Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రీసుదేశము (భూగోళము)

వికీసోర్స్ నుండి

గ్రీసుదేశము (భూ) :

గ్రీసుదేశము తూర్పు మధ్యధరామండలములో నున్న ఒక చిన్న రాజ్యము. ఇది 35°-411/2° ఉత్తర అక్షాంశ రేఖల మధ్యను, 19°-281/2° తూర్పు (గ్రీనిచికి) రేఖాంశవృత్తముల మధ్యను కలదు. దక్షిణ యూరపుఖండమునందలి మూడు ద్వీపకల్పములలోను ఇది మిక్కిలి తూర్పున

చిత్రము - 147

ఉన్నది. 1951 వ సంవత్సరపు లెక్కలనుబట్టి దీని విస్తృతి 51,168 చ. మైళ్ళు. జనాభా 76,32,801. ఇందు ప్రజాస్వామిక ప్రభుత్వము కలదు. ఇచటి ద్రవ్యమానమునకు (monetary unit) 'డ్రాక్మ' అని పేరు. ఇవి 84 అగుచో

ఒక పౌను (స్టెర్లింగు) తో సమానమగును. ప్రజలలో పెక్కురు ప్రాచీనసంప్రదాయపు (orthodox) చర్చికి చెందిన క్రైస్తవులు. రాజ్యాంగ విధానము ననుసరించి ఇతర మతములకు చెందిన జనులకు కూడ ఇచట మత స్వాతంత్ర్యము కలదు.

ప్రాచీన వైభవమునకు గ్రీసుదేశము మిక్కిలి ప్రసిద్ధి గాంచియున్నది. ఇది పశ్చిమఐరోపా నాగరకతయందును పరిపాలనావిధానమునందును పురోగామిగా ప్రసిద్ధి నొంది యున్నది. కాని నేడు కేవలము జీవికకొరకే గ్రీకులు ప్రకృతిని, తోటిమానవులను కఠినముగా ఎదుర్కొనవలసినవా రగుచున్నారు. తూర్పు మధ్యధరాసముద్రమునను ఉపగమించు మార్గమును (టర్కీతో కలిసి) తన యధీనమునం దుంచుకొనుటకు తోడ్పడునట్టి గ్రీకుయొక్క నైసర్గికస్థితి మూలముననే అది యూరపుఖండమున ప్రాక్పశ్చిమదేశ గతములయిన రాజకీయ పక్షముల మధ్య ఏర్పడిన సంఘర్షమున ప్రప్రథమమున బలియయ్యెను. 1830 వ సంవత్సరమువరకు గ్రీసుదేశము టర్కీ దేశముయొక్క అధికారమునకు లోబడియుండెను. కాని దానికి స్వాతంత్ర్యము లభించినపిదప 1923 లో జనాభాయొక్క వినిమయము జరిగెను. అందుచే 6,00,000 మంది టర్కీ దేశీయులు స్వదేశమును విడిచిపోయిరి. 15,00,000 మంది గ్రీకుదేశీయులు గ్రీసుదేశమునకు వలస వచ్చిరి. ఇదివరకే దారిద్ర్యముతో పీడింపబడుచున్న గ్రీసుదేశములో ఇంత మంది కాందిశీకులు ఇముడుట అతికష్టసాధ్య మయ్యెను. కాని దేశమందు ఈ వినిమయమువలన ఒకేజాతికి చెందిన జనాభా ఏర్పడెను. ఇప్పటికిని అనేకమంది దేశాంతరములం దున్నారు. రెండవ ప్రపంచయుద్ధ కాలమందు గ్రీసుదేశము ఇతర ప్రధానశక్తులమూలమున ఉపద్రవమునకు గురి అయ్యెను. తదుపరి దేశముయొక్క ఉత్తరభాగమందున్న సోవియట్ రష్యాపక్షమువా రగు గోరిల్లాలకును ప్రజాస్వామిక మగు గ్రీసుప్రభుత్వమునకును మధ్య అంతర్యుద్ధము ప్రవర్తిల్లెను. అమెరికాదేశముయొక్క సహాయముతో గ్రీసుదేశము ఛిన్నాభిన్నమైన తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకొన్నది. నేడు గ్రీసు సంప్రదాయ సిద్ధమయిన తన ప్రాచీన వైభవానుగుణముగా ఆగ్నేయ యూరపునందలి ప్రజాస్వామికమున కొక ఉప స్తంభమువలె నిలిచియున్నది.

