సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్జలము
అంతర్జలము:- భూమిమీద పడెడు వర్షపునీరు కొంతభాగము ఆవిరిగా మారుట, కొంతభాగము నెలయేరులద్వార సముద్రములకు ప్రవహించుట, మరి కొంతభాగము భూమిలోనికి ఇంకుట అందరికి తెలిసిన విషయమే. ఇట్లు భూమిలోనికి ఇంకుచున్న నీరు, ఇంక ఇతర కారణములవలన కూడ భూమి ఉపరిభాగమున కొంతవరకు వ్యాపించి యుండిన నీరు అంతర్జల మనడును. నూతులు, నీటిబుగ్గలు (Springs) మొదలయినవి, ఈ అంతర్జాలపు ఉనికిని కొంతవరకు తెలియచేయును. అనాదినుండియు నీరు రాళ్ళలోనికి పీల్చబడుచు, వాటిలోనుండు పగుళ్ళను (Cracks), బీటికలను (Fissures) ఇంక ననేక ఖాళీ ప్రదేశములను నింపుచున్నది. ఇందులో కొంతభాగము నీటిబుగ్గలుగాను, మరికొంత భాగము రాళ్ళలో నుండెడు సూక్ష్మరంధ్రముల ద్వారాను (Pores) అనేక వృక్షముల ద్వారాను, తిరిగి భూమి ఉపరిభాగ చేరుచుండును. వర్షము, మంచు, చెరువులు, నదులు, మొదలయిన వాటినుండి ఇంకుటవలన ఏర్పడిన అంతర్జలమును వర్షపాతజలము (Meteoric) అనియు, నీటిలో నేర్పడిన ఒండ్రుమట్టి పొరల (Sediments)మధ్య ఉండిపోయిన నీటిని కాన్నేటు జలము (Connate Water) అనియు అందురు.
భూమి ఉపరిభాగమునుండి లోతుగ పోయినపుడు కొంత దిగువున మన్ను రాళ్ళు మొదలయినవన్నియు తడిగా నుండి సంపృక్తత (Saturation) చెంది ఉండును. ఈ మండలమును సంపృక్త మండలము (Zone of saturation) అందురు. దీని ఉపరిభాగము సంపృక్త జలమట్టము (Water table) అని పిలువబడును. ఇది తేమగా ఉండెడు ప్రదేశములలో తక్కువ లోతులోను, ఎడారివంటి ప్రదేశములలో వందలకొలది అడుగులు లోతుగాను ఉండును. ఈ మట్టము వర్ష కాలములో పైకివచ్చుచు, ఇతర కాలములో క్రిందికి దిగుచుండును. ఈ సంపృక్త జలమట్టము వివిధ ప్రదేశములలో మారుచు నుండును. ఇది ఆయా ప్రదేశములలో లభ్యమగు అంతర్జల పరిమాణముపై నాధారపడి యుండును. ఈ పరిమాణము, తిరిగి శీతోష్ణస్థితి, శిలల స్వభావములు(Character of rocks) వీనిపై ఆధారపడి యుండును. శీతోష్ణస్థితి, ఆవిరియగుట (Evaporation), వర్షపాతము అను రెండు క్రియలద్వారా భూమిమీద జల పరిమాణమును అదుపులో నుంచును. సచ్ఛిద్రత (Porosity), భేవ్యత(Permeability) అను శిలాస్వభావములు, రాళ్ళు పీల్చుకొను నీటి పరిమాణమును అదుపులో నుంచును.
అంతర్జలము ఉపరిభాగమునకు ఊటలుగా (Seepages)గాని లేక నీటిబుగ్గలు (Springs) గా గాని వచ్చును. నీటి బుగ్గలు సాధారణముగా సంపృక్తజలమట్టము భూమి ఉపరిభాగమును తాకి అతిక్రమించునపుడును; భేద్యమైన శిలలు (Permeable rocks) అభేద్యమైన శిలలను (Impermeable rocks) తాకు చోటను సంభవించ గలవు. అంతర్జలచలనము (Ground water movement) ఆయా చోటులనుండు రాళ్ళయొక్క లక్షణములపై ఆధారపడి యుండును. బాగా తెరపుకలిగిన బీటికలు (Fissures) అతిఛిద్రత కలిగిన రాతిపొరలవలెనే పనిచేయును, ఈ నీటి ప్రవాహము తిరిగి వివిధములైన రాతిపొరల భేద్యతలోని వ్యత్యాసములపై కూడను ఆధారపడి ఉండును.
