Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఘంటశాల

వికీసోర్స్ నుండి

ఘంటశాల :

ఆంధ్రదేశమున కృష్ణాజిల్లా దివితాలూకాలో, ఘంటశాల(గంటసాల) అను గ్రామమున్నది. ఇది చారిత్రకముగా మిక్కిలి ప్రాముఖ్యమును కలిగియున్నది. పూర్వము ఆంధ్రసామ్రాజ్యము వైభవోన్నతులతో నున్న కాలమున ఇది దక్షిణాపథమున ప్రముఖమైన యోడరేవుగా నుండి దూరదేశములతో భారతదేశ వాణిజ్యమునకు మిక్కిలి తోడ్పడినది. ఆంధ్రదేశమున బౌద్ధమతము విరివిగా ప్రచారమున నున్న సమయమున గంటసాల బౌద్ధుల పుణ్య క్షేత్రముగా ప్రఖ్యాతిపొంది పలుచోటులనుండి యాత్రికుల నాకర్షించినది. ఈ గ్రామ నామము ఘంటశాల యనియు, గంటసాల యనియు వాడుకలో గలదు.

గంటసాల చరిత్రకు 'కొంటకొశ్శైల' శబ్దము ఆధారమై యున్నది. క్రీ. శ. 140 వ సంవత్సరమున ఆంధ్ర దేశమునందు పర్యటించిన టాలెమీ యను గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుడు భారతదేశము నందలి రేవుపట్టణముల నన్నిటిని పేర్కొనుచు మైసోలియాను, కొడ్డూరును, కృష్ణా నదీముఖద్వారమునందు వర్తకకేంద్రమై వరలిన 'కొంటకొశ్శైల' ను పేర్కొనెను. ఆంధ్రదేశమునకు చెందిన ఈ మూడు స్థలములలో మైసోలియాను ప్రాచీన ప్రఖ్యాత రేవుపట్టణమైన మోసలపురముగను, కొడ్డూరును నేటి గూడూరుగను చారిత్రకులు నిర్ణయించినారు.

టాలెమీ పేర్కొనిన కొంటకొశ్శైలను కొంతమంది చారిత్రకులు - మెక్ క్రిండిల్ ప్రభృతులు - కంచకచర్లగా నిర్ణయించిరి. కాని ఇది సరికాదు. కంచకచర్ల, కొంటకొశ్శైల అను శబ్దములకు సరియైన పోలిక లేకపోవుటయే దీనికి కారణము. కంచకచర్ల, టాలెమీ చెప్పినట్లు కృష్ణానదీ ముఖద్వారమున గాక కృష్ణా నదీతీరమున మాత్రమే యున్నది. టాలమీ కొంటకొశ్శైలను వర్తక కేంద్రముగా పేర్కొనినాడు. కంచకచర్లకు పూర్వము వాణిజ్య కేంద్రముగా ఖ్యాతి యున్నట్లు చారిత్ర కాధారములు లేవు. వజ్రపుగనులు గల పరిటాల సమీపమున నుండుటచే, కంచకచర్ల వాణిజ్యకేంద్రమని యూహించిరి. కాని పరిటాల వజ్రపుగనుల వృత్తాంతము పదునేడవ శతాబ్దమున టావర్నియర్ వ్రాసినదానిని బట్టి తెలిసికొను చున్నాము. టాలమీ కాలమున పరిటాల అజ్ఞాతముగానే యుండెను.

ఇక గంటసాలకును, టాలెమీ పేర్కొనిన కొంటకొశ్శైల శబ్దములకును సన్నిహిత సామ్యము గలదు. గంటసాల యోడరేవుగను, వాణిజ్య కేంద్రముగను నుండెనని చెప్పుటకు ఇచట తరచు లభించు స్వదేశస్థ, విదేశస్థ పురాతననాణెములే నిదర్శనములుగా నున్నవి. గంటసాల టాలెమీ కాలమున ప్రముఖ విశాలనగర మనుటకు ఇచ్చట రెండుమైళ్ళ భాగమున కనుపించు శిథిలములు, కట్టడములు, మత సాంస్కృతిక చిహ్నములు ఆధారములుగా నున్నవి. టాలెమీ పేర్కొనిన కొంటకొశ్శైల శబ్దమునకును, గంటసాల నామమునకును కంటక సేల, కంటక శైల శబ్దములకును సామ్యము కలదు.

