వస్తుజ్ఞానోత్పత్తి మానసజడ ద్రవ్యసంయోగము వలన కలుగును. గాని అవి ఏకాంతభిన్నములయినచో ఎట్లు జ్ఞానోత్పత్తి కొరకు కలిసికొనగలవు? సంయోగశీలత వస్తువులకు సామాన్యగుణము ద్వారానే కలుగగలదు. మనస్సునకు జడపదార్థమునకు సంయోగ సంబంధ శీలత లేనపుడు జ్ఞానము అసంభవము. కాని జ్ఞానము సర్వజన వేద్యము. అందుచేత మనోజడములు ఏకాంతభిన్న ద్రవ్యములుకావు. ద్రవ్యము ఒక్కటియే, అది ఈశ్వర స్వరూపము. దానికి పెక్కు విశేష గుణములు కలవు. వాటిలో రెండు మనస్సు, జడత. కాగితము యొక్క రెండు ప్రక్కలవలె ఈ రెండును పరస్పరా పేక్ష కలవి. ఒక దానిలో మార్పు కలిగినప్పుడు రెండవ దానిలో తదుచితమైన మార్పు కలుగును. ఈ మార్పు మానసమున జ్ఞానాకారము పొందును. జంతుకోటియు, జడవస్తుకోటియు ఈశ్వరుని విశేషగుణముల విశేషణములు (modes).

ద్రవ్యము ఒక్కటియే అను సిద్ధాంతము లైబ్నిడ్జు స్వీకరింపలేదు. ద్రవ్యము ఒక్కటే అయినచో మానవుల వేరు వేరు అనుభవములకు కారణము ఏమి? వారివారి స్వతంత్ర కర్మలకు కారణమేమి ? అందుచేత ద్రవ్య బహుత్వము స్వీకరించవలెను. అదియునుగాక మానసము ఒకటే మాత్రము చలనశీలము కాదు. జడ ద్రవ్యము కూడ చలనశీలమే. దానిలోను శక్తి (force) ఉన్నది. చలనశీలత మానసత్వసూచకమైనచో జడద్రవ్యము కూడ మానసమే. అది అనావిర్భూతమానసము. ప్రపంచమున కేవల జడమాత్రమనునది లేదు. సర్వము అణుపరిమిత మానసో పేతము. ఈ మనస్సులకు లై బిడ్డు మొనాడులు (monads) అని పేరిడెను. అవి అణువులకంటే చిన్నవైనను మహత్తుకంటే మహత్తరములు. వాటికి పరస్పరము ఏ జోక్యములేదు.