గ్రీసుదేశము నిమ్నోన్నతమగు భూమి కలది. ఇది ఆయా ఋతువులందే మిక్కిలి వేగముగా ప్రవహించు నదులతో కూడి యున్నది. ఇందు మధ్యమధ్య విచ్ఛిన్నమయిన తీరపుమైదానములు కలవు. వాయవ్యదిశనుండి ఆగ్నేయమువరకు వ్యాపించియున్న ఇందలి ఎగుడు దిగుడు కొండల వరుసలు బాల్కను పర్వతముల ధోరణిని అనుకరించుచున్నవి. వీటిలో పిండస్ పర్వతములు అత్యంతము ముఖ్యములైనవి. ఏజియన్, ఎడ్రియాటిక్ మడుగుల క్రుంగుదలయొక్క ఫలితముగా ఈ దేశము అనేకములగు ద్వీపకల్పములతోను, ద్వీపములతోను ఏర్పడియున్నది. దేశముయొక్క మిట్టపల్లములతో కూడిన నైసర్గికస్థితియు, విచ్ఛిన్న తీరరేఖయు గ్రీకులను సముద్రయానమందు అభిరుచి కలవారినిగా చేసెను. ప్రాచీన కాలమునుండియు వారు నౌకాయానమునకు సంబంధించిన సంప్రదాయమును కలిగియుండిరి. నేటికిని గ్రీసు యొక్క పరిమాణమును, ఉపపత్తుల (resources) ను బట్టి చూడగా దానికి అట్టి దేశము లన్నిటికంటె గురుతర భారమును మోయగల నౌకాసంపత్తి (shipping tonnage) కలదనవచ్చును. ఈ దేశమందు మధ్యధరామండలమునకు చెందిన ప్రత్యేక శీతోష్ణస్థితి కలదు. ఇచట సిరొకో (sirocco) అనబడు వాయువులు వీచుచుండును. పొడిగాను, ఉష్ణముగాను ఉండు వేసవియు, సౌమ్యవృష్టి గల శీతకాలమును ఇచట కనిపించును. దేశముయొక్క ఉత్తరభాగమం దున్న మేసిడోనియా, థ్రేస్ అను మైదానములు మాత్రమే తీవ్రమగు . శీతకాలములతో కూడిన ఖండాంతర్గత శీతోష్ణస్థితివంటి శీతోష్ణస్థితిని కలిగియుండును. మధ్యగత పర్వత సముదాయము కారణముగా పశ్చిమగ్రీసులో చాలినంత వాన పడును. ఆ వర్షపాతము తరచుగ 50" లకు మించి యుండును. కాని దేశము యొక్క తూర్పుభాగమున అల్ప వర్షపాతము, తరచుగ నీటిక్షామము ఘటిల్లును. ఏథెన్సు నగరములో సగటున 14"-15" ల వాన కురియును. ఒండుమట్టితో కూడియుండు మైదానములలో తప్ప ఇతరత్రకల భూములు సారవిహీనములు. వివరములను తెలిసికొనవలెనన్న గ్రీసుదేశమును భౌగోళికముగా నాలుగు భాగములు చేయవచ్చును : 1. మేసిడోనియా, ధ్రేసులలో చేరియున్న ఈశాన్యభాగము; 2. గ్రీకు ద్వీపకల్పము; 3. పెలెపోనెసస్ (Peloponnesus); 4. గ్రీకు దీవులు.

మేసిడోనియా, థ్రేసు : ఈశాన్యదిశయందున్న గ్రీసుదేశము యొక్క ఈ భాగము బాల్కను ప్రదేశముల యొక్క అనుబంధముగా నున్నది. ఈ ప్రాంతమందు అంచెలుగానుండు మైదానములు కలవు. ఉత్తరమందు క్రమముగా ఎత్తుగా లేచుచున్న చిన్నకొండలు రొడోవ్ (Rhodope) పర్వతము లనబడుచున్నవి. గ్రీసునందలి ఈ ప్రాంతము వ్యవసాయముదృష్ట్యా ఇతర భాగముల కంటె అధిక ప్రాధాన్యమును వహించుచున్నది. ఇది జనాకీర్ణమై యున్నది. యుగోస్లేవియా సరిహద్దుమీదుగా ఉత్తరమునుండి ఏజియన్ సముద్రములోనికి ప్రవహించు చున్న వరదార్ నదియొక్క లోయ ప్రస్తుతము రష్యావారి పలుకుబడిలోనున్న డాన్యూబ్ ప్రాంతమునకు త్రోవను కల్పించుచున్నది. ఈ కారణముచే ఈ ప్రాంతము రాజకీయముగా భయ ప్రమాదములకు గురియగు చుండును. మైదానములు వేసవిలో పొడిగా నుండును. ఇది శీతకాలమందును, వసంతఋతువునందును వరదలకు లోనగుచుండును. అందుచేత ఆ కాలములందు నేలలు చిత్తడిగ నుండి చలిజ్వరములు వచ్చుచుండును. ఈ చిత్తడి నేలలు క్రమముగ సారవంతమగు భూములుగా మారి ఫలవంతము లగుచున్నవి. ఇచట శీతకాలము మిక్కిలి దుర్భరమై యుండును. సాధారణముగా మంచు కురియుచుండును. వేసవిలో మిక్కిలి పొడిగానుండును. కనుక ఆ కాలమందలి వ్యవసాయము నీటిపారుదలమీదనే ఆధారపడియుండును. ఇచట ఆలివు వృక్షములు పెరుగవు. ద్రాక్షఫలములు, తదితర ఫలములు పండును. పొగాకు బాగుగా అభివృద్ధిచెందును. ఇవి అన్నియు ఎగుమతి చేయబడును. సముద్రతీర ప్రాంతములు పల్లముగను, తేమగను ఉండును. అందుచే ఈ ప్రాంతములందు సాధారణముగ జనావాసము లేర్పడవు. ఇందు రెండు ముఖ్యమైన రేవు పట్టణములు కలవు. వీటిలో సెలోనికా యొకటి. ఇది వరదార్ నదీముఖద్వారమువద్ద నున్నది. 1951 వ లెక్కల ననుసరించి ఇందలి జనాభా 2,17,049. ఇది గ్రీసుదేశము నందలి రెండవ పెద్దపట్టణము. ఒక ఉత్తర గ్రీసునకేకాక యుగోస్లేవియా, బల్గేరియాలలో కొంతభాగమునకుకూడ ఈ రేవు వరదార్ నదీలోయగుండా ఒక నిర్గమనద్వారమై యున్నది. రెండవ పట్టణము కవల్ల (Kavalla) అనునది. ఇది థ్రేస్‌లో నున్నది. ఇందలి జనాభా 50,000 మంది. మేసిడోనియా రాజ్యము గ్రీసుదేశమునంతయు కొంతకాలము పాలించియున్నను, మేసిడోనియా చక్రవర్తి యగు అలెగ్జాండరు దూరపు ఆసియాలోకూడ సామ్రాజ్యమును విస్తరింపజేసి యున్నను, గ్రీసుయొక్క ప్రాచీన ఘనకృత్యములలో ఉత్తరదేశము విశేషముగా పాల్గొన లేదు.

