Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఛత్రపతి శివాజీ మహారాజు

వికీసోర్స్ నుండి

ఛత్రపతి శివాజీ మహారాజు :

పండ్రెండవ శతాబ్ది తుదిభాగమున భరత ఖండము నందు మహమ్మదీయ ప్రభువుల యధికారము నెలకొనిన నాటినుండియు, హైందవ ధర్మానుయాయులకు చెడ్డరోజులు ప్రారంభించెను. మహమ్మదీయులు పాలకులుగా నుండి హిందూ ధర్మమును, సంస్కృతిని రూపుమాపుటకై సర్వవిధముల యత్నించి కొంతవరకు కృతార్థత చెందిరి. ఈ ఘోర విపత్తునుండి హైందవులను కాపాడుటకై యత్నించినవారిలో ముఖ్యులు రాజపుత్రులు, మహారాష్ట్రులు అని చెప్పవలసి యున్నది. కాని వీరన్యోన్య సహకారముతో మెలగని కారణమున వీరి ఆశయములు సంపూర్ణముగ ఈడేరలేదు. హైందవ ధర్మ పునరుజ్జీవనమునకై మహారాష్ట్రమున గొప్ప కృషిసల్పిన మహా పురుషుడు సమర్థ రామదాసస్వామి. ఈయన యందు ఆధ్యాత్మిక తత్త్వమును, ధర్మోద్ధరణాభిలాషయు మూర్తీభవించెను.

ఈ స్వామి కేవలము ముముక్షువు కాడు. సాంఘికముగ, రాజకీయముగ నానాటికి పతన మగుచున్న హిందూ సమాజమును అభ్యున్నతికి తేవలయునను పవిత్రాశయము కలిగినవాడు. ధీరోధాత్తుడైన శివాజీకి ఆయన కర్తవ్యోపదేశము చేసి కర్మయోగిగ శివాజీని తీర్చిదిద్ద గలిగెను. శివాజీ మహారాజు జీవితము ధర్మ ప్రపూర్ణము, వీరరస విలసితము. మహారాష్ట్ర జాతిలో జాతీయభావములను పెంపొందించి, వారిలో నిక్షిప్తములై యున్న మహాశక్తులను విజృంభింపజేసి, రాజ్య నిర్మాణశక్తిని ప్రసాదించి, దేశోద్దరణము గావించినవాడు ఛత్రపతి శివాజీ మహారాజు.

మహారాష్ట్రుల యుదంతము శివాజీకి పూర్వమంతగా తెలియదు. మహారాష్ట్ర ప్రాంతమును, రాష్ట్రకూటులు, చాళుక్యులు, యాదవులు పరిపాలించిరి. పదునాల్గవ శతాబ్దమున దేవగిరి యాదవరాజులు అలావుద్దీన్ చక్ర వర్తిచే పరాజితులైరి. పిదప బహమనీ సుల్తానులకు లోబడి వారిరాజ్యము చీలికలైన తర్వాత కొంతభాగము అహమద్‌నగర సుల్తానులకును, కొంత ప్రాంతము బీజాపూర సుల్తానులకును దక్కెను. పదునేడవ శతాబ్దారంభమున సమర్థ రామదాసు, తుకారాము మున్నగు మహాభక్తులు ధర్మ ప్రబోధకులుగా నుండిరి. వీరు మహారాష్ట్రులలో స్వమతాభిమానమును, సామాజిక దృక్పథమును పొటమరింపజేసిరి. బీజాపూర్, అహమ్మద్‌నగర రాజ్య ప్రాంతములలో మహారాష్ట్ర ప్రముఖులు కొందరు సైనికులుగను, ఉద్యోగులు గను ప్రవేశించి, రాజాశ్రయమును సంపాదించికొని జాగీర్దారులుగ ప్రబలు లగు చుండిరి. మొగలాయి చక్రవర్తుల రాజ్య విస్తరణ కాంక్షకు గురియై తమలో తాము కలహించుకొనుచు, దక్కను నందలి మహమ్మదీయ రాజ్యములు బలహీనము లగు చుండినవి. ఇట్టి రాజకీయ, సాంఘిక పరిస్థితులు మహారాష్ట్రుల విజృంభణమునకు కారణము లైనవి.

చిత్రము - 222

పటము - 1

మహారాష్ట్రులలో భోఁస్లే కుటుంబము ఈ సందర్భమున ప్రాముఖ్యమును గడించినది. ఈ వంశము వాడైన శహాజీ అనునాతడు అహమద్‌నగర నవాబుల కొలువున నుండి ఆ రాజ్యముపై దండెత్తి వచ్చిన మొగలు చక్రవర్తి షాజహాన్‌తో యుద్ధమునకు తలపడి, అహమద్‌నగర స్వాతంత్ర్యమును రక్షించుటకు ప్రయత్నించి విఫలు డయ్యెను. పిమ్మట బీజాపూర్ నవాబుల నాశ్రయించి, పూనాను జాగీరుగా సంపాదించెను. మహారాష్ట్రులను సంఘటిత పరచినచో వారు శౌర్యము నందును, క్రమశిక్షణ యందును మొగలులతో పోటీపడగల సామర్థ్యము కలవా రగుదురని తొలిసారిగా శహాజీకితోచినది. మొగలులను ఎదిరించిన మహారాష్ట్రులలో శహాజీ యే మొదటివాడు. ఈ శహాజీ కుమారుడే ఛత్రపతి శివాజీ మహారాజు.