అయినను. ప్రతి మొనాడు ప్రపంచమునంతటిని " ఆంతరంగికముగానే గ్రహించును. బహిర్ముఖముగా చూచుటకు దానికి కిటికీలు లేవు. (The monads are windowless) జ్ఞానము బహిర్వస్తుజనితము కాదు. అంతరంగిక వికాసము. ఈ వికాసము కొన్ని మొనాడులలో ఎక్కువగాను, కొన్నిటియందు తక్కువగాను ఉండును. మిక్కిలి తక్కువ వికాసముకల వాటిని జడములని, ఎక్కువ వికాసములు కలవాటిని మానసములని మనము తెలిసి కొందుము. ఈశ్వరుడుకూడ ఒక మొనాడుమాత్రమే. అతడు మొనాడులన్నిటిని సృజించినపుడు పరస్పరసంగతి (harmony) దృష్టితో సృజించెను. గడియారము చేయువాడు అన్ని గడియారములు ఒకే సమయమును చూపునట్టు ఏలాగుచేయునో, అలాగే ఈశ్వరుడు గూడ ఒకే విధమైన ప్రపంచజ్ఞానమును, పొందునట్టు మొనాడులను సృజించెను. వీరందరు హేతు ప్రాధాన్య వాదులు(rationalists) అని పిలువబడుదురు. సత్యము వస్త్వ పేక్షితముగాని, బుద్ధ్య పేక్షితము గాదని ఇంగ్లాండులో బేకను తన సిద్ధాంతమును వెల్లడించెను. ప్రపంచమున ఏ ఏ సత్తలు కలవు? అవి ఎన్ని విధములు ? ఏ స్వరూపములు కలవి ? అను విషయము బుద్ధి యొక్క స్వరూపమును, స్వభావమును పరిశీలించినంత మాత్రమున తెలియదు. అది ప్రత్యక్షానుభవమువలననే తెలియగలదు. ప్రపంచములో అయిదు మహాభూతములు కలవా ? అరువది భూతములు కలవా? అరువదికంటే హెచ్చుగా నున్నవా ? అను విషయము బుద్ధిని పరిశీలించిన మాత్రమున ఎట్లు తెలిసికొన గలుగుదుము? అందుచేత ఇంద్రియ జ్ఞానాధారమే సర్వజ్ఞానము. ఈ మతమునకు అనుభవ మూల వాదము(empiricism) అని పేరు. బేకను గొప్ప దార్శనికుడు కాడు. అయినను అతడు ఈ వాదమునకు పునాది వేసిన వాడు. దీనిని పురస్కరించుకొని లాకు, బెర్కిలీ, హ్యూము అనువారు తమ దర్శనములను నిర్మించిరి. ప్రత్యక్షానుభవమే ప్రధానమైనచో లై బ్నిడ్డు చెప్పిన ప్రకారము అంతరంగముగా బుద్ధివికాసమే సత్యమును నత్తనుజ్జాతము చేయజాలదు. అదియునుగాక జాతిజ్ఞానము (knowledge of the universal) ప్రత్యక్షోద్ధృత మేగాని ప్రత్యక్ష కారకముకాదు; బుద్ధ్యంతరంగోద్ధృతము కాదు. మనము పెక్కుమంది మనుష్యులను చూచి, వారి సామాన్య గుణములను సంగ్రహించి, ఆ గుణసంపుటికి మనుష్యజాతి పదము వాడుదుము. మనుష్యజాతికి మనుష్య వ్యక్తి సత్తాభిన్నమైన వేరొక సత్తలేదు. వేరుగా మనము వాడి నప్పుడు అది నామమాత్రము, బుద్ధ్యాకృతి మాత్రము, మనోవృత్తి మాత్రము అని లాకు వాదము.

లాకు ప్రారంభించిన వాదమును బెర్కిలీ విస్తరించెను అనుభవైక వేద్యమే సత్త అయినచో జడ ద్రవ్యము యొక్క సత్త ఏ అనుభవము యొక్క గోచరము? నారింజ కాయ ఆకుపచ్చగాను, పుల్లగాను ఉన్నదని, రంగు యొక్కయు రుచి యొక్కయు సత్త నారింజ కాయయందు ఉన్నదని, నారింజకాయ ఈ రంగుకు రుచికి ఆధారమని భావింతుము. కాని నా కన్ను రంగు గ్రుడ్డి అయినచో రంగు కనిపించదు. పైత్య భూయిష్ఠమైనచో సర్వము పసుపుగా కనిపించును. అందుచేత రంగు నా మానసిక వృత్తిగాని, విషయవృత్తి గాదు. అలాగుననే పులుపు గూడ మానసిక వృత్తియే. ఈ గుణము లన్నిటికి భిన్నమైన నారింజయను జడద్రవ్యమును చూచినవాడెవ్వడు ? జడద్రవ్యము గుణాధారమని అందురు. గుణములు మాత్రమే ప్రత్యక్షములు. తదాధారము ఎవ్వరికి గోచరము కాదు. తదుపరి గుణములు మానసికములు. అందుచేత జడద్రవ్యము అసత్య పదార్థము. దానికి సత్తలేదు. సత్త సర్వదా మానసిక ద్రవ్యమే.

బెర్కిలీ జడద్రవ్యమును నిరాకరించినరీతినే హ్యూము మానసద్రవ్యమును కూడ నిరాకరించెను. జడద్రవ్యము ప్రత్యక్ష వేద్యము కానిచో మానసద్రవ్యము మాత్రము ప్రత్యక్ష వేద్యమా? పంచజ్ఞానేంద్రియములలో దేనికిని మానసము ప్రత్యక్షము కాదు. నేను నా అంతరంగమున చూచినప్పుడు కొన్ని భావములు, సుఖ దుఃఖములు, జ్ఞానములు, కల్పనలు మొదలగునవి ప్రత్యక్షమగును గాని మనస్సు మాత్రము ప్రత్యక్షముకాదు. అందుచేత మనోద్రవ్యమనునది ఉన్నదని రూఢిచేయలేము. అటులనే జాతిపద విషయములకు (universals) వ్యాప్తులకు (universal judgments) సత్త ఉన్నదని సత్త ఉన్నదని నిర్ధారణ చేయలేము. దేని సత్త అయినను, ఇంద్రియ విషయము అయినగాని, తత్సంబద్ధము అయిన గాని ఒప్పుకొనబడదు.