కంటకశైల అను సంస్కృతరూపమునకు కంటక సేల యనునది ప్రాకృతరూపము. ఆంధ్రదేశమున ప్రాకృత భాష ప్రచారమున నున్న కాలమున గంటసాలకు కంటకసేల యనియే వ్యవహార ముండెడిది. దీనిని టాలెమీ కొంటకొశ్శైలయని పేర్కొనినాడు. కంటకశైల, కంటక సేల యను నామములు ఈ నగరమునకు బౌద్ధ మతముమూలమున కలిగినవి. బుద్ధుడు మహాభినిష్క్రమణ సందర్భమున కంటకమను అశ్వము నధిరోహించి చనెను. బౌద్ధులకు, బుద్ధునికి చెందిన యే వస్తువైనను పవిత్రమైనదే. పవిత్రాశ్వమైన కంటకము పేర బౌద్ధక్షేత్రము నెలకొల్పబడినది. ఇది ఇట కంటకశైలముగా నుండి, క్రమముగా కంటక సేల, గంటసాలగా మారినది. ఈ విధముగా కొందరు తలంచుచున్నారు. కాని కంటకశైల నామము నాగార్జునకొండలోని ఒక గుట్టకు చెందినదని మరికొందరు తలంచుచున్నారు. ఈ కంటక శైలమును మైనదే. పవిత్రాశ్వమైన కంటకము పేర బౌద్ధక్షేత్రము నెలకొల్పబడినది. ఇది ఇట కంటకశైలముగా నుండి, క్రమముగా కంటక సేల. గంటసాలగా మారినది. ఈ విధముగా కొందరు తలంచుచున్నారు. కాని కంటకశైల నామము నాగార్జునకొండలోని ఒక గుట్టకు చెందినదని మరికొందరు తలంచుచున్నారు. ఈ కంటకశైలమును గురించిన ప్రస్తావనలు శాసనములందు మనకు లభించు చున్నవి. పెదవేగిశాసనము సంఖ్య 219 (1927) అమ రావతి శాసనము సంఖ్య 54, నాగార్జునకొండ శాసనము సంఖ్య 214 (1927) మొదలగు వానియందు కంటక శైలము ప్రస్తావింపబడినది.

ఘంటశాలలో కొన్ని పురాతన నాణెములు లభించినవి. వీటిలో కొన్ని పరిమాణమున నేటి అర్ధరూపాయతోను, పావులాలతోను తుల్యములుగను, కొన్నివీటికంటె చిన్నవిగను ఉన్నవి. ఇవి కంచు, రాగి, సత్తు అను లోహములతో చేయబడినవి. సత్తుతో చేయబడిన నాణెములు ఆంధ్ర చక్రవర్తులకు చెందినవి. వీనిపై స్తూపములు, తెరచాపలు, ఓడ, ఉజ్జయిని మున్నగు సంజ్ఞలు ముద్రితములై యున్నవి. ఆంధ్రుల విదేశవాణిజ్యము విరివిగా సాగుచుండె ననుటకు ఆనాటి నాణెములపై గల ఓడయొక్కయు తెరచాపల యొక్కయు సంజ్ఞలు నిదర్శనములుగా నున్నవని విన్సెంట్ స్మిత్ పండితుని అభిప్రాయము. లభించిన నాణెములలో కొన్ని ప్రసిద్ధాంధ్ర చక్రవర్తి యగు యజ్ఞ శ్రీ శాతకర్ణికి చెందినవని చారిత్రకులు నిర్ణయించినారు.

ఘంటశాలలో లభించిన నాణెములందు కొన్ని రోమను నాణెములుగూడ నున్నవి. వానిలో ఒక్కొక్కనాణెము మేలిమిబంగారముతో చేయబడి తూకమున నేటి సవరనునకు సమానముగనున్నది. ఒకవైపు రాజు విగ్రహము, వేరొకవైపు ఏదైన దేవత యొక్కగాని, దేవాలయము యొక్కగాని యాకారము ముద్రింపబడినది. దేవత పేరు, లేక దేవాలయము పేరు దానిక్రింద వ్రాయబడియున్నది. రెండువైపుల నగిషీపని కలదు. లభించినవానిలో ఒకటి అంటోనినస్ (Antoninus 138 A.D.) అను రాజునకు చెందినది. వేరొకటి హాడ్రియన్ (Hadrian 117 A. D.) అను రాజునకు చెందినది.

ఘంటశాల ప్రాచీనకాలపు ఓడరేవై, వాణిజ్యమునకు కేంద్రమగుటయేకాక బౌద్ధమతమునకు కూడలి స్థానముగా నుండెను. విదేశ వాణిజ్యమునకు కేంద్రమైన గంటసాలలో బౌద్ధులైన పలువురు వర్తకులు స్తూపములు, సంఘా రామములు కట్టించిరి. ఇచటినుండియే బౌద్ధ భిక్షువులు బుద్ధదేవుని ప్రేమసందేశములను తెలుపుటకు వివిధ దేశములకు నౌకామార్గమున వెళ్లుచుండిరి. అందుచేత గంటసాల విదేశీయబౌద్ధులకును, భారతదేశీయ బౌద్ధులకును కూడలిగా నుండెననదగును.

