సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవులు
అడవులు :—1. ఉపోద్ఘాతము :- సాంకేతికముగా 'అడవి ' అనగా అతి సూక్ష్మమగు ఉద్భిజ్జము మొదలుకొని అత్యున్నతమగు వృక్షములవరకు వివిధ పరిమాణ భేదములతో కూడికొనియున్న జీవ ప్రపంచపు సంఘము అని వర్ణింపబడుచున్నది. కాని దానికిగల సామాన్యభావమునకే ఈ దిగువ వ్యాసమునందు ప్రాధాన్య మీయబడుచున్నది.
"అడవి” “అరణ్యము” అనబడుచున్న వృక్ష సంఘముల పెరుగ పరిణామములు ఒక ప్రదేశము యొక్క శీతోష్ణముల మీదను, భూగర్భ సంబంధమగునవియు, నేల యొక్కయు స్థితిగతులమీదను ఆధారపడి యుండును. ఉష్ణోగ్రత, వర్షపాతము, నేలలు వీనిలోని భేదముల ద్వారా స్థితిగతులలో కలుగు మార్పుల ఫలితముగ. ఉద్భిజ్జ జాతిలో మార్పు లేర్పడును. పై కారణములు మార్పు లేక ఒక స్థితియందున్నపుడు ఆ ఉద్భిజ్జ జాతిలో సామరస్య మేర్పడును. బాహ్యకారణములు, ముఖ్యముగా మానవుడు జోక్యము కలుగజేసికొన్నచో దానికి భంగము కలుగును.
నేటి ఉద్భిజ్జ జాతి అతి ప్రాచీన యుగములలో (Geological ages) నున్న ఉద్భిజ్జముల సంతానమే యని శిలారూప జీవపరిశీలన వలన తెలిసినది. ఊర్ధ్వ మత్స్య యుగపు శిలారూప జీవముల (Upper Domain Fossils) వలన అప్పటి ఉద్భిజ్జ జాతికిని నేటి ఉద్భిజ్జ జాతికిని చాల వ్యత్యాసమున్నట్లు తెలియుచున్నది. తక్కినవానితో పాటు దేవదారు (Coniferous) జాతి మొక్కలలో మొదటిరకములు అంగారయుగము (Carboniferous period)లో చక్కగా పెరిగినవి. గట్టి దారువుగల మొక్కలు ఖటీ యుగము (Cretaceous period) లో నున్నవి. కాని, నేటి జాతులను బోలిన మొక్కలు తృతీయ యుగము(Tertiary period) లో నున్నవి.
జంతుజాతీవలెనే ఉద్భిజ్జజాతికూడ మొదట ఉత్పత్తియై, తరువాత అభివృద్ధిచెంది, అటుతరువాత కాలము గడచిన కొలది పరిణామమున వివిధ రూపములను బొందును. ఉద్భిజ్జములలోను, వాని జాతులలోను గల ఈ వివిధ భేదములను బట్టి వివిధ మండలము అగుపడుచున్నవి. ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి ఒత్తిడి, నేలలు, అక్షాంశములు, ఎత్తు అనువానిపై ఆధారపడి ఆయా మండలములలో వేరు వేరు పారస్థిక (Ecological conditions), బాహ్యస్థితిగతులు ఏర్పడుచున్నవి.
2. ప్రపంచవ్యాప్తి - వివిధ శీతోష్ణ పరిస్థితులు, వానితో గూడిన వర్షపాతములు ఎట్లు వ్యాప్తిచెందియున్నవో దానికి అనుగుణముగా వివిధ తరగతుల అరణ్యముల వ్యాప్తియుండును. అనగా ఒక్కొక్క రకపు శీతోష్ణ పరిస్థితులలో ఒక్కొక్క లక్షణముగల అరణ్యముండును. ఇట్టి అరణ్యములు సహజమగు ఉద్భిజ్జజాతి. మానవుని జోక్యముగాని, మార్పుగాని లేకున్నచో ఆ ఉద్భిజ్జములు ఉష్ణోగ్రత, వర్షము, నేల విని యొక్క పరస్పర క్రియల ఫలితముగా పెరుగును. అరణ్యముల స్థూలవర్గీకరణము, వ్యాప్తి ఈ దిగువ నీయబడినది:- (అ) 'సెల్వాలు' అనబడు భూమధ్య రేఖాప్రాంతపు సదాహరితారణ్యములు భూమధ్యరేఖ పొడవున నున్న వర్షపాత మండలములో నున్నవి. సంవత్సరమునకు 80 అంగుళములకు మించి వర్షపాతముగల ఋతుపవన ప్రదేశములలో గూడ అవి యుండును. అచట సంవత్సరము పొడుగునను సూర్యరశ్మి బాగుగానుండును. గాలి, నేల ఎప్పుడును తడిగా నుండును. ఆ అరణ్యములు పొడవైనవి. పొట్టివియగు వేలకొలది రకముల మొక్కలతో దట్టముగా, ఏపుగా పెరుగును. అవి భూమధ్య రేఖా ప్రాంతమందంతటను ఉన్నను అమెజాన్, కాంగోపరీవాహ ప్రదేశములలోను, భారత దేశము, సింహళము, మలయా, ఈస్టు ఇండీస్, బర్మాలోను ఉన్న అడవులు అత్యుత్తమ మైనవి. రబ్బరుచెట్లు, సింకోనా, కోకో, మానియోక్, కొబ్బరి చెట్లను కలిగియుండుటచే నివి చాల ముఖ్యమైనవి. భారతదేశపు ఋతుపవనారణ్యములనుండి వర్తకమునకు పనికి వచ్చు కలప, ముఖ్యముగా టేకు సాలవృక్షములనుండి లభించును. 40 అంగుళములకు తక్కువ వర్షపాత మున్నచోట్ల అడవులు కొంచెము పలుచగను, కొట్టివేయుటకు సులభముగను పెరుగును. వీటియందు కలప నిచ్చు వృక్షములు, వెదురు, తాడి, తృణధాన్యములు, వరి, ప్రత్తి, కొన్ని పర్వతపు వంపులందు తేయాకు, కాఫీ లభించును. ఆహార ధాన్యపు పైరులను పెంచుటకు ఈ ప్రాంతము చాల అనుకూలముగ నుండును. అందువలను అచట జనసంఖ్య ఎక్కువగానుండును.
(ఆ) వెచ్చని సమశీతలారణ్యములు ఋతుపవనారణ్యములను ఇంచుమించు పోలియుండును. కాని వేరురకముల వృక్షములు కలిగియుండును. ఆహారసంబంధమగు పైరులను సేద్యము చేయుటకొరకు పెక్కు ప్రదేశములలో నున్న అరణ్యములు చాలా కాలము క్రిందటనే కొట్టివేయబడినవి. వీటిలో 5 ముఖ్యమగు ప్రదేశము లున్నవి -(1) రొంపినేలలో మాత్రమే అరణ్యములు గల ప్రాంతములు, విశాలమగు ప్రత్తినేలలు, మొక్కజొన్న నేలలుకల అమెరికా సంయుక్త రాష్ట్రములోని ఆగ్నేయ భాగము, (2) విలువైన కలపనిచ్చు అరణ్యములుగల బ్రెజిల్ లోని దక్షిణ భాగము. (3) చెరకు, మొక్కజొన్న పైరు చేయుటకు అరణ్యములను నరకి వేసిన దక్షిణాఫ్రికా లోని నేటాలు. (4) మధ్య చైనా, ఉత్తర చైనా. (5) యూకలిప్టను అరణ్యములకు ప్రాముఖ్య మొందిన ఆస్ట్రేలియాలోని తూర్పు భాగము.
(ఇ) చల్లగానుండి, ఆకురాలు సమశీతలారణ్యములు చల్లగా సమశీతలముగానున్న ప్రదేశములలో చలినుండి రక్షించుకొనుటకై శీతకాలమున వృక్షముల ఆకు రాలును. అందుచే వాటికి ఆకురాలు వృక్షములని పేరు. ఓక్, ఎల్మ్. బీచ్, బర్చ్, పేపుల్ అను వృక్షములు విలువైన కలప నిచ్చును. ఇట్టి వృక్షములుగల అరణ్యములు ఉత్తర యూరప్ , అమెరికా ఈశాన్య భాగములో, మంచూరియాలో కలవు. గోధుమ, బార్లీ, రై, మెదలగు ఆహారధాన్యపు పైరులను పెంచుటకొరకు ఈ ప్రదేశములలో మొదటనున్న ఉద్భిజ్జజాతి నరకి వేయబడినదను విషయము గమనించతగినది.
(ఈ) చల్లని సమశీతల కోనిఫరు అరణ్యములు :- కోనిఫరు వృక్షములు ఎక్కువ చలిప్రదేశములలో పెరుగును. అందుచే, మంచునుండి కాపాడుకొనుటకును, బాష్పోత్సేకమును తగ్గించుకొనుటకును, వాటిపత్రములు సూదులవలె నుండును. ఆవృక్షములు మెత్తని దారువు కలిగి, కాగితపు పరిశ్రమలకు చాల ఉపయోగపడును. ఉత్తరార్ధగోళము యొక్క ఉత్తరపు సరిహద్దులయందును, మధ్య యూరప్ (జర్మనీ, స్విట్జర్లాండు, కార్పేధియన్సు) పర్వతములలోగల ఉన్నత ప్రదేశములయందును, న్యూజీలాండు, టాస్మేనియా, ఆస్ట్రేలియాలలో ఆగ్నేయభాగములందుగల పర్వత ప్రదేశములయందును కోనివరు అరణ్యములు విస్తృతముగానున్న భాగములు వరుసగా గలవు. ఈ ప్రదేశములలో నివసించు ప్రజల కార్యకలాపములు అరణ్యములతో సంబంధించియుండును.
