Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అచ్చు యంత్రములు - ముద్రణకళ

వికీసోర్స్ నుండి

అచ్చు యంత్రములు - ముద్రణకళ : (1) ముద్రాక్షరములనుగాని ముద్రాక్షరములు అచ్చుముక్కలనుగాని కూర్చి వాటిని ముద్రణము కొరకు పంక్తులలోను వరుసలలోను (columns) ఏర్పరచు అన్ని తరగతుల యంత్రములను సాధారణముగా అచ్చుకూర్పు యంత్రములు అని వర్గీకరింపవచ్చును. ఈ యంత్రములలో ' పంక్తి ముద్రణము · (Linotype), ' ఏక ముద్రణము' (Monotype) అనునవి ప్రధానమయినవి.

చారిత్రకముగా చూచినచో కానెక్టికట్ వాస్తవ్యుడగు విలియం చర్చ్ అను నాతడు కనిపెట్టిన ముద్రాక్షర యంత్రము మొట్టమొదటిది. ఇంగ్లాండులో 1822 వ సంవత్సరమున దాని కల్పనాధికారము పొందబడినది. అతడొక ' మీటల బల్ల' (Key Board) ను నియోగించి ముద్ర_అక్షరములను కాలువలలో (Channels) చేర్చి యుంచెను. 1848-1872 వ సంవత్సరము వరకును ఆమెరికా సంయుక్త రాష్ట్రములలో 57 అచ్చుకూర్పు యంత్రములకు కల్పన రక్షణాధికారములు (Patents) ఒసగబడెను. గ్రేటు బ్రిటనులో కూడ సుమారు ఆ సంఖ్యలోనే కల్పన రక్షణాధికారములు పొందబడినవి.

1. పంక్తి ముద్రణ యంత్రము :- అచ్చును కూర్చుట, పోత పోయుట అను రెండు పనులను చేయునట్లు ఇది కల్పింప బడినది. విడివిడిగా నున్న అక్షరములను పంక్తులనుగా కూర్చుటకు బదులుగా ఇందు లోహపు పట్టెలమీద గాని, లోష్టకముల మీదగాని అక్షర పంక్తులు అమర్చబడును. ఈ పట్టెలు పేజీగా అమర్చినపుడు విడిముద్రాక్షరములతో కూర్చిన పేజీవలెనే కనపడును. ఇవి నేరుగా అచ్చువేయుటకు గాని, మామూలు పద్ధతిలో విడదీయుటకు వీలు లేకుండ కూర్చి గట్టిచేసి వేయబడిన ముద్రాక్షరములు గల దిమ్మలను లేక విద్యున్ముద్రాక్షరముల దిమ్మెలను తయారుచేయుటకుగాని ఉపయోగించును. ఈ యంత్రము మనకు కావలసిన వివిధ రీతులుగల అచ్చు అక్షరములను తయారుచేయును. ముద్రాక్షరశాలలలో చేతికూర్పుమీద అయిదుగురు లేక ఆరుగురు వ్యక్తులు చేయగల పనిని ఒక్క వ్యక్తియే ఈ యంత్రసాహాయ్యమున చేయగల్గును.

1866 వ సంవత్సరములో బాల్టిమోర్ వాస్తవ్యుడగు ఆట్మర్ మెర్జెన్ థాలర్ అను నాతడు పంక్తి ముద్రణమును కనిపెట్టెను. అతడు పుట్టుకచే జర్మనీ దేశస్థుడు. ప్రప్రథమమున 1886 వ సంవత్సరమున న్యూయార్కు ' ట్రిబ్యూను ' అను పత్రికను ప్రచురించుట యందు ఇది ఉపయోగపడెను. అది మొదలు వార్తాపత్రికల కార్యాలయముల యందును, ప్రపంచమందలి ముద్రణాలయముల యందును సాధారణముగా ఈ రకపు యంత్రములు ఉపయోగింపబడుచు వచ్చెను.

ఈ యంత్రమున వందలకొలది ఇత్తడి అచ్చుముక్కలు (Matrices) కలవు. ప్రతిఅచ్చుముక్కలోను ఒక చదునైన రేకుపై ఒక్కొక్క సంజ్ఞ చెక్కబడియుండును. ఆ అచ్చుముక్కల యొక్క పై భాగమున పండ్లు (Teeth) కలవు. యంత్ర - ఆధారఫలకములో అచ్చు ముక్కలు వాటి యొక్క స్థానములకు చేరుటకు ఆ పండ్లు ఉపయోగపడును. అచ్చుముక్కలు రెండురకముల సంజ్ఞలతో తయారగును.