ఘంటశాలలో బౌద్ధమతమునకు సంబంధించిన శిథిలములు విరివిగా కనుపించును. వీనిలో శిథిలావస్థయందున్న ఇచటి స్తూపము ముఖ్యమైనది. ప్రాచీన శిథిలసంరక్షక సంఘమువారి నివేదిక ననుసరించి ఇప్పు డీగ్రామమునకు ఈశాన్యముననున్న ఈ స్తూపము ఆకృతిలో గుండ్రముగా నున్నది. మధ్యకొలత సుమారు 112 అడుగులు. ఎత్తు 23 అడుగులు. స్తూప మధ్యభాగమున 10 అడుగుల చచ్చౌకము కలిగి లోపల బోలులేని ఇటుకలతో కట్ట బడిన దిమ్మె యొకటి కలదు. దాని చుట్టును 19 అడుగుల చచ్చౌకము గల సమచతురావరణము కలదు. స్తూపము ఆయా భాగములందు అరలుగా విభజింపబడినది. ఈ అరలు మట్టితో గట్టిగా పూడ్చబడియున్నవి. స్తూపము చుట్టును 51/2 అడుగుల వెడల్పుతో 41/2 అడుగుల ఎత్తుతో పిట్టగోడ యొకటి కలదు. ఇది భక్తులకు ప్రదక్షిణ మార్గముగా నుపయోగింపబడుచుండెడిది. స్తూపము యొక్క నాలుగు వైపులందు మెట్లును, శిథిలములైన ఇతర భాగములును కనుపించుచున్నవి. స్తూప ప్రాంతమున కొన్ని పాలరాళ్లు కనుపించును.

శ్రీపాదము : ఇది బుద్ధభగవానుని పాద చిహ్నము చెక్కబడిన పాలరాయి. ఇదియే గంటసాలలో దొరకిన పాదచిహ్నము. ఈ రాతి యొక్క మూడు కోణములు విరిగిపోయినవి. అమరావతిలో దొరకిన శ్రీపాద చిహ్నముతో దీనికి పోలిక కలదు. పాదముల మడమల వెనుక పద్మ పుష్ప గుచ్ఛము కలదు. మడమల మీద రెండు చక్రము లున్నవి. చక్రప్రాంతములందు స్వస్తికయు, త్రిశూలముమ కనిపించును.

శిలా స్తంభము : బుద్ధవనమని నేడు వాడుకలో నున్న గ్రామపు పశ్చిమ ప్రాంతమున శిలా స్తంభమున్నది. ఇది యొక చెట్టు క్రింద నిలువుగా పాతబడియున్నది. ఈ స్తంభము యొక్క ముందుభాగమునందును, కుడి ప్రక్క యందును మాత్రమే నగిషీపని చేయబడియున్నది. మిగిలిన రెండు భాగములు నున్నగా నున్నవి. స్తంభపు అడుగుభాగమున గుండ్రని పాత్రాకార మొకటి కలదు. ఆ పాత్రాకారము నుండియే బయలుదేరినట్లు కమలగుచ్ఛములును, పుష్పపత్రాదులును ఒక దానిపైనొకటి మిక్కిలి సుందరముగా చెక్కబడియున్నవి. స్తంభపు కుడిప్రక్కన శిల్పము గూడ దాదాపు ఇట్లే యున్నది. సాంచీలోని ఉత్తర ద్వారమున గల శిల్పముతో దీనికి పోలిక గలదు. ఈ స్తంభము బహుశః బౌద్ధమత స్మారక చిహ్నముగా నెలకొల్పబడియుండును.

వేరొక శిలాస్తంభము : గ్రామపు సరిహద్దులలో నున్న దిబ్బ వద్ద ఈ స్తంభము భూమిలో పాతబడియున్నది. దీని శిరోభాగము విరిగిపోయినది. మిగిలియున్న భాగము అష్టముఖములతో నున్నది. రెండు ప్రక్కలలో మాత్రమే శిల్పము కలదు. మొదటి ప్రక్కన క్రింద నొక సింహాసనము, దాని కిరువంకల రెండు పద్మపుష్పములు, చక్రము, దాని చుట్టును త్రిశూలాలం కారము కనుపించుచున్నవి. రెండవ ప్రక్క గూడ నిట్టి శిల్పమే కలదు గాని అది చాలవరకు అస్పష్టముగా నున్నది. దీనికి సమీపమున నాలుగు విరిగిన స్తంభములు పాతబడియున్నవి. ఇవి పూర్వము మండపాకారమున నుండియుండును.

