సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిలీ దేశము
చిలీ దేశము :
దక్షిణ అమెరికాలో బహుకాలముగా ఘటిల్లిన విప్లవములను, కలహములను బట్టి చూడగా, 'చిలీ' తరతమ భావముచే ప్రశాంతమగు చరిత్రగల దేశమనవచ్చును. కాని అది ఇటీవలి కాలమున తరచుగా సంభవించుచు వచ్చిన కార్మిక కలహముల కారణముగా గొప్ప ఇక్కట్టులకు గురియైనది,
క్రీ. శ. 1536 వ సంవత్సరమున ప్రప్రథమముగా యూరపియనులు చిలీ దేశమున దిగిరి. డైగో డీ ఆల్ మగ్రో (Diego de Almagro) అను నతడు ఆ సమయమున ' పెరూ' (Peru) నుండి చిలీపై దండయాత్రచేసి విఫలమనోరథు డయ్యెను. అయిదు సంవత్సరముల అనంతరము పెడ్రో డీ వాల్ డివియా (Pedro de Val-divia) అను మరియొక స్పెయిన్ దేశీయుడు సాంటియాగో (Santiago) ను స్థాపించెను. 1810 వ సంవత్సరము సెప్టెంబరు 18 వ తేదీన చిలీ దేశీయులు స్పెయిన్ ఆధిపత్యముపై తిరుగబడిరి. కాని వారికి 1818 వ సంవత్సరము వరకు సంపూర్ణ స్వాతంత్ర్యము లభింపకుండెను. ఆ సంవత్సరమున బెర్‌నార్డో ఓ హిగ్గిన్స్ (Bernardo o Higgins), జోస్ డీ సాన్ మార్టిన్ (Jose de san Martin) అనువారు తుదకు స్పానిష్ సైన్యములను అణగద్రొక్కిరి.
చిలీ ఎన్నడును యుద్ధమున పరాజయ మొందిన దేశము కాదు. దానికిని బొలివియా (Bolivia). పెరు (Peru) లకును నడుమ 1879-83 సంవత్సరముల మధ్య కాలమున యుద్ధము సంభవించెను. ఆ యుద్ధములో 'ఆన్టో ఫాగస్టా' (Anto Fagasta) అను పేరుతో బొలివియాకు గల ఏకైక సముద్రమార్గమున్న రాష్ట్రమును, దానితోపాటు, పెరుకు చెందిన విశాల భూభాగములును చిలీ కైవసమయ్యెను. మొదటి ప్రపంచ మహాసంగ్రామమందు చిలీ తటస్థముగానుండెను. 1927 వ సంవత్సరమున కర్నల్ కార్లోస్ ఇబాఫియజ్ (Colonel Carlos Ibafiez) అనునతడు అధికారమును తన హస్తగత మొనర్చుకొనెను. అతనికి 1931 వ సంవత్సరమున పతనము సంభవించెను. అతని పతనమునకు అనంతరము కొలదికాలమువరకు అరాజకపరిస్థితు లేర్పడెను. ఆ స్వల్ప కాలమునందే ఏడ్గురు వ్యక్తులు దేశాధ్యక్షులగుటయు, తిరిగి పదభ్రష్టులగుటయు గూడ తటస్థించెను. కాని డా. ఆర్టురో అలెస్సాండ్రీ (Dr. Arturo Alessandri) 1932-38 సంవత్సరము మధ్యకాలములో చిలీ యొక్క రాజకీయ, ఆర్థిక స్థైర్యమును నెలకొల్పుటకు గొప్ప ప్రయత్నమొనర్చెను.
1938 వ సంవత్సరమున జరిగిన ఎన్నికలలో విజయుడైన పెడ్రో ఆగ్విరే సెర్‌డా (Pedro Auguirre Cerda) అను నతడు 1941 నవంబరు 25 వ తేదీన మరణించెను. ఇతడు తన మరణమునకు పూర్వమే విపులమైన ఒక సామ్యవాద ప్రణాళికను దేశములో ప్రవేశపెట్టెను. 1942 సం. లో 'ప్రజాపక్షము'న (popular Front) తీవ్రవాదియైన జువాన్ ఆన్‌టోనియా రియోస్ (Juan Antonio Rios) అభ్యర్థిగా ఎన్నుకొనబడెను. ఆతని కాలమున రాజకీయ కలహములు, కార్మిక సంఘర్షణములు చెలరేగెను. వెలుపలినుండియు, లోపలినుండియు (విశేషముగా శక్తిమంతమైన కమ్యూనిస్టుపార్టీ నుండి) కలిగిన బలమైన ఒత్తిడికారణముగా తుదకు చిలీ అక్ష రాజ్యములతో (జర్మనీ, జపాను) తనకుగల సంబంధమును 1943 సంవత్సరము జనవరి 20 వ తేదీన విచ్ఛేదమొనర్చుకొనెను. కాని ఆ దేశము 1945 సంవత్సరము ఫిబ్రవరి 14 వ తేదీవరకు జపానుపై యుద్ధము ప్రకటింపలేదు.
రియోస్ అనునతడు 1946 సంవత్సరము జూన్ 27 వ తేదీన మరణించెను. వెంటనే ఒక అసాధారణమైన ఎన్నిక జరిగెను. అందులో 1946 సం. నవంబరు 3 వ తేదీన 'వామ - సెంటర్ మిశ్రమపక్షముల' (Leftist-center Coalition) అభ్యర్థియగు గేబ్రియల్ గంజాలెజ్ విడెలా (Gabriel Gonzalez Videla) అనునతడు అధ్యక్షుడయ్యెను. అతని పరిపాలనమునకూడ తరచుగ సంభవించిన కార్మిక కల్లోలముల మూలమున దేశమునకు తీవ్రముగ నష్టము కలిగెను. ఈ కల్లోలములో కొంతవరకు కమ్యూనిస్టు ప్రభావమున్నట్లు తెలియుచున్నది. గేబ్రియల్ కమ్యూనిస్టు ప్రతికూలవిధానము ననుసరించెను. అతనిపిమ్మట కార్లస్ ఇబాఫియెజ్ (Carlos Ibafez) అను నతడు 1952 సంవత్సరము సెప్టెంబరు 4 వ తేదీన అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను.