ఉదా :- రోమను అక్షరములు, ఏటవాలు (Italics)అక్షరములు. వీటిలో మనకు కావలసిన రకపు అక్షరములను ఉపయోగించుకొనవచ్చును. యంత్రములో ప్రతి యక్షరమునకును పెక్కు అచ్చుముక్కలుండును. ప్రత్యేక సంజ్ఞల కొరకును, మాటమాటకు నడుమ ఎడము ఏర్పరచుట (space) కొరకును కూడ అచ్చుముక్కలుండును.

ఇందులో యంత్రము యొక్క సామాన్య నిర్మాణము సంగ్రహముగా వివరింపబడినది. 'ఎ' అనునది ఏట వాలుగానున్న ఒక స్థిరమైన యంత్ర ఆధారఫలకము అయి యున్నది. దానిలో కాలువ లుండును. ఆ కాలువలలో క్రమపద్ధతిలో అచ్చు ముక్కలు చేర్చబడియుండును. ఆ కాలువలలోని అచ్చుముక్కలు ఒక్కొక్కటి చొప్పున పై కొననుండి జారుచు ప్రవేశించి, క్రింది కొన గుండా బయటికి వచ్చుచుండును. యంత్ర - ఆధార ఫలకములో నున్న ప్రతి కాలువకును క్రిందికొన వద్ద 'బి' అను నిష్క్రమణ ద్వారముండును. అది 'సి' అను కడ్డీ మూలమున 'డి' అను వ్రేలిమీటకు కలుపబడి యుండును. ఆ వ్రేలిమీట, కాలువలలో నున్న అచ్చుముక్కల అక్షరములను గాని, సంజ్ఞులను గాని తెలియజేయు చుండును. ప్రతి సంజ్ఞకును ఒక మీట యుండును. అక్షరముల నడుమ ఎడము కొరకు ఉంచుకణికలకును, మధ్యమధ్య స్థలములను కల్పించుటకై దిగగొట్టబడిన ముక్కలకును మీట లుండును.

కావలసిన అచ్చుముక్కలును, ఖాళీస్థలములను ఏర్పరచు వస్తువులును, వివిధములగు మీటలను ఉపయోగించుటచే 'జి' అను అచ్చు చట్రములోనికి వచ్చి చేరును. ఈ విధముగ అచ్చులో ఒక పంక్తిలో నుండవలసిన సంజ్ఞలన్నియు దానిలో చేరిన తరువాత, కూర్పబడిన ఆ పంక్తి, రెండవ బొమ్మలో చుక్కలతో చూపిన దారి గుండా, యంత్ర సహాయముచే తీసికొనిపోబడి, 'కే' అను చక్రము గుండా దాని ముందు వైపునుండి వెనుక వైపునకు వ్యాపించియున్న మూసకట్టు లేక నిడుపైన కన్నమునకు ముందు ఒక స్థానమున నిల్చును. మాటకును మాటకును మధ్య ఎడములను సర్దుటకై చీలలు మూసకట్టునకు ఎదురుగానున్న ముద్రణ పంక్తిలో చేర్పబడును. అవి ఆ ముద్రణ పంక్తిని సరియైన ప్రమాణమునకు తెచ్చును.

