Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అఖిలేశ్వర వాదము

వికీసోర్స్ నుండి

అఖిలేశ్వర వాదము  :- అఖిలేశ్వరవాదమన నేమి?- అఖిలేశ్వర వాదమను పదము యొక్క నిర్వచనము మిక్కిలి సందిగ్ధముగ నున్నది. ఆ పదమును భిన్న భిన్న రచయితలు వివిధ రీతులలో ప్రయోగించిరి. వాటిలో పెక్కులు స్పష్టముగ లేవు. కాని విజ్ఞాన కోశములకు, నిఘంటువులకు ఆపద నిర్వచన విషయమున అభేదత కనిపించుచున్నది. అఖిలేశ్వరవాదము అనునది ఒక సిద్ధాంతము. అందు దేవునకును, విశ్వమునకును అభేదత నిరూపింపబడును.

అందుగూడ స్వల్పభేదమున్నది. దీనికి కారణము రెండు భిన్నములయిన పక్షముల ఉనికియే. ఒకపక్షమువారు "దేవుడన్నను, ప్రకృతియన్నను ఒకటే. దేవుడే కర్త. దేవుడే ఉపాదానము. అతడే కులాలుడు. అతడే మృత్తు" అందురు. ఇదియే క్రమమైన అఖిలేశ్వరవాదము. రెండవ పక్షమునకు చెందినవారు ఈ విషయమును విశ్వసింతురు. కాని వారు భగవంతుడు కేవలము స్రష్ట అని కాని, స్రష్టయు సృష్టియు గూడ అని కాని దేవునిగూర్చి తమ ఆశయమును తెలుపుటకు నిరాకరింతురు. 'ప్రకృతి విషయకమయిన యథార్థజ్ఞానమే భగవద్విషయకమయిన యథార్థ జ్ఞానము' అను విషయమున మాత్రము వీరు అభిలేశ్వర వాదులతో ఏకీభవింతురు. ఇంక వీరిట్లు వాదింతురు. "ఒక వేళ దేవుడు స్రష్టయు, సృష్టియునై యున్నచో, ప్రకృతియందలి భిన్నభిన్న దృశ్యములు ప్రతిభాస-ఆధారమగు భగవంతునియొక్క ఆవిర్భావములేయైయున్నచో, ప్రకృతియందలి భిన్న భిన్న సౌందర్యముల యొక్కయు, అందలి అపూర్వవస్తువుల యొక్కయు దృఢమైన పరిచయమే భగవంతుని యొక్క సంపూర్ణతా వైవిధ్యము యొక్క పూర్ణమయిన పరిచయము అనునర్థము సిద్ధించుచున్నది. అట్లుగాక దేవుడు కేవలము సృష్టికర్తయే యైయుండి, ప్రకృతి ఆతని చేతిపనియే యైయున్న యెడల, ఆతని కృత్యములను, భక్తి పూర్వకముగ మీమాంస యొనర్చుటయే ఆతనిని గూర్చి జ్ఞానమును, భక్తిని సంపాదించుటకు అనన్యమార్గము." ఇట్లు రెండు పక్షములవారిచే నిరూపింపబడిన అఖిలేశ్వర సిద్ధాంతము యొక్క ప్రాథమికావస్థ యందైనను మృణ్మయములు, శిలామయములు. చిత్రమయములు, సాంప్రదాయికములు నగు విగ్రహముల యొక్క ఆరాధనకు తావు లభించియుండలేదు. అఖిలేశ్వర వాదు లిట్లు వాదింతురు. "దేవుడు తన కృత్యముల ద్వారముననే స్వాత్మను ఆవిష్కరించుకొనేను. భగవంతుని కృత్యములను తెలిసికొనుటచేతనే మానవునకు భగవంతుని గూర్చి జ్ఞానము లభించును.” దీనిని బట్టి అభిలేశ్వర సిద్ధాంతము నందు భగవంతుని సాకారునిగ నిరూపించుట గాని, ప్రకృతి యందలి వస్తువులందు చైతన్యము నారోపించుటగాని జరిగియుండలేదని తెలియును. ఇదియే ఈ సిద్ధాంతము నందలి ప్రత్యేకత.