(ఉ) మిక్కిలి ఎత్తయిన (ఆల్పైన్) ఉద్భిజ్జజాతి :- భూమధ్య రేఖనుండి గల దూరమునుబట్టి ఉష్ణోగ్రతలు, వర్షపాతము నేలలు ఎట్లు మార్పుచెందునో, అట్లే అవి పర్వతపార్శ్వములందు భూమట్టము నుండి గల ఎత్తునుబట్టి కూడ మారుచుండును. అందుచే ఉన్నత పర్వతశ్రేణులలో క్రిందినుండి శిఖరమువరకును పైన చెప్పిన తరగతుల అరణ్యములన్నియు ఉండవచ్చును. పర్వతపార్శ్వములందు అరణ్యము లిట్లు మాండలికముగ వ్యాప్తిచెందుట ' ఆల్పైన్ వ్యాప్తి' అనబడును. హిమాలయ పర్వతములను ఆరోహించినచో స్పష్టముగ చూడనగును.
3. భారతదేశ మందలి అరణ్యముల రకములు :- శీతోష్ణస్థితులకు కారకములగు ఉష్ణోగ్రత, ఆర్ద్రత అనునవి నేలల అభివృద్ధికిని, తత్ఫలితమగు ఉద్భిజ్జ నివాసమునకును ముఖ్యమగు కారణములు. ఈ దేశములో నున్న వివిధ ఉద్భిజ్జ జాతులు, వృక్షశాస్త్ర దృష్ట్యా ఈ దిగువ ప్రత్యేక లక్షణములు గల ప్రదేశములుగా విభజింపబడినవి -
1. తూర్పు హిమాలయము, 2. పశ్చిమ హిమాలయ ప్రదేశము, 3. సింధు మైదానము, 4. గంగా మైదానము, 5. పశ్చిమ సముద్రతీరము, 6. దక్కను.
ఈ ప్రదేశములలో నున్న అరణ్యముల రకములు, వాటి వ్యాప్తి ఈ దిగువ నీయబడినవి :-
(1) ఉష్ణమండలస్థ సదాహరితార్దారణ్యము :- ఇది ఛత్రాకారముగ విజృంభించిన సదాహరితములగు మధ్యో దిృదములతో (Mesophytes) ఎత్తుగా, దట్టముగా నున్న అరణ్యము పడమటి కనుమల యొక్క పశ్చిమ ముఖము నను, అస్సాంలో ఊర్ధ్వభాగమున నైరృతిమూల నుండి కాచార్ గుండా దక్షిణమున చిట్టగాంగు పర్వత ప్రదేశముల గుండా వ్యాపించిన పీలిక యందును ఇట్టిది కలదు.
(2) ఉష్ణమండల సదా అర్ధహరితారణ్యము :-ఇది ఆకురాలు జాతులు, స్వల్పకాలము పత్రరహితముగనుండు సదా హరితములును కలిసియున్నది. పడమటి కనుమలలో నున్న ఉష్ణమండల సదాహరితారణ్యమునకు ప్రక్కను, తూర్పుహిమాలయముల క్రింది వాలులందును ఇట్టి అరణ్య మగపడును.
(3) ఉష్ణమండలపు చెమ్మగల ఆకురాలు అరణ్యము :- (ఇది ఆకురాలు వృక్షములే ప్రముఖముగను, సదాహరితములు స్వల్పముగను గలది.) దీనికి ఋతుపవన మండలారణ్యమని కూడ పేరు. ఇది భారతదేశపు టరణ్యలక్షణములకు చక్కని ఉదాహరణము. హిమాలయ పాద ప్రదేశమందును, పడమటి కనుమలలో తూర్పు దిక్కునను, ఛోటా నాగపూర్ లొ కొన్ని భాగములందును, ఖాళీ పర్వతములలో గాలి మరుగుదిక్కునను, ఇట్టి అరణ్యము కలదు.
(4) ఉష్ణమండలపు పొడియయిన ఆకురాలు అరణ్యము :- (ఇది ఇంచు మించు సంపూర్ణముగా ఆకురాలు ఎత్తుగాని వృక్షములు గల అరణ్యము.) ఇది భారతదేశము యొక్క మధ్యభాగమున ఉత్తర దక్షిణముగా హిమాలయ పాద ప్రదేశమునుండి కన్యాకుమారి అగ్రమువరకును వ్యాపించి యున్నది. ఇచట 40 అం. లు మొదలు 50 అం. ల వరకు వర్షము పడుటయు, 6 నెలలు వానలు లేకుండుటయు ప్రత్యేక లక్షణములు.
