Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రీకు భాషాసాహిత్యములు

వికీసోర్స్ నుండి

గ్రీకుభాషా సాహిత్యములు :

యూరప్ ఖండపు సంస్కృతికి ప్రాచీన గ్రీసుదేశమే పుట్టినిల్లగుటచే, గ్రీకుభాషయు, సాహిత్యమును యూరప్ ఖండమునందలి వివిధదేశముల భాషాసాహిత్యములపై తమప్రభావమును ప్రసరింపజేసి, వాఙ్మయ ప్రపంచమునం దొక విశిష్ట స్థానమును గడించుకొన్నవి.

భాష : గ్రీకుభాష ఇండో - యూరపియన్ భాషా కుటుంబమునకు చెందినది. దానికి కెల్టిక్, ట్యుటానిక్, లాటిన్, సంస్కృత భాషలతో సంబంధము కలదు. గ్రీసు దేశమునందలి వివిధ రాష్ట్రముల నడుమనున్న పర్వతములు పూర్వము దుర్గమములై ప్రజల రాకపోకల కాటంకము కలిగించుటచేతను, గ్రీకు ప్రజలు పరిసర ద్వీపములందు సైతము చెదరియుండుట చేతను, దేశపు నైసర్గిక స్వరూప ప్రభావమున గ్రీకు భాషకు మొదట నొక సునిశ్చిత రూపమేదియులేక పెక్కు మాండలిక భేదము లేర్పడెను. వానిలో ఇయోలిక్, డోరిక్, అయోనిక్, యాటిక్ అను నాలుగు మాండలికములే ప్రధానములు. క్రీ. పూ. 4 వ శతాబ్దమునాటికి గ్రీకు రాష్ట్రము లన్నింటను ఏథెన్సు నగరమునకు రాజకీయముగ ప్రాధాన్యము హెచ్చెను. సాహితీ పరులకుకూడ నది ముఖ్య కేంద్రమయ్యెను. కనుక ఏథెన్సునగరమున ప్రచారమునం నున్న యాటిక్ మాండలిక మే నాటినుండియు సారస్వతోపాసకుల కాదరణీయమై క్రమముగ దేశమంతటను వ్యాపించి గ్రాంథిక భాషకు ప్రాతిపదిక యయ్యెను. అలెగ్జాండర్ దండయాత్రల మూలమున గ్రీకుభాష ఆసియా మైనర్, సిరియా, మెసపొటేమియా, ఈజిప్టు దేశములందు కూడ వ్యాపిం చెను.

ఈభాషకు లిపి తొలుత నెప్పుడేర్పడెనో నిశ్చయముగ తెలియదు. ఫినీషియా దేశస్థుడుగు కాడ్మస్ గ్రీకుభాషకు వర్ణమాల నేర్పరచెనని పూర్వగాథ యొకటి సూచించు చున్నది. గ్రీకు వర్ణములు ఫినీషియన్ వర్ణములనుండి యేర్పడినమాట మాత్రము సత్యమే. గ్రీకు వర్ణమాలయం దిరువదినాలుగక్షరములు కలవు. ప్రాచీన శిలాశాసనములనుండి నాటి గ్రీకులిపి స్వరూపమును తెలిసికొనుటకు వీలగుచున్నది.

నేటి గ్రీకుభాషకూడ ప్రాచీన వర్ణమాల నుపయోగించుచున్నది. కాని భాషాస్వరూపము మాత్రము చాల మారినది. ప్రాచీనభాషలోలేని విదేశీయ పదము లనేకము నేటి గ్రీకుభాషలో ప్రవేశించినవి. శబ్దాచ్చారణము నందును, వ్యాకరణమునందును పెక్కుమార్పులు కలిగినవి. ద్వివచనరూపము అంతరించి, ఏకవచన, బహువచన రూపములే నిలిచినవి. "స్వచ్ఛ" భాషా వాదులు ప్రాచీన


శాటరిజులు, మేనాడులచే పరివేష్టితుడైయున్న డయోనైనస్ ఇతడు ప్రాచీన గ్రీకుల మద్యరసాధిదేవత

ఈస్కలస్ అనువాడు గ్రీకువిషాదాంతనాటకకర్తలలో ప్రథముడు. అతడు రంగముమీదికి రెండవనటునికూడ