బాల్యము నుండియు ధర్మయోధు లయిన రామాయణ, భారతవీరుల వీరోచిత కార్యకలాపములు, ధర్మోద్ధరణాభిలాష యెంట బట్టించుకొని పరమతోల్బణమును అరికట్ట సమకట్టిన శివాజీకిని, బీజాపూరు సుల్తానుల ప్రాభవమునకును తన మనుగడ ముడిబెట్టుకొన్న శహాజీకిని మార్గములు వేరయ్యెను.

పూనాకు సమీపమున శివనేరుగిరి దుర్గమున 10, ఏప్రియల్ 1627 లో శివాజీ జన్మించెను. శివనేరున నున్న శివాయిదేవి వరప్రసాదమున జన్మించిన వాడగుటచే తల్లి జిజియాబాయి తన కుమారునకు శివాజీ యని పేరు పెట్టెను. దాదోజీ కొండదేవ్ అను నొక బ్రాహ్మణుని సంరక్షకత్వమున తన భార్యయైన జిజియాబాయిని, కుమారుడైన శివాజీని నిల్పి శహాజీ బీజాపూరునందు నివసింప సాగెను. కొండదేవ్ శివాజీకి మల్ల యుద్ధము నందును, గుర్రపు

చిత్రము - 223

పటము - 2

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు - సమర్థరామదాసు

స్వారియందును, ఖడ్గచాలనము నందును, నైపుణ్యము అలవడునట్లు చేసెను.

అక్బరు, హైదరలీ, రణజిత్ సింగ్ మున్నగు మధ్యయుగ వీరుల వలెనే శివాజీ నిరక్షరాస్యుడని చారిత్రకు లూహించుచున్నారు. శివాజీ స్వహస్తలిఖిత మైన పత్ర మొక్కటియును లబ్ధము కాలేదు. కాని అతడు రామాయణ, మహాభారత గాథలను విని, ధర్మాభిరతి, త్యాగము రాజ్యనిర్వహణ విధానము, ఆహవ పాటవము, రాజనీతి మొదలగు విశేషములను క్షుణ్ణముగా నెరిగినవాడై యుండెను. అత డెచ్చటికి బోయినను హిందూ, ముస్లిం భక్తులు పాడిన పాటలు వినియును, పురాణ, కీర్తన, భజన కాలక్షేపములందు పాల్గొనియును, అనేక ధర్మ రహస్యములను, సూక్ష్మములను తెలిసికొనుచుండెను. ఈ కారణముచేతనే, గ్రంథావలోకనము లేకపోయినను, కర్మవీరుడుగ, రాజ్యపాలనాదక్షుడుగ అతడు కృతకృత్యుడు కాగలిగెను. మధ్యయుగమునందు నేతృత్వమునకు కావలసినది కర్తవ్యానురక్తి యే కాని, భావశబలత, పాండిత్యములు కావు.

పూనాకు పశ్చిమదిశయందు పడమటి కనుమలలో 90 మైళ్ళ పొడవును, 12 నుండి 24 మైళ్ళ వెడల్పునుగల ఒక లోయప్రాంత మున్నది. ఈ ప్రాంతమునే మావళ్ (సూర్యు డస్తమించు భూమి) అందురు. ఈ ప్రాంతమున ఎన్నియో లోయలు, చిట్టడవులు ఉన్నవి. ఉత్తరదిశ నుండు లోయలలోని జనము కోలీలు. దక్షిణదిశయం దుండువారు మరాఠాలు. ఈ రెండు జాతులవారు మిక్కిలి ఉత్సాహవంతులు, దృఢకాయులు, వ్యవసాయకులు, నిరాడంబరులు, వ్యసన రహితులు. ఈ గ్రామములలో రాజప్రతినిధులు 'దేశ్ ముఖ్' లనబడువారు 'పాటిల్' అను గ్రామాధికారులనుండి రాజస్వము, పన్నులను సేకరించు చుండిరి. ఈ దేశముఖ్ లు మరాఠాలు, శివాజీ జాతివారు. వీరు బ్రాహ్మణు

చిత్రము - 224

పటము - 3 శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు

లకు పరిపాలనా వ్యవహారముల నప్పగించి. చిన్న చిన్న సైనికదళముల నేర్పరచి, తమ అదుపులో నుంచుకొను

చుండిరి. ఈ దళములు శత్రువుల దాడి నుండి కాపాడుటకును, బందిపోటు దొంగల పీచ మడంచుటకును ఉపయోగపడుచుండును. ఈ మావళేలు శివాజీ విజృంభణముతో పైకి వచ్చిరి. ఈ మావళేలతో శివాజీ స్నేహమును సంపాదించి, వారికి నాయకుడయ్యెను. శివాజీ సైన్యమునకు మావళేల సంఘమే వెన్నెముకగా నుండెను. మావళేలు శివాజీని తమ నాయకునిగను సంరక్షకునిగను, పరిగణించిరి. పునహాప్రాంతము నందలి చిన్న చిన్న నాయకులు, పాలెగాండ్రు గ్రామములను కొల్లగొట్టుచుండిరి. న్యాయ, ధర్మములు నశించెను. అంతః కలహములు మెండయ్యెను. ఆ ప్రాంతము శక్తి గల వానికే సర్వస్వమయ్యెను. ఇట్టి విపత్కర పరిస్థితులలో తన దూరదృష్టి చేతను, శక్తిసామర్థ్యముల చేతను, నిష్పక్షపాత వైఖరి చేతను శివాజీ ఆ పల్లీయుల హృదయములను వశపరచుకొనెను. అతని రాజ్యమునకు పునాదులు వేసినది ఈ పీడిత ప్రజాహృదయములే. హిందూమత విధ్వంసకులకు విరుద్ధముగ మావళేలను పురికొల్పి, చైతన్యవంతులుగ చేసి, వారిలో జాతీయ భావమును ప్రజ్వలింప జేసెను.

ఈ ఆశయములకు ఫలమే శివాజీ మహారాజు. కొండదేవు కడ నాతడు చిన్నతనము నుండియే పరిపాలనానుభవమును కొంత గడించుకొని యుండెను. సమవయస్కులైన మావళేలతో స్వేచ్ఛా విహారము చేయుచు అడవులలో, కొండలలో ప్రభుత్వాధికారులు తారసిల్లినప్పుడు వారిని తికమకలుపెట్టి వారియొద్ద నుండు రాజధనమును శివాజీ కాజేయుచుండెడివాడు. అతని దృష్టిలో నిదియొక వీరోచిత చర్య. అహమద్ నగర మంతరించి పోవుట చేతను, ఆ ప్రాంతమున అరాజకము ప్రబలి యుండుట చేతను శివాజీ కిట్టిచర్యలను అవలంబించుటకు ఉత్సాహము కలిగెను.

శివాజీ సహ్యపర్వత ప్రాంతమున అడవులలో, లోయలలో, మావళే యువకులతో పరిభ్రమించుచు, అందు నివసించు జనులతో సంబంధము లేర్పరచుకొనుచు ఉండెను. విశ్వాసపాత్రులైన అధికారులు కొందరు శ్యామ్‌రాజ్ నీలకంఠ్, రంజేకర్ బాలకృష్ణ హనుమంతే, సోనాజి పంత్, రఘునాథ్ కోర్డే - ఈ నల్గురు 1642 లో శహాజీచే పునహాకు పంపబడిరి. వారు అతని జాగీరు నిర్వహణ భారము వహించుటకు నియమితులై యుండిరి. 1646 లో బిజాపుర సుల్తాను అగు అదిల్‌షా అస్వస్థుడగుటచే కర్ణాట నాయకులు స్వాతంత్ర్యమును ప్రకటించు కొనుచుండిరి. రాజ్యపరిపాలనము పట్టమహిషి బారిసాహెబా హస్తగత మయ్యెను. శివాజీకి ఇదే అదను. 1647 లో కొండదేవుడు దేహయాత్ర చాలించెను. ఇక శివాజీకి సలహాలిచ్చు వారు కాని, ఈతని స్వేచ్ఛావిహారముపట్ల మనస్తాపము చెందువారు కాని, మందలించువారు కాని లేకుండిరి.

కొండదేవుని మరణమునకు పూర్వమే బిజాపురపు సర్దారును మోసముచేసి యుద్ధము చేయకుండగనే శివాజీ తోరణ దుర్గమును స్వాధీన పరచుకొని యుండెను. ఈ దుర్గములో నున్న ధనరాశి అతని వశమయ్యెను. ప్రచండగడమని ఈ కోట కాతడు కొత్త పేరు పెట్టెను. ఈ కోటకు 5 మైళ్ళ దూరముననే అదే కొండల నడుమ రాజగడము అను కొత్త కోటను నిర్మించెను. ఈ యుదంతము బీజాపూరులో తెలిసెను. అయిన నేమి, కొందరు మంత్రుల నతడు వివిధో పాయములచేత తనకు అనుకూలురుగ మార్చుకొని యుండిన వా డగుటచేత వారు దాని కెట్టి ప్రాధాన్య మియ్యక మిన్నకుండిరి. పూనాకు పోవు మార్గము సంరక్షించుచున్న చాకన్ దుర్గముపై కొండదేవుడు ఫిరాంగ్ జీని దుర్గరక్షకునిగా నియమించియుండెను. ఇతడు విశ్వాస పాత్రుడగుటచే శివాజీ కూడ అతనినే నియమించెను. బారామతి, ఇందాపూరు దుర్గాధికారులు కిమ్మనకుండ శివాజీకి లొంగిపోయిరి. ఆదిల్ షా రాజప్రతినిధికి శివాజి లంచ మిచ్చి కోడాంగ్ దుర్గమును వశపరచుకొనెను.