ప్రభుత్వము - రక్షణ : చిలీ ప్రజలు ఆరు సంవత్సరముల కొకసారి అధ్యక్షుని, ఎనిమిది సంవత్సరముల కొకసారి 45 మంది సభ్యులు గల సెనటును (వీరిలో సగము మంది నాలుగు సంవత్సరముల కొకసారి మారు చుందురు.), నాలుగు సంవత్సరములకొకసారి 147 మంది సభ్యులుగల 'ఛేంబర్ ఆఫ్ డెప్యూటీస్' అను మరియొక ప్రజాప్రతినిధి సభను ఎన్నుకొందురు. అధ్యక్షుడు తనకు తోడ్పడుటకై తనకు బాధ్యత వహించు ఒక మంత్రివర్గమును నియమించును. కాని ఈ మంత్రివర్గము కాంగ్రెసు చేయు దేశద్రోహనే విచారణకు (impeachment) లో బడియుండును. అధ్యక్షుడు చెలాయించు 'వీటో' (Veto) అను ప్రతికూలాభిప్రాయమును సహితము 2/3 వంతులు ఓటుచే రద్దుచేయు అదికారమును కాంగ్రెసు కలిగియుండును. ఎన్నికలలో 2 సంవత్సరముల వయస్సు పై బడిన అక్షరాస్యులగు పౌరులందరకు వోటుచేయు అధికారము కలదు.
చిలీదేశములో సైనికశిక్షణ నిర్బంధము చేయబడెను. ఈ శిక్షణ ఇరువది సంవత్సరముల వయఃకాలమున ఆరంభ మగును. మొదటి 9 నెలల పర్యంతము ప్రారంభ శిక్షణ ఒసగబడును. ఈ శిక్షణ అయిన పిదప 45 వ సంవత్సరపు వయస్సు వరకును ప్రతి పౌరుడును మూలబలము (Reserve) లో చేరి యున్నట్లు భావింపబడును. 1948 వ సంవత్సరమున జరిగిన అనధికార అంచనానుబట్టి, చిలీలో 25,000 సైనికబల మున్నట్లు తెలియుచున్నది. నౌకాదళమునందు మామూలుగా 12,000 మంది యోధు లుందురు. ఈ దళములో 1953 వ సం. న 28,000 టన్నుల పాత యుద్ధనౌక యొకటియు, 1951 వ సంవత్సరమున అమెరికానుండి సంపాదించుకున్న రెండు తేలికపాటి క్రూయిజర్లును, ఆరు డిస్ట్రాయర్లును, ఆరు ఫ్రైగేట్లును, ఏడు జలాంతర్గాములును, రెండు సముద్రతీర రక్షక నౌకలును, ఇతరములైన చిన్న ఓడలును కలవు. ద్వితీయ మహాసంగ్రామ సందర్భమున చిలీలో విమానబలము అభివృద్దికి తేబడెను.
సాంఘిక, ఆర్థిక పరిస్థితులు : 7-15 సంవత్సరముల వయస్సు గల బిడ్డలకు చిలీ కేంద్రప్రభుత్వము నిర్బంధోచిత విద్యావిధానమును అమలునం దుంచెను. 1948 వ సం. న చేయబడిన అంచనా ప్రకారము చిలీదేశమున నిరక్షరాస్యత 24 శాత మున్నదని తెలియుచున్నది. దక్షిణ అమెరికా యందలి దేశములలో ఈ విషయమున చిలీ మూడవస్థాన మాక్రమించును. 1948 సం. లో పాఠశాలలకు పోవు బాలబాలికల సంఖ్య దాదాపు 7,39,000. చిలీదేశములో ప్రభుత్వ విశ్వవిద్యాలయముతో కలుపుకొని 5 విశ్వవిద్యాలయము లున్నవి. విద్యనిమిత్తమై బడ్జెటులో 20 శాతము వినియోగింప బడుచున్నది.
చిలీదేశములో కొందరు జర్మనులు, ఆంగ్లేయులు, పోలండుదేశీయులు, స్కాటులు ఉండియున్నను తెల్లవారిలో అధికసంఖ్యాకులు స్పెయిన్ దేశీయులే. రోమన్ కాథొలిక్ మతమే అచటి ప్రధాన మతము. కాని 1925 వ సం.లో రాజ్యాంగము నుండి మతము వేరుచేయబడెను.