ప్రవేశ పెట్టి, బృందగానపు ప్రాముఖ్యమును తగ్గించి, సంభాషణలను విస్తరింపజేసెను. అతని నాటకములలో 'యగమెమ్నన్' వంశమునుగూర్చిన నాటకత్రయమును, “ప్రొమీథియస్ బౌండ్" నాటకములు ప్రధానములు. ఈస్కలస్ నాటకములు గంభీరమైన శైలికి ప్రసిద్ధములై కవి ధార్మికదృష్టిని, జీవిత పరమావధిని గూర్చిన భావ మధనము నడుగడుగున ప్రతిఫలింప జేయుచుండును. సోఫక్లీస్ కాలక్రమమున ద్వితీయుడైనను. కళాసౌందర్య మున ప్రథముడని గణుతికెక్కెను. పాత్రల మనస్తత్వ చిత్రణమునం దాతడు సిద్ధహస్తుడు మానవుల సహజో ద్రేకములు, పరస్పర విరుద్ధాశయములు విషాద పరిణామమున కెట్లు దారితీయునో సోఫక్లీస్ కడు రమ్యముగ చిత్రించును. అతని నాటకములలో "ఈడిపస్", “యాంటిగనీ”, “ఎలెక్ట్రా", "అయ్‌జాక్స్" అనునవి ప్రశస్తములు. ప్రధాన విషాదాంత నాటకకర్తలలో తృతీయుడు యూరిపిడీస్. నాటకమున కతడు పూర్వ రంగమును కూర్చెను. సమకాలీన జీవితమునందలి ధర్మసందేహము లతని నాటకములలో కాన్పించును. మానవు లెట్లుండవలెనో సోఫక్లీస్ నాటకములు సూచించగా, మానవు లెట్లుందురో యూరిపిడిస్ నాటకములు వెల్లడించును. యూరిపిడిస్ నాటకములలో "హెర్ క్లీస్", "హెక్యుబా", "హెలెనా", "ఇఫిజీనియా" అను నాటకములు ప్రఖ్యాతములు.

ఆ కాలముననే సుఖాంత నాటక రచనయు ప్రారంభమయ్యెను. పామరుల హాస్య పరిహాసములును, వినోద గీతములును దానికి బీజములు. సుఖాంత నాటకములకు కళాస్వరూపము నొసగిన నాటకకర్త అరిస్టోఫనీస్ అను వాడు. తన నాటకములం దతడు సమకాలికో దంతములను, ప్రసిద్ధ వ్యక్తులను నిర్భయముగ పరిహసించెను. “క్లౌడ్స్” అను నాటకమునందతడు సుప్రసిద్ధ వేదాంతాచార్యుడైన సోక్రటీసును, “ఫ్రాగ్స్" అను నాటక ము నందు యూరిఫిడీసును గేలిచేసెను. అటుపిమ్మట సుఖాంత నాటకములందు వ్యక్తులుగాక వివిధోద్యమములు విమర్శింప బడెను. తుదకవి దైనందిన జీవితమునందలి హాస్య ఘట్టములను ప్రదర్శించెను. అట్టి నాటకములను రచించిన వారిలో మినాండర్ ముఖ్యుడు.

క్రీ. పూ. 5 వ శతాబ్దమునందే చరిత్ర రచనయు, వచన వాఙ్మయమును పరస్పర పోషకములై వెలసెను. గ్రీకు చరిత్రకారులలో ప్రథముడుగు హెరోడటస్ సుందరమైన వచనశైలికి కూడ మార్గదర్శకుడయ్యెను. గ్రీసు, పర్షియా దేశముల నడుమ జరిగిన యుద్ధముల నతడు వర్ణించుచు అం దసమాన కథనాశ క్తిని ప్రదర్శించెను. థ్యూసిడిడీస్ విమర్శ దృష్టితో పెలపనీషియన్ యుద్ధచరిత్రమును రచించుచు అందు వ్యక్తుల శీల తారతమ్యమును అతి దక్షతతో వెల్లడించెను. ఆ కాలమునకే చెందిన వేరొక చరిత్రకారుడగు జెనఫన్ స్వయముగ సైనికుడై యుద్ధమున పాల్గొనుటయేగాక, గ్రీసుభాషలో తొలి వచన వ్యాసములను రచించి కీర్తిగాంచెను.

