Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అక్కన్న మాదన్నలు

వికీసోర్స్ నుండి

అక్కన్న మాదన్నలు: అక్కన్న మాదన్న లిద్దరు అచ్చపుటాంధ్ర పుత్రులు. అయినను వీరు సేడంకాపురస్థులగు కులకర్ణివంశపు కన్నడ బ్రాహ్మణులనియును, మహారాష్ట్రులనియును, శివాజీ ప్రధాని యగు మోరోపంతు పింగళే యొక్క దాయాదులనియును కొంత ప్రచార మున్నది. ఈ వాదమును సమకాలికులగు ఏ చారిత్రకులచేతను చెప్పబడలేదు. చారిత్రక నిదర్శనములు గాని, స్థల పురాణములు గాని ఈ వాదమునకు బల మొసంగుటలేదు. వీరి పింగలివంళము, ఆ పింగళే వంశము పేరు. ఋషులు వేరు. వీరు ఆంధ్రులనుట చారిత్రక సత్యము. అయితే, ఎచ్చటివారో నిష్కర్షగా చెప్పుటకు వీలుపడదు. ప్రస్తుతము అందుబాటులోనున్న చారిత్రక సాధనములను బట్టి వీరు భానుజయ్య, భాగ్యమ్మల సంతానము. భానుజయ్య హనుమకొండలో 'ఆమిలు' నొద్ద పని జేయు ప్రభుత్వోద్యోగి. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు కలిగినారు. కొడుకుల పేర్లు వరుసగా అక్కన్న, మాదన్న, విస్సన్న ( విశ్వనాథుడు), మల్లన్న ( మృత్యుంజయుడు ). ఆడపిల్లల పేర్లు తెలియుట లేదు. అయినను వీరి సంతానముగ కంచర్ల గోపన్న (రామదాసు), పొదిలి లింగన్న, పులిపల్లి ఎంకన్న (రుస్తుంరావు) అనువారు కలరు. అక్కన్నకు "మల్లు" అను కొడుకును, పేరు తెలియని ఒక కూతురును ఉండిరి. మాదన్నకు మల్లన్న యను కుమారుడును, పేరు తెలియని ఒక కుమార్తెయు ఉండిరి. మూడుతరముల వంశవృక్ష మీ క్రింద ఈయబడినది :

భానుజయ్యపంతులు తనకొమరులకు యుక్త వయస్సున ఉపనయనములు చేసెను. ఆ దినములలో అవసరములుగా నుండిన పారసీ, హింది, సంస్కృతము, ఆంధ్రము మున్నగు భాషలను వారికి చెప్పించెను. వివాహానంతరము అక్కన్న మాదన్నలు ఉద్యోగము కొరకు రాజధానియగు హైదరాబాదునకు ఏతెంచిరి. అప్పుడు వీరి వయస్సు ఇరువది రెండు, ఇరువది సంవత్సరములు ఉండవచ్చును. కొంత ప్రయత్న ఫలితముగా మీర్జామహమ్మదు సయీదు మీర్జున్లూ నొద్ద స్వల్ప వేతనములపై ఇద్దరును ఉద్యోగములలో కుదిరిరి (1650).వీరు క్రమముగా తమ ధీ విశేషముచేతను, అవిరళ పరిశ్రమ వలనను ఒక్కొక మెట్టెక్కుచు పైకివచ్చిరి.

క్రీ. శ. 1656 లో మీర్జుమ్లా చేసిన తిరుగుబాటులో ఈ అన్నదమ్ములు పాల్గొనలేదు. అందుచే భూమ్యాదాయశాఖలోని వారి పదవులట్లే యుండెను. తరువాత మరి పది సంవత్సరములు కష్టించి పనిచేయుచురాగా వీరిరువురిలో ఎక్కుడు ధీశాలియగు మాదన్న గోలకొండ సర్వ సైన్యాధ్యక్షుడగు “బక్షీ - ఉల్ ముమాలిక్ " కడ పేష్కారుగ ప్రతిష్ఠితు డయ్యెను (1666). అప్పటినుండి భూమ్యాదాయశాఖ క్రీ.శ. 1673 వరకు ఈ అన్నదమ్ముల పర్యవేక్షణలోనే ఉండెను. ఉద్యోగములో ప్రవేశించినప్పటినుండి క్రీ. శ. 1678 తుదివరకు రమారమి 25 సంవత్సరములు గోలకొండ భూమ్యాదాయ శాఖ వీరి ఆధీనములో నుండెను.