అయినచో ఈశ్వరునికి సత్తలేదా? ఆత్మకు సత్తలేదా? కార్యకారణభావము అసత్యమా? కార్యకారణభావమే అసత్యమయినచో శాస్త్రజ్ఞాన మే అసంభవమగును. శాస్త్రముల నిర్వచనములన్నియు దానిమీదనే ఆధారపడి యున్నవి. లేనిచో ప్రపంచకమంతయు యాదృచ్ఛిక మగును. కార్యకారణద్యోతకము వాప్తివాక్యము; అనగా సామాన్య వాక్యము. ధూమమునుండి అగ్నిని అనుమానము చేసినప్పుడు అగ్ని ధూమమునకు సర్వత్ర సర్వదా కారణమని ఒప్పుకొనియే అనుమానము చేయుదుము. కాని ఎవడు సర్వాగ్నులను సర్వత్ర సర్వదా చూచిన వాడు? లేనప్పుడు, మన జ్ఞానము సర్వము సంశయాస్పదమగును. తత్ఫలితము సంశయతాసిద్ధాంతము(skepticism). ఈ ఫలితమును తొలగించుటకు కాంటు పూనుకొని ప్రపంచానుభవమునకు కారణములు రెండని, అవి అంతఃకరణము వస్తు స్వనత్త (thing in itself) అని చూపెను. కాంటు అంతఃకరణమునకు మూడు భాగములు అని చెప్పెను. అవి ఇంద్రియ వేదన (sensation) (వేదన అను పారిభాషిక పదమును బౌద్ధులు వాడుదురు). మనోవృత్తి, బుద్ధివృత్తి, వస్తంతఃకరణముల సంయోగము వలన సర్వ ప్రపంచము ఉద్భవించును. కేవలము వస్తువు గాని, కేవలము అంతఃకరణముగాని ప్రపంచమును సృజింప నేరదు. “ఆత్మా మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ | ఇంద్రియ మర్థేన తతః ప్రత్యక్షం” అన్నట్లు వస్తు స్వసత్త ఇంద్రియముల ద్వారా అంతఃకరణముతో సంబంధమైనప్పుడు ఇంద్రియచేతన ఉద్భవించును. ఇంద్రియచేతనలే దృశ్య ప్రపంచము యొక్క ద్రవ్యసామగ్రి. కాని మైనము ముద్రలను స్వీకరించునట్లు అంతఃకరణము ఇంద్రియ వేదనలను స్వీకరింపదు. వాటిని తన ద్వారముల ద్వారా తీసికొనుచు వాటికి తన రూపములను ఇచ్చును. అట్లు చేయని ఇంద్రియచేతనలు ఈ రూపములు. ఈ రూపములు మూడు విధములు. ఇంద్రియచైతన్యరూపములు, మానసచైతన్యరూపములు, బుద్ధిచై తన్య రూపములు (forms of sensation, understanding and reason) మొదటివి దిక్కాలములు (space and time). ప్రతి ఇంద్రియచేతనను అంతఃకరణము దిక్కాలములద్వారా లోపలికి ప్రవేశ పెట్టుకొనును. అందుచేత ప్రతివస్తువు దిక్కాలనియమితమైనట్టు మన అనుభవము. దిక్కాలరూపితములైన ఇంద్రియచేతనలకు అంతఃకరణము మనస్సుద్వారా ద్రవ్యగుణ, కార్యకారణాది రూపములను ఇచ్చును. అందుచేత మనము ప్రతివస్తువును కార్యముగను, కారణముగను, ద్రవ్యముగను, గుణముగను, అనుభవ గోచరము చేసికొందుము. అనుభవ విషయములనన్నింటిని బుద్ధి సంచితముచేసి, పరస్పర సంబంధములు కల్పించి, ఏకీకృతముచేసి ఏకవస్త్వంగములుగా నిరూపించును. ప్రపంచములోని నియామక సూత్రములన్నింటికి అంతఃకరణమే మూలము. పద్ధతిబద్ధమైన ప్రపంచము అంతఃకరణ సృష్టము. అందుచేత అంతఃకరణము, ఆ నియామక సూత్రములను తదాధారములైన వ్యాప్తులను తెలిసికొనగలదు. తత్కారణముగా శాస్త్రజ్ఞానము అసంభవము కానేరాదు.