గ్రీకు ద్వీపకల్పము: ఇది చారిత్రకముగా అధిక ప్రాముఖ్యమును చెందియున్నది. మధ్యనున్న ముడుత పర్వతపంక్తి యొకటి యుగోస్లేవియా, ఆల్బేనియా దేశముల సరిహద్దులనుండి దక్షిణముగా వ్యాపించియున్నది. ఈ పర్వతములు నిమ్నోన్నతమగు నైసర్గిక స్థితియు, సంశ్లిష్టమగు భూతత్త్వ నిర్మాణమును కలవి. ఈ పర్వత శ్రేణి ఉత్తర దిశయందు ప్రత్యేక ఖండముగా విచ్ఛిన్నమై దక్షిణ భాగమందు పిండస్ పర్వత మనబడు ఏకాండపు శిలోచ్చయముగ ఏర్పడియున్నది. ఇందు పశువుల కాపరులకు ఆవాసములగు కొన్ని గ్రామములు మాత్రమే కలవు. గొఱ్ఱెలు, మేకలు ఇచట మేపబడుచుండును. వ్యవసాయము స్వల్పముగ జరుగును. పర్వతపు వంపులమీది అడవులు నరికివేయబడుటచే విపరీతమగు భూమికోత (soil erosion) ఏర్పడెను. శీతకాలమున వర్షములు మిక్కుటముగా నుండును. పర్వతప్రదేశములందు లోతైన మంచు ఏర్పడుచుండును.

పశ్చిమ గ్రీసు (మధ్య పర్వతశ్రేణికి పశ్చిమ భాగము) ఎత్తు తక్కువగా నుండును. అందు తీరమునకు సమాంతరముగా మడ్డిచిట్టెముగట్టిన ముడుత కొండలవరుసలుకలవు. అచట చిన్న చిన్న తీరపు మైదానములు కలవు. వాటి యందలి పొడవులేని సెలయేళ్ళు అయోనియన్ సముద్ర
తీరమును చేరును. అచట శీతాకాలమందు వర్షములు మిక్కుటముగా నుండును. భూమి వ్యవసాయమునకు

అనుకూలముగ నుండును. జనాభా దట్టముగ నుండును. అచట గోధుమ, ద్రాక్ష, పొగాకు, ఆలివు, మొక్కజొన్న పండును. భూమి స్వల్పభాగములుగ విభజింపబడి యుండును. వ్యవసాయ పద్ధతులు మిక్కిలి అనాగరికముగ నుండును. అమెరికా దేశముయొక్క సాంకేతిక సాహాయ్యమువలన వ్యవసాయపద్ధతి క్రమమగు అభివృద్ధి నొందుచున్నది.