మూసకట్టునకు (mould) వెనుక భాగమున 'ఎమ్ *అను కరుగు పాత్ర యొకటి కలదు. అది వాయువుచే గాని, గాసొలీనుచే గాని, విద్యుత్ తాపక ముచే గాని, వేడిచేయబడును. (రెండవ బొమ్మలో చూపబడినట్లు) పోతబోయ వలసిన అచ్చుముక్కల పంక్తి, మూసకు ముందు భాగముననున్న పిదప కరగిన లోహద్రవము కరుగుపొత్ర నుండి ఒక పంపుయొక్క సహాయమున అచ్చుమూసలోనికి పోయబడును. ఆ లోహద్రవము ఆ సంజ్ఞలలో పడిన వెంటనే ఘనీభవించును. ఆవిధముగ తయారయిన లోష్టకము యొక్క పై భాగమున అచ్చు ముక్కలచే నేర్పడి యెత్తైన సంజ్ఞల యొక్క ముద్రలు ఏర్పడును. సరియయినపొడవు మందము ఉండునట్లుగా ఆ లోష్టకము కోయబడి, స్వతశ్చలనముచే (automatically) అచ్చునుండి తొలగిపోవును. తరువాత ఆ పంక్తి మూసకట్టునుండి ఎత్తబడి ప్రక్కకు జరపబడును. అప్పుడు అచ్చుముక్కలకు పై భాగముననున్న పండ్లు (teeth) బొమ్మలో 'ఆర్ 'అనుచోట గల కడ్డీయొక్క కొక్కెములను పట్టుకొనును. దీని ఫలితముగా యంత్రముయొక్క ఉపరిభాగమున నున్న విభాగమునకు (Distributor) ఆ అచ్చు ముక్కలు పైకి లేపబడి చేరుకొనును. ఆ అచ్చుముక్కలు యంత్రాధార ఫలకము యొక్క అడుగుభాగమునుండి బయలుదేరి అక్షరపంక్తిలోచేరి అక్కడనుండి మూసకట్టు ద్వారమున ఆధార ఫలకము యొక్క పై భాగమునకు తిరిగిచేరును. ఈ ప్రదక్షిణ క్రమమువలన ముద్రణకార్యము అతివేగముగా జరుగును. అది టైపు వేగమును ఎన్నో రెట్లు మించును. ప్రస్తుతము భిన్నభిన్న ముద్రణ కార్యములను నిర్వహించుటకు అనువైన వేరువేరు రకముల పంక్తి ముణ్రములు అమలులో నున్నవి. ఆధునిక యంత్రములు, ప్రకటనములకు, ప్రదర్శనములకు సంబంధించిన విష యములనే కాక పఠన విషయములను గూడ అచ్చుకూర్చగలవు. లోహమును కరగించుటకు విద్యుచ్ఛక్తిచే వేడి చేయబడు లోహపాత్రమును ఉపయోగించుట, ఇటీవల జరిగిన అభివృద్ధియైయున్నది. దీనివలన సీసపు పొగలచే గలుగు బాధ తగ్గుటయేగాక లోహముయొక్క ఉష్ణోగ్రతను మిక్కిలి సూక్ష్మముగా క్రమపరుచుటకు కూడా వీలుకలుగుచున్నది. 1928వ సంవత్సరమున ప్రపంచమందంతటను 60,000 పంక్తి ముద్రణ యంత్రములు ఉపయోగమునందుండెను.

2. ఏకముద్రణ యంత్రము (Monotype) :- ఈ యంత్రమునందు ప్రతి సంజ్ఞయు విడిగా అచ్చుపోయబడి అక్షరపంక్తుల యందు స్వయముగా కూర్పబడుటచే దీనికి ఏకముద్రణ యంత్రము అను 'పేరు సార్థక మగుచున్నది. దీనిలో మీటల బల్ల, పోతపోయు యంత్రము అను రెండు వేరు వేరు యంత్ర భాగములుండును. దీనిని తరచుగా ఒకే పనివాడు నడిపించుచుండును. మీటల బల్లయు పోతబోయు సాధనమును ఒకేపనిని ఎడతెగక చేయుచుండుట వలన, వీటిలో ఏదైన తాత్కాలికముగ ఆగినయెడల, రెండవదానికి ఆటంకములేకుండ, ముద్రణ కార్యము జరుగునట్లు ఈ సామగ్రి అమర్పబడియున్నది. మీటల బల్లపై కూర్పు జరుగును. అది పోతయంత్రము కొరకు కాగితమును స్వాధీనమునందుంచు రిబ్బనుపై రంధ్రములు చేయును. ఈ మీటబల్లపై 225 మీటలుండును. టైపుకొట్టు అన్ని ప్రమాణపు (standard) పైపుయంత్రములలో ఉండునట్లుగానే ఇందు ప్రతి అక్షరమునకును సంజ్ఞాక్రమము ఒకే విధముగా నుండును. ఆ మీటలు మీట కడ్డీల మూలమున పిధాన (Volves) ములతో చేర్చబడియుండును. ఆ పిధానములు చిన్న ముషలకముల (Pistons) క్రిందినుండి గాలిని ప్రవేశ పెట్టును. కార్యకర్త (Operator) మీట నొక్కగానే సిధానముల ద్వారా ప్రవేశించిన గాలి కాగితపు రిబ్బను నందు సంజ్ఞానుకూలములైన రంధ్రములను చేయును. మీటను వదలినతోడనే కాగితమును స్వాధీనమునందుంచు కొను రిబ్బను ముందునకు జరిగి తరువాతి సంజ్ఞను గ్రహించుటకు సిద్ధముగనుండును. కాగితపు రిబ్బనునం దేర్పడిన రంధ్రసముదాయము పోతపోయు యంత్రమువద్ద మూసపై నున్న వలసిన సంజ్ఞను గ్రహించుటకు వీలుగా అచ్చుముక్కను అమర్చునట్లుగా రంధ్రములు చేయు ఇనుప సాధనములు ఏర్పాటు చేయబడినవి. రంధ్రములు చేయు యంత్రసామగ్రి, వీటితోపాటు లెక్కించుటకును, సరిచూచుటకును కావలసిన పరికరములు మీటబల్లపై నుండును. లెక్కించు సాధనము, పంక్తిలో కొట్టబడిన ప్రతి సంజ్ఞయు ఎంత వెడల్పుగానున్నదో లెక్కించి, పంక్తిలో ఇదివరకు కొట్టబడిన సంజ్ఞల యొక్క వెడల్పునకు కలుపును, దానినిబట్టి ఒక్కసారిచూడగానే, పంక్తిలో ఇంక ఎంతస్థలము మిగిలియున్నదో కార్యకర్త తెలిసికొనగలడు. సరిచూచు యంత్రమునందు ఒక సూచికయుండును.