సాధారణపు బుగ్గలుగాక, కొన్ని చోట్లలో వేడి నీటి బుగ్గలుకూడ ఉండును. ఇవి చాల ఉష్ణోగ్రత కలిగి ఉండును. ఈ ఉష్ణోగ్రత వివిధ ప్రదేశములలో వేరు వేరుగ నుండును. దీనికి రెండు ముఖ్యకారణము లున్నవని చెప్పవచ్చును. అందులో మొదటిది నీరు అగ్నిపర్వతములున్న ప్రదేశములగుండ ప్రవహించుటవలన వేడెక్కుట; రెండవది— నీరు చాల లోతైన ప్రదేశముల గుండ ప్రవహించునపుడు, అక్కడ నుండెకు అధిక ఉష్ణోగ్రత (Thermal gradient) వలన వేడెక్కుట, రసాయన క్రియ (Chemical action), సంఘర్షణ (Friction) కూడ ఉష్ణమునకు ఆధారములు. అమెరికాలోని ఎల్లో స్టోనుపార్కు, న్యూజిలాండు, ఐస్ లాండులలోని కొన్ని ప్రదేశములలో అంతర్జలము వేడినీటి ధారలుగాను లేక ఉష్ణోదక స్రొతస్సులు (Geysers) గాను ఇవి బహిర్గతమగుచున్నవి. ఇవి చాల భాగము అగ్నిపర్వత ప్రదేశములలోనే కన్పడుచున్నవి. ఈ బుగ్గలు ఏర్పడుటకు అంతర్భాగములో అత్యధిక ఉష్ణోగ్రత, చాల పొడవైన బీటికలు భూమిలోనికి వ్యాపించియుండుట చాల ముఖ్యమగు పరిస్థితులు. ' ఈ నీటిబుగ్గలు ఎల్లప్పుడును బహిర్గతమగుచునే యుండక మధ్యమధ్య విరామము చెందుచుండుట కద్దు. ఎల్లోస్టోన్ పార్కులోనున్న “ఓల్డు ఫెయిన్ ఫుల్ " అను వేడి నీటి బుగ్గ చాల ఆశ్చర్యకరమైనది. ఇది చాల సంవత్సరములనుండి సమాన విరామ కాలములతో వేడినీటిని బహిర్గతము చేయుచున్నది. ప్రతి 70 నిమిషములకు వేలకు వేల గాలనుల నీరు అతి తీవ్రమైన శక్తితో 2,800 అడుగులు ఎత్తువరకు పోవుచుండును.
వేడి నీటిబుగ్గలే కాక, ఖనిజ పూరితమగు నీటి బుగ్గలు (Mineral springs) కూడ ఉన్నవి. వాటినుండి వివిధ పరిమాణములలో ఖనిజములు వెలువడును. వీటిలో కొన్నింటిని ఔషధములకు కూడ ఉపయోగించుదురు.
నీటి బుగ్గల తరువాత చెప్పదగినవి నూతులు. ఇవి మట్టిలోను, ఇసుకలోను, లేక అంతర్జలముతో నిండిన భేద్యమైన రాతి పొరలలోగాని, బీటికలతో నిండిన స్ఫటికమయ శిలలో గాని త్రవ్వుటవలన ఏర్పడును.అంతర్జలము నూతి అడుగు భాగములోనికి రంధ్రముల ద్వార చొచ్చుకొని కొంత మట్టము వరకు వచ్చును. ఈ మట్టము క్రింద ఉండెడు జల పీడనముపై ఆధారపడి యుండును.
మరొకరకము నూతులు ఆర్టీసియన్ నూతులు (Artesian wells). వీటిని పాతాళగంగ అనవచ్చును. వీటి నుండి నీరు ఎడ తెరిపిలేని ధారలుగా నేల పైభాగమున కొంత ఎత్తువరకు, చాలపీడన శక్తితో చిమ్ముచుండును. అంతర్జలము అత్యధిక జలపీడన శక్తి కలిగి ఉండుటయే దీనికి కారణము. ఈ విధముగ, అంతర్జలము వివిధ రీతులలో, భూమి ఉపరిభాగము చేరి, మేఘములు గాను, వర్షముగాను, మార్పుచెంది, తిరిగి భూగర్భములోనికి ఇంకిపోవుచున్నది.