క్రీ. శ. 1674 వ సంవత్సరపు విప్లవానంతరము మీర్జుమ్లా యగు సయ్యదు ముజష్ఫరు పతనమొందెను.1674 జూన్లో లో మాదన్న గోలకొండ ప్రధాని ( మీర్జుమ్లా ) గ నియుక్తుడయ్యెను. సుల్తాన్ అబుల్ హసిన్ తానాషా అతనికి "సూర్యప్రకాశరావు" అను బిరుదు, ఏనుగు, గుఱ్ఱము, కత్తి, నగారా, రాజాంబరములు ప్రసాదించెను. అక్కన్న పేష్కారు పదవియందు ప్రతిష్ఠితుడయ్యెను. మాదన్న తమ్ముడగు విశ్వనాథుడు హనుమకొండ "ఆమిలు" గను, మేనల్లుండ్రలో నొకడగు ఎంకన్న దండనాయకుడుగను నియమితులైరి.

మాదన్నను ప్రధానిగ నెన్నుకొనుటలో సుల్తాను 3 సూత్రములను దృష్టియందుంచుకొనినట్లు అగపడుచున్నది. (1) మాదన్న బుద్ధివిశేషము ఆతనికి తనయెడ గల భక్తివిశ్వాసములు. (2) తన వంశ్యులగు ఉమ్రావులకు, సర్దారులకు మంత్రిత్వ మొసగినచో వారు తనయెడ భక్తి వినయ విశ్వాసములను జూపరు. (3) మతోన్మాదము గల ఔరంగజేబునకు ముస్లిములు వశ్యులగుదురు.

మాదన్న ప్రధానియగునప్పటికి గోలకొండ రాజ్యపు కోస్తా శ్రీకాకుళమునుండి చెంగల్పట్టువరకు 480 మైళ్ళు వ్యాపించి యుండెను. ప్రధానియైన తదుపరి మాదన్న దేశములో శాంతిభద్రతలు నెలకొల్పుటలో నాలుగు నెలలు గడిపెను. ఆపై నవంబరునుండి డిసెంబరు తుది వరకు రెండు నెలలు రాజుతోగూడి రాజ్యమంతయు తిరిగి 1675 జనవరిలో రాజధానికి మరలవచ్చెను గోలకొండ చరిత్రలో ఈ విధముగ రాజును, ప్రధానియు, ఊరూరు తిరిగి ప్రజల బాగోగులు విచారించుట అపూర్వ మగు విశేషము. ప్రతి స్థలము నందును, ముఖ్యముగ మచిలీపట్టణ మందును వీరికి ఘనమగు సత్కారము జరిగెను, ప్రధాని యగునాటికి మాదన్న వయస్సు రమారమి 52 సంవత్సరములు ఉండియుండును. మాదన్న పరిపాలనమును కొన్ని ముఖ్య శాఖలుగ విభజింపవచ్చును. 1. ఆంతరంగిక శాఖ, 2. దేశీయశాఖ, 3. అంతర్జాతీయశాఖ, 4. రక్షణశాఖ, 5. సైన్యసంస్కరణశాఖ, 6. భూసంస్కరణశాఖ.

1. ఆంతరంగిక విధానము :- పెక్కు సంస్కరణలు ప్రవేశ పెట్టి పరిపాలనా యంత్రమును నిర్దుష్ట మొనరించి, వివిధ శాఖలుగా విభజించెను. కేంద్ర, ప్రాంతీయ, గ్రామ పరిపాలనములను వేర్వేరు చేసెను.

కేంద్రములో రాజు, ప్రధాని, విదేశీయాంగ మంత్రి, దేశీయమంత్రి, ముజ్ములేదారు, బషీఉల్ మూమిలిక్, సరే ఖేల్, దారోగాయే ఆజం, సదరుఖాజీ, దబీరు, మహేల్దారు. మంత్రివర్గముగ నేర్పడెను.

ప్రాంతీయ పరిపాలనా వర్గమున తరల్దారు, దివాను, సరేఖేల్, ఖాజీ, పండితులు ఉండిరి.