దేవ విషయకమయిన ఇట్టి భావన, మనుష్యత్వారోపము నొక వైపునను, అనాత్మ వాదమును మరియొక వైపునను నిరాకరించుచున్నది. " దేవుడు శక్తివిశిస్టుడు, శాశ్వతుడు, అనంతుడు. ప్రకృతి యందలి ప్రతిరూపము యొక్కయు, సంఘటన యొక్కయు ద్వారమున అతడు స్వాత్మను ప్రకటించుకొనును. భగవంతుడు నశ్య పదార్థము కంటే భిన్నుడు. ఆత్మకు శరీరమునకు గల సంబంధము వంటిదే భగవంతునకును. ద్రవ్యమునకునుగల సంబంధము. ఒక సుప్రసిద్ధ తత్త్వజ్ఞుడు వచించినట్లు మహాసముద్రము ప్రకృతమునకు తార్కాణము, సముద్రము అనంతము, శాశ్వతము. అట్టిదాని యందు సంఖ్యాతీతములయిన రూప భేదములతో పెక్కు బుద్బుదములు, చిన్న తరంగములు, గొప్ప తరంగములు పుట్టును. అవి అందే భాసించి, అందే లయించి, దాని రూపమునే పొందుచున్నవి. ఆ బుద్బుదాదులన్నియు జలము కంటె భిన్నమయినవి కావు, ఎప్పుడును జలరూపమున నుండునవే. శరీరము యొక్క ఆకృతులు నశ్యములు. ఆత్మ శాశ్వతమైనది. అది ఏకము, అద్వితీయము, సార్వకాలికము " అని ఈ సిద్ధాంతము. కావున అఖిలేశ్వర వాదము ద్వైతమును గాక అద్వైతమునే ప్రతిపాదించుచున్నది.

అఖిలేశ్వర వాదము యొక్క సంగ్రహ చరిత్ర :- మత చరిత మెంత పురాతనమైనదో, అభిలేశ్వర వాదముకూడ అంత ప్రాచీనమయినది. అన్ని యుగములందును అఖిలేశ్వర వాదమునందు అభిరుచిగలవా రుండిరి. అది ప్రపంచమున ప్రాచీనతములయిన నాగరకులలో వ్యాప్తినొందెను. అన్ని దేశములలో, అన్ని కాలములలో అది ఆదరమును గాంచెను. ప్రాక్పశ్చిమ దేశములలో అందరికి దీని యందు ఆభిముఖ్య మేర్పడెను. హిందువుల అఖిలేశ్వర వాదమును వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధించెను. గ్రీకు అఖిలేశ్వర వాదమును ప్రబోధించిన వారు ఐయోనియన్స్, ఈలియాటిక్సు, అర్వాచీనమయిన ప్లేటో మతమును అనుసరించిన వారు. మధ్య యుగములలో దేవాలయాధికారుల యొక్క నిర్బంధ పర్యవేక్షణము కారణముగ మత మీమాంసకు అవకాశము లేదయ్యె. జానుస్కోటసు ఎంజెన అను వేదాంతి యొక్కడే మత మీమాంసకు డుండెను. అతడు ప్రాచీన, అర్వాచీనములయిన అఖిలేశ్వర వాదముల మధ్య ఒక గొలుసువలె భావింపబడెను. పశ్చిమ దేశములలో గయార్డానో బ్రూనో బెనెడిక్టు, స్పినోజా, ఫిక్టే, హెగెల్ అనువారు అర్వాచీనమయిన అఖిలేశ్వర వాదమునకు ప్రతినిధులు. హిందూదేశమున దివ్యజ్ఞాన సమాజస్థులలో రాజా రామమోహనరాయ, కేశవ చంద్రసేనులు మొదలుకొని స్వామి వివేకానంద, రవీంద్రనాథ ఠాకూరుల వరకు దానికి ప్రతినిధులు పలువురున్నారు.

హిందూ - అఖిలేశ్వర వాదము :-వేదములయందు విగ్రహారాధనకు ప్రసక్తి లేకుండెను. హిందూ దేశమున మూర్తిపూజ అనునది మిక్కిలి అనంతరీయమయిన కాలమున ఏర్పడిన వ్యవస్థ. అది సామాన్యముగ పెక్కురు గ్రహించిన బహుదేవతావాదమునకు ఎంతమాత్రము సంబంధించినది కాదు. వేదములందు సూర్యుడు, అగ్ని, ఉషస్సు మున్నగు దేవతలనుగూర్చి ప్రార్థనలున్నవనుట సత్యమే. అయితే ఆ దేవతలలో ఏయొక్క దేవత ప్రత్యేకముగ ప్రార్థింపబడినను, ఆ దేవత, శేషంచిన దేవతల అధికారమునకు లోబడినదిగాగాని, ఇతర దేవతలకంటే గౌరవ ప్రతిపత్తులలో న్యూనతాధిక్యములు కలదిగాగాని భావింపబడలేదు. మహత్త్వవిషయమున ప్రతి దేవతకు ఇతర దేవతలతో సమత కల్పింపబడెను. ఆరాధ్య దేవత యొక్క దేవతాత్మక, ప్రాధాన్యము, పరమాత్మత, మున్నగు గుణములను గూర్చి ఆరాధకుని మనమున ఎట్టిశంకకును తావే లేకుండెను. బహుదేవతాత్వ భావనచే మన మనస్సు నందు జనింపదగిన పరిచ్ఛిన్న బుద్ధి, ఆరాధ్య దేవతా విష యమున భక్తుని మనమున పొడమలేదు. ఇది బహు దేవతా వాద మనుకొనబడినది గాని, బహుజను అనుకొనునట్టి ఏకేశ్వర వాదము కాని కాదు. ఒక్కడును, అద్వితీయుడు నగు పరమాత్మయొక్క స్వరూపమే సర్వదేవతాగణము. ఆ పరమాత్మ ఒక్కడే భిన్నభిన్నములయిన ఆకృతులతో కనిపించును. దేవతలు, మనుజులు, ప్రకృతికృత్యములు, ఈ సర్వమును ఒక్కడు, సర్వవ్యాపి, సత్య స్వరూపుడునగు పరమాత్మ యొక్క క్షణిక ప్రతిభాసయై యున్నది. అను జ్ఞానమే హిందూ - అఖిలేశ్వరవాద హృదయము.

