Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అగ్ని పర్వతములు

వికీసోర్స్ నుండి

అగ్ని పర్వతములు : – అగ్ని పర్వతముల యొక్క ముఖ్యాంశములు :- ప్రకృతిలో అనేక నదులు, పర్వతములు, ఎడారులు ఉన్నట్టుగానే అగ్ని పర్వతములుకూడ పెక్కు చోట్లలో నున్నవి. సాధారణముగ అగ్ని పర్వతములు ఎక్కువ ఏటవాలు లేని శంఖాకారమును (cone-shaped) కలిగిఉండును. దీనిశిఖరమునుండి మధ్యగా భూగర్భము లోనికి గెరాటీనిపోలిన ఒక సొరంగమార్గముండును. దీనినే అగ్ని పర్వతపు కంఠ నాళ మందురు. దీనిపై భాగమున నుండు బిలము 'క్రేటరు' (crater) అనబడును. ఈక్రేటరు ద్వారా కొన్ని సమయములలో అనేక వాయువులు, రాళ్ళు, శిలాద్రవము (Lava), “లావాగుండ్లు” (Volcanic bombs.) వెలువడుచుండును. కనుక అగ్ని తర్వత మనునది ఒక జ్వాలా ముఖద్వారమనియు, దానిచుట్టును శిలా ద్రవము ఘనీభవించుటచే జనించిన శంఖాకారపు రాతిగుట్ట గలిగియున్న పర్వతమనియు చెప్పవచ్చును. క్రేటరు అగ్ని పర్వతపు ముఖ్యాంగము. ఇది అగ్ని పర్వత శిఖరములనే కాకుండ ఒకటి రెండు ప్రక్కలయందుకూడ ఉండవచ్చును.

ఆగ్నిపర్వతభేదములు:- ఇటలీలో నుండెడు " వెసూవియస్" (Vesuvious) అనునది అగ్ని పర్వతము లన్నింటి లోనికి చాల ప్రఖ్యాతిచెందినది. దీని ఆకారము, లక్షణములు మొదలైనవి సిసలైన అగ్నిపర్వతమునకు ఉండ వలసినవిగా ఎంచబడినవి. కాని ప్రపంచములో నుండెడు అగ్నిపర్వతములను పరిశీలించినచో ఈ లక్షణములు అన్నిటి యందును కన్పించకపోవచ్చును. సరియైన అంచనాలు ఇంతవరకును వేయబడనప్పటికిని భూమిమీద ఉండెడు అగ్ని పర్వతముల సంఖ్య వేనవేలుండునని చెప్ప వచ్చును. వీటన్నిటిలోనికి సుమారు నాలుగయిదు వందలుమాత్రమే చైతన్యము కలిగి యున్నవి (Active Volcanoes). భూమిపై మానవజాతి ఉద్భవించిన పిదప ఏర్పడిన అగ్ని పర్వతములు చైతన్యము కలవిగాను, మిగతా వన్నియు చల్లారి జడమైనవిగాను (Extinct Volcanoes) విభజించుట పరిపాటి. కాని ఈ విభజనము అంత సమంజసమైనది కాదు. ఎందువల్లననగా ఒకే అగ్నిపర్వతము కొన్ని కాలముల పాటు చైతన్య రహితముగా కనబడుచు మందకొడిగా నుండి తిరిగి చైతన్యము పొందవచ్చును. ఒకప్పుడు స్తబ్ధతతోకూడిన విరామకాలము, మరొకప్పుడు భీభత్స సంఘటనలతో నిండియుండవచ్చును.