చిలీ యందు వ్యవసాయము కాలిఫోర్నియాలో వలె, సమ శీతోష్ణస్థితి గలిగిన కేంద్ర ప్రాంతము నందలి లోయలలో జరుపబడుచున్నది. దేశములో ఫలవంతమగు భూమి అతి స్వల్పముగ నున్నది. దానిలో అధిక భాగము నీటి పారుదలను అపేక్షించును. 1951 లో గోధుమ 9,88,000 మెట్రిక్ టన్నులు పండెను. ఇదియే అచ్చటి ప్రధానమైన పంట. తరువాత పేర్కొన దగినవి ఉర్లగడ్డలు, ఓట్సు, బార్లీ, ధాన్యము, తీగెచిక్కుడు, పండ్లు, గోధుమ తర్వాత అధిక విస్తీర్ణములో ద్రాక్ష పండింపబడుచున్నది. ద్రాక్ష ఫలముల నుండి 1952 సం. లో 56,500,000 గ్యాలనుల ద్రాక్ష సారాయి తయారయ్యెను. సగటున 2500 ఎకరముల విస్తీర్ణము గల ఫ్యూడల్ (జమీందారీ) భూకమతములు (estates) ఆ దేశములో ఎక్కువగా నున్నవి. 1951 సం. న పశుసంపద యొక్క మొత్తము సంఖ్య 2,160,000; 1949 సం.న గొఱ్ఱెల సంఖ్య 6,345,000; 1951 సం.న ఉన్ని ఉత్పత్తి 12,000 మెట్రిక్ టన్నులు. పశు పరిశ్రమ స్థానికావసరములకు చాలినంతగా లేదు. చిలీలో తయారగు ఉన్నిలో కొంతభాగము అచ్చటి బట్టల మిల్లులకు ఉపయోగపడుచున్నది. కాగా మిగిలిన ఉన్ని, చర్మములతో పాటుగా విదేశములకు ఎగుమతిచేయబడుచున్నది.
విదేశీ వ్యాపారము : (అమెరికన్ డాలర్లలో-మిలియనులలో). మిలియన్ అనగా 10 లక్షలు :
1950 | 1951 | 1952 | |
ఎగుమతులు | 282 | 371 | 456 |
దిగుమతులు | 240 | 329 | 371 |
1952 సం. లో అమెరికా 57 శాతమును, అర్జెంటినా 8 శాతమును, బ్రిటన్ 5 శాతమును, జర్మనీ 5 శాతమును చిలీ నుండి సరకులను దిగుమతిచేసికొనెను. చిలీ దేశము అమెరికా నుండి 52 శాతమును, బ్రిటను నుండి 9 శాతమును, అర్జెంటినా నుండి 8 శాతమును సరకులను దిగుమతి చేసికొనెను. 1952 సం.న చిలీ ఈ క్రింది ముఖ్యమైన ఎగుమతులు చేసెను : రాగి (49 శాతము) ; సత్రితము (నైట్రేట్ : 13 శాతము). ప్రధానమైన దిగుమతులు యంత్రములు, వాహనములు, నేతవస్తువులు, పంచదార, ఇనుము, ఉక్కు, చేతిపని సామానులు.
గొప్ప పారిశ్రామికాభివృద్ధిని గూర్చి చిలీ కలలు కను చున్నను, ఉత్తమ తరగతికి చెందిన బొగ్గు, తగరము తప్ప, శేషించిన అవసరమగు ముడిసరకులన్నియు చిలీ యందు లభ్యమయినను, అందు ప్రగతి మందముగ సాగుచున్నది. ఖనిజ పరిశ్రమయందు తప్ప, దైనందిన జీవితములో ప్రజలు వాడుకొను వస్తువులు - ముఖ్యముగా వస్త్రములు- ఇతర పరిశ్రమలలో చౌకగా తయారగుచున్నవి. 1946 సంవత్సరములో ఉక్కు పరిశ్రమ స్థాపింపబడినది. ఉక్కు ఉత్పత్తి 1952 వ సంవత్సరములో మొత్తము 243,000 మెట్రిక్ టన్నులు జరిగెను.
1947 వ సంవత్సరము నాటికి మొత్తము సుమారు 31,250 మైళ్ళ పొడవున రోడ్డు రహదారీ నిర్మింపబడి యుండెను. ఇందులో మూడవ వంతు చక్కపరుపబడినది. రైల్వే మార్గము పొడవు 5,434 మైళ్ళు. ఇందులో కొంత విద్యుదీకరణము చేయబడినది. చిలీ అంతర్భాగములో ప్రజోపయోగమునకై విమానయాన సౌకర్యము గొప్పగా అభివృద్ధి నొందియున్నది. అనేకములైన అంతర్జాతీయ విమానయాన మార్గములు దేశమందు ఏర్పరుప బడినవి. 'లాయ. రిజిస్టర్' ను బట్టి, 1952 వ సంవత్సరము జూన్ 30 వ తేదీనాటికి చిలీలో మొత్తము 1,87,618 టన్నుల శక్తిగల 92 వాణిజ్య నౌక లున్నట్లు తెలియుచున్నది.
ఇటీవల తయారు కాబడిన ఆదాయ వ్యయములు (బిలియనులలో) ఈ క్రింది విధముగా నున్నవి :
(బిలియను పీసో నాణెమునకు)
1 బిలియను అనగా లక్ష కోట్లు.
1951 | 1952 | 1953 | |
ఆదాయము | 26.0 | 3- | 47.5 |
వ్యయము | 27.6 | 42.0 | 47.5 |
బడ్జెట్ అంచనా : 1951 సంవత్సరము డిసెంబరు 31 వ తేదీనాటికి చిలీ ప్రభుత్వము 7,524,100,000 పీసోలు జాతీయ ఋణము చెల్లించవలసి యుండెను. ఇందులో 5,461,100,000 పీసోలు చిలి ప్రభుత్వము స్వదేశీయులకే ఋణపడి యుండెను. చిలీ దేశముయొక్క ఆర్థిక సంపత్తికి పునాది అందలి ఖనిజసంపదయైయన్నది. ఈ ఖనిజములు 'అట కామా' (Atacama). 'అంటిఫా గస్టా' (Antofa gasta), 'టారాపకా' (Tarapa) అను రాష్ట్రము లలో లభ్యమగుచున్నవి. ఈ రాష్ట్రములు చిలీ దేశములో ఉత్తరముగా నున్న ఎడారి ప్రాంతమునందు కలవు. ప్రపంచములోకెల్ల సహజమైన నత్రితము (nitrate) లభించు దేశ మిదియే. ప్రపంచమందు ఉపయోగింపబడు అయొడిన్ (iodine) లో 60 వ శాతము నత్రితము యొక్క ప్రక్రియల (nitrate processes) ఉప ఫలితములుగా పొందబడు చున్నది.