1648 లో ఈ రాజ్య విస్తరణ కార్యక్రమము ఆగిపోవలసివచ్చినది. దక్షిణ ఆర్కాటు జిల్లాలో రాజప్రతినిధి గాను బీజాపూర్ సుల్తానుల సర్దార్ గా ఉన్న ముస్తఫా ఖాన్ శివాజీ తండ్రియైన శహాజీని నిర్బంధించి అతని ఆస్తిని, పరివారమును స్వాధీనపరచుకొనెనని కర్ణాటకము నుండి వార్తలు వచ్చెను. శివాజీ రాజనీతిని ప్రదర్శింప నెంచి, అప్పుడు దక్షిణమున బిజాపూరు సుల్తానులకు ప్రబల విరోధులైన మొగలులతో మంతనములు జరిపెను. మొగలు రాజప్రతినిధి మురాద్‌బక్షీతో సంబంధ మేర్పరచుకొనెను. అంతకు పూర్వము అహమ్మద్‌నగరములో మొగలుల నెదిరించిన శహాజీని క్షమించి, బిజాపూర్ రాజుల చెరనుండి ఆతనిని విడిపించినచో నతడు మొగలులతో చేరు ననియు, తాను కూడ మొగలాయి ప్రభువులకు విధేయుడనై యుండెద ననియు రాయబార మంపెను. కాని ఆ ప్రయత్నము సఫలము కాలేదు. బిజాపూరు సుల్తాను శహాజీని రాజధానికి తెప్పించి మొగలులతో చేరకుండ మర్యాదలుచేసి తనవానినిగ జేసికొని విడుదల చేసెను. 1648 లో బిజాపూర్ సుల్తాను రోగగ్రస్తుడగుటచే పురందర దుర్గాధిపతి స్వాతంత్ర్యమును ప్రకటించెను. శివాజీ సమయస్ఫూర్తికలవాడు. పురందర దుర్గాధిపతి తనసోదరులకు భాగమియ్యకుండుటను గమనించి, ఆ సోదరుల నడుచు చీలికలు కలిగించి ఆ దుర్గమును స్వాధీనమొనర్చుకొనెను. 1656 లో జావళీ, రాయగడములను తనవిగా జేసికొనెను. జావళీకోటకు సమీపమున ప్రతాప గడమను కోటను నిర్మించెను. అదే కోటయందు మహాశక్తి భవాని దేవాలయమును స్థాపించెను. ఆ దేవియందు శివాజీకి అత్యంత భక్తి ప్రపత్తు లుండెను. భవానీదేవి యాదేశము ననుసరించియే శివాజీ తన కార్యకలాపములను జరిపినట్లు అతని అనుచరుల విశ్వాసము. శివాజీ కరవాలమునకు 'భవానీ'యని పేరుండెను. సూపా అను కోట గూడ ఈ సందర్భముననే వశమయ్యెను. 1656 లో సూపా, బారామతి, ఇందాపూర్, పురందర్, రాజగడ్, కోదాణ, తోరణా, రోహిడా, టికోణా, లోహగడ్, రాజమాచ్ దుర్గములు శివాజీ అధీనము లయ్యెను. సింహగడ్ అను కోటను పట్టుకొను సందర్భమున శివాజీ తన ప్రాణమిత్రుడైన తానాజీ మాల్ సురేఅను మహావీరుని కోల్పోయెను. తానాజీ మరణము శివాజీ జీవితమున అత్యంత విషాద ఘట్టము. నవంబరు 4, 1656 బిజాపూర్ సుల్తాను మహమ్మద్ ఆదిల్ షా మరణించెను. ఈ సంఘటనము శివాజీ కార్యక్షేత్రమును మరింత శక్తిమంతము గావించినది.

శివాజీ స్వాతంత్ర్యమును వహించి జాగరూకతతో రాజ్యసంరక్షక కార్యమును నిర్వహించుచు మొగలుల జోలికి పోలేదు. బిజాపూర్ సుల్తాను లతనికి మొదటి నుండియే శత్రువులు. ఇక మొగలులను కూడ ఎదిరించినచో తన ప్రయత్నము వమ్ముకావచ్చునని అత డూహించి యుండును. 1653 నుండి మొగలుల అధీనమున నున్న దక్షిణభారతమునకు రాజప్రతినిధిగా ఔరంగజేబు పరిపాలించుచుండెను. ఆదిల్‌షా మరణము తర్వాత ఔరంగజేబు బీజాపూరును లోగొనుటకు ప్రయత్నము లారంభించెను.