ప్రపంచకము యాదృచ్ఛికముగాక, సూత్రబద్ధ మైనది. ఈ సూత్రములు బుద్ధినిర్మితములగుట చేత ప్రపంచము గూడ బుద్ధినిర్మితమే . బుద్ధికిగోచరము కానిది, ఇంద్రియ చేతనలకు కారణమైనది. వస్తుస్వసత్త (Thing in itself) అను నది వేరొకటిలేదు. దృశ్య ప్రపంచము వెనుక అదృశ్య ప్రపంచము వేరొకటి ఒప్పుకొనము. వ్యావహారిక సత్త అని, పారమార్థిక సత్త అని, రెండుసత్తలులేవు. సత్త అన్నది బుద్ధిగ్రాహ్యము; బుద్ధినిర్మితము. స్వారాయ తసత్తాకమైన వస్తువు ఒకటి ఉన్నదని కాంటు పొరపాటు బడెనని హెగెలు వాదించెను. బుద్ధి నిరూప్యమే సత్త, సత్తయే బుద్ధినిరూప్యము. (The rational is real, and the real is rational). బుద్ధి యొక్క అంతరంగ తత్త్వములను (Categories) తెలిసి కొనినచో ప్రపంచస్వభావమును తెలిసికొనగలము, బుద్ధికి ఏకసత్తాన్వేషణయే పరమగతి. ఏక సత్తావాదమే సత్యము (Monism) పరమాత్మస్వరూపమే (Absolute consciousness) ఏక సత్త. హెగెలు ప్రపంచపు దార్శనికులలో మొదటి తరగతిలోనివాడు. ఆయన ప్రభావము రమారమి నూట ఏబది సంవత్సరములు ప్రపంచము మీద వ్యాపించెను. మార్క్సు కూడ ఆయన సిద్ధాంతమును మార్చి స్వీకరించెను.

కాని హేగెలువాదము ప్రత్యక్ష ప్రాధాన్య వాదులకు నచ్చలేదు. బుద్ధి స్వభావమును గ్రహించినను ప్రపంచ స్వభావమును గ్రహింపలేము. ప్రత్యక్షము, ప్రత్యణాధారమయిన అనుమానము అవసరములు. జడద్రవ్య స్వభావము భౌతిక విజ్ఞానము వలనను, జంతు స్వభావము జంతుశాస్త్రము వలనను, మనఃస్వభావము మనశ్శాస్త్రమువలనను, ప్రత్యక్షమును, అనుమానమును, యంత్రములను (instruments of knowledge) ఉపయోగించియు తెలిసికొనవలెను. బుద్ధిమీద మాత్రము ఆధార పడుట వ్యర్థము. అందుచేత సత్యాన్వేషణకు సత్తాన్వేషణకు వేరువేరు విధానములను కలుగ జేసికొనవలెను. ఈశ్వరా న్వేషణ కూడ అట్టి విధానములనే ఉపయోగించి సాగించవలెను. విజ్ఞానశాస్త్రములను (sciences) ఇందుకొరకు ఉపయోగించుకొనవలెను. ఇట్లు ప్రస్తుతపు దార్శనికులలో ఎక్కువమంది అభిప్రాయపడుచున్నారు.