అంతర్జలము గురుత్వాకర్షణశక్తి ప్రాబల్యమున (Influence of gravity) సంపృక్త జలమట్టపు వాలులను అనుసరించుచు ప్రవహించును. నీరు భూతలము యొక్క స్వరూపమును ఏర్పరచుటయేగాక, భూమిలోపల కూడ పెక్కు మార్పులను కలిగించుటలో చాల ప్రముఖ పాత్ర వహించును. ఇది సున్నపురాయి మొదలయిన పెక్కు రాళ్ళగుండ ప్రవహించు నపుడు వాటి పొరల మధ్యను, అతుకులలోను రాతిని కరిగించుచు అంతర్మార్గములను విస్తరింప చేయును. ఆ మార్గములు కొన్నిచోట్ల భూమి పై ప్రవహించు నీటిచే మరింత పెద్దవై గెరాటిని బోలిన పెద్ద సొరంగ మార్గములుగా తయారగును. వీటినే మ్రింగు సొరంగములు (Swallow holes) అందురు. ఇటువంటి మ్రింగు సొరంగములు ప్రసిద్ధికెక్కిన మేమత్ గుహ ఉన్న కెంటకీ పీఠభూమిలో 60,000 పైగా ఉన్నవి. ఇట్లు రాళ్ళను కరిగించుటవలన ఏర్పడిన ద్రవము పెద్ద పెద్ద కీలులు (Master points), అతుకులు, రాతి పొరలు మొదలయిన వాటిగుండా ప్రవహించి పెక్కు సొరంగ మార్గములను (Caverns) గుహలను కూడ నిర్మించును. ఇటువంటి గుహలు, మెక్సికోలోని కారల్స్ బాడ్ ఉన్నవి. అక్కడ ఉన్న వాటన్నింటిలోను పెద్దదగు ఒక గుహ 4000 అ॥ పొడవు, 625 అ॥ వెడల్పు, 350 అ॥ ఎత్తుకలిగి ఉన్నది. ఇట్లు ఏర్పడిన గుహలు అగాధములైన (Chasms) సొరంగ మార్గములతో అన్నియు కూడ ఒక దాని నుండి మరియొక దానికి మార్గము కలిగి ఉండును. వీటినుండి, అంతర్జలము నదులవలె ప్రవహించును. ఇట్లు పెక్కు సెలయేరులై ప్రవహించెడు నీరు, కొంత దిగువున, ఒక పెద్ద నదీ ప్రవాహమువలె బయల్వెడలును, సున్నపురాతిగుండ ప్రవహించెడి నీరు కొంత కర్బని ద్విఆమ్లజని (Corbondioxide) కలిగియున్నందున, దానిని కరగించును. ఈ ద్రవము కొంత కర్బని ద్విఆమ్లజని ఆవిరిరూపమున కోల్పోయిన, కరిగియున్న కొంత కార్బనేటు (Carbonate) కాల్సైటుగా నిక్షేపించబడును. భూమిలోని గుహలలో పై భాగమునుండి వ్రేళ్ళాడు నట్లుండు కాల్సైటును “స్టాతి క్లైట్సు”అనియు, క్రిందిభాగమున స్తంభములవలె నిలువబడియుండు కాల్సైటును "స్టాలగ్ మైట్లు" అనియు అందురు. అంతర్జలములలో నుండెడు పదార్థము ఖటిక కర్బనితము (Calcium carbonate) ఒక్కటేకాదు. ఇసుక పదార్థము కూడ తరుచుగా నుండును. ఉదాహరణకు, చెకుముకిరాయి (Flint concussion) సులభముగ కరుగని రాళ్ళచుట్టును ఏర్పడుట, చెప్పవచ్చును. డెండ్రైట్సు అనునవి యినుము, మాంగనీసు యొక్క ఆమ్లజనిదముల ఉత్పాదనీయమైన అవిక్షేప రూపములు (Secretionary forms).
ఇంక ఎడారులలో ఒయాసిస్ లనబడెడు ఫలవంతమైన ప్రదేశములు చాల ఎన్నతగినవి. ఇవి అంతర్జలము ఉపరి భాగమును చేరుటవలన ఏర్పడును. ఇట్లు అంతర్జలము పైకి ఉబుకుటవలన, ఆ ప్రదేశములు సారవంతముగా మారుచుండును. అచ్చట చెట్టు చేమ లుండుటవలన, అంతవరకు ఇసుకపర్రగా ఉండేడు ప్రదేశముల మధ్య అవి స్వర్గతుల్యముగా కన్పడును.
అంతర్జలపు ఉనికి, కొన్నిచోట్ల భూతత్వశాస్త్రరీత్యా కనిపెట్టవచ్చును. ఇటీవల భౌతిక శాస్త్ర పద్ధతుల ద్వార (Geographical Methods) కనుగొనుట కూడ జరుగుచున్నది. విద్యుత్పరిశోధనల ద్వారా (Electrical prospecting methods) అంతర్జలపు ఉనికి కని పెట్టుటకు, శిలల నిరోధకతలోని వ్యత్యాసము (Variation of resistance in rocks) కొంతవరకు తోడ్పడుచున్నది.
డా. యస్. డా.
[[వర్గం:]]
[[వర్గం::సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]