గ్రీసు దేశమంతటిలోను తూర్పు గ్రీసు చారిత్రకముగా అత్యంత ప్రాముఖ్యము కలది. ఇచట ఏథెన్సు, డెల్ఫి, థెహెస్ మున్నగు ప్రసిద్ధమయిన ప్రాచీన నగరములు కలవు. కాని వీటిలో ఏథెన్సు తప్ప మిగిలినవి ఇవుడు ఎట్టి ప్రాముఖ్యములేని చిన్న పల్లెలుగా నున్నవి. మధ్య పర్వత శ్రేణులు చిన్నచిన్నవి అనేకములు తూర్పుగాను. దక్షిణముగాను వ్యాపించి యున్నవి. వీటిమధ్య కొద్దిపాటి వండలినేలలు ఏర్పడి యున్నవి. ఇట్టి నేలలలో కిఫిస్సాస్ (దీనికి బొయోషియా అని ప్రాచీన గ్రీకు పేరు) అనునది మిక్కిలి పెద్దది. ఇది లోతులేని ఒక పెద్ద సరస్సు వట్టి పోవుటచే ఏర్పడి యుండెను. అటికామైదానము ప్రాచీన గ్రీకునాగరకతకు పీఠమై యుండుటచే దీనికంటె చిన్న దైనను ఎక్కుడు ప్రసిద్ధమైనది. కొన్ని గుట్టలు విడిగా నున్నవి. వాటిలో నొక దానిమీద ఏథెన్సుకు చెందిన ప్రసిద్ధమగు ఎక్రోపోలిస్ (Acropolis) కలదు. గ్రీసు యొక్క ముఖ్యపట్టణమగు ఏథెన్సు నగరము మొట్టమొదట గుట్టమీద వృద్ధి చెందెను. కాని మిక్కిలి విస్తరించి యుండుటచే సాలామిస్ (Salamis) సింధుశాఖలో నున్న పిరాయెన్సు రేవు నేడు దీనిలో చేరి యున్నది. ఏథెస్సు గ్రీకు ద్వీపకల్పమందు మిక్కిలి దక్షిణముగా నున్నప్పటికిని దీని ప్రాచీనకాలిక సంబంధమును బట్టియు, ఏజియన్ సముద్రమందు మధ్యగా నుండుటను బట్టియు ఇది యిప్పటికిని ప్రధాననగరముగా వరలుచున్నది. ఇప్పు డీనగరము గ్రీసుదేశమునం దెల్ల పెద్ద నగరమైయున్నది. ఇందు సమస్త ఆధునిక సౌకర్యములు కలవు. పిరయెన్సు నందును, ఇందును కలిసి 1951 వ లెక్కల ననుసరించి 1,378,586 మంది జనులున్నారు. దేశముయొక్క ఈ భాగమందు శీతకాలమున స్వల్పముగా వానపడును. వేసవి ఉష్ణముగ నుండును. జులై నెలలో సగటు ఉష్ణోగ్రత 80 ఫారన్‌హీటు డిగ్రీలవరకు పెరుగును. ధాన్యపు పంటలు, పండ్లతోటలు నీటిపారుదలమీద ఆధారపడును. పండ్లు, పొగాకు తూర్పుమైదానమునుండి ఎగుమతి చేయ బడును.

మధ్యగ్రీసునందలి పర్వతములకు తూర్పుభాగమున నదులచే కోయబడిన కొండల వరుసలు కలవు. వీటి ఎత్తు తక్కువ. ఉత్తరమున నున్న థెస్సలి మైదానము విశాలమైనది. అందు సారవంతములగు వండలి నేలలు కలవు. కాని వరదల మూలమున ఆ ప్రదేశమందు మలేరియాకు అనుకూలమగు శీతోష్ణస్థితి ఏర్పడినది. అందుచే అచట కొన్ని చిన్న నగరములు, పెక్కు గ్రామములు కలవు. వీటియందు నీటిపారుదల సహాయమున వ్యవసాయము చేయబడుచుండును. త్రిక్కాల, లారిస్సా అనునవి ఈ ప్రాంతమునకు ముఖ్యకేంద్రములు. లారిస్సా నగరము థెస్సలోనికానుండి ఏథెన్సుకు పోవు రైలుమార్గముమీద నున్నది. ఈ రైలుమార్గము ప్రసిద్ధమైన ఒలింపస్‌కొండ (ప్రాచీన గ్రీకుదేవతలకు నిలయము) కును, ఒస్సా అను కొండకును మధ్యనున్న లోయగుండా మైదానములలోనికి ప్రవేశించును. అట్లాంటే కాలువచే దేశముయొక్క ప్రధానభాగమునుండి ఇబోయియా అను ద్వీపము వేరు చేయబడినది. ఇది కొండల వరుసలతో ఇరుకుగా నున్నది. ఇది విచ్ఛిన్నమగు తీరపుమైదానములతో కూడియున్న దేశముయొక్క ప్రధానభాగమును విశేషముగా పోలియున్నది. పెలోపొన్నెసస్ అనునది కోరింత్, ఏజినా అను లోతైన, ఇరుకైన సింధుశాఖలచే ద్వీపకల్పరూపమున నున్న గ్రీసుభాగమునుండి వేరుచేయబడి, దానితో కోరింత్ అను ఇరుకైన భూసంధిచే కలుపబడియున్నది. కోరింత్భూ సంధియొక్క వెడల్పు 31/2 మైళ్ళుమాత్రమే. దీని గుండా ఓడలు పోవుటకు వీలగు ఒక కాలువ త్రవ్వబడుటతో పెలో పొన్నెసస్ పూర్తిగా ఒక ద్వీపముగా మారినది. ఈ కోరింత్ కాలువ ఏర్పడుటవలన గ్రీసుయొక్క తూర్పుభాగమునుండి పశ్చిమభాగమునకు సముద్రమార్గమున పోవలసిన గొప్ప దూరము తగ్గిపోయినది.