కాని ప్రకృతిశాస్త్రములకు (Natural Sciences) కూడ సత్తాన్వేషణ ఆవశ్యకము. కార్యకారణవిధానము అసత్యమైనచో ఏ శాస్త్రము పనిచేయలేదని ఇదివరకే సూచింపబడినది. ప్రతి శాస్త్రము తాను పరిశోధించు వస్తువునకు కారణము కని పెట్టును. ఇదియే దాని నిర్వచన పద్ధతి (method of explanation). నిజముగా కార్యకారణ భావమునకు సత్త లేనిచో శాస్త్రము నిష్ప్రయోజన మగును. ఉన్నచో దానిని సమర్థించుట ఎట్లు ? తత్తచ్ఛాస్త్రజ్ఞులు ఈ సమర్థనము చేయక పోయినను సత్యమని స్వీకరించియే తమ పని చేయుదురు. కానీ సత్తాశాస్త్రము, కార్యకారణ భావము సత్యమా అసత్యమా అను దానిని రూఢిచేయును. అటులనే కర్మ సత్యమా అసత్యమా? అసత్యమైనచో ధర్మశాస్త్రము నిర్మూలమగును. అటులనే మానవబహుత్వము సత్యమా అసత్యమా ? అసత్యమైనచో సంఘశాస్త్రములు (Social Sciences) నిర్మూలము లగును. సత్యమైనచో నేను చూచు వాడు నా సజాతి జీవుడని నేను ఎట్లు గ్రహింపగలను? ప్రత్యక్షముగా అతని ప్రాణమును గాని, మనస్సునుగాని చూడలేను. నాకు కనుపించునవి అతని రంగు, ఆకృతి అనుమానమును పురస్కరించుకొని అతడు పురుషుడనుటకు వీలులేదు. ఏలన అనుమానమునకు ప్రత్యక్షము ఆధారము. ప్రత్యక్షముగా ఎక్కడైన ఇతరుల మనస్సు నేను చూచిఉండవలెను. కాని ఎక్కడను ఇది అసంభవము. నిరాధారమైన అనుమానము ఇతర మానవస త్తను ఎట్లు స్థాపింపగలదు? విజ్ఞానశాస్త్రములకు మూలభూతములైన యీ ప్రశ్నలన్నియు తత్త్వశాస్త్రము విమర్శింప వలయును.

వర్తమాన యుగమున జడద్రవ్యము నిశ్చలముకాదని స్థిరీకరింపబడినది. మూలసత్త జడము కాదని, అది చైతన్యోపేతము, ఉత్తేజస్సంకలితము అయిన ప్రాణరూపమని (life), అదియే కాలము (time) అని, బెర్గ్ సను బోధించెను. దానిస్వరూపము పరిణామిత్వము కాదు, పరిణామమే. అనగా, పరిణమించే వస్తువు ఒకటి, దాని పరిణామము వేరొకటి. బెర్గ్ సను మతానుసారము మూలసత్త ఒక వస్తువు యొక్క పరిణామము కాదు.పరిణామ స్వరూపమే. దానిస్వరూపము స్వభావముకూడ పరిణామమే. అది ఏదైనా ఒక ఆకృతి (pattern) స్వీకరించి నప్పుడు, ఆ యాకృతికి మనము ఒక పేరు పెట్టి ద్రవ్యము (substance) అని అందుము.