(5) ఉష్ణమండలపు కంటకారణ్యము :- ఇందు తక్కువ ఎత్తుగల చెట్లుండును. ఇది దట్టముగా నుండదు. ఇందలి వృక్షములు వేడిమిని కానలేమిని తట్టుకొన గలిగి యుండును. ఇందుగల వృక్షములు ముండ్లుగలిగి ప్రధాన ముగా కాయధాన్యముల జాతికి చెందినవై యుండును. ఇట్టి అరణ్యము దక్షిణపంజాబులో సింధు పరీవాహ ప్రదేశమందును, రాజపుత్రస్థానములోను, సింధులోను 10 అం. మొదలు 30 అం.ల వరకు వర్షపాతము కలిగి యుండును. ఊర్ధ్వ గంగా మైదానమందును, దక్కను పీఠభూమి యందును ఇట్టి అరణ్యము కలదు.
(6) తడిలేని ఉష్ణమండల సదాహరితారణ్యము :- (ఇందు చిన్న ఆకులు, ముండ్లు కల ఉద్భిజ్జములు ఎక్కువగా నుండును.) ఇట్టి అరణ్యము కర్నాటక సముద్ర తీరమున కనబడును.
(7) ఉప-ఉష్ణమండలపు ఆర్ద్ర పర్వతారణ్యము :- (ఇది ఎత్తుగా, బాగుగా పెరిగిన సదాహరితవృక్షములతో కూడిన అరణ్యము). హిమాలయముల క్రిందివాళ్ల యందును. బెంగాలు నందును, అస్సాములోను, ఖాళీ, ఉదక మండల, మహాబలేశ్వర పర్వతపంక్తులపైని ఇట్టి అరణ్యమగపడును.
(8) ఉప-ఉష్ణమండలపు' పైను చెట్ల అరణ్యము :- (ఇది సదాహరితములయినట్టి గాని, హరితములు కానట్టి గాని సులభముగా కాలునట్టి వృక్షములతో పలుచగానుండును.) ఇట్టి అరణ్యము, మధ్య, పశ్చిమ హిమాలయములలో, ఖాళీపర్వతములలో 3000 అడుగుల ఎత్తునుండి 6000 అడుగుల ఎత్తువరకు ఉండును.
(9) పొడియైన ఉప ఉష్ణమండలసతతహరితారణ్యము :- (ఎండ వేడిమిని, వానలేమిని తట్టుకొనగల (xerophytic) ముండ్లజాతులు, చిన్న చిన్న ఆకులుగల 'ఆలివ్' వంటి సతత హరితములు ఇది కలిగి ఉండును.) ఇది భారతదేశమున వాయవ్య భాగమున నున్నది.
(10) ఆర్ద్ర సమశీతలారణ్యము :- (ఇది క్రిందిభాగమున దట్టముగా పెరిగిన ఉద్భిజ్జములతో సదాహరితము, అర్ధ సదాహరితములు గల మిశ్రారణ్యము.) తూర్పు హిమాలయములలో 6,000 అడుగుల నుండి 9,500 అడుగుల వరకు గల భాగమందును, దక్షిణ భారత దేశములో పర్వత శిఖరములపై నను ఇట్టి అరణ్యము లగపడును.
(11) చెమ్మగల సమశీతలారణ్యము :- (సూచీముఖ వృక్షజాతి (కోనిఫరు) మరియు ఓక్ వృక్షములతో సదా హరితములు, క్రింది భాగమున ఆకురాల్చు ఉద్భిజ్జము లుండును.) మధ్య హిమాలయములు, పశ్చిమ హిమాలయము లందు 40 అంగుళములకు మించి వర్షపాతమున్న ప్రదేశములలో ఇట్టి అరణ్యము లుండును.
(12) తడిలేని సమశీతలారణ్యములు :- దేవదారు, పైన్, జ్యూనిపెర్ వృక్షములును, విశాలమగు ఆకులుగల వేడిమిని వానలేమిని తట్టుకోగల (xerophytic) వృక్షములును ఉండును.) హిమాలయ పర్వతముల లోపలి పంక్తు లలో నిట్టి అరణ్యముండును.
(13) “ఆల్పైన్" (alpine) అరణ్యము :- సదాహరితములగు 'కోనిఫరు' వృక్షములు, ఎత్తు తక్కువ, విశాల మగు ఆకులు గల వృక్షములు ఉండును.) 10,000 అడుగులకు మించిన ఎత్తులో 'కలపహద్దు' వరకు హిమా లయములం దంతటను ఇట్టి అరణ్య మగుపడును.