అయినను చిలీకి నత్రితము విషయమున ప్రపంచమంతటిలో గల గుత్తవ్యాపార ప్రాబల్యము, సంకలన ఉత్పత్తి (synthetic product) యొక్క అభివృద్ధి కారణముగా తగ్గిపోయినది.
ప్రపంచములోకెల్ల అధికతమమైన రాగిసంపద చిలీ దేశములో కలదు. దీని విలువ 134 మిలియను పౌనులని అంచనా వేయబడినది. దీనికితోడుగా, ఉత్తమ తరగతికి చెందిన ముతక ఇనుముగూడ 900 మిలియను టన్నులకు పైగా అచట లభ్యమగును. చిలీ గనులలో లభ్యము కాగల బొగ్గు రెండు బిలియనుల టన్నులకు మించి యున్నది. అయితే ఆ బొగ్గుకు పరిమాణ విశేషమేగాని గుణవిశేషము లేదు.
1952 వ సంవత్సరమున ఖనిజోత్పత్తి ఇట్లున్నది :
బొగ్గు, లిగ్ నైట్ - 21,93,199 మెట్రిక్ టన్నులు.
రాగి (శుభ్రపరుపబడినది) 4,04,742 టన్నులు.
ముతక ఇనుము 23,10, 472 టన్నులు.
సోడా నైట్రేటు 14,27,817 టన్నులు.
బంగారము 1,76,021 ఔన్సులు.
వెండి 12,46, 327 ఔన్సులు.
పాదరసము, ముడిమాంగనము (manganese ore). మణిశిల (cobalt), తుత్తునాగము (zinc), తుంగనము (Tungsten), మోలదము (Molybdenam) అను లోహ ఖనిజములు కూడ అచ్చట ఉత్పత్తి చేయబడును. వరుణము (Uranium) యొక్క నిక్షేపములు గూడ చిలీయం దున్నట్లు తెలియుచున్నది. 1945 సం. డిసెంబరులో మొదటి సారిగా నూనె 'టై రాడెల్ ఫ్యూగో' (Tierradel Fuego) లో ఉత్పత్తి చేయబడినది. 1952 సం.లో ఉత్పత్తి అయిన నూనె పరిమాణము 800,000 పీపాలు.
చిలీ దక్షిణ భాగమునందు 35 మిలియను యకరముల విస్తీర్ణము గల అడవులు గలవు. అందు వర్తకమునకు ఉపయోగపడు కానిఫర్ (Conefer), లారెల్ (Laural) మగ్నోలియా (Magnolia) మున్నగు నానా విధములైన కలప ఆదేశములో ఉత్పత్తి యగుచున్నది. గండు చేపలు (Cod), పామువలె నుండు చేపలు (Eel), గుల్ల చేపలు (Oysters), సొరచేపలు (Sawfish), సార్డయిన్స్ (Sardines), ట్యునా (Tuna), తిమింగలపు నూనె (Whale oil) మున్నగునవి జాలరి వృత్తికి సంబంధించిన ఉత్పత్తులలో చెప్పదగినవి.
నై సర్గిక లక్షణము - శీతోష్ణస్థితి : చిలీదేశము ఇరుకైన, పర్వతమయమైన భూభాగము. దాని పొడవు 2661 మైళ్లు. 46 నుండి 250 మైళ్ల వరకు వెడల్పు గలది. మొత్తము విస్తీర్ణములో మూడవ వంతు అత్యున్నతమైన ఆండీస్ (Andes) పర్వత పంక్తులచే ఆక్రమింపబడియున్నది. ఉత్తర తీర పర్వతములకును, ఆండీస్ పర్వతములకును నడుమ ఖనిజ సంపత్తికి ప్రసిద్ధివడసిన 'అటకమా' ఎడారి కలదు. మధ్యభాగమున 700 మైళ్ల పొడవు గల లోయ యొకటి కలదు. అది ఆండీస్ పర్వతములకును, ఎత్తయిన తీర మైదానమునకును మధ్యగా నున్నది. ఆ లోయలో జనాభా క్రిక్కిరిసి ఉన్నారు. దక్షిణమున ఆండీస్ పర్వతములు సముద్రతీరమునకు సరసనే యున్నవి.
చిలీ ప్రధాన భూభాగములో దక్షిణకొన యందు ప్రపంచములోకెల్ల మిక్కిలి దక్షిణమున నున్న 'పుంటా అరీనాస్' (punta Arenas) అను పట్టణము కలదు. దానికి ఆవల 'మాగెల్లన్' అను జల సంధియు, 'టైరా-డెల్-ప్యూగో' అను ద్వీపమును కలవు. ఈ ద్వీపము చిలీ, అర్జెంటైనాల మధ్య విభక్తమై యున్నది. దక్షిణ పసిఫిక్ సముద్రములో, చిలీ ప్రధాన భూభాగమునకు పశ్చిమమున సుమారు 400 మైళ్ళ దూరమున నున్న 'జువాన్ ఫెర్‌నాన్‌డెజ్ (Juan Fernandez) అను దీవులును, పశ్చిమమున సుమారు 2000 మైళ్ల దూరమున నున్న 'ఈస్టర్' (Easter) ద్వీపమును చిలీ స్వాధీనమున నున్నవి.