బిజాపూరు సుల్తాను శివాజీని లొంగదీయుటకు అఫ్జల్ ఖానును పంపించెను. శివాజీని కౌగలించుకొని, నలిపివేసి చంపుటకు బలాఢ్యుడైన అఫ్జల్ ఖాను ఎత్తు వేసెను. శివాజీ ఆ మోసమును తెలిసికొని, తానును మోసమునకు పూనెను. ఇద్దరు మోసగాండ్రు పెనగులాడినపుడు తెలివి గలవాడు జయించును. స్నేహితుని వలె ఖాను శివాజీని కౌగలించుకొని, క్రమముగా బిగించుచు, తన దురుద్యోగము నకు కడంగ నుండగా, శివాజీ తాను గుప్తముగా ధరించి యున్న “బిఛువా" (పులిగోళ్ళు) తో చీరి, వానిని చంపివేసెను. ఆ తర్వాత మహారాష్ట్ర వీరులు అఫ్జల్ ఖాను వెంట వచ్చిన సైన్యమును సర్వనష్టములకు గురిచేసిరి. 1659 నుండి 1662 వరకును శివాజీకిని, బిజాపూరు సుల్తానులకును జరుగుచుండిన యుద్ధము ఏతము త్రొక్కినట్లుగ నుండెను. 1662 లో బిజాపూరు సుల్తానులు శివాజీ ధాటికి ఆగలేక తమ రాజ్యములోని కొంత భాగమును శివాజీ కిచ్చి సంధిచేసికొనిరి. పూనా మొదలుకొని కృష్ణానది వరకున్న విశాల భూభాగము శివాజీ కీ విధముగ దత్తమయ్యెను.

బిజాపూరు సుల్తానుల నీ విధముగ లొంగదీసికొని, శివాజీ శక్తిమంతమైన మొగలాయి సామ్రాజ్యముపైకి కత్తిదూసెను. మొగలులపై అతడు యుద్ధము ప్రకటించు నాటికి మొగలు చక్రవర్తి ఔరంగజేబు దక్షిణమున తన ప్రతినిధియైన షాయిస్తాఖాను అనువానికి శివాజీని అదుపులో నుంచుట కాజ్ఞచేసెను. షాయిస్తాఖాను శివాజీ అధీనమునం దున్న పూనా, చాకన్, కల్యాణదుర్గములను జయించి, పూనాను తన కార్యకలాపములకు కేంద్రముగ చేసికొనియుండెను. మోసముచే నైనను శత్రువులను లొంగదీయవలయునను నీతిని అనుసరించి మొగలు సైనికుల వేషములతో అనుచర యుక్తముగ శివాజీ పూనా మున శివాజీ షోడశ మహాదానములు చేసెను. పిదప మంత్రులకు అధికార లాంఛనములను, నియామక పత్రములను ప్రసాదించెను. తరువాత ఉత్తమాశ్వము నెక్కి ఊరేగెను. పుణ్యాంగన లారతులిచ్చి, లాజలు చల్లిరి. ఈ శుభసందర్భమును పురస్కరించుకొని పురవాసులు తమ గృహాంగణములను దివ్యముగ నలంకరించిరి. ముస్లిముల ధాటికి నిలువలేక కొనయూపిరితోనున్న హిందూధర్మ సంప్రదాయము లన్నియు సమగ్రరూపమున పట్టాభిషేక మహోత్సవ మప్పుడు పరిఢవిల్లెను. ఇప్పుడు శివాజీ హిందూధర్మ రక్షకుడు. హిందూ సమాజమున కాదర్శ పురుషుడు, భారతీయ సంస్కృతికి ఆశాజ్యోతి.

1677 లో శివాజీ కర్ణాటక ప్రాంతముపై దాడి వెడలెను. ఇది అతని జీవితములో ప్రధానమైనది. పశ్చిమ కర్ణాటక ప్రాంతమును, బళ్ళారిని లోగొని, తంజావూరిని పాలించుచున్న సవతి తమ్ముడు వెంకోజీ నుండి కొంత రాజ్యమును స్వాయత్తము చేసికొని, రాయగడమునకు తిరిగివచ్చుచు, అతడు జింజీ, వెల్లూరులను వశపరచుకొనెను. ఇంచుమించు పశ్చిమ తీర ప్రాంత మంతయు శివాజీ రాజ్యమునకు పడమటి పొలిమేర అయ్యెను. శివాజీకి తండ్రినుండి లభించినవి కొన్ని జిల్లాలు మాత్రమే. కాని శివాజీ వానిని విస్తృత పరచెను.