ఏథెన్స్ నగరమునం దపుడు వక్తృత్వమునకు ప్రజాదరణ మధికముగ లభించుచుండెను. నాటి వక్తలు తమ ఉపన్యాసములను గ్రంథరూపమున ప్రచురించుచుండిరి. వారిలో అగ్రగణ్యుడైన డెమాస్తనీస్ "ఒలింథియాక్స్", “ఫిలిప్పిక్స్” అను సంపుటములలో తన గంభీరోపన్యాసముల సంకలనము గావించెను. గ్రీకు వచన రచనయం దద్వితీయుడని పరిగణించబడుచున్న ప్రఖ్యాత తత్వజ్ఞుడు ప్లేటో కవిత్వమున కెనవచ్చు రసవంతమైన శైలిలో “డయలాగ్స్" గ్రంథమునందు తన దేశికుడైన సోక్రటీస్ ధర్మ ప్రబోధమును, 'రిపబ్లిక్ ' గ్రంథమునం దాదర్శ సమాజ స్వరూపమును చిత్రించెను. ఆతని శిష్యుడగు అరిస్టాటిల్ రచించిన “పొయటిక్స్” పాశ్చాత్య వాఙ్మయమునందలి ప్రథమ లక్షణగ్రంథము.

క్రీ. పూ. 4వ శతాబ్దము తరువాత ఏథెన్స్‌నగరపు ప్రాధాన్య మంతరించి, రాజకీయముగ నేమి, వైజ్ఞానికముగ నేమి, అలెగ్జాండ్రియా ముఖ్యకేంద్రమయ్యెను. అప్పటితో గ్రీకు సాహిత్యమున క్షీణదశ ప్రారంభమైనట్లు విమర్శకు లభిప్రాయపడుచున్నారు. అలెగ్జాండ్రియన్ యుగ కవితలో నిసర్గసౌందర్య లోపమును, పాండిత్య ప్రకర్షయు నెక్కువగా కాన్పించును. ఆనాటి కవులయం దితిహాసకావ్యములకు అపొలోనియస్ అనువాడును, స్తోత్రకావ్యములకు కాలిమాకస్ అనువాడును ప్రసిద్ధి వడసిరి. ఆ కాలముననే సరళసుందరమైన గ్రామీణ జీవనమును వర్ణించు “పాస్టరల్" కవిత్వ ముదయించెను. “పాస్టరల్” కవులలో థియాక్రిటస్, బయన్, మాస్కస్ అను మువ్వురును ముఖ్యులు.

క్రీ. పూ. 2వ శతాబ్దమున గ్రీసుదేశము రోమనుల వశమయ్యెను. ఆ యుగమునకు చెందిన గ్రంథకర్తలలో చరిత్ర రచనను గూర్చి స్వతంత్ర దృష్టిగల పోలీబియస్ ప్రత్యేకముగ నెన్నదగినవాడు. అపుడే ప్లూటార్క్ పండితుడు ప్రఖ్యాత గ్రీకు, రోమన్ మహాపురుషుల జీవిత చరిత్రముల నతి రసవంతముగ రచించెను. లూసియన్, వ్యంగ్యకావ్య రచనచే ప్రసిద్ధుడయ్యెను. ప్లాటినస్, మార్కస్ ఆరీవియస్ తాత్వికగ్రంథములను రచించిరి. అపుడే గ్రీకుభాషలో మొదట క్రైస్తవ వాఙ్మయ ముదయించెను. ఆ మతసంబంధమైన ప్రబోధములు, లేఖలు, మతాలయ చరిత్రాదు లనేకములు రచింపబడెను. ప్రణయపు ఘట్టములను, సాహసకృత్యములను వర్ణించు కథా వస్తువుతో కూడిన “రొమాన్స్” అను నూతన సాహిత్య ప్రక్రియ సైత మపుడే యేర్పడెను.