సర్కారు, సిమ్లు, పరగణా, మహల్, పాలకవర్గము గూడ దాదాపు ఈ విధముగనే యుండెను.కాని అచ్చటి సైన్యాధిపతులు వరుసగ పౌజ్దారులనియు, హవల్దారులనియును, న్యాయాధికారులు "ఖాతిబు” లనియు పిలువబడెడు వారు. మాదన్నకు ముందు వీరికి జాగీరు లుండెను. వీరికి జీతములు ఏర్పాటుచేసి మాదన్న వారలను విధేయులుగను, రాజ భక్త్యధికులుగను కావించి, నీరసులుగు నొనర్చెను.

గ్రామపరిపాలన :- పట్వారీ, మాలీపటేలు, కొత్వాలీ పటేలు, శేఖు సనదు, పురోహితుడు, వీరు పాలక వర్గముగా నేర్పడిరి. వీరికి జీతములుగాక మాన్యము లుండెను.

పరిపాలన :- మాదన్నకు పూర్వము దేశమున కొక రాజ్యాంగము, ప్రజలకు భద్రత లేకుండెను. దేశము సార వంతమయ్యును, సుభిక్షము గాకుండెను. మీర్జుమ్లా మొదలు బంట్రోతువరకు అందరును బాహాటముగనే లంచములు అడిగి వుచ్చుకొనెడివారు. మిర్జామహ్మదు సయీదు, మహమ్మదు అమీను, సయ్యదు ముజప్ఫరు అను వారలు మీర్జుమ్లాలుగా నున్నపుడు సైతము ప్రజలకు ఈ గోడు తప్పలేదు.

మాదన్నకు పూర్వము దేశములోని "తరఫు” లు మొదలుకొని గ్రామముల వరకు అన్నియు వార్షికములకు వేలము వేయబడుచుండినవి. అందుచేత అస్థిరత అవిశ్వాసము దారిద్య్రము బాగుగ పాదుకొనిపోయినవి. ఇజారాదారుల దౌర్జన్య క్రౌర్యములకు తాళజాలక గ్రామములకు గ్రామములే మనుష్యరహితములైనవి. ముల్లాలకు, బ్రాహ్మణులకు అనేక గ్రామములు మాన్యములుగ నీయబడుచుండెడివి. ఈ కారణముల వలన ప్రభుత్వము భూమ్యాదాయ విషయమున విపరీతముగ నష్టపడినది. అడవులు నరకి క్రొత్త గ్రామములు నిర్మించుట, పాడుపడిన గ్రామముల పునరావాస మొనర్చుట, అగ్రహారములు, మాన్యములు మున్నగువాటి నుండియు స్పల్ప మొత్తములు శిస్తుల రూపమున రాబట్టుట అను మూడు పద్ధతులను అవలంబించి మాదన్న గొడ్డుబోయిన భూమ్యాదాయమును కామధేనువుగ నొనర్చెను. వ్యవసాయము, తోటలు అభివృద్ధిపరచి వాటి ఫలసాయమును సరసమగు ధరలకు విక్రయించు వ్యవస్థ చేసెను. ఈస్టిండియా కంపెనీతో జరిగిన సుదీర్ఘ సంఘర్షణము ఇందులకొక నిదర్శనము, గ్రామములను వేలము వేయు పద్ధతులను మాన్పించి గ్రామాధికారులను మాదన్న నియమించెను. దేవాలయ పోషణము కొరకును, పురోహితుడు, వడ్రంగి, కురుమ, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, దాసరి, తంబళి,సర్రావ్, పట్వారి, పటేలు, షేఖుననది, వెట్టి, మాదిగ మున్నగు పనివారల జీవనము కొరకును మాన్యము లీయబడెను. చోరుల బాధలు అరికట్టబడెను. శాంతిభద్ర తలు నెలకొల్పబడెను.

ప్రభుత్వపు అయోమయ స్థితివలన మూసివేయబడిన విఖ్యాతములగు వజ్రపుగనులను మాదన్న మరల తెరపించెను. భూసముద్ర వ్యాపారములను అభివృద్ధిపరచెను. రేపు సుంకముల ద్వారమునను విశేషాదాయము వచ్చునట్లు చేసెను. సయాంతో జరిగిన నౌకా యుద్ధము సముద్ర వ్యాపార రక్షణకు జరిగినదే. మందుగుండు, నేత, అద్దకము, శిల్పము, చిత్రలేఖనము మున్నగు ననేక ముఖ్యపరిశ్రమలను అభివృద్ధిపరచెను.