ఎడమును సూచించు పట్టీని (spacebar) నొక్కిన వెంటనే ఆ సూచిక ఒక్కొకసారి ఒక్కొక్క గంటును పైకి లేవనెత్తు చుండును. అప్పుడు పదములమధ్య సరియైన ఎడము
బుద్ధ ధర్మచక్రప్రవర్తన ముద్ర - అజంతా గుహ 19
అజంతా - 19 వ గుహ
ఏర్పడును. సరిచూచు యంత్రమునందు కొలతబద్ద కల ఒక స్తూపము కూడ కలదు. కార్యకర్త కావలసిన సంజ్ఞలను, ఎడములను పంక్తిలో అమర్చినతరువాత, ఆ స్తూపము పంక్తిని సరిచేయుటకై స్వతశ్చలనముచే గిరగిర తిరుగును.

కొలతబద్ద యొక్క పైభాగము చిన్న సమకోణ చతురస్రములుగా (Rectangles) విభజింపబడి యుండును. ఒక్కొక్క చతురస్రములో మీటబల్లపై నున్న మీటలతో సంబంధమును చూపు సంఖ్యలుండును. పంక్తిలో కావలసిన సంజ్ఞలు చేర్చబడినపిదప సూచిక సూచించిన ఈ రెండు సంఖ్యలకు అనుగుణముగా నుండు మీటలను కార్యకర్త నొక్కుచుండును. మీటల వలన ఏర్పడిన రంధ్రములు, ఎడములను ఏర్పరచుటకును, పంక్తి యొక్క ఎడమును సరిచేయుటకును చీలలను పోతయంత్రమువద్ద అమర్చును. పోతయంత్రము సంపూర్ణముగా స్వతశ్చలనముచే పనిచేయును. అది మీటబల్లపై రంధ్రములు చేయబడిన రిబ్బను అధీనములో నుండును. అచ్చు పెట్టెలో 225 అచ్చుముక్క లుండును. వివిధ సమ్మేళనములకు ప్రత్యామ్నాయముగా వివిధ సంజ్ఞల నుంచవచ్చును. లేదా ప్రాత అచ్చుముక్కల పెట్టెను తీసివై చి, క్రొత్త పెట్టెను యంత్రములో నమర్చవచ్చును. అచ్చుముక్కలపై ముద్రాక్షరముల స్వరూపము పోతపోయబడును. అచ్చు అక్షరము యొక్క క్రింది భాగము మూసకట్టులో పోతపోయబడును. ఇదివరలో వర్ణించిన విధమున పోతయంత్ర ముపై ముద్రాక్షరములు (అక్షర) పంక్తిగా ఏర్పడును. అచ్చు అక్షరములను కూర్చి అమర్చి పెట్టు సాధారణ చట్రములో ఈ పంక్తులన్నియు కూడుకొని సిద్ధముగా నుండును. ఇట్లు బహు విధముల ఉపయోగకరమయిన ఏక ముద్రణయంత్రము వార్తా పత్రికలు, గ్రంథములు, చిల్లర విషయములు ముద్రించు ననేక కార్యస్థానములలో ముద్రణమునకు వలసిన వివిధ కార్యములను ఒకేచోట జరుగుటకు వీలును కలిగించునదై యున్నది. ఒకసారి ఉపయోగించిన అన్ని అచ్చు అక్షరములను తిరిగి కరిగించి, క్రొత్త సంజ్ఞలను తయారుచేయుటకు ఈ యంత్రము తోడ్పడును. అందుచే ఈ క్రొత్త పద్ధతి ఆర్థిక సౌలభ్యమును చేకూర్చినది. ఏక ముద్రణ యంత్రము ఈ విధముగా ఒక అచ్చుకూర్పు యంత్రముగా నే కాక అచ్చువేయు కార్యస్థానమునకు కావలసిన వస్తువులలో పెక్కింటిని సమకూర్చగల ముద్రాక్షర సంధానిగా కూడ ఉపయోగపడుచున్నది.

డా. గ. కె. శా.

[[వర్గం:]] [[వర్గం:]]