'పెలో పొన్నెసస్' పిండస్ పర్వతములయొక్క పొడి గింపుగా నుండును. ఈ పర్వతములు ఇచట ఎక్కువ వెడల్పుగా నుండి ప్రత్యేక శాఖలుగా చీలియున్నవి. ఇచట పరస్పరము వేరుపడుచున్న అనేకములయిన నదీ పరివాహక ప్రాంతములుకలవు. ఆల్ఫియోస్, ఇవ్రోటాస్ అను నదులు వాయవ్యమునుండి ఆగ్నేయమునకు పోవు ఒక నిర్మాణాత్మకమగు కందకము వెంబడి ప్రవహించును. ఉత్తర, పశ్చిమ తీరముల వెంబడి నిమ్న భూమండలము కలదు. ఇచటి పట్రాయి (పట్రాస్) అను పట్టణమునందు 79,500 మంది జనులు కలరు. ఇది కోరింత్ సింధుశాఖపై ముఖ్యమగు రేవుపట్టణముగా నున్నది. ఈ నగరమునకును, ఏథెన్సు నగరమునకును ఒక రైలుమార్గముచే సంబంధము ఏర్పడియున్నది. ఇచటినుండి ముఖ్యముగా చిన్న రకపు నల్లద్రాక్షపండ్లు ఎగుమతియగును. ప్రపంచములో నెల్ల ఇట్టి ద్రాక్షపండ్లను మిక్కిలి విస్తారముగా ఎగుమతిచేయు దేశము గ్రీసే. ఈ భాగముయొక్క ఆగ్నేయదిశలో, సింధుశాఖల ముఖముల వద్ద చిన్న చిన్న మైదానములు కలవు. వీటిలో ఆర్గోస్, స్పార్టా అనునవి ప్రాచీన కాలమందు ప్రసిద్ధములై యుండెను కాని నే డివి చిన్న నగరములుగా ఉన్నవి. పూర్వకాలమందు సముద్రపు దొంగల భయమువలన నగరములు పెక్కులు కొండల మీద కట్టబడెను. కోరింత్‌లో 10,000 మంది జనులు మాత్రమే కలరు. పెలోపోనెస్సస్ యందలి శీతోష్ణస్థితి పశ్చిమ గ్రీసుదేశము నందలి శీతోష్ణస్థితికంటె సౌమ్యమైనది. ఎత్తైన ప్రదేశములలో దేవదారు వృక్షములు పెరుగును. కాని ఏటవాలు భాగములందలి అడవులు నరికివేయ బడుటచే అవి (ఆ భాగములు) విశేషముగా కోతపడి భయదము లగుచున్నవి. గోదుమ, ఆలివ్, ద్రాక్ష ప్రధానముగా పండించబడును. చిన్న నల్లద్రాక్షపండ్లు ముఖ్యమైన ఎగుమతి వస్తువులు. ఇచట మేకలు పెంచబడును. కాని వాటివలన చిన్న చెట్లకు మిక్కిలి హాని జరుగుచుండును.

నీలసముద్రమునుండి పైకి లేచియున్న నిమ్నోన్నతములగు పర్వతముల మూలమున గ్రీసుదేశము సుందరముగా నుండును. కాని వ్యవసాయదృష్టిచే గ్రీసుదీవులు మిక్కిలి తక్కువ విలువకలవి. ఆ దీవులలో కొన్ని మేకలు మేయుటకు మాత్రమే ఉపయోగపడుచున్నని. వీలగుచోట్లలో ఆలివ్, ద్రాక్ష, స్వల్పముగా గోధుమలు పండించబడుచుండును. ప్రాచీన గ్రీకుచరిత్రలో ఈ దీవులు ప్రసిద్ధికెక్కి యుండెను. కాని టర్కీచే జయించబడిన పిదప ఈ దీవులు తమ ప్రాముఖ్యమునెల్ల కోల్పోయినవి.

క్రీటుద్వీపము అన్నిటికంటె పెద్దది. ఇది ఏజియన్ సముద్రములోనున్న ఇతర ద్వీప సముదాయములకు దక్షిణముగా నున్నది. తూర్పు పడమరలుగా దీని నిడివి 160 మైళ్లు. ఉత్తర దక్షిణములుగా దీని నిడివి 36 మైళ్లు. ఇందు దక్షిణతీరమునకు నిట్టనిలువుగా వ్రాలియున్న పర్వతమధ్యభాగము కలదు. ఉత్తరతీరమందు కొద్దితీరపు మైదాన మొకటికలదు. ఈ ప్రాంతమందు గ్రీసుయొక్క ఇతర ప్రాంతములందువలె మధ్యధరా మండలమునకు చెందిన మాక్వి (Maqui) అనబడు సతతహరిత గుల్మజాతికి చెందిన వృక్షసంపద కలదు. పల్లపు భూములలో వ్యవసాయము జరుగుచుండును. కాని నీటికొరతయు, భూమి కోతబడుటయు వ్యవసాయమునకు ప్రతిబంధకము లగుచున్నవి. ఉత్తరతీరమందున్న చిన్న ఓడ రేవులనుండి ఆలివ్ నూనెయు, ఎండు ద్రాక్షపండ్లును ఎగుమతి యగు చుండును.