నాణేముల ముద్రణాధికారము ఇంతవరకు ఇతరులు కీయబడియుండెను. మాదన్న ఆ పద్దతిని రద్దుపరచి ప్రభుత్వపు టంకసాలలో నాణెములు ముద్రించు నేర్పాటు చేసెను. ఈ క్రింద బేర్కొనిన నాణెములు సిద్ధమగు చుండెను. 1. వరహా 2. ఫనము, 3. నేవలము, 4. కాసు, 5. తార, 6. గవ్వ. వరహా ⅝ అంగుళముల వెడల్పును, 52⅓ గురిగింజల బరువును, 21¾ క్యారెట్ల వన్నెను కలిగియుండెను. ఇది విజయనగరపు నాణెము.

మాదన్న చట్టబద్ధ మొనర్చిన కొలత మానములో గజము, మూర ఉండెను. తులామానములో తులము, శేరు, వీసె, పుట్టి, ఉండెను.

మంత్రిపదవి వహించినతోడనే మాదన్న రాజ్యమున పర్యటనము చేసియుండెను గదా ! ఆ పర్యటనమువలన పరిపాలనా యంత్రమందలి దోషములు మాదన్నకు బాగుగ బోధపడెను. చీకులు, భోగలాలసులు, స్వార్థులు, అసమర్దులును అగు ఉన్నతోద్యోగులను తొలగించి, వారి స్థానములలో సమర్థులగు యువకులను నియమించెను. ఇంతవరకు ఉన్నతాధికారులు తమ స్థానములకు బోవక పట్టణములందే యుండెడివారు. మాదన్న యీపద్ధతిని మాన్పించి అధికారులు తమతమ ప్రాంతము లందు వసించునట్లు కట్టడిచేసెను. అంతియేగాక, ప్రతి రెండు, మూడు సంవత్సరముల కొకసారి అధికారులను మార్పుచేయు నాచారమును ప్రవేశ పెట్టెను. దీనివలన పరిపాలనా యంత్రాంగము పరిపుష్టమై, చైతన్యవంతమైనది.

సిమ్రులను (రాష్ట్రములను), తరఫులను (మండలము లను) మరలనిర్మించి, వాటిపై విశ్వాసపాత్రులు, సమర్థు లును అగు యువకోద్యోగులను నియమించెను. వాపీ, కూపతటాకములు, రహదారులు, అన్నసత్రములు, ఉచిత విద్యా వైద్య ప్రసూతిశాలలు, ఏర్పాటు చేసెను. క్రొత్తగ జయింపబడిన కర్ణాటకమందు శాంతి నెలకొల్పెను. ఆ ప్రాంతమును “ఖిబ్లా పట్టి" యనియును, అచ్చటి నాయకులను అహ్నం అనియును పేర్కొ నెడువారు. ఈ క్రొత్త పద్ధతులపై రెండు సంవత్సరములు పరిపాలన జరిగిన మీదట తన సంస్కరణ ఫలితములను పరిశీలించుటకై మాదన్న 1678 జనవరిలో మరల రాజయుక్తముగ మూడు నెలలు దేశసంచారము చేసి మార్చి తుదకు గోలకొండకు ఏతెంచెను.

ఉద్యోగములు, మన్సబులు, ఇతర ప్రత్యేకతలు కోలుపోయిన ఉన్నతాధికారులు, ఉమ్రావులు మున్నగువారు 1676 మధ్యలో తిరుగుబాటు చేసిరి. వీరికి గజపతి కుమారుడు నాయకత్వము వహించెను. అయితే రాజవంశీయుడగు అప్పలరాజును మాదన్న తనకు వశంవదుని చేసికొని అతని సాయమున తిరుగుబాటుదారుల నడచి, శ్రీకాకుళము వరకు దేశమును మరల స్వాధీనపరచు కొనెను. అప్పలరాజునకు "అప్పలపాయక రావు బహద్దరు " అను బిరుదును, అనేక జాగీరులను ఒసగెను. (పాయకరావనగా యుద్ధమున ముందుండు వాడని యర్థము.)