14. ఆంధ్రదేశములోని అడవులు :- ఈ రాష్ట్రము ఉష్ణమండలములో నున్నది. ఈశాన్య ఋతుపవనముల వలన ఇచట కొన్ని తావులలో వర్షము కురియును. తూర్పు కనుమలలో ఇంచుమించు 40 అంగుళముల వర్షము కురియును. పడమట తెలంగాణాయందు 20 మొదలు 30 అంగుళముల వరకు వర్షపాతముండును.స్థూల వర్గీకరణమున ఆంధ్రరాష్ట్రపు టడవులు ఋతుపవనారణ్యముల తరగతికి చెందును. అవి ఆకురాలు లక్షణముగలవి. పశ్చిమ భాగములలో ఆకురాలునట్టివి, ఉష్ణమండలపు ముండ్లతో గూడినట్టివి మిశ్రారణ్యములుగా నుండును, సముద్ర తీరమున నున్న రొంపి నేలలో, ముఖ్యముగా గోదావరీ, కృష్ణా ముఖద్వారములందు గొప్ప సముద్రపు పోటులకు, ఉప్పునీటికి తగియున్న వాయు శిఫలు (mangroves) పెరుగును.
ఆంధ్రరాష్ట్రమున నున్న అడవులను భౌగోళికముగా ఈ క్రింది తరగతులుగా విభజింపవచ్చును.
అ) గోదావరి లోయలోనున్న అడవులు చక్కని మురుగుపారుదల గలదియు, సారవంతమైనదియు, చాల లోతువరకు మెత్తని మట్టిగలదియు నగు నేలలో పెరుగును. అచటి వృక్షములలో టేకు ముఖ్యమైనది. అది 60 అడుగులు మొదలు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగును. కొంచెము మరియొక రకపు అడవి తడిలేని, లోతులేని వండు నేలలలో పెరుగును. అచటి టేకు వృక్షములు 25 మొదలు 50 అడుగుల వరకు పెరుగును.
(ఆ) కృష్ణానది లోయలోని అడవులలో ఏపి, చిరుమ్రాను, అబ్నస్ (Abnus), నల్లమద్ది వృక్షములు ముఖ్యమైనవి. ఈ అడవులు విడివిడిగా లోతులేని ట్రాపియన్ (Trappean) ప్రదేశముల యందు పెరుగును. కాని ఇసుకరాతి ప్రదేశములలో విస్తారముగా వ్యాప్తిచెందును.
(ఇ) తూర్పు కనుమలలో నున్న అడవులలో పలు రకముల వృక్షము లుండును. వానిలో టేకు, వెదురు, కాగితపు గుజ్జుకొరకు పనికివచ్చు ఇతరమైన రకములు ఉండును.
(ఈ) డెల్టాలలో రొంపిగానుండు సముద్ర తీరములలో 'వాయుశిఫలు' అను జాతి (Mangrove) అడవులు పెరుగును. వృక్షములు చాలవరకు వంట చెరుకుగా ఉపయోగపడును.
5. అరణ్య సంబంధమగు పదార్థములు : అరణ్య ప్రదేశములలో దొరకు అన్ని రకముల జంతు, వృక్ష, ఖనిజ పదార్థములు ఉప అరణ్య పదార్థములు, ఇందు దొరకును. కలప, వంటచెరుకు, ముఖ్య పదార్థము. భారతదేశపు ఉప - అరణ్య పదార్థములను ఈ క్రింది తరగతులుగా విభజింపవచ్చును :
1. నార, పీచు : చేవగల చాల జాతుల యొక్క నార పొరనుండి నారలు లభించును. వానిలో కొన్నిటినుండి త్రాళ్ళు పేనుటకు వీలుగా పొడవుగల బలమైన నార లభించును. కొన్నిటినుండి నేతపనుల కుపయోగించు పట్టు మాదిరి సన్నని పోగులు దొరకును. ఆయా జాతులను బట్టి నారను తయారుచేయు పద్ధతులు చాలవరకు వేరుగా నుండును. కాని పోగులను ఒకదాని నుండి మరియొక దానిని వేరుచేయు పద్ధతి “రెట్టింగు" అనబడును. ఉపయోగకరమగు నారనిచ్చు మొక్కలు స్టెర్క్యూలి యేసీ, టిలియేసి, లెగూమినోసీ, అస్కిపియడేసి, అర్టి కేసీ అను కుటుంబములకు చెందినవి. అనగా జనుపనార మొక్కలు 'లినెన్' అను నార మొక్కలు, 'హెంప్', 'మానిల్లా హెంప్ ' ముఖ్యముగా లభించు అరణ్యపదార్థములు.
పీచు, కపోక్, ఇండియన్ కపోక్ అనునవి అరణ్య వృక్షముల యొక్క ముదుక పట్టువలెనుండు రకములు.