1658 నుండియే అతడు నౌకానిర్మాణమున కుద్యమించి పశ్చిమ తీరమును దుర్గముగా చేసికొనెను. ఇది అతని రాజనీతి దక్షతకు నిదర్శనము. రాజ్యాదాయము పెంచుటకై అతడు సముద్రమార్గమున విదేశములనుండి వాణిజ్యమును కూడ ప్రోత్సహించెను. నౌకాబలము వలనను, విదేశీయ వ్యాపారము వలనను శివాజీ, బుడుత కీచుల యొక్కయు, ఆంగ్లేయుల యొక్కయు ఆగడముల నుండి భారతీయులు తట్టుకొనగలుగునట్లు ఏర్పాట్లు చేసి యుండెను. శివాజీ కొండ యెలుక యనియు, గెరిల్లా పోరాటమున ఆరితేరినవాడనియు, క్షత్రియోచితమైన పోరాటమున కతడు అలవాటుపడినవాడు కాడనియు ద్వేషపూరిత మనస్కులైన చారిత్రకు అతనిని వర్ణించిరి. కాని ఈ విదేశ వాణిజ్యమును, నౌకాబల నిర్మాణమును పరిపాలనా వ్యవస్థను పరిశీలించినచో శివాజీ ఔన్నత్యము మనకు గోచరించును. పశ్చిమతీర సమీపమున నున్న యొక ద్వీపమును అబిసీనియాదేశస్థులైన సిద్దీలు ఆక్రమించుకొని తీరప్రాంత నగరములను దోచుకొనుచుండిరి. శివాజీ వారిని కూడ అదుపులో పెట్టుటకు ప్రయత్నించెను.

శివాజీ చరమదశలో అతని కొడుకైన శంభూజీ (సంభాజీ) దక్కనులో మొగలు ప్రతినిధియైన దిలేరు ఖానుతో కలసి మహారాష్ట్రరాజ్య విచ్ఛేదమునకు దారి తీసెను. కాని 1679 లో శంభూజీ తన తప్పిదమును తెలిసికొని తండ్రితో కలిసెను.

1680 లో శివాజీ మహారాజు రోగగ్రస్తు డయ్యెను. రోగము నివారణ కాజాల దను సంగతి తెలిసిన తరువాత శివాజీ మంత్రులకు, అధికారులకు తగిన ఉపదేశము లిచ్చి సమాధి నిష్ఠుడై 4 ఏప్రియల్ 1680 ఆదివారము మధ్యాహ్నము దివంగతు డయ్యెను. మరణమునాటి కాతని వయస్సు 53 సంవత్సరములు. మరణము సంప్రాప్తమైనందుకు అనేకములైన కారణములను కొంద రూహించిరి. విషప్రయోగముననో, సయ్యదుఖాను మహమ్మదు అను ఆతడు ఫకీరు శాపము వలననో మరణించె నని వేర్వేరు కథనములు గలవు. కాని చారిత్రకముగ నివి నిరూపించుటకు వీలులేదు.

శివాజీ మరణము నాటికి అతడు నిర్మించిన మహారాష్ట్ర రాజ్యము సూరత్‌నుండి కార్వార వరకును, పశ్చిమసముద్రతీరమునుండి కొల్హాపురమువరకును ఏక ఖండముగా వ్యాపించిన రాష్ట్రము. ఇదిగాక బళ్ళారి, వెల్లూరు, తంజావూరు, జింజీ కూడ శివాజీ పలుకుబడిలో నుండెను. మొగలు రాజ్యము నందలి మొగలాయి అను పేరుగల ప్రాంతముకూడ శివాజీరాజుదే. 'చౌథ్' అను పన్నును ఈ మొగలాయి ప్రాంతమున వసూలుచేసికొను అధికారము మహారాష్ట్రుల కుండెను. శివాజీ రాజ్యమున 230 కోట లుండెను. అందు 111 అతడు స్వయముగ కట్టించినవి. 79 కోటలు మద్రాసు ప్రాంతమున నుండినవి. 40 కోటలు పరరాజుల నుండి వశపరచుకొన బడినవి.

శివాజీ గురువైన సమర్థ రామదాసస్వామి గట్టి ప్రభుత్వ మొక్కటి ఏర్పరచి దుష్టశిక్షణము, శిష్టరక్షణము గావించి తనకు ప్రతినిధిగా ధర్మపాలనము చేయుమని శివాజీని ఆదేశించి యుండుటచే, శివాజీ ముస్లిములను ముప్పుతిప్పలు పెట్టుటయే తన ధ్యేయముగ నుంచుకొనక క్రమబద్ధమైన రాజ్యతంత్రమును నడుపుట కుద్యమించెను. మొగలు ప్రభువుల పరిపాలనా పద్ధతిని చాలవరకు స్వీకరించి తన యనుభవమును రామదాసస్వామి ఆదేశమును దృష్టియం దుంచుకొని రాజ్య వ్యవహారములను నిర్వహించెను. అంతరంగిక, వైదేశిక వ్యవహారములను, రాజ్యము యొక్క ఆదాయ వ్యయములను నిర్వహించు ఉన్నతోద్యోగులను నియమించుటలో శివాజీ ప్రభువు చాల మెలకువ చూపెను. రాజ్య తంత్రమున రాజునకే సర్వాధికారము లుండెను.