ఆర్థికనీతి :- దేశములో శాంతి నెలకొల్పుట యందును, బీజాపురముతో, మొగలులతో జరిగిన ఒప్పందమును నెరవేర్చుట యందును, పాడుపడిన దుర్గములను బాగుచేయుట యందును, సైన్యమును బలిష్ఠము చేయుటయందును, పశ్చిమోత్తర సరిహద్దులను సురక్షిత మొనర్చుటయందును మాదన్న ధనము విశేషముగా వ్యయము చేసెను. ఆ దా సరిపడునదిగాకుండెను. అందుచే మాదన్న వ్యయము తగ్గించియు, పెద్ద జీతములు మన్సబులు తగ్గించియు, ఆయవ్యయములను సరిపుచ్చుటకు ప్రయత్నించెను. ఈ మార్పులు జన సామాన్యపు శాంతజీవనమునకు ఎంతో దోహదము కలిగించెను. ప్రజలకు అగ్రహారీకులనుండియు, అధికారులనుండియు ఎట్టి అలజడి కలుగకుండ కట్టుదిట్టములు చేసెను. దేశము సస్యశ్యామల మయ్యెను. ప్రజలు సిరిసంపదలతో హాయిగ నుండిరి. ప్రభుత్వాదాయము వృద్ధిచెందెను. ఇట్టి ఘనవిజయమునకు సుల్తాను మిక్కిలి సంతోషించి మాదన్నకు “ఆలంపనాః” అను బిరుదును ప్రసాదించెను.

క్రీ. శ. 1657 నాటి మీర్జుమ్లా తిరుగుబాటు వలనను, మొగలాయీల యుద్ధములవలనను రాజ్యములో అశాంతి ఏర్పడెను. ఆ కారణమున రాజ్యములోని వజ్రపు గనులు మూసి వేయబడెను. 1660 నుండి 1674 వరకు వజ్రాల గనులలో పనులు జరుగలేదు. మాదన్న ఆగనులను తెరపించి సక్రమముగా పనిచేయునట్లు ఏర్పాటుచేసెను. గనులలో పనిచేయు కూలివారికి అనుకూలముగ నుండునట్లు భృతినిర్ణయములు గావించెను. తిరిగి గోలకొండ రాజ్యము యథాప్రకారము "రత్న కోశము" గా ప్రసిద్ధి చెందెను.

దేశీయ విధానము :- ఆంగ్లేయులు జబర్దస్తీగా వ్యవహరింప మొదలిడిరి. తమ గిడ్డంగులను సైనిక స్థావరములుగా

మార్చిరి. దేశీయ వర్తకులను పీడింపసాగిరి. ప్రభుత్వ ఫర్మానాలను నిర్లక్ష్యము చేయసాగిరి. స్వంత నాణెములను చలామణి చేయసాగిరి. న్యాయస్థానములను ఏర్పాటు చేసి ప్రభుత్వము నెరవసాగిరి. ఆంగ్లేయుల విధానము గోలకొండ ప్రభుత్వ వ్యాపారముపై దెబ్బతీయునదిగా నుండెను. అంత ప్రధాని మాదన్న ఆంగ్లేయుల అధికార విజృంభణమును అధికార దర్పముతో అణచి వేయుటకు కడగెను. కర్ణాటకములోని పరిస్థితులను చక్కదిద్దుటకు సమర్థులగు పాలకులు నియమింపబడిరి. వీరిలో అక్కన్న, లింగన్న లిద్దరు ఆంగ్లేయులకు కొరకరాని కొయ్యలయిరి. ఆంగ్లేయుల ఆటలు సాగవయ్యెను. మాదన్నను తమ కనుకూలునిగా చేసికొనుటకు ఆంగ్లేయులు పడరానిపాట్లు పడిరి. వారి ప్రయత్నము లన్నియు వ్యర్థమయ్యెను. దేశీయ ప్రభుత్వమునకు, దేశీయ వ్యాపారులకు ప్రాబల్యమునుచే కూర్చునట్టి మాదన్న యొక్క రాజనీతి ప్రయోగ విధానమునకు తట్టుకొనలేక ఆంగ్లేయులు గోలకొండ రాజ్యమందున్న తమ గిడ్డంగులను, నిర్మాణ శాలలను ఎత్తివేసి, జింజీకి ప్రయాణమయిరి. దేశభద్రత, ఆర్థిక బలము, గౌరవము, వర్తకము, దేశీయవర్తకుల మర్యా దలు వృద్ధినొందెను.