ఇవిగాక స్తూపమున నున్న పాలరాతి పలకలు అచ్చటచ్చట కనుపించును. అందు బౌద్ధ మతస్థుల పవిత్ర చిహ్నములు కనుపించును. బోధివృక్షము, బౌద్ధస్తూపాకృతి, బౌద్ధవిగ్రహము, ఛత్రము, భిక్షువులు, అర్హతుడు, కలశము మొదలైనవి ఇట్టి చిహ్నములు.

బౌద్ధమతము క్షీణించినతరువాత బౌద్ధశిల్పవిన్యాసము గల పాలరాతి పలకలను చెడగొట్టి, వాటిపై హిందూ దేవతా విగ్రహములను చెక్కినారు. ఇచట కనుపించు భైరవస్వామి విగ్రహము, సరస్వతీదేవి విగ్రహము. రతీదేవి విగ్రహము ఇట్టివే. మూడును మిక్కిలి మోటుగా నుండి శిల్పనైపుణ్య రహితములుగా నున్నవి.

జలధీశ్వరాలయము : ఘంటశాలలో నున్న జలధీశ్వరాలయమున శివుడు జలధీశ్వరనామముతో ఆరాధింప బడుచున్నాడు. గంటసాల యోడరేవగుటచే ఇచటి నుండి నౌకాయానముచేయు వర్తకులు మహాదేవుని తమ ప్రయాణము సఫలమగుటకై పూజించి ప్రార్థించుచుండిరి. రోమనులు సముద్రయాన సందర్భమున సముద్రదేవతను (నెప్త్యూనును) పూజించునట్టిదే ఇది. భారతదేశమున శివుడు జలధీశ్వర నామముతో మరియెచటను పూజింపబడినట్లు కానరాదు. ఈ ఆలయమున శివుడు లింగరూపమున లేడు. ఇందు పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠమున నున్నట్లు వెలసియున్నారు.

ఈ ఆలయ మెపుడు నిర్మితమయ్యెనో చెప్పుటకు సరియైన ఆధారములు లేవు. ఇది బహు పురాతనమైనది. క్రీస్తుశకారంభమునాటికే ఈ యాలయము నిర్మింపబడి యుండును. ఇచట నున్న దాన శాసనములను బట్టి ఈ దేవాలయము ఎనిమిదివందల సంవత్సరములకుపూర్వము కూడ నుండెనని చెప్పుటకు వీలగుచున్నది. పూర్వకాలమున ఈ ఆలయము మహావైభవ సమన్వితమై గొప్ప పుణ్య క్షేత్రముగా ప్రసిద్ధిచెంది, దూరదూర ప్రదేశముల నుండి భక్తుల నాకర్షించుచుండెననుటకు ఇచటి శాసనములు సాక్ష్యములుగా నున్నవి.

ఇట్లు పూర్వము ప్రసిద్ధినందిన ఘంటశాల బౌద్ధ క్షేత్రముగను, ఓడ రేవుగను, వాణిజ్య కేంద్రముగను ప్రఖ్యాతిని బడసి, నేడు ఆంధ్రదేశపు ప్రాచీనపు టౌన్నత్యమునకును, నౌకాయాన ప్రావీణ్యమునకును, బౌద్ధమత ప్రాశస్త్యమునకును ప్రత్యక్ష చిహ్నముగా నున్నది.

మ. కు.


ఘటికాస్థానములు :

ఘటిక, ఘటికాస్థానము అను పదములు శిలాతామ్ర శాసనములలో మాత్రమే కానవచ్చును. అందువలన ఘటిక యన్ననేమో, ఎట్టిదో తెలిసికొనుటకు ఈ పదము వచ్చు శాసనములను, ఆ సందర్భమున చెప్పబడిన విషయములను తెలిసికొనవలసి యుండును.

మొదటిమారు పరిశోధకుల దృష్టి నాకర్షించుటకు హేతువైన ఘటికా పదాన్విత లేఖ్యము కదంబ కులజుడైన కాకుత్థ్సవర్మ తాలగుండ శిలాస్తంభశాసనము. ఇది మైసూరురాష్ట్రము లోనిది. కదంబులు బ్రాహ్మణులు. కదంబ వంశజుడైన మయూరశర్మ వేదాధ్యయనమును