2. గడ్డిరకములు, వెదురు, పేములు :- సన్నబట్ట నేతకు పనికివచ్చు ప్రోగులను (Fibres) ఇచ్చు గడ్డి జాతులు భారతదేశములో లేవుకాని, ఏకులకు, చాపలకు, కాగితపు గుజ్జుకు పనికివచ్చు రకములు చాల ఉన్నవి. కాగితపు గుజ్జు తయారుచేయుటకు ఎంతయో ఉపయోగపడుచు బీహార్, ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, తూర్పు పంజాబు రాష్ట్రముల నున్న 'బైబ్' అనుగడ్డి అన్నిటికంటెను ముఖ్యమైనది. 'ముంజ్' గడ్డి ప్రఖ్యాతి చెందిన ఢిల్లీ చాపలు తయారు చేయుటకు విస్తారముగా నుపయోగపడును. వట్టి వేళ్ళు సువాసన నిచ్చు చాపలు తయారుచేయుటకు ప్రసిద్ధి చెందినది.
వేర్వేరురకముల వెదురు భారతదేశ మందంతటను కనబడును. దాని ఉపయోగములు అందరకు బాగుగ తెలిసినవే, పేము లేక రటన్ అనునది 'పామ్' కుటుంబములో పెక్కు గణములకు చెందిన ఎగబ్రాకు మొక్కల యొక్క కాండములు. వాటిలో క్లారుస్ (Clamus) అను గణము అన్నింటికంటే ముఖ్యమైనది. వీటిని తాళ్ళకు బదులుగా నుపయోగింతురు. ఒక్కొక్కప్పుడు 300 - 400 అడుగుల పొడవుగల పేము బెత్తములను వ్రేలాడు వంతెనలకు ఆధారముగా నుపయోగింతురు. కుర్చీలు, కర్రసామాను, పిల్లల తిరుగుడు బండ్లు, బుట్టలు, జల్లెడలు, చాపలు, త్రాళ్ళు మొదలైనవి తయారుచేయుటకు కూడ వానిని ఉపయోగింతురు.
3. స్వేదనమువలన, కషాయము తీయుటవలన లభించు ద్రవ్యములు :- అడవిగడ్డిజాతులనుండి స్వేదన క్రియవలన లభించు పరిమళ తైలములు 5 ముఖ్యమైనవి భారతదేశమున గలవు - పామరోజా లేక జిరేమియంతై లము, నిమ్మగడ్డి నూనె, నింబతైలము, అల్లపుగడ్డినూనె, వట్టి వేరు తైలము, చందన తైలము, అగరు నూనె, దేవదారు తైలము, ఆయావృక్షముల దారువులనుండి లభించును.
కర్పూర తైలము, యూకలిప్టసు తైలము, దాల్చిన తైలము, వింటర్ గ్రీన్ తైలము అనునని ఆయాపత్రములనుండి లభించువానిలో ముఖ్యమైనవి. వింటర్ గ్రీన్ తైలము తక్క మిగిలినవి చాల ప్రసిద్ధములైనవి. వింటర్ గ్రీన్ తైలము నుండి సాలిసిలికామ్లము కార్బాలికామ్లము తయారుచేయవచ్చును. 'ఆస్పిరిన్' అనుదానిని సాలిసిలిక్ఆ మ్లము నుండి తయారుచేయవచ్చును.
4. నూనెగింజలు : - అవిసె, నువ్వులు, ఆవ, రేప్ (Rape) వంటి నూనెగింజలు చాలవర కిప్పుడు క్షేత్ర సస్య ములుగా పైరుచేయబడుచున్నవి. అమెరికా, యూరప్ బజారులలో భారతదేశపు అరణ్యలబ్ధమగు చౌత్ మూగ్ర తైలము కుష్ఠు చర్మవ్యాధులకు ముఖ్యమైన ఔషధముగా అమ్మబడుచున్నది. 'సేపియం సాబిఫెరమ్ ' అను వృక్షమునుండి లభించు తెల్లనిమైనము చైనాలో సబ్బులు, క్రొవ్వు వత్తులు చేయుటకు ఉపయోగ పడుచున్నది. 'జపాను మైనము' అనునది దీనిలో మరి యొక రకము.
5. రంగులు, అద్దకములు : తుమ్మ, తంగేడు, సాల వృక్షముల యొక్క పట్టనుండి రంగులు తయారు చేయు దురు. వీనిలో తుమ్మపట్టరంగు అన్నిటికంటే ముఖ్యమైనది. భారతదేశ మందంతటను ఇది ఉపయోగములో నున్నది. మిగిలినవి పండ్లరంగులు ఆకురంగులు అని రెండు విధములుగా విభజింప బడినది. కరక్కాయలు, తుమ్మకాయలు, డివిడివికాయలు వీనినుండి లభించురంగులు పండ్ల రంగులు. ఇతరవృక్షములనుండి లభించునవి ఆకురంగులు.