గ్రీసు ద్వీపకల్పమునకు పశ్చిమముగానున్న అయోనియన్ దీవులందు మిగిలిన గ్రీసుదేశ మందుకంటె ఎక్కువ వానలు కురియును. వీటియందు శీతోష్ణస్థితి సౌమ్యముగను, జనాభా దట్టముగను ఉండును. పర్వతపువాలు లందు ఆలివ్‌వృక్షముల తోపులుండును. కిస్‌మిస్ పండ్లు ఎగుమతి యగుచుండును కోర్ఫు, ఇథాకె (ఒడెస్సెలోని ఇథాక), సెఫెలోనియా, జంటా అనునవి ఈ దీవులలో ముఖ్యమైనవి.

ఏజియన్ సముద్రములో టర్కీకిని, థ్రేసునకును సమీపములో థ్రేసియన్‌దీవులు కలవు. వాటిలో లెమ్నాస్‌లో మంచి వ్యవసాయానుకూలమగు భూమి కలదు. ఇచట సురక్షితమయియున్న మండ్రోస్ అను రేవు కలదు. సామోథ్రేస్, థాసోస్ అనునవి అడవులతో నిండియున్నవి. ఉత్తరముననున్న 'స్పొరాడీస్' అను చిన్నదీవులు శిలా మయములు.

సైక్లేడులు : ఇచటనున్న 20 దీవుల సముదాయమునకు చక్రీయదీవులు (cyclades) అని పేరు. వీటిలో నాక్సస్ అను దీవి మిక్కిలి పెద్దది. వీటిలో పెక్కుదీవులు పర్వతమయములు. కొన్నిమాత్రమే తక్కువ ఎత్తుకలవి. ఇచట కొలది భూవసతులు కలిగిన బీద కర్షకులు జనసంఖ్య మాత్రము కొంత కలదు. ఈ రైతులు గొఱ్ఱెలను, మేకలను పెంచుదురు. వీరు ద్రాక్షలను, గోధుమలను పండింతురు.

మిటిలీస్ (లెషోస్), ఖియోస్ (khios), సమోస్ అను దీవులు విశాలమైనవి. ఇవి టర్కీ తీరమునకు మిక్కిలి సామీప్యమున నున్నవి. వీటికి దక్షిణముగా స్పోరాడెస్, డొడెకనీస్ అను చిన్నదీవులు కలవు. రోడ్సు (Rhodes) అనునది డొడెకనీస్ దీవులలోకెల్లపెద్దదీవి. ఇది గ్రీసుదేశమునకు 1945 లో యుద్ధ ఫలితముగా సంక్రమించెను. ఈ దీవులన్నియు గుట్టలతో నిండియున్నవి. ఇచటి వాతావరణము సౌమ్యమై వ్యవసాయమునకు అనుకూలముగా నుండును. ఈ దీవులన్నిటిలోను జనసంఖ్య ఎక్కుడుగా నున్నది.

గ్రీకుదేశము ఇతర బాల్కనుదేశముల వలె, వ్యవసాయమే ప్రధానవృత్తిగాకలది. దేశమందలి పాటకజనులలో నూటికి 63 మంది కర్షకులే. భూములు సారవిహీనములు; భూవసతి స్వల్పము; వ్యవసాయపద్ధతులు పురాతనమైనవి. అందుచేత ఫలసాయము స్వల్పముగా నుండును. అధిక భాగమందు సక్రమముగా పంటలను, ఎరువులను మార్చుట జరుగదు. గోధుమ, ఆలివ్, ద్రాక్ష, పొగాకు ముఖ్యమగు పంటలు. ద్రాక్ష, ఆలివ్ నూనె, కిస్‌మిస్, పొగాకు కూడ ఇక్కడి ముఖ్యమగు ఎగుమతులు. వ్యవసాయ రంగమందు పూర్వముకంటె మేలైన పద్ధతులు, పరికరములు ఇందు ప్రవేశపెట్టు విషయములో అమెరికాదేశము సహాయము చేయుచున్నది. గ్రీసుదేశములో కొద్ది మొత్తములలో లిగ్నైటు, సీసము, మేగ్నసైటు, బాక్సైటు, ఎమెరీ (Emery) అను ముఖ్యములగు ఖనిజములు లభించుచున్నవి. బొగ్గు దొరకదు. ఇనుప గనులు తక్కువ. అందుచే ఇచట యెట్టి ఉత్పాదక పరిశ్రమలు అభివృద్ధి కాజాలకున్నవి. ముడి ఖనిజములే ఎగుమతి చేయబడుచున్నవి. ఉన్ని, తోళ్ళు, పొగాకు, ప్రత్తి- వీటికి సంబంధించిన లఘుపరిశ్రమలు ముఖ్యముగా ఏథెన్సు, థెస్సెలోనికా, అను పట్టణములలో నెలకొని యున్నవి. ఈ పరిశ్రమలలో అధికభాగము టర్కీనుండి వలసవచ్చిన గ్రీకులచే ప్రవేశపెట్టబడినవి. యంత్రసామగ్రి, రాసాయనికములు, లోహసామగ్రి, నేత లేక అల్లిక వస్తువులు (textiles), ఇంకను కావలసిన ఇతరసామగ్రి గ్రీసుదేశము దిగుమతి చేసికొనుచుండును.