చిలీలోని పొట్టినదులు నీటిపారుదలకును, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికిని మాత్రమే ఉపయోగకరములుగా నున్నవి. దేశమున పెక్కు ఓడరేవు లున్నవి. మంచి నౌకాశ్రయములు మాత్రము తక్కువగా నున్నవి. సరకుల రవాణా విశేషముగా చిన్న పడవల ద్వారానే జరుగుచున్నది. చిలీయొక్క ఉత్తరదిశాగ్రమందు పగళ్లు వేడిగానుండును. తీరమందు రాత్రులు కొలది వెచ్చగాను, లోపలిభాగమున చల్లగాను ఉండును. చిలీ మధ్యభాగమందలి శీతోష్ణస్థితి దక్షిణ కాలిఫోర్నియా యొక్క శీతోష్ణ స్థితితో పోల్చదగియున్నది. దక్షిణదిశలో సరోవరప్రాంతమున శీతోష్ణస్థితి అమెరికాకును, పసిఫిక్ సముద్రమునకు పశ్చిమోత్తరమున నున్న శీతోష్ణస్థితితో సమానముగ నున్నది. చిలీ దక్షిణాగ్రమందు పొగమంచు, తుపానులు కారణముగా సగటు శీతోష్ణపరిమాణము తక్కువగానుండును. 'సాంటియాగో' లోని శీతోష్ణపరిమాణములు రెండును తీవ్రముగా (26 డిగ్రీల నుండి 96 డిగ్రీల వరకు) వ్యాపించు చుండును. చిలీలో మంచు అరుదుగా మాత్రమే పడును.
గ. ల. శా.
చెంచులు :
చెంచులు ఆంధ్రప్రదేశమందలి కర్నూలు, మహబూబు నగరము జిల్లాలలోని నల్లమల కొండలలోను. అమరాబాదు పీఠభూమి యందును నివసించు చున్నారు. వారు
చిత్రము - 206
పటము - 1
చెంచుపడతి - ఉంగరాల వెండ్రుకలు ఈ జాతి ప్రత్యేకత
నల్లని శరీరవర్ణమును, వెడల్పయిన ముక్కులును, ఉంగరముల జుట్టును కలిగి యుందురు. వెదురుతోను, గడ్డి కప్పులతోను ఇండ్లను కట్టుకొనుట వీరికి తెలిసియున్నప్పటికిని, వీరు అడవులయందు సంచరించుచు, భోజనార్హమైన కందమూలములను, ఇతర ఫలములను సంతరించుకొను చుందురు. 'పెంట' అనబడు చెంచుపల్లెలలో 13లేక 15 గుడిసెల కంటె ఎక్కువగా నుండవు.
వేటాడుట, ఆహారమును సంపాదించుట - ఇవియే చెంచులయొక్క ఆర్థికవిధానములు. ఉదయమున లేచిన తోడనే 'ఇంటిలో ఆహారము లేదు' అను సమస్య చెంచుల నెంతమాత్రమును బాధపెట్టదు. ఆతడు అడవికి వెళ్ళి తేలికగా ఆ సమయమునకు అచ్చట సందర్భపడిన పదార్థములతో ఆకలి తీర్చుకొని, సాయంకాలమునకు తాను సంపాదించిన పండ్లతో, కందమూలములతో చేరి తన కుటుంబమును, తానును వాటిని భుజించెదరు. చెంచులకు 'రేపు' అను ఆలోచనయే ఉండదు కనుక, ఆహారమును దాచుకొను పద్ధతికూడ వారికి ఉండదు. తెచ్చిన ఆహారము నంతయు అప్పటికప్పుడే కర్చు చేసికొందురు. చెంచు సంఘములో స్త్రీ పురుషు లిరువురును పనిచేయుదురు. ఆహార సంపాదనములో వివిధ పద్ధతులు అవలంబింప వలసిన పని లేకుండుటచే, స్త్రీ పురుషు లిరువురును అన్ని ఋతువుల యందు సమానముగనే ఆహార సంపాదన మొనర్తురు. కాని వేట, తేనె పోగుచేయుట, తట్ట లల్లుట మొదలగు పనులు ప్రత్యేకముగా పురుషులే చేయుదురు. స్త్రీలు ఈలోగా కట్టెలు తెచ్చుపనిని నెరవేర్తురు.
చెంచులలో పెక్కుమంది అడవిలో సంపాదించిన పండ్లు, కందమూలములు, మొక్కలు మొదలైన వాటిపై ఆధారపడి యుందురు. వారి ఆహార సంపాదనకు త్రవ్వు గోలయు, సేకరించిన ఆహారమును ఉంచుకొనుటకై ఒక తట్టయు మాత్రమే కావలయును. చెంచులకు కణుజు, దుప్పి, మేక, ఎలుగుబంటి, కుందేలు, ఉడుత, అడవి పిల్లి, నెమలి, కోడి అదృష్టవశాత్తు పట్టుకొన గలిగిన మరి యే ఇతరములైన చిన్న పక్షులైనను ఆహారముగా ఉపయోగపడును. కాని వారు పెద్దపులి, చిరుతపులి, కుక్క, పాము, కప్ప మొదలగు వాటిని మాత్రము తినరు. వారికి చేపలు పట్టు అవకాశ
ములు మిక్కిలి తక్కువ. కాని మెరక చెరువులలో చేతికి సులభముగా చిక్కు చేపలను పట్టుకొందురు. చేపలను కఱ్ఱ గాలములతో పట్టుకొనుట కూడ వీరు నేర్చియున్నారు. వీరు దున్నపోతు, ఆవు, మేక మొదలగు కొన్ని గృహ జంతువులను పెంచుదురు. జొన్న, వరి, రామములగపండ్లు(టొమేటాలు), మిర్చి మొదలగు పంటలను కొలదిమాత్రముగ ఇండ్ల ముందర పండించుట వరకే వీరి వ్యవసాయము పరిమితమై యున్నది. నేలపై గడ్డి తీసివేసి ఏదో ఒక కఱ్ఱతో భూమిని త్రవ్వెదరు. విత్తనములను నాటునప్పుడు ఒక మనుష్యుడు తిన్నగా నడచుచు, అడుగడుగున ఆగి, కఱ్ఱతో నేలయందు గుంటలుచేసి, ఆ గుంటలలో విత్తనము లుంచి, పాదముతో ఆ గుంటపై మట్టి నెట్టుచు పోవుదురు.