కొన్ని తరగతులకు చెందిన మొక్కల చెక్కలు. పట్టలు, పువ్వులు, పంళ్లు, వ్రేళ్ళు, రంగులు తయారుచేయుట కుపయోగ పడును. ఎనిలైన్ సంబంధమగు రంగులు వచ్చినప్పటినుండి శాకసంబంధమగు రంగుల ప్రాముఖ్యము తగ్గినది.
6. జిగురులు, రజనములు :- జిగురులు చెట్లనుండి పట్టలనుండి, బయటికి స్రవించు పదార్థములు, అని సంపూర్ణముగనో, కొంతవరకో నీటిలో కరగును. రజనములు (Resins) నీటిలో కరగవు. సాధారణముగ మధుసారము (alcohol) లో కరగును. అరబిక్ జిగురు, తుమ్మ జిగురు, బెంగాల్ కినో అనునవి భారతదేశపు అరణ్యవృక్షములనుండి లభించు కొన్ని ముఖ్యములైన జిగురులు. పైనస్ లాంజిఫోలిస్,ఎ క్సెల్సా, ఖాసిల్ మెర్కుపై అను నాలుగుజాతుల పైనువృక్షములు వ్యాపారరీత్యా విలువైన రజనములను ఇచ్చును. ఉద్భిజ్జ ద్రవములు సహజముగ ఇగిరిపోవుటవలనగాని, ప్రత్యేకమగు గ్రంధుల వలనగాని తయారై, సహజముగా వృక్షమునుండి బయటికి వచ్చును. లేదా గంటు పెట్టిన యెడల పట్టలోనికి, దారువులోనికి వచ్చును. ఈ సందర్భమున చిర్ పైన్ రజనము, టర్పెంటైన్ పరిశ్రమ చెప్పదగినవి.
7. వాసన ద్రవ్యములు. విషపదార్థములు, ఓషధులు :-భారతదేశమున హిమాలయములందును, ఇతర పర్వత శ్రేణులందును ఉన్న 'అరణ్యములలో అనేకములగు ఓషధులున్నవి. వానిని తీయు ఉద్భిజ్జభాగములనుబట్టి ఓషధులు వర్గీకరింప బడినవి. వేరు ఓషధులు, పట్ట ఓషధులు, ఉదా :- క్వినైన్) పండు, గింజ ఓషధులు (ఉదా:-స్ట్రినైన్ ) పత్ర - ఓషధులు (ఉదా :- గంజాయి మొక్క నుండి తీయు గంజాయి).
ఏలకులు, మిరియాలు, దాల్చినచెక్క చాలా ప్రసిద్ధమైన సువాసన ద్రవ్యములు.
8. జంతు, ఖనిజాది సంబంధమగు ద్రవ్యములు :- అరణ్యములనుండి లభించు మైనము, తేనె, కొమ్ములు తోళ్ళు, దంతము, షీకాయ, కుంకుడు వంటి చాల దినుసులు తక్కువ ప్రాముఖ్యము కలవి.
అరణ్య లభ్యమగు పదార్థములలో మిక్కిలి ముఖ్యమైనవి లక్క, షెల్లాక్. వీటివిషయమున ప్రపంచములో భారతదేశము ఒకటే ఉత్పత్తిస్థానముగా నున్నది. అచ్చులు పోయుటకును, గ్రామఫోను పరిశ్రమలకును, చక్కని వార్నీసులు, మెరుగులు, లక్క, టోపీలు, కురువింద కూపములు (emery wells) మందుగుండు సామాగ్రిని, విద్యుత్పరికరములను, విద్యుతంత్రుల కప్పులు మొదలగువానిని చేయుటకును ఉపయోగపడును.
రజనము తయారుచేయుటలో భారతదేశము క్రమముగా అభివృద్ధి గనబరచు చున్నది. లైనోలియం, లక్క, నూనె గుడ్డలు, కందెన సమ్మేళన ద్రవ్యములు (lubricating compounds,) సిరాలు తయారు చేయుటకును, లోహములను అతుకుట, రంగులు, వార్నీసులు ఆరబెట్టుట, యంత్రముల పట్టాలను కప్పుట మొదలగు పనులకును రజనము ఉపయోగపడును.
భారతదేశమున మంచిరకము టర్పెన్ టైన్ తయారగును. అది చాలవరకు రంగులు, వార్నీసులు, ఔషధములు తయారు చేయుటకు ఉపయోగపడుచున్నది.