వేదములందలి హిందువు ప్రజ్ఞాసంస్కృతి విశేషమున పేక్షించు సమస్యలలో వ్యాపృతుడై యుండెను. అవి సత్య స్వరూపము నెరుంగు శక్తి నొసంగజాలియుండెను. మోక్షముల్లరు నుడివినట్లు, అతడు (హిందువు) ఈ ప్రపంచ సమస్యా పరిష్కార విషయమున మగ్నుడై యుండెను. ఆద్యమాన వునందువలె అతనియందును వాంఛలు లోపములు కన్పట్టెను. ఆహారమును, ధనమును, ఆధిపత్యమును, పెద్దకుటుంబమును, దీర్ఘాయువును తన దైనందిన ప్రార్థనలలో అత డర్థించేను. విశ్వమునగల సర్వభూతములకు అతడు నామకరణ మొనర్చెను. వాటిని ప్రార్థించెను; స్తుతించెను; పూజించెను; తన హృదయాంతర మందు ఒకశక్తిని అతడు గుర్తించెను. ఆ శక్తి తనయందుండి ప్రార్థనను బోధించినట్లు, ఆ ప్రార్థనల నాలకించినట్లు, తన పరిసరముల నున్న వారికి తోడ్పడినట్లు ఆతనికి గోచరించెను.

దీనినే అతడు 'బ్రహ్మము' అనెను. ఆ వైయక్తికమయిన ఈ 'బ్రహ్మము' కూడ కాలక్రమమున 'ఒక చిత్రము దివ్యమునైన వస్తువుగా మారెను.తుదకది నేటికిని పూజింపబడుచున్న త్రిమూర్తులలో నొకడుగా నేర్పడెను. ఐన నాతని హృదయమునందలి భావనకు నిజమైన పేరు లేకుండెను. అనన్యమును, సర్వదేవతలకు, సర్వలోకమునకు, సర్వమునకు ఆధారభూతమునయిన శక్తి విశేషమొకటి వాచ్యముగాక, భావితమై అతని మనము నెదుట ప్లవమానమై గోచరించెను. తుద కాతడు దానిని 'ఆత్మ' యనెను. ఆదియందు, ఆత్మశబ్దమునకు ప్రాణము, లేక, చైతన్యము అను నర్థము లుండెను. ఆ శబ్దము పిదప 'ఆత్మ' యను అర్థముననే స్థిరపడేను.

భిన్నభిన్న దేవతలను గూర్చి, పౌనఃపున్యముగ, సర్వత్ర ప్రార్థనలు జరుగుచున్నంతలో, చాల స్వల్పసంఖ్యగల దేశము లందలి జనులుమాత్రమే, సర్వవ్యాపి, విశ్వాత్ముడునగు దేవుడొక్కడే కలడను విషయమును నొక్కి వక్కాణింపగల్గి యథార్థముగ దేవుడొక్కడే. అతడే సర్వాత్మ; అతడే పరమాత్మ; ఈ విశ్వ మాతనికృతి. ఇతర దేవతలు వేరు వేరు నామములచే వ్యవహరింపబడుదురుగాక ! విశ్వమును, మనుజులను, దేవతలను గూడ వ్యాపించి"పరమాత్మ ఒక్కడే ఉన్నాడు" అనుసత్యము విస్మృతము కాదగదు.