అగ్నిపర్వతములనుండి అనేక పదార్థములు వెలువడుటను ప్రేలుడు, లేక బ్రద్దలగుట (Eruption) అందురు. అగ్నిపర్వతము “ప్రేలుచున్నప్పుడు బయల్వెడలెడు శక్తులు, వాటివలన సంభవించెడు దారుణ ఫలితములు మిగుల భయంకరమైనవి. పరిమాణములో అగ్ని పర్వతములు చాల మార్పుకలిగి తేనెపట్టంత చిన్న శంఖాకృతులు మొదలు బ్రహ్మాండమైన ఎత్తుకలిగినవికూడ ఉండును.ఇటువంటి అగ్నిపర్వతములు దక్షిణ అమెరికాలోని ఆండీసు (Andes) పర్వతాలలో నున్నవి. అక్కడి పర్వత శిఖరాలు చాలవరకు అగ్నిపర్వతాలే ఉదాహరణకు : ఈక్విడారులోని "కోటోపాక్సీ” (cotopaxi) ప్రపంచములోని అగ్ని పర్వతాలన్నిటిలోను చాల ఎత్తయినది. దీని ఎత్తు 19,600 అడుగులు; క్రేటరు వెడల్పు అర మైలు; లోతు 1500 అడుగులు. ఇంత విపరీత పరిమాణము కలిగినవి హవాయి దీవులలో కూడ ఉన్నవి. అక్కడ ఉండెడు పర్వతములు సముద్రమట్టమునకు 4 మొదలు 15 వేల అడుగుల దిగువనుండి పైన 14,000 ఎత్తు వరకు వ్యాపించి, మొత్తము సుమారు ముప్పది వేల అడుగులకు వ్యాపించియున్నవి.

"లావా" :- భూగర్భమునుండి వెలువడెడు వాయు, ఘన పదార్థముల బహిర్గత క్రియకు సంబంధించిన శాస్త్రవిషయముల నన్నిటిని అగ్ని పర్వతశాస్త్రమందురు (Volcanology). ఈ మహోన్నత కార్యము భూనిర్మాణమునకు సంబంధించిన క్రియలలో నొకటిగా (Earth's Building Activity) ఎంచబడినది. బహిర్గతమయ్యెడు పదార్థము ఒకప్పుడు పూర్తిగా శిలాద్రవమే కావచ్చును; అట్లు కానిపక్షములో పూర్తిగాగాని, అసంపూర్తిగాగాని ఘనీభవించిన రాళ్ళసముదాయముగనే యుండవచ్చును. ఇవికాక నీటిఆవిరి, అనేక వాయువులు వివిధపరిమాణములలో వెలువడును. అందువల్లనే అగ్నిపర్వతము వ్రేలినవుడు దట్టమైన మేఘములు ఆకాశమును ఆవరించును. అట్టి సమయమలయందు భీభత్స పరిస్థితుల మూలమునను, వెలువడిన వాయువులు పై నున్న గాలిలో అత్యంత త్వరితముతో కలిసిపోవుట వలనను, వాటియొక్క సమ్మేళనము (composition) సరిగా తెలిసికొనుట సాధ్యముకాదు. కాని ఈ వాయువులు చాలవరకు నీటియావిరి అని చెప్పుటకు ఆధారములున్నవి. ఒక్కొక అగ్ని పర్వతమునుండి వంద రోజులలో సుమారు 46 కోట్ల గాలనుల నీరు వెలువడునని అంచనా వేసిరి. నీటి ఆవిరితోపాటు మరికొన్ని ఇతరపదార్థములు—ముఖ్యముగా కర్బనద్విఆమ్లజనిదము (Carbon-Dioxide), ఉదజహరితామ్లము (Hydrochloric acid), గంధకమిశ్రమ ద్రవ్యములు (Sulphur compounds), ఉదజని (Hydrogen) మొద లైనవి వెలువడును. ఇవికాక అగ్నిపర్వతమునుండి వెలువడు రాతి ముక్కల సముదాయమును పైరోక్లాస్టికు పదార్థము (Pyroclastic material) అందురు. ఈ వెదజిమ్మబడెడు శిలా ఖండములు కొంతభాగము గట్టిగాను, మరికొంత భాగము అనేక సూక్ష్మరంధ్రములుకలిగి స్పాంజివలెను (Sponge-like) ఉండును. వీటన్నిటికంటే ముఖ్యమైనది శిలాద్రవము; దీనినే భూమి అంతర్భాగములో నున్నపుడు 'మాగ్మా' (Magma) అనియు, భూమిపైన పడినపుడు 'లావా' (Lava) అనియు అందురు. లావా ఘనీభవించగా ఏర్పడిన శిలారూప లక్షణములు మాగ్మా ద్రవపు సమ్మేళనము (composition), దాని ఉష్ణోగ్రత (Temperature), జిగటతనము (Viscosity) మొదలైన పరిస్థితులపై ఆధారపడియుండును. కనుక ఇప్పుడు మాగ్మా పరిస్థితులను గురించి కొంత తెలిసికొనుట అవసరము.