(8) కాగితము, కాగితపుగుజ్జు :- భారత దేశమున అరణ్యలబ్ధ పదార్థములలో కాగితపు గుజ్జు తయారుచేయు టకు గడ్డిజాతి కుటుంబమునకు చెందినవి మంచివి. హిమాలయములయందున్న 'కోనిఫరు'లు, కొన్ని ఆకురాలు వృక్షములు కాగితపు పరిశ్రమకు మంచి పదార్థములు, హిమాలయ పాదపర్వతముల పైని, బీహారు, ఒరిస్సా, మధ్యభారతములలో కొన్ని భాగములయందును ఎల్లప్పుడు పెరుగుచుండు సబాయ్ గడ్డి ఈ పరిశ్రమకు ముఖ్యమైన ముడిపదార్థము.
గడ్డిజాతి కుటుంబమునకు చెందిన వెదుళ్ళు, మద్రాస్ బెంగాల్, బీహారు, ఒరిస్సా, బొంబాయి, తిరువాన్కూరు రాష్ట్రములలో విస్తారముగా దొరకును. అవి కాగితపు పరిశ్రమకు పనికివచ్చును.
(10) భూసార విశేషమును పదిలపరచుట (Soil Conservation) : మధ్య శతాబ్దములలో జరిగిన విస్తారమగు ఆక్రమణ కార్యక్రమములలో అరణ్య నిర్మూలనమువలన కలిగిన నష్టములు గత శతాబ్దాంతమున తెలిసినవి. సహజమగు ఉద్భిజ్జ శోభగల అరణ్యములు ఎంత ముఖ్యమైనవో దట్టమగు వర్ష మేఘములు (Cukulo-nimbus Clouds) ఏర్పడుటకు అవి ఎట్లు తోడ్పడునో, పూర్వము నుండియు గుర్తింపబడినది. ఈ మేఘములు ఏర్పడుటకు అవసరమైన చల్లదనము, ఆర్ద్రత, విస్తృతమగు అరణ్యముల వలన కలుగును. అరణ్యములు, వానియందున్న దట్టమగు ఉద్భిజ్జజాతి భూమి పైపడు వర్షపాతమును అదుపులో నుంచును. భూమిని నల్లగా నుంచుటయందును, అధికముగ నీటిని పీల్చుకొనుటకును అరణ్యవృక్షములు తమ ఛత్రాకార పత్ర సమూహముతో తోడ్పడును. అంతే గాక, ఉద్భిజ్జావరోధము వలన భూసార విశేషము (soil) కొట్టుకొనిపోక నిలిచియుండును.
వ్యవసాయము కొరకు నిర్మూలనము చేయుట వలన పూర్వము దట్టమగు అరణ్యములతో నిండియున్న పెద్ద భూభాగములు (దక్కను పీఠభూమిపై నున్న దండా కారణ్యము) ఇప్పుడు బయళ్లుగా నున్నవి. అందుచే ప్రపంచమందన్ని దేశముల యందును భూసార విశేషమును పదిల పరచియుంచుట ఒక పెద్ద సమస్యయైనది. నాగరక దేశములన్నిటి యందును ఇప్పుడు క్రమపద్ధతిని మొక్కలు నాటుట, అరణ్యములు పెంచుట అను కార్యక్రమములు విరామములేకుండ జరుపబడుచున్నవి. అడవులను పెంచుట (ఇది భారత దేశమున 'వనమహోత్సవము' అనబడు చున్నది). ఒక ప్రత్యేకమగు శాస్త్రజ్ఞానము. దానిని పరిశీలించి, వ్యవసాయ, ఆర్థిక సంబంధమగు లాభములకే గాక ఆయా ప్రదేశ సౌందర్యము కొరకును ఆచరణలో పెట్టవలెను.
బంజరుభూములకు తగిన ప్రత్యేక జాతుల మొక్కలను నాటుట, క్రమక్రమముగా వాని స్థానమున ఎక్కువ శ్రేణికి చెందిన వృక్షజాతులను పెంచుట, వర్షజలము యొక్క వేగమును తగ్గించుట కొరకు వంకర టింకర కాలువల నేర్పరచుట భూసారపు తేమను పదిలపరచు పెద్ద కార్యక్రమములో జరుగుచున్న కొన్ని పద్ధతులు.
ప్రకృతి శాస్త్రజ్ఞులు, వ్యవసాయదారులు, ఇంజనీయర్లు కల ప్రత్యేక సంఘములు ఎడతెగని పరిశోధన చేయుటకును, ప్రస్తుతము ఉన్న అరణ్యములను సంరక్షించుటకును, దూరదృష్టి లేక వెనుక కాలమున నాశనము చేయుటచే లోపించిన విశాలారణ్య ప్రదేశములను పునరుద్ధరించుటకును సంస్థాపితములయినవి.
స. జి.
[[వర్గం:]] [[వర్గం:]]