విదేశీయ విధానము :- మొగలులు దక్షిణ రాజ్యములను జయించుటకు కడగి కొంతవరకు జయముపొందిరి. బీజపూరు గోలకొండ రాజ్యములకు ప్రమాదము కనుచూపుమేరలోనికి వచ్చెను. బీజాపూరునందు రాజగు రెండవ అలీ ఆదిల్ షా మరణించెను (1672). అతని కుమారుడు పంచవర్ష ప్రాయుడు సికిందరు రాజయ్యెను. రాజ్యములో అంతఃకలహములు ప్రబలసాగెను. మాదన్న కల్పించుకొని నాయకప్రతినాయకుల మధ్య సంధిచేసెను. ఈ సంధి సూత్రముల ప్రకారము బీజపూరు రాజ్యమును గోలకొండ రాజ్యము రక్షించునట్లును, గోలకొండ రాజ్యపు విదేశాంగ నీతి ననుసరించి బీజాపూరు వర్తించు నట్లును, మాదన్న నిబంధించెను. బీజాపురము దర్బారు నందు గోలకొండ ప్రతినిధి నియుక్తుఁడయ్యెను. కాని సర్దారులు నాయకుడు “వకీల్ -ఉల్ -సుల్తనతు” అగు సిద్ధిమసూదు ఈ సంధిషరతులకు విరుద్ధముగ ప్రవర్తించెను, మాధన్న 'విధానమునకు విఘాతము కలిగినది.

అయినను అతడు నిస్పృహ చెందక బీజాపురమందు గోలకొండ ప్రతినిధిగనున్న అక్కన్నను వాపసు పిలిపించు కొనెను. అయినను మొగలులు బీజాపూరుపై దండెత్తినప్పుడు సికందరు యొక్క అభ్యర్థనమును పాటించి మాదన్న ప్రచండ సైన్యమును పంపెను. ఈ సైనిక సహాయమువలన ఔరంగజేబు మాదన్న మీద క్రుద్ధు డయ్యెను. మహారాష్ట్రశక్తి ప్రళయ తాండవమునకు బలిగాకుండ గోలకొండ రాజ్యమును సంరక్షించుటకును, మొగలుల ఉపద్రవమునుండి కాపాడుటకును, దూరమాలోచించి మాదన్న అబుల్ హసన్ తానాషాకును, శివాజీకిని మైత్రి కుదిర్చెను. శివాజీ హైదరాబాదునకు విచ్చేసి ఒక సంధి పత్రముపై సంతకము చేసెను. ఈ సంధి షరతులప్రకారము మొగలులకు వ్యతిరేకముగ పరస్పరము సహాయముచేసికొనుటకు నిశ్చయింపబడెను. సుశిక్షితులయి లక్షసంఖ్యాకులగు మహారాష్ట్ర సైనికులు గోలకొండ రక్షణమునకు లభించిరి. ఈ సంధి కారణముగా గోలకొండ రాజ్యమునకు శాంతిభద్రతలు చేకూ రెను. ఇది మాదన్న మంత్రి రాజనీతి చతురతకు పరాకాష్ఠయని చెప్పవచ్చును. అయితే దీనివలన అలంఘీరునకు కోపము హెచ్చినది. ముసల్మానులిది దేశ ద్రోహముగా భావించిరి. విద్వేషపూరిత ప్రచారములు సాగెను. మాదన్న యున్నంతవరకు గోలకొండ మీద తనయాటలు సాగవని ఔరంగ జేబునకు తోచెను. గోలకొండ సైన్యము సదా సంసిద్ధమై బలోపేతమై యుండెను. మొగలు సేనలు 1677 లో మాల్ఖేడునొద్ద గోలకొండ సేనల పరాక్రమమును చవిచూచెను. ఆ యుద్ధమున సామ్రాజ్య సేనలు ఘోర పరాజయము పాలయ్యెను. ఇరువది మైళ్ళలో నున్న గుల్బర్గాను చేరుటకు మొగలు సేనలకు 12 దినములు పట్టెను ! మాదన్న ప్రతిభ అట్టిదిగా నుండెను.ఇగంతయు ఆత్మరక్షణ కొరకు మాదన్న చేయవలసివచ్చెను. కాని సార్వభౌమ ప్రభుత్వమునకు కట్టవలసిన కప్పము యథాప్రకారము మాదన్న చెల్లింపసాగెను. అంతియెగాదు. 1692 లో చక్రవర్తి దక్షిణాపథమునకు రాగా, మాదన్న పదునైదు ఏనుగులను, కొన్ని మణుగుల బంగారమును, కప్పమును బురహాను పురములో నున్న యాతనికి సత్కారపూర్వకముగా బంపెను. అయినను అక్కన్న మాదన్నల యెడ క్రోధము విడనాడక ఔరంగ జేబు "జన్నారుదారానె దక్కన్ ఖాబిలె గర్దజదన్" (దక్షిణపు యజ్ఞోపవీత ధారులు అక్కన్న మాదన్న వధార్హులు.) అని తానాషా ప్రభువునకు వ్రాయుచుండెడి వాడు.