బెర్గ్ సను వాదములోని ఈ పరిణామమాత్ర భాగమునే వైజ్ఞానిక తత్త్వజ్ఞులు (Scientific Philosophers) స్వీకరించిరి. ఐన్ స్ట్తేను అను భౌతిక గణితశాస్త్రవేత్త, కాలము దిక్కు వేరువేరు తత్త్వములు కావనియు, దిక్కాలమనునది space time ఒక టే తత్త్వమనియు,నిరూపించెను దానినుండియే ప్రపంచము ఉద్భవించినదని అలెగ్జాండరు వాదించెను. దిక్కాలము నుండి జడద్రవ్యము, జడద్రవ్యము నుండి ప్రాణికోటి, ప్రాణికోటినుండి చిత్తవంతములను (mental-beings) చిత్తవంతముల నుండి సర్వేశ్వరుడు ఉద్భవించుట - ఇది దిక్కాలము యొక్క పరిణానుకృత్యమని ఆయన మతము. లాయడ్ మార్గము కొంచము అదేవిధముగా భోధించెను. ఈయన జడద్రవ్యముతో ప్రారంభించును. ఈశ్వరుని కూడ మొదటనే పెట్టి, అతనిని జడ ద్రవ్య పరిణామమునకు ప్రేరకునిగా భావించును. వైటు హెడ్డు కూడ కొంచము ఈ మోస్తరు పరిణామము నే స్వీకరించెను. ఈయన అధునాతన సత్తాశాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు. గొప్ప గణితశాస్త్ర వేత్త. మూలసత్త అనునది ఘటనా సమూహము (events). అది మానవదృగ్గోచరము కాదు; అనుమేయము. ఈ ఘటనలు (events) ఒక సంప్రదాయమును, ఒక ఆకృతిని అనుసరించినచో స్థాయి ద్రవ్యము ఉద్భవించును. మన పూర్వకాలికులు చెప్పిన పరమాణువులు ఘటనాసమూహములు. అవి అవిభాజ్యములు కావు; అవి భేద్యములు కావు; అవి భాజ్యములు; అవి భేద్యములు; క్షణికములగు ఘటనలు మాత్రమే. ఈశ్వరుడు వీటిని సంఘములుగాను, సంప్రదాయములు గాను ప్రవాహాకృతిని పొందుటకు ప్రేరేపించును. . ఈ ప్రేరణవల్ల దృశ్య జడపదార్థములు, ప్రాణులు, చైత్యములు ఉద్భవించును. ఇవి అన్నియు ఈ ఘటనాప్రవాహములు ధరించిన ఆకృతి రూపములు, ఘటనలు అన్నియు అనేక విధములుగా పరస్పర సంబద్ధములు. ఈ ఆకృతులు కూడ అనంత విధములు. ఘటనలకు ఆకృతికారకుడు ఈశ్వరుడు. ఆకృతులన్నియు నిత్యవస్తువులు (exteranal objects); ఈశ్వరుని బుద్ధిరూపములు ( Conceptual forms); ఆయన బుద్ధిస్వభావసంఘటితములు. ఘటనలు నిరాకారములు అయినప్పుడు ఈశ్వరుడు కేవలము బుద్ధి స్వరూపమున ఉండును. ఆకృతులకు అప్పుడు సత్త ఉండదు. ఘటనలకు మాత్రమే సత్త ఉండును. ఘటనలు ఆకృతులను స్వీకరించినప్పుడు, ఆకృతులకు కూడ సత్త చెందును. మనము ద్రవ్యము అని పిలుచునది ఘటనల యొక్క ఒక ఆకృతి. ఈ ఆకృతులకు సత్త కలిగినప్పుడు ఈశ్వరునికి కూడ సత్త కలుగును. అందుచేత ఈశ్వరునికి రెండు భావములు : కేవల బుద్ధిభావము, సత్తా భావము (conceptual and actual) అని.

పాశ్చాత్య దర్శనములందు సత్త పరిపరి విధముల నిర్వచింపబడినది. కొందరిచే కేవలము ఈశ్వరస త్తతో ప్రారంభించి మానవస త్త జడసత్త నిర్వచింపబడినవి. అధునాతనులచే జడసత్తతో ప్రారంభించి, మానవసత్త ఈశ్వర సత్త నిర్వచింపబడినవి. ఈ రెండు రీతులయందు మానవ సత్త తన ప్రాముఖ్యమును కోల్పోయినది. అందుచేత ధర్మ శాస్త్రమునకు హానికలిగినది. ఈశ్వరస త్తను స్వీకరించుట గాని, నిరాకరించుటగాని మానవుడే తన బుద్ధివలన చేయ వలెను. అటులనే జడస త్తను స్వీకరించుటగాని, నిరాకరించుటగాని మానవునిదే. కనుక ధర్మశాస్త్ర ప్రారంభమునకు మానవుడు మూలమని, కేంద్రమని, చెప్పవచ్చును. ఈశ్వరస త్తను స్వీకరించి, తత్సాక్షారమునకు ప్రయత్నము చేయునది”మానవుడు. ఈశ్వరుడు నిత్య సంపూర్ణ స్వరూపుడై నందున అతనికి ప్రయత్నా ప్రయత్నములు, కోరికలు, మనోరథము యొక్క సఫలత్వ విఫలత్వములు లేవు. కనుక ధర్మశాస్త్రములు, విజ్ఞాన శాస్త్రములు మానవునికొరకు ఉద్దిష్టములు. మానవుడే అప్రధానుడైనచో ఈ శాస్త్రములన్నియు నిరర్థకములు. జడసత్త మానవునకు అనుకూలముగా నున్నను, ప్రతికూలముగా నున్నను ఉదాసీనతయే. ప్రపంచకము సార్థకమైనచో దాని సార్థకత మానవాపేక్ష చేతనే కలుగును.ఈశ్వర దృష్టిచే ప్రపంచమునకు సార్థకత నిరర్థకత అనునవి లేవు. జడదృష్టిచే కూడ అవి లేవు. అందుచేత ఏ సత్తా శాస్త్రమైనను ప్రథమమున మానవుని జీవనమును, కర్మమును నడవడిని, ధర్మమును, వీటి సార్థకతను చూపవలెను. ఈ అభిప్రాయమునకే ఇప్పుడు ప్రపంచమున ప్రాధాన్యము లభించుచున్నది.