భూమి పై భాగము నుండి లోతుగా వెళ్ళినకొలది ఉష్ణోగ్రత పెరుగుచునుండును. చాల మైళ్ళ దిగువ నుండెడు ఉష్ణోగ్రత భూమి పైన ఉండెడు రాళ్ళను కరిగించునంత ఎక్కువగా ఉండునని అంచనా వేయబడినది. ఈ ఉష్ణోగ్రతతో బాటు భూమి లోపల పీడనము (Pressure) ఎక్కువ అగుచుండును. కనుక భూగర్భములో నుండెడు అత్యధిక పీడనశక్తి రాళ్ళను కరగనియ్యదు. కొన్ని ప్రదేశములలో పీడనశ క్తి తక్కువగానుండి ఉష్ణోగ్రత ఎక్కువగా నుండవచ్చును. అట్టి పరిస్థితులలో అక్కడ ఘనస్థితిలో నుండెడు శిలాపదార్థము మాగ్మారూపము చెందును. మాగ్మాద్రవము 1200 సెం. డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉండునని అంచనా వేయబడినది. ఈ మాగ్మా ద్రవాశయములు భూగర్భములో విపరీతముగా నుండును. ఈ మాగ్మా అతి తీవ్రమైన శక్తితో భూమిని భేదించుకొని బయటపడుటయే అగ్నిపర్వతోద్గారము (Volcanic eruption) అనబడును. కొన్ని మైళ్ళ పొడవున సొరంగ బీటికల ద్వారా మాగ్మా మెల్లగా భూమిపైకి ప్రవహించుచు వచ్చినచో దానిని రంధ్రోద్గారము (Fissure eruption) అందురు,

అగ్ని పర్వతముల నన్నింటిని పరిశీలించినచో వాటి స్వభావ లక్షణములలో ఎక్కువతేడా కన్పించును. ఇవి తీవ్రజాతి (Violent), మాధ్యమిక జాతి (Intermediate), సాత్వికజాతి (Quiet) అని మూడు తెగలుగ విభజింపబడినవి, బ్రహ్మాండ మైన శక్తితో బ్రద్దలగువాటిని తీవ్రజాతి గాను, అతి నెమ్మదిగా బ్రద్దలగువాటిని సాత్విక జాతి గాను, ఈ రెండింటికి మధ్యగా నుండెడు వాటిని మాధ్యమిక జాతిగాను పేర్కొనుచున్నారు. తీవ్రజాతి పర్వతములనుండి ముఖ్యముగా ఘన, వాయు పదార్థములే ఎక్కువగా బహిర్గత మగును. సాత్వికజాతినుండి ముఖ్యముగా ' లావా ' పదార్థము వెలువడును; మధ్యరకపు జాతినుండి ఘన, ద్రవ, వాయు పదార్థములు అన్నియు సమానముగ నే బహిర్గతమగును.

చైతన్యము కలిగిన ప్రతి అగ్నిపర్వతపు జీవిత ప్రమాణము వేరువేరుగా నుండును. ఇటలీలో నున్న “ఎట్నా”(Etna) అనెడు అగ్నిపర్వతము ఇప్పుడు ఎంత తీవ్రముగా ప్రేలుచున్నదో అంతటి శక్తితో గత 2500 సంవత్సరముల నుండియు ప్రేలుచు వచ్చినదట. బ్రహ్మాండముగా నున్న దీని పరిమాణము అతి సూక్ష్మముగా ఉండుచున్న పెరుగుదలతో సరిపోల్చినట్లైన దీనిని నిర్మించుటకు అధమపక్షము 3 లక్షల సంవత్సరము లైనను కావలసి యుండును. కాని భూగర్భశాస్త్రరీత్యా ఈ పర్వతము అంత పురాతనమైనది కాదని, ఆ శాస్త్రయుగములలో ఇటీవలదైన “ప్లిస్టోసిన్” (Pleistocene) మధ్య భాగమువరకు ఇది ప్రేలియుండలేదని తెలియుచున్నది. ఈ ఆధారమునుబట్టి ఈ పర్వతమింకను యౌవనదశలోనే ఉన్నదని నిర్ధారణ అయినది. అగ్నిపర్వతపు జీవితకాలము వాతావరణమునకు, సంబంధించిన గాలి, నీరు, మొదలైనవి చేయు వినాశకరమైన క్రియలకు గురి యగును. ఒక నియమిత కాలములో అగ్నిపర్వతపు స్వరూపము, ఎత్తు, దాని నిర్మాణమునకు తోడ్పడెడు శక్తులకు (constructive forces) వినాశనమునకు దారితీయు శక్తులకు (destructive forces) ఉండేడు తారతమ్యముపై ఆధారపడియుండును. వాతావరణ శక్తుల ప్రాబల్యము అధికమైన కొలది అగ్ని పర్వతపు శ్రీణత అధికమగుచుండును.