మాదన్న పరిశ్రమలకు, వాణిజ్యములకు ఎక్కుడు ప్రోత్సాహమిచ్చెను. గోలకొండ వణిజులు ఓడలనిండ సరకుల నింపుకొని తూర్పు, పడమరలనున్న దూరదేశములకు పోయి, వ్యాపారము చేయుచుండిరి. ఆంగ్లేయులు, పరాసు వారు, సయాం చక్రవర్తిని ప్రోత్సహించి గోలకొండ పర్తక నౌకలను దోపిడి చేయించుచుండిరి. రెండుమూడు పర్యాయములు మాదన్న ఉపేక్షించెను. అయితే అది మాదన్న నీరసతగ నెంచి గోలకొండ వర్తకనావలను తరుచు కొల్లగొట్ట సాగిరి.అందుచే మాదన్న తన నౌకాబల సహాయముచే సయాం, ఆంగ్ల, పరాసులు సంయుక్త నౌకాబలమును 1685 ఉత్తరార్ధమున నోడించి, తన వ్యాపారమును సురక్షితము చేసెను. మాదన్న భూనైన్యములనేగాక, సముద్ర సైన్యములను సహితము సంస్కరించి, సత్వసంపన్నములనుగా నొనర్చియుంచెనని తెలియుచున్నది.

దేశరక్షణ వ్యవస్థ:- దేశరక్షణ విషయములో మాదన్న అత్యంతము జాగరూకతను వహించి సువ్యవస్థగావించెను. భువనగిరి, ఓరుగల్లు, ఖమ్మముమెట్టు, కొండపల్లి, కొండవీడు మొదలగు దుర్గములను వృద్ధిపరచెను. ప్రతి దుర్గము నందును ఉండు పండ్రెండువందల సైనికుల సంఖ్యను రెండు వేలకు పెంచెను. (1682). మన్సబుదారి పద్ధతి పైన జాగీరుదారులు కొంత సైన్యమును రాజునకు సహాయార్థము సిద్ధముచేసి యుంచెడివారు. కాని జాగీరుదారులతోనే యుద్ధము సంభవించినచో జాగీరు సైన్యము జాగీరు వారి పక్షముననే యుండునుగదా.మాదన్న ఈ విధానమును మార్చివై చెను. సైనిక నిర్మాణ వ్యవస్థయంతయు రాజాధీనముననే యుండు నట్లేర్పరచెను. దేశీయ, విదేశీయ సైనికుల జీతములందుగల హెచ్చుతగ్గులను మాదన్న సవరించెను. ఆశ్విక దళమును, శతఘ్నీ దళమును విస్తృతపరచెను. సామ్రాజ్యపు ప్రబలసైన్యములను ఎనిమిదినెలలు పది రెండు దివసములు కాలూననీక అదలించినదీ శతఘ్నీ దళమే.