బ్రాహ్మణముల కాలమున యాగాది కర్మ కలాపముల వలన మతము క్రమముగా సన్నగిల్లెను. అందుచేత శుద్ధమును, ఆధ్యాత్మికమును, వైదికము నగు ఈశ్వర విషయక మయిన భావము నందలి ఉన్నతికి భంగము వాటిల్లెను. పురోహిత వర్గము యొక్క అధికారము, నీచ ప్రమాణమునకును దుర్వినీతికిని దారితీసెను.

ఈ పరిస్థితులు బౌద్ధ ధర్మము, సాంఖ్యము మున్నగు హిందూ మతమునందలి సంస్కారాత్మక దర్శనములకు మార్గదర్శకము లయ్యెను. ఇవి పురోహిత వర్గముపైని, భగవద్విషయక భావనపైని, సవాలు చేసెను. అయిరే ఈ దర్శనములు పూర్వోక్త విధమున అఖిలేశ్వర వాదము నందలి రెండవ పక్షమునకు చెందినవై యున్నవి.

ఉపనిషత్తుల యందుగూడ అఖిలేశ్వరవాద తాత్పర్యము కలదు. ఒక పాశ్చాత్య వేదాంతి దాని నిట్లు సంగ్రహించెను : " జగత్తునకు భగవంతుడు సర్వజ్ఞతాయుతము, సర్వశక్తి విశిష్టము నైన కారణము ; ఇచ్ఛా మాత్రమున అతడు సృష్టి యొనర్చును. అతడు విశ్వమునకు సమర్థ కారణము, ఉపాదాన కారణము –ఉభయమునై యున్నాడు. అతడు స్రష్ట, సృష్టి; నిర్మాత; నిర్మితి; కర్త, కృత్యము. ప్రళయకాలమున సర్వము అతనియందే లీనమగును. పరమాత్మ ఒక్కడు, అద్వితీయుడు, అఖండుడు, నిరవయవుడు, అనంతుడు, వాచామగోచరుడు. అతడు సర్వజీవులకు, ఉత్తత్పత్తికి, వివేకమునకు, బుద్ధికి, సుఖమునకు అధీశుడు. ఆతనినుండి పుట్టిన వ్యక్తిగతజీవులు ప్రజ్వలించు నగ్నినుండి జనించిన అసం ఖ్యాకము అయిన అగ్నికణములవంటివారు. జీవులు భగవంతుని అంశములు, అందుచే వారు ఆతనియందే జనించి, ఆతనినే చేరుదురు. జీవాత్మ, శరీరమును, దాని అవయవములను నియమించును. అతనికి ఉత్పత్తి నాశములు లేవు. జీవాత్మ దివ్య వస్తువు (పరబ్రహ్మము)యొక్క అంశము. అందుచేత అతడు అనంతుడు, అమరుడు, ప్రాజ్ఞుడు, చేతనుడు, వాస్తవికుడు. దేహాంతర ప్రాప్తికి లోనగుచు, జీవుడు, లోకాంతర ప్రవిష్టుడయి, అచ్చట తన యొక్క సుకృత దుష్కుృతముల ఫలములను అనుభవించును.

శిక్షను అనుభవించు నిమిత్తమై పావులు వేరు వేరు లోకముల కేగుదురు. సుకృతవంతులు చంద్రలోకమునకు అరుగుదురు. అరిగి, అచట నిజ సుకృతఫలము ననుభవింతురు. పుణ్యము క్షీణింపగా, వారు మర్త్యలోకమున నిజ కర్మానుగుణము లయిన దేహముల నొంది, విధివశమున ప్రవర్తింతురు. జ్ఞానవంతులు ప్రాపంచిక బంధములనుండి ముక్తులయి, ఉన్నతతర మయిన బ్రహ్మ లోకమున ప్రవేశింతురు; జ్ఞాన పరిపూర్ణు లగు జీవులు వెంటనే బ్రహ్మైక్యము నొందుదురు.

గ్రీకుల అఖిలేశ్వర వాదము :- హిందువుల వేదాంతము నందువలె గ్రీకుల వేదాంతమునందు కూడ అఖిలేశ్వర వాద సూచనలు పెక్కు లుండెను. థేల్సు, గ్రీకు వేదాంతులలో ఆద్యుడు. అతడు సర్వవస్తువులకు మూలము ఉదక మని నిరూపించెను. అతడిట్లు వాదించెను, "మనుజుడు ప్రథమ సృష్టి యనుట పొసగదు. ఎందుచేత నన- అతడు తనకంటే ముందు పుట్టిన నీటిపై ఆధార పడెను. దేవతల సృష్టికూడ మొదటిది అనుటకు వీలులేదు,దేవతలుకూడ మనుజులవలె నీటి అవసరము కలవారే. వారు ఆకసములో నివసింతురని భావింప బడుచున్నది. ఆకసమునుండియే వాన పడును. నీరు లేనియెడల ప్రాణి వర్గము నశించును. నీరులేక ఏ వస్తువు పుట్టియుండదు. అందుచేత నీరే అన్ని వస్తువులలో మొదటి సృష్టి.”