డెకార్టు చెప్పినట్లు మానవుడు సర్వమును సంశయింపగలడు. కాని తన సత్తను సంశయింపలేడు. తాను అనిత్యుడు మర్త్యుడు అయినను అతని సత్తయే ప్రథమమున నిశ్చయ వేద్యము ; అనిరాకరణీయము, బుద్ధిని ఉపయోగించిన కొలది తన సత్త, తన దేహ పరిమితమే గాక తనను అతిక్రమించి ఉన్నట్లు మానవుడు తెలిసికొనును. ఇది సంకుచితముగాని ప్రతిబుద్ధికి వేద్యము. ఈ అతిక్రమణ (Transcendence) విధాన మెట్టిదో తెలిసికొనుట సత్తాశాస్త్రము యొక్క ఒక ముఖ్య విషయము. ఈ అతిక్రమణమును అంతఃక్రమణముగా చేయు విధానమే ధర్మము. తదనుకూల ప్రవర్తనమే ధర్మ ప్రవర్తనము. తదనుకుల జీవనమే జీవన వికాసము. ఈ వికాసమునకు ఈశ్వర సాక్షాత్కారము అంతిమకోటి. ఇట్లు మానవ జీవనమునకు, ధర్మమునకు, కర్మకు ప్రాధాన్యము ఇచ్చిన సత్తాశాస్త్రమే సత్యము కాగలదు. తక్కినవాటి సత్యాసత్యములు నిరూపించుట వ్యర్థ ప్రయత్నము. సత్తాశాస్త్రములలో పరస్పర వైరుధ్య ముండుటచే అన్నియు సత్యములు కాజాలవు. అయినచో ఒక్కటియే సత్యము కాగలదు. సత్యము ఏక స్వరూపము. అసత్యములు అనంతములు. రెండు రెండు కలిసిన ఎంతవచ్చును ? అను ప్రశ్నకు నిజమైన ఉత్తరము ఒక్కటియే. తప్పులు అనంతములు. నాలుగుసంఖ్య తప్ప తక్కిన సంఖ్యలు అన్నియు తప్పు జవాబులు. అటులనే ధర్మశాస్త్రములు, సత్తాశాస్త్రములు. వాటిలో సత్యము లెవ్వియో సత్యేతరము లెవ్వియో భగవంతునకే ఎరుక. మానవుడు తనబుద్ధిని ఉపయోగించి సత్యమును తెలిసికొనుటకు సర్వ ప్రయత్నములు అనేక శతాబ్దులనుండి చేయుచున్నాడు. కొంచెముకొంచెముగా అతని ప్రయత్నములు సఫలములు కూడా అయినవి. అయినను పరసత్త ఎట్టి స్వభావము కలదియో నిర్ణయింపగలుగుదాక తన జీవితమునుగాని,కర్మనుగాని, అతడు ఆపలేడు. కావున ఈ రెండింటిని ప్రథమమున స్వీకరించి దర్శనశాస్త్రము నిర్మించవలసి యుండును.

సత్తాశాస్త్రమును ప్రస్తుత కాలమున దర్శనశాస్త్రమునకు పర్యాయముగా కూడ వాడుట కలదు. సర్వ ప్రపంచమునకు సామాన్య సత్తాస్వరూపము ఎట్టిదో తెలిసికొనుటకంటె వేర్వేరు సత్తల స్వరూపము తెలిసికొనుట సులభము. కనుక తత్త్వశాస్త్రము ప్రపంచశాస్త్రము (cosmology) సత్తాశాస్త్రము (ontology) పురుషార్థశాస్త్రము (philosophy of values) మత విజ్ఞానము (philosophy of religion) మొదలగు శాఖలుగా విభజింపబడినది. అన్నిటియందును సత్తా విషయక ప్రశ్నలు ఎత్తుకొనబడును.

పి. టి. రా.

[[వర్గం:]] [[వర్గం:]]