అతని కెనమండుగురు మంత్రులు. వీరే 'అష్టప్రధానులు' (1) పీష్వా-ప్రధానామాత్యుడు (2) అమాత్యుడు- ఆర్థికమంత్రి (3) వాకనీస్ - ప్రధానలేఖకుడు (4) సచివుడు - రాజున కాంతరంగిక కార్యదర్శి (5) సుమంతుడు = విదేశవ్యవహార మంత్రి (6) సేనాపతి (7) పండితరావు – మతశాఖాధికారి (8) న్యాయాధీశుడు. సేనాధిపతి తప్ప అందరు బ్రాహ్మణులే. ఈ యష్టప్రధానులు రాజునకు ఆయా వ్యవహారములలో సలహా లిచ్చువారే కాని నిర్ణయము రాజుదే. ఈ ప్రధాన పదవులు ఆనువంశికములు కావు. ప్రతిభను బట్టియే వీరి నియామకము.

ఉన్నతోద్యోగులకు మొగల్ రాజులవలె జాగీరు లిచ్చినచో అదుపులో నుండరనియు, స్వాతంత్ర్యము ప్రకటించు ప్రమాద ముండుననియు తలచి శివాజీ తన అనుచరులకు జాగీరుల నిచ్చుట మానివేసి జీతముల నేర్పాటు చేసెను. మొగలు చక్రవర్తుల వలె రాష్ట్రము నంతయు “సూబాలు"గా విభజించెను. సూబాకు అధికారి సుబేదారు. ప్రభుత్వమునకు ముఖ్యాదాయము పన్నులే. షేర్షా, అక్బరుల వలె శివాజీ వ్యవసాయభూములను సర్వే చేయించి, వివరములు తెలిసికొని, పన్నులు విధించు పద్ధతిని ప్రవేశ పెట్టెను. పంటలో 2/5 భాగము ప్రభుత్వముది. పన్ను కోతల కాలముననే తీసికొనవలయును. రైతులకు నేరుగా కేంద్రప్రభుత్వము తోడనే సంబంధము. జమీందారులు, దేశాయిల వంటి మధ్యస్థులకు శివాజీ రాజ్యతంత్రమున స్థానము లేదు.

అహమ్మదునగర్, బీజాపూర్ మరియు మొగల్ రాజ్యములలో పాటిల్, కులకర్ణి, దేశముఖ్ ల వంటి మిరాసీదారు (వంశ పరంపరాధికారము కలవారు) లుండిరి. వీరు అధికారమును హస్తగతము చేసికొని తామే ప్రభువులై నట్లు వర్తించుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారు చిన్న చిన్న సైనిక దళముల నేర్పరుచుకొని పరస్పర కలహములు పెంచుకొని ప్రజాపీడనము చేయుచుండిరి. పటిష్ఠమైన ప్రభుత్వ మేర్పరచుటకు అవరోధము కల్గునను కారణమున ఈ పద్ధతికి స్వస్తిచెప్పి శివాజీ రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టెను. సైనికాధికారులకు కూడ రైతులపై ఎట్టి అధికారమును లేకుండెను.

అనూచానముగ వచ్చుచున్న చతురంగ బలములలో రధ, గజ బలములు సమకాలీన యుద్ధపద్దతులకు సరిరాక పోవుటచే అవి శివాజీ నాటికే పాతపడి కొన్ని శతాబ్దములై యుండెను. శివాజీకి 40 వేల ఆశ్విక బలము, 1200 గజములు, ఒక లక్ష కాల్బల ముండెను. తుపాకులు, శతఘ్నులు (ఫిరంగులు) విశేషముగ నుండెను. 25 గురు సైనికులపై ఒక హవల్దారు అధికారి. 5 గురు హవల్దార్లపై ఒక జుమ్లేదార్, 10 గురు జుమ్లేదార్లపై ఒక హజారి, 5 గురు హజార్లపై ఒక పంచ హజారి అధికారులుగ నుండిరి.

వీరందరిపై సర్ నోబత్ సర్వాధికారిగా, సర్వసేనానిగా నుండెను. ఈతడే అష్ట ప్రధానులలో 6 వ వాడు. ఈ సైనికులకు శివాజీ ఏర్పరచిన కట్టుబాట్లు మహాభారత యుద్ధనీతిని తలపించుచున్నది. దేశములను దోచుకొన్నను, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించవలయును. గోవులను కాని, బ్రాహ్మణులను కాని, వృద్ధులను కాని, బాలురను కాని హింసపెట్ట కూడదు. వారిని రక్షించ వలయును. సైనికులకందరకును ధర్మానురక్తి, రాజ్య స్వాతంత్ర్యాభిలాష యుండవలయును.