చిత్రము - 207
పటము - 2
చెంచుయువకుడు తలమీద జుట్టుముడివేయు పద్ధతి ఒక విశేషము
చెంచుజాతివారు మెన్లూరు, టోకల్, నిమల్, సింగార్లు, నల్లపోతేరు, ఎరవలు, పుల్సారు, ఉర్తాలు, దాసెరోలు, మామెడి, కట్రాజ్, బాల్ మార్ అను తెగలు లేక కులముల క్రింద విభజింపబడియున్నారు. ఈ తెగలలో అంతర్వివాహ పద్ధతి యున్నను, కొందరు బాంధవ్యమును బట్టి పెద్ద తెగలుగా ఏర్పడుటచే, అందరును అట్టి వివాహములను చేసికొనరు.
ప్రతి చెంచు పల్లెయందును, 'పెద్ద' యను నొక డుండును. అతడు సాధారణముగా వయోవృద్ధుడుగా గాని, మధ్య వయస్కుడుగా గాని ఉండవచ్చును. కాని పల్లెలో అందరి కంటె అతడు వృద్ధుడుగా నుండి తీరవలె నను నియమము మాత్రము లేదు. పూర్వకాలపు అనాగరకుల వలెనే చెంచువారు సంఘములుగ నుందురు. వారు మిక్కిలి స్వతంత్రులైన ప్రజాస్వామ్యవాదులు. 'పల్లె పెద్ద' అందరిలో పెద్దవాడుగ పరిగణింప బడినను, అతని అధికారము, పలుకుబడి అతని ప్రవర్తనను బట్టియు, సామర్థ్యమును బట్టియు ఉండును. ఈ 'పెద్ద మనిషి' ఐన వాడు దృఢ మనస్కుడై ఉండవలెననియు, అతనిని చూచినచో, పెద్దపులిని చూచినట్లు ఇతరులు భయపడవలెననియు చెంచుల అభిప్రాయము. ఈ జాతివారి ఆలోచనా సభలో (పంచాయితీ), నేరములలో చిక్కుకొనిన వేరువేరు గుంపుల 'పెద్ద మనుష్యులును'ను ఆయా పల్లెల పెద్దమనుష్యులును ఉందురు.
చెంచుల మతములో ఒకదాని కొకటి సంబంధములేని నమ్మకములు, ఆచారములు ఉండును. 'గారెల మైసమ్మ', 'భగవంతరు' అనువారు వీరి ముఖ్యదేవతలు. వీ రిరువురును కరుణామయులైన దేవతలుగను, ప్రకృతి శక్తులను, మానవ జీవితశక్తులను అదుపులో పెట్టగలవారుగను భావింపబడు చున్నారు. 'భగవంతరు' ఆకాశములో నివసించు ననియు, 'గారెల మైసమ్మ' అరణ్యములం దుండు ననియు వీరు నమ్మెదరు. చెంచులు అడవికి పోవునపుడును, అడవినుండి జంతువులను తీసికొని ఇంటికి వచ్చునపుడును 'గారెల మైసమ్మ'ను ప్రార్థించెదరు. చెంచులు ప్రమాదకరమైన జబ్బులోనున్నప్పుడు, నిస్సహాయతతో మానవాతీత శక్తులను నమ్ముకొని, వాటిని వేడుకొందురు. చనిపోయిన వారిని పాతిపెట్టుటగాని, దహనము చేయుటగాని జరుగుచుండును. కాని ఖననము చేయుటయే సర్వ సాధారణమైన పద్ధతి. ఈ సందర్భములో ఎట్టి కర్మకాండలు జరుగవు. కాని సమాధిని మూసివేయుటకు ముందు, చనిపోయినవాని భార్యయో, లేక చనిపోయిన ఆమె భర్తయో, లేక రక్త సంబంధముగల మరియొక బంధువో రెండు గుప్పెళ్ళ మన్ను తీసికొని ఆ సమాధిపై చల్లుచు, “నీకు నాకు దూరం అయింది” అను మాటలను ఉచ్చరింతురు. మూడవనాడు బంధువులు వెళ్ళి ఆ సమాధిపై కొంత ఆహారము పెట్టి వచ్చెదరు. అప్పుడువారు "సామీ ! నారాయణా ! భగవంతా ! నీకూ నాకూ దూరం పోయింది. సామిని ఇచ్చినవారు మీరు, తీసికోపోయినవారు మీరు, సామిదగ్గర పోయి చేరాలనేగా. దండం" అని అందురు.
హైదరాబాదు ప్రభుత్వమువారు తమ అభివృద్ధి ప్రణాశిక ద్వారా చెంచులను బాగుపరచి, వారిని రాతియుగపు నాటి అనాగరిక స్థితినుండి, ఎక్కువ నాగరకమైన జాతుల స్థితికి తీసికొని వచ్చినారు. ఈ ప్రణాళిక 1942 లో ప్రారంభింపబడినది. ఇది 'అమరాబాదు గ్రామీణ సంక్షేమ సంఘము' అను పేరుతో పిలువబడుచున్నది.
రా. ప్ర.