థేల్సు పుట్టిన తరువాత, ముప్పది సంవత్సరములకు, క్రీ. పూ. 610 ప్రాంతమున జన్మించినవాడు అనాగ్జి మాండరు. అతడు భూమియే ఆద్యసృష్టి యని నిరూపించినట్లు ప్రసిద్ధికలదు. అతడు భూగోళశాస్త్రజ్ఞుడు. అతడు భూగోళశాస్త్ర సాధనములను కనిపెట్టినట్లు ఆ శాస్త్ర విషయమున తన ప్రజ్ఞను వినియోగించినట్లు తెలియుచున్నది. పిదప చెప్పదగినవాడు ఎనాగ్జిమీనసు. అతడు థేల్సు పుట్టిన పిదప, నూరు సంవత్సరములకు జన్మించెను. ఐయోనియను వేదాంతులలో అతడు తృతీయ స్థానమును ఆక్రమించెను. అతడు పూర్వులగు వేదాంతు లొనర్చిన సిద్ధాంతములతో తృప్తినొందడయ్యె. "వాయువు ఆద్యతత్త్వము. జలము, భూమి, గుణమునందు పరిమితములు. వాతావరణము సర్వత్ర వ్యాపించునది. దానికి దేవునితో తాదాత్మ్యము కలదు అని ఆతని సిద్ధాంతము. హిరాక్లిటను అను వేదాంతి అగ్నిని ప్రథమ తత్త్వముగా నిరూపించెను. అతడు క్రీ. పూ. 6వ శతాబ్దివాడు. "అగ్ని సర్వముగాను, సర్వము అగ్నిగాను మార్చుటకుశక్యము. " అనునది ఆతని సిద్ధాంతము - కాగా పై సిద్ధాంతము లన్నియు స్పష్టి కెల్ల మూలబీజము ప్రకృతి యను విషయమున నైకమత్యము కలిగియున్నవి. అనగా నివన్నియు అనాత్మవాదమును ప్రతిపాదించునవే. పై థాగరసు, ఈ లియాటిక్సు అను వేదాంతులు అనంతరీయులు. వారిరుపురు అయోనియను వేదాంతమును పెంపొందించిరి. పై థాగరసు విశ్త్యక్యమును స్పష్టముగ దర్శించెను. "ఏక మునుండి సర్వము పుట్టుచున్నది. దేవుడు సర్వ వ్వాపి. సర్వ ప్రేరకుడయ్యు, అతడొక్కడే సర్వావస్థలు గళిత ములు కాగా, పరమాత్ముడొక్కడే అద్వితీయుడును, సంపూర్ణుడునై శేషించుచున్నాడు." అని అతడు వాదించెను. హిందూ వేదాంతుల వేదాంతమునందలి అత్యంత నిర్గుణత. ఆధ్యాత్మికత, అను సంశములను ఈ లియాటిక్సు అంగీకరించెను. పిదప పేర్కొనదగిన వారు అర్వాచీనమయిన ప్లేటో మతమునకు చెందిన గూఢతత్త్వ ద్రష్టలు. తదనంతరీయులు అరేబియను సూఫీ మతస్థులు. వారు భగవదై కాగ్ర్యమును సర్వజనులకు ప్రీతి పాత్రము కావించిరి. వారు దూరస్థుడగు నీశ్వరుని భజింపరు. ఈశ్వరుడు వారి హృదయమునం దుండవలయును. "అత్యున్నత సత్యములను స్వాధ్యాయమువలన అందుకొనజాలము. ఆనంద పారవశ్యమునందలి ఆత్మ పరివర్తనముచేతనే వాటిని పొందగలుగుదుము." అని వారు వక్కాణించిరి. అర్వాచీనమయిన అఖిలేశ్వరవాదము : దీనికి అనుయాయులు పెక్కురు గలరు. దీనిని ప్రకాశింపజేసిన ప్రముఖు లలో సెర్విటను, బ్రూనో, వానిని (vanini), స్పినోజా,ఫిక్టే, హెగెల్— పేర్కొనదగుదురు. బ్రూనో ప్రతిపాదించిన వాదములు రెండు. వాటిని అఖిలేశ్వర వాదము యొక్క ముఖ్యలక్షణములు అనవచ్చును. దేవతలు లోనుండి వ్యవహరింతురు; బహిఃస్థితులయి వ్యవహరింపరు. విశ్వము ఏకము. అనంతము, అనునవి ఆవాదములు. విశ్వైక్యమును చింతించుచు బ్రూనో ఇట్లు వచించెను. "జాత మయిన వస్తు వెట్టిదైనను మార్పునొందును. నిత్యవస్తువు మాత్రము మారునది కాదు. ఆ వస్తువు ఏకము, దివ్యము, శాశ్వతము. వస్తుజాతము విశ్వమునందున్నది; విశ్వము వస్తుజాతమున గలదు. మనము 'తత్' అనుదానియందున్నాము. 'తత్' అనునది మనయందున్నది. అందరము పరిపూర్ణ -అద్వైతమున సమాగమము నొందుదుము.”