తరువాత బై జాంటియమ్ (కాన్స్‌టాన్టినోపిల్) గ్రీకు సంస్కృతికి విహారభూమి యయ్యెను. సాహిత్యక్షేత్రము నం దపుడు బహుళమయిన కృషిజరిగెను. కాని యది ప్రధానముగ మత సంబంధమైనది. సృజనాత్మక రచన లపుడధికముగ నవతరింపలేదు. నాటి విద్వాంసులు బహుళ పరిశ్రమ గావించి ప్రామాణిక నిఘంటువులను, విజ్ఞాన కోశములను, పూర్వగ్రంథములకు బృహద్వ్యాఖ్యానములను వెలయించిరి. క్రైస్తవ భక్తుల జీవిత చరిత్రము లనేక మవుడు ప్రకటితమయ్యెను. నాటి మత గ్రంథ కర్తలలో డెమాస్కస్ నివాసి యగు సెయింట్‌జాన్ ముఖ్యుడు. క్రీ. శ. 1453 లో కాన్స్‌టాన్టి నోపిల్ తురుష్కుల వశమగుటతో గ్రీకు విద్వాంసు లచటినుండి నిష్క్రమింపవలసి వచ్చెను.

క్రైస్తవులకును, మహమ్మదీయులకును నడుమ జరిగిన మత యుద్ధముల మూలమున గ్రీకు ప్రజలకు ఇటలీ, ఫ్రాన్స్ దేశవాసులతో సన్నిహిత సంబంధ మేర్పడుటచే క్రీ. శ. 13-18 శతాబ్దముల నడుమ రచింపబడిన గ్రీకు కవిత్వమునందు ఆదేశముల సంస్కృతి ప్రభావము కొంత కాన్పించును. అపుడు వెలసిన గ్రీకు "రొమాంటిక్ " కావ్యములందలి ప్రణయ కథలలో నధిక భాగము ఫ్రెంచి మూలముల ననుసరించి యుండును.

క్రీ. శ. 18 వ శతాబ్దమున గ్రీకుభాషలో జానపద గేయ వాఙ్మయము ప్రబలెను. లలితమయిన భాషయు, సుకుమార భావములును, సుందర గ్రామీణ చిత్రము లును అం దెల్లెడల కాన్పించును. తరువాత గ్రీకు ప్రజలు కోల్పోయిన తమ స్వాతంత్ర్యమును తిరిగి సాధించుటకు బద్దకంకణులగుటతో దేశమున జాతీయతా భావము వ్యాపించుటచే, జనులలో ప్రాచీనసాహిత్య సంస్కృతుల పట్ల భక్తి గౌరవములు వృద్ధియయ్యెను. సమకాలీన వ్యావహారిక భాష సాహిత్య గౌరవమున కర్హమైనది కాదనియు, ప్రాచీన కావ్యములలోని భాషయే గ్రంథ రచనకు తగినదనియు భావించు పండితులు కొందరపుడు “స్వచ్ఛ” భాషావాదమును లేవదీసిరి. అడమాంటియస్ కోరే మధ్యేమార్గము నవలంబించి, గ్రాంథిక, వ్యావహారిక భాషలకు సామరస్యమును కుదుర్చుటకు ప్రయత్నించెను. కాని క్రీ. శ. 1888 లో జీన్‌సిచారి "మై జర్నీ” అను నవలను వ్యావహారిక భాషలో రచించి ప్రకటించుటతో, వ్యావహారిక భాషావాదమునకే బలమెక్కువగ చేకూరెను. ఇటీవల రెండు ప్రపంచ సంగ్రామముల నడిమి కాలమున గ్రీకు రచయితలు నవలలను, చిన్న కథలను విరివిగా వ్రాయుచున్నారు. స్ట్రాటస్ మిరివిలిస్ వ్రాసిన "హిజ్ లైఫ్ ఇన్ ది టూంబ్" ఇలై యాస్ వెనెజిస్ వ్రాసిన “రిజిస్టర్ నెంబర్ 31328” ప్రథమ ప్రపంచ సంగ్రామమును గూర్చి వెలువడిన నవల లన్నిట నత్యుత్తమము లని విమర్శకులు నిర్ణయించిరి. గ్రీకు భాష యందిపుడు వచన వాఙ్మయమే నానాటికి విజృంభించు చున్నది.

అ. రా.


గ్రీన్‌లాండ్ :

విమానములో ప్రయాణించి గ్రీన్‌లాండ్ భూభాగముపై దిగ నుద్యమించు బాటసారికి, తాను మరియొక గ్రహముపై దిగుచున్నట్లు గోచరించును. పై నుండి ఆతనికి యుగముల తరబడిగా నిరంతరము పడి పేరుకొనిన మంచుచే కప్పబడి, నిర్జనమై, విశాలమైన మైదానము