మత సంబంధములైన వ్యవహారములను శివాజీ న్యాయబుద్ధితో, సహనశీలతతో నిర్వహించెను. ముస్లిముల దర్గాలకును, మసీదులకును, హిందూదేవాలయములకును అతడు దానములు చేసెను. వేద విదులైన బ్రాహ్మణులకు జ్యోతిష్కులకు, సాధువులకు, ముస్లిం వలీలకు అతడు దానములు చేసి ఆశ్రమములను నిర్మించి యిచ్చెను. దక్షిణ ప్రాంతముపై దాడి వెడలి నప్పుడు ఆంధ్రదేశము నందు పురాణప్రసిద్ధమైన శ్రీశైలక్షేత్రమును సందర్శించి 24 మార్చినుండి 1 ఏప్రిల్ 1677 చైత్రనవరాత్రోత్సవ ముల నక్కడ జరిపించి, నీలగంగ, పాతాళగంగ యనబరగు చున్న కృష్ణానదియొద్ద శ్రీగంగేశ అను ఒక స్నానఘట్టమును, యాత్రికుల సౌకర్యార్థ మొక ధర్మశాలయును నిర్మింప జేసెను. లక్షబ్రాహ్మణులకు సమారాధన చేసి, భూరి దక్షిణల నిచ్చెనట! తన రాజ్యము నంతయు తన గురు వైన సమర్థ రామదాసస్వామికి అర్పింపగా స్వామి తన ప్రతినిధిగా రాజ్యమేలుమని శివాజీని ఆదేశించెను. స్వామి వారి కాషాయాంబరమునే శివాజీ భక్తి ప్రపత్తులతో రాజ్యమునకు పతాకగా నిర్ణయించెను. ఇక ఇట్టి రాజ్యమున ధర్మపాలనము జరుగకుండుటెట్లు?

ముస్లి మేతరు లైన ప్రజలపై 'జిజియా' అను నొక వింత పన్నును ఔరంగజేబు విధించి యుండెను. శివాజీ ఎన్నోమారులు ఔరంగజేబున కీఇ యన్యాయమును గూర్చి తెల్పి యుండెను. ధర్మబద్ధముగ పరిపాలన జరిపినచో తాను ఔరంగజేబు సార్వభౌమత్వమును అంగీకరించ గలనని తెలిపి యుండెను. శివాజీకి ప్రజా క్షేమమేకాని అధికార వ్యామోహము లేదనియే చెప్పవచ్చును.

శివాజీ వ్యక్తిగత మైన జీవితము మహోదాత్త మైనది. విధేయుడైన కుమారుడుగ, వాత్సల్యము గల తండ్రిగ, బాధ్యత లెరిగిన భర్తగా అతడు ప్రవర్తించెను.

ఆతడు పరస్త్రీలను పవిత్రహృదయముతో గౌరవించువాడు. కల్యాణ దుర్గమును జయించి నప్పుడు ఒక మరాఠా సర్దారు. సోన్ దేవ్ అంతఃపుర స్త్రీలను చెరపట్టి తీసికొనివచ్చి శివాజీ ముందుంచగా శివాజీ ఆతని చర్యను తీవ్రముగ నిరసించి, దానికి దిద్దుబాటుగా వారలను సగౌరవముగా వారి యిండ్లలో దించి రావలసిన దని సోమదేవుని ఆజ్ఞాపించెను. కళ్యాణ దుర్గాధిపతి యైన మౌలానా మహమ్మద్ కోడలు పట్టుబడగా ఆమెను కూతురు వలె గౌరవించి, ఆమె తన తల్లి యైనచో తాను సుందరుడుగా జన్మించ కుందునే యన్నట్లు ఐతిహ్యము లున్నవి. గురుభక్తి, దైవభక్తి, సంప్రదాయ బద్ధము లైన ధర్మములపై ఆసక్తి రూపుగొన్న వ్యక్తి అతడు. మహారాష్ట్ర సామ్రాజ్యము స్థాపింపవలెనను ఆకాంక్ష కతడు రూపకల్పన చేసి మొగలు సామ్రాజ్యమునకు ప్రక్కలో బల్లెమై చరిత్రహీనులైన మహారాష్ట్రుల నొకజాతిగా నిర్మించి చరితార్థు డయ్యెను.

శివాజీ తన జీవితము నొక మహోద్యమముగా మార్చుకొని, జాతికొక విభూతి యయ్యెను. మొగలు సామ్రాజ్య పతనమునకు అతని ఉద్యమము కారణ మైనట్లు దక్షిణాపథము నందు ఏదియు కాలేదనుట నిర్వివాదాంశము, నేటికిని మహారాష్ట్రులకే కాదు, స్వాతంత్ర్యప్రియు లైన భారతీయుల కాతడాదర్శ ప్రాయుడు, ప్రాతస్మరణీయుడు.

ఇ. కృ.