రాజ్య వ్యవస్థ : భూమ్యాదాయ, పరిపాలనాశాఖల సౌలభ్యము కొరకు మాదన్న దేశమును ఖండములుగను, ఖండములను సర్కారులుగను, సర్కారులను పరగణాలుగను విభజించెను. తెలంగాణ ఖండములో ఇరువది సర్కారులును, రెండు వందల ఇరువదినాలుగు పరగణాలును; కర్ణాటక ఖండములో ఇరువది రెండు సర్కారులును, మున్నూట పదునాలుగు పరగణాలును; ఆర్కాటు (తమిళ) ఖండమునందు పదునారు సర్కారులును, నూట పదునారు పరగణాలును ఉండెను. గోలకొండ రాజ్యము మూడు ఖండములు, ఏబది ఎనిమిది సర్కారులు, వందల ఏబదినాలుగు పరగణాలు కలదిగా నుండెను.

అక్కన్న మాదన్నల హత్య :- క్రీ. శ. 1685 అక్టోబరు నాటి సంధి ననుసరించి ఈ యన్నదమ్ములు పదభ్రష్టులయి, కారాగారవాసులయి యుండవలసి యుండెను. సుల్తాను దాని నమలుపరచలేదు. కాని ఆ సంధి నియమముల వలన మాదన్న విరోధులకు ధైర్యమెక్కువయినది. రాజాంతఃపురమునందును, వెలుపలను ఈ యన్నదమ్ములను హత్యచేయుటకు కుట్రలు ప్రబలెను. 1686 మార్చి నెల తుది భాగమున ఒకనాటి రాత్రి మొదటి యామమున రాచకార్యములు ముగించుకొని, రాజాజ్ఞ గై కొని అక్కన్న మాదన్నలు ఇంటికి బోవుచున్న సమయమున కుట్రదారులు తటాలున వారిపైబడి కనుమూసి తెరచునంతలో వారిని హత్య చేసిరి. విశేషముగ లంచముల కావరకే అంగరక్షకులు లోబడియుండుటచే ఈ హత్యాకాండ సునాయాసముగ జరిగిపోయినది. తరువాత హంతకులు నగరము పైబడి రుస్తుంరావును (పులిపల్లి, ఎంకన్న) రెండు వేల బ్రాహ్మణ కుటుంబములను సమూలముగా హత్యగావించిరి. వారి యిండ్లను దగ్ధమొనర్చిరి. అసంఖ్యాకములగు తాళపత్ర గ్రంథములను అగ్నిలో పడ పైచిరి.

అక్కన్న మాదన్నల శిరములను రోహీరులో నున్న షాఆలమునకు పంపిరి. అతడు వాటిని పోలాపురములో నున్న చక్రవర్తి కడకు పంపెను. ఆతడు గోలకొండ తనకు వశమయినట్లే భావించి సంతసించెను. ఆ శిరములను ఏనుగులచేత త్రొక్కించెను. వీరి మరణమునకు సుల్తాను అబుల్ హసన్ తానాషా మిక్కిలి దుఃఖంచెను.

అక్కన్న మాదన్నలు పలు భాషలయందు అసమాన పాండిత్యము కలవారు, సనాతన ధర్మావలంబకులయినను పురోగాములు, రాజకీయశాస్త్రకోవిదులు, అర్థశాస్త్ర ప్రవీణులు, కార్యదక్షులు, రాజభక్తి పరాయణులు, శిష్టజన సంరక్షకులు, దుష్టజన భయంకరులు. మాదన్న ప్రపంచములోని మహామంత్రులతో సమానముగా నెన్న దగినవాడు. జ్యేష్ఠుడగు అక్కన్నయు అసామాన్య ప్రతిభాశాలిగా పేరొందెను. అక్కన్న పేష్కారుగను, దేశీయాంగ, రక్షణ, వాణిజ్య, నౌకా మంత్రిగను, పైన్యాధ్యక్షుడుగను, రాయబారిగను, పెక్కు బాధ్యతాయుతములయిన పదవులను అత్యంత సామర్థ్యముతో నిర్వహించెను. అక్కన్న సాహసికుడు, యథార్థవాది, అరిభయంకరుడు, తమ్మునిలోనున్న సౌమ్యత ఈతనియందు కొంత లోపించినట్లు కనపడును.

కొ. భూ.రా.

[[వర్గం:]] [[వర్గం:]]