ఆధునిక వేదాంతులలో స్పినోజా ప్రముఖుడు. అతడు అఖిలేశ్వర వాదమునకు ప్రవక్తగ పరిగణింపబడెను. స్పష్టత యందు తర్క కౌశలమునందు ఆతని వాదము అద్వితీయము.“దేవుడుసర్వము తానయైయున్నాడు.అతనికంటె భిన్న మొండు లేదు. ఆతనిలో నీ విశ్వము ఇమిడియున్నది. దేవుడు అనంతుడు. ప్రపంచమునకు అంతముకలదు. అనంతవస్తువునకును, నశ్యవస్తువునకును పొత్తుకుదరదు.

నశ్యములగు వస్తువులు యథార్థముగలేనివే. వికార రహితమయిన పదార్థము యొక్క ఖ్యాపనములు లేక ఆకృతులుగా తెలియబడునంతవరకు అవి సత్యములు. ఆధ్యాత్మిక పరిభాషలో అవి సత్యవస్తువు యొక్క ప్రతి రూపములు. అన్య వస్తువు నందున్న దానికే ప్రతిరూపమని పేరు, ఆ అన్యవస్తువు చేతనే దాని స్వరూపము గోచరించును. సర్వము భగవంతునియందే కలదు. భగవంతుని యందు లేనిది లేనేలేదు. సముద్రమునకును, తరంగములకును గల సంబంధము వంటిదే సద్వస్తువునకును, ప్రతి రూపములకునుగల సంబంధము, అవి సత్యవస్తువు యొక్క భిన్న భిన్నములయిన అవిర్భావములు, ఆ వస్తువుకంటే నవి అభిన్నములు. దానియందే అవి లయించును." అని అతడు ప్రవచించెను. ఇట్లు సర్వమునకు అంతర్గతమయిన కారణముగా, సర్వసారముగా విశ్వమునందలి సర్వ వస్తుజాతము పైని విశేషముగ మానవుని హృదయము పైని ప్రభావముతోగూడిన ఆత్మజ్ఞత, సంకల్పము, ప్రజ్ఞ, వ్యక్తిత్వము కలవాడుగా భగవంతుడు స్పినోజాకు గోచరించెను. శాశ్వతమును సర్వగతమునగు కారణమగుటచే భగవంతునకు ఆంగ్లేయములో 'నాచురనాచురన్స్' అని వ్యవహారము. సృష్టియందు ఆవిష్కృతుడగుటచే అతనికి “నాచురనాచురట" అని పేరు. ప్రకృతి అనగా, విశ్వము భగవంతుని ముఖ్యసారము. అందుచే నది అతని శక్తి. కాగా భగవంతుడు, అతనియందలి ప్రకృతి, ఆద్యము, అనౌపాధిక మునగు కారణము. ప్రకృతికార్యము అనగా, ఆతనిశ క్తి యొక్క ఔపాధికమయిన ఆవిర్భా వము. భగవంతునికంటే వ్యతిరిక్తమయినది ఏదియు లేదు.”

ఫిక్టే, మరియొక అర్వాచీనుడగు అఖిలేశ్వరవాది, అతడు దేవుని, విశ్వమును గూర్చి గాఢముగ విమర్శన మొనర్చెను. ప్రతిరూప భేదమునకు వెనుక నున్న వాడు దేవుడే యైనను అతనిని గూర్చి స్వల్పముగానే మనము తెలిసికొనగల్గు చున్నాము. అతనిని రాయిగా, మొక్కగా, ప్రాణిగా లేదా ప్రకృతిసూత్రముగా, నైతిక సూత్రముగా మాత్రమే మనము తెలిసికొనుచున్నాము. ఇవియన్నియు ఆతనికంటె భిన్నములు. ఆకృతియే సత్యవస్తువును మన దృష్టి నుండి మరుగుపరచుచున్నది. ఈ పరిదృశ్యమానమే ఆసత్యవస్తువును దాచుచున్నది. మన దృష్టి ఇంకకంటె విశేషమును గుర్తింపజాలకున్నది” అని ఫిక్టే వచించెను.