చెకోస్లావేకియాదేశము (చ) :
ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరము 1918 సంవత్సరము అక్టోబరు 28 తేదీన చెకోస్లావేకియా ప్రజాప్రభుత్వము ఏర్పడినది. చెకోస్లావేకియా యూరప్ ఖండములో, కీలకమయినస్థానములో, పర్వతశ్రేణులచే చుట్టబడి యున్నది. వైశాల్యములో ఇది పెద్దదేశము కాక పోయినను, నైసర్గికస్వరూపమువలనను, అమరికవలనను, ఐరోపా ఖండములో చెకోస్లావేకియాకు ప్రాముఖ్యము లభించుచున్నది. దీనికి ఉత్తరమున జర్మనీ, పోలండ్ దేశాలు; తూర్పున రష్యా; దక్షిణమున హంగేరి, ఆస్ట్రియాలు ; పశ్చిమమున జర్మనీ దేశమును ఉన్నవి. ఈ దేశము బొహీమియా, మొరేవియా - సై లేషియా, స్లావేకియా, రుధేనియా, అను నాలుగు భూభాగములచే ఏర్పడియున్నది. పశ్చిమ భాగములోని బొహీమియా, మధ్య భాగములోని మొరేవియా ప్రాంతములు చాలవరకు పర్వతములచే చుట్టబడి, సమతల పీఠభూమిగాను, తూర్పుననున్న రుధేనియా, స్లావేకియాలు తూర్పునకు ఏటవాలుగా నున్న కార్థేసియన్ పర్వత శ్రేణులలోని పచ్చిక బయళ్ళుగాను ఏర్పడి యున్నది. మొత్తమునకు ఈ దేశములో అరణ్య భాగమే ఎక్కువగా కనబడును.
చెకొస్లావేకియా యొక్క వైశాల్యము 49,381 చ. మైళ్ళు. ఈ దేశములోని ప్రధానమైన నదులు లాబె, వటావా, వ్జోడర్, మొరావా, వాః, డాన్యూబ్ అనునవి. దీనికి రాజధాని ప్రేగ్ నగరము. ఈ దేశ వాసులలో సుమారు 70% వరకు రోమన్ కాథలిక్కు మతస్థులున్నారు. దేశములోని క్రైస్తవ దేవాలయము లన్నియు ప్రభుత్వాధీనమున నున్నవి. 1958 డిసెంబరు నాటికి ఈ దేశపు జనాభా 13,518,021. పర్వత ప్రాంతములలోని పల్లెలలో, వస్త్రములు నేయుట, వస్త్రములపై రంగు రంగు ఎంబ్రాయిడరీ చిత్రముల నల్లుట, ఆట బొమ్మలను చేయుట మున్నగునవి ముఖ్య వృత్తులు. పశువులను వీరు పచ్చిక బయళ్ళలో మేయుటకై విచ్చలవిడిగ వదలరు.
చెకోస్లావేకియా అను పేరు క్రీ. శ. 1880 సం. నుండి ప్రచారమున నున్నది. స్థూలముగా 'స్లావ్ ' జాతికి చెందిన చెక్కులు, స్లావెక్కులు అను రెండు తెగలతో నిండిన ఈ దేశములో, చెక్కులు బొహీమియా, మొరేవియా ప్రాంతములలోను, స్లావెక్కులు స్లావేకియాలోను ప్రధానముగ నివసింతురు. రష్యనులుకూడా ఈ 'స్లావ్’ జాతికి చెందినవారే. ప్రారంభములో చెక్కులు, స్లావెక్కులు అను నీ రెండు తెగల మధ్య చెప్పుకోదగినన్ని విభేదములు లేవు. చారిత్రక రీత్యా ఏర్పడిన ఈ వి భేదముల వలన పశ్చిమ భాగములోని బొహీమియన్ చెక్కులు పదునాల్గవ శతాబ్దమునకే, యూరప్ ఖండమునందు, విశిష్టమైన సంస్కృతిని, నాగరకతను, ఖ్యాతిని గడించిరి. ప్రేగ్ నగరమున, ఆరువందల సంవత్సరములకు పూర్వమే ఒక విశ్వ విద్యాలయము వెలసినది. ఈ బొహీమియన్ చెక్కులు, పదునారవ శతాబ్దమునుండి, జర్మన్ దేశస్థుల అధీనమున నుండుటచే, పారిశ్రామిక జాతిగా వీరు దిద్దితీర్చ బడిరి. తూర్పు తీరములోని స్లావెక్కులు సుమారు వేయి సంవత్సరములుగ హంగేరియన్ల అధీనమున నుండి, కర్షక జాతిగా తయారయిరి. అందులకే 1918 వ సం॥న చెకోస్లావేకియన్ ప్రజాప్రభుత్వ మేర్పడిన తర్వాత, స్లావేకియాలోకూడ పరిశ్రమలు స్థాపించుటకుగాను ప్రయత్నములు జరుగుచున్నవి. యాదృచ్ఛికముగ ఏర్పడిన ఈ రెండు తెగల మధ్య పెంపొందిన విభిన్న ప్రవృత్తులకు పొందిక కల్పించుట చెకోస్లావేకియన్ ప్రజాప్రభుత్వమును ఎదుర్కొను గడ్డు ప్రశ్నలలో నొకటి. ఈ దేశపు నైసర్గిక స్వరూపముకూడ ఈ సమస్యను మరింత చీకాకు పెట్టినది. ఇట్టి విషమ సమస్య లెన్నో బయలుదేరినను, ఈ ప్రభుత్వము వాటి నెదుర్కొని, విజయవంతముగ పురోగమించుచున్నది.