ప్రదేశముయొక్క నిమ్నోన్నత స్వభావమునుబట్టి అవసరమగు రవాణాసౌకర్యములు బాగుగా అభివృద్ధి చెందలేదు. తీరపుమైదానములు అనేకములు సముద్రము గుండా ఇతరప్రాంతములతో విశేషసంబంధమును కలిగి యున్నవి. ఇరుగుపొరుగున నుండు లోయలతో రవాణా సంబంధములు లేకుండుటచే పూర్వకాలమున అనేకములగు చిన్న చిన్న నగరరాష్ట్రములు ఏర్పడియుండెను. గ్రీకులు నౌకాయాన సంప్రదాయమున పెంపొందుటకు కూడ ఇదియేకారణము. గ్రీకులు గొప్పనావికులు. వారికి వ్యాపారోపయోగ కరమైన నౌకా సంపత్తి విస్తారముగా కలదు. మంచి రోడ్లు స్వల్ప సంఖ్యాకములు మాత్రమే కలవు. పర్వత ప్రాంతములందు నాటుదారులు మాత్రమే కలవు. గ్రీసు ద్వీపకల్పముయొక్క పశ్చిమ భాగమున రైలు మార్గ మొకటికూడలేదు. తూర్పు తీరమున థెస్సెలోనికా (సొలోనికా) నుండి ఏథెన్సు నగరమునకు ఒకే ఒక ప్రధానమైన రైలు మార్గము కలదు. పెలెపోనిసస్ యొక్క పశ్చిమ తీరము వెంబడి మెస్సీనా సింధుశాఖ మీదనున్న కలమటా గుండా ఈ రైలుమార్గము పొడిగింపబడినది. థ్రేస్, థెస్సాలె, అట్టికాలలో చిన్న శాఖామార్గములు కలవు. మధ్య గ్రీసులో కాని, పశ్చిమ గ్రీసులోకాని రైలుమార్గ మేదియులేదు. దేశమందలి మొత్తము రైలు మార్గము పొడవు 1700 మైళ్లు. ఏథెన్సు నగరము యూరపు నందును, ఆసియా యందునుగల అన్ని ముఖ్యపట్టణములతోను విమాన మార్గములచే కలుపబడి ఉన్నది. గ్రీసులో దేశీయ వాయుమార్గములుకూడ కలవు. ఇప్పటికిని గ్రీసులో పెక్కు భాగములలో రోడ్లుగాని, రైలుమార్గములుగానిలేవు. రహదారి సౌకర్యములు అభివృద్ధి పరచబడినచో, పరిశ్రమలు చక్కగా నిర్వహింపబడుచో గ్రీసుయొక్క ప్రాచీన ఆలయములు, స్మారక చిహ్నములు కారణముగా వచ్చుచు పోవుచుండు యాత్రికుల మూలమున ఆదాయ మేర్పడి, అదియొక పరిశ్రమగా నెలకొన గలదు. గ్రీసుదేశము నేడు అధిక జనసంఖ్య కలదై దారిద్ర్యముతో నున్నది. ఇది తన ఉనికినిబట్టి రెండు ప్రపంచ దృక్పథములకు యుద్ధభూమిగా నుండునట్టి ప్రమాదములో నున్నది. నేటి ప్రతిదేశము ప్రాచీన గ్రీసునుండి జీవితమునకు సంబంధించిన ప్రతివిషయమందును ప్రోత్సాహమును పొందియున్నది. అందుచే గ్రీసుయొక్క ఆర్థిక వ్యవస్థా పునర్నిర్మాణ విషయమున దానికి ప్రపంచము తోడ్పాటు కావింపవలెను.

యం. జె. సు.


ఘంటశాల :

ఆంధ్రదేశమున కృష్ణాజిల్లా దివితాలూకాలో, ఘంటశాల(గంటసాల) అను గ్రామమున్నది. ఇది చారిత్రకముగా మిక్కిలి ప్రాముఖ్యమును కలిగియున్నది. పూర్వము ఆంధ్రసామ్రాజ్యము వైభవోన్నతులతో నున్న కాలమున ఇది దక్షిణాపథమున ప్రముఖమైన యోడరేవుగా నుండి దూరదేశములతో భారతదేశ వాణిజ్యమునకు మిక్కిలి తోడ్పడినది. ఆంధ్రదేశమున బౌద్ధమతము విరివిగా ప్రచారమున నున్న సమయమున గంటసాల బౌద్ధుల పుణ్య క్షేత్రముగా ప్రఖ్యాతిపొంది పలుచోటులనుండి యాత్రికుల నాకర్షించినది. ఈ గ్రామ నామము ఘంటశాల యనియు, గంటసాల యనియు వాడుకలో గలదు.