అర్వాచీనులయిన హిందూ వేదాంతులలో, రాజా రామమోహనరాయలు మొదలుకొని రవీంద్రనాథ ఠాకూరు వరకు పెక్కురు కలరు. మహర్షి దేవేంద్రనాథ ఠాకూరు, కేశవచంద్రసేను మొదలగు మతోపదేశకు లున్నారు. బ్రహ్మజ్ఞాన సమాజస్థులలో ప్రముఖులుకలరు. వివేకానందస్వామి యొకడున్నాడు. వీరి మత- వేదాంత విషయకములయిన ఆశయములు అఖిలేశ్వరవాదమునకు అనుకూలములైనవి. వీరి వేదాంతము ఏకేశ్వరుని ప్రతిపాదించు ఉపనిషత్తత్త్వమే. ఇది ఆధ్యాత్మిక గూఢ తత్త్వము కంటే అభిన్నము.

అఖిలేశ్వర వాద సిద్ధాంతములు:- " సత్య వస్తు వొకటి కలదు. అది సర్వ వ్యాపి. పరిదృశ్యమానమగు సర్వ ప్రపంచమున కది మూలతత్త్వము. అది ఏకము, అవిది తము, అవేద్యము. బాహ్యప్రకృతి దాని ఆవిర్భావమే " అనునది సంగ్రహముగ అఖిలేశ్వరవాదము యొక్క ముఖ్య సిద్ధాంతము. అభిలేశ్వరవాదము యుక్తి సిద్ధము. దీనికి స్పెన్సరు వేదాంత మొక ఉత్తమోదాహరణము.స్పెన్సరు యొక్క అవేద్య విషయక భక్తియు, నిర్దుణాత్మకమయిన అభిలేశ్వర వాదమే. వేదకాలపు ద్రష్టల నుండి ఆధునికులగు తత్త్వజ్ఞుల వరకు భగవంతునియందలి విశ్వాసము పెంపొందుచున్నదని నిరూపింపబడినది. దేవుడు ఒక్కడు అద్వితీయుడు, సర్వవ్యాపి, పరిదృశ్య మానమగు విశ్వమెల్ల అతని బాహ్యస్వరూపము ” అనునదే ఆ దృఢవిశ్వాసము. నేటికి ప్రకృతిశాస్త్రము దీనిని సరిచూచుటకు ఉపక్రమించుచున్నది. 'సత్త' పూర్వమందు ఉన్నట్టిది. ముందు అది పరిమాణమునందును, తత్త్వమందును మార్పునొందనిది. ఆకృతియందే దానికి మార్పు ఘటిల్లును - అను విషయమును ప్రకృతి యొక్క అనశ్వరత్వము, శక్తి యొక్క సంరక్షణము అను వాటిని గూర్చిన సిద్ధాంతములు నిరూపించుచున్నవి. ఈ ప్రకటనముల పరిణామమే అఖిలేశ్వర వాదముగ దోచును. అవిజ్ఞాత (వస్తువు) ము లేకయే జ్ఞాతమును గూర్చి ఆలోచింప జాలనట్లు ప్రతిభాస- ఆధారముగ నంగీకరింపక యే, ప్రతి భాసములను అంగీకరింపజాలము. వీటిలో ఒకటి, రెండవ దాని పూర్వభావనయే. మనుజుడు ప్రతిభాస- ఆధార స్వరూపమును తెలిసికొనుశక్తి తనకు లేదని యంగీకరించినను, దానియొక్క సత్తను మాత్రము, తర్క ప్రాబల్యమునకు లోనై, అంగీకరింపవలసినవా డగుచున్నాడు. ఆతడు తన శక్త్యభావమును సవినయముగ అంగీకరించటయే అతని వివేకమునకు లక్షణము. ప్రతిభాస-ఆధారము యొక్క రూపములు అనంతములుగా ఆవిష్కృతములు. అవి సంకల్పము, బుద్ధివైభవము, స్రష్ట,సృష్టి, సత్యము - మున్నగునవి. ఈ నామములు, నామమాత్రములుగా (చిహ్నములుగా అంగీకరింపబడువరకు అవి యున్న వనుకున్నను బాధయుండదు. ఈ నామము లన్నియు అనిర్వాచ్యమగు సత్యపదార్థము యొక్క స్వరూప నిరూపణమున అపర్యాప్తములు- అను భావము ఉత్సుకుల హృదయ కుహరమున లక్షితమగుచున్నది. సి. ఇప్లంపుట్రీ అనునాతడు హూకరును ఇట్లనువదించు చున్నాడు. "భగవంతుని యథాస్థితినిగూర్చి మన కేమియు తెలియదని గుర్తించుటయే ఆతని గూర్చి మనకు గల సంపూర్ణ జ్ఞానమగుచున్నది. అతడు అ వేద్యుడు. ఆతనిని గూర్చి మనము ప్రదర్శింపగల వాగ్వైభవము మౌనము వహించుటయే.”