క్రీ. శ. ఆరవ శతాబ్దమున 'స్లావ్ ' జాతివారు తూర్పు తీరమునుండి బొహీమియా రాజ్యమునకు వలస వచ్చిరి. పిమ్మట సుమారు మూడు వందల సంవత్సరములకు సెయింట్ సిరిల్ మున్నగు మతప్రచారకులు ఈ ప్రాంతమున క్రైస్తవ మత ప్రచారము చేయదొడగిరి. పదునొకండవ శతాబ్దమున స్లావెక్కులు హంగేరిదేశ మాగ్యర్ వంశస్థుల అధీనములోనికి రాగా, చెక్కులు నాల్గవ చార్లెస్ (1346-78) యొక్క పాలనమున, 'హోలీ రోమన్’ (పవిత్ర రోమక) సామ్రాజ్యమునందు ప్రముఖ పాత్రను వహించిరి. బొహీమియాలోని 'హస్సైట్' సంచలనమును యూరప్‌లోని ప్రాటెస్టెంట్ తిరుగుబాటులోని నాందీ ప్రస్తావనలతో సమన్వయింప వచ్చును. జాన్ వైక్లిఫ్ అనుయాయుడును గొప్ప చెక్ పండితుడు నగు జాన్‌హస్‌యొక్క శిష్యసంతతి ప్రారంభించిన 'హస్సైట్ ' ప్రచారమును రోమన్ కాథలిక్కులు నిరసించిరి.
1526 న 'హావ్స్‌బర్గ్ ' (ఆస్ట్రియా) వంశమునకు చెందిన మొదటి ఫర్డినెండ్ బొహీమియా రాజ్యమునకు రాజయ్యెను. 1602 న చెక్కులు స్వాతంత్ర్య పోరాటమును జరిపి, నవంబర్ 8 వ నాడు, హావ్స్బర్గులచేత ఓడింప బడిరి. దీని ఫలితముగా ఈ తిరుగుబాటును లేవదీసిన ప్రముఖు లందరును హత్య గావింపబడిరి. నాటినుండి సుమారు మూడు శతాబ్దములవరకు, చెక్కులు స్వాతంత్య్ర జీవితమును కోల్పోవుటయే కాక, బొహీమియన్ ప్రాటెస్టెంట్ మతము సమూలముగ తుడిచి వేయ బడినది.
ప్రథమ ప్రపంచ సంగ్రామము నాటికి, అంతవరకు అసంతృప్తితో అలజడి చేయుచుండిన చెక్కులును, స్లావెక్కులును స్వాతంత్ర్య జీవనోద్దేశమున ఏకమై, దూరదృష్టి గలవాడును కార్యనిర్వహణ ధురీణుడును అయిన మాసరిక్ (Tomas Garrigue Masaryk) అనునతనిని నాయకునిగా గ్రహించిరి. ఆస్ట్రియన్ పోలీసు దళములు తన్ను బంధింప నున్నవని గ్రహించి 1914 లో మాసరిక్, విదేశముల నుండియే చెకోస్లావేకియన్ బలములను కూడబరచుకొనుచు, తన మిత్రుల మూలమున స్వదేశమున జరుగు మార్పుల నరయుచు, స్వాతంత్ర్య సన్నాహములను చేయుచుండెను. అమెరికాలో నున్న చెకోస్లావేకియన్ పౌరులు ఈ స్వాతంత్య్ర పోరాటమునకు వలయు ఆర్థిక సహాయము చేయ సిద్ధపడిరి. నాటి మాసరిక్ ప్రయత్నములకు లండన్ నగరము కేంద్రముగ నుండెను. 1915 లోనే మాసరిక్ ఆస్ట్రియాకు చెకోస్లావేకియా స్వాతంత్ర్యము విషయమై ఒక ప్రకటన గావించెను. 1918 జూన్ 30 వ తేదీ చెకోస్లావేకియన్ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడైన మాసరిక్, తాను అమెరికాలో నున్నప్పుడు నూతన ప్రజాప్రభుత్వ నిర్మాణమునకు గాను, చెక్కులు స్లావెక్కుల మధ్య నొక యొడంబడికను చేయించెను. అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్సు, ఇటలీ దేశము లీ నూతన ప్రభుత్వ నిర్మాణము నామోదించినవి. 1918 అక్టోబర్ 14 వ తేదీ పారిస్ నగరమున డా॥ బినెస్ చెకోస్లావేకియన్ తాత్కాలిక ప్రభుత్వము నేర్పరచెను. అక్టోబరు 18న వాషింగ్టన్ నగరము నుండియు, 28 తేదీన ప్రేగ్ నగరములోను మాసరిక్ చెకోస్లావేకియా స్వాతంత్ర్యమును ప్రకటించెను. 1920 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినవి. ఫిబ్రవరి 19 తేదీన తొలిసారిగా పౌరులచే ఎన్నుకొనబడిన ప్రతినిధుల 'నేషనల్ అసెంబ్లీ ' సమావేశమయినది.
నేషనల్ అసెంబ్లీ మాసరిక్ ను దేశాధ్యక్షునిగాను, క్రామర్ ను ప్రధానమంత్రిని గాను, డా॥ బినెస్ ను విదేశాంగ మంత్రినిగాను ఎన్నుకొనినది. నానాజాతి సమితి (League of Nations) తోను, ఫ్రాన్సు, రష్యా దేశములతోను ఈ ప్రభుత్వము సన్నిహిత సంబంధములను నిలుపుకొన్నది. అందుకుతోడు ఇరుగు పొరుగు దేశములతోను శాంతియుతమును, నిర్మాణాత్మకమును అయిన స్నేహమును పెంపొందించుకొన్నది. 'లోకార్నో' ఒడంబడిక అనంతరము (1925 - 1926) జర్మనీ దేశముతో గూడ సన్నిహిత సంబంధ మేర్పడినది. 1929 లో మాగ్యర్ల కలహముల నణచుటకును, డాన్యూబ్ నదిమీద వర్తకము నభివృద్ధి గావించుటకును 'లిటిల్ ఎన్టెన్ట్' ఒడంబడికను ఈ ప్రభుత్వము యుగోస్లావియా, రుమేనియా దేశములతో చేసికొన్నది.