గంటసాల చరిత్రకు 'కొంటకొశ్శైల' శబ్దము ఆధారమై యున్నది. క్రీ. శ. 140 వ సంవత్సరమున ఆంధ్ర దేశమునందు పర్యటించిన టాలెమీ యను గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుడు భారతదేశము నందలి రేవుపట్టణముల నన్నిటిని పేర్కొనుచు మైసోలియాను, కొడ్డూరును, కృష్ణా నదీముఖద్వారమునందు వర్తకకేంద్రమై వరలిన 'కొంటకొశ్శైల' ను పేర్కొనెను. ఆంధ్రదేశమునకు చెందిన ఈ మూడు స్థలములలో మైసోలియాను ప్రాచీన ప్రఖ్యాత రేవుపట్టణమైన మోసలపురముగను, కొడ్డూరును నేటి గూడూరుగను చారిత్రకులు నిర్ణయించినారు.

టాలెమీ పేర్కొనిన కొంటకొశ్శైలను కొంతమంది చారిత్రకులు - మెక్ క్రిండిల్ ప్రభృతులు - కంచకచర్లగా నిర్ణయించిరి. కాని ఇది సరికాదు. కంచకచర్ల, కొంటకొశ్శైల అను శబ్దములకు సరియైన పోలిక లేకపోవుటయే దీనికి కారణము. కంచకచర్ల, టాలెమీ చెప్పినట్లు కృష్ణానదీ ముఖద్వారమున గాక కృష్ణా నదీతీరమున మాత్రమే యున్నది. టాలమీ కొంటకొశ్శైలను వర్తక కేంద్రముగా పేర్కొనినాడు. కంచకచర్లకు పూర్వము వాణిజ్య కేంద్రముగా ఖ్యాతి యున్నట్లు చారిత్ర కాధారములు లేవు. వజ్రపుగనులు గల పరిటాల సమీపమున నుండుటచే, కంచకచర్ల వాణిజ్యకేంద్రమని యూహించిరి. కాని పరిటాల వజ్రపుగనుల వృత్తాంతము పదునేడవ శతాబ్దమున టావర్నియర్ వ్రాసినదానిని బట్టి తెలిసికొను చున్నాము. టాలమీ కాలమున పరిటాల అజ్ఞాతముగానే యుండెను.

ఇక గంటసాలకును, టాలెమీ పేర్కొనిన కొంటకొశ్శైల శబ్దములకును సన్నిహిత సామ్యము గలదు. గంటసాల యోడరేవుగను, వాణిజ్య కేంద్రముగను నుండెనని చెప్పుటకు ఇచట తరచు లభించు స్వదేశస్థ, విదేశస్థ పురాతననాణెములే నిదర్శనములుగా నున్నవి. గంటసాల టాలెమీ కాలమున ప్రముఖ విశాలనగర మనుటకు ఇచ్చట రెండుమైళ్ళ భాగమున కనుపించు శిథిలములు, కట్టడములు, మత సాంస్కృతిక చిహ్నములు ఆధారములుగా నున్నవి. టాలెమీ పేర్కొనిన కొంటకొశ్శైల శబ్దమునకును, గంటసాల నామమునకును కంటక సేల, కంటక శైల శబ్దములకును సామ్యము కలదు.

కంటకశైల అను సంస్కృతరూపమునకు కంటక సేల యనునది ప్రాకృతరూపము. ఆంధ్రదేశమున ప్రాకృత భాష ప్రచారమున నున్న కాలమున గంటసాలకు కంటకసేల యనియే వ్యవహార ముండెడిది. దీనిని టాలెమీ కొంటకొశ్శైలయని పేర్కొనినాడు. కంటకశైల, కంటక సేల యను నామములు ఈ నగరమునకు బౌద్ధ మతముమూలమున కలిగినవి. బుద్ధుడు మహాభినిష్క్రమణ సందర్భమున కంటకమను అశ్వము నధిరోహించి చనెను. బౌద్ధులకు, బుద్ధునికి చెందిన యే వస్తువైనను పవిత్రమైనదే. పవిత్రాశ్వమైన కంటకము పేర బౌద్ధక్షేత్రము నెలకొల్పబడినది. ఇది ఇట కంటకశైలముగా నుండి, క్రమముగా కంటక సేల, గంటసాలగా మారినది. ఈ విధముగా కొందరు తలంచుచున్నారు. కాని కంటకశైల నామము నాగార్జునకొండలోని ఒక గుట్టకు చెందినదని మరికొందరు తలంచుచున్నారు. ఈ కంటక శైలమును