ఇందలి ముఖ్యమైన లోపములు (Limitations) :- అభిలేశ్వర వాదమున బుద్ధివైభవము మెండు. అందలి లక్షణ ములు చిత్తావర్ణకములు. ఐనను అది మతస్థాయిని అందుకొనలేక పోయినది. ఎందుచేతనన అది పాపము, తదుత్పత్తి మున్నగు సమస్యలను వివరించియుండ లేదు. సర్వము దేవుడేయైనచో, లోపములు కూడ దివ్యములే యగును. ఆ పక్షమున దేవుడు అసంపూర్ణుడగుట గాని, పాపమనునది లేనేలేకుండుట గాని సంభవించును. కాని ఇది మన ప్రత్యణానుభవమునకు విరుద్ధమైనది. దేవుడు ప్రతి సంఘటనకు(దృశ్యము) ప్రతిభాన ఆధారమయినచో అతడు ప్రపంచము నందలి పాపముల కెల్ల ప్రతిభాస. ఆధారమగునని అంగీకరింపవలసి యుండును. అట్లంగీకరించుట నాస్తికతను ప్రతిపాదించుటయే యగును. బేకను వచించినట్లు దేవునిగూర్చి అనర్హమయిన అభిప్రాయమును ప్రకటించుట కంటె, ఊరకుండుటయే మేలు. ఎందుచేతనన-ఒకటి అవిశ్వాసముగా, రెండవది అవజ్ఞ గా పరిగణింపబడును. అఖిలేశ్వర వాదమున గల లోప మొక్కటే. పాపమును గూర్చి వివరణ మిందు లేకుండుటయే ఆ దోషము. ఈ వాదమునకు మత గౌరవము చేకూరకుండుటకు గల ప్రతిబంధక మిదియే. అన్ని మతములకుగల నిక్కమయిన ప్రతిబంధక మిదియే.

అఖిలేశ్వరవాదము ప్రగతికి సాధనము కాదను నా క్షేపము ఇందలి రెండవ లోపము. కారణములు-అనంతవస్తువునకును, నశ్యమయిన వస్తువునకును భేదా భావమే ఇందలి సారాంశమగుట; తన్మూలమున నశ్య వస్తువు అనశ్య వస్తువును పెక్కు రీతులు పోలియుండుట ; అందుచేత నశ్య వస్తుసముదాయము అనంత వస్తువువలె పరిపూర్ణతను చెందవలసివచ్చుట - ఇందలి యుక్తి ఇది; నశ్య వస్తుసముదాయము సంపూర్ణమే యైనచో, పురోగతికై, లేదా ఆదర్శ సంపాదనమునకై ప్రయత్నము అనవసరమగును. పూర్వస్థితియే చాలును. కాబట్టి ఈ . వాదమున నైతికముగా లేదా ఆధ్యాత్మికముగా అభివృద్ధికి అవకాశ మేలేదు.

ఇది మరల వ్యక్తిత్వ నిరసనమునకు మార్గదర్శక మగును. అనంత వస్తువికాసము నశ్య వస్తువును కల్పించుచో ; 'సర్వము దేవుడే' అను అఖిలేశ్వర వాదమును బట్టి, నశ్యవస్తువు అనంతవస్తువునకు సమాన మయినచో ; ఈ రెండింటికిని భేదము శూన్య మగును. ఆత్మ, దేవుని ప్రతిచ్ఛాయాంక మగుటచే, పరిచ్ఛిన్నాత్మలకు విశ్వాత్మ గుణాధిరోహణము సాధ్యమా అను విషయమున ఔదా సీన్య మేర్పడును. భావ మేమన- శాస్త్రీయముగా మాత్రము ఆత్మ విశ్వాత్మతో స్వీయమైన వ్యక్తిత్వమును కోల్పోవు నంతగా లీనమగును. పూర్వోక్తము లయిన కారణములను పుర్కరించుకొని ఈశ్వరవాదులు అన్యులతోపాటు అఖిలేశ్వర వాదమొక వేవాంతమనియు అది తృప్తికరమగు మతస్థాయిని అందుకొనజాలక పోయిన దనియు భావించుచున్నారు.

శ్రీ శ్రీ దేవి

[[వర్గం:]] [[వర్గం:]]