అతి భయంకరమైన సంఘటనలతో నిండిన జాతిలో "క్రాకటోవా ” (Krakatoa) అను అగ్ని పర్వతము ముఖ్యముగా చెప్పదగినది. ఇది జావా, సుమత్రా దీవుల మధ్య 'సుండా' జలసంధిలో ఉన్నది. ఇది "వ్రేలినపుడు సంభవించిన ప్రమాదములు చరిత్రాత్మక మైనవి. సుమారు రెండువందల సంవత్సరములు ఈ పర్వతము మందకొడిగానే ఉండి దానిపై భాగము చెట్టుచేమలతో నిండిఉండెడిది కాని అకస్మాత్తుగా ఒక రోజున (1883 ఆగస్టు 27 తారీఖున) భయంకరమైన శబ్దముతో యావ త్ప్రపంచము దద్దరిల్లునట్లు అది ప్రేలినది. దీని ఫలితముగా సముద్రమట్టమునకు 1500 అడుగుల ఎత్తున ఉన్న శిఖరము పూర్తిగా ఎగిరిపోయి, సముద్రమట్టమునకు దిగువ 1000 అడుగుల లోతుగల పెద్ద అగాధము ఏర్పడినది. దీనినుండి వెలువడిన ధూళి ఆకాశమును అంటునట్లు 17 మైళ్ళు ఎత్తువరకు ఎగిరినది. ఈ బూడిద వేలకు వేలు మైళ్ళు ప్రయాణము చేసి 11,000 మైళ్ళు దూరములో నున్న యూరపు ఖండవీధులలోకూడ పడినదట! ఈ దారుణ సంఘటనకు సముద్రములో 50 అడుగుల ఎత్తు వరకు కెరటములు లేచినవట ! సుమారు 40,000 మంది ప్రాణములు కోల్పోయిరి. ఇది ప్రేలినపుడు ఉద్భవించిన ధ్వని 3000 మైళ్ళ దూరమువరకు వినిపించినదట! కనుక అగ్నిపర్వత మనునది ప్రేలినట్లయిన అది కలుగజేసెడు భీభత్సము వర్ణనాతీతము.

అగ్ని పర్వతములు ప్రతిచోటను ఉండవు. ఇవి సాధారణముగ భూకంపములు వచ్చెడు ప్రదేశములలోను, భూమ్యుపరిభాగపు పెచ్చు (Earth's Outer Crust) బలహీనముగా ఉండెడు ప్రదేశములలోను, మడత పర్వతములు ఏర్పడుచోట్లను ఉండును. ఈ ఉష్ణోగ్రత, భూమి పైభాగమునందు గాలియందున్న ఉష్ణోగ్రతలతో పోల్చినచో అధికముగ నుండును. అందుచేఉష్ణోగ్రత తన సహజ లక్షణము ననుసరించి పైకి వచ్చుటకు ప్రయత్నించు చుండును.

చాలభాగము అగ్ని పర్వతములు ఫసిఫికు మహాసముద్రము చుట్టును కొంచెము ఇంచుమించు వలయాకారముననుండి పసిఫిక్ ప్రాంతమునందలి అగ్నిమయ మండలాకార రేఖ (Pacific girdle of fire) అని పిలువబడుచున్నవి. ముఖ్యమైన మరొక పర్వతపంక్తి భూమధ్యరేఖకు ఉత్తరముగాను సమాంతరముగాను, భూమిని చుట్టుకొనియున్నది.{

డా. ఎన్. డా.

[[వర్గం:]